headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-09 | August 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

4. సాహిత్యప్రయోజనం: కుందుర్తి దృక్పథం

dr_p_viswaprasad.jpg
డా. పి. విశ్వప్రసాదు

సహాయాచార్యులు
SRR GASC (A) కళాశాల, కరీంనగర్,
కరీంనగర్, తెలంగాణ
సెల్: +91 9866802692. Email: pogulavishwam72@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

“ప్రపంచం బాధ అంతా శ్రీశ్రీ బాధ” అన్నట్లు కవి సమాజాన్ని ఏ అవగాహనతో పరిశీలిస్తున్నాడు అనేది ముఖ్యం. అంతకు ముందున్న సాహిత్యంలో అనుభూతి స్థానంలో కవి దృక్పథం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. అనుభూతి హృదయానికి, మనసుకు సంబంధించినది. దృక్పథం ఆలోచనకు, ప్రధానంగా ఆచరణకు మార్గం చూపింది. తద్వారా ఊహల స్థానంలో భౌతిక వస్తువుకు ప్రాధాన్యం కలిగింది. ప్రజల జీవితం బాగుండాలి అంటే జీవిత అవసరాల ఉత్పత్తి ఎక్కువ కావాలి. దానికి తగిన సాంఘిక ఆర్థిక విధానాలు ఉండాలి. ఈ నిరంతర లక్ష్యం సాధ్యం కావాలంటే ఆలోచన ఆచరణలో సమిష్టి భావన ఎంతో ముఖ్యం. ఇదే అభ్యుదయం. ప్రజలకు తమ శక్తి సామర్థ్యాలను గుర్తించేలా బోధించాల్సిన అవసరం అభ్యుదయ కవుల మీద ఉంది. సమాజంలోని వర్గ దోపిడిని వివరించి చైతన్యపరిచే బాధ్యత కూడా అభ్యుదయ కవిదే. కుందుర్తి ఈ బాధ్యతను స్వీకరించారు. ఏ రచన అయినా, సందేశాత్మకంగా, మానవ ప్రయోజనాల్ని ఉద్దేశించి, ఉండాలనేది, కుందుర్తి అభ్యుదయదృక్పధం. ఈ అవగాహనతో కుందుర్తి రచనల ద్వారా అతని సాహిత్య ప్రయోజనాన్ని అంచనా వేయడం ఈ వ్యాస ఉద్దేశం.

Keywords: దృక్పధం , ఫ్రీ వర్స్ ఫ్రంట్ , అభ్యుదయం , సామాజిక స్పృహ, దర్శనం

1. నేపథ్యం:

“పాతకాలం పద్యమైతే వర్తమానం వచన గేయం” అని పూర్తిగా వచన కవిత్వాన్ని ఒక ఉద్యమంగా నడిపిన వాడు వచన కవితా పితామహుడు కుందుర్తి.(1922_1982). ఫ్రీవర్స్ ఫ్రంట్(1958) ను స్థాపించి వచన కవిత్వానికి చిరునామా అయ్యారు, నయాగరా, తెలంగాణ, నగరంలో వాన, నాలోని నాదాలు, హంస ఎగిరి పోయింది, ఇదే నా దేశం, కుందుర్తి పీఠికలు, కుందుర్తి వ్యాసాలు, బతుకుబాట, మొదలైనవి ఇతని రచనలు, జాషువా విశ్వనాథల ప్రభావాలతో పద్య కవిత్వం పై అవగాహన కల్పించుకొని సౌప్తికం అనే కావ్యాన్ని రాసిన తర్వాత శ్రీ శ్రీ ప్రవాహంలో పడి అభ్యుదయ దృక్పథం, వచనకవిత్వానికి దగ్గరైనారు.. నయాగరా ఈయన తొలి కవితా సంపుటి. బెల్లంకొండ రామదాసు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం, కుందుర్తి వీరిని నయాగారకవులు అంటారు కుందుర్తి రచనలు కుందుర్తి కృతులుగా ప్రచురించబడ్డాయి. కుందుర్తి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు,రాష్ట్ర సాహిత్య అకాడెమీ అవార్డు,సోవియట్ లాండ్ నెహ్రూ పురస్కారం (1969) మొదలైన గౌరవాలుపొందారు. ఈయన కవిత్వంలో అభ్యుదయ దృక్పథం, హేతువాద దృష్టి, సామాజిక స్పృహ, అధిక్షేపణలు యువ కవులను ఆకర్షించాయి..

2. ఉపోద్ఘాతం:

వర్తమాన సమాజం యొక్క ఆలోచనలను ఆశయాలను సాహిత్యం ప్రతిఫలిస్తుంది. సమకాలీన ఆలోచన స్వభావాలను తనలోఇముడ్చుకొని ఆవేశాన్ని పొందుతుంది. గతకాలపు ప్రమాణాలను ఆదర్శంగా తీసుకునేందుకు సిద్ధ పడదు. ప్రస్తుత జీవన స్థితిగతులను నుంచి ప్రజల జీవన విధానాల నుంచి విషయాన్ని స్వీకరించి దానికి తగిన భావవ్యక్తీకరణ సిద్ధం చేసుకుంటుంది. దీనికి సామాజిక, ఆర్థిక, రాజకీయ, మత, తాత్విక వ్యవస్థలు దోహదపడతాయి. సామాజిక అవగాహన బాధ్యతలు ఉన్నకవి ఈ సంకల్పంతోనే రచన చేస్తాడు. ఇలాంటి ప్రగతిశీల ఆలోచనలతో రచనలు చేసిన కవి కుందుర్తి.

సాహిత్య ప్రయోజనం ఆనందంగా నిర్ణయించినట్లు అయితే ఆ ఆనందం ఎవరికి? దేనికి ఆనందం? అన్న మౌలిక ప్రశ్న ఆధునిక సాహిత్యాన్ని మలుపు తిప్పింది. ఈ ఆనందం పాఠకుల్ని, శ్రోతల్ని రెండుగా విభజించి ఒక సుఖవంతమైన వాతావరణాన్ని సాహిత్యం నిండా పరిచింది. దీనికి నోచుకోని పాఠక వర్గం తమ ప్రయోజనాన్ని ఆనందానికి ప్రత్యామ్నాయంగా నిలబెట్టే సాహిత్యం కోసం ఎదురు చూసింది. చైతన్యవంతులైన కవులు ఈ పనికి పూనుకున్నారు. సమాజ వ్యవస్థల పట్ల జాగృతిని కలిగించి, వ్యక్తిని భాగస్వామిని చేసి, అతనిలో చైతన్యాన్ని ప్రేరేపించే ప్రయత్నం చేశారు. వీరి కవిత్వం శక్తివంతమైనది. ప్రబోధాత్మకమైనది,అభ్యుదయకరమైనది.

3. నిర్వచనం:

కవి అయిన వాడికి జీవితం మీద సర్వసమగ్రమైన దర్శనం ఉండాలి” (కుందుర్తి పీఠికలు పు 7) అంటాడు కుందుర్తి. 

జీవితాన్ని ఒక కోణంలో పార్శ్వపుదృష్టితో కాకుండా, సమ్యక్ దృష్టితో పరిశీలించినప్పుడు సమన్వయానికి మార్గం దొరుకుతుంది అంటారు. కవి గతకాలపు వైభవాలను వర్ణించడంలో, కీర్తించడంలో సఫలత పొందలేడు. తాను జీవిస్తున్న జీవితానికి దాని అలజడులను పోరాటాలను వదిలి రచన ముందుకో, వెనక్కో సాగడం అర్థం లేనిది. దిశానిర్దేశం చేసే కవి సామాన్య జనానికి ప్రతినిధి కావాలి.

నీడలా వెంటాడే నేటి కాలపు జీవితాన్ని/ పట్టుదలగా కావ్యాలలో ప్రతి ప్రతిఫలింప చేస్తానట” (కుందుర్తి పీఠికలు. పు.16) అంటాడు కవి. 

ఈ క్రమంలో తన పోరాటంలో తనను వెనక్కి లాగే ప్రయత్నాలను, కుయుక్తులను ఎదుర్కొనేందుకు కవి సిద్ధంగా ఉండాలి అంటాడు.

అడుగు ముందుకు పడేస్తుంటే/అడ్డుపుల్లలు వేస్తుంది” అని వీటినిఅడ్డుకొని ముందుకు సాగడమే అభ్యుదయ కవి ప్రధాన కర్తవ్యమని బోధిస్తారు. కవితను నిర్వచిస్తూ -

.../వివేకంతో మర్యాదగా ఏర్పరిచి చెడు మంచి/ చీకటికి లొంగని, వెలుగు చూసి వెర్రిగా పొంగని సమన్వయం సాధించడం కవిత ”(కుందుర్తి కృతులు 1. పు.27) అని, ఆ సమన్వయ సాధన కోసం కవి తీవ్రంగా ప్రయత్నం చేయాలంటారు. 

తద్వారా భవిష్యత్తులో అందమైన ప్రపంచాన్ని ఆవిష్కరించడం కవితకు పరమార్ధం అంటూ తీర్పు ఇస్తారు. 

భవిష్యత్తు పట్ల సరైన అవగాహన సామాన్య ప్రజల్లో ఉండకపోవచ్చు. ఆకలి, అజ్ఞానం వెనుకబాటుతనం, వివక్షలకు గురవుతున్న పీడితులు అందమైన కలలు కనడం కూడా నేరంగా భావించవచ్చు. అంతమాత్రాన వారి జీవితాలు అలా చీకట్లోనే ఆరిపోకుండా వెలుగుల దారి వారి కోసం వేచి ఉందంటూ దానిని చేరేందుకు మార్గాన్ని సుగమం చేసేందుకు వారిని చైతన్యపరచాలి. 

ఎడారి పుష్పి స్తుందని చెప్పటం మా జాతి కవులకు అలవాటు” (కుందుర్తి పీఠికలు పు.19) అని కుందుర్తి అసాధ్యాలను సుసాధ్యం చేసేదే కవిత్వంగా భావించాడు. 

సాహిత్యం సామాన్య జనజీవితంలో మమేకమై చైతన్య స్ఫూర్తిగా విశ్వశ్రేయః సాధనంగా ఆనందదాయకంగా మారినప్పుడు ఆనందం ఎవరికి దేనికి అన్న ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. సాహిత్యం పరిపూర్ణతను సాధిస్తుంది.

4. నిర్మాణం:

నిర్దేశిత లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నా దాన్ని చేరుకునేందుకు కవి భావన ఎంత స్ఫూర్తిమంతంగా వుండాలో చైతన్యవంతమైన దాన్ని వ్యక్తపరిచే భాష కూడా అంత సుందరంగా వ్యంగ్యంగా ఉండాలంటారు కుందుర్తి.

 “నా ఊహలో కవితకు శరీరం ప్రజల వ్యవహార భాష/ఆత్మ వారి అభ్యున్నతి”( కుందుర్తి కృతులు పు 34)అంటాడు. 

ఎంత గొప్ప భావన అనిపించుకునేదైనా అయోమయంగా పులమడం అసమర్థ కవితా లక్షణంగా భావించాడు. గొప్ప భావాన్ని సహజంగా సరళంగా అందించగలవారే గొప్ప కవులు అని చెప్పే విషయంలోతోపాటు రీతి, శైలి కూడా సహజత్వాన్ని పోగొట్టుకోవద్దు అంటారు.

వ్యవహార భాష పద ప్రయోగం కౌశలం వచన కవితకు ప్రాణం వంటిది” (కుందుర్తి కృతులు పు.26) అని సూత్రీకరించాడు. 

ఊహలకు స్థల కాలాదులతో ప్రమేయం ఉండదు. వాటికి ప్రాంతీయ జాతీయ సరిహద్దులు ఉండవు. కానీ కవి తన భావాన్ని ప్రకటించేందుకు మాత్రం భాష విధిగా ఉండాల్సిందే.

భాష విధించే పరిమితులకు లోనుకాకుండా కవి తన భావాలను ప్రకటించలేడు”(కుందుర్తి పీఠికలు పు.33

అని అనడంలో కవి లోకజ్ఞానంతో పాటు భాషా జ్ఞానం కూడా ఎంత ముఖ్యమో చెబుతాడు. తన బాధ్యత స్పష్టంగా తెలిసిన కవి ఈరెంటినీ సాధిస్తాడు.
ప్రతిభ అంటే చెప్పే తీరులో కవి చూపించే నేర్పు. ప్రాచీన అలంకారికులు, కవుల ప్రకారం ఛందస్సు, అలంకారాలు, ధ్వని, వక్రోక్తి మొదలగు వాటికి తోడుగా తన చుట్టూ ఉన్న సమాజాన్ని గురించిన అవగాహన దాని మార్పుపట్ల బాధ్యత కూడా గుర్తించి రచనలో వీటికి ప్రధాన భూమికను ఇవ్వగలిగితే ప్రతిభ మరింత అర్థవంతం అవుతుంది అంటాడు. ఇంకాస్త ముందుకెళ్లి

చారిత్రక దృష్టితో తిరుగుబాటును ప్రబోధిస్తూ ఉన్న కవులందరూ ఒక జాతికి చెందిన వారే” (కుందుర్తి పీఠికలు.. పు.. 23)

అని చారిత్రక దృష్టితో సమాజాన్ని అధ్యయనం చేయడం అభ్యుదయ కవుల బాధ్యతగా సూచన చేస్తాడు. కావ్యాల్లో వర్ణన మానవ జీవిత ఇతివృత్తంలో సమన్వయం పొందినప్పుడు దాని కావ్యత్వగుణం పెరుగుతుందని, వర్ణ కేవలం సాధన మాత్రమేనని, లక్ష్యం ప్రజల అభ్యున్నతి అని అంటారు.

సామాజిక ప్రయోజనాన్ని లక్ష్యంగా చేసుకున్న సాహిత్యం ప్రధానంగా సామాన్యుడి జీవితానికి సంబంధించినదై ఉంటుంది. కాబట్టి ఆ సాహిత్యం సామాన్యుడికి అర్థమయ్యేటట్లు ఉండాలి. ఎంచుకున్న వస్తువు, నిర్వహణ, భాష అతడికి అందుబాటులో ఉండాలి. దానిలో చిత్రించిన చైతన్యాన్నిబట్టి ఆ జీవితాన్ని అర్థం చేసుకుంటూ తద్వారా రచయితకు సమాజం పట్ల అవగాహనను సూత్రీకరించవచ్చు. ఈ అవగాహన కుందుర్తి

“ఒక్క మాటలో చెప్పాలంటే మానవ జీవితాన్ని ముందుకు సాగనీయకుండా దాని చుట్టూ అల్లుకొని అడ్డుపడుతున్న ముండ్ల కంచేలను తొలగించే కృషితో పూర్తిగా సంబంధం ఉంటుంది. అది వారి సాహిత్య కృషి లక్ష్యంగా భావిస్తుంది” (కుందుర్తి పీఠికలు..పు..40) అన్నాడు. 

అడ్డుపడుతున్న ముండ్ల కంచెలను తొలగించే ప్రయత్నంలో సమాజంలోని ఇరు పక్షాల్లో శతృ భావం పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా కవిదే. అభ్యుదయ కవిత్వం మానవీయ కోణంలో సాగాలని సుందరమైన భవిష్యత్తుకు సమాజం మొత్తం సహకరించాలన్నారు. బడుగు జీవిని బాగుచేసే ప్రయత్నంలోనే సమాజం ఉన్నత స్థితి వైపు సాగుతుందని దానికి కవిత్వం బాసటగా నిలవాలని 

సామాన్యుడి బాధలకు స్వరూపం కలిగిస్తూ/ ప్రేమను ప్రతి వారి హృదయపు ప్రమిదలో వెలిగిస్తూ/ భవిష్యత్తును దర్శించిన కవితా రీతి”( కుందుర్తి కృతులు పు.. 28) 

లక్ష్యంగా చేసుకొని అభ్యుదయ కవులు రచనలు చేయాలన్నారు. మోయలేని బాధలతో కష్టాల్లో సామాన్యుడు అవస్థల పాలవుతున్నారు. తాను నిర్హేతుకంగా కోల్పోతున్న జీవితం వెనుక అసలైన సత్యాన్ని కనుక్కొని దానిద్వారా - అంటే సత్యం ద్వారా చైతన్యం కలిగించడం కవిత్వ ప్రయోజనం అంటారు. సత్య ఆవిష్కరణ ద్వారా వ్యక్తి జ్ఞానవంతుడు అవుతాడు. జ్ఞానిసమాజం పట్ల సమరస భావంతో ఉంటాడు. అప్పటివరకు ఉన్న అలజడులకు స్పష్టమైన కారణాలు తెలియడంతో నీతి మార్గంతో సమసమాజ స్థాపనకు ప్రతిన పూనుతాడు. దీనినే “కవితలు జ్ఞాన లోచనం విప్పడం” అంటూ కారణం బోధపడ్డాక 

“హేతువు సస్యాన్ని జాతి పరం చేస్తాను/ మనిషి చెట్టు కు నీతి పూలుయిస్తాను” (నగరంలో వాన.పు.14) 

అంటూ సాహిత్యం చేయాల్సిన విశేష కృషిని తెలియజేస్తాడు. దీని కోసం ఎంచుకున్న కవితామార్గం కూడా 

“.....రమ్యాక్షరాల గింజలు చల్లి/ మహార్థాల సస్యం కోసి / విశ్వ శ్రేయస్సు వెదజల్లుతాను” (కుందుర్తి కృతులు పు.47) 

అని కవిత్వ నిర్వహణ కూడా సుఖదుఃఖాలుగా విడిపోయిన జీవితాల్లోకి దిగులుపడే కన్నుల వైపు ప్రేమగా స్నేహ హస్తాలు చాచి బాధాతప్త జీవితాల్లో వెలుగులు పూయించేందుకు సరళంగా, సుందరంగా నిర్మిస్తానంటాడు

5. ప్రయోజనం:

సామాజిక ప్రయోజనం విశ్వ శ్రేయస్సు కవిత ప్రయోజనాలుగా భావించిన కుందుర్తి తన దారిని స్పష్టం చేస్తూ,

ప్రయోజనం తండ్రి/పరమ సౌందర్యం తల్లిగా/పలికే ప్రతి వాక్కు రసానంద కల్పవల్లిగా/ నా దారి నాది” ( కుందుర్తి పీఠికలు పు.17) అని కవి యొక్క సామాజిక బాధ్యతను విశ్లేషిస్తాడు.

దీనికి వ్యతిరేకంగా మానవజాతి పురోగమనానికి దోహద పడని కవి, అతని సాహిత్యం అర్థరహితమైనదని భావిస్తాడు. సాహిత్యం ప్రధానంగా తాను ఆశించే నవసమాజం వైపుగా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తూ వారి ఊహలను భావనలను దానికి అభిముఖంగా తీర్చిదిద్దడమేగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తుంది. కవిత్వం ప్రజలకు దూరం కాకుండా ఉండాలంటే ఈ మార్గం ద్వారా తప్పనిసరిగా ప్రయాణించాలి.

రచనల్లో ప్రధానంగా వస్తువు పట్ల గౌరవం చూపించిన కుందుర్తి తన కవితా సామగ్రిని వివరిస్తూ-

అమరవీరుల దివ్య గాథలు/ అతి సామాన్యుల బ్రతుకు బాధలు/ప్రతి మానవుడు కన్న కలలు/ ప్రతి ఉద్యమ సముద్రంలో లేచిన త్యాగాలు అలలు”(కుందుర్తి పీఠికలు పు.41)

అంటూ సామాన్యుల దీన గాథలనుండి ఉద్యమ త్యాగాల వరకు అన్నీ సామాజిక ప్రయోజనాన్ని పొందేందుకు దోహదపడతాయని దీనికోసం “పందిరి మీద తీగలా పదిదిక్కులకు పాకుదాం” అంటూ సమస్యలు ఎన్ని రకాలైన, క్లిష్ట సందర్భాలు అయినా కవి పారిపోకూడదు అని మరింత విస్తృతంగా రచనలు చేయాలంటారు. అది కూడా పందిరి మీద తీగలా చాలా సరళంగా, సహజంగా, సమాజంలో జ్ఞాననేత్రం తెరుచుకునేలా రచనలు చేయాలని సూచిస్తారు. “గుణం ముఖ్యం కానీ గణం ముఖ్యం కాదు” అంటారు. కవిత్వం కోట్లాది పేదల బాధల్ని కొలిచి చూపేటట్లు ఉండాలని పస్తులతో దిగులు చెందిన అన్నార్తులకు ఓదార్పు కావాలని కవితా వస్తువులు వాటి లక్ష్యాలను విపులంగావివరించారు.

కవితా వస్తువుగా సామాన్యుల్ని ఎంచుకున్న కుందుర్తి తన కవిత్వం నిండా సామాన్యుడి దీనాలాపనలనే వినిపించాడు. అడుగడుగున అతడు పడే వేదనను విస్మరించరాదని, గత కాలపు కావ్య వస్తువుల్లో విస్మృతికి గురైన సామాన్యుడికి పెద్దపీట వేస్తూ ఈనాటి కవిత్వం చారిత్రక ప్రజల ఉద్యమ చైతన్యానికి ప్రతినిధి అని దీనిని

“ప్రజల కోసమే రాసేది/ వారే కృతి భర్తలు/ ప్రజల గురించే రాసేది/ వారే భవిష్య నిర్మాణకర్తలు”(కుందుర్తిపీఠికలు.పు.31)

అంటూ సామాన్యుడి పక్షాన అద్భుతమైన భవిష్యత్తును వాగ్దానం చేస్తాడు.ఆనందాల శిఖరాల మీద చిరునవ్వుల బావుటాను ఎగురవేయాలని భావిస్తాడు. రాబోయే భవిష్యత్తు తన గురించి వాకబు చేస్తూ తన కవిత్వాన్ని సూత్రీకరించే ప్రయత్నం చేస్తోందన్న ఊహతో

“....నరుని వదిలి ఏనాడు నా చూపు నక్షత్ర సంగీతం వినాలని/ ఆకాశంలోకి దూర లేదు/ బ్రతుకు బాధలు సమరాంగణంలో/భయంతో నేను ఏనాడు వెన్నిచ్చి పారిపోలేదు”(కుందుర్తి పీఠికలు పు 22)

అని తన కవి హృదయాన్ని నిర్భయంగా ఆవిష్కరిస్తాడు. సామాన్యుడి లోని విశిష్ట లక్షణాలను ఎంచుకొని వాటి గురించి రాయాలని అప్పుడే ప్రజలు మన్నిస్తారని ఈనాటి సాహిత్యం అలాంటి ధోరణి అలవర్చుకోవాలి హితవు చెప్తాడు. ఈ స్పృహ కనిపిస్తే దాన్ని మరింత బాధ్యతతో నిర్వహించాలని కోరుకుంటారు. “సామాన్యమానవున్ని కవిత్వంలో పోతపోయడం నా లక్ష్యం" అని తన కవితా లక్ష్యాన్ని స్పష్టం చేస్తాడు కుందుర్తి.

పాలక వర్గ ప్రయోజనాలు కాకుండా పాలితుల ప్రయోజనాల కొరకు కవిత్వం విస్తరించాలి. సామాన్యుల అవసరాలను ఆకాంక్షలు తీర్చే రీతిలో సామాజిక స్థితిగతులను కాపాడేందుకుకానీ మార్చేందుకుకానీ కావలసిన ప్రేరణ సాహిత్యం సమకూర్చాలి. సామాన్యుడికి అవసరమైన ఆనందాన్ని దూరం చేస్తున్న ప్రతీప శక్తుల పట్ల జాగ్రత్త వహించి వాటిని సాహిత్యంలో నిర్భీతిగా నిలదీయాలి. తద్వారా సామాన్యుని ఆనందానికి మార్గం సుగమం చేయాలి. భవిష్యత్తు గురించి ఆశావహమైన అవగాహన పెంపొందింప చేయాలి. గతాన్ని అర్థం చేసుకుంటూ ఆత్మవిశ్వాసంతో భవిష్యత్తు ఆహ్వానించేందుకు సాహిత్యం సామాన్యుడిని సిద్ధం చేయాలి. వ్యక్తుల గురించి కాకుండా సమాజం పట్ల బాధ్యత వహించాలి. దీనినే

“కావ్యం వ్యక్తిగతమైన ఆనందానికి కాక, సామాజికమైన సామూహిక ఆనందానికి దోహదకారి కావాలి” (కుందుర్తి పీఠికలు పు 19)

అంటూ విశ్వమానవ కళ్యాణానికి సాహిత్యం దారులు వేయాలని భావించాడు.

సామాజిక ప్రయోజనం చైతన్యమని పరమ లక్ష్యానికి ఎట్టి పరిస్థితుల్లో బంధం కలగకూడదని అంటాడు. ఆధునిక కవులు బలంగా కవిత్వం రాయాలని, భవిష్యత్తులో శతాబ్దాల తర్వాత అప్పటి పాఠకులు ఇప్పటి పరిస్థితు లను సరిగ్గా అంచనా వేయగలిగిన విధంగా కవి సమ్యక్ దర్శనంతో స్పష్టతతో ఉండాలంటారు. దీనికి కవికి స్పందించే గుణం ఎక్కువ మోతాదులో ఉండాలని హృదయంతో ఆలోచించి బుద్ధితో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. పాఠకుడు కూడా కవి హృదయాన్ని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే అతడు ఏ కాలపు పాఠకుడు అయినా సహృదయుడు కావాలి. కవికి సమ్యక్ దర్శనం పాఠకుడికి సహృదయత ప్రధానం. దీనినే క్లుప్తంగా కుందుర్తి “కవిత్వాలు హృదయాలు ఉన్నవాళ్లకి” అని తీర్మానించాడు. సాహిత్యమే కవికి సర్వస్వం అయినప్పుడు కవి నిబద్ధతతో ఉంటూ ప్రజలను సరియైన దిశలో చైతన్యపరిచే ప్రయత్నం చేస్తాడు. సామాజిక ప్రయోజనం హేతుబద్దమైన శాస్త్రీయదృష్టి, వాస్తవికతపైన ఆధారపడిన ఆలోచనలు కవికి పనిముట్లుగా ఉన్నట్లయితే పైది సాధ్యమవుతుంది.

సామాజిక ప్రయోజనమే లక్ష్యంగా రచనలు చేసిన కుందుర్తి

“ఇది నా కవిత్వంగీత వినే వాడు నరుడు/ చదువు సంధ్య రాని రోడ్డుమీద పామరుడు/ లేమి తల్లిఒడిలో నిరంతర గాఢనిద్రాపరుడు” (కుందుర్తి పీఠికలు.పు.48)

అంటూ ఆనిద్ర పరుని మేలుకొల్పే విధంగా కవితా లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ణయించుకొని సామాన్యుని కోసం కలం పట్టి అభ్యుదయ మార్గంలో నడిచాడు. మానవతావాదంతో కూడిన అభ్యుదయ దృక్పథం కుందుర్తిది. “నా గీతం నరజాతి విముక్తికి సంగీతం” అని వర్గపోరాటం ద్వారా సమసమాజం ఏర్పడాలని కుందుర్తి సాహిత్యప్రయోజనం సామాజికప్రయోజనంతోనే నెరవేరుతుందని భావించారు.

6. ముగింపు:

కవిత్వం సామాన్య జనానికి ప్రతినిధిగా ఉంటూ వారి జీవితాల్లోని అన్ని కోణాలను సృష్టించాలి. సమాజాన్నిఅభ్యుదయ,హేతువాద దృష్టితో పరిశీలించి మానవతావాదం భూమిక గా సమన్వయాన్ని సాధించాలి. శ్రామిక జీవితాలను చైతన్య పరిచేందుకు కవిత్వం వాహిక కావాలి. వారికి ఒక అందమైన సమసమాజాన్ని వాగ్దానం చేయాలి. గొప్ప భావాన్ని కూడా సరళంగా, సులభతరం చేస్తూ సహజత్వానికి దగ్గరగా ఉన్నప్పుడే కవిత్వానికి నిజమైన ప్రయోజనం.

కవినిబద్ధతే కావ్య ప్రయోజనం ఈ నిబద్ధత సమాజంలోని అసమానతలను సరిచేస్తూ గొప్ప భవిష్యత్తుకు దీపదారిగా ఉండాలి. ఈ సామాజిక ప్రయోజనమే అసలైన సాహిత్య ప్రయోజనంగా కుందుర్తి భావించాడు.

ఆధునిక సాహిత్యంలో రచయిత అవగాహన, దృష్టి కోణం మారింది. సాహిత్యం అనుభూతి విలువల కంటే ఆచరణాత్మక విలువల వైపు మొగ్గు చూపింది. అభ్యుదయ దృష్టితో ఆలోచించే కవులు సమాజంలోని అన్ని రకాల వ్యవస్థలోని డొల్లతనాన్ని ప్రశ్నించారు. మెరుగైన, మేలైన సమసమాజ నిర్మాణానికి సాహిత్యాన్ని మాధ్యమంగా చేసుకున్నారు. వ్యక్తి, సమిష్టి ప్రయోజనాలను ఉద్దేశించి ఆధునిక సాహిత్యం నడుస్తుంది. విశ్రాంతి, శ్రామిక జీవుల మధ్య ఉన్న అగాధాన్ని పూడ్చే ప్రయత్నం ఆధునిక సాహిత్యం చేసింది. పీడితుల పక్షాన గొంతెత్తి సమన్వయం కుదిరిచే పని ఈ సాహిత్యం నిండా కనిపిస్తుంది.

భాషలో, భావనలో స్పష్టత, సరళత సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తుందని భావించి, సృజన కారులు ఆ దిశలో ప్రయత్నాలు చేశారు. సాహిత్య ప్రయోజనం ఆనందం అని కాకుండా చారిత్రక దృష్టితో పీడితులను చైతన్యం పరిచేది అసలైన ప్రయోజనం గా భావించారు. విస్మృతి జీవితాలపై వెలుగు రేఖలను ప్రసరింప చేయడమే ఆధునిక సాహిత్య లక్ష్యంగా భావించారు. వారి జీవితాన్ని సూక్ష్మస్థాయిలో అంచనా వేయడమే ప్రయోజనంగా భావించారు. రచయిత,పాఠకుడు ఇద్దరూ వ్యవస్థ పట్ల బాధ్యతతో కూడి ఉంటే ఈ సాహితీ ప్రయోజనం నెరవేరినట్లే. సమ సమాజ స్థాపనే ఆధునిక సాహిత్య లక్ష్యమనీ,సాహితీకారులు దీన్ని దృష్టిలో ఉంచుకొని సామాజిక బాధ్యతతో రచనలు చేస్తే ఆ సామాజిక ప్రయోజనమే సాహితీ ప్రయోజనంగా గౌరవించబడుతుందని కుందుర్తి అభిప్రాయం.

7. ఉపయుక్తగ్రంథసూచి:

1 కుందుర్తి కృతులు 1 – కుందుర్తి, మార్చి 1975,హైదరాబాద్
2. కుందుర్తి పీఠికలు – కుందుర్తి, మార్చి,1977, స్పందన సాహితీ సమాఖ్య, మచిలీపట్నం
3. నగరంలో వాన – కుందుర్తి,సెప్టెంబర్, 1967,హైదరాబాద్
4. కుందుర్తి నాటకములు – కుందుర్తి మార్చి,1975,హైదరాబాదు
5. ఆధునిక తెలుగు సాహిత్యంలో విభిన్న ధోరణులు – కేకే రంగనాథాచార్యులు (సం), 1982, ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాద్

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]