headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-09 | August 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

8. ‘పులిస్వారి’ నాటిక: సామాజిక విలువలు

dr_p_srinivasarao.jpg
డా. పులపర్తి శ్రీనివాసరావు

M.A. (Tel), M.A. (Skt), M.A.(Pub.admin), Ph.D., PDF
సాహిత్య పరిశోధకులు, విమర్శకులు,
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 8309742248. Email: telugu.bujji@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

‘హితేన సహితం సాహిత్యం’ అన్నారు ఆర్యులు. సమాజానికి హితం చేకూర్చేది సాహిత్యం అని దాని అర్థం. ఆధునిక సాహిత్యం చాలా వరకూ ఈ కోవలోనే ఉంది. అయితే నేటి కాలంలో ప్రజలలో సామాజిక విలువలు లోపిస్తున్నాయనేది అందరూ అంగీకరించాల్సిన సత్యం. ఆధునిక కాలంలో కందుకూరి, గురజాడలాంటి వారు సాహిత్యపరంగా సంఘసంస్కరణకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ప్రజలలో సామాజిక విలువల పట్ల అవగాహన కల్పించే ప్రయత్నం చేశారు. ఇదేవిధంగా ఆధునిక సాహిత్యాన్ని పరిశీలిస్తే, దృశ్య రూపకాల ద్వారా పరివర్తన తీసుకురావడానికి చాలా మంది కవులు, రచయితలు కంకణం కట్టుకున్నారు. నేటితరం రచయితలు కూడా ఇదే పంథాను అనుసరిస్తున్నారిని కూడా అర్థమవుతూ ఉంది. ఇలాంటివారందరూ మానవత్వం, మానవ సంబంధాలు నశించిపోతున్న ఈ కాలంలో మనుషులలో యాంత్రికత్వాన్ని పోగొట్టి మంచి విలువలను అందిపుచ్చుకునేలా రచనలు చేస్తున్నారు. ఈ కోవలో సామాజిక విలువలను సాహిత్య వస్తువుగా తీసుకుని వివిధ ప్రక్రియల ద్వారా సమాజంలో అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే లక్ష్యంతో కవి, రచయిత అయిన ద్విభాష్యం రాజేశ్వరరావు ‘పులిస్వారి’ అనే రూపకాన్ని రాసి సమాజ సంస్కరణలో రచయితగా తన బాధ్యతను నెరవేర్చే కోణంలో అనేకసార్లు ప్రదర్శింపచేశారు కూడా. అంతేకాకుండా ఈ నాటిక ద్వారా సామాజిక విలువల ఆవశ్యకతను తెలియజెప్పుతూ, ప్రతీ మనిషిని ఆలోచింపచేసేలా పాత్ర చిత్రణ చేశారు. ఈ రూపకం ద్వారా రచయిత సమాజంలో ఏవిధమైన మార్పుని ఆశించారో?, ఎలాంటి విలువలు సమాజానికి అవసరమో ఆయా పాత్రల ద్వారా తెలియజెప్పిన విధానాన్ని పరిశీలించి పాఠకులకు, పరిశోధకులకు మరియు సాహితీవేత్తలకు అందించి, ఆయన తెలియపరిచిన సామాజిక విలువలపట్ల అవగాహన కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ పరిశోధన వ్యాసాన్ని అందిస్తున్నాను.

Keywords: వాఙ్మయం, పులిస్వారీ, ఐశ్వర్యం, చీదరింపు, కట్టుబాట్లు, ప్రపంచీకరణ, మోడరన్‌ సొసైటీ, సంస్కృతి.

1. ఉపోద్ఘాతం:

సాహిత్య ప్రక్రియల్లో నాటకం అత్యంత శక్తివంతమైన సాధనం. జన హృదయాలను సూటిగా స్పందింప చేసే శక్తి ఒక్క నాటకానికే ఉంది. ఆధునిక సాహిత్య ప్రక్రియలైన కవిత్వం, నవల కథానికలవలె నాటక వాఙ్మయం కూడా సాంఘిక ప్రయోజనం పరమావధిగా అవతరించింది. తెలుగువారి సామాజిక జీవితాన్ని బహుకోణాల్లో నాటకం ప్రదర్శించింది. ఒక శతాబ్ది కాలంలో, తెలుగు సమాజంలో వచ్చిన అనేక పరిణామాలను ఎప్పటికప్పుడు చిత్రిక పట్టింది నాటకం. సంఘజీవితంలో ఏర్పడిన అనేకమైన ఎగుడుదిగుడులను విమర్శనాత్మకంగా, పరిశీలనాత్మకంగా, ప్రయోగాత్మకంగా చిత్రిస్తూ సంఘపురోగమనానికి అడ్డుపడే దౌష్ట్యాలను, సంఘజీవితాన్ని విచ్ఛిన్నం చేసే క్రౌర్యాలను బయటపెట్టింది నాటక ప్రక్రియ. కాబట్టే ఆధునిక సమాజంలో సంస్కరణను ఆశించిన రచయితలు ఈ నాటకానికే పెద్దపీటవేశారని తెలుస్తుంది. గురజాడవారు రాసిన కన్యాశుల్కం, కందుకూరి రాసిన రాజశేఖర చరిత్ర లాంటివి ఈ కోవలోకే వస్తాయి. ఈ ప్రక్రియకు ఉంటే లక్షణాలనే కలిగి నిడివి తక్కువగా ఉండి, తక్కువ సమయంలో ఎక్కువ ఆలోచన కలిగించే సాహిత్య ప్రక్రియ నాటిక. సంఘ సంస్కరణ దృక్పథం కలిగిన కవులు ఈ ప్రక్రియకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. ద్విభాష్యం రాజేశ్వరరావు కూడా ఇదే మార్గంలో సామాజిక పరివర్తన గురించి అవగాహన కల్పించడం కోసం ‘పులిస్వారీ’ నాటికను వెలువరించారు.

2. రచయిత పరిచయం:

ద్విభాష్యం రాజేశ్వరరావు 1-7-1945 న విశాఖజిల్లా యలమంచిలి గ్రామంలో ద్విభాష్యం వెంకట సూర్యనారాయణ మూర్తి, నరసాంబ దంపతులకు జన్మించారు. రాజేశ్వరరావు గారికి సీతాదేవితో 1968 వివాహం అయింది. వీరికి ముగ్గురు పిల్లలు.1964 వ సం॥లో హైదరాబాదులోని ‘‘ఆల్విన్‌ మెటల్‌వర్క్స్‌’’లో ఉద్యోగ జీవితం ఆరంభించారు. ఆ తరవాత 1967 ఏప్రియల్‌లో విశాఖపట్నంలోని ‘కోరమండల్‌ ఫర్టిలైజర్స్‌’ కంపెనీ ఉద్యోగంలో స్థిరపడ్డారు. ప్రస్తుతం ‘డిప్యూటి మేనేజర్‌ ఇన్‌ సేఫ్టీ’ గా పదవీ విరమణ చేసి విశ్రాంత జీవనం గడుపుతున్నారు. 1957-60 మధ్యకాలంలో చందమామ, బాలమిత్ర పుస్తకాలలో పిల్లల కథలు రాయడంతో వీరి సాహితీ జీవితం ఆరంభమైంది. ఆ వ్యాపకం కాస్త నూటికి పైగా కథలు, నాలుగు నాటకాలు, మూడు నాటికలు, నవలలు, కవితలు, సామాజిక వ్యాసాలు రాసి తెలుగు సాహిత్య సేవలో మునిగి ఉన్నారు. 1992 లో కూరెళ్ళ సాహితీ ట్రస్టు ఉత్తమ సాహిత్య పురస్కారం. 2016 హైదరాబాదు కిన్నెర ఆర్ట్స్‌, పానుగంటి లక్ష్మీ నరసింహారావు సాహితీ పురస్కారం, 2015 లో వేదగిరి కమ్యూనికేషన్‌ గురజాడ సాహితీ పురస్కారం, 2016లో రాయనిపాటి సాహితీ పీఠం వారు ఉత్తమ కథారచయిత పురస్కారం, ఇదే సంవత్సరం గణపతిరాజు అచ్యుత రామరాజు జీవన సాఫల్య సాహితీ పురస్కారం, 2017లో పసుమర్తి సాహితీ పీఠంవారు ఉత్తమ కథా, నవలా, నాటక రచయిత పురస్కారం అందుకున్నారు. ఆ తరువాత కేంద్ర సాహిత్య అకాడమీ ట్రావెల్‌ గ్రాంట్‌ అవార్డు లభించింది.

3. పులిస్వారి నాటిక - కథా పరిచయం:

ప్రతాప్‌, లలితలు భార్యాభర్తలు. వీరికి పావని, గోపి అని ఇద్దరు సంతానం. ప్రతాప్‌ తండ్రి రంగనాథం పేకాట పార్టు టైముగా, బ్రాకెట్‌ ఆటను ఫుల్‌టైమ్‌గా ఎంచుకొని జీవితం గడిపేస్తుంటాడు. ఒక రోజు నాకు దుబాయ్‌లో సీనియర్‌ ఇంజనీరుగా ఉద్యోగం వచ్చింది, అంతా వాళ్ళే చూసుకుంటారు. మూడేళ్ళు కళ్ళు మూసుకొని గడిపేస్తే తిరిగి వచ్చి ఇక్కడ హాయిగా బతకొచ్చు అందుకని నేను బయలుదేరి వెళ్ళాలి అని భార్యతో చెప్తే, దానికి ఆమె ఒప్పుకోదు. ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి చివరకు ఒక్కసారి పిల్లల సలహా కూడా తీసుకోమంటుంది.

కుటుంబం సంతోషంగా గడవాలంటే వయసు ఉండగానే సంపాదించుకోవాలనేది ప్రతాప్‌ ఆలోచన. మొత్తానికి అన్నీ సరిచూసుకొని బయలు దేరుతున్న ప్రతాప్‌తో, బావా నువ్వు నిశ్చింతగా వెళ్ళిరా, డబ్బు పంపడం నీ పని, దాన్ని నేను జాగ్రత్తగా చూసుకొవడం నాపని అని వ్యంగ్యధోరణిలో పలుకుతాడు అతని బావమరిది. దుబాయ్‌ నుండి ప్రతాప్‌ పంపిన డబ్బులతో ఇల్లు అధునాతనంగా తయారుచేసుకుంటారు. పావని, గోపి ఇద్దరూ కూడా చాలా ఆధునిక హంగులలో మునిగితేలుతారు. వీళ్ళకు సంస్కారం మొత్తం పోతుంది. అతని భార్య కూడా ఆధునిక సంస్కృతికి అలవాటుపడుతుంది. జరుగుతున్న అధునాతన మార్పు గురించి ప్రతాప్‌కి చెప్పొద్దని రంగనాథానికి వార్నింగ్‌ ఇస్తుంది లలిత. పంపిన డబ్బులతో బావమరిది ఇంకా జల్సాలు చేస్తాడు. కూతురు చేసిన చీకటి తప్పుకి అబార్షను కూడా చేయిస్తుంది. ఇంతో ప్రతాప్‌ స్నేహితుడు విశ్వనాథం వచ్చి తన కొడుకు ఐ.ఎ.ఎస్‌. సెలక్టయ్యాడని చెప్తాడు. ఈ పరిస్థితుల్లో ప్రతాప్‌ దుబాయి నుండి వచ్చేయడమే మంచిదనుకుంటాడు తండ్రి రంగనాథం. అనుకున్నట్లుగానే దుబాయి నుండి ఇంటికి వచ్చేస్తాడు. ఇంట్లో ఎవరూ ఉండరు. లలిత ఆమె క్లబ్‌కి వెళ్ళిందని, పావని బెంగుళూరు వెళ్ళిందని పనిమనిషి ద్వారా తెలుసుకుంటాడు. ఇంటి వాతావరణం చూసి ఆశ్చర్యపోతాడు ప్రతాప్‌. ఆ రోజు తాను దుబాయ్‌ వెళతానని పట్టుబట్టి వెళ్ళడం చేసిన తప్పేనని, ఇపుడు ఎలా బ్రతకాలా అని ప్రతాప్‌ ఆలోచిస్తుంటే మీరు మళ్ళీ దుబాయ్‌ వెళ్ళి ఉద్యోగంలో చేరండని సలహా ఇస్తుంది భార్య. అక్కడ పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయో చెప్పినా వినరు. ఇంతలో విశ్వం వస్తాడు. ఆరోజు నామాట వినలేదని, వినుంటే ఇంత జరిగేది కాదని చెప్తాడు. విలాసాలకు, నిత్యావసరాలకు మధ్యన ఉండే అతి చిన్న, సున్నితమైన సరిహద్దు తెలియక వీరు మారిపోయి ఇలా తయారయ్యారని, ఇది మాన్పించడం చాలా కష్టమని అలవాటు పడిన జీవితాన్ని కిందకు తీసుకురాలేమని సముదాయిస్తాడు. వాళ్ళలో ఐశ్వర్యవంతులమనే భావన పెరిగిపోయిందని, అందుకు బాధ్యులు నువ్వే. కనుక వారి అవసరాలు తీర్చుట కోసమైనా నువ్వు ఉద్యోగం చెయ్యాలంటాడు. నేను పులిస్వారీ చేయడానికి సిద్ధమే కానీ ఇక నుండి మీరు బ్రతకడానికి సరిపోయే డబ్బు మాత్రమే పంపుతానని వెళ్ళిపోతాడు ప్రతాప్‌.

4. సామాజిక విలువలు:

సామాజిక జీవన చిత్రణకు ప్రాధాన్యమిచ్చి సాంఘిక సందేశాన్ని ‘పులిస్వారీ’ నాటిక ద్వారా అందించారు రచయిత ద్విభాష్యం రాజేశ్వరరావు. నేటి కుటుంబవ్యవస్థలో సామాజిక విలువలు ఏవిధంగా నాశనం అవుతున్నాయో తెలియజేసేవిధంగా ప్రతీ పాత్రను, సంభాషణను చిత్రించారు. స్థోమతకు తగ్గట్లే జీవనం గడపాలి గానీ అంతకు మించి ప్రయత్నం చేస్తే పులిస్వారీలా ఉంటుందనే సందేశాన్ని ఈ నాటిక ద్వారా పాఠకులకు అందించారు.
ఈ నాటికలో చర్చించిన విషయాల్లో ముందుగా తెలుసుకోవలసింది నేటి సమాజంలోని యువత దృక్పథం. పాశ్చాత్య సంస్కృతి భారతీయులపై విపరీతంగా ప్రభావం చూపుతుందన్న విషయాన్ని అందరూ అంగీకరించాల్సిందే. దీనికి నిదర్శనం నేటి సమాజంలోని యువత వస్త్రధారణ, వేష భాషలు, సంస్కృతి. ఇలా అనేక విషయాల్లో మార్పులొచ్చాయి. ఈ విషయాలన్నింటినీ మననం చేసుకొని యువత పరిస్థితి ఎలా ఉందో ఈ నాటికలో గోపి, పావని పాత్రల ద్వారా చూపించారు రచయిత.

ప్రతాప్‌ దుబాయ్‌ వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇల్లు అధునాతనంగా తయారవుతుంది. రంగనాథం సోఫాలో కూర్చొని పేపరు చదువుతూ ఉంటాడు. ఆ సమయంలో పావని చాలా పాశ్చాత్య సంస్కృతికి ఏమాత్రం తీసిపోకుండా తయారై ఎవరికో స్నేహితునికి ఫోన్‌ చేస్తుంది. ఆ సమయంలో పావని మాట్లాడిన మాటలు వింటే, ఒక స్త్రీకి ఉండవలసిన లక్షణాలు ఆమెలో లేవని అర్థమవుతుంది. ఆమె ఫోన్‌లో మాట్లాడిన మాటలు గమనిస్తే ఆమె ఏ విధంగా స్త్రీల సంస్కృతిని, సంప్రదాయాలను పక్కనెట్టిందో తెలుస్తుంది. తన స్నేహితురాలు దివ్యకి ఫోన్‌ చేస్తూ-

‘‘హల్లో దివ్యా! నేను రెడీ ఇప్పుడే బయలుదేరుతున్నాను. పది నిమిషాల్లో నీ దగ్గర ఉంటున్నాను. మనవాళ్ళంతా వచ్చేసారా? ఒకె. దెన్‌ బాయ్స్‌ కూడా వస్తున్నారా? వెరీగుడ్‌. మంచి న్యూస్‌ చెప్పావే. ఎందుకంటావా? బాయ్స్‌ లేకుండా థ్రిల్‌ ఉండదు కదా! అందుకని. ఒకే వచ్చేస్తున్నాను’’1

తల్లిదండ్రులు దగ్గర అనుమతి తీసుకోవాలనే జ్ఞానం ఆమెకు లేదు. అదీకాక బాయ్స్‌ లేకపోతే థ్రిల్‌ ఉండదని చెప్పడంలో ఆమె సంస్కారం ఎంత దిగజారిందో గ్రహించవచ్చు. బాయ్స్‌ వస్తున్నారని తెలియడం మంచి న్యూస్‌గా పరిగణించడంలో కూడా ఆమె దృక్పథం వెల్లడవుతుంది.

ప్రస్తుత సమాజంలో యువత పెడతోవ పడుతున్నారనేది నిజం. అయితే అది మరీ దిగజారిపోయేలా ఉండటం బాధాకరం. భారతీయ సమాజం స్త్రీలకు వేరేగా, పురుషులకు వేరేగా సంస్కృతి సంప్రదాయాలను ఆపాదించింది. మగవారు చేసే కొన్ని పనులు ఆడవారు చేస్తే సమాజం చీదరించుకుంటుంది. కానీ నేడు ఆడ మగ అనే తేడా లేకుండా విచ్చల విడితనం బాగా పెరిగిపోయింది. సమాజంతో పనిలేకుండా సిగ్గును వదిలేసి తిరుగుతున్న వివిధ రకాల ఆడవాళ్ళ దృక్పథం నేడు ఇలా ఉందని తెలియజేయడానికే రచయిత ఈ ప్రయత్నం చేశారనిపించింది. అలాగే ఇది మన సంస్కృతి కాదమ్మా! అని హెచ్చరించిన తాతయ్య రంగనాథాన్ని ఆమె ఎదిరించిన విధానంలో కూడా నేటి యువత తత్త్వాన్ని గుర్తించవచ్చు.

పెద్దవారికి గౌరవ మర్యాదలు ఇవ్వడమనేది ప్రతీ ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలి. ఈ రోజుల్లో ఈ పరిస్థితి కనిపించడంలేదు. అందుకే రచయితకు ఆవేదన కలిగించే ఈ విషయాన్ని కళ్ళకు కట్టినట్లు చిత్రించారు. రంగనాధం పెద్దతరం వ్యక్తి. పావని అతని మనవరాలు అయినా సమాజం పట్ల అవగాహన లేని ఆమె, తాతయ్య పట్ల అగౌరవంగా మాట్లాడుతూ, ఎదిరించడం మొదలెట్టింది. సంస్కారం, మానవతా విలువలు ఎలా నశించిపోతున్నాయో పావని ప్రవర్తన ద్వారా చూపించలడం ఈ నాటికలో కనిపించింది. సమాజం స్త్రీలకు కొన్ని కట్టుబాట్లను ఆపాదించింది. ప్రతి స్త్రీ ఆ కట్టుబాట్లకు లోబడి జీవించినపుడు ఏ విధమైన సమస్యలు రావు. కానీ వీటిని చీల్చుకుని బయటకు వచ్చినవారి జీవితాలు అగౌరవాన్ని, కుసంస్కారాన్ని సంపాదించుకుంటాయి కానీ మంచి పేరు సంపాదించుకోలేవు. ఇదే విషయాన్ని ఆలోచన కలిగించేలా చెప్తూ, చైతన్యవంతంగా ఈ పాత్ర ద్వారా సందేశాన్ని అందించడంలో యువతలో సామాజిక విలువలపట్ల అవగాహన కలిగించడం కోసమేనని అర్థం చేసుకోవచ్చు.

ఈ మధ్య కాలంలో యువత ఆధునికత్వానికి అలవాటుపడి, విదేశీ సంస్కృతిని ఆకళింపు చేసుకొని, మాతృ సంస్కృతిని, సంప్రదాయాలను మర్చిపోతూ ఉంది. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్‌ తరాలకు ఎంతో విలువైన భారతీయ సంస్కృతిని, సంప్రదాయాలను అందించలేము. ఈ తరహాలో సమాజాన్ని పూర్తిగా ఆకళింపు చేసుకున్న రచయిత వ్యవస్థలో మార్పుని కాంక్షించారని ఈ నాటిక పరిశీలిస్తే తెలియవచ్చింది. చుట్టూ ఉన్న ప్రపంచంలో యువత చేసే తప్పు ఒప్పులను బేరీజు వేశారు. ఈ నాటికలో గోపి పాత్ర ప్రవర్తన కూడా అలాగే ఉంటుంది. అయితే గోపి స్నేహితురాలైన అభిలాష అతని కోసం ఇంటికి ఫోన్‌ చేస్తుంది. తను లేకపోవడంతో రంగనాథం ఫోన్‌ తీస్తాడు. ఎవరమ్మా అని అడిగితే ఆమె చెప్పే సంభాషణ పూర్తిగా ఆధునికతకు మారినట్లు, దిగజారుడుగా ఉంటుంది. గోపి వస్తే రామకృష్ణా బీచ్‌కి రమ్మని చెప్పమంటే, నువ్వు ఇలా బాయ్‌ఫ్రెండ్స్‌తో బీచ్‌ల వెంట షికార్లు తిరిగితే, మీ ఇంట్లో పెద్దవాళ్ళు నిన్ను ఏమీ అనరా? అని అడిగితే, దానికి ఆమె ఇచ్చిన సమాధానం -

‘‘ఏవిటీ మోడరన్‌ సొసైటీలో అలా తిరక్కపోతే తప్పు. సాయంత్రం 5 గంటలకు బీచ్‌కి రమ్మని చెప్పు’’2 అని ఫోన్‌ పెట్టేస్తుంది.

ఆధునిక సమాజాన్ని పూర్తిగా చదివేసిన రచయిత ఆ పరిస్థితులను సంభాషణల ద్వారా చిత్రించి, యువత అనుసరిస్తున్న విదేశీ సంస్కృతిని తెలియజెబుతూ, ఒక ప్రక్క ఆవేదన వ్యక్తం చేసినట్లు పాత్ర చిత్రణ ద్వారా అర్థమవుతూ ఉంది. సమాజంలో యువత పాత్రే కీలకం. కానీ మంచి మార్గాన్ని అనుసరించడం పక్కనెట్టి పాశ్చాత్య సంస్కృతితో భారతీయ సంస్కృతికి అవమానం కలిగేలా ప్రవర్తించడం బాధాకరం అనే విషయాన్ని తేటతెల్లం చేయడంలో రచయిత మనసులోని పరోక్షాభిప్రాయమేంటో తెలుసుకోగలం.

ప్రపంచీకరణ ప్రభావం సమాజంపై చాలా ఎక్కువగా ఉందని చెప్పే ప్రయత్నం చేయడమే కాకుండా దాని వలన సామాజిక విలువలు నాశనం అవుతున్నాయని పేర్కోవడం ఈ నాటికలో కనిపించింది. ప్రతాప్‌ కుటుంబం చాలా సాధారణమైనది. కొద్దిపాటి జీతంతో కుటుంబాన్ని నడిపిస్తుంటాడు. కొంతకాలం తరువాత విదేశీ ఉద్యోగం రావడంతో ధనాశ పెరిగి కుటుంబాన్ని లోటు లేకుండా చూసుకోవచ్చనే ఆశతో ఉద్యోగానికి వెళతాడు. ప్రతాప్‌ ప్రతీ నెల అధిక మొత్తంలో డబ్బులు పంపడంతో, అప్పటి వరకూ సాదాసీదాగా బ్రతికిన భార్య, పిల్లలు ఒక్కసారిగా విలాసాలకు అలవాటుపడి సంస్కృతినే మార్చేసుకుంటారు. వాళ్ళలో వచ్చిన మార్పులు దిగ్భ్రాంతి కలిగించేలా ఉంటాయి.

ఒకసారి ప్రతాప్‌ ఫోన్‌ చేస్తే ప్రపంచీకరణకు అద్దంపట్టిన ఆడది పాశ్చాత్య సంస్కృతికి లోనైతే ఎలా ఉంటుందో ఆ విధంగా లలిత పాత్రచేత మాట్లాడిరచిన తీరును విస్తుగొలిపేలా ఉంటుంది. ఆమెలో వచ్చిన పరివర్తనను ఎలా చిత్రించాడో చూస్తే రచయిత ఆశించిన, ఇవ్వాలనుకున్న, ఉద్భోదిస్తున్న సందేశం అర్థమవుతుంది.

‘‘హల్లో డియర్‌! లల్లీ ప్రతాప్‌ దిస్‌ సైడ్‌. ఎలా ఉన్నారు, మేం అంతా బాగున్నాం. మీరెలా ఉన్నారూ, ఏమిటీ మరో సిక్స్‌ మంత్స్‌లో వచ్చేస్తున్నారా? సరే, మీరు వచ్చేటపుడు నేను చెప్పిన ఐటమ్స్‌ అన్నీ తీసుకురావాలి! ఓకే...ఉంటాను’’3 అంటుంది.

ఆమె భాషలో వచ్చిన మార్పు, మానసిక ధోరణి చూస్తే ఉన్నంతలో కంటే అత్యాశతో మార్పు అనేది సర్వసాధారణం. కానీ అది అందరి ఆమోదయోగ్యంగా ఉండాలి. అలా కాని పక్షంలో సమాజం నుండి వ్యతిరేకత వస్తుంది. జీవితం ఒడిదుడుకుల్లో పడిపోతుంది. ఈ నాటికలో తప్పు ఎవరిది? అనేది పక్కన పెడితే, అత్యాశ అనేది పనికిరాదని పరోక్షంగా తెలియజేసినట్లైంది.
ఈ నాటికలో ఒక సందర్భంలో సాంఘిక విలువలంటే ఎలా ఉండాలో ప్రస్తావించారు. మంచి జీవితం అంటే ఇలాగ కూడా ఆలోచిస్తారా? అన్నట్లు ఈ పరిస్థితుల్లో ప్రతాప్‌ లలితల పాత్రల మధ్య సంభాషణతో తెలియజెప్పారు. తాను సంపాదించే పదివేల జీతంతో మంచి జీవితం రాదని, విదేశీ ఉద్యోగంతోనే అది సాధ్యమని అంటే లలిత సమాధానంగా-

‘‘విలాసాలు సమకూర్చుతానంటే ఎవరు కాదంటారండీ. కానీ ఆ విలాసాలు మాకు సమకూర్చడం కోసం, మీరు మాకు దూరం అయిపోవడం నాకిష్టం లేదండీ. అంతో ఇంతో ఆదాచేసి యీ ఇల్లు కట్టుకున్నాం. ఇది మిగుల్చుకున్నది కాదా? అప్పులు లేవు మనకు. అది ఆర్జన కాదంటారా? మీరు కోపగించుకోను అంటే ఒక్క విషయం చెప్తాను. మీ సరదాలు మానుకోమని నేను చెప్పనండి. కానీ ఇలా ఆదాయం పెరగటం వల్ల, డబ్బు మిగుల్చుకునే మాట ఎలా ఉన్నా, దురలవాట్లు మిగులుతాయని నా భయం. ఆదా చేయాలంటే పెరగాల్సింది జీతం కాదండీ, ఉన్నదాన్ని పొదుపుగా వాడుకునే గుణం. జీతం పెరిగే కొద్దీ విలాసాలే అవసరాలుగా మారిపోతాయండీ’’4 అని చెబుతుంది.

ఈ మాటల్లో ఒక మధ్య తరగతి కుటుంబం ఆలోచించాల్సిన అంశాలను వాస్తవంగా చిత్రించినట్లు కనిపిస్తుంది. ఒక సాధారణ కుటుంబంలోని వ్యక్తులు ఎలా ఆలోచించాలో లలిత పాత్ర చేత కూడా అదే ఆలోచన చేయించారు రచయిత. ‘పొదుపు అనేది అత్యంత అవసరం’ అనే దాన్ని ప్రధానంగా వ్యక్తీకరించారు. భవిష్యత్‌ ఆశల కోసం ఇటువంటి కుటుంబాల్లో పొదుపును ప్రోత్సహించే విధంగా ఈ చిత్రణ చేయడం రచయిత సామాజిక ఆలోచనకు తార్కాణంగా చెప్పుకోవచ్చు. అలాగే మరో సందేశం కూడా పై మాటల్లో వ్యక్తమయ్యింది. ‘ఆదా చేయాలంటే పెరగాల్సింది జీతం కాదని, ఉన్నదానిని పొదుపుగా వాడుకోవడం’ అనే దాన్ని చెప్పి వ్యవస్థలోని కుటుంబాలకు ఆదర్శవంతమైన సందేశాన్నివ్వడం గమనించదగిన విషయం.

ఈ నాటికలో నిజ జీవితంలోని సమస్యలను కూడా సూచనప్రాయంగా ప్రస్తావించారనిపించింది. దుబాయ్‌ నుండి వచ్చాక తన కుటుంబంలో వచ్చిన మార్పులు చూసి దిగ్భ్రాంతి చెందుతాడు ప్రతాప్‌. ఆ క్షణంలో తన స్నేహితుడు విశ్వం ప్రవేశించి మాట్లాడిన మాటల్లో వాస్తవం కనిపిస్తుంది.

‘‘రిలాక్స్‌ రా ప్రతాప్‌! రిలాక్స్‌. ప్రతాప్‌! విలాసాలకు, నిత్యావసరాలకు మధ్యన ఉండే అతి సున్నితమైన గీత గుర్తించి విభజన చేయటం చాలా కష్టం. అది ఆర్జించే వాళ్ళకు తెలియవచ్చుగానీ, అనుభవించే వాళ్ళకు తెలియదురా! చెల్లాయికి, పిల్లలకు విలాసవంతమైన జీవితం అలవాటైపోయింది. కాదు, ఒక రకంగా చెప్పాలంటే, నువ్వే అలా అలవాటు చేశావు. వాళ్ళలో తాము ఐశ్వర్యవంతులమనే భావన పెరిగిపోయింది. వాళ్ళ అవసరాలు పెరిగి పోయాయి, అభిరుచులు పెరిగిపోయాయి. అందుకు బాధ్యులు ఎవరు? నువ్వు. కనుక వాళ్ళ అవసరాలు, అభిరుచుల మేరకు నువ్వు ఆర్జించాలిరా తప్పదు’5 అని అనడంలో వాస్తవ విషయాన్ని గమనించవచ్చు.

ప్రతాప్‌ ఏమీ చేయలేని పరిస్థితిలో విశ్వనాధాన్ని సలహా అడగడం, విశ్వనాథం మాటల్లో ‘నిండా మునిగాక లోతెందుకు’ అనే సామెతలా జవాబు రావడం గమనిస్తే రచయిత ఆలోచన మంచిదే కావచ్చనిపిస్తుంది. అతను అధిక మొత్తంలో డబ్బులు సంపాదిస్తే భవిష్యత్‌ బాగుంటుందని ఆశించాడు. కాని వచ్చిన డబ్బుల్ని ఎలా సక్రమంగా ఖర్చు పెట్టాలో ఆలోచించకుండా విలాసాలకు బానిస అయ్యారు అతని భార్య, పిల్లలు. ఈ అలవాటు నుండి వెనక్కు రప్పించడం కష్టమే. కానీ వారిని సరైన దారికి తీసుకురావాలంటే ప్రతాప్‌లోనే యజమానిలోనే మార్పు రావాలి అనే విధంగా సంభాషణను సమకూర్చారు.

ఆధునిక సమాజాన్ని పరిశీలస్తే, సామాజిక విలువలన్నీ నాశనమవుతున్నాయన్న విషయం అర్థమవడంతో పాటు, యాంత్రిక జీవనంలో పడి మానవ విలువలకు పాతరేస్తున్న విధానాన్ని చెప్పడంకోసం పరోక్షంగా ప్రతాప్‌ కుటుంబ సభ్యుల ద్వారా సామాజిక సందేశాన్నిచ్చారు రచయిత. విలాసాలకు బానిసలైన ప్రతాప్‌ భార్య, పిల్లలు మానవీయ విలువలకు అవకాశం లేకుండా బతుకుతున్నారు. తండ్రి అనే గౌరవం, మార్యాద లేదు. భర్త అనే గౌరవం, ఆప్యాయతలు ఆమెలో కనిపించలేదు. అలవాటుపడిన విలాసాలు మళ్ళీ ఎక్కడ కోల్పోతామనే భయంతోనే ఉన్నారు గానీ తండ్రి, భర్త సంబంధం గురించి ఆలోచించలేదు. అందుకే మళ్ళీ విదేశాలకు వెళ్లిపోమన్నారు ఇంటిళ్ళపాది. 

“‘సమాజంలో నా స్థితి ఏమిటో నీకు తెలుసు. నేను లేడీస్ క్లబ్ సెక్రెటరీ నీ, మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలిని. కాబట్టి, నేను విరాళాలు ఇవ్వాలి, నేను సన్మానాలు చేయాలి. నా ఎడమ చేతితో వేల రూపాయలు విసిరేయాలి. మీరు ఇచ్చే పదివేల రూపాయలతో నేను నిర్వహించలేను. కనీసం యాభై వేలు కావాలి. కాబట్టి, నాకు డబ్బు... డబ్బు... డబ్బు కావాలి. రేపు సాయంత్రంలోగా మీ వీసా ఏర్పాటు చేస్తాను. కాబట్టి సిద్ధంగా ఉండండి ఓ...కే6 (మూలానికి వ్యాసకర్త అనువాదం)

అని చెప్పిన లలిత మాటల్లో కుటుంబ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలవుతున్నాయని గ్రహించవచ్చు.

5. ముగింపు:

వ్యవస్థలో మటుమాయం అవుతున్న సామాజిక విలువలను బెరీజు వేస్తూ, మారుతున్న ఈ వ్యవస్థను అంచనా వేసే దృష్టికోణంలోనే ఈ నాటిక సాగిందని అర్థమయ్యింది. దురాశకుపోయి దు:ఖంకొని తెచ్చుకునే బదులు, ఉన్నంతలో సంతోషంగా గడపడంలో ఉన్న మేలు మరేదీ లేదని ‘పులిస్వారీ’ నాటిక ద్వారా ఇచ్చిన సందేశం యావత్‌ సమాజాన్ని ఆలోచింపచేసేలా ఉంది. అలాగే ప్రతీ కుటుంబంలో వచ్చే కలహాలు చిన్నవిగానే పరిగణించాలి. వాటిని భూతద్దంలో పెట్టి చూస్తూ జీవితాలు పాడుచేసుకోవడం మంచిది కాదనే సందేశం ఈ నాటికలో తేటతెల్లం చేశారు. సమాజంలో ఉన్న విలువలను, కుటుంబ జీవనచిత్రణకు ఆయువుపోసి నాటికను రక్తి కట్టించారనిపించింది.

మనిషి స్థాయికి మించి చేస్తే అది ‘పులిస్వారీ’ అవుతుందనే విషయాన్ని సూచనప్రాయంగా తెలిపి, ఇలా జీవితాన్ని సాగించకూడదనే సందేశాన్ని పాఠకులకు అందిండంతో పాటు, సామాజిక విలువలను పెంపొందించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేయడం ఆలోచించదగ్గ విషయంగా అనిపించింది. అలాగే ప్రతీ కుటుంబం ఉన్నంతలోనే జీవనాన్ని సాగించాలని, పొదుపు అనేదాన్ని ఖచ్చితంగా పాటించాలని చెప్పడంలో సామజిక మార్పును కోరుకున్న రచయితగా గ్రహించవచ్చు.

6. పాదసూచికలు:

  1. పులిస్వారి(నాటిక) - ద్విభాష్యం రాజేశ్వరరావు :పుట- 190
  2. పులిస్వారి(నాటిక) - ద్విభాష్యం రాజేశ్వరరావు :పుట- 191
  3. పులిస్వారి(నాటిక) - ద్విభాష్యం రాజేశ్వరరావు :పుట- 193
  4. పులిస్వారి(నాటిక) - ద్విభాష్యం రాజేశ్వరరావు :పుట-191
  5. పులిస్వారి(నాటిక) - ద్విభాష్యం రాజేశ్వరరావు :పుట- 197
  6. you know what is my status in the society. Secretary, ladies club, president of women’s welfare society. So, I have to give donations, I have to make Felicitations. I have to throw thousands of rupees just with my left hand. I can’t manage with your bloody ten thousand bucks. At least I need fifty thousand. So, I want money... money... money. I will arrange your VISA by tomorrow evening. So be ready O...K. పులిస్వారి(నాటిక) - ద్విభాష్యం రాజేశ్వరరావు :పుట-202

7. ఉపయుక్తగ్రంథసూచి:

  1. ఆరుద్ర - సమగ్రాంధ్ర సాహిత్యం (1,2 సంపుటాలు) శేషాచలం అండ్‌ కంపెనీ, మద్రాసు, 1965.
  2. ప్రతాప్‌రెడ్డి, సురవరం- ఆంధ్రుల సాంఘికచరిత్ర, విశాలాంధ్ర పబ్లిషింగ్‌హౌస్‌, గిరిప్రసాద్‌ భవన్‌(నాగోల్‌), హైదరాబాద్‌ 2013.
  3. మోహనరావు, సజ్జా(సంపాదకులు)- సాంఘికోద్యమ రూపకాలు ,ఆంధ్రవిశ్వకళాపరిషత్‌, విశాఖపట్నం, 2015.
  4. రంగనాథాచార్యులు, కె.కె-ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు, ఆంధ్ర సారస్వత పరిషత్‌, హైదరాబాద్‌, 1982.
  5. రాజేశ్వరరావు, ద్విభాష్యం-పులిస్వారీ నాటిక, శ్రీ మహలక్ష్మీ బుక్స్‌ కార్నర్‌ ప్రచురణ, విజయవాడ,2013.
  6. రామలింగారెడ్డి, కట్టమంచి -కవిత్వతత్త్వ విచారము, ఆంధ్ర విశ్వకళాపరిషత్తు, ప్రచురణల విభాగం, వాల్తేరు, 1947.
  7. సిమ్మన్న, వెలమల-తెలుగు సాహిత్య విమర్శ సిద్ధాంతాలు, దళిత సాహిత్య పీఠం ప్రచురణ, విశాఖపట్నం, 2005.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]