AUCHITHYAM | Volume-04 | Issue-09 | August 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed
5. కూచిమంచి తిమ్మకవి స్వస్థానం: పిఠాపురం ప్రాశస్త్యం
డా. సుద అంకమ్మ
సహాయాచార్యులు
తెలుగు శాఖాధ్యక్షులు, RGUKT AP,
ఆర్.కె.వ్యాలీ, వేంపల్లి, కడప, ఆంధ్రప్రదేశ్
సెల్: +91 8985995523. Email: suda2maruthi@gmail.com
Download PDF
వ్యాససంగ్రహం:
పిఠాపురం సంస్థానం గర్వించదగ్గ ప్రాచీనపట్టణం. అష్టాదశశక్తిపీఠాలలో పీఠికాపురం ఒకటి. శాసన వాఙ్మయంలో పిఠాపురానికి పిష్టపురం, పైష్టకపురం అనే పేర్లున్నాయి. ప్రధానంగా ఇది శక్తి పీఠంగా గుర్తింపబడింది. స్కాందపురాణంలోని భీమఖండం, 3వ అధ్యాయం వేదవ్యాస మహర్షి చేసిన తీర్థయాత్రా వర్ణనల్లో దీని ప్రస్తావన ఉంది. నా పత్రసమర్పణ కోసం ప్రాచ్యపరిశోధన సంస్థ గ్రంథాలయం, తిరుపతి., తిరుమల తిరుపతి దేవస్థానం సెంట్రల్ లైబ్రరీ, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం గ్రంథాలయం మొదలైన చోట్ల పుస్తకాలను సేకరించాను. ఈ వ్యాసం 17, 18 శతాబ్దాల సామాజికాంశాలు, కవికి దేవునిపైగల భక్తిని మొదలైన అంశాలను చర్చిస్తుంది. శతకసాహిత్యంపై అవగాహన కల్గిస్తుంది. ప్రాచీన సాహిత్య పరిశోధనలకు మార్గదర్శకంగా తోడ్పడుతుంది.
Keywords: పిఠాపురం, సంస్థానాలు, చరిత్ర, సాహిత్యం, పురాణాలు, తిమ్మకవి.
1. ఉపోద్ఘాతం
ఆంధ్రదేశంలో "నేటి తూర్పుగోదావరి జిల్లాలో గల తూర్పు భాగాలను `ప్రోలునాడు` అని పేర్కొనేవారు. క్రీ.శ. 1084 నుంచి ఈ పేరు ప్రచారంలో ఉన్నట్లు శాసన ప్రమాణం కనబడుతున్నది. అత్యంత ప్రాచీనమైన ఈ పేరు నేటికి వ్యాప్తిలో వుంది. అయితే ప్రజల నోళ్లలో పడి అది పొర్లునాడు గా మారింది. పెద్దాపురం, కాకినాడ, పిఠాపురం, తుని ప్రాంతాలు కలిసి ప్రోలునాడుగా ఏర్పడ్డాయి అని `ఆరుద్ర` ఉవాచ.
ఈ నాల్గు సీమల్లో పెద్దాపురం. పిఠాపురం సంస్థానాలు ఆనాటి ఆంధ్ర రాజకీయాలలో ప్రముఖ పాత్ర వహించడమే కాదు, సాహిత్య పోషణలో అనల్పమైన సేవచేశాయి. ఈ రెండు సంస్థానాల్లోను పిఠాపుర సంస్థానం పార్లునాడు గర్వించదగ్గ ప్రాచీన పట్టణం!1 అష్టాదశ శక్తిపీఠాలలో `పీఠికాపురం` ఒకటి.
శ్లో||
ఉజ్జయిన్యాం
మహాకాళీ, పీఠ్యాంచ
పురుహూతికా
ఓఢ్యాణే
గిరిజాదేవి,
మాణిక్యాదక్షవాటికే2
అని శ్రీ ఆదిశంకరులు రచించిన అష్టాదశ శక్తిపీఠ స్తోత్రంలోని ఒక శ్లోకం దీనిచేత పీఠికాపురంలో వెలసిన శక్తి పేరు ``పురుహుతికా`` అని తెలుస్తున్నది.
కూచిమంచి తిమ్మకవి `రుక్మిణి పరిణయం` మనే ప్రబంధావతారికలో `పీఠికాపురాన్ని` యిలా ప్రస్తుతించాడు.
సీ||
పాదగయాక్షేత్ర
పరమ
పవిత్రంబు -
పురుహుతి కాంబకు
(బుట్టినిల్లు
యేలానదీ
జలావృత
తటాకానీక
-మఖిల
శక్తులకువిహారభూమి
తోరంపులవణ
పాదోనిధి తీరంబు -
నిర్మల
గౌతమీ
నికటసీమ
కుంతిమాధవదేవు
గురుతర
స్థానంబు-విలసిత
భీమ మండల
తలంబు
తే.గీ.
“సేతుకాశీ
ప్రయాగాద్యశేష
దివ్య - తీర్థరాజంబులందు
(బ్రతిష్ఠ
(గాంచి
సకల
దోషాపనోదకశక్తి
నలరు
- పుణ్యసారంబు
పీఠికాపుర
వరంబు``3
ప్రాచీనకాలంలో “పీఠికాపురం” అనే పేరు గల పట్టణమే నేటి ``పిఠాపురం``. ఈ పిఠాపురానికి పాదగయా క్షేత్రమని పేరు. ఇచ్చటి శక్తిదేవత పేరు పురుహుతిక! ఇక్కడ ఏలానదీ ప్రవహిస్తూ వుంది. గౌతమీనది తీరానికి దగ్గరగా ఉండేదే పిఠాపురం. ఈ పట్టణం భీమ మండలంలో ఒక భాగం. ఇక్కడ కుంతీమాధవదేవుడు కొలువై ఉన్నాడు. ఈ దివ్యక్షేత్రం సేతు రామేశ్వరం. కాశీ, ప్రయాగ వంటి పుణ్యక్షేత్రాలంత పవిత్రమైనది.
రెండవ కవి సార్వభౌముడైన కూచిమంచి తిమ్మకవి ఇంతగా పీఠాపురాన్ని గూర్చి చెప్పినపుడు, మొట్టమొదటి కవి సార్వభౌముడు శ్రీనాథుడు `భీమేశ్వర పురాణం`లో చాలా విపులంగా పీఠికాపుర ప్రాశస్త్యాన్ని వివరించియున్నాడు.
సీ||
ఏ పట్టణము మ్రోలనేలేరు ప్రవహించు -
పృథ్వికి ముత్యాల పేరు వోలె
మున్నూట యిరువది మూర్తి భేదములతో - విహరించు
నేవీటి వేల్పుపిండు
పీఠాంబ చెలియోగ పీఠి హుంకృతి దుర్గ - ననిచి కాపుండు నేనగరి
కెలన
కుంతీమహాదేవి కూర్మి మేనల్లుడు - మాధవుండే వీట
మరగినాడు
తే.గీ. “పెద్దగవులకు నేపుట
భేదనములు-
నెలమి నిలుచుండు వ్రీడా విహీనజఘను
డట్టి
పీఠాపురము జేరనరుగుదెంచె-
పరమశైవుండు శ్రీ
పరాశరసుతుండు”4
పీఠికాపురం సమీపంలో ప్రవహించే ‘ఏలేరు’ కాలువల ప్రవాహ సౌందర్యం భూదేవికి ముత్యాల హారపు పేటల వలె ఉన్నాయి. ఇక్కడ 320 మూర్తి భేదాలతో దేవతలు వచ్చి విహరిస్తూ ఉంటారు. పీఠికాపురానికి దగ్గరలోనే పీఠాంబకు చెలికత్తెయైన యోగపీఠనివాసిని హుంకారిణీ శక్తి పీఠముంది. ఆ శక్తి విగ్రహం ఈనాడు కనబడడం లేదు. కాని, శ్రీనాథుని కాలం వాటికి ఉన్నట్లు మనం భావించవచ్చు. పీఠికాంబ అనే పేరుగల శక్తి విగ్రహాన్ని శ్రీనాథుడు భీమేశ్వరపురాణంలో ఇలా వర్ణించాడు.
“హాటక పానపాత్రయును, నారగ బండిన
మాతులుంగమున్
ఖేటము, లోహదండము నొగిన్ ధరియించి పురోపకంఠ
శృం
గాటక భూమిభాగమున గాపురముండెడి పీఠికాంబకున్
గైటభదైత్యవైరి ప్రియకాంతకు మ్రొక్కునతండు
భక్తితో”5
పీఠికాంబకు నాల్గుచేతులు. ఆ నాల్గింటిలో క్రమంగా బంగారు పానపాత్ర, పండిన మాదీఫలం, త్రిశూలం, లోహదండాన్ని పట్టుకొని ఆ ఊరి పొలిమేరలో నాలుగు త్రోవలు కలిసే చోటులో శ్రీనాథుని కాలంలో వుండేది. ఆ తర్వాత కొత్తపేటలోని కుమారస్వామి ఆలయానికెదురుగా ఉండే చెరువులో ఎంతోకాలం ఉండిపోయినది. ఆ శక్తి విగ్రహాన్ని కుమారస్వామి ఆలయంలో ప్రతిష్ఠించడానికి భయపడినారు. కానీ, అది పురాతనమైన శక్తి విగ్రహమని తెలుసుకొన్న తర్వాత దేవాలయంలోని ప్రాకారంలో ఒకచోట దానిని స్థాపించినారు. భీమేశ్వరపురాణంలో శ్రీనాథుడు పీఠికాపురాన్ని ఒక గద్యలో యిలా వర్ణించాడు.
“అఖిల భువనాభిరామంబులైన ఆరామంబుల వలన కన్నులపండువై కుంతీమాధవ దేవునకు విశ్రాంతి ప్రదేశంబును, హుంకారిణి మహాదేవికి విహార సంకేత భవనంను, పీఠికాంబ లక్ష్మీకాట కూటంబును, హేలాసానికి లీలాపాన గోప్ఠీమండపంబనదగి భూత, భేతాళ, ఢాకినీ, ప్రేత, రంకా, భైరవ వ్రాత నిర్మిత ప్రాకార వప్రహట్ట కుట్టిమంబగు పీఠాపట్టణం బని”6 వర్ణించి ఉండడం గమనింపదగింది.
తెలుగు సాహిత్యంలో కుక్కటేశ్వరుని తొలిసారిగా ప్రస్తావించినవాడు. కవిసార్వభౌముడు శ్రీనాథుడే! భీమేశ్వర పురాణంలోని ప్రస్తావన మొట్టమొదటి సాహిత్యాధారంగా గ్రహింపవచ్చు.
- “అది కుక్కుటేశ్వరంబయ్యుపాంతము మేడ - హుంకారిణీ దేవి యోలగంబు” 7
- మహిత గోదావరీ మండల ప్రాంతంబు-ప్రాకటాంభోరాశి పరిసరంబు
విశ్రుతాష్టా దశపీఠాధిరాజంబు - పాదగయాక్షేత్ర పావనంబు
నిరుపమ కుక్కుటేశ్వర దివ్యనిలయంబు-త్రిముఖలింగేశ్వరా ధిష్ఠితంబు
శ్రీకుంతిమాధవ స్థిరతరాగారంబు -భాస్వదేలానదీ పరివృతంబు
తే.గీ. పృధులతర శాస్త్ర వర
పురాణేతిహాస-వేదవేదాంత విద్యావివేక సహిత
భూసురా గ్రేసరాత్యంత
భాసురంబు-పుణ్యనికరంబు పీఠికాపురవరంబు”
8
శ్రీనాధుని శివరాత్రి మాహాత్మ్యంలో కూడా, “కుక్కుటేశ్వర వరకుండి పిఠాపురి” 9 అనే ప్రస్తావన కనబడుతుంది. కూచిమంచి తిమ్మకవి కుక్కుటేశ్వర శతకం ప్రసిద్దమైనదే. ‘పీఠికాపుర మేవ త్రివిష్టపమిహ’ (ఈ భూలోకంపై వెలసిన స్వర్గమే పీఠికాపురం) అని హరికథా పితామహులు శ్రీ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు ప్రశంసించారు.
2. శాసన వాఙ్మయంలో పిఠాపురం:
శాసస వాజ్మయంలో పిఠాపురానికి పిష్టపురం, పైష్టకపురం,
పైష్టపురం అనే పేర్లు కనబడగా, పురాణ వాజ్మయంలో పీఠికాపురం, పీఠాపురం అనే
పేర్లు చెప్పబడ్డాయి. ఈ పీఠికాపురం ప్రధానంగా
శక్తిపీఠంగా
గుర్తింపబడింది.
కుక్కుటేశ్వర క్షేత్రం వలన పిఠాపురానికి `దక్షిణకాశి` అనే పేరు ఏర్పడింది. ఆలయానికి ఎదురుగా ఉన్న పుష్కరిణికి `పాదగయ` అని పేరు. ఇది కొన్ని వందల సంవత్సరాలుగా శివక్షేత్రంగా ప్రసిద్ధికెక్కినప్పటికి పురాతత్త్వవేత్తల (ఆర్కియాలజిస్టు) నిర్ణయం ప్రకారం, ముఖ్యంగా డా. శ్రీ పాద గోపాలకృష్ణమూర్తి గారు వ్రాసిన ఆంధ్రదేశంలో జైనస్థావరాలు (The Jain Vestiges in Andhra) అనే గ్రంథంలో నేటి పిఠాపురంలో అతి ప్రాచీనకాలంలో ఒక జైనదేవాలయం ఉండేదని అక్కడ కుక్కుట సర్ప పరీవృతుడైన తీర్థంకరుని విగ్రహముండేదని, ఆంధ్రదేశంలో వీరశైవమతం వైష్ణవమతాలు విజృంభించిన కాలాలలో అంటే 12, 13 శతాబ్దాలలో జైనులను వీరశైవులు పారద్రోలి వారి దేవాలయాలనూ, శివాలయాలుగా మార్చుకొన్నారని, అందుకే విగ్రహాల నిర్మాణంలో రెండు వైపుల కుక్కుట సర్పముల ప్రాధాన్యాన్ని తెలియజేసే విధంగా వున్న శివునికి కుక్కుటేశ్వర స్వామి అని పేరు పెట్టడం జరిగిందని పురాతత్త్వవేత్తల నిర్ణయం.10
జైనులకు పూర్వం పిఠాపురం ప్రఖ్యాత బౌద్ధక్షేత్రమై వుండేదని, బౌద్దుల కుక్కుట జాతక కథలలో చెప్పబడిన పిట్టపురమే నేటి పిఠాపురమని ‘కుక్కుట శబ్దం’ ఆనాడే ఏర్పడి వుందని అదే కుక్కుటేశ్వరస్వామిగా పరిణమించిందని శ్రీ వడ్డాది శ్రీరామచంద్రమూర్తిగారు ‘పిష్టపుర చరిత్ర’ అనే వ్యాసంలో పేర్కొంటున్నారు.11
ఇక శాసనాలను పరిశీలిస్తే......
- సముద్రగుప్తుని అలహాబాదు శాసనం (క్రీ.శ. 360) లోను
- రెండవ పులకేశి ఐహోళె శాసనం (క్రీ.శ. 634-35) లోను
- విష్ణువర్ధనుని తిమ్మావరం శాసనంలోను
- శక్తివర్మ రాగోలు శాసనంలోను, పిఠాపురానికే పైష్టకపురం, ‘పైష్టపురం’, ‘పిష్టపురం’ అనే పేరు కనబడుతుంది.
ఆచార్య ఎస్వీ జోగారావుగారు చాళుక్య జయసింహ వల్లభుని ‘పిష్టపుర’ శాసనాలను పరిష్కరించి భారతిలో ప్రకటించారు.12
3. పిఠాపురం - పౌరాణిక నేపథ్యం :-
స్కాంద పురాణంలోని భీమఖండంలో గల 3వ అధ్యాయం వేదవ్యాస మహర్షి చేసిన తీర్థయాత్రను వర్ణిస్తూ ఉంది. ఆయన దక్షిణ భారతదేశయాత్ర చేస్తూ పిఠాపురానికి శిష్య సమేతంగా వచ్చినట్లు పేర్కొనబడింది.
కేదార
కుంభకోణాది
పుణ్యక్షేత్ర
సమంమహత్
పిఠాపురం మునివరో
నిజశిష్యై
స్సహా
విశత్”
13
పిఠాపురం పాదగయాక్షేత్రం ఎట్లయినదో, కుక్కుటమనే పేరుతో పిఠాపురంలో వెలసిన శివునికి గల సంబంధమేమిటో తెలుసుకుందాం.
కుక్కుటమనే మాటకు రెండర్థాలున్నాయి. 1) కుక్కుటసర్పం. 2) కోడి మొదటి అర్థంలో జైన తీర్థంకర విగ్రహాల చేతులకు లతలు అల్లుకొని ఉండడం గమనించవచ్చు. ఈ తీర్థంకరుల విగ్రహాలు పాము పడగల క్రింద ఉన్నట్లుగా కనపడుతున్నాయి. వీటిని కుక్కుట సర్పాలుగా చెబుతారు. కాబట్టి, పిఠాపురంలోని శివునికి కుక్కుటేశ్వరుడనే పేరు ఏర్పడింది. అంటే అతి ప్రాచీనకాలంలో ఇది జైన దేవాలయమన్నమాట. చారిత్రక నేపథ్యం తెలియకుండా మనం దీనికి అర్థం చెప్పలేము.
ఇక పౌరాణిక నేపథ్యంలో కుక్కుటమంటే కోడి అనే అర్థం వచ్చేటట్లుగా ఒక కథ కల్పించబడింది. ఆ కథ ఇలా వుంది. కృతయుగంలో పరమ భాగవతోత్తముడైన గయాసురుడునే దానవ రాజుండేవాడు. ఆయన చేసిన మంచి పనుల వలన ఇంద్ర పదవి లభించింది. ఆ దానవ రాజు మూడు లోకాలను పరిపాలించేవాడు. పదవి కోల్పోయిన ఇంద్రుడు మరలా తన పదవిని పొందడానికి బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను ప్రార్థించినాడు. ఇంద్రుని కోరికపై త్రిముర్తులు బ్రాహ్మణ వేషాన్ని ధరించి గయాసురుని వద్దకు వెళ్ళారు. ఆయన వారిని సత్కరించి వచ్చిన పని తెల్పమన్నారు. దానికి వారు తాము ఒక యజ్ఞం తలపెట్టినామని యజ్ఞవేదిక కోసం కొంత స్థలాన్ని ఇవ్వమని ప్రార్థించారు.
గయాసురుడు యజ్ఞవేదికగా తన శరీరాన్ని సమర్పించినాడు. గయాసురుని దేహంపై త్రిమూర్తులు యజ్ఞం చేశారు. యజ్ఞం తొలి కోడికూత సమయానికి ప్రారంభింపబడింది. యజ్ఞం భగ్నం చేయడానికై ఇంద్రుని కోరికపై శివుడు కోడి రూపం ధరించి నిర్ణీత సమయానికి కుక్కుటధ్వని చేశాడు. ఆ కోడి కూత విని గయాసురుడు యజ్ఞం పూర్తయిందని భావించి తన శరీరాన్ని కదిలించినాడు. యజ్ఞ భంగం కావించినందులకు గయాసురుని సంహరిస్తామని త్రిమూర్తులు పలికినారు. గయాసురుడు దానికి అంగీకరించాడు. మరణ సమయంలో ``నీ ఆఖరి కోరిక ఏమిటని త్రిమూర్తులు అడిగారు. అందుకు గయాసురుడు ఈ విధంగా చెప్పాడు.
తన శరీర భాగాలలో ముఖ్యమైన మూడు భాగాలు మూడు దివ్యక్షేత్రాలుగా విరాజిల్లే విధంగాను, అందులో శిరోభాగంలో విష్ణువు, నాభి దేశంలో బ్రహ్మ, పాదాల వద్ద శివుడు కోడి రూపాన్ని ధరించిన విధంగా త్రిమూర్తులు అనుగ్రహించారు. ఈ మూడు క్షేత్రాలలో ఎవరైనా తమ పితరులనుద్దేశించి పిండ తర్పణాలు చేసినట్లయితే వారి పితరులు నూరుతరాలవారు కూడా తరించేటట్లు త్రిమూర్తులు వరాన్ని అనుగ్రహించారు.
ఈ విధంగా పిఠాపురం, మూడు గయలలో మూడవ గయ అయిన పాదగయా క్షేత్రంగా ప్రఖ్యాతి గాంచినది.
- శిరోగయ గయాక్షేత్రం బీహార్ రాష్ట్రం
- నాభిగయ జాజ్‌పూర్ రైల్వేజంక్షన్ -ఒరిస్సా రాష్ట్రం
- పాదగయ పిఠాపురం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
పితృదేవతలకు ముక్తినిచ్చే క్షేత్రంగా పిఠాపురం ప్రసిద్ధికెక్కింది. ఈ క్షేత్రంలో గయ పాదములు, విష్ణు పాదములున్నాయి.
పురాణములననుసరించి పిఠాపురం, శివక్షేత్రం, శక్తిక్షేత్రం కూడా. గయాసుర సంహారార్థము శివుడు స్వయంభువంగా కోడి రూపాన్ని ధరించి వెలసిన దివ్యలింగమూర్తి. ఆయనను కుక్కుటేశ్వరస్వామిగా భక్తులు ప్రశంస చేస్తున్నారు,
దక్షయజ్ఞంలో తన శరీరాన్ని విడిచిన సతీదేవి యొక్క మృతకళేబరం శ్రీ మహావిష్ణువుచేత గల సుదర్శన చక్రం చేత ఖండితమై 18 భాగాలుగా వింగడింపబడి భూమిపై పడగా అందులో ప్రధానమైన పీఠభాగం ఈ క్షేత్రంలో పడినందున దానికి పిఠాపురం అనే పేరు ఏర్పడింది.14
పిఠాపురం దత్తక్షేత్రం కూడా. శ్రీ దత్తాత్రేయ స్వామి సుమతీ రాజశర్మ పుణ్యదంపతులకు శ్రీ పాద శ్రీ వల్లభులుగా పాదగయ క్షేత్రంలో జన్మించి స్వయంభువంగా వెలసి వున్నారు. దత్తక్షేత్రాలు భారతదేశంలో మూడు ప్రసిద్ధి పొందినాయి.
- పిఠాపురం - పాదగయాక్షేత్రం - శ్రీ పాద శ్రీ వల్లభస్వామి జన్మస్థానం
- కరంజా - నృసింహ సరస్వతీ జన్మస్థానం
- సహ్యాద్రి -(మారచార్ ఘడ్) దత్తాత్రేయ జన్మస్థానం. దత్తాత్రేయ మూలస్థానం పాదగయాక్షేత్రం. భారతదేశంలో గల దత్త పుణ్యక్షేత్రాలలో ఈ పుణ్యక్షేత్రంలో మాత్రమే స్వామివారు విగ్రహారూపంలో వున్న స్వయంభూమూర్తి.
పిఠాపురం విష్ణుక్షేత్రంగా కూడా వాసికెక్కింది. వృత్రాసురుని వధించిన తరువాత ఇంద్రునికి చుట్టుకొన్న బ్రహ్మ హత్యాదోష నివృత్తి కొరకు ఐదు విష్ణు ప్రతిష్టలు చేసినాడు. ఈ ఐదింటికి పంచ మాధవ క్షేత్రాలుగా పేర్లు ఏర్పడ్డాయి.
మొదటి క్షేత్రం కాశి. ఇది బిందు మాధవక్షేత్రం.
రెండవది ప్రయాగ. వేణు మాధవక్షేత్రం.
మూడవ క్షేత్రం పిఠాపురం.
ఇది కుంతీ మాధవ క్షేత్రం.
నాల్గవది రామేశ్వరం. సేతు మాధవ క్షేత్రం.
ఐదవది అనంత పద్మనాభం. ఇది సుందర మాధవ క్షేత్రం.
4. ముగింపు :
భారతదేశంలో గల దత్తపుణ్యక్షేత్రాలలో చెప్పుకోదగినది పిఠాపురం. స్వామివారు విగ్రహరూపంలో వున్న స్వయంభూమూర్తి.
పిఠాపురం విష్ణుక్షేత్రంగా కూడా ప్రసిద్ధికెక్కింది. వృత్రాసురుని వధించిన తర్వాత ఇంద్రునికి చుట్టుకొన్న బ్రహ్మ హత్యాదోష నివృత్తి కోసం ఐదు విష్ణు ప్రతిష్ఠలు చేశాడు. ఈ ఐదింటికి పంచమాధవ క్షేత్రాలుగా పేర్లు వచ్చాయి. అందులో మూడవ క్షేత్రం పిఠాపురం. ఇది కుంతీ మాధవ క్షేత్రం, మొదటి కాశి. అక్కడ బిందుమాదవుడున్నాడు. రెండవది ప్రయాగ, వేణిమాధవ క్షేత్రం, నాల్గవది రామేశ్వరం, సేతుమాధవ క్షేత్రం. ఐదవది అనంతపద్మనాభం, ఐదు సుందర మాధవక్షేత్రం. ఈ విధంగా పిఠాపురం ప్రాచీన చరిత్ర కాలం నుండి ఎన్నో మార్పులకు లోనై శివక్షేత్రంగా, శక్తిక్షేత్రంగా, దత్తక్షేత్రంగా, విశేషించి విష్ణుక్షేత్రంగా కూడా ప్రసిద్ధిలోకి రావడంచేత ఆ ప్రాంతాలలో పుట్టి పెరిగిన కూచిమంచి తిమ్మకవి కుక్కుటేశ్వరస్వామికే తన గ్రంథాలన్నీ అంకితం చేసి, వాటితో తృప్తి పడక ఒక శతకాన్ని ఆ స్వామి పేరుతో రాయడం తెలుగుసాహిత్యంలోనే ఒక విలక్షణమైన అంశంగా చెప్పవచ్చు.
ఈ నా వ్యాసంలో 17, 18 శతాబా్దల సామాజికాంశాలు, కవికి, దేవునిపైగల భక్తిని చూడవచ్చు. అలాగే శతక సాహిత్యంపై అవగాహన కలిగిస్తుంది. ప్రాచీన సాహిత్య పరిశోధనలకు మార్గదర్శకం అవుతుందని భావిస్తున్నాను.15
5. పాదసూచికలు
- ఆరుద్ర సమగాంధ్ర సాహిత్యం సంపుటం – 12 - 1968 ప్రోలునాటి కవులు - పుట
- ముదివేడు ప్రభాకరరావు భారతీయ సంప్రదాయ భూమిక భిన్నత్వంలో ఏకత్వం - శ్రీ జ్ఞాన ప్రసూన మాలికా ప్రచురణలు - తిరుపతి 2000 పుటలు 300-301
- కూచిమంచి తిమ్మకవి, రుక్మిణీ పరిణయం అవతారిక
- శ్రీనాధుడు, భీమేశ్వర పురాణం - పిఠాపుర ప్రాశస్త్యం
- శ్రీనాధుడు, భీమేశ్వర పురాణం ఆశ్వాసం-2, పద్యం -57
- శ్రీనాధుడు, భీమేశ్వర పురాణం ఆశ్వాసం-2, గద్య -58
- శ్రీనాధుడు, భీమేశ్వర పురాణం ఆశ్వాసం-2, పద్యం -59
- శ్రీనాధుడు, భీమేశ్వర పురాణం ఆశ్వాసం-1, పద్యం -32
- శ్రీనాధుడు శివరాత్రి మహాత్మ్యము
- శ్రీ పాద గోపాల కృష్ణమూర్తి, The Jain Vestiges in Andhra Dept. of Archaeology, Govt. of A.P., Hyd - 1967.
- శ్రీ వడ్డాది శ్రీరామచంద్రమూర్తి, పిష్టపుర ప్రాచీన చరిత్ర, ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక, కాకినాడ, 1937, పుటలు 2012-16
- ఆచార్య యస్వీ జోగారావు, చాళుక్య జయసింహ వల్లభుని పిష్టపుర శాసనములు, భారతి, డిసెంబరు 1933, పుటలు 17-20.
- స్కాందపురాణాంతర్గత భీమఖండం, అధ్యాయం-3, వేదవ్యాస మహర్షి చేసిన దక్షిణ భారతదేశ యాత్ర
- పెద్దింటి మాధవాచార్యులు, పీఠికాపుర క్షేత్ర మహాత్మ్యం, కుంతీమాధవస్వామి దేవస్థానం, పిఠాపురం - 1986.
- శ్రీ పీఠపురి క్షేత్ర మహిమ, పన్నాలభట్ట శర్మ పిఠాపురం – 1989
6. ఉపయుక్తగ్రంథసూచి:
- కమలా అనార్కలి, సి. పిఠాపుర సంస్థానం కవిపండిత పోషణ - కాకినాడ - 1984.
- గోపాలకృష్ణారావు, కె. - ఆంధ్రసాహిత్య వికాసం, హైదరాబాద్, 1970
- తిమ్మకవి, కూచిమంచి. అచ్చ తెలుగు రామాయణం - వావిళ్ల మ్రదాసు - 1954.
- తిమ్మకవి, కూచిమంచి.- కుక్కుటేశ్వర శతకము (నీతి శతక సంపుటం) - వావిళ్ల రామస్వామి శాస్త్రి అండ్ సన్స్, చెన్నపురి, 1929.
- నాగేశ్వర రావు, కాశీనాథుని. శతకమంజరి - భక్తి సంపుటం, ఆంధ్ర గ్రంథమాల, చెన్నపురి, 1930
- పన్నాలభట్ట శర్మ, శ్రీ పీఠపురిక్షేత్ర మహిమ - పిఠాపురం, 1989
- ప్రభాకరరావు, ముదివేడు - భారతీయ సంప్రదాయ భూమిక, భిన్నత్వంలో ఏకత్వం,జ్ఞానప్రసూన మాలిక ప్రచురణలు, తిరుపతి.
- బాగయ్య, ఎం. కూచిమంచి తిమ్మకవి - జీవితం, స్వీయప్రచురణ హైదరాబాదు, రచనలు - ఒక పరిశీలన, 1993
- మాధవాచార్యులు, పెద్దింటి. పీఠికాపుర క్షేత్ర మాహాత్మ్యము
- వేంకట రమణయ్య, నేలటూరి. నాయక రాజులనాటి ఆంధ్ర సాహిత్య పోషణ -
- వేంకటకృష్ణశర్మ, వేదం - శతకవాఙ్మయ సర్వస్వము (ప్రథమ సంపుటం), 1954
- శ్రీరామచంద్రమూర్తి, వడ్డాది. - పిష్టపుర ప్రాచీన చరిత్ర - ఆంధ్రసాహిత్య పరిషత్తు పత్రిక, కాకినాడ, 1937 - పుటలు 212-216
- శ్రీరామమూర్తి, కొర్లపాటి. తెలుగు సాహిత్య చరిత్ర - రమణశ్రీ ప్రచురణలు (సంపుటి-5), వాల్తేరు – 1998
- సుబ్బారావు, వంగూరి - శతక కవుల చరిత్ర (ద్వితీయ ముద్రణ), 1954
- స్వామి శివశంకరస్వామి - శతక సంపుటం (ద్వితీయ భాగం), ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.