AUCHITHYAM | Volume-4 | Issue-9 | August 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed
10. గురజాడ పద్యకవిత్వం: విషయవైవిధ్యం
డా. రాంభట్ల పార్వతీశ్వరశర్మ
తెలుగు సహాయాచార్యులు, భాషాసాహిత్యశాఖ, మానవీయశాస్త్రవిభాగం
ప్రశాంతినిలయం ప్రాంగణం, శ్రీసత్యసాయి విశ్వవిద్యాలయం
శ్రీసత్యసాయి జిల్లా –515134, ఆంధ్రప్రదేశ్
సెల్: +91 9247859580, Email: psarmarambhatla@sssihl.edu.in
Download
PDF
వ్యాససంగ్రహం:
వచన, గేయ, నాటక ప్రక్రియలకు గురజాడ పెట్టింది పేరు. అప్పారావు కవిత్వంలో సింహభాగం ఆధునిక వచన ప్రక్రియల్లో సాగినప్పటికీ... పద్యకవితాప్రక్రియల్లో గురజాడ వారిది అందె వేసిన చెయ్యి. అప్పారావు సంప్రదాయకవిత్వంగా ఛందోబద్ధంగా రాసిన ఖండకావ్యాలను అనుశీలించి, వాటిల్లోని విషయవైవిధ్యాన్ని విశ్లేషిండం ఈ వ్యాసం ప్రధానోద్దేశ్యం. గురజాడ పద్యఖండికలు, లఘుకావ్యాలు, సంకలనగ్రంథాలు, సాహిత్యసర్వస్వం, పత్రికాప్రచురణలు ఈ పరిశోధనకు ప్రాథమిక ఆకరాలు. అక్టోబర్ 2021లో హ్యూస్టన్ సాహితీసమితి, అమెరికా వారికై నెలనెలా తెలుగు వెన్నెల కార్యక్రమంలో ఈవ్యాస కర్త అంతర్జలంలో చేసిన ప్రసంగం “మహాకవి గురజాడ పద్యసాహిత్యం” ఈ వ్యాసరచనకు ముఖ్యభూమిక.
Keywords: గురజాడ, పద్యకవిత్వం, సుభద్ర, ఋతశతకం, మాటలమబ్బులు, పుష్పలావికలు, మెరుపులు.
1. పరిచయం:
విశాఖ జిల్లా, యస్.రాయవరం లో, మేనమామ ఇంట్లో 1862 సెప్టెంబరు 21 నజన్మించారు. వెంకట రామదాసు, కౌసల్యమ్మ దంపతులు. మహాకవి గురజాడ జీవనరేఖలు (1862 సెప్టెంబర్ 21 - 1915 నవంబర్ 30). 1885లో అప్పల నరసమ్మతో వివాహం. ముగ్గురు సంతానం - ఇద్దరు కుమార్తెలూ, ఒక కుమారుడు. ఓలేటి లక్ష్మి నరసమ్మ, వెంకట రామదాసు, పులిగెడ్డ కొండయ్యమ్మ.
2. రచనలు:
కన్యాశుల్కం నాటకం, సారంగధర (ఇంగ్లీషు పద్య కావ్యం), దేశభక్తి, పూర్ణమ్మ, కొండుభట్టీయం, నీలగిరి పాటలు, ముత్యాల సరాలు, కన్యక, సత్యవ్రతి శతకము, బిల్హణీయం (అసంపూర్ణం), సుభద్ర, లంగరెత్తుము, దించులంగరు, లవణరాజు కల, కాసులు, సౌదామిని, కథానికలు, మీపేరేమిటి, దిద్దుబాటు, మెటిల్డా, సంస్కర్త హృదయం, మతము-విమతము, పుష్పాలవికలు.
3. వివిధ ఉద్యోగాలు:
1886లో డిప్యూటీ కలెక్టరు కార్యాలయంలో హెడ్ క్లర్కు, 1886లో రాజా వారి ఆస్థానం, 1887లో కళాశాలలో అధ్యాపకులు, 1887లో సాంఘిక సేవకై విశాఖ వాలంటరీ సర్వీసు, 1889లో ఆనంద గజపతి "డిబేటింగ్ క్లబ్బు"కు ఉపాధ్యక్షుడు, 1891లో విజయనగర సంస్థానంలో సంస్థాన శాసన పరిశోధకుడు, 1897లో మహారాజా ఆనంద గజపతి సోదరి, రీవా మహారాణి, అప్పల కొండమాంబ గారికి వ్యక్తిగత కార్యదర్శిగా అప్పారావు నియమితుడయ్యారు., 1911లో మద్రాసు యూనివర్సిటీ బోర్డ్ ఆఫ్ స్టడీస్‌లో సభ్యత్వం, మంజువాణి పత్రిక (1903) నుంచి పుష్పగిరి రాజమ్మ అనే పరిశోధకురాలు ఉద్ధరించారు. గజపతిరాజుల తెలుగు సాహిత్యపోషణం - బులుసు వెంకటరమణయ్య.
4. పద్యవ్యాసంగం - ప్రాచీన వృత్తాలలో రచించిన ఖండకావ్యాలు:
- సుభద్ర (కావ్యము)
- ఋతశతకము
- మాటలమబ్బులు
- పుష్పలావికలు
- మెరుపులు
4.1. సుభద్ర:
నన్నయ - మహాభారతం ఆదిపర్వంలో సుభద్ర కథ, 11వ శతాబ్దంలో ఉన్నది. తాళ్ళపాక తిమ్మక్క “సుభద్రాకళ్యాణం” – ద్విపదకావ్యం 15వ శతాబ్దంలో చూడవచ్చు. పోతన – భావగతం దశమస్కంధం – ఉత్తరభాగం – 15వ శతాబ్దంలో కూడా చోటుచేసుకుంది. చేమకూర వేంకటవి “ విజయవిలాసం” 18వ శతాబ్దంలో ఈ కథే ప్రధానం. గురజాడ - సుభద్ర 19-20వ శతాబ్దంలో ఈ కథను తిరిగి ఎన్నుకున్నారు. ఇది అసంపూర్ణ రచన. మూడాశ్వాసాలే దొరుకుతున్నాయి. సుభద్రా అర్జునుల కల్యాణం ఇందులో ప్రధాన విషయం
ఈ లఘుకావ్యంలో చక్కని కథాంశవిభాగాలను ఘట్టాల వారీగా చూస్తే:
- అర్జునుడు మౌనివేషంలో “రైవతకాద్రికి” రావడం,
- పరిచర్యలు జేయడానికి సుభద్రను బలరాముడు పంపడం.
- సుభద్ర యతి వేషంలో ఉన్న అర్జునుడి పట్ల ఆకర్షితారలవడం
సుభద్రకావ్యం: ప్రబంధ లక్షణాలు:
ప్రబంధ లక్షణాలున్న కావ్యం ఈ సుభద్ర. అలంకారాలు, వర్ణనలు, శృంగార రస ప్రధానం, వస్వ్తైక్యం ఇందులో ఉన్న లక్షణాలు. ప్రబంధాల మార్గంలో ఉన్న పదబంధాలు మనం ఇందులో గమనించవచ్చు
- 'చూడ్కులు మరుని కటారులై పొడుచుట
- 'జఘనఘన
- 'వారిజ కింజల్క శ్రీ' (తామరల పుప్పొడి వైభవం)
- 'తాటి సిడపు జోదు’ (బలరాముడు) మొదలైన ప్రయోగములు
సభద్రకావ్యం – నాయికవర్ణన:
“కస్తూరి గన్నేరుకావి చీరమెఱుంగు
మేనిచాయకు వింతమిసిమిగొలుప
చెలరేగుముంగురుల్ చేర్చికట్టినజోతి
యిరులపై రిక్కలకరణివెలుఁగ
పైటపైఁదూగాడు పచ్చలహారముల్
చలదింద్రచాపంబు చాడ్పుఁజూప
నింపుఁజెక్కుల దిద్దినపత్రముల్
మకరాంకుబిరుదాల మాడ్కివఱల
మెఱపు కెమ్మబ్బులోపల మెఱయునట్లు
వలిపమున మేల్మిమొలనూలు తళుకులీన
భద్ర నడతెంచె బంగరుపళ్ళెరములఁ
బండ్లుఁబూవులుగొనుచు సపర్యకొఱకు”.
4.2. మాటల మబ్బులు
విజయనగరంలోని అధికారులను అధిక్షేపించిన పద్యాలు ఈ మాటలు మబ్బులులో కనిపిస్తాయి.
దబ్బరలు (అసత్యాలు, మోసం), కొండెములు (అనుచిత ఆరోపణలు), మాయమాటలు, మొండితనము మొదలైనవి “అధికారుల అబ్బురపువిద్యలు” అనే ఎత్తిపొడుపు ఇందులోని భావాలలోని ద్యోతకమౌతున్నాయి.
11వ శతాబ్దంలో సంస్కృత మహాకవి – క్షేమేంద్రుడు కలావిలాసం, దేశోపదేశం, నర్మమాల – లోకంలో మోసాలను, అధికారలను అధిక్షేపిస్తూ రాసిన హేళన కావ్యాల ఫక్కీ ఈ పద్యాలలో గురజాడకు ప్రేరణగా చెప్పవచ్చు.
మచ్చుకు ఒక ఉదాహరణ పద్యాన్ని చూద్దాం.
తనకొక మేలు చేకురగ తక్కినవారికి గీడు సేయుటల్
మనమున లేని భక్తి, యభిమానము మాటలలోనే చూపుటల్
గొనకెటు లాభముల్ గలుగు? గొంకక నాటకమాడ సాగుటల్
ధనమునకు న్మహోన్నతికి దారులు రాజ గృహాంతరంబులన్.
ఎన్ని రకాల అవగుణాలు ఉంటాయో అవన్నీ రాజగృహాలలోనే ఉంటాయని నిరసిస్తూ చెప్పిన పద్యంగా ఈ పద్యం కనిపిస్తోంది. కుట్రలకు, కపటగుణం, ధనం, ఉన్నతికి రాజగృహం చిహ్నం అని గురజాడ అభిప్రాయపడ్డారు.
కెంజిగురుల కోయిల, సుమ/ మంజరులన్ దేటిగముల, మనుజ ఖగములన్
మంజుల ఫలముల, చూతమ! రంజించెద వితర తరులు రా వాదుకొనన్.
మామిడి చెట్టును - ఇలా సహాయ చేస్తే మిగిలినవి ఆ చెట్టును ఆదుకోవు. అసూయ చెందుతాయి అని చక్కని స్వభావోక్తితో గురజాడ వారు ఈ పద్యాన్ని రూపుదిద్దారు. చెట్టు ఎవరెవరికి ఏమేం ఇస్తుంది. అందులోను మామిడి చెట్టు ఉపయోగాలు ఏంటో తెలుపుతూనో, నిస్వార్థంగా ఆ చెట్టు చేస్తున్న సహాయానికి మిగిలిన చెట్లు ఏ విధంగా భావిస్తాయో ఊహించారు గురజాడ. ఇది లోకహితార్థమై చేస్తున్న ఉపదేశం.
4.3. మెరుపులు:
ఈ శీర్షికతో రాసిన పద్యాలన్నీ సంస్కృత చాటువులకు అనువాదములే. "కాశ్యాం మరణాత్ ముక్తిః" అంటారు. ఇదే భావంగల ప్రసిద్ధ శ్లోకాన్ని గురజాడ ఇలా తెలుగుచేశాడు.
కాశి జచ్చెనేని కలుగదు జన్మంబు, / కలిగెనేని నుదుట కలుగు కన్ను,
సిరసు నందు చిన్న - సిరి తోడు బుట్టవు,/ కంఠసీమ వెలయు గరళ చిహ్న.
కాశ్యా మవశ్యం త్యజతాం శరీరం/ శరీరిణాం నా స్తి పునశ్శరీరం
యద్యస్తి కంఠే గరళం లలాటే/ విలోచనం చంద్రకళాచ మౌళౌ.
ఈ పద్యంలో ‘లలాదేవిలోచనమ్' అనడానికి 'నుదుటగలుగుకన్ను', 'చంద్రకళాచ మౌశా' అనడానికి 'సిరసునందు చిన్న సిరితోడబుట్టువు' అనే ప్రయోగములు చక్కని తెలుగు నుడికారాలు.
శకుంతల సభలోకి వచ్చి దుష్యంతునితో తమ కలయికను గుర్తు చేస్తున్నప్పుడు దుష్యంతుడన్నట్లుగా ఈ శ్లోకం-
స్త్రీణా మశిక్షిత పటుత్వ మమానుషీషు/ సందృశ్యతే కిముత యాః ప్రతిబోధవత్యః
ప్రాగ న్తరిక్ష గమనా త్స్వమపత్యజాత/ మన్యై ర్ద్విజైః పరభృతాః ఖలు పోషయన్తి.
ఎవరూ నేర్పకుండానే తెలివిగా ప్రవర్తించడం పశుపక్ష్యాదుల్లోనే ఉన్నప్పుడు మనుష్యుల్లోవేరే చెప్పాలా? కోకిల తన పిల్లలు ఎగిరేవరకు కాకిగూడులోనే గుడ్లుపెట్టడం చూడలేదా! ఈ భావాన్ని గురజాడ ఇలా చెప్పారు.
మానిసులు గాని యింతుల/ తా నేర్చని నేర్చు చెలగు! తరి జెప్పంగా
జ్ఞానవతుల కగునె? పికము/ దాని శిశువు బెంచు నెగురుదాక - నొరు చేన్
బంగారానికి పరీక్షాస్థానం అగ్ని. ఈ విషయాన్నే "ధనంజయే హాటక సంపరీక్షా" అన్నారు. అంతేకాదు ఇంకా దానికి నాలుగురకాల పరీక్షలున్నాయన్నారు.
యథా చతుర్భిః కనకం పరీక్ష్యతే/ నికర్షణ, చ్ఛేదన, తాప, తాడనైః
తథాచతుర్భిః పురుషు పరీక్ష్యతే/ కులేన, శీలేన, గుణేన, కర్మణా.
నాల్గు రీతుల గనకంబు నాడెమగును/ వేటు, గీటుల, తునియించి, వెచ్చజేసి!
నరుడు నట్టుల నాల్గింట నాడెమగును! /కులము, శీలంబు, కర్మంబు, గుణము చేత.
4.4. ఋతుశతకము:
“ఇది కందపద్యములలో వ్రాయబడినది. ఇప్పటికి దొరకిన పద్యములు 25 మాత్రమే. వీనిలో 'త' ప్రాసము అన్ని పద్యములలో పాటించబడుట ప్రత్యేకత. ఈ పద్యములలో పదములగజిబిజి యెక్కువ. ఏవో కొన్ని పద్యములలో తప్ప ప్రసాదగుణము లేదు” - సి.నా.రె.
"స్మితమతి, సూచీ భేదిత / ఋతమౌక్తిక పదక శతక మిభపతి భాషా
సతి, కతి కుతుకత గూర్చగ,/ సతతము సంతతమొసంగు సత్యవ్రతికిన్! - 1
అన్న ధోరణిలో స్పష్టతకు దూరముగా నున్నది. 'ఇభపతి' యనగా గజానను డనుకొన వలెనేమో ? ' ఋతతకమును వినాయకునికి, సరస్వతికి కుతుకముగూర్చునట్లుగా రచింతునను ప్రతిజ్ఞ ఈ పద్యములో నున్నట్లు తోచును..
ఈ ఋతుశతకం గురించి పూర్వపరిశోధకు, విమర్శకు ఇదివరకే చక్కని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. వారిలో కొందరు-
మంజువాణి పత్రిక (1903) నుంచి పుష్పగిరి రాజమ్మ అనే పరిశోధకురాలు
గజపతిరాజుల తెలుగు సాహిత్యపోషణం - బులుసు వెంకటరమణయ్య
మహోదయం – కెవి రమణారెడ్డి
"సతతము సంతసమొసంగు సత్యప్రతికిన్" ఆనందగజపతి ఒక సమస్య నిచ్చారు. పూరించమన్నాడు.
ఆదిభట్ల నారాయణదాసు గారి పూరణ: (1894 - 1897 మధ్య)
"చతురకళా విద్యా సం/ గతికిన్, స్థిర ధృతికిఁ, బ్రకట కరుణామతికిన్,
కృతి యానంద గజపతికి/ సతతము సంతసమొనంగు సత్యవ్రతికిన్"
అని ఆదిభట్ల వారు పూరించిన వైనం రాజావారి మెప్పు పొందింది. సహృదయానందరంజంకంగా ఉన్న పూరణగా అందరి ఆమోదమూ పొందేలా నారాయణదాసు గారీ పూరణ చేసారు.
భాగవతుల లక్ష్మీనారాయణ శాస్త్రి గారి పూరణ:
ఋతతిత ఊత్తు తీతా/ తతేతితా తేతతాత తతై తత్తా
తత తత్తా తతతత్తిన్ / సతతము సంతసమొసంగు సత్యవ్రతికిన్
కరక్కాయ పాకపు పద్యాన్ని బులుసు వెంకటరమణయ్యగారు పేర్కొన్నారు. గురజాడ రచనలలో ఋతశతకముగా అచ్చుపడివున్న కందపద్యాలు అప్పారావు ఈ సందర్భంలో రాసినవే, పద్యచ్ఛందస్సు ఆయనకింకా మచ్చిక లేదు. యతిప్రాసల విషయంలో చాలా ప్రయాసపడ్డారు.
ఈ ఋతుశతకం నుండీ కవితాగంధమున్నపద్యాల నుండి ఒకటి ఉదాహరించుచున్నాను.
“మతివీణ మీటునంతనె
ఋతతంత్రీ శ్రుతినిజేరి యింపుగ స్వరముల్
ప్రతి సంవాదమ్మిడునని
సతతము సంతతమొసంగు సత్యవ్రతికిన్! భావం స్పష్టం.
4.5. పుష్పలావికలు:
'పుష్పలావికలు’ శీర్షికతో (9) తొమ్మిది పద్యాలు రాసారు. పువ్వులను మాలికలుగా కట్టి విక్రయించే స్త్రీ వ్రాసిరి. ప్రబంధములలోని పుష్పలావికల వర్ణనలకు అనుకరణలు'. పుష్పలావికల శృంగారమును ప్రదర్శించు పద్యములివి. అని పూర్వ పరిశోధకులు పేర్కొన్నారు.
ఆముక్తమాల్యదలోని పుష్పలావికావర్ణన ఘట్టంలో..
“వెలది యీ నీదండ వెలయెంత? నాదండ
కును వెలబెట్ట నెవ్వనితరంబు" అని పుష్పలావిక, విటుల సంభాషణ.
దానిని అనుసరిస్తూ…
“నీదండ చిక్కువడెనే
నాదండను చిక్కటన్న నగరే ప్రాజ్ఞుల్
నీదండ నుంచికొనుమా
వా దుడుగుమటందు రచటి వనితలు విటులున్"
ఆముక్తమాల్యదలోనే మరో ఘట్టంలో-
కళ్ళ కాంతులనే కలువలుగా, నవ్వులనే మల్లెలుగా భ్రమించి, పూలుకట్టకుండా ఉత్త దారాన్నిచ్చి, పొరపాటయ్యిందని సిగ్గుపడ్డారు అని పద్యముంది..
ఈ 'భ్రాంతిమదలంకారమును గురజాడ-
"గోరులడాలు దండలకుగూర్పగ గెంజిగి నెర్రమొల్లలిం
పారగజూడగా గలిగె నన్నువ తెమ్మని తీసి యింటికిన్
జేరగ తెల్లవారగని చింతిలి తారును దెల్లవారి ర
య్యూరను గల్గు లావికల యోజలు చిత్రములంచు జవ్వనుల్"
ప్రబంధాలలో కనిపించే పుష్పలావికల సన్నివేశాలకు, రమణీయమైన వర్ణనలకు, కల్పనలకు తక్కువకాని మృదూహను గురజాడ ఈ పద్యాలలో ఆవిష్కరించారు.
4.6. సమస్యాపూరణ:
మ. కలిచేతన్ విమతిత్వ మొందుచు మహా కామాంధకారంబునన్
కులధర్మంబు పరిత్యజించి గణికన్ గూడిమ్మ అమ్మా నినున్
బలుమార్వేడెదమంచుఁ బల్కెదరహో పాండిత్యమూహింపకే
వెలవాల్గంటి కుమారులౌదురు గదా విప్రోత్తముల్ రావణా!
(ఆనందగజపతి సోదరి - రీవారాణి అప్పలకొండయాంబకు సమస్యా పూరణం అంటే చాలా ఇష్టమట. “వెలవాల్గంటి కుమారులౌదురు గదా విప్రోత్తముల్ రావణా!” అనే సమస్యను ఆమె ఆస్థాన పండితులకిచ్చారట. గురజాడ పూరించిన పద్యమిది. కె.వి.ఆర్. మహోదయం, 1969 ప్రతి, పుట. 123)
గురజాడ వారీరీతిగానే పద్యరచన చేసియుండినచో ఆ మార్గములో వారు తప్పక ప్రౌఢకవి యయ్యెడి వారు. సంప్రదాయము ననుసరించిన కవుల పంక్తిలో ఎక్కడో ఒకచోట ఆయనకొక స్థానం లభించి యుండెడిది. కానీ అట్లు జరుగలేదు. -సినారె. (ఆధునికాంధ్ర కవిత్వము . డా. సినారె పుట. 212.).
5. ముగింపు:
సమాసాలు, కఠినపదాలు లేకుండా తేటమాటలతో రచన చేయడం ఆయన ధ్యేయం. కవిత్వం అంటే క్లిష్టత, ప్రౌఢిమ కాదు. సులభంగా, హాయిగా అందరికీ అర్థమవ్వాలని ఆయన అభిప్రాయం. వ్యాకరణమనే కట్టుబాటుతో భాషలో చైతన్యం తగ్గిపోతుందని భావించారు. వ్యవహారంలో ఉన్న జాతీయాలు, పలుకుబళ్ళతోనే కవిత్వాన్ని నడిపించారు.
వారి కవిత్వమంతా తరచిచూస్తే... కవిత్వంలో ఉండాల్సింది మన అభిప్రాయాలో... ఆలోచనలో కాదు. భావాలు. కవిత్వం మెదడుకు మేతలా కాకుండా.. హృదయానికి హత్తుకునేలా ఉండాలని గురజాడ విశ్వాసం.
తొలితరం కవులు శతాధిక అలంకారాలు, అష్టాదశవర్ణనలు, రసాదులెన్నో పోషించారు. కానీ గురజాడ వాటిని విడిచి పెట్టి తన కళ్ళకు కనబడిన సౌందర్యాన్నే పాఠకులకు అందించాలి ప్రయత్నించారు. ప్రబంధాల్లో కనిపించే హంస, చిలక, నెమళ్ళ వర్ణనలేవీ ఈయన కవిత్వంలో ఉండవు. కథనంతో మేళవించిన వర్ణనలు కనిపిస్తాయి.
6. ఉపయుక్తగ్రంథసూచి:
- ఈశ్వరరావు, సెట్టి (సంపా). గురజాడ రచనలు – కవితలసంపుటం. విశాలాంధ్రపబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2005.
- గురజాడ అప్పారావు, అవసరాల సూర్యారావు(అను.) మాటామంతీ అవీఇవీ.ఆంధ్రాప్రింటర్స్, విజయవాడ. 1958.
- నారాయణరెడ్డి, సి. ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయములు:ప్రయోగములు. విశాలాంధ్రపబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 1999.
- రమణారెడ్డి, కె.వి. మహోదయం- జాతీయ పునరుజ్జీవనంలో గురజాడ స్థానం, విశాలాంధ్రపబ్లిషింగ్ హౌస్, విజయవాడ. 1969
- రమణమూర్తి, ఆర్.వి. (ప్రధా. సంపా.). గురజాడసాహిత్యసర్వస్వం, తెలుగు అకాడమి, హైదరాబాద్. 2012.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.