headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-4 | Issue-9 | August 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

7. ‘‘రామం భజే శ్యామలమ్": మన సనాతన ధర్మపునరుజ్జీవనం

పాణ్యం దత్తశర్మ

5-4-481/1, ప్లాట్‌ నెం. 20, రోడ్‌ నెం. 1
ఆంధ్రకేసరి నగర్‌, వనస్థలిపురం,
హైదరాబాదు - 70, తెలంగాణ.
సెల్: +91 9550214912, Email: dattasarma1956@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

చాలాకాలంగా, భారతీయ సనాతన ధర్మం మీద, రామాయణం మీద, కోట్ల మంది మనసులలో కొలువై ఉన్న శ్రీరామచంద్ర ప్రభువు మీద, ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న సైద్ధాంతిక దాడి, ఇటీవల ఉధృతమై, దాని ఉనికికే ప్రమాదం వాటిల్లే సూచనలు కనబడుతున్నాయి. 1930లలోనే, సావిత్రీబాయి అనే రచయిత్రి "A warning to the Hindus" అన్న ఒక వివాదాస్పద పుస్తకం రాశారు. ఆమె హిందూమతాన్ని స్వీకరించిన ఒక గ్రీకు వనిత. క్రమంగా భారతదేశంలోని హిందువులు మైనారిటీలుగా మారతారని, హైందవం కేవలం ఒక విశ్వాసాధారిత మతం కాదని, ఒక పవిత్ర గ్రంథమో, ఒక ప్రవక్త మాత్రమో ప్రవచించే బోధన కానే కాదని, భారతీయ సనాతన ధర్మం, జీవన క్రమంగా రూపు దాలిస్తే అది హైందవం అయిందని, దాన్ని కుహనా సెక్యులరిస్టుల నుండి కాపాడుకోవడానికి, భారతీయులంతా సంఘటితం కావాలని ఆమె దాదాపు 90 సంవత్సరాల క్రిందటే హెచ్చరించారు. ఆమె చెప్పిన విషయాలన్నీ తు.చ. తప్పకుండా ప్రస్తుతం జరుగుతున్నాయి. శ్రీమద్రామాయణం ఒక కావ్యం మాత్రమే కాదనీ, ఒక చరిత్ర అనీ, శ్రీ కోవెల సంతోష్‌ కుమార్‌ గారు నిరూపిస్తూ, ‘రామంభజే శ్యామలం" అన్న మనందరిని ఆలోచింపచేసే గ్రంథాన్ని రాశారు. ఇది 55 వ్యాసాల పరంపర. దీనిని ‘సంచిక డాట్‌ కామ్‌’ అన్న అంతర్జాల వారపత్రిక ధారావాహికంగా ప్రచురించింది. ‘సాహితి’ పబ్లికేషన్స్‌ విజయవాడ వారు దీనిని పుస్తకంగా ప్రచురించారు. రామాయణాన్ని రాముడిని, విదేశీ స్వదేశీ పాలకులు ఏవిధంగా కించపరచి, తారుమారు చేసి, అల్పపరచి (belittle) శ్రీరాముని వ్యక్తిత్వ హననం చేశారో, పూర్తి వివరాలతో (facts and figures) ఋజువులతో, కోవెల సంతోష్‌ కుమార్‌ నిరూపించారు. ఆ గ్రంథాన్ని పరిశోధించి, దానిలోని అంశాలను తార్కికంగా విశ్లేషించి, దానిలోని వ్యగ్రతను, అనివార్యతను, ఆవశ్యకతను సమాజానికి తేటతెల్లం చేయడమే ఈ సిద్ధాంత వ్యాసపు ముఖ్య ఉద్దేశం

Keywords: ఏకత్రితం, కుహనా సెక్యులరిజం అంతర్లీన ప్రజాస్వామ్యం, తారుమారు చరిత్రకారులు, కాల నిర్ణయాతిక్రమణం, డొల్లతనం, వ్యక్తిత్వ హననం, దిశానిర్దేశం, మహిళా చైతన్యం, మూలచ్ఛేదం. అపనమ్మక నివృత్తి, అభద్రతాభావం, తార్కికాధారం, ప్రత్యామ్నాయం.

  1. ఉపోద్ఘాతం

               రామం భజే... శ్లోకానికి శ్రీమాన్‌ కోవెల సుప్రసన్నాచార్య వ్రాసిన వ్యాఖ్యానం ఎంతో భావస్ఫోరకమైనది. శ్రీరాముని గురించిన ప్రార్థనా శ్లోకాల్లో మూడవ దానిలో ఆయన ధర్మ ప్రవర్తకుడయిన గురువుగా ఆవిష్కరింపబడుతున్నాడు.

                     శ్లో॥      ‘‘వైదేహీ సహితం సురదృమ తతేహైమేమహామంటపే                                                                          మధ్యే పుష్పకమాసనే మణిమయే వీరాసనే సుస్థితం

                           అగ్నే వాచయతి ప్రభంజనసుతే తత్త్వం మునిభ్యఃపరం              

                           వ్యాఖ్యాం తం భరతాదిభిః పరివృతం రామంభజే శ్యామల"’

               సుప్రసన్నాచార్యులవారు, వారి ముందుమాటలో ఈ శ్లోకానికి లోతయిన వివరణనిచ్చినారు. శ్యామలం అంటే ఒక రంగు అని అనుకుంటాము. నలుపురంగు అని అనవచ్చు. కాని కేవలం రామచంద్రుని శరీర వర్ణం గురించి ఇక్కడ ప్రస్తావించడం లేదు. శ్యామలత్వం ఆకాశానికి సంకేతం. అనంతం, ఆత్మ తొలి ఆవిష్కారం ఆకాశమే అంటున్నారు సుప్రసన్నాచార్య వైదేహీ మాత దేహాతీతమైన చైతన్యం. శ్లోకంలో లక్ష్మణుని ప్రసక్తిలేదు. కాని ఆయన శ్రీరాముని ప్రవృత్తిలో అత్యంత సహజంగా ప్రసరించబడే ఒక భాగం. అంటే రామ లక్ష్మణులకు అభేదం అని తెలస్తూన్నది. భరతాదులు... అనడం ద్వారా మిగతా సోదరులు, దేవతలు, మునులు ప్రస్తావించబడినారు. ఇక హనుమంతుడు ఆయన శివాంశ సంభూతుడు. తొలి శ్రోత వీరందరికీ గురుస్థానంలో సాక్షాత్‌ శ్రీరామచంద్ర పరబ్రహ్మ, పరమార్థాన్ని బోధిస్తూ ఉన్నాడు.’’

               తండ్రిగారైన సుప్రసన్నాచార్యులవారి ఆదేశంతో తానీ గ్రంథ రచనకు పూనుకున్నానని రచయిత చెప్పుకున్నారు "పితృ వాక్య పరిపాలన" శ్రీరాముని ఆదర్శంగా తీసుకుని చేశారు. సాక్షాత్తు గురుస్థానంలో పితృపాదులవారు ఉండటం ఈ రచయిత పూర్వజన్మ సుకృతం అని చెప్పవచ్చు.

"తండ్రి హరిజేరు మనియెడు తండ్రి తండ్రి!’’

               అని బమ్మెర పోతనామాత్యుడన్నట్లు, అటువంటి తండ్రి ఉండటం కోవెల సంతోష్‌ కుమార్‌గారి అదృష్టం. రామాయణాన్ని ఒక కొత్త కోణంలో విశ్లేషించడం, దర్శించడం చేశారీయన. తండ్రి పరాత్పరుని దృష్టితో రామాయణాన్ని విశ్లేషిస్తే, ఈయన మానవ దృక్పథంతో చేశారు. ఈ బృహద్యజ్ఞంలో వీరికి శ్రీరామచంద్రుని పరిపూర్ణ అనుగ్రహం ఉంది.

"పలికెడిది భాగవతమట

పలికించెడి విభుడు రామభద్రుండట...’’

               అని పోతనగారు చెప్పారు. ‘‘రామంభజే శ్యామలం" ను రాయించినది కూడ ఆ రాముడే. తనమీద వస్తున్న అపవాదులను, కువ్యాఖ్యలను, వక్రీకరణలను, తన వ్యక్తిత్వహననాన్ని, సహేతుకంగా పూర్వపక్షం చేసే ఆయుధంగా రాముడే రచయితను మలిచాడని చెప్పవచ్చు.

               John Milton తన "Paradise Lost"ను రాయడానికి కారణాన్ని ఇలా చెప్పుకున్నాడు.

               "To Justify the ways of God to men"అంటే, భగవంతుని మార్గాన్ని, విధానాలను, మానవులకు సహేతుకంగా నిరూపించి చూపటానికని.

"Sing Heavenly muse......"

               పవిత్రమైన మ్యూజ్ ను మిల్టన్‌ తనలోకి ఆవహింపచేసుకుని, తనను తాను జ్ఞాన సంపన్నుడిని చేసుకుంటాడు. గొప్ప కావ్యాలు రచించడానికి దైవ ప్రేరణ అవసరం అని దీనివల్ల తెలుస్తుంది. అట్లే కవుల / రచయితల వినయశీలము కూడ వెల్లడి అవుతూంది.

               మహాకవి కాళిదాసు అంతటివాడు తన రఘువంశ కావ్యపు అవతారికలో, తన అశక్తతను, పరిమిత పాండిత్యాన్ని, సవినయంగా చెప్పుకొంటాడు.

                     శ్లో॥      ‘‘క్వ సూర్యప్రభవో వంశః క్వచాల్పవిషయామతిః                                                                                               తితీర్షుర్దస్తరం మోహాదుడు పేనాస్మిసాగరమ్‌"                       (రఘువంశం - మొదటి సర్గ శ్లో-2)

               అట్లే,           ‘‘మందః కవియశః ప్రార్థీగమిష్యామ్యపహాస్యతామ్‌                                                                                             ప్రాంశులభ్యేఫలేమోహాదుద్భాహురివ వామనః       (రఘువంశం - మొదటి సర్గ ` శ్లో-3)

               ‘‘సూర్యాన్వయ మెక్కడ? నేనెక్కడ? నా బుద్ధి చాలా చిన్న విషయాలకు పరిమితం. ఒక చిన్న తెప్ప ద్వారా సముద్రాన్ని దాటాలనుకుంటున్నాను. కేవలం కీర్తి కోసం అపహాస్యం పాలవుతానేమో? ఎత్తుగా ఉన్నవారికి మాత్రమే అందే ఫలాల కోసం చేతులెత్తినవాడిలా ఉంది నా పరిస్థితి.’’

               ఈ వినయమే గొప్ప గ్రంథాల సృష్టికి పునాది. ఇదే కోవెల వారిలో ఉంది. ‘‘విద్యాదదాతి వినయమ్‌" అని భర్తృహరి చెప్పినట్లు వినయమునిచ్చేదే విద్య.

               ‘‘ధీ లక్ష్మీకృపాపాత్రులీవసుధన్‌ గర్వము నొంద నేరరు కదా ప్రఖ్యాతులై యొప్పినన్‌"

               అంటారు శతావధాని, పౌరాణిక రత్న బ్రహ్మశ్రీ పాణ్యం లక్ష్మీనరసింహశాస్త్రిగారు. రాయలసీమలోని జంటకవులయిన ‘‘పాణ్యం సోదర కవుల"లో ఆయన ఒకరు రెండవవారు పాణ్యం నరసరామశర్మ.

రామాయణం కావ్యం కాదు చరిత్రే! ఈ గ్రంథాన్ని మనం లోతుగా అధ్యయనం చేస్తే, రామాయణం నిస్సందేహంగా చరిత్రే. కావ్యం కాదు. రాముడు ఒక కల్పితపాత్ర కాదు. అందుకే రామునికి రామాయణానికి ఒక సార్వకాలీనత ఏర్పడిరదంటారు రచయిత.

                     ‘‘రామాయణం అంటే భారతదేశం, భారతదేశం అంటే రామాయణం. రామాయణమంటే భారతీయజీవన దృక్పథం. రామాయణమంటే మూర్తీభవించిన భారతీయ ధర్మం. రామాయణమంటేభారతీయుల మూల పురుషుడి చరిత్ర. రామాయణమంటే వేదం రామాయణ వేదం వేదమే రామాయణం"                               - రామంభజేశ్యామలం - అశోకరాముడు (వ్యాసం) పుట.2

               5550 పైగా సంస్థానాలు, భిన్న భాషలు, మతాలు, సంస్కృతులు, కులాలతో అత్యంత సంక్లిష్టమైన భారతదేశాన్ని ఏక సూత్రంతో ‘‘ఏకత్రితం" చేసింది రామాయణమే, సీతారాములే అంటారు రచయిత.      భారతీయ సనాతన ధర్మాన్ని మూలచ్ఛేదం చేసే ప్రయత్నం. విదేశీ పాలకులే కాదు, మన పాలకులు కూడ ప్రారంభించారు. ఆ క్రమంలో మూడు దశలను మనం గమనించవచ్చు.

  1. రామాయణం పుక్కిట పురాణం అని దుష్ప్రచారం చేయడం.
  2. రాముడి వ్యక్తిత్వాన్ని ఒక పద్ధతి ప్రకారం హననం చేయడం.
  3. రామాయణం అసలు భారతదేశంలోనే పుట్టలేదని చెప్పడం.

               ఈ క్రమంలో గాంధీగారి ప్రభావాన్ని తగ్గించుకుంటూ వచ్చారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసినట్లు కనిపించకుండా, మైనారిటీలను నెత్తికెత్తుకున్నట్లు అనిపించకుండా, చాలా తెలివిగా ఎత్తువేశారు. రామాయణాన్ని కేవలం ఒక మత గ్రంథంగానే పరిగణించారు. రాముడిని ఒక MYTH గా మార్చారు. బౌద్ధాన్ని అవరానికి మించి మార్కెటింగ్ చేశారు. రాముడిని విలన్‌ను చేయడం కోసం, బుద్ధుడిని, అంతకంటె అశోకుడిని హీరోను చేశారు.

  1. ఔచిత్యం:

‘‘అనౌచిత్యాదృతే నాన్యత్ రసభంగస్యకారణం" – ఆనందవర్థనుడు, ధ్వన్యాలోకం. ‘అబద్ధం చెప్పినా అతికినట్లుండాలని’ సామెత సోకాల్డ్‌ కుహనా మేధావులు. చరిత్రకారులు, చరిత్రను, కాల నిర్ణయాన్ని తారుమారు చేసి, నిజాన్ని అబద్ధంగా, మసిపూసి మారేడుకాయను చేయాలని చూసినా, అందులో ఔచిత్యం (propriety) లేకపోవడం వల్ల, అదంతా అబద్ధంకాక మరొకటి కాదని తేల్చేశారు రచయిత. వారు ముందుకుతెచ్చిన distortions (తారుమారు భావాలు) అన్నీ పరస్పరం పొంతనలేనివిగా నిరూపించడాయన. అవి పరస్పరం విరుద్ధాలని తేల్చారు.

  1. పాఠకుల అపనమ్మకం తొలగింపు: (Suspension of Readers' Disbelief)

ఇదంతా రచయిత ప్రామాణికంగా వివరిస్తున్నా, మనకు మొదట ఆశ్చర్యం, తదనంతరం ఆయన చెప్పేదానిమీద అపనమ్మకం ఏర్పడతాయి. కాని క్రమంగా ప్రతి వ్యాసాన్ని చదువుతూ పోతున్నప్పుడు, తార్కికంగా, ఋజువులతో వివరిస్తున్నప్పుడు, పాఠకులలోని అపనమ్మకం తుడిచిపెట్టుకొని పోతుంది. ఆంగ్ల సాహిత్య విమర్శకులు దీనినే (Suspension of Readers' Disbelief) అన్నారు. రచయిత, ముఖ్యంగా ఇలాంటి వివాదాస్పదమైన రచన చేస్తున్నప్పుడు, తన భావాలను పాఠకులమీద బలవంతంగా రుద్దుతున్నట్లు అనిపించకూడదు. (Imposing writer's will arbitrarily on readers) అలా రుద్దినంత మాత్రాన ఎవరూ నమ్మరు కూడా. ‘‘రామంభజే శ్యామలం" లో రచయిత పాఠకుల అపనమ్మకాన్ని తొలగించడానికి ఈ క్రింది విధానాలు అవలంబించారు.

  1. ముందు వైరిపక్షం వారి భావాన్ని చెప్పి, అది ఎందుకు సత్యదూరమో తార్కికంగా వివరించడం.
  2. గణాంకాలు (Facts cofigures) సమర్పించడం
  3. పత్రరూపంలో సాక్ష్యాలు (Documentary evidences)
  4. ఛాయాచిత్రాలు, డయాగ్రామ్స్‌ ద్వారా వివరణ.
  5. చరిత్ర, సాహిత్యంలో సంబంధిత రెఫరెన్సులు.

               ఇవన్నీ ఎంతో convincing గా, argumentative గాobjective గా, వ్యాసాల్లో సమర్పించడం వల్లన, మనలో కలిగిన అపనమ్మకం తొలగి, రచయిత భావాలతో ఏకీభవించడం ప్రారంభిస్తాము. చివరికి ఏకీభవించడమే కాకుండా, రచయిత ఉద్దేశించిన కావ్య ప్రయోజనాన్ని పొందుతాము. సంస్కరించబడతాము. భారతీయ సనాతన ధర్మ పరిరక్షణలో మన బాధ్యతనూ గుర్తెరుగుతాము.

  1. మనుస్మృతి : మహిళా వివక్ష

‘‘న స్త్రీ స్వాతంత్య్రమర్హతి" అని మనువు చెప్పినట్లు, మనధర్మంలో మహిళల పట్ల పూర్తి వివక్ష ఉన్నట్లు వక్రీకరించారు. దానికి బదులుగా, రామాయణాన్ని ‘‘సీతాయ్య: చరితంమహత్‌" అన్న వాక్యం ద్వారా పూర్వ పక్షం చేశారు రచయిత. సీతమ్మను సాంత వ్యక్తిత్వంగల స్త్రీగా, అవసరమైనపుడు భర్తను సైతం వ్యతిరేకించగల ధైర్యవంతురాలిగా, రామాయణం మనకు చూపిస్తుంది. 

  1. హిందూకోడ్‌ బిల్లు

ఆనాటి పాలకులు హిందూకోడ్‌ బిల్‌ తేవడానికి కారణం, హిందూ ధార్మిక వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలనే తలంపే దానివల్ల ఏర్పడిన దుష్పరిణామాలు.

  1. ఉమ్మడి కుటుంబాల విచ్ఛిత్తి
  2. దంపతులు విడిపోవడం
  3. ఒంటరి పురుషులు, ఒంటరి స్త్రీలు, ఒంటరి తల్లిదండ్రులు
  4. వృద్ధాశ్రమాలు, అనాధాశ్రమాలు

               ఇలా భారతదేశం మునుపెన్నడూ చూడని విషయాలు సంభవించసాగినాయి.      హిందూ మహిళల జీవితాలను పునరుద్ధరించడానికి (అదేదో ఇతర మతాల్లో మహిళలను నెత్తిన పెట్టుకున్నట్లు) ఈ బిల్లును తెచ్చారు.

  1. దానికి వ్యతిరేకత:

               దీనిని భారత ప్రథమ రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌ వ్యతిరేకించారు. హిందూకోడ్‌ బిల్లు వ్యతిరేక కమిటీ ఒకటి ఏర్పడింది. గాంధీజీ కంటే ముందు బాలగంగాధర్‌ తిలక్‌ జాతిని ఏకం చేయడానికి శ్ర్రీరామనామమనే తారకమంత్రాన్ని ఉపయోగించారు. ఈ బిల్లులో ప్రతపాదించిన అంశాలు ఈ నాలుగు

  1. మహిళలకు ఆస్తిలో సమాన వాటా
  2. భార్యాభర్తలకు పడకపోతే విడాకులు తీసుకునే వీలు
  3. కులాంతర వివాహాలను ప్రోత్సహించడం
  4. విధవా పునర్వివాహం, విడాకులు తీసుకొన్నవారు తిరిగి వివాహం చేసుకునే వీలు.

               ఇవి కాకుండా హిందువులు ఏ కులంవారినైనా దత్తత తీసుకునే అవకాశం ఈ బిల్లు కల్పించింది.

  1. అసలు మర్మం:

ఈ ప్రస్తుత ఆధునిక సమాజంలో, ఈ మార్పులన్నీ సహజంగానే చోటు చేసుకుంటున్నాయని గ్రహించాలి మనం. దీనికి కారణం మనుషుల ఆలోచనా విధానాల్లో పెను మార్పులు చోటు చేసుకోవడం. నగరీకరణ, ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వలసలు, స్త్రీ వాద ఉద్యమాలు, కుల వ్యతిరేక, కుల వివక్ష వ్యతిరేక భావాలు, ఇవన్నీ.

కాని, 1948లోనే ఇవన్నీ ప్రతిపాదించడం పనిగట్టుకొని ఆనాటి వ్యవస్థను అతలాకుతలం చేయడమే క్రమ పరిణామం (evolution), సరే, దాన్ని స్వీకరించాలి. మనుషుల్లో కాల క్రమాన వచ్చిన మార్పును స్వీకరించాలి. కాని బలవంతంగా ప్రభుత్వమే ఒక Arbitrary Law ద్వారా, హిందూ సమాజ వ్యవస్థను విచ్ఛిన్నం చేయబూనటం కుట్ర కాక మరేమిటి? ఇతర మతాల జోలికి పోకుండా, కేవలం హిందూ మతాన్నే సంస్కరించడం ఎందుకు?

  1. సెక్యులరిజం:

సామాన్య భారతీయుడికి ఎంతమాత్రం అర్థంగాని బ్రహ్మ పదార్థమే సెక్యులరిజం అంటారు కోవెల సంతోష్‌ కుమార్‌.

               ‘‘అన్ని మతాలు సమానమే గాని ఒకటి మాత్రం ఎక్కువ సమానం" అని పరిహసించారు!

               1952 అక్టోబరు 17న భారత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఒక లేఖ రాశారు. అందులో మీ మీ రాష్ట్రాలలో క్రైస్తవ మిషనరీలు చేసే ఎలాంటి కార్యక్రమాలనూ అడ్డుకోవద్దని సుస్పష్టంగా ఆదేశమిచ్చారు.

               "I have some times received complaints from Christian missions and missionaries, both foreign and Indian, about the differential treatment accorded to them in certain states. It is said that there is some kind of harassment occassionally."

               "Our policy of religious nautrality and protection of minorities must not be affected...."

             "I do not want any foreigner to come who looks down upon us...."

             "But if any foreigner wants to come here for social service, I would welcome him"

               క్రైస్తవం ఈ దేశంలో 2000 సం॥ నుండి ఉన్నదని, అలాంటి క్రైస్తవ సోదరులకు తాము అణచివేతకు గురి అవుతున్నామననే భావనలు కల్పించే చర్యలకు పూనుకోరాదనీ నెహ్రూ హెచ్చరించారు.

               సెక్యులరిజం అనే భావన రావడానికి ముందు మత సామరస్యం ఎన్నడూ చెడలేదు. పండుగల్లో ఉభయులూ కలిసి పాల్గొనడం ఉండేది. సెక్యులర్‌ మేధావుల ప్రసంగాల వల్ల ‘ముస్లీం లీగ్‌" అనే పార్టీ ఏర్పడి, బ్రిటిష్‌ పాలనే మెరుగనే భావం ముస్లిములల్లో ఏర్పడిరది. ఆ భయమే దేశ విభజనకు దారితీసింది.

               ముస్లింలలో ఈ అభద్రతాభావం, భయం, ఎన్నటికీ అంతరించకుండా సోకాల్డ్‌ సెక్యులరిస్టులు జాగ్రత్తపడ్డారు. ముస్లింరాజులను గ్లోరిఫై చేసి తీసే సినిమాలు మనదేశంలో ప్రశంసలనందుకుంటాయి.

               భారతీయతకు వ్యతిరేకంగా వ్రాసే రచనలకు అవార్డులు వెల్లువెత్తుతాయి. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్‌ అనే ఆయన ద్రౌపదిని కించపరుస్తూ రాసిన గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. దాన్ని ఖండిస్తూ కస్తూరి మురళీకృష్ణలాంటివారు ‘‘సౌశీల్య ద్రౌపది" అనే బుక్‌ రాస్తే దాన్నెవరూ గొప్పగా పరిగణించరు.

               భారతీయ సనాతన ధర్మాన్ని సమర్ధిస్తూ, మాట్లాడేవారికి ‘హిందూత్వ’ ముద్రవేస్తారు ఆర్‌.ఎస్‌.ఎస్‌ లేదా బి.జె.పి. సానుభూతిపరుడంటారు. మరి ఆదిశంకరాచార్యులు, కవిసామ్రాట్‌ విశ్వనాథ, కస్తూరి మురళీకృష్ణ బి.జె.పి వారు కాదే!

               సెక్యులరిజం విపరీతపోకడలకు తార్కాణం, బొంబాయిలో బాంబు పేలుళ్లకు పాల్పడిన మెమున్‌ను ఉరిశిక్షనుంచి కాపాడటానికి అర్ధరాత్రి సుప్రీంకోర్టును తెరిపించడం. రాముడిని రామాయణాన్ని రామ్‌కీమా, రామ్‌కీబాప్‌ అంటూ వెకిలిగా మాట్లాడిన ఓవైసీని ఏం చేయరు, చేయలేరు సమర్థిస్తూ మాట్లాడిన పాతబస్తీ ఎమ్‌ఎల్‌ఎ రాజాసింగ్‌ను మాత్రం వెంటనే లోపలేస్తారు."

               దేశ రాజధాని నడిరోడ్డుమీద నిలబడి ‘‘భారత్‌, తెరే టుక్‌డే టుక్‌డే కరేంగే, అఫ్జల్‌ తేరా కతిల్‌ జిందాహై, ఘర్‌ ఘర్‌మే అఫ్జల్‌, ఛీన్‌కేలేంగీ ఆజాదీ" అని నినాదాలు చేసినా, ఏ పాలకులూ వాళ్లను ఏమీ చేయలేని బలహీనులను చేసేంతవరకు సెక్యులరిజం ఎదిగింది"... అంటారు కోవెల.

  1. విద్యా విధానం:

               ఈ రోజు కూడా మనదేశంలో లార్డ్‌ మెకాలే ప్రవేశపెట్టిన విద్యావిధానమే అమలులో ఉంది. బ్రిటిష్‌ వారు తమ పరిపాలన అవసరమైన గుమాస్తాలను తయారు చేసుకోవటానికీ దానిని రూపొందించారు. అదే విధానాన్ని స్వాతంత్య్రం తరువాత కూడ మన పాలకులు కొనసాగిస్తున్నారు.

               విద్యా బోధనలో రెండు విధానాలున్నాయి. అవి.

  1. Behaviourist method.
  2. Cognitivist method.

               మొదటిది యాంత్రికమైనది. పదే పదే ఒక విషయాన్ని నూరిపోసి, బట్టీపెట్టేలా చేసి (Learning by rote) నేర్పించడం. రామ చిలుక కూడ పదిసార్లు చెబితే ఆ మాటలను వల్లిస్తుంది. దాన్నే చిలుకపలుకులు అంటాం. అందులో సృజనాత్మకత ఉండదు. మెకాలేవిద్యావిధానం సరిగా ఇదే.

               కానీ మన భారతీయ సనాతన గురుకుల విద్యావిధానం అలా ఉండదు. అది Cognitivist approach తో సాగుతుంది. ఒక విషయం నేర్చుకున్న తర్వాత విద్యార్థికి why? (ఎందుకు) why not? (ఎందుకుకాదు?) అనే ప్రశ్నలు ఉత్పన్నమవ్వాలి. ఈ రెండు ప్రశ్నలే సమస్త జ్ఞానానికి, పరిశోధనలకు, పురోగతికి మూలాలు. ఈ రెండు ప్రశ్నలూ తార్కిక దృక్పథానికి Logical approach) పునాదులు

  1. గాంధీజీ విద్యావిధానం

               వివేకానందుని ఆలోచనలు, గాంధీజీ ఆలోచనలు, దగ్గరగా ఉంటాయంటారు రచయిత. ఆయన దార్శనికతతో ఇలా వివరించారు.

               1) ప్రతి పిల్లవాడికి ప్రాథమిక విద్య నిర్బంధంగా అందించాలి.

               2) ప్రాథమిక విద్య పూర్తిగా మాతృభాషలోనే జరగాలి.

               3) ఏదో ఒక చేతి వృత్తిలో (Vocational) శిక్షణ ఇవ్వాలి.

               గాంధీజీ ఇలా అన్నారు

               "I am convinced that the present system of education is not only wasteful but positively harmful" – 1931, Round Table conference, London

               స్వాతంత్య్రం వచ్చిన తర్వాత గాంధీని పూర్తిగా పక్కనపెట్టారు. మార్క్సిస్టులూ నెహ్రూతో కలిశారు. తన అజెండాను అమలు చేయడానికి జాతీయ పరిశోధన శిక్షణ మండలి (NCERT) జాతీయ విద్యా ప్రణాళిక, పరిపాలన సంస్థ (NI$CA) లను నెహ్రూ స్థాపించారు. అభారతీయమైన అజెండా ఇది. ఇందిరాగాంధీ దీనిని మరింత బలపరిచారు. 1969లో జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయం ఏర్పడింది. దానికి అనుబంధంగా ఆలీఘర్‌ ముస్లిం యూనివర్శిటీ. ఈ రెండు మెకాలే మానసపుత్రులను తయారు చేయడం ప్రారంభించాయి.’’ ఈ దేశాన్ని ముక్కలు చేస్తాం" అని ధైర్యంగా నినదించేస్థాయికి ఆ విద్యార్థులు ఎదిగారు.

స్వాతంత్య్రం ఎలా వచ్చింది?

               ‘‘ధృతిమన్నించి పరాయివాడు తన దారిందాను పోగా, సమున్నతి స్వాతంత్య్రము వచ్చి పడ్డదనుకున్నన్‌ వాని దేపిచ్చి, సంగతి కాండ్రై పొరుపింతలేక నలతన్‌ కల్లోలముల్‌గా, ప్రచండతరంగార్ణవ మెల్ల జేసికొనకుండన్‌ జూచుకోగావలెన్‌"

                               - విశ్వనాథ సత్యనారాయణ - కేదార గౌళ" (1947) ఖండకావ్యం.

               1960లో అజాద్‌ స్మారకోపన్యాసానికి ఇంగ్లండ్‌ నుండి ‘‘అర్నాల్‌ టాయన్‌ బీ" అనే ఆయన్ను పిలిపించారు. ‘‘వన్‌వరల్డ్‌ అండ్‌ ఇండియా" అన్న టాపిక్‌ మీద ఆయన ఉపన్యసించారు.

     ‘‘ఆధునిక పాశ్చాత్య ఉదారవాదం (liberalism)అనేది పాశ్చాత్య దేశాలు ప్రపంచానికి పెట్టిన భిక్ష. దీని పర్యవసానమే మేము ఇండియాకు స్వాతంత్య్రం ఇచ్చి మాదేశానికి వెళ్లిపోవడమే. జైళ్లల్లో పెట్టిన భారతీయ నాయకులకే తిరిగి అధికారం అప్పగించాము. ఇదీ ఉదారవాద ఫలితమే. పగవానిని కూడ క్షమించగలిగే భారతీయుల ఉదారబుద్ధి కూడా దీనికి కారణం. మా ఉదారవాదం, గాంధీజీ క్షమాతత్త్వం కలిశాయి. స్వాతంత్య్రం తర్వాత మీరు మా పార్లమెంటరీ ప్రజాస్వామ్యమును స్వీకరించి ఉదారవాదంపై మీకు గల ఆదరాభిమానాలను వ్యక్తం చేశారు.’’

               ఈ ఉపన్యాసాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే ప్రసంగించిన వాడు ఎంత తెలివైనవాడో అర్థం అవుతుంది. మన ఉద్యమాలన్నీ స్వాతంత్య్రానికి కారణం కాదు, కేవలం వాళ్ల ఉదారవాదమే కారణం అని మనకే చెప్పి, చప్పట్లు కొట్టించుకున్నాడు.

  1. దోపిడీ, విధ్వంసం:

               భారతదేశంలో అంతులేని సంపద పోగుపడి ఉంది. అందుకే విదేశీ మూకలు మనమీద దాడులు చేసి మన సంపదను దోచుకుపోయారు. దానికి వీలుగా రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు వేసుకొని, దాన్ని మనకోసం చేస్తున్న అభివృద్ధిగా చూపించి మరీ దోచుకున్నారు. కొన్ని శతాబ్దాలపాటు ఆర్థిక సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆధ్యాత్మిక, చారిత్రక విధ్వంసం ఎలా జరిగిందో కోవెల ‘‘రామంభజే శ్యామలం’’ లో విశదీకరించారు.

               రామాయణంలో పాలనా వ్యవస్థ-

                               ‘‘సమితి! అస్మత్కర్త, కః స్తుతి సమ్హతిః                                                                                             యాజతాయాజతాశు, యస్త్యవేశు                                                                                                   దేవేశు, మధ్యేదేవిద్యోతమానాభవతి"          - ఋగ్వేదం- పదవ మండలము

               దీనిని ఉదహరించారు కోవెలవారు. దీనిలో ‘‘సమితి" ని గురించి చెప్పారు ఋగ్వేదంలో. ఇ ది మన పార్లమెంటుతో సమానం అని చెప్పవచ్చు.

               ‘‘వేదాల్లో అన్నీ వున్నాయిష!’’ అని కొందరు మహానుభావులు వెటకారం చేశారు. దీన్ని అర్థం చేసుకుంటే ఆ వెటకారంలోని డొల్లతనం మనకు తెలుస్తుంది. సమితి అనేది ప్రజలందరి భాగస్వామ్యంతో వారి ప్రతినిధులతో ఏర్పడేది. ఇందులో ప్రజల కష్టసుఖాలను చర్చించుకొని పరిష్కారాలను కనుగొంటారు. మరి దీన్ని రాచరికమంటారా?

               భరతుడు అడవికి వచ్చి రాముడిని కలుసుకున్నప్పుడు రాజధర్మాలు, రాజ్య స్వరూపాన్ని గురించి ఆయన తన తమ్మునికి వివరిస్తాడు అందులో కొన్ని:

             1) తక్కువ ప్రయత్నంతో ఎక్కువ ఫలితం వచ్చే పనులను, సత్వరం చేయాలి.

             2) వేల మంది మూర్ఖులకంటె, ఒక మేధావే రాజ్యానికి అవసరం

             3) సామర్థ్యాన్ని బట్టి ఉద్యోగులకు విధులను కేటాయించాలి.

             4) యుద్ధ వీరులైన సైనికులకు సముచిత గౌరవం ఇవ్వాలి.

             5) సర్వజ్ఞులు, సమయస్ఫూర్తి కలిగినవారిని విదేశీ రాయబారులుగా నియమించాలి.

             6) ఓడిపోయిన శత్రువులను నిరంతరం గమనిస్తుండాలి.

             7) ఆదాయం ఎక్కువగా ఖర్చు తక్కువగా ఉండాలి. అపాత్రుల చేతుల్లోకి ధనం వెళ్లకూడదు.

             8) దేశంలో పండిన పంటను అందరికీ అందేలా చూడాలి. - అయోధ్యాకాండ - 100వ సర్గ - 17వ శ్లోకం నుండి

               మన సోకాల్డ్‌ ప్రజాస్వామ్య ప్రహసన పాలకులు పైన చెప్పిన వాటికి రివర్స్ గా చేస్తారు. రాచరికంలోని నియంతృత్వ ధోరణులను, వారసత్వ సంస్కృతిని నిందిస్తారు గాని, దశాబ్దాలు గడుస్తున్నా, కొడుకును తన వారసునిగా రాజకీయాల్లోకి తీసుకు రావాలన్న తపన నాయకుల్లో ఎక్కువగా ఉంది. ప్రతి రాజకీయ పార్టీ, ఒకే నాయకుని కనుసన్నల్లో నడుస్తూ ఉంటుంది. అది నియంతృత్వంకాక మరేమిటి? ప్రజాస్వామ్యం అనేది మనకు ఒక పల్చని ముసుగు మాత్రమే. దానిలోపల, మేడిపండు చందంగా, కుళ్ళు అంతా కనబడుతూ ఉంటుంది.

  1. రాచరికంలో ప్రజాస్వామ్యం:

               రామాయణంలో మూడు రకాల రాజ్య వ్యవస్థలున్నాయి. అవి పరస్పర భిన్నమైనవి.

                     1) అయోధ్య (ప్రజాస్వామిక రాచరికం)

                     2) కిష్కింధ (అరాచకం)

                     3) లంక (నియంతృత్వం)

               ఈ మూడింటిలో అయోధ్యలోనే మనం అంతర్గత ప్రజాస్వామ్యాన్ని గమనించవచ్చు. దశరథుడు తనవారసునిగా శ్రీరామచంద్రుని ఎంపిక చేసేముందు, గ్రామస్థాయి నుంచి రాజధాని దాకా అన్ని స్థాయిల్లోని ప్రజలను సంప్రదిస్తాడు. ఇది ఒక రకమైన రెఫరెండం లాంటిది. మన సమాజంలో కొడుకులను, కూతుళ్లను, విధవలైన భార్యలను మన నెత్తిమీద రుద్దుతున్నారు. కేవలం నాయకుల వారసులుగా తప్ప, వారికేవిధమైన పాలనా సామర్థ్యం ఉండదు. ఆఖరుకు సినిమారంగంలో కూడ ఈ ధోరణి ప్రబలి, దుర్భరమైన వారసుల నటనను ప్రేక్షకులు చూడాల్సి వస్తూన్నది. ‘‘చిత్రహింస అంటే ఇదే.’’ తినగ తినగవేము తియ్యనుండు" అని వేమన అన్నట్లు వారే అలవాటై, వారినే స్వీకరించే దౌర్భాగ్యపు మానసిక స్థితికి చేరుకున్నాము. రాముడి పట్టాభిషేకం నిర్ణయించినపుడు అందరూ ఏకగ్రీవంగా జేజేలు పలికారట. అప్పుడు దశరథునికి అనుమానం వచ్చిందట. తాను ఇంతవరకు బాగా పాలిస్తున్నాడా? వీళ్లకు అసంతృప్తి ఏమైనా ఉందా? కేవలం తన కుమారుడనే, రాముడిని ఇంతగా ఆకాశానికెత్తుతున్నారా? అని. అదేం లేదు మహప్రభో! అని అందరూ ఆయనకు నచ్చ చెప్పారట.

  1. తారుమారు చరిత్రకారులు:

               ‘‘భవిష్యత్తులోకి మనం వెళ్లడానికి

             వర్తమానంలో ఉత్ప్రేరకంగా ఉపయోగపడేది గతం" - కోవెల వారు గతానికి ఇచ్చిన అద్భుతమైన నిర్వచనం ఇది.

               స్వాతంత్య్రం వచ్చిన తర్వాత, మన ఖర్మ అదేమిటో గాని, మన చరిత్ర నిర్మాణం అంతా ప్రభుత్వ జోక్యంతో, కమ్యూనిస్ట్‌ దృక్పథంతోనే జరిగిందంటారు రచయిత. దురదృష్టవశాత్తు మార్క్సిజమ్‌ శాస్త్రీయతకు పర్యాయపదంగా మారిందని ఆయన వాపోయాడు. ICHR (ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ హిస్టారికల్‌ రీసర్చ్‌) అనే సంస్థను ప్రభుత్వం నెలకొల్పింది. చరిత్రను పరిశోధించాల్సిన ఆ ప్రతిష్ట్మాక(?) సంస్థ, ఇంకా ఇతర సంస్థలు, భారతదేశ అస్తిత్వానికి వ్యతిరేకులు, పాశ్చాత్య సామ్రాజ్య, సామ్యవాద సిద్ధాంతకర్తతో దాదాపు 50 సంవత్సరాల పాటు నిండిపోయాయి. ICMR ను ఏలినవారు ఈ ముగ్గురు.

               1) ప్రొఫెసర్‌ మహమ్మద్‌ హాబీబ్ (ఆలీఘర్‌ ముస్లిం యూనివర్సిటీ),    2) నూరుల్‌ హసన్‌, 3) రోమిల్లా థాపర్‌

               1926 నుంచే ఈ తారుమారు స్పెషలిస్టులు తమ తప్పుడు వాదనలను ప్రచారంలోకి తేసాగారు. వారికి ప్రభుత్వం అండ ఉండనే ఉంది. ఇక వారు రెచ్చిపోక ఏం చేస్తారు? వారి ‘‘అమూల్య" సిద్ధాంతాలు!

  1. భారతదేశంలో ఇస్లాం చొరబడలేదు
  2. స్వదేశీరాజులపై దాని ప్రభావం సున్న         
  3. ఇస్లాంలోకి హిందువులను బలవంతంగా అసలు మార్చలేదు
  4. నిమ్నకులాలవారే బ్రాహ్మణుల, ఇతర అగ్రవర్ణాల అణచివేత నుండి బయటపడడానికి దానిని స్వచ్ఛందంగా

                                         కౌగలించుకున్నారు.

  1. సమాజంలో సమానత్వం ఇస్లాంవల్లే సాధ్యమైంది.

                                         - రామంభజే శ్యామలం - వ్యాసం 12 (సూపర్‌ హిస్టారియన్లు) - పుట 96

చరిత్ర వక్రీకరణ: మూడు కోణాలు:

ఆర్యులు భారతీయులు కానేకారు. వేదాలు ఇక్కడ పుట్టలేదు. సంస్కృతం ఈ దేశానిది కాదు అని నిరూపించడం.

దండెత్తి వచ్చిన ముస్లిం రాజుల అమానుష రికార్డులను మరుగుపరచడం. వారిని మతసామరస్యానికి ప్రతీకలుగా చూపడం.

నెహ్రూ కుటుంబానికి అనుకూలంగా స్వాతంత్య్ర పోరాటాన్ని మలచటం.

               మహమ్మద్‌ హబీబ్‌, తర్వాత ఆయన కుమారుడు ఇర్ఫాన్‌ హబీబ్‌ భారత చరిత్ర నిర్మాణానికి వేసిన పునాది వాక్యాలను చూస్తే మనం దిగ్భ్రాంతి చెందక తప్పదు. కొడుకు ‘‘పద్మభూషణ్‌" కూడా! పెద్ద హబీబ్‌ 1947 డిసెంబర్‌లో బొంబాయిలో జరిగిన హిస్టరీ కాంగ్రెస్‌లో మాట్లాడారు. ఆయన ఇలా అన్నారు.

               "భారత దేశంలో బ్రిటిష్‌ పాలకుల చరిత్రను సానుకూల దృక్పథంతో వ్రాయాలి. వారు మనదేశాన్ని ఆక్రమించుకొన్నారంటే కారణం భారతీయులలోని లోపాలే. వారి తప్పేం లేదు.’’

ఆయన చెప్పిన ఆంగ్లపాఠం ..

"The history of the British period can now be written and it is to be hoped that it will be written without enimity or resentment that all defects of Indian character and Indian instituitions, which made the foreign rule possible will be frankly confessed and every element of value that we have received from the british will be gratefully recognised..."      

                     ‘అరుణ్‌ శౌరి’ వీరి వాదనల్లోని డొల్లతనాన్ని విమర్శించారు.

               1957లో పరమాత్మ శరణ్‌ అనే ఒక పర్షియన్‌ స్కాలర్‌ ‘‘తారిఖ్‌ ఇ` అక్బర్‌" అని, 16వ శతాబ్దానికి చెందిన పర్షియన్‌ గ్రంథానికి తాను చేసిన అనువాదానికి సహకారాన్ని కోరి, దానికి ICHR కు సుమర్పిస్తే, ఆ గ్రంథం ‘‘కనపడుటలేదు!’’. 1993లో ICHR డిప్యూటీ డైరెక్టర్‌ తన్సీమ్‌ అహ్మద్‌ పేరుతో అదే పుస్తకం, ఉన్నది ఉన్నట్లుగా (ఆయన సొంత పరిశోధనగా) అచ్చయింది. దానిని ఇర్ఫాన్‌ హబీబ్‌ ఇలా పొగిడాడు.  

               "..........provided by Dr Tanseem Ahmed in a very competent maneer, aiming at faithful accuracy...."     దీనికి తన్సీమ్‌ అహ్మద్‌గారికి పిహెచ్‌డి ఇచ్చారు! - Arun shourie: Eminent Historians: Their technology, Their line, their fraud, 1998.

               Folks magazine June 2012 సంచికలో Dr. N.S. Rajaram గారు వ్రాసిన వ్యాసం, "ICHR are they" eminent Historians" or Ordinary criminals is scholars' robes" ఈ వ్యాసం అప్పట్లో సంచలనం సృష్టించింది.

  1. పురాణాల పుట్టుక, వక్రీకరణ:

               మన పురాణాలు పుట్టినకాలం, వాటి కాల వ్యవధి ఇవన్నీ వక్రీకరణకు గురయ్యాయి. హెచ్.ఆర్. విల్సన్ అనే సూపర్‌ హిస్టారియన్‌ "The Puranas" అనే గ్రంథంలో మన పురాణాలన్నింటిని తిరస్కరించాడు. ఆయన అమూల్యాభిప్రాయంలో తాను ఆ గ్రంథం రాసిన నాటికి మహా అయితే రెండు మూడు వందల ఏండ్ల ముందు పుట్టి ఉంటాయని చెప్పి, మన పుట్ట్టిముంచాలని చూశాడు. ఆయన అద్భుత పరిశీలనాంశాలు.

  1. వరాహ పురాణం 12వ శతాబ్దంలో పుట్టింది.
  2. రామాయణం కూడ అప్పుడే జరిగింది.
  3. వేదాలు పశువుల కాపరులు పాడుకునే పాటలు.

               కోవెల వారు దీనిని పూర్వపక్షం చేస్తూ, భారతదేశంలోని అత్యంత ప్రామాణికుడైన, గొప్ప చరిత్రకారుడు, పరిశోధకుడు శ్రీమాన్‌ కోట వెంకటాచలము గారిని ఇలా ఉటంకించారు.

‘‘భారతీయవాఙ్మయమున యిప్పటి సృష్టి ప్రారంభ కాలము 195 కోట్ల సం॥ మించి యుండెను ‘వారు’ దానిని జీర్ణించుకొనలేకపోయిరి. వారి మత గ్రంథమైన బైబిలు ప్రకారము వారు తెలుసుకొనిన, రూఢిగా నమ్మిన సృష్టికాలము ఆరు వేల సంవత్సరములకు తక్కువగా నుండెను...’’

               కవి సమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ తన ‘‘పురాణవైర గ్రంథమాల" లో విక్రమార్కునికి, విక్రమాదిత్యునికి తేడా తెలియక, (తెలిసి) కొన్ని వేల సంవత్సరాల మన చరిత్రను పాశ్చాత్య చరిత్రకారులు మింగేశారని సోదాహరణముగా నిరూపించారు

  1. రోమిలా థాపర్‌:

               ఈమె, భారత చరిత్ర ఆర్యుల దండయాత్రతోనే ప్రారంభమైనదన్నారు. ఆర్యులు ఇరాన్‌ ఈశాన్య ప్రాంతం నుంచి వచ్చి పంజాబులో స్థిరపడి, ఢిల్లీ దాకా వెళ్లి, విస్తరించారట. నాలుగు వేదాలూ వీళ్లే రాసుకున్నారట. సింధు నాగరికతకు, వీళ్లకు, ఎలాంటి సంబంధం లేదట. వీళ్లు గొప్ప గొప్ప నగరాలను నిర్మించడానికి వెయ్యి సంవత్సరాలు పట్టిందట. ఇదీ ఈమె సిద్ధాంతం.

  1. సూర్య సిద్ధాంత గ్రంథం:

               ఈ గ్రంథంలో ‘గోళాధ్యాయం’ అనే ప్రకరణంలో 29 నుండి 32వ శ్లోకం వరకు భూ స్వరూపం వివరింపబడింది. ఇప్పటి జియాలజిస్టుల ఒక అంచనాగా భూమి పుట్టుకను 420 కోట్ల సంవత్సరాలు. మన ప్రాచీన ఋషులు దానికి 432 కోట్లు అని ఖచ్చితంగా చెప్పగలిగారు.

               గోళాధ్యాయం ఇలా చెబుతూన్నది.

               "భూమి సమఘన వృత్తంలా, గోళాకృతిలో ఉంది రోదసి మధ్యలో ఆకాశ కక్ష్య ఉన్నది. దాన్నే వ్యోమ కక్ష అంటారు. మధ్యలో నక్షత్ర కక్ష్య ఉంటుంది. అందులో మేషం మొ॥ 12 రాశులు, తొమ్మిది గ్రహాలు ఒక దాని దిగువున మరొకటి ఉన్నాయి. దానికి దిగువన నక్షత్ర గణాలతో కూడిన భూగోళము ఉన్నది.’’

               ప్రస్తుత మన సోలార్‌ సిస్టమ్‌ను గమనిస్తే, ఇంచుమించు యిలాగే ఉంటుంది; అని కోవెలవారు సూత్రీకరించారు. - రామంభజే శ్యామలం-15వ వ్యాసం, పుట 121

  1. రామాయణ వక్రీకరణ:

               ఇది చాలా దారుణం, సనాతన భారతీయ ధర్మాన్ని గౌరవించి, విశ్వసించే వారెవరైనా దీనిని చదివి కోపంతో రగిలిపోతారు.

               దీనిని క్రోడీకరిస్తే ఏడు ప్రధాన అంశాలు బయటకొస్తాయి. అవి

               1) అయోధ్య అనేది లేనే లేదు. అది ఒక బౌద్ధ క్షేత్రం.

               2) రామాయణం పుక్కిట పురాణం. భారతం తర్వాత జరిగింది.

               3) రాముడు దుర్మార్గుడు రావణుడు బంగారు కొండ

               4) ఇది ఆర్యులు ద్రావిడులపై చేసిన యుద్ధం

               5) రాముడు దళిత ద్వేషి, శంబూక వధే దీనికి సాక్ష్యం

               6) రాముడు ఏక పత్నీవ్రతుడు కాదు ఆయనకు నలుగురు భార్యలు!

               7) రామాయణం ఇండోనేషియాలో జరిగింది.

               ఈ వక్రీకరణకు కేంద్ర బిందువులుగా నిలిచింది. మార్క్సిస్టు, ఇస్లామిస్టు చరిత్రకారులు వారి ప్రధాన లక్ష్యం! ఈ దేశంలో వేల ఏండ్లుగా ఆరాధనీయుడుగా, ఆదర్శపురుషుడుగా పూజలందుకుంటున్న రాముడి చరిత్రను నామ రూపాలు లేకుండా చేయటం... అంటారు రచయిత. ఆయనను రిప్లేస్‌ చేయడానికి అశోకుడిని ‘‘మార్కెటింగ్‌" చేయడం మొదలుపెట్టారు.

  1. రామాయణానికి ‘‘సోర్స్‌" (ఆధారం):

               వాల్మీకి - నారద సంవాదమే రామాయణం రాయడానికి ఆధారమని రచయిత తార్కికమైన వివరణ ఇచ్చారు. నారదుడు రాముని గొప్పదనాన్ని, వాల్మీకి రామాయణంలోని తొలి ఐదు శ్లోకాలలోనే చెప్పాడు. ఇది భూమిపై జరిగిన కథే అని, ఆయన స్పష్టం చేశాడు. అయోధ్యను గురించిన నిజాలను, గణాంకాలను వివరించాడు అయోధ్య సరయూనదీ తీరంలోని కోసల దేశంలో ఉందనీ, దాని విస్తీర్ణం లెక్కలు కూడా వివరించాడు వాల్మీకి.

               ఈ కథకు నారదుడే ‘సోర్స్‌’అని వాల్మీకి మొదటి పది శ్లోకాల్లోనే చెప్పుకున్నాడు. జరిగిన కథను కావ్యంగా మలచి మనకు అందిస్తే దాన్ని చరిత్ర అనకుండా మిధ్య అని ఎలా అంటాం? అని ప్రశ్నిస్తారు రచయిత.

  1. మన పూజావిధానంలో సంకల్పం – చరిత్ర:

               మనం రోజూ ఇంట్లో సంధ్యావందనం, దేవతార్చన చేసేటప్పుడు, ఇతర వ్రతాలు చేయించుకునేటపుడు ‘‘సంకల్పం" చెప్పుకుంటాం. అందులో మన కాలాన్ని, మన మున్న ప్రదేశాన్ని చెప్పుకుంటాం.

"జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే, మేరోః దక్షిణ దిగ్భాగే, శ్రీశైలస్య నైరుతి ప్రదేశే, శ్రీకృష్ణాగోదావర్యోః మధ్యమ ప్రదేశే కలియుగే, ప్రధమపాదే,... నామ సంవత్సరే.... మాసే,.... పక్షే,.... తిథౌ....... వాసర యుక్తాయాం......’’ ఇలా సాగుతుంది మన సంకల్పం"

 

  1. రామాయణంలో కాల నిర్ణయం:

               వాల్మీకి మహర్షి, అయోధ్య, కిష్కింధ, యుద్ధకాండలలో ఋతువులను స్పష్టంగా నిర్ణయించాడు. భాద్రపదంలో వర్షాకాలం, ఆశ్వయుజ పూర్ణిమ నుండి వేసవికాలం, వైశాఖమాసంలో శిశిరం... ఈ విధంగా

               పుత్రకామేష్టియాగం తర్వాత ఆరు ఋతువులు గడిచాయి. అంటే ఒక సంవత్సరం, అప్పుడు శ్రీరామచంద్రమూర్తి తల్లి గర్భంలొంచి బయటపడ్డాడు. చైత్ర నవమి, పునర్వసు నక్షత్రం గ్రహాలన్నీ అత్యంత ఉచ్చ స్థితిలో ఉన్నాయి. అది క్రీస్తు పూర్వము 7323వ సంవత్సరం, డిసెంబరు 4వ తేదీ మ. 12-1 గం॥ మధ్య.

               సీతారాముల వివాహం -         7 ఏప్రిల్‌ 7307 B.C.    

               వనవాసం               -         29 నవంబరు 7306 B.C.

               సేతు నిర్మాణం          -         26`30 నవంబరు 7292 B.C.   

               రావణ వధ              -         15 నవంబరు 7292 B.C.

               రాముని అయోధ్యాగమనం-      6 డిసెంబరు 7292 B.C. (అప్పటికి ఆయన వయస్సు 39 సం॥)

               వీటన్నింటినీ భారతదేశంలోని 195 ప్రదేశాలు విస్పష్టంగా నిరూపిస్తున్నాయి. అయోధ్య, పంచవటి, హంపి, లంకలో దొరికిన ఆనవాళ్లు వాటిపై చేసిన పరిశోధనలు ఈ కాల నిర్ణయంపై సరితూగుతున్నాయి.

                                         - పుల్లెల రామచంద్రుని రామాయణం

                                         - పి.వి వర్తక్‌; వాస్తవ్‌ రామాయణ్‌

                                         - పుష్కర్‌ భట్నగర్‌, డేటింగ్‌ ఆఫ్‌ రామాయణ

                                         - కోట వెంకటాచలం : ది ప్లాట్‌ ఆఫ్‌ ఇండియన్‌ క్రోనాలజీ

                                         -` సుందరాచార్య స్వామి : శ్రీరామ కాల నిర్ణయ బోధిని

               పై గ్రంథాలన్నీ రామాయణ కాల నిర్ణయాన్ని ప్రామాణికంగా నిర్ధారించాయి.

  1. బుద్ధుడు, అశోకుడు: అసలు నిజాలు:

               గౌతమ బుద్ధుడు ఇక్ష్వాకువంశంవాడే అని నిరూపించారు కోవెల. మహాభారత యుద్ధం తర్వాత కొనసాగిన ఇక్ష్వాకు వంశంలో బుద్ధుని తండ్రి శుద్ధోదనుడు 23వ రాజు. సిద్ధార్ధుడు తన 29వ ఏట జ్ఞానాన్ని అన్వేషిస్తూ బయలుదేరాడు. ఆరేండ్లతర్వాత, అంటే తన 35వ ఏట బుద్ధుడయ్యాడు. మహాభారత కాలం నుండి రాజుల పరిపాలనా కాలాన్ని ఖచ్చితంగా గణించుకుంటూ వస్తే, గౌతమ బుద్ధుడు క్రీ.పూ. 19వ శతాబ్దానికి చెందినవాడని తేలుతుంది. కాని పాశ్చాత్య చరిత్రకారులు దానిని క్రీ.పూ. 5వ శతాబ్దంగా నిర్ధారించారు. అట్లే, భారతదేశంపై అలెగ్జాండర్‌ దాడి క్రీ.పూ. 326 లో జరిగింది. గుప్త వంశానికి చెందిన చంద్రగుప్తుడు క్రీ.పూ. 327 నుంచి క్రీ.పూ. 320 వరకు పాలించాడు. కాబట్టి అలెగ్జాండర్‌ దాడి సమయంలో మగధరాజు మౌర్య చంద్రగుప్తుడు కానే కాదు.

               "తప్పుగా గుర్తించడం వల్ల మన చరిత్ర ఏకంగా 12 శతాబ్దాలు ముందుకు జరిగింది" (- రామంభజే శ్యామలం - వ్యాసం 19, పుట. 141)

  1. శ్రీరామునికి ప్రత్యామ్నాయం అశోకుడు:

               రచయిత అశోకుడిని ఒక ‘‘సూపర్‌ న్యూమరీపోస్ట్‌" అని పరిహసిస్తారు. కుహనా చరిత్రకారులు శ్రీరామచంద్ర ప్రభువు ప్రాశాస్త్యాన్ని తగ్గించడానికి ఆయనను రంగంలోకి దింపారు. దానికి బిల్డప్‌ నాలుగు సింహాలు, ధర్మచక్రం, హడావిడి! తర్వాత భారత ప్రభుత్వం కూడ అదే పనిగా బౌద్ధాన్ని ‘‘మార్కెటింగ్** చేసింది. అసలు రామాయణమే మన సుపరిపాలనకు, దేశపునర్నిర్మాణానికి పునాది కావాల్సి ఉంది. యుద్ధకాండ చివర ‘రామరాజ్య’ వర్ణన ఉంది. ఒక ఆదర్శవంతమైన పబ్లిక్ సెంట్రిక్ పరిపాలన ఎలా వుండాలో వాల్మీకి చూపించారు. దాన్ని ఒక ఉటోపియా అని భావిస్తే అంతకంటే తెలివితక్కువ తనం లేదు. మరి ఇదంతా వదిలేసి, అశోకుడినే నెత్తికెత్తుకోవలసిన అవసరం ఏమొచ్చింది? ఇదొక మిలియన్‌ డాలర్ల ప్రశ్న.

               "రాముడు రాజ్యమును పాలించిన కాలంలో స్త్రీలు వైధవ్య దుఃఖమును పొందలేదు. క్రూర జంతువుల వల్ల భయంకానీ, వ్యాధుల వల్ల భయంకానీ లేదు. లోకంలో దొంగలు లేరు. ఎవరికీ ఏ అనర్థమూ జరుగలేదు. పెద్దవాళ్లు చిన్నవాళ్లకు ప్రేతకార్యం చేసే అవసరం కలుగలేదు. అంతా ఆనందంగా ఉంది. అందరూ ధర్మపరులుగా ఉన్నారు. తప్పు చేస్తే రాముడెక్కడ శిక్షిస్తాడో అన్న భయంతో ఉన్నారు. ప్రజలు ఒకరినొకరు హింసించుకోలేదు. ఆయా వృత్తుల వారు వారి వారి వృత్తులను చేసుకుంటూ ఉన్నారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ప్రజలు సురక్షితంగా ఉన్నారు. వాతావరణం కలుషితం కాలేదు. వర్షాలు సకాలంలో పడ్డాయి. చెట్లు పండ్లు పూలతో ఎప్పుడూ నిండుగా ఉన్నాయి.’’ - వాల్మీకి రామాయణం- యుద్ధ కాండ చివరి భాగం -రామ రాజ్య వర్ణణ

               ఇలాంటి పరిపాలన మన వారికి ఆదర్శం కాలేదు

  1. కళింగ యుద్ధం; పరివర్తన:

               ఇదంతా కల్పితం అని నిరూపించారు కోవెల సంతోష్‌కుమార్‌. కళింగ యుద్ధం తర్వాత ఆయన పూర్తిగా మారిపోయాడు. యుద్ధంలో లక్షల మందిని చంపాడు. ఆ మారణకాండను చూసి విచలితుడై ఒక్కసారిగా బౌద్ధంలోకి మారాడు. వెంటనే ఆయన డ్రస్‌ కోడ్‌ మారిపోయింది. రోడ్డు పక్కన చెట్లు (మొక్కలు కాదు) నాటించాడు. సత్రాలు, ఆసుపత్రులు కట్టించాడు. ‘‘అశోకా ది గ్రేట్‌’ అయ్యాడు! ఇదీ మనందరికీ తెలిసింది. మనందరి మీద తారుమారు చరిత్ర కారులు రుద్దింది. ఇలా అని ఏ బౌద్ధ మత గ్రంథంలోనూ లేదు. ‘‘ఆయన బౌద్ధాన్ని కేవలం రాజకీయంగా వాడుకున్నాడేమో" అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు కోవెల. ఆయన వివరించిన ప్రమాణాలు చూస్తే మనకు కూడా ఆ అనుమానం నిజమే అనిపిస్తుంది. కళింగ యుద్ధానికి సంబంధించిన శిలా శాసనం గుజరాత్‌లోని గిర్నార్‌లో లభించింది. కళింగ ఒరిస్సాలో ఉంది. దీనిపై అశోకుని పేరు ‘‘ప్రియదస్సి" అది ప్రాకృతపదం.

               యుద్ధంలో లక్షమందిని చంపి, మరో లక్షన్నర మందిని యుద్ధ ఖైదీలుగా తీసుకుని వెళ్లాడా ‘‘రక్త పిపాసి", ‘‘ధౌలి" అని భువనేశ్వర్‌ వద్ద మరో శాసనం లభ్యమైంది. దానిలో ఆయన పశ్చాత్తాపం కంటే, తాను మరో దండయాత్రకు పాల్పడతానని ఉన్నదే తప్ప, పరివర్తన కలిగినట్లు అనిపించదని కోవెల కుండబద్దలు కొట్టారు.

                     "దేశాన్ని ఏలిన అత్యంత క్రూరమైన రాజుల్లో అశోకుడు మొదటి స్థానంలో ఉంటాడు.’’

  1. షాజహాన్‌ - ముంతాజ్‌ / సీతారాములు:

               సీతారాముల ఆదర్శ దాంపత్యం మనకు శిరోధార్యం. దానిని మన పాలకులు పెద్దగా పరిగణించలేదు. దానికి బదులు 19 ఏండ్లలో 14 సార్లు భార్యను గర్భవతిని చేసి, ఆరోగ్యం క్షీణించి చనిపోయేలా చేసి, పాతిపెట్టిన ఆరు నెలలకు ఆ ఎముకలను తెచ్చి, ఇంకో చోట పూడ్చి పెట్టి, పాలరాళ్ళు కప్పితే, దాన్నో ప్రపంచ వింతగా, అమర ప్రేమకు చిహ్నంగా, మసిపూసి మారేడుకాయ చేసి, మనకు చూపారు. రచయిత ఆవేదనను అక్కసు మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి.

  1. మన వీర పురుషులు వీరవనితలు:

               మన పాలకుల్లో చంద్రగుప్త మౌర్యుడు, రాజరాజచోళుడు, కనిష్కుడు, రాణాప్రతాప్‌, ఛత్రపతి శివాజీ, సముద్రగుప్తుడు, భోజ మహారాజు, విక్రమార్కుడు, శ్రీకృష్ణ దేవరాయలు, లలితాదిత్య చక్రవర్తి, ఇలా ఎందరో వీరాగ్రేసరులు, పరిపాలనాదక్షులున్నారు. వారికి ‘‘ది గ్రేట్‌" అనే పదాలు చేర్చం మనం. మనకు ‘‘అక్బర్‌ దిగ్రేట్‌", ‘‘అశోకా ది గ్రేట్‌"లే ఉంటారు ఎందుకోమరి!

               మహిళాపరిపాలకులలో రుద్రమ, విష్ఫల (ఋగ్వేదం), ఝాన్సీ లక్ష్మీబాయి, పద్మావతి, అహల్యబాయి హల్కర్‌, మీరాబాయి (ఈమె యుద్ధ విద్యలోనూ ప్రవీణురాలు), రాణి సంయుక్త, తారాబాయి (శివాజీ మహరాజ్‌ కోడలు), వీరితో బాటు అవధ్‌రాజు వాజిద్‌ ఆలీషా భార్య బేగం హజ్రత్‌ మహల్‌ను కూడ గొప్ప యోధురాలండ్రలో ఒకరిగా ఈ రచయిత ప్రస్తావించారు. నిజమైన సెక్యులరిస్టు ఆయన.

  1. వాట్సాప్‌ పరిశోధకులు:

               వీరి మాటలకు ప్రమాణాలు ఉండవు. అతివేగంగా ఈ భావాలు సోషల్‌ మీడియాలో వ్యాపిస్తాయి. వేదం ఒక మతమనీ, వేదమతంలో దయ, ప్రేమలకు తావులేదనీ, పోస్ట్‌ చేస్తారు. వీటినే జీసస్‌ క్రైస్ట్‌ అడాప్ట్‌ చేసుకుని ప్రపంచానికి చాటాడట. బోడిగుండకు మోకాలికి ముడిపెట్టినట్లుంది. ఇలాంటి వాళ్లను రచయిత బావిలోని కప్పలతో పోల్చారు. వీరు మన వాదనకు హేతువునడుగుతారుగాని, తమ వాదనకు ప్రాతిపదికను చెప్పరు.

రచయిత తార్కిక ప్రశ్న : గౌతమ బుద్ధునికి ముందు సమాజం? మతం?

               రచయితకు గౌతమ బుద్ధునిపై అపరిమిత గౌరవం ఉంది. అది ఆయనే చెప్పుకున్నాడు. కాని ఆయన వాదనా పటిమకు, సత్యశోధనకు, తార్కిక జ్ఞానానికి మచ్చుతునక ఈ చర్చ. ఆయన వేసే సూటి ప్రశ్నలు :

               1) గౌతమ బుద్ధుడు పుట్టకముందు సమాజం అన్నది ఒకటి ఉన్నదా?

               2) ఉంటే అది అనుసరించిన మతం ఏమిటి?

               3) ఆ మతం ప్రబోధించిన జీవన మార్గం ఏమిటి?

               4) 29 సం॥ల పాటు బుద్ధుడు, ఆయన కుటుంబ సభ్యులు ఏదో ఒక మతాన్ని అనుసరించి

                ఉండాలి కదా? అది వేదమతమా? హిందూమతమా? ఇంకేదైనా మతమా?

               5) ఆయన వివాహం ఏ మతాన్ని అనుసరించి వివాహం చేసుకున్నాడు?

               6) అప్పుడు ఏవైనా మంత్రాలు చదవడం, తంతు జరగడం ఉండి ఉంటుంది కదా?

               7) ఆ మంత్రాలు ఎక్కడ నుంచి వచ్చాయి? వాటి అర్థాలు ఏమిటి?

               8) ఆయన దాంపత్య ధర్మాన్ని పాటించాడు కదా! కుమారుడు కూడా కలిగినాడు కదా!

               9) మరి గృహస్థాశ్రమం లేదా దాంపత్య ధర్మం గురించి బుద్ధునికి ముందు ఏం చెప్పబడింది?

               10) కరుణ, ప్రేమ, దయ అనే భావనలు అంతకు ముందు లేవా?

                     సై ప్రశ్నలు నిజంగా తార్కికమైనవి. దానికి జవాబులు లేవు

  1. యజ్ఞం - వక్రీకరణ :

               వేదాలలో సామాజిక విలువలు లేవు. యజ్ఞయాగాల గురించి మాత్రమే చెప్పారని B. B.C. వాడు చెప్పాడట. యజ్ఞం గురించిన రచయిత వివరణ ఇది.

               "యజ్ఞం అన్న మాటకు మూడు అర్థాలు ఉన్నాయి. ఒకటి.. దేవపూజ, రెండు దానం, మూడు సంగతీకరణం. సంగతీకరణం అంటే సంఘటనమని అర్థం. ధర్మాన్ని పాటించే ప్రజాసమూహ ప్రయోజనం కోసం సంఘటితం చేయడమే యజ్ఞమని అన్నారు. ఈ యుగంలో సంఘటనానికి మించిన శక్తివంతమైనది లేదు" -రామం భజే శ్యామలం - 27వ వ్యాసం పుట 210

               మన వ్యవహారంలో చెప్పాలంటే లోక కల్యాణం కోసం అని అర్థం మరి లోక కల్యాణంలో.. ప్రజా సమూహ ప్రయోజనాలు నెరవేరాలనడంలో సామాజిక విలువలు లేవు అంటే అంతకంటే అవివేకం లేదు.

  1. శ్రీరాముడు-కరుణ:

రాముని జీవితకాలంలో ఉన్నదంతా కరుణే. యుద్ధరంగంలో రాక్షసులు చనిపోతుంటే ‘‘ఒక్కడు చేసిన నేరానికి ఇందరిని బలి చేయాల్సి వస్తుందే" అని ఆయన బాధపడతాడు. కైక, భరతుడు లక్ష్మణుడు, గుహుడు, శబరి, సుగ్రీవుడు, జటాయువు, సంపాతి... ఇలా రాముడు దయ చూపని జీవులెవరు? అని రచయిత ప్రశ్నిస్తారు.

               ఒక వీరుడు మరణిస్తే అతని అనుచరులు అతని మరణం నుండి ప్రేరణ పొందుతూ, అంత్యక్రియలు చేస్తున్న వర్ణన ఇది. ఇది ఋగ్వేదంలోని దశమమండలంలో ఉంది.

                     ‘‘వర్చస్సు కోసం, బలం కోసం, శక్తి కోసం

                     ఈ మృతవీరుని హస్తం నుండి ధనుస్సు గ్రహిస్తున్నాను

                     మీరూ, మేమూ, మనం విశ్వమంతా నిండిన వైరిచక్రాన్ని అతిక్రమిస్తాము.

                     ఇతన్ని మాతృభూమి ఒడిలోకి అధిక వర్చస్సును ప్రసరింపజేసేందుకు చేరుస్తున్నాం

                     శిరీష కోమలి ఈ మహిషి ప్రతీకారం జరిగే దాకా విచ్ఛిత్తి నుండి రక్షించనీ

                     పృథివీ ఇతన్ని బలంగా నొక్కకు, ఊపిరి పీల్చుకోనీ సులభంగా సుకుమారంగా ప్రవేశించనీ

                     అవనీ! తల్లి బిడ్డను పొత్తిళ్లలో ఒదిగినట్లు ఒదించుకో... - ఋగ్వేదం (18-9,10,11) - తెలుగు అనువాదం  - శ్రీమాన్‌ కోవెల సుప్రసన్నాచార్య - భావుక సీమ, పు. 127.

 

               ఇది కూడా బుద్ధుని తర్వాతే వ్రాశారనే వారికి ఏం చెబుతాం? అని ప్రశ్నిస్తారు రచయిత.

౩౦. కులం, మతం, మనపై సూపర్‌ ఇంపోజ్‌ చేయబడినవే !

               మన దేశంలో ‘‘కులం" అనే పదాన్ని వంశాన్ని రెఫర్‌ చేసేందుకే ఉపయోగించారు. రఘుకులదీపకుడు, యదుకులతిలకుడు ఇలాంటి ప్రయోగాలన్నీ దాన్నే బలపరుస్తాయి. అది సమూహపరంగా వాడబడింది. ఇక్ష్వాకు వంశం, రఘువంశం, చంద్రవంశం, సూర్యవంశం ఇలా డైనాస్టీ లనే సూచించారు. మనం చేసే వృత్తులు, కుటుంబ పరంగా, ఫలానా వృత్తి చేసేవాడిని అలా పిలవడమన్నదిలేదు.

  1. హార్బర్ట్‌ రిస్లే:

               ఈయన ఒక ఆంత్రోపాలజిస్టు. అంటే మానవ పరిణామ సిద్ధాంత శాస్త్రవేత్త. 1901లో మన దేశంలో జనాభా లెక్కల అధికారి. భారత సమాజాన్ని సామాజికంగా విడగొట్టిన మహానుభావుడు ఇతడే అంటారు రచయిత. ‘కులం’ అన్న పదాన్ని ఇతడే మొదటవాడాడు. మొఘలులకాలంలో కూడా ఈ పదం అంత వ్యాప్తిలో లేదు. గ్రామం ఏర్పడడానికి 18 వృత్తుల వారిని తీసుకొచ్చి, వారికి భూమి, ఇతర సదుపాయాలు కల్పించేవారని తెలుస్తూన్నది. ఇలా అనేక వృత్తులవారు (కులాలు కాదు) కలి స్తే గ్రామం అవుతుంది. ఒకరిమీద ఒకరు ఆధారపడేవారు. ఒకరి కోసం ఒకరు జీవించేవారు. మనం ఆదర్శంగా భావించే ఇంగ్లీషు సమాజంలో వృత్తుల పేర్లను వ్యక్తులకు పెట్టుకుంటారు. టైలర్‌, గార్డినర్‌, అలాగ.

                               ‘‘నైపుణ్యాన్ని బట్టి పని తప్ప... కుటుంబాన్ని

                               బట్టి వృత్తి అన్న మాటే లేదు.’’

               హార్బర్ట్‌ రిస్లే చేసిన దారుణమైన పని, తాను ‘సృష్టించిన’ 2378 కులాలను గెజిట్‌లో ప్రచురించేటప్పుడు, అకారాదిక్రమంలో ఆరోహణ విధానంలో’ వ్రాయలేదు. ఫలానా కులం పెద్దది, ఫలానా కులం చిన్నది అంటూ ఒక అక్రమమైన క్రమాన్ని ఏర్పాటు చేశాడు. సమాజంలోని గౌరవమర్యాదలను అంతరాలుగా చూపించాడు. అవి ఈనాడు తొలగించడానికి వీలులేని రాచపుండుగా మారాయి అంటారు కోవెల.

                               ‘‘చాతుర్వర్ణం మయాస్పష్టం గుణకర్మ విభాగశః"

                               ‘‘జన్మనా జాయతే శూద్రః, కర్మణాజాయతే ద్విజః"

               మనిషి తాను చేసిన సత్కర్మలవల్ల, తనకున్న సద్గుణాలవల్ల మాత్రమే బ్రాహ్మణుడు అవుతాడని మన శాస్త్రాలు ఘోషి స్తు తున్నాయి.

               మన సనాతన ధర్మం ఏ కులాన్నీ తక్కువ చేయలేదు. ధర్మవ్యాధుడు మాంసం కొట్టు నడుపుకునేవాడు. ఆయన కౌశికునికి, ధర్మసూక్ష్మాలు బోధించాడు. సాక్షాత్తు శ్రీమన్నారాయణుని అవతారమైన శ్రీరామచంద్రుని చరితను గ్రంథస్థం చేసిన వాల్మీకి బోయవాడు. ఆయనను మనం ‘‘వాల్మీకి మహర్షి" అని పిలుస్తాం. శ్రీకృష్ణపరమాత్మ గొల్ల వారి కుటుంబంలో జన్మించాడు. అరుంధతీ దేవి వశిష్టుని అర్ధాంగిగా సప్తర్షి మండలంలో ఆయన సరసన స్థానాన్ని పొందింది. ఆముక్త మాల్యద కావ్యంలో వచ్చే ‘మాలదాసరి’ మహావిష్ణుభక్తుడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో దృష్టాంతాలున్నాయి. జ్ఞానానికీ, కులానికీ ఏమాత్రం సంబంధంలేదని వీరందరూ నిరూపించారు.

సంస్కృత భాష

                 ‘‘జనని సమస్త భాషలకు సంస్కృత భాష ధరాతలంబునన్‌"

               పై సూక్తిని రచయిత సోదాహరణంగా నిరూపించి చూపారు.

               ప్రోటో ఇండో యూరోపియన్‌ భాష, బాల్టోస్లేవిక్‌, జర్మనిక్‌, సెల్టిక్‌, ఇటాలిక్‌, హెలెనిక్‌, ఇండిక్‌, ఇరానియన్‌ భాషలకు మూలం. కాని వీటన్నింటిలో సంస్కృతం ఉంది. అన్ని భాషలు సంస్కృతంలో ఇముడుతాయి. 1818లో రాస్మక్‌ క్రిస్టియన్‌ రాక్‌ అనే శాస్త్రవేత్త సంస్కృతం గ్రీకు భాషల్లోని పదాలను మరింత లోతుగా విశ్లేషించాడు. 1816లో ఫ్రాంచ్‌చాప్‌ సంస్కృతం, పర్షియన్‌ గ్రీక్‌, లాటిన్‌, అధువేనియన్‌, ఓల్డ్‌స్లేవిక్‌, గోధిక్‌, జర్మన్‌ భాషల మధ్య దగ్గరి లక్షణాలను దర్శింప చేశాడు. 1833లో వీటన్నింటికి పనికి వచ్చే వ్యాకరణాన్ని కూడ ఆయన ప్రచురించాడు. 1822 లో జేకబ్‌ గ్రిమ్‌ ఇండో యూరోపియన్‌ లాంగ్వేజెస్‌లోని ధ్వని మార్పును విశ్లేషించాడు. ఇందులోనూ ఆయన సంస్కృత ప్రాధాన్యాన్ని గుర్తించాడు.

‘‘ఒకవేళ మనం ఈ భాషలతో ఒక మ్యాట్రిక్స్‌ రాస్తే (వాటి మధ్య ఉన్న సామీప్యతను బట్టి), మూలంగా ప్రోటో ఇండో యూరోపియన్‌ లాంగ్వేజ్‌కు బదులుగా, సంస్కృతాన్ని గనుక వినియోగించి కొత్త మ్యాట్రిక్స్‌గా ట్రాన్స్‌ఫార్మ్‌ చేస్తే, మ్యాధమాటిక్స్‌ పరంగా వచ్చే ఫలితాలు నూటికి నూరు పాళ్లు కరెక్ట్‌ అవుతాయి అంటే సంస్కృతం వీటన్నిటికీ మూలభాషగా తేలుతుంది.’’

                                            - రామం భజే శ్యామలం-28వ వ్యాసం, పుట 222, 223

  1. జన్యు అధ్యయనాలు, వలసలు:

               ఆర్యుల దండయాత్ర అనే సిద్ధాంతం మన దేశ చరిత్రను ధ్వంసం చేసింది అంటారు రచయిత. దీనివల్ల భారతీయులు జౌత్తరాహులు, దాక్షిణాత్యులుగా విడగొట్టబడ్డారు. ఆర్యులు, ద్రావిడులుగా ముక్కలయ్యారు.

               2013లో CCMB (సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యూలర్‌ బయాలజీ) అన్న హైదరాబాదులోని ఒక గొప్ప సంస్థ ఒక డాక్యుమెంట్‌ను అమెరికన్‌ జర్నల్‌ ఒక దానిలో విడుదల చేసింది. అది హ్యూమన్‌ జెనిటిక్స్‌పై. ప్రియామూర్జాని, ప్రొఫెసర్‌ కుమారస్వామి తంగరాజ్‌ అనే ఇద్దరు CCMB సైంటిస్టులు భారతదేశవ్యాప్తంగా కొన్ని వేల మంది ప్రజల D.N.A. శాంపిల్స్‌ తీసుకొని పరిశోధన చేశారు. x, y క్రోమోజోములను వారు పరిగణనలోనికి తీసుకోలేదు. వారి మూలాలు, వారి పూర్వీకులపై వారు లోతైన పరిశోధనలు జరిపారు.

               వీరి పరిశోధన ప్రకారం ఉత్తర, దక్షిణ భారతీయులు సుమారు 60 వేల ఏండ్ల నుండీ ఉంటున్నట్లు రుజువైంది. ఇద్దరి పూర్వీకులు ఒకరే అన్నట్లు నిరూపణ అయింది. 2000 B.C.. వరకు వీరు ఒక్క చోటే నివసించారు. సజాతి వివాహాలు జరిగాయి.

               కాని యూరోపియన్ల వాదన వేరుగా, విచిత్రంగా ఉంది. వీరంతా 15000 B.C. లో మధ్య ఆసియాల నుంచి వలస వచ్చారట.

               ఈ జన్యు అధ్యయనాలు అత్యంత శాస్త్రీయంగా జరుగుతాయి అంటారు రచయిత. వివిధ వ్యక్తుల నుండి శాంపిల్స్‌ సేకరిస్తారు. ముఖ్యంగా లాలాజలాన్ని, దాన్ని శుభ్రపరచి దాన్నుండి సీక్వెన్సింగ్‌ చేయడం ద్వారా డేటాను తెలుసుకుంటారు. దాని నుండి మ్యాధమాటికల్‌ అనలిసిస్‌ చేస్తారు. తర్వాత SQP విధానం ద్వారా అన్ని రకాల గణాంకాలను కనుగొని, వాటి ఆధారంగా జన్యు ఉత్పరివర్తనాల కాలాన్ని అంచనా వేస్తారు.

               "ఈ పరిశోధనలన్నింటిని జాగ్రత్తగా పరిశీలిస్తే భారతదేశంలోకి, ఏ యుగంలోనూ, ఏ దశలోనూ వలసలు వచ్చినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవు. భారతదేశంలోకి జన్యు ప్రవాహం జరిగినట్లు తేలలేదు.’’                    - రాజంభజే శ్యామలం - 29వ వ్యాసం, పుట 228

               ఆర్యుల, ద్రావిడుల జన్యువు ఒక్కటే, వారు వీరు వేరు కాదు. అందరం ఒక్కటే, మన D.N.A. లో గుణాత్మకమైన నాగరికత సమాజపు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తాయి. అతి ప్రాచీనతకు సాక్షాలైన (ANTIQUES) వస్తువులు లభ్యమైన దీనిని నిరూపించాయి. అర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా పరిశోధనలు దీనికి మరింత ఊతమిచ్చాయి.

ఉదా :

  • కేరళలోని ఎడక్కల్‌ గుహల్లో తొమ్మిది వేల సంవత్సరాల నాటి చేతి వ్రాతలు, బొమ్మలు కనిపిస్తాయి. (గుర్రం, రౌతు, కూజా పట్టుకున్న వ్యక్తి)
  • ఈ సంకేత చిత్రాలు హరప్పాలో కూడ కనిపిస్తాయి. దీన్నిబట్టి కేరళ, హరప్పాల మధ్య సాంస్కృతిక సంబంధం అవగతమౌతుంది.
  • మొహంజోదారో త్రవ్వకాల్లో రెండు ముద్రలు (420,430నం) గురించి ప్రొపెసర్‌ అభయంకర్‌ 1993లో ఒక బులెటిన్‌ విడుదల చేశారు ఇవి జ్యోతిష విజ్ఞానాన్ని సూచిస్తున్నాయి.
  • మధురై చాలా సంపన్న ప్రాంతం, మధురైకి సరఫరా ఐన అనేకానేక వస్తువులు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు వచ్చిన మార్గంపై పురాతత్త్వ వేత్తలు అధ్యయనం చేశారు. ‘‘కిజాది" అన్న ప్రాంతం మధురైకి ప్రధాన వ్యాపార రవాణా మార్గంగా తేలింది. ఈ ప్రాంతంలో 4.5 మీ. లోతు వరకు త్రవ్వకాలు జరిపారు. అక్కడ దొరికిన వస్తువులు కార్బన్‌ డేటింగ్‌ కొరకు అమెరికాలోని ప్లోరిడాకు పంపారు. అవి (క్రీ.పూ. 300 సం॥ నాటివని తేలింది.

               2017లో మన ఆర్కియలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నిపుణులు తామే కార్బన్‌ డేటింగ్‌ నిర్వహించారు. ఆ వస్తువులు 2200 సం॥ క్రిందటివని తేల్చారు. ఫ్లోరిడా వారి లెక్క తప్పు! ఈ కిజాదీ సమాచారం ASI తొక్కిపెట్టింది!

  • రోమన్‌ సామ్రాజ్యంతో సముద్ర వర్తకం జరిపిన ఓడరేవుల వివరాలు ‘‘పెరిప్లస్‌ ఆఫ్‌ ఎరిత్రియన్సీ" అన్న ఒక Port Sailors Document లో ఉన్నాయి. ఇందులో తమిళనాడులోని ‘‘అరికమేడు" రేవు ప్రస్తావన ఉన్నది. అరికమేడులో జరిపిన త్రవ్వకాల్లో, ‘‘మోర్టిమర్‌ వీలర్‌" అనే శాస్త్రవేత్తకు అగస్టస్‌, సీజర్‌కు సంబంధించిన ఆనవాళ్లు దొరికాయి.

                                                   - రామం భజే శ్యామలం    - 29వ వ్యాసం, పుటలు 230-233

 ఈ విధంగా దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లి త్రవ్వకాలు జరిపినా వేల సంవత్సరాల నాటి అవశేషాలు, నివాసస్థలాలు బయట పడ్డాయి. పురాణాలను చరిత్రగా కాక, కేవలం కథలుగా చెప్పడం వల్ల మన వారసత్వంపై నీలనీడలు కమ్ముకున్నాయి.

  1. ఉత్తర రామాయణం- ఒక అభూతకల్పన:

               శ్రీరాముడిని తక్కువ చేసి చూపేందుకు, ఆయన వ్యక్తిత్వాన్ని చంపేందుకు కావలసినంత ‘స్టఫ్’ ఉత్తర రామాయణంలో ఒక పద్ధతి ప్రకారం జరిగిందంటారు రచయిత కోవెల ఉత్తర రామాయణం అనేది ఒక కల్పన అనడానికి ఈ క్రింది ఆధారాలు చూపుతున్నారు.

  • వాల్మీకి రామాయణం యుద్ధకాండలో, శ్రీరామపట్టాభిషేకంతో ముగుస్తుంది ఫలశృతి కూడ ఉంది.
  • జ్ఞాన్‌ పీఠ పురస్కార గ్రహీత కవి సామ్రాట్‌ విశ్వనాథ వారు కూడ తమ రామాయణ కల్ప వృక్షాన్ని ‘‘యుద్ధకాండతోనే ముగించారు. ఆయన ఉత్తర రామాయణం జోలికి పోలేదు.
  • ఉత్తర రామాయణంలోని సీతా పరిత్యాగం, శంబూకవధ లాంటి వృత్తాంతాలు ‘‘సిల్లీ"గా అనిపిస్తాయి. ఏ ఒక్క కథకూ పొంతన ఉండదు.
  • వాల్మీకి రామాయణానికి సంస్కృతంలో మూడు వ్యాఖ్యానాలు లభిస్తున్నాయి. వాటిల్లో అతి ప్రాచీనమైనది గోవిందరాజ్‌ వ్యాఖ్యానం. అందులో ఎక్కడా ఉత్తర కాండను కనీసం స్పృశించనైనా లేదు.
  • రామాయణానికి ప్రాంతీయ భాషల్లో వచ్చిన అనువాదాలు.

               1) కంబ రామాయణం (12వ శతాబ్దం) దీనిలో యుద్ధకాండవరకే రామాయణం ఉంది.

               2) రంగనాథ రామాయణం (క్రీ. శ. 1380) ఇది తెలుగు అనువాదం. ద్విపదకావ్యం. ఇది కూడ పట్టాభిషేకంతో ముగుస్తుంది.

               3) తోరవే రామాయణం (15వ శతాబ్దం) రామ పట్టాభిషేకం, సుగ్రీవాది ప్రముఖులకు రాముడు వీడ్కోలు పలకడంతో ఈ కన్నడ అనువాదం ముగుస్తుంది.

  • ‘‘ది ఇలియడ్‌ ఆఫ్‌ ది ఈస్ట్‌" అన్న పేరుతో ఫ్రెడ్రికా రిచర్డ్‌ సన్‌ రామాయణాన్ని ఇంగ్లీష్‌లో వ్రాశారు. మ్యాక్‌ మిల్లర్‌ వారు దీన్ని 1870లో ప్రచురించారు. దీనిలో కూడ ఉత్తర రామాయణం లేదు.
  • 1874లో రాల్ఫ్‌ టి. హెచ్‌ గ్రిఫిత్‌ కూడ ఇంగ్లీష్‌ అనువాదం చేశాడు. ట్రబ్నర్‌ అండ్‌ కో లండన్‌, లాజరస్‌ అండ్‌ కో బనారస్‌ వారు దీనిని ప్రచురించారు. చివరగా గ్రిఫిత్‌ ఇలా రాశారు.

                                         "The Ramayana ends, epically

                                    complete, with the triumphant

                                    return of Rama and his resqued

                                    Queen to Ayodhya....."

  • తులసీదాస్‌ మహరాజ్‌, వాల్మీకి తర్వాత అంతటివాడని పేర్కొన్నారు, కోవెల ఆయన జీవితకాలం 1511-1623 గా నిర్ధారణ అయింది. ఆయన రాసిన ‘‘రామ చరిత మానస్‌"లో ఉత్తరకాండలో కనిపించే ఏ కథనాలూ లేవు.
  • ఉత్తరకాండలోని తొలిసర్గలో వివిధ ఋషులు వచ్చి, ఇంద్రజిత్తు, కుంభ కర్ణాదుల పరాక్రమాన్ని రాముని ఎదుటే పొగడుతారు. అదృష్టవశాత్తు నీవు వారిని చంపగలిగావని అంటారు! ఇందులో ఏమైనా లాజిక్‌ ఉన్నదా?

               ‘‘రామోవిగ్రహవాన్‌ ధర్మః" ఈ మాట అన్నది సీతాపహరణానికి ముందు మారీచుడు. రావణునితో! ఆయన ధర్మం ఏనాడూ తప్పలేదు. శంబూకవధ ద్వారా రాముడిని దళితవ్యతిరేకిగా చిత్రీకరించారు. రాముని అధర్మపాలనలో పిల్లలు అకాలమరణాలు పొందుతున్నారట. శూద్రుడొకడు తపస్సు చేస్తున్నాడు. అది ధర్మ విరుద్ధం. వెంటనే రాముడు బయలుదేరి తలకిందులుగా తపస్సు చేస్తున్న శంబూకుడనే శూద్రుడిని కత్తితో నరికి చంపాడు. దానివల్ల అతనికి దివ్యలోకాలు లభించాయి. శంబూకుని వివరణ కూడ కనీసం విలేదట రాముడు.

               ‘‘రాముడి ఈ విపరీత వ్యక్తిత్వం ఉత్తరకాండలో మాత్రమే కనిపిస్తుంది. వర్ణాశ్రమ ధర్మాలు, శంబూక వధ సందర్భంగా మాత్రమే ప్రస్తావనకు వస్తాయి. ఈ కథను రాముడికి రచయిత వాల్మీకికి ఎందుకు ఆపాదించారు?’’

               గుహుడు, శబరి, వీళ్లంతా శూద్రులే. వారిని రాముడు అక్కున చేర్చుకున్నాడు. శబరి కూడ తపశ్శాలియే మరి ఆమెను కూడ చంపాలి కదా! దళితులు, శూద్రులు తపస్సు చేయకూడదని మన సనాతన ధర్మంలో ఎక్కడా లేదే? అని ప్రశ్నిస్తారు రచయిత. హనుమంతుడు వానరుడు. సాక్షాత్తు సూర్యభగవానుడి దగ్గర సమస్త విద్యలను, చతుర్వేదములను అభ్యసించినవాడు వ్యాకరణ వేత్త. వానరుడైన ఆంజనేయుని తన ఆత్మ బంధువుగా స్వీకరించినాడు రాముడు. అలాంటివాడు శంబూకుడిని ఎందుకు చంపుతాడు?

               సీతా పరిత్యాగం కూడ హేతుబద్ధంగా ఉండదు. శంబూకుని తపస్సు వల్ల గ్రామాల్లో పిల్లలు అకాల మరణాలు పొందుతున్నారన్న వాళ్లు, లంకలో అన్ని రోజులున్న సీతను ఏలుకున్నాడని నిందలు వేస్తారా? ఎవడో వాగిన మాటలను విని భార్యని అడవుల్లో వదిలేస్తాడా? సీతారాములు ఆదర్శ దంపతులుగా మనం అనాది నుంచి వారిని ఆరాధిస్తున్నాం. ఉత్తరకాండను కల్పించి మన భావాలను దెబ్బతీయడానికి కుట్ర జరిగింది.

  1. ఆత్మానం మానుషం మన్యే రామం దశరధాత్మజం:

               ఈ విషయాన్ని యుద్ధకాండలోని 117వ సర్గలో శ్రీరాముడే స్వయంగా చెప్పుకున్నాడు. "నన్ను నేను మానవుడిగా భావించుకుంటున్నాను" ఆయన దేవుడుగా ఎప్పుడూ అద్భుతాలు చేయలేదు. మహిమలు చూపలేదు. మనిషిగా సుఖ దుఃఖాలను, కోపావేశాలను, ప్రేమానురాగాలను ప్రదర్శించాడు. ఆమెకు అగ్ని పరీక్ష పెట్టి, ఆమెను నిష్కళంకగా, తేజోమూర్తిగా నిరూపించాడు. కోసల సమాజం ఇటువంటి ప్రాయశ్చిత్తాలను నిష్ఠగా ఆచరించే సమాజం. అది అగ్ని పునీతయైన సీతపై అపవాదు ఎందుకు మోపుతుంది? చెప్పుడు మాటలు విని రాముడు ఆమెను ఎందుకు పరిత్యజిస్తాడు? అదీ పదకొండు వేల సంవత్సరాల తర్వాత!

               ఫెమినిస్టులకు ఈ ఉత్తరకాండలో రాముడిని తిట్టడానికి సీతా పరిత్యాగమనే బ్రహ్మాస్త్రం దొరికిందంటారు రచయిత.

  1. సుగ్రీవుని అట్లాస్‌:

               సీతాదేవిని వెతకడానికి వానరులందరినీ నలుదిక్కులా పంపుతున్నప్పుడు, సుగ్రీవమహారాజు వారికి దిశానిర్దేశం చేస్తూ, భరతఖండంలోని నాలుగు దిక్కులలోని ప్రదేశాలను వర్ణిస్తాడు. అవన్నీ ఈ రోజు కూడ అతంటిక్‌గా కొన్ని మార్పులతో ఉన్నాయి.

తూర్పువైపు :

               ఇవి ఆస్ట్రేలియా నుంచి దక్షిణ అమెరికా దాకా విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతాంల్లో భారతీయుల జీన్స్‌ విస్తరించి ఉన్నాయి. సుగ్రీవుడు తూర్పున పెరూ, చిలీ దాకా జియోగ్రఫీని, మైలో పోస్టులను సంపూర్ణంగా వివరించాడు. తూర్పుగా వెళ్లిన వానర సేకు నాయకుడు వినతుడు. అతనికి సుగ్రీవుడు గంగ సరయు కౌశికి, యమున, సరస్వతి, సింధూ నదులను, శోణనదమును, మహీ, కాలమహీనదిని, బ్రహ్మమాల, విదేహి, మాళవ, కాశీ, కోసల, పుండ్ర, అంగ దేశములను గురించి చెప్పిన వాటిల్లో సీతమ్మను వెతకమన్నాడు.

               సుగ్రీవుడు వర్ణించిన బంగారు గనులు, ‘‘పారుచాప్‌" అని పిలవబడే చోటు ఇప్పటికీ థాయిలాండ్‌లో ఏడు ద్వీపాలున్నాయి. వాటికి సంబంధించిన రాజముద్రల్లో సంస్కృత పదాలు ఇప్పటికీ కనిపిస్తాయి.

               ‘‘కైలాస పర్వతమువలె ఉన్న గరుత్మంతుడి గృహము"ను సుగ్రీవుడు ప్రస్తావించినాడు. ఇది అస్ట్రేలియాలోని క్వీన్స్‌ల్యాండ్‌కు 120 కి.మీ. దూరంలో ఉన్న గ్రింపీ పిరమిడ్‌.   - రామంభజే శ్యామలం, - 41వ వ్యాసం పుటలు 293-302

దక్షిణం వైపు సుగ్రీవుని అట్లాస్‌:

               ఇటువైపు వెళ్లిన వానరులకు నాయకుడు వాలి కుమారుడైన అంగదుడు. సుగ్రీవుడు అతని ముందుగా వింధ్య పర్వతము గురించి చెప్పినాడు. నర్మద, గోదావరి, కృష్ణవేణి, మహానదులను, మేఖల, ఉత్కళ దేశములను, దశార్ణ, అబ్రవంతి, అవంతి నగరములను విదర్భ, కళింగ, ఆంధ్ర, చోళ, పాండ్య, కేరళ దేశములను, దండకారాణ్యమును ప్రస్తావించినాడు. ఆయన వింధ్య పర్వతాలనుండి క్రిందనున్న అంటార్కిటికా వరకు వివరించినాడు.

               మలయ పర్వత శ్రేణులు, కర్నాటకలోని అరేబియా సముద్రతీరం వెంబడి, గుజరాత్‌ తీర ప్రాంతం చివరలో ప్రారంభమై మంగుళూరు నుంచి కేరళ మీదుగా తమిళనాడులోని తిరునల్వేలి ప్రాంతంలో ముగుస్తున్నాయి. సుగ్రీవుడు చేసిన మనోహరమైన ఆ ప్రాంతపు ప్రకృతి వర్ణన ఈనాటికీ ఆ చోట్లలో కనువిందు చేస్తున్నది.

               దక్షిణాన చిట్టచివర ఉన్నది అంటార్కిటికా. ఇక్కడ వాతావరణం చాలా భయంకరంగా ఉంటుంది. మధ్యలో మైనస్‌ 89.6 డిగ్రీలు ఉంటుంది. అందుకే దానిని యమస్థానమని, అక్కడికి వెళ్లొద్దని సుగ్రీవుడు చెప్పాడు.          - రామం భజే శ్యామలం - 42వ వ్యాసం, పుటలు 303-311

పశ్చిమం వైపు సుగ్రీవుని అట్లస్‌:

               పశ్చిమాన ఆలప్స్‌ వరకు సుగ్రీవుడు ఇందులో విశ్లేషిస్తాడు. ఈ దిక్కు వర్గానికి నాయకుడు సుషేణుడు. ఇందులో సౌరాష్ట్ర బాహ్లిక్‌ దేశాలను ప్రస్తావించాడు. ఎక్కువ సముద్రమే ఉన్నదన్నాడు. సముద్రంలోని ద్వీపాలను వర్ణించాడు. సౌరాష్ట్రం ప్రస్తుతం గుజరాత్‌లో ఉంది. ‘‘చంద్ర చిత్త" రాజస్థాన్‌లో ఉంది. బాహిక్‌ దేశం ఆఫ్ఘనిస్తాన్‌లోని ప్రస్తుత బాల్ప్‌ ప్రొవిన్స్‌.

               ‘‘సోమగిరి" ప్రస్తుత పాకిస్తాన్‌లోని లక్కీ పర్వతశ్రేణుల్లో ఉంది. ‘‘పరియాత్ర", పాకిస్తాన్‌ ఆఫ్ఘనిస్తాన్‌ల మధ్య దక్షిణం నుంచి పశ్చిమం వైపు విస్తరించిన హిందూ కుష్‌ పర్వతశ్రేణి.

               ‘వరాహపర్వతం’ ప్రస్తుత టర్కీలోని ‘టారస్‌. ఇక్కడే టైగ్రస్‌ నది ప్రవహిస్తుంది.

               ‘‘మేఘవంతం" అనే పర్వతం స్లోవేకియాలో మొదలై రొమేనియా మీదుగా విస్తరించి ఉంది. ఈ శ్రేణులను బంగారు పర్వతాలుగా సుగ్రీవుడు అభివర్ణించాడు. వాటిని ఇప్పుడు కార్పథియన్‌ పర్వత శ్రేణులుగా పిలుస్తున్నారు.

               తర్వాత మేరు పర్వతం. ఇది ఇప్పుడు టాంజానియన్‌ పర్వతంగా పేరుగాంచింది. ఇందులో అగ్ని పర్వత భాగం కూడ ఉంది. దీనిని ప్రస్తుతం స్ట్రాటో వాల్కెనో అని పిలుస్తారు. చివరిది అస్తాద్రి అంటే ఆల్ప్స్‌. దీని పరిధిలో ఎనిమిది యూరప్‌ దేశాలున్నాయి. అవి ఫ్రాన్స్‌, స్విట్జర్‌ల్యాండ్‌, మొనాకో, ఆస్ట్రియా, లైటెన్సిటియన్‌, జర్మనీ, స్లోవేనియా మొ॥ దీనిపైనే సూర్యాస్తమయం జరుగుతుందని సుగ్రీవుడు చెప్పాడు. - రామం భజేశ్యామలం-43వ వ్యాసం పుటలు 312-319

సుగ్రీవుని ఉత్తర దిక్కు వర్ణన:

               దీనికి నాయకుడు శతబలుడు. ఈ వర్ణన కిష్కింధ కాండలోని 43వ సర్గలో ఉంది.. దీనిని విని శ్రీరామచంద్రుడే ఆశ్చర్యపోయాడట!

               సుగ్రీవుని ప్రస్తావన ‘మ్లేచ్ఛులు’వస్తారు. వీరు పశ్చిమోత్తరం నుంచి మన దేశంలోకి వలస వచ్చారు. వీరు పాళి, ప్రాకృత భాషలు మాట్లాడేవారు. తర్వాత సింధీ, కాశ్మీరీ భాషలను కూడా.

               అప్పటి ‘పులింద’రాజ్యం, ఇప్పటి మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌ ప్రాంతం. తర్వాత ‘శూరసౌన’ రాజ్యం. ఇది ప్రస్తుతం యుపిలోని బ్రజ్‌. ‘కురు రాజ్యం’ ప్రస్తుత హర్యానాలోని చండీగఢ్‌కు సమీపంలో కొంచెం దిగువన ఉంటుంది. ‘ప్రస్థల’ రాజ్యం ఇప్పటి పంజాబులోని ‘జలంధర్‌’.

               దేవసఖ పర్వతం ప్రస్తుత నేపాల్‌లో ఉంది. ఉత్తరాన కైలాస పర్వతాన్ని సుగ్రీవుడు అద్భుతంగా వర్ణించాడు. అక్కడ జీవరాసులు నివసించలేవంటాడు. కైలాస్‌ దగ్గర ఆక్సిజన్‌ శాతం అతి తక్కువగా ఉంటుందనేది విదితమే. దీనికి 177 కి.మీ. దూరంలో అలకాపురి గ్రేసియర్స్‌ ఉన్నాయి. దీనినే సుగ్రీవుడు, కుబేరుని అలకాపురిగా పేర్కొన్నాడు. మానస పర్వతం ప్రస్తుతం నేపాల్‌లో ‘మనసలు’గా పిలువబడుతూ ఉంది. ‘సోమగిరి’ బంగారు వర్ణంలో ఉంటుంది. ఇది ఆర్కిటిక్‌ ప్రాంతంలో ‘కారంనోస్జ్’ అనే పేరుతో ప్రస్తుతం ఉంది.’ - రామం భజేశ్యామలం- 44వ వ్యాసం పుటలు 320-326

               ఇవన్నీ సుగ్రీవుడికి ఎలా తెలిశాయి!

               తన అన్న వాలి నుంచి తప్పించుకొనే క్రమంలో తాను నలుదిక్కులా తిరిగానని సుగ్రీవుడే చెప్పుకున్నాడు. ఈ వివరణ లాజికల్‌గా ఉంది. సుగ్రీవుడి అట్లస్‌ సంపూర్ణ స్వరూపం ఇది. అన్నింటినీ ఐడెంటిఫై చేయలేము కాని, దూరాలు, భారతీయ ప్రాచీన చరిత్రకారులు చెప్పిన Facts and figures ను బట్టి, ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయని నిర్ధారించవచ్చు.

 

  1. రామసేతు:

               ధనుష్కోటి నుండి శ్రీలంకలోని మన్నార్‌ వరకు 36 కి.మీ. మేర సేతువు కనిపిస్తుంది. ఆకాశం నుంచి చూస్తే అది నక్షత్రాకారంలో ఉంది. మహేంద్ర గిరి సమీపంలో సముద్రం లోతు తక్కువగా ఉన్న చోట సేతువు నిర్మించమని సేతువు Architect ఐన నలునికి సముద్రుడే సూచించాడు. ఇది మానవ నిర్మితమైన ఆనకట్ట అని ‘‘నాసా" లోని శాస్త్రవేత్తలు ఋజువు చేశారు. 2017 డిసెంబరు 11న సైన్స్‌ ఛానెల్‌ దీనిమీద స్పెషల్‌ డాక్యుమెంటరీ ప్రసారం చేసింది.

                                         ‘‘రామసేతు నూరు యోజనాల పొడవు

                                    పది యోజనాల వెడల్పుగా నిర్మించినారు.

                                    దీనిని కట్టుటకు ఐదు రోజులు పట్టింది.’’                     - యుద్ధకాండ

               ‘‘సేతు నిర్మాణం ఋజు మార్గంలో జరగలేదు. సముద్రంలో ఎక్కడెక్కడ లోతు తక్కువగా ఉందో అక్కడక్కడ జిగ్‌జాగ్‌గా నిర్మించబడిరది. ఈ లెక్కన మహేంద్రగిరినుంచి సౌత్‌ టిప్‌కు... అక్కడి నుంచి రామేశ్వరం.. ధనుష్కోటి మీదుగా మన్నార్‌ దాటి లంకలోకి ఇక్కడ ఉన్న మట్టికీ, ప్రస్తుతం సేతువు మీద ఉన్న మట్టికీ చాలా పోలిక ఉంది. యోజన ప్రమాణాన్ని సరిగ్గా తేల్చడంతోపాటు ఓషనోగ్రఫీ ప్రకారం సముద్ర మట్టంలో వచ్చిన మార్పులు. భూమి పొరల్లో వచ్చిన మార్పులు లెక్కలోకి తీసుకుని ఒక స్పష్టతకు రావాలి. లంక ఒక ద్వీపం. దానికో ఆర్డినేట్లు చెప్పుకోదగ్గ మార్పులకు లోనవుతాయి. - రామం భజే శ్యామలం    - 45వ వ్యాసం, పుటలు 333

  1. రావణలంకే... నేటి శ్రీలంక:

               1988లో నవంబరు 2`4 తేదీలలో ‘ధార్వాడ్‌లో ఇండియన్‌ హిస్టరీ కాంగ్రెస్‌ సదస్సులలో కె. రామకృష్ణారావుగారు సమర్పించిన పరిశోధనా పత్రంలో 16 మంది రచయితలు, వారి రచనల్లో లంకను ప్రతిపాదించిన ప్రదేశాన్ని ప్రతిపాదించారు.

               ‘వాస్తవ రామాయణాన్ని రచించిన ప్రముఖ చరిత్రకారుడు. పివీ. వర్తక్‌ ఆరు ప్రాంతాలను ప్రతిపాదించారు. మధ్యప్రదేశ్‌ శాస్తి, ముంబై ఒరిస్సా, గుజరాత్‌/మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌ డాక్టర్‌ సంకాలియా కూడ లంక మన దేశంలోని ఒక ప్రాంతమేనన్నారు.

               శ్రీలంకను మొదట శిలా ద్వీప మని పిలిచే వారు అరబ్బులు దీనిని ‘సెరిండిబ్‌’ అన్నారు యూరోపియన్లు ‘సిలోన్‌’ అన్నారు భారతీయ రచయితలు సింహళ ద్వీపం, శ్రీలంక వేరని భావించారు.

               వివిధ వాదనలను క్రోడీకరిస్తే, ఈ క్రింది అంశాలు రావణుని లంకే నేటి శ్రీలంక అని తేలుస్తున్నాయి.

  • సుగ్రీవుని అట్లాస్‌ ప్రకారం లంకా ద్వీపం త్రికుట పర్వతం మధ్యన ఉంది. ఈ త్రికూటం ఈ నాటి లంకలో నేటికీ ఉంది.
  • పరాంతక చోళుడు (907-950) తిరుచిరాపల్లిలో తులాభారం సమర్పించినపుడు చేయించిన తమిళనాడు పురావస్తు శాఖ వారు భద్రపరచిన వేలాంజరి తామ్రశాసనంలో. ‘‘రమ్యే శ్రీరామతీర్థేకపి వరనికరైః బద్ధ సేతు ప్రబంధే" అని ఉంది. కోతులు కట్టిన రామతీర్థం అని స్పష్టంగా అందులో ఉంది.
  • శ్రీలంకలోని రావణుని విమానాశ్రయం, సీతా ఏలియా, విమానాల నమూనాలు రామాయణానికి ఆనవాళ్లు. శ్రీలంక పార్లమెంట్‌లో విభీషణుడి చిత్ర పటం ఉంది.
  • దక్షిణాన ఉన్న పోల్‌స్టార్‌ను మనం ‘‘అగస్త్యతార’ అని పిలుస్తాం. రాముడికి శక్తివంతమైన ఆయుధాలను ఇచ్చినవాడు ఆ మహర్షి. రామునికి ‘‘ఆదిత్య హృదయం" అనే సూర్యస్తోత్రాన్ని బోధించిందీ ఆయనే. కాబట్టి రామాయణకాలానికి ఆయన పోల్‌స్టార్‌ కాలేదు. దాన్ని ఆధారం చేసుకుని లంకను నిర్ధారించకూడదు.
  • భాగవతంలో బలరాముడు తిరుమల, కంచి, కావేరి, శ్రీరంగం, దక్షిణ మధుర మొదలైన పుణ్యక్షేత్రాలను తన తీర్థయాత్రలలో దర్శించుకున్న తర్వాత సముద్ర తీరాన గల సేతువును దర్శించి, దాన ధర్మాలు చేశాడు అక్కడి నుంచి వేగై, కన్యాకుమారికి వెళ్లాడు. కాబట్టి రామేశ్వరం దగ్గరే రామసేతు వున్నది. ఈక్వేటర్‌ దగ్గర కాదు.
  • శ్రీలంకలో దొరికిన అనేక పురాతన ఆనవాళ్ళపై జపాన్‌ శాస్త్రవేత్తలు కార్బన్‌ డేటింగ్‌ చేసి అవన్నీ రామాయణ కాలం నాటివే అని తేల్చారు.                    - రామం భజేశ్యామలం     - 45వ వ్యాసం పుటలు 334-335
  1. అయోధ్య : ఒక నిజం:

                               ‘‘అయోధ్యానామనగరీ    

                           తదాసీతు విశృతా

                           మనూనామాన వేంద్రేణ

                           యా పురీ నిర్మితాస్వయమ్‌"

               రాముడి పూర్వీకుడైన మను చక్రవర్తి అయోధ్యానగరాన్ని నిర్మించాడని వాల్మీకి స్పష్టం చేశాడు. ఇది కోసల దేశ రాజధాని. సరయూ నదీ తీరంలో ఉంది. మహానగరాలన్నీ చరిత్రలో నదీ తీరాలలోనే నిర్మితమవుతాయనేది మనందరికీ తెలుసు.

               ‘‘అయోధ్య నగరం 12 యోజనాల పొడవు 3 యొజనాలు వెడల్పుతో నిర్మాణమైనదని వాల్మీకి వివరించాడు. ఒకవేళ అయోధ్య ఒక కల్పనే అయి ఉంటే, వర్ణనలే తప్ప వివరాలు ఉండేవి కావంటారు రచయిత. అయోధ్యను ‘జూదమాడే పీట’ఆకారంలో ఉన్నట్లు వాల్మీకి వర్ణించాడు. అంటే దీర్ఘ చతురస్రాకారంలో ఉంది. నగర విస్తీర్ణం దాదాపు 4,962 చ.కి.మీ వస్తుంది. ప్రస్తుత లాస్‌ ఏంజిల్స్‌, ఫిలడెల్పియా నగరాలకంటె అయోధ్య పెద్దది.

               ‘‘అయోధ్య అంటే యుద్ధం చేసి జయించడానికి శక్యం కానిది అని అర్థం. దాని చుట్టూ అతి పెద్దదైన, పటిష్టమైన ప్రహరీ, బయట దృఢమైన ద్వార బంధాలు ఉన్నాయి. లోపల కోట బురుజులపై వందల కొద్దీ శతఘ్నుల వంటి ఆయుధాలు ఉన్నాయి. నగరం చుట్టూ ఏనుగులు సైతం తిరగగలిగిన ప్రాకారం, దాని బయట అగాధమైన అగడ్తను నిర్మించారు. దాని తర్వాత ఇంచుమించు రెండు యోజనాల విస్తీర్ణంలో దట్టమైన అడవిని పెంచారు. అందులో క్రూర మృగాలు సంచరిస్తుంటాయి.

               ‘‘నగరంలోని ఇండ్లను విమాన గోపురాలవలె ఏడంతస్తులతో కట్టారు. విమానాలు పిరమిడ్‌ ఆకారంలో ఉంటాయి. నగరం ‘లే అవుట్‌’ ఒక క్రమ పద్ధతిలో ఉంటుంది. నగరంలోనికి వచ్చే ప్రధాన రహదారులు, ఎలాంటి వంకలు లేకుండా నేరుగా నగరంలోకి వస్తాయి ఇలా నగర నిర్మాణం, నిర్మాణశైలి, నైపుణ్యం, రక్షణ ఏర్పాట్లు, మౌలిక సదుపాయాలు, నివాస సముదాయాలు, సైన్యంలో వినియోగించే జంతువులు, భవనాల్లోని పెంపుడు జంతువులు, ఇలా ఒక సెక్యూర్డ్‌, సోఫిస్టికేటెడ్‌. బ్యూటిఫుల్‌ సిటీ అయోధ్య అది నిజం కల్పన కానే కాదు. - రామం భజేశ్యామలం - 46వ వ్యాసం పుటలు 336-343

  1. రామ రావణ యుద్ధం:

               ఇది మన సినిమాలలో చూపించినట్లుగా ఆషామాషీగా జరగలేదంటారు రచయిత. ఇద్దరు సమ ఉజ్జీల మధ్య యుద్ధం జరిగితే ఎంత భయానకంగా ఉంటుందో వాల్మీకి మన కళ్లకు కట్టినట్లు వర్ణించాడు. రామ రావణులిరువురూ ఒంటినిండా గాయాలతో, రక్తసిక్తమైన దేహాలతో యుద్ధం చేశారు. అట్లే ఇరువైపుల రాక్షస వానర వీరులు కూడ రావణుడు నేల కూలిన తర్వాత రాముడు విజయగర్వంతో నినాదం చేశాడు యుద్ధంలో మాయలు మర్మాలు ఏవీ జరుగలేదు.

శ్రీరామచంద్ర ప్రభువు: ఒక ఇంటిగ్రేటింగ్‌ ఫోర్స్‌:

               ఇల్లు వదలి వనవాసానికి బయలుదేరింది మొదలు, భిన్న జీవన విధానాలున్న, భిన్న సమాజాలతో మమేకం అయి, ఈ దేశాన్ని శ్రీరాముడు ఏకత్రితం చేసుకుంటూ వెళ్లాడంటారు కోవెల. ఈ ఏకత్రితం అన్న మాటా చాలా విస్తృతమైన అర్థాన్ని కలిగి ఉంది. ఇంటిగ్రేషన్‌ అన్న ఆంగ్ల పదం కంటె ఇది విశిష్టమైనది. గుహుడు, శబరి, జటాయువు ఇలా అందర్నీ ఆయన అక్కున చేర్చుకున్నాడు. కిష్కింధలో వాలిని చంపిన తర్వాత ఆయనేమీ రాజ్యాధికారాన్ని చేపట్టలేదు. సుగ్రీవునికే పట్టాభిషేకం చేశాడు. అట్లే విభీషనునికి కూడా. తన పట్టాభిషేక సమయంలో తనకు సహాయం చేసిన వారందిరికినీ, సపరివారంగా ఆహ్వానించి, ఆతిథ్యమిచ్చి, సత్కరించి, గౌరవించాడు. ‘‘సర్వత్ర సమదర్శనయోగం" పాటించాడు. దీనిని ఎంతో సౌకర్యవంతంగా ఇగ్నోర్‌ చేసి, రామునిపై నిందలు మోపే దౌర్భాగ్య సమాజం ఈ దేశంలో తయారయిందని ఆవేదన చెందుతారు రచయిత.

  1. సీతారాముల వివాహం; స్వయంవరం; సీతాదేవి వ్యక్తిత్వం

               వాల్మీకి రామాయణం ప్రకారం శ్రీరాముడు కేవలం శివధనుస్సును చూడడానికీ మిధిలానగరానికి వెళ్లాడు. తన తండ్రి దశరథమహారాజు అంగీకరించిన తరువాతే సీతను వివాహమాడాడు. సీతమ్మవారు ఆయనను భర్తగా స్వీకరించిన తర్వాతే ప్రేమించింది. వారిరువురూ మానవాతీతులు కాదు. మనలాంటి మనుషులే. అందుకే వారు మనకు ఆరాధ్యులైనారంటారు రచయిత. రావణ వధానంతరం తనను తన ఇష్టం వచ్చిన చోటుకు వెళ్లమని రాముడు చెప్పినపుడు సీత ఇలా తీవ్రంగా స్పందించింది.

                               ‘‘వీరుడా! ఒక సామాన్య పురుషుడు ఒక సామాన్య

                           స్త్రీతో పలుకుచున్నట్లు పలుకుచున్నావేమి? ఓ మహా

                           బాహు! నేను నీవు అనుకున్నట్లు ప్రవర్తించిన దానను

                           కాను నన్ను విశ్వసింపుము. నా సచ్చరిత్రపై ఒట్టుపెట్టి

                           చెప్పుచున్నాను. ప్రాకృత స్త్రీల ప్రవృత్తిని బట్టి నీవు

                           స్త్రీ జాతినే శంకించుచున్నావు.’’  -రామాయణం -యుద్ధకాండ

               తర్వాత ఆమె అగ్ని పరీక్షకు సిద్ధమైంది. తర్వాత ఆమెను గ్రహించినప్పుడు రాముడు సంజాయిషీ చెప్పుకోవలసి వచ్చింది.

               సీత కోసం ఎంతకైనా తెగించాడు రాముడు. కిష్కింధలో ఆంజనేయుడు సీతాభరణాలను చూపినపుడు ధైర్యం కోల్పోయి, ‘‘హాప్రియా, సీతా!’’ అని ఏడుస్తూ మూర్ఛిల్లినాడు రాముడు తన భార్య పై చూపించిన ప్రేమ, అనురాగం, బంధం రామాయణమంతా ప్రతిఫలిస్తూనే ఉంది. ఆమె ఆయనకు ఒక మధుర భావన

                               ‘‘మధురామధురాలాపా కిమహ మమ భామినీ?

                           మద్విహాన వరారోహ, హనుమాన్‌ కధయస్వమే"

               అని ఆంజనేయుడిని ప్రశ్నిస్తాడు. ‘‘నా సేత మధురమైనది. ఆమె మాటలు మరింత మధురాలు. నేను లేని దుఃఖంలో ఉన్న ఆమె ఏమి చెప్పింది? నాకు వివరించు హనుమా!’’

               అశోకవనంలో, రావణుని ఎదుర్కొన్నపుడు సైతం సీత తన వ్యక్తిత్వాన్ని, ఆత్మ విశ్వాసాన్ని, భర్త వీరత్వంపై తనకు గల నమ్మకాన్ని ప్రదర్శించింది. అట్లే తనకు నచ్చని రీతిలో భర్త ప్రవర్తించినప్పుడు ఆయనను తీవ్రంగా విమర్శంచడానికి వెనుకాడలేదు. భర్త విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకుంది. పతివ్రత అంటే భర్తను గుడ్డిగా అనుసరించి పూజించేది కాదని ఆత్మగౌరవం కలిగిన నారి అని సీత నిరూపించింది.

  1. శ్రీరాముని వ్యక్తిత్వం, నాయకత్వ లక్షణాలు:

               శ్రీరాముడిని తన వారసుడిగా ప్రకటించడానికి ముందు, దశరథుడు ఆయన అర్హతలను, వ్యవహార దక్షతలను, పరాక్రమాన్ని, ప్రజలలో ఆయనకున్న ఫాలోయింగ్‌ను పరిగణించాడు. నిజానికి ఆ అవసరం లేదు. దశరధుని బేరీజు ప్రకారం రామునికిగల సుగుణాలు 25 తేలాయి. ఈనాడు మన Management Gurus, Personality developement gurus చెబుతూ ఉన్న (వేలల్లో ఫీజు తీసుకుని) నాయకత్వ లక్షణాలు, వ్యక్తిత్వ విశిష్టతలు రాముడిని ఆశ్రయించుకుని ఉన్నాయి. ఇక్కడ మనం గమనించాల్సింది, ఈ లక్షణాలలో మానవతీత శక్తులు, మహిమలు లేకపోవడం. కేవలం ఒక పురుషోత్తముడికి ఉండవలసిన లక్షణాలను కలిగి ఉండడం అవి.

  • ప్రశాంత చిత్తం కలిగి ఉండటం
  • మృదువుగా మాట్లాడడం
  • ఎవరైనా పరుషంగా తనతో మాట్లాడినా స్పందించకపోవడం
  • బుద్ధినైశిత్యం
  • పరాక్రమశాలిత్వం
  • గర్వ హీనత
  • పెద్దలను గౌరవించడం
  • ప్రజలను ఆదరించడం
  • కరుణ కలిగి ఉండటం
  • మంచి శరీరాగ్యం కలిగి ఉండటం
  • వాక్చాతుర్యం కలవాడు
  • దృఢమైన అందమైన శరీరం కలవాడు
  • ఏ కాలంలో ఏ పని చేయాలో తెలిసినవాడు
  • దైన్యం లేనివాడు
  • లోక వ్యవహారం తెలిసినవాడు
  • ధర్మార్ధ కామాల లోతుపాతులు ఎరిగినవాడు
  • లోపలి భావాలను ముఖంపై తెలియనివ్వనివాడు
  • చపలత్వం లేనివాడు
  • దుష్టులను ఎలా కంట్రోలు చేయాలో తెలిసినవాడు
  • ధర్మార్ధముల విషయములో జాగ్రత్తపడుతూనే భోగాలను అనుభవించడం తెలిసినవాడు
  • డబ్బును ఎలా ఖర్చు చేయాలో తెలిసినవాడు
  • లలిత కళలో ప్రవేశమున్నవాడు
  • సైన్యానికి సారధ్యం వహించి ముందుకు నడిపించడంలో సమర్ధుడు
  • శత్రువులను ఉపేక్షించకుండా నిశ్చయంగా హతమార్చగలగినవాడు
  • ఎప్పటికీ ప్రజల అభివృద్ధి కోరేవాడు.

                                                   - రామం భజేశ్యామలం - 47వ వ్యాసం పుటలు 347`348

  1. సీతారామ తత్త్వం, కవి సమ్రాట్‌ విశ్వనాథ:

                     ‘‘ఏపున మంటి నుండి యుదయించిన జానకి మింటి నుండి, ఆ

                  వాపము గన్న రాఘవుడు వచ్చి బుగధ్వజులందునుండి ద్యా                  

                  వాపృథువుల్‌ సమాహరణ భావము పొందిన రీతి సంగమ

                  వ్యాపృతి పండు వెన్నెలమయంబుగ జేసెద రాత్మరోదసిన్‌"

                                                              - రామాయణ కల్పవృక్షము - విశ్వనాథ సత్యనారాయణ -కళ్యాణ ఖండము

               రాముడు ఆకాశం నుంచి దిగివచ్చిన చైతన్యమైతే, సీతాదేవి భూమి నుంచి ఉద్భవమందిన మహాశక్తి. భూమ్యాకాశాలమధ్య (ప్రపంచంలో) శ్రేయస్సును సాధించాలన్న లక్ష్యమే ఈ ఇద్దరి అవతారం. భూమ్యాకాశాల సమాహరణం గురించి వేదాలకాలం నుంచి కూడా మనవాళ్లు చెబుతూనే ఉన్నారు. ఈ సమన్వయమే ఆత్మ రోదసిని కాంతివంతం చేస్తుందన్నారు విశ్వనాథ. ఆయన జ్ఞానపీఠ్‌ అవార్డును పొందిన సందర్భంగా చేసిన ప్రసంగంలో ‘‘సీతా నామకయోగాన్ని" నాగుల నుంచి తెలుసుకున్నానని చెప్పారు ‘‘సీతాయాశ్చరితం మహత్‌" అన్న ఉపన్యాసంలో, కల్పవృక్ష రహస్యాలలో ఆయన దీనిని ప్రస్తావించారు. సీతమ్మ ఇలా అన్నది.

                               ‘‘ఆడది యింత సేయుననుటన్నది యన్నదె యంచు నన్నుమా

                               టాడితి కైకకోరక మహా ప్రభునీవని రాకలేదు. నీ

                               యాడది సీత కోరక మహా సుర సంహరణంబులే ద యా

                               యాడది లేక లేదజగమంచు,, నిదంతయునేన చేసితిన్‌"

               అంతా నేనే చేశాను పొమ్మన్నది సీతమ్మవారు. మనం కొంతకాలం విడిపోతేనే ఇంత నాశనమైంది.! అన్నది సమస్త విశ్వశ్రేయస్సుకు పరస్పర పూరకాలైన ప్రకృతి, పురుషులు వేరుకావడం ఎంత అనర్ధ దాయకమో ఆమె మాటల వల్ల మనకు అవగతమవుతుంది.

  1. సీతాయాశ్చరితం; రామాయణం:

               మిథిలలో ఉన్నపుడే ఆమె వనవాసాన్ని, రావణుని చెరను పండితులు సూచించారు. ఆమె వాటికి మానసికంగా సిద్ధపడే ఉంది. అందుకే ఆమె కళవళపడలేదు. రాముడు వారించ చూసినా వినలేదు. ఆమె వనవాసానికి వెళ్లకపోతే రామాయణం లేదు. రాక్షససంహారం లేదు.

                               ‘‘ఆదిపరాశక్తే సీతాదేవిగా అవతరించి

                           రాముడికంటి ముందే చేరుకుని, సర్వరాక్షస

                           సంహారానికి పునాది వేసింది. మాయలేడిని

                           కోరడం, కిష్కింధ దగ్గర తన నగలను పడవే

                           యడం, ఇవన్నీ రావణసంహారానికి సీతా దే

                           వి చేసుకుంటూ వెళ్లిన దారిలో భాగమే. లంకలో

                           రాక్షస శక్తులను బలహీనం చేసింది. విభీషణు

                           డిని రావణుడికి దూరం చేసింది. త్రిజటా స్వప్నం

                           లో భవిష్యత్తును దర్శింప చేసింది. రావణుడికి

                           అనుకూలంగా తన మనస్సును మార్చుదామ 

                           నుకున్న రాక్షస స్త్రీల మనస్సులనే తన కనుకూ

                           లంగా మార్చింది. సుందరకాండ లో ప్రఘస్మ

                           న్న రాక్షసి అన్న మాటల్లో ఇది తేటతెల్లమయింది.’’

                                                                        - శతకంఠ రామాయణం.

 

  1. అరిస్టాటిల్‌ - ఇంపోర్ట్‌:

               అరిస్టాటిల్‌ మహాశయుడు చెప్పినట్లుగా, రచయిత ఏ అనుభూతిని పొంది రచన చేస్తాడో అదే అనుభూతి పాఠకులు పొందడమే ఇంపోర్ట్‌. దీనిని తెలుగులో కావ్యపరమార్థం అనవచ్చు. దీనికి దైవానుగ్రహం కూడ అవసరం. ‘‘రామం భజే శ్యామలం"ను పలికించిన వాడు రామభద్రుడే! దీనిని పలికి ‘‘భవహరము" చేసుకున్నారు కోవెల! ‘‘నాహంకర్తాహరిఃకర్తా" అని అన్నమాచార్యుల వారన్నమాటలు ఈ గ్రంథానికి సరిగ్గా సరిపోతాయి. రాముని గురించిన నిందలు, అపోహలు, అపార్థాలు వక్రీకరణలు ఈ పుస్తకం చదివిన తర్వాత సమసిపోతాయి.

  1. ఉపసంహారం:

               గ్రంథం ఆద్యంతం రచయిత సబ్జెక్టివ్‌ (Subjective) గా ఉంటూనే ఆబ్జెక్టివ్‌ (Objective) ని సాధించాడు. ఈ పరిశోధనవల్ల రామాయణం కేవలం కావ్యం మాత్రమే కాదు సజీవ చరిత్ర అని ఋజువైంది. రాముడు, సీత దైవాంశ సంభూతులుగా కాకుండా మనలాంటి మానవమాత్రులుగా, సుఖదుఃఖాలు అనుభవించినవారుగా దర్శనమిస్తారు.

               శ్రీరాముడిని, రామాయణాన్ని కించపరచి, విలువ తగ్గించడానికి (belittle)జరిగిన ప్రయత్నాలన్నీ అజాగళస్తనాలుగా (నిరర్ధకాలుగా) నిరూపించారు రచయిత. బౌద్ధం, హైందవ సనాతన ధర్మములోని భాగమే అని తేలింది. అశోకుడి అహింసావాదంలోని డొల్లతనం తేట తెల్లమయింది.

               కుహనా చరిత్రకారుల సాయంతో ఆనాటి పాలకులు చేసిన చరిత్ర వక్రీకరణ ఎంత దారుణంగా ఉందో ఋజువులతో సహా నిరూపించబడింది. ఉత్తరరామాయణం, రాముడి వ్యక్తిత్వ హననానికి ఉద్దేశించిన కల్పన అని తెలిసింది. అయోధ్య ఒక నిజమనీ, వర్ణన కాదనీ ఋజువైంది. రామసేతువు మానవు నిర్మితమని తెలసింది. ఈనాటి శ్రీలంక రావణుని లంకయే అని కూడ నిర్ధారించబడింది. సీతాదేవి విశిష్ట వ్యక్తిత్వం రామయాణంలో అమెకిచ్చిన సమాన ప్రాధాన్యత అర్థమైంది.

               రచనా విధానంలో చదివించగల శక్తి ఉంది. విషయం పరిశోధనాత్మకమైదైనా, కథనం ఫిక్షన్ ను పోలి ఉంటూ, ఆసక్తికరంగా ఉంది. హస్యానికి అనుషంగికాలైన ఎగతాళి (Ridicule)విమర్శ (Satire) ధ్వని (Irony) లాంటి అంశాలను సందర్భానుసారంగా ప్రయోగించడంలో రచయిత కృతకృత్యుడైనాడు. భాష సరళంగా, సుబోధకంగా ఉంది. భారతీయులందరికీ, రామాయణం పట్ల జరుగుతున్న వక్రీకరణను బయటపెట్టి దాని పవిత్రతను, విశ్వసనీయతను పునరుద్ధరించడం ద్వారా, రచయిత సామాజిక ప్రయోజనాన్ని సాధించారు.

                               ‘‘వేద వేద్యే పరేపుంసి జాతే దశరథాత్మజే

                           వేదః ప్రాచేత సాదాసీత్‌ సాక్షాత్‌ రామాయణాత్మనా"

               ‘‘వేదవేద్యుడగు పరమపురుషుడు శ్రీరామచంద్రుడుగా లోకమున ఆవిర్భవించగా, వాల్మీకి వల్ల ఆ వేదమే రామాయణం ఐనది"

‘‘లోకా స్సమస్తాః సుఖినోభవన్తు"

 

  1. ఉపయుక్త గ్రంథసూచి:

 

  1. Arnold, Edwin. (1879) "The light of Aisa" JR OS good & Co. Boston, America.
  2. Arun Shourie, (2014). Eminent Historians; HarperCollins, India.
  3. A.C. (1990). Indo European Languages” Awesome Books, United Kingdom.
  4. Folks Magazine. (June 2012 issue). North Holland.
  5. Savithri devi, (1939). "A warning to the Hindus"; Brahmachari Bijoy Krishna of the Hindu Mission. Calcutta.
  6. శ్రీరామచంద్రుడు, పుల్లెల. (2013). వాల్మీకి రామాయణం, టీఎల్ పీ పబ్లిషర్స్, హైదరాబాద్.
  7. వర్షమిత్ర, burgees, E., (1989). సూర్య సిద్ధాంతం; గోళాధ్యాయం,
  8. వాల్మీకి. (1907). శ్రీమద్రామాయణం. గీతాప్రెస్, ఘోరక్ పూర్.
  9. కాళిదాసు, (2011). రఘువంశం. రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్, జనక్ పురి, న్యూఢిల్లీ.
  10. భట్నాగర్‌, పుష్కర్‌. (2004). డేటింగ్‌ ఆఫ్‌ రామాయణ, రూపపబ్లికేషన్స్. ఇండియా.
  11. క్షేమేంద్రుడు. (2007). ఔచిత్య విచారచర్చ. చౌకాంబా విద్యాభవన్, వారణాశి, ఉత్తరప్రదేశ్.
  12. సుందరాచార్యస్వామి. (1913). శ్రీరామకాల నిర్ణయ బోధిని. ఆర్. వెంకటేశ్వర్ & కో, మద్రాస్
  13. సత్యనారాయణ, విశ్వనాథ. (2015). శ్రీమద్రామాయణ కల్పవృక్షం, విశ్వనాథ పబ్లికేషన్స్, విజయవాడ.
  14. తులీసీ దాస్‌, రామ్‌ చరితమానస్‌. (2018). గోస్వామి, తులసీదాస్. గీతాప్రెస్, ఘోరక్ పూర్.
  15. భవభూతి. (1939). ఉత్తర రామ చరితమ్‌. నిర్ణయ్ సాగర్ ప్రెస్, బోంబే.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]