AUCHITHYAM | Volume-04 | Issue-09 | August 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed
9. శ్రీమన్మహాభారత అశ్వమేధ-ఆశ్రమవాస-మౌసలపర్వాలు: ధర్మానుసరణలో ధర్మజుని వైశిష్ట్యం
డా. ముళ్ళపూడి బి.ఎస్.ఎస్. నారాయణ
సంస్కృత సహాయాచార్యులు, భాషాసాహిత్యశాఖ,
ప్రశాంతినిలయం ప్రాంగణం, శ్రీసత్యసాయి విశ్వవిద్యాలయం
శ్రీసత్యసాయి జిల్లా – 515134, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9966108560. Email: mullapudibssnarayana@sssihl.edu.in
Download PDF
వ్యాససంగ్రహం:
ధర్ముడు స్వయంగా ముంగిసరూపంలో వచ్చి పరీక్షించిన తరువాత, ధర్ముడు ధర్మరాజులో అంతర్లీనమైన ఘటన మనకు అశ్వమేధ పర్వంలో కనిపిస్తుంది. అదే ధర్ముడు విదురుడిగా తన రూపాన్ని వదిలి ధర్మరాజులో తన తేజస్సును నిక్షిప్తం చేయటం జరిగింది ఆశ్రమవాసపర్వంలో. ఈ సందర్భంలోనే యుధిష్ఠిరుడు తన పూర్వజన్మ స్వరూపమును కూడా గుర్తించగలిగాడు. పర్వాలు ఎన్ని మారినాగానీ, మహాభారతంలో మారని ధర్మస్వరూపమే ధర్మజుని సత్యస్వరూపము. దాదాపు తొంబది సంవత్సరాలు పాండవులు కష్టాలు అనుభవించటానికి కారుకుడైన ధృతరాష్ట్రుని కూడా, చరమదశ వరకూ తండ్రివలే సేవించిన ఆదర్శమూర్తి ఈ ధర్మమూర్తి. తాను దైవంగా భావించిన పరమాత్ముడే అవతారం చాలించి చనిననాడని, ఇక తానూ నిష్క్రమించుట సరియైనదని భావించిన సత్యగ్రాహిగా యుధిష్ఠిరుడు కనిపిస్తాడు.
Keywords: అశ్వమేధయాగమునకు ధన సమీకరణము - యాగారంభము – ధర్మజుని సందేహము – నకులోపాఖ్యానము – ధర్మజుని పితృభక్తి – ధర్మజుని పూర్వజన్మ స్మృతి – ధర్మరాజుయొక్క వయో నిర్ణయము.
1. ఉపోద్ఘాతము:
తాను పాటించినది క్షత్రియధర్మమే అయినా బంధువధ, క్షత్రియవధ చేసిన బాధ నుండీ యుధిష్ఠిరుడు ఉపశమనాన్ని శాశ్వతంగా పొందే మార్గమే ఈ అశ్వమేధయాగము. యుద్ధాలు అందరు రాజులూ చేస్తారు. శత్రువధ సర్వ క్షత్రియులూ చేస్తారు. విజయం సాధించి సుఖంగా రాజ్యభోగాలు అనుభవిస్తారు. కానీ క్షత్రియవినాశనము ద్వారా తాను అనుభవిస్తున్న మానసికబాధను అశ్వమేధయాగము చేసి శాస్త్రరీత్యా పరిష్కరించుకున్న మహానుభావుడు ఒక్క ధర్మరాజుమాత్రమే. నిరంతరం కష్టాలు అనుభవిస్తున్న సోదరుడి కోసం పరితపించే అన్నగా ధర్మజుని హృదయావిష్కరణ మనకు ఈ వ్యాసంలో స్పష్టమవుతుంది.
2. అశ్వమేధపర్వము:
2.1 ధన సమీకరణము:
అనేక ధర్మసందేహాలను నివృత్తి చేసిన భీష్మ పితామహుడు, ఉత్తరాయణంలో అష్టవసువులలో చేరిన తరువాత ఆయనను తలుచుకుని యుధిష్ఠిరాదులు శోకంతో కుమిలిపోతుంటే వ్యాసుడు, శ్రీకృష్ణ పరమాత్ముడు వారిని ఉపశమన వాక్యాలతో శాంతపరిచారు. ఆ సందర్భంలో వ్యాసులవారు “నాయనా యుధిష్ఠిరా! ఇంత చెప్పినా కూడా నీవింకా బాధ పడుతూనే ఉన్నావు. నీకు నీవే పాపకర్ముడిని అనుకుని వ్యర్థంగా భావిస్తున్నావు. నీకు ఈ భావన పోవాలంటే, సకల పాపాలూ పోవాలంటే యజ్ఞం ఒకటే సరైన మార్గం. దేవతలు కూడా పుణ్యం కలగటానికి యజ్ఞక్రియని నిర్వర్తింపచేస్తూంటారు. అందువలన నీవు రాజసూయం, అశ్వమేధం, సర్వమేధం, నరమేధం అనే యజ్ఞాలు చేయి. పూర్వం శ్రీరామచంద్రుడు అశ్వమేధాన్ని యథావిధిగా ఆచరించాడు”- అని వ్యాసులవారు పలికారు.
ఆ మాట విని యుధిష్ఠిరుడు అన్నాడు. “మహర్షీ! మీరు చెప్పింది నిజమే, ఈ అశ్వమేధయాగం సమస్త భూమండలాన్ని కూడా పవిత్రం చేస్తుంది. కానీ జ్ఞాతివధ చేసి, సమస్త బంధువులతో పాటు నేను ధనాన్నికూడా కోల్పోయాను. ఆ దుర్యోధనుని వలన ఖజానా అంతా ఖాళీ అయింది. అశ్వమేధయాగానికి దానధర్మాలు చేయటానికి సమృద్ధిగా నాదగ్గర ధనం లేదు. యుద్ధం చేసిన రాజుల గాయాలు కూడా ఇంకా మానలేదు. బాలురు, దీనులు మాత్రమే మిగిలారు. ఈ స్థితిలో ఉన్నవారిని నేను ధనం అడగలేను. ఈ క్లిష్ట సమయంలో, పన్నులు కూడా వసూలుచేసి ధనం సంపాదించలేని పరిస్థితి నాది. అశ్వమేధంలో సమస్త భూమండలాన్నీ దానం చేయ్యాలి. అలా చేయకపోతే అది శాస్త్రవిరుద్ధమవుతుంది. ఇటువంటి పుణ్యకార్యాలలో ముఖ్యవస్తువు లేనప్పుడు ప్రత్యామ్నాయంగా ఇంకో వస్తువు ఏదైనా ఇవ్వటాన్ని ప్రతినిధి దక్షిణ అంటారు. ఆ ప్రతినిధి దక్షిణ ఇవ్వటం నాకు ఇష్టం లేదు. కాబట్టి మీరే తగిన ఉపాయం చెప్పండి” అని యుధిష్ఠిరుడు వినయంగా వ్యాసులవారిని అడిగాడు. దానికి సమాధానంగా వ్యాసుడు మరుత్తుని చరిత్ర చెప్పి ఆ రాజు యాగం చేసినప్పుడు మిగిలిన ధనాన్ని తీసుకువచ్చి యాగం పూర్తి చేయమని సలహా ఇచ్చాడు.
మరుత్తుడు యాగానంతరం అంతులేని బంగారాన్ని దానం చేసి మిగిలిన బంగారాన్నంతా కొండవలే ఒక కుప్పగా పోసి తాను తన రాజ్యపాలనలో మునిగిపోయాడు. ఆ ధనం నీవు అశ్వమేధయాగం నిర్వహించటానికి సరిపోతుంది యుధిష్ఠిరా, కాబట్టి నీవు దానిని త్వరగా గ్రహించు అని వ్యాసులవారు మరుత్తుని కథ ద్వారా యుధిష్ఠిరుని సందేహ నివృత్తి చేశారు. తరువాత యుధిష్ఠిరుడు వ్యాసులవారు చెప్పిన అశ్వమేధయాగానికి కావలసిన ద్రవ్యాన్ని సమీకరించటం కోసం పనులు మొదలు పెట్టాడు. సోదరులందరూ కలిసి ఏ విధంగా మరుత్తుడి యాగంలో మిగిలిన ధనాన్ని తీసుకురావాలో ఆలోచన చేసుకుని, రాజ్యంలో యుయుత్సుడికి పెద్దల రక్షణ భాద్యతలను అప్పగించాడు. వ్యాసులవారితో పాటు ఇంద్రియనిగ్రహం కల బ్రాహ్మణులను, పాండవుల పురోహితుడైన ధౌమ్యులవారిని ముందుంచుకుని సోదరసమేతంగా సైనికులతో సహా ధ్రువ నక్షత్రంలో బయలుదేరాడు యుధిష్ఠిరుడు. బ్రాహ్మణులు సూచించిన విధంగా మరుత్తుని ధనం ఉన్న ప్రదేశానికి చేరుకుని ధనం కోసం త్రవ్వటానికి శుభనక్షత్రాన్ని అడిగాడు. ఆ రాత్రి దర్భల పై పడుకుని ఉపవాసం చేసి మరునాడు శంకరుని పూజకై అన్ని ఏర్పాట్లు చేయించాడు. దైవ సంబంధమైన అగ్నిహోత్రవిధులన్నీ నిర్వర్తించాడు. శివుని పార్షాదులకు, అలాగే యక్షప్రభువైన కుబేరునికి భూతాధిపతులకి ఎవరికి ఎలా తృప్తి కలగే విధంగా ఉపాసించాలో అలా అన్ని క్రియలూ శాస్త్రోక్తంగా నిర్వహించాడు. మహాశివుని నివాస ప్రాంతమైన ఆ ప్రదేశమంతా సుగంధభరితమైన ద్రవ్యాలతో, ధూపాలతో, చక్కటి పుష్పాలతో సౌందర్యాన్ని సంతరించుకున్నది. తరువాత వ్యాసమహర్షిని ముందుంచుకుని నిధి ఉన్న ప్రదేశానికి వెళ్ళాడు. ధనాధ్యక్షుడైన కుబేరుడిని పూజించి బ్రాహ్మణుల స్వస్తి వచనాల మధ్యలో ఆ ధనం కోసం త్రవ్వించాడు. శివుడి అనుగ్రహంతో కొద్ది సేపు త్రవ్వగానే మనోహరములైన రత్న వజ్ర వైఢూర్యాలు, సువర్ణపాత్రలు, సువర్ణ కలశాలు, అపారమైన నిధులన్నీ లభించాయి. వాటన్నింటినీ పైకి తీయించాడు. వాటిని తీసుకువెళ్ళటానికి పెద్ద పెద్ద పెట్టెలను తెచ్చారు. తగిన వాహనాలను సిద్దంచేశారు. అరవై వేల ఒంటెలు, ఒక కోటీ ఇరవై లక్షల గుఱ్ఱాలు, లక్ష ఏనుగులు, మరో లక్ష రథాలు, ఇంకో లక్ష బండ్లు, లెక్కలేనన్ని గాడిదలు, సిద్దంగా ఉంచి, ఆ తీసిన ధనాన్ని ఆయా వాహనాల మీద సద్దారు. పదహారు కోట్ల ఎనిమిది లక్షల ఇరవై నాలుగు వేల బారువుల బరువు ఉంది ఆ ధనం, ఈ ధనాన్ని ప్రసాదించిన మహాదేవుడిని మరలా ప్రసన్నం చేసుకుని వ్యాసమహర్షిని ముందు పెట్టుకుని హస్తినాపురానికి సంతోషంగా చేరుకున్నారు.
2.2 యాగారంభము:
తరువాత వ్యాసులవారు చైత్రమాసంలో యజ్ఞదీక్ష జరుగుతుందని ముహూర్తం నిర్ణయించారు. అశ్వవిద్య తెలిసిన సూతులు, బ్రాహ్మణులు యజ్ఞార్థసిద్ధికోసం పవిత్రమైన ఉత్తమ అశ్వాన్ని పరీక్షించాలి, శాస్త్రానుసారంగా దానిని విడిచిపెట్టాలి. ఆ అశ్వం దీప్తిమంతమైన నీ యజ్ఞ యశస్సును విస్తరింపజేస్తూ సముద్ర పర్యంతమయిన భూమండలాన్ని చుట్టి రావాలి. పైలుడు, యాజ్ఞవల్కుడితో పాటు నేను వచ్చి నీ యజ్ఞాన్ని సుసంపన్నం చేస్తాము అని వ్యాసులవారు యుధిష్ఠిరుడికి యజ్ఞ విధానాన్ని, అందుకొరకు సిద్దం చేయించవలసిన వస్తువులను ఆజ్ఞాపించాడు. యుధిష్ఠిరుడు అవన్నీ సిద్ధం చేసుకుని, వ్యాసులవారు చెప్పిన సమయానికి ఉత్తమమైన అశ్వాన్ని ఎంచుకున్నాడు. భూమండలమంతా స్వేచ్ఛగా సంచరించే ఆ అశ్వానికి రక్షణగా అర్జునుడిని నియోగించమని వ్యాసులవారు ఆదేశించారు. భీమసేనుడు, నకులడు రాజ్యరక్షణకు సమర్థులు కావున వారికి రాజ్యరక్షణను అప్పగించాడు. సహదేవుడు కుటుంబరక్షణ విషయాలను అన్నింటిని పర్వవేక్షిస్తాడు. అంటూ వ్యాసులవారే స్వయంగా ఎవరెవరు ఏ పనిలో వ్యవహరించాలో ఆజ్ఞాపించారు. యుధిష్ఠిరుడు అర్జునుడిని పిలిచి నాయనా! ఈ అశ్వరక్షణ నీవు తప్ప మరెవ్వరూ చేయలేరు. చాలామంది రాజులు, వీరులు ఇంకా గాయాలనుండీ కూడ కోలుకోలేదు. రాజలోకం నశించడంతో కొన్ని రాజ్యాలలో బాలురో లేక వారి బంధువులో రాజ్యభారాన్ని నిర్వహిస్తున్నారు. నిన్ను ఎదిరించే రాజులతో, వీలయినంత వరకు యుద్దం చేయవలసిన అవసరం లేకుండా సామోపాయంతోనే మనపక్షాన నిలిచి ఉండేటట్లు చూడు. వారందరినీ ఈ యాగానికి తప్పకుండా ఆహ్వానించు. అంటూ తగు సూచనలు ఇచ్చి అర్జునుడిని అశ్వ రక్షకుడిగా ససైన్యంతో పంపించాడు యుధిష్ఠిరుడు. పాండవులు మహాభారతసంగ్రామంలో జయించిన సమస్త దేశాలలో ఆ అశ్వం స్వేచ్ఛగా సంచరిస్తూ భూమికి ప్రదక్షిణ చేసింది.
స హయః పృథివీ రాజన్ ప్రదక్షిణమవర్తత।
ససారోత్తరతః పూర్వం తన్నిబోధ మహీపతే।। 73.11
హస్తినాపురంలో యాగాశ్వ సంచారాన్ని, విజయుడి విజయోత్సాహాన్ని చారుల ద్వారా తెలుసుకుని యుధిష్ఠిరుడు చాలా సంప్రీతి చెందాడు. త్వరలో మాఘపౌర్ణమి దగ్గరపడుతున్నది. ఇంకా యాగానికి ఒక నెల మాత్రమే గడువున్నది. కాబట్టి యాగం చేయవలసిన ప్రదేశము కోసం నిపుణులైన బ్రాహ్మణులను ముందు వుంచుకుని మద్దిచెట్లతో నిండిన సుందరమైన ప్రదేశాన్ని ఎంచుకున్నాడు. ఆ పవిత్ర ప్రదేశంలో భీమసేనుడు శాస్త్రానుసారంగా యజ్ఞభూమిని సిద్ధం చేయించాడు. అనేక ప్రాసాదాలు నిర్మించాడు. యాగశాలను బంగారంతోను, రత్నాలతోను అలంకరించారు. పెద్ద పెద్ద సింహద్వారాలను ఏర్పాటు చేసారు. బ్రాహ్మణులకు తగిన నివాసాలను ఏర్పాటు చేశారు. విచ్చేసే రాజులందరికీ వసతులు ఏర్పాటు చేశారు.
ఏవం ప్రముదితం సర్వం పశు గో ధనధాన్యతః।
యజ్ఞవాటం నృపా దృష్ట్వా పరం విస్మయమాగతాః।। 85.35
2.3 ధర్మజుని సందేహము:
శ్రీకృష్ణుడు విచ్చేసి, యుధిష్ఠిరునికి నమస్కరించి, భీమాదులను సంతోషంతో కుశలప్రశ్నలు వేశాడు. ద్వారకా నగరానికి అర్జునుడు విచ్చేసినప్పుడు అర్జునుడు చెప్పిన దిగ్విజయ(బభ్రువాహనుడితో యుద్ధ) విశేషాలను కృష్ణుడు యుధిష్ఠిరుడికి చెప్పి సంతోషపరిచాడు. దిగ్విజయ యాత్రలో అనేక యుద్దాలతో అలసిపోయిన అర్జునుడి ప్రస్తావన చేశాడు జగన్నాథుడు. అర్జునుడి పేరు ప్రస్తావించగానే యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడిని ఒక సందేహం అడిగాడు. “కృష్ణా! అర్జునుడిని స్మరించగానే నా మనస్సు సంతోషంతో నిండిపోతుంది. మరోప్రక్క అర్జునుడు యుద్ధాలు చేసిచేసి అలసిపోతున్నాడే అనే దిగులుగా ఉంది. అంతటి ధీమంతుడైనా కూడ అర్జునుడు ఎందుకు సుఖహీనుడవుతున్నాడు. అతని జీవితంతో సుఖ పడిందే తక్కువ. అలా సుఖహీనుడవటానికి అతన శరీరంతో అనిష్టకరమైన లక్షణం ఏదన్నా కారణమా? సాముద్రికపరంగా అతని శరీరంలో ఏదన్నా దోషముందా”?
కిం ను తస్య శరీరేsస్తి సర్వ లక్షణ పూజితే।
అనిష్టం లక్షణం కృష్ణ యేన దుఃఖాన్యుపాశ్నుతే।। 87.5
అని తన తమ్ముడు అంత బాధపడుతున్నాడే అని దీనంగా అడిగాడు. శ్రీకృష్ణుడు కాసేపు ఆలోచించి యుధిష్ఠిరునికి సమాధానం చెప్పాడు. “రాజా! అర్జునుడి శరీరంలో కాళ్ళలో పిక్కలు ఉండవలసిన పరిమాణం కంటే ఎక్కువగా ఉంటాయి. అతడి వయసుకి, అతడి ఎత్తుకి సగటున ఉండవలసిన దానికంటే కొంచెం పెద్దవి.
న హ్యస్య నృపతే కించిత్ సంశ్లిష్టముపలక్షయే।
ఋతే పురుషసింహస్య పిణ్డికేsస్యాధికే యతః ।। 87.8
ఇంతకంటే సాముద్రిక పరంగా ఏ దోషమూ అర్జునుడిలో నాకు కనపడలేదు. అర్జునుడు అంతటి వీరుడయినా కూడ దుఃఖ పరంపరలను ఎదుర్కొనటానికి ఇదే కారణం యుధిష్ఠిరా. ఇంతకంటే వేరే కారణం లేదు” అని సాముద్రికశాస్త్రాన్ని కూడ కృష్ణుడి ముఖతః మనకు పరిచయం చేశాడు వ్యాసభగవానుడు.
తరువాత మూడవరోజున వ్యాసులవారు యాగాన్ని ప్రారంభించారు. యుధిష్ఠిరుడు యాగ దీక్షలో తరించాడు. ఈ యాగంలో ఏ లోపమూ లేకపోవటం వలన దీన్ని అహీనం, సర్వాంగపూర్ణం, అని చెప్పవచ్చు.
అహీనో నామ రాజేంద్ర క్రతుస్తేsయం చ కల్పతామ్।
బహుత్వాత్ కాంచనాఖ్యస్య ఖ్యాతో బహుసువర్ణకః।। 88.13
ఇందులో సువర్ణద్రవ్యాన్ని అధికంగా వాడటం వలన ఇది బహుసువర్ణకం అనే పేరు ప్రఖ్యాతమవుతుంది. యుధిష్ఠిరుడు దక్షిణల విషయంలో వారు అనుకున్న దానికంటే మూడురెట్లు అధికంగా ఇచ్చాడు. అందువలన ఈ యజ్ఞం మూడు యాగాలతో సమానమవుతుంది. ఈ యాగంలో అవభృధ స్నానంతో యుధిష్ఠిరుడు జ్ఞాతివధ చేసినందువలన వచ్చిన పాపమంతా పోగొట్టుకుంటాడు. ఇరువై ఒక్క యూపస్తంభాలతో యాగం విశేషతను సంతరించుకుంది. బ్రాహ్మణులు శ్రద్ధగా యాగం నిర్వర్తించారు. ఆ యాగధూమవాసన తగిలినా చాలు సర్వపాపాలు హరిస్తాయి. ఆ దివ్యసువాసనను సోదరసహితంగా యుధిష్ఠిరుడు ఆఘ్రాణించాడు. శాస్త్రబద్ధంగా యాగాన్ని పరిసమాప్తి చేసి యుధిష్ఠిరుడు బ్రాహ్మణులకు వేయి కోట్లు బంగారు నాణాలను దానం చేశాడు. ఆ సందర్భంగా యుధిష్ఠిరుడు యాగ విధిని అనుసరించి ఈ సమస్త భూమినీ నేను ఋత్విక్కులకు ఇచ్చేస్తున్నాను. దాని నిమిత్తమై వ్యాసులవారికి ఈ భూమండలాన్ని నేను సమర్పిస్తున్నాను.
కోటీ సహస్రం నిష్కాణాం వ్యాసాయ తు వసుంధరామ్। 89.8
నేను ఇక అడవికి వెళతాను. యజ్ఞప్రమాణాన్ని అనుసరించి మీరు ఈ భూమిని నాలుగు భాగాలు చేసుకుని పంచుకోండి.
వనం ప్రవేక్ష్యే విప్రాగ్ర్య విభజధ్వం మహీమిమామ్।
చతుర్ధా పృధివీ కృత్వా చాతుర్హోత్రప్రమాణతః।। 89. 12
నా సోదరుల అభిప్రాయం కూడా ఇదే. అని ప్రమాణం చేయగానే ద్రౌపదీ దేవితో సహా సోదరులందరూ యుధిష్ఠిరుడి మాటే మా మాట కూడా అని ఏకకంఠంతో పలికారు. ఆ త్యాగానికి విన్నవారి రోమాలు నిక్కబొడిచాయి. గగనతలం నుండీ పుష్పవృష్టి కురిసింది. సత్యవతీ సుతుడు వ్యాసుడు ఆ భూదానాన్ని గ్రహించి తిరిగి ధర్మరాజుకే ఆ రాజ్యభారాన్ని అందించాడు. దానికి తగ్గ మూల్యాన్ని మాత్రం, ధర్మరాజుకి తగిన ఫలం రావటంకోసం గ్రహించాడు. శ్రీకృష్ణుడుకూడ వ్యాసులవారి వచనాలను పాటించమని ధర్మరాజుకి సూచించాడు. దాంతో ధర్మరాజు ప్రతి బ్రాహ్మణుడికీ కోట్లకొలదీ దానాలతో సంతృప్తి పరచి యాగాన్ని ఘనంగా సమాప్తి చేశాడు. అందరూ సంతోషంగా హస్తినాపురానికి చేరుకున్నారు.
2.4 నకులోపాఖ్యానము:
అయితే జనమేజయుడు వైశంపాయన మహర్షిని ఒక ప్రశ్న వేశాడు. “యుధిష్ఠిరుడు చేసిన అశ్వమేధయాగంలో ఏమైనా విశేషాలు జరిగాయా” అని కుతూహలంగా ప్రశ్నించాడు. దానికి సమాధానంగా వైశంపాయనుడు నకులోపాఖ్యానాన్ని చెప్పాడు. యాగానంతరం ధర్మరాజు చేసిన దానాల గురించి అందరూ ప్రశంసించుకుంటున్న సందర్భంలో ఆ యజ్ఞవాటికలోకి ఒక ముంగిస వచ్చింది. అది ఒక్క సారిగా ఉరుములాగా గర్జించి మానవభాషలో ఇలా అన్నది. “నరశ్రేష్ఠులారా! కురుక్షేత్రంలో ఉంఛవృత్తి చేస్తూ జీవించిన బ్రాహ్మణుడు చేసిన పేలపిండి దానంతో ధర్మజుడు చేసిన యజ్ఞం ఏ మాత్రం సమానం కాదు” అని ఆక్షేపించింది.
సక్తుప్రస్థేన వో నాయం యజ్ఞస్తుల్యో నరాధిపాః।
ఉంఛవృత్తేర్వదాన్యస్య కురుక్షేత్ర నివాసినః।। 90.7
పొలంలో పంటకోసి తీసుకుపోయిన తరువాత పడిన గింజలను ఏరుకుని దానిని ఆహారంగా చేసుకోవటమే ఉంఛవృత్తి అంటారు. ఆ ముంగిస మాటలు విన్న వారంతా శాస్త్రబద్ధంగా నిర్వహించిన ఈ యాగాన్ని ముంగిస ఎందుకు ఆక్షేపిస్తుందో అర్థం కాక ముంగిసనే అడిగారు. ముంగిస నవ్వుతూ, “అవును, నేను చెప్పింది నిజమే. కురుక్షేత్రంలో సకుటుంబముగా నివసిస్తున్న బ్రాహ్మణోత్తముడున్నాడు. ఉంఛవృత్తితో జీవిస్తూ మూడురోజులకొకసారి తనవారితో కలిసి భుజించేవాడు. ఒకోసారి ఆయనకు ఆహారం దొరక్కపోతే మరలా మరో మూడురోజులు ఉపవసించి తిరిగి ప్రయత్నించేవాడు. ఇలా ఒక నియమంగా తపస్సులాగా జీవనాన్ని కొనసాగించాడు. ఒక కష్టకాలంలో అనేక రోజులు ఉపవసించవలసి వచ్చింది. తదుపరి చాలా రోజుల తర్వాత అతనికి లభించిన గింజలతో ఆహారాన్ని సిద్దంచేసుకుని అగ్నికి ఆహుతులు సమర్పించి ఇంటిలోని నలుగురు నాలుగు భాగాలు విభజించుకుని తినటానికి సిద్ధమయ్యారు. సరిగ్గా అదే సమయానికి ఒక విప్రుడు వారి ఇంటికి అతిథిలాగా వచ్చాడు. ఆ పవిత్రమైన ఆహారాన్ని తన వంతు భాగాన్ని ముందుగా సమర్పించాడు. ఆ సక్తుపిండిని ఆరగించిన అతిథికి ఇంకా ఆకలి తీరలేదు. గృహస్థుని స్థితిని గమనించిన ఆ ఇల్లాలు భర్తతో అన్నది. నాథా! మనిద్దరికీ ధర్మార్థాలు సమానమే. కాబట్టి నా ఆహార భాగాన్ని స్వీకరించి అతిథికి తృప్తిని కలిగించండి. రక్షించటం వలన పాలించటం వలన నీవు నాకు పతివి. భరించటం వలన పోషించటం వలన నీవు భర్తవు. పుత్రుడిని ప్రసాదించటం వలన వరదుడివి. కాబట్టి నీకు నాయొక్క ఆహార భాగంలో హక్కు ఉన్నది. అని గృహిణి తన భాగాన్ని ఇచ్చింది. అది కూడా తిని ఇంకా ఆకలిగా ఉన్న అతిథిని చూసి తరువాత క్రమంగా కుమారుడు, కోడలు కూడా వారి వారి భాగాలను సమర్పించారు.
వాస్తవానికి ఆ అతిథి రూపంలో వచ్చిన బ్రాహ్మణుడే ధర్మదేవత. వారి అతిథి సేవకు సంతృప్తి చెందిన ధర్ముడు బ్రాహ్మణుడితో అన్నాడు. “ద్విజోత్తమా! నీవు చేసిన ఈ పవిత్ర దానానికి సంప్రీతి చెందాను. నేను ధర్మదేవతను. నీ దర్శనార్థమై బ్రహ్మలోకంలో విమానాలలో సంచరించే బ్రహ్మర్షులు ఎదురుచూస్తున్నారు. నీ దానంతో నీ పితరులనందరినీ తరింపచేశావు. నీవు చేసిన ఈ పుణ్యం వలన అనేక యుగాల్లో నీ తరాల వారు కూడా తరిస్తారు. ఆకలి ప్రజ్ఞను, ధర్మబుద్ధిని, పోగొడుతుంది. ఆకలిని జయించినవాడు స్వర్గాన్ని జయిస్తాడు. ఇదిగో ఈ దివ్యవిమానం ఎక్కి నీవు నీ కుటుంబంతో పాటు దేవలోకానికి చేరుకో” అని వారితో పాటు ధర్ముడు అదృశ్యమయ్యాడు.
ఆరోహత యథాకామం ధర్మోsస్మిద్విజ పశ్య మామ్।
తారితో హి త్వయా దేహో లోకే కీర్తిః స్థిరా చ తే।। 90.106
సభార్యః సహపుత్రశ్చ సస్నుషశ్చ దివం వ్రజ।
ఇత్యుక్తవాక్యే ధర్మే తు యానమారుహ్య స ద్విజః।। 90.107
2.5 ధర్ముడికే శాపవిమోచనము కలిగించిన ధర్మజుడు:
“నేను నా కన్నంలోనుండి బయటకువచ్చి ఆ బ్రాహ్మణుడు పెట్టిన సక్తుపిండిని ఆఘ్రాణించటం వలన అక్కడ పడిన దివ్య పుష్ఫాల రాపిడి వలన నా తల భాగం సువర్ణమయమయింది. ఇక నా శరీరంలో రెండవ భాగం ఎలా సువర్ణమవుతుందో అనే ఉద్ధేశంతో అనేక తపోవనాలకు వెళ్లాను. అనేక యాగాలకు వెళ్లాను. అలాగే ధర్మరాజు గొప్ప యాగం చేస్తున్నాడని తెలిసి ఇక్కడకి వచ్చాను. కానీ నా శరీరం బంగారంగా మారలేదు. అందుకే బ్రాహ్మణుడి దానాన్ని ప్రశంసించాను” అని చెప్పి ముంగిస అంతర్థానమైపోయింది. ఈ విషేషమైన ఆఖ్యానాన్ని విన్న జనమేజయుడు వైశంపాయనుడిని అడుగుతున్నాడు. ఈ ముంగిస రూపంలో వచ్చి మానవ భాషలో మాట్లాడినవారు ఎవరు? ఇలా ధర్మరాజు యాగాన్ని ఆక్షేపించటానికి గల కారణమేమిటి?అని ప్రశ్నించాడు. దానికి సమాధానంగా మహర్షి వివరించారు. “నాయనా! పూర్వకాలంలో విశ్వామిత్రుడి తండ్రి జమదగ్ని పితృశ్రాద్దాన్ని పెడుతూ హోమధేనువు పాలు పితుకుతున్నాడు. పితృశ్రాద్దంలో క్రోధాదులతో ప్రవర్తించకూడదు. ఆ సమయంలో ధర్మదేవత క్రోధరూపంలో వచ్చి పాలలో ప్రవేశించి వాటిని దూషితం చేశాడు. ఆయనకు ఇష్టం లేని పని చేస్తే ఏం చేస్తాడో, కోపగిస్తాడో లేదో పరీక్షిద్దామని ఈ పని చేశాడు. కానీ జమదగ్ని ఈ విషయం తెలిసికూడా చాలా శాంతచిత్తంతో వ్యవహరించాడు. జమదగ్ని చేతిలో ఈ విధంగా పరాజయం పాలైన ధర్ముడు ఆయనకు క్షమాపణ చెప్పి నమస్కరించి ఆయన అనుమతితో వెళ్ళిపోయాడు. కానీ పితృకార్యంలో ఈ పని చేసినందుకు పితృదేవతలు ధర్ముడిని ముంగిస రూపంలో మారిపోయేట్టు శపించారు. ఆ ధర్ముడు శాపావసానం కోరితే వారు యుధిష్ఠిరుడి చర్యను ఆక్షేపించిన రోజు నీకు శాపవిముక్తి కలుగుతుంది అని ప్రాయశ్చిత్తాన్ని నిర్ణయించారు. సాక్షాత్తు విష్ణువే శ్రీకృష్ణుడి రూపంలో అధ్యక్షత వహించిన ఆ యజ్ఞాన్ని అందరూ ప్రశంసిస్తుంటే ఎవరన్నా ఆక్షేపించగానే ధర్మరాజు యొక్క ముఖకవళికలు ఎలా మారిపోతాయి. అది పరీక్షించటానికే ఇదంతా. కానీ యుధిష్ఠిరుడు ఏమాత్రం రాగ ద్వేషాలకు లొంగకుండా తనలో ఏదన్నా తప్పు ఉంటే సరిదిద్దుకోటానికే సిద్ధమయ్యాడు. అతడి ఇంద్రియ నిగ్రహం చూసి ధర్ముడు చాలా ప్రసన్నుడయ్యాడు. అందుకే ముంగిస రూపంలో ధర్ముడు అశ్వమేధానికి వచ్చి ధర్మరాజు యాగాన్ని ఆక్షేపించి తరువాత శాపవిముక్తి కలిగి ఆ ధర్ముడు యుధిష్ఠిరుడిలోనే కలిసిపోయాడు అని వైశంపాయన మహర్షి నకులోపాఖ్యానంతో తదుపరి అనేక దానాల మహిమను వర్ణించి అశ్వమేధ పర్వాన్ని సమాప్తి చేశారు.
3. ఆశ్రమవాస పర్వం:
అశ్వమేధయాగం తరువాత యుధిష్ఠిరుడు పదిహేను సంవత్సరాలు ఈ భూమండలమంతా సుఖంగా పరిపాలించాడు.
పాణ్డవాః సర్వకార్యాణి సంపృచ్ఛన్తి స్మ తం నృపమ్।
చక్రుస్తేనాభ్యనుజ్ఞాతా వర్షాణి దశ పంచ ।। 1.6
3.1 ధర్మజుని పితృభక్తి:
తాను ఏ పని చేస్తున్నా ధృతరాష్ట్రుడికి గౌరవార్థంగా చెప్పి చేసేవాడు. సర్వ కార్యాలను కూడ ఆయనను ముందు పెట్టుకునే ఆచరించాడు. కుంతీ మరియు ద్రౌపది కూడ గాంధారీదేవిని గురుభావంతో సేవించారు. దుర్యోధనాదులు ఉన్నప్పుడు ధృతరాష్ట్రుడు ఏవిదమైన గౌరవ మర్యాదలను, సుఖాలను అనుభవించారో అదేవిధంగా ఇప్పుడు కూడా వారికి ఏ లోటూ రాకుండా చూసుకున్నాడు యుధిష్ఠిరుడు. ఇక్కడ మనం పరిశీలిస్తే పెద్దల పట్ల ఎలా ఉండాలో గ్రహించవచ్చు. మహాభారత సంగ్రామానికే మూల కారకులుగా ధృతరాష్ట్ర-దుర్యోధనులను చెప్తాము. అటువంటి ధృతరాష్ట్రుడిని, పాండవులకు ఇంత వరకూ సుఖమనేదే లేకుండా చేసిన ధృతరాష్ట్రుడిని, యుధిష్ఠిరుడు ఎంత గౌరవిస్తున్నాడో చూడండి. అదీ పెద్దల పట్ల మనం నడుచుకునే ధర్మం. పాండురాజు ధృతరాష్ట్రుడిని ఎలా గౌరవించాడో, అలాగే గౌరవించాడు యుధిష్ఠిరుడు కూడ, ఇంకా చెప్పాలంటే దుర్యోధనుడు కూడా ఇంత గౌరవం ధృతరాష్ట్రుడికి ఇవ్వలేదు. ఆయన కోరిన వస్తువులనన్నిటినీ సమకూర్చేవాడు యుధిష్ఠిరుడు. తండ్రి లేని లోటు ఎలా ఉంటుందో యుధిష్ఠిరుడికి తెలుసు. ధృతరాష్ట్రుడు పుత్రశోకంతో మరణించకుండా, ధృతరాష్ట్రుడినే తన తండ్రిగా భావించి సపర్యలు చేస్తూ, రక్షించుకుంటూ వస్తున్నాడు మహారాజు. అశ్వమేధయాగం తరువాత యుధిష్ఠిరుడు పదిహేను సంవత్సరాలు ఈ భూమండలమంతా సుఖంగా పరిపాలించాడు. పదిహేను సంవత్సరాలు గడిచాక ఇక ధృతరాష్ట్రుడు నియమబద్ధంగా జీవించాలనుకొన్నాడు. కొన్నిరోజులు రెండు రోజులకోసారి, కొన్ని రోజులు నాలుగు రోజులకోసారి కేవలం ఆకలి తీరటానికి మాత్రమే భుజిస్తున్నాడు.
చతుర్థే నియతే కాలే కదాచిదపి చాష్టమే। 3.24
(చతుర్థకాలం, నాలుగు పూటలు. అంటే రెండు రోజులకొకసారి, అష్టమ కాలం అంటే నాలుగురోజుల సమయానికి ఒకసారి) శరీరం కృశించేట్టు ఉపవాసాలు చేశాడు. నేలమీదనే శయనించాడు. ఈ విషయం తెలుసుకుని యుధిష్ఠిరుడు చాలా బాధ పడ్డాడు. తన తప్పేమన్నా ఉందా అని ప్రాధేయపడ్డాడు. కాళ్ళావేళ్ళా పడి వేడుకున్నాడు. “నీవు మనసులో ఏదో పెట్టుకుని ఆహారాన్ని నిరసిస్తున్నావు. నా వలన తెలిసిగానీ తెలీకగానీ ఏదన్నా దోషం జరిగిందా, చెప్పమని వేడుకున్నాడు. నీకు బాధ కలిగించినట్లయితే ఈ రాజ్యమే నాకు అక్కర్లేదు. ఇదంతా నీకే ధారపోస్తాను. నీవు చెప్పినట్లు నడుచుకుంటాను. ముందు మీరు సరిగ్గా ఆహారం తీసుకోండి” అని నచ్చ చెప్పాడు. ఎంత బ్రతిమలాడుతున్నా ధృతరాష్ట్రుడు మాత్రం ఒకే మాట మీద నిలబడ్డాడు. “మమ్మల్ని వనవాస జీవితానికి అనుమతించు నాయనా, మన పూర్వికులందరూ వారి చరమదశలో వనవాస జీవితాన్నే ఆశ్రయించారు. కాబట్టి మేము కూడ వనాలకు వెళ్ళి జీవిస్తాము. దానికి నీవు అంగీకరిస్తేనే నేను ఆహారం తీసుకుంటాను” అని పంతం పట్టాడు. ఇంతలో వ్యాసమహర్షి అక్కడకి వచ్చాడు. ఆయన కూడ ధృతరాష్ట్రుని నిర్ణయాన్నే సమర్థించారు. యుధిష్ఠిరునితో ధృతరాష్ట్రుడు చెప్పిన ప్రకారమే అనుసరించమని ఆదేశించాడు.
యుధిష్ఠిర మహాబాహో యథాహ కురునందనః
ధృతరాష్ట్రో మహాతేజాస్తత్ కురుష్వాsవిచారయన్. 4.1
మరే ఇతర ఆలోచన చేయకుండా ధృతరాష్ట్రుడు చెప్పినట్లే నడుచుకోమన్నాడు. ఈ ధృతరాష్ట్రుడు వృద్ధుడైపోయాడు. అందునా పుత్రశోకంలో ఉన్న ఈ రాజు చిరకాలం ఈ బాధను సహించలేడయ్యా. ఈ రాజుని వనవాసానికి అనుమతించు. లేకపోతే వృథాగా ఈ బాధలోనే ఇక్కడ మరణిస్తాడు. అది క్షత్రియులకు మంచిది కాదు. యుద్ధంలోనన్నా మరణించాలి లేదా వానప్రస్థంలో రాజర్షులుగానన్నా మరణించాలి అని వ్యాసులవారు సెలవిచ్చారు. పైగా ఈ మహారాజు రాజ్యసుఖాలనన్నీ అనుభవించాడు. ఈయనకు నీపై ఏ మాత్రం కోపం లేదు. అని వ్యాసుడు ధర్మవచనాలు చెప్పి వెళ్ళిపోయాడు. యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుడి వచనాలను అంగీకరించి ముందు మీరు ఆహారం తీసుకోండి, తరువాత వనవాసం గురించి చర్చించండి అని తృప్తిగా ఆహారాన్ని తినిపించాడు దగ్గరుండి మరీ. ధృతరాష్ట్రుడితో పాటు గాంధారీ, సంజయుడు, విదురుడు కూడా వనవాస జీవితానికి సిద్దమయ్యారు.
ఆ తరువాత కూడ వారు వనవాసాలకు వెళ్ళిపోతారనే దిగులుతో యుధిష్ఠిరుడు ధృతరాష్ట్రుడి చెంతే కూర్చుని అనేక ఉపదేశాలను వారి నుండీ కూడా విన్నాడు. ఇలా కొన్ని రోజులు గడిచాక గాంధారి దేవి అన్నది ధృతరాష్ట్రుడితో, నాథా! స్వయంగా నీ తండ్రి వ్యాసులవారే వచ్చి నీకు వనవాసానికి అనుమతినిచ్చారు. ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నారు, అని ఎక్కడ ఆలస్యమైతే ఆయన మనసు మారిపోతుందో అనే భయంతో అడిగింది. అప్పుడు ధృతరాష్ట్రుడన్నాడు. దేవి! ఇన్నాళ్ళూ ఈ హస్తినాపుర వాసులు నన్ను ఆదరించారు. కాబట్టి మనం వనవాసానికి వెళ్ళేముందు ప్రజలకు కూడా మన కర్తవ్యాన్ని నివేదించాలి. వారి అనుమతి తీసుకున్న తరువాత నేను కొన్ని దానాలు చేయాలనుకుంటున్నాను. జూదరులైన మన కుమారులు ఎన్నో పాపాలు చేశారు. వారి పాపంలో నాకు కూడా భాగం ఉంటుంది. వారి ఆత్మకు తృప్తి కలిగే విధంగా ప్రజలకు బ్రాహ్మణులకు దానాలు చేస్తాను. ఆ తరువాత యుధిష్ఠిరుడి అనుమతితో వనవాసాలకు ప్రయాణించారు.
సంవత్సరకాలం తరువాత పాండవులకు వారి తల్లి కుంతీదేవి మీద ధృతరాష్ట్రాదుల మీద బెంగ కలిగింది. యుధిష్ఠిరుడు వెంటనే అందరూ కలిసి వెళ్ళటానికి తగిన ఏర్పాట్లు చేయించాడు. మరునాడు ఉదయమే అందరితో బయలుదేరాడు, కానీ ప్రజలు కూడా వస్తూండటంతో ఆ రాజు నగరం వెలుపలే అయిదు రోజులు ఆ ప్రజల కోసం నిరీక్షించి అందరితో కలిసి వనానికి బయలుదేరాడు.
3.2 ధర్మజునికి పూర్వజన్మ స్మృతి కలుగుట:
యుధిష్ఠిరుడికి గాంధారీ ధృతరాష్ట్రులు, కుంతీదేవి, సంజయుడు కనిపించారు కానీ మహాత్ముడైన విదురుడు కనిపించలేదు. విదురుడి వివరం అడిగిన ధర్మరాజుతో ధృతరాష్ట్రుడు చెప్తున్నాడు, “నాయనా! విదురుడు నిరాహారుడై వాయు భక్షణ మాత్రమే చేస్తూ కృశించిపోయాడు. నరాలు బయటపడి మనిషి ఎండిపోయాడు. వనంలో దిగంబరంగా తిరుగుతూ దుమ్ము, ధూళితో స్నానం చేసినట్లు తిరిగుతున్నాడు. అవధూతలాగా మారిపోయాడు. ఈ నిర్జనారణ్యంలో తిరుగుతూ ఒకోసారి ఒకోచోట బ్రాహ్మణులకు కనిపిస్తున్నాడు. స్థిరంగా ఒక చోట ఉండటం లేదు”. అని వారు ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉండగానే విదురుడు ఆశ్రమం వైపు చూసి, తిరిగి వెనక్కు వెళ్ళిపోయాడు. యుధిష్ఠిరుడు ఒంటరిగా ఆయనను వెంబడించాడు. యుధిష్ఠిరుడు విదురుడిని పిలుస్తూ, ఆర్తితో, “మహానుభావా! నీకిష్టమైనవాడిని, యుధిష్ఠిరుడిని, ఒక్కసారి నీ దర్శనభాగ్యాన్ని కలిగించు” అంటూ ఘోరమైన కాననంలో ఆయన వెనుకే పరుగెత్తాడు.
భో భో విదుర రాజాహం దయితస్తే యుధిష్ఠిరః।
ఇతి బ్రువన్నరపతిస్తం యత్నాదభ్యధావత।। 27.21
అప్పుడు విదురుడు ఒక మహావృక్షాన్ని ఆసరాగా చేసుకుని నిలిబడి యుధిష్ఠిరుడిని చూశాడు. పూర్తిగా కృశించిపోయి, కేవలం ఆకారం మాత్రమే మిగిలి ఉన్న విదురుడిని గుర్తించాడు యుధిష్ఠిరుడు. చేతులు రెండూ జోడించి నమస్కరించి నేను యుధిష్ఠిరుడిని అని పలుకుతూ దగ్గరకు వెళ్ళి ఆయన పాదాలమీద పడ్డాడు. ఆ సమయంలో విదురుడు రెప్పవాల్చకుండా ధర్మరాజుని చూశాడు. ఆ సమయంలో విదురుడు తన దేహాన్ని విడిచిపెట్టాలని నిశ్చయించుకొని, తన దృష్టిని యుధిష్ఠిరుడి దృష్టిలో, తన ప్రాణాన్ని యుధిష్ఠిరుని ప్రాణంలో, అలాగే ఇంద్రియాలను అతని ఇంద్రియాలలో, తన తేజస్సును అతని తేజస్సుతో లీనం చేశాడు.
వివేశ విదురో ధీమాన్ గాత్రైర్గాత్రాణి చైవ హ
ప్రాణాన్ ప్రాణేషు చ దధదిన్ద్రియాణీన్ద్రియేషు చ. 27.26
యుధిష్ఠిరుడు చూస్తూండగానే విదురుడు యోగ బలంతో తన సమస్త శక్తినీ యుధిష్ఠిరుడిలో నిక్షిప్తం చేశాడు. తనలో ఒక నిత్య నూతనమైన తేజస్సును కలవటం ప్రత్యక్షంగా చూసుకుని ఆశ్చర్యపోయాడు యుధిష్ఠిరుడు. అంతేకాక ధర్మరాజు తన ప్రాచీన రూపాన్ని, అంటే తన జన్మకు కారణమైన పూర్వ దేహాన్ని కూడా నూతన శక్తితో గుర్తు చేసుకున్నాడు. వచ్చిన నూతనోత్తేజంతో వారిద్దరివీ యమధర్మరాజు అంశలుగా గుర్తించి తనను తాను ధర్మస్వరూపునిగా తెలుసుకున్నాడు.
క్షణాలలోనే విదురుడి దేహం అచేతనంగా మారిపోయింది. అలాగే రెప్పవాల్చకుండా అచేతనంగా నిలబడి చెట్టుకి ఆనుకుని ఉన్న విదురుడి పార్థివదేహాన్ని చూశాడు.
విదురస్య శరీరం తు తధైవ స్తబ్ధలోచనమ్.
వృక్షాశ్రితం తదా రాజా దదర్శ గతచేతనమ్. 27.28
ఆ శరీరానికి ప్రదక్షిణ గావించి దహనసంస్కారాలను చేయాలని సంకల్పించాడు. కానీ అంతలోనే ఆకాశవాణి వినిపించింది. “రాజా! విదురుని దేహానికి దహనసంస్కారం యోగ్యంకాదు. ఇతడు సంన్యసించినవాడు. ఈ దేహాన్ని ఇలాగే వదిలేయాలి” అని పలికింది. ఆ వాక్కులను ఆలకించి ధర్మజుడు వెనక్కు వెళ్ళిపోయాడు. మాండవ్యముని శాపం వలన ధర్ముడే విదురుడి అంశగా పుట్టటం జరిగిందని ఆది పర్వంలో కూడా చెప్పుకున్నాం. విదురుడంతటి బుద్దిమంతుడు మరొకడు లేనేలేడు. దేవతలలో బృహస్పతిగానీ, రాక్షసులలో శుక్రాచార్యుడు కానీ విదురుడి బుద్ధితో సమానం కాలేరు. ఈ మాటని స్వయంగా వ్యాసులవారే ధృతరాష్ట్రాదులకు చెప్పారు. అటువంటి విదురుడిని బ్రహ్మనియోగమనే మార్గం ద్వారా వ్యాసుడే కన్నాడు. ఆ విదురుడు దేవతలకే దేవుడని చెప్పాలి. సనాతనమైన ధర్ముడు ఆయన. ధర్ముడే విదురుడు, విదురుడే యుధిష్ఠిరుడు. వీరిరువురికీ బేధం లేదు. ధారణ వలన, మనసా ధ్యానించటం వలన ఆయనను ధర్ముడని పండితులంటారు.
భ్రాతా తవ మహారాజ దేవదేవః సనాతనః ।
ధారణాన్మనసా ధ్యానాద్ యం ధర్మం కవయో విదుః।। 28.16
యుధిష్ఠిరుడు వారందిరినీ విడిచి వెళ్ళలేకపోయాడు. కుంతీమాతను బ్రతిమలాడుకున్నాడు. ‘నేనుకూడా మీకు సేవ చేస్తూ తపస్సుతో జీవిస్తాను’ అని. కానీ వారందరూ రాజ్యభారమే నీకు తపస్సు నాయనా అని ప్రోత్సహించి పంపించారు. సహదేవుడు కుంతీదేవి కాళ్ళు పట్టుకుని వేడుకున్నాడు. రాజ్యానికి రానన్నాడు. తపస్సునాచరిస్తానని అనుమతించమని వేడుకున్నాడు. కానీ కుంతీ దేవి అతడిని ఓదార్చి, మీరిక్కడే ఉంటే మా తపస్సు వృథా అయిపోతుంది. నా మాట విను నాయనా అంటూ సహదేవుడిని కూడా ఒప్పించి అందరినీ మరోసారి చూసుకుని సాగనంపింది. చేసేది లేక వచ్చినవారందరూ హస్తినాపురానికి పయనమయ్యారు.
ఒకసారి దైవికంగా నారదమహర్షి యుధిష్ఠిరుడి దగ్గరకు వచ్చాడు. యుధిష్ఠిరుడి చేత పూజలందుకున్న మహర్షి తన యాత్రా విశేషాలను వర్ణిస్తూ గంగాతీరంలో తపస్సు చేస్తున్న ధృతరాష్ట్రాదుల గురించి యుధిష్ఠిరుడు అడగగా ఆ వివరాలు చెప్పుకొచ్చాడు. “యుధిష్ఠిరా! నీవు వారిని దర్శించుకొని వచ్చేశాక వారందరూ కురుక్షేత్రం నుండీ గంగా ద్వారానికి(హరిద్వారం) వెళ్ళారు. అక్కడ వ్యాసుని కుమారుడు ధృతరాష్ట్రుడు, గాంధారీ, కుంతీదేవి ముగ్గురూ ఇంద్రియ సమూహాన్ని నిరోధించి, కట్టెవలే కూర్చున్నారు. అలా ఆసీనులయిన వారిని దావాగ్ని దహించింది. వారు ఆ పవిత్రమైన అగ్నిలో కాలి బూడిదైపోయారు మహారాజా”- అంటూ నారదుడు యుధిష్ఠిరుడికి వివరించాడు.
గాంధారీ చ మహాభాగా జననీ చ పృథా తవ।। 37.31
దావాగ్నినా సమాయుక్తే స చ రాజా పితా తవ।। 32
4. మౌసల పర్వం:
తరువాత పద్దెనిమిది సంవత్సరాలకు అంటే మహాభారత సంగ్రామం జరిగి ముప్పదియారు సంవత్సరాలకు యుధిష్ఠిరుడికి విపరీతమైన, అనిష్టశకునాలు కనిపించాయి. (యుద్ధానంతరం యుధిష్ఠిరుడు ముప్పదియారు సంవత్సరములు పరిపాలించాడు).
షట్ త్రింశే త్వథ సమ్ప్రాప్తే వర్షే కౌరవనన్దనః।
దదర్శ విపరీతాని నిమిత్తాని యుధిష్ఠిరః।। 1.1
ఆ శకునాలు భయాన్ని ఉద్వేగాన్ని కలిగించేవిగా ఉన్నాయి. తరువాత కొద్ది కాలానికే యుధిష్ఠిరుడు బ్రాహ్మణుల శాపంతో వృష్ణివంశంలో రోకలికారణంగా యుద్ధం జరిగిందని, యదువీరులందరూ ఆ యుద్ధంలో నశించారని విన్నాడు.
శ్రీకృష్ణపరమాత్ముడు కూడా గాంధారీ శాపాన్ని స్మరించాడు. (ముప్పదియారు సంవత్సరముల తరువాత నీ యదువంశము వారిలో వారు కలహించుకున్న కారణంగా నాశనమవుతుంది) మరియు మహాభారతయుద్ధసమయంలో యుధిష్ఠిరుడు గమనించిన శకునములు కృష్ణుడు ద్వారకయందు అటువంటి శకునములనే చూశాడు..
ఇదం చ తదనుప్రాప్తమబ్రవీద్ యద్ యుధిష్ఠిరః।
పురా వ్యూఢేష్వనీకేషు దృష్ట్వోత్పాతాన్ సుదారుణాన్।। (మౌ.ప)2.22
రామ-కృష్ణుల అవతారసమాప్తి అనంతరం వ్యాసభగవానుడు దీనమనస్కుడైన అర్జునుడితో
“మీకు కూడా ఇది పరలోకానికి వెళ్ళే కాలమని నా అభిప్రాయం” అన్నాడు. అదే మీకు
శ్రేయస్కరము అన్నాడు. ఉత్తమగతిని పొందటానికి ఇదే సరైన సమయము అని అర్జునుడిని సమాధానపరిచాడు వేదవ్యాసుడు.
యదువీరుల పతనము, శ్రీకృష్ణబలరాముల నిర్యాణమును తెలుసుకున్న యుధిష్ఠిరుడు వ్యాసవచనాలను స్మరంచి,
మహాప్రస్థాన సమయము ఆసన్నమయినదని నిశ్చయించుకున్నాడు.
4.1 యుధిష్ఠిరుని
వయసు ఏ ఏ సందర్భాలలో ఎంత:
ఈ సందర్భంగా అసలు యుధిష్ఠిరుని వయసు ఏ ఏ సందర్భాలలో ఎంత ఉన్నదీ అనే విషయాన్ని కూడా గమనిద్దాము.
4.1.1 మహాభారత యుద్ధసమయానికి -
- భీష్ముని వయసు - 141 సం.
- కృష్ణుడు - 90 సం.
- కర్ణుడు - 107 సం.
- ధర్మరాజు - 91 సం.
- భీముడు - 90 సం.
- అర్జునుడు - 89 సం.
- నకులుడు & సహదేవుడు - 88 సం.
- దుర్యోధనుడు - 90 సం.
- అభిమన్యుడు - 17 సం.
బ్రాకెట్లలో వున్న అంకెలు ధర్మరాజుకు ఆ అంకెల సంవత్సరాల వయసు వున్నపుడు జరిగిన సంఘటనలుగా భావించవలెను.
- ధర్మరాజు కన్నా కర్ణుడు 16 సం. పెద్దవాడు. క్రీ.పూ 3245 న జన్మించాడు
- ధర్మరాజు క్రీ.పూ 3229-8-15 న జన్మించాడు. (127)
- తరువాతి సం.లో భీముడు ఆ తరువాతి సం లో అర్జునుడు జన్మించాడు.
- కృష్ణుడు అర్జునికన్నా 6 నెలలు పెద్దవాడు. నకుల సహదేవులు ధర్మరాజు కన్నా ౩ సం చిన్నవాళ్ళు.
- దుర్యోధనుడు భీముడు పుట్టిన మరుసటిరోజు జన్మించాడు.
- తరువాత రోజుకు ఒక సోదరుడు చొప్పున మిగిలిన కౌరవులు జన్మించారు.
4.1.2 ధర్మరాజు వయసు – సందర్భానుసారముగా -
- (16) పాండురాజు మరణం.
- (౩1) ధర్మరాజు యువరాజ పట్టాభిషేకం
- (37) లాక్షాగృహ దహనం.
- (46)ధర్మరాజు పట్టాభిషేకం
- (60)మయసభ ప్రవేశం .
- (76)ఇంద్రప్రస్థం ను రాజధాని గా చేసుకుని 16సం పరిపాలిస్తాడు.
- (76)అరణ్యవాసం
- (91)శ్రీకృష్ణ రాయబారం ,కురుక్షేత్ర యుద్ధం .
- (92)అశ్వమేధ యాగం.
- (127)36-2-15 రోజులపాటు రాజ్య పాలన.
- కనుక మొత్తం #72సం_రాజ్యపాలనను తన 127 సం. జీవితకాలంలో చేసాడు.
- "క్రీ.పూ3102-2-20న 2:27:౩౦pm న #కలియుగ_ప్రారంభం మరియు #శ్రీకృష్ణ_నిర్యాణం .. అనంతరం వారం రోజుల తర్వాత ద్వారక సముద్రం లో మునిగిపోతుంది.
- (128) పాండవుల మహాప్రస్థానం 36 సం పరీక్షిత్తు కు పట్టాభిషేకం.66సం పరీక్షిత్తు పాలన అనంతరం 25సం జనమేజయుడు పట్టాభిషేకం పొందుతాడు."
5. ముగింపు:
మహాభారతసంగ్రామంలో విజయాన్ని అందుకుని, వ్యాసవాక్కులచే అశ్వమేధాన్ని పరిసమాప్తి
చేసి, తిరిగి సంపాదించిన భూమినంతటినీ వ్యాసభగవానుడికి దానం చేసిన నిష్కాముకుడు ధర్మరాజు. నిండు సభలో ‘నీ
యాగము గొప్పదేమీ కాదు’ అని పలికిన నకులవచనములకు ఏమాత్రమూ చలించక, రాగద్వేషాలకు లోనుగాక, ఇంద్రియనిగ్రహం
పాటించి ధర్ముడికే శాపవిముక్తిని కలిగించిన ధర్మాధిదేవుడే యుధిష్ఠిరుడు.
6.
ఉపయుక్తగ్రంథసూచి:
- కృష్ణాచార్య, టి.ఆర్., & వ్యాసాచార్య, టి.ఆర్. (సంపా.). శీమన్మమహాభారతమ్. నిర్ణయసాగర్ ప్రెస్, కుంభకోణం, బోంబే. 1906.
- పట్నాయక్, కె.ఎన్.ఎస్. “ది మహాభారతమ్ క్రోనోలజీ”. (వ్యాసము). నవంబరు 30. 2023.
- ప్రతాప్ చంద్ర, రాయ్ (అను.). ది మహాభారత. ఓరియంటల్ పబ్లిషింగ్ కో., కలకత్తా.
- మోహన్ గంగూలి, కిసరి. (అను.). ది మహాభారత. 2003.
- రామకృష్ణమూర్తి, తిప్పాభట్ల. & శ్రీనివాసులు, సూరం. వ్యాసమహాభారతము. విజయవాడ. 2010
- రామనారాయణదత్త శాస్తీ ,పాండ్యే. (హిందీ అను.) మహాభారతము. గీతాప్రెస్.
- శాస్త్రి, పి.పి.ఎస్. (సంపా.). ది మహాభారత. వావిళ్ళరామస్వామిశాస్త్రులు అండ్ సన్స్. 1931.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.