AUCHITHYAM | Volume-04 | Issue-08 | July 2023 | ISSN: 2583-4797
4. కాళోజి కవిత్వం: పురాణ ప్రతీకలు
డా. ఆర్. మహేందర్ రెడ్డి
తెలుగు సహాయాచార్యులు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, (స్వయంప్రతిపత్తి), సిద్ధిపేట,
సిద్ధిపేట, తెలంగాణ.
సెల్: +91 9959525955. Email: ra.mahi.1947@gmail.com
Download PDF
వ్యాససంగ్రహం:
భాషలో, భావంలో అభ్యుదయ భావజాలంతో కవితారచన చేసిన ప్రజాకవి కాళోజినారాయణ. కవిత్వరచనలో కొన్ని వాక్యాల్లో చెప్పలేని భావం ఒక్క ప్రతీక ద్వారా వెల్లడవుతుంది. భారతీయ సంస్కృతికి నిదర్శనాలైన రామాయణ, భారత, భాగవతాలలోని పాత్రలను, సంఘటనలను ప్రతీకలుగా తీసుకొని సమకాలీన సామాజికపరిస్థితులకు అన్వయించి కాళోజి కవిత్వరచన చేసారు. అభ్యుదయ భావజాలంతో సాగే కాళోజి కవిత్వంలో పురాణప్రతీకల ప్రాధాన్యతను తెలియజెప్పడమే ఈ వ్యాస ఉద్దేశ్యం.
Keywords: కాళోజి నారాయణరావు, అభ్యుదయకవిత్వం, ప్రతీకలు, రామాయణం, భారతం, భాగవతం, సామాజికాంశాలు, ధర్మమార్గం.
1. ఉపోద్ఘాతం:
"ఏమిటి సాహిత్యమంటే...... కళేబరాన్ని బట్టి ఆత్మను ఎంచుట సబబా" అని ప్రశ్నించి కవికి, కవిత్వానికి ఉండవలసిన లక్షణాలను, బాధ్యతలను ప్రకటించినవాడు, "అన్నపురాసులో కచోట, ఆకలిమంటలింకొక చోట" (నాగొడవ-కాళోజి కవితలు, వ్యత్యాసాలు,పుట.5.)
అని సమాజంలోని అసమానతలను ప్రశ్నించి, అణగారిన సమాజం వైపు వకాల్త తీసుకొని అన్యాయాలకు పాల్పడే అధికారాలను ప్రశ్నించి కవిత్వరచన చేసినవాడు కాళోజి నారాయణరావు.
కాళోజి కవిత్వం సూటిగా మనసుని తాకుతుంది. తాకడమే కాదు మనసుని చలింపజేసి మనిషిని చైతన్యపరుస్తుంది. అధిక్షేపం, అంతర్లీనంవ్యంగం వంటి లక్షణాలతో వినూత్నంగా కనిపించే కాళోజి కవిత్వంలో ప్రతీకాత్మకత ఎక్కువ. సమాజాన్ని ఆలోచింపజేసే అభ్యుదయ భావజాలంతో రాసిన కాళోజి కవిత్వంలో భారతీయసాంస్కృతిక జీవనానికి ఆత్మవంటి రామాయణ, భారత, భాగవతాల్లోని పాత్రలను ప్రతీకలుగా తీసుకొనిశక్తివంతమైన కవిత్వరచన చేసారు.
"యాదగిరి యాది" కవితలో తమ కులదైవంగా చెప్పుకొన్న నరసింహస్వామిని అనేకచోట్ల ధర్మరక్షణను ప్రతీకగావాడుకున్నాడు. చిన్నపుడు తండ్రి ద్వారా విన్న ప్రహ్లాదచరిత్ర కథ నుండి ఎన్ని ఆటంకాలెదురైనా జీవితాంతంనమ్మిన విశ్వాసానికి కట్టుబడి ఉండాలనే విషయాన్ని గ్రహించి దాన్ని జీవితాంతం పాటించాడు. చాలా కవితల్లో పురాణపాత్రలను ప్రతీకలుగా వాడుకోవడమే కాకుండా కొన్ని కవితలకు "మాంధాతలనాటి నుండి","ప్రజాగజజేంద్రుని మొర", “సరస్వతీ భక్తుల్లారా”, “అన్యధా శరణం నాస్తి”, "సంభవామి పదేపదే" వంటి పురాణ ప్రతీకలనే శీర్షికలుగా పెట్టారు.
2. భారతంలోని ప్రతీకలు:
భారతంలో లేనిది ప్రపంచంలో ఎక్కడా ఉండదు. ప్రపంచంలో జరిగేవన్నీ భారతంలో ఉన్నవే. అనే విషయం సార్వకాలిక సత్యమని భారతంలోని పాత్రలు, సంఘటనలు పదేపదే నిరూపిస్తున్నాయి. నేటి సమాజంలోని మనుషుల మానసికస్థితికి నిదర్శనాలనదగిన పాత్రలన్నీ భారతంలో కనిపిస్తాయి. భారతానికి సంబంధించి యుద్ధకారణాలు, అనాలోచిత నిర్ణయాలు మొదలైన అంశాలను కాళోజి తన కవిత్వప్రతీకలుగా ఎంచుకున్నారు.
"దేబెల దౌర్భాగ్యం" కవితలో "భీముడు లేనట్టిచోట బేరమాడి రాతమునకు- బకాసురుని మెప్పించుక బ్రతుకుట తప్పనిసరియగు"(నాగొడవ-కాళోజి కవితలు, పుట.81)
ప్రజలను కాపాడే సరైన ప్రజానాయకుడు లేని పరిస్థితిలో ప్రజలు అధికారుల అన్యాయాలను భరిస్తూ బ్రతకాల్సిన దౌర్భాగ్యం గురించి తెలిపాడు. ఏకచక్రాపురంలో రక్షించే వాడు లేక ప్రజలు బకాసురునికి బలైన సంఘటనను ప్రతీకగా వాడుకున్నాడు.
భారత జాతీయోద్యమకాలంలో కరాచిలో జరిగిన కాంగ్రెస్ సభ నిర్ణయాలు గందరగోళానికి దారితీసాయి. ఏమి జరుగుతుందో తెలియని అయోమయ పరిస్థితులు ఏర్పడడానికి, అనంతర విషమపరిస్థితులకు కరాచీ కాంగ్రెస్ సభ కారణమైంది. ఈ విషయాన్ని భారతంలో కుంతీదేవి బాల్యచాపల్యంతో చేసిన పనివల్ల గర్భవతియై కష్టాలు తెచ్చుకున్న సంఘటనను ప్రతీకగా తీసుకొని "అయోమయోదయం" కవితలో
"మాస్కోలో కన్నెగట్టిన ముడుపు - కర్ణాకర్ణిగ సోకిన దుమారం, దూర్వాసుని వరం - కరాచీ కాంగ్రేసుకైంది కడుపు"(నాగొడవ-కాళోజి కవితలు, పుట.121)
అని చెప్పడంలో అధిక్షేపం వెల్లడవుతుంది. “మళ్ళీ మహాభారతం" కవితలో పాకిస్తాన్ భారత భూభాగమైన కాశ్మీర్ ను ఆక్రమించినపుడు పాకిస్తాన్ ను కౌరవులతో, భారత్ ను పాండవులతో పోల్చి
"దుండగుడు కన్ను గీటితే- శీలవతి కన్నుల్లో శివుని చిచ్చుకంటి మంటలు,
సైరంధ్రి అవమానిత అయినపుడు - కీచకవధ జరుగక తప్పదు
ద్రౌపది అభిమానికి క్షతి జరిగినప్పుడు - దుర్యోధనుల తొడలు విరుగక తప్పదు,
దుశ్శాసనుల ఎదలు పగలక తప్పదు" (నాగొడవ-కాళోజి కవితలు, పుట.142)
అని ధర్మబద్ధమైన భారత్ చేతిలో అధర్మవర్తనంలో పయనిస్తున్న పాకిస్తాను ఓటమి పాలవకతప్పదని హెచ్చరిస్తాడు. ఇక్కడ నియమవిరుద్దంగా ప్రవర్తిస్తున్న శత్రుదేశాన్ని కౌరవులతో పోల్చడంలోనే వారి ఓటమిని వ్యక్తీకరించాడు. అదే సమయంలో యుద్ధంలో మరణించిన భారతసైనికుల గురించి
"ఆచార్యుల పద్మవ్యుహాలు - అభిమన్యుల చిత్రవధలు... మళ్ళీ మహాభారతం" (నాగొడవ-కాళోజి కవితలు, పుట.142) అని
కొందరి అధికారాల కోసం, ఆ అధికారుల ఆలోచనల కారణంగా అకాలమరణం పొందిన సైనికుల గురించి ఆవేదన చెందుతాడు.
"కైతల కథనం - ఔతల పని" కవితలో సమాజంలో పైకి మంచిగా నటిస్తూ అంతర్గతంగా చెడు ఆలోచనలు చేసేనాయకుల గురించి
"మన మాలిన్యం దుర్యోధనునిది -మాటచ్చం గాంధీ మాదిరి.
చేతలు నరకాసురునివే -కానీ కూత మాత్రం శకుని మాదిరిదె" (నాగొడవ-కాళోజి కవితలు, పుట.192) అని
గోముఖవ్యాఘ్రాల వంటి నాయకుల వ్యక్తిత్వాన్ని, వారి మనోమాలిన్యాన్ని తెలుపుతూనే అలా ప్రవతించిన వారు చరిత్రహీనులుతారని దుర్యోధనుదు, శకుని వంటి పాత్రలను ప్రతీకలుగా చెప్తాడు.
ఇందిరాగాంధీ కాలం నాటి రాజకీయపరిస్థితులను విమర్శిస్తూ "ఏమిటి ఈ దేశముగతి' కవితలో
"రాష్ట్రపతి ధృతరాష్ట్రుడు -ఘనులు మహా కానీనులు
బలులు మహా బలనీయులు - గౌరవసభ వర్ణనము
ఇది ఈనాటి భారతము - ఇందిరా దర్బారుషాను" (నాగొడవ-కాళోజి కవితలు, పుట.210) అంటాడు.
రాజుగా అధికారం ఉన్నా దుర్యోధనున్ని ఏమి అనలేక యుద్ధానికి పరోక్షకారణమైన ధృతరాష్ట్రునితో రాష్ట్రపతిని పోల్చడం నాటి రాజకీయవ్యవస్థలో అధికారకేంద్ర స్థానాన్ని ధ్వన్యాత్మకంగా వ్యక్తీకరిస్తాడు.
భగవద్గీతలోని ప్రసిద్ధ శ్లోకానికి పేరడీగా రాజ్యాంగంలోని ఎమర్జెన్సి ఆర్టికల్ గురించి 'సంభవామి పదేపదే’ శీర్షికతో
"యదాయదాహి దేశస్య-హానిర్భవతి భారత / ఎమర్జెన్సి సంభవామి-భారతాని పదేపదే"(నాగొడవ-కాళోజి కవితలు, పుట.217) అని
వ్యక్తిగత అవసరాలకోసం రాజ్యాంగఅధికారాలను
ఉపయోగించుకున్న అధికారాన్నిశ్లోకాత్మకంగా ఎత్తిపొడుస్తాడు.
3. భాగవతంలోని ప్రతీకలు:
భాగవతం భక్తిరసాత్మక గ్రంథం. ఇందలి నవవిధభక్తులు, దశావతారాలు వంటి భక్తి సంబంధిత అంశాలను, ప్రధానంగా కృష్ణుడు, నరసింహస్వామి పాత్రలను మార్మికతకు, దార్మికతకు ప్రతీకలుగా వాడుకున్నాడు. “సామరస్యం" కవితలో
"చిన్నారి అణువు-అందంగా, అమయాకంగా / పాలబుగ్గల బాలకృష్ణుని వలె / జడిసినట్లు నటిస్తూ.." (నాగొడవ-కాళోజి కవితలు, పుట.57 ) అని
చెప్పే కవిత్వంలో విశ్వరహస్యాలను ఇముడ్చుకున్న అణువును చిన్నికృష్ణునితో, ఆ అణురహస్యాలను తెలుసుకున్న శాస్త్రవేత్తలను యశోదమ్మతో పోలుస్తాడు. సమాజంలో సామరస్యత లోపిస్తే ఆ అణువు విశ్వశాంతిని ధ్వంసంచేసి విధ్వంసం సృష్టిస్తుందని అంతటి వినాశకరశక్తిని దాచుకున్న అణువును శివుని చిచ్చుకన్నుతో పోలుస్తాడు.
తెలుగు భాగవతంలో ప్రసిద్దమైన గజేంద్రమోక్షం ఘట్టాన్ని, అందలి ప్రసిద్ధ పద్యాలను ప్రతీకలుగా గ్రహించి నాటి ప్రభుత్వాల ప్రజాపీడనను ‘ప్రజాగజేంద్రుని మొర’ శీర్షికతో మరణించిన బాపుజీకి లేఖ రాసాడు.
‘ఎవనికేం పట్టింది దేశంగతి- ఎవని గొడవ వానిది, పోయింది మతి,
బాపూజీ పేరా కాళోజి పంపిన జాబు -లోపల దేశపు దుఃఖం, బయట నవ్వుల గిలాబు
ప్రభుతామకరిగ్రసిత ప్రజాగజేంద్రుని మొర - ప్రాణంబుల్ ఠావుల్ దప్పినాయిరా దొర’ (నాగొడవ-కాళోజి కవితలు, పుట.99) అని
ఆవేదనను వ్యక్తం చేస్తాడు. నిరంకుశ విధానాలతో ప్రజలను పట్టి పీడిస్తున్న ప్రభుత్వాధికారాన్ని మోసలితోను, దాని నోటచిక్కి బయటపడలేక అవస్థ పడుతున్న గజేంద్రునితో ప్రజలను పోల్చి చెప్తూ, తనకు ఎదురు లేదని భావించే ఆ నిరంకుశ ప్రభుతామకరి అంతంకాక తప్పదని చెప్తాడు. ఇందులో భాగవత పాత్రలతో పాటు “ప్రాణంబుల్ ఠావుల్ దప్పెను” వంటి ప్రసిద్ధ భాగవత పద్యపాదలను సముచితంగా ఉపయోగించుకోవడం విశేషం. ఇదే పద్యాన్ని మరోచోట సమాజంలో దారితప్పిన “లా అండ్ ఆర్డర్” (నాగొడవ-కాళోజి కవితలు, పుట.185) గురించి రాసిన పేరడిలో కూడా వాడుకున్నాడు.
‘మహాంద్రంలో మహాకవులు’ కవితలో “పదవి ఎత్తిన మెదడు ఎదుగును - బలిని బలిగొను చలము తెలియును” (నాగొడవ-కాళోజి కవితలు, పుట.124) అని
అధికారం చేజిక్కించుకున్నవాడు ఉన్నతుడిగా పేరొందిన వాడైనా సరే అవకాశంవస్తే ఇతరులను తొక్కివేసేందుకు ఎలా ప్రయత్నిస్తాడో చెప్తాడు. కవులు సమాజశ్రేయస్సు దృష్టితోనే కవిత్వం రాయాలని, అధికారాలకు తలొగ్గి వారిని మాటలకు వంతపాడడం తప్పని నిర్మొహమాటంగా ప్రకటించారు. "కలం గారడీ కైతల వలలకు" కవితలో
"దొరతనాల దోపీడీని దోస్తీ అనకు - నరకాసురుని ఏలుబడిని నాకమనకు,
దితిపుత్రుల పాలనను దివ్యమనకు - భస్మాసురు చేతిచలువ రశ్మియనకు"(నాగొడవ-కాళోజి కవితలు, పుట.171)
అని ప్రభుత్వ విధానాలను గుడ్డిగా సమర్ధించ వద్దని హితవు చెప్తాడు. ప్రభుత్వ విధివిధానాలు వ్యక్తిగతంగా కాకుండా వ్యవస్థకు ఏ విధంగా మేలు చేస్తున్నాయో చూడాలని, అది కవికి కనీస బాధ్యత అని గుర్తు చేస్తాడు.
"విప్లవ వహ్ని" కవితలో "ఎదురు ఎవరంచు ఘోషించు మదముబూని
ఎదిగి తలయెత్తు శక్తికి భయముజెంది
మూడులోకాలు లొంగినను; భీతి లేక
నాడు ప్రహ్లాదుడొక్కడే ఎదురు నిలిచి ఆత్మగౌరవస్థాయి...." (నాగొడవ-కాళోజి కవితలు, పుట.180) అంటూ
జాపీడన ప్రభుత్వం అధికారంతో అందరిని తన ఆధీనంలో ఉంచుకున్నప్పటికీ, భయపడకుండా నీతివంతుడై తాను నమ్మిన విశ్వాసానికి కట్టుబడ్డ నాటి ప్రహ్లాదుని వంటివారు ఆ నిరంకుశ అధికారానికి ఎదురునిలుస్తారని, అధికారాన్ని ప్రశ్నిస్తారని, తీరు మార్చుకోకపోతే అంతం చేస్తారని హెచ్చరించాడు. అటువంటి
"ప్రహ్లాదుడైన నరుని కాయ నరుడే - మొండివాడైన నరుడే
దితిపుత్రు పొట్ట చీల్చి - నరసింహు రూపుదాల్చి
హింస హరియింప ప్రతిహింస బూనినాడు." (నాగొడవ-కాళోజి కవితలు, పుట.180)
అని అధర్మవర్తనంతో, అక్రమాలతో హింసకు పాల్పడేవారికి ప్రతిహింసతో సమాధానం చెప్పడంలో తప్పులేదంటాడు.
"సృజన-పిలుపు" కవితలో "ప్రహ్లాదుల సత్యాగ్రహం పరిహాసం పాలైనప్పుడు / నచ్చజేప్పితే హిరణ్యకశిపుడు నొచ్చుకుంటున్నప్పుడు" (నాగొడవ-కాళోజి కవితలు, పుట.181)
హింసామార్గం తప్పదని, అది తప్పుకాదని, మానవుడు ధర్మంగా తానుపొందే కనీసహక్కులను కాపాడుకోవడానికి హింసకు ఎదురుగా ప్రతిహింస మార్గంలో ముందుకెళ్ళడం తప్పుకాదని ప్రహ్లాదచరిత్ర ఆధారంగా సమర్దిస్తాడు. సామాన్యుల కనీస హక్కులు హరించే ప్రభుత్వానికి మంచి చెప్పడం నచ్చదు. అటువంటి సందర్భాలలో ఆ ప్రభుత్వాన్ని పడగొడితే తప్ప సామాన్యులకు మేలు కలుగదు. కాబట్టి నరసింహుడు దుష్టుడైన హిరణ్యకశిపుని వధించి ధర్మాన్ని కాపాడినట్టు కొన్నిసార్లు హింసాయుతధర్మం కూడా అధర్మ ప్రభుత్వాన్ని తొలగించి సాధారణ ప్రజలను కాపాడుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తాడు.
"జన్మహక్కు మర్యాదను కాపాడగా" అనే కవితలో
"మాంధాతల మాటైతేం, మావోత్సుంగ్ సూక్తయితేం,
మానవుని జన్మహక్కు మర్యాదను కాపాడగ
ప్రతిహింసను చేపట్టిన ప్రతినరుడొక నరసింహ
దితిపుత్రుల నెదిరిపోర తిరుగుబాటు చేయు హక్కు
మాంధాతల ధర్మపథం మర్మం కాళోజి మతం." (నాగొడవ-కాళోజి కవితలు, పుట.181) అని
వసరమైనపుడు ప్రతిహింసను సమర్దిస్తాడు. అయితే ఆ ప్రతిహింస తప్పకుండా ధర్మపథంలో ఉదాలని తెలపడం సాంప్రదాయ ధర్మం పట్ల వారి గౌరవభావాన్ని వెల్లడిస్తుంది.
ఇందిరాగాంధీ ప్రధానిగా భారత్ లో ఎమర్జెన్సీ విధించినపుడు రాష్ట్రపతి ఉదాసీనతను ప్రశ్నిస్తూ "రాష్ట్రపతీ ఏమంటావ్" కవితలో
"హిరణ్యకశిపుని శక్తి ఇందిరమ్మ పొంది నిలిచి
దౌర్జన్యం,అన్యాయం తలపెట్టి ఏలుతుంది
భరియింపను ఏమైనా దౌర్జన్యాన్నెదురిస్తా
అన్నవాడు ప్రహ్లాదుడు; ఎవరేవరేం చేస్తారో మాకెందుకు.
నరసింహుని భక్తులేం చేస్తారన్నదే ప్రశ్న" (నాగొడవ-కాళోజి కవితలు, పుట.217) అని
అన్యాపదేశంగా ప్రజల్లో ధర్మరక్షణ కర్తవ్యాన్ని
ఉద్భోధించి స్తబ్దమైన చైతాన్యాన్ని నిదురలేపుతాడు.
భారత్-పాక్ యుద్ధంలో పాకిస్తాన్
విభజనను, భారతవిజయాన్ని ధర్మవిజయంగా పేర్కొంటూ "విజయోస్తు" కవితలో
"భారతపౌరుల విజయం
బంగ్లాదేశ్ వాతావరణం, పాకిస్తాన్ కు ప్రళయం
హిరణ్యకశిపుని చీల్చిన నరసింగమునకు విజయం" (నాగొడవ-కాళోజి కవితలు, పుట.230)
అంటాడు. యద్ధానంతరం పాకిస్తాన్&బంగ్లాదేశ్ గా విడిపోయిన మతప్రాతిపదిక దేశాన్ని అధర్మవర్తనుడై చీల్చి చంపబడ్డ హిరణ్యకశిపునితో, అందుకు కారకుడైన ధర్మస్తాపకుడు నరసింహస్వామితో భారతదేశాన్ని పోల్చడం ఔచిత్యవంతంగా కనిపిస్తుంది. ఈ కవిత ద్వారా ధర్మాన్ని కాపాడడానికి అధర్మాన్ని చీల్చక తప్పదనే అంతర్గత సందేశాన్ని అందించాడు.
"ఉగ్రనరసింహ విను" కవితలో
"ఈనాటి దితిపుత్రులు-భక్తులవలె నిన్ను జేరి
మొక్కుబడులు చెల్లించుక-తమ ఆటలు సాగించుక
హాయిగా బ్రతికేడి వైనం" (నాగొడవ-కాళోజి కవితలు, పుట.230)
తెలుపుతూ సమకాలీన నీచ రాజకీయనాయకుల కుట్రపూరిత వ్యక్తిత్వాలను ఎండగడతాడు.
రాజకీయనాయకులు ప్రజలను మోసం చేసేందుకు ఎన్నివేశాలు వేస్తారో, ప్రజలను మోసగించి కూడా కొంచం కూడా పశ్చాత్తాపం లేకుండా ఎలా దర్జాగా బతుకుతారో "దశావథారాలు' కవితలో తెలుపుతాడు.
"జీతంభత్యాలు దిగమింగి డొక్కులు తేలేసిన చేపలు,
పరిపాలన కవ్వానికి వీపిచ్చిన తాబేళ్లు,
అశుద్ధం మేసి ప్రసిద్ధంగా తిరుగాడు వరాహాలు,
ప్రజలమొండానికి అధికారలలాటం తగిలించుకొన్న సామాన్య నరసింగాలు,
ఓట్లబిచ్చంతో రేగి ప్రజల తలెక్కి తైతక్కలాడే మరుగుజ్జులు,
స్వార్ధం మాటున నక్కి ప్రత్యర్ధుల హతమార్చే కోదండపాణులు,
పగటికన్నాలకు, చీకటి పన్నాగాలకు పేరుగాంచిన కన్నయ్యలు,
మనిషి మాంసం మ్రింగి త్రేంచెడి బౌద్ధముఖాలు,
కలికి బాత్ అబద్ధం కల్తీలం, కల్కీలం” (నాగొడవ-కాళోజి కవితలు, పుట.155) అని
రాజకీయనాయకులు ప్రజలను మోసం చేయడానికి వేసే బహు
రూపులవేషాలను విమర్శిస్తాడు. ధర్మం కోసం వెలిసిన దశావతారాల్లో వాటి జాతి సహజమైన ప్రవర్తనను నేటి రాజకీయ
నాయకులకు అన్వయిస్తాడు. దశావతారాల్లోన్ని కొన్ని అవలక్షణాలను తెలియజేస్తూ, నేటి రాజకీయ నాయకులకు అవే
ఆదర్శాలైనాయని పూటపూటకు మాటమార్చే రాజకీయ నేతల వ్యక్తిత్వాలను కవిత్వం ద్వారా బట్టబయలు చేసాడు.
4. శివునికి సంబంధించిన ప్రతీకలు:
పంచశీల ఒప్పందం తర్వాత ఇచ్చిన మాట తప్పిన చైనా ప్రభుత్వం భారత భూభాగాన్ని ఆక్రమించే ప్రయత్నం చేసింది. ఆ పరిస్థితిని "పాహి పాహి పాహి" కవితలో తెలుపుతూ-
"భాయి మాటపన్నాగము పన్నినావు భాయి–కంసమామ మమత మేము కన్నట్టిదె భాయి
ధృతరాష్ట్రుని కౌగిలింత ముతకగాథ భాయి -గణపతయ్య నిండుబొజ్జ గిల్లినావు భాయి
నందీశ్వరు తోకబట్టి గుంజినావు భాయి-గంగమ్మను కన్నుగీట దలచినావు భాయి
మహంకాళి పులిపోడను కుదిపినావు భాయి-పార్వతమ్మ పైటచెరుగు లాగినావు భాయి
కైలాసము చిచ్చుకంట వ్రేలు గుచ్చినావు భాయి –ప్రళయాగ్నిని పేరుపెట్టి పిలిచినావు భాయి." (నాగొడవ- కాళోజి కవితలు పుట.165 )
అని స్నేహం ముసుగుతో చైనా చేసిన ద్రోహాన్ని గురించి చెప్తూనే, చైనా కోరి కోరి భారతదేశంతో శత్రుత్వాన్ని, తద్వారా ప్రమాదాన్ని తెచ్చుకుంటుందని హెచ్చరించాడు. హిండుధర్మంలో హిమాలయపర్వతశ్రేణులను శివునికి, శివపరివారానికి నిలయమని భావిస్తారు. అటువంటి హిమాలయ ప్రాంతాన్ని చైనా దురాక్రమణ చేయడానికి సాహసించినప్పుడు ఆ పరిస్థితిని, శివునికి సంబంధించిన ప్రతీకలతోనే చెప్పడం ఔచిత్యవంతంగా కనిపిస్తుంది. చైనా చేస్తున్న కవ్వింపు చర్యలు ఇక్కడి సార్వభౌమాధికారాన్ని ప్రశ్నించి రెచ్చగొట్టేలా ఉన్నాయని అందుకు తగిన ప్రతిఫలం చైనా అనుభవించక తప్పదని హెచ్చరించాడు. ఇంకా 'పద పద పద' కవితలో
"హిమవంతునికాపదయట ఎంతమాట ఏమిటికత" (నాగొడవ-కాళోజి కవితలు, పుట.163) అని
ప్రశ్నిస్తూ, శత్రుదేశం తో జరిగె ఆధునిక యుద్ధంలో కేవలం సైనికులే కాదు శాస్త్రవేత్తలు కూడా తోడుగా నిలబడాలని ఆశిస్తాడు.
"శీతకరునిచే నిప్పులు చెరిగించెడి మాంత్రికులు
శివుని కొసరు కంటిలోన చిచ్చును రగిలింపలేర" (నాగొడవ-కాళోజి కవితలు, పుట.163 ) అని
చైనాతో జరిగే యుద్ధంలో మన సైనికులకు శాస్త్రవేతల
విజ్ఞానం అండగా నిలువాలని కోరుకుంటాడు.
5. ఇతర దైవసంబంధ ప్రతీకలు:
వివాహబంధంతో స్త్రీ పురుషులు ఒకటికావడానికి కులాల అవసరం లేదంటూ "బ్రతుకుసూత్రం" కవితలో-
“బ్రహ్మ సరస్వతుల కులమేమిటి / శివపార్వతుల గోత్రాలేమిటి
లక్ష్మి విష్ణువుల వర్ణాలేమిటి / ఆలుమగలుగా కలసి బ్రతుకగా” (నాగొడవ-కాళోజి కవితలు, పుట.255) అంటూ
స్త్రీ పురుషులు ఒకటిగా కలసి బతకడానికి కులాల ప్రసక్తి ఎందుకని ప్రశ్నిస్తాడు. అభ్యుదయ భావజాలంతో కులరహిత సమాజాన్ని ఆకాంక్షిస్తూ, ఆది దేవతలుగా పూజలందుకొంటున్న త్రిమూర్తులు కులాలకతీతంగా పరస్పరానురాగంతో ఉన్నారని వారిని దైవాలుగా పూజించడమే కాకుండా వారి అభ్యుదయ భావజాలాన్ని అందిపుచ్చుకోవాలని ఆశిస్తాడు.
అక్షరాక్షతలు" కవితలో-
“ఒకముడి ఆనాడు, పార్వతి పరమేశ్వరులను, కాయమందు ఒకటిజేసిన పాటిది,
ఒకముడి ఆనాడు, లక్ష్మీనారాయణులమనసుల ఒకటిజేసిన పాటిది,
ఒకముడి ఆనాడు, బ్రహ్మ సరస్వతులమాటయందు ఒకటిజేసిన పాటిది” (నాగొడవ-కాళోజి కవితలు, పుట.289 ) అని
వివాహవ్యవస్థలో మూడుముళ్ల బంధము యొక్క విశిష్టతను, వివాహానంతరం భార్యాభర్తలు మనోవాక్కర్మలు ఒక్కటిగా, త్రికరణశుద్ధిగా ఒకరి పట్ల మరొకరు ఆప్యాయతానురాగాలతో నడుచుకోవలసిన అవసరాన్ని తెలియజేస్తాడు.
రామాయణంలోని లక్ష్మణరేఖను 'దిగులు" కవితలో సిండికేటు పెత్తందారుల ఆధిపత్యానికి ప్రతీకగా తీసుకొని
"లక్ష్మణరేఖగా అగుపిస్తున్న పరిధిని / కాలివ్రేళ్ళతో చెరిపేస్తే మనకేదిగులూ లేదు" (నాగొడవ-కాళోజి కవితలు, పుట.107 ) అని చైతన్యపరుస్తాడు.
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారత విదేశాంగ విధానంలో ఎన్నో మార్పులు వచ్చాయి. అందులో భాగంగా కమ్యునిజం ను భారత ప్రభుత్వం స్వీకరించింది కానీ మంచి చేస్తుందనుకున్న కమ్యునిజం, చైనాతో జరిగిన పంచశీల విధానం భారత్ కు చేటుచేసిందని ‘రక్తఉప్పలి’ కవితలో
“ఎరుపుచుక్క కిరణం మనపాలిట రక్తఉప్పలియై మొలుస్తుందని అనుకోలేదు వారు” (నాగొడవ-కాళోజి కవితలు, పుట.159) అని
నాయకులు చేసిన పొరపాటు ఫలితాన్ని తలచుకొని వాపోతాడు.
మాటగొప్పదనము గురించి "వాణీవిలాసం" కవితలో
“సర్వమంగళ సమేతుడు పరమేశుడు, శ్రీయుతుడు శ్రీమన్నారాయణుడు
సకల సృష్టికర్త బ్రహ్మ ఇత్యాదులు, సాక్షాత్తుగా వాగీశ్వరీ పదజనితులు” (నాగొడవ-కాళోజి కవితలు, పుట.250) అని
మాటే లోకాన్ని నడిపిస్తుందని, మాటమీదనే ఎన్నో వ్యవహారాలు నడుస్తాయనే వాస్తవాన్ని వెల్లడించాడు. అటువంటి విలువైన మాటను నమ్ముకొని పూటగడుపుకునే కవులు సంపాదన కోసం కాకుండా, సమాజశ్రేయస్సుకు పాటుపడే రచనలు చేయాలని చెప్తూ-
“చిలుక పలుకుల సాముల్లారా, శ్రీవాణి వాణిజ్యము చాలు,
సాహిత్యము సంబారము అనుకొని, సాగించిన సాపాటులు చాలు” (నాగొడవ-కాళోజి కవితలు, పుట.250) అని
కవికి కర్తవ్యబోధ చేస్తాడు. పవిత్రమైన కవిత్వాన్ని వాణిజ్యవస్తువుగా భావించరాదని, బతుకుదెరువు కోసం రాసే కవిత్వం ఇకనైనా ఆపమని అర్థిస్తాడు. గ్రంథాల సంఖ్యను పెంచుకోవడమే లక్ష్యంగా, వాసికెక్కని గ్రంథరాశిని పెంచుకుంటూపోయే కవుల గురించి
“శతసహస్ర గ్రంథరచన ప్రతినబూని నెరవేర్చుట
నుడులరాణి అందాలకు గుడియని కాష్టము పేర్చుట” (నాగొడవ-కాళోజి కవితలు, పుట.250) అని
ఎద్దేవా చేస్తాడు. కవికి కళాత్మకదృష్టి ఉండాలని చెప్తూ "హార్టిన్డ్ ఆర్టిస్టు" కవితలో
“ఉద్రేకము పరాకాష్ట చెందినప్పుడు, మనిషి ఊహ నింగిని వదలి, శివుని తలను దూకెడి గంగను బోలును” (నాగొడవ-కాళోజి కవితలు, పుట.258) అని
కవి ఆలోచనలను ఉవ్వెత్తున ఎగసిదూకే గంగాప్రవాహంతో పోలుస్తారు.
ఎలాంటి జీవనాధారం లేకుండా అతికష్టంగా తన జీవితాన్ని గడుపుతూ కూడా దేశం కోసం తాను దాచుకున్న నూటనలబై రూపాయలు విరాళంగా ఇచ్చిన ఒక పేదరాలి గురించి "భారతమాత పూల్ దేవి" కవితలో
“దధీచి తోబుట్టు దాదమ్మ ఫూల్ దేవి, అంబవు వజ్రపు గుండెల చండివి నీవేనమ్మా” (నాగొడవ-కాళోజి కవితలు, పుట.166) అని
నిర్మలిన హృదయంతో ఆమె చేసిన నిస్వార్థ త్యాగాన్ని దేవతల కోసం ప్రాణత్యాగం చేసిన దధీచితో పోలుస్తాడు.
ఎన్నో ఉద్యమాలతో, ఎందరో ప్రాణత్యాగాలు చేస్తే ఏర్పడ్డ స్వతంత్ర భారతంలో ప్రభుత్వం ఎమర్జెన్సి విధించి కొందరి మనసుకు మాత్రమే వచ్చినట్టు వ్యవహరిస్తున్నదని చెప్తూ “నరుడా” కవితలో
“నాడెపుడో ఆనాడు శివుడు గరళకంఠుడగుట,
మంగళ సూత్రంబునెంతో మదినమ్మిన జగదంబ చైతన్యరూప,
ప్రాణవిభుడు చేదుమ్రింగ తానై సమ్మతి దెల్పుట,
దేవతలు తప్పతాగి అప్సరసలతో తైతక్కలాడుటకా” (నాగొడవ-కాళోజి కవితలు, పుట.204) అని
ప్రశ్నించి, అమృతం కోసం శివుడు విషాన్ని మింగితే, అమృతం తాగిన దేవతలు అప్సర నాట్యాలతో ఆనందం పొందిన విషయాన్ని ఎందఱో వీరుల త్యాగఫలంతో కష్టపడి తెచ్చుకున్న స్వాతంత్రం ఇలా ఇష్టారాజ్యంగా వ్యవహరించడానికా అని నిరంకుశ అధికారాన్ని నిలదీస్తాడు.
6. ముగింపు:
ఈ విధంగా ఆర్తి, ఆవేశం కలగలిసి, ఎగసిపడే సముద్ర తరంగంలా సాగే కాలోజి కవితల్లో పురాణ ప్రతీకలు ప్రాణం పోసుకొని పాఠకుని మనసును మరింతగా ఆలోచింపజేసి ఆవేశాన్ని రగిలించడానికి తోడ్పడుతాయి. కవిత్వంలో కనిపించే ప్రతీకలు ఏవైనా కవిత్వ భావగాఢతను అభివ్యక్తం చేస్తూ పాఠకుని మనస్సుకు ఆయా భావాలను మరింత దగ్గరగా చేర్చడానికి ఉపకరిస్తాయి. అభ్యుదయ భావజాలంతో కవిత్వరచన చేసిన కాళోజి తన కవిత్వంలో భారతీయ ధార్మిక చింతనకు మూలాలైన భారత భాగవత పురాణాలలోని పాత్రలను ప్రతీకలుగా ఉపయోగించి దేశం పట్ల, ధర్మం పట్ల తనకున్న ఆదరాభిమానాలను అభివ్యక్తం చేసారు.
7. ఉపయుక్తగ్రంథసూచి:
- అయిలయ్య బన్న, 1969 తెలంగాణ ఉదయమం - ప్రజాకవి కాళోజీ కవిత్వం.
- కాళోజి, నాగొడవ. యువభారతి. సికిందరాబాద్ 1974
- కాళోజి, నా గొడవ- కాళోజి కవితలు, కాళోజి పౌండేషన్, హైదరాబాద్, 2016
- కృష్ణానంద మల్లాది. తెలుగు పెద్దలు. విశాలంధ్ర పబ్లిషింగ్ హౌసు, హైదరాబాద్. 2021
- జగన్నాథం పేర్వారం. కాళోజీనారాయణరావు. (మోనోగ్రాఫ్). సాహిత్య అకాడమీ,2007
- జయరాములు.బి ఆధునికాంధ్రకవులు. నవచేతన బుక్ హౌస్, విజయవాడ, 2013.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.