headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-09 | August 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

3. జాషువా కవితావైశిష్ట్యం: ఇతర కవులపై జాషువా ప్రభావం

dr_pv_ramana.jpg
డా. పప్పల వెంకటరమణ

తెలుగు అధ్యాపకులు
ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పురుషులు),
శ్రీకాకుళం, శ్రీకాకుళం, ఆంధ్ర ప్రదేశ్
సెల్: +91 9491811710. Email: ramanapappala1@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

గుఱ్ఱం జాషువా తక్కువ కులంలో పుట్టినప్పటికీ అత్యుత్తమ కవిత్వం రాసి అగ్రకులజులచే గండ పెండేరం తొడిగించుకున్న మొదటి దళిత మహాకవి. చీత్కారాలు పొందిన చోటే సత్కారాలు పొందెను. కళలకు కులమతాలు లేవని, స్వశక్తితో ఏ స్థాయికైనా చేరవచ్చునని జాషువా గారి జీవితమే తెలియజేస్తుంది. జాషువా పై సమగ్ర పరిశోధన చేసి తెలియని విషయాలను తెలియపరచడమే వ్యాస రచయిత ముఖ్య ఉద్దేశము. జాషువ రచనల్లోని వైశిష్యమును మరియు ఇతర కవులపై జాషువా ప్రభావాన్ని నిశిత పరిశీలన ద్వారా కొత్త విషయాన్ని చెప్పడం గాని, ఉన్న విషయాన్ని నవ్య దృక్పథంతో తులనాత్మకంగా పరిశీలించి విషయ వివరణ చేయడమే వ్యాసకర్త ప్రధాన ఉద్దేశ్యం.

Keywords: ఖండికలు, కవిత్వము, జాతీయాలు, అంతర్ నేత్రాలు, భావోద్వేగం, లఘుకావ్యం, చమత్కారం, గీర్వాణ భాష, క్రైస్తవ సాహిత్యం, భావ కవిత్వం

1. ఉపోద్ఘాతం:

"రాజు మరణించే నొక తార రాలిపోయే
కవియు మరణించే నొక తార గగనమెక్కే
రాజు జీవించే రాతి విగ్రహములందు
సుకవి జీవించే ప్రజల నాలుకల యందు"

జాషువా సుకవి.  అతని వ్యక్తిత్వం సంస్కార ప్రియుల హృదయాల్లో జీవిస్తున్నది.  అతని కవితా వ్యక్తిత్వం ప్రజల నాలుకల్లో జీవిస్తున్నది.  అసమ సమాజం గుమ్మినప్పుడు,  అంటరానితనం విషాగ్నులు చిమ్మినప్పుడు, దుర్భర దారిద్యం వెన్నాడినప్పుడు,  దురంతవేదన గుండెల్లో తుక తుక ఉడికినప్పుడు జాషువా గుర్తొస్తాడు.  అతని పిరదౌసి గుర్తొస్తుంది.  గబ్బిలం జ్ఞాపకానికి వస్తుంది.  స్మశాన వాటి నిట్టూర్పు పొగలతో కట్టెదుట నిలబడుతుంది.  ఇంకా ఎన్నెన్నో ఖండకృతులు ప్రతిఘటనకు ఓం కృతులై ప్రతిధ్వనిస్తాయి.

ఆధునిక తెలుగు కవులలో ప్రముఖ స్థానం పొందిన కవి గుర్రం జాషువా. గుంటూరు జిల్లా వినుకొండ గ్రామంలో వీరయ్య,  లింగమాంబ దంపతులకు 1895 సెప్టెంబర్ 28 వ తేదీన జన్మించారు. సమకాలీన  కవిత్వ వరవడి అయిన భావ కవిత్వ రీతి నుండి పక్కకు జరిగి సామాజిక ప్రయోజనం ఆశించి రచనలు చేశాడు. తక్కువ కులంగా భావించబడ్డ కులంలో జన్మించినందువలన అనేక అవమానాలు ఎదుర్కొన్నాడు. అయితే కవిత్వాన్ని ఆయుధంగా చేసుకుని మూఢాచారాలపై తిరగబడ్డాడు. చీత్కారాలు ఎదురైన చోటే సత్కారాలు పొందాడు.

2. ప్రధానవిషయం:

జాషువా బాల్యంలో తన ఊళ్ళో నాటకం చూద్దామని టిక్కెట్ కొనబోతుంటే "నీవు అంటరాని వాడివి, రాకూడదని" ఈసడించినప్పుడు తెలుగు భాష మీద మక్కువతో పురాణేతిహాసాలు చదువుతూ ఉంటే "జాషువా హిందువైపోతున్నాడని" స్వమతస్తులు చీత్కరించినప్పుడు, కొప్పరపు కవుల అవధానం విని తాను వ్రాసిన అభినందన పద్యాలను వేదికపై నుంచి వినిపించాలని కుతూహలాన్ని "అంత్యవ ర్ణజుడు సభలో ప్రవేశార్హుడు కాడని, అన్య వర్ణాల వారు తృణీకరించినప్పుడు,  అటు హిందువులు,  ఇటు క్రైస్తవులు విడివిడిగా తనను వెలివేసినప్పుడు,  పాడుబడ్డ మసీదే పాఠశాలగా,  గుడ్డి దీపమే గురువుగా,  భారత,  భాగవతాలు తాను చదువుతున్నప్పుడు సాలీలు, గిజిగాళ్లు,  గబ్బిలాలు, కముజులు తన నేస్తాలై కన్నీళ్లు తుడిచినప్పుడు,  జాషువా తరుణ హృదయంలో చెలరేగిన ఒక్కొక్క వేదనాస్పులింగం ఒక్కొక్క ఖండకృతిగా రూపొందినది. జాషువా కవితకు ఊపిరి అతని శ్వాస కోశాలనుండి ఎగజిమ్మిన ఆవిరి.

జాషువా అజ్ఞాతుడిగా,  అనాధృతుడుగా సంఘం మాటున బ్రతికాడు.  చేదుబాధల చిగుళ్ళను మేసి స్వాదు కవితలు ఆలపించాడు.  వినుకొండ దాటి,  గుంటూరు దాటి,  సమస్తాంధ్ర అంచులు మీటి ఎక్కడెక్కడ తెలుగుందో అక్కడిదాకా జాషువా కలగీతం పయనించింది.  అందుకే జాషువా కవి కోకిల.

జాషువా నిలువెల్లా కవి.  వైవిధ్యాలతో పాటు వైరుధ్యాలను కూడా తలదాల్చినవాడు.  తెలుగు పద్యం బలహీనపడుతున్న దశలో పద్యానికి ప్రాణ ప్రతిష్ట చేసినవాడు.  పద్యానికి పదును పెట్టి సామాజిక ప్రయోజనం కోసం సాధనంగా వాడుకున్నాడు.  జాషువా కవిత్వం చైతన్యవంతమైనది. ఆయన కవిత్వం సమ సమాజ భావజాలానికి సన్నిహితంగా ఉంటుంది.

మనిషిని ఔన్నత్యం వైపు నడిపించి,  అసమానతలు తొలగించి,  మానవ సమాజం సౌభాగ్యవంతంగానూ,  సుఖశాంతులతోనూ జీవించాలని ఆకాంక్షించాడు.  అందుకు దోహదపడే కవిత్వాన్ని రచించాడు.  "ధనము,  ధాన్యము ఒకని పెత్తనం కింద ఉండరాదని"  ఆకాంక్షించాడు.  అది ప్రజలందరికీ చెందాలని ఆశించాడు.  మానవ కళ్యాణాన్ని,  శ్రామిక,  పీడిత,  జనోదరణ కోసం కవిత రూపంలో తపించాడు.  అట్టడుగు స్థాయి వ్యక్తుల ఆర్థిక ఆవేదనతోను,  ఆవేశంతోను అక్షర రూపం ఇచ్చాడు.

జాషువా కవిత్వం మీద ఇరవయ్యో శతాబ్దపు ఉద్యమాలు,  రాజకీయ సాంఘిక,  ఆర్థిక,  సామాజిక స్థితిగతులు ప్రభావం చూపాయి.  జాషువా పారదర్శక దృష్టి గల కవి. అనంతమైన ఆర్ద్రత,  అపారమైన భావుకత కలిసిన మానవీయకవి.  ప్రకృతి అందాలను,  రహస్యాలను కవిత్వ రూపంలో అందించడంలో ఆయనది అందవేసిన చేయి.  వర్ణించే వస్తువులో తాను మమేకమై ఎవరూ ఊహించని భావుకతను ప్రకటిస్తాడు.  జాషువా తన పూర్వకవుల కవిత్వ సారాన్ని పిండుకుని తాగినవాడు.  ఈ విషయం తన స్వీయచరిత్ర  'నాకథలో'  చెప్పుకున్నాడు.  ఆయన కవిత్వంలో కవిత్రయం వారి కవితా రీతులు ముఖ్యంగా తిక్కన శైలి,  శ్రీనాధుని పద్య ధార,  ప్రబంధ కవుల గడుసు పోకడలు కనబడతాయి.

జాషువా పదప్రయోగ వైచిత్రి విలక్షణమైనది. జాషువా ఎంచుకునే శబ్దాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది.  అలాగే జాషువా శైలిలో వాగర్ధాల సమతుల్యం,  సారల్యం కనిపిస్తుంది.  జాషువా వాక్కు భావ గర్బితం.  తెలుగు నుడికారం,  లోకోక్తులు మధురమైన శబ్దాలతో కూడిన సమాసాలు,  విజాతీయ పదాలు,  సంస్కృత శబ్దాలను సందర్భోచితంగా ప్రయోగించడం జాషువా పద్యాలకు కొంత కాంతిని తెచ్చిపెట్టాయి.

పద్య కవిత్వంలో ఆధునికతను ప్రదర్శించిన వాడు జాషువా.  సంప్రదాయంలో నుండి ఆధునికతలోకి దృష్టి సారించిన వినూత్న ప్రయోగవాది జాషువా.  పాత చందో రూపానికి కొత్త ముస్తాబులు చేసి సరికొత్త వస్తువును రూపొందించిన పద్య నిర్మాణ శిల్పి.  పద్యాన్ని కవితా ప్రయోగశాలలో కాలానికి ఎదురొడ్డి నిలిచేలా పరీక్షలు చేసి విజయం సాధించారు.

జాషువా పద్యాలలోని కుదుపు ఆద్యంతము వెంటాడుతుంది.  చిక్కదనంతో కూడుకున్న భావము,  ఎక్కడా బెట్టు తప్పని ధారాశుద్ధి ఆయన కవితా గుణం.  పద్యం ఎత్తుగడలో,  మలుపులో,  విరుపులో తనదైన ప్రత్యేకత ప్రదర్శిస్తాడు.  పద్య పాదాంతములో ఒక చమత్కారం లేదా వక్రొక్తి,  ధ్వన్యాత్మకమైన విసురు,  ఎత్తిపొడుపు అధిక్షేపన చాలా సహజంగా జాషువా పద్యాల్లో ఆవిష్కృతమవుతాయి. ఈ లక్షణాలే జాషువా కవిత్వానికి జీవశక్తులుగా భావించాలి.

మారుతున్న కవిత్వానికి,  మారుతున్న విలువలకు అనుగుణంగా జాషువా కవిత్వ రూపంలోని అభివ్యక్తి కూడా మారింది.  కాలం మారేటప్పుడు సమకాలీన సమాజంలో జీవించే కవి,  వైతాళికుడు కాగలిగితే మార్పును ఆహ్వానిస్తాడు.  పాత విలువలకు కొత్త ఆలోచనలు జత చేసి సరికొత్త మార్గాన్ని నిర్దేశిస్తాడు.  సరిగ్గా జాషువా చేసింది ఇదే.  పాత రూపంలో నుంచి కొత్త వస్తువును,  కొత్త వస్తువులో నుంచి సరికొత్త అభివ్యక్తిని సృష్టించాడు. ఈ గుణాల వల్లే జాషువా కవిత్వం సజీవంగా నిలిచిపోయింది.

3. కవిత్వ లక్షణాలు ఎలా ఉండాలి:

కవిత్వ లక్షణాలు ఎలా ఉండాలో జాషువా స్వయంగా చెప్పుకున్నారు.  పరోక్షంగా జాషువా చెప్పిన ఈ లక్షణాలు ప్రత్యక్షంగా ఆయన కవిత్వానికి చక్కగా అన్వయించబడ్డాయి.

            "మదమరాలంబుల కుదురైన నడకలో
              రాణించు సహజంపు రాజసంబు
              కదనుద్రొక్కు గురాల గర్వంపు మెడల వం
              పులనుట్టిపడు కులుకుల పసందు
              నెల కూనలంటని నిండు జవ్వని కుచ
              ద్వయి నేలు వలరాచవాని బిగువు
              కలికి గులాబీ మొక్కల మీది విశ్వమో
              ఘనమైన సున్నితమైన మెదుపు
              మధుర రసమును గడుపున మాటుకొన్న
              ద్రాక్ష ఫల గులుచ్చముల యందముల తూ
              వరకవీంద్రుని కావ్య ప్రపంచమందు
              ప్రతి పదంబున మదికి దర్శనమోసంగు
ఈ పద్యంలో ఉత్తమ కవిత్వానికి ఉండవలసిన సమగతి, వక్రోక్తి, ప్రౌడ మార్ధవం మాధుర్యం సూచింపబడ్డాయి. జాషువా తన కవితా లక్షణాలను ఈ పద్యములో నిబిడీకరించారు. 

జాషువా కవితా లక్షణాలను మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి గారు ఈ విధంగా విశ్లేషించారు. "తీయనైన శయ్య వైభవముతో,  నిర్దిష్టమైన భాషా ప్రాభవముతో హృదయంలోనున్న విషయమంతుయు పాఠకుల కందియగల కూర్పు నేర్పు వీరికి అబ్బినది.  అబ్బిన చాతుర్యమును నిరంతరాభ్యాసం వలన పెంపు చేసుకొనిరి.  దానితో ఆయన ప్రతి పద్యము హాయి అనిపించినట్లు వ్రాయగలుగును.  బంగారు తీగ వంటిదేదో ఒక ధారాలత,  వృత్తములు, విశేషించి సీసములు క్రొత్త ధోరణిలో క్రొత్త సొంపులు పెట్టి వ్రాయటలో నీ కవి పేరు పడెను".²  జాషువా శైలి అనితర సాధ్యమైందని చెప్పడానికి జాషువా కవితా లక్షణాలను గుర్తించిన విమర్శకుల అభిప్రాయాలే ప్రామాణికమని భావించవచ్చు.  "ఈయన కవిత్వం సరళమై ముద్దులొలికే పలుకుబళ్ళతో నిండి ఉంటుంది.  ఈయన కలములో విశిష్టమైన ఒడుపు ఉన్నది.  మనోహరమైన పద సంపుటలను కూర్చడంలో జాషువా కవి నేర్పరి.  తెలుగు కవిత్వంలో తీపి ఈ కవి చూపినట్లు నవ్యులలో మరొకరు చూపలేరు అనిపిస్తుంది".³  ఆయన శైలి,  ఆయన పద్యాలు పాఠకులను ఎక్కువగా ఆకర్షించడానికి ప్రధాన కారణం ఇదేనని భావించవచ్చు.  "ఆయన శబ్దశక్తి,  ఆయన కవితా శక్తికి ప్రాణం వంటిది.  కవి సృష్టి పాఠకులకు శబ్దార్థ రూపమున సాక్షాత్కరించుచున్నది.  అనగా కావ్య ప్రపంచం యొక్క వ్యక్త రూపం శబ్దార్ధములు"⁴ జాషువా కావ్య ప్రపంచ రూపానికి సిద్ధాంతాలు బాహ్య నేత్ర,  అంతర్ నేత్రాలుగా కనబడతాయి. "కావ్యము నందు శిల్ప నైపుణ్యం హెచ్చుకొలది యందలి కథా భాగమును జదువరుల హృదయము నాకర్షించు శక్తియు హెచ్చు చుండును".⁵

జాషువా లఘు ఖండికలు,  పిరదౌసి,  స్వప్న కథ,  గబ్బిలం వంటి కావ్యాలు విశేషంగా ఆకర్షించడానికి ఆయన కవితా శిల్పము కూడా ఒక కారణం.  జాషువా శిల్ప శైలిని తిరుమల రామచంద్ర గారు విష్ణుకుండినులతో పోల్చారు.  శైలికి సంబంధించి జాషువా ప్రత్యేకతను ఇలా నిర్వచించారు.

"నేడు చెల్లుబడి లో ఉన్న నుడికారంపై వారిది అద్వితీయమైన అధికారం.  ప్రాచీన సంప్రదాయానికి వారితో సంపూర్ణ సహకారం సమసామయిక విషయాలతో కొత్త సమయాలు కల్పించుకొని జాతీయాలు సృష్టించుకున్నారు.  కనుకనే వారు సూర్యు శూనుడు కర్ణుడు గాని,   సూర్యుని చూచి కబోది అయ్యే గబ్బిలాన్ని గాని,  రేణుక చరిత్రను గాని,  రేడియో చెడియ చలిది పాటను గాని,  లవణాన్ని గాని,  లైకాను గాని,  శారదను గాని,  స్మశానాన్ని గాని,  దేనిని గాని పొదిగిన ప్రతి మాట మన మనసును హత్తుకుపోతుంది"⁶ అని జాషువా కవిత్వంలో దాగి ఉండి మాటల శక్తిని విశ్లేషించారు.

"చూడటానికి మామూలు పదాల వలే కనిపించి,  ఆ ప్రత్యేక స్థానంలో దాని శక్తి గురించి ఆలోచిస్తే అణు శక్తిని మించుతుందా అనేటట్లు చేయగల ప్రత్యేక శక్తి జాషువాది"⁷  అని మేడవరం వెంకటనారాయణ శర్మగారు అభిప్రాయపడ్డారు.  "జాషువా పదప్రయోగాలలో దేశీ పదాలు,  అన్య దేశాలు, సంకీర్ణ పదాలు విరివిగా కనబడతాయి.  ఇంగ్లీషు పదానికి తెలుగు పదంతోను,  హిందుస్తానీ పదంతో సంస్కృత శబ్దంతోను కలిపి సంధి చేయడమో,  సమాసం చేయడమో జాషువా పద ప్రయోగాలలో కనిపించే విలక్షణ గుణం.  జాషువా కవితా లక్షణాల్లో కనిపించే ఈ అంశాన్ని డాక్టర్ బి. భాస్కర చౌదరి తన సిద్ధాంత గ్రంథంలో సప్రమాణంగా చర్చించారు".⁸

    కవిత్వం భువన హితం కోరేదిగా ఉండాలని జాషువా విశ్వాసం.  రాజుల భోగ వర్ణనలు, విరహినుల అంగాంగ వర్ణనలు అతనికి గిట్టవు. భావకవిత్వ యుగం మహోజ్వలంగా వెలుగుతున్న రోజుల్లో తలఎత్తిన కవి. భావ కవులు అంటే ఊహంబర విహారులు,  అందని ప్రేయసికై అర్రులు సాచే స్వప్న సంచారులుగానే గోచరించారు.  జాషువా దేశాభిమాన కవిత్వం,  సంఘసంస్కరణ కవిత్వం వెలయించినా ప్రణయ కవిత్వం వైపు పోలేదు. 'సఖి' వంటి ఒకటి రెండు ఖండకృతుల్లో తప్ప,  నిష్టుర జీవిత సత్యాలనే కన్నీరు తడిసిన కరకు పాళీ తో చిత్రించాడు.  కంటికి కనిపించిన వాస్తవాలనే ప్రవచించాడు.  ఊహ ప్రేయసి వర్ణనను నిరసించాడు.
   
జాషువా సాహిత్యంలో కరుణ,  వీర రసాలు: జాషువా కరుణ రసంలో నుంచి వీర రసాన్ని పొంగించిన కవి.  అతడు చిందించే కన్నీళ్లు అగ్నిగోళాలు.  అవి దేబరించేవి కావు.  గూబ గుద్ది పలకరించేవి.

జాషువా కవిత్వంలో కరుణ,  వీర రసాలు ఉంటాయని సి. నారాయణ రెడ్డి గారు సోదాహరణంగా వివరించారు.

"కరుణ రసాన్ని వర్ణించిన కవి జాషువా 'ఈనాడు రచింతు రిద్ధ కరుణా పరిణర్థ రస ప్రబంధముల్' అని స్పష్టంగా కరుణరస ప్రాధాన్యాన్ని ప్రకటించాడు.  కరుణ రసంతో పాటు వీర రసాన్ని జాషువా స్వీకరించాడు.  స్థూలంగా చూస్తే జాషువా రసాలలో కరుణం అంగీరసంగా,  వీరం అంగరసాలలో ఒకటిగా భాసిస్తాయి.  కానీ ఈ రకమైన సంప్రదాయ సిద్ధమైన రస సిద్ధాంతాల కొలమానాలతో చూస్తే జాషువా కవితా విశిష్టత అందదు"⁹ అంటూ సి. నారాయణ రెడ్డి గారు భావించారు.
          "కఠిన చిత్తుల దురాగతముల ఖండించి
           కనికార మోలికించు కలము నాది
           నిమ్నజాతుల కన్నీటి నీరదములు
           
పిడుగులై దేశమును కాల్చివేయు" నని హెచ్చరించారు.

కాల్చే కన్నీళ్లను దర్శించడం అంటే కరుణ, వీర రస సిద్ధాంతానికి  ప్రాతిపదిక వేయడమే కదా!   'గబ్బిలం ' లోని

              "వాని తల మీద పులిమిన పంకిలమును
              కడిగి కరుణింప లేదయ్యే గగనగంగ
              వాణి నైవేద్యమున అంటువడిన నాడు
              మూడు మూర్తులకును గూడ కూడు లేదు"

    అన్న పద్యంలోనూ నిర్వేదంతో కూడిన ప్రతిబోధమే వెళ్లి విరుస్తున్నది.  అస్పృశ్యుడు పండించిన ధాన్యమే కదా ఆలయంలో సమర్పించే నైవేద్యం?   అంటరాని వాని ధాన్యాన్ని అంటుకోమని ఆ దేవతలే అనుకుంటే వాళ్లకు కూడు లేదు.  పూజారులకు నీడ లేదు.

      " ప్రతిమల పెండ్లి చేయుటకు వందలు వేలు వ్యయించు గాని దుః
        ఖితమతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్
        మెతుకు విదల్పదీ భరతమేదిని ; ముప్పది మూడు కోట్ల దే
        వత లెగవడ్డ దేశమున భాగ్యవిహీనుల  క్షుత్తులారునే"

    ఈ పద్యంలో జాషువా ప్రతిఘటనమే రెక్క విప్పింది. కరుణ రసానికి సంచారీ భావాలు దైన్యము,  గ్లాని,  జడత,  చింత,  నిర్వేదము మొదలైనవి.  వీర రసానికి సంచారీ భావాలు అమర్శము,  క్రోధము, వితర్కం,  ఆవేశము,  ఉగ్రత మొదలైనవి.  జాషువా కృతులలో గోచరించే కరుణ వీరం ఏకకాలంలో దైన్యాన్ని,  ప్రబోధాన్ని,  నిర్వేదాన్ని,  క్రోధాన్ని,  జడతను,  ఉగ్రతను,  చింతను,  అమర్షాన్ని ప్రత్యక్షకిరిస్తుంది.  అభ్యుదయ కవిత్వం లోను కరుణ వీర ప్రతిపాదనమే ప్రముఖంగా కనిపిస్తుంది.  ఇందుకు ఆద్యుడు జాషువా.  'కరుణ వీరం'  అనే వినూత్న వీర రసభేదాన్ని ప్రతిపాదించడానికి స్ఫూర్తిని కలిగించింది జాషువా కవిత్వమే.

కలాన్ని కులంతో కొలిచే మనస్తత్వాన్ని జాషువా గర్హించాడు.  చాతుర్వర్ణ  వ్యవస్థ మూలాన్ని కుదిలిస్తూ ఇలా అన్నాడు.

                  "ముసలివాడైన బ్రహ్మకు పుట్టినారు
                  నలుగురు కుమారులనుట  విన్నాము గాని
                  పసరమున కన్నా హీనుడభాగ్యుడైన
                  అయిదవ కులస్తుడు ఎవరమ్మా! సవిత్రి!"

అసలు నాలుగు వర్ణాల విభజనమే ఆధునిక కాలంలో అర్థం లేనిది.  అందులో ఐదవ కులం ఏమిటి? ఆ కులం అంటరానిది కావడమేమిటి?  ఎవరు దీనిని సృష్టించారు?  భారతీయులు ఎందుకు దీని ఇంకా అనుసరిస్తున్నారు?  అనే ప్రశ్నలు జాషువా గుండెల్లో మొలకెత్తినవి. ఆనాడు కర్ణుడికి,  ఈనాటి జాషువాకు ఎదురైన పరాభవం ఒకటే.

కురుకుమారుల సభలో ఆ సూతపుత్రునికి జరిగిన అవమానమే అనేక కవితా సదస్సుల్లో జాషువాకు జరుగుతూ వచ్చింది.  సూర్య రాయమహీపతిని సందర్శించినప్పుడు చెప్పిన పద్యంలో జాషువా ఆత్మ వేదన అసిధారా సదృతంగా వ్యక్తం అవుతుంది.

        "నా కవితావదూటి వదనంబు నెగా దిగా జూచి రూప రే
        ఖాకమనీయ వైఖరులు గాంచి భళే భళే ఎన్నవాడే "మీ
        దేకుల" మన్న ప్రశ్న వెలయించి చివుక్కున లేచిపోవుచో
        బాకున క్రుమ్మినట్లగును పార్థివ చంద్ర వచింప సిగ్గగున్"

      జాషువా తొలి రోజుల్లో 'గడనకెక్కిన ఆంధ్ర పుత్రుడను నేను'  అని గానం చేసిన జాషువా,  'భరత ఖండంబు నా పాఠశాల'  అని మననం చేసిన జాషువా, క్రమక్రమంగా

          "నిఖిల లోక మెట్లు నిర్ణయించిన నాకు
            తిరుగులేదు విశ్వ నరుడ నేనుఅని విశ్వజినీన దృక్పథాన్ని అలవర్చుకున్నాడు.  

జాషువా కవితా లక్షణాలను గురించి అగస్త్య రెడ్డి వెంకు రెడ్డి గారు ఇలా అంటారు.  "ఆయన కవిత్వానికి ముఖ్య లక్షణాలు కొన్ని ఉన్నాయి.  అసలు కవిత్వం అంటే ఒక అద్భుతమైన కళ.  ఆ కళలో ఒక మహాకవి గాని సుప్రసిద్ధుడు లేడు.  పరిణిత మనస్కుడిగా ఉండవలె.  దానిలో అందరూ ఆరితేరలేరు.  అది అసమానమైన కళ.  ఆ కళలో ఆరితేరవలేనంటే కవికి కొన్ని ముఖ్య లక్షణాలు ఉండవలెను. అందులో లోకజ్ఞత అపారంగా ఉండవలె.  లోకజ్ఞతతో పాటు వైదుస్యం సరే.  ప్రతిభాపాటవం ఉండవలె. సద్య స్ఫూర్తి ఉండవలె.  శబ్దముల మీద అధికారం ఉండవలె.  ఇవన్నీ మహాకవి జాషువాలో పుష్కలంగా ఉన్నాయి".¹⁰

"నన్నయ శ్రీనాధుల తర్వాత సీస పద్యాన్ని కదం తొక్కించిన అశేష నైపుణ్యం జాషువా గారి దే"¹¹ నని కొంగర జగ్గయ్య జాషువాను వైతాళికుడిగా, ప్రవక్తగా భావించి ఆయన శైలి భావోద్వేగంతో కూడుకున్నదని,  నన్నయ శ్రీనాధుల తర్వాత సీస పద్యాన్ని కదం తొక్కించారని భావించారు.

కరుణ శ్రీ జాషువా కవితా వైశిష్ట్యం గురించి ఇలా ఉదాహరించారు. "శ్రీ జాషువా గారు ఆనాటికి ఈనాటికి సాటిలేని మహాకవి.  ఆయన కవిత్వం చెక్కుచెదరదని,  మొక్కవోని చక్కదనం సంతరించుకున్నది.  ఆయన తెలుగు పద్యానికి ఒక హృద్యమైన శైలి సంతరించారు.  ఆయన వాణి నిత్య కళ్యాణి.  ఆయన బాణీ అనన్య సామాన్యమైనది.  ఆయన లేఖని అమృత వాహిని' ¹² అంటూ ఆయన కవి కవితాశైలిని ప్రముఖంగా పేర్కొనిరి. ఈ అభిప్రాయాన్ని సమర్థించుతూ నాగుళ్ళ గురు ప్రసాదరావు గారు ఒక చోట ఈ విధంగా రాశారు "అపారమైన కవితా శక్తితో,  సరళ సుందరమైన భాషను వాడి జాషువా వలె తెలుగు వారి గుండెలను దోచుకున్న కవులు నవీన ఆంధ్ర సాహిత్య ప్రపంచమున ఎందరో లేరు"¹³ అని నిర్వచించారు.

4. ఇతర కవులపై జాషువా ప్రభావం:

జాషువా కవిత్వానికి రస హృదయాలను ప్రభావితం చేసే శక్తి అపారం.  ఆయన కవిత్వానికి ఆకర్షణ ప్రధాన లక్షణం.  అందువల్లే ఆయన కవిత్వం పండితుల్ని,  పామరుల్ని ఆకర్షించింది.

తెలుగు కవిత్వంలో జాషువా పద్యముద్ర ఒకటి స్థిరంగా నిలిచిపోయింది.  ఈ ప్రభావం సమకాలిక కవుల మీద,  వర్ధమాన కవుల మీద చాలా సహజంగా ప్రసరించింది.  ఈ అంశాన్నే  స్ఫూర్తి శ్రీ ఒక చోట పేర్కొన్నారు.  "శ్రీ జాషువా వలె పద్యం నడిపించాలనీ,  పదప్రయోగం చేయాలనీ,  కల్పనలు కావించాలనీ వ్యక్తం చేసిన యువకులు ఈనాడు ఎందరో లబ్ద ప్రతిష్టులయ్యారు.  ఇదే వారి విశేషాన్ని నిర్ధారిస్తుంది"¹⁴  అని భావించారు.  ప్రముఖ కళా విమర్శకుడు సంజీవ్ దేవ్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.  "ఆయన ప్రభావం చాలామంది కవుల మీద పడింది.  కానీ ఆయన మీద ప్రత్యేకించి ఏ కవి ప్రభావం అంతగా పడినట్లు లేదు"¹⁵  అంటూ జాషువా ప్రభావాన్నీ,  ప్రతిభను గుర్తించారు.

జాషువా తన ఖండ కావ్య రచనల్ని,  మహాకావ్యాల స్థాయికి తీసుకుని వెళ్లారు.  ఒక్కో ఖండకావ్యాన్ని ఒక్కో కళాఖండంగా తెలుగు సాహిత్యంలో అమూల్యం చేశారు. శైలి,  వస్తు వైవిధ్యం,  శిల్ప నైపుణ్యం,  భావ గాంభీర్యం,  అభివ్యక్తిలోని కొత్తదనం,  దార్శనికతతో కూడిన తాత్విక ధోరణి మొదలైన ప్రత్యేక అంశాలు జాషువా ఖండికల్లో కనబడతాయి. ఈ కారణాలవల్ల జాషువా ఖండ కావ్యాలకు ఆంధ్రదేశంలో విపరీతమైన ప్రచారం కలిగింది.  ఖండకావ్యం అంటే జాషువాకు పర్యాయపదం అన్నంతగా వీటికి ప్రజాదరణ లభించింది.  ఈ అంశాల్ని విమర్శకులు గుర్తించారు.

ఖండ కావ్య ప్రక్రియకి గురజాడ,  రాయప్రోలు ప్రారంభకులు అయినప్పటికీ ఖండ కావ్యాన్ని తెలుగు సాహిత్యంలో సుస్థిరం చేసింది జాషువా అనే చెప్పుకోవచ్చు.  ఈ అభిప్రాయానికి అనుకూలంగా డాక్టర్ సి. నారాయణరెడ్డి ఒకచోట ఈ విధంగా అన్నారు.  "ఆధునికాంధ్ర కవిత్వంలో ఖండకావ్య ప్రక్రియ రాయప్రోలు తో పొటమరించినా,  పుష్పించింది జాషువా కవితలోనే.  ఖండకావ్యం రాసి అఖండ కావ్య స్ఫూర్తిని అందించిన కీర్తి జాషువాకే దక్కింది" ¹⁶ అంటూ ఖండకావ్య ప్రక్రియ వికాసానికి జాషువా ఏ విధంగా కారకుడయ్యారో పేర్కొనడం జరిగింది.  డాక్టర్ బి.  భాస్కర చౌదరి "వ్యదాభరితమైన హృదయము నుండి పొంగి పొరలిన భావావేశమే జాషువా ఖండికులకు జీవనాడి"¹⁷ గా అభివర్ణించారు. జాషువా ఖండకావ్యాల గురించి ఒక గ్రంథానికి పీఠిక రాస్తూ కొండవీటి వెంకట కవి ఇలా భావించారు.

"ఇప్పటికవులలో సుప్రసిద్ధులగు శ్రీ జాషువా కవి గారు తమ లఘుకృతులను సంపుటికరించి ఖండ కావ్యములను పేర వెలయించిరి.  మేమెరిగినంత వరకు సుస్పష్టముగా నీ శబ్దమును వాడిన వారు వీరేయని తెలియుచున్నది.  వీరిని చూచి కొందరు తాము రచించిన శీర్షికలలోని యొక దళమును గ్రంథ నామముగా నుంచుకొనిరి".¹⁸

ఖండకావ్యానికి సంబంధించి జాషువా ఖండకావ్యాలు నిర్వహించిన పాత్ర అత్యంత ప్రధానమైనది.  ఒక విధంగా చూస్తే ఆయన ఖండా కావ్యాల ప్రభావం మహాకావ్యాన్ని సైతం అరికట్టగలిగింది.  కవిత్వాన్ని ప్రజల దగ్గరికి తీసుకుపోవడంలో జాషువా ఖండకావ్యాలు విజయవంతమయ్యాయి.  ఆనాటి సాహిత్య వాతావరణంలో కూడా ఈ ఖండకావ్యాలు ప్రతిస్పందింప చేశాయి.  ఈ కారణాలవల్లే జాషువా "సమకాలిక సాహితీ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మహాకవి"¹⁹ అయ్యాడని ఇరివెంటి కృష్ణమూర్తి గారు తీర్మానించారు.

సాహిత్యంలో 'ప్రభావం' అన్న పదం చాలా విలువైనది,  గంభీరమైనది కూడా.  ఒక మహాకవి ప్రభావం సమకాలిక కవుల మీద,  తదనంతర కవుల మీద విభిన్న రకాలుగా  ముద్రితమవుతుంది. ప్రభావాన్ని ఐదు భాగాలుగా విభజించవచ్చు.
        1. వస్తు ప్రభావం
        2. శైలి ప్రభావం
        3. రూప ప్రభావం
        4. శిల్ప ప్రభావం
        5. భావ ప్రభావం

పైన పేర్కొన్న వాటిలో ఏ అంశం బలంగా ప్రతిబింభిస్తుందో ఆ ప్రభావం ప్రభావిత కవుల మీద ఉంటుంది.  ప్రభావితుడైన కవి చాకచక్యం వల్ల ప్రతిభావంతుడైతే అతని రచనల మీద మూల ప్రభావం అంతగా బయటికి కనిపించదు.  ప్రభావితుడైన కవి సరి అయిన నైపుణ్యం చూపించకపోతే అతని రచనల్లో మూల ప్రభావం కనిపిస్తుంది.  అతని సొంత శక్తి కనుమరుగైపోతుంది.  మహాకవుల ప్రభావం సర్వకాలాల్లోనూ సమకాలిక కవులపై ప్రసరించడం సాహిత్యంలో చారిత్రక వాస్తవమని గుర్తించాలి.

5.1 దాశరధి పై జాషువా ప్రభావం :

జాషువా ప్రభావం మహాకవి దాశరధి పై చాలా స్పష్టంగా కనిపిస్తుంది.  వృత్త పద్యాల ఎత్తుగడలో,  నడకలో, పద్యాంతంలోని చమత్కారపు విసురులో,  సంబోధనలో,  పదప్రయోగ విశేషణల్లో జాషువా ముద్ర,  దాశరథి తొలినాటి పద్యాల పై గాఢంగా ఉన్నట్లు తెలుస్తుంది.

వీరుల మీద,  కళాకారుల మీద కవిత్వం రాయడం తెలుగులో జాషువా నుంచే బాగా ప్రచారంలోకి వచ్చింది.  'శిల్పి'  జాషువా రాసిన ప్రఖ్యాత ఖండిక.  ఇందులో శిల్ప కళా నైపుణ్యానికి సంబంధించిన ఇతివృత్తాన్ని తీసుకొని కవిత్వంగా మలిచారు.  ఈ వస్తు ప్రభావంతో ఇదే శీర్షికతో దాశరధి కూడా 'శిల్పి 'అనే ఖండిక రాశారు.

దాశరధి రాసిన ఈ ఖండిక మీద జాషువా 'శిల్పి ' ఖండిక ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తున్నది.  జాషువా సంభోదనలోని ఆత్మీయతను దాశరధి నేర్పుగా పట్టుకున్నారు.  జాషువా లాగే సహజంగా ఉండే సంబోధన శైలి వాడుకున్నట్లుగా నిర్ధారించవచ్చు.
జాషువా తన 'శిల్పి ' ఖండికలో 'శిల్ప కంఠీరవ'  'శిల్ప విద్యానిధి' అని కళాత్మకంగా సంబోధిస్తే,  దాశరధి తన 'శిల్పి ' ఖండికలో ఇదే పద్ధతి అనుకరిస్తూ 'శిల్పి కులావతంసమా'  'శిల్పి కుల కుంజర' అని అచ్చం జాషువా లాగే సంబోధిస్తాడు.

అదేవిధంగా జాషువా తన గబ్బిలం కావ్యంలో గబ్బిలాన్ని 'పక్షినీ '  'గబ్బిలపుచానా ' పతంగీ, మౌనిఖగరాగ్ని అని వైవిధ్యంగా సంభోదనలు ప్రయోగిస్తే,  ఇదే శైలిలో ఇదే ధోరణిలో దాశరధి తన 'మహోంద్ర దయం'  కావ్యములో 'కపోతి సందేశం' అనే ఖండికలో పావురాన్ని 'పతగీ ' 'పక్షినీ ' 'పులుగు చానా'  'పక్షిరాగ్ని ' అని జాషువా లాగే ప్రయోగాలు చేశాడు.  జాషువా పద ప్రయోగ వైచిత్రి దాశరధి పద్యాల్లో చాలా చోట్ల కనిపిస్తుంది.  జాషువా సంబోధనలో ఒక ఆత్మీయత,  మూగజీవుల మీద కారుణ్యం చూపిస్తాడు.  జాషువా సంభోదనలు హృదయాన్ని హత్తుకుంటాయి.

5.2 కరుణశ్రీ పై జాషువా ప్రభావం:

      మహా ప్రతిభావంతుడైన రచయిత జాషువా ప్రభావం కరుణశ్రీ మీద ఎక్కువగా ఉందని భావించవచ్చు. కరుణశ్రీ అనే కలం పేరు శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిది.  ఈయన తెలుగు సాహిత్యంలో లబ్ద ప్రతిష్టుడైన కవి.  జాషువా కవిగా ఉజ్వల స్థాయిలో ఉన్నప్పుడు కరుణశ్రీ వర్ధమానకవి.
      జాషువా కవిత్వంలో కనిపించే కొన్ని ప్రత్యేక లక్షణాలు కరుణశ్రీ లోనూ కనిపిస్తాయి.  జాషువా వస్తువు,  శైలి, కరుణశ్రీలో చాలా స్పష్టంగా  కనబడుతుంది.

    జాషువా ప్రభావం కరుణశ్రీలో రెండు రకాలుగా కనిపిస్తుంది.

1 వస్తు ప్రభావం,  2 రూప ప్రభావం.  ఒక్కోసారి వస్తువు,  రూపము మిళితమైన కవిత్వ సందర్భాలు కనబడతాయి.  ఉదాహరణకు జాషువా 'పిరదౌసి' కావ్యం లో

            "పోటమరింపక ముందే పుష్పసంతతులకు
            వింతగా రంగులు వేయువాడ"²⁰

  అని వర్ణించిన ప్రకృతి స్తుతిలో భగవంతుని శక్తి సామర్థ్యాలు జాషువా కొనియాడితే,  అదే రకమైన వస్తువుతో అదే రూపంతో కరుణశ్రీ ఈ విధంగా మూల రచన నుంచి ప్రభావితుడయ్యారు.
              "తెలవారకుండా మొగ్గల లోన జొరబడి
               వింత వింతల రంగు వేసి వేసి"
      పైన పేర్కొన్న కరుణశ్రీ భావం,  భాష,  పద్యం,  ఎత్తుగడ జాషువా మూల పద్యానికి చాలా సన్నిహితంగా ఉన్నట్లు గమనించవచ్చు.

        భావ కవితా యుగంలో ఆంధ్ర ప్రసస్తి,  ఆంధ్ర పౌరుషం,  దేశభక్తి అనే అంశాల మీద కావ్య ఖండికలు వెలువడ్డాయి.  ప్రత్యేకంగా జాషువా,  గతించిన ఆంధ్రదేశ వైభవాన్ని,  ఆంధ్ర రాజుల కళా వైదుష్యాన్ని,  ఆంధ్రత్వాన్ని గురించి గొప్పగా పులకరించి కవిత్వం చెప్పారు.

      జాషువా దేశభక్తికి సంప్రదాయాభిమానానికి 'ఆంధ్రుడు ' అనే పేరు గల ఖండిక విశేష ప్రఖ్యాతి పొందింది.
                  "బహుదేశములను బెర్వడసి మీసము దీటు
                  భరత ఖండంబు నా పాఠశాల
                  స్తన యుగంబున గాన సాహిత్యములు గల్గు
                  భాష వధూటి నా పంతులమ్మ"

      అంటూ జాషువా ఆంధ్రత్వానికి ఆత్మీయతను,  ఆత్మీయతకు మానవ సంబంధాలను జతచేసి,  మాతృభూమిని అక్షర దేవతగా భావించబడే సరస్వతిని కవిత్వ రూపంగా ప్రస్తుతిస్తే,  సరిగ్గా కరుణశ్రీ కూడా అదే రకమైన భావాలను,  అభివ్యక్తులను వాడుకొని పద్యం రాయడం గమనించాల్సిన అంశం.

                    "సర్వ భూమి పూజ్య గీర్వాణ భాషా
                    తల్లి గారాబంపు తల్లి నాకు
                    అత్యంత సుకుమారి ఆంధ్ర భాషా యోష
                    అల్లారు ముద్దుల చెల్లి నాకు"

      అని కరుణశ్రీ జాషువా గొంతు శృతి చేసుకున్నాడు. 'ఆంధ్రుడను' అనే జాషువా ఖండిక ప్రభావంతో కరుణశ్రీ 'అంజలి' ఖండిక ఆవిర్భవించింది.

                    "శ్రీ కృష్ణరాయ ధాత్రీ నాయకుని సమ
                    గ్ర ప్రతాపము,  దీప కళిక మాకు
                    రాజరాజ నరేంద్ర రమనీయ సద్యశ:
                    కాండంబు పండు రేయండ మాకు"

    అని జాషువా పలికితే కరుణశ్రీ ఇలా ప్రతిస్పందించడం జరిగింది.

                    "కాళిదాస కవీంద్ర కావ్య కళా వీధి
                      పరుగులెత్తిడి రాచబాట నాకు
                      భట్ట బాణునీ ముద్దుపట్టి కాదంబరి
                      కథలు చెప్పెడి చెలికత్తి నాకు"

జాషువాను కరుణశ్రీని తులనాత్మక దృష్టితో చూసినప్పుడు కరుణశ్రీ ఎన్నో విధాలుగా జాషువా కవిత్వం నుంచి ప్రేరణ పొందినట్లుగా తెలుసుకోవచ్చు.  జాషువా సీస పద్యాల్లో కనిపించే ప్రత్యేక లయ కరుణశ్రీ లో ప్రతిస్పందించిందని చెప్పడానికి పై పద్యాలనే ఆధారంగా గ్రహించవచ్చు.

5.3 వినుకొండ కవులపై జాషువా ప్రభావం :-

జాషువా కవిత్వానికి మాతృభూమి వినుకొండ.  ఇది గుంటూరు జిల్లాలోని తాలూకా.  ఆయన భాషా పరిశ్రమ చేసింది, బాలకవిగా అవతరించింది ఈ గడ్డ మీదే. చిన్ననాటి నుంచి ప్రతిభావంతుడు,  ధీమంతుడు కావడం చేత పలువురు దృష్టిని ఆకర్షించాడు. పట్టుదల,  అభ్యాసం పుష్కలంగా ఉండటం వల్ల అటు కవిత్వంలోనూ,  ఇటు నాటకాల్లోనూ సాధన చేశాడు.

జాషువా లాగా పద్యం రాయగలిగిన ఒకరిద్దరు కవుల్లో వినుకొండకు చెందిన బిర్నీడి విజయ దత్తు ఒకడు.  ఇతని 'స్వర్గావతరణ' అనే కావ్యంలో జాషువా పోకడలు చాలా స్పష్టంగా కనబడతాయి. 'జేబున్నీసా' ఖండికలోని జాషువా పద్యాన్ని,  విజయదత్తు తన 'స్వర్గావతరణ' అనే కావ్యంలో ఎంత దగ్గరగా అనుకరించారో తెలుస్తుంది.

                "మొగలు రాజన్యుని పగడాల మేడలో
                  వసియింప దింక నీ ప్రణయ లక్ష్మి
                  ఢిల్లీ నవాబుల మల్లె తోటల వంక
                  బరికింపదింక నీ వలపు జిలుక
                  ఔరంగజేబుని ఆపరంజి గిన్నెలో
                  భుజింపదింక నీ ముద్దులాడి
                  బాదుషా నగరిలో బట్టు పాన్పుల మీద
                  బవళింపదింక నీ పాదదాసి".                 - జాషువా

                " పలికింపడీ రోజు పచ్చిక బయలున
                  దావీదు రాజు రత్నాల వీణ
                  ప్రసరింపదేనాడు బహరాము శిబిరాన
                  రసపిపాసుల వయారముల పాట
                  సవరింపడే పూట జంషీద్ కొలువులో
                  పరదేశి పసిడి కిన్నెరుల మ్రోత
                  కదలింపదీ ప్రొద్దు ఖై ఖుస్రు మేడలో
                  కన్నె భోగము సాని కాలి గజ్జె".      - బిర్నీడి విజయ దత్తు

ఈ రెండు పద్యాలను పరిశీలిస్తే జాషువా ప్రభావం బిర్నీడి విజయదత్తు కవిపై ఎంత గాఢంగా ఉందో గమనించవచ్చు.

జాషువా గబ్బిలం ఒకటి,  రెండు భాగాలు వచ్చాక ఆ ప్రేరణతో చాలామంది కవులు అస్పృశ్యతను వస్తువుగా తీసుకొని కొన్ని కావ్యాలు రాశారు.  వాటిలో ఈ క్రిందివి చెప్పుకోదగినవి.

బిర్నీడి మోషేకవి 'హరిజన అభ్యుదయము',  మల్లెల దావీదు 'అస్పృశ్యత,  గద్దల జోసెఫ్ 'కన్నీటి కబురు',  ఎడ్లపల్లి శామ్యూల్ 'వసంతకుమారి' , నూతక్కి అబ్రహం మత్కుణం ,  ఎడ్లపల్లి జోసఫ్ 'ఇన సందేశం',  మోదుకూరి జాన్సన్ 'నిచ్చెన మెట్లు' , ముక్తిపూడి సుందర రావు 'పావురం' ఇలా ఎన్నో రచనలు దళిత నేపథ్యంలో పుట్టడానికి ప్రధాన ప్రేరణ జాషువా గబ్బిలమే నన్నది నగ్నసత్యం.

జాషువా ప్రభావం చాలామంది దళిత క్రైస్తవుల్లో ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఆయన వ్రాసిన 'క్రీస్తు చరిత్ర'  కావ్యానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది.  జాషువా క్రీస్తు చరిత్ర కావ్యం వెలువడ్డాక ఆ ప్రభావంతో పది,  పన్నెండు పిల్ల క్రీస్తు చరిత్రలు పుట్టుకు రావడం విశేషం.

ప్రతిభావంతుడైన ఒక మహాకవి ప్రభావం అతడు జీవించిన యుగం మీద,  సమకాలిక కవుల మీద తప్పకుండా పడుతుందని చెప్పడానికి జాషువా కవిత్వం గొప్ప ఉదాహరణగా భావించవచ్చు.

6. ముగింపు:

వర్ధమానదశలో కొందరు జాషువా ప్రభావానికి గురి అయినప్పటికీ ఆ తరువాత స్వతంత్ర కవులుగా  నిలదొక్కుకున్నారు.  జాషువా లాగా పద్యం రాయాలనుకుని విఫలమైన వాళ్ళు లేకపోలేదు. కొందరు జాషువా వస్తువును,  రూప శిల్పాన్ని అనుకరించారు.  కానీ జాషువా పద్యాల ప్రాణ రహస్యాన్ని,  ఆయన అసమాన భావుకతలోని కవిత్వపు జీవనాడిని పట్టుకోలేకపోయారు. ఇరవయ్యో శతాబ్దపు పద్య కవులు ఎవరూ జాషువా ప్రభావం నుంచి తప్పించుకు పోలేదని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

తెలివికి కలిమిలేములతో నిమిత్తం లేదని, ప్రతిభను కులమతాల తక్కెడలో తూచరాదని విశ్వసించి తన జీవితమంతా ఆ విశ్వాసాన్నే కవిత్వంగా విశ్వసించిన జాషువాలోని ప్రతిఘటన దృక్పథాన్ని ఆవిష్కరించడానికి ఈ ఒక్క పద్యం చాలు.
          " గవ్వకు సాటి రాని పలుగాకుల మూకలసూయ చేత న 
          న్నేవ్విది దూరినన్ నన్ను వరించిన శారద లేచిపోవునే?
          యివ్వ సుధాస్థలిం బొడమరే రసలునులు? గంటమూనేదన్
          రవ్వలు రాల్చేదన్ గరగరల్ పచరించెద నాంధ్ర వాణికిన్"     

"ఎవ్వరేమనండ్రు నాకేమీ కొరత"  అని ప్రత్యర్థులను ధిక్కరించిన శ్రీనాధుడు ఎక్కడైనా ఈ "మధుర శ్రీనాధుని"  కలుసుకొని పై పద్యం వింటే ఒళ్ళు మరచి అమాంతంగా కౌగిలించుకోకుండా ఎలా ఉంటాడు.

జాషువ కులపరంగా అన్ని గాలివానలను సహించి వట వృక్షంలా నిలబడ గలిగారు. ఏ కులానికో,  మతానికో ప్రాధాన్యం ఇవ్వనని విశ్వ నరుడునని అంటారు అందుకే జాషువ….          

          "కుల మతాలు గీచుకున్న గీతలు చొచ్చి
          పంజరాన కట్టుపడను నేను
          నిఖిల లోకమెట్లు నిర్ణయించిన, నాకు
          తిరుగులేదు, విశ్వనరుడ నేను" అంటారు.

      ఖండకావ్య రచనలో ఎందరో కవులకు జాషువా ఆదర్శప్రాయుడు,  అనుసరణీయుడు.

7. పాదసూచికలు:

1.గుఱ్ఱం జాషువా, ఖం. కా-2, కవితాలక్షణము, పుట - 70.
2. మధునా పంతుల సత్యనారాయణ శాస్త్రి,  ఆంధ్ర రచయితలు, పుట - 506.
3. కురుగంటి సీతారామ భట్టాచార్యులు,  నవ్యాంధ్ర సాహిత్య వీధులు, పుట - 667.
4. డాక్టర్ పాటిబండ్ల మాధవరాయ శర్మ,  సారస్వత వ్యాసములు, తృ.సం. పుట - 159.
5. దువ్వూరి రామిరెడ్డి,  సరస్వతి వ్యాసములు, తృ.సం. పుట - 159.
6. తిరుమల రామచంద్ర,  మరపురాని మనీషి, పుట - 58.
7. మేడవరం వెంకట నారాయణ శర్మ, జాషువా కవిత్వతత్వం, పుట - 207.
8. డాక్టర్ బి. భాస్కర చౌదరి,  జాషువా కృతుల సమాలోచన, పుట - 328.
9. ఆచార్య సి. నారాయణరెడ్డి,  సమీక్షణం, పుట - 24.
10. జనహితుడు జాషువ, పుట - 3.
11. జనహితుడు జాషువ, పుట - 3.
12. జనహితుడు జాషువ, పుట - 3.
13. జనహితుడు జాషువ, పుట - 3.
14. జాషువ కవిత్వ తత్వం, పుట - 180.
15. జాషువ కవిత్వ తత్వం, పుట - 140.
16. ఆచార్య సి. నారాయణ రెడ్డి,  కవితాలహరి, పుట - 88.
17. జాషువ కృతుల సమాలోచన, పుట - 158.
18. కవి పాదుషా కొప్పురావూరి సత్యనారాయణ,  కళ్యాణ కింకిని, పీఠిక.
19. ఇరివేంటి వ్యాసాలు, పుట - 128.
20. జాషువ,  పిరదౌసి,  ద్వితీయ అశ్వాసం, పుట - 25.

8. ఉపయుక్తగ్రంథసూచి:

  1. ఆరుద్ర (2004),  సమగ్ర ఆంధ్ర సాహిత్యం(నాల్గవ సంపుటం), తెలుగు అకాడమీ, హైదరాబాద్.
  2. జాషువ, గుఱ్ఱం. (1946), గబ్బిలం - 1, వెంకట్రామ అండ్ కో, బెజవాడ.
  3. నాగయ్య, జి. (1996)తెలుగు సాహిత్య సమీక్ష(ద్వితీయ ముద్రణ), నవ్య పరిశోధక ప్రచురణలు, తిరుపతి.
  4. నారాయణరెడ్డి, సి.(1981) సమీక్షణం (వ్యాస సంకలనం), వంశీ ఆర్ట్ థియేటర్స్ హైదరాబాద్.
  5. ప్రకాశరావు, శివలెంక(1987),  భావ కవులు - ప్రతిభావిస్ఫూర్తి, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు.
  6. మహతి, (సమీక్ష వ్యాస సంకలనం). (1972),  యువభారతి, సికింద్రాబాద్.
  7. శాస్త్రి, ద్వా.నా. (1988), తెలుగుసాహిత్యచరిత్ర, విశాలాంధ్రపబ్లిషింగ్ హౌస్,  విజయవాడ.
  8. సత్యనారాయణ, ఎస్. వి.(2000), దళితవాద వివాదాలు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.
  9. సిమ్మన్న, వెలమల( 2011), తెలుగు సాహిత్య చరిత్ర, దళిత సాహిత్య పీఠం, విశాఖపట్నం.
  10. సుధాకర్, ఎండ్లూరి. (2007), జాషువా సాహిత్యం దృక్పథం పరిణామం, మానస మనోజ్ఞ ప్రచురణలు, రాజమండ్రి.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]