headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-08 | July 2023 | ISSN: 2583-4797

7. తాటికోల పద్మావతి కవిత్వం: స్త్రీవాదం

n_vidyavati.JPG
నూతక్కి విద్యావతి

పరిశోధకవిద్యార్థిని, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం.
స్కూల్ అసిస్టెంట్, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల,
లక్కరాజు గార్లపాడు, సత్తెనపల్లి మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్ర ప్రదేశ్.
సెల్: +91 9963637182. Email: vidyavathinutakki@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

తెలుగు సాహిత్యంలో 20వ శతాబ్దంలో వచ్చిన మార్పుల వలన ఆంగ్ల సాహిత్యప్రభావంతో తెలుగులోకి ప్రవేశించిన ప్రక్రియలలో వచనకవిత్వం ఒకటి. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎందరో కవులు వచన కవిత్వంలో రచనలు చేసి సామాజికంగా మార్పులకు కారకులయ్యారు. ఆ క్రమంలో ఎన్నో కొత్త సాహిత్య ఉద్యమాలు వచ్చాయి. వాటిలో స్త్రీవాదం ఒకటి. మనిషి జీవితంలో ఎంతో ముఖ్య భూమిక వహించే స్త్రీ నిజజీవితంలో మాత్రం ఎంతగానో వివక్షత ఎదుర్కొంటుంది. ప్రస్తుత కాలంలో కొంత వరకు మార్పు వచ్చినా ఇంకా స్త్రీలకు స్వేచ్ఛ, సమానత్వం పూర్తిగా రాలేదనే చెప్పాలి. స్త్రీలపై నేటి కాలంలో ఎన్నో దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. అలాంటి వాటి గురించి స్త్రీలను చైతన్యపరుస్తూ రచనలు చేసిన వారిలో నేటి తరం రచయిత్రి తాటికోల పద్మావతి ఒకరు. వారి కవిత్వంలో ఉన్న స్త్రీ వాదం గురించి ఈ వ్యాసం వివరిస్తుంది. వారి కవిత్వాన్ని పరిశీలించినప్పుడు మనకు స్త్ర్రీకి సమాజంలో ఎదురవుతున్న సవాళ్లను గమనించవచ్చు. తాటికోల పద్మావతి కవితా వైచిత్రిపై పరిశీలనాత్మక పద్ధతిని అనుసరించి చేస్తున్న పరిశోధన ఇది. వీరి కవిత్వం ద్వారా పాఠకులలో మార్పుని సాధించి స్త్రీలను గౌరవించేలా చేయాలని, వారి లక్ష్యాలను పాఠకలోకానికి తెలియజేయాలన్నది ఈ వ్యాస ఉద్దేశం.

Keywords: వచనకవిత్వం, తాటికోల పద్మావతి, కవిత్వం, స్త్రీవాదం, సామాజికచైతన్యం.

1. ఉపోద్ఘాతం:

అనంతమైన తెలుగు సాహిత్యసాగరంలో ఎందరో మహాకవులు ఉద్భవించారు. వారి కమనీయమైన ఆలోచనల నుండి ఎన్నో రచనలు మనిషి జీవితాన్ని, మనసుల్ని వికసింపజేసి, తెలుగు సరస్వతికి, కళామతల్లికి వన్నెతెచ్చి, పరిమళాలను వెదజల్లాయి. ఎన్నో వేలసంవత్సరాల నుండి మౌఖికరూపంలోనూ, తరువాత లిపి ఏర్పడ్డాక లిఖితరూపంలోనూ, తెలుగు సాహిత్యం అజరామరంగా విలసిల్లుతూనే ఉంది. ఆనాటి నన్నయ మొదలుకొని నేటి తరం ఎందరో కవులు, రచయితలు విమర్శకులు సాహిత్య సేవ చేస్తూనే ఉన్నారు.

ఆధునికకాలంలో పాశ్చాత్య సాహిత్య ప్రభావాల వల్ల తెలుగులో ప్రవేశించిన ప్రక్రియలు నవలలు, వచనకవిత్వాలు మొదలైనవి. ఇవి మాత్రమే కాకుండా కథలు, కథానికలలో కూడా ఎందరో సాహిత్యకారులు రచనలు చేసి అలరింపచేశారు. వ్యావహారికభాషలోనే పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా సాహిత్యాన్ని అందించడం వీటి లక్షణం. ఈ ప్రక్రియలలో చేసే రచనలు చాలా వరకు సరళభాషతో, సృజనాత్మకతతో రచించడానికి కవులకు, రచయితలకు, పఠించి ఆనందించడానికి పాఠకులకు చక్కటి మార్గం ఏర్పడింది. ఈ ప్రక్రియలలో రచనలు చేసి పాఠకుల ప్రశంసలను పొందుకున్నవారు కోకొల్లలు. అటువంటి ప్రముఖుల్లో ‘కవనసరస్వతి’ బిరుదాంకితులైన తాటికోల పద్మావతి కూడా ఒకరు. చిన్ననాటి నుండి సాహిత్యాభిలాష కలిగిన వ్యక్తిగా అధికంగా పుస్తకపఠనం చేసే పద్మావతి తర్వాత కాలంలో రచనలు చేయడం పట్ల కూడా ఆకర్షితులయ్యారు. కవయిత్రిగా, కథా రచయిత్రిగా, మంచి పేరు గడించారు.

తాటికోల పద్మావతి గొప్ప రచయిత్రి. సమాజం మీద అవగాహన ఉన్న వ్యక్తిగా తన రచనలలో ఆ భావాలు స్పష్టంగా కనిపిస్తాయి. అతిసాధారణమైన కుటుంబస్థాయి నుండి ప్రారంభమైన వారి జీవితం ఎందరికో ఆదర్శప్రాయం. కవిత్వరచనలో, కథాకథనంలో కనిపించే సామాజిక సమస్యలతో పాటు ప్రకృతి ప్రేమికురాలిగా బావకవితాప్రవాహం కూడా కనిపిస్తుంది. రచన పట్ల వారికున్న మక్కువ వర్ణించలేనిది. సాహిత్యాభిలాషతో అలవడిన కవితాశక్తితో సమాజంలో నిత్యం తారసపడే సమస్యల చుట్టూ తిరుగుతూ ప్రజలను చైతన్యవంతం చేసే విధంగా కనిపిస్తాయి.

2. తాటికోల పద్మావతి - సాహిత్య ప్రస్థానం:

చిన్న నాటి నుండి సాహిత్యాన్ని ఎక్కువగా చదవడం వల్ల సహజంగానే తనలో రచనాసక్తి పెరిగిందని వాపోయారు. ఏ కవి ప్రేరణ కానీ, ప్రభావం కానీ వీరి మీద లేదు. సొంతంగా పైకి ఎదగాలనే తపన మాత్రమే వారిని కవయిత్రిగా, రచయిత్రిగా పేరుగాంచేలా చేసింది. ఏదైనా సంఘటన విన్నప్పుడు గాని, చూసినప్పుడు గాని దాని మీద కథ రూపంలోగాని కవిత రూపంలో కానీ తనలోని భావాలను రాసేవారు.”1 (రచయిత్రి తాటికోల పద్మావతితో ముఖాముఖీ, తేది:12-07-2022)

వీరి మొదటి రచన ‘గాలివాన’ గేయం. తరువాత వివిధ పత్రికల్లో సీరియల్స్ రాసేవారు.

గ్రామీణ వాతావరణంలో పుట్టి పెరిగిన వ్యక్తిగా తన కవిత్వంలో ఎక్కువ గ్రామీణ నేపధ్యం కనిపిస్తుంది. ప్రకృతి అందాలు, గ్రామీణులు నిర్వహించే పండుగలు, వాటి వైభవం బాగా కనిపిస్తాయి. 1985 సంవత్సరం నుండి రచనలు చేయడం ప్రారంభించిన తాటికోల పద్మావతి నేటికీ రచనలు కొనసాగిస్తూనే ఉన్నారు. వీరు రాసిన రచనలు అనేక పత్రికలలో ప్రచురణను పొందాయి. వీరు కవితలు -400, సీరియల్స్ – 6, బాల సాహిత్యానికి సంబంధించిన కథలు – 40, ఆధ్యాత్మిక వ్యాసాలు – 50, సామాజిక వ్యాసాలు- 50 వరకు రచించారు. అయితే వీటిలో కొన్ని పుస్తకం రూపంలో ప్రచురించబడగా మరికొన్ని ఇంకా ముద్రణకు నోచుకోలేదు. కేవలం రచనలు మాత్రమే కాక రేడియోల్లో సైతం కార్యక్రమాలు నిర్వహించారు. కవితలు, కథానికలు ప్రసారం చేశారు. అనేక కవి సమ్మేళనాలలో పాల్గొన్నారు.

ఎంతో ప్రాచీనచరిత్ర కలిగిన తెలుగు సాహిత్యంలో ఎన్నో సాహిత్య ప్రక్రియలు నేటికీ కొత్త రూపాన్ని సంతరించుకుంటూ వాటి వైభవాన్ని చాటుతున్నాయి. వాటిలో ఎక్కువ మందిని ఆకర్షించినది, పాశ్చాత్య సాహిత్య ప్రభావంతో తెలుగులోకి ప్రవేశించిన ప్రక్రియలలో ముఖ్యమైనది వచన కవిత్వం. దీనిని ఇంగ్లీషులో ‘Freevers’ అంటారు. అనాది కాలం నుండి తెలుగు సాహిత్యంలో పద్యమే దిక్కుగా భావించబడింది. కానీ 20 వ శతాబ్ధం ప్రారంభం నుండి తెలుగు సాహిత్యంలో మార్పులు జరుగుతూ వచ్చాయి. పద్యమే కవిత్వంగా అపోహపడే వారికి ఆధునిక కాలంలో వచన కవిత్వమే సరైనదని నిరూపించి, ఎందరికో కొత్త బాటలు వేసిన వాడు కుందుర్తి ఆంజనేయులు. 

వచన కవిత పితామహుడుగా ప్రసిద్ధుడైన కుందుర్తి 1958 లో “Freeverse Front” ని స్థాపించాడు. వారు రచించిన ‘నగరంలో వాన’ ఆనాడు సాహిత్యంలో ఎన్నో వాదోపవాదాలకు, చర్చలకు తెర తీసింది. కానీ ఎందరో కవులకు ఆదర్శప్రాయమై, మార్గం చూపించింది.”2 (ఆధునికాంధ్ర సాహిత్యం – సాంప్రదాయాలు, ప్రయోగాలు – డా. సి. నా. రె – పుట:87)

భావ వ్యక్తీకరణకు ఛందోబద్దత అవసరం లేదని చాటారు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఎందరో కవులు వచన కవిత్వంలో కవిత్వం రాసి సాహిత్యంలో తమదైన ముద్రను వేశారు. తమ ప్రత్యేకతను చాటుకున్నారు. ఈ క్రమంలో వచన కవిత్వంలో తన కలాన్ని నడిపించి, కవిత్వంలో తనకూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్న రచయిత్రి తాటికోల పద్మావతి.

3. తాటికోల పద్మావతి కవిత్వం:

వీరి కలం నుండి వెలువడిన రచనలలో రెండు వచన కవిత సంపుటులున్నాయి. అవి: కవితా కుసుమాలు: ఇది 2011 లో ప్రచురించబడింది. దీనిలో వివిధ వస్తు వైవిధ్యంతో రచించబడిన కవితలు 50 ఉన్నాయి. అనురాగ ధార కవిత సంపుటి: వీరి రెండవ కవిత సంపుటి ‘అనురాగ ధార’. ఇది 2017 లో ప్రచురించబడింది. దీనిలో 49 కవితలున్నాయి.

4. తాటికోల పద్మావతి కవిత్వం - స్త్రీవాదం:

సృష్టియంతటిలో భూమి ఎంతటి పవిత్రమైనదో స్త్రీ అంతటి పవిత్రమైనది. కానీ స్త్రీకి సమాజంలో దక్కాల్సిన గౌరవం దక్కడంలేదనేది వాస్తవం. తరతరాలుగా స్త్రీ శృంగార వస్తువుగా, గృహ బానిసగా, వంటింటి పనిమనిషిలా చూడటం జరిగింది. దీనివల్ల సమాజంలో స్త్రీ ఔన్నత్యం తగ్గిపోయింది. స్త్రీలపై ఎన్నో దాడులు, వివక్షతలు, దారుణాలు జరుగుతున్నాయి. చివరకు స్త్రీ జీవనం కూడా అస్తిత్వాన్ని కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిలో స్త్రీలపై జరుగుతున్న దాడులను, సమస్యలను గురించి పోరాటాలు చేసి, వారిలో చైతన్యం కలిగించాలని ఎంతో మంది ప్రయత్నాలను చేశారు. ముఖ్యంగా సాహిత్యకారులు, సంఘసంస్కర్తలతో కలసి స్త్రీలను చైతన్యవంతం చేయడంలోనూ, సమాజంలో మార్పు సాధించడంలోనూ కొంత విజయులయ్యారు.

తెలుగు సమాజంలోను, సాహిత్యంలోనూ 15వ శతాబ్ధంలో తాళ్ళపాక తిమ్మక్క విద్యాభ్యాసంతో ప్రారంభమై తదనంతర కాలంలో వెంగమాంబ, మొల్ల వంటి వారు ఎందరో ఈ విషయంలో తొలి అడుగులు వేశారని చెప్పవచ్చు. ఇలాంటి ఎందరో సాహితి స్త్రీ మూర్తులు చరిత్రలో విశిష్ట స్థానం సంపాదించుకున్నారు. అయితే స్త్రీ స్వేచ్ఛకు సమానత్వానికి సరైన ప్రగతి ఆనాడు లభించలేదు. 20 వ శతాబ్ధం ప్రారంభ దశలోనే అటు సాంఘికంగా ఇటు సాహిత్య పరంగా వచ్చిన ఉద్యమాల ప్రభావం వల్ల వారు ఎదుర్కొంటున్న సమస్యలపై గళం పెరిగింది. చాలా మంది పురుషులు కూడా స్త్రీలకు అన్ని విషయాలలోనూ సమాన స్వేచ్ఛ, అవకాశాలు ఉండాలని పోరాడారు. తదనంతర కాలంలో చాలా మంది స్త్రీ వాద రచయితలు బయలుదేరి తమ గొంతుకలను వినిపించారు.

నీలిమేఘాలు రచనలో ముందు మాట రాస్తూ ఓల్గా ఇలా అన్నారు – స్త్రీ వాదం కొన్ని విషయాలను ముందుకు తెచ్చి చర్చకు పెట్టింది. పితృస్వామ్యం, జండర్, అణచివేత, ఇంటి చాకిరీ స్వభావం మొదలగునవి ఎన్నో విషయాల గురించి కొత్త ఆలోచనలు రేపింది. సమాజంలో స్త్రీ పురుససహులు ఎలా నిర్వహించబడతారని దాని మీద ఆధారపడి సమాజంలో రకరకాల విషయాలు రూపొందుతాయని, మిగిలిన విషయాలన్నింటికి నిర్దిష్టమయిన స్వరూప స్వభావాలనిచ్చేంత ప్రధానమైన విధానం జండర్ విధానమని స్త్రీ వాదం చెబుతుంది.”3 (తెలుగులో కవిత్వోద్యమాలు – ఆచార్య కె. యాదగిరి – పుట:185)

ప్రస్తుత సమాజంలో స్త్రీ వ్యక్తిత్వాన్ని, ఔన్నత్యాన్ని గుర్తించి గౌరవించాలి. ఒకరు ఎక్కువ ఇంకొకరు తక్కువ అని కాదు. దేవుడి దృష్టిలో ఆడా మగా ఇద్దరూ సమానమే. స్త్రీపై అత్యాచారాలు, హత్యలు చేయడం, వివక్షతను చూపడం మానాలి. స్త్రీపై విద్యావంతురాలయితే సమాజాన్ని దేశాన్ని, అభివృద్ధి చేస్తుంది. పాత సాంప్రదాయాలు, కట్టుబాట్లు పేరుతో చిన్న చూపు చూడకూడదు. ఈ ఉద్దేశంతోనే ఎందరో కవులు, రచయితలు రచనలు చేస్తూ వచ్చారు. అదే బాటలో స్త్రీ గొప్పతనాన్ని తెలియజేస్తూ వారిపై జరుగుతున్న దాడులని ప్రతిఘటిస్తూ తాటికోల పద్మావతి కవిత్వ రచన చేశారు.

4.1. ఓ వసంతమా:

చైతన్యవంతం చేసే విధంగా సాగే ఈ కవితలో ప్రకృతి పట్ల అనురాగాన్ని, సమాజంలో స్త్రీ పట్ల జరిగే ఆకృత్యాలు గురించి చిత్రించినది. మనుషులలో మానవత్వం లోపిస్తుంది. సాటి మనిషి పట్ల కనీసం ఆదరణ కూడా చూపించలేని స్థితిలో నరుడు వెళ్లిపోతున్నాడు. అటు ప్రకృతిని ఇటు సమాజాన్ని కలుషితం చేస్తున్నాడు. ఎక్కడ చూసిన దారుణాలు చోటుచేసుకుంటున్నాయి. అలాంటి సంఘటనలు చూసి, చలించిపోయి ఇవన్నీ తొలగి ఒక కొత్త వసంతం రావాలని కాంక్షించే కవిత ఇది.
భారతీయ సమాజంలో స్త్రీకి ఎంతో ప్రాధాన్యత ఉంది. స్త్రీని ఆది దేవతగా భావించి పూజించే దేశం. అయినప్పటికీ ఈ దేశంలో స్త్రీ అన్నిరకాల వివక్షతలకు గురవుతుంది. స్త్రీ జీవనాన్ని ఛిద్రం చేస్తున్నారు. అటు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా స్త్రీకి సమున్నత ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు. మరో ప్రక్క వారి మీద భౌతిక దాడులు కూడా పెరిగిపోతున్నాయి. అంతే కాదు చిన్న పిల్లల మీద సైతం కామాంధులు విరుచుకుపడుతున్నారు. పాల బుగ్గల దశలోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఎన్ని చట్టాలు వచ్చినా స్త్రీ జీవితానికి రక్షణను ఇవ్వలేకపోతున్నాయని అభిప్రాయపడ్డారు.

నరనరాల్లో పాకిన కామాగ్ని విషజ్వాలలకు
రేపటి మొగ్గలన్నీ రాలిపోతున్నాయి
పగ ప్రతీకార వాంఛలకు రంగురంగుల పూలన్నీ
కామాంధులకు బలై – ముళ్ల పొదల్లో చిక్కుకుంటున్నాయి
పరిమళాన్ని కోల్పోయి రుధిరాన్ని వెదజల్లుతున్నాయి”4(ఓ వసంతమా – కవితా కుసుమాలు – తాటికోల పద్మావతి – పుట:10)

మగవాడి కామాన్ని జ్వాలల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయిన చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ల వరకు రోజు వార్తల్లో కనిపిస్తుంటారు. పగ ప్రతీకారాల పేరుతో మరికొందరు స్త్రీల జీవితాలను ఛిద్రం చేస్తున్నారు. ప్రశ్నార్థకంగా మారుస్తున్నారు.

4.2. దీపం:

ఆడపిల్లలను గురించి చిత్రించిన కవిత ఇది. ఆడపిల్లలు ఇంటికి దీపం వంటివారని ఈ కవిత ద్వారా చాటారు. నేటి సమాజంలో స్త్రీలపై జరుగుతున్న అకృత్యాలు రోజు రోజుకి పెరిగిపోతున్న తరుణంలో స్త్రీ పట్ల మనిషికి ఉండాల్సిన ఆలోచనలు గుర్తుచేస్తుంది. ఆడపిల్లల యొక్క వ్యక్తిత్వాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించారు.

“ఆకాశం నుండి
వెండిపూల వెలుగులు
చిన్నారి పాపల చిరునవ్వులై
ఇంటికి దీపాలై వెలగాలి
కరడుకట్టిన దానవత్వాన్ని
కరుణతో చేరదీసి
మంచితనం మానవత్వం నింపి
నీతో పాటు మరికొన్ని
ప్రమిదల్ని వెలిగించి
లోకమంతా వెలుగు పంచుతావు”5 (దీపం – కవితా కుసుమాలు – తాటికోల పద్మావతి – పుట:18)

ఆడపిల్లని ఆకాశంలో నక్షత్రంతో పోల్చారు కవయిత్రి. వెండి మెరిసినట్లుగా, ఆకాశంలో నక్షత్రాలు వెలిగినట్లుగా చిన్నారి పాపల నవ్వులుంటాయని అవి ఇంటికి దీపాలు అని అభిప్రాయపడ్డారు. సమాజంలో కరుడు గట్టిన కొందరు కఠినాత్ములు వారిపై తమ పాశవిశకతను ప్రదర్శించి, మొగ్గ దశలోనే వారి జీవితాలను చిదిమేస్తున్నారు. అయితే ఎంతటి వారినైనా క్షమించే శక్తి కూడా ఒక్క స్త్రీకే ఉంటుంది. కరుణతో నిండిన స్త్రీ దీపంలాగా వంద దీపాలను వెలిగించగలదని అభిప్రాయపడ్డారు.

ఉజ్వల కాంతిని ప్రసరించే నీ కాంతులు
లోకానికి దారిచూపే వెలుగులు
చీకటిని చీల్చుకొని చిరు దీపానివైనా
త్యాగానికి ప్రతిరూపంగా నిలిచిపోతావు”6 (దీపం – కవితా కుసుమాలు – తాటికోల పద్మావతి – పుట:18)

ఆడపిల్లని చిరుదీపంగా పోల్చుతు లోకానికి దారి చూపే వెలుగుగా ప్రస్తావించారు. ఇంటిల్లిపాదికీ ఆశాజ్యోతిలాంటిది ఆడపిల్లలేనని, ఆడపిల్ల ఉన్న ఇంట్లో నిత్యం దీపావళి పండుగ సంబరాలు జరుగుతాయని అభిప్రాయపడ్డారు.

నిమీలిత నేత్రావళి
నీవు వచ్చే దారిలో
ఆత్మీయానుబంధాలు
అనురాగాల శ్రేయోభిలాషులు
ప్రజా హితవులై స్ఫూర్తి దాతలుగా
నీకు స్వాగతం పలుకుతున్నాం
నీ రూపం శాశ్వతం
అందుకే నువ్వు దీపానివి”7 (దీపం, కవితాకుసుమాలు, తాటికోల పద్మావతి. పుట:19)

ఆడపిల్ల అంటేనే ఆత్మీయతకు, అనురాగలకు మారుపేరని, తల్లిదండ్రుల శ్రేయస్సుకు మాత్రమే కాకుండా సమాజ హితం కోరుకునే స్ఫూర్తి దాతలు అని అలాంటి ఆడపిల్లల పుట్టుకను నిరోధించడం లోక కంటకమని అభిప్రాయపడ్డారు. ఆడపిల్లలను స్వేచ్ఛగా ఎదగనివ్వాలని నినదించారు. వారి ప్రగతికి బాటలు వేయాలని కోరారు.

4.3. రేపటి కోసం:

ప్రస్తుత సమాజంలో స్త్రీలు ఇంటా బయట ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. గర్భంలో ఉన్న నాటి నుండి మరణించే వరకు పురుషాధిక్య ప్రపంచం అడుగడుగునా వారి ప్రగతికి ప్రతిబంధకాలు వేస్తున్నాయి. నేటి తరంలో స్త్రీలు పురుషులతో సమానంగా ఉద్యోగాలు చేస్తూ తమకంటూ కొంత గుర్తింపులను సంపాదించుకుంటున్నారు. కానీ ఒకనాటి సమాజంలో స్త్రీ అందుకు పూర్తి భిన్నంగా ఉండేది. ఇంటా బయట అన్నింటిలోనూ వివక్షతే అలుముకునేది. ఆ సమస్యలను చీల్చుకొని నేటి తరం యువత తన ప్రత్యేకతను చాటుకునేలా ప్రగతి పథం వైపు అడుగులు వేస్తుంది. స్త్రీ ఎదుర్కొంటున్న సమస్యలను కవయిత్రి ఇలా తెలియచేశారు.

1 . గృహిణిగా సమస్యలు
2 పురుషాధిక్యత

4.3.1 గృహిణిగా సమస్యలు:

పెళ్ళయిన నాటినుండి స్త్రీలకు బరువులు, బాధ్యతలు పెరుగుతాయి. ఒకప్రక్క కుటుంబంలోని చాకిరి, మరో ప్రక్క భర్త, పిల్లలు అత్తమామల యోగక్షేమాలు చూసుకుంటూ రోజంతా యంత్రంలా పని చేస్తూనే ఉంటారు. వ్యక్తిగత కోరికలు, ఆశలు చంపుకొని బ్రతుకుని భారంగా నెట్టుకొచ్చే ఎందరో స్త్రీలు ఈ సమస్యలను భరిస్తున్నారు.

“అమ్మా! నిన్నటి నీ తరంలో
ఎంతటి దౌర్జన్యాలున్నా
ఎదుర్కునే శక్తి లేక అశక్తురాలివై
చీకటిలో నిశబ్దంగా కాలం వెళ్ళబుచ్చావు
అంతా నీ తల రాతంటూ
అవివేకంతో అజ్ఞానంగా
బంధాల ముసుగులో బాధ్యతల బరువు మోశావు” 8 (రేపటి కోసం – కవితా కుసుమాలు – తాటికోల పద్మావతి – పుట:20)

ఎందరో స్త్రీల జీవితాలు పెళ్ళితో మారిపోతాయి. వారి ఆశలకు అడ్డుకట్ట వేసి కుటుంబం అనే బంధాల్లో చిక్కుకొని జీవిస్తుంటారు. తనకంటూ స్వేచ్ఛ లేకుండా అత్తామామలు, భర్త అడుగుజాడల్లో నడవడం తప్ప తనకు సొంత అభిప్రాయాన్ని వ్యక్తం చేసే స్వేచ్ఛ కూడా లేదు. వారి ఛీత్కారాలతో అంతా తన కర్మ అని సరిపెట్టుకుంటారు. ఎదురు తిరిగి ప్రశ్నించే వ్యక్తిత్వం వల్ల ఎన్నో హింసలు భరించారు. చివరకు ప్రాణాలు పోగొట్టుకున్నవారు కూడా ఉన్నారు.

4.3.2 పురుషాధిక్యత:

పురుషాధిక్యత సమాజంలో స్త్రీకి స్వతంత్రాలు కరువయ్యాయి. భార్యగా, తల్లిగా, చెల్లిగా, కూతురుగా పురుషుడి ఆధిపత్యంలోనే అణగిపోతుంది. మరో ప్రక్క వారిపై జరిగే అకృత్యాలకు అంతే ఉండదు. ఇలాంటి వాటిని కవయిత్రి చిత్రించారు.

ఎదురుతిరిగితే బ్రతుకుని
చిత్ర వధ చేస్తామంటూ శాసిస్తున్నాయి
సామాన్య హోదాలో ఉంటే
పురుషాధిక్యత అజమాయిషీ చేస్తున్నది
ధన దాహంతో ప్రేమ పిశాచాలుగా
కామాంధులై కాటు వేస్తుంటే
సభ సమాజం ఒకటై
నిశబ్ధ సమరాన్ని ఛేదించాలి”9 (రేపటి కోసం – కవితా కుసుమాలు – తాటికోల పద్మావతి – పుట:20)

అని ఆకాంక్షించారు. పురుషాధిక్య సమాజంలో స్త్రీకి తన గొంతుకను వినిపించే హక్కు కూడా లేదు. ఎదురుతిరిగితేనే చిత్ర వధలు చేసి చంపేస్తుంటారు. ఎక్కడ చూసిన మాన భంగాలు, స్త్రీలపై ప్రేమ పేరుతో జరిగే మోసాలుతో వారి బ్రతుకులను అంధకారంగా మార్చేస్తున్నారు.
ఈ పరిస్థితులు మారాలి. స్త్రీలు చైతన్యవంతం కావాలి. రేపటి తరం స్వేచ్ఛగా బ్రతికేందుకు అడుగులు వేయాలని కోరారు. అందరూ సంఘటితమైతేనే ఏదైనా సాధించగలుగుతారు. భవిష్యత్ తరాలకోసం నేటి తరం వారు అడుగు ముందుకు వేయాలి. అప్పుడే అకృత్యాలు అరికట్టగలుగుతారు.

అత్తింటి ఆరళ్ళు- భర్త అధికారపు అజమాయిషీ
చిత్ర హింసలు అగ్నికి ఆహుతి కావడం
అన్నింటినీ న్యాయస్థానంలో వేలాడదీయాలి”10(రేపటి కోసం – కవితా కుసుమాలు – తాటికోల పద్మావతి – పుట:21)

అని అప్పుడే స్త్రీకి రక్షణ లభిస్తుందని ఆకాంక్షించారు. స్త్రీలను శారీరకంగా కానీ, మానసికంగా కానీ వేధించే వారికి శిక్షలు కఠినంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. అప్పుడే గృహ హింసలను నిరోధించగలమని అభిప్రాయం వ్యక్తం చేశారు.

4.4.గ్రుడ్డిగా నమ్మకు:
ప్రేమ పేరుతో నష్టపోతున్న ఆడపిల్లలను చైతన్యవంతంగా చేసేందుకు మంచి, చెడులను గురించిన విచక్షణను ఆలోచించమని చెప్తూ గ్రుడ్డిగా ఎవరినీ నమ్మవద్దని చెప్తున్న కవిత ఇది. కేవలం యవనేశ్చల వలన కలిగే శారీరక వ్యామోహం ప్రేమ అని నమ్మి మోసపోతుంటారు. కొందరు అబ్బాయిలు అమ్మాయిలను తమ వైపు దృష్టి మరలించుకోవడానికి వారిని మాయ మాటలతో మభ్యపెడుతుంటారు. అందుకే కవయిత్రి ఆడపిల్లలను ఇలా హెచ్చరిస్తున్నారు.

నీ అందాలకు మెరుగులు దిద్ది
మరింత మురిసిపోకు అమాయకురాలిలా!
ప్రేమంటూ వెంటబడి వెళ్ళావంటే
నిన్ను మాయమాటలతో మభ్యపెట్టి
నీ అందాన్ని పొగుడుతూ నీకు మస్కాకొట్టి
వెన్నెల రాత్రులు విహారం చేద్దామని
పార్కులు, పబ్బుల వెంట తిప్పి
సరసాలతో సరదాలు తీర్చుకొని”11(గ్రుడ్డిగా నమ్మకు – కవితా కుసుమాలు – తాటికోల పద్మావతి – పుట:58)

నేటి కాలంలో కొందరు యువకులు వేసే వెర్రి వేషాలను, వారి ఆలోచనలను ముందుంచే ప్రయత్నం చేశారు. ప్రేమిస్తున్నాను అని వెంట పడతారు. ఆడపిల్లలను కూడా ప్రేమించేలా చేయడం కోసం ఎన్నో పొగడ్తలతో మస్కా కొడతారని అభిప్రాయపడ్డారు. తీరా ప్రేమలో పడ్డాక కొన్నాళ్ళు పార్కులు, పబ్ ల వెంట తిప్పుతారు. సరసాలు ఆడుతూ వారి సరదాలు తీర్చుకుంటారు. పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి తాను తప్ప వేరే లోకమే లేదని ఆకాశానికి ఎత్తేస్తారు. చివరకు శారీరకంగా లోబరుచుకొని అందాలను ఆస్వాదిస్తారు. వారు కోరుకున్న శారీరక సుఖాలు దక్కాక మొహం చాటేస్తారని అభిప్రాయపడ్డారు.

తెల్లవారి వెన్నెలంతా కరిగిపోయాక
కళ్ళు తెరచి నిజం తెలుసుకునేలోపు
ఆ గండు తుమ్మెద మకరందం కోసం
మరో పువ్వుపై వాలుతుంది”12 (గ్రుడ్డిగా నమ్మకు – కవితా కుసుమాలు – తాటికోల పద్మావతి – పుట:59)

తమకు మోసం జరిగిందని గ్రహించే లోపు పెళ్లి కాకుండానే తల్లులయి సమాజంలో అవమానాలపాలవుతున్నారు. అవమానాలు భరించలేక మరణమే శరణమనుకుంటారు కొందరు ఆడపిల్లలు. అందుకే ప్రేమను గుడ్డిగా నమ్మవద్దని బ్రతుకుని చీకటిమయం చేసుకోకుండా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని హెచ్చరించారు.

4.5.రంగుల ప్రపంచం:

ఈ కవిత 2012 లో ఆకాశవాణి కార్యక్రమంలో ప్రసారం చేయబడింది. దీనిలో ప్రధానంగా ప్రస్తుత కాలంలోని స్త్రీల ఆలోచనా ధోరణి కనిపిస్తుంది. కుటుంబం పట్ల, పిల్లల పట్ల అధికంగా శ్రద్ధ వహించాల్సిన స్త్రీలు ప్రస్తుత కాలంలో తమ సంసారం, పిల్లల పట్ల చూపించే శ్రద్ధ కన్నా సీరియళ్ళు, బ్యూటీ పార్లర్లు వంటి వాటికే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారని దానివల్ల తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని తెలియజేశారు.

“బ్యూటీపార్లర్ చుట్టూ
రంగురంగుల పూలు వచ్చి వాలుతున్నాయి
గృహ లక్ష్మీలంతా బుల్లితెర భామలై
సీరియల్ డైలాగులు వంటబట్టించుకొని
ఇంట్లో నేనేం తక్కువంటూ
రిహార్సల్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు”13 (రంగుల ప్రపంచం – అనురాగధార – తాటికోల పద్మావతి – పుట:38)

నేటి కాలంలో స్త్రీలు తమ అందాలకు మెరుగులు దిద్దుకోవడం కోసం ఎక్కువ సమయాన్ని బ్యూటీ పార్లర్ లలో కేటాయిస్తున్నారు. అంటే కాదు చాలా మంది గృహిణులు సీరియల్స్ కు బానిసలైపోతున్నారు. టి. వి ఛానళ్ళలో వచ్చే సీరియల్స్ లో పాత్రల్లో తమను తాము ఊహించుకుంటూ ఆ పాత్రలు ఏవిధంగా ప్రవర్తిస్తారో దానిని వారు వారి జీవితాల్లో అన్వయించుకుంటున్నారు. ఇంట్లో కుటుంబ సభ్యుల పట్ల కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆత్మీయత, బంధాలు, బాంధవ్యాలను కోల్పోతున్నారు. చిన్నచిన్న విషయాలకే స్పర్ధలు పెంచుకుంటూ కాపురాలను కూల్చివేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాదు ఇటు తల్లిదండ్రులకు, అత్తమామలకు తలవంపులు తెస్తున్నారని తెలియజేశారు.

తల్లిదండ్రులు వృద్ధాశ్రమానికి
అత్తమామలు అనాథ శరణాలయాల్లో
పిల్లలు హాస్టల్ గదుల్లో బందీలయితే
ముఖాలకు రంగులు పూసుకోవడం తప్ప
చిరునవ్వులో తియ్యదనం ఎక్కడుంది” 14(రంగుల ప్రపంచం – అనురాగధార – తాటికోల పద్మావతి – పుట:39)

నేటి కాలంలో చాలా మంది స్త్రీలు చేస్తున్న పని ఇది. అత్తా మామలను చూసుకోవడం భారమై, భర్తలను వేధించి మరీ వారిని వృద్ధాశ్రమాలలో వదిలేస్తున్నారు. అటు తల్లిదండ్రుల పట్ల కూడా అదే నిర్లక్ష్య వైఖరి చూపుతున్నారు. చివరకు పిల్లలను కూడా హాస్టల్లో వదిలేస్తున్నారు. దీనివల్ల ఆప్యాయతలు, అనుబంధాలు దూరమవుతున్నాయి. మరి కొందరు స్త్రీలు ఉద్యోగాల పేరుతో కుటుంబాలకు దూరమవుతున్నారు.

5. ముగింపు:

పైన పేర్కొనబడిన విషయాలలోనే కాక ఇంకా మరెన్నో కవితల్లో స్త్రీలపై జరుగుతున్న అకృత్యాలను, గృహ హింసలను నిరసిస్తూ కవితలను రాశారు. ఆడ పిల్లగా పుట్టిన నాటి నుండి ఎంతో అపురూపంగా కాపాడుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని బాధను వ్యక్తం చేశారు. ఆడ పిల్లలను స్వేచ్ఛగా సమాజం ఎదగనివ్వడం లేదని, అడుగడుగునా ఎన్నో అవాంతరాలు సృష్టించి వారి ప్రగతిని అడ్డుకునే వాళ్ళు, కామ వాంఛతో వారిపై దాష్టీకానికి పాల్పడేవాళ్ళు ఎక్కువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఎదగనిస్తే ఎన్నో అద్భుతాలు చేయగలరని, సమాజ ప్రగతికి కారకులవుతారని ఆమే అభిప్రాయ పడ్డారు. అదే సమయంలో స్త్రీలు కూడా తమ వ్యక్తిత్వాన్ని, విలువలను కాపాడుకునేలా ప్రవర్తించాలని, ఏది మంచూ, ఏది చెడో తెలుసుకొని విలువలతో జీవించాలని సందేశమిచ్చారు రచియిత్రి.

6. ఉపయుక్తగ్రంథసూచి:

  1. కవిత, కల్వకుంట్ల. (సంపాదకులు) (2015). తంగేడు మాసపత్రిక -1 మార్చ్-2015, తెలంగాణ జాగృతి, హైదరాబాద్
  2. నారాయణరెడ్డి, సి. (2012). ఆధునికాంధ్రకవిత్వం–సాంప్రదాయాలు, ప్రయోగాలు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.
  3. పద్మావతి, తాటికోల. (2011). కవితా కుసుమాలు. తేజస్వి ప్రింటర్స్, గుంటూరు
  4. పద్మావతి, తాటికోల. (2017). అనురాగ ధార. మల్లెతీగ ప్రచురణలు, విజయవాడ
  5. యాదగిరి, కె. (2020). తెలుగులో కవిత్వోద్యమాలు తెలుగు అకాడమీ ప్రచురణ, హైదరాబాద్
  6. రామారావు, ఎస్. వి. (1989). తెలుగులో సాహిత్యవిమర్శ - అవతరణ, వికాసాలు. పసిడి ప్రచురణలు, సికింద్రాబాద్.
  7. వెంకటేశ్వరరావు, దార్ల. (వ్యాసం) (2020) ఔచిత్యం (మాసపత్రిక) vol -1, issue -1, అక్టోబర్-2020

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]