"కమనీయం తెలుగు రామాయణం"
జాతీయసదస్సు నవంబర్-2023 ప్రత్యేకసంచిక
(ప్రభుత్వ డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి) సిద్ధిపేట, సిద్ధిపేట జిల్లా, తెలంగాణ రాష్ట్రం.)
AUCHITHYAM | Volume-4 | Issue-15 | December 2023 (Special Issue) | ISSN: 2583-4797 | UGC-CARE listed
5. శ్రీమద్రామాయణకల్పవృక్షం శ్రీరాముని లక్షణాలు: మనుజధర్మం
డా. కె.ఎల్. జ్యోతిర్మయి
ఆంధ్రోపన్యాసకురాలు,
ఎస్.వి.జె.వి. సంస్కృత కళాశాల, కొవ్వూరు,
తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9494008879, Email: lalithajyothirmayee@gmai.com
Download
PDF
వ్యాససంగ్రహం:
మానవునకు ఆచరణీయములుగా చెప్పబడిన వివిధములైన కర్తవ్యాలు, విధులు అన్నీ ధర్మములే. తన జీవితంలో వివిధ దశలలో నిర్వర్తింపవలసిన క్రియా కలాపములు, ఆచరించవలసిన కర్మలన్నీ మానవుడు మృత్యు పర్యంతం నిర్వహించవలెను. బాల్యం, కౌమారం, యౌవ్వనం, వార్ధక్యంలో నిర్వహించవలసిన పుత్ర, శిష్య, వ్యక్తి, సంఘ మొదలైనవన్నీ మానవ ధర్మాలే అనబడతాయి. ఇందులో కొన్ని సామాన్యం కాగా, కొన్ని విశేష ధర్మాలు. ప్రతీ మానవుడు నిర్వర్తించు కొన్ని విశిష్టమైన వ్యాపారములు కూడా ధర్మములే అనబడుచున్నవి. మానవ అవతారం ఎత్తినందుకు గాను మానవ ధర్మాలకు రాముడు కూడా అతీతుడు కాడు. దేహంతో పాటుగా వచ్చిన దేహ సంబంధమైన ధర్మాలను రాముడు నిర్వర్తించాడు. ఆయనకు కూడా తన జీవితంలో జరిగిన మంచి సంఘటనలకి ఆనందించడం, చెడు వాటికి దుఃఖించడం, దిగులు చెందడం, సంయోగ వియోగాలు, సుఖదుఃఖాలు, శత్రుత్వ మిత్రత్వం, వైరాగ్య సంసారం, ఉద్వేగ ఔదా సీన్యాలు, హాస్యం, ఇతరులతో ఉల్లాసమాడుట అన్న మానవ సహజమైన లక్షణాలన్నీ ఉన్నా లేనట్లుగా ప్రవర్తించి ఈయన సామాన్య మానవుడు కాడు అని ఇతరులు అనుకునేటట్లుగా ఉండటం ఆయనలో ఉన్న విశేషం.. విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షంలో శ్రీరాముని మానవ లక్షణాలు, మనుజ ధర్మం ఏ విధంగా ఉన్నాయో కొన్నింటిని చూపిం చే ప్రయత్నం నా ఈ వ్యాసం యొక్క ము ఖ్యోద్దేశ్యం.
Keywords: శ్రీరాముడు, కరుణస్వభావం, హాస్యశీలం, కోపస్వభావం, దుఃఖస్వభావం, మనుజధర్మం.
1. ఉపోద్ఘాతం:
మానవునిగా జన్మించినందుకు మానవుడు మానవ సహజమైన లక్షణాన్ని కలిగి ఉండాలి. మానవుని మానవ ధర్మంలో భాగం ఈ మానవ లక్షణాలు లేదా గుణాలు. ఈ గుణాలు మంచి చెడులను అనుసరించి మానవుల్లో ఉత్తమ, మధ్యమ, అధమ అని మూడు రకాలుగా ఉంటుందని నా అభిప్రాయం. ఉత్తమ లక్షణాలు కలిగిన మానవుడు మంచి ప్రవర్తన కలిగి అందరి మన్ననల్ని పొందుతాడు. వీరు ఇంటా, బయట సుఖంగా, సంతోషంగా ఉంటూ వారి చుట్టూ ఉన్నవారిని కూడా ఆనందంతో ఉండేలా చక్కని ప్రవర్తనతో మెలుగుతూ జగత్తుకు ఆదర్శప్రాయంగా నిలుస్తారు.
మానవునిగా జన్మించినందుకు జన్మతో లభించిన కర్మలు, కర్మ ఫలాలు అనుభవించక తప్పదు అని మన ఆర్ష విజ్ఞానం తెలియపరుస్తుంది. సుఖదుఃఖాలు, కామ క్రోధాలు, ఖేద మోదములు మొదలగునవి దేహధర్మాలు. ఇవన్నీ అనుభవించక తప్పదు. మానవుని జీవితంలో అనేక సంఘటనలు అనేక సందర్భాలలో వాటికి తగినట్లుగా ఉండటం అనేది మానవుని సహజ లక్షణం. ప్రతీ మానవుడు తన జీవితంలో మంచి సంఘటనలకు ఆనందించడం, చెడు వాటికి దుఃఖించడం, దిగులు చెందడం, దైన్యం అనుభవించడం, కృతజ్ఞతానుగుణం, కరుణ స్వభావం, హాస్యశీలం, వైరాగ భావాలు, క్రోధ, దైన, దుఃఖ స్వభావాలు కలిగి ఉండటం అనేవి సర్వ సహజమైన లక్షణాలు.
2. శ్రీ రాముని మానవత్వ లక్షణాలు - కొందరి అభిప్రాయాలు:
"మానవుని యందెట్టి విశిష్ట గుణములుండవలెనని చెప్పబడునో అట్టి ఉత్తమ గుణములన్నియూ మూర్తిభవించినవాడు శ్రీరాముడు. ఆయన దయ, ఔదార్యం, ధైర్యం, సౌమ్య భాషణం, వాత్సల్యం, మితభాషత్వం, క్షమ, కృతజ్ఞత, న్యాయవర్తన, అన్యులను ఆదరించుట, పెద్దల యెడ వినయ వర్తనం, కర్తవ్య నిష్ఠ, క్రమశిక్షణ, అచంచలమైన ఏకపత్నీ వ్రత నిష్ఠ మున్నగు సద్గుణ గణ విరాజితుడై విలసిల్లినాడు.”1
"శ్రీరామచంద్రుని చిత్రించు సందర్భమున అతని దివ్య శరీర సౌందర్యంతో పాటుగా అతని మానసిక సౌందర్యం, మమత, వాత్సల్యం, ప్రేమ, దయ, స్నేహం, క్రోధం, వీర్యం, పరాక్రమం, క్షమా, అహింస, సత్యనిష్ఠ మొదలగునవే కాక పరిస్థితులకు ఎదురు నిలిచి కర్తవ్యం కోసం కఠోరంగా నిలవగల అద్భుత శక్తితో పాటు కష్టాలకు తాత్కాలికంగా చలించి తిరిగి స్థిరంగా నిలబడుటకు కావలసిన ఇంద్రియాలు అదుపులో పెట్టగల ఆత్మ సంయమనాన్ని నిరూపించి వాల్మీకి అతనిలో మానవత్వాన్ని వికసింపజేసి పూర్ణంగా ప్రతిష్టించి ఉన్నాడు"2
శ్రీరామునిలో మానవత్వ లక్షణాలకు సంబంధించిన ఈ అభిప్రాయాల్ని కావూరి పాపయ్యశాస్త్రిగారు తమ పరిశోధన గ్రంథంలో ఉటంకించారు. వాటిని ఇక్కడ విశదపరిచాను.3
మానవుని లక్షణాలు, మనుజ ధర్మం అనేవి శ్రీరామునిలో ఉన్నవి. విశ్వనాథ వారికి కల్పవృక్షంలో తెలిపిన కొన్నింటిని ఈ వ్యాసంలో తెలిపే ప్రయత్నం చేస్తాను.
3. శ్రీరాముని కరుణ స్వభావం:
రాముడు తండ్రి ఆజ్ఞననుసరించి విశ్వామిత్రునితో యాగ రక్షణకు పోవుచు మార్గమధ్యంలో తాటకిని సంహరించవలసి వచ్చింది. గురు ఆజ్ఞానుసారం రాముడు చంపెను. ఆ తర్వాత రాముని మనస్సుకు కసాయి పనిగా అనిపించింది. అయ్యో! క్షత్రియ ధర్మం ఇంత కష్టంగా ఉంటుం దా అంటూ రాముడు ఎంత బాధపడ్డాడో ఈ క్రింది పద్యంలో మనకు అవగత మౌవుతుంది.
“ఇలపయి రాచబడ్డ బ్రదుకేయిది వానికి మృత్యుతత్త్వముల్
దెలియంగ దేలికైన పని తెల్లముగా గను దాటకావధా
విలగతి నే గ్రహించితిని వెక్కసమై చనిజీవి యెంతగా
గిలగిల తన్నుకొన్న యది? కేవలమప్పుడు చూడగావలెన్”4
“ఇదియును గాక గౌతమ ఋషీంద్రుని భార్య యహల్య యెంత ప
డ్డది? యలనామె దుఃఖ వికట జ్వలితాగ్ని మదంతరంబునం
దొదిగిన కోటిజన్మల మహోన్నత దుఃఖము ద్రవ్విచూపె; నా
సదమల దుఃఖశీల క్షితిజాతను నన్నును నట్లు రమ్మనెన్”5
రాముడు తన తల్లికి తాటకిని చంపినందుకు తాను ఎంత బాధపడ్డాడో అన్న విషయాన్ని ఈ పద్యంలో విశ్వనాథ గారు “యెక్కసమై చనిజీవి యెంతగా గిలగిలతన్నుకున్నదో?” అని చెబుతూ రాముడు తాటక వధ వేళ తాను పడిన బాధను అక్కడితో వదలక మరొక సందర్భంలో తన తమ్ముడైన లక్ష్మణునితో “సమద్యత్తాటకోన్మాద మిప్పటికిన్ నా యెద నొవ్వుపోదుగద” ఈ విధంగా బాధపడటంలో రామునిలో మానవ లక్షణాలు కనిపిస్తాయి. రాముడు చంపినది దుర్మార్గులైన రాక్షసుల్ని. ఇది క్షత్రియ ధర్మం కావచ్చు. ఎంత ధర్మం అయినా ఈ హింసాకాండ అంతా ఆయనకి క్రూరంగా తోచింది. అదే మరొక సందర్భంలో “ఈ చంపుటయో కసాయి పని మేలన్నట్లుగా నున్నదయ్యో!” అని రాముడు బాధపడకుండా ఉండలేకపోయాడు. ఇలా ఈ విధమైన వ్యాధులకు హేతువు ప్రధానంగా ఆయన హృదయంలో ఉన్న కరుణ స్వభావం. ఆయన జీవ లక్షణాల్లో ప్రధాన గుణాలు సౌమ్య స్వభావం, కరుణ స్వభావం. ఇవి రాముడిలో కనిపించే ఉన్నత మానవ లక్షణాలు, ఉత్తమ మానవ ధర్మాలు. ఈ గుణాల వల్ల రాముడు ఆదర్శ పురుషునిగా జగత్తులో నిలిచాడు.
4. శ్రీరామచంద్రుని హాస్యం:
మానవుడు ఆనందంగా ఉండటం, హాయిగా నవ్వుకోవడం తన చుట్టూ ఉన్న వారిని ఆనందంగా ఉంచడం అనేవి మనిషికి ఔషధం వంటిది. అటువంటి హాస్యం శ్రీరామునిలో విశ్వనాథ వారు రామాయణ కల్పవృక్షంలో అనేక చోట్ల అనేక సందర్భాలలో చూపించారు. కల్పవృక్షంలో వాక్యాల్ని పరిశీలించినచో కొన్ని కవి శ్రీరామునితో పలికించినవి, కొన్ని కవి పలికినవి, కొన్ని రామాయణంలో మిగిలిన పాత్రలతో రాముడు హాస్యం గురించి చెప్పినవి ఉన్నాయి.
“తా హాస్యాద్భుతశీలి రాముడు పృషత్కంబుల్ ప్రయోగించుచో
హాహాకారము లేచు మంధరను రాయన్ బాయగా నేయుద
ద్దాహాకారము లెంతగా బలియునో హాస్యంబు దానంతగా
బాహాస్ఫాలనమూర్తి చేయు రఘురాడ్బాలుండు గగోలుగాన”6
రామాయణ కల్పవృక్షంలో బాలకాండలో విశ్వనాథ వారి రాముని యౌవనారంభంలో రాముని మనఃస్థితిని వర్ణిస్తూ రాముని చిలిపి చేష్టలను, హాస్యాన్ని 4, 5 పద్యాలలో ఈ విధంగా వర్ణించారు.
రాముడు హాస్యశీలి. వీలైనప్పుడు వీలైన వారితో హాస్యమాడుట ఆయన సహజ గుణం. అందులోనూ మంధర కనిపిస్తే చాలు ఆయన పరిహాసం ఆడకుండా, ఆటపట్టించకుండా ఉండేవాడు కాదు. ధనుర్విద్యలో దిట్టయైన రాముడు బాణములు వేయడం సాధన చేస్తున్న సమయంలో అటుగా వచ్చిన మంధరను అదే పనిగా ఆట పట్టిస్తూ ఉండేవాడు. మంధర ఎంత ఎక్కువగా కేకలు పెడుతుంటే రాముడు కూడా అంతలా ఆటపట్టించేవాడు. ఆమె భయంతో గడగడలాడుతూ హాహాకారాలు చేస్తుంటే రాముడు మరింత గగ్గోలు పెట్టించి ఆట పట్టించేవాడు. ఇలా రామాయణంలో అనేక చోట్ల అనేక సందర్భాలలో హాస్యశీలం మనకు కనబడుతుంది.
6. శ్రీరాముని కోప స్వభావం:
రాముని కోపం ధర్మకోపం. ఆయనకు వచ్చిన కోపం అంతా క్షణికం. అది పాలపొంగు వంటిది. ఇట్టే వచ్చి అట్టే పోతుంది. మానవునికి కోపం ఎక్కువ కాలం ఉండకూడదు. అది పగకు దారి తీస్తుంది. అది మానవులకు దుఃఖ హేతువు. వినాసానికి కారణం అవుతుంది. కల్పవృక్షంలో రాముని కోపానికి సంబంధించి సుగ్రీవుడు అన్నమాట విశ్వనాథ వారు ఈ విధంగా-
“కోపంబును రావచ్చును
కోపంబును వంటి పెట్టికొని యుండుటయున్
కాపురుష లక్షణంబగు”7
ఈ పరమ సత్యం శ్రీరాముడెరుగని వాడు కాడు. కోపానికి అవధి ఏర్పరచుకొనుట మర్యాదస్తుల లక్షణం. ఇది విశ్వనాథ వారు అనేక సందర్భాలలో చూపించినప్పటికీ ఒక అంశాన్ని ప్రస్తావిస్తాను.
సుగ్రీవుని కోసం వాలిని సంహరించాడు. వానర రాజ్యానికి మేలు చేశాడు. సుగ్రీవుడు రాజై రాముని సంగతి పట్టించుకొనక పోవడంతో నమ్మకద్రోహానికి పట్టరాని కోపంతో రాముడు
“రామునకు గోపముంబగచి ముందుకు రానెవడున్ ధరిత్రిలో”8 అని పలికి
“సఖతకు సాక్షిగా నుషర్భుదు జూచి క్షమించితిన్, కాని
ముఖమును నద్దమున్నయది పొల్పుగ జూచుకొనంగవచు న యెడలి
ప్పఖరుడు దూషణుండు తమ వాలియా వారిని జాడ వచ్చునున్”9
అని లక్ష్మణునితో చాలా కోపముగా పలికిన మాటలు. అవి విన్న లక్ష్మణుడు తన అన్నగారిలో ఇప్పటివరకు ఎప్పుడూ అంతటి కోపాన్ని తాను చూడలేదని శ్రీరాముని చూసి ఆశ్చర్యచకితుడైనాడు.
6. శ్రీరాముని దుఃఖ స్వభావం:
సీతా వియోగంతో శ్రీరాముడు దుఃఖాన్ని రూపు దాల్చాడు. ఆమెకై పలు విధాలుగా దుఃఖించాడు. ఆమె క్షేమం గురించి తెలియక తిరిగి ఆమెను పొందలేనేమో అనే భయంతో ఆశ, నిరాశల మధ్య కొట్టుమిట్టాడుతూ ధైర్యం చెడి, మనస్థైర్యం దెబ్బతిని పరితపించాడు. సీత తనతో ఉన్న రోజులని తలుచుకుంటూ తనకు మళ్ళీ దక్కుతుందో లేదో అనే భయంతో దుఃఖిస్తూ అసలు బ్రతికి ఉందా లేదా ఏ రాక్షసుడైన ఆమెకు అపకారం చేసే ఉంటాడని ఆ భయంలో తన తమ్ముడైన లక్ష్మణునితో ఈ విధంగా-
“అన్న! నిన్ను నొక్కడడిగెదను బ్రదికి
యున్నవారు దివికి జన్నవారు
స్వప్నమందు నొక్కసారి తోతురె! నాకు
జానకియును దండ్రి కాన బడిరి”10
“నా వలన జచ్చె దాటక,
నా వలననె మంధరా మనస్సురిసి పడెన్
రావణుని భగిని యటైనది
స్త్రీవధ దోషంబు నన్ను జెందిన దయ్యా!“11
ఇందులో విశ్వనాథ వారు చక్కని పదజాలంతో మనిషి యొక్క సహజ స్థితిని నిక్షిప్తం చేశారు. సీతావియోగ దుఃఖంలో ఉన్న రాముడు తన వల్ల ఇంతకుముందు రాక్షస స్త్రీలు వధింపబడ్డారు అంటూ పై పద్యంలో తాటకి, మంధర, సూర్పనఖలను తలుచుకుంటూ స్త్రీవధ పాపం అని ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. తాను స్త్రీలను చంపి పాపం మూట కొట్టుకున్నాను. ఇదిగో ఇప్పుడు ఇలా ఆ కర్మని అనుభవిస్తున్నాను. అలాగే అప్పుడు కర్తవ్యంగా భావించి సంహరించాను. ఇప్పుడు ఈ దుఃఖానికి ఆ కృత్యాలకు ముడిపెట్టి మాట్లాడుతూ రాముడు దుఃఖ వికాలాత్ముడైన స్థితిలో అన్న మాటలు. మానవుడు విషాద దుఃఖ వికలాత్ముడైనప్పుడు ధర్మాలు అంతగా గుర్తుకు రావు. కాని రాముడు కష్టంలో, దుఃఖంలో, ఆపదలో, చికాకులు అన్నింటిలో ఎన్ని బాధలు పడినా ఎంత ఆవేదన అనుభవించినా ధర్మాన్ని మాత్రం ఎక్కడా విడిచిపెట్టలేదు. శ్రీరాముడు ఉత్తమ మానవ ధర్మాన్ని చూపించి అందరికీ ఆదర్శప్రాయంగా నిలిచాడు.
7. శ్రీరాముని మనుజ ధర్మం:
విశ్వనాథ వారి రామాయణ కల్పవృక్షంలో శ్రీరాముడు ధర్మ నిర్వహణలో మొదటగా పేర్కొన్నది ఆయన యొక్క క్షత్రియ ధర్మం. ఇక్ష్వాకుల వంశంలో మొదటి నుండి వస్తున్న క్షత్రియ ధర్మాన్ని తాను కూడా నిర్వహిస్తానని రాముడు పలుమార్లు పలు సందర్భాలలో నిశ్చయంగా పలికినాడు. ఒక సందర్భంలో అరణ్యపర్వంలో విశ్వనాథ వారు కల్పవృక్షంలో తాను మనువు ధర్మం తెలిసిన వాడినని ఈ క్రింది పద్యం తెలుపుచున్నది.
"క్రమొప్పంగను నాల్గు ధర్మములలో గైపూనగా క్షత్ర ధ
ర్మము కోదండము పూని యార్తజన సంరక్షావిధానంబు ధ
ర్మము వాగ్దానము దీర్చుటో పరమ ధర్మంబీ త్రయీధర్మము
త్తమ మన్మత్ప్రియము...."
రాముడు ధర్మాన్ని తెలిసినవాడిని స్త్రీ వధ ధర్మం కాదనే సందిగ్ధ స్థితిలో ఉన్నప్పుడు విశ్వామిత్రుడు ధర్మరక్షణ కొరకు స్త్రీ వధ చేయమని ఆజ్ఞాపించెను. ఇలా ధర్మ సందిగ్ధంలో ఉన్న గురువు ఆజ్ఞానుసారం స్త్రీ వధ చేసి ధర్మరక్షణ, ప్రజారక్షణ, గురువు ఆజ్ఞానుసారం తాటకిని వధిస్తానని పలికి తాటకిని వధించెను. ఇందులో రాముని రాజధర్మం మనకు కనిపిస్తుంది.
'మనుజుడను నేను మనువు ధర్మం బెఱుగుదు
యిల నధర్మంబు చాయ సహించు టెఱుగ"
విశ్వనాథ వారు కల్పవృక్షంలో రాముడు తన మనుజ ధర్మం గురింఛి అన్న మాటలివి. తనుమానవుడనని, తన ధర్మం మానవ ధర్మం అని ఈ భూమిపై అధర్మం నీడను కూడా తాను సహించనని రాముని మాటల సారాంశం.
రాముడు మానవునిగా నిర్వర్తించవలసిన అనేక కర్మలన్నింటినీ ధర్మానికి బద్ధుడై నిర్వర్తించాడని చెప్పవచ్చు. మానవుడు తన జీవిత పర్యంతం ఎలాంటి నిత్య కర్మలని, కర్తవ్యాన్ని ఆచరించాలో వాటినన్నింటిని తాను ఆచరించి చూపించాడు. ధర్మాచరణకై రాముడు సుఖ, సంపదలని వదులుకున్నాడు. కష్టనష్టాలను ఎదుర్కొన్నాడు. ధర్మాచరణ యొక్క స్వరూపం ఇలా ఉంటుందని తన జీవితంలో అన్ని దశలలో అన్ని సంఘటనలలో నిర్వహించి చూపించినవాడు శ్రీరాముడు. ఆయన పుత్రధర్మం, శిష్య ధర్మం, మిత్ర ధర్మం, భ్రాతృ ధర్మం, భర్తృ ధర్మం, రాజ ధర్మం ఇలా అన్నింటిలో “ఇది ధర్మం ఇలా చేయాలి” అంటే ఆ రకంగా దీక్ష కలిగి ఆచరించేవాడు. మానవుడు సంఘంలో ఎలా ఉండాలి, వ్యక్తిగా ఎలా ఉండాలి దేశంలో తన స్థితి ఏ విధంగా ఉండాలి అనేది రాముడు జన్మించి మానవుని యొక్క గృహ, వ్యక్తి, సంఘ ధర్మాలు ఎలా ఉండాలో ముందుగా తాను ఆచరించి లోకానికి చూపించెను. ఇవి శ్రీరాముని పరిపూర్ణ మానవ లక్షణాలు. విశ్వనాథ వారు రామాయణ కల్పవృక్షంలో అనేక సందర్భాలలో అనేక సంఘటనలలో పేర్కొన్నారు.
8. ముగింపు:
విష్ణువు దశావతారాల్లో పరిపూర్ణ మనవావతారంగా చెప్పబడే శ్రీరాముడు మూర్తీభవించిన ధర్మస్వరూపుడు. దైవంగా భావింపబడే రాముడు ఏనాడు మానవాతీతుడుగా ప్రవర్తించలేదు. నిజజీవితంలో మనిషి పొందే సుఖ దుఖాలను తాను అనుభవించాడు. కానీ ఎలాంటి క్లిష్టపరిస్థితుల్లో కూడా ధర్మాన్ని విడవలేదు. అందుకే అందరికి ఆదర్శంగా నిలిచాడు. రాముడు నడిచిన బాట మానవాళికి అనుసరణీయమైంది. భారతీయధర్మమే ఆత్మగా, వాల్మీకి రామాయణాన్ని తెలుగువారికి కల్పవృక్షంగా అందించిన విశ్వనాథ పరిపూర్ణమానవుడిగా రామున్ని చిత్రించిన తీరు మానవులందరినీ ధర్మమార్గంలో పయనించేలా దారివేసిందని చెప్పవచ్చు.
9. పాదసూచికలు:
- The Ramayana - sri S. L. N. Simha page no :53
- శ్రీమత్ రామాయణ వైభవం. పుట. 582
- శ్రీమద్రామాయణ కల్పవృక్షం, శ్రీ రాముని మనుజ ధర్మం, పుట. 79, 80
- శ్రీమద్రామాయణ కల్పవృక్షం, బాల. కళ్యాణ. పుట. 378
- శ్రీమద్రామాయణ కల్పవృక్షం, బాల. కళ్యాణ. పుట. 379
- శ్రీమద్రామాయణ కల్పవృక్షం, బాల. అవతార. పుట. 170
- శ్రీమద్రామాయణ కల్పవృక్షం, కిష్కింద. పుట. 26
- శ్రీమద్రామాయణ కల్పవృక్షం, కిష్కింద. పుట. 171
- శ్రీమద్రామాయణ కల్పవృక్షం, కిష్కింద. పుట. 171
- శ్రీమద్రామాయణ కల్పవృక్షం, కిష్కింద. పుట. 144
- శ్రీమద్రామాయణ కల్పవృక్షం, కిష్కింద. పుట. 145
10. ఉపయుక్తగ్రంథసూచి:
- గోపాలకృష్ణ శర్మ, మల్లాది, 1978, శ్రీమత్ రామాయణ వైభవం, తెనాలి.
- పాపయ్య శాస్త్రి, కావూరి, 1996, శ్రీ జానకీ ప్రియ పబ్లికేషన్స్, వరంగల్.
- వాల్మీకి, 1979. శ్రీమద్రామాయణము, జయలక్ష్మి పబ్లికేషన్స్, హైదరాబాద్.
- సత్యనారాయణ, విశ్వనాథ, 1992, శ్రీమద్రామాయణ కల్పవృక్షం, విశ్వనాథ పబ్లికేషన్స్, విజయవాడ.
- సత్యనారాయణ, విశ్వనాథ, 2015, శ్రీమద్రామాయణ కల్పవృక్షం, విశ్వనాథ పబ్లికేషన్స్, విజయవాడ.
- SimhaS.L.N.1984,The Ramayana, Dhrma Arsha centre, Bambay.
***
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for
Papers
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (Peer-Reviewed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు సంచిక / ఏదైనా సంచికల్లో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: ప్రతి నెలా 20వ తేదీ.
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# “2 నుండి 3 వారాల సమీక్ష తరువాత,
వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన
తరువాతే,
వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది. ప్రచురణ ప్రక్రియకు కనీసం ఒక నెల నుండి మూడు నెలల వరకు సమయం పడుతుంది. వ్యాసకర్తలు సహకరించగలరు.”
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసం ప్రచురణకు ఎంపికైనట్టు సమాచారం అందిన తరువాత “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] తప్పనిసరిగా సమర్పించాలి. గైడ్ లెటర్ జతచేయని రీసెర్చిస్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు.ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల
పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1500
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష
తరువాత మీ
వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "రాబోయే ఏ సంచికలో అయినా" (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ
ఎలాంటి
బాధ్యత వహించరు.

