headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-08 | July 2023 | ISSN: 2583-4797

6. "టెంకణాదిత్య" నామం: పుట్టుపూర్వోత్తరాల పరిశీలన

dr_a_srinivasulu
డా. అంకే శ్రీనివాసులు

తెలుగు అధ్యాపకులు,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల(స్వ.) అనంతపురం,
అనంతపురం, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9652471652. Email: ankesreenivas@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

తెలుగులో గ్రామనామాల మీద జరిగినంత పరిశోధన ప్రాదేశిక నామాల మీద జరగలేదు. ప్రాదేశికనామపరిశోధన వల్ల భాష పరిణామంతో పాటు ప్రాచీనకవుల ప్రాదేశికత కూడా తెలిసే అవకాశం ఉంది. "టెంకణం" పదపదవ్యుత్పత్తిని సాహిత్య, చారిత్రక, భాషాశాస్త్ర ఆధారాల ద్వారా విశ్లేషించడం ఈ వ్యాసప్రధానోద్దేశం. టెంకణాదిత్యులుగా పిలవబడిన చారిత్రక వ్యక్తుల గురించిన విశ్లేషణ, నన్నెచోడునికి టెంకణం ప్రాంతంతో ఉన్న నేపథ్యాన్ని తగిన ఆధారాలతో ఈ వ్యాసం చర్చిస్తుంది.

Keywords: టెంకణం, తాడిపత్రి, ప్రొద్దుతూరు, గణము, ఆణెము, తాలిపాఱపురము

1. ఉపోద్ఘాతం:

నన్నెచోడుని కాలనిర్ణయం తెలుగు సాహిత్య చరిత్రలో అత్యంత వివాదస్పదమైనది. నన్నయ్యకన్నా పూర్వుడని కొందరు, నన్నయకు ఆర్వాచీనుడని కొందరు లోతుగా చర్చించారు. అయితే అందరూ పాకనాటి ప్రాంతానికి చెంది వుండవచ్చునని అనుమానించారు. కారణం అతనికి చెందినవిగా భావిస్తున్న శాసనాలు పాకనాడులోనే లభించడం, నన్నచోడుడు కూడా తన తండ్రిని గురించి పాకనాటి వాడుగానే చెప్పుకొని ఉండటమే కారణాలు.

2. ప్రధానవిషయం:

కలుపొన్న విరుల బెలుగన్
గలుకోడి రవంబు దిశల గలయగ జెలగన్
బొలుచు నొరయూరి కధిపతి
నలఘుపరాక్రముడు టెంకణాదిత్యుండన్” - (కుమార సం. 1-54)

టెంకణాదిత్యుడనని నన్నెచోడుడు ప్రకటించుకున్నాడు. టెంకణం అనే మాటకు అర్థమేమి?
ఆ మాటకు పదవ్యుత్పత్తి ఏమి? టెంకణం అనేది ఒక ప్రాంతం పేరు. ఆ ప్రాంతాన్ని ఒక కన్నడ శాసనం ఆధారంగా కుందూరి ఈశ్వరదత్తు వంటి పరిశోధకులు గుర్తించారు.

అనంతపురంజిల్లా తాడిపత్రిలోని రామేశ్వరాలయంలో శా.శ.1220 (క్రీ.శ.1298)లో మహామండలేశ్వరుడైన ప్రతాపకుమార ఉదయాదిత్య మహారాజు వేయించిన కన్నడ శాసనంలో ‘టెంకణం’ చిరునామా ఉంది.

నవరత్న భరిత జలధర
నివహ పరిక్షుభిత బహుళకల్లోలరవ
ప్రవి ఘోర్ణమాన లవణా
ర్ణవ పరివృత మనిపుద్రంటు జంబూ ద్వీపం”
అముశత సహస్రయోజన గదిత సువిస్తార మాగి సమవృత్తాకారాది సిర్పుడడఱ మధ్యప్రదేశ కోళ్మంధరాద్రి సొగయిసి తోర్కు
మేరుమహామహాధరద తెంకణభారత వర్షదోళుగునో
హారియు దెంచిన నొళ్పకుంతల దేశద పూర్వభాగ దోళు
సారి మరపుదంధ్ర ధరణీతల నందద ఱెందె తెంకణా
ధారిణియల్లి పెన్నపరినాడు నిరంతర ఒప్పితోఱుగుఁ”

జంబూద్వీపంలో భరతవర్షమున, కుంతలదేశానికి పూర్వదిక్కున, ఆంధ్రదేశమందు తెంకణ ప్రాంతం పెన్నపరినాడుకు చెందుతుందని, అది నేటి తాడిపత్రి ప్రాంతమయివుంటుందని పై కన్నడ శాసనానికి ఈశ్వరదత్తుగారిచ్చిన సంక్షిప్త అనువాదం.

టెంకణాదిత్యులమని ప్రకటించుకున్నవారు నన్నెచోడుడే కాకుండా రేనాడుని పాలించిన వెంకయచోళుడు కూడా ఒకడు. తన దొంగలసాని శాసనంలో టెంకణాదిత్యుడనని ప్రకటించుకున్నాడు. ఇతని శాసనం క్రీ.శ పదవశతాబ్దికి చెందినది. 

మరొకడు కొణిదెన చోళులలో ప్రముఖుడయిన త్రిభువన మల్లచోళుడు శా.సం॥ 1064 (క్రీ.శ 1142)లో గుంటూరు జిల్లా నరసారావు పేట సమీపంలోని కొణిదెన (కొట్యదాన) గ్రామంలోని. శంకరాలయంలో ఈ శాసనాన్ని ప్రకటించాడు.

త. ... ఆదిత్య
తిలకుండు ‘డేంకణా’దిత్యుండూర్జితుండు
త్రిభువన మల్లధాత్రీనాథుడుర్విన్ (శాసనపద్య మంజరి 17  - South Indian Inscriptions Vol. VI)

పై దేవాలయంలోనే ఉన్న మరొకశాసనంలో గణపతిదేవుని సామంతుడు ఓపిలిసిద్దన దేవచోళుడు . టెంకణ చక్రవర్తినని, టెంకణాదిత్యుడనని చెప్పుకున్నాడు చూడండి.

“ఓపిలి సిద్ధివల్లభజయోన్నతు ‘డేంకణ’ చక్రవర్తినా
జ్ఞాపరిరక్షి తాఖల దిశావలయు ఘనుదాన కర్ణులీ
లా పరిపూర్ణ రమ్య శుభలక్షణ మూర్తి జయంతునశ్వని
క్షాపురుపూత చేరుకొనగా జనుల్ జోడకులైన్ భూషణ్”

స్వస్తిచరణ సరోరుహ విహత విలోచన త్రిలోచన ప్రముఖాఖిల పృథ్వీశ్వర కారిత కావేరీతీర కరికాల కులరత్న ప్రదీప అపరిమిత ప్రతాప సతత సామాంతార్చిత ఒఱయూర్పురవరాధీశ్వర కాశ్యపగోత్ర అతిచతుర కామినీజనజయంత తురగరేవంత వితరణ వినోద విక్రమాదిత్య ‘టెంకణాదిత్య’రిపువిపుల మార్తాండ జగనోబ్బగండ గర్వితారాది కుమారకులకుధకులిశధర శరణా గత వజ్రపంజర కాంచీపుర వరాధీశ్వర దాయాది మండలిక ....”

పై శాసన వచనమంతా విశేషణాలతో నిండిన బిరుదులే. “ఓఱయూర్పుర వరాధీశ్వర” అని ప్రకటించుకున్న వ్యక్తి ‘టెంకణచక్రవర్తినని’, ‘టెంకణాదిత్యుడనని’, ‘కాంచీపురవరాధీశ్వరుడ’నని చెప్పుకున్నాడు. ఇవన్నీ చారిత్రక సత్యాలు కాదు. ఒకనాడు తమ పూర్వీకులు పాలించిన ప్రాంతాల గురించిన బిరుదులే తప్ప, ఇవి వ్యక్తిగతంగా సాధించిన ప్రాంతాల ద్వారా కలిగిన బిరుదులు కాదు. ‘కావేరీతీర కరికాలకులరత్న’ అని తమ వంశకర్త విశేషణాలతోనే వచనం మొదలవుతుంది. కాంచీపురానికీ, ఓఱయూరికీ, టెంకణానికీ ఏవిధమైన పాలనా సంబంధాలు లేవు. ‘ఓఱయూరుపురవరాధీశ్వర’ అనే విశేషణం తెలుగు చోళులందరికీ వున్న విశేషణం. పాకనాటి పాలకుడు ఒఱయూరికి పాలకుడెలా అవుతాడు? ఈ ఒఱయూరు తమిళనాడు రాష్ట్రంలోని తిరుచినాపల్లికి సమీప గ్రామం. పాకనాడు నేటి నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాలలో విస్తరించి వుండేది. ఈ మూడు ప్రాంతాలు వేరువేరుగా పరివేష్టితమైనవని మనం గమనించాల్సిన విషయం. టెంకణం కేవలం తాడిపత్రి సమీపంలోని పెన్నాపరివాహకమే.

కవులు చాలాకాలం పాటు టెంకణాన్ని ప్రస్తావిస్తూ వచ్చారు. నన్నెచోడుని తర్వాత టెంకణాన్ని ఒక దేశంగా మాట్లాడిన వారిలో తిక్కన మొదటివాడు.

“రాధేయునకు ప్రాపయి పులింద బాహ్లిక టేంకనాంధ్ర భోజానీకం.... (భార... కర్ణ....2-317)”.

ఇది మూల వ్యాసభారతంలో లేదు. తిక్కన భారతంలో మాత్రమే వుంది. తిక్కన భారతానికి కొనసాగింపుగా ఉత్తర హరివంశ కావ్యాన్ని రాసిన నాచన సోముడు కూడా టెంకణాన్ని ప్రస్తావించాడు.

పాంచాల పాండ్య బర్బర కిరాతాభీర...
యవనటేంకణ దశార్ణ పుండ్రపులింద..” (5-144)

అదేవిధంగా దగ్గుపల్లి దుగ్గన కూడా చెప్పాడు. (తెంకనాంధ్ర కళింగాది దేశములకు....నాచి-2-169). ఈ టెంకణం ద్వాపరయుగం నాటిది కాదు. తిక్కన, సోమన, దుగ్గనల కాలం నాటిదే!

“ద్రవిళ విదేహ మాళవ....
చేది టంకణవత్స” (హంసవింశతి..-4-14) 

అని 17 శతాబ్దిలోని అయ్యలరాజు నారాయణామాత్యుడూ చెప్పాడు. కవులు 18వ శతాబ్దం వరకూ టెంకణం ప్రాంతాన్ని గురించి మాట్లాడుతూ వచ్చారు. తరిగొండ శ్రీ వెంగమాంబ (1730-1817) కూడా ప్రస్తావించింది. (“మాళ్వ నేపాళ మళయాళ బంగాళ, చోళ, టెంకణసింధూ.. వేంకట”)

అయితే జనవ్యవహార భాషా ప్రవాహం నుండి టెంకణం శతాబ్దాల కిందటే కొట్టుకుపోయింది. దీనికి కైఫీయత్తులు, శాసనాలే సాక్ష్యం. టెంకణం అనేమాటకు ప్రత్యామ్నాయంగా తాడిపత్రిగానే వాడుకలో వుంది.

ఇంతకీ టెంకణం అనే శబ్దానికి పదవ్యుత్పత్తి ఏమిటి? దక్షిణం దిగ్వాచక శబ్దం తెంకణంగా పరిణమించిన తద్భవరూపం అన్నారు కొందరు. తెన్ అంటే దక్షిణం అని దిగ్వాచిగా దక్షిణదేశమనే అర్థంతో దేశ్యమన్నారు మరికొందరు. అయితే అందరూ ఏకగ్రీవంగా ఆమోదించినది మాత్రం టెంకణం(తెంకణం) అంటే దక్షిణదేశం లేదా దక్షిణ ప్రాంతమనే.

సాహితీవేత్తలు, సాహిత్య చరిత్రకారులే గాక కొందరు భాషాశాస్త్రజ్ఞులు కూడా దక్షిణ దేశంగానే పరిగణించారు. దక్షిణ దేశం (ప్రాంతం) అంటే ఎక్కడ? ఉత్తరభారతానికి దక్షిణమనే అర్థమా? ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశంలోని అన్ని ప్రాంతాలు దక్షిణదేశాలే! ప్రత్యేకంగా టెంకణం మాత్రమే దక్షిణం కాదు. పోనీ కేవలం ఆంధ్రదేశంలోని నాడులు, సీమల్లో దక్షిణ దేశమా అంటే అదీ సాధ్యం కాదు. టెంకణం కన్నా వెంగోనాడు, పులుగులనాడు, పాకనాడు మరింత దక్షిణ ప్రాంతాలవుతాయి కదా! కేవలం పెన్నానదికి దక్షిణమనుకున్నా కూడా వీలుకాదు. ఏవిధంగానూ దక్షిణదేశంగా టెంకణం ప్రాంతం భౌగోళికంగా సాధ్యం అయ్యే అవకాశం లేదు.

టెంకణ పదవ్యుత్పత్తి గురించి కొన్ని క్షణాలు పక్కన వుంచుదాం. టెంకణం ప్రాంతాన్ని ప్రస్తుతం తాడిపత్రి ప్రాంతంగా పిలుస్తారని కన్నడ శాసనం ఆధారంగా ముందే చెప్పుకున్నాం.

‘తాడిపత్రి’ అనే సమాసంలోని ప్రథమావయవం ‘తాడి’! ఇది తాటిచెట్టు సంబంధి. ‘పత్రి’ అనే ద్వితీయావయం కూడా భౌగోళిక నైసర్గిక విషయాన్నే వివరిస్తుంది. క్రీ.శ.234లోనే గ్రామనామాల్లో ‘పఱ్’ శబ్దం కనిపిస్తుంది. (విఱిపఱితి) పఱ్  రూపం నది లేక వాగు ప్రవాహాల్ని సూచించే మాట. నీరు ఒరుసుకొని ప్రవహించే చోటు. దీని నుండి ‘పఱితి’, పత్రి, పర్తి, పఱ్ఱు వంటి నిర్మాణాలు పరిణమించాయి. పత్రి, పర్తి పదాలు నది లేదా వాగు ఒరుసుకొని ప్రవహించే ప్రాంతాన్ని సూచిస్తాయి. ఉదా:- పుట్టపర్తి, తాడిపత్రి, విప్పర్తి! పత్రి, పర్తి భౌగోళికమైన వర్ణవ్యత్యయ శబ్దాలు. తాడిపత్రి పెన్నానది ఒడ్డున వుంది. తాడి రూపం తాటి, తాళ శబ్దాల సంబంధం! ఒకప్పుడు తాటిచెట్లు విస్తారంగా ఉన్న ప్రాంతం తాడిపత్రి. తాడిచెట్లున్న ప్రాంతంలో నది నేలను ఒరుసు కుంటూ ప్రవహిస్తున్నందువల్ల ఈ ప్రాంతాన్ని తాడిపత్రిగా పిలిచారు. తాడిపత్రికి సమీపంలో తాళ్ళప్రొద్దుటూరు (కడప జిల్లా) అనే గ్రామం వుంది. ఈ రెండు గ్రామాల మధ్య దాదాపు 17,18 కిలోమీటర్లు. తాళ్ళప్రొద్దుటూరులోని “తాళ్ళ” శబ్దం కూడా తాటివృక్షసంబంధమేనని ఆచార్య కేతువిశ్వనాథ రెడ్డిగారు చెప్పారు. 

ప్రొద్దు అంటే సూర్యుడు. “తూరు” శబ్దానికి దూరు, ప్రవేశించు, ఎత్తు, చొచ్చుకొనివచ్చు, పొడుచుకొనివచ్చు అనే అర్థాలు ఉన్నాయి. పొద్దు పొడవటం లేదా పొద్దు చొచ్చుకొని రావడంతో ప్రొద్దుతూరు. తాడిచెట్లున్న వనంలో ప్రొద్దుపొడవడం తాళ్ళ ప్రొద్దుటూరుగా వాడుకలోకి వచ్చింది. అక్కడ జననివాసమై ఊరు అనే అర్థంలో క్రమంగా తాళ్ళప్రొద్దుటూరు అయింది. (ఇక్కడ అనవసరమైనప్పటికీ ఒకమాట, తూర్పుదిక్కు అనే మాటలోని తూర్పు శబ్దానికి ఆదారం కూడా తూరు శబ్దమే. ధాన్యంలోని చెత్తా చెదారాన్ని పోగొట్టడానికి తూర్పుగాలికి గంపలతో ఎత్తడాన్ని తూర్పెత్తడం, తూర్పుకు ఆరబెట్టడాన్ని తూర్పారబెట్టడం వంటి జాతీయాలేర్పడ్డాయి.) తూర్పు శబ్దం దేశీయ శబ్దం అంటే ప్రాచీనకాలంలో ఈ ప్రాంతమంతా తాటిచెట్లతో విస్తరించివుండేదని తాడిపత్రి, తాళ్ళప్రొద్దుటూరు అనే ఈ పేర్లే సాక్ష్యం. ఇది తెలుగు గ్రామనామాల్లో సహజం. ఉదా॥ కడపజిల్లాలో వేంపల్లి, వేముల వృక్షసంబంధమైన గ్రామనామాలు. ఈ గ్రామాలు కనీసం 15,16 కి.మీ దూరంలో వుంటాయి. ఒకనాటి వేమవనాన్ని సూచిస్తాయి. ఇటువంటిదే తాటివనం కూడా!

3. టెంకణం ప్రస్తావనలు - విశ్లేషణ:

టెంకణంలోని ‘టెంక’ అంటే తాటికాయ, మామిడికాయల్లోని విత్తనాన్ని ‘టెంక’ అంటారు. దీనిని నిఘంటువులూ చెబుతున్నాయి. మామిడి టెంక, తాటి టెంక పదాలు వాడుకలో నేటికీ నిలిచేవున్నాయి. ‘టెంకి’ అంటే తాటాకులకు బెజ్జం వేసే సాధనం అని శబ్ద రత్నాకరం, సూర్యరాయాంధ్ర నిఘంటుకారులు చెప్పిన అర్థమూవుంది. టెంకలకు బెజ్జం వేసేది టెంకి.

  • టెంకి అంటే స్థానము అనే అర్థంలో నుదురుపాటి వేంకన తన ఆంధ్రభాషార్ణవము నిఘంటువులో చెప్పాడు. (టెంకి నిట్టయన...) ఇదే అర్థంతో తిక్కన ప్రయోగం కూడా వుంది. 
    అరుగుదెంచి... నొడలుచూచి టెంకినున్న... (భార-మౌస-82)
  • టెంకి శబ్దానికి ‘గృహం’ అనే అర్థంలో శ్రీనాథుడు, వేమనలు ఉపయోగించారు.
    1. “య్యూవిధకును...టెంకికేగుమా” - (హర-2-64)
    2. “దూలాలు టెంకినుండగ” – (వేమన)
  • ఇదే మాటకు జలాశయమనే అర్థంతో ప్రయోగాలున్నాయి.
    1. “టెంకి లింగిపోజేసి” గౌరన - (ద్విపద హరిశ్చ)
    2. “దప్పికై పాఱి సెలయేటి టెంకులన్” (పెద్దన- మనుచరిత్ర, 4-37)
  • ‘తెంకి’ అంటేకూడా స్థానం, గృహమనే అర్థాలు.
    “మెకముల బట్టికట్టి... యాగితెంకికి” (-పిల్లలమఱ్ఱి పినవీరన-శృంగార, 2-3)
  • తెంకిపట్టు అంటే ఉనికిపట్టు
    1. “ఇవి గుఱ్ఱపు మొగంపు చివురాకు బోడిమి తెగిచెట్ల గట్టిన తెంగిపట్టు”
    (అయ్యలరాజు రామభద్రుడు-రామా,  7-11).
    2. “డెంకి పట్టినదాని... ” (తిరువేంగళనాథుడు-అష్టమహిషీ, 1-11-పో-252)
    పై చర్చానేపథ్యంలో తాడిచెట్ల ప్రాంతం లేదా తాటివనాన్ని- టెంకణం/తెంకణం అని అనేవారని స్పష్టమవుతోంది. జలాశయం లేదా నీరు కల్గిన ప్రాంతంగా కూడా ఈ పదానికి అర్థం వర్తిస్తుంది. తాడిపత్రి, తాళ్ళపొద్దుటూరు ప్రాంతాలు పెన్నాపరివాహంలో ఉన్న స్థలాలు పై కన్నడ శాసనంలో “పెన్నపరినాడు”. అని స్పష్టంగానే వుంది. తాటి విత్తనం, గృహం, స్థానం, నీరు కల్గిన ప్రాంతం అనే నానార్థాలకు వచ్చే ఏకైక పదం ‘టెంక’. అందువల్ల ఈ పదం మూడు విధాలుగా నిర్మాణమయ్యే అవకాశం ఉంది.
    1) ‘గణము’ అనే మాటకు సమూహం, గుంపు అనే అర్థాలున్నాయి. టెంక + గణము కలిసి కాలప్రవాహంలో టెంకణంగా నిలబడవచ్చు. తాడిచెట్ల సమూహం, తాడిచెట్ల గుంపు అనే అర్థంలో.
    2) ‘ఆణెము’ అంటే దేశం, ప్రాంతం. టెంక + ఆణెము టెంకాణెము అనేమాట వ్యవహారికంలో టెంకణంగా స్థిరపడే అవకాశం కూడా ఉంది. తాడిచెట్ల ప్రాంతం లేదా తాటిచెట్ల దేశం అని వ్యవహారిక అర్థంలో పరిణమించి ఉండవచ్చు.
    3) తడిసిన నేలను ‘మాగణం’ అంటారు. ఈ ప్రాంతమంతా పెన్నానదితో తడిసిన ప్రాంతం. పై కన్నడ శాసనం చెప్పిన ‘పెన్న పరినాడు’ మాట కూడా మాగాణం మాటకు వర్తిస్తుంది. టెంక మరియు మాగాణం కలసి టెంకమాగాణమై వాడుకలో క్రమంగా ‘టెంకణం’ గా స్థిరపడి ఉండవచ్చు.

ఇలా మూడు విధాలుగా సలక్షణంగా సరిపోయే విధంగా ఈ పదం ఆవిర్భవించడం నిజంగా అద్భుతం. 

ఈ వ్యాస ప్రారంభంలో కుందూరి ఈశ్వరదత్తు గారిచ్చిన కన్నడ శాసనం అసంపూర్ణం. ఆ పద్యం తర్వాత కూడా మరొక కన్నడ పద్యం వుంది.

ఆ జనపదక్కె తలెసలె
రాజాశ్రయమెనిసి తాళిపాఱపురంవి
భాజి సుగువమర పన్నగ
రాజ పెరక్కణె యెనిప్ప మహిమోన్నతియుః”

ఈ కన్నడ శాసన పద్యంలోని తాళిపారపురం నేటి తాడిపత్రికి నాటి వాడుక రూపం. 

‘టెంక’ శబ్దం దేశ్యం. తాళి, తాడి శబ్దాలు సంస్కృతం నుండి ప్రవేశించినవి. దేశ్య శబ్దమైన ‘టెంక’ను మింగేసి తద్భవ రూపమైన ‘తాడి’ వాడుకలో నిలబడి శాశ్వతంగా పీఠం వేసి కూర్చుంది. ‘టెంకణం’కాస్త కాలప్రవాహంలో కొట్టుకుపోయింది. టెంకణం, తాడిపత్రి సమానార్థకాలు.

తెలుగు చోళులకు నన్నెచోడునికీ వున్న విశేషణాలన్నీ దాదాపుగా ఒకే విధంగా వుంటాయి. నన్నెచోడునికి ఉన్న ప్రత్యేకమైన బిరుదు ‘టెంకణామాత్యుడు’. అంటే తాడిపత్రి ప్రాంతంతో నన్నెచోడునికి వున్న ప్రత్యేక సంబంధాన్ని ఈ విశేషణం తెలియజేస్తోంది. ఈ ప్రాంతానికే చెందినవాడా? అనే అనుమానాన్నీ రేకెత్తిస్తోంది. ముందు చెప్పుకున్న వెంకయ్యచోడునికి నన్నెచోడుడు బంధువా? లేక ఆ వంశంలోని వాడా? అనే సందేహాలు కలుగుతున్నాయి. టెంకణచక్రవర్తినని, టెంకణాదిత్యుడనని చెప్పుకున్న ఓపిళి సిద్ధన దేవచోడుడు నన్నెచోడునికి సమకాలికుడు అయ్యే అవకాశం లేదు. కానీ క్రీ.శ. 10 శతాబ్దంలోని వెంకయ్యచోడుని గురించి పరిచయం చేసిన ‘దొంగలసాని’ శాసనం కడపజిల్లా సిద్ధవటం ప్రాంతంలోనిది. టెంకణం, దొంగలసాని గ్రామాలు రేనాడు ప్రాంతంలోనివే కావడం ఇక్కడ గమనార్హం. వెంకయ్య, నన్నెచోడులకు మూలాలు సిద్ధవటం సమీపంలో వున్న పొత్తపి చోళులలో ఉండే అవకాశం ఉంది. అత్యంత ప్రాచీన తెలుగు చోళులలో పొత్తపి చోళులు ఒకరు. నన్నెచోడుడు తన తండ్రిని

“పాకనాడిరువది యొక్క వేయిటి కధీశుడు నాజనుచోడబల్లి...” (కుమార 1-53)

అని చెప్పుకున్నాడు. సిద్ధవటం, పొత్తపి, గ్రామాలు పాకనాటిలోని భాగాలే. దీనికి సమాంతరంగానే సిద్ధవటం, పొత్తపి, టెంకణం ప్రాంతాలు రేనాడులో కూడా భాగంగా ఉన్నట్లు అసంఖ్యమైన కైఫీయత్తులు, శాసనాలు తెలియజేస్తున్నాయి. టెంకణాదిత్యులమని ప్రకటించుకున్న త్రిభువన మల్లచోళుడు, ఓపిలి సిద్ధన దేవచోళులిద్దరూ వెంకయ్యచోడ నన్నెచోడుల తర్వాత కాలానికి చెందినవారు. నన్నెచోడుని కాలనిర్ణయం మీద జరిగినంత చర్చ స్థల నిర్ణయం మీద జరగలేదు. నన్నెచోడుని గురించి శోధించిన పరిశోధకులందరు గమనించని విషయం ఇదే. 

తన కుమారసంభవము ప్రథమాశ్వాసం 53వ పద్యంలో తన తండ్రి చోడబల్లిని-

పాకనాడిరువది యొక్క వేయిటికధీశుడు...” (పాకనాడులో ఉన్న ఇరవైయొక్క వేల గ్రామాలకు అధీశుడు) అని

ప్రకటించిన వెంటనే తనగురించి 54వ పద్యంలోనే “టెంకణాదిత్యుడనని” ప్రకటించుకున్నాడు. అంటే తన తండ్రిమాత్రమే పాకనాటికి అధీశుడు తను కాదు. తను టెంకణం ప్రాంతానికి మాత్రమే పాలకుడు. ఖచ్చితంగా అతని తండ్రి చోడబల్లి మనకు తెలియని ఏదో యుద్ధంలో ఓడిపోయి పాకనాటిని కోల్పోయాడు. లేదా నన్నెచోడుడయినా కోల్పోయివుండవచ్చు. అక్కడి నుండి నన్నెచోడుడు టెంకణం (తాడిపత్రి) ప్రాంతానికి వచ్చి స్థిరపడి ఈ ప్రాంతానికి పాలకుడయ్యాడు. చరిత్రలో ఇది అసాధారణ విషయమేమి కాదు. క్రీ.శ.1323లో కాకతీయులు ఢిల్లీ తుగ్లక్ ల చేతిలో ఓడిపోవడంతోనే వారు అంతరించినట్లుగా చాలామంది భావిస్తుంటారు. కానీ ఓడిపోయిన ప్రతాపరుద్రుని సోదరుని కుమారుడు అన్నమదేవుడు నేటి ఛత్తీస్ ఘడ్ అడవుల్లోకి వెళ్ళి బస్తర్ లో తిరిగి విశాలమైన కాకతీయ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అతని వారసులు అక్కడు 600 సం॥రాల పాటు పాలించారు. అలాగే తల్లికోట యుద్ధంలో ఓడిపోయి విజయనగర ఆరవేటి వంశస్తులు హంపిని కోల్పోయిన తరువాత పెనుకొండ, చంద్రగిరిల నుండి మిగిలిన విజయనగర సామ్రాజ్య ప్రాంతాన్ని పాలించారు. ఇదేవిధంగానే నన్నెచోడుడు పాకనాడు నుండి వచ్చి తాడిపత్రి ప్రాంతం(టెంకణం)లో స్థిరపడి టెంకణాదిత్యుడనని ప్రకటించుకున్నాడు. నన్నెచోడుని గురించి పరిశోధకులు వ్యాఖ్యానించిన శాసనాలు నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనివి (పాకనాడు లోనివి). బహుశా కోల్పోయిన ప్రాంతాలను నన్నెచోడుడు తిరిగి సాధించి వుండవచ్చు, లేదంటే పాకనాటికి దూరం కావడానికి ముందు వేయించిన శాసనాలైనా కావచ్చు (అవి నన్నెచోడునికి చెందినవైతే) ఏది ఏమైనా కుమారసంభవాన్ని రచిస్తున్న సమయంలో నన్నెచోడుడు ‘టెంకణం’లో నివసిస్తున్నది వాస్తవం.

4. ముగింపు:

నన్నెచోడుని దీక్షాగురువైన జంగమ మల్లికార్జుని సమాధి శ్రీశైలంలో ఉంది. మనం దర్శించవచ్చు కూడా. ఆ రోజుల్లో తాడిపత్రి ప్రాంతం వీరశైవులకు ప్రధాన ప్రాంతంగా ఉన్నట్లుంది. నన్నెచోడునికి తర్వాత 4,5 శతాబ్దాల తర్వాత కూడా శైవ ప్రముఖులు ఈ ప్రాంతంలో కనిపిస్తారు. శ్రీనాథుడు తన చివరి రోజుల్లో శ్రీశైలం వెళ్ళి పండితారాధ్య శాంత భిక్ష మఠాధిపతికి శివరాత్రి మాహాత్మ్యాన్ని సమర్పించాడు. ఈ శాంతభిక్ష మఠానికి అప్పటి ఉత్తరాధికారియైన ముమ్మడి శాంతయ్య తాడిపత్రి ప్రాంతం వాడే. ఇతనికి చెందిన ఒక అసంపూర్ణ శాసనం పోరుమామిళ్ళ ప్రాంతంలో కూడా ఉంది. నన్నెచోడుని కవిత్వంలో కన్నడ తమిళ పదాలు విశేషంగా కనిపిస్తాయని పరిశోధకులు ఇప్పటికే వివరించివున్నారు. తాడిపత్రి ప్రాంతం కన్నడ తమిళ భాషలతో తీవ్రంగా ప్రభావితమైందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

చివరగా ఒక్కమాట తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భవించిన తరువాత పాల్కురికి సోమనాథున్ని తమ తొలికవిగా ప్రకటించడం జరిగింది. ఈ క్రమంలో రాయలసీమ తొలి తెలుగు కవిగా నన్నెచోడుడు కనిపిస్తున్నాడు.

5. సంకేతి సూచి:

  1. అష్టమహిషీ - అష్టమహిషీ కళ్యాణము, తాళ్ళపాక తిరువేంగళనాథుడు.
  2. కర్ణ – కర్ణపర్వము, తిక్కన.
  3. కుమార - కుమారసంభవము, నన్నెచోడుడు.
  4.  నాచి – నాచికేతోపాఖ్యానము, దగ్గుపల్లి దుగ్గన.
  5. భార - శ్రీమదాంధ్ర మహాభారతము, తిక్కన.
  6. మను – మనుచరిత్రము, అల్లసాని పెద్దన.
  7. మౌస – మౌసలపర్వము, తిక్కన.
  8. వేంకట - వేంకటాచల మాహాత్మ్యము, తరిగొండ వెంగమాంబ.
  9. రామ – రామాభ్యుదయము, అయ్యలరాజు రామభద్రుడు.
  10. శృంగార - శృంగార శాకుంతలము, పిల్లలమర్రి పినవీరభద్రుడు.
  11.  హర – హరవిలాసము, శ్రీనాథుడు.
  12. హరిశ్చ – హరిశ్చంద్రోపాఖ్యానము, గౌరన.
  13. హంస – హంసవింశతి, అయ్యలరాజు నారాయణామాత్యుడు.

6. పాదసూచికలు:

  1. కుమార సంభవము - 55, పొట్టిశ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం, హైదరాబాద్ 2006.
  2. ప్రాచీనాంధ్ర చారిత్రక భూగోళము - 153, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి 1963.
  3. Inscriptions of Andhra Pradesh - Cuddapah District - Vol.1-140-142, The Govt. of Andhra Pradesh, Hyderabad, 1977.
  4.  శాసనపద్యమంజరి 17, జయంతి రామయ్య పంతులు, 1930.
  5. South India Inscriptions Vol. VI -605-648. Archeological Survey of India, Mysore 1986.
  6. South India Inscription Vol. IV, 179, Kannada Inscription, Archeological Survey of India, Mysore 1945.
  7. కడప ఊర్ల పేర్లు - 306, నవ్యపరిశోధక ప్రచురణలు, తిరుపతి 1976.

7. ఉపయుక్తగ్రంథసూచి:

  1. ఆరుద్ర. సమగ్ర ఆంధ్ర సాహిత్యం, తెలుగు అకాడమి, 2012.
  2. జితేంద్ర బాబు, కుర్రా. మానవల్లికవి - రచనలు, DACRI, సెప్టెంబర్ 2015.
  3. నాగయ్య, జి. తెలుగు సాహిత్య సమీక్ష, నవ్య పరిశోధక ప్రచురణలు, 1999.
  4. రామచంద్ర, తిరుమల. నుడి - నానుడి, నవచేతన పబ్లిషింగ్ హౌస్, ఫిబ్రవరి 2016.
  5. Krishna Murthy, Bhadriraju. The Dravidian Languages, Cambridge University Press, New York, 2003.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]