headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-08 | July 2023 | ISSN: 2583-4797

11. శ్రీనాథుని కవితామార్గం: వర్ణవిన్యాసవక్రత

v_sharanya.jpg
వేముల శరణ్య

పరిశోధకవిద్యార్థిని,హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం
తెలుగు అధ్యాపకురాలు
తెలంగాణ సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల, జగిత్యాల, తెలంగాణ.
సెల్: +91 9493613830. Email: vemulasharanya11@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

తెలుగు ప్రాచీనసాహిత్యంలో శ్రీనాథుడు 15వ శతాబ్దంలో సుస్థిరస్థానాన్ని ఏర్పరచుకున్న కవి. ఆ మహాకవి సార్వభౌముని కవితామార్గం మీద పలు చర్చలు జరిగాయి. శ్రీనాథుని కవితామార్గం ఏమిటి? అనే ప్రశ్నకు చాలా సమాధానాలు వస్తాయి. వాదాలూ ఉన్నాయి. ఈ విషయం పైన పూర్వ పరిశోధకులు విమర్శకులు తమ అభిప్రాయాలను తెలిపారు. పలు చర్చలు జరిగిన మీదట చాలా మంది శ్రీనాథునిది వక్రోక్తి మార్గంగా సూచించారు. వారి అభిప్రాయాలను తెలుపుతూ కుంతకుడు చెప్పిన ఆరు వక్రతల్లో “వర్ణవిన్యాసవక్రత” శ్రీనాథుని కవిత్వంలో ఉందని లక్షణలక్ష్యసమన్వయం చేయటం ఈ వ్యాస ప్రధాన ఉద్దేశ్య౦. శ్రీనాథుడు అనుసరించాడని ఎక్కువ మంది భావించిన వక్రోక్తి శ్రీనాథుని కవిత్వంలో ఉందని కొంత స్పష్టత ఏర్పడేందుకు ఈ వ్యాసం ప్రయోజనకారి అవుతుందని భావిస్తున్నాను

Keywords: శ్రీనాథుడు, కవితాగుణాలు, పూర్వకవిస్మరణ, కవితామార్గం, కుంతకుడు, వక్రోక్తి.

1. ఉపోద్ఘాతం:

ప్రతి కవికి ఒకశైలి ఉంటుంది. కావ్య రచనలో వైవిధ్యం ఉంటుంది. ప్రత్యేకమైన ముద్ర ఉంటుంది. అయితే విలక్షణమైన ముద్రతో సహృదయులను గెల్చుకొని తమ కావ్యాలు చిరకాలం ఉండేలా రచనలు చేసే కవులు కొందరుంటారు. అటువంటి ఉత్కృష్టమైన కవులలో కవి సార్వభౌముడైన శ్రీనాథుడు ఒకడని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

‘‘భావవ్యక్తీకరణ విధానంలో మెరుగులు దిద్దే ఒకానొక రచానారీతిని శైలి అనవచ్చు. శైలీ పరిశీలనం కేవలం భాషాశాస్త్రానికి సాహిత్య విమర్శకి చెందింది కాక కళాభినివేశపాండిత్యాలలో కూడిన శాస్త్రీయ కృషి విశేషంగా భావించవచ్చు”.1 

శ్రీనాథుడు శైలిని గూర్చి చెప్తూ తన కవిత్వం ఎలా ఉంటుందో? అసలు కవిత్వం అనేది ఎలా ఉండాలో కవితా మార్గాలను పూర్వ కవులనుండి అన్వేషించి, వాటిలో లోతుపాతులు తెలుసుకొని తనదైన పాండితీ పటిమతో రచనలు చేసాడో తెల్పాడు.

ప్రాచీనాంధ్ర కవుల సాహిత్య దృక్పథాలను సమన్వయించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అలంకారశాస్త్రాన్ని ఆధునిక విమర్శ శాస్త్రాన్ని అవగాహనం చేసుకొని సమన్వయ దృక్పథాన్ని సాధించుకొని ప్రాచీన సాహిత్యంలోని మహాకవుల రచనలను సమీక్షించే యువకులు క్రమంగా తగ్గిపోతున్నారు”.

కనుక ప్రాచీన సాహిత్యం పట్ల దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. శ్రీనాథుడు తన కవితా మార్గాన్ని గూర్చి ఏమి చెప్పాడు? ఏ పూర్వ కవులను తను అనుసరించాడు? అనే వాటిని చర్చిస్తూ అలాగే శ్రీనాథుని కావ్యాలపై పరిశోధన చేసిన వారి అభిప్రాయాలకు అనుగుణంగా శ్రీనాథుని కవిత్వం ఉన్నదా అని పరిశీలిద్దాం.

2. శ్రీనాథుని కవితాగుణాలు - చర్చ:

శ్రీనాథుని కవితామార్గం గురించి పలువురు పండితులు రకరకాల చర్చలు చేసారు. కొందరు రీతి మార్గం అని కొందరు ధ్వని మార్గం. కొందరు వక్రోక్తి అని వివిధ రకాల అభిప్రాయాలను వెలిబుచ్చారు. కానీ శ్రీనాథుడే స్వయంగా కవిత్వం అంటే దానికి కొన్ని లక్షణాలు ఉండాలి. అలా ఉంటే ఆ కవిత్వం చిరకాలం నిలిచి ఉంటుందని తన కవితా లక్షణాలను భీమఖండంలో చెప్పాడు.

మ. హరచూడ హరిణాంక వక్రతయుగాలంత స్ఫురచ్చండికా
పరిషోద్గాఢ పయోధర స్ఫుటతటి పర్యంత కాఠిన్యమున్
సరసత్వంబును సంభవించె ననఁగా సత్కావ్య ముల్దిక్కులం
జిర కాలంబు నటించు చుండుఁ గవిరాజ గేహరంగంబులన్ (భీమ. 1అ. 12ప)

ఈ పద్యంలో వక్రత, కాఠిన్యం(ప్రౌఢత) సరసత్వం అనే కవితా గుణాలను చెప్పడం జరిగింది. శివుని శిరస్సుపైన ఉన్న చంద్రుని పదహారవ కళ ఎంత అందంగా లోకోత్తరంగా, కళంకరహితంగా ఉంటుందో అలాంటి రమణీయమైన వక్రత కవిత్వంలో ఉండాలని చెప్పాడు. ఈ వక్తోక్తి మాత్రమే కాదు కాఠిన్యం అంటే పదప్రౌఢి కూడా ఉండాలని అంటూ, సరసత్వం గల రసపూరితమైన కవిత్వం ఉంటే గనుక ఆ కావ్యం చిరకాలం మనస్సులో నిలిచి ఉంటుందని చెప్పాడు. ఇలా వక్రోక్తి, కాఠిన్యం, సరసోక్తి అనే లక్షణాలను చెప్పాడు. ఈ కవితాగుణాలు తన కవిత్వంలో ఉన్నాయని చెప్పవచ్చు. వాటి గురించి తెలుసుకుందాం.

2.1.వక్రత:
వక్రత అంటే వంకర అనే అర్థం అందరికి తెలిసినటువంటిదే. ఇక్కడ వాడే వక్రత అలంకార సంబంధి. అయితే వక్రతలో చాలా భేదాలున్నాయి. సంస్కృత ఆలంకారికుడైన కుంతకుడు “వక్రోక్తి కావ్యజీవితం” అను నాలుగు ఉన్మేషాల కావ్యం రాసి అందులో ‘వైదగ్ధ్యభంగీభణితి’ని వక్రతగా చెప్పాడు. విచిత్రాభిదవక్రత అంటూ ప్రధానంగా ఆరు వక్రత భేదాలను పేర్కొన్నాడు.

2.2 కాఠిన్యం:
శ్రీనాథుడు ఇక్కడ కాఠిన్యం అనే పదాన్ని వాడుతూ రెండవ లక్షణంగా చెప్పాడు. కఠినత అనే పదానికి అర్థం కటువైనది. పరుషమైనదనే అర్థాలున్నాయి. దీన్నే ప్రౌఢత అనే అర్థంతో కూడా వాడటం జరుగుతుంది. ఇక్కడ శబ్ద అర్థ ప్రౌఢి అని రెండు రకాలుగా ఆలోచించాల్సి ఉంటుంది. ప్రౌఢమైన పదరచన, కొంత పరుషత కలిగిన కవిత్వం అని అర్థం చేసుకోవాలి. ఈ కవితా లక్షణం ఓజోగుణం ఉన్నటువంటి పరుషత్వంతో, ప్రౌఢమైన భారతి వృత్తితో కూడిన రచన అని భావించాలి.

2.3. సరసత్వం:
అన్ని సందర్భాలకు అనుగుణంగా ఔచిత్యవంతమైన రసపోషణ చేయడమే సరసతను కలిగి ఉండటం, ఇలా శ్రీనాథుడు మూడు కవితా లక్షణాలను చెప్పుకు వచ్చాడు. నిజానికి కవిత్వం ఏ మార్గాన్ని అనుసరించి ఉంటే అది కవిత్వం అవుతుంది? మామూలు వచనానికి, కావ్యానికి తారతమ్యం ఏముంది? అనే ప్రశ్నకు సమాధానం 15వ శతాబ్దిలోనే శ్రీనాథుడు చెప్పాడు. ఇవే కాకుండా శ్రీనాథుడు పూర్వ కవుల మార్గాన్ని అనుసరించానని వివరించిన విషయం పరిశీలిద్దాం.

3. పూర్వకవుల స్మరణ:

కవిత్వరచన చేసేటప్పుడు మనకన్న ముందున్న వారిని అనుసరించి వెళ్ళవలసి ఉంటుందని చెప్పాడు శ్రీనాథుడు. అతని రచనామార్గం అలాగే కొనసాగింది కూడా. తెలుగు, సంస్కృతభాషల్లో పండితుడైన శ్రీనాథుడు ఉభయభాషాకవులను అంటే తెలుగులో ఉన్న పూర్వకవులను, సంస్కృతంలో గల పూర్వకవులను తన కావ్యాల్లో స్మరించాడు. వారి ప్రతిభను పుణికిపుచ్చుకున్నాడు. రచనావిధానాన్ని అనుసరిస్తూనే కవిత్వంలో గొప్ప వర్ణనాకౌశలాన్ని చూపెట్టాడు. శ్రీనాథుడు 15వ శతాబ్దివాడు కావడంచేత అంతకు ముందున్న 11వ శతాబ్దంనాటి కవి అయిన నన్నయ మొదలుకొని తనకాలం వరకు గల ప్రముఖ తెలుగు కవులను తన కావ్యాల్లో స్తుతించాడు.


ఈ విషయాన్ని బలపరుస్తూ- 

ఇతడు పూర్వకవి ముఖ్య విరచితాపూర్వ కావ్య భావరస సుధా చర్వణ ప్రౌఢతతో నాంధ్ర సాహిత్యమునకు గీర్వాణ సాహితి సరసను సింహాసనము ప్రతిష్ఠించుటకు పథకములు పన్నినాడు. కల్పనములు చేసినాడు. చేతికి దొరికిన కావ్యములపై తెనుగు జీవము కుమ్మరించినాడు. ఈ యుద్యమములోనే సంస్కృత పండితులు శిరసావహించు కాశీఖండ నైషధములను చేపట్టి ప్రతిభా ముద్రతో నిర్వహించినాడు కాసట బీసటగానున్న యచ్చపు తెనుగు జోదుల కతలకు కావ్యగౌరవము ప్రతిపాదించినాడు. పద్యరచనములో నన్నయకోవవాడు శ్రీనాథుడు అతని మార్గముల నీతడు విశాలపరచి ఘంటాపథములు చేసినాడు. క్రొత్త నడకల సాధించి వానికొక వింత దర్జా నెలకొల్పినాడు."3 

అని ఇంద్రగంటి హనుమచ్చాస్త్రి తన అభిప్రాయాన్ని తెలిపాడు.  కనుక శ్రీనాథుని పూర్వకవుల కవితా మార్గాలను పరిశీలించడం ఆవశ్యమైంది.

3.1 తెలుగు కవులు:

తెలుగు కవులైన వేములవాడ భీమనను, నన్నయ, తిక్కన, ఎర్రనను ప్రస్తుతించి వారి కవితామార్గాలు తనకు అనుసరణీయమైనవని చెప్పాడు. అంతేకాకుండా వారు పూర్వకవులని తన కావ్యాల్లో స్మరించడం జరిగింది.

సీ. వచియింతు వేములవాడ భీమన భంగి, ఉద్ధండలీల నొక్కొక్కమాటు
భాషించు నన్నయభట్టు మార్గంబున నుభయ వాక్ప్రౌఢి నొక్కొక్కమాటు
వాక్రుత్తు తిక్కయజ్వప్రకారము రసాభ్యుచిత బంధముగ నొక్కొక్క మాటు
పరిఢవింతు ప్రబంధ పరమేశ్వరునివ ఠెవసూక్తి వైచిత్రి నొక్కొక్క మాటు
తే. నైషధాది మహాప్రబంధములు పెక్కు
చెప్పినాఁడవు మాకు నాశ్రితుఁడ వనఘు
యిప్పుడు చెప్పదొడంగిన యీ ప్రబంధం
మంకితము సేయు వీరభద్రయ్య పేర  (కాశీ. పీ. 18ప)

వేములవాడ భీమనలో ఉన్న ఉద్దండత, నన్నయలో గల తెలుగు సంస్కృత భాషల్లోని ఉభయ వాక్ప్రౌఢి సందర్భానుసారంగా ఉపయోగించే తిక్కన రసాభ్యుచిత బంధం, ఎర్రన సూక్తివైచిత్రి నీలోపల ఉన్నాయి. ఎంతోమంచి కావ్యాలను రాసిన నీవు వీరభద్రారెడ్డికి ఈ కాశీఖండం అనే ప్రబంధాన్ని అంకితం ఇవ్వు అని వేమారెడ్డి అడిగినట్లుగా తన కవితా మార్గం గురించి తానే చెప్పుకున్నాడు. ఈ నాలుగు కవితా లక్షణాలను కొంత సునిశితంగా పరిశీలించవలసిన అవసరం ఉంది. అప్పుడే శ్రీనాథుని రచనలలో విశిష్టత తెలుస్తుంది.

3.2 సంస్కృత కవులు:

శ్రీనాథునిపై సంస్కృత కవుల ప్రభావం కూడా ఉన్నదని చెప్పవచ్చు. ఎందుకంటే అతడు సంస్కృతపద భూయిష్టమైన సమాసాలను వాడాడు. సంస్కృతంలోని నైషధాన్ని తెనిగించినప్పుడు కేవలం ప్రత్యయాలను మాత్రమే వాడాడని శ్రీనాథున్ని డు,ము,వుల కవి అనే పేరును పెట్టి పిలిచారు. సంస్కృత కవులను తలచుకుంటూ ఒక సీసపద్యాన్ని రచించాడు.

సీ. ప్రణుతింతు రసభావ భావనామహనీయ కవితా సముల్లాసుఁగాళిదాసు
గణుతింతునిరవద్య గద్యపద్య నిబంధ, పరితోషిత స్థాణుభట్టబాణు
భజియింతు సాహిత్య పదవీ మహారాజ్య భద్రాసనాసీనుఁ బ్రవరసేను
వర్ణింతు నంబోధి నార్వీచి గంభీర తాసార వాక్సముత్కర్షు హర్షు
తే. భాసశివభద్ర సౌమిల్ల భల్లులకును
మాఘ భారవి బిల్హణ మల్హణులకు
భట్టి చిత్తపకవి దండి పండితులకుఁ
గీలు కొలుపుదు నొసలిపైఁగేలు దోయి (భీమ. 1.ఆ 7.ప) 

రసభావాలను పోషించడంలో గొప్ప కవితాలక్షణాలను కలిగిన కాళిదాసుని నిర్దుష్టమైన గద్యపద్యరచన చేసేటువంటి బాణభట్టుని పొగుడుతాను. సాహిత్యమహాసామ్రాజ్యసింహాసనాన్ని అధిష్ఠించినటువంటి ప్రవరసేనున్ని కొలుస్తాను. అలాగే హర్షున్ని, భాసున్ని శివభద్రున్ని సౌమిల్లున్ని దండి మొదలైన కవులకు నమస్కరిస్తానని తెలిపాడు. దీనిని బట్టి ఈ కవుల రచనామార్గప్రభావం సంస్కృతసాహిత్య పరిచయం, అలాగే అలంకార ప్రస్థాన ప్రభావం ఉందని చెప్పుకోవచ్చు.

4. శ్రీనాథుని రచనామార్గం:

‘‘శైలీ పరిశీలనం మానవుడి అంతరంగాన్ని కళాకలితం చేసి రసార్ద్రం కావిస్తుంది. ఇది ఒకానొక కావ్య కర్తృత్వాన్ని, కవికాలాన్నీ నిర్ణయించడానికి ఉపకరిస్తుంది. ఈ శైలి కావ్యస్వరూప స్వభావాలకు అద్దంపడుతుంది. శైలీ పరిశీలన౦వల్ల భాషావగాహనాధికారాలతో పాటు భావామలత్వా- మరత్వాలనుగూడా సాధింపవచ్చు4

కనుక ఒకయుగ కవిరచనామార్గం అధ్యయనం చేయడం తప్పనిసరి. ప్రసిద్ధకవి అయిన శ్రీనాథుడు అనుసరించిన రచనామార్గం గూర్చి భిన్న అభిప్రాయాలను వెల్లడించడానికి కారణం శ్రీనాథుడు తన రచనల్లో కొన్ని సందర్భాల్లో రచనామార్గం గురించి చెప్పుకోవడం ఒకటయితే, మరికొన్ని సందర్భాల్లో పూర్వకవులైన వారిని సంస్కృత కవులను ఇటు తెలుగు సంస్కృత కవులను స్మరించి, వారి కవితా మార్గాన్ని కూడా అనుసరించానని చెప్పాడు.

5. పరిశోధకుల అభిప్రాయాలు:

శ్రీనాథుని రచనల మీద కృషి చేసిన వారు భిన్నమైన అభిప్రాయాలను వెల్లడించారు. శ్రీనాథుడు స్పష్టంగా తన పద్యాల్లో మూడు కవితామార్గాలు ఉన్నాయని ‘హరచూడాహరిణా౦కవక్రత’ పద్యాన్ని ఆధారం చేసుకొని వక్రత, సరసత్వం, కాఠిన్యం కవితా లక్షణాలుగా చెప్పిన వారు ఉన్నారు. ప్రాచీన సంస్కృత సాహిత్యాన్ని చదివిన వాడు కనుక అలంకారికుల మార్గాలను అనుసరించిన వాడైనందున కుంతుకుని వక్రోక్తిని పాటించాడని అభిప్రాయపడ్డారు.

5.1 జి.వి.సుబ్రహ్మణ్యం:

జి.వి.ఎస్ శ్రీనాథుని కవితా మార్గం గురించి చెప్తూ “రీతి ఆయన మార్గం,వక్రత శోభాతిషయ హేతువు. రీతిని మార్గమంటారు ‘రీయంతే పరంపరయా గచ్ఛ౦తి అనయాకరణ సాధనో2యం రీతి శబ్దః మార్గాపర్యాయః అని రత్నేశ్వరుడు రీతిని వ్యాఖ్యానించాడు. మార్గ కవిత్వం కావ్యంలో ఎలా మహానీయంగా భాసిస్తుందో భావించడానికి శ్రీనాథుని కవితా ప్రస్థానం చక్కని ఉదాహరణ5 రీతి ప్రాధాన్య వాదిగా తెలిపాడు.

5.2 కుందూరి ఈశ్వరదత్తు:

శ్రీనాథుని కవిత తత్త్వం మీద పరిశోధన చేసిన పరిశోధకుడు కుందూరి ఈశ్వరదత్తు శ్రీనాథుడు అనుసరించిన మార్గం విచిత్ర మార్గం అని తెలిపి-
"విచిత్ర మార్గము 1. ప్రతిభాజాతశబ్దార్ధ చమత్కారము, 2. అలంకార సహితము, 3. ఉక్తి వైచిత్ర్యము 4. ప్రతీయమాన అర్థచమత్కారము, 5. వక్రోక్తి నిబంధనము 6 అని తెలిపాడు.

5.3 కొర్లపాటి శ్రీరామమూర్తి:

శ్రీనాథుని మీద ప్రసిద్ధమైనపరిశోధన చేసి చారిత్రిక ఆధారాలను చూపెట్టిన కొర్లపాటి శ్రీరామ మూర్తి శ్రీనాథుని కవితా మార్గం గూర్చి ప్రస్తావిస్తూ-

భరతముని ప్రోక్తమైన రసము కుంతకుని ప్రతిపాదితమైన వక్రోక్తి శైలీ పరిణతమైన ప్రౌఢిమ సత్కావ్య లక్షణములని శ్రీనాథుని సిద్ధాంతము. ఈ మూడును తన కవితా రీతులని శ్రీనాథుని ఋజుముఖ ప్రకటనము.”7 అంటూ వక్రోక్తి మార్గంగా సూచించాడు.

5.4 జి.నాగయ్య :

కుంతకుడు తన వక్రోక్తి జీవితమును గ్రంథమున శైలిని సుకుమార విచిత్ర మధ్యమ మార్గములుగ విభజించి వాటి స్వరూపములను నిరూపించియున్నాడు శ్రీనాథుడు కుంతకుడు నుడివిన విచిత్రమార్గమును శైలీవిధానమును స్వీకరించినాడు.8 

జి. నాగయ్య కూడా వక్రోక్తి మార్గాన్ని బల పరిచాడు. ఇలా ఎంతోమంది శ్రీనాథుని కవితా మార్గం గురించి చర్చించారు. చాలామంది శ్రీనాథుని కవిత్వంలో వక్రోక్తి ఉందని చెప్పారు. ముందుగా కుంతకుని వక్రోక్తి సిద్ధాంతం గూర్చి తెలుసుకొని ఆ లక్షణాలకు అనుగుణంగా శ్రీనాథుని కవిత్వం ఇముడుతున్నదా అనేది చూడాలి.

6. కుంతకుని వక్రోక్తి సిద్ధాంతం:

భారతీయ అలంకార లోకంలో పలు సిద్ధాంతాలు బయలుదేరాయి. అందులో కుంతకుని వక్రోక్తి సిద్ధాంతం ఒకటి. కుంతకుడు క్రీ.శ 950 - 1050 మధ్య కాలానికి చెందినవాడు. ఇతడు కాశ్మీర దేశానికి చెందినటువంటి కవి. కుంతకుడు రాసినటువంటి గ్రంథం ‘వక్రోక్తి జీవితమ్’ ఇతను వక్రోక్తి కావ్యానికి జీవితం అని అన్నాడు. 

ఆనందవర్ధనుడు ధ్వని కావ్యాత్మ అనగా కుంతకుడు ధ్వని మతానికి ప్రతికూలంగా ఒక కొత్త సిద్ధాంతాన్ని ప్రతిష్ఠించాడు. ఆ సిద్ధాంతమే వక్రోక్తి. ధ్వని కావ్యాత్మ అని ధ్వనికి ఒక స్వతంత్ర స్థితి ఉన్నదనీ కుంతకుడు అంగీకరించడు. ధ్వని కూడా వక్రోక్తిలో అంతర్గతం అంటాడు.9 అని పుల్లెల శ్రీరామ చంద్రుడు తెలిపాడు. 

కుంతకుడు వక్రత గూర్చి వివరించి ప్రధానంగా ఆరు వక్రతలను తెలిపాడు. ఆ కారికను పరిశీలిద్దాం.

కవి వ్యాపార వక్రత్వ ప్రకారాస్సo భవంతి షట్
ప్రత్యేకం బహవో భేదాస్తేషాo విచ్ఛిత్తి శోభినః”  (వ.జీ. ఉ.1 -  కా.18)

కవివ్యాపారవక్రత్వ పద్ధతులు ఆరు రకాలుగా ఉండవచ్చు వాటిలో ఒక్కొక్కదానికి వైచిత్ర్య శోభితాలైన అనేక భేదాలు ఉన్నాయని తెలిపాడు. కవివ్యాపారవక్రత పద్ధతులు ఆరు రకాలుగా ఉండవచ్చు. వాటిలో ఒక్కొక్కదానికి వైచిత్ర్య శోభితాలైన అనేక భేదాలు ఉన్నాయని తెలిపాడు.
ప్రధానంగా ఆరు రకాల వక్రతలు - 1. వర్ణవిన్యాసవక్రత, 2.పదపూర్వార్థవక్రత, 3. పదపరార్థవక్రత, 4. వాక్యవక్రత, 5. ప్రకరణవక్రత 6. ప్రబంధవక్రత. ఈ వక్రతలు కుంతకుని వక్రోక్తి సిద్ధాంతానికి సంబంధించినటువంటివి. ఇందులో శబ్ద అర్థ ప్రధానమైనవి, వస్తు రసప్రధానమైనవి. కారక ప్రత్యయ ప్రధాన్యమైనవి ఉన్నాయి. వ్యాసపరిధినిబట్టి షడ్విధవక్రతలలో మొదటిదైన వర్ణవిన్యాసవక్రతకు, అందులో ఉపవిభాగాలకు మాత్రమే ఇప్పుడు శ్రీనాథుని కవిత్వం నుండి లక్ష్యాలను ప్రదర్శిస్తాను.

7. వర్ణవిన్యాసవక్రత:

ప్రధానంగా మూడు విధాల వర్ణవిన్యాస వక్రతలు చెప్పాడు.

"ఏకోద్వౌ బహవో వర్ణాబధ్యమానా పునఃపునః
స్వల్పాంతరాస్త్రిదా సోక్తా వర్ణ విన్యాస వక్రతా” (వ.జీ.ఉ.2 కా.1)

కొంత వ్యవధానంతో కూడిన ఒకవర్ణం గాని, లేదా రెండు వర్ణాలు గానీ, మూడు వర్ణాలు గానీ, పునరావృత్తమైతే అది వర్ణవిన్యాస వక్రత, ఇది 'ఏకవర్ణపునరావృత్తి, ద్వివర్ణపునరావృత్తి, బహువర్ణ పునరావృత్తి’ అని మూడు రకాలు. ఇక్కడ వర్ణాలు అంటే హల్లులుగా గ్రహించాల్సి ఉంటుంది. ఈ వర్ణ విన్యాసవక్రతను ఇతరాలంకారికులు చేకానుప్రాస, వృత్యానుప్రాస, అంత్యానుప్రాన, లాటానుప్రాస, శ్రుత్యానుప్రాస, అను ఐదు ప్రాసలుగా చెప్పారు. ఈ మూడిటితో పాటు ఇందులో భాగంగా మరో మూడు విధాల వర్ణవిన్యాసవక్రతలను తెలిపాడు. వర్గపంచమాక్షరాలతో రాయటం, ద్విత్వాలు ఎక్కువగా రావటం, సంయుక్త పదాలు ఉండడం కూడా వర్ణ విన్యాసమే అన్నాడు. ప్రధానమైన మూడు వర్ణ విన్యాస వక్రతలు. శ్రీనాథుని కవిత్వంలో వక్రోక్తి మార్గం పాటించాడు అని అన్నారు కాబట్టి ఆ లక్షణానికి సరిపడ లక్ష్యాలు ఉన్నాయా లేవా అని పరిశీలిద్దాం.

7.1 ఏకవర్ణ విన్యాస వక్రత:

ఒకే వర్ణం (హల్లు) అనేక సార్లు ఆవృత్తమైతే దానిని ఏకవర్ణ పునరావృత్తి అని అంటారు. దీనికి శ్రీనాథుుని భీమేశ్వరపురాణంలోని ఈ క్రింది పద్యాన్ని ఉదాహరణగా చూపవచ్చు.

కం. వడివిడువక యివ్వడువున
ముడుపతి ముకుటుండు చెవులకొనరని నుడుగుల్
నొడివిన నే నయ్యిరువుర
యడుగులబడి కాశి వెడలి మరిగెడు వేళన్. (భీమే ద్వి. ఆ. 16ప)

వ్యాసున్ని కాశీ వదిలి పొమ్మని శివుడు కోపగించే సందర్భంలోనిది ఈ పద్యం ఇందు 'డ' కారం ప్రతీసారీ ఆవృత్తమై వర్ణ విన్యాసాన్ని కలిగించింది. మహాశివుని మాట్లాడిన వేగాన్ని ఈ శబ్దం చెపుతున్నదా అనట్లు అనిపించటం ఈ పద్యంలోని ప్రత్యేకత. ఇది పోతన భాగవతంలోని ‘అడిగెదనని కడువడి జను’ పద్యాన్ని గుర్తుకు తెలుస్తుంది. ‘డ’ వర్ణ విన్యాసంతో అలరించిన ఈ పద్యం కుంతకుడు చెప్పిన ఏక వర్ణ విన్యాసానికి ఉదాహరణ. ఇతరులు దీన్నివృత్యాను ప్రాసగా చెప్తారు. 'డ' కారం నాద సౌందర్యాన్ని పద్యానికి చేకూర్చటం వలన పద్యం వినసొంపుగా ఉంది.

7.2 ద్వివర్ణవిన్యాసవక్రత:

రెండు వర్ణాలు అనేక మార్లు అవృత్తమైతే దాన్ని ద్వివర్ణవిన్యాసవక్రత అని అంటారు. ఈ విధమైన వక్రతకు శ్రీనాథుని భీమేశ్వరపురాణంలోనే ఈ క్రింది మరో పద్యాన్ని లక్ష్యంగా పేర్కొనవచ్చు.

కం. అసమ సమ విషమ సమర
ప్రసృమర రిపుసుభట నిటలపట్ట విఘట్ట
వ్యసన దృఢ దోః కఠారా !
కుసుమ శరాసన సమాన కోమలమూర్తీ! (భీమే. ద్వి. ఆ. 164 ప)

వేమ భూపాలుని పొగుడుతూ అతని పరాక్రమాన్ని తెలుపుతూ రకరకాల సమరములలో శత్రు సైనికుల నుదుటి పట్టములను చీల్చుటయందు ఆసక్తి కలిగినవాడా! మన్మధునితో సమానమైనవాడా అన్ని వర్ణించాడు. ఇక్కడ అసమ సమ, సమర, సమాన పదాల్లో 'సమ' అను పదంలోని వర్ణాలు అనేకమార్లు భిన్న అర్థాలలో వ్యక్తమయ్యాయి. ఇతరాలంకారికులు యమకంగా దీన్ని గుర్తించారు. కుంతకుడు వర్ణ విన్యాసంగా చెప్పాడు. ఇన్ని సార్లు ఈ హల్లుల జంట రావడం రాజు పరాక్రమాన్ని తెలియజేస్తూ శబ్ద సౌష్టవాన్ని కూర్చింది. ఇక్కడ ‘సమ’ అనే పదం సమానమైన, అసమానమైన యుద్ధ సంబధమైన పదగతంగా అర్థాలను ఇచ్చి పలు మార్లు ఆవృత్తం కావటం వలన శ్రవణానందాన్ని కూర్చింది. ఇది కుంతకుడు చెప్పిన ద్వివర్ణ పునరావృత్తి గా చెప్పవచ్చు.

7.3 బహువర్ణవిన్యాసవక్రత:

మూడు లేదా అంతకంటే ఎక్కువ వర్ణాలు మళ్ళీ మళ్ళీ ఆవృతమైనట్లైతే దానిని బహువర్ణ పునరావృత్తి అని అంటారు. ఇందుకు శ్రీనాథుని హరవిలాసంలోని ఈ క్రింది పద్యాన్ని ఉపపత్తిగా చెప్పవచ్చు.

క. వచ్చిన వాడక వచ్చున్.
జొచ్చిన వాకిలియు చొచ్చు జొచ్చిన చోటే
యచ్చుగా గ్రమ్మఱఁజొచ్చన్
బచ్చు శివార్చనకు శంభు భక్తుల వెదకన్" (హ. వి. ఆ. 2 –ప. 46)

చిఱుతొండనంచి ఆతిథ్యం ఇవ్వడానికి అతిథి కోసం వెతుకుతున్న సందర్భంలో చెప్పినటువంటి పద్యం ఇది. ఈ పద్యమందు ‘వచ్చిన వచ్చున్’ జొచ్చిన చొచ్చు, జొచ్చిన అనే పదాలు పునరావృతమైనవి. జ, చ, న వర్ణాలు పదే పదే ఆవృత్తమైనవి కనుక దీనిని బహువర్ణ పునరావృత్తిగా చెప్పవచ్చు. ఈ పదాలను మళ్ళీ మళ్ళీ ప్రయోగించుట వలన చిఱుతొండనంబి ఏవిధంగా అతిథికోసమై ప్రయత్నం చేసాడో అనే దానిని గూర్చి చెప్పుతూనే ఆ ప్రయత్నం ఎంతపట్టుదలతో చేసాడనే విషయాన్నిఈ పదాలే చెప్తున్నాయా? అన్నట్లు వ్యక్తం చేస్తున్నాయి. ఇది బహువర్ణవిన్యాసానికి లక్ష్యంగా చెప్పవచ్చు.

8. ముగింపు:

కుంతకుని వక్రోక్తి సిద్ధాంతంలోకి వేములవాడ భీమన ఉద్దండ లీల, నన్నయ ఉభయ వాక్ప్రౌడి రెండు కూడా కాఠిన్యమే. ఈ మూడు లక్షణాలు కూడా కుంతకుడు చెప్పిన వర్ణవిన్యాసవక్రతలో అంతర్భవిస్తాయి. రసంతో కూడిన సరసోక్తి కూడా రససమున్మేషవక్రతలో వస్తుంది. తిక్కన రసాభ్యుచిత బంధం సరసత్వమే కదా. ఎర్రన సూక్తి వైచిత్రి వాక్య వక్రతలో ఇలా ప్రతీ లక్షణం వక్రతా వ్యాపారంలో ఇముడుతుంది. కానీ ప్రతి లక్షణానికి ఉదాహరణలతో ఈ పత్రంలో నిరూపించడానికి నిడివి సరిపోదు. ప్రస్తుతం శ్రీనాథుని కవిత్వంలో వర్ణవిన్యాసవక్రత సోదాహరణంగా నిరూపించడమైంది. ఈ మహాకవి కేవలం శబ్దానికే కాక అర్థానికి కూడా ప్రాధాన్యం ఇచ్చాడు. ఆయన మార్గం కుంతకుడు చెప్పిన విచిత్రమార్గం. వక్రోక్తి సిద్ధాంతంలోని అంతర్భేదాలలో కూడా చెప్పిన అన్ని లక్షణాలు శ్రీనాథుని పద్యాల్లో ఇమిడి ఉన్నాయి. కవి చెప్పిన దాన్ని బట్టి పరిశోధకుల అభిప్రాయాన్ని బట్టి, శ్రీనాథుని కవితా మార్గాన్ని వక్రోక్తిగా చెప్పవచ్చు. 

9. పాదసూచికలు:

  1. మస్తాన్ రెడ్డి. చేరెడ్డి. భారత పద్య శైలి. పుట.1
  2. సుబ్రహ్మణ్యం. జి.వి.ముత్యాల ముచ్చట్లు.పుట. 50. 
  3. హనుమచ్చాస్త్రి. ఇంద్రగంటి. ప్రాచీన కవితా వైజయంతి పుట 73.
  4. మస్తాన్ రెడ్డి, చేరెడ్డి. భారత పద్య శైలి. పుట 2. 
  5. సుబ్రహ్మణ్యం.జి.వి.ముత్యాల ముచ్చట్లు పుట. 51.
  6. ఈశ్వర దత్తు. కుందూరి. శ్రీనాథుని కవితా తత్త్వం.పుట. 157. 
  7. శ్రీ రామమూర్తి, కొర్లపాటి. తెలుగు సాహిత్య చరిత్ర పుట 123.
  8. నాగయ్య .జి. ఎఱ్ఱన శ్రీనాథుల సూక్తి వైచిత్రి పుట27. 
  9. శ్రీరామ చంద్రుడు. పుల్లెల వక్రోక్తి జీవితం, పుట: 203.

10. ఉపయుక్తగ్రంథసూచి:

  1. ఈశ్వరదత్తు. కుందూరి. (1964). శ్రీనాథుని కవితాతత్త్వం. ఆంధ్రసారస్వతపరిషత్. హైదరాబాద్. 
  2. జయకృష్ణబాపూజీ, జంధ్యాల. (1977), శ్రీనాథుని సాహిత్యప్రస్థానం. వెల్కం ప్రెస్. గుంటూరు.
  3. నాగయ్య, జి. (1984). నవ్య పరిశోధక ప్రచురణ. ఎఱ్ఱర శ్రీనాథుల సూక్తి వైచిత్రి. తిరుపతి. 
  4. మస్తాన్ రెడ్డి. చేరెడ్డి. (1989). భారత పద్య శైలి. ఆశాలతా ప్రచురణలు. నరసరావుపేట.
  5. మృత్యుంజయరావు, జొన్నలగడ్డ. (2000), కవి సార్వభౌమ విరచిత శ్రీ శివరాత్రి మహాత్మ్యం. (వ్యాఖ్యానం). తెలుగు విశ్వ విద్యాలయం హైదరాబాద్. 
  6. లక్ష్మీనారాయణ. గుండవరపు. (1997). శ్రీనాథ మహా కవి విరచిత శ్రీ భీమేశ్వర పురాణం (వ్యాఖ్యానం). ఫాలాక్ష ప్రచురణ. గుంటూరు.
  7. శరభేశ్వర శర్మ, మల్లంపల్లి, (1992). శ్రీనాథ విరచిత శ్రీ కాశీఖండం (వ్యాఖ్యానం). తెలుగు విశ్వ విద్యాలయం. హైదరాబాద్. 
  8. శ్రీరామ మూర్తి కొర్లపాటి. (1992). తెలుగు సాహిత్య చరిత్ర. రమణశ్రీ ప్రచురణలు. విశాఖపట్టణం. 
  9. రామచంద్రుడు. పుల్లెల (2007). వక్రోక్తి జీవితం (బాలానందిని వ్యాఖ్యానం),సాహిత్య అకాడెమి. న్యూఢిల్లీ. 
  10. సుబ్రహ్మణ్యం. జి.వి. (1996). ముత్యాల ముచ్చట్లు. జీవియస్ షష్టిపూర్తి ప్రచురణలు. హైదరాబాద్. 
  11. హనుమచ్చాస్త్రి. ఇంద్రగంటి. (1988), ప్రాచీనకవితావైజయంతి. తెలుగు విశ్వవిద్యాలయం. హైదరాబాద్.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]