headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-08 | July 2023 | ISSN: 2583-4797

2. రావూరి ‘కాదంబరి’ నవల: విభిన్నపీడితుల ఆక్రందన

dr_mm_vinodini
డా. ఎం. ఎం. వినోదిని

అసోసియేట్ ప్రొఫెసర్,
తెలుగుశాఖ, యోగి వేమన విశ్వవిద్యాలయం,
కడప, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9440456087. Email: mmvinodini@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

తెలుగు సాహిత్యంలో “జ్ఞానపీఠ అవార్డు” పొందిన మూడవ వ్యక్తి రావూరి భరద్వాజ. 2012 సంవత్సరంలో ‘పాకుడురాళ్ళు’ నవలకు ఈ పురస్కారం పొందారు. తన అసమానప్రతిభతో విశేషమైన సాహిత్యసృజన చేశారు. భరద్వాజ పేదరికం నించి ఎదిగి వచ్చిన రచయిత. మధ్యతరగతి ప్రజలు, పేదలు, సామాన్యులు, పీడితులు, దళితులు, స్త్రీలు వీరి సాహిత్యంలో ప్రధాన పాత్రలు. ప్రస్తుత నవల ‘కాదంబరి’ కూడా అటువంటి నవల. రామకృష్ణయ్య, ఆయన కూతురు కౌముది పాత్రల నేపథ్యంలో పేదరికం, స్త్రీ స్వేచ్ఛ, దళితుల భూమి సమస్య, ప్రభుత్వ వ్యవస్థల పని తీరు, రాజకీయ వ్యవస్థల పనితీరు వంటి అనేక విషయాలను చర్చించిన నవల ఇది. స్త్రీల స్వేచ్ఛ, దళితుల భూమి సమస్య, వాటి చుట్టూ ఉన్న రాజకీయాలను లోతుగా చర్చించిన నవల ఇది. ఈ నవలలో ప్రధానపాత్రలు, వారు వ్యవహరించిన తీరు, రచయిత ఆ పాత్రలను మలిచిన తీరు, ఆయా పాత్రల ద్వారా చర్చించిన సమకాలీనసామాజిక, రాజకీయాంశాలను గురించి విశ్లేషించడం ఈ వ్యాసం ప్రధానోద్దేశం.

Keywords: రావూరి భరద్వాజ, జ్ఞానపీఠ అవార్డు, కాదంబరి నవల, పాకుడురాళ్ళు, తెలుగు నవల దళిత సమస్య, స్త్రీ వాదం, స్త్రీ స్వేచ్ఛ రాళ్ళు

1. ఉపోద్ఘాతం:

తెలుగు సాహిత్య వేదిక మీద ఎంతో కాలం మసక మసకగా కనిపించిన పేరు రావూరి భరద్వాజ. భరద్వాజ 500 పైగా కథలు, 37 కథా సంపుటాలు, 19 నవలలు రాశారు. కథ, నవల, బాలసాహిత్యం, సాహిత్య పరామర్శ, అపరాద పరిశోధన వంటి అనేక ప్రక్రియలలో సాహిత్య సృజన చేశారు. ఎంత విస్తృతంగా సాహిత్య సృజన చేసినా తెలుగు సాహిత్యంలో ఆయనకు అంత పెద్ద గుర్తింపు ఏమీ దక్కలేదు. దానికి కారణం లేకపోలేదు. ఒక పక్క సమాజపు ఆలోచనలు మార్చే ఎంతో సీరియస్ రచనలు చేస్తూనే మరొక పక్క, సాధారణపాఠకులను అలరించే కమర్షియల్‌ రచనలు చేశారనే అపవాదు ఆయన మీద ఉండేది. ఈ కమర్షియల్ రచనల వలన ఆయన రాసిన గొప్ప రచనలు కూడా మసకబారాయని సాహితీవేత్తల అభిప్రాయం.

రావూరి భరద్వాజ “పాకుడు రాళ్ళు” నవలకు గాను 2012 సంవత్సరానికి జ్ఞానపీఠ అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు తర్వాత ఆయన మళ్ళీ వెలుగులోకి వచ్చారు. ‘జ్ఞానపీఠ’ అందుకున్న తర్వాత వారి సాహిత్యాన్ని ‘రీరీడింగ్‌’ (తిరిగి చదువుకోవడం) చేయడం మొదలైంది. రావూరి భరద్వాజ రచనలలోని వస్తువులు పరిశీలిస్తే, ప్రతికథావస్తువు ఒక సామాజికబాధ్యతతో ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. రావూరి భరద్వాజ మీద చలం ప్రభావం ఉంది. అందుకే, ఎక్కువ కథలు, నవలలు స్త్రీల దృష్టికోణం నించి రాసినట్టు కనిపిస్తుంది. ముఖ్యంగా గ్లామర్‌ రంగం అయిన సినిమా రంగంలోకి స్త్రీలు వెళ్ళడం, అక్కడ వాళ్ళు ఎదురొన్న పరిస్థితులను చెప్పే, స్త్రీ పట్ల కన్సర్న్‌ తో రచనలు చేసినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం నేను ఆయన రాసిన కాదంబరి నవలను విశ్లేషణ చేస్తున్నాను. రావూరి భరద్వాజ నవలలు, కథలు తిరిగి చదువుకోవడం వల్ల ఆయనెంత ఆధునికుడు, ఎంత కొత్త వస్తువులు ఎన్నుకున్నాడు, ఎంత కొత్త దృక్పథంతో రాశాడు అనేది పాఠకులకు తెలుస్తోంది. అటువంటి ఎంతో ఆధునిక దృష్టితో రాసిన రచనల్లో ఒక నవల భరద్వాజ ‘కాదంబరి’.

2. ‘కాదంబరి’ పరిచయం:

కాదంబరి నవల 1978లో వచ్చింది. ఈ నవల శీర్షిక గురించి ముందుమాటలో భరద్వాజ ఇలా రాసుకున్నారు:

‘‘బాణమహాకవి రచించిన ‘కాదంబరి’ సంస్కృతంలో వెలసిన తొలి వచనకథాకావ్య విశేషం. ‘ఆడకోయిల’, ‘గోరువంక’, ‘మద్యం’, ‘నవల’ మొదలైనవి దీని అర్థాలు. ‘మీ నవల వచన కావ్యంలాగా ఉంది. ఇందులోని ప్రతిపాత్ర ఒక్కొక్క రకమైన మాదకతతో జోగిసలాడిపోతూ ఉన్నది. పుస్తకానికి ‘కాదంబరి’ అన్న శీర్షక నుంచండి’ అని సలహా ఇచ్చినవారు డాక్టర్‌ రాఘవాచార్య’’  అని. కన్నడ భాషలో నవలా ప్రక్రియను ‘కాదంబరి’ అంటారు.

ఉత్తర భారతదేశాన్ని పరిపాలించిన హర్షుని (క్రీ. శ. 606 నుండి 647వరకు) ఆస్థానకవుల్లో ఒకడైన బాణభట్టు సంస్కృతంలో రచించిన కావ్యం పేరు కాదంబరి. ఇది తొలి గద్యకావ్యం. ఈ కావ్యం చదివితే సకల శబ్దార్ధజ్ఞానం పట్టుబడుతుందని సాహితీవేత్తల నమ్మకం. ఆ కావ్యం పేరునే ఈ నవలకు పెట్టుకునట్లుగా భరద్వాజ రాసుకున్న ముందుమాటను బట్టి తెలుస్తుంది.

3. కాదంబరి నవల - కథాంశం:

ఈ నవలలో కథాంశం ఒకటి కాదు. విభిన్న అంశాల కలబోత ఈ నవల. మొదటిది ఈ కథకు నాయకుడైన రామకృష్ణయ్య జీవితం! ఆయనతో ముడిపడి ఉన్న ఇతర జీవితాలు ఈ కథలో ముఖ్య పాత్రలు. రామకృష్ణయ్యది అత్యంత నిరుపేదకుటుంబం. మంచి జీవితాన్ని వెతుక్కుంటూ రామకృష్ణయ్య చిన్నపుడే ఇంటినుంచి పారిపోతాడు. బతకడం కోసం రకరకాల పనులు చేస్తాడు. అనేక రకాల ఉద్యోగాలు చేశాక, సినిమా హాల్లో బ్లాక్ టిక్కట్లు అమ్ముతూ కోటీశ్వరుడైన చంద్రశేఖరం దృష్టిలో పడతాడు. దానితో అతని జీవితం మారిపోతుంది. చంద్రశేఖరం తెలివైన వాడు. రామకృష్ణయ్యని చేరదీసి వ్యాపారం నేర్పించి, తన కూతుర్ని ఇచ్చి పెళ్ళి చేస్తాడు. పెళ్ళైన తరువాత రామకృష్ణయ్య సొంతంగా కలప వ్యాపారం చేసి, కోట్ల రూపాయలు సంపాదించి, వ్యాపారవేత్త గా ఎదుగుతాడు.

రెండవ అంశం - రామకృష్ణయ్య అంచెలంచెలుగా ఎదగడం, వ్యాపారంలో అత్యున్నత స్థాయికి వెళ్ళడం, రాజకీయాలలో ప్రవేశించడం. రామకృష్ణయ్య, ఉన్నట్టుండి ఒకరోజు తన వ్యాపారం మొత్తం కొడుక్కి అప్పగించేసి, 'మయూరాక్షి' నది మీద ప్రభుత్వం ఆనకట్ట కట్టాలంటూ పోరాటం మొదలు పెడతాడు. అధికార గణంలో ఎవరితో ఏ పని ఎలా చేయించుకోవాలో బాగా తెలిసిన రామకృష్ణయ్యకి, అన్ని పార్టీల నాయకులూ స్నేహితులే. రామకృష్ణయ్య ఎందుకు పోరాటం చేస్తున్నాడో తెలియకపోయినా, అతని మీద నమ్మకం ఉన్న వాళ్ళు, అతని పోరాటం లో వెనక నిలబడతారు.

మూడవది, రామకృష్ణయ్య కూతురు కథ! రామకృష్ణయ్య కూతురు కౌముదికి స్వేచ్చాయుత ఆధునికజీవితం జీవించడం ఇష్టం. రామకృష్ణయ్యకు కూతురంటే వల్లమాలిన ప్రేమ. 

నాలుగవ అంశం మయూరాక్షి ప్రాజెక్టు నిర్మాణం, దళితుల జీవితాలు. ఇలాంటి విభిన్నమైన వస్తువుల కలయికగా ఈ నవల కనిపిస్తుంది.

4. కాదంబరి నవల - ప్రధానపాత్రలు:

కాదంబరి నవలలో ప్రధాన పాత్రలు రామకృష్ణయ్య, ఆయన కూతురు కౌముది. ఇంకా జగన్నాథం, సీరాములు, ఎంకావ, శంకరం, వసంత్, నారాయణ స్వామి, చంద్రశేఖరం, సరస్వతి ఇలా చాలా పాత్రలు వున్నాయి. అయితే కథ ప్రథానంగా తండ్రి, కూతుర్ల దే. ఈ ఇద్దరి కేంద్రంగా రచయిత అనేక విషయాలను చెబుతూ కథ ముందుకు నడిపారు. 

4.1 రామకృష్ణయ్య:

రామకృష్ణయ్య గ్రామీణ నిరుపేద కుటుంబం నుండి పట్టణానికి వచ్చి అంచెలంచెలుగా ఎదిగి పెద్ద పెద్ద ఆస్తులు సంపాదిస్తాడు. అనేక వ్యాపారాలలో స్థిరపడతాడు. ధనవంతుల కుటుంబానికి చెందిన వికలాంగురాలైన సరస్వతిని పెళ్ళి చేసుకుంటాడు. అయినా ఆమె ఆస్తిని వద్దు అని అనుకుంటాడు. మయూరాక్షి ప్రాజక్టు నిర్మించడం కోసం నిర్మాణ పనులను అనేక రాజకీయ ఎత్తుగడలతో హస్తగతం చేసుకుంటాడు. తమ పిల్లలు వసంత, కౌముదిని అత్యంత స్వేచ్ఛతో పెంచుతాడు. కూతురు కౌముదిని తనతో కూర్చోబెట్టుకుని కలిసి మద్యం సేవించేటట్లుగా ఆమెని ప్రోత్సహిస్తాడు.

‘‘కూతురు గ్లాసును తనే నింపాడు. నింపాక వోగుక్కెడు పుచ్చుకొని గ్లాసును కూతురు కందించాడు’’ (కాదంబరి - పేజి 51)

కూతుర్ని ‘అరే’ అని సంభోదిస్తాడు. ఎవరితో అయినా ఆమె గురించి చెప్పేటప్పుడు ‘వాడు’ అని సంభోదిస్తాడు. అలా తమ పిల్లలకు గొప్ప లైంగిక స్వేచ్ఛని ఇచ్చాడని రామకృష్ణయ్య పాత్ర బట్టి తెలుస్తోంది.

‘‘మా వాడు ఏముండనో, ముతకనో ఉంచుకొన్నాడని’’ ఆ మద్య ఎవరో అన్నారు. నా కందులో తప్పేమి కనిపించలా. అలాగే కౌముది ఇంకెవరినో పూసుకు తిరుగుతున్నదని తెలిసినా నేనేమి అనుకోను! ఆ వయస్సులో ఉన్నవాళ్ళు, తప్పకుండా అలానే ప్రవర్తిస్తారు. అది సహజం. అలాకాకుండా, కచ్చడాలు బిగించుకున్నారనుకోండి, వారి ఆరోగ్యాన్ని గురించి మానసిక స్థితిని గురించీ మనం ఆలోచించాలి’’ (కాదంబరి - పేజి 132) అని అంటాడు.

  రామకృష్ణయ్య పాత్ర తన పేదరికాన్ని గురించి తానే చెప్పకునే రెండు, మూడు సందర్భాలలో మనకు రచయిత రావూరి భరద్వాజ గారి జీవితం కన్పిస్తుంది.

‘‘ఉన్నచోట తినకుండా, తిన్నచోట పడుకోకుండా, పక్షిలాగా పిడికెడు మెతుకుల కోసం, ఊళ్ళకు ఊళ్ళు తిరిగాను. ఒక్కటే లాగు, వొక్కటే చొక్కా, ఏ చెరువు దగ్గర్నో ముందుగా లాగు ఉతికి ఆరేసేవాణ్ని. అంత దాకా చొక్కాను గోచీగా పెట్టుకొని కూచునేవాణ్ని, లాగు ఆరిన తరువాత దాన్ని తొడుక్కునే వాణ్ని. చొక్కాను ఉతికి ఆరేసే వాణ్ని, ఇలా రెండు మూడు మాసాలపాటు గడిపాను.’’ (కాదంబరి - పేజి 40) అని రామకృష్ణయ్య చెపుతాడు. ఇంకా “కొంత కాలం ఒక ప్రెస్‌లో పనిచేశాను, హోటల్ లో పని చేశాను. కాఫీ, టీ లు అందించటంలోనే రోజంతా సరిపోయింది. రోజుకు పావలా ఇచ్చేవాళ్ళు. బేడా పెట్టి భోజనం చేసి మరో రెండణాలు సాదరు ఖర్చు పెట్టుకొనేవాడిని. ప్రెస్‌ అరుగుల మీద రీము అట్టలు పరుచుకొని పడుకొనేవాడిని’’. (కాదంబరి - పేజి 48 ) అని చెప్పారు. ఇదంతా రావూరి భరద్వాజ గారి జీవితమే!

భరద్వాజ తన అనుభంలోనించి తీసుకున్న ఎన్నో విషయాలను రామకృష్ణయ్య పాత్రకు అపాదించి చెప్పారేమో అనిపిస్తుంది. దాదాపు పదిహేను సంవత్సరాల వయసు నించే భరద్వాజ జీవన పోరాటం మొదలు పెట్టారు. కుటుంబ పరిస్థితులు బాగా లేని కారణంగా ఎన్నో పనులు చేశారు. బాల్యంలో వ్యవసాయ కూలీగాపని చేశారు. యవ్వనంలో ప్రింటింగ్ ప్రెస్సులో పని చేశారు. అనాధ శరణాలయంలో, పత్రికల్లో పని చేశారు. ఆయన జీవితమే ఆయన సాహిత్యానికి మార్గదర్శి గా పని చేసింది. రామకృష్ణయ్య లాంటి పాత్రల చిత్రణలో భరద్వాజ గారి జీవితానుభం కనిపిస్తుంది. రామకృష్ణయ్య అంతటి దుర్భర జీవితాన్ని అనుభవించాడు కాబట్టే సమాజం లో డబ్బుని, పరపతిని సంపాదించడంలో ఆనందాన్ని వెతుకుంటున్నట్లు తెలుస్తోంది.

4.2 కౌముది:

కౌముది రామకృష్ణయ్య కూతురు. స్వేచ్చాయుతమైన జీవితం జీవించే ఒక స్త్రీ పాత్ర. సమకాలీన ఆధునిక స్త్రీగా ఈమె పాత్రను మలిచారు రచయిత. ఈ నవల రాసే నాటికి తెలుగు సాహిత్యంలో స్త్రీ వాదం అంతగా ప్రాచుర్యంలో లేకపోయినా ఈమెను మనం ఒక స్త్రీ వాదిగా చూడవచ్చు.

కౌముది పాత్ర, సంప్రదాయాలకు భిన్నంగా అత్యాధునికంగా ఆలోచిస్తుంది. ఈ ఆధునిక సమాజంలో స్త్రీ పురుషులు ఇద్దరూ కలిసి జీవించే ‘సహజీవనం’ లేదా ‘లివింగ్‌ టు గెదర్‌’ - ‘లివింగ్‌ రిలేషన్‌ షిప్‌’ అని ఈనాడు పిలువబడుతున్న దానిని రావూరి భరద్వాజ కౌముది పాత్ర ద్వారా ఆనాడే చెప్పించారు.

“అదిగాక భార్యాభర్తలం కాకుండా కొంతకాలం కలిసి ఉంటే ఎలా ఉంటుందో కూడా చూదామన్న సరదా నాకున్నది. పెళ్ళి చేసుకున్నామనుకోండి మరింక జన్మలో ఆ సరదా తీరదు. అందుకోసం మరోజన్మ ఎత్తాలి. ఈ బాదరబందీ అంతా దేనికని ఈ జన్మలోనే దాన్ని కానిచ్చేశాం’’(కాదంబరి - పేజి 148) అంటుంది కౌముది.

నిజానికి శంకరంతో ఆమె పెళ్ళికి ముందే సహజీవనంలో ఉందని రావూరి భరద్వాజ చెప్పారు.

భూస్వామ్య కుటుంబానికి చెంది అత్యంత ధనవంతురాలుగా ఉండి, ఉన్నత వర్గాలకు ప్రాతినిధ్యం వహించే స్త్రీ కౌముది. ఈమె తన తండ్రి రామకృష్ణయ్య అన్యాయపు ప్రవర్తనను గమనిస్తుంది, ప్రశ్నిస్తుంది, ‘నువు తప్పు చేస్తున్నావు’ అని తండ్రిని హెచ్చరిస్తుంది. సొంతగా కారు డ్రైవింగ్‌ చేయడం, పురుషులతో స్నేహం చేయడం, కాలేజీలో చదివే రోజుల్లో అబ్బాయిలకు ప్రేమ లేఖలు రాసి ఆట పట్టించడం లాంటి ఒక స్వతంత్ర, స్వేచ్చాయుత జీవనం ఈమెది. పురుషులతో సమానత్వాన్ని కోరుకోవడం, లైంగిక స్వేచ్ఛ పట్ల ఒక అవగాహన కలిగి ఉండడం, ఈ పాత్ర ప్రత్యేకత. లెక్కకు మించి డబ్బు సంపాదన పట్ల ఈమెను విముఖత ఉంది.

నీకు సుఖాన్ని అనందాన్ని ఇవ్వని డబ్బు నీ దగ్గరుండకూడదు. దాన్ని నీ దగ్గరుంచుకున్నంత కాలం, అది నిన్ను కుక్క కింద మారుస్తుంది. తనకు కావలి కాయమంటుంది... నీకు నిద్రాహారాలు లేకుండా చేస్తుంది.” (కాదంబరి - పేజి 29) అంటుంది. డబ్బు, ఆధిపత్యం పట్ల ఈమె విలువలు అత్యంత ఆధునికంగా కనిపిస్తాయి.

కౌముది పాత్ర చాలావరకు ఆధునికంగా, నిర్భీతిగా, నిజాయితీగా కనిపిస్తుంది. నిజం మాట్లాడే విషయం లో తండ్రిని కూడా నిలదీస్తుంది. మయూరాక్షి ప్రాజెక్టు నిర్మాణంలో ముంపునకు గురైన ప్రాంతాల్లో దళితులు నష్టపోవడం, ప్రభుత్వ బంజరు భూములను దళితుల పేరుతో పెద్దలు కొట్టేస్తున్నారని తన తండ్రికి తెలుసునని ఇది అనాగరిక లక్షణమని తండ్రిని నిలదీసి ప్రశ్నిస్తుంది. జగన్నాధానికి తనతో ఉన్న స్నేహాన్ని గురించి భర్త శంకరానికి ఏ విధమైన జంకు, దాపరికం లేకుండా చెబుతుంది. భర్త తో తాను కలిసి ఉంటున్న ఇంటికి జగన్నాధాన్ని ఆహ్వానిస్తుంది. ఈ పాత్రను అంత పారదర్శకంగా, హుందాగా, ఆధునికంగా మలిచారు భరద్వాజ.

5. విభిన్న పీడితుల ఆక్రందన:

5.1. స్త్రీల గొంతుక :

చలం స్త్రీల పాత్రల లాగే రావూరి భరద్వాజ స్వేచ్ఛాయుతమైన స్త్రీల పాత్రలను సృష్టించారు. ఆ పాత్రల ద్వారా స్త్రీల అణిచివేత, స్త్రీ విముక్తి, కుటుంబం, భర్త వంటి విషయల పట్ల స్త్రీల భిన్నమైన ఆలోచనలను ప్రతిబింబించారు. అత్యంత ధనవంతుని కుమార్తె అయిన కౌముది పాత్ర మధ్య తరగతి స్త్రీల జీవితాన్ని ఇష్ఠపడుతుంది. తాను కూడా అలా జీవించాలని కోరుకుంటుంది. లభించిన అన్నిరకాల స్వేఛ్ఛలను అనుభవిస్తూ ఆనందాన్ని పొందుతూనే ఇంకో పక్క తాను భర్త ఆధిపత్యం కింద ఉండే ఒక సాధారణ మధ్య తరగతి గృహిణి జీవితాన్ని జీవించాలని కోరుకుంటుంది. భర్త ఆధిపత్యం, పెత్తనం, తనపై భర్త చేయి చేసుకోవడం, తాను అలగడం లాంటివి తనకు కూడా జరగాలని కోరుకుంటుంది. తన భర్తతో తనకు అలాంటి జీవితం లేనందుకు భాదపడుతుంది. ఆమెలో ఉన్న ఈ వైరుధ్యాలను పరిశీలిస్తే- ఆనాటి చదువుకున్న స్త్రీల మీద ఉన్న చలం ప్రభావం కనిపిస్తుంది. ఆ ప్రభావం కారణంగానే ఏ ఆధిపత్యాలు లేని స్వేచ్ఛాయుత జీవితాన్ని కోరుకునే స్త్రీ మనస్తత్వం ఒక పక్క, మరో పక్క ఈ సమాజానికి భయపడుతూ ఒక సాధారణ గృహిణి జీవితంలో నుంచి తమను తాను చూసుకోవడం – ఈ రెండూ ఈ పాత్ర లో కనిపిస్తాయి.

కౌముదిలో ఆధునికతకు సంప్రదాయతకు మధ్య తచ్చాడే డోలాయమాన మానసిక స్థితి కనిపిస్తుంది. ఈవిధమైన వైరుధ్యపు ఆలోచనలు కలిగి ఉన్న కౌముది పాత్ర ద్వారా ఆనాటి చైతన్య వంతులవుతున్న స్త్రీల మానసిక స్థితిని నమోదు చేశారు రావూరి భరద్వాజ . అయితే భరద్వాజ ఎక్కడా తీర్పులు ఇవ్వలేదు. ‘స్త్రీలు ఇలాంటి స్వేచ్ఛ కోరుతున్నారు’ అని చెప్పలేదు. మధ్య తరగతి స్త్రీలు ఆధునిక జీవితాన్ని కోరుకుంటున్నారా? సంప్రదాయ జీవితాన్ని కోరుకుంటున్నారా? అనే ఒక సందిగ్ధ సందర్భాన్ని మాత్రమే రచయిత రికార్డు చేసినట్టు మనకు అర్థమవుతుంది.

రెక్కల కష్టం మీద బతికె యాంకావ పాత్ర ద్వారా స్త్రీలు ఇంటా బయటా ఎదుర్కొనే పురుషాధిపత్యాన్ని గురించి చెప్పారు భరద్వాజ . ఈ నవలలో భరద్వాజ స్త్రీ స్వేచ్చతో పాటు కుటుంబ హింస గురించి, స్త్రీలపై వుండే పితృస్వామిక అణిచివేత గురించి ప్రస్తావించారు. శ్రీరాములు పాత్ర ఇంట్లో భార్య యంకావని హింసించిన తీరును వర్ణించారు. దానితో పాటు యాంకావ బయట ఆసాములనించి ఎదుర్కొనే పీడన, హింస, అణిచివేతని చెప్పడం ద్వారా స్త్రీలకు ఎక్కడా స్వేచ్ఛ, విముక్తి లేదని చెప్పారు. 

సమాజానికి స్త్రీల పట్ల అత్యంత ఎంత చులకన భావం వుందో, పురుషులు స్త్రీల గురించి వారి వెనుక ఎంత తక్కువ చేసి మాట్లాడుకుంటారో జగన్నాథం, నారాయణ లాంటి పాత్రలు స్త్రీల విషయాలో ఎంత అవకాశ వాదంతో ఎలా ప్రవర్తిస్తాయో చెప్పారు.

5.2. దళిత సమస్య :

ఈ నవలలో రచయిత భరద్వాజ చాలా స్పష్టంగా తెర మీదకు తీసుకుని వచ్చిన విషయం - దళితులు వారి భూమి సమస్య, దళితుల మీద ఆధిపత్య వర్గాలు చేసే దాడులు, భూస్వాములు తమ ఆస్తుల్ని పెంచుకోవడం కోసం, రాజకీయ పలుకుబడి పెంచుకోవడం కోసం వారు చేసే కుట్రలు, ఎత్తుగడలను చెప్పారు. ఆపై వారు చేసే రాజకీయ పథక రచనలలో దళితులు తమ జీవితాలను ఎలా నష్టపోతారో చెప్పారు.

ఈ నవలలో ప్రస్తావించిన మయూరాక్షి ప్రాజెక్టు, నిర్మాణ పనుల భాగంలో కొన్ని విషయాలను మన ముందుకు తెచ్చారు రచయిత. ఆ ప్రాంతపు చెరువుల్లో మెరకేసి పోయిన భూముల్ని ఆయా ప్రాంతాల్లో ఉండే హరిజనులు చాలా సంవత్సరాలుగా సాగు చేసుకుంటున్నారు. వారికదే బ్రతుకు తెరువు. బాధ్యత గల పెద్ద మనుషులు చెప్పిన ప్రకారం కాలవల్ని చెరువుల్లోకి మలుపుతూ తీసుకుపోతే, ఈ భూములన్నీ మునిగిపోతాయి, వందలాది హరిజన కుటుంబాలు దిక్కులేనివయిపోతాయి. అందుకని ఆ దళిత కుటుంబాలు ఆ స్థలాలను ఖాళీ చేయడానికి ఇష్టపడలేదు.

“సారవంతమైన ఆ భూముల్ని తమ హస్తగతం చేసుకోవాలని భూస్వాములైన రైతులు భావించారు. అక్కడ నుండి దళితులను వెళ్ళగొట్టేందుకు ప్రయత్నించారు”. (కాదంబరి - పేజి 116)

దళితుల మీదకక్ష కట్టిన భూస్వాములు ఒక్క మాట మీద ఉండడంతో అక్కడ దళితుల పరిస్థితి మరింత దిగజారిపోయింది. భూస్వాములు దళితులను కూలీ, నాలీ చేయటానికి పిలవలేదు. దళితులు ఆకలితో అల్లాడిపోయారు. వారి మధ్య ఐక్యత దెబ్బతిన్నది. ఇదే అదనుగా ఆధిపత్య కుల భూస్వాములు వీళ్ళ భూముల్ని స్వాధీనం చేసుకున్నారు. కాని ప్రభుత్వ రికార్డులో మాత్రం ఆ భూములు హరిజనులే సాగు చేసుకున్నట్లుగా ఉన్నాయి.

ముంపు కారణంగా తమ భూములను కోల్పోతున్నారు కాబట్టి నష్టపరిహారంగా మరెక్కడైనా భూములు ఇవ్వవలసిందిగా దళితుల చేత పెద్దలు దరఖాస్తులు చేయించారు. ఈ విషయాన్ని దళితులకు తెలియనివ్వకుండా

‘దీని మీద వేలి ముద్ర వేస్తే పాడి గేదలను కొనుక్కోవడానికి అప్పులు ఇస్తార’ని (కాదంబరి - పేజి 117) ప్రచారం చేయించారు.

దళితులు వేలిముద్ర వేశారు. ఆ కాగితాలన్నీ ప్రభుత్వానికి చూపించి బంగారం లాంటి బంజరు భూములు కొట్టేశారు భూస్వాములు. ధనవంతులందరూ దళితుల పేరు మీద ప్రభుత్వ బంజరు భూములను ఆక్రమించుకున్నారు. కాగితాల మీద దళితుల పేరుమీదుగా ఉన్న ఆ భూములను అనుభవిస్తున్నది మాత్రం భూస్వాములు.’ అని ముఖ్యమంత్రే ప్రస్థావించడం గమనార్హం.

మయూరాక్షి ప్రాజెక్టు రాబోతుందని తనకు కావలసిన వారికి ముందుగానే ఉప్పు అందించాడు ముఖ్యమంత్రి. దానితో ముఖ్యమంత్రి సన్నిహితులు, ఇతర మంత్రుల బంధువులు కూడా ముందే తెలుసుకొని వచ్చి అ ప్రాంతాన్ని ఆక్రమించేశారని చెబుతారు రచయిత. ‘‘ఆయా వర్గంలోని సన్నిహితులు ఇతర మంత్రుల బంధువర్గాలు డబ్బు సంచులతో ఈ ప్రాంతాలకు వచ్చారు. ఆ ప్రాంతాల్లోని పొలాలను కారు చౌకగా కొనేశారు……. అక్కడ అప్పటికే ఆ భూములను సాగు చేస్తున్న సన్నకారు జనాన్ని అదిరించి వాళ్ళ భూములను అమ్మించి కమీషన్లు పొందారు దళారీలు.’’ (కాదంబరి, పేజి 113).ఈ పని మొత్తం చాలా రహస్యంగా, ఎవరికీ తెలియకుండా చేసేశారని చెబుతారు భరద్వాజ.

  ఈ విధంగా రావూరి భరద్వాజ కాదంబరి నవలలో దళితుల భూమి సమస్య మీద ఎన్నో పరిశోధనాత్మకమైన అంశాలను వెలికి తీశారు. ఎక్కడైనా దళితులకు భూమి ఉంటే ఓర్వలేక భూస్వాములు దాన్ని చేజిక్కించుకోవాలని కుట్రలు, కుయుక్తులు పన్నుతారు. అవసరమైతే దాడులు కూడా చేస్తారని చెప్పారు. ప్రభుత్వ బంజరు భూములను దళితుల పేరు మీద ఆధిపత్య వర్గాలు ఎలా స్వాధీన పరుచుకొని అనుభవించారో మొత్తం కథను వివరంగా ఈ నవలలో చెప్పారు రచయిత. దళితులు ఎదురు తిరిగినా, ప్రశ్నించినా వారిని కూలికి పిలవకుండా వెలివేసేవాళ్ళని, ఆకలితో అలమటించేటట్లు చేస్తారని చెప్పారు. ఆకలి కడుపుతో అలమటించటం వల్ల వాళ్ళ మధ్య అంతర్గత విభేధాలు తలెత్తినప్పుడు వాటిని ఆసరాగా చేసుకొని తమ తెలివితేటలను ఉపయోగిస్తారని, వాళ్ళను పావులుగా వాడుకొని వాళ్ళ పేరు మీద భూములను స్వాధీనం చేసుకునే కుట్రపూరితమైన చర్యలకు పాల్పడతారని రావూరి భరద్వాజ చెబుతున్నారు. బలహీనుల జీవితాలను గురించి సాహిత్యానికి అందని ఎన్నో కొత్త విషయాలను ఈ నవలలో చర్చించారు భరద్వాజ .

5.3 నిరుపేదలు – వలస కూలీల సమస్య : 

  నిరుపేద వర్గాలైన వలస కూలీలు బతకడం కోసం కష్టపడి పని చేస్తారు,

వారిలోని అమాయకత్వం, చదువులేనితనం కారణంగా వారిని మోసం చేయడం చాలా సులభం. కాబట్టి ఎక్కడ ఏ ప్రాజక్టు కడుతున్నా, ఎక్కడైనా కాలువలు తవ్వుతున్నా నిరుపేదలైన, చదువులేని వలస కూలీలనే తీసుకుని వెళ్తారు కాంట్రాక్టర్లు. ఎంతో దూర ప్రాంతాల నుండి కూలీలను పట్టుకొని వస్తారు. ఎక్కువ ఆదాయం ఆశ చూపుతారే కాని చివరికి తక్కువ మొత్తం చేతులో పెడతారు. పని గంటల పరిమితి నియమాన్ని కానీ, సెలవుల నియమాన్ని కానీ పాటించరు. పొద్దు పొడిచిన దగ్గర నుండి చీకటి పడేదాకా పని చేయిస్తారని’ (కాదంబరి - పేజి 134)

ఇలాంటి ఎన్నో విషయాలను ఈ నవలలో ప్రస్తావించారు భరద్వాజ .

  ఈ నిరుపేద కూలీలని పనికి ఉపయోగించే వారు, వారి కింద ఉన్న రౌడీలు, గూండాలు ఈ కూలీలకు ముందుగా కొంత మొత్తం అప్పుగా ఇచ్చి వీరిని దళారీలకు అప్పచెబుతారు. ఎవరైనా కూలీలు ఆ కూలి పనులు చేయడానికి నిరాకరిస్తే ఈ రౌడీలు-

‘‘ఈ అమాయకుల్ని కొట్టీ, హడలుగొట్టీ, అవసరమైతే వాళ్ళు చేతులను బిగ గట్టీ లారీల్లో వేసుకొస్తారు. అక్కణ్నించీ పని.. జొన్నలు, ఉప్పు, కారం, నూనే లాంటి వాటిని కూడా, ఈ దళారీయే సరఫరా చేసి, వాళ్ళకిచ్చే కూలీలో మినహాయించుకుంటాడు... పొట్టకు చాలీ చాలకుండా ఇస్తాడే తప్ప, నిండు కూలీ వీళ్ళకు ముట్టదు.” (కాదంబరి, పేజి 135).

ఎవరైనా పారిపోవడానికి ప్రయత్నిస్తే అందర్ని పిలిచి వాళ్ళ ముందు ఆ పారిపోయిన వాడ్ని రక్తాలు కారేదాకా కొడతారు. వాళ్ళ భార్యను అవమానిస్తారు. వాళ్ల బిడల్ని చంపుతామని బెదిరిస్తారు.

‘‘ఒక కూలీ కొంత సేద తీరడానికి ప్రయత్నిస్తే తోలు కొరడాతో వాళ్ళ వీపులు బద్దలయేటట్లు కొడతారు. కొరడాతో పాటు వీపు మీద చర్మం ఊడివస్తుంది. డొక్కలో లాగి తంతారు.’’ (కాదంబరి, పేజి 135).

ఆనాడు రాజకీయ నాయకులు, భూస్వాములు, పెట్టుబడి దారులు లాంటి వాళ్ళు దళారీల రూపంలో ఇలాంటి హింసను పెంచి పోషిస్తున్నారని చెబుతారు రచయిత.

అట్లాగే ఈ బలహీన వర్గాల వారికి తమకు హక్కులు ఉన్నాయని తెలియదని,

తమపై జరుగుతున్న హింసకు ఫిర్యాదు చేయవచ్చని తెలియనంత అమాయకుల’ని (కాదంబరి, పేజి 136) అంటాడు రచయిత.

వీళ్ళు కర్మ సిద్ధాంతం నమ్ముతారని,

వాళ్ళు కొరడాతో కొట్టడానికి, తాము ఆ దెబ్బలు తిని కిక్కురుమనకుండా ఉండడానికి పుట్టామని తలుస్తారు’, (కాదంబరి, పేజి 136)

అందుకనే వారి జీవితాలు ఇంత దయనీయంగా ఉన్నాయని రచయిత ఉద్ధేశం.

6. ముగింపు:

ఈ నవలను చదివిన తర్వాత రచయిత రావూరి భరద్వాజ స్వేచ్ఛ పట్ల ఒక ప్రత్యేకమైన అభిప్రాయాన్ని కలిగి ఉన్నారని అర్థం అవుతుంది. స్త్రీలు తమ వ్యక్తిత్వాన్ని కోల్పోకూడదని, ఆత్మగౌరవంతో ఉండాలని, అన్యాయాన్ని ప్రశ్నించాలని కౌముది పాత్ర ద్వారా చెబుతారు. అట్లాగే దళితుల భూమి సమస్యను, విముక్తి సమస్యను చర్చించారు. నిరుపేదలు, కూలీల మీద జరిగే దౌర్జన్యాలు, దాష్టీకాలను కళ్ళకు కట్టినట్టు చూపించారు. పేదలు - పెద్దల రాజకీయ ఎత్తుగడలకు, కుట్రలకు బలై పోయి భూములను కోల్పోయిన వైనాన్ని చెబుతారు. పలుకుబడిగల వాళ్ళ చేతులలో దళితులు పావులుగా మారుతారనే విషయాన్ని కూడా ఈ నవలలో విపులంగా చెప్పారు భరద్వాజ . మొత్తం మీద బలహీన వర్గాల జీవితాలు, కూలినాలీ చేసుకునే బతుకులు దళారీలు, పెద్దల చేతుల్లో ఎలా నాశనం అయిపోతున్నాయో కళ్ళకు కట్టినట్లుగా చిత్రించారు రచయిత రావూరి భరద్వాజ

వీటితో పాటు ప్రముఖ చారిత్రక పరిశోధకుడు, పురాలిపి శాస్త్ర వేత్త అయిన మల్లంపల్లి సోమశేఖర శర్మ ని ఒక పాత్రగా చూపించారు. ఈ పాత్ర నిడివి చిన్నదే. మల్లంపల్లి సోమశేఖర శర్మ 1891లో పుట్టి 1963లో మరణించారు. అయితే ఈ నవల మొదటిసారి అచ్చులోకి వచ్చింది 1978 లో! అంటే ఈ నవలలో మల్లంపల్లి సోమశేఖర శర్మ మరణం తర్వాత ఒక పాత్రగా ఉండడం అనేది రచయిత స్వేచ్ఛ. అలాగే మయూరాక్షి ప్రాజక్టు నిర్మాణం గురించి మాట్లాడినప్పుడు సర్‌. ఆర్దర్‌ కాటన్‌ దొర ప్రస్తావన కూడా తెస్తారు రచయిత.

రచయిత ఈ నవలలో ప్రతి విషయాన్ని చాలా విపులంగా చెబుతారు. దీని వలన పాఠకులకు కొంత ‘బోర్‌’ కలగవచ్చు. పేజీలకు పేజీలు ప్రాజక్టు నిర్మాణం గురించి విషయ వివరణ చేయటం వల్ల మధ్యలో ప్రధాన కథ నుంచి డైవర్ట్ అవుతుంది. కొన్ని విషయాల దగ్గర రచయిత ప్రధాన కథను వదిలేసి ఒక పాయింట్‌ దగ్గర నుంచి వేరే విషయాన్ని లోతుగా చర్చిస్తారు. తిరిగి ఎప్పటికో ప్రధాన కథలోకి వస్తారు.

1978లో వచ్చిన ఈ నవలలో అప్పటి సమాజంలో కాలానుగుణంగా మార్పు చెందుతున్న స్త్రీ స్వేచ్ఛ గురించి, అప్పటికే దేశవ్యాప్తంగా దాడులకు గురై భూమిని కోల్పోతున్న దళితులు, పేదల సమస్యలను గురించి ఎంతో సానుకూలంగా, బాధితులకు దన్నుగా మాట్లాడారు రచయిత రావూరి భరద్వాజ . ఒక రచయిత సమాజంలో బలహీనుల పట్ల, పీడితుల పట్ల ఎలా వుండాలో, వారి సమస్యను ఎలా అర్థం చేసుకోవాలో, ఒక రచనలో ఎటు పక్క నిలబడి మాట్లాడాలో చెప్పడానికి ఒక వుదాహరణ ఈ నవల. 

7. ఉపయుక్తగ్రంథసూచి:

  1.  ఇనాక్, కొలకలూరి, ఆధునిక సాహిత్య విమర్శ సూత్రం, మారుతి బుక్ హౌస్, గుంటూరు: 1996
  2. చంద్రశేఖర రెడ్డి, రాచపాలెం, మన నవలలు- మన కథానికలు, లక్ష్మిగ్రాఫిక్స్, అనంతపురం: 2010 
  3. భరద్వాజ, రావూరి. కాదంబరి. నవల. ఆదర్శగ్రంథమండలి. విజయవాడ, : :1978
  4. భరద్వాజ, రావూరి, నేనెందుకు రాస్తున్నాను : వ్యాస సంకలనం, శ్రీ కమలా పబ్లిషింగ్ హౌస్, విజయవాడ : 1978 
  5. భరద్వాజ, రావూరి. పాకుడు రాళ్ళు. విశాలాంధ్ర పబ్లికేషన్స్., హైదరాబాద్: 2013 
  6. మధుకర్, ఏ, రావూరి భరద్వాజ రచనలు – ఒక పరిశీలన, విశాలాంధ్ర పబ్లికేషన్స్, హైదరాబాద్: 2014
  7. వెంకట సుబ్బయ్య, వల్లంపాటి, నవలా శిల్పం, విశాలాంధ్ర పబ్లికేషన్స్, హైదరాబాద్: 2000
  8. సుబ్బారావు, త్రిపురనేని, భరద్వాజ జీవితం-సాహిత్యం, కవిరాజ సాహితీ సదనం, హైదరాబాద్: 1987 

పత్రికలు : 

  1. రావూరి భరద్వాజ తో ముఖాముఖి, రజాహుస్సేన్, తెలుగు జాతి పత్రిక: నడుస్తున్న చరిత్ర (మాసపత్రిక), మే, 2013. 

పరిశోధనలు:

  1. రావూరి భరద్వాజ చిన్న కథలు – సమగ్ర సమీక్ష, కొండ్రు కనకదుర్గ – ఆంధ్ర యూనివర్సిటీ, 1989
  2. పాకుడు రాళ్ళు నవల – వస్తు రూప విశ్లేషణ, గంధం వేణు - మధురై కామరాజ్ యూనివర్శిటీ, 2020
  3. రావూరి భరద్వాజ నవలలు ఒక పరిశీలన  – జె. కాటమయ్య
  4. తెలుగులో స్మృతి సాహిత్యం – రావూరి భరద్వాజ రచనలు - వై. విశాలాక్షి

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]