AUCHITHYAM | Volume-04 | Issue-08 | July 2023 | ISSN: 2583-4797
12. ప్రాచీనకావ్యపరిశోధన: నూతనదృక్పథాలు
డా. మల్లిపూడి రవిచంద్ర
తెలుగు విషయనిపుణులు,
బ్రిడ్జ్ ఇంటెర్నేషనల్ అకాడమీస్ (అమెరికా),
హైదరాబాదు, రంగారెడ్డి, తెలంగాణ.
సెల్: +91 9573449282. Email: ravi.hcu32@gmail.com
Download PDF
వ్యాససంగ్రహం:
తెలుగు సాహితీక్షేత్రంలో వెలువడిన మొత్తం ప్రాచీనకావ్యాలన్నిటిపై ఇప్పటివరకూ జరిగిన పరిశోధనలను స్థూలంగా పరిశీలిస్తే అధికసంఖ్యలో జరిగిన పరిశోధనలు సాహిత్యస్పృహతోనే జరిగాయన్నది స్పష్టమవుతుంది. ఆ వివరణతో పాటు కావ్యంలోని విలువల మదింపులో శాస్త్రవిషయాలు ఏవిధంగా దోహదపడతాయన్నది ఈ పత్రంలో వివరించడం జరిగింది. పరిశోధకులంతా కావ్యాలను నూతనదృక్పథంతో అంటే భాషాశాస్త్ర దృష్టితో పరిశోధించి ప్రతి కావ్యానికీ వర్ణనాత్మకవ్యాకరణాలు రాయవలసిన ఆవశ్యకతను ప్రస్తావించడమైంది. అలాంటి సందర్భంలో కావ్యాలను ఎలా పరిశీలించాలి? ఒక కావ్యంలో ముద్రణదోషాలు లేదా పాఠాంతరాలు ఉంటే వాటిని పరిష్కరించే దిశలో ఎటువంటి ప్రమాణాలను పాటించాలి? లాంటి నూతన విషయాల ప్రస్తావన ఈ వ్యాసంలో కనిపిస్తుంది.
Keywords: ప్రాచీనసాహిత్యం, కావ్యపరిశోధన, కూచిమంచి తిమ్మకవి, శివలీలావిలాసం, రవిచంద్ర
1. ఉపోద్ఘాతం:
ప్రథమాంధ్ర కావ్యమైన మహాభారతం మొదలు ఆధునికయుగం
ఆరంభానికి ముందు వరకూ తెలుగులో ప్రసిద్ధమైన కావ్యాలు అనేకం వెలువడ్డాయి. దాదాపు వాటన్నిటిపై వైయక్తికంగానో,
విశ్వవిద్యాలయాల్లోనో పరిశోధన జరిగింది. ఒక వేళ ఎటువంటి పరిశోధనకు నోచుకోని కావ్యాలు ఉన్నా వాటిని వేళ్ళపై
లెక్కించవచ్చు. అయితే, ఇప్పటివరకూ జరిగిన పరిశోధనలను పరిశీలిస్తే వాటిలో ఎక్కువ శాతం పరిశోధనలు
సాహిత్యాంశాల దృష్టితో జరిగినవే కనిపిస్తాయి. ఇంకా లోతుగా గమనిస్తే వస్తురూప విశ్లేషణ, పాత్రచిత్రణ,
సాంస్కృతిక సామాజికాంశాలచర్చ వంటి వాటి ప్రస్తావన ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఆయా కావ్యాలకు గల ప్రత్యేకతను
చూపించే ఒక కోణం.
శాస్త్రాల/ సిద్ధాంతాల ఆధారంగా ప్రాచీనకావ్యాలను విశ్లేషించి వాటిలోని సొబగులను
వ్యక్తీకరించే పరిశోధనలు కూడా జరిగాయి. వాటిలో రసం, ధ్వని, అలంకారం, శైలి, శిల్పం... మొదలైన అంశాలు కీలక
పాత్రను పోషిస్తాయి. ఇది మరొక కోణం.
పై రెండు కోణాల నుంచి ఒక కావ్యాన్ని పరిశీలించినపుడు ఆ కావ్యాన్ని వెలకట్టే వాటిలో పైకి కనిపించే వస్తు, రూప, పాత్రచిత్రణలు, సాంస్కృతిక, సామాజికాంశాలు ఎంతటి ప్రాధాన్యతను వహిస్తాయో, అంతర్లీనంగా వాటిని పట్టి చూపించే రసం, ధ్వని, అలంకారం, శైలి, శిల్పం లాంటివి అంతకు మించిన ప్రాధాన్యతను వహిస్తాయి. అవి పైకి కనిపించకపోయినా కవి అభివ్యక్తికి సంబంధించినవై కావ్యమంతా పరచుకొని ఉంటాయి. వీటిని ఏ కవియైతే సమర్థంగా ఉపయోగించుకోగలడో ఆ కవి కావ్యమే సాహితీ జగత్తులో ప్రత్యేకంగా నిలబడి వెలగగలుగుతుంది.
ఇక మూడవ కోణం ఛందస్సు, వ్యాకరణం, భాషాశాస్త్రం
దృష్ట్యా జరిగిన పరిశోధనలు. మొదటి రెండు కోణాల్లో జరిగిన పరిశోధనల కంటే ఈ కోణం నుంచి జరిగిన పరిశోధనలు ఇచ్చే
ఫలితాలు విశిష్టంగా ఉంటాయి. వీటిలో ఛందస్సు, వ్యాకరణం, భాషాశాస్త్రం ఉత్తరోత్తర బలీయాలు. కావ్యంలోని
విషయమూల్యాంకన సాధనాలుగా ఇవి పోషించే పాత్ర ఉత్కృష్టం.
2. ప్రాచీనకావ్యాల పరిశోధన- భాషాశాస్త్రం పాత్ర:
ప్రస్తుతం ఛందస్సును గూర్చిన చర్చను పక్కనపెడితే వ్యాకరణం, భాషాశాస్త్రం రెండిటిని గూర్చి ప్రస్తావించుకోవలసి ఉంటుంది. ఇక్కడ వ్యాకరణం అంటే సంప్రదాయవ్యాకరణమని గ్రహించాలి. సంప్రదాయవ్యాకరణం, భాషాశాస్త్రం రెండూ భాషకు సంబంధించిన విషయాలను చర్చించేవైనప్పటికీ రెండిటికీ మధ్య వ్యత్యాసం ఉంది. ‘సంప్రదాయవ్యాకరణం నిర్ణీత కాలంలో ఉన్న కావ్యభాషని వర్ణించే వ్యాకరణం. దీనిని భాసాశాస్త్రశాఖలో ఒకటైన వర్ణనాత్మకవ్యాకరణం (Descriptive Grammar)గా చెప్పుకోవచ్చు. భాషాశాస్త్రానికి సంప్రదాయవ్యాకరణం కంటే అదనంగా చారిత్రకవ్యాకరణం (Historical Grammar), తులనాత్మకవ్యాకరణం (Comparative Grammar) లాంటి బాగా అభివృద్ధి చెందిన శాఖలున్నాయి.’ (సుబ్రహ్మణ్యం, పి. ఎస్. 2007:15,16) అంతేగాక ప్రవాహినీరూపమైన భాషలో అనివార్యంగా కలిగే మార్పులను సంప్రదాయవ్యాకరణం వ్యాకరణ విరుద్ధంగా పరిగణించి సమర్థించకపోతే భాషాశాస్త్రం మాత్రం వాటన్నిటినీ గ్రహించి విశ్లేషిస్తుంది. కాబట్టి ప్రాచీనకావ్యాల అధ్యయనంలో భాషాశాస్త్రం భూమిక చాలా కీలకం.
ఒక్కమాటలో చెప్పాలంటే ప్రాచీనకావ్యాల విలువల మదింపులో వస్తు, రూప, పాత్రచిత్రణలు, సాంస్కృతిక, సామాజికాంశాలు, రసం, ధ్వని, అలంకారం, శైలి, శిల్పం లాంటి శాస్త్రవిషయాల కంటే కూడా ఆ కావ్యాలకు జీవమైన భాష ప్రాధాన్యతే ఎక్కువ. వివిధ విశ్లేషణస్థాయుల ఆధారంగా ఆ భాషను పరిశీలించే భాషాశాస్త్రం పాత్ర మరింత కీలకం. కాబట్టి భాషాశాస్త్ర దృష్టితో ప్రాచీనకావ్యాలపై పరిశోధన చేయడం అత్యంత అవసరం.
3. పరిశోధనల ఆవశ్యకత:
ప్రస్తుతం లభిస్తున్న ప్రతి కావ్యాన్నీ భాషాశాస్త్రదృక్పథంతో పరిశీలించి వాటికి వరుసగా వర్ణనాత్మక వ్యాకరణాలు రాయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే తెలుగుభాషకు ఇప్పటివరకూ ఒక సమగ్రమైన చారిత్రకవ్యాకరణం లేదు. చిన్నదైన వ్యాకరణదీపపు వెలుగులోనే తెలుగు వాళ్ళంతా మనుగడ సాగిస్తున్నారు. ఈ కొరత తీరాలంటే ప్రాచీనకావ్యాలన్నిటికీ వర్ణనాత్మకవ్యాకరణాలు రావాలి. అప్పుడు మాత్రమే ఆ వ్యాకరణాలన్నిటినీ పోల్చి చూసి ఒక సమగ్రమైన చారిత్రకవ్యాకరణం తయారు చేయగలం. భాషాపరిణామక్రమంలో ఏవైనా కొత్తపదాలు చోటుచేసుకున్నపుడు వాటి ద్వారా నైఘంటిక వనరులను పరిపుష్టం చేయగలం. అదీగాక పదప్రయోగసూచుల కొరత కూడా కొంత తీరే అవకాశం ఉంది.
4. పూర్వ పరిశోధనలు:
ప్రాచీనకావ్యాలను అధ్యయనం చేసి వ్యాకరణాలు
రాసినవారు అనేకులున్నారు. మన సంప్రదాయ వైయాకరణులంతా ఆ కోవకు చెందిన వారే. "ఆంధ్రభాషాభూషణం" వంటి పద్యాంధ్ర
వ్యాకరణాలు, "బాలవ్యాకరణం"వంటి సూత్రాంధ్ర వ్యాకరణాలు, "ఆంధ్రశబ్దచింతామణి" వంటి సంస్కృతంలో తెలుగుకి వచ్చిన
వ్యాకరణాలు దాదాపు 200 పైగా తెలుగుభాషకు ఉన్నాయి. వాటి మూలంగా తెలుగుకు అనుకున్నంత స్థాయిలో ఉపకారం
జరిగిందని చెప్పలేం. అయితే, భాషాశాస్త్రం అభివృద్ధి చెందాక ఆ స్పృహతో చాలా పరిశోధనలు జరిగాయి. వాటి ద్వారా
తెలుగుభాషకు ఒనగూరిన మేలు అధికం. అందులో భాగంగానే చాలామంది ప్రాచీనకావ్యాలకు వర్ణనాత్మకవ్యాకరణాలు రాశారు.
వారిలో నన్నయ భారతానికి కె. నాగభూషణరావుగారు, నన్నెచోడుని కుమారసంభవానికి ఎల్. బి. శంకరరావుగారు,
ఆముక్తమాల్యదకు పి. నరసింహారెడ్డిగారు, శ్రీనాథునిభాషకు నేతి అనంతరామశాస్త్రిగారు, పి. ఎల్.
శ్రీనివాసరెడ్డిగారు (ఆంగ్లం), నాచనసోముని ఉత్తరహరివంశానికి శశికళగారు, పోతన భాగవతానికి వై. ఆదెప్పగారు,
తిక్కన నిర్వచనోత్తర రామాయణానికి ఎన్. వెంకటేశ్వరరావుగారు, అయ్యలరాజు నారాయణామాత్యుని హంసవింశతికి కె.
బాలకృష్ణగారు, కట్టావరదరాజు ద్విపదరామాయణానికి పి. పవన్ కుమార్ గారు, కూచిమంచి తిమ్మకవి రచనలపై మల్లిపూడి
రవిచంద్ర వంటి వారు ఉన్నారు. ప్రస్తుతం విశ్వవిద్యాలయాల్లో వర్ణనాత్మకవ్యాకరణ పద్ధతిలో పరిశోధనలు జరుగుతూ
ఉండడం విశేషం.
5. పరిశోధనకు కావ్యాల ఎంపిక- పాటించవలసిన
నియమాలు:
కావ్యభాషను పరిశీలించి వర్ణనాత్మకవ్యాకరణాలు రాయడం అంత తేలికైన పనికాదు. దానికి శాస్త్రపరిజ్ఞానంతో పాటు కావ్యాలను చదివి ఆకళింపు చేసుకునే శక్తి కూడా పరిశోధకుడికి ఉండి తీరాలి. అలా చేయగలిగిన వ్యక్తి ఎటువంటి కావ్యం తీసుకున్నా దానికి పరిపూర్ణ న్యాయం చేయగలడు. అయితే, ఒక కావ్యాన్ని పరిశోధనకు ఎన్నుకున్నాక ప్రతి పరిశోధకుడు కొన్ని నియమాలను మాత్రం తప్పక పాటించవలసి ఉంటుంది.
5.1 పాటించవలసిన
నియమాలు:
- భాషాశాస్త్ర దృక్పథంతో వర్ణనాత్మకవ్యాకరణం రాసే క్రమంలో పరిశోధనకు ప్రాచీనకావ్యం ఏదైనా ఎన్నుకోవచ్చు.
- అయితే, ఎన్నుకొన్న కావ్యం పరిష్కరించబడి సంశుద్ధముద్రితప్రతియై ఉంటే మంచిది.
- ఆ కావ్యం పలు ముద్రణలు పొంది ఉంటే లభిస్తున్న మొత్తం ప్రతులను సేకరించి తప్పక పరిశీలించాలి. ఎందుకంటే వాటిలో పాఠాంతరాలు గానీ, ముద్రణదోషాలు గానీ ఉండే అవకాశం ఉంది.
ఉదా. కూచిమంచి తిమ్మకవి రచించిన శివలీలావిలాసమనే
రెండాశ్వాసాల ప్రబంధం ఉంది. అది 1921, 1930, 2010 సంవత్సరాలలో వరుసగా మూడు ముద్రణలు పొందింది. ఆ మూడు
ప్రతులనూ పరిశీలిస్తే ఏవో రెండు ప్రతులు ఒక రూపాన్ని కలిగి ఉంటే మిగిలినది తద్భిన్నమైన రూపాన్ని కలిగిఉండడం,
మూడు ప్రతులూ మూడు వేరు వేరు రూపాలను కలిగి ఉండడం, ఒకే రకమైన ముద్రణ దోషంగానీ, పాఠాంతరంగానీ ఉండడం
గమనించవచ్చు. అలాంటి పదాలు శివలీలావిలాసంలో 135 కనిపిస్తాయి. అటువంటి వాటిని పరిశీలించి పరిష్కరించాకగానీ
వర్ణనాత్మకవ్యాకరణ రచనకు పూనుకోకూడదు. అందుకు కొన్ని ప్రమాణాలను ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం.
5.2 పాటించవలసిన ప్రమాణాలు:
కావ్యంలో ఉండే ముద్రణదోషాలను గానీ,
పాఠాంతరాలను గానీ పరిష్కరించుకునేందుకు కింది ప్రమాణాలను పాటించాలి.
1. వెలువడిన అన్నిప్రతులను తులనాత్మకంగా
విషయప్రధాన దృష్టితో అనుశీలించడం.
2. పదం సరైనదా? లేక ముద్రణదోషమా? గ్రహించి ఒకవేళ ముద్రణదోషమైతే దాని అసలు
రూపాన్ని సూచించడం.
ఉదా. శివలీలావిలాసం కావ్యం 1921 ప్రతిలో “నగుపఁడఁగ జేయరే కొమ్మటనఁటులార!”(2:61) అని ఉండగా, 1930 ప్రతిలో “కొమ్మటనఁటులార!” స్థానే “కొమ్మనఁటులార!” అని ఉంది. 2010 ప్రతిలో మాత్రం భిన్నంగా “తొమ్మటనఁటులార! అని ఉంది. కొమ్మనఁనటి, కొమ్మనఁటి రెండూ కొమ్మనరఁటి అనే పదానికి రూపంతరాలు. అది కదళీ విశేషం.(సూర్య.సం.2.పు.: 434) అయితే, పదం ఇచ్చే అర్థాన్ని గ్రహించి సందర్భందృష్ట్యా, ఛందస్సుదృష్ట్యా చూసినట్లయితే “కొమ్మననఁటులార!” సరియైనది. అంటే ఇక్కడ మూడుప్రతులలోనూ దోషముందని గ్రహించి అసలు రూపాన్ని స్వీకరించడం అవసరం.
5.2.1 పదాలన్నీ రాతలో/ ముద్రణలో సరిగా ఉంటే వాటి అర్థాలు ఆ సందర్భానికి తగినవా? కావా ? అన్నది అనుశీలించడం.
ఉదా. 1921, 2010 ప్రతులలో
"ముద్దు జంగమఱేఁడు మురిమీఱ మీపజ్జ
మసలియుండడు గదా మావులార!"(2:57) అని ఉంటే,
1930 ప్రతిలో మాత్రం 'మురి' కి బదులు 'ముది' అని ఉంది. మురి అంటే అతిశయం , ముది అంటే వృద్ధాప్యం అని అర్థాలున్నాయి.(శబ్ద.పు.:746) రెండూ సరైనవే అయినా సందర్భానికి 'మురి' మాత్రమే సరిపోతుంది.
5.2.2 రెండురూపాలు ఉండి ఆ రెండిటి అర్థం ఒక్కటే అయినట్లయితే, ఛందస్సును కొలమానంగా తీసుకొని పరిష్కరించడం.
ఉదా.1921, 1930 ప్రతులలో
“పశుపతి సమాఖ్య చెల్లె నబ్బురము మీఱ” (1:57) అని ఉంది.
2010 ప్రతిలో మాత్రం ‘అబ్బురము’
స్థానంలో ‘అబ్రమ్ము’ ఉంది. రెండిటికీ ఆశ్చర్యం అని అర్థం. (శబ్ద.పు.:35) రెండుపదాలు సరైనవే.
కాబట్టి ఇలాంటి సమయంలో ఛందస్సును కొలమానంగా తీసుకొవాలి. ఇది తేటగీతి పాదం. యతి స్థానంలో
‘బ్బు/బ్ర’ ఉన్నాయి. ప్రారంభ వర్ణం ‘ప’. కాబట్టి యతి ‘బ్ర’ వర్ణంతో
చెల్లుతుందేతప్ప ‘బ్బు’ వర్ణంతో చెల్లదు. ఇలాంటి వాటిని జాగ్రత్తగా గమనించాలి.
5.2.3 సాధు-శకటరేఫల మధ్య అభేదం పాటించినట్లయితే, అది ఇచ్చే అర్థాన్ని దృష్టికి తెచ్చుకొని సరైన రూపాన్ని సూచించడం.
ఉదా.1921, 1930 ప్రతులలో
“పారి మీరే తిప్పఁ బట్టినారు?”(2:70) అని ఉంటే,
2010 ప్రతిలో ‘పారి’ స్థానంలో
‘పాఱి’ అని శకటరేఫ ప్రయోగం ఉంది. పారి అంటే పర్యాయం, తడవ అని అర్థం. (శబ్ద.పు.:575) పాఱి అంటే
పారిపోవడం అని అర్థం. సందర్భానికి పాఱి రూపమే పొసగుతుంది. దానినే గ్రహించాలి.
5.2.4 ‘కచటతప’ లు, ‘గజడదబ’ లు ఒక దాని బదులు మరొకటి ప్రయోగించబడినట్లయితే, వాటిలో అర్థవంతమయిన పదాన్ని గ్రహించడానికి నిఘంటువులు, వ్యాకరణాల సహాయం తీసుకోవడం.
ఉదా.1921, 1930 ప్రతులలో -
“హరి తన నయనాబ్జముతోఁ
దొరలఁగ నొక వేయి వికచ తోయజముల నీ
శిరమునఁ బూజించిన”(1:60) అని ఉంది.
2010 ప్రతిలో మాత్రం అరసున్న ముందు లేని ‘దొరలఁగ’ ఉంది. తొరలు అంటే సోకు/కలుగు అని అర్థం.(సూర్య.సం.3.పు.:587) వ్యాకరణాన్ని కూడా పరిగణలోకి తీసుకొని చూస్తే ‘తొరలఁగ’ ముందు అరసున్న ఉండాలి. ఒక వేళ లేని పదాన్ని గ్రహిస్తే ‘దొరలఁగ’ అవుతుంది. ఈ పదానికి దొర్లడం అనే అర్థం వస్తుంది. ఇక్కడ సందర్భంలో విష్ణుమూర్తి తన కళ్ళు అనే పద్మాలను నిరంతరం శివునిపై సోకే విధంగా ప్రసరించి పూజ చేశాడు అనే అర్థం రావాలి. అప్పుడు ‘తొరలఁగ’ సరైన రూపం అవుతుంది.
ఇటువంటి ప్రమాణాలతో పదాలను పరిష్కరించి ఏ ప్రతిలోనయితే దోషాలు తక్కువగా ఉంటాయో ఆ ప్రతిని మాత్రమే పరిశోధనకు స్వీకరించాలి. ఇది వర్ణనాత్మకవ్యాకరణ పద్ధతిలో మౌలికాంశం.
6. ముగింపు:
- ప్రాచీనకావ్యాల పరిశోధనలో ఇప్పటివరకూ చర్చించినట్లు -
- ప్రాచీన కావ్యాన్ని లేదా గ్రంథాన్ని దేన్నైనా పరిశోధనకు తీసుకోవడం
- ముద్రిత ప్రతి అయితే ముద్రణదోషాలు లేకుండా సవరించుకొని సంశుద్ధ పత్రిగా మార్చుకోవడం
- ఒకటికి మించిన ప్రతులు లభిస్తుంటే వాటిలో ఏదైనా ఒక దానిని పరిశోధనకు ఎన్నుకోవడం
- ఆ క్రమంలో లభిస్తున్న ప్రతులన్నిటినీ సేకరించి నిఘంటువు, వ్యాకరణం, ఛందస్సు వంటి శాస్త్రాల సహాయంతో ఎటువంటి దోషాలు లేని సరైన రూపాలను కూర్చుకోవడం
- ఒక పదానికి రెండు రూపాలు ఉంటూ, రెండూ సరైన అర్థాలనే ఇస్తూ ఉంటే అందులో (శాస్త్రాల సహాయంతో) సందర్భానికి తగిన విధంగా ఉండే పదాన్ని అసలు రూపంగా ఇచ్చి మిగిలిన పదాన్ని పాఠాంతరంగా ఇవ్వడం మొదలైన నూతనదృక్పథాలను అవలంబిస్తూ భాషాశాస్త్ర దృష్టికోణంతో కావ్యభాషను అధ్యయనం చేసినట్లయితే ఆశించిన ఫలితాలను పొందగలం. దానితోపాటు తెలుగుభాషను మరింత సుసంపన్నం చేసే అవకాశం ఉంటుంది. తద్ద్వారా సాహితీ వాతావరణానికీ ఎంతో మేలు చేకూరుతుంది.
7. పాదసూచికలు:
- ఆధునిక భాషాశాస్త్ర సిద్ధాంతాలు, సుబ్రహ్మణ్యం పి. ఎస్, పుటలు.15,16.
8. ఉపయుక్త గ్రంథసూచి:
- తిమ్మకవి, కూచిమంచి. 1921. శివలీలావిలాసము. చెన్నపురి: వావిళ్ళ రామస్వామి శాస్త్రులు & సన్స్.
- ---------------1930. శివలీలావిలాసము. చెన్నపురి: వావిళ్ళ రామస్వామి శాస్త్రులు & సన్స్.
- ---------------2010. శివలీలావిలాసము. పెరిదేపి:స్వప్న పబ్లికేషన్స్.
- నిత్యానందరావు, వెలుదండ. 2013. విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన. హైదరాబాదు: శ్రీమతి వి. గీతారాణి పబ్లికేషన్స్.
- పవన్ కుమార్, పమ్మి. 2003. కట్టావరదరాజు ద్విపదరామాయణం: భాషాపరిశీలన (హైదరాబాదు విశ్వవిద్యాలయానికి సమర్పించిన పిహెచ్.డి. పరిశోధన గ్రంథం.)
- రవిచంద్ర, మల్లిపూడి. 2013. కూచిమంచి తిమ్మకవి శివలీలావిలాసము: భాషాపరిశీలన (హైదరాబాదు విశ్వవిద్యాలయానికి సమర్పించిన ఎం.ఫిల్. పరిశోధనవ్యాసం)
- శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు. 1982 (సం.1-8). హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి
- సీతారామాచార్యులు, బహుజనపల్లి. 2011. శబ్దరత్నాకరము. విజయవాడ : శ్రీ వేంకటేశ్వర బుక్ డిపో.
- సుబ్రహ్మణ్యం, పి. ఎస్. 2007. ఆధునికభాషాశాస్త్రసిద్ధాంతాలు. హైదరాబాదు: పొట్టిశ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.