AUCHITHYAM | Volume-04 | Issue-09 | August 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed
6. అరుణతార పత్రిక: చైతన్య కథల విశ్లేషణ
డా. వి. రామకృష్ణ
స్వతంత్రపరిశోధకులు
మచిలీపట్టణం, ఆంధ్ర ప్రదేశ్
సెల్: +91 9949622251. Email: vrk1987vrk@gmail.com
Download PDF
వ్యాససంగ్రహం:
తెలుగు సాహిత్యంలో కథానికకు విశిష్ట స్థానం ఉంది. సమాజంలో ఉన్న అనేక విషయాలను ఎల్లప్పుడూ పాఠక లోకానికి అందిస్తూ సమ సమాజ నిర్మాణాభివృద్ధి దిశగా కథానిక కొనసాగుతుంది. ప్రజల్లో మార్పును తీసుకొచ్చే ప్రధాన సాధనాల్లో పత్రిక ఒకటి. అందుకే సమాజపు నాల్గవ స్థంభంగా పత్రికలను చేర్చారు. అలా ఆవిర్భవించిన పత్రికల్లో అరుణతార పత్రిక ఒకటి. అరుణతార పత్రికలో వచ్చిన చైతన్య కథలను విశ్లేషించడమే ఈ వ్యాసం యొక్క ఉద్దేశం.
Keywords: అరుణతార, పత్రికలు, కథలు, సామాజికాంశాలు, చైతన్యం.
1. ఉపోద్ఘాతం:
ఈ నా పరిశోధనా నమూనా వ్యాసంలో అరుణతార పత్రికలో 2001 - 2005 సంవత్సరాలలో ప్రచురింపబడిన అరుణతార ఆరు చైతన్య ఇతివృత్తం కల్గిన కథలను స్వీకరించి విశ్లేషణ చేయడం జరిగింది. వాటిలో 1. ‘కానుక’అనే కథను రచయిత్రి భావన రచియించారు. 2. ‘ఎర్రగౌను పిల్ల’కథను కె.వి.కూర్మనాథ్ రాశారు. 3. ‘ట్రాఫిక్ జామ్ డాట్ కామ్’అనే కథను పల్లా మోహన్ రాశారు. 4. ‘మెట్లమీద’కథను మిడ్కో రాశారు. 5. ‘మయ సభ’అను కథను బమ్మిడి జగదీశ్వరరావు రాశారు. 6. ‘‘ముళ్ళ పొదల్లో పూల మొగ్గలు’అనే కథను యమ్. హరికిషన్ రాశారు.
1. కానుక :
ఈ కథను రచయిత్రి లేఖా పద్ధతిలో రాశారు. తల్లి తన కుమారునికి ఉత్తరం రాసే విధానంలో కథ సాగింది. బాలల్లో ఉద్యమం పట్ల చైతన్యం తీసుకురావడం కోసం కథలోని పాత్రలచేత ఒక చక్కటి కథను చెప్పిస్తారు రచయిత్రి. అమాయక ప్రజలను ధనిక వర్గాలు ఏవిధంగా అన్యాయం చేస్తున్నారో వారికి ఏ విధంగా బుద్ది చెప్పాలి అనే అంశంతో సాగుతుంది కథ. మౌనంగా ఉన్నంత వరకు దోచుకునేవాడు దోచుకుంటూనే ఉంటాడు కావున వాడి దోపిడీని ఆపాలంటే మనం తిరుగబడక తప్పదని రచయిత్రి భావన.
జాలరుల జీవితాలు ఎంత వెనుకబాటు తనంతో ఉంటాయో కళ్ళకు కట్టినట్లు చెప్పారు రచయిత్రి. కనీసం వారి వయసెంతో కూడా వారికి తెలియదు. వారికి స్థిరనివాసాలు ఉండవు. నదులపైనే వారు జీవిస్తారు. చేపలు పట్టడమే వారి జీవనాధారం. చేపలు తీరంలో దొరకకపోతే ఇంకా ముందుకు వెళ్తుంటారు. పడవలోనే వారి ఇల్లు కూడా. చలిలో, ఎండలో ఒక ఇల్లంటూ లేక ప్రకృతి ఒడిలో పెరిగే జాలరులు.... చేపల పులుసు కారం మెతుకులు తప్ప సరైన పోషకాహారం లేక వయస్సుకు తగ్గ పెరుగదల ఉండదు కావున వారి ఒడ్డూ, పొడుగులను చూసి వారి వయస్సును అంచనా వేయడం కూడా కష్టమేనని రచయిత్రి అంటారు.
జాలరుల పిల్లల శరీరంలో పసితనపు ఛాయలు కనిపించవు. ఎందుకంటే వారికి ఆరేండ్ల వయస్సు వచ్చే సరికి వారు బుట్టల్తో నదుల్లో ప్రయాణం చేసి చేపలు పట్టడానికి బయలుదేరుతారు. రేయి, పగలు శ్రమిస్తూ చేపలు పట్టడం నేర్చినవారు ఆ పిల్లలు. శరీరాలు బండబారి వారి వయసును సరిగా తెలపవు. ఎన్ని ఏండ్లు గడిచినా వీరిలో మార్పు రాలేదని బాధపడుతారు రచయిత్రి.
ఇటువంటి వారి విముక్తి కోసం దళంలో సభ్యులు వారిలో ఏ విధంగా చైతన్యాన్ని కలిగిస్తున్నారో తెలియజేయడమే ప్రధాన ఉద్దేశ్యంగా సాగుతుంది ఈ కథ.
రచయిత్రి తన కొడుకు పుట్టినరోజు కానుక ఈ ఉత్తరంలోని విషయాలే అని చెబుతారు.
పుట్టిన రోజు అంటే ఏమిటో అర్థాన్ని వివరిస్తారు. పుట్టుకకు అర్థం వుండేలా జీవించాలి. ఈ భూమ్మీద ఎన్నో ప్రాణులు పుడుతున్నాయి. మరణిస్తున్నాయి. కాని మనుషులుగా పుట్టినందుకు మనం మన జీవితానికి అర్ధం ఉండేలా జీవించాలి అని అంటారు భావన. మనం మన కోసం జీవిస్తే ఏ తృప్తి ఉండదు. నలుగురి కోసం జీవించి, నలుగురి కోసం మరణించడంలోనే జీవితానికో అర్థం ఉంటుంది అని ఆమె ఉద్దేశం. జీవితానికి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని ప్రతి పుట్టిన రోజు నాడు మనం ఆ లక్ష్యానికి చేరువవుతున్నామా లేదా? అని ప్రశ్నించుకోవాలని తన కొడుకు చిన్నాకు రాసిన ఉత్తరంలో పుట్టిన రోజు అంటే ఏమిటో తెలియజేస్తారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ మన వ్యక్తిత్వాని కూడా ఉన్నతంగా మలచుకోవాలని అని బోధిస్తారు భావన గారు.
‘మన దగ్గర చేపలు కొనుక్కుని పోయే ఈ షావుకారు ఒక పదేండ్ల కింద ఎట్లవుండే. సైకిల్ మీద వచ్చి, చేపలు కొనుక్కపోయేవాడు, మరిప్పుడు స్టీమరు మీదోచ్చి కిలోల కొద్ది చేపలు లోడ్ చేసుకొని పోతాడు. వాడికింకా రెండు స్టీమర్లున్నయిప్పుడు! మరి ఇన్ని పైసలు వాడికి ఎక్కడ నుండి వచ్చినయి! మనల దోచుకుంటేనే కథా, పగలు అంతా మనం కష్టం చేస్తే మనకు కారం మెతుకులు’1
కష్టపడి పనిచేసేవాడు ఎప్పుడు కష్టపడుచూనే వున్నాడు. ధనం కూడ బెట్టేవాడు మరింత ధనం దోచుకొని దాచుకుంటున్నాడు. మధ్యలో దళారి వ్యవస్థ వల్ల అటు ఉత్పత్తిదారుడు, ఇటు వినియోగదారులు ఇద్దరు కూడా తీవ్రంగా నష్టపోతున్నారు. రైతు, ఉత్పత్తిదారులు అలాగే వుంటే దళారులు మాత్రం కోట్లకు పడగలెత్తుతున్నారు.
రచయిత భావన ఈ కథలో రైతులు, ఉత్పత్తిదారులు నిత్యం సమాజంలో ఏ విధంగా దోపిడీ చెయ్యబడుతున్నారో దీనిలో వివరించారు. అందుకే నేరుగా రైతులు, ఉత్పత్తిదారులే తమ పంటలను విక్రయించే వెసులుబాటు కల్పించాలని ఈ కథ ద్వారా రచయిత సమాజానికి, ప్రభుత్వాలకు సందేశమిచ్చారు.
‘‘మనిషిగా పుట్టినందుకు మనకంటు ఓ లక్ష్యముండాలి. జీవితానికి ఒక లక్ష్యాన్ని ఏర్పర్చుకొని ప్రతి పుట్టిన రోజున మన లక్ష్యానికి చేరువవుతున్నామో లేదో పరిశీలించు కోవాలి.’’ 2 అని రచయిత భావన చిన్న పిల్లలలో మంచి నడవడికను, మానవతా విలువలను, నైతిక దృక్పథాన్ని పెంపొందించే ఇతివృత్తాన్ని కథగా వివరించారు.
2. ఎర్రగౌను పిల్ల :
చిన్నపిల్లల శరీర అవయవాలతో వ్యాపారం చేసే వారిని దృష్టిలో ఉంచుకొని కె.వి.కూర్మనాధ్ రాసిన కథ ఈ ఎర్రగౌను పిల్ల. బడుగు, బలహీన వర్గాల పిల్లలు సరైన తిండిలేక, కట్టుకోవడానికి బట్టలు లేక వీధిన పడుతుంటారు. అటువంటి అమాయకులైన పిల్లలను అపహరించుకొనిపోయి వారి అవయవాలను తీసి అమ్మి డబ్బును సంపాదించే దోపిడిగాళ్ళు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. కొంతమంది సంపాదనపరులు తమ బిడ్డలను ఎంతో అల్లారు ముద్దుగా చూస్తుంటారు. పేదవారు తమ పిల్లలను తమ జీవనం గడవడం కోసం అమ్ముకుంటున్నారు. ధనిక, పేద వర్గాల మధ్య ఈ తారతమ్యం పోయినపుడే ఇటువంటి అకృత్యాలు జరగవని రచయిత ఈ కథ ద్వారా చైతన్య పరుస్తున్నారు. నేటి సమాజంలోని దోపిడిగాళ్ళను బ్రహ్మారాక్షసుడు పాత్రలో తీర్చిదిద్ది రచయిత ఇలా అనిపిస్తారు. ‘‘నాకేమిటి సిగ్గు! సిగ్గూ శరమూ, బుద్ది, జ్ఞానమూ అనే పదాలు మా భాషలో లేవు. పచ్చినెత్తురు తాగడమే మా బతుకు.’’ అంటే నేటి సమాజం తీరు ఎలావుందో అర్థం చేసుకోవచ్చు.
‘అడ్డాలనాడు బిడ్డలు కాని గెడ్డాలప్పుడు కాదంటారు వణుకుతున్న చేతులను టేబుల్ పై దన్నుగా పెట్టుకుని. వణుకుతున్న తలను నిలిపే ప్రయత్నమేమీ చేయ్యలేదు. పిల్లల్ని కంటాం కాని వాళ్ళ బుద్ధుల్ని కనం కదా మేం వున్నోళం కాదు. కానీ ఉన్నదాంట్లోనే కొంచెం ఎవరికైనా యివ్వాలని చెప్పేదాన్ని’3
పసివయస్సులో తల్లిదండ్రులు ఏమి చెప్పినా పిల్లలు వింటారు. అదే పెరిగి పెద్ద వాళ్ళయ్యాక స్వతంత్రంగా ఆలోచించే తీరు వలన తల్లిదండ్రుల మాట వినరు. విన్నా అదే మాటను వారు ఆచరించాలనే ఆలోచన చెయ్యరు. తల్లిదండ్రుల అనుభవాలను వారి ఆలోచనలతో బేరీజు వేసుకునే ప్రయత్నం చెయ్యరు. పిల్లలు మాట వినక తప్పుదోవపట్టినప్పుడు ఆ తల్లిదండ్రులు ఎంత మానసిక క్షోభ అనుభవిస్తారో ఇందులో వివరిచడం జరిగింది. ఆనాటి పరిస్థితులకు తగిన ఇతివృత్తం తీసుకుని రచయిత చేసిన వర్ణన పాఠకున్ని కట్టి పడేస్తుంది. అప్పట్లో ఉన్నదాంట్లో కొంచెం ఇతరులకు పంచేతత్వం బాగా కనిపిస్తుంది. మనిషికి ఎంత ఉన్నా ఎదుటి వారికి పంచడంలో ఉన్న ఆనందం ఎందులోనూరాదు’అన్న గొప్ప అంశాన్ని మనకు ఈ కథలో సందేశంగా చెప్పారు.
‘‘ఇప్పుడు మిమ్మల్ని చరిత్రలోని చీకటి రోజులకు తీసుకువెళ్తున్నాను. పువ్వులను, పిల్లలను కూడా ప్రేమించలేని మధ్యయుగపు దుర్థినాలవి. మొగ్గలైనా, పసి మనసులైనా విచ్చుకుని వికసిస్తే సహించలేని హంతక ప్రభువులకు గొప్ప నిరసన తెలుపుతున్న మౌలికను చూడండి. మనం అలాంటి రోజుల్లో బతకనందుకు సంతోషిద్దాం, అంటూ చద్దర్ మడతలను చాలా స్టైల్ గా విప్పింది’4
పసిపిల్లల మనస్సు ఎంత సున్నితంగా ఉంటుందో మనకు వారిని అర్థం చేసుకుని ప్రేమించే హృదయం ఉంటేనే గానీ అర్థం అవ్వదు. మధ్యయుగంలో ఉన్న అరాచకాలు పసి హృదయాలను ఎంతగా గాయపరచాయో ఈ కథలో రచయిత కళ్ళకు కట్టినట్లు వివరించారు. అప్పటి ప్రభువుల నిరంకుశ నీచ పాలనా విధానం ఇందులో వివరణాత్మకంగా సభ్య సమాజానికి విన్నవిస్తూ అలాంటి రోజుల్లో మనం లేనందుకు సంతోషిద్దాం అంటూనే ప్రస్తుతం పసిపిల్లలపై జరుగుతున్న అరాచకాలను, కామాందుల అక్రమాలను ఎండగట్టారు.
3. ట్రాఫిక్ జామ్ డాట్ కామ్ (చైతన్య కథ) :
ఒక మధ్య తరగతి మనిషి ఉద్యోగం పోతే అతని మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఈ కథలో తెలియజేశారు. రచయిత పల్లా మోహన్ చలపతి అనే మధ్య తరగతి వ్యక్తి ఆనందమూర్తి అనే ఒక పేరు మోసిన ఛార్టడ్ ఎకౌంటెంట్ వద్ద గుమస్తాగా పని చేస్తుంటాడు. ఆనందమూర్తి దగ్గర అప్రెంటిస్ చేయడానికి ఒక అమ్మాయి చేరుతుంది. హైదరాబాద్‌లో అకౌంటింగ్ సంబంధించి కోర్సులను పూర్తి చేసి వచ్చిన అమ్మాయి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్న అమ్మాయి కూడా కావడం చేత ఆనందమూర్తి స్వార్ధంతో ఎప్పటి నుండో పని చేస్తున్న చలపతిని ఉద్యోగం నుండి అర్థాంతరంగా తీసేస్తాడు.
ముసలివారైన తల్లిదండ్రులు, గర్భవతి అయిన భార్య, ఇద్దరు పిల్లల పోషణ ఎలా అని ఆలోచిస్తూ తన పదేళ్ళ పాతకాలపు సైకిలు మీద ఎక్కి ఉద్యోగ ప్రయత్నం కోసం బయలు దేరుతాడు చలపతి. అతని ఆలోచనల సమాహారమే ఈ కథ. నేటి నిరుద్యోగ ప్రపంచంలో ఎన్ని డిగ్రీలు ఉన్నా ఉద్యోగం దొరకడం కష్టం. రోజురోజుకు మారుతున్న సాంకేతిక విప్లవాల వలన నేటి పోటీ ప్రపంచంలో ఉద్యోగ సాధన ఎంత కష్టమా ఈ కథలో తెలియజేశారు రచయిత.
‘‘రేపట్నుంచి పెళ్ళాం పిల్లల్ని, తల్లిదండ్రుల్ని ఎట్లా సాకాలి? ఈ సంగతి తెలిస్తే వాళ్ళెంత బాధపడి అల్లాడిపోతారో, భారతిని ఈ రోజే ఆస్పత్రికి తీసుకుపోవాలి, ఎదుర్చూస్తుంటుంది.’’ 5
అనుకొకుండా వచ్చిన ప్రమాదం చలపతి జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. ఆ అనుకోని పరిణామానికి చలపతి విలవిల్లాడిపోతాడు. తన కుటుంబం పరిస్థితి గురించి తలచుకొని చాలా వ్యధ చెందుతాడు.
ఒక మధ్య తరగతి చిన్న ఉద్యోగికి వున్న ఉద్యోగం పోయిన అది అతనికి చావు దెబ్బ అని రచయిత పల్లామోహన్ ఈ కథలో మంచి నేర్పరితనంతో వివరించారు.
‘‘అరె సైకిలేమిటి ఇంత బరువైపోతుంది. కాళ్ళలో శక్తి సన్నగిల్లిందా, ఉహు ... లేదు గట్టిగా బలంగానే తొక్కుతున్ననే’'6 అని ఉద్యోగం పోయిన చలపతి యొక్క మనస్సు ఏ విధంగా ఆలోచిస్తుందో వివరించాడు.
రోజూ తోక్కే సైకిల్ కూడా ఆ భాదలో భారంగా మారిపోయింది. అలాంటిది మరి అతని కుటుంబం సంగతి ఏంటో అని వేదనపడుతూ బాధలో వున్నప్పుడు మనిషి ఏ విధంగా మదన పడతాడో చలపతి పాత్ర ద్వారా రచయిత మోహన్ వివరించిన తీరు అద్భుతం.
ఏ విషయాన్ని అయినా ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, వచ్చిన బాధలను తట్టుకుని తిరిగి నిలబడే ప్రయత్నం చెయ్యాలని, రచయిత సమాజానికి ఒక వర్తమానం అందజేశారు.
4. మెట్ల మీద :
మిడ్కో రాసిన ఈ కథ పాఠకునికి చైతన్యాన్ని కలిగిస్తుంది. ఒక కుటుంబంలోని కీలకమైన వ్యక్తి ఆ కుటుంబాన్ని విడిచిపెట్టి దళంలో చేరిపోతే ఆ కుటుంబం ఎన్ని ఇబ్బందులు పడవలసి వస్తోందో తెలియజేసారు రచయిత. రవీందర్ దళంలో చేరిన పదిహేనేళ్ళ తర్వాత బయటకు వచ్చి కుటుంబంతో గడపాలనుకుంటాడు. కాని దళం నుండి బయటకు వచ్చాక అతను పశ్చాత్తాపపడతాడు. తనతో పాటు చేరిన అయితయ్య దళం కోసం ప్రాణాలర్పిస్తాడు. సురేష్ దళంలో ఎంతగానో ఎదిగిపోయాడు. తానుమాత్రం తన స్వార్ధం కోసం దళాన్ని విడిచిపెట్టానని బాధపడతాడు.
రవీందర్ ఉద్యమంలో చేరిన తర్వాత రవీందర్ తల్లి సరోజమ్మ, చెల్లెలు లలిత ఉద్యమానికి దగ్గరవుతారు. పార్టీని రవీందర్ విడచి పెట్టి వచ్చిన తర్వాత కూడా పార్టీ కార్యక్రమాల్లో చురుకుగానే ఉంటారు. కాని రవీందర్ తండ్రి నారాయణరెడ్డి, సరోజ, లలితలను మందలిస్తుంటాడు. పోలీసుల వలన ఏమైనా ఇబ్బందులు వస్తాయోమోననే భయం అతనికి కొడుకు ఉద్యమాన్ని విడిచిపెట్టి వచ్చిన తర్వాత ఇంకా వాటితో సంబంధాన్ని కొనసాగించడం అతనికిష్టంలేదు.
రవీందర్ అక్క రత్నమాల కూతురు సౌజీ కూడా దళం కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటుంది. ఈ విధంగా కథలో రవీందర్ ని స్ఫూర్తిగా తీసుకొని చాలా మంది దళానికి ప్రత్యక్షంగా, పరోక్షంగా పని చేస్తుంటారు. వీటిని గమనించిన రవీందర్ తనను ఆదర్శంగా తీసుకొని ఇంతమంది ఉద్యమానికి ఆకర్షితులైతే తాను మాత్రం భార్య, బిడ్డల కోసం బయటకి వచ్చానని సిగ్గుపడతాడు.
లలిత ఉద్యమంలో చేరడానికి తండ్రి నిరాకరిస్తాడు. కాని లలిత చేరతాననే అంటుంది. పార్టీ మంచిదే అయితే, మీ అన్నయ్య ఎందుకు బయటికి వస్తాడని ప్రశ్నిస్తాడు తండ్రి. అయితే పార్టీ మంచిది కాదని, ఈ రాజ్యం మారదని అన్నయ్య చెబితే నేను ఒప్పుకొంటాను అంటుంది లలిత. ఇంటి మెట్లెక్కుతున్న రవీందర్ పార్టీలో పదిహేనేళ్ళు పనిచేసి వచ్చిన తాను లలిత వైపు చెప్పాలా లేదా పార్టీని విడచిపెట్టి వచ్చాను కనుక తండ్రి వైపు చెప్పాలా అనే సందిగ్ధంతో కథ ముగుస్తుంది.
‘‘ఏం ఆలోచన చేస్తుండో’భాదలో ములుగుతుంది సరోజమ్మ మనసు, మనవడితో ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉందికానీ, కళ్ళూ, మనసూ అన్నీ కొడుకుమీదే ఉన్నాయామెకు. కొడుకును గుండెలకు హత్తుకుని భోరున ఏడ్వాలనుందామెకు. కొడుకు భుజం తడుతూ ‘‘భాదపడకయ్యా’’ అని చేప్పాలనుంది. కనీసం వెనుకనుండి కొడుకు తల నిమరాలనుంది. కానీ ఏదీ చేయలేదామె’'7
తల్లిదండ్రులకు పిల్లలపై ఉన్న ప్రేమ, అనురాగం ఎన్నటికీ తరిగిపోవు. తల్లిబిడ్డలు బాధపడితే చూసి తట్టుకోలేక తల్లడిల్లిపోతుంది. ఇందులో కొడుకు ఏ విషయం గురించో తీవ్రంగా ఆలోచించి మనసు బాధపెట్టుకుంటున్నాడని తల్లి ఆవేదన.
ఎన్నియుగాలైన ఈ భూమి మీద తల్లి ప్రేమ దేనికీ సరిలేనిది. ఎన్ని బాధలైనా కష్టాలైనా తామే భరించాలి అనుకుంటారు తల్లిదండ్రులు. కానీ తమ పిల్లలు భాదపడితే చూడలేరు. ఈ కథలో భాదపడుతున్న కొడుకును గూర్చి ఆ తల్లి ఆవేదనను కళ్ళకు కట్టినట్లు రచయిత చిత్రీకరించారు.
‘‘కలలు కనడం మర్చిపోయినంక కలలు ఫలిస్తే నేం? ఫలించకపోతేనేం?’’ 8
మనిషి జీవితంలో పుట్టుక, జీవన విధానం, కుటుంబం, వ్యవస్థ ఇవన్నీ భాగాలుగా ఉంటే, అందమైన జీవితం అవుతుంది. కానీ కుటుంబం కోసం, ఊరికోసం, ఎదుటివారి బాగుకోసం అహర్నిశలు తపన పడి, తన ఉనికిని మనిషి మరిచిపోయి, వెనుదిరిగి చూసుకున్నపుడు తనెక్కడా కనపడకపోతే ఆ మనిషి మనసు పడే ఆవేదనను రచయిత ఈ కథలో ప్రస్ఫుటంగా వివరణ ఇచ్చారు. పోరాట పటిమను ఇతరులలో నింపుతూ మనమూ చైతన్యవంతులం అవ్వాలి. కానీ మన ఉనికి మనం కోల్పోకూడదు. అలా జరిగిన రోజున మనం ఎన్ని అనుకున్నా, వ్యర్ధమే అనే సత్యాన్ని రచయిత వివరించడం జరిగింది.
5. మయ సభ:
గ్రామీణ ప్రాంతాల్లో పేద పిల్లలు చదువుకు ఎందుకు దూరమవుతున్నారో నాటకీయంగా తెలయజేశారు రచయిత బమ్మిడి జగదీశ్వరరావు. చదువుల పండగ పేరుతో ప్రభుత్వం పాఠశాలలో చేరని, పాఠశాలకు రాని విద్యార్థులను పాఠశాలలో చేర్పించే ప్రయత్నం చేస్తుంది. ఇందుకోసం ప్రతి పల్లెలో పండగ వాతావరణంలో అనేక చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే ఒక పల్లెలోని పాఠశాలలో సింహాచలం అనే ఉపాధ్యాయుడు ‘‘కలియుగ ప్రహ్లాద’’ అనే పేరుతో నాటకం వేసి ఆ ఊరి ప్రజలలో చదువు పట్ల చైతన్యం కలిగించాలని బావిస్తాడు.
‘‘మీరు బడికి వెళ్ళడానికి ఈళ్ళైదంటే, మీరు ... పిల్లలు కష్టపడి తెస్తే నేను తిని తొంగుంటాను, తాగి తొంగుంటాను. మీరు కష్టపడి కట్టలు తెస్తే దాచుకుంటాను. బ్యాంకులో వేసుకుంటాను. మీ కష్టంతో కాళ్ళు కడుక్కుంటాను మీ చెమటతో చేతులు కడుక్కుంటాను ... తను రాసిన డైలాగులకు తోనే మురిసిపోతు సింహాచలం మాష్టారు చదివికెలిపోతున్నాడు. హిరణ్యక శివుడు అప్పలకొండ అర్థం చేసుకుని తెలుగులో వచ్చిన అరవ సినిమాలా పెదవులు కదుపుతూ తన అభినయాన్ని అందించాడు. ‘‘నాయనానే సదువుకుంటానే’ ప్రహ్లాదుడు హరినామజపంలా ‘‘సదువు’’ జపం చేస్తున్నాడు. మళ్ళీ మళ్ళీ అదే మా(పా)ట!’’ 9
రచయిత చదువు మీద అవగాహనకై ఊరి ప్రజలను, పిల్లలను చైతన్య పరచాలని ఆరాటపడే ఒక టీచరు పాత్రద్వారా నాటకీయంగా చిత్రీకరించిన విధానం సభ్య సమాజంలో చదువు ఎంత అవసరమో విదితమౌతుంది.
తిండి తినకపోతే మనిషి ప్రాణం పోవచ్చుగానీ, చదువు విచక్షణ అనేవి లేకపోతే మనిషి మనుగడే కరువవుతుందని ఈ కథలో రచయిత సూచించారు. ఊళ్ళో ఎన్నో పండగలు జరుపున్నపుడు చదువుని ఎందుకు పండగలాగా జరపకూడదని ఆ రోజుల్లోనే అక్షర క్రాంతి, రాత్రి బడి లాంటివి ఏర్పాటు చేసి ప్రజలు, పిల్లల్లో చైతన్యం తెచ్చారని అర్ధం అవుతుంది.
‘‘ఎప్పట్లాగే ప్రహ్లాదుడు పల్లీలమ్ముకుంటున్నాడు. మునిపటిలాగే అప్పలకొండ పంచాయితీ ప్రెసిడెంటు ఇంట్లో పాలేరు పని చేసుకుంటున్నాడు. అడారి సోంబాబు పశులుకాసుకుంటున్నాడు. మాలచ్చిమి మినిష్టరు గారింట్లో అంట్లు తోముకోవడానికి పోతోంది. ఆలీ హోటల్లో సర్వరుగా చేరిపోయాడు. మళ్ళీ పండక్కి మనల్ని పిలుస్తారో.. లేదో...? అనుకున్నారంతా!’’ 10
సమాజంలో ఎంత మార్పు తీసుకురావాలని ప్రయత్నించినా అన్నివైపుల నుండి సహకారం అందకపోతే ఎలాంటి పనీ చేయలేమనే విషయాన్నే రచయిత వివరించారు. ఎన్ని పండగలు అక్షర క్రాంతులు తెచ్చినా, అభ్యుదయ భావాలు కల్గించాలని, అన్నిటా ప్రయోజకుల్ని చేయాలన్న సింహాచలం మాష్టారి కృషి చివరికి ఫలించక పోవడం చూస్తే ఆనాడు చదువు కంటే సంపాదన, ఇల్లు గడవాలనే తపన వలన బానిసలుగానే బ్రతుకు ఈడ్చడానికి మొగ్గు చూపారు గానీ, చైతన్యం కలుగని వారి మెదడు బానిసలుగానే ఉండటానికి ఇష్టపడిన తీరుని రచయిత వివరించారు.
6. ముళ్ళపాదల్లో పూల మొగ్గలు :
డా॥ ఎం. హరికిషన్ రాసిన ఈ కథలో సినిమాల ప్రభావంతో నేటి తరం పిల్లల ప్రవర్తన ఏవిధంగా ఉంటుందో తెలియజేశారు. ఇందులో ప్రధాన పాత్ర విశాల. విశాల కుమార్తె కీర్తి ఎనిమిదవ తరగతి చదువుతుంటుంది. బొద్దుగా ముద్దుగా ఉండేది. అకస్మాత్తుగా ఆమె ప్రవర్తనలో మార్పు వచ్చి తిండిని పూర్తిగా తగ్గించేస్తుంది. కీర్తి ప్రవర్తనకు కారణమేంటోనని ఎంతగానో విశాల ఆలోచిస్తుంది. విశాల ఉపాధ్యాయరాలిగా పనిచేస్తుండడం వలన పిల్లల మనస్తత్వాలను దగ్గరగా పరిశీలించే అలవాటు ఉంది.
ఒక రోజు విశాల పాఠశాలకు బయలు దేరుతూ ఆటోకోసం ఎదురు చూస్తున్న తనకి ఒక దృశ్యం కన్పిస్తుంది. రోడ్డు పక్కన ఇద్దరు చిన్న పిల్లలు గొడవపడుతున్నారు. వయసు పదేళ్ళు కూడా ఉండవు. వారి సంభాషణ ఇలా ఉంది.
‘‘రేయ్ .... మర్యాదగా నా పెన్సిల్ నాకియ్. ల్యాకపోతే పీక ... పీకకోస్తా ఏమనుకుంటున్నావో’’ ఒక పిల్లాడు రౌద్రంగా అంటాడు. వెంటనే మరో పిల్లవాడు ఏందిరా నువ్ కోసేది. నా కంటి సూపు సాలు నిన్ను అడ్డంగా నరికెయ్యడానికి అంటూ సమాధానమిస్తాడు.’’ 11
ఆ సంభాషణ విన్న విశాలకు అదే వయసులో ‘‘ఆ ఉన్న తన కొడుకు గుర్తుకు వస్తాడు. సినిమాల ప్రభావంతో తన కొడుకు కూడా లేని మీసం మెలి తిప్పుతూ’’ రేయ్... రారా దమ్ముంటే ప్లేసు నువ్వు డిసైడ్ చేస్తావా, నన్ను చేయమంటావా... ఎక్కడైనా సరే. ఎప్పుడైనా సరే... నీవూరి లోనైనా సరే, నా వూరిలో నైనా సరే... ఒక్కనివైనా రా, వందమందితోనైనా రా... సింగిల్ గా వస్తా... వుత్త చేతుల్తో వస్తా... నీ ఇంటి కొస్తా... నీనట్టింటి కొస్తా... నాతొడ సౌండ్ కే ఛస్తార్రా మీరు’’ అంటూ ముద్దు ముద్దుగా పలికే వాడిని చూసి చుట్టు ప్రక్కల వాళ్ళు ముద్దులముంచెత్తేవారు.
పాఠశాల విశ్రాంతి గదిలో విశ్రాంతి తీసుకుంటున్న విశాల వద్దకు నాల్గవతరగతి విద్యార్థి లావణ్య తన తల్లితో పాటు వస్తుంది. లావణ్య తల్లి మౌనంగా ఒక పేపర్ ను తీసి చూపిస్తుంది. విశాల ఆ పేపరును చూసి ఆశ్చర్యపోతుంది. ఎర్రని రక్తంతో రాసిన ప్రేమలేఖ రాసింది ఐదవ తరగతి చదివే తేజ. లావణ్య తల్లిని సర్దిచెప్పి పంపిస్తుంది విశాల. తేజను పిలిచి మందలిస్తుంది.
అదే పాఠశాలలో మూడవ తరగతి చదువుతున్న అమ్మాయి సరిగా భోజనం చేయకపోవడాన్ని గమనించిన విశాల మందలిస్తుంది. అందుకు సమాధానంగా ఆ అమ్మాయి. నేను సినిమా హీరోయిన్ లాగ బక్కగానే ఉంటా. ఎక్కువ తిని లావైతే అందరూ ఏడిపిస్తారు అని అంటుంది. ఆ మాట వింటూనే విశాలకు తన కూతురు కీర్తి సరిగా తినకపోవడానికి సమాధానం దొరికినట్లైంది. నేటి సినిమాలు చూసి పిల్లలు బాగా చెడిపోతున్నారని బాధపడుతుంది. పిల్లల్లో క్రిమినల్ ఐడియాలజీ పెరగడానికి సినిమాలే కారణమని భావిస్తుంది. సినిమాలలో ఉపాధ్యాయ వృత్తిని కించపరిచే సన్నివేశాలు కూడా అధికంగానే ఉంటున్నాయి. ఏ మాత్రం బాధ్యత లేకుండా ఉపాధ్యాయ పాత్రలను పోషించే వారు విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు. అందువలన విద్యార్థులు ఉపాధ్యాయుల మీద చవక బారు కామెంట్లు చేస్తున్నారు. విద్యార్థికి, ఉపాధ్యాయుడికి మధ్య ఉండే స్నేహసంబంధం బాగా దెబ్బతిన్నది. ఆఖరికి పిల్లలను కడుపు నిండా అన్నం కూడా తిననీయకుండా చేస్తున్న సినిమాల ప్రభావాన్ని తలచుకుని విశాల ఎంతగానో బాధపడుతుంది.
రచయిత హరికిషన్ ఈ కథకు పెట్టిన శీర్షిక కథకు తగ్గట్టుగా ఉంది. సినిమా అనే ముళ్ళపొదలోని చిక్కుకున్న పూల మొగ్గల్లాంటి విద్యార్థులు ఆ ప్రభావం నుండి బయట పడలేక తమ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. చిన్న పిల్లలు సినిమాలలోని సన్నివేశాలను, సంభాషణలను అనుకరిస్తూ, అనుసరిస్తూ తమ బంగారు భవిష్యత్ ను పాడుచేసుకుంటున్నారని తెలియజేసే ఉద్దేశంతో రాసిందే ఈ కథ. ఈ కథ ద్వారా రచయిత సమాజంలో సినిమాల పట్ల చైతన్యాన్ని కలిగించే ప్రయత్నం చేసారు. తల్లిదండ్రులు తమ పిల్లలను సినిమాలకు, సాంకేతిక మధ్యమాలకు వీలైనంత దూరంగా ఉంచడం వలన వారి భవిష్యత్ బంగారుమయవుతుంది అని అంతర్లీన సందేశంతో సాగింది ఈ కథ.
‘‘రేయ్.. మర్యాదగా నా పెన్సిల్ నాకియ్. ల్యాకపోతే పీక... పీక కోస్తా ఏమనుకుంటున్నావో! ఒక పిల్లవాడు రౌద్రంగా అన్నాడు. వెంటనే మరో పిల్లోడు ఏందిరానువ్ కోసేది నా కంటి సూపు సాలు నిన్ను అడ్డంగా నరికేయ్యడానికి అంటూ సమాధానమిచ్చాడు.’’
రచయిత సినిమాల ప్రభావం పిల్లల మీద, వారి చదువు కెరియర్ మీద ఎంతగా ఉన్నదో వివరించారు. తమ పేరు కూడా సరిగా పలకలేని చిన్నారులు సైతం హీరోల భారీ డైలాగుల్ని బట్టీ పట్టి వాటిని తమ కనుకూలంగా అవసరమైన చోట టకటకా చెబుతూ ఉండటం చూస్తే వారు ఎంత ప్రభావితం అవుతున్నారో అర్ధం అవుతుంది.
సినిమాలు, సీరియళ్ళలో వచ్చే డైలాగులు, హింసాత్మక ధోరణిని చిన్న వయసు నుండే పిల్లల మనసులో నాటుతున్న తీరు అహేతుకంగా ఉంది అనిపిస్తుంది. సినిమా అనేది కేవలం నటన మాత్రమే అని, అది తమ జీవితాలకు అన్వయించకూడదని పిల్లలలో చైతన్యం నింపాలన్నదే రచయిత చేసిన ఈ సదాలోచన.
‘‘విశాల వాన్ని కోపంగా చూస్తూ చేతిలోకి బెత్తం తీసుకొని వేలెడంతలేవు. అప్పుడే లవ్ లెటర్స్ రాసేంత పెద్దోని వై పోయావురా నువ్ అంటూ ఇష్టమొచ్చినట్లు చావ బాదసాగింది. వాడాదెబ్బలకు తట్టుకోలేక ఏడుస్తూ ‘‘సారీ మేడమ్ ఇంకెప్పుడు రాయను మేడమ్. ప్లీజ్ మేడమ్ కొట్టొద్దు మేడమ్ అంటూ, ప్రాధేయపడసాగాడు. అంతలో అరుణ విశాల చేతిలోని బెత్తాన్ని గుంజేసింది'’12
చిన్న వయసులోనే సినిమాల ప్రభావం వలన పిల్లలు ప్రేమ అనే పదానికి అర్ధం కూడా తెలియని వయసులో ఆకర్షణలో పడి లవ్ లెటర్స్ అంటూ చెడిపోవడం గూర్చి రచయిత వివరించారు. రచయిత ఈ కథ హాస్యాస్పదంగా నడిపిస్తూనే సందేశాత్మకంగా తీర్చిదిద్దిన తీరు కనబడుతుంది. రక్తంతో లవ్ లెటర్ రాసిన పిల్లాన్ని, నిలదీసి అడిగిన టీచర్ ఆ రక్తం కూడా వేరే వాడి కాలికి తగిలిన గాయం నుండి సేకరించాడని తెలిసి హతాసురాలైపోయిన వైనం చూస్తే పిల్లలు ఎంతగా సినిమాలు, సీరియళ్ళకు, ప్రకటనలకు ప్రభావితం అవుతున్నారో రచయిత విసదీకరించారు.
‘‘నేను సినిమా హిరోయిన్లెక్క బక్కగానే వుంటా. లావైతే అందరూ దుబ్బీ.... దుబ్బీ... అనేడిపిస్తారు’'13 అంది. సినిమాలు, ప్రకటనలు చూసి పిల్లలు ఏ విధంగా తమ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారో సినిమా అనే ముళ్ళపాదల్లో పడి వారి భవిష్యత్ ఎలా నాశనం చేసుకుంటున్నారో చక్కగా వివరించారు. రకరకాల క్రీములు, శీతల పానియాలు వివిధ రకాలైన సౌందర్యోపకరణాలు వాడి ఎంతో మంది ఆరోగ్యపరంగా శారీరకంగా ఎన్నో ఇబ్బందులకు గురైనవారూ ఉన్నారు. రచయిత శీర్షిక కథకు తగ్గట్టుగా పెట్టారు.
7. ముగింపు :
అరుణతారలో ప్రచురితమైన ఈ చైతన్య కథల్లో సమాజంలో ప్రజల జీవన స్థితిగతుల్లో మార్పు సాధించడానికి అభివృద్ధి నెలకొల్పడానికి ఎన్నో అంశాలు విపులంగా వివరించారు.
‘‘కానుక’’ కథలో జాలరుల ఇతివృత్తం ద్వారా వారు నిత్యం ఎన్నో కష్టాలు పడి చేపలు వేటాడి తెచ్చి మార్కెట్‌లో వారు విక్రయించకుండా మధ్యలో దళితులను నమ్మి, వారికి చేపలు అమ్మి తీవ్రంగా నష్టపోయే విషయాన్ని వివరించి ఈ విధానంలో మార్పు వస్తేనే వారి బ్రతుకుల్లో వెలుగు వస్తుందని రచయిత వారికి సందేశం ఇచ్చారు.
‘ఎర్రగౌను పిల్ల’ కథలో చెడు సహవాసాలకు, దురలవాట్లకు బానిసలైన కొందరు చిన్న పిల్లలను అపహరించి, వారి అవయవాలతో వ్యాపారం చేసే దుస్థితి సమాజానికి విశదీకరించి ఈ పరిస్థితి నుంచి సమాజం మార్పు చెందాలని, చిన్న పిల్లలను ఎల్లప్పుడూ కాపాడుకోవాలని తల్లిదండ్రులకు హిత బోధ చేసారు.
‘‘ట్రాఫిక్ జామ్ డాట్ కామ్’’ కథలో చలపతిరావు పాత్రద్వారా జీవితానికి ఆధారమైన ఉద్యోగం పోయినా ధైర్యంగా తట్టుకుని నిలబడాలని, చిన్న చిన్న కష్టాలకే ఆత్మహత్యలు చేసుకోకూడదని ఒక చైతన్యవంతమైన సందేశం ఇచ్చారు.
‘‘మెట్లమీద’’ కథల్లో గ్రామంలో కొందరి మాటలు, పాటలకు ఆకర్షితులైన యువతి యువకులు తొండరపడి ముందూ వెనుకా ఆలోచించకుండా ఉద్యమంతో చేరకూడదని చెబుతూ ఒకసారి తమ కుటుంబ సభ్యుల పరిస్థితిని ఆలోచించి అడుగులు వేయాలనే మంచి మాట చెప్పారు.
‘‘మయ సభ’’ కథలో రచయిత సమాజంలో తల్లిదండ్రులు వారి పిల్లలకు సంపదగా ఇవ్వవలసింది ధనం, బంగారం లాంటిదికాదని, వారికి ఇవ్వవలసిన నిజమైన ఆస్తి అంటే చదువు సంధ్యలని, వాటి వలనే వారు తమ జీవితంతో అభివృద్ది చెందుతారని వివరించారు.
‘‘ముళ్ళపొదల్లో పూల మొగ్గలు’’ కథలో రచయిత పిల్లలు సినిమాలు చూసి ఏవిధమైన చెడు అలవాట్లును నేర్చుకుంటున్నారో వివరించారు. యువతీ యువకులు సినిమాల్లో కథానాయకుడు, కథనాయికలను చూసి వారి వేషధారణ మాటతీరు అనుకరించడం ప్రేమ వ్యవహారాలు లాంటివి చేయరాదని, మంచి సినిమాలు రావాలని ఆకాంక్షించారు.
8. పాద సూచికలు:
- అరుణతార పత్రిక-2001-మార్చి, ఏప్రిల్-భావన-పుట-18.
- అరుణతార పత్రిక-2001-మార్చి, ఏప్రిల్-భావన-పుట-19.
- అరుణతార పత్రిక-2002-జనవరి-కె.వి.కూర్మనాధ్-పుట-26.
- అరుణతార పత్రిక-2002-జనవరి-కె.వి.కూర్మనాధ్-పుట-27.
- అరుణతార పత్రిక-2002-ఫిబ్రవరి-పల్లామోహన్-పుట-14.
- అరుణతార పత్రిక-2002-ఫిబ్రవరి-పల్లామోహన్-పుట-14.
- అరుణతార పత్రిక-2001-సెప్టెంబరు, అక్టోబరు-మిడ్కో-పుట-12.
- అరుణతార పత్రిక-2001-సెప్టెంబర్, అక్టోబరు-మిడ్కో-పుట-22.
- అరుణతార పత్రిక-2002-జూలై, ఆగష్టు-బమ్మిడి జగదీశ్వరరావు-పుట-19.
- అరుణతార పత్రిక-2002-జూలై, ఆగష్టు-బమ్మిడి జగదీశ్వరరావు-పుట-20.
- అరుణతార పత్రిక-2003-డిశంబర్-ఎం.హరికిషన్-పుట-05.
- అరుణతార పత్రిక-2003-డిశంబరు-ఎం.హరికిషన్-పుట-5.
- అరుణతార పత్రిక-2003-డిశంబరు-ఎం.హరికిషన్-పుట-06.
9. ఉపయుక్త గ్రంథసూచి :
- ఆనందలక్ష్మి.సి.-తెలుగు నవలల్లో కుటుంబ జీవనం, నవజ్యోతి పబ్లికేషన్స్, విజయవాడ- 1979.
- ఇనాక్, కొలకలూరి-సాహిత్య వ్యాసాలు, సి.ఎల్.ఎస్.బుక్ షాపు, స్టేషన్ రోడ్డు, హైదరాబాదు - 1974.
- కృష్ణమూర్తి ఇరివెంటి-తెలుగు కథా రచయితలు, ఆంధ్రప్రదేశ్ సాహితీ అకాడమీ, కళాభవన్, సైఫాబాద్, హైదరాబాద్-4, 1982
- కాళీపట్నం రామారావు-కథాకథనం, స్వేచ్ఛాసాహితీ ప్రచురణలు, విజయవాడ, 1990.
- గుడిపాటి-ఇతివృత్తం, రుషి ప్రచురణలు, విజయవాడ-3, 2003.
- గుడిపాటి-సంవిధానం, పాలపిట్ట బుక్స్, హైదరాబాద్, 2013.
- ఘండికోట బ్రహ్మాజీరావు-కథానిక కథకమామిఘా, విజయ పబ్లికేషన్స్, మామిడికుదురు, తూర్పుగోదావరి జిల్లా, 1996
- చంద్రశేఖర్ రెడ్డి రాచపాలెం- కథాంశం (వ్యాస సంపుటి), తారక్‌నాథ్ కోలనీ, అనంతపురం, 2006.
- జి.యోహాన్ బాబు-బలివాడ కాంతారావు నవలలు-పరిశీలన-1994.
- జి.యోహాన్ బాబు-పత్రికా రచన-పరిచయాలు.
- జాషువా గుర్రం-జాషువా రచనలు (గబ్బిలం-ఖండ కావ్యం)
- దక్షిణామూర్తి పోరంకి-కథానిక స్వరూప స్వభావాలు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 1988.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.