headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-08 | July 2023 | ISSN: 2583-4797

9. క్షేత్రమాహాత్మ్యకావ్యాలు: సాంఘికజీవనం

dr_m_kasimbabu.jpg
డా. మోదుగు కాశీంబాబు

జూనియర్ రిసోర్స్ పర్సన్
భారతీయ భాషాసంస్థ,
మైసూర్, కర్నాటక.
సెల్: +91 9908683093. Email: kasimtelugu@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

మన ప్రాచీనసంప్రదాయసాహిత్యంలో అనేక విలువలతో కూడుకున్న సామాజికజీవన విధానం కనిపిస్తుంది. ఆ సమాజం మానవుని సర్వతోముఖాభివృద్ధికి నిదర్శనంగా తోస్తుంది. కవులు ఆనాటి జీవనశైలిని తమ కావ్యాల రూపంలో గ్రంథస్థం చేయటం వల్లనే ఇప్పటికీ ఆ వైభవాన్ని గుర్తు చేసుకోగలుగుతున్నాము. మనచరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు, ఆహారపదార్థాలు, దుస్తులు, ఆటలు, పాటలు వంటి సాంఘిక జీవనసంస్కృతి ఆనాటి క్షేత్రమాహాత్మ్యకావ్యాల ఆధారంగా నిరూపించటం ఈ వ్యాసోద్దేశం. ఈ వ్యాసనిర్మాణానికి క్షేత్రమాహాత్మ్యకావ్యాలైన కాశీఖండం, భీమఖండం, కాళహస్తిమాహాత్మ్యం, పాండురంగమాహాత్మ్యం వంటి గ్రంథాలను ఉపయోగించు- కున్నాను. ఈ వ్యాసంలో మన సంస్కృతి, కుటుంబజీవనం, విలువలతో కూడిన సమాజం వంటి విషయాలను క్రమంగా తెలియజెప్పాను. మన ప్రాచీనజీవనవిధానంలో ఉన్న అనేక గొప్ప విషయాలను ఈనాటి సమాజానికి అందించటం ఇందులోని ప్రధాన విషయం. ఈ వ్యాసంలోని విషయాలు ఈనాటి సాంఘికజీవితానికి స్ఫూర్తిని కలిగిస్తాయని భావిస్తున్నాను.

Keywords: క్షేత్రమాహాత్మ్యకావ్యాలు, సాంఘికజీవనం, పురవర్ణనలు, అలంకారాలు, భోజన పదార్థాలు.

1. ఉపోద్ఘాతం:

మనిషి సృష్టిలోలేని అనేక విషయాలను కనుగొంటూ గొప్పవాడిగా నిలుస్తున్నాడు కానీ, తోటిమనిషిని మనిషిగా చూడటానికి మాత్రం ఇష్టపడటం లేదు. మానవసేవే మాధవసేవని ఎంతోమంది మేధావుల మాటలు మాటలుగానే ఉన్నాయి. వాటిని ఇప్పటికీ చాలామంది అర్థం చేసుకోకుండా మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. గుడికివెళ్ళి చేసినపాపాలను పోగొట్టుకొని, పుణ్యంకోసం దేవుడికే డబ్బు, నగదు సమర్పిస్తున్నారు. దేవుడ్ని కొనటానికి తయారవుతున్నారు తప్ప పక్కవాడు పస్తులుంటే కూడ పట్టించుకోవటం లేదు. ఈ సందర్భాన్ని ఎత్తిచూపే ఒక విలువైన పద్యం కాశీఖండంలో శ్రీనాథుడు చెబుతాడు.

తల్లిదండ్రులకు నిద్దపుభక్తి ఠవణిల్ల శుశ్రూషచేసిన శుద్ధమతులు
పతులకు నిర్వ్యాజ పరమతాత్పర్యత~మ్ బరిచర్య సలిపిన పద్మముఖులు
సజ్జనావళికి నిష్కారణంబున నుపకార మొనర్చిన ధీరగుణులు
దఱిదప్పకుండ సంధ్యాజపహోమతంత్రంబులు నెఱపిన ధర్మవిదులు
బ్రహ్మరతులు తపస్వులు భవ్యతీర్థ సేవకులును సద్వ్రతులు నిస్పృహులు మొదలు
గాఁగనొప్పెడు తత్పుణ్యకర్మపరులు వీరె చూడుఁడు సుఖమున్నవార లిందు (కా.ఖం. 2-11)

సాంద్రమైన భక్తితో తల్లిదండ్రులకు సేవలుచేసిన స్వచ్ఛమనస్కులు, కారణంలేకుండానే పరమభక్తితో భర్తలకు పరిచర్యలు చేసిన స్త్రీలు, ఏ కారణం లేకుండానే సజ్జనులకు ఉపకారం చేసిన ధీరోదాత్తులు విలువలతోకూడిన సంస్కారవంతమైన జీవితాన్ని గడిపే పుణ్యకర్మపరులకు స్వర్గప్రాప్తి కలుగుతుందని చెప్పటం ఈనాటి సమాజం నేర్చుకోవలసిన గొప్ప విలువలసారంగా తోస్తుంది.

నన్నయనుంచి మొదలుకున్న మన ప్రాచీనసాహిత్యంలో అనేక విలువలతో కూడుకున్న సమాజం కనిపిస్తుంది. కవులు ఆనాటి జీవనశైలిని తమ కావ్యాల రూపంలో గ్రంథస్థం చేశారు. ఈ గ్రంథాల ఆధారంగానే మనచరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, పండుగలు, ఆహారపదార్థాలు, దుస్తులు, ఆటలు, పాటలు వంటి సాంఘిక జీవనసంస్కృతి తెలుస్తుంది. క్షేత్రమాహాత్మ్యకావ్యాల్లో ప్రధానంగా ఆనాటి మన సాంఘికజీవితం ప్రతిబింబిస్తు౦ది. అందువలన ఇక్కడ క్షేత్రమాహాత్మ్యకావ్యాలైన కాశీఖండం, భీమఖండం, పాండురంగమాహాత్మ్యం, శ్రీకాళహస్తిమాహాత్మ్యం, శ్రీరంగమాహాత్మ్యం వంటి రచనల ఆధారంగా ఆనాటి సాంఘికజీవనాన్ని తెలియజెప్పే ప్రయత్నం చేస్తాను.

2. పురవర్ణనలు:

క్షేత్రమాహాత్మ్యకావ్యాల్లో ప్రధానంగా పురవర్ణనలు కనబడతాయి. ఈ పురవర్ణనల ఆధారంగానే ఆ  క్షేత్రమాహాత్మ్యం తెలుస్తుంది. శ్రీనాథుడు కాశీఖండంలో కాశీక్షేత్రమాహాత్మ్యాన్ని గురించి చెబుతూ చేసిన వర్ణన కాశీపురి ప్రాశాస్త్యాన్ని మరింత పెంచుతుంది.

కాశికానగరంబు కడసీమమున నున్న చండాలుఁ బోల డాఖండలుండు
నానందవనములో ననశన స్థితి నున్కి భువన సామ్రాజ్య వైభవముఁబోలు
నవిముక్త దేశస్థుఁడయ్యెనేఁ బతితుండు నశ్వమేధాధ్వరాహర్త దొరయు
వారణాసీ సంభవంబైన మశకంబు నైరావతముతోడ నవఘళించు
నాటుకొని శ్రీ మహాశ్మశానముననున్న యణుక నగ్నాట వటుఁడైన నాగ్రహమున
గర్వితోద్ధతి నే తెంచు కాళ రాత్రి మృత్యుదేవత ముని పండ్లుమెఱకఁ జాలు (2-47)

కాశీనగరం ఎంతపవిత్రమైనదంటే ఇంద్రుడు మొదలైన దేవతలు కాశీనగరంలో ఊరుచివర ఉండే కడజాతివాడికైన సరిరారు అంటాడు. ఆనందవనంలో తిండిలేకుండా ఉపవాసదీక్షతో ఉండటం భువనసామ్రాజ్య వైభవానందాన్ని పొండటం వంటిది. కాశీ నివాసి అయితే చాలు సర్వవిధాల భ్రష్టుడైన వాడు కూడ అశ్వమేధం చేసిన వాడితో సమానం. వారణాసిలో పుట్టిన దోమ కూడా ఐరావతానికి సాటి అంటాడు. అంటే కేవలం ఈ క్షేత్రంలో పుట్టటం చేతనే కడజాతివాడికైన, పశుపక్షకీటకాదులకు సైతం ఆ గొప్పతనం కలుగుతుందని కాశీపుణ్యక్షేత్రం మాహాత్మ్యాన్ని తెలియజేస్తాడు.

తెలుగువారికి కాశీపురికి మధ్య అనాదిగా ఒక గొప్ప సంబంధం ఉన్నట్లుగా మన ప్రాచీన కావ్యాల ఆధారంగా తెలుస్తున్నది. నేను పరిశీలించినంత వరకు తెలుగుసాహిత్యంలో కాశీపుర ప్రస్తావనగాని, కాశీపురవర్ణనగాని అనేక కావ్యాలలో కనిపిస్తుంది. ఈ వర్ణనల ఆధారంగా కూడా ఆ నగరంలోని సామాజిక జీవనాన్ని  అంచనావేయవచ్చు. పాండురంగమాహాత్మంలోని కాశీపురవర్ణనను పరిశీలిస్తే...

శ్రీకరోదయవధూ లోకాననప్రభా నాటిత బహుచంద్ర నాటనంబు
సమ్మర్దగళిత భూషారత్నమంజరీ యోజిత రథ్యా ప్రపూజనంబు
కైలాస శైలసంకాశ సౌధనివేశ కౌముదీ కవచిత గగనతలము
విస్తీర్ణవిపణి విన్యస్త వస్తువ్రజ ప్రకటిత రత్నగర్భా జఠరము
విపుల మవమాన తాండవవేపమాన లాంఛనధ్వజ పట్ట పల్లవలలామ
మౌళిరచిత కశాకృత్య హేళిహయము దీపితంబగు శ్రీకాశికాపురంబు” (పాండు.1-103)

ఆ నగరంలోని స్త్రీలముఖాలను చంద్రునితో పోల్చుతూ, ఒక్కసారిగా ఆ బహుచంద్రులు పురవీథుల్లోను, గృహాలలోను, ఎత్తైన భవంతుల మీదనూ ఎక్కడ చూస్తే అక్కడ నగరమంతటా కనిపిస్తూ ఉన్నాయని భావన చేశాడు. స్త్రీపురుషులు ఇద్దరూ రత్నాభరణాలను ధరించి నిర్భయంగా గుంపులుగుంపులుగా వీథులలో సంచరించేవారు అనటం వారి సామాజిక సమానత్వాన్ని, ఆర్థికబలాన్ని, భద్రతను తెలియజేస్తుంది. అలాగే వీథుల్లోని జనాలరద్దీ వలన వారు ధరించిన రత్నాలు రాలి కిందపడిన సన్నివేశం పువ్వులు, పేలాలతో రాజవీథికి పూజచేసినట్లుగా రథ్యాప్రపూజ నిర్వహించబడుతోందా? అన్నట్లుగా ఉందట. ఇక ఆ నగరంలోని రాజగృహాలు, సాధారణగృహాలు తెల్లనికాంతిని ఎగజిమ్ముతూ కైలాసపర్వతానికి సాటి వచ్చేవిలాగ ఉన్నాయట. విశాలమైన వీథులతో, ఆ వీథులనిండ వస్తురత్నాలు పేర్చి అమ్మకానికి పెట్టిన ఆ సందర్భం కాశీనగరం భూదేవి తాలూకు గర్భకోశమా అన్నట్లుగా ఉందట. రాజసౌధం శిఖరాగ్రాన రాజచిహ్నంతో కూడిన ఒక పెద్ద పట్టుజెండా గాలికి చిగురాకులా రెపరెపలాడుతోందట. అది ఎంత ఎత్తుగా ఉందంటే అది గాలికి ఊగుతున్నప్పుడు కొసభాగం సూర్యుని గుర్రాల వీపులకి చెళ్ళుమని తగిలి, త్వరగా పరుగెత్తండి అని తరుముతున్నట్లుగా ఉందట. అంతటి ఎత్తైన రాజసౌధంతో కాశీపురం శోభిల్లుతోందని చెప్పటం కవి ఉద్దేశం. గురజాడ చెప్పినట్లు ‘దేశమంటే మట్టికాదు మనుషులు’, వారు నివశించే పరిసరాలు. ఇక్కడ కవి వర్ణనల్లో కనిపించే మనుషులు, వారి అలవాట్లు, వారు అలంకరించుకునే ఆభరణాలు, వారు ఏర్పరచుకున్న పరిసరాలు ఆ వ్యవహారమంతా ఆనాటి సాంఘికజీవనాన్ని పట్టిచూపుతుంది. ఆ నగరం గొప్పతనాన్ని మరింత పెంచుతుంది.

ఈ పురవర్ణనల్లో భాగంగా తెనాలి రామకృష్ణకవి రాసిన ఘటికాచలమాహాత్మ్యములో కాంచీపురవర్ణనను గమనించవచ్చు.

శ్రీకరానేక రత్నాకర ప్రాకార గోపుర ప్రాసాద దీపితంబు
సౌధాగ్ర సంచరజ్జలజముఖీ ముఖ మణి దర్పణిత చంద్రమండలంబు........” (ఘటి.2-161)

ఇక్కడ స్త్రీ, పురుషులిద్దరూ బంగారం, రత్నాలు పొదిగిన ఆభరణాలు ధరించడం. వేదకాలానికే అద్దం వంటి పరికరాన్ని గురించి తెలుసుకోవడం. అద్దంలో కనబడే ప్రతిబింబం కుడి ఎడమవుతుందని తెలుసుకోవడం. అద్దానికి రత్నాలు పొదిగి రూపొందించుకోవడం. నగరానికి చుట్టూ పెద్ద ప్రాకారాన్ని నిర్మించుకోవడం, ధనవంతుల భవంతులకు రత్నాలను పొదిగి అలంకరించుకోవడం, వాస్తుతో కూడిన కట్టడాలు, ఇళ్ల ముందు రంగురంగుల రంగవల్లికలు, ఆకాశాలను తాకే బంగారు భవంతులు వంటి విషయాలన్నీ మన పూర్వీకుల విజ్ఞానాన్ని, మేథాజీవితాన్ని ఎత్తిచూపుతున్నాయి.

శ్రీనాథుడు కాశీఖండంలో స్త్రీలు పూలనూ, నగలునూ ధరించటం వల్ల వారి భర్తలకు ఆయుష్షు పెరుగుతుందన్న విషయాన్ని చెబుతాడు.

పసుపుం గుంకుమ కజ్జలంబు నునుకూర్పాసంబు తాంబూలమున్
కుసుమంబుల్ కబరీ భరంబు చెవియాకుల్ మంగళాలంకృతుల్
విసుపొక్కింతయులేక తాల్పవలయున్ వీనిన్ సదాకాలమున్
నసిచక్కంగ ప్రియుండు వర్థిల్లుటకై నాలీకపత్రాక్షికిన్ (2-73)

అలంకరణ అనేది ఒక మానసిక అవస్థ. సుమంగళిగా ఉన్న స్త్రీకి, విధవరాలైన స్త్రీకి ఉన్న వ్యత్యాసం వారు ధరించే అలంకరణలను బట్టి కూడ తెలుస్తుంది. ఈ సమాజంలో కూడా తాళి, మెట్టెలు వంటి విషయాలు స్త్రీకి కేవలం అలంకరణలేకావు, తమకు రక్షణని కల్పించే విషయాలు కూడా. అవివాహితనో, విధవనో చూసినంత చులకనగా వివాహితను నొప్పించటానికి పురుషసమాజం ఆలోచిస్తుంది. కాబట్టి ఈ అలంకరణ స్త్రీలకు నష్టంకంటే లాభాన్నే కలిగిస్తుందని చెప్పవచ్చు. అయితే పురుషుల అభివృద్ధిని, ఆయుష్షుని కోరి స్త్రీలు ఆభరణాలు ధరించాలన్నది ప్రాచీనులు ఆలోచించి చేసినట్లుగానే తోస్తుంది. ఎందుకంటే పూలను చూచినపుడు వాటి పరిమళాన్ని ఆస్వాదించినపుడు మనసుకు తెలియని ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడి దూరమవుతుంది. ఒత్తిడిలేని మనిషికి ఆయుష్షు పెరుగుతుందన్నది శాస్త్రీయమైన అంశమే, కాబట్టి ప్రాచీనులు ఈ నియమాన్ని రూపొందించి ఉండవచ్చు.  

ధూర్జటి శ్రీకాళహస్తిమాహాత్మ్యంలో చెంచుల వేషధారణను, అలంకరణ విశేషాలను తెలియజేయటాన్ని చూడవచ్చు. చెంచుబాలకుడైన తిన్నడి వేషధారణను పరిశీలిస్తే...

జలకంబార్చి విభూతి పెట్టి కుంజాబీజ సంకీర్ణమే
ఖల బంధించి మయూర పక్షలతికా కాండంబులంజేసిసం
దిలి దండల్సవరించి కన్నుగవ కాంతింగాటుకందీర్చి మం
దుల తాయెత్తులు గట్టినన్శబర పుత్రుల్గూడి యాడంబురిన్ (శ్రీకాళ.3-32)

పై పద్యంలోని విషయాలను పరిశీలిస్తే చెంచులు శైవాచారాలను పాటించినట్లుగా తెలుస్తుంది. వేటకు ముందు కాట్రేనిని ఆరాధించటం కనిపిస్తుంది. గురిగింజలహారాలు, మొలత్రాళ్లకు ఆభరణాలు, నెమలి ఈకలు, తాయెత్తుల్లు వంటివి వారు చాలా ఇష్టపడతారు. స్త్రీపురుషులిద్దరూ నెమలిపించాలతో అలంకరించుకోవటం కనిపిస్తుంది. స్త్రీలు తమ కొప్పులో నెమలిపింఛాన్ని చుట్టుకొని, నుదుట జేగురుబొట్టు ధరించి, పాలిండ్లపై గురువింద పేర్లనేగాక పండుటాకుల పైటను కూర్చుకొని, విండ్లను, మొనదేలిన కొయ్యబాణాలను చేతబట్టుకొని తమ భర్తలతోపాటు అడవుల్లో తిరుగుతూ వేటకు సహకరించేవారని తెలుస్తున్నది.

శ్రీకాళహస్తిమాహాత్మ్యంలో కాశీలో జీవిస్తున్న మానవునికున్న గొప్ప లక్షణాలను తెలియజేయడాన్ని గమనించవచ్చు.  

చదువుల పుట్టినిండ్లు శమ సంపద యిక్కలు పుణ్యలక్ష్మికిన్
మొదలి దివాణముల్ సురసమూహము నాఁకటి పంట లంచితా
భ్యుదయ నిసర్గ బంధువులు ప్రోడతనంబుల ఠాణముల్ పురిన్
బొదలెడి భూసురోత్తముల భూరి పవిత్ర శరీర వల్లరుల్ (పాండు.1-109)

కాశీపురిలో నివశించే భూసురోత్తములు తపశ్శక్తితో ప్రకాశిస్తున్న, పవిత్రమైన శరీరవల్లరులు. ఉపవాసాది దీక్షలతో శరీరాన్ని అధీనంలో పెట్టుకోవడం వీరి ప్రత్యేకత. గొప్ప విద్యావంతులు. శాంతమనే సంపదలకు నెలవులు. పుణ్యమనే లక్ష్మికి మొదటి కొలువులు. దేవతలకు ఆకలితీర్చే పంటలు. ఒప్పే శ్రేయస్సుకు సహజ బంధువులు. నిత్యం లోకశ్రేయస్సు కోసం కృషి చేస్తారు. నైపుణ్యాలకు స్థానాలు వీరు అని చెప్పటం ఆనాటి మానవ సంస్కారాన్ని పట్టిచూపుతుంది. ప్రాచీన సమాజం నుంచి ఈనాటి సమాజం నేర్చుకోవలసిన ప్రధాన లక్షణాలివి. క్రమశిక్షణతో కూడిన విలువల సమాజమే ఎప్పటికైన చరిత్రలో నిలుస్తుంది. స్వార్థంనింపుకున్న గుండెల్లో ప్రేమకరువై, విలువలు తరిగిన సమాజం ఎప్పటికైన తిరోగమనాన్నే చూస్తుంది.

ప్రతి సమాజంలోను ధనవంతులు, కూలీలు కనబడతారు. ధనవంతులు సౌకర్యవంతమైన జీవితాన్ని గడిపే సందర్భంలో తమ భవంతులను ఆకాశానికి పోటీపడేలా ఎత్తుగా నిర్మించుకోవటమేకాక, భవనశిఖరాగ్రాలపైన, భవంతుల ముందుభాగంలోనూ వజ్రాలను, ముత్యాలను పొదిగి నిర్మించటం కనిపిస్తుంది. అలాగే రవాణాసౌకర్యం లేకపోవటం చేత ఎంతదూరమైన బోయీలతో పల్లకీలను మోయించుకోవటమూ కనిపిస్తుంది. తినటానికి తిండిలేక నిరుపేదజీవితాన్ని అనుభవిస్తూ యాతన పడుతున్న సందర్భాలు కూడా మనకు అక్కడక్కడ కనిపిస్తున్నాయి. కాశీఖండంలో శ్రీనాథుడు కూలికి ఎంతదూరమైన వచ్చే పనివాళ్ళున్నట్లు చెప్పాడు. “మార్గమధ్యంబున నొక్క వేఁటపల్లె నొక్క యాటవికునికిన్ భృతి యిచ్చి మూటమోపించుకొని యెట్టకేలకుం గాశీపట్టణంబు చేరి” అని ఒక కూలివాడి సహాయంతో వైశ్యుడు కాశీకి చేరినట్లు చెబుతాడు. దీన్నిబట్టి యాత్రికులు తమ ప్రయాణ సందర్భంలో వస్తువులను మోయటానికి కూలీలను నియమించుకునేవారని, ఆకాలానికి కూలీలు ఉన్నట్లుగా తెలుస్తున్నది. చెంచులు అడవుల్ని వదిలి కూలిపనికోసం బయటప్రదేశాలకు వెళ్ళేవారని, అందులో కొంతమంది తమ ఆర్థిక ఇబ్బందులను తట్టుకోలేక “మూటలోఁ దామ్రసంపుటకంబున ధనం బున్నయది యని చెంచు వంచనాపరుం డై బొక్కసం బెత్తుకొని తప్పుతెరువునందన పల్లెకుం బోయె” యాత్రికుల మూటలను తీసుకొని పారిపోయేవారని చెబుతాడు.

3. జాతరలు - వినోదాలు:

ఏ మతమైన మనుషులందరినీ ఐకమత్యంగా నడిపించడానికి, బలమైన వ్యవస్థగా తీర్చిదిద్దడానికే పుట్టింది. గ్రామీణ సమాజంలో గ్రామరక్షణకోసమని గ్రామదేవతలకు మొక్కుతూ జాతరలు ఏర్పాటుచేసుకోవడం, ఆ జాతరల్లో ప్రజలంతా సామూహికంగా విందులు, వినోదాల మూలంగా విజ్ఞానాన్ని పంచుకోవడం కనిపిస్తుంది. జాతరలకు వెళ్ళే స్త్రీల అలంకరణలను గమనిస్తే ఉదయాన్నే లేచి వెచ్చని చమురు తలకు రాసుకొని, స్నానం చేసి, నలుచదరపుగళ్ళ వస్త్రాలను ధరించేవారు. కళ్ళకు కాటుక పెట్టుకొని కొప్పులో పూలు పెట్టుకొని, వేపచిగుళ్ళ దండలను మెడలో వేసుకొనేవారు. మోటుదనపు అందాలతో భార్యలు ముందర నడుస్తుండగా రెడ్లు తమ వారిని అనుసరిస్తూ పొలాలగట్లగుండా ఊరిపొలిమేరల్లోవున్న దేవతల గుడికి చేరుకునేవారు. ఇక జాతర అంటేనే వినోదం. స్త్రీపురుషులు ఇద్దరూ కల్లు తాగడం కూడా సాధారణంగా కనిపిస్తుంది. ఈ విశేషాలన్నిటిని పాండురంగమాహాత్మ్యంలో రామకృష్ణకవి సహజమనోహరంగా వర్ణించాడు.

పెలుచ గలుచొక్కు చెలువల తలకునెక్క
దోన దిక్కుల తల కెక్కదొడగె దమము
దేవి గుడిలోన నొక్కొక్క దివియ దోప
దోన నొక్కొక్క చుక్కయు దోచెమింట (పాండు.3-79)

జాతరలో మేకలను, గొర్రెలను నరకటం, వండి తినటం, నిప్పులలో నడవటం, అగ్నిగుండాలలో దూకటం, అరటాకుల మీద నృత్యంచేయడం వంటి సాహసోపేత కృత్యాలను తమ భక్తిని నిరూపించుకునే సందర్భంలో ఆనాటి ప్రజలు చేయటాన్ని గురించి కవి సమగ్రంగా వివరిస్తాడు.
పాండురంగమాహాత్మ్యంలో రకరకాల భోజనపదార్థాలు చెప్పబడ్డాయి.

ఒక కొన్ని వడియంబు లొక కొన్ని వరుగులు ఒక కొన్ని తెఱగుల యొలుపు పప్పు
లొక కొన్ని ద్రబ్బెడ లొకకొన్ని తాలింపు లొక కొన్ని విధముల యొఱ్ఱచేరులు…….. (4-184)

అంటూ వేపుళ్ళు, పప్పులు, కేకులు, కారంతోకూడిన ద్రవ్యాలు, చట్నీలు, పిండ్లు, మజ్జిగలు, అప్పాలు వంటి వాటిని చెప్పాడు. ఘటికాచలమాహాత్మ్యంలో చల్దన్నం, పెరుగన్నం వంటివి చెప్పటంతోపాటు, రాత్రిపూట మిగిలిన అన్నాన్ని కొద్దిగా గంజిలో ఉంచి ఉదయాన్నే మజ్జిగ, ఉప్పువేసి చల్దన్నాన్ని తయారుచేస్తారని చెబుతాడు. ఇక ధూర్జటి శ్రీకాళహస్తి మాహాత్మ్యంలో చెంచువారి ఆహారపు అలవాట్లను వర్ణిస్తాడు. శివుణ్ణి భోజనానికి పిలుస్తున్న సందర్భంలో తిన్నడు తమ ఆహారంలో అడవిమృగాలైన పందులు, లేళ్ళు, దుప్పులు, పిట్టలు ఉంటాయని చెబుతాడు. వాటిని కమ్మగా వండుకొని ఇష్టంగా తింటారని, వీరి వంటల్లో ప్రధానమైనది మాంసమని తెలుస్తున్నది.

కొండల కానలందిరిగి క్రొవ్వినపందుల లేళ్ళదుప్పులన్
చెండిన పెక్కుచందముల చిన్నక పెద్దకగారు కమ్మగా
వండుదురట్ల పిట్టలును వండుదురివ్వట నుండనేల నా
కొండొకటానతీక యుడుమూరికి రాగదవయ్య లింగమా (3-66)

ధూర్జటి ఇక్కడే పాయసాన్ని తయారుచేయటానికి ఉపయోగించే పదార్థాలను కూడా చెప్పటం విశేషం.

ఓ లింగమ విని నివ్వరి ప్రాలును, నొడిపిళ్ళు కునుకుప్రాలును వెదురుం
బ్రాలునుసవరపు మెకముల పాలును గలపచుట నీకు పాయసమునకున్ (3-67) అని శివునికోసం తయారుచేసే పాయసాన్ని గురించి వివరించటం గమనించవచ్చు.

4. వైద్యవిశేషాలు:

గ్రామీణవైద్యాన్ని ప్రస్తావిస్తూ ఏ ఆకుపసర ఏ జబ్బును నయంచేస్తుందో వివరంగా శ్రీకాళహస్తి మాహాత్మ్యంలోను, పాండురంగమాహాత్మ్యంలోనూ చెప్పబడింది. ధూర్జటి నేత్రవ్యాధికి చికిత్సావిధానాన్ని ఈ కింది విధంగా చెప్పాడు.

కోకపొట్లం బావిగొన నూది యొత్తుచు కషనోష్ణ కరభ భాగమునగాచి
నెత్తి తంగేడాకు మెత్తి రేచికి నిమ్మపంటి నీరున నూఱి పట్టువెట్టి.............. (శ్రీకాళ.3-110)

ఇప్పటికీ కొన్నిచోట్ల కంటిలో ధూళిగాని, దుమ్ముగాని పడిందంటే గ్రామాల్లో ఈనాటికీ ప్రజలు వెంటనే బట్టను పొట్లంగాచేసి నోటి ఆవిరిపట్టి కంటిలో పెడతారు. తంగేడు, రేచకి, నిమ్మరసం, తెల్లదిరిసెనపువ్వురసం, కలివె పూవురసం వంటివి కంటి జబ్బులకు పనిచేస్తాయని ధూర్జటి తెలియజేస్తాడు. ఇలా ప్రతి జబ్బుకు మన పూర్వీకులు ప్రకృతి వైద్యాన్నే చేసుకుంటూ జీవించారు.
ఆనాడు ప్రసవసందర్భంలో మంత్రసానుల పాత్ర ప్రధానమైనది. మందులు సిద్ధంచేయటం, పుట్టిన శిశువుకు స్నానం చేయించేటప్పుడు ఆ నీళ్ళు పడటానికి ఒక చిన్నగుంటను తవ్వటం, బాలింతరాలిని అటూ ఇటు నడిపించటం మొదలైన పనుల్ని ధూర్జటి శ్రీకాళహస్తిమాహాత్మ్యంలో వివరించటాన్ని గమనించవచ్చు.

చెలువకు బిడ్డకుట్లు విలసిల్లగ భల్లపురంధ్రు లంతలో
పిలువరె మంత్రసాని తలపెట్టరె కాయము గూర్ప లేమకున్
జలకముగాపరే కొలనుచయ్యన ద్రవ్వరె మందగామినిన్
నిలువగనీకురేనుచు నేర్పరులైకడు సంభ్రమింపగన్ (శ్రీకాళ.3-26)

ఇంకా పుట్టిన బిడ్డకు బొడ్డుకోయటం దగ్గరనుంచి ఎటువంటి విధులు నిర్వహించాలి వంటి అనేక విషయాలు వరుసగా వివరించబడ్డాయి.

5. క్రీడాస్ఫూర్తి:

ఆటలు మనిషి జీవితంలో అత్యంత ప్రధానమైనవి. కేవలం వినోదం కోసమేకాక విజ్ఞానాన్ని అందిస్తాయి, శరీరదృఢత్వాన్ని పెంచుతాయి. అయితే ఈ ఆటల్ని మన ప్రాచీనకాలంలో నుంచి అనేకంగా కోల్పోతూ వచ్చాం. కానీ మన ప్రాచీన కావ్యాల ద్వారా ఇప్పటికీ ఆ ఆటలు సజీవంగానే ఉన్నాయి. ఈ ఆటల పద్ధతులు కూడా ప్రతి సమూహానికి, ప్రతి సమాజానికి వైవిధ్యంగా ఉండటాన్ని గమనించవచ్చు. ధూర్జటి శ్రీకాళహస్తిమాహాత్మ్యంలో చెంచుబాలకులతో కలిసి తిన్నడు రకరకాల ఆటలు ఆడినట్లుగా వర్ణించాడు.

చిట్లపొట్లకాయ సిరిసింగణావత్తి గుడిగుడి గుంచాలు కుందెనగుడి
డాగిలి మ్రుచ్చులాటలు గచ్చకాయలు వెన్నెలకుప్పలు తన్ను బిల్ల
తూరన తుంకాలు గీరనగింజలు పిల్లదీపాలింకి బిల్లంగోడు....................(శ్రీకాళ.3-33)

ఇక్కడ గుడిగుడిగుంచాలు, దాగుడుమూతలు, కచ్చకాయలు, వెన్నెలకుప్పలు, గీరనగింజలు, బిల్లంగోడులు వంటి ఆటల్ని వివరించటం గమనించవచ్చు.

6. వ్యసనాలు

దుర్వ్యసనాలు మనిషిని ఎంతగా దిగజార్చుతాయో భారతకాలం నుంచి చూస్తున్నాము. అయితే ఈ వ్యసనాలు ఒక్కొక్కరిని ఒక్కోరకంగా పతనంచేయటం ఆనాటి సమాజం నుంచి ఈనాటి సమాజంలో కూడా మనం చూస్తుంటాం. నిగమశర్మ తన రోజువారి చిల్లరఖర్చులకోసం తన ఒంటిపై ఉన్న ఆభరణాలను ఎంతమాత్రం ఆలోచింపక కోమటికి తాకట్టుపెట్టటం, తన తల్లి నగలును కొంచెం కొంచెంగా కాజేయటం, తరులు తన తండ్రిదగ్గర తాకట్టుపెట్టిన పత్రాలను దొంగిలించి ఇతరులవద్ద తాకట్టుపెట్టటం వంటి విషయాలు ఈ పద్యం తెలియజేస్తుంది.

దినవెచ్చమునకునై తనమేనగల సొమ్ము కొదుకక బచ్చింట కుదువవైచు
నీదు గీచినరీతి నించుకించుక చేరి గిలుబాడు దల్లిపైగల పసిండి...........
గుడ్డవృత్తులు వృత్తులు గొలుచు గుత్తచేలు.................. (పాండు.3-16)

7. స్త్రీ సమస్యలు:

స్త్రీల విషయంలో ఇప్పుడున్న సమస్యలు అప్పుడు కూడ ఉన్నట్లుగా తెలుస్తున్నది. కాశీఖండంలో శ్రీనాథుడు స్త్రీలు పాటించవలసిన ఆచారాలను ప్రస్తావించాడు.

ఒంటి నెచ్చోట కరుగుట యుక్తికాదు-తడుపుగట్టక నీరాడ తగవుకాదు
కడపమీదను మఱి సన్నెకంటెమీద-చక్కిమీదను కూర్చుండ జాడకాదు (కా.ఖం.2-75)

ఇక్కడ స్త్రీలు ఒంటరిగా వెళ్ళకూడదని చెప్పటంలోని వారికి తగినంత స్వేచ్ఛలేదన్న విషయంతోపాటు, ఇతరులతో హాని కలిగే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే తుడుపు వస్త్రాలు లేకుండా స్నానాలు చేయటం, కడప మీద కూర్చోవటం, రోటిమీద కూర్చోవటం మంచిదికాదని చెప్పటంలో ఒక శాస్త్రీయమైన అంశం ఉండివుండొచ్చు.

8. మానవతావిలువలు:

మనిషి సృష్టిలోలేని అనేక విషయాలను కనుగొంటూ గొప్పవాడిగా నిలుస్తున్నాడు కానీ, తోటిమనిషిని మనిషిగా చూడటానికి మాత్రం ఇష్టపడటం లేదు. మానవసేవే మాధవసేవని ఎంతోమంది మేధావుల మాటలు మాటలుగానే ఉన్నాయి. వాటిని ఇప్పటికీ చాలామంది అర్థం చేసుకోకుండా మూర్ఖంగా వ్యవహరిస్తున్నారు. గుడికివెళ్ళి చేసినపాపాలను పోగొట్టుకొని, పుణ్యంకోసం దేవుడికే డబ్బు, నగదు సమర్పిస్తున్నారు. దేవుడ్ని కొనటానికి తయారవుతున్నారు తప్ప పక్కవాడు పస్తులుంటే కూడ పట్టించుకోవటం లేదు. ఈ సందర్భాన్ని ఎత్తిచూపే ఒక విలువైన పద్యం కాశీఖండంలో శ్రీనాథుడు చెబుతాడు.

తల్లిదండ్రులకు నిద్దపుభక్తి ఠవణిల్ల శుశ్రూషచేసిన శుద్ధమతులు
పతులకు నిర్వ్యాజ పరమతాత్పర్యత~మ్ బరిచర్య సలిపిన పద్మముఖులు
సజ్జనావళికి నిష్కారణంబున నుపకార మొనర్చిన ధీరగుణులు
దఱిదప్పకుండ సంధ్యాజపహోమతంత్రంబులు నెఱపిన ధర్మవిదులు
బ్రహ్మరతులు తపస్వులు భవ్యతీర్థ సేవకులును సద్వ్రతులు నిస్పృహులు మొదలు
గాఁగనొప్పెడు తత్పుణ్యకర్మపరులు వీరె చూడుఁడు సుఖమున్నవార లిందు (కా.ఖం.2-11)

సాంద్రమైన భక్తితో తల్లిదండ్రులకు సేవలుచేసిన స్వచ్ఛమనస్కులు, కారణంలేకుండానే పరమభక్తితో భర్తలకు పరిచర్యలు చేసిన స్త్రీలు, ఏ కారణం లేకుండానే సజ్జనులకు ఉపకారం చేసిన ధీరోదాత్తులు విలువలతోకూడిన సంస్కారవంతమైన జీవితాన్ని గడిపే పుణ్యకర్మపరులకు స్వర్గప్రాప్తి కలుగుతుందని చెప్పటం ఈనాటి సమాజం నేర్చుకోవలసిన గొప్ప విలువలసారంగా తోస్తుంది.

అలాగే భైరవకవి రాసిన శ్రీరంగమాహాత్మ్యం కావ్యంలో శ్రీరంగం పుణ్యక్షేత్రంలో అసువులుబాసిన ఒక దుష్టురాలైన స్త్రీని స్వర్గానికి తీసుకెళ్ళాలని చూస్తున్న దేవదూతలకు, నరకానికి తీసుకువెళ్ళాలని చూసే యమదూతల మధ్య వాదు జరుగుతున్న సందర్భాన్ని వర్ణిస్తూ కవి ఆమె అవలక్షణాలను చెబుతున్న ఈ పద్యాన్ని గమనించాలి.

అత్తమామల కెదురాడు దుశ్చారిణి వావి వర్తనలేని వాడవదినె
కొండేలఁ గొంపల~మ్ గూల్చు పాతకురాలు బలి భిక్ష మిడని నిర్భగ్యురాలు
మగనితో నేవేళ జగడించు జగజంత పసిబిడ్డలను దిట్టు పాపజాతి
దేనికేన్ బాసలు తెగిసేయునట్టుగొట్టిళ్ల కమ్ములు దెచ్చు ముళ్లమారి
కాలుఁ బ్రాణంబుగాఁ గాచు కష్టురాలు బరవఁగూయులు కూయు దబ్బరల దాసి
కెలని మేలు సహింపని గిల్బిషంబు దీనికై నీవు కనికర మూనఁ దగునె (శ్రీరంగ. 5-34)

నిజానికి ఇవన్నీ ఆ మహాసాధ్విలో ఉన్నా కూడా భైరవికవి చేసిన ఈ రచన నుంచి ఏ స్త్రీ కూడ ఇటువంటి దుష్ప్రవర్తన కలిగి ఉండకూడదన్నది మాత్రం మనం గ్రహించాల్సిన సారం. 

9. శకునాలు, వాస్తు నమ్మకాలు:

మనిషి శకునాలను నమ్మటం అనాదిగా వస్తున్న ఆచారం. ఇది ఇప్పటికీ సమాజాన్ని పట్టిపీడిస్తూనే ఉన్న సమస్య. శుభకార్యానికి బయలుదేరినప్పుడు తుమ్మటం, పిల్లి అడ్డుగారావటం, విధవ ఎదురుగారావటం వంటివి జరిగితే అశుభం అని నమ్మటం ఇప్పటికీ ఉంది. ఈ విషయాన్నే శ్రీనాథుడు కాశీఖండంలో చెబుతున్నాడు.

నిద్రమేల్కాంచి రేపాడి నియమ పరత, నహిమ భానుని వీక్షింప యటక మున్న
తగదు నరునకు జూడంగ తల్లి వదినె, నత్తగారిని తప్పించి యన్య విధవ (కా.ఖం.2-33)

ఉదయం నిద్రలేవగానే విధవరాలు ముఖం చూడటం శుభశకునం కాదంటాడు. అయితే ఈ విధవలైన తల్లి, వదినె, అత్తగార్లకు ఈ నియమం వర్తించదన్న విషయాన్ని కూడ ఇందులో వివరించాడు.

సాధారణంగా గ్రామీణ సమాజంలో ఇల్లు అంటే ఇప్పుడున్నంత ఇరుకుగాకాక ఇంటి ముందు పందిరి, ఇంటి వెనుక పెరడు, చెట్లతోకూడిన పచ్చని ప్రశాంత వాతావరణం ఉంటుంది. ఈ విషయాన్నే కాశీఖండంలో శ్రీనాథుడు ఇల్లు, ఇంటిముందుండే ఆరుగులు, పందిళ్ళు వంటి విషయాలను పేర్కొన్నాడు.

అంగడి నుండి బియ్యము పదార్థములుం గొనివచ్చి దప్పిమై
నంగము దూల నుహ్హానుచు నల్లన కోమటిసెట్టి మందిర
ప్రాంగన సీమవేదిపయి పందిరి నీదను విశ్రమించి పి
ల్చెం గటమున్ ప్రసేవమును చెచ్చెర దెమ్మని బంటు మ్లేచ్ఛునిన్ (5-65)

ప్రతి ఇంటి ముందు ఒక అరుగు ఉంటుంది. ఆ అరుగును వైశ్యులు దుకాణంగా కూడా ఉపయోగిస్తారు. పెద్దవారు ఆ అరుగుమీద కూర్చొని వచ్చేవారిని వెళ్ళేవారిని పలకరిస్తూ కాలక్షేపం చేస్తుంటారు. కొందరు చేతివృత్తులవారు ఇంటిముందర పందిళ్లకింద తమ పనులను చేసుకుంటుంటారు. ఇలాంటి పద్ధతులతో గృహనిర్మాణం శ్రేయస్కరంగా ఉండేది.

10. కులవ్యవస్థ:

మనుషులంతా ఒక్కటే. మనిషి ఏర్పరచుకున్నదే కులం. సృష్టిలో కామానికి కులం లేదు. ఆడ మగ అయితే చాలు. అందుకే నిత్యం వేదాన్ని వల్లెవేసే కులంలో పుట్టిన నిగమశర్మ, కాపు స్త్రీ ఇద్దరూ కలిసి పారిపోతారు. సాధారణంగా కులాన్ని మనిషి తనకు నచ్చినప్పుడు చాలా కఠినంగా, పక్కవాడితో అవసరమున్నపుడు తేలికైపోతుంది. కామంతో ఉన్నప్పుడు, ప్రాణంపోయే సందర్భంలోను కులం మనిషికి అడ్డురాదు. ఇది చారిత్రక సత్యం. ఇదే విషయం నిగమశర్మ విషయంలోనూ తేటపడుతుంది. నిగమశర్మ, కాపుకోడలు ఇద్దరూ ప్రాణంకోసం బోయపల్లెలో తలదాచుకున్నారు.

కాపు కోడలు కంచంత కాపురంబు-బాల వంటి కులంబు గాడ్పరచి యురికె
మగని నటువెట్టి రెండవ మగని వెంట-నువిదలకు బుద్ధి పెడతల నుండుగాదె (పాం.3-81)

ఏ సమాజంలోనైన ఒక కడజాతి ఆడదానికి ఉన్నతకులంలో పుట్టిన మగడు లభించటం ఒప్పదు సమాజం. ప్రధానంగా ఆ సమాజానికి కులవ్యవస్థ మీద గౌరభావాలు ఎక్కువ. కులానుగతమైన ఆచారాలను విడిచిపెడితే గేలిచేయడం కూడా కనిపిస్తుంది. ఎన్నో జన్మలు ఎత్తితేగాని బ్రాహ్మణ్ణుడై పుట్టడనే విశ్వాసం వారిది, అలాంటిది ఆ కులంలో పుట్టిన నిగమశర్మలాంటి వారిని చూచి బాధపడటం, కులాచారాలను, కట్టుబాట్లను భ్రష్టుపట్టిస్తున్నందుకు ఛీద్కరించుకోవటం కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఒక కడజాతి స్త్రీకి బ్రాహ్మణకులంలో పుట్టిన నిగమశర్మ దొరకటం సహించలేని ఆ చుట్టుప్రక్కల వారు దారిని వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు గుర్రుచూపులతో చూడటం. కొందరు ఉమ్మివేయటానికి రావటం వంటి చేష్టలతో కష్టపెడతారు. అయినా ఆ స్త్రీ ఆ చేష్టలకు మనసులో కొంచెం కూడ చలించలేదు ఎందుకంటే, మచ్చలేని నీ పున్నమ చందమామ లాంటి ముఖంలో గల అమృతాన్ని చూసుకునే సుమా అని తనమీద ప్రేమను తెలియజేయడం కనిపిస్తుంది.

ఈ కడజాతినాతి కిహిహీ మహిదేవుడు చిక్కెనంచు నన్
రాకకు బోకకున్ జనపరంపర కెంపగు చూడ్కి జూచి యం
బూకృత మాచరించుటకు బుద్ధి దలంక గలంక ముక్త చం
ద్రాకృతి బొల్చు నీ ముఖమునం దమూతస్థితి గాంచి మించుటన్ (పాండు.3-95)

అలాగే కాశీఖండం కావ్యంలో కాశీక్షేత్రమాహాత్మ్యాన్ని వర్ణిస్తున్న సందర్భంలో శ్రీనాథుడు చెప్పిన మాటలు ఆనాటి సామాజికస్థితిని పట్టిచూపుతుంది.

కాశికానగరంబు కడ సీమముననున్న చండాలుఁ బోల రాఖండలాదు
లానందవనములో ననశనస్థితి నున్కి భువన సామ్రాజ్య వైభవముఁ బోలు (కా.ఖం.2-47) దీని ద్వారా ఆనాటికే చండాలురుగా పిలువబడుతున్న వారు ఊరిబయటనే జీవిస్తున్నారని తెలుస్తున్నది.

11. ముగింపు:

ఇలా మన ప్రాచీనకావ్యాలను పరిశీలించినపుడు అందులోని దాగివున్న మన సాంఘికజీవితం కనిపిస్తుంది. ఆనాటి జీవితంలో కనబడే అనేకమైన విలువలు ఈ ఆధునిక సమాజంలో కనబడవు. ఆనాటి నిగమశర్మ జీవితం ఇప్పటివారికెందరికో ఆదర్శనీయం. తోడబుట్టువులు తమకంటే చిన్నవారి జీవితాలను నిలబెట్టటానికి చేసిన ప్రసంగాలు ఈనాటి కుటుంబజీవితానికి మార్గనిర్దేశం. పాత రోతని స్వేచ్ఛపేరిట విచ్చలవిడి జీవితాన్ని అలవాటు చేసుకొని విలువలు, బాధ్యతలు మరచి సమాజాన్ని విచ్ఛిన్నం చేసుకుంటూపోతున్న ఈనాటి సమాజం రాబోయేతరాలకు అందించే జీవితపు విలువలు శూన్యం. “గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్” అని నన్నయవంటి మహానుబావులు తమ అనుభవంలోని విషయాలను గాఢమైన పరిశీలనచేసి అన్నట్లుగా అనిపిస్తుంది. అనాగరికం నుంచి ఒక బాధ్యతాయుత సామాజిక జీవితాన్ని ఏర్పరచుకున్న మనం స్వేచ్ఛ పేరిట విచ్చలవిడి తనాన్ని కోరుకుంటు మళ్ళీ అనాగరికంలోకే పడిపోతున్నాం.

12. పాదసూచికలు:

  1. తెనాలి రామకృష్ణకవి, ఘటికాచలమాహాత్మ్యం, 2-161
  2. శ్రీనాథుడు, కాశీఖండం, 2-33

13. ఉపయుక్తగ్రంథసూచి:

  1. చెన్నప్ప, మసన. (1991). ప్రాచీనకావ్యాలు గ్రామీణజీవనచిత్రణ, హైదరాబాద్.
  2. ధూర్జటి. (1966). శ్రీకాళహస్తిమాహాత్మ్యము, వావిళ్ల ప్రచురణలు.
  3. ప్రతాపరెడ్డి, సురవరం. (1950). ఆంధ్రుల సాంఘికచరిత్ర, సాహిత్య వైజయంతి ప్రచురణ, హైదరాబాద్.
  4. రవీంద్రబాబు, బుదారపు (1995). భైరవకవి శ్రీరంగమహత్త్వము, భార్గవ ప్రింటర్స్, కర్నూల్.
  5. రామకృష్ణుడు, తెనాలి. (1952). పాండురంగమాహాత్మ్యము, వావిళ్ల ప్రచురణలు, మద్రాస్.
  6. శ్రీనాథుడు. (1901). శ్రీభీమేశ్వరపురాణము, క్రొత్తపల్లి వేంకట పద్మనాభశాస్త్రిచే ప్రకటించబడినది, మద్రాస్.
  7. శ్రీనాథుడు. (1958). కాశీఖండం, వావిళ్ళ ప్రచురణలు, మద్రాస్.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]