AUCHITHYAM | Volume-04 | Issue-08 | July 2023 | ISSN: 2583-4797
5. అర్నాద్ నవలలు: సామాజికదృక్పథం
డా. పప్పల వెంకటరమణ
తెలుగు అధ్యాపకులు,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పురుషులు),
శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9491811710. Email: ramanapappala1@gmail.com
Download PDF
వ్యాససంగ్రహం:
అర్నాద్ ప్రముఖ నవలా రచయిత. ఉత్తరాంధ్ర మాండలికంలో నవలలు వ్రాసి సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలు, స్త్రీలు పడుతున్న బాధలు, పరిశ్రమల్లో కార్మికులకు జరుగుతున్న అన్యాయాలు, పత్రికా రంగంలో జరుగుతున్న అవినీతి మొదలైన సాంఘిక సమస్యలను తన రచనల ద్వారా వెలుగులోకి తెచ్చారు. అర్నాద్ నవలల్ని వింగడించి వివిధ దృక్పథాలని, ధోరణులను సునిసితంగా పరిశీలించి, సమాజంలో మార్పును కోరడమే ఈ వ్యాసము యొక్క ప్రధాన ఉద్దేశ్యము. రచయిత అర్నాద్ సమాజంలోని సామాజిక సమస్యలను ప్రణాళిక ప్రకారం ప్రాధాన్యతను ఇచ్చి పాఠకులలో చైతన్యం కలిగించెను. గతాన్ని వర్తమానాన్ని విశ్లేషించి, సమన్వయించి పరమార్ధాన్ని పట్టి ఇచ్చేది పరిశోధన. నిషిత పరిశీలన ద్వారా కొత్త విషయాన్ని చెప్పడం, ఉన్న విషయాన్ని నవ్య దృక్పథంతో పరిశీలించి వివరణ చేయడం, అర్నాద్ నవలల లోని సామాజిక దృక్పథముపై సమగ్ర పరిశోధన చేసి సమాజ సమస్యలకు పరిష్కార మార్గం చూపించుట వ్యాస రచయిత ముఖ్య ఉద్దేశం. అర్నాద్ నవలలు పాఠకులకు ఒక మార్గ నిర్దేశాన్ని చేసి వారు మంచి పాఠకులుగా తీర్చిదిద్దుటకు, వారు చైతన్యవంతులై సామాజిక సమస్యలను పరిష్కరించుటకు దోహదపడుదురు.
Keywords: నవల, సామాజిక స్పృహ, ఆధునిక ప్రక్రియ, కార్మికులు, సాహిత్య పత్రికలు, పాఠకులు, ఆత్మసంతృప్తి, కుటుంబ జీవనం, సత్య, సంపాదకులు.
1. ఉపోద్ఘాతం:
ఆధునిక వచన రచనల్ని అత్యధికంగా ఉపయోగించుకున్న ప్రక్రియ తెలుగు నవల. సుమారు ఒక శతాబ్ది కాలం తెలుగు సాహితీ రంగంలో మహోజ్వలంగా విలసిల్లి బహుళ ప్రజాదరణ పొందిన ఆధునిక సాహితీ ప్రక్రియ నవల. ఆంగ్ల సాహిత్య ప్రభావముతో ఆధునికాంధ్ర సాహిత్య ప్రక్రియల్లో నవల పేర్కొనదగినది. ఈ ప్రక్రియలో విశేష ప్రజాదరణ పొంది నేటికీ తెలుగు సాహిత్యంలో నవల అగ్రస్థానం పొందింది. అటు సాహిత్య దృష్టితో గాని, ఇటు వ్యాపార దృష్టితో గాని నవల కున్న ప్రాముఖ్యత, ప్రాచుర్యము ఇంకా ఏ ఇతర సాహిత్య ప్రక్రియలకు లేవంటే అతిశయోక్తి కాదు.
నవల అన్న పదం ఆంగ్లంలోని 'నావెల్ '¹ అనే పదానికి పర్యాయపదంగా తెలుగులో వాడబడింది. ఈ ప్రక్రియకు మన వారు చేసిన తొలి నామకరణం వచన ప్రబంధం, నవీన ప్రబంధం అన్నారు. కందుకూరి వీరేశలింగం రాసిన రాజశేఖర చరిత్రను విమర్శిస్తూ 1897 సంవత్సరంలో శ్రీ కాశీభట్ల బ్రహ్మయ్య శాస్త్రి మొదటిసారిగా తెలుగులో ఈ ప్రక్రియను నవలా అని పిలిచారు.
నవల అనగా "నవాన్ విశేషాన్ లతి గృహనాతీతి నవలా"² అని నిర్వచించారు.
"యదార్థ జీవితాన్ని యదార్థ దృష్టితో అధ్యయనం చేసి దానిని గద్య రూపంలో వ్యక్తం చేసేదే నవల" అన్నారు రీఛర్థ్ క్రాస్.³
"నవల జీవితానికి ప్రతిబింబం మిగిలిన అన్ని సాహిత్య ప్రక్రియల కన్నా దీని పరిధి విస్తృతమైంది. సాంఘిక జీవితానికి ప్రతిబింబంగా వ్యక్తుల జీవిత గమనాన్ని చిత్రిస్తూ ఆచార వ్యవహారాల్ని వ్యక్తీకరించే గద్య ప్రబంధం నవల" ⁴
"వ్యక్తుల జీవితాన్ని ప్రధానంగా తీసుకొని సామాజిక జీవితాన్ని స్పురింపజేసే సాహిత్య ప్రక్రియ నవల అని అందురు" ⁵
తెలిసినంతవరకు ప్రపంచ సాహిత్యంలో కవితామయంగా నవల రాసిన మొదట రచయిత ప్లే బేర్.⁶
దుంప హరనాధరెడ్డి అర్నాధ్ అనే కలం పేరుతో చీకటోళ్లు, ఈ తరం స్త్రీ, సాంఘికం, సత్య అనే నాలుగు నవలలు రాసి పేరు పొందిరి. ఈ నాలుగు నవలలు ఇతివృత్తంలోనూ, శైలిలోనూ భిన్నమైనవి, విలక్షణమైనవి.
2. చీకటోళ్లు నవల సామాజిక చైతన్యం:
చీకటోళ్లు నవల అర్నాద్ కలం నుండి జాలువారిన మొదటి ఆణిముత్యం. ఈ నవలను తన గురువుగారైన శ్రీ రాచకొండ విశ్వనాథ శాస్త్రి కి భక్తితో అంకితం చేశారు. ఏ దృష్టితో చూసినా ఈ నవల నిస్సందేహంగా పేదల నవలే. ఈ నవలను ఏ.బీ.ఎన్. ఒలుగరన్ సంస్థ వారు 'వాడని మల్లి' సినిమాగా నిర్మించిరి.
చీకటోళ్లు నవల అంతర్జాతీయంగా రష్యన్ ఫిలిం ఫెస్టివల్ కు ఎంపీకై అర్నాద్ కి విశేష ఖ్యాతిని తెచ్చి పెట్టింది.⁷
అర్నాద్ చీకటోళ్లు నవల పేదల నవల. ఇందులో సామాజిక చైతన్యం తేటతెల్లమవుతుంది. నవల ప్రారంభంలోనే దీనజనుల గూర్చి, సమాజంలోని అట్టడుగు వర్గాల గూర్చి పేర్కొన్నారు.
"అడు గూడిపోయిన బతుకు పల్లెములా శూన్యంగా ఉంది ఆకాశం"⁸
అనే వాక్యంతో నవల ప్రారంభమవుతుంది.
"ఈ మాయదారి ప్రపంచంలో యెట్లా బతకాలో తెలియక బితుకు బితుకుమంటున్న దీనుల కళ్ళలా దీనంగా ఉన్నాయి చుక్కలు"⁹ అనే వాక్యంతో ముందుకు నడుస్తుంది.
నవల మొత్తం చరిత్ర హీనుల దీనజన జీవితం, ఆడవాళ్ళ ఎక్స్ప్లైటేషన్ కదా వస్తువు. చీకటోళ్లు నవలలో ఆదెమ్మ ప్రధాన పాత్ర. అప్పన్న క్యాజువల్ లేబర్. అతని ముసలి తల్లి, భార్య, ముగ్గురు కూతుళ్లు తమది కాని మురికివాడ స్థలంలో తమదైన గుడిసె వేసుకుని ఉంటున్నారు. ఆ మురికివాడ స్థలాల యజమాని బం రాజు. ఇతనికి బోలుడు ఇళ్ల స్థలాలు, వడ్డీ వ్యాపారాలు ఉన్నాయి. బైక్ మీద వస్తుంటే యముడు దున్నపోతు మీద వస్తున్నట్లుగా ఉంటుంది. ఇతని చూపులు యమపాశం వంటివి. వయసులో ఉన్న వారిని ఆకర్షించడానికి, వారిని వలలో వేసుకుని తన కోరికలు తీర్చుకోవడానికి ఎన్నెన్నో ప్రలోభాలు పెట్టి కొందరిని దారికి తెచ్చుకుంటాడు. నవల చివరలో ఎర్రమ్మ ఆశతోను, ఆదెమ్మ అవసరంతోను బం రాజు పాశంతో బంధించబడ్డారు. ఇలాంటి బం రాజులు మన సమాజంలో మన ముందు నిత్యం తారసిల్లుతుంటారు.
కథలో వావి వరుసలు పాటించని ముత్యాలుకు కోడలవుతుంది ఆదెమ్మ. అతనిది పోలీస్ ఉద్యోగం. అతని ఇంట్లో అతని సోదరి పాపమ్మ ఉంది. ఈమెను కట్టుకున్న మొగుడు, ఉంచుకున్న మొగుడు కూడా పోయారు. ఈమె దాటికి ముత్యాలు భార్య కిరోసిన్ పోసుకుని చచ్చింది. పాపమ్మ చాలా దుర్మార్గురాలు. చిన్న కిరాణ దుకాణం ఉంది. ముత్యాలు ఇంటి పెత్తనం కూడా ఈమె చేసేది. ఆదెమ్మను నిత్యం వేధించుకు తినేది. ఆదెమ్మకు అత్తవారింట్లో అసలు మొగుడు తప్ప చాలామంది మొగుళ్ళు తయారయ్యారు. ఆదెమ్మ మొగుడు ఆర్మీలో ఉండటంతో మొగుడి మేనత్త, ఆమె కూతురు చేసే దాష్టికం, మామ ముత్యాలు వెంట పడడంతో ఆమె పుట్టింటికి చేరుకుంటుంది. నేటి మన సమాజంలో కూడా కోడళ్ళ వెనకబడి కోరిక తీర్చమనే ముత్యాల వంటి మామలు ఎందరో ఉన్నారు. భర్తలకు ఉద్యోగరీత్యా దూరమై సమాజంలో ఎందరో స్త్రీలు లైంగిక వేధింపులకు గురి అయ్యే సంఘటనలు నిత్యము జరుగుతున్నవి. అర్నాద్ ఇలాంటి విషయాల్ని వెలుగులోకి తెచ్చి సామాజిక చైతన్యం కలిగించారు.
నేటి మన భారతదేశంలో ఎందరో అభాగ్యులు కడుపునిండా తిండికి నోచుకోవడం లేదు. అర్నాద్ చీకటోళ్లు నవల్లో ఆదెమ్మ తిండి కోసం నానా తిప్పలు పడేది. ఆదెమ్మ అత్త తిండి పెట్టేది కాదు. ఎన్ని పనులు చేయడానికి అయినా, ఎన్ని కష్టాలు అనుభవించడానికి అయినా ఆదెమ్మ సిద్ధమే. కానీ కడుపునిండా తిండి ఉంటే చాలు అనేది. ఆదెమ్మ తిండి లేకపోతే 'అందరము చద్దాం' అనే తల్లితో విభేదిస్తుంది. నా చెల్లెళ్లను నేను చంపలేను అంటుంది. ఆదెమ్మ 'మానం నిప్పె అయిన అది పొయ్యి రాజేయడానికి పనికిరాని నిప్పు' కనుక నిష్ప్రయోజనం అంటుంది. బతుకు లేకపోయాక మంచి పేరు ఎందుకు అన్న స్పృహ ఆదిమ్మకుంది.
"తిండి పెట్టలేని గొప్పలు ఎందుకు? నిప్పులాంటి నీతులు ఎందుకు? ఈ చీకటి బతుకుల్లో వెలుగు సిందెది ఎలాగో ఆలోచించండి"¹⁰
అంటూ ఆదెమ్మ ద్వారా అనిపించిన అర్నాద్ తన అభ్యుదయ భావాన్ని బలంగా వ్యక్తీకరించి మన చేత ఆలోచింపజేస్తారు.
అప్పన్న సమ్మెలో చచ్చిపోతాడు. సమ్మెలు ఎందుకు జరుగుతాయో చెప్పటంలో కాళీపట్నం రామారావు కథ శాంతిని గుర్తుకు తెస్తారు అర్నాద్ . ముత్యాలు పోలీస్ వ్యవస్థకి, అతని రెండో కొడుకు లింపియన్ శ్రామికుడికి నిదర్శనాలు. నేటి పోలీస్ వ్యవస్థలో ఎందరో ముత్యాలు వంటి వారు గలరు. అవినీతిలోనే గాక, శారీరక సుఖం కోసం పరాయి స్త్రీల వెంట పరుగులు పెట్టే పోలీసుల గూర్చి అర్నాద్ వివరించారు. సమాజంలో చీడపురుగు లాంటివాడు ముత్యాలు. భార్య చనిపోతే కూతురుతో సమానమైన కోడలు వెనక కోరికలు తీర్చమని వెంటపడేవాడు.
అర్నాద్ ఏ విషయం గురించి అయినా క్షుణ్ణంగా ఆలోచిస్తారు. ఉదాహరణకి ఎర్రమ్మ నిప్పులాంటి అప్పన్న కూతురు. ఆమె తన ఇంటికి కంపెనీ బాడీ లాంటి తక్కువ ఖరీదు వస్తువును తీసుకువెళ్తేనే అది ఎట్లా సంపాదించగలిగిందో వివరించాల్సిన పరిస్థితి. ఇంట్లో అటువంటిది ఉంచుకున్న వాడు అచ్చంగా నగలు ఇస్తే ఎక్కడ దాచుకుంటుంది. తన వాళ్ళ నుంచి దూరంగా ఉండగలిగే ధైర్యం ఆ పదహారు ఏళ్ల పడుచుకు లేదు. కానీ ఆ వయస్సు కోర్కెలను కలిగించగలదు. ఆ కలలు కాసేపు నిజం చేసుకోవడానికి
"నువ్వు నీవు అడిగినవన్నీ అద్దెకిస్తావ్, దానికి బదులుగా నేను నా ఒళ్ళు అద్దెకిస్తా" ¹¹
అని ఏమాత్రం ప్రౌఢత్వం లేకుండా అతి చౌకగా ఒళ్ళు అద్దెకిచ్చేసి దాని ఫలితాన్ని ఎదుర్కోలేక ఆత్మహత్య చేసుకుంది. అర్నాద్ చీకట్లో నవల లోని ఎర్రమ్మ వంటి వారు మన సమాజంలో ఎందరో కలరు. వయసు కోరికలను అనచుకోలేక పరిస్థితులు అనుకూలించక 'కాల్ గర్ల్స్' గా అవతారం ఎత్తి ఎందరో వరహాల రాజు వంటి వారి పడకగదిలో నలిగిపోయి జీవితాల్ని పాడు చేసుకుంటున్నారు. అర్నాద్ ఈ నవల అంతా సామాజిక చైతన్యంతో, వామపక్ష భావాలతో, స్త్రీవాదంతో నిండి ఉంటుంది. విమర్శకులు ఏ కోణంలో చూసినా ఆ కోణంలోని వారికి ఈ నవల సమాధానమిస్తుంది.
సమాజంలో వ్యక్తుల విచ్చలవిడి శృంగారం వల్ల లైంగిక వ్యాధులు వచ్చి శరీరం రోగాల బారిన పడుతుంది. సిప్లిస్, గనేరియా, ఎయిడ్స్ వంటి వ్యాధుల బారిన పడి ఎందరో బలైపోతున్నారు. చీకటోళ్లు నవల్లో మంగ మొగుడు సింహాద్రి ఇలాంటి జబ్బుతో ఎన్నాళ్లో బాధపడ్డాడు. ఈ జబ్బు అంటుకొని నానా యాతనలు పడి చివరకు తగ్గించుకుంటుంది. ఇలాంటి వ్యాధిగ్రస్తులను చూసి సమాజం అసహ్యించుకుంటుంది. అర్నాద్ ఇలాంటి విషయాలు తెలియజేసి సమాజంలో చైతన్యాన్ని కలిగించారు. మంగకు వచ్చిన ఈ జబ్బు వల్ల చెల్లెలు ఆదెమ్మ ఎంతో బాధపడి సపర్యలు చేసింది. ఏ పాపం ఎరుగని అక్కకు మాయదారి జబ్బు తన బావ వల్ల వచ్చిందని కృంగిపోయింది. అక్కకు సపర్యలు చేసి అక్కాచెల్లెళ్ల అనుబంధానికి ఆదెమ్మ విలువ పెంచింది.
ఆదెమ్మ భర్త మిలటరీ ఉద్యోగి. ఎక్కడో దూరాన జమ్మూ కాశ్మీర్లో విధులు నిర్వర్తిస్తుంటాడు. ఆదెమ్మను తన తల్లిదండ్రుల దగ్గర విడిచిపెట్టి వెళ్లిపోయాడు. ఆమెపై మామతో సహా ఎందరో కన్నేశారు, కానీ ఎవరికీ తలవంచలేదు. నేటి సమాజంలో కూడా మిలటరీలో దూరంగా పనిచేసే వారి భార్యలకు ఇలాంటి వేధింపులు నిత్యం ఎదురవుతుంటాయి. అర్నాద్ ఇలాంటి విషయాలు తెలియజేసి వారి పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు వర్ణించారు. ఆదెమ్మ భర్త ఆశిరయ్య మందుకు అలవాటు పడ్డాడు. భార్యను సరిగా చూసేవాడు కాదు. ఆరు మాసాలకు ఒకసారి ఇంటికి వచ్చినా జీతము డబ్బులు తండ్రికి తప్ప భార్యకు ఇచ్చేవాడు కాదు. ఆదెమ్మ భర్త పెట్టిన భాదలకు విసిగిపోయి అతను కట్టిన తాళిని తెంపి విసిరేసింది. భర్తతో పూర్తిగా తెగ తెంపులు చేసుకుంటుంది. తర్వాత అసిరయ్య మేనత్త కూతురు గౌరమ్మనే మనువాడాడు. నేటి సమాజంలో కూడా ఇలాంటి సంఘటనలు అరుదుగా కనిపిస్తాయి. భార్యకు విడాకులు ఇచ్చినట్లు చేసి కూతుర్నిచ్చి మనువాడినట్లు చేసిన పాపమ్మలాంటివారు కుప్పలు తేప్పలుగా కనిపిస్తారు. ఇలాంటి సంఘటనలు నేటి సమాజంలో ఏ విధంగా జరుగుతున్నాయో అర్నాద్ కళ్ళకు కట్టినట్టు వివరించారు.
స్త్రీలు చుట్ట కాల్చడం ఉత్తరాంధ్రలో సహజం. అర్నాద్ చీకటోళ్లు నవల లోని కొన్ని స్త్రీ పాత్రలు పొగతాగే అలవాటున్న పాత్రలు. ఉత్తరాంధ్ర సంస్కృతి సంప్రదాయాల్లో స్త్రీ పొగ త్రాగడం ఒక భాగం. నేడు కొంతవరకు తగ్గనా ఈ వ్యసనా బారిన పడిన ఎందరో స్త్రీలు రోగాల బారిన పడుతున్నారు. ఈ నవల్లో పాపమ్మ చుట్ట కాల్చే అలవాటున్న పాత్ర. తన కూతురు గౌరమ్మకు కూడా చుట్ట కాల్చడం నేర్పేసింది. తల్లి కూతుర్లు ఇద్దరు మంచోళ్ళు కాదు. ఇలాంటి వారి వలన సమాజం చెడిపోతుందని, జాగ్రత్తగా ఉండమని అర్నాద్ పరోక్షంగా తెలియజేశారు.
కుటుంబ పరిస్థితులు ఎంతటి వారి చేత అయినా ఎలాంటి పనులు అయినా చేయిస్తుందని అర్నాద్ చీకటోళ్లు నవల తెలియచేస్తుంది. ఈ నవల్లో రచయిత సామాజిక చైతన్యాన్ని కలిగించడంలో సఫలీకృతులయ్యారు.
3. ఈ తరం స్త్రీ నవల సామాజిక చైతన్యం:
ఈ తరం స్త్రీ అర్నాద్ రెండో అత్యుత్తమమైన నవల. ఈ నవలలో ఆయన తన గొంతులోని గోడు వినిపించారు. ఈ నవల ఆయన రాసేనాటికి ఉద్యోగస్తురాలైన స్త్రీల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆప్పటికే ఉద్యోగినుల ఇబ్బందులు గూర్చి కథలోస్తున్నాయి. పనిమనిషి ఆలస్యంగా రావడం, బస్సులో చోటు దొరకకపోవడం, మేనేజర్ ఆమెని తిట్టడం లాంటి ఇతివృత్తంతో ఆ రోజుల్లో పనిమనిషి కూడా ఉద్యోగస్తురాలే అన్న స్పృహ రచయితలు చూపించేవారు కాదు. కానీ అర్నాద్ అలాంటివి ఈ నవలలో చూపించి పనిమనిషికి సముచిత స్థానాన్ని కల్పించారు.
అర్ణాధ్ సామాజిక చైతన్యం ఈ నవలలో పుష్కలంగా కనిపిస్తుంది. ఆధునిక యుగంలో చదువుకున్న స్త్రీల మనస్తత్వాన్ని వాస్తవానికి దగ్గరగా తెలియజేసి విజయం పొందారు. ఈ నవలను తన రచనగా కాకుండా స్త్రీ రచయిత్రి పేరుతో నవల రాశారు.
"ఉద్యోగినులకు సంసార సుఖం తక్కువ అవటాన్ని"⁶ కథగా తీసుకొని నవల రాసి ప్రసిద్ధి చెందారు.
స్త్రీలు ఉద్యోగులు అయితే వివాహ వ్యవస్థ విచ్ఛిన్నమవుతుందని అర్నాద్ తన అభిప్రాయాన్ని తెలియపరిచిరి. నేడు మన భారతీయ సమాజంలో ఉద్యోగం చేసే స్త్రీల బాధలు వర్ణనాతీతం. ఆర్థికంగా బాగా ఉన్నప్పటికీ మానసికంగా ఎంతో కృంగిపోయే అభాగ్యులు కోకొల్లలు. పిల్లల పెంపకం విషయంలో శ్రద్ధ వహించలేకపోవడం, సమాజం నానా రకాల సూటి పోటీ మాటలు, లైంగిక వేధింపులు, భర్తలు అనుమానపు జాడ్యాలు మనం నిత్యం చూస్తున్నవే. అర్నాద్ ఈ విషయాలు ఆన్నింటిని ఈ తరం స్త్రీ నవల్లో కూలంకషంగా వివరించి సమాజంలో పరివర్తన తీసుకొచ్చారు.
నేడు స్త్రీలపై కుటుంబ హింసకు తోడు సామాజిక హింస కూడా పెరిగింది. నేటి పెట్టుబడిదారీ వ్యవస్థలో లాభార్జన ధ్యేయంగా కుటుంబ సామాజిక హింస ఎలా ఉంటుందో ఈ నవల్లో ఆర్నాధ్ తెలిపారు. ఈనాడు నగరీకరణ అభివృద్ధి వల్ల మధ్యతరగతి స్త్రీ ఏదో ఒక ఉద్యోగం చేయాల్సిన పరిస్థితిలు దాపురించాయి. కుటుంబ ఖర్చులు పెరిగి జీవన యానం చేయడానికి స్త్రీలు చదువుకుని ఉద్యోగాలు చేయాల్సి వస్తుంది. కొన్ని కఠినమైన ఉద్యోగాలు కూడా స్త్రీలు చేయాల్సి వస్తుంది. నేడు సైన్యంలో కూడా స్త్రీలు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సున్నిత మనస్తత్వం గల స్త్రీలు నలిగిపోతున్నారు.
కొందరు భార్యాభర్తలు ఉద్యోగాలు చేసి ఆర్థికంగా బాగా సంపాదిస్తున్నప్పటికీ వారిలో ఇంకా ఆశలు తగ్గలేదు. మరోవైపు వ్యాపారాలు, చీటీలు వేసి ఇంకా ఎక్కువ సంపాదించాలని తాపత్రయపడేవారు నేడు అధికమైపోయారు. ఆర్ణాధ్ ఇలాంటి విషయాలు వెలికి తీసి వారి ఆరాటాలని వివరించి, వారు సామాజికంగా ఎంత నీచ స్థాయికి దిగజారిపోతుంది తెలియజేశారు. కొందరు పురుషులు సంపాదన ఆరాటంలో పడి ఏ రాత్రికో ఇంటికి చేరి ఆరోగ్యాన్ని పాడు చేసుకుని, భార్య కోరికలను తీర్చలేక మానసిక వేదన అనుభవించి అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారు నేటి మన సమాజంలో ఎందరో కనిపిస్తున్నారు. అలాంటివారికి అర్నాద్ ఈ నవల ఒక గుణపాఠం. సంపాదన కోసం ఆరాటం పడేవారు తప్పక చదివి తీరాల్సిన నవల ఈ తరం స్త్రీ.
అక్రమ సంబంధాలు మనుషుల్ని ఎంతగా దిగజారుస్తాయో ఈ నవల్లో స్పష్టంగా చెప్పారు. ఈ తరం స్త్రీ నవల్లో ఛాయ అందగత్తె. తన అంద చందాలని చూపించి ఇతరులని ఆకర్షించేది. సంపాదన మీద ఆశతో సెక్స్ ను ఎరగా చూపి పురుషులని లోబరుచుకునేది. భర్తలకు ఈ విషయం తెలిసినప్పటికీ పెద్ద కుటుంబాల్లో ఇలాంటివి సాధారణమేనని సర్దుకుపోయేవారు. నేటి సమాజంలో ఇలాంటి సన్నివేశాలు మనకు నిత్యం దర్శనం ఇస్తుంటాయి. సమాజం ఎంతగా దిగజారి పోతుందో తెలుసుకోవడానికి నిదర్శనం వేరే అక్కర్లేదు. అర్నాద్ ఇలాంటి విషయాలు చెప్పి సామాజిక చైతన్యాన్ని కలిగించారు.
రియల్ ఎస్టేట్ వ్యాపారం మూడు పూలు ఆరు కాయలుగా వర్ధిల్లుతున్న నేటి కాలంలో విజయ భర్త చలం ఈ రంగంలో వ్యాపారం చేసి కోట్లకు పడగలెత్తాడు. హైమా వంటి అందగత్తెలకు లొంగి పోతాడు. తాగుడుకు బానిసై వ్యాపారంలో గొడవలు తెచ్చుకుంటాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో గొడవలు పెరిగి ప్రత్యర్థులు చేతిలో దాడికి గురై ప్రాణాలను పోగొట్టుకుంటాడు. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు చలం జీవితం ముగిస్తుంది. నేడు రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇలాంటి సంఘటనలు సర్వసాధారణమైపోయాయి. అర్ణాద్ ఇలాంటి సన్నివేశాన్ని తెలియజేసి సామాజిక చైతన్యం కలిగించడానికి కృషి చేశారు. ఆయా రంగాల్లో వ్యాపారులు జాగ్రత్తలు వహించేటట్లు మేల్కొలిపారు.
ఆడదాన్ని అనుమానించడం మధ్యతరగతి మగాడిని పీడిస్తున్న మాయ రోగం. భార్య భర్తలు దూర దూరంగా ఉద్యోగాలు చేస్తున్నప్పుడు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఈతరం స్త్రీ నవల్లో రవి, సుజాతలే ఇందుకు నిదర్శనం. డబ్బు కోసం ఆడదానితో ఉద్యోగం చేయించి చివరకు ఆమెను అనుమానించడం ఒక రోగం వంటిది. రవి తన పని పిల్లతో అక్రమ సంబంధం ఏర్పరచుకుని తన కోరికలను తీర్చుకునేవాడు. అలాగే తన భార్య కూడా చేస్తుందని అనుమానం కలిగి మానసిక వేదనకు గురి అయ్యేవాడు. ఇలాంటి సంఘటనలను అర్నాద్ చిత్రించి సమాజం పట్ల తమ అవగాహన నిరూపించారు.
ఏ వయసులో ముచ్చట్లు ఆ వయసులో తీరాలి అన్నట్లు పెళ్లీడు వచ్చినప్పుడు పెళ్లిళ్లు చేసి తల్లిదండ్రులు తమ బాధ్యతను నిర్వర్తించాలి. లేకపోతే ఈ తరం స్త్రీలో ఛాయ ఎదుర్కొన్న పరిస్థితులే దాపురిస్తాయి. మూడు పదుల వయసు పైబడనా పెళ్లి కాలేదు. అలాంటి వారి మానసిక ప్రవృత్తి విచిత్రంగా ఉంటుంది. వావి వరుసలు లేకుండా పశువు వలె ప్రవర్తిస్తారు. తమ శారీరక కోరికలు తీరక ఫిట్స్ లాంటి జబ్బులు శరీరాన్ని ఆవరిస్తాయి. నవ్విపోతురు గాక నాకేటి సిగ్గు అన్నట్లుగా కొందరు సమాజం తమనే ఎన్ని విధాల అసహ్యించుకున్న వారి ప్రవృత్తిలో మార్పు రాదు. ఛాయ తనకు సపరియలు చేసిన రాంబాబు ముగ్గురు పిల్లల తండ్రి అయినప్పటికీ అతన్నే కోరుకునేది. అది ఒక మానసిక జాడ్యం. ఎందరు ఎన్ని విధాలుగా అనుకున్న అలాంటివారు పట్టించుకోరు. నేటి మన సాంఘిక వ్యవస్థలో రాంబాబు, చాయ వంటి మనస్తత్వం గలవారు ఎందరో తారసిల్లుతుంటారు. అలాంటి వారిని మార్చడం ఆ బ్రహ్మకు కూడా సాధ్యం కాదు.
సంపాదన పరురాలైన స్త్రీ ఇంట్లో ఉంటే కుటుంబమంతా ఆమెపై ఆధారపడినట్లయితే ఆమె చేసే చాటుపనులను చూసి చూడనట్లు ఊరుకుంటారు. ఏమి చేయలేని నిస్సహాయ స్థితి వారిది. నలుగురు నాలుగు రకాలుగా అనుకున్నప్పటికీ ఏమీ తెలియనట్లు నటిస్తారు. అర్నాద్ ఈతరం స్త్రీ నవల్లో ఛాయ తన స్నేహితుడైన రాంబాబుతో పెళ్లికాకముందు విచ్చలవిడిగా తిరిగినప్పటికీ ఛాయ కుటుంబీకులు నిస్సహాయులుగా ఏమీ చేయలేక మిన్నకుంటారు. కారణం కుటుంబమంతా ఛాయ సంపాదనపై ఆధారపడటమే. నేటి మన సమాజంలో ఎందరో ఛాయ కుటుంబీకులాగే ఏమీ చేయలేక నిస్సహాయులుగా చూస్తూ ఉంటారని అర్నాద్ ఈ నవల్లో సమాజాన్నంతా పాఠకుల ముందుంచి వారిలో చైతన్యం కలిగించారు.
పురుషులు ఇంట్లో విషయాల కంటే బయటి విషయాలకే ప్రాధాన్యతని ఇస్తారు. విజయ భర్త చలమే ఇందుకు తార్కాణం. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉన్నప్పటికీ చలం పరాయి స్త్రీలపై వ్యామోహం పెంచుకుంటాడు. ' పొరుగింటి పుల్లకూర రుచి' అన్న సామెతను చలం ఈ నవలలో రుజువు చేస్తాడు. భార్య యోగ్యురాలు, అందచందాలు, గుణవంతురాలు అయినప్పటికీ హైమ మాయలో పడి సప్త వ్యసనాలు నేర్చి తన జీవితాన్ని అంతం చేసుకుంటాడు. ఎందరో చలం వంటి వారు స్త్రీ వ్యామోహంలో పడి కుటుంబాలకు దూరమై తమ పేరు ప్రతిష్టల్ని, ఆరోగ్యాన్ని పాడు చేసుకుని చివరకు పిచ్చివాళ్లుగా మారేవారు మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు. ఈ విషయాలన్నీ అర్నాద్ తన నవలలో పేర్కొని సామాజిక చైతన్యానికి కృషి చేశారు.
విజయను పెళ్లి చేసుకున్న తర్వాత చలం దశ తిరిగింది. సామాన్యమైన జీవితం గడిపే చలం కోటీశ్వరుడు అవుతాడు. తాను పట్టిన దంతా బంగారంగా మారిపోతుంది. కానీ దానిని నిలుపుకునే ప్రయత్నం చేయలేదు. ఇలాంటి సంఘటనలు మన సమాజంలో ఎన్నో జరుగుతుంటాయి. అదృష్ట దేవత అందరి ఇళ్ల తలుపులు తడుతుంది. దాన్ని వినియోగించుకున్న వారే ముందుకెళ్లగలుగుతారు. లేనివారు కష్టాలను అనుభవిస్తూనే ఉంటారు.
కొందరు స్త్రీలు సంపాదన కోసం కాకుండా కాలక్షేపం కోసం, సమాజంలో స్థాయి, అంతస్తులు పెంచుకోవడం కోసం ఉద్యోగాలు చేస్తారు. వారికి ఉద్యోగం చేసి సంపాదించాలన్న తపన ఉండదు. ఇందుకు నిదర్శనమే ఈ తరం స్త్రీ నవలలో విజయ. ఎందరో స్త్రీలు నేడు ఉద్యోగం అవసరం లేనప్పటికీ విజయాలా ఆత్మానందం కోసం ఉద్యోగాలు చేసే వాళ్ళు చాలామంది మనకు కనిపిస్తారు.
కుటుంబమంతా చక్కగా సంతృప్తిగా ఒకే దగ్గర హాయిగా కాలం గడపాలని చూస్తుంటారు. పురుషులు ఎన్ని పనులు చూసినప్పటికీ, ఎంత ఒత్తిడికి లోనైనప్పటికీ భర్త తన దగ్గరే ఉండాలని కోరుకుంటుంది. ఈ నవలలో సుజాత తన భర్త తప్పుడు నిర్ణయాల వల్ల తను పాడు పనులు చేయాల్సిన దుస్థితి దాపురించిందని బాధపడుతుంది. సుజాత జీతాన్ని ఆశించి రవి సుజాతచే ఉద్యోగానికి రాజీనామా చేయించలేదు. తనకు బదిలీ కూడా జరగలేదు. భార్యాభర్తలు ఇరువురు సంసార సుఖానికి దూరమై పరాయి వాళ్ల చే ఆ సుఖాన్ని పొందవలసి వచ్చింది. పరిస్థితుల ప్రభావానికి ఎవరైనా లోబడక తప్పదన్న నగ్నసత్యం వీరి వల్ల తెలుస్తుంది.
4. సాంఘికం నవల సామాజిక చైతన్యం:
అర్నాద్ కలం నుండి జాలువారిన మూడో నవల సాంఘికం. ఈ నవలలో పత్రికా సామ్రాజ్యంలోని ఆదిపత్యం గూర్చి, వాటి ఎగుడు దిగుడుల గూర్చి, అర్నాద్ వివరంగా తెలియజేశారు. పతనమవుతున్న పత్రికల నైతిక విలువలు గూర్చి ఇందులో వివరించారు. నేడు సమాజంలో ఎన్నో పత్రికలు ఆవిష్కరించబడి మొగ్గ దశలోనే నేలరాలుతున్నాయి. కొన్ని చిరకాలము ప్రేక్షకుల మన్ననలను పొందినవి కొన్ని, సాహితీ విలువలు పాటించినవి కొన్ని ఉంటాయి. సాంఘికం నవలలో సాహితీ విలువలకు, మానవ సంబంధాలకు మిక్కిలి ప్రాధాన్యత ఇచ్చారు. స్వాతంత్ర సమరవీరుల సంతతికి చెందిన వారి ఆశయాలు అలాంటివి. ఎన్నో ఏళ్ల నుండి రవిచంద్ర పత్రికను పెట్టాలని కలలు కంటుండేవాడు. ఆ కల నెరవేరింది. ఇతరులకు సహాయ సహకారాలు అందించే అరుణను వివాహం చేసుకున్నాడు. పత్రికా సంపాదకుడైన కృష్ణారావు కూతురు అరుణ. నేడు అన్ని పత్రికలు రాజకీయ నాయకుల చేత ఆవిష్కరించబడుతుంటే అందుకు భిన్నంగా సుమతీ పత్రికను అర్నాద్ ఆవిష్కరించారు.
నేటి సమాజంలోని పత్రికలు సమాజాభివృద్ధికి కృషి చేయడం లేదు సరి కదా సంఘ పతనానికి దారితీస్తున్నవి. ప్రచురించకూడని కథనాలు, చూపించకూడని చిత్రాలు చూపించి సమాజాన్ని కలుషితం చేసి నేర ప్రవృత్తిని ప్రేరేపిస్తున్నవి. చింతామణి, భారతి, సత్యదూత వంటి పత్రికలు సాహిత్య అభివృద్ధిని కాకుండా మానవ విలువల్ని పెంచి పోషించేవి. నేటి పత్రికలు వ్యాపార ధోరణితో కూడుకుని వర్గ వైషమ్యాలను పెంచి సమాజ విచ్చిన్నతకు కారణభూతాలవుతున్నాయి. సినీ వారపత్రికలు అయితే స్త్రీల అంగాంగ ప్రదర్శనలు ప్రచురించి యువతను పెడ ద్రోవ పట్టిస్తున్నాయి. అర్నాద్ ఈ నవల ద్వారా సామాజిక చైతన్యం పెంపొందించడానికి తనదైన రీతిలో ప్రయత్నించారు.
సుమతి పత్రిక యజమాని రవిచంద్ర మన పత్రికలు ప్రయాణించే విధానాన్ని విమర్శించారు. పత్రికలు యువతరంపై చెడు ప్రభావం చూపకుండా ఉండాలని తన ప్రసంగంలో పేర్కొంటారు. జాతి భవిష్యత్తుకు కారకులైన యువత చెడిపోవడాన్ని చూసి హృదయం రోదిస్తుందని రవిచంద్ర ఆవేదన చెందాడు. సమాజం మేలు కోసం పత్రికలు పాటుపడాలని, యువకులకు మార్గదర్శకత్వం వహించి ముందుకు నడిపే కథనాలు రాయాలని కోరుకున్నాడు. నిరుద్యోగ యువతకు దారి చూపే కథనాలు ప్రచురించాలని సాంఘికం నవల ద్వారా అర్నాద్ తెలియజేశారు.
నేడు పాఠకులు కూడా తమ అభిప్రాయాల్ని మార్చుకొని విలువలు బోధించే రచనల పట్ల ఆసక్తి తగ్గి నేరపూరితమైన, కుట్రపూరితమైన కథనాలపై మోజును పెంచుకుంటున్నారు. ప్రాచీన సంస్కృతి సాంప్రదాయాలను హేళన చేస్తున్న వాటిని పత్రికలు ప్రోత్సహిస్తున్నాయి. మన పూర్వీకుల చరిత్రను, సంస్కృతిని, వేషభాషలను అద్దం పట్టే రచనలను పత్రికలు ప్రోత్సహించాలి. మన తీర్థయాత్రల గూర్చి, వెలుగులోకి రాని ప్రాచీన కట్టడాలను గూర్చి పరిశోధించి వెలికి తీసి పాఠకులకు అందించాలి. ప్రాచీన కవుల రచనలను, వారి కవితా రీతులను, అందులోని విశేషాలను గూర్చి పత్రికల్లో ధారావాహికంగా ప్రచురించి పాఠకులకు ప్రాచీన సాహిత్యం మీద మక్కువ పెంచేటట్లుగా కథనాలు ఉండాలి. అర్నాద్ తన సాంఘికం నవల్లో రవిచంద్ర ప్రసంగం ద్వారా తెలియజేసి సమాజాభివృద్ధికి కృషి చేశారు.
సాంఘికం నవలలో సంపత్ పత్రికాధిపతి. ఇతడు ఎన్నో పత్రికలను స్థాపించి పాఠకుల యొక్క మన్ననలను పొందారు. నేటి పత్రికల్లో ఉండవలసిన విషయాలను గూర్చి, పత్రికాధిపతుల విధులను గూర్చి, పత్రికలలో ప్రచురించే విషయ సేకరణ గూర్చి ఆవిష్కరణ సభలో సంపత్ అమూల్యమైన సూచనలను చేశారు. పత్రికను స్థాపించడమే కాదు సమాజం నుండి వచ్చే ఒత్తిడిలను తట్టుకొని నిలబడి మనుగడ సాగించడం కష్టం. నేటి పత్రికల్లో చాలావరకు 'మఖలో పుట్టి పుబ్బలో' అంతమయ్యేవి ఎక్కువగా వస్తున్నవి. విలువలు పాటించక పోటీ ప్రపంచంలో పోటీని తట్టుకోలేక చాలా పత్రికలు కనుమరుగు అవుతున్నాయి. నేడు అన్ని భాషల్లోనూ దినపత్రికలు, వార, మాసపత్రికలు, సినీ, రాజకీయ పత్రికలు కుప్పలు కుప్పలుగా స్థాపించడం జరుగుతుంది. నేడు మన తెలుగు భాషలో కొన్ని వందల పత్రికల ప్రచురణ జరుగుతుంది. కొన్ని తెలుగు దినపత్రికలు అయితే పార్టీలను అంటిపెట్టుకొని వాటికి కొమ్ముకాస్తూ మిగిలిన రాజకీయ పక్షాలను విమర్శించడమే పనిగా పెట్టుకుంటున్నాయి. ఇలాంటి పత్రికలను, పత్రిక ఆధిపతులను అర్నాద్ తీవ్రంగా విమర్శించి వ్యతిరేకించారు.
సాంఘికం నవల్లో రవిచంద్ర, శ్రీ వాస్తవలు బాల్య స్నేహితులు. అరమరికలు దాపరికం లేనివారు. రవిచంద్రకు అబద్దాలన్నా, దొంగతనాలన్నా భయం. ఈ విషయం తన స్నేహితుడైన శ్రీవాత్సవ ఘనంగా తన స్నేహితుని గూర్చి చెప్పుకునేవాడు. శ్రీవాత్సవను తన కుటుంబ సభ్యునిగా పరిగణించేవాడు. ఈ నవల్లో శ్రీవాత్సవ ఒక గొప్ప నవలా రచయిత. తన మొదట నవల యే మేధావుల మన్ననలను పొందింది. ఒక రచయితను ఎవరెస్టు శిఖరమంతా ఎత్తుకు ఎదిగించాలన్నా, పాతాలానికి తొక్కేయాలన్నా పత్రికాధిపతులకే సాధ్యం. సాంఘికం నవలలో మీనాక్షి అటువంటి పత్రిక సంపాదకురాలే. శ్రీవాత్సవ నవలను తన పత్రికలో ప్రచురించి పాఠకుల్లో ఉత్కంఠను కలిగించారు. ఈ నవల్లో రాధ, శశాంకులు నాయికా నాయకులు. కథను ఎన్నో మలుపులు తిప్పి ఏమవుతుందో అనే ఉత్కంఠ కలిగేటట్లు చేశారు. పత్రిక కాఫీ ఎప్పుడు విడుదల అవుతుందోనని, నవల్లోని రాధ పరిస్థితి ఏమవుతుందోనని ఎదురుచూసి పాఠకుల్లో భయానక, భీభత్స, కరుణ రసాలు ముప్పిరిగుంటాయి. నేటికీ పత్రికల్లో వచ్చే కొన్ని నవలల్లో ఇలాంటి ఉత్కంఠను కలిగిస్తుంటాయి.
కొన్ని పత్రికలు రచయితల పేరు ప్రఖ్యాతులను బట్టి విలువను పెంచుకుంటాయి. పత్రిక సంపాదకుల మనస్తత్వాన్ని బట్టి పత్రికల్లోని వార్తలు ప్రచురితమవుతాయి. నేడు పత్రికలు వ్యాపార రంగంగా మారి పాఠకుల మనోభావాలకు తగిన కథనాల్ని ప్రచురించి, విలువల్ని విడనాడి పాఠకుల సంఖ్యను లక్షలకు పెంచుకుంటున్నాయి. నిస్సిగ్గుగా కథనాల్ని రాసి బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడి ఒక కొత్త విష సంస్కృతిని నేటి పత్రికలు పెంచి పోషిస్తున్నాయి. అర్నాద్ సాంఘికం నవల మొత్తం పత్రికా ప్రపంచానికి చెందినది. ఇందులో నేటి పత్రికాధిపతులకు, పత్రికా సంపాదకులకు చైతన్యం కలిగించే ఎన్నో విషయాలను గూర్చి తెలియజేశారు. పాఠకులు ఆశ్చర్యపోయే వాస్తవాన్ని ఈ నవల ద్వారా తెలియజేసి పాఠకులు మేల్కొన్నట్లు, వాస్తవ విషయాన్ని గ్రహించేటట్లు తెలియజేసి ఒక నూతన వరవడికి అర్నాద్ బాటలు వేశారు. తద్వారా సామాజిక చైతన్యానికి కృషి చేశారు.
5. సత్య నవల - సామాజిక చైతన్యం:
అర్నాద్ సత్య నవల ఓ రెబల్ ఉమెన్ సీరియల్. ఇందులో ప్రధానంగా కథంతా సత్య చుట్టూ తిరుగుతుంది. నవల అధ్యంతము సామాజిక చైతన్యంతో కూడుకున్నటువంటిదే. ఒక సామాన్య స్త్రీ తనకు ఎదురైన గడ్డు పరిస్థితుల్ని అధిగమించి జీవితంలో ఎలా నిలదొక్కుకుంది తెలియజేస్తుంది. సమాజంలోని రాక్షస రాబందులు సృష్టించే అరాచకాలను, అకృత్యాలను, అనైతికాలను ఎదుర్కొని మహిళా లోకాన్ని మేల్కొలిపి చైతన్యం కలిగించిన సత్య గాధను సెన్సేషనల్ రైటర్ అర్నాద్ అద్భుతంగా తీర్చిదిద్దారు.
సమాజానికి పునాది వంటిది వివాహం. సత్యను వివాహం చేసుకున్న కృష్ణారావు పెళ్లయిన నాటినుండి నరకాన్ని చూపిస్తున్నాడు. అతను ఒక కామపిశాచి. భార్యను పుట్టింటికి వెళ్ళనీయకుండా, బంధువులను తన ఇంటికి రానీయకుండా అడ్డుకట్ట వేసిన శాడిస్ట్. భార్యపై అనుమానపు జబ్బు ఎక్కువ. శృంగారంలో కూడా పైశాచిక ఆనందాన్ని అనుభవించేవాడు. ఇలాంటి శాడిస్టులు మనకు సమాజంలో ఎందరో కనిపిస్తారు. ఇలాంటి వారి మానసిక ప్రవృత్తిని తెలియజేసి అర్నాద్ సామాజిక చైతన్యాన్ని కలిగించారు.
కంపెనీలు భద్రతకు ప్రాధాన్యమీయకుండా కార్మికుల జీవితాలతో చెలగాటమాడుతుంటాయి. సత్య నవలలో కృష్ణారావు మందు సీసాతో కంపెనీలోకి ప్రవేశించి, అక్కడ మద్యం సేవించి విధుల నిర్వహించుట, ప్రమాదవశాత్తు కిందపడి మరణించుట, కంపెనీ యొక్క అజాగ్రత్తను గూర్చి తెలియజేస్తున్నాయి. యాజమాన్యానికి వ్యతిరేకంగా కార్మికులు నినాదాలు చేసి కంపెనీ లోపాన్ని తెలియజేసి భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తపడేటట్లు చెప్పిన అర్నాద్ సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని రాసినదే.
నేటి యూనియన్ ఎన్నికల్లో కూడా కులం, జిల్లా, బిర్యాని, మందు లాంటి బలహీనతలకు బలైపోయి, నిలబడే వారందరూ దొంగలు అయినప్పుడు ఎవరికో ఒకరికి ఓటు వేయక తప్పదు. ఇలాంటి అవకాశాల్ని అప్పలరాజు లాంటి నాయకులు సక్రమంగా వినియోగించుకుంటారు. పై అధికారులకు లంచాలు, అవసరాలకు వడ్డీలకు అప్పులిచ్చి, రకరకాల సరఫరాలు చేసి ప్రసన్నం చేసుకోవడంలో అప్పలరాజు దిట్ట. సత్య బంధువులకు ఉద్యోగం ఇప్పించే విషయంలో అప్పలరాజు తరదూర్చి భంగబడెను. ఎంక్వైరీ ఆఫీసర్ నిజాయితీ వల్ల సత్యకు ఉద్యోగం వచ్చింది. ఇలాంటి అధికారులను వెలికి తీసి అర్నాద్ సమాజంలో మార్పు తీసుకురావడానికి కృషి చేశారు. అప్పలరాజు సత్య పై కన్నేసి ఆమెను లోపరుచుకొని శాశ్వతంగా ఆమెను ఉంచుకొని తన కోరికలు తీర్చుకోవాలని ప్రయత్నించి భంగ పడ్డాడు. సత్య చదువుకున్నది ఇంటర్మీడియట్ అయినప్పటికీ మంచి లోకజ్ఞానం ఉంది. ఎవరి మాయలకు ప్రలోభాలకు లొంగలేదు. పరిస్థితిల ప్రభావాలు సలహాలు, సామాజిక ఘర్షణలు, అనుభవాల దొంతరలు జీవితంలో పాఠాలు నేర్పుతాయి.
నీతి నిజాయితీ గల వారిని మాటిమాటికి బదిలీ చేయటం ఎప్పుడూ సమాజంలో జరుగుతుందే. నిజాయితీగా ఎంక్వయిరీ చేసిన స్వామిని ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ నుండి కమర్షియల్ డిపార్ట్మెంట్ కి బదిలీ చేసి ప్రాధాన్యత తగ్గించారు. నేడు మన రాజకీయ నాయకుల అడుగులకు మడుగులొత్తని ఉద్యోగులని బదిలీ చేసి వారిని ఇబ్బందులకు గురి చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఈ సంఘటనలు నేటి సామాజిక వ్యవస్థకు దర్పణం వంటివి. అర్నాద్ స్వామి వంటి పాత్రలని సృష్టించి సామాజిక చైతన్యం కోసం కృషి చేశారు.
సత్య సమాజానికి ఎప్పుడూ భయపడలేదు. భయపడే కొద్ది మరింత భయపెడుతుందనే సత్యాన్ని రామాయమ్మ ద్వారా తెలుసుకుంది. ఈ నవల్లో మానవత్వం విలువలు, అనురాగాలు, ఆప్యాయతలు పుష్కలంగా గల పాత్ర రాములమ్మ. సత్యకు తల్లి తరువాత తల్లి లాంటిది. కష్టసుఖాల్లో ఆదుకుని అన్నింటికి నేనున్నానని భరోసా ఇచ్చేది. రామాయమ్మ లేకపోతే సత్య జీవితం ఏనాడో ముగిసేది. సత్యకు ధైర్యం నూరు పోసి కామాంధుడైన భర్త నుండి రక్షించుట, సత్య ప్రసవ సమయం లో దగ్గరుండి సపర్యలు చేయడం, సత్యపై కన్నేసిన కీచకుల కబంధహస్తాల నుండి కాపాడి భర్త ఉద్యోగం సత్యకు వచ్చినంత వరకు ఆమె వెన్నంటే ఉండి ధైర్యం నూరిపోసి సత్యను పరిపూర్ణవంతురాలిగా చేయడంలో రామాయమ్మ సేవలు విలువ కట్టలేనివి. మంచికి మానవతకు మారుపేరు రామాయమ్మ. అర్నాద్ సత్య నవల్లో సామాజిక చైతన్యమంతా రామయమ్మలోనే ఉన్నట్లు తీర్చిదిద్దారు.
అక్క చెల్లెల్లు కానప్పటికీ అంతకంటే మిన్నగా సత్య, పద్మలు పేరు తెచ్చుకున్నారు. తనకు ఎటువంటి సలహా అయినా అక్క పద్మ చెబితేనే చేసేది. ఈ కాలంలో ఒకే రక్తం పంచుకు పుట్టిన అక్కాచెల్లెళ్లు మధ్య పొరపొచ్చాలు ఉంటాయేమో గాని వీరి మధ్య దాపరికాలు లేకుండా అన్యోన్యంగా ఉండేవారు. సత్య కూతురు శిరీషను సొంత కూతురులా చూసుకుంది. కొడుకులు తప్ప కూతురు లేని పద్మ సత్య కూతురునే కూతురుగా చూసుకుంది. స్త్రీ పట్ల చులకన భావముగల నేటి సమాజంలో, తల్లి గర్భములోనే స్త్రీలను భ్రూణ హత్యలకు పాల్పడుతున్న నేటి సమాజానికి గుణపాఠం వంటిది. కూతురులంటే పద్మకు ఇష్టం అర్నాద్ తన నవలలో స్త్రీలకు సముచిత స్థానము కల్పించి స్త్రీ చైతన్యం కోసం కృషి చేశారు. సత్య నవలంతా స్త్రీ చైతన్యానికి కేంద్ర బిందువు. చలం నవలల్ని గుర్తుకు తెచ్చి అర్నాద్ స్త్రీ పక్షపాతి అని ఈ నవల ద్వారా అనిపించుకున్నారు.
భర్త చనిపోయిన స్త్రీ విధవరాలుగా ఒక మూలన చేరి బొట్టు, గాజులు లేకుండా ఉండే సంప్రదాయానికి అర్నాద్ తెరదించారు. అవి పాత రోజులు. ఎవరు ఏదో అంటారని భయంతో మనం వెనక్కి పరిగెత్తనక్కరలేదు. మన రోజులు మనవి. మనం ఇష్టం వచ్చినట్లుగా మనకు నచ్చినట్లుగా ఉందామని సత్య ద్వారా తెలియజేశారు. భార్య పోయిన మగాడు భర్త పోయిన స్త్రీలా ఎందుకు కనిపించడు అని ప్రశ్నింపజేశారు. స్త్రీలు ఉద్యోగాలు చేసే దగ్గర లైంగిక వేధింపులు పరిపాటి. సత్య పని చేసే కంపెనీలో తోటి పురుష ఉద్యోగులు ఆమెను వేధించేవారు. వారందరికీ బుద్ధి చెప్పి తన వైపు కన్నెత్తి చూడకుండా చేసింది. నేడు చాలామంది ఉద్యోగినులు పనిచేసే చోట వేధింపులకు గురికా బడుతున్నారు. అలాంటి వారిలో ఈ నవల చైతన్యం కలిగించి, వారికి సత్య వంటి వారు మార్గదర్శకులుగా చిత్రించెను. చాలామంది స్త్రీలు హింసకు గురి కాబడుతున్నారు. పరిస్థితులతో పోరాడి నెగ్గుకు రావాలని తెలిపారు. కొందరు ఉన్మాదులు, మానసిక రోగులు లైంగిక, మానసిక, భౌతిక హింసలకు పాల్పడతారని, వారి నుండి ఏ విధంగా తప్పించుకోవాలనే విషయం తెలిపి సామాజిక చైతన్యం కోసం కృషి చేశారు.
మారు పేరులతో, ముల్లాల పేరుతో ఉత్తరాలు రాయడం ఫోన్లు చేయడం నేడు పరిపాటి అయింది. సత్యకు ఎన్నో బెదిరింపు ఉత్తరాలు వచ్చి ఆమెను మానసిక అశాంతికి గురి చేశారు. ఇలాంటి ఫోన్లు చేసి స్త్రీలను వేధించుకు తినే మానసిక రోగులు కోకొల్లలుగా ఉన్నారు. అలాంటి వారి పట్ల జాగ్రత్త వహించాలని తెలియజేశారు. నేడు ఇలాంటి అకృత్యాలు, అనాగరిక చర్యలు శృతి మించి సాంఘిక విచ్ఛిత్తికి కారణమవుతున్నాయి. మన వెనుకే ఉండి మనకే గోతులు తవ్వేవారు నేడు ఎక్కువైపోయారు. స్వామి వెనుక ఉండి స్నేహితుడైన రాఘవరావు అతనికి ద్రోహం చేస్తాడు. ఏ అలవాటు లేని స్వామికి మందు వ్యసనం నేర్పి అతన్ని పాడు చేస్తాడు. బలవంతంగా అర్ధరాత్రి సత్య ఇంటికి స్వామిని పంపించి, ఆ వెంటనే స్వామి భార్యకు ఫోన్ చేసి స్నేహానికి ద్రోహం చేశాడు. మనం నమ్ముకునే వారే మనల్ని మోసం చేస్తారని విషయం రాఘవరావు ద్వారా తెలియజేసి పాఠకులు జాగ్రత్త పడేటట్లు చేశారు.
నేటి సమాజంలో బ్లాక్మెయిలింగ్ రాజకీయాలు ఎక్కువవుతున్నవి. సత్యతో పాటు పనిచేసే రాజారామ్ వెధవరాలైన సత్యను పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అందుకోసం పద్మ, స్వామిలతో రాయబారం నడిపించాడు. సత్య తిరస్కరణతో బ్లాక్ మెయిలింగ్కు పాల్పడి, నన్ను కాదంటే ఆత్మహత్య చేసుకుంటానని రాజారాం బెదిరించాడు. జీవితాన్ని చదివిన సత్య ఇలాంటి తాటాకు చప్పుల్లకు భయపడలేదు. కానీ నేడు ఎందరో స్త్రీలు అలాంటి వారి ఉచ్చులో పడి మోసపోవడం జరుగుతుంది. ఇలాంటి విషయాలని అర్నాద్ తన నవలలో తెలియజేసి సామాజిక చైతన్యం కోసం కృషి చేశారు. కొందరు స్వార్ధపరులు స్నేహముగా ఉండరు, స్నేహంగా ఉండే వారిపై లేనిపోని చాడీలు చెప్పి స్నేహితులను విడదీస్తారు. సత్య నవల్లో ముల్లాల్ పేరుతో అరాచకాలను సృష్టించే వారిని నిశితంగా విమర్శించారు.
మద్యపానం మానవులను ఎంతటి నీచస్తాయికైనా దిగజారుస్తుంది. స్వామి ఆదర్శప్రాయుడు. కానీ మద్యానికి బానిసై చివర్లో నిందలపాలయ్యాడు. సత్య దృష్టిలో స్వామి దేవుడుతో సమానం. ఒకరోజు అర్ధరాత్రి స్నేహితులతో మందు త్రాగి సత్యతో శారీరక పొందుకు తాపత్రయపడతాడు. ఆ సమయంలో దేవుడు లాంటి స్వామి చనిపోయిన తన భర్త కృష్ణారావును గుర్తుకు తెస్తాడు. అంతవరకు స్వామి పై సదాభిప్రాయం దురాభిప్రాయంగా మారెను. మగవాళ్ళంతా ఒకే జాతిగా, నరరూప రాక్షసులుగా, కామపిశాచులుగా భావిస్తుంది సత్య. చివరకు స్వామి పశ్చాత్తాపంతో సత్య శాంతించింది. ఈ నవలంతా సమాజాన్ని దృష్టిలో ఉంచుకొని రాసింది. మానవుల్లో పరివర్తన తీసుకొచ్చి సామాజిక చైతన్యానికి అర్నాద్ కృషి చేశారు. మన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించారు.
6. ముగింపు:
సామాజిక నవలల దృష్ట్యా పరిశీలించినప్పుడు అర్నాద్ ఓ నిబద్దత గల రచయితగా కనపడుదురు. ఆయన రచనలలో వర్తమాన సాంఘిక, ఆర్థిక పరిస్థితులు, సామాజిక స్పృహ కనబడును. ముఖ్యంగా అర్నాద్ మానవతావాది. మనిషి మనిషిగా మన గలిగినప్పుడు సామాజిక సమస్యలకు ఒక పరిష్కారం తప్పక లభిస్తుందని ఆయన విశ్వాసం. రచయితగా ఆయనకు జీవితమే ప్రమాణం. సిద్ధాంతం కోసం జీవితాన్ని వక్రంగా చిత్రించాలన్న తపన ఆయనకు లేదు. మౌలికంగా గల ఒక సంఘర్షణ ఒకదానికి అనుకూలంగానో, ప్రతికూలంగానో చేసే సంఘర్షణ.
"కళాకారుడు జీవితాన్ని కాపీ చేయడు అతడు జీవితం యొక్క వ్యాఖ్యాత పరివర్తకుడు" ¹²
అన్న మార్చిమ్ గోర్కీ .మాటలు సమాజం పట్ల రచయిత బాధ్యతను, రచయిత తత్వాన్ని వ్యక్తం చేస్తున్నాయి. అర్నాద్ రచనల పట్ల ఈ మాటలు సార్ధకాలు. జీవితాన్ని సమగ్రంగా పాఠకుల ముందు ఉంచడం, ఆలోచింపజేయడం తద్వారా అతనిలో చైతన్యం పెంచటం అర్నాద్ లక్ష్యం. పాఠకుల భౌతిక జీవిత పురోగతికి ప్రేరణ కలిగిస్తూ దోహదం చేస్తూనే అతన్ని నైతికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నతున్ని చేయడం అన్నది అర్నాద్ రచనల్లో కనిపిస్తుంది. ఏ కలలోనైనా సుందరత, వాస్తవికత, దార్శనికత అనేవి త్రివేణి సంగమములా ముప్పేటగా ఉంటాయి. అర్నాద్ ఈ నాలుగు నవలలు ఇతివృత్తంలోనూ, శైలిలోనూ భిన్నమైనవి విలక్షణమైనవి. నవల అన్నింటిలోనూ సామాజిక చైతన్యం పుష్కలంగా కనిపిస్తుంది.
7. పాదసూచికలు:
- తెలుగు నవలాను శీలనం. -. డాక్టర్ ముదిగంటి సుజాతా రెడ్డి. పుట. 29
- ఆంధ్ర నవలా పరిణామం. -. డాక్టర్ బొడ్డపాటి వెంకట కుటుంబరావు- పుట . 102
- తెలుగు నవలాను శీలనం. -. డాక్టర్ ముదిగంటి సుజాతా రెడ్డి. పుట .29
- తెలుగు నవలానుశీలనం. -. డాక్టర్ ముదిగంటి సుజాతా రెడ్డి పుట . 47
- నవలా శిల్పం. -. వల్లంపాటి వెంకటసుబ్బయ్య. పుట . 13.
- నవలా శిల్పం -. వల్లంపాటి వెంకటసుబ్బయ్య పుట .8
- చీకటోళ్లు నవల. -. అర్నాద్. పుట . 3
- చీకటోళ్లు నవల. -. అర్నాద్. పుట . 5
- చీకటోళ్లు నవల. -. అర్నాద్. పుట 209
- చీకటోళ్లు నవల. -. అర్నాద్. పుట . 266
- చీకటోళ్లు నవల. -. అర్నాద్. పుట. 209
- నవలా శిల్పం. -. వల్లంపాటి వెంకటసుబ్బయ్య. -. పుట - 8
8. ఉపయుక్తగ్రంథసూచి:
- అభ్యుదయ రచయితల సంఘం. ఈ దశాబ్ది నవల విశేష సంచిక. జనవరి సంచిక. విశాలాంధ్ర, విజయవాడ: 1980
- అర్నాద్. ఈ తరం స్త్రీ (నవల). వాహిని బుక్ ట్రస్ట్, విద్యానగర్, హైదరాబాద్: 2003
- అర్నాద్. చీకటోళ్లు (నవల). స్వాతి నవలల పోటీల్లో ప్రథమ బహుమతి:1977.
- అర్నాద్. సత్య (నవల). వాహిని బుక్ ట్రస్ట్: 2006
- అర్నాద్. సాంఘికం (నవల). స్వాతి సాహిత్య మాసపత్రిక, విజయవాడ: జూలై 1990.
- ఆనందరామం, సి. తెలుగు నవలలు కుటుంబ జీవనం.
- తెలుగు నవల - నూరు సంవత్సరాలు. ఆంధ్ర సాహిత్య అకాడమీ, హైదరాబాద్: 1973.
- నాగభూషణ శర్మ, మొదలి తెలుగు నవలా వికాసం. హైదరాబాద్:1974.
- మృణాళిని, సి. సాంఘిక నవల- కథన శిల్పం. హైదరాబాద్:1988
- రంగనాథాచార్యులు, కె.కె., తెలుగులో తొలి సామాజిక కవులు. ఆంధ్రప్రదేశ్ సారస్వత పరిషత్, హైదరాబాద్:1984
- రంగారావు, మాదిరాజు. నవల స్వరూపసమాలోచనం. రసధుని, వరంగల్:1984.
- రామకృష్ణారావు వై. ఆధునికాంధ్ర సాహిత్యం చైతన్య స్రవంతి. వేదిక, హైదరాబాద్: 1982
- లలిత, జి. మహిళ (నవల).
- వల్లంపాటి, వెంకటసుబ్బయ్య. నవలాశిల్పం. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ హైదరాబాద్: 1989
- వెంకట కుటుంబరావు, డాక్టర్ బొడ్డపాటి. ఆంధ్ర నవలాపరిణామం. హైదరాబాద్: 1971
- వెంకటేశ్వర్లు, పుల్లాభొట్ల. తెలుగు నవలాసాహిత్య వికాసం. విజయవాడ:1974
- సంజీవమ్మ, పి. తెలుగు నవలల్లో సామాజిక చైతన్యం. అభ్యుదయ రచయితల సంఘం, కడప:1985
- సుజాత రెడ్డి, డాక్టర్ ముదిగొండ. తెలుగు నవలానుశీలనం. హైదరాబాద్: 1990.
- సుదర్శనం, ఆర్. ఎస్. తెలుగు నవల పాత్ర చిత్రణ. రచయితల సహకార సంఘం, చిత్తూరు:1972
- సుబ్రహ్మణ్య శర్మ, పురాణం. తెలుగు నవల సరికొత్త పోకడలు.
- సుబ్రహ్మణ్యం, జి. వి., సమాలోచనం (ఆధునికాంధ్ర సాహిత్య ప్రక్రియలపై సమీక్ష) - ఆంధ్రప్రదేశ్ సాహిత్యఅకాడమీ, హైదరాబాద్:1980.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.