headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-08 | July 2023 | ISSN: 2583-4797

1. శనగన నరసింహస్వామి రచనలు: సాహిత్యసౌరభం

prof_v_sankararao
ఆచార్య చల్లా శ్రీరామచంద్రమూర్తి

ఆచార్యులు, తెలుగుశాఖ,
కాశీ హిందూ విశ్వవిద్యాలయం,
వారణాసి - 221005, ఉత్తరప్రదేశ్.
సెల్: +91 9453884292, 8318891225. Email: sreeramachalla@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

తెలుగు సాహిత్యంలో ఆదికవి నన్నయ నుండి సంప్రదాయ సాహిత్యాన్ని సృజించిన ఎందరో మహాకవులున్నారు. ఆధునికయుగంలో ఎందరో గొప్పవారు ప్రాచీనపద్యవిద్యాసరస్వతిని ఆరాధించారు. పింగళి, కాటూరి, విశ్వనాథ, జాషువా, దేవులపల్లి, కరుణశ్రీ, హనుమదింద్రగంటి, మధునాపంతుల, పైడిపాటి మొదలైన వారు ముందు వరుసలో నిలుస్తారు. ఈ క్రమంలో చెప్పుకోదగిన తెలుగు సాహితీ సృజనకారుడు శనగన నరసింహస్వామి. వీరిని పరిచయం చేసి, వీరి రచనల్లోని సాహితీసౌరభాన్ని వెలికితీయడం ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం.

Keywords: పద్యం, ఆధునికకవిత్వం, సాహిత్యం, నరసింహస్వామి, శనగన.

1. బాల్యం-విద్యాభ్యాసం:

శ్రీరాముని నిత్యం ఆరాధించే భక్తితత్పరుడైన వీరాస్వామి, సుబ్బమ్మ దంపతుల ఏకైక సంతానంగా పశ్చిమగోదావరి జిల్లా తణుకు పట్టణానికి సమీపంలోని పాములపర్రు అనే చిన్న గ్రామంలో10-03-1936వ తేదీన నరసింహస్వామి జన్మించారు. వీరాస్వామి వ్యవసాయకుటుంబానికి చెందిన వారైనప్పటికీ ఒంటెద్దు బండి స్వయంగాలాగుతూ పేదరికానికి ఎదురీదేవాడు. వారు కొడుకును ఉన్నంతలో గొప్పగానే చూసుకుంటూ ఉండేవారు. గురువుల ఆదరాభిమానాలు ఈ కవికి వన్నె తెచ్చాయి. పల్లెసీమల అందాలతో, కవి బాల్యం ఆనందమయంగా సాగింది. పాములపర్రులో ప్రాథమికపాఠశాల పక్కన ఉన్న ఉండి అనే గ్రామంలో హైస్కూల్ చదువు, భీమవరం డి.ఎన్.ఆర్. కాలేజీలో కళాశాలవిద్య అభ్యసించారు. స్నాతకోత్తరవిద్యను ఆంధ్రవిశ్వకళాపరిషత్తులో చదివి తరగతిలో మొట్టమొదటి వ్యక్తిగా ఉత్తీర్ణులయ్యారు. మహాపండితులైన నండూరి రామకృష్ణమా- చార్యులు, వ్యాకరణనిష్ణాతుడు దువ్వూరి వేంకటరమణ శాస్త్రి వంటి మహామహుల దగ్గర చదివారు. తెలుగు, సంస్కృత భాషల పట్ల మంచి పట్టు పెంచుకున్నారు.

శనగనవారు అత్యంత ప్రతిభానైపుణ్యంకల వ్యక్తి. విజయవాడ ఆంధ్ర లయోలా కళాశాల తెలుగుశాఖలో 59 నుండి 85 వరకు ట్యూటరుగా ఉద్యోగజీవితాన్ని ప్రారంభించారు.1986 నుండి లెక్చరర్ గా ఎదిగి 88 నుండి తెలుగుశాఖ అధ్యక్షుడుగా పదోన్నతి పొంది 1994 మార్చిలో పదవి విరమణ చేశారు. సుమారు 35 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిని సమర్థవంతంగా నిర్వహించి, ఎందరో విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దారు. విద్యార్థులు, తోటి అధ్యాపకులు, యాజమాన్యం వారితోనూ మనసెరిగి నడుచుకుంటూ, ఉత్తమ అధ్యాపకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. పాఠాలతోబాటు నీతులు, సూక్తులు, దేశభక్తి విషయాలు, వ్యక్తిత్వ వికాసాది విషయాల వివరణలు విద్యార్థులకు బోధించడం ఆయన ధర్మంగా భావించే సంస్కారవంతుడు. ఈ కవికి ఆంధ్ర లయోలా కళాశాలపట్ల, కళాశాల నిర్వాహకులైన జేసుసభ సభ్యులపట్ల అవ్యాజానురాగాలు, భక్తి ప్రపత్తులు ఎక్కువ. కొన్ని వేల మంది అంతేవాసులను అంతరంగమున చేర్చుకున్న అశేషశేముషీ దురంధరులు శనగన నరసింహస్వామి.

2. వ్యక్తిత్వం:

పుట్టగాపువ్వు పుట్టగానే పరిమళిస్తుందనేది నానుడి. కేవలం 12 ఏళ్ల వయసు నుండే నరసింహ స్వామి తన రచన ప్రారంభించారు. నాకు కవితా ప్రతిభ సహజంగా సంక్రమించింది కాదు. అది నాకు రక్తనిష్టమైనదే, అనేది స్వామి మాట. తల్లిదండ్రుల నుండి రామాయణ భజన కీర్తనల వల్ల, సంస్కారం దండిగా ఉండేది. అందర్నీ ఆకట్టుకునేలా పెద్ద పంచ కట్టు, అందమైన పైజామా, భుజాన పెద్ద పెద్ద అంచులతో తళతళలాడు తున్న కండువా, ముఖాన చిరునవ్వు, గాత్రంలో మాధుర్యం, వినసొంపైన పద్యపఠనం, చూడాలనిపించే చిరునవ్వు ముఖం ఇదీ శనగన వారి రూపచిత్రణ. మనసు వెన్న, మాట సున్నితం, ఎదుటివారిని పలకరించడంలో మర్యాద, పిల్లల పట్ల ఆప్యాయత, పెద్దల పట్ల వినయం, విద్యార్థుల పట్ల వాత్సల్యం, తోటి అధ్యాపక మిత్రులతో సాన్నిహిత్యం, వెరసి స్వామి వ్యక్తిత్వపు ఔన్నత్యం.

జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా మంచి నడవడికను మాత్రం వదిలిపెట్టలేదు. వీరి పెద్ద తండ్రి నరసయ్య ఛందోబద్ధ రచనలు చేయడంలో చేయి తిరిగిన వ్యక్తి. కానీ నరసయ్య రచనలు నేడు లభించడం లేదు. పది సంవత్సరాల వయసులోనే నరసింహస్వామి ఒకేఒక తప్పుతో ఓ కందపద్యం రాశారట. “మన్నింపుము రామచంద్ర మానవనాథా!” శనగన వారి కవితా రచనకు ఇది శ్రీకారం. అనంతరకాలంలో ఆధునికసాహిత్యాన్ని అవపోసన పట్టిన కవిశేఖరుడు కావడంతో కలకండవలె మధురమైన కావ్యాలు రచించారు.

3. శనగనవారి రచనలు:

వాల్మీకి అనే పద్య కావ్యం, చైత్రవంది, శారద రాత్రులు అనే భావకవితా పద్య సంపుటులు; రత్న పాంచాలిక అనే సంస్కృత అనువాదనాటిక, హేమంతలేఖని నుండి హేమంతసంక్రాంతి, వసంత వాల్లభ్యము, జలదగీతి, విషాద విపంచి, షాజహాన్, సౌశీల్యము, కవి కుమారుడు, అనార్కలి, ప్రణాంజలి, ఋష్యశృంగ నిర్గమనము, కృష్ణతంతువు, విశ్వగీతి మొదలైన లఘుకావ్యాలు రాశారు. పోతన భాగవత చతుర్థ స్కంధానికి వ్యాఖ్యానం రాశారు. హమీదుల్లా షరీఫ్ అనే ఆయన రాసిన దివ్య ఖురాన్ గ్రంథానికి తెలుగు అనువాదం చేశారు. వీరి కొన్ని అముద్రిత రచనలు తెలుసుకుందాము.

4. అముద్రితాలు:

వీరికి కవిత్వ రచనావ్యాసంగమే నిత్యవ్యాపారం. మనసుకు సొగసైన భావపరంపర వీచికలు తాకినప్పుడు పురాణపురుషుల కథలు, సమాజానికి న్యాయభావన తెలియజెప్పాలని అనిపించినప్పుడు, ఆంగ్లసాహిత్యకారుల నాటక రుచిని తెలుగు పాఠకులకు పంచాలని పరితపించినప్పుడు, కాటమరాజు వంటి నాయకులను గుర్తించుకొని వారి వీర లక్షణాలు అందించాలని తన కలానికి పదులు పెట్టేవాడు. కానీ ఇలాంటి రచనలు నేడు లభించడం లేదు. ఇతడు రాసిన నాటికలలో సంపూర్ణ రామాయణము మొదటిది. ఇది పద్యగద్యాత్మకపౌరాణిక నాటకం. ఈ కోవలో సావిత్రి, భక్తమందార, భక్తధ్రువ, కృష్ణలీల వంటివి చెప్పుకోవాలి. హైస్కూల్ గర్ల్ అనే సాంఘికనాటిక, కాటమరాజు, పరివర్తనం అనే చారిత్రకనాటికలు ఉన్నాయి. వీరి అముద్రిత రచనల్లో సమాధి, అపుత్రస్య గతిర్నాస్తి కథానికలు, శివరాత్రి, ఋతుచక్రము అనే లఘుపద్య కావ్యాలున్నాయి. పాంధగీత అనే ఖండకావ్యం. దీనిని గబ్బిలం మూడవ భాగంగా గమనించాలి. ఇవి ఈ కవి అముద్రిత రచనలు.

భువన విజయంలో ఒకనాడు” అనే దృశ్యరూపకం ఈ కవి రచన. ఆంధ్ర లయోలా కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకులే ఈ రూపకంలో పాత్రధారులు. నాటి ప్రిన్సిపల్ ఫాదర్ జయబాలన్ శ్రీకృష్ణదేవరాయలుగా, శనగనవారు అల్లసాని పెద్దనగా, ఈ వ్యాసరచయిత ఆచార్య చల్లా శ్రీరామచంద్రమూర్తి తెనాలి రామకృష్ణునిగా అభినయించారు. కళాశాల దేవయ్య ఆడిటోరియంలో సుమారు 5000 మంది ఆహూతుల సమక్షాన ఈ రూపకం అద్భుతంగా ప్రదర్శితమైంది.

5. వాల్మీకి కావ్యసౌరభం:
ఇప్పుడు శనగనవారి సాహిత్యసౌరభాన్ని పరిశీలిద్దాం. ముందుగా వాల్మీకి కావ్యంలోని విశేషాలు గమనించుదాం.

కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం

మధురాక్షరములైన ‘రా’ ‘మ’ అనే రెండు అక్షరాలను కోకిలలా గానం చేసిన వాల్మీకి మహర్షి కారణజన్ముడు. సంస్కృతంలో శ్రీమద్రామాయణాన్ని రచించిన వాల్మీకి చరిత్రను ఈ కవి రాశాడు. వాల్మీకి కథను మొదటిసారిగా తెలుగులో ‘వాల్మీకి చరిత్ర’ అనే పేరుతో కావ్య రచన చేసిన పరమ శ్రీరామ భక్తుడు, తంజావూరును పరిపాలించిన (క్రీ.శ. 1600-1631 ప్రాంతము) రఘునాథ నాయకుడు పేరు తలచుకోవాలి. సంస్కృతంలో వాల్మీకిచరిత్ర ధర్మఖండంలో ఉంది. వాశిష్ఠ రామాయణంలోని భక్తవిజయంలో ఉంది. ఈ రెండింటి కథలలోనూ కొంత భేదం కనబడుతోంది. కిరాతకులంలో జన్మించిన వాల్మీకి దారి దోపిడీ ప్రధాన వృత్తిగా ఎంచుకుని, ఆ దారిలో పోతున్న సప్తర్షులను బాధించాడు. ఆ మహాత్ముల అనుగ్రహంతో శ్రీరామ తారక మంత్రోపదేశాన్ని పొందాడు. అసంఖ్యాకంగా మంత్ర జపం చేసి శ్రీరామ సాక్షాత్కారం పొందాడు. శ్రీరామునకు అంకితం చేస్తూ శ్రీమద్రామాయణ రచన చేశాడు. ఇదే ధర్మ ఖండంలో ఉన్న సూక్ష్మ కథ. కానీ వాశిష్ఠ రామాయణ- భక్త విజయంలోని వాల్మీకి చరిత్ర కొద్ది భిన్నంగా కనబడుతుంది. వాల్మీకి బ్రాహ్మణవంశంలో జన్మించాడు. కిరాతుడై వనితా లోలుడయ్యాడు. తాను పుట్టిన బ్రాహ్మణ వంశ ధర్మాలు అన్నిటినీ కాలరాశాడు. పంచ మహా పాతకాలలో వేశ్యా సంపర్కం ఒకటి. మహాపాపం చేస్తున్న అతనికి అదృష్టవశాన సప్తర్షుల అనుగ్రహం లభించింది. ఫలితంగా అతడు మహర్షి అయ్యాడు. “వాల్మీకి చరిత్ర-రఘునాధనాయకుడు” ఈ పుస్తకానికి నిడదవోలు వెంకట రావు రాసిన పీఠిక ఆధారం.
వేమూరి శ్రీనివాసరావు సంకలనంలో వచ్చిన పూర్వ గాథా లహరిలో వాల్మీకి చరిత్ర మరొక విధంగా కొద్ది తేడాలతో కనిపిస్తుంది. ఈ కథా సంవిధానాలన్నీ లోతుగా పరిశీలించిన శనగన నరసింహస్వామి, రఘునాథ నాయకుడు రచించిన వాల్మీకి చరిత్ర లోని ఇతివృత్తాన్ని ప్రధానంగా చేసుకొని కావ్య రచన చేశారు. రఘునాధ నాయకుడు 450 పద్య గద్యాలలో, మూడు ఆశ్వాసాల ప్రబంధంగా వాల్మీకి చరిత్ర నిర్మిస్తే-శనగనవారు 218 పద్యాలలో ఐదు సర్గలతో, నిర్వచనంగా వాల్మీకి వృత్తాంతాన్ని రచించారు. సర్గాంతాలలో కథాంశానికి అనువైన శీర్షిక సూచన శనగన వారి ప్రత్యేకత. ప్రథమ సర్గ చివర సందర్శనము అనే పేరు పెట్టారు. మంత్రోపదేశం ద్వితీయ సర్గ, పరివర్తన తృతీయ సర్గ, శాసనము చతుర్థ సర్గ, శ్రీకారం అనేది పంచమ సర్గ. వీటిలోని కథా సంవిధానము, వర్ణనలు, అలంకార సౌరభాలు వంటివి పరిశీలించుట ప్రస్తుత కర్తవ్యం.

5.1. వర్ణనలు:

మొదటి సర్గలో సప్త ఋషులు వద్దనున్న ధనాన్ని బోయవాడు దోచుకోవడానికి ప్రయత్నించడంతో, ఆ ఋషులు కిరాతునితో ఇలా పలికారు.

అకట! నిషాద! సాహసము యౌవన యోగము బహుసత్త్వమున్
నికరములే శరీరమును నిత్యమె, శాశ్వతులే సతీసుతుల్
సుకములు సుస్థిరంబులె; యశోధన మాఱడిపోవఁగా నిటుల్
సకలుష భుక్తికేల సెయిఁజాతు వదేమి తపంబొ ధ్యానమో? (1సర్గ-28వ పద్యం )

వెంటనే మహర్షులు నీవు చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నావు. ఇకనైనా “సజ్జన సాంగత్యంతో పాపపు పనులు మానుమయ్యా” అని హితబోధ చేశారు. భుక్తికిచేయి జాపడమేమిటని నిలదీశారు. తాను చేసే పాపపు పనుల్లో భార్యా బిడ్డలకు కూడా భాగము ఉంటుందా?అని ఋషులు ప్రశ్నించిన పద్యం ఇలా ఉంది.

అనవిని మౌనివర్యులివి యున్నియుఁ గైకొనవచ్చుఁ గాని యిం
దనుకను నీవొనర్చిన ఘనంబగు పాపము నీకు మాత్రమే
యనుభవయోగ్యమౌనొ భవదంగనయున్ సుతులందు భాగమున్
గొనుదురొ యంచనన్ మనసు గోసిన యట్లయి వెచ్చనూర్చుచున్. (1సర్గ-34వ పద్యం)

వెంటనే నిషాదుడు ఇంటికి వెళ్లి భార్యా బిడ్డలను అడగడానికి పయనమయ్యాడు. భార్య సమాధానం విని కిరాతుడు ఆశ్చర్యపోయాడు. చింతాక్రాంతుడయ్యాడు, మనసు విలవిలలాడింది.

తెచ్చుట నీ పని తెచ్చిన
పచ్చాకును గూరఁజేసి పాపల నిన్నున్
మెచ్చించుట నా పని నీ
తెచ్చిన పాపంబుఁదడవు తెగులు ఏమిటికిన్. (2 సర్గ 4వ పద్యం)

వెంటనే ఋషులు రామ అనే అక్షరాలు అతనికి పలకడం రాకపోతే ‘మరా, మరా’ అను రామనామ తారక మంత్రాన్ని విలోమపద్ధతిలో ఉపదేశించారు. ఆ మంత్ర జపం చేస్తున్నాడు కిరాతుడు.

వింత దయ్యము పట్టెనో పంతగించి
క్రొత్త రోగము గదిసెనో కోరి కోరి
రుసులు నీ మీఁద బసుమంబు విసరినారొ
గంగిగోవుగ నెటు మారె సింగ మిపుడు. (2 సర్గ 8వ పద్యం)

తమ నాయకుని చూచి గూడెంవారు రకరకాలుగా భావిస్తున్న మాటలు మనం పైన గమనించాము.
ఆ శబరుడు వృక్షమూలమందు రుద్రాక్ష మాల చేతపట్టుకుని, గాలిని ఆహారంగా స్వీకరిస్తూ, కౄర జంతువులతో పక్కనే ఉంటూ, బాహ్య ప్రపంచాన్ని మరచి తపస్సు చేశాడు. వాల్మీకిగా రూపాంతరం చెంది శిష్యగణంతో తమసా నదీ తీరంలో ఆశ్రమాన్ని నిర్మించుకుని శిష్యగణంతో గడుపుతున్నాడు. ఒకరోజు తమసా నదీతీర దారిలో క్రౌంచ పక్షుల జంటలో ఒక దాన్ని బోయవాడు తన బాణంతో చంపాడు. మానిషాద.... శ్లోకం శాప రూపంగా అతనినోట పెల్లుబికింది. హృదయవిదారక దృశ్యానికి చింతిస్తున్న వాల్మీకి మహర్షికి సరస్వతీబ్రహ్మలు ప్రత్యక్షమైనారు. లోకోపకారకమైన శ్రీరామద్రామాయణ కావ్యాన్ని రచించాలని, ఆనతిచ్చి, ఆశీస్సులు అందించారు. అదే శిరీష కోమల, సుమధుర వాక్కుల కమనీయ కావ్య రచనకు శ్రీకారం జరిగింది.

ప్రస్తుతం శనగనవారి వాల్మీకి కావ్యంలోని ప్రకృతి వర్ణన సౌందర్యం గమనించాలి. ప్రకృతిని ఎంతో రమణీయంగా రచయిత వర్ణించారు.

వచ్చెను ముందు మాధవుడు వచ్చెను పుష్ప శరుండు ముందుగా
వచ్చెను జందన ప్రభవ వాయు కుమారుఁడు ముందు ముందుగా
వచ్చెఁ గురంగలాంఛనుఁడు వచ్చిన వారల యందు ముందుగా
వచ్చినవార లెవ్వరను వాదముఁ దేల్పఁగరాని శీఘ్రతన్. (4సర్గ 9వ పద్యం)

వసంతుడు ముందుగా వచ్చాడు. మన్మధుడు అంతకుముందే వచ్చాడు. చందనం నుండి పుట్టిన పిల్లగాలి దానికి ముందే అరుదెంచాడు. అంతకుముందే కురంగలాంఛనుడు (మన్మధుడు) వచ్చాడు. ఈ వేగంలో ఎవరు ముందు వచ్చిందీ తెలుపలేకున్నాము. ఇది వసంత ఋతు వర్ణన.
శనగనవారికి శరదృతువు అంటే చాలా ఇష్టం. మానస సరోవరం నుండి రెక్కలార్చుతూ పృథివి పైకి వస్తున్న హంసలేమో అన్నట్లుగా, నభోమండలమున, శుభ్రాంబుదములు, రంగుల హరివిల్లు అదృశ్యమైపోయింది. మేఘ గంభీర ధ్వనులు లేకపోవుటచే అడవి నెమళ్ళు ఆడడం లేదు. నిర్మలాకాశం కాబట్టి, సూర్య కిరణాలు తీక్షణంగా, చంద్ర కిరణాలు అమృతదాయకంగా ఉన్నాయి. ఈ వర్ణన గమనిద్దాం.

శ్రాంతియెఱుగని శ్రావణాసారవృష్టి
రూపు రేఖలు సెడిన సరోజ వనము
భాస్కరోదారకర పరిష్వంగ దీప్తిఁ
గోలుకొనగ సాగే నల్లనఁ గొలను నడుమ. (1 సర్గ 4వ పద్యం)

ఎడతెరిపి లేని శ్రవణ మాసపు వర్షాలతో రూపురేఖలు చెడిన పద్మాల కొలను భాస్కరుని కిరణ పరిష్వంగములో పొందిన కాంతి ఇప్పుడు మరలా పెరుగుతున్నది. ‌ ప్రకృతి తనకు తాను శోభను సంతరించుకునే విధానంలోనే కవి శరదృతువు వర్ణన కళ్ళకు కట్టినట్టుగా వర్ణించాడు. ఇలాంటి వర్ణనలు మనకు చాలాచోట్ల కనిపిస్తాయి.

బోయవాడి వర్ణనలో మాంసము తినుట, మద్యము సేవించుట, కళ్ళ నుండి వెలువడుతున్న ఎర్రని చూపులతోనే భయంకర అటవిలో అకాల అగ్నిని సృష్టించేవాడు. పవిత్రమైన యముని దేహము నుండి భూమిపైకి జారిపడి, మానవాకృతిని ధరించిన జార చోర శేఖరుడు ఈ కిరాతుడు.

5.2. అలంకార సోయగాలు:

“అలంక్రియతే ఇత్యలంకార:” అని అలంకార నిర్వచనం. కవితాలతాంగికి హార కటక కంకణాదుల అలంకరణ అవసరం. కావ్యకన్యకు అలంకారాలవల్ల శోభ పెరుగుతుంది. శబ్దార్థాలు కావ్యాలంకార శోభకు సాధనాలు. వీటి ప్రాధాన్యాన్ని కవి తన వాల్మీకి కావ్యంలో విస్తరించిన రామణీయకతను తెలుసుకోవాలి.

ధర్మదేవత పావన తనువు నుండి
ధరణి జాఱిన పాప పాదమ్ము మగుడ
మానవాకృతిఁదాల్చిన మాద్రివాఁడు
జారచోర శిఖామణి చక్రవర్తి. (1సర్గ 15వ పద్యం)

ధర్మదేవత పుణ్య తనువు నుండి భూమిపైకి జారిపడిన పాపాల పాదంవలె జారచోర శిఖామణి అయిన బోయ మానవాకారం దాల్చాడు. పాపాల పాదమనే ఉపమానమానికి వనచరుడనే ఉపమేయముతో చక్కని ఉపమాలంకార సామ్యము కనిపిస్తోంది.

మానసమునుండి ధాత్రికి మఱలి వచ్చు
నంచలోయన ఱెక్కలల్లార్చుకొనుచు
సానవట్టిన శస్త్రంబువోని నిగ్గు
టంబరంబునఁదోఁచె శుభ్రాంబుదములు. (1సర్గ 1వ పద్యం)

మానససరోవరమునుండి ఱెక్కలల్లార్చుకొనుచు మరలివచ్చు హంసలా! అన్నట్లు; తెల్లని మేఘాలు ఆకాశంలో అక్కడక్కడా ఉన్నాయి. తెల్లని మేఘాలు హంసలన్నట్లు ఊహించబడింది. ఇక్కడ తెల్లని మేఘాలు విషయం. హంసలు విషయి. అక్కడక్కడా విస్తరించిన తెల్లని మేఘాల ధర్మము; హంసలయందు ఆరోపితమైనందున ఉత్ప్రేక్షాలంకారం.

కన్నులు గానక నీవే
కన్నులుగా బ్రదుకుచున్న కడు ముసళులు నీ
సన్నిధికిఁ బాసిన వసుమతి
నెన్నాళ్ళిఁక నిలువఁగలరొ యెండిన మ్రోడులన్. (3సర్గ 24వ పద్యం)

నీవే తమ కంటిచూపుగా భావించి బతుకుచున్న వృద్ధులు, నీ ఎడబాటుతో ఎండిన మ్రోడులులాగ ఎన్నాళ్ళు ఈ భూమిపైన జీవించగలరో? ఎండిన మ్రోడులు- కడు ముసళులు అనే విషయి-విషయముల మధ్య అభేదము పాటించడంచేత రూపకాలంకారము. గానాన్నీ, కావ్యాన్నీ చెలికత్తెలుగా చేసుకుని విశ్వకళ్యాణాన్ని చేకూర్చే శారదాదేవి సుందర వర్ణన –

దీనులఁజేసి కొందరిని దిక్పతులన్ బొనరించి కొందరిన్
మానవలోకమెల్ల విషమంబుగఁ జేసెడి నాతి కొడలై
గానము కబ్బమున్ జెలిమికత్తెలుగా నిరతంబు విశ్వ క
ల్యాణముఁగూర్చు తల్లిని విలాస కళాసుమవల్లి నెంచెదన్. (సమర్చన 4వ పద్యం)

లక్ష్మీదేవి లక్షణాన్ని పరోక్షంగా చెప్తూ, ఆమె కోడలైన సరస్వతీదేవిని ప్రార్థించిన పద్ధతి, రమణీయంగా సాగింది. అలాగే తన జననీ జనకుల అపార కరుణవల్లనే సాహిత్య ప్రఙ్జ లభించినదని శనగన నరసింహస్వామి అభిప్రాయము.

5.3. చతుర్విధ ఆశ్రమాలు:

భారతీయధర్మం ప్రతిజీవికి నాలుగు ఆశ్రమాలను విధించి మానవతా విలువలు పాటించడానికి బీజంవేసింది. వీటినే చతుర్విధ ఆశ్రమాలని పిలుస్తారు. ప్రతి ఆశ్రమానికి కొన్ని ధర్మాలు ప్రతిపాదించి బ్రహ్మచర్యం, గృహస్థం, వానప్రస్థం. సన్న్యాసం అని నాలుగు దాలుగా విభజించారని తెలిసిందే. వీటిలో గృహస్థాశ్రమం మకుటాయమాన మైనదని ఆదిశంకరులవారు తెలిపారు. దీనికి మండన మిశ్రులవారి జీవితమే పరమోదాహరణ. ఈ విషయం నిషాద జనులనోట శనగన పలికించిన విధానం-

ఆశ్రమ చతుష్కమున గృహస్థాశ్రమంబు
శ్రేష్ఠమని నొక్కి చెప్పవే స్మృతులు, గృహికి
ముక్తి లభియింపదే దైవభక్తికిఁబ్రతి
బంధకములౌనె లౌకిక బంధనములు? (3సర్గ 27వ పద్యం)

దైవభక్తికి లౌకిక బంధనములు ఎప్పటికీ ప్రతిబంధనములు కావు. మానవుల జీవిత పరమావధి ముక్తిని సాధించడం. ఆ ముక్తి సాధనలో నాలుగు ధర్మాలుంటాయి. వాటిలో గృహస్థాశ్రమం ఉత్తమ సాధనమని స్మృతులు సూచిస్తున్నాయి. అందుకే గృహస్థాశ్రమ స్వీకరణ అనివార్యం. బ్రహ్మచారి, బధిర, పంగు, కాపాలికాది అనాథలకు గృహస్థుడే ఆహార దాత కావాలి. ‘గార్హస్థ్యమునకు సరియే’ అనేది అల్లసాని పెద్దన మనుచరిత్రలో సిద్ధుడు -ప్రవరునిలో పలికిన మాటలు స్మరించుకోవాలి.

5.4. గిరిజన ఆహారం:

ఆటవికుల ఆహారపుటలవాట్లు ఈ కావ్యంలో కానవస్తుంది.

వెదురుఁబ్రాలు లేడి కొదమల మాంసము
పుట్టతేనె యిప్పపూలకల్లు
రేపు మాపుదెచ్చి పాపల మేపు నీ
తీయవలపు లెందుఁబోయె నయ్య? (3సర్గ 30వ పద్యం)

వెదురుబొంగుపాలు, లేడి మాంసము, పుట్ట తేనె, ఇప్పపూలకల్లుమొదలైనవి ఆటవికుల ఆహార అలవాట్లుగా అవగతమగుచున్నది. జాతీయాలు, సామెతలు సందర్భాను సారంగా కవి తన కావ్యంలో చొప్పించారు. ఈ విధంగా వాల్మీకి కావ్యంలోని సాహిత్య సౌరభాలు పాఠకుల్ని ఆకట్టుకుంటాయి.

6. భావకవిత్వం:

తెలుగులో ఆధునిక సాహిత్యం వచ్చేసరికి, సంప్రదాయ సాహిత్యాన్ని వెనక్కు నెట్టి, పలు రకాల ప్రక్రియలకు కవులు మొగ్గుచూపారు. మిల్టన్, కీడ్స్, షెల్లీ, వర్డ్స్ వర్త్ వంటి ఆంగ్ల కవుల కవితా ప్రభావంతో తెలుగులో ఆవిర్భవించిన నూతన కవితా ధోరణి భావ కవిత్వం. ఆంగ్లంలో రొమాంటిక్ పోయెట్రీ లేక లిరికల్ పోయెట్రీ అనే పేర్లతో చెప్పుకునే దానికి సమాంతరమైనదే భావ కవిత్వం. నవ్యాంధ్ర సాహిత్య చరిత్రలో ఆంగ్ల కాల్పనికోద్యమ మానస పుత్రిక భావకవిత్వం. దీనికి ఆత్మాశ్రయ సిద్ధాంతమే మూల సూత్రం. కాల్పనిక భావుకతయే మూలతత్త్వం. రాయప్రోలు సుబ్బారావు తో ఈ కవిత్వం తెలుగులో ప్రవేశించిందని చెప్పాలి. దువ్వూరి రామిరెడ్డి “గీతకవిత్వం” అని దీనికి పేరు పెట్టారు దేవులపల్లి కృష్ణశాస్త్రి, నోరి సింహశాస్త్రి “నవ్య కవిత” అని వ్యవహరించినట్టు పైడిపాటి సుబ్బరామశాస్త్రి వ్యాసం (శుక్లపక్షం- భావకవితా వివేచన పుట 8) వలన తెలుస్తోంది.

విశ్వనాథ సత్యనారాయణ, దేవులపల్లి కృష్ణశాస్త్రి భావగీతాలు పట్ల ఎనలేని ఆదరణ చూపించారు. భావ కవిత్వమంటే శనగన నరసింహస్వామి కి అమితమైన అభిమానం. ఈ భావ కవిత్వానికి కవితా వస్తు స్వరూప స్వభావాలు బట్టి ఆత్మాశ్రయ రీతి, దేశభక్తి కవిత్వం, ప్రకృతి కవిత్వం, సంఘ సంస్కరణ కవిత్వం, భక్తి కవిత్వం, స్మృతి కవిత్వం అను ఆరు శాఖలుగా ఆచార్య సి నారాయణ రెడ్డి తన పరిశోధన గ్రంథంలో వివరించారు.

ప్రకృతి అందాలను తిలకించి పరవశించినప్పుడు, పాలు కారే వెన్నెలను ఆస్వాదించినప్పుడు, తమవిద్యా గురువులను తలచుకున్నప్పుడు, పురాణ పురుషుల వ్యక్తిత్వాలు సమాజానికి నివేదించాలని ఉన్నప్పుడు, విరహ వేదములప్పుడు, సమాజ సంస్కరణలు కావాలనుకున్నప్పుడు, భగ్న ప్రేమికుల, ప్రకృతి ప్రేమికుల బాధలు వివరించాలని అనుకున్నప్పుడు, సంఘసంస్కరణాభిలాష కలిగినప్పుడు, సంస్కార శీలియైన శనగన నరసింహస్వామి భావ కవిత్వాన్ని పద్య రూపాలుగా వెలయించారు. దాదాపు 38 కవితలతో కూడిన శారద రాత్రులు అనే శీర్షికతో 1994లో సహృదయ ప్రచురణలు పేరుతో ముద్రించబడింది. ఈ కవితలు భారతి, సమాలోచన వంటి సాహిత్య పత్రికలలోనే కాకుండ, ఆంధ్ర పత్రిక, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి వారపత్రికలు, ఇతర ప్రత్యేక సంచికలలో అచ్చయ్యాయి. వీటిని గమనిద్దాం-
ముసలితనం శరీరానికే కానీ, మనసుకు కాదని తాను శృంగార మాధవుడనేనని, తనది కోకిల కులము అని ఈ కవి ప్రకటించిన పద్యం-

వచ్చెమేనికి నిజముగ వార్ధకమ్ము
మనసునకు లేదు, రాదణుమాత్రమేని
తరుణ శృంగార మధుర మాధవుడ నేను
కలికి పాటల కోకిల కులము మాది! (శారదరాత్రులు -స్వగతం 2వ పద్యం)

చైత్రవంది, శారద రాత్రులు అనే రెండు ఖండకావ్యాలలో వందకుపైగా భావగీతాలున్నాయి. వీటిలో ప్రకృతి, ప్రణయ, విరహ, విషాద, స్తుతి, స్మృతి, చంద్రిక, పర్వ, సంఘం సంస్కరణ, గురువుల గీతాలున్నాయి. ప్రకృతిలో పరవశించే దృశ్యాలకు, ఆనందించని మానవుడు ఉండడు. చిగురాకు కొమ్మపై పదిలంగా కూర్చుని పరమానందకరంగా జంకు గొంకు లేక గళ మెత్తి నా పంచమస్వర విభవంబు పరిమళించేటట్లు పాడతాను. రసికజన పుంగవులంతా పరవశించేటట్టు పాడతాను. అనే ప్రకృతి గీతాన్ని చూద్దాం-

ఈ విశాలవనీ వీధి - ఈ వినూత్న
వత్సరారంభ పర్వ ప్రభాత వేళ-
తరుణ చూత ద్రువాటికాంతమున నాకు
కుదిరి పీఠమ్ము చిగురాకు కొమ్మ పైని! (శారద రాత్రులు పుట 3)

ఆమ్రశాఖిపై అందంగా కూర్చుని ఆలపించే కోకిల గానం అంటే ఈ కవికి అత్యంత ప్రీతి. కోకిల రావానికి ఆనందించని మానవుడు అరుదు.

ప్రణయ గీతాల్లో ప్రణయం అమలినమైనదే. మనిషి మనసుకు కలిగే ఆర్తిని ఓదార్చడానికి ప్రణయానికి మించిన మందు లేదనేది శాస్త్రజ్ఞుల మాట. ప్రణయానికి మూలమైన యౌవనమును, అమృతముతో పోలుస్తూ వెనక్కి రాని కాలము పట్ల జాగ్రత్త వహించి యౌవనామృతమును బిందువైనా మిగల్చకుండగా త్రాగుదామని పలికిన ప్రణయ గీతాన్ని పరిశీలిద్దాం-

గతము గతంబెకాని క్షణకాలము వెన్కకురాదు భావి యే
గతి కడతేరునో తెలియగా నగునే మతి కల్గువారికీ
క్షితి నొక వర్తమానమె సుసేవ్యము దుర్లభమైన యౌవనా
మృతమును బిందువైన మిగిలింపక తాగుదమింక నెచ్చెలీ! (చైత్రవంది పుట 130)

ప్రకృతి వైభవాన్ని అన్వయిస్తూ “మధు విభావరి మధుకర వధువు పెండ్లి” అత్యంత మనోహరంగా రచించాడు. ఈ వివాహానికి తరుణ సహకార శాఖల తళుకులీనుతున్న తొగరుటాకులే అందాల తోరణాలు. ప్రథమ కోయిల మనోజ్ఞమైన కాకలీ కూజనములే మంగళ వాయిద్యాలు. మల్లికావల్లరీ భాసమానమైన సురభిల కళ్యాణ మండపము. వయ్యారమైన మరాళం నృత్య భంగిమలు. అట్టి వివాహానికి యుగయుగాల నుండి సమస్త ప్రాణికోటికి ప్రణయాన్ని ఉద్దీపింపజేసే మన్మధుడే పురోహిత బ్రాహ్మణుడు. “ఇక విందు సంగతి సరేసరి. పసరుటాకులలో పుష్ప రసమే విందు”. ఆ ప్రణయం-

పసరు టాకులలో పుష్ప రసము విందు
కాన్క లిడవచ్చు నెయ్యమికాండ్రకెల్ల
పూలరేకుల మెఱుగు పుప్పొడుల బంతి
తరలి వచ్చిన వయసు ముత్తయిదువలకు
కలికి నవ్వుల విరుల తావులపసందు
సరస చాంద్రీ ముహూర్త ప్రశాంత మధుర
మధు విభావరి మధుకర వధువు పెండ్లి
వత్తురా మీరు తద్వైభవంబు చూడ! (చైత్రవంది పుట 129)

సఖి ప్రణయము పారము లేనిది. సఖి ఒడి చంద్రుని కన్నా, చందనం కన్నా, పుష్పముల కన్నా. నక్షత్రముల కన్నా, అత్యంత శీతలం. అలాంటి ప్రశాంత శీతలమయమైన సఖి ఒడిలో శిరస్సు మోపి మరణించే భాగ్యాన్ని ప్రసాదించుమని కవి వేడుకుంటున్నాడు.

తెలుగు వారికి నూతన సంవత్సరం అంటే ఉగాది. అప్పటినుండి ప్రారంభమైన పండుగలకు ఒక్కో పండుగకు ప్రత్యేకమైన విధానం, నేపథ్యం, అంతర్లీనంగా మానవుల జీవన విధానం, ఆరోగ్యాభివృద్ధి మొదలైన విషయాలు ఇమిడి ఉంటాయి. ఇలాంటి పండుగల వైశిష్ట్యాన్ని, కవి ఆయా సందర్భాలలో కవితా రూపంలో, అందించిన పద్యాలు, ఆనాటి పత్రికలు ముద్రించాయి. అందుకనే ఈ కవికి “పర్వదిన కవితా చక్రవర్తి” అనే బిరుదు వచ్చింది. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగ సంబరాలను వర్ణించాలనే తలపుతో కూడు గూడు లేని అభాగ్యుల కడగండ్లు వివరించిన సందర్భంలో “నీకు ఎవరు స్వాగతం చెప్తారు? కలవారి గుమ్మాల వద్దకే వెళ్ళు”! అంటూ కవి వ్యంగ్య వైభవంలోని పద్యం.

కూడు లేని అనాథుడా! కొంపలేని
దీనుడా! చలికల్లాడు మానధనుడ!
ఎవ్వరిత్తురు స్వాగతం బిచట నీకు?
పొమ్ము! సంక్రాంతి! కలవారి గుమ్మములవె! (చైత్రవంది పుట 35)

దీపావళి రోజు పద్యం నిరాశావాదంలో ఇలా ఉంది-

దీపమే లేని జనుషాంధదీన మంది
రాంతరంబుల నగ్న నాట్యంబు ద్రొక్కు
కటిక చీకటి రాకాసి కడపలేక
దివ్య దీపావళియె తలదించుకొనెనె! (చైత్రవంది పుట 125)

వియోగ గీతిక అనే పేరుతో రచించిన ఈ సుందర కవిత-1990 భారతి మేనెల సంచికలో ముద్రించబడింది. కవి ఉద్దేశంలో విరహ గీతం మానవాకృతి దాలిస్తే అది దేవులపల్లి కృష్ణశాస్త్రి అవుతుంది. ఈ విషయాన్ని ఇలా రచించాడు-

ఒక్క గంధర్వ సుందరుండక్కట! తరు
ణీ వియోగ వ్యధాగాన కేవలుండు
కేళి వనిలోన తిరుగాడు వేళ జారి
ధరణి పైబడె నొక చిన్న విరహ గీతి! (శారద రాత్రులు, పుట 11)

భావకవులు చంద్రుడు-చంద్రిక వర్ణనలు తమ కవిత్వంలో వర్ణిస్తుంటారు. మానవుని ప్రశాంతతకు ఈ రెండు ఉన్నప్పుడే ప్రణయం పుడుతుంది. ప్రణయం కలిగినప్పుడే విరహం. అది ఉన్నప్పుడే వేదన ఉంటుంది. కాబట్టి భావకవుల గీతాలకు మూలం చంద్రుడు-చంద్రికలే. నరసింహస్వామి కూడా తమ కవిత్వంలో ఈ రెండిటిని అందమైన భావ గీతాలుగా రచించారు. చైత్రవంది అనే కవితా సంకలనంలోని శశి వింశతి అనే పేరుతో 20 పద్యాలు చంద్రుని చంద్రికలను సుందరంగా, వైభవంగా వర్ణించారు. చంద్రుడు సముద్రంలో జన్మించాడు. ఎన్నో జంటలకు ఆనందాన్ని పంచే రాయబారిలాంటివాడు. చంద్రుని చిత్రణ గమనిద్దాం.

మూడు జగంబులున్ నిదుర మున్గి విరామముల నొందుచుండ, మో
మోడక యర్ధరాత్రమున నుజ్జ్వల వేషము దాల్చి, చుక్క పూ
బోడుల మధ్య నోలగము పొంది ధరాపతి భంగి నాడుచుం
బాడుచు గాలముం గడపు పార్వణ చంద్రుడు మిమ్ము నేలుతన్. (చైత్రవంది పుట 85)

లక్ష్మీ సహోదరుడైన క్షీరసముద్రరాజ తనయుడైన ఆ శశిబింబము కురిపించే వెన్నెల ఈ చరాచర జగత్తుకు ఆనంద ప్రదాయకం, ఆరోగ్యదాయకమే కదా! అమృత కలశం పగిలినట్లుగా, కామధేనువు క్షీర ధార క్షితికి దిగిందా! అన్నట్లుగా వెన్నెల ఉంది. అంత స్వచ్ఛంగా, నిర్మలంగా, అక్షయంగా చంద్రికలు వీస్తున్నాయి. ఈ వెన్నెల వైనాన్ని వైభవంగా వర్ణించిన ఈ కవికి చంద్రికలు పరోపకృతికి పేరు మోసిన ఉపకార రూపాలుగా భాసించాయి. ఈ పద్యం-

అమృత కలశమ్ము పగిలెనో! అమర సురభి
క్షీర ధారా పరంపర క్షితికి దిగెనొ !
త్రాగబోవుదు రేయెల్ల తడియబోదు
నింత వెన్నెల ఇందాక నెచట దాగె! (శారద రాత్రులు పుట 69)

ఈ విధంగా చాలా పద్యాలు చంద్రుడు-చంద్రికల గీతాలను కవి రచించాడు.

నరసింహ స్వామి స్తుతి గీతాల పరంపరలుగా రాశారు. ఇది పురాణ పురుషులు లేక భక్తుల స్తుతి గీతాలు, కవి పుంగవుల స్తుతి గీతాలు అనే రెండు రకాలుగా సాగింది. తన గానామృతంతో భారతీయులను ఆనంద పరవశంలో ఓలలాడించినవారు మహాకవి త్యాగయ్య. మానవ జీవిత పరమార్థాన్ని తన కీర్తనల ద్వారా లోకానికి తెలియబరచిన భక్తాగ్రగణ్యుడు, కర్ణాటక సంగీత విద్వన్మణి, నాదయోగి త్యాగయ్య. నిధికోసం కాకుండా, రాముని సన్నిధికోసం సంకీర్తనలు రాసి, పాడి, తరించిన నిగర్విగా, నిష్కామయోగిగా శనగన వర్ణించారు. శ్రీరామచంద్రుని రకరకాలుగా స్తుతించిన పరమభాగవతోత్తముడైన పోతన గారే, త్యాగయ్య రూపంలో మరల జన్మించినారని కవి రమ్యమైన భావన.

భాగవతంబునందు బహుభంగుల శ్రీహరి ప్రస్తుతించియున్
భాగవతోత్తముండయిన బమ్మెర పోతన తృప్తిగాంచమిన్
త్యాగయ! నీవయై మఱల ధారుణిపై నుదయించె గానిచో
సాగునె రాజ సత్కృతులు సైపని పావనగాన సాధనల్? (శారద రాత్రులు పుట 78)

లోకంలో కార్యకారణ సంబంధమైన జగత్తు రహస్యాలను హేతుబద్ధంగా ప్రవచించిన ఆ బుద్ధజ్యోతి మరోరూపమే ఆచార్య నాగార్జనుడంటూ, మహాయాన బౌద్ధ ప్రతిపాదిత విజ్ఞానాన్ని ఈ కవి వినిపించిన అక్షరమత్తేభాన్ని విలోకిద్దాం.

భ్రమలే సత్యములంచు వెంటబడు విశ్వక్షోణిపై హేతువా
దము బీజంబులు చల్లినట్టి అల బుద్ధజ్యోతియే నీదు రూ
పముతో గ్రమ్మరదోచి మాధ్యమిక తత్త్వంబాదిగా పెక్కు గ్రం
థములంగూర్చి తమస్సు తూల్చెననుచున్ సర్వజ్ఞ!భావించెదన్. (శారదరాత్రులు పుట 80)

మాధ్యమికవాదప్రబోధకుడైన ఆచార్య నాగార్జునుని స్తుతిస్తూ, పది పద్యాలను ఆకాశవాణి- విజయవాడ కేంద్రంనుండి 1982లో ఈ కవి రాసిన ఖండ కవిత ప్రసారమైంది. ఆచార్య నాగార్జునుడు సంచరించిన ప్రాంతము శ్రీపర్వతము. ఇది నేటి నాగార్జున విశ్వవిద్యాలయమునకు చేరువలోనుండెడిది. ఆయన పేరుతో ప్రారంభించినదే ఈ విశ్వ విద్యాలయము, నాగార్జున సాగర్ ప్రాజెక్టు.

తెలుగు కవిత్వానికి, నిర్మాణాత్మక రూపాన్ని ప్రసాదించిన, తెలుగు మహాభారత రచనకు శ్రీకారం చుట్టిన ఆదికని నన్నయభట్టును శనగన తన24 పద్యాలలో కీర్తించారు. ఇవి కవి పుంగవుల స్తుతి గీతాలు.

వ్యాకరణమ్ము శబ్ద విభవంబును జాలని బాలభాషలో
వాకొననౌనె భారతమువంటి మహాకృతి నెవ్విధాన ర
మ్యాకృతి దీర్చినాడవొ కదా! తలపోసిన గుండె వ్రీలు వా
ల్మీకివి నీవు మా తెలుగు మేదిని కైతకు శబ్దశాసనా! (శారద రాత్రులు పుట 54)

తిక్కన, ఎర్రన, శ్రీనాథ, పెద్దనాది కవులు పెద్ద గ్రంథాలు వెలయించడానికి, నీవు ఏర్పరచిన రచనా మార్గమే కదా! నన్నయ్య మహాకవీ! అని కీర్తించారు. ఋషివంటి నన్నయ రెండవ వాల్మీకి అని విశ్వనాథ సత్యనారాయణ కీర్తించిన మాట ఈ కవి పద్యంలో గుబాళించింది.

భావ కవితా ప్రపంచంలో తన ప్రశాంత భావ కవితా వీచికలతో దీపావళిని ప్రజ్వరిల్లజేసిన భావుకుడు వేదుల వారు. వెన్నెల కాసినట్లు, పిక బృందము కూసినట్లు, తిమ్మెరలు సన్నగా సాగినట్లు, సుమ సౌరభములు ప్రసరించినట్లు, వెన్నుని వేణువు ధ్వనించినట్లు వేదుల వారి కవిత్వం ఈ కవికి గోచరమైంది. వాగర్ధములకు అద్భుత ప్రణయ దాంపత్యాన్ని సంధించిన కవివరేణ్యుడని వేదుల వారిని ఈ కవి ప్రస్తుతించాడు. నవయుగ కవిచక్రవర్తి, కవికోకిల గుర్రం జాషువా పలికినదల్లా పద్యం, పాడినదల్లా కావ్యమై భాసించిందని శనగన తన పద్యాలలో వినుతించారు.

ఈ కవి విషాదగీతాలకు ఉదాత్తభావన అందిస్తాడు. ప్రతి నిమిషం పంకిలభావభంగతుంగ హృదయసముద్రం ఉప్పొంగుతుంటుంది. వెనువెంటనే కృంగిపోతుంటుంది. వేదనారూప బడబానలాన్ని తనలో దాచుకుని మనసు కుమిలిపోతుంటుంది. ఈ మనసు అనే సముద్రంలో ముత్యాలు, పగడాలు వంటివి చూడలేరు. నత్తలు, ఆల్చిప్పలు మాత్రమే కనపడతాయంటూ విషాద రచన చేసిన పద్యం చూడండి-

కాలకూట వైశ్వానర జ్వాలలందు
తప్తమయ్యెను స్వాంత రత్నాకరమ్ము
తడవి చూడగ లేవు ముత్యములు, మణులు,
పగడములు నత్త లాల్చిప్పలును గాక! (చైత్రవంది పుట 3)

గురు గీతాలలో నండూరి వేంకట రామకృష్ణమాచార్యులు రచనలు, బోధన, వారి వ్యక్తిత్వం మొదలైనవి ప్రస్తుతించారు. వారి ధర్మపత్ని శ్రీమతి సుభద్రమ్మ అందించిన అతిథి సేవనం మరపురానిదన్నారు. ఆచార్యుల వారి ఇంట్లో నిత్యం నటులో, పాఠకులో, కవిత్వపారీణులో, నాట్య ప్రవీణులో, సాహితీ వ్రతులో, శిష్యులో తమ బహు కళా పారవస్య లీలా వినోదాలు సలుపుతుండేవారు. అలాంటి వారందరినీ అభిమానంతో ఆదరిస్తూ, అతిథి సమర్చనంలో కాశీ అన్నపూర్ణమ్మతో పోటీపడే పరమ సాధ్వి. నండూరి వంశ వధూ జనోత్తమ సుభద్రమ్మ అంటూ తన భక్తి ప్రపత్తిని కృతజ్ఞతా భావాన్ని నరసింహస్వామి లా ప్రకటించారు.

అమ్మ విధాన మమ్ము మధురాదర వైఖరి జూచు మా సుభ
ద్రమ్మను సంతతాతిథి సమర్చన కాశిక అన్నపూర్ణనే
పొమ్మన జాలు సాధ్విని ప్రభూతపు భక్తి నమస్కరింతు డెం
దమ్మున దేశికాంగనను నండూరివంశ వధూజనోత్తమన్!. (శారద రాత్రులు పుట 61)

అని గురుపత్నిని నుతించి, నండూరి వారికి ఇలా ప్రణమిల్లారు-

జవ్వనంబున యందె సాటివారౌనన
ప్రాచ్యభాషాధ్యక్ష పదవి గనవొ!
వేవేల శిష్యుల వీనులు పులకింప
క్రొంగ్రొత్త తెనుగును గుప్ప లేదొ!
బహు కళాశాలలు భక్తిమై వరియింప
కులపతి గద్దెపై కుదురు కొనవొ!
తిక్కన్న భారత దివ్యతత్త్వము త్రచ్చి
శోధక పట్టంబు చూరగొనవొ!
సరస కృతులను పెక్కింటి జలుపలేదొ!
ప్రగతి గీతలు గొంతెత్తి పాడుకొనవొ!
స్వామి! గురుదేవ! తక్కువయేమి నీకు?
ధన్య ధన్యంబు భవదుపాధ్యాయ భవము!! (శారద రాత్రులు పుట 63)

గురు కరుణా కృపాకటాక్ష వీక్షణలవల్లనే తాను వృద్ధిలోకి వచ్చానని శరణాగతితో, వినయ, విధేయతలతో గురువుకు పద్యదక్షిణ సమర్పించడం నరసింహస్వామి గురుభక్తికి నిదర్శనం. గురువును త్రిమూర్త్యాత్మక స్వరూపంగా కవి భావించాడు. పత్రము, పుష్పము, ఫలము, తోయము భక్తితో ఈశ్వరునకు సమర్పించినట్లుగా గురుదేవులకు పద్య సుమాలను శనగన సమర్పించారు.
దువ్వూరి వారు అనగానే తెలుగు వారందరకు గుర్తుకు వచ్చేది వారి బాలవ్యాకరణ రమణీయ వ్యాఖ్య. తెలుగుదేశంలో వేలకు వేలు శిష్యులను కలిగి, సరస సంభాషణ చేస్తూ, శిష్యులకు దిశానిర్దేశం చేస్తూ, మహర్షిగా జీవితాన్ని గడిపిన దువ్వూరి వేంకటరమణశాస్త్రిని గురుదేవా! అంటూ పద్యసుమాలమాలను అందించారు.

అల్లారుబిడ్డవై అమ్మ సీతమ్మతో
ఏకాంతమున ముచ్చటించువాడ!
కలభాషిణీ కావ్య కన్యా రహస్యాలు
చిత్ర చిత్రములుగా చెప్పవాడ!
కావ్యమ్ము పోలిక కమ్మగా, గడుసుగా
తెల్గు వ్యాకృతిని బోధించువాడ!
తెలుగుదేశము నాల్గు దిక్కుల యందును
వేవేలు శిష్యులు వెలయువాడ!
సరస సంభాషణంబున చారువేష
ధారణంబున నొక క్రొత్త దారి వాడ!
సూరితో శబ్దశాస్త్ర గోష్ఠులను నెఱప
దివము చేరితివే! గురుదేవ! నీవు!

ఈ విధంగా తనకు విద్య బోధించి, సంస్కారాదులు మప్పి, తమ జీవనానికి, సాహిత్య జీవితానికీ కారకులైన గురుదేవులను స్మరించడం ద్వారా శనగన సంస్కారవంతుడుగా గుర్తింపబడ్డారు.

ఆంధ్ర షెల్లీగా లబ్ద ప్రతిష్టుడైన భావకవి దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి ప్రభావం ఈ కవిపై విశేషంగా కనిపిస్తుంది. దేవులపల్లి వారి భావకవితా శైలీవిన్యాసం, తలవెండ్రుకల విలక్షణత, పంచ కట్టు, మొదలైన ప్రత్యేకతలన్నీ శనగన వారి రచనలోనూ, ఆకారంలోను కొట్ట వచ్చినట్టు కనిపిస్తాయి. 1981లో దేవులపల్లి భౌతిక దేహాన్ని వీడినప్పుడు తెలుగుదేశం నిలువుటద్దం బద్దలయింది, షెల్లీ మళ్లీ మరణించాడు, వసంతం వాడిపోయిందంటూ శ్రీశ్రీ వాపోయాడు. ఈ మూడు పరితాప వాక్యాలను గ్రహించి, శనగనవారు 17 పద్యాలలో స్మృతి కవిత్వాన్ని కరుణసాత్మకంగా రచించారు. ఇవన్నీ నాటి సాహిత్య పత్రికల్లో ముదితమయ్యాయి.. విరహ గీతానికి రూపం వస్తే అది దేవులపల్లిలా ఉంటుందంటారు నరసింహ స్వామి. దేవులపల్లి వారి రూపాన్ని మాటల్లో ప్రత్యక్షీకరించారు.

సొగసు గలవాడు గిరజాల జుట్టు వాడు
ధవళ వసనాలవాడు క్రొందళుకువాడు
సరస ఫణితులవాడు రాచరికపు మరి
యాదలెరిగిన వాడు ప్రాయంబు వాడు! (శారదరాత్రులు పుట 47)

సుందరుడైన దేవులపల్లి కేళీవనంలో తిరుగుతున్న వేళ, జారిపోయి చిన్న విరహగీతి రూపంలో ధరణిపై పడిన వెంటనే, భూమండలంపై, బాష్ప గీతాలు కోకిలాకృతిని ధరించాయి. అప్పటినుండి గళమెత్తి ఆర్ద్ర గీతాలను ఆలపించడం ప్రారంభించారంటూ శాస్త్రి కవిత పటుత్వాన్ని ఈ కవి స్మరించారు. భావ కవిత్వంపై మొదటిసారిగా తిరుగుబాటు చేసిన వారినిగా శ్రీశ్రీ, శిష్ట్ల, నారాయణబాబులను చెప్పుకోవాలి.

గీతాంజలి, జేత, సౌమ్య సూక్తం, భస్మపానం, రమణీయం, శంకుసాల, సామిధేని, ప్రణయసూక్తం, మధు చషకం, సాధారణ సాధువాదం, దీప శిఖలు, ధిక్ ధిక్, తారామైత్రి, విక్రమ శశాంకం, దీపకేళి, శశివింశతి, విస్మృత శశాంకం వంటి శీర్షికల రచనలతో శనగన భావకవిత్వానికి బలం చేకూర్చారు.

పంజర శుకి శీర్షికతో రాసిన భావ కవిత్వంలోని పద్యాల్లోని సారాంశం తెలుసుకుందాం. శుకమనగా చిలుక. పైగా పంజరంలో బంధించినదీ చిలుక. దీనిని దళితులకు అన్వయించి భావ కవిత్వాన్ని వెలయించాడు. ఎక్కడా దళితుడు అనే పదంగాని, దీనుడు అనే పలుకు గాని కనపడదు. పంజరంలో చిలుక యజమాని పలికిన పలుకులు మాత్రమే తిరిగి అనగలుగుతుంది. యజమాని నేర్పిన మాటలే కానీ, వేరే కొత్త మాటలు పలుకలేదు. ఇనుప పంజరమే కానీ బాహ్య జగత్తు కొంచమైనా దానికి తెలియదు. దళితునికి కూడా తమకు తాము యజమానులుగా భావించుకునే ధనాధికులు ఇలాగే వ్యవహరిస్తారు. ఈ దళితులకు, ఆ ధనికులు తాము చెప్పినదే విద్య, అదే నీతి, అదే వేదం, తాము చూపేదే ప్రేమ, వారు అనుగ్రహించి ఇచ్చిందే ముఖ్య భుక్తి అని నమ్మించారు. ఇలా తమవద్ద పనిచేసే దళితుల జీవితాలను నట్టేట ముంచారు. జ్ఞాన సముపార్జనకు, విశాలవిశ్వం వైపు వారు చూపు మరల్చకుండా పంజరంలో చిలుకవలె దళితులను సంపన్నులు బంధించారనే ఆవేదన ఈ కవితలో కనిపిస్తుంది. సమాజంలోని బాహ్య జగత్తుకు దూరంగా, ఆధిపత్యమనే పంజరంలో బంధించి, వారిని నిత్య అజ్ఞానులుగా మార్చిన వైనమే పంజరశుకి శీర్షికకు మూల సూత్రం.

ఈ చతుస్సాగరాంత మహీతలమ్ము
విపులమని కాని పరతంత్ర వృత్తికరము
హేయ మని కాని మది తలపోయదయ్యె
ఎగుర గలనను మాటయే యెపుడొ మఱచె! (చైత్ర వంది పుట 46)

శనగన నరసింహస్వామి తన కవిత్వంలో అన్ని రకాల ఛందస్సులను ప్రయోగించారు. రెండు కవితా సంపుటాలలోనూ, తెలుగు వారు సహజంగా ప్రయోగించే వృత్త పద్యాలు, దేశీ ఛందస్సులైన కందం, తేటగీతి, ఆటవెలది, సీస పద్యాలను అత్యధికంగా ఉపయోగించారు. ముత్యాలసరాల మాత్రాఛందాన్ని అక్కడక్కడ ఉపయోగించారు. రకరకాల ప్రాసలు దుష్కర ప్రాస, సంయుక్తాక్షర ప్రాస, అంత్య ప్రాసలు పాటించారు. కొన్ని చోట్ల ప్రౌఢ శైలితో నారికేళ పాకాన్ని రుచి చూపించారు. సాధారణంగా సరళంగానే ఈ కవి రచన నడిచింది. ఈ రెండు ఖండకావ్యాల్లోనూ భావానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. సందర్భానుసారంగా ప్రయోగించిన అలంకారాలు, భావాల్లో ఒదిగిపోయాయి. ఉపమ, రూపకం, అతిశయోక్తి, ఉత్ప్రేక్ష, వ్యాజ స్తుతి, సందేహము మొదలైన అలంకారాలు ఈ కవి రచనల్లో కనిపిస్తాయి. లోకోక్తులు, జాతీయాలు, సామెతలు భాషకు వెన్నెముక వంటివి. సమర్ధుడైన కవి భావవ్యక్తీకరణకు విషయ వివరణనకు వీటిని సాధారణంగా ఉపయోగిస్తుంటారు. భాషా మర్యాదలను గౌరవించడమేకాక, అల్పక్షరాలలో, అనల్పార్ధ ప్రయోజనాన్ని సాధించినట్లు అవుతుంది. దూరపు కొండలు నునుపు, పూర్వజన్మ ఫలం అనుభవించడం, చిలికి చిలికి గాలి వాన, కులమును చెరుపంగా జాలుడే క్రూరొకడు, నీ చిత్తం మా భాగ్యం, చెడగొట్టడం తేలిక కాదు, గత కాలం కన్నా వచ్చే కాలమే మిన్న, తేనె పూసిన కత్తి, మేక వన్నె పులి, గోముఖ వ్యాఘ్రం, పయోముఖ విషకుంభం, మొహం వాచిపోవడం వంటి భాషా సొగసులు ఈ కవి రచనల్లో గోచరిస్తాయి.

7. ముగింపు:

పద్యం కలకాలం తెలుగు ప్రజల హృదయాలలో పదిలంగ ఉండాలని నమ్మి పద్యరచన చేసినవాడు శనగన నరసింహస్వామి. భావకవిగా, అభ్యుదయకవిగా, మానవతావాదిగా, నాటక కర్తగా, పర్వదినకవిచక్రవర్తిగా, సాహిత్యసభల వ్యాఖ్యాతగా, కర్షకకవిగా, దళితకవిగా, నీతిసందేశాల ప్రవాచకుడుగా, నిరాడంబరకవిగా, ఉత్తమఅధ్యాపకుడుగ ఆధునికతెలుగుసాహిత్యంలో ప్రకాశిస్తున్నాడు. అందుకే నరసింహ స్వామి రచనలు కలకాలం చిరస్థాయిగా నిలిచి ఉంటాయి. తెలుగు సాహిత్యచరిత్రలో ఈ కవిని గురించిన వివరాలు పొందుపరచాల్సిన అవసరం ఉందని నమ్ముతున్నాను. ఈ విధంగా శనగన నరసింహస్వామి సాహిత్యసౌరభాన్ని గమనించగలము.

8. ఉపయుక్తగ్రంథసూచి:

  1. నరసింహ స్వామి, శనగన. చైత్రవంది. ప్రతిభ కావ్యమాల, గుణదల, విజయవాడ. 1978
  2. నరసింహ స్వామి, శనగన. రత్నపాంచాలిక. గంగాధర పబ్లికేషన్స్, విజయవాడ. 1971.
  3. నరసింహ స్వామి, శనగన. వాల్మీకి. సహృదయ ప్రచురణలు తెలుగు శాఖ, ఆంధ్ర లయోల కళాశాల, విజయవాడ. 1977.
  4. నరసింహ స్వామి, శనగన. శారదరాత్రులు. సహృదయ ప్రచురణలు. తెలుగుశాఖ, ఆంధ్ర లయోల కళాశాల, విజయవాడ. 1994.
  5. బాపు రెడ్డి, జె. ఆధునిక తెలుగు కవిత్వం తీరు తెన్నులు. జూబిలీ ప్రచురణలు, హైదరాబాద్. 2007.
  6. రంగనాథాచార్యులు, కె.కె. (సం.) ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు. ఆంధ్రసారస్వతపరిషత్. హైదరాబాద్. 1980. 
  7. రఘునాథనాయకుడు. వాల్మీకి చరిత్రము. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, హైదరాబాద్. 1968.
  8. వీరభద్రయ్య, ముదిగొండ. తెలుగుకవిత: సాంఘికసిద్ధాంతాలు. శ్రీ అరవిందసొసైటీ, హన్మకొండ. 1980. 
  9. సుబ్బరాయశాస్త్రి, పైడిపాటి. శుక్లపక్షం- భావకవితా వివేచన. విజయవాడ.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]