headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-08 | July 2023 | ISSN: 2583-4797

3. కథల్లో నుడికారాల అనువాదం: పద్ధతులు

dr_b_bhujangareddy
డా. బాణాల భుజంగరెడ్డి

సహాయాచార్యులు,
తెలుగుశాఖ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ,
హైదరాబాద్, తెలంగాణ.
సెల్: +91 9493976813. Email: bbreddy65@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

విడి విడి పదాల సమాహార అర్థం కంటె భిన్నమైన సమాహార అర్థాన్ని ఇచ్చే పదబంధాన్ని (phrase,) నుడికారం లేదా జాతీయం అంటారు. దీన్నీ ‘పలుకుబడి’ అని కూడా అంటారు. నుడికారాలను ఇంగ్లీషులో Idiom అనీ, హిందీలో ‘ముహావరా’ అనీ అంటారు. ఉదా: ‘అతని చేతికి ఎముకలేదు’ అంటే నిజంగా అతని చేతికి ఎముకలేదని అర్థం కాదు, అతను అడిగినవారికి లేదనకుండా దానం చేస్తాడని అర్థం. ఈ నుడికారంలోని విడి విడి పదాల వాచ్యార్థాన్ని కలిపితే ఈ అర్థం రాదు. ఇలాంటి పదబంధాలనే నుడికారం లేదా జాతీయం అంటారు. ఇలాంటి నుడికారాలు ఒక్కొక్క భాషకు ఒక్కొక్క రకంగా ఉంటాయి. ఒక భాషలోని నుడికారాలు ఆ భాష మాట్లాడే ప్రజల ఆహారపు అలవాట్లు, వారి సంస్కృతి, చరిత్ర, అక్కడి పరిసరాలు మొదలైన వాటి ఆధారంగా రూపొందుతాయి. ఉదా: వీడి కంటె వాడు రెండాకులు ఎక్కువే చదివాడు, వాళ్ళిద్దరూ ఒకే ఆకులో చదువుకున్నారు, ఈ రోజు ఇక మీ చదువులు కట్టిపెట్టండి మొదలైన నుడికారాలు తెలుగువాళ్ళు తాటాకులపై రాసుకున్నారనీ, వాటినే చదువుకున్నారనీ, చదవడం పూర్తయిన తరువాత తాటాకు గ్రంథాలను తాడుతో కట్టిపెట్టేవారనే విషయాలను ఈ నుడికారాలు తెలుపుతాయి. భిన్న భాషల్లోని నుడికారాల మధ్య కొంత సామ్యం కూడా ఉన్నప్పటికీ, సామ్యం కంటే భేదమే ఎక్కువగా ఉంటుంది. అందువల్ల వీటి అనువాదంలో సమస్యలు తలెత్తుతాయి. నుడికారాలను ఒక భాషనుంచి మరో భాషలోకి అనువదించే పద్ధతులను గురించి Eugene A. Nida, బోలానాథ్ తివారీ లాంటి అనువాద వేత్తలు తమ అనువాద సిద్ధాంత గ్రంథాల్లో తెలిపారు. వీరు తెలిపిన అనువాద పద్ధతుల నేపథ్యంలో, తెలుగు కథల్లోని నుడికారాలను ఇంగ్లీషు, హిందీ భాషల్లోకి అనువదించడంలో ఆ యా అనువాదకులు అనుసరించిన పద్థతులను సోదాహరణంగా వివరించడమే ఈ వ్యాసం ఉద్దేశం.

Keywords: నుడికారం, అనువాదం, భాషాంతరీకరణ, కథలు, భుజంగరెడ్డి.

1. నుడికారం నిర్వచనాలు, వివరణ:

విడివిడి పదాల సమాహార అర్థం కంటే భిన్నమైన సమాహార అర్థాన్ని ఇచ్చే పదబంధాన్ని (phrase) నుడికారం లేదా జాతీయం అంటారు. దీన్నే 'పలుకుబడి', 'పదబంధం' అని కూడా అంటారు. ఉదాహరణకు, ‘‘నిన్ను చూస్తే వాడు కళ్ళలో కారం పోసుకుంటాడు.’’ అనే వాక్యానికి, నిన్ను చూస్తే వాడు నిజంగా కళ్ళలో కారం పొడి చల్లుకుంటాడని అర్థంకాదు. మండి పడతాడు, అసూయపడతాడు అని అర్థం. ఇలా విడివిడి పదాల అర్థం కంటే భిన్నమైన అర్థాన్నిచ్చే నుడికారాలు వక్త చెప్పదలుచుకున్న భావాన్ని శ్రోత మనస్సులో హత్తుకునేలా చెప్పడానికి ఉపయోగపడతాయి. ఇలాంటి పదబంధాలనే ఇంగ్లీషులో Idioms అనీ, హిందీలో 'ముహావరా' అనీ అంటారు.

"సామాన్యంగా విడివిడి పొడి మాటలుగా ఉన్నవే అపూర్వసమ్మేళనంతో, ఆ మాటలకు విడివిడిగా దేనికీ లేని ఏదో ఒక అపూర్వ భావ వ్యక్తీకరణకు మూలమైన విశిష్ట పదబంధాలుగా భాషలో నిలిచిపోతున్నాయి." అని పదబంధాలను 'పదబంధ పారిజాతం'లో వివరించారు. (వెంకటేశ్వరరావు 1959: పుట 5)

ఒంటరిగానున్న ఒక పదమున కనబడని సొగసు అది పదాంతంలో చేరి జత కట్టినప్పుడు ఇట్టే తళక్కుమని తోచును. దాని వలన ఆ సందర్భమునకే ఒక వింత సొబగు చేకూరును. ఇవియే పదబంధములు" అని 'ఆంధ్ర శబ్దరత్నాకరం'లో పదబంధాలను నిర్వచించారు (రంగాచార్యులు 1966: పుట 4).

పదబంధ పారిజాత నిర్వచనంలోని "అపూర్వ భావవ్యక్తీకరణ", ఆంధ్రశబ్దరత్నాకర నిర్వచనంలోని "వింత సొబగు చేకూరును" అనేవి పదబంధాల లేదా నుడికారాల ప్రయోజనాన్ని తెలుపుతున్నాయి.

'Aspects of Language' అన్న ఆంగ్ల గ్రంథంలో “విడి విడి పదాల అర్థాన్ని కలిపితే వచ్చేఅర్థం కంటె భిన్నమైన అర్థం వచ్చే పదాల సమూహమే నుడికారం” అని 'Idiom' ని నిర్వచించారు (Bolinger 1975).

ఇలాంటి నుడికారాలు ప్రతి భాషలోనూ ఉంటాయి. కానీ, ఇవి ప్రతి భాషకి విలక్షణంగా ఉంటాయి. అయినప్పటికీ, మానవులందరి అనుభూతుల్లో సామ్యం ఉన్నట్లే వివిధ భాషల నుడికారాలమధ్య కూడా కొంత సామ్యం ఉంటుంది. భిన్న భాషల నుడికారాల ప్రయోగంలో సామ్యం కంటే విలక్షణతే ఎక్కువగా ఉండడం వల్ల అనువాదంలో ఇవి సమస్యలు అవుతాయి. కొన్నిసార్లు వాటిని అనువదించడం అసాధ్యమై దాని భావాన్ని మరో భాషలో మామూలు మాటల్లో చెప్పాల్సివస్తుంది.

అందుకే Nida, "ఒక భాషలోని నుడికారానికీ మరో భాషలోని నుడికారానికీ రూపంలో పోలికవుండదు. అందువల్ల ఈ నుడికారాల అనువాదంలో అర్థపరమైన సర్దుబాట్లు చెయ్యవలసి వస్తుంది." అని అన్నారు (Nida 1964: 106).

2. నుడికారాల అనువాదపద్ధతులు:

ఈయన నుడికారాల అనువాదంలో అనుసరించదగిన మూడు పద్ధతులను తెలిపారు. అవి: 1. మూలభాషలోని నుడికారాలను లక్ష్య భాషలో వివరణాత్మకంగా అనువదించడం. 2. మూల భాషలోని నుడికారాలను లక్ష్య భాషలో కూడా నుడికారాలుగానే అనువదించడం. 3. మూల భాషలో వివరణాత్మకంగా ఉన్న మాటలను లక్ష్య భాషలో నుడికారాలుగా అనువదించడం (Nida 1964: 106). నుడికారాన్ని నుడికారంగా అనువదించడం అంత సులభం కాదు. ఎందుకంటే, ఒక భాషలోని నుడికారాలకు శబ్దపరంగానూ, అర్థపరంగానూ సమానమైన నుడికారాలు మరో భాషలో అన్నిసందర్భాల్లోనూ ఉండవు గాబట్టి. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించుకోవడానికి అనుసరించదగిన నాలుగు పద్ధతులను ‘'అనువాద్ విజ్ఞాన్” అన్న గ్రంథంలో భోలానాథ్ తివారీ సూచించారు (తివారీ 1995: 105-115). అవి:

i. మూల భాషలోని నుడికారానికి శబ్దపరంగానూ, అర్థపరంగానూ సమానమైన నుడికారంగా అనువదించడం.

ఉదా: అగ్నికి ఆజ్యం పోయడం = Add fuel into the fire = జల్తే ఆగ్ మే ఘీ డాల్నా

ii. మూల భాషలోని నుడికారాన్ని శబ్దపరంగా వేరుగా ఉన్నా, భావపరంగా సమానమైన నుడికారంగా
అనువదించడం.

ఉదా: మూన్నాళ్ళ ముచ్చట = Nine days wonder = చార్ దిన్ కీ చాందినీ

iii. నూతన నుడికారాన్ని సృష్టించడం.

మూల భాషలోని నుడికారానికి సమానమైన నుడికారాన్నిలక్ష్య భాషలో పైన తెలిపిన పద్ధతుల్లో వాడడం సాధ్యం కానప్పుడు మాత్రమే లక్ష్య భాషలో నూతన నుడికారాన్ని సృష్టించాలని తివారీగారు అంటారు. అబ్బూరి ఛాయాదేవి రచించిన ‘సుఖాంతం’, పి. సత్యవతి రచించిన ‘ఇల్లలకగానే’, ఓల్గా రచించిన ‘తోడు’ అనే తెలుగు కథల ఇంగ్లీషు, హిందీ అనువాదాల్లో అనువాదకులు అనుసరించిన నుడికారాల అనువాద పద్ధతులను ఇప్పుడు పరిశీలిద్దాం.

2.1 నుడికారాలను వివరణాత్మకంగా అనువదించడం:

i. పిల్లలు వాళ్ళ సంసారాలు వాళ్ళు చేసుకుంటున్నారుకదా అని నిశ్చింతగా వూరుకుందామంటే కడుపుతీపి. (సుఖాంతం: 190)

అబ్ బచ్చే బడే హోగయే, సబ్ కే అప్నే - అప్నే పరివార్ భీ హో గయే, మై నిశ్చింత్ హో జాఊంగీ. పర్ మమత ఔర్ మోహ్ కా యహ్ బంధన్ ఛూట్తా నహీఁ| (సుఖాంత్-1: 187)

యహ్ సోచ్కర్ నిశ్చింత్ రహనే కా ప్రయత్న్ కరూఁ  కి చలో, బచ్చే అప్నీ అప్నీ గృహస్థీ సంభాలే హుయే హైఁ, తో సంతాన్ కా మోహ్ ఆడే ఆతా హై | (సుఖాంత్-2: 120)

(రాయప్రోలు శ్రీనివాస్, కల్లూరి శ్యామలగార్లు ఈ నుడికారాన్ని ఇంగ్లీషులో అనువదించకుండా వదిలేశారు.)

ii. జీవితామంతా నిద్రకోసం మొహం వాచినట్టు అనిపిస్తోంది. (సుఖాంతం : 190)

All my life seems to be lying in wait for this sleep. (Happy Ending-1: 62)

All my life I longed only for sleep, it appears so now. (Happy Ending-2: 57)

జిందగీ భర్ నీంద్ కే లియే తరస్తీ రహీ| (సుఖాంత్-1: 187)

జీవన్ భర్ నీంద్ కే లియే తరస్తీ రహీ హూఁ| (సుఖాంత్-2: 120)

 

iii. ఈ విధంగా ఆమె జీవితం మూడు అలుకుగుడ్డలూ, ఆరు ముగ్గుబుట్టలుగా సాగిపోతూవచ్చింది. (ఇల్లలకగానే: 25)

That's how her life was going on, with a sumptuous and ceaseless supply of daubing cloths and muggu baskets. (What is my name: 152)

ఇస్ తరహా ఉస్కీ జీవన్ పోంఛ్నోం ఔర్ రంగోలీకీ పిటారియోం సే భరా - పూరా రహా| (మై కౌన్ హూఁ : 46)

ఇస్ తరహా ఉస్కీ జీవన్ రంగోలియోంకే  ఇంద్రధనుషీ రంగోం మే సమాహిత్ హో గయా| (పహచాన్: 51)


పైన పేర్కొన్న i, ii, iii ఉదాహరణల్లో, తెలుగు భాషలోని నుడికారాలను (ఇంగ్లీషు, హిందీ భాషల్లో సమానమైన నుడికారాలు లేకపోవడంవల్ల) అనువాదకులు లక్ష్యభాషలో వివరణాత్మకంగా అనువదించడం చూడవచ్చు.

మొదటి ఉదాహరణలో, తెలుగులోని 'కడుపు తీపి' అనే నుడికారాన్ని హిందీ అనువాదకులిద్దరూ క్రమంగా "మమతా ఔర్ మోహ్ కా యహ్ బంధన్" అనీ, “సంతాన్ కా మోహ్" అనీ వ్యాఖ్యాన ప్రాయంగా అనువదించారు. అయినప్పటికీ, ఈ రెండు అనువాదాలూ మూలంలోని భావాన్ని బాగానే వ్యక్తంచేస్తున్నాయి. ఇంగ్లీషు అనువాదకులిద్దరూ ఈ నుడికారాన్నిఅనువదించకుండా వదిలేశారు. దీని వల్ల ఆంగ్లానువాదాల్లో అర్థనష్టం జరిగింది.

రెండో ఉదాహరణలో, "మొహం వాచినట్టు" అనే తెలుగు నుడికారాన్ని ఇంగ్లీషులో to be lying in wait for this sleep అనీ, I longed only for this sleep అని అనువదించారు. ఈ రెండింటిలో రెండో అనువాదమే మూలపాఠంలోని భావాన్ని సరిగా వెల్లడిస్తున్నది. హిందీ అనువాదకులిద్దరూ నీంద్ కే లియే తరస్తీ రహీ” అని వివరణాత్మకంగా అనువదించారు. ఇవి తెలుగులోని భావాన్ని బాగానే వెల్లడిస్తున్నాయి.

మూడో ఉదాహరణలో, తెలుగులోని ‘మూడు అలుకుగుడ్డలూ- ఆరు ముగ్గుబుట్టలుగా' ('మూడు పువ్వులు ఆరు కాయలు'గా అనే నుడికారం ఆధారంగా ఈ నుడికారాన్ని రచయిత్రి సృష్టించింది) అనే నుడికారాన్ని ఇంగ్లీషు అనువాదంలోనూ, ’’మై కౌన్ హూఁ‘‘ అనువాదంలోనూ ఆమె జీవితం అలుకుగుడ్డలూ, ముగ్గు బుట్టలతో నిండిపోయింది అనే అర్థం వచ్చేలాగా అనువదించారు. 'పహచాన్' అనే అనువాదంలో ఆమె జీవితం ముగ్గుల రంగుల్లో కలిసిపోయిందని అనువదించారు. మొత్తంమీద మూడు అనువాదాలు తెలుగు నుడికారంలోని భావాన్ని కొంతవరకు బాగానే వ్యక్తంచేస్తున్నాయి.

2.2 నుడికారాలను నుడికారాలుగానే అనువదించడం.

నుడికారాలను నుడికారాలుగా అనువదించడంలో భోలానాథ్ తివారీ తెలిపిన నాలుగు పద్ధతులను కూడా ఇక్కడే పరిశీలిద్దాం.

a) మూల భాషలోని నుడికారాన్ని – శబ్దపరంగా, అర్థపరంగా సమానమైన నుడికారంగా అనువదించడం.

i. "నువ్వు ఇల్లు అలకడంలో నేర్పరివి. ముగ్గులు వెయ్యడంలో అంతకన్నా నేర్పరివి. సెబాష్ కీప్ ఇట్ అప్’’ అని మెచ్చుకొని భుజం తట్టాడు. (ఇల్లలకగానే: పుట 25)

well done! keep it up saying it in English once again he praised her, giving her a pat on the shoulder. (What is my name: 154)

శాబాశ్ ! కీప్ ఇట్ అప్   | ఔర్ అంగ్రేజి మే భి ఏక్ బార్ ఔర్ ప్రశంసా కర్ కే ఉస్ కా కంధా థప్ థపాయా| (మై కౌన్ హూ: 46)

శాబాశ్ ! కీప్ ఇట్ అప్ | కహతే హుఏ అంగ్రేజి మే భీ ప్రశంసా కర్ దేతా| (పహచాన్: 51)

 

ii. అస్తమానం ఏడువు ముఖంతో కూచునే తనను కోడళ్లు ఎంతకాలమని ఆదరంగా, ప్రేమగా చూడగలరు. (తోడు: 3)

How long would the daughters-in-law treat with regard and affection a person who always has a woebegone face? (Companionship: 71)

రుఆఁసా ముహ్  లేకర్ బైటే  రహనే పర్ బహుఏఁ  భీ కబ్ తక్ ఆదర్ ఔర్ ప్రేమ్ జతా సక్తీ  హై| (సహారా: 107)

 

iii. కొడుకులూ, కోడళ్ళూ ముఖాలు మాడ్చుకున్నారు. (తోడు: 10)

Her sons and daughters-in-law made a face. (Companionship: 79)

లడ్కే   ఔర్ బహుఏఁ  అధిక్ నిరాశ్ హుఏ| (సహారా: 111)


b). మూలభాషలోని నుడికారాన్ని భావవరంగా సమానమైన నుడికారంగా అనువదించడం.


i. కొంపలు మునిగిపోతున్నట్లు మొహం మీద నీళ్ళు జల్లి మరీలేపేది. (సుఖాంతం : 187)

....mother again rudely forcing me into consciousness as if the world was coming to an end. (Happy Ending-1 : 62) .

My mother used to put water on my face to wake me up. (Happy Ending -2:54 )

న మాలూమ్ ఇత్ నీ జల్దీ క్యా థీ, మేరే ముఁహ్ పర్ పానీ ఛిడక్ కర్ మాముఝే  ఉఠా దేతీ థీ | (సుఖాంత్-1: 184 )

ముహ్  పర్ పానీ ఛిడక్ కర్ మాఁ ఏ సే జగాతీ తీ జైసే ఘర్మే ఆగ్ లగీ హో| (సుఖాంత్-2 : 118)


ii. వెధవ కోడి కునుకులు నా కొద్దు - మనిషి నిద్రకావాలి. (సుఖాంతం : 190)

Not these catnaps and snoozes for me. I want real deep sleep for once. (Happy Ending -1: 62)

I don't want light sleep that I normally get these days! I must sleep like a human being and not like a cock. (Happy Ending -2:57)

ముర్గీ కీ తరహ అధ్ ఖులీ ఆఁఖోంసే అధూరీ నీంద్ సే మేరా జీ నహీఁ భరేగా| (సుఖాంత్-1: 187)

శ్వాన్ నిద్రా ముఝే  నహీఁ చాహిఏ| మనుష్యు, కీ నీంద్ చాహిఏ| (సుఖాంత్-2 : 121)

 

iii. విజయలక్ష్మి తలుపు తీసి, గంగాధరాన్ని చూసి చేటంత ముఖంచేసుకుంది. (తోడు: 13)

Vijayalakshmi open the door, looked at him with a broad smile on her face (Companionship:63)

దర్వాజా ఖోల్, గంగాధరమ్ కో దేఖ్తే హీ విజయలక్ష్మీ కీ బాఛే ఖిల్ గయీ| (సహారా : 114)

మొదటి ఉదాహరణలో, ‘కొంపలు మునిగిపోతున్నట్లు’ అన్నతెలుగు నుడికారాన్ని ఇంగ్లీషు అనువాదం-1లో as if the world was coming to an end అని భావపరంగా సమానమైన నుడికారంగా అనువదించగా, ఇంగ్లీషు అనువాదం-2లో ఈ నుడికారాన్ని అనువదించకుండా వదిలేశారు. దీనివల్ల అనువాదంలో అర్థనష్టం జరిగింది.

రెండో ఉదాహరణలో, తెలుగులోని 'కోడికునుకులు' అనే నుడికారాన్ని ఇంగ్లీషులో catnaps and snoozes అనీ, హిందీ అనువాదం-2లో 'శ్వాన్ నిద్రా' అనీ భావపరంగా సమానమైన నుడికారాలుగా అనువదించగా, ఆంగ్లానువాదం-2లో light sleep అని మామూలు మాటల్లో అనువదించారు. హిందీఅనువాదం-1లో శబ్దానువాదంచేశారు.

మూడో ఉదాహరణలో, తెలుగులోని 'చేటంత ముఖం చేసుకుంది' అనే నుడికారాన్ని హిందీలో 'బాచే ఖిల్ గయీ' అని భావపరంగా సమానమైన నుడికారంగా అనువదించారు. ‘ఆమె సెలవులు వికసించాయి’ అని ఈ నుడికారానికి వాచ్యార్థం. ‘ఆమె ముఖం వికసించింది’ అని నుడికారార్థం. ఇంగ్లీషులో మామూలు మాటల్లోఅనువదించారు. దీనివల్ల మూలపాఠంలోని అర్థం తెలుస్తుందిగాని సమానమైన అనుభూతి కలగడం లేదు.

C) మూల భాషలోని నుడికారాన్ని లక్ష్య భాషలో శబ్దానువాదంచేయడం.

1. …. ఓ చిన్నవాడు ఆ అమ్మాయి మెడలో మూడుముళ్ళు వేసి, ఓఇంటికి ఇల్లాల్ని చేసి, 'ఇదిగో అమ్మడూ ఈ ఇల్లు నీది' అని చెప్పేడు. (ఇల్లలకగానే: 25)

.....a young man tied the three sacred knots around her neck, made her the housewife to a house ..... (What is my name : 154)

ఏక్ నవ్ యువక్ నే ఉస్ లడ్కీ కే గలే మే మంగల్ సూత్ర్ ధారణ్ కరా కర్ ఉసే ఏక్ ఘర్ కీ గృహిణీ బనాయా ఔర్...... (మై కౌన్ హూఁ :46)

ఏక్ యువక్ నే ఉస్ కే గలే మే మంగల్ సూత్ర్  పహనాయా| (పహచాన్ : 51)

 

ii. విజయలక్ష్మి చేతి వంట తింటుంటే, గంగాధరానికి చచ్చిన జిహ్వ బతికొచ్చింది. (తోడు: 8)

As he was eating the food Vijayalakshmi prepared, his dead taste buds came back alive. (Companionship :77)

విజయలక్ష్మీ కే  హాత్ కా బనా భోజన్ కర్తే సమయ్ గంగాధరమ్ కీ జిహ్వా పర్ ఖోయా హుఆ స్వాద్ లౌట్ అయా| (సహారా : 110)

పైన తెలిపిన మొదటి ఉదాహరణలో, ‘మూడుముళ్ళు వేసాడు’ అన్న తెలుగు నుడికారాన్ని ఇంగ్లీషులో tied the three sacred knots అని కొద్దిపాటి మార్పుతో శబ్దానువాదం చేశారు. హిందీలో ‘మంగల్ సూత్ర ధారణా కరా కర్’ అనీ, ‘మంగల్ సూత్ర పహనాయా’ అనీ వివరణాత్మకంగా అనువదించారు.

రెండో ఉదాహరణలో, తెలుగులోని ‘చచ్చిన జిహ్వ బతికొచ్చింది’ అన్ననుడికారాన్ని, ఇంగ్లీషులో dead taste buds came back alive అనీ, హిందీలో 'జిహ్వ పర్ఖోయా హువా స్వాద్ లౌట్ ఆయా" అనీ శాబ్దానువాదం చేశారు. అయితే హిందీ అనువాదంలో ‘చచ్చిన’ అనే పదాన్ని ‘ఖోయా హుఆ’ (పోయిన) అని మార్చి అనువదించారు.

d) మూల భాషలోని నుడికారానికి భావపరంగా సమానమైన నుడికారాన్ని లక్ష్య భాషలోసృష్టించడం.

ఒక్క నూతన నుడికారాన్ని కూడా అనువాదకులు సృష్టించలేదు.

2.3 మూల భాషలోని మామూలు మాటలను లక్ష్య భాషలోనుడికారంగా అనువదించడం.

i. సెలవుల్లో పత్రికలు, నవలలూ చదువుతుంటే టైముతెలిసేది కాదు. “పడుకొనే - అర్థరాత్రిదాకా ఏమిటా చదువు" అని కేకలేసేది అమ్మ. (సుఖాంతం : 187)

So many books and mags to read. I would be burning the midnight oil over these junk, reading till my mother would shout (Happy Ending - 1:59)

I again used to read magazines and papers to get sleep till late in the night. (Happy Ending-2: 54)

....లేకిన్ చుట్టియోం మే పత్రికాయేఁ ఔర్ ఉపన్యాస్ పఢ్ నే మే పతా తక్ నహీఁ చల్తా థా కీ వక్త్ కైసే గుజర్ జాతా హై కీ మా తో ముఝే  “బరాబర్" డాంట్తీ థీ "అబ్ సో జాఓ బేటీ | ఆధీ రాత్ తక్ క్యా పఢాఈ కర్ రహీహై? (సుఖాంత్1: 184)

చుట్టియోం మే పత్రికాయే  ఔర్ ఉపన్యాస్ పఢ్తీ తో సమయ్ కా పతా హీ నహీఁ చల్తా! "అబ్ సో భీ జాఓ- ఆధీ రాత్ బీత్ చుకీ హై" మా చిల్లాతీ| (సుఖాంత్-2: 119)

 

ii. కబుర్లు, నవ్వులు, చర్చలు, సమావేశాలు-హాటలంతా కోలాహలంగా ఉంది. (తోడు: 2)

Conversation, laughter, disscussions, meetings --the hotel was full of excitement....
(Companionship: 69)

హడ్-బడ్ హో-హా హుల్లా-గుల్లా, కిల్ కారియాఁ, హసీ-మజాక్ కా ఆలమ్ పూరే హోటల్ మే రాజ్ కర్ రహా థా| (సహారా: 106)

పైన ఇచ్చిన మొదటి ఉదాహరణలో, ఆంగ్లానువాదం-1లో burning of the midnight oil అనే నుడికారం, రెండో ఉదాహరణలో, హిందీ అనువాదంలో 'రాజ్ కర్ రహా రా' అనే నుడికారం మూల భాషాపాఠంలో లేవు.

3. ముగింపు:

మూల కథల్లోని నుడికారాలన్నింటినీ ఇంగ్లీషు హిందీ భాషల్లో అనువదించిన పద్ధతులను
గమనిస్తే ఈ కింది విషయాలు తెలుస్తాయి.

1. తెలుగులోని నుడికారాలను ఇంగ్లీషులో ఎక్కువగా వివరణాత్మకంగా అనువదించగా, హిందీలో చాలా వరకూ నుడికారాలుగానే అనువదించారు.

2. తెలుగులోని నుడికారాలను ఇంగ్లీషు, హిందీ భాషల్లో నుడికారాలుగానే అనువదించిన వాటిలో శబ్దపరంగా వేరుగా ఉన్నా, భావపరంగా సమానమైన నుడికారాలుగా అనువదించినవే ఎక్కువగా ఉన్నాయి.

శబ్దపరంగానూ, అర్థపరంగానూ సమానమైన నుడికారాలుగా అనువదించినవీ, శబ్దానువాదం చేసినవీ తక్కువగా కనిపిస్తాయి. నూతనంగా సృష్టించిన నుడికారాలు అసలు లేవు.

నుడికారాలను అనువదించేటప్పుడు పాటించేవివిధ అనువాద పద్ధతులను అనుసరించడంలో ఈ కింది ప్రాధాన్య వివక్షను పాటిస్తే బాగుంటుందని తివారీ సూచించారు (తివారీ 1995: 105-115).

మూల భాషలోని నుడికారాన్ని లక్ష్య భాషలో శబ్దపరంగానూ, అర్థపరంగానూ సమానమైన నుడికారంగా అనువదించాలి. ఇది సాధ్యం కానప్పుడు, మూల భాషలోని నుడికారాన్ని శబ్దపరంగావేరైనా, భావపరంగా సమానమైన నుడికారంగా అనువదించాలి. ఈ రెండు పద్ధతులూ సాధ్యంకానప్పుడు మూల భాషా నుడికారాన్ని లక్ష్య భాషలో శబ్దానువాదం చెయ్యాలి. ఈ విధంగా శబ్దానువాదం చేసేటప్పుడు అది లక్ష్య భాషలో హాస్యాస్పదంగానూ, అర్థరహితంగానూ, అపార్థానికి తావిచ్చే విధంగానూ ఉండకుండా జాగ్రత్త పడాలి.

ఉదా: ‘వాడికి నోట్లో నాలుక లేదు’ అన్న నుడికారాన్ని He does not have tongue in his mouth అని అనువదిస్తే హాస్యాస్పదంగా ఉంటుంది. శబ్దానువాదంచేస్తే హాస్యాస్పదంగా ఉండే అవకాశమున్నప్పుడు మూల భాషలోని నుడికారానికి సమానార్థమైన నుడికారాన్ని లక్ష్య భాషలో సృష్టించి వాడాలి. ఇలా సృష్టించి వాడినప్పుడు మూల భాషాపాఠకులకు అర్థమయ్యేదిగానూ, అర్థవంతంగానూ ఉండేట్లు చూసుకోవాలి. ఈ పద్ధతి కూడా సాధ్యం కానప్పుడు మూల భాషలోని నుడికారం తెలిపే భావాన్ని లక్ష్య భాషలో వివరణాత్మకంగా అనువదించాలి. అంతేగాని మూల భాషలోని నుడికారాన్ని అసలు అనువదించకుండా వదిలివేయకూడదు. అలా వదిలేస్తే లక్ష్య భాషలో అర్థనష్టం జరుగుతుంది. ఒక్కొక్కసారి దీని వల్ల మొత్తం పాఠానికే నష్టం వాటిల్లవచ్చు.

సృజనాత్మక సాహిత్యానికి నుడికారాలు జీవనాడిలాంటివి. అవి పాఠకులను ప్రభావితం చేసే తీరువల్ల కథకు సాహిత్య విలువలు పెరుగుతాయి. కాబట్టి నైడా, తివారీ పేర్కొన్న విధంగా నుడికారాలను ఏదో ఒక పద్ధతిలోలక్ష్య భాషా పాఠకులకు అందజేయడంలో అనువాదకులు జాగ్రత్త వహిస్తే బాగుంటుంది.

4. ఉపయుక్తగ్రంథసూచి:

తెలుగు గ్రంథాలు

  1. ఓల్గా, 1995.‘‘తోడు’’ ప్రయోగం: రాజకీయ కథలు - 2,  హైదరాబాద్: మానవి ప్రచురణలు
  2. ఛాయాదేవి, అబ్బూరి. 1993. (తృ. ము) “సుఖాంతం” కథాభారతి: తెలుగు కథానికలు.  న్యూఢిల్లీ: నేషనల్ బుక్ ట్రస్ట్
  3. రంగాచార్యులు, చెలమచెర్ల. 1966. ఆంధ్ర శబ్దరత్నాకరం.
  4. వెంకటేశ్వరరావు, నార్ల et. al. 1959. పదబంధ పారిజాతం. హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ
  5. సత్యవతి, పి. 1998. “ఇల్లలకగానే " ఇల్లలకగానే..... సత్యవతి కథలు. హైదరాబాద్: రచయిత్రి

హిందీ గ్రంథాలు

  1. తివారీ, భోలానాథ్  అనువాద్ విజ్ఞాన్. దిల్లీ: శబ్దకార్ (ప్రకాశక్). 1995.
  2. పాండురంగారావు, ఇలపావులూరి. ‘‘సుఖాంత్’’ తెలుగు కహాఁనియాఁ. సంపా. పురాణం సుబ్రహ్మణ్య శర్మ. దిల్లీ: నేషనల్ బుక్ ట్రస్ట్
  3. రెడ్డి, జె.ఎల్.  ‘‘సుఖాంత్’’ భాషా. జూలై-ఆగస్త్ 1997
  4. రెడ్డి, జె. ఎల్.  “మై కౌన్ హూఁ’’ సమకాలీన్ భారతీయ సాహిత్య్ . నఈ దిల్లీ: సాహిత్య అకాడమీ. జులై - సితంబర్, 1995
  5. విజయరాఘవరెడ్డి, పి. “సహారా’’ అనువాద్. నఈ దిల్లీ: భారతీయ్ అనువాద్ పరిషద్ జనవరి-జూన్,1995
  6. శ్రీదేవి, ఎల్. “పహచాన్’’ సమకాలీన్ భారతీయ సాహిత్య్. నఈ దిల్లీ: సాహిత్య అకాడమీ, సితంబర్ – అక్తూబర్, 1999

ఆంగ్ల గ్రంథాలు

  1. Nida, Eugene A. and Charles R. Taber. 1974 edition. The Theory and Practice of Translation. Leiden: E.J. Brill (First edition 1969)

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]