headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-09 | August 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

2. పోతన భాగవతసంభాషణలు: అద్వైతం, తదితర సిద్ధాంతాలు

k_madhavi.jpg
కొమ్ము మాధవి,

తెలుగు పరిశోధకులు,
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తిరుపతి &
తెలుగు అధ్యాపకులు,
అన్నవరం సత్యవతీ దేవి ప్రభుత్వ మహిళా కళాశాల, (స్వయంప్రతిపత్తి),
కాకినాడ, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9441834661. Email: kmadhavitelugu@gmail.com

dr_y_subhashini.jpg
డా. యర్రదొడ్డి సుభాషిణి

సహాయాచార్యులు, తెలుగుశాఖ,
శ్రీపద్మావతి మహిళావిశ్వవిద్యాలయం
తిరుపతి - 2, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9000102394. Email: dr.subhashiniy@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

తెలుగువారు చేసుకొన్న కోటిపుణ్యాల ఫలితం పోతన మహాకవి అందించిన భాగవతం. వేదవ్యాసకృతముగా ప్రసిద్ధికెక్కిన భాగవతపురాణమును పోతన క్రీ.శ.15వ శతాబ్దంలో కావ్యముగా స్వేచ్చానువాదం చేశాడు. సంస్కృత భాగవతానికి ద్వైతాద్వైతవిశిష్టాద్వైతాది సిద్ధాంతపరములుగా వచ్చిన వ్యాఖ్యానములు ఉన్నాయి. వీటిలో శ్రీధరస్వామి అద్వైతసిద్ధాంతపరముగా వ్రాసిన ‘భావార్థ దీపిక’ను పోతన అనుసరించాడని పెక్కుమంది పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. అందువల్ల పోతన భాగవతమునకు అద్వైతవ్యాఖ్యను ఎంతవరకు అనుసరించాడనే అంశాన్ని పరిశీలించటం, ఇతర సిద్ధాంతాలు కూడా ఎక్కడెక్కడ కనిపిస్తాయో సోదాహరణంగా సూచనప్రాయంగా తెలియజేయడం ఈ పరిశోధనావ్యాస ఉద్దేశ్యం. ప్రసిద్ధసంభాషణల్లో ఈ సిద్ధాంతాలు ఎలా ఆనుషంగికంగా మిశ్రితమై ఉన్నాయో ఈ వ్యాసం చర్చిస్తుంది.

Keywords: పోతన, భాగవతం, అద్వైతం, విశిష్టాద్వైతం, ద్వైతం, జైనం, ప్రకృతి ఆరాధన.

1. ఉపోద్ఘాతం:

శ్రీమద్రామాయణభారతభాగవతాలు విశ్వమానవాళికి అందిన కామితార్థదాయినులైన కల్పతరువులు. వేదసమాన ప్రతిపత్తి కలిగిన ఈ పురాణేతిహాసకావ్యాలు మహర్షులయిన వాల్మీకివ్యాస మునీంద్రులు సంస్కృతంలో కూర్చగా ఎన్నో భాషలలో అనువాదములు పొంది, ఇంకా పొందుతూ యుగయుగములుగా ధార్మికులచేత సేవింపబడుతూ ఉన్న, భారతభూమి ప్రపంచమునకు ఒసగిన వారసత్వ సంపదలు. క్రీ.శ.15వ శతాబ్దంలో భక్తకవి బమ్మెర పోతనామాత్యుడు తెలుగు వారి కోటిపుణ్యాల ఫలముగా మధురభక్తిభావబంధురముగా భాగవతమును తెనిగించి మరి ఏ ఇతర కావ్యమునూ రచించనవసరము లేకుండా తన పేరును ఆచంద్రార్కం నిలుపుకొన్నాడు.

2. పోతన ఆంధ్రీకరణ:

సంస్కృతములో వేదవ్యాసకృతముగా ప్రసిద్ధి చెందిన భాగవత పురాణమును పోతన సంస్కృతాంధ్ర కవులను సమానముగా మెప్పించునట్లు మూలములో ఉన్న ప్రణాళికకు అనుగుణముగానే 12 స్కంధములలో శ్రీమదాంధ్రమహాభాగవతముగా తెనిగించాడు. వీనిలో పంచమ, షష్ఠమ, ఏకాదశ, ద్వాదశస్కంధములు మాత్రము ఆయన శిష్యులయిన ఏల్చూరి సింగన, బొప్పరాజు గంగయ, వెలిగందల నారయ రచించినట్లుగా ప్రసిద్ధమయ్యాయి.

శృంగి అనే ముని శాపం కారణంగా తక్షకుడు అనే సర్పం వలన ఏడు రోజులలో మరణించే పరీక్షిత్తునకు మోక్షము పొందటానికి సులభమైన మార్గంగా శ్రీశుకమహర్షి తన తండ్రి వ్యాస భగవానుడు తనకు తెలిపిన భాగవతమును వినిపిస్తాడు. భాగవతం శ్రీమన్నారాయణుని లీలావతారాల వర్ణన, ఆయన నామగుణరూపకీర్తనము, విష్ణుభక్తుల కథలు ప్రధానంగా కలిగినది. గజేంద్ర మోక్షణం, ప్రహ్లాద చరిత్ర, ధ్రువోపాఖ్యానం, కుచేలోపాఖ్యానం, రుక్మిణీ కళ్యాణం, అంబరీష చరిత్ర, శ్రీకృష్ణావతారము మొదలైన భక్తి రసబంధురమైన అద్భుత గాథలు చదివేవారి, వినేవారి జన్మములు తరించేలాగా వర్ణింపబడ్డాయి.
భాగవతము అనగా భగవత్సంబంధమైనది అని అర్థం. భాగవతులు అనగా భగవంతునికి సంబంధించినవారు-భక్తులు అని భావం. ఇందులో విష్ణుదేవుని లీలావతారములు, విష్ణుభక్తుల కథలు వర్ణింపబడ్డాయి.

3. సంస్కృత భాగవతవ్యాఖ్యానములు :

సంస్కృత భాగవతమునకు అనేక వ్యాఖ్యానములు  ఉన్నాయి. ఒక కావ్యమును చదివిన వారు ఆ కావ్యమును అర్థము చేసుకొని తాము గ్రహించిన భావమునే వ్యాఖ్య అనవచ్చు. ఒక కావ్యమును నేరుగా చదివి అర్థము చేసుకోలేనివారికి వ్యాఖ్యానములు సహాయకారులుగా ఉంటాయి. అంతేకాక, లోతుగా, నిగూఢంగా దాగి ఉండే విశేషార్థములను గ్రహించటానికి కూడా ఈ వ్యాఖ్యలు ఉపకరిస్తాయి. సంస్కృత భాగవతమునకు ద్వైతాద్వైత విశిష్టాద్వైతాది సిద్ధాంతపరములుగా వచ్చిన శుక పక్షేయము, భాగవత చంద్రిక, పదరత్నావళి, సిద్ధాంత ప్రదీపము, ఆధ్యాత్మిక టీక,  క్రమ సందర్భము, సారార్థదర్శిని మొదలైన వ్యాఖ్యానములు 30 కి పైగా ఉన్నాయి.

ఇవి మాత్రమే కాకుండా శ్రీధరస్వామి భాగవతమునకు అద్వైతసిద్ధాంతమును వర్తింపచేస్తూ ‘శ్రీధరీయము’ అనే నామాంతరము గల ‘భావార్థదీపిక’ అను వ్యాఖ్యను రచించాడు. పోతన తన ఆంధ్రీకరణములో కథాపరముగా వ్యాసభాగవతమును, వ్యాఖ్యానపరముగా శ్రీధరీయమును అనుసరించాడని పెక్కుమంది పరిశోధకుల అభిప్రాయం. ఇక్కడ ఒక సందేహం రావచ్చు. మూలమును యథాతథముగా అనువదించి చదువుకోవచ్చు కదా! వ్యాస భగవానుడు ఏమి చెప్పాడో అది అర్థం చేసుకోవాలి గాని ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం అంటూ వేరు వేరు అర్థములెందుకు? నిజంగా వ్యాసుని అభిప్రాయం ఏమిటి? అని. ఇది కొంతవరకు నిజమే కానీ ఆదిమధ్యాంతరహితుడు, సాకార, నిరాకార స్వరూపుడు అయిన పరమాత్మ తన భక్తులు ఏ రూపముగా ఏ పేరుతో భావించి సేవిస్తారో వారిని ఆ విధముగానే అనుగ్రహిస్తాడు. “యే యథా మాం ప్రపద్యంతే తాం స్తథైవ భజామ్యహమ్” అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు కదా! అంతేకాక అనంత శక్తి స్వరూపుడైన పరమాత్మను, పరబ్రహ్మమును అందరూ ఒకే విధముగా దర్శించలేరు. ఎవరి అభిరుచి శక్తి, స్థాయిలను అనుసరించి వారు ఆయనను ధ్యానిస్తారు. అందువల్లనే సనాతన ధర్మములో విభిన్న దృష్టికోణములు, ఆరాధనా విధానములు ఏర్పడ్డాయి. అందువలన ఆ భగవత్తత్వమును అర్థము చేసుకొనే క్రమములో, తాము అర్థం చేసుకొన్న రీతిలో  భాగవతమునకు కూడా వివిధ సిద్ధాంతాల పరముగా, భిన్న దృష్టి కోణములతో పలు వ్యాఖ్యానములు వచ్చాయి. మరి పోతన భాగవతము ఎక్కువమంది పరిశోధకులు భావించినట్లు సంవూర్ణముగా అద్వైతపరముగానే వ్రాయబడిందా? లేక ఇతర సిద్ధాంతములు కూడా ప్రవర్తిస్తున్నాయా? అనే అంశం పరిశీలించటమే ఈ పరిశోధనా వ్యాస ఉద్దేశ్యం.

4. అద్వైతసిద్ధాంతం - అవగాహన:

అద్వైతసిద్ధాంతప్రవక్త శంకరభగవత్పాదులు. వేదములలో ప్రతిష్ఠింపబడిన అద్వైతమును పునరుద్ధరించినవారు. న+ద్వైతం= అద్వైతం. ద్వైతము కానిది అద్వైతం. ద్వి అనగా రెండు. ద్వైతము అనగా రెండు కలది. అద్వైతం అనగా రెండు లేనిది, ఒక్కటే ఉన్నది అని భావం. ఇందులో రెండు ఏమిటి అంటే, 1. జీవాత్మ 2. పరమాత్మ. జీవాత్మ, పరమాత్మ అని రెండూ పైకి వేరువేరుగా కనిపిస్తున్నా, అవి వేరు కావని, రెండూ ఒక్కటే అని చెప్పేది అద్వైత సిద్ధాంతం. మరి రెండూ ఒక్కటే అయినప్పుడు వేరు వేరు పేర్లతో ఎందుకు వ్యహరిస్తున్నాము? అంటే, నిజానికి జీవాత్మ, పరమాత్మ ఇద్దరూ ఒక్కటే. అంతటా వ్యాపించి ఉన్నది, అంతా తానే అయి ఉన్నది, తాను కాక వేరుగా మరొక పదార్థము ఏదీ లేనిదీ పరబ్రహ్మతత్త్వము.

సృష్టి చేయాలనే పరమాత్ముని సంకల్పము వలన జనించినది మాయ. బ్రహ్మము  శాశ్వతము, సత్యము. మాయాశక్తి వలన అజ్ఞానం ఆవరించి ఒక సత్యమే అనేక విధములుగా కనబడుతోంది. ‘బ్రహ్మ సత్యం, జగన్మిథ్యా’. బ్రహ్మమే సత్యము. జగత్తు మిథ్య. ఉన్న బ్రహ్మము లేనిదిగా, లేని జగత్తు ఉన్నట్లుగా కనపడటాన్ని మిథ్య అంటారు. అజ్ఞానం అంతరించినప్పుడు జీవునికి స్వస్వరూప జ్ఞానం కలిగి తాను పరబ్రహ్మమనే సత్యాన్ని గ్రహిస్తాడు. అదే అద్వైతస్థితి. ఇది స్థూలంగా అద్వైతతత్త్వం. ఈ సిద్ధాంతం పోతన భాగవతమునకు సంపూర్ణంగా వర్తిస్తుందా? అనే అంశాన్ని పరిశీలిద్దాం.

5. పోతన భాగవతం – అద్వైతతత్త్వం :

పోతన భాగవతంలోని ఆఖ్యానోపాఖ్యానముల ద్వారా, సంభాషణల ద్వారా, వర్ణనల ద్వారా, వ్యాఖ్యల ద్వారా అద్వైతభావనలు వ్యక్తమవుతూ ఉంటాయి. వానిలో కొన్నింటిని ఇప్పుడు పరిశీలిద్దాం.

పోతన ప్రారంభ పద్యంలో-

శ్రీ కైవల్య పదంబుC జేరుటకునై చింతించెదన్ లోకర
క్షెకారంభకు భక్త పాలనకళా సరంభకున్  దానవో
ద్రేక స్థంభకు గేళి లోల విలసద్దృగ్జాల సంభూత నా
నా కంజాతభవాండకుంభకు మహానందాంగనా డింభకున్
” -భాగ. 1.1.

బాలకృష్ణుని కైవల్యపదము కొరకు ప్రార్థించాడు. కైవల్యమంటే మోక్షపదము. జననమరణాలనే చక్రభ్రమణం లేని పునరావృత్తిరహితమైన పరబ్రహ్మ పదమే కైవల్యం. మోక్షం- సాయుజ్యం, సామీప్యం, సారూప్యం, సాలోక్యం అని నాలుగు విధములుగా ఉంటుంది. సాయుజ్యమంటే పరమాత్మలో లీనమైపోవటం. ఇది ఒక్కటే ఉత్కృష్టమైన మోక్షపదము. మిగిలినవన్నీ సాయుజ్యం కంటే ఒక మెట్టు దిగువనే ఉంటాయి. ఈవిధంగా పోతన ప్రారంభంలోనే పరమాత్మతో అభేదమును కోరుకొని భాగవత రచనను ప్రారంభించాడు. ఈ విధంగా భాగవత రచన, శ్రవణ, పఠనముల పరమ ప్రయోజనం అద్వైతమని పోతన అభిప్రాయంగా తెలుస్తుంది.

ఈ ప్రారంభపద్యం ద్వారా మరికొన్ని విశేషాలు తెలుస్తాయి. బ్రహ్మవిష్ణుమహేశ్వరులు త్రిమూర్తులు. వారు క్రమముగా సృష్టి, స్థితి, లయకారకులు. భాగవతంలో మాత్రం మహావిష్ణువే సర్వాంతర్యామి, సర్వేశ్వరుడు. బ్రహ్మ, మహేశ్వరుడు మొదలైన దేవతలను వారి వారి అధికార స్థానములలో నియమించి సృష్ట్యాదిప్రళయపర్యంతం  సమస్త కార్యభారములను వహించేవాడు శ్రీ మహావిష్ణువు. ఆ విష్ణువు నిర్వహించే కార్యములను ఈ పద్యంలో వ్యతిరేక క్రమాలంకారంలో ధ్వనింపచేశాడు. ఇది ఈ పద్యంలోని వైశిష్ట్యం. వీనిలో చివరి కార్యం లయం.  కైవల్యం అంటే అత్యున్నత మోక్షస్థితి కదా! అంటే ప్రళయకాలంలో విశ్వమంతా విష్ణువులో లీనమైపోయి ఇంకేమీ మిగలని నిరామయ నిరాకార స్థితి. ఇదే లయం. ఇదే కైవల్యం. లయమంటే సృష్టిని నాశనం చేయటమో, లేదా విరూపం చేయటమో కాడు. ఒక క్రమ పద్ధతిలో ప్రారంభించిన సృష్టిని అంతే క్రమ పద్ధతిలో సక్రమంగా ముగించటం. ఇది విష్ణువు యొక్క సృష్టి ఉపసంహార క్రియ. దీనిని మొట్టమొదట సూచించాడు.     

తర్వాత ‘లోకరక్షెకారంభకున్’ అనే పదబంధంలో విష్ణువు నిర్వహించే స్థితి కార్యం చెప్పబడింది. లోకములను స్థిరముగా ఎట్టి అవాంతరములు లేకుండా కొనసాగేలా చేయటం స్థితికార్యం. సోమకుడు వేదములను అపహరించినప్పుడు బ్రహ్మదేవుడు సృష్టిని సక్రమంగా నిర్మించే పనిలో తగిన విజ్ఞానం లేక తికమక పడుచుండగా మత్స్యరూపం ధరించి సోమకుని చంపి వేదములను బ్రహ్మకిచ్చి లోకములను అవ్యవస్థ నుండి కాపాడటం వంటి రక్షణ, పాలన కృత్యములను ‘లోకరక్షెకారంభకున్’ అనే పదబంధంలో సూచించాడు.

తర్వాతి అంశం ‘భక్తపాలనకళాసంరంభకత్వం’. భక్తులను పాలించటం అనేది ఒక కళ. ఎందుకంటే,  పంచభూతాత్మకమైన శరీరమును ధరించిన ఎవరికైనా కర్మానుభవం తప్పదు. అటువంటి భక్తుల సంచిత, ప్రారబ్ధ కర్మలకు ఎప్పుడెప్పుడు ఎటువంటి ఫలితాలనివ్వాలో అప్పుడప్పుడు అటువంటి ఫలితాలనిస్తూ, ఆశ్రితులను సంరక్షించుకోవటం, వారిని దయతో పాలించటం అనే పనిలో నిరంతరం సన్నద్ధంగా ఉందటం అనే సూచన ఉంది. అందుకే ‘భక్తపాలనకళాసరంభకున్’ అని పేర్కొన్నాడు.

భక్తపాలనను కళాత్మకంగా, అలా విలాసంగా నిర్వహిస్తూ ఉన్నప్పుడు రాక్షసుల వలన ఆటంకములు ఎదురైతే వారిని నిలువరించటం, అవసరమైతే వారిని సంహరించటం అనే కార్యములను ‘దానవోద్రేకస్థంభకుడు’ అనే విశేషణంతో పేర్కొన్నాడు. లోకరక్షెకారంభము, భక్త పాలనకళాసరంభము, దానవోద్రేకస్థంభము అనే మూడు కార్యములను నిర్వహించటానికే నారాయణుడు ఏకవింశతి అవతారములను ధరించాడు.

‘కేళిలోల విలసద్దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకున్’ అనే సమాసంలో నారాయణుడు విధాతగా సృష్టి చేసిన వైనాన్ని తెలిపాడు. సృష్టి చేయటానికి కారణం విష్ణువు ‘కేళిలోలత్వం’ – ఆటలాడటంలో కుతూహలం. అందువలన దృగ్జాలముల నుండి-తన చూపుల మాయల నుండి ఒక ఆటగా, లీలగా, విలాసముగా నానా బ్రహ్మాండములను సృష్టించాడు. అద్వైత సిద్ధాంతం దృశ్యమాన జగత్తును వాస్తవముగా ఉన్నట్లుగా భ్రమ పడటం ఆ మాయ వలననే అని ప్రతిపాదిస్తుంది. ఈ విధంగా పోతన అవతారిక మొదటి పద్యంలో శ్రీ మహావిష్ణువు పంచకృత్య పరాయణత్వమును సూచించాడు.

5.1 పోతనభాగవతరచనాఫలం :

పోతన భాగవతరచన ద్వారా పునరావృత్తి రహితమైన మోక్షమును పొందగలనని ముక్తకంఠంగా తెలిపాడు.    

పలికెడిది భాగవతమట!,  పలికించెడివాడు రామభద్రుండట! నే
పలికిన భవహర మగునట!, పలికెద వేఱొండు గాథ పలుకగ నేలా!
    - భాగ.1.18.

తన చేత భాగవతమును పలికింపచేసినవాడు శ్రీరామచంద్రుడని, భాగవతమును చెప్పి మరి ఏ ఇతర కావ్యమునూ వ్రాయనవసరము లేకుండా భవహరము అనగా తిరిగి పుట్టుక లేకుండా చేసుకుంటానని పోతన తెలిపాడు.

ఒనరన్ నన్నయ తిక్కనాదు లీ యుర్విం పురాణావళుల్
తెనుగుం జేయుచు మత్పురాకృత శుభాధిక్యంబు దానెట్టిదో
తెనుగుం జేయరు మున్ను భాగవతమున్ దీనిం దెనింగించి నా 
నా జననంబున్ సఫలంబు జేసెద బునర్జన్మంబు లేకుండగన్
” - భాగ.1.21.

అని జన్మాంతరములలో చేసిన పుణ్యవిశేషము వలన భాగవతమును తెనిగించే అపూర్వమైన అవకాశం లభించిందని, ఇప్పుడీ భాగవతమును రచించటం ద్వారా పునర్జన్మ లేకుండా  ఈ జన్మమును సఫలం చేసుకుంటానని తెలిపాడు. జీవులు పూర్వజన్మ కర్మానుభవాలను వాసనారూపంగా ఉత్తర జన్మలకు  తెచ్చుకుంటూ ఉంటారు. ఆవిధంగా జన్మపరంపరలు కలుగుతూ ఉండటం, పరమాత్మను ఆశ్రయించి జన్మరహిత్యాన్ని పొందటం అనే సిద్ధాంతాన్ని అద్వైతం అంగీకరిస్తుంది.  

ఈ విధంగా పోతన కృత్యాదిలోని మూడు పద్యాలలో కైవల్యము, భవహరము, పునర్జన్మ లేకుండా జన్మమును సఫలము చేసుకోవటం అనటం ద్వారా పోతన ఆశించినది మోక్షమని తెలుస్తుంది.

5.2. సంభాషణలు :

భాగవతం శుకపరీక్షిత్తుల, సూతశౌనకాది మహర్షుల సంభాషణారూపమైన కృష్ణసంకీర్తనము. శుకబ్రహ్మర్షి పరీక్షిత్తునకు భాగవతమును వర్ణించిన విధానమును సూతుడు శౌనకుడు మొదలైన మహర్షులకు నైమిశారణ్యంలో వివరించాడు.

లోకంలో మానవులకు శాశ్వతానందాన్ని కలిగించేది ఏదో దానిని తెలుపుమని శౌనకాది మహర్షులు సూతుని అడుగగా సూతుడు హరిగుణకీర్తనానురూపమైన భాగవతమును శుకమహర్షి పరీక్షిత్తునకు తెలిపిన  పద్ధతిలో వివరిస్తాడు.

ఆరూపుండయి చిదాత్మకుండయి పరగు జీవునికిం బరమేశ్వరు మాయాగుణంబులైన మహదాది రూపంబుల చేత నాత్మస్థానంబుగా స్థూల శరీరంబు విరచితంబైన, గగనంబునందు బవనాశ్రిత మేఘసమూహంబును, గాలియందు బార్థివధూళిధూసరత్వంబును నేరీతి నారీతి ద్రష్టయగు నాత్మ యందు దృశ్యత్వంబు బుద్ధిమంతులు గాని వారిచేత నారోపింపంబడు.” అని చెప్పాడు. 

జీవుడు ఆకారము లేనివాడే. మరి రకరకములైన రూపములతో, రకరకములైన పేర్లతో ఎలా విడివిడిగా  కనపడుతున్నాడు? అంటే అదే పరమేశ్వరుని మాయాశక్తి. సృష్టి చేయాలనే ఈశ్వరుని సంకల్పం నుండి జనించినది మాయ. మహత్తు, అహంకారం, శబ్దస్పర్శరూపరసగంధములనే పంచ తన్మాత్రలు, ఈ తన్మాత్రల గుణములు కలిగిన ఆకాశవాయ్వగ్నిజలభూములనే పంచ భూతాలు, వాక్పాణిపాదపాయూపస్థలనే పంచ కర్మేంద్రియాలు, శ్రవణత్వచనేత్రజిహ్వానాసికలనే పంచ జ్ఞానేంద్రియాలు, మనస్సు అనేవి మహదాదులు. మహదాదుల వలన సత్వరజస్తమోగుణములతో జీవుడు స్థూల శరీరం కలిగినవానిగా కనపడుతున్నాడు. ఒకే వజ్రము అనేక కాంతి రేఖలను వెదజల్లినట్లు, ఒకే సూర్యుని నుండి అనేక కాంతి కిరణములు ప్రసరించినట్లు, మాయ ఆవరించిన జీవునికి ఒకే బ్రహ్మము అనేక రూపములైన తనలాంటి జీవులుగా కనపడుతున్నాడు. ఆకాశంలోని మేఘంలో పిల్లలు తాము ఊహించిన ఆకారమును చూస్తారు. ‘యద్భావం తద్భవతి’ అన్నట్లు జీవులు తమను జీవునిగా భావిస్తే తమయందు జీవుని, తమను బ్రహ్మముగా భావిస్తే తమయందు పరబ్రహ్మమును దర్శిస్తారు. అడవి నుండి తప్పిపోయిన సింహపు  పిల్ల మానవుల చేతుల్లో పడి శాకాహారియై తనను మనిషిగా భావించుకుంటుంది. అదే మరొక సింహం చేసిన ప్రబోధంతో తెలివి తెచ్చుకొని తన సహజ జ్ఞానమును పొందుతుంది. అలాగే జీవుని అవస్థ కూడా ఉంటుంది. కారణం పరమేశ్వరుని మయాశక్తి వలన కలిగిన ఆవిద్య. అదే అజ్ఞానం. భూమి నుండి పైకి లేచిన ధూళి కణములు గాలితో కూడి బూడిద రంగు కల మేఘముల వలె ఆకాశంలో కనపడుతూ ఉంటుంది కదా. అలాగే, చిత్ స్వరూపుడు అయిన ఆత్మయందు లేని లక్షణములు ఆరోపింపబదుతాయి. ఆవిద్య వలన ఉన్న బ్రహ్మము లేనట్లుగాను, లేని జగత్తు ఉన్నట్లుగాను కనపడుతూ ఉంటుంది. దీనినే శంకరభగవత్పాదులు మిథ్యాజ్ఞానం అన్నారు. ప్రయత్నపూర్వకముగా సాధన చేసి ఆత్మానాత్మవివేకముతో సత్యమును గ్రహించిన జీవుడు బ్రహ్మ స్వరూపమును పొంది, కట్టె లేకుండానే మండే అగ్ని వలె ప్రకాశిస్తాడు. ఇలా జీవుడు స్వస్వరూప జ్ఞానం పొంది బ్రహ్మత్వం సాధించటమే అద్వైతం. దానికి మొదటి మెట్టు భక్తి. ఇది భాగవతం చెప్పే పరమార్థం.

5.2.1 శుక - పరీక్షిత్తుల సంభాషణ:      

శుక మహర్షిని పరీక్షిత్తు కొన్ని ప్రశ్నలు అడిగాడు. అవి : 1. సకల భూత సంసర్గ శూన్యమైన ఆత్మకు భూత సంసర్గం ఏవిధంగా కలిగింది? 2. అది నిష్కారణముగానా? లేక కర్మమును బట్టి కలిగిందా? 3. పరంజ్యోతి స్వరూపుడైన విష్ణుమూర్తికి, బ్రహ్మకు భేదము ఏమైనా ఉందా? లేదా? 4. భక్తి వలన ముక్తి ఏవిధంగా కలుగుతుంది? 5. జీవుడు దేహ సంబంధము వలన మాయకు లోబడి ఉంటాడు. మరి భగవంతుడు కూడా శరీరధారి అయినప్పుడు ఆ దేహ సంబంధము వలన వలన మాయకు లోబడి ఉంటాడా? అంటే దేహభ్రాంతి దేవునకు కూడా ఉందా? ఈ ప్రశ్నలకు భాగవతం ద్వారా సందేహ నివృత్తి కలుగుతుంది.

“జీవుడు సుజ్ఞాన స్వరూపుడు. అటువంటి జీవునికి దేహముతో సంబంధం ఈశ్వరమాయ లేకుండా కలుగదు. శ్రీహరి యొక్క యోగమాయాప్రభావం వలన జీవుడు పాంచభౌతిక శరీరం పొందుతాడు, శరీరం కారణంగా నేను, నాది అన్న అహంకారంతో సంసారమునందు తగులుకొంటాడు. పుటం పెట్టిన మేలిమి బంగారమైనా ధూళి చేత కప్పబడినప్పుడు దాని అసలు రూపం ఎలా మరుగుపడి ఉంటుందో, అలాగే మాయ ఆవరించి ఉన్న జీవుడు తన స్వరూప జ్ఞానమును కోల్పోతాడు. అతనికి భగవద్భక్తి యోగముతో ముక్తి కలుగుతుంది. జీవుడు అవిద్య వలన కర్మల ననుసరించి అసత్యమైన దేహసంబంధం కలవాడవుతున్నాడు. కానీ భగవంతుడు తాను సృజించిన నిజమాయా ప్రభావమునకు లోను కాక తన ఇచ్చతో కల్పించుకొన్న లీలా విగ్రహధారియై ఉంది, మాయకు లోనైన వారికి తాను కూడా శరీర సంబంధమైన కర్మలను అనుభవిస్తున్నట్లు భ్రమింపచేస్తాడు. రంగుల కళ్ళద్దములను ధరించిన వారికి లోకమంతా అదే రంగులో కనిపించినట్లు మాయలో నిమగ్నమైన ఉన్న జీవునికి పరమాత్ముడు కూడా మాయకు లోబడి ఉన్నట్లు కనిపిస్తుంది.

ఇందులో ఒక విశేషం ఉంది. జీవులందరూ శరీరాధారులైనందువల్ల ఆ శరీరముతో పాటు వచ్చిన సుఖ దుఃఖములను అనుభవిస్తుంటారు. కేవల భౌతికాపేక్ష కలిగిన జీవులతో పాటు, పరమాత్మను ఆశ్రయించిన జీవులు కూడా సుఖములను అనుభవిస్తుంటారు. అయితే, భగవద్భక్తులు కానివారు ఇహలోకములో సుఖములను అనుభవించిన తర్వాత వారి కర్మానుభవమును బట్టి ఫలితములను, జనన మరణములను పొందుతుంటారు. పరమాత్మను ఆశ్రయించిన జీవులు భగవద్భక్తి చేత కలిగిన జ్ఞానముతో పరమపదమును చేరి ఆనందానుభూతిని శాశ్వతముగా పొందగలుగుతారు. ఇది ఇద్దరికీ భేదము. ఈ బ్రహ్మజ్ఞానమును విదితం చేయటానికే ఆత్మకు ఆధ్యాత్మికము, అధిదైవికము, ఆధిభౌతికము అనే తాపత్రయము కల్పించబడింది. ఈ విధంగా శుక పరీక్షిత్తుల సంభాషణలో అద్వైతం ప్రతిష్ఠింపబడింది.

5.2.2 విదుర - మైత్రేయుల సంభాషణ:

ఇందులో తత్త్వవిచారం ఇమిడి ఉంది. విదురుడు, మైత్రేయుని కాలస్వరూపాన్ని గురించి, శ్రీమన్నారాయణుని విరాట్స్వరూపమును గురించి ప్రశ్నిస్తాడు. అప్పుడు మైత్రేయుడు ఇలా చెప్పాడు :

తెఱగొప్ప నఖిల విశ్వము
బురుషోత్తము మాయ చేత బుట్టుం బెరుగున్
విరతిం బొందుచు నుండుం
గర మర్థిం భూత భావి కాలము లందున్”      - భాగ.3.343.  

“ఈ సృష్టికి పూర్వం వెలుపల మొదలు, తుద లేని ఒక తత్త్వం ఉంది. ఆ తత్త్వమే ఈ సృష్టికి మూలం. ఇరవై నాలుగు గుణాలు, పది ఇంద్రియాలు, పంచభూతాలు పరమాత్మను ఆశ్రయించి ఉంటాయి. ఆయన జగన్నిర్మాణ సమయంలో తగినట్లుగా వాటిని స్వీకరించి, తనను తాను సృష్టించుకున్నాడు. కాబట్టి తాను సృష్టించిన లోకాలన్నింటిలోనూ తానే ఉంటాడు. విశ్వమునకు కారణమూ, కార్యమూ కూడా పరమాత్ముడే. పరమాత్మ యొక్క బాహిర స్వరూపమే ఈ విశ్వము.”

ఈ విధంగా భగవంతుడు చేసే సృష్టి కార్యానికి అంతం అనేది లేదు. అది కొనసాగుతూనే ఉంటుంది. ఈ సృష్టి చేయటానికి ఆయనకు మరొక వస్తువుతో పని లేదు. లౌకిక జగత్తులో ఒక వస్తువును తయారు చేయటానికి మూడు కారణాలు ఉంటాయి. 1. ఉపాదాన కారణము. 2. సమవాయ కారణము. 3. నిమిత్త కారణము. ఒక కుండను రూపొందించటానికి మట్టి కావాలి. అది ఉపాదాన కారణము. కుండగా రూపొందించటం సమవాయ కారణం. కుండను చేసేవాడు నిమిత్త కారణం. కానీ, ఈ జగన్నిర్మాణానికి ఆ కారణాలు అవసరం లేడు. అన్ని కారణాలూ, అన్నీ కార్యాలూ తానే అయి ఉంటాడు”. అని చెప్పాడు. విశ్వం అంతా ఒకే పరబ్రహ్మ స్వరూపమని, పరబ్రహ్మము కంటే వేరైన రెండవ వస్తువు ఏది లేదని అద్వైతం తెలుపుతుంది.

నిజానికి “శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్” అని పోతన అనటంలోనే మహాభాగవత సారాశమంతా ధ్వనిస్తోంది కాబట్టి భాగవతం మొత్తం అద్వైత తత్త్వ ప్రతిపాదాత్మకమైన కావ్యమని చెప్పటానికి ఇంతకంటే రుజువు వేరే అవసరము లేదని అద్వైతవాదులంటారు. కానీ ఇందులోని ఆఖ్యానములను, వృత్తాంతములను పరిశీలిస్తే, కేవలం అద్వైతం మాత్రమే కాక విశిష్టాద్వైత, ద్వైత, సాంఖ్య, చార్వాక మొదలైన తత్త్వముల ఛాయలు కూడా కనబడుతాయి. ఇప్పుడు అద్వైతంతో పాటు గోచరించే ఇతర సిద్ధాంతములను పరిశీలిద్దాం.

6. పోతన భాగవతంలో అద్వైతేతర సిద్ధాంతములు:

6.1 విశిష్టాద్వైతం :

విశిష్టాద్వైతాన్ని భగవద్రామానుజులు ఉపదేశించారు. అద్వైతమైనా కొన్ని భేదాలతో అద్వైతం కంటె కొంత భిన్నంగా ఉంటుంది. పరమాత్మలో జీవాత్మ ఐక్యాన్ని విశిష్టాద్వైతం అంగీకరిస్తుంది.  విశిష్టాద్వైతంలో జీవేశ్వరులు ప్రకృతి పురుషులుగా ఉంటారు. ఆచార్యుని ద్వారా జీవాత్మ పరమాత్ముని చేరుతుంది. అద్వైతంలో ఆచార్యుని సహాయం అవసరమే గానీ తప్పనిసరి కాదు. ఇది భేదం. విష్ణువు ఒక్కడే పరమాత్మ అని బోధిస్తుంది. ఇతరులను దైవములుగా అంగీకరించదు. విష్ణుపారమ్యమును బోధించుట విశిష్టాద్వైతం చేత విశిష్టాద్వైతమే శ్రీవైష్ణవ మతంగా ప్రసిద్ధి పొందింది. 

6.1.1 పరీక్షిత్తు - శుక సంభాషణ:

మోక్షార్థి అయిన పరీక్షిత్తు శుక బ్రహ్మర్షిని-

ఏమి చింతించిన నేమి జపించిన నేమి గావించిన నేమి వినిన
నేమి సేవించిన నెన్నCడు సంసార పద్ధతిC బాసిన పదవి గలుగు
?’  - భాగ.1.525.

ఏమి ధ్యానిస్తే, ఏమి జపిస్తే, ఏమి చేస్తే,  ఏమి వింటే, ఏమి సేవిస్తే, ఎప్పుడు సంసార బంధముల నుండి విముక్తి కలుగుతుంది?  అని పరీక్షిత్తు ఆరు ప్రశ్నలడిగాడు. ఈ ఆరు ప్రశ్నలకు శుకుడు మహావిష్ణువును సమాధానంగా చూపించాడు.

........... సర్వాత్మకుడు మహావిభవుడు విష్ణు డీశు డాకర్ణింపన్
సేవింపను వర్ణింపను భావింపను భావ్యు డభవభాజికి నధిపా!           - భాగ.2.4.

‘మోక్షాపేక్ష గలవానికి సర్వాత్మలలో నెలకొన్నవాడు, గొప్ప వైభవం గలవాడు, సర్వవ్యాపకుడు అయిన విష్ణువే సేవించటానికి, వర్ణించటానికి, భావించటానికి తగినవాడు’ అని చెప్పి అందుకు తగినట్లుగా భాగవతం వినిపించాడు.

హరి మయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పని లేదా
హరి మయము గాని ద్రవ్యము, పరమాణువు లేదు వంశపావన! వింటే
”  - భాగ.2.17.

మహావిష్ణువు తప్ప విశ్వములో మరొకటి లేదు అని చెప్పటంలో విశిష్టాద్వైతం వ్యక్తమవుతుంది.

6.2. ద్వైతం : 

ద్వైతం అనగా రెండు వేరు వేరుగా ఉన్నవి అని అర్థం. ‘ద్వే జతే గతే యస్మిన్ స్తత్ ద్వైతం’ అని ద్వైతమునకు నిర్వచనం. దేవుడు వేరు, జీవుడు వేరు అని ప్రతిపాదించేది ద్వైతం. ద్వైత మత స్థాపకులు ఆనంద తీర్థులు అను నామాంతరము గల మధ్వాచార్యులు. మోక్షమంటే జీవాత్మ పరమాత్మకు చేరువ కావటమే. ఆన్ని విషయాలలోనూ పరమాత్మ కంటే చాలా తక్కువ స్థాయిలో ఉండి పరమాత్మను దర్శిస్తూ ఉంటుంది. కానీ జీవాత్మపరమాత్మలు ఒక్కటి కావటం మాత్రం అసంభవం. శ్రీమన్నారాయణుడే సర్వోత్తముడు అనేది ద్వైత మత సిద్ధాంతం.

6.2.1 పరీక్షిత్తు - శుక సంభాషణ:

........ యతని సేవింప నగు గాక యన్యసేవ,
గలుగనేరవు కైవల్య గౌరవములు..........
”  - భాగ.2.18.

కేవలము విష్ణువును సేవిస్తే మాత్రమే కైవల్యం కలుగుతుంది గాని ఇతర దేవతలను సేవిస్తే మోక్షం సిద్ధించదు”.   అని శుకుడు పరీక్షిన్మహారాజుతో చెపుతాడు.

6.2.2 గజేంద్రమోక్షం:  

గజేంద్ర మోక్షణములో ఏనుగు మొసలి నోట చిక్కి చాలా సంవత్సరములు పోరాడింది. చివరకు తన బలము  చాలదని గ్రహించి పూర్వజన్మలో చేసిన పుణ్య విశేషము చేత పరమాత్ముడు ఒకడు ఉన్నాడని, అతడే తనను రక్షించగలడని తెలుసుకొని ఆ పరమేశ్వరుని శరణు వేడింది. “........  అరక్షిత రక్షకుండైన యీశ్వరుం దాపన్నుం డైన నన్నుం గాచు గాక యని నింగి నిక్కి చూచుచు నిట్టూర్పులు నిగిడించుచు బయలాలకించుచు ......: మొఱ పెట్టుకొంది. 

ఇక్కడ గజేంద్రుడు ప్రత్యేకంగా బ్రహ్మ అని, విష్ణువు అని, మహేశ్వరుడు అని ఏ ఒక్క దేవుని పేరును ప్రస్తావించకుండా ‘దీనులపాలిటి కలిగినవాడు తనను రక్షించుగాక’ అని ప్రార్థించాడు. గజేంద్రమోక్షణంలో ఉన్న వైచిత్రి ఏమంటే, గజేంద్రుని ప్రార్థనలో  అంతా అద్వైతం వినిపిస్తుంది.

ఎవ్వనిచే జనించు, జగమెవ్వని లోపల నుండు లీనమై,
యెవ్వని యందు డిందు బరమేశ్వరుడెవ్వడు, మూల కారణం
బెవ్వ డనాది మధ్య లయుడెవ్వడు సర్వము తాన యైన వా
డెవ్వడు వాని నాత్మభవు నీశ్వరునే శరణంబు వేడెదెన్
”    - భాగ.8 .73.

విశ్వం పుట్టుక, ఉనికి, తుద అన్నిటికీ కారణమైనవాడు, ఆత్మభవుడు ఒక్కడే. ఇతరము లేని వానిని గజేంద్రుడు ప్రార్థించాడు. కానీ అంతలోనే -  

‘’విశ్వమయత లేమి వినియు  నూరక యుండి రంబుజాసనాదు లడ్డపడక
విశ్వమయుడు విభుడు విష్ణుండు జిష్ణుండు భక్తియుతున కడ్డ పడ దలచె
’’   - భాగ.8 .94.

బ్రహ్మాది దేవతలకు విశ్వమంతా నిండి ఉండే శక్తి లేక వారు గజేంద్రుని మొర విని కూడా రక్షించకుండా ఊరకు న్నారు. మహావిష్ణువు విశ్వమయుడు, ప్రభువు కాబట్టి గజేంద్రుని రక్షించటానికి పూనుకొన్నాడని పోతన వర్ణించాడు. ఇక్కడ ఇతర దేవతలకన్న విష్ణువే అధికుడని చెప్పబడింది. ఈ సందర్భంలో దేవతలందరికన్న సర్వోత్తముడు మహావిష్ణువు అన్న ద్వైత సిద్ధాంతం నిరూపణ అవుతోంది. విశిష్టాద్వైతం ఇతర దేవతల ఉనికిని ఖండించలేదు. అందరిలోనూ విష్ణ్వాధిక్యముతో పాటు విష్ణ్వాద్వైతమును విశిష్టాద్వైతం ప్రకటిస్తుంది. శ్రీహరి చేత రక్షింపబడిన గజరాజు హరి కరస్పర్శ చేత విగతపాపుడై అజ్ఞానం పోయి విష్ణువు రూపు పొంది సారూప్య మోక్షమును పొందాడు. గజేంద్రుడు విష్ణువులో లీనం కాలేదు. విష్ణు రూపుడై విష్ణువు కంటే భిన్నంగా ఉన్నాడు. గజేంద్రమోక్షణంలో అద్వైతంతో పాటు ద్వైత భావం కూడా ప్రకటింపబడింది.

6.3 జైనం :

వైదిక మతములోని కొన్ని ఆచారములను నిరసిస్తూ ఆవిర్భవించినవి బౌద్ధ జైన మతములు. జైన మతములో 24 మంది తీర్థంకరులు ఉంటారు. వారిలో ఋషభదేవుడు అని పిలువబడే వృషభనాథుడు మొదటి తీర్థంకరుడు. భాగవతంలో వృషాభావతారం అంటే ఋషభదేవుడే.  జైనపురాణమైన ఆదిపురాణంలో ఋషభదేవుని కథలు వర్ణింపబడ్డాయి. భాగవతంలో పరమాత్ముని ఏకవింశతి అవతారములలో 8 వ అవతారం వృషాభావతారం.

6.3.1 వృషభావతారం:

భాగవతంలోని ద్వితీయ స్కంధంలో “అగ్నీధ్రుండను వానికి “నాభి” యనువాడుదయించె, నతనికి మేరుదేవి యను నామాంతరంబు గల “సుదేవి” యందు హరి వృషభావతారంబు నొంది జడస్వభావంబైన యోగంబు దాల్చి ప్రశాంతాంతః కరణుండును, బరిముక్తసంగుండునునై పరమ హంసాభిగమ్యం బయిన పదం బిది యని మహర్షులు పలుకుచుండం జరించె” అని వృషభావతారము పేర్కొనబడింది.        

6.4. ప్రకృతి ఆరాధన:

వ్రేపల్లెలో తరతరాలుగా సకాలంలో వానలు కురిసి, పాడిపంటలతో గోకులం వర్ధిల్లటం కోసం ఇంద్రయాగం చేయటం ఆచారం. ఇంద్రయాగం చేయాలనే ఆలోచనతో ఉన్న నందుని వద్దకు శ్రీకృష్ణుడు వచ్చి తమకు, తమ గోసంపదకు సకల గ్రాసమును, ఓషధులను ఇచ్చే కల్పతరువు వంటి గోవర్ధన పర్వతాన్ని పూజించుదామని వారిచేత గోవర్ధనగిరి పూజ చేయిస్తాడు. ఇంద్రయాగం వైదికమైన క్రతువు. గోవర్ధనగిరి పూజ వేదాలలో లేని ప్రకృతి ఆరాధనా విధానం. ఈ విధంగా కృష్ణుడే స్వయంగా వేదోక్తమైన కర్మలనుండి వారిని ప్రకృతి ఆరాధన వైపు మళ్లించాడు. దీనికి ఒక కారణాన్ని మనం ఊహించవచ్చు. అదేమంటే, వ్రేపల్లెలోని ప్రజలు నేలను, నమ్ముకున్నవారు. గోపాలకులు. పాడిపంటలే వారి జీవనవిధానం. ఆధునికత, నాగరికతలకు దూరంగా ప్రకృతిలో స్వేచ్చగా, స్వచ్చంగా, నిష్కల్మషంగా జీవించేవారు. అందువలన వారి సహజ స్వభావానికి విరుద్ధంగా చేసే ఇంద్రయాగం కంటె  వారి జీవితంలో భాగమైన గోవర్ధన గిరి పూజ ద్వారా కృష్ణుడు ఎవరికి వారి సహజ ఆరాధనా పద్ధతిని వారికి సూచించాడని భావించవచ్చు. ఇంద్రుడు కోపించి ఏడురోజులపాటు ఏకధాటిగా రాళ్ళ వాన కురిపించినప్పుడు ఆ గోవర్ధన పర్వతాన్నే ఎత్తి వారిని కాపాడటం ద్వారా ఎవరి ధర్మమును వారు నిష్ఠగా అనుసరిస్తే ఆ ధర్మమే వారిని కాపాడుతుందని ప్రతీకాత్మకంగా చెప్పాడని భావించవచ్చు. ప్రకృతి ఆరాధన, పరిరక్షణ ఇందులో ప్రతీకాత్మకంగా వ్యక్తమయింది.

6. 5 ఇతరములు:

శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధానంతరం ధర్మరాజును రాజ్యపాలనమున నిలిపి తిరిగి ద్వారకకు వెళ్ళుచున్నప్పుడు శ్రీకృష్ణుని చూచి హస్తినాపుర పౌరులు తమలో తాము ఇలా మాట్లాడుకునే సందర్భంలో వైదికావైదిక సిద్ధాంతాల ప్రస్తావన ఉంటుంది.

6.5.1 హస్తినాపురస్త్రీలమనోగతం:

హస్తినాపుర  స్త్రీలు  తమలో తాము ఇలా సంభాషించుకుంటారు:

సృష్టి ఇంకా ప్రారంభం కావటానికి ముందు, వ్యక్తంగా ఉండే ప్రపంచం ఏమీ లేనప్పుడు ప్రళయకాలములో ఏ వికారములూ లేని ఆత్మ ఒక్కటే ఉంటుంది. జగత్తుకు కారణమైన పరమాత్మ శక్తులు ఆయనలోనే అంతమై ఉంటాయి. ఏ మాయామోహములు, గుణములు అంటని స్థితిలో పరబ్రహ్మములోనే జీవులు లీనమైపోయి ఉన్నప్పుడు, విశ్వము ఏర్పడని స్థితిలో ఒక్కడుగా ప్రకాశిస్తూ ఉండే పురాణపురుషుడే ఇతడు.” అని కొందరు అన్నారు. పరబ్రహ్మము తప్ప రెండవ వస్తువు ఏదీ లేదని చెప్పేది అద్వైతం. ఆ పరబ్రహ్మమే విష్ణువు అని చెప్పేది విశిష్టాద్వైతం.

అప్పుడు కొందరు ఇలా అన్నారు: “జీవులు బ్రహ్మములో లీనమవటం అనేది నిజమైతే, అప్పుడు బ్రహ్మత్వం పొందినవానికి లయం అనేది ఎందుకు ఉంటుంది? బ్రహ్మత్వం పొందితే వారికి అస్తిత్వం ఉండాలి కదా! మరి వారు ఎందుకు లయమవుతున్నారు? అనేది వారి సందేహం. ఇక్కడ సాంఖ్యం సూచింపబడింది. సాంఖ్యం అనగా ‘గణనము’. ప్రకృతిని, తత్త్వాలను విడివిడిగా గణిస్తూ పరమాత్మ తత్త్వమును నిరూపించునది సాంఖ్య యోగము. సాంఖ్యం ప్రకారం జీవులు వేరు, బ్రహ్మము వేరు. సాంఖ్యవాదం ద్వైతమును సమర్థిస్తుంది. కర్దమ ప్రజాపతి, దేవహుతిలకు కుమారుడుగా జన్మించిన కపిలాచార్యుడు తల్లి అయిన దేవహుతికి సాంఖ్య యోగమును వివరించాడు. సాంఖ్యం, భక్తి యోగం ద్వారా కపిలుడు మోక్ష మార్గమును ఉపదేశించాడు.

7. ముగింపు:

జీవుడు, బ్రహ్మము రెండూ వేరు కావని, రెండూ ఒక్కటే అని చెప్పే అద్వైత సిద్ధాంతం ప్రకారం - శ్రీ కైవల్య పదంబు..” పలికెడిది భాగవతమట..”, “ఒనరన్ నన్నయ.....” అనే కృత్యాది పద్యాలలో పోతన పునరావృత్తిరహితమైన మోక్షపదమును కోరుకొన్నాడు. శుకపరీక్షిత్తులు, విదురమైత్రేయుల సంభాషణలు, భీష్ముడు మొదలైన వ్యక్తుల భావనలలో అద్వైతంధ్వని కనిపించింది. భగవద్రామానుజులు ఉపదేశించిన  విష్ణుపారమ్యమును బోధించే విశిష్టాద్వైతం ప్రకారం, ‘ఏమి ధ్యానిస్తే, ఏమి జపిస్తే, ఏమి చేస్తే,  ఏమి వింటే, ఏమి సేవిస్తే, ఎప్పుడు సంసార బంధముల నుండి విముక్తి కలుగుతుంది?’  అని పరీక్షిత్తు అడిగిన ప్రశ్నలకు శుకుడు మహావిష్ణువును సమాధానంగా చూపించినట్టు గోచరిస్తోంది.

“హరి మయము విశ్వమంతయు.. సంశయము పని లేదా హరి మయము గాని ద్రవ్యము, పరమాణువు లేదు” అని చెప్పటంలో విశిష్టాద్వైతం వ్యక్తమవుతుంది. ఇక దేవుడు వేరు, జీవుడు వేరు అని ప్రతిపాదించేది ద్వైతం. ద్వైతమత స్థాపకులు మధ్వాచార్యులు. గజేంద్రమోక్షణంలో బ్రహ్మాది దేవతలకు విశ్వమయత లేకపోవటం వల్ల వారు గజేంద్రుని మొర విని కూడా రక్షించకుండా ఊరకున్నారు. మహావిష్ణువు విశ్వమయుడు కాబట్టి గజేంద్రుని రక్షించటానికి పూనుకొన్నాడని పోతన వర్ణించాడు. ఇతర దేవతలకన్న విష్ణువే అధికుడని చెప్పబడింది. గజరాజు హరి కరస్పర్శ చేత విగతపాపుడై అజ్ఞానం పోయి విష్ణువు రూపు పొంది సారూప్య మోక్షమును పొందాడు. ఈ విధంగా గజేంద్రమోక్షణంలో ద్వైతభావము ప్రకటింపబడింది.

ఇక జైనమతస్థాపకుడైన ఋషభదేవుని విష్ణువు వృషభావతారంగా చెప్పటంలో జైనం, కపిల దేవహుతి సంభాషణలో సాంఖ్యం, గోవర్ధనోద్ధరణంలో ప్రకృతి ఆరాధన మొదలైన వైదికేతరములైన సిద్ధాంతములు కూడా ప్రతిపాదింపబడ్డాయి. దీనినిబట్టి పోతన తన భాగవతంలో అద్వైతంతో పాటు భగవంతుని చేరే ఇతర మార్గములను కూడా అంగీకరించినట్లు తెలుస్తుంది. భాగవతులు తమకు అనుకూలమైన దారిలో భగవంతుని చేరవచ్చు.

దీనిని బట్టి పోతన భాగవతం సంపూర్ణంగా ఏ ఒక్క సిద్ధాంతమునూ స్థిరముగా అనుసరించలేదని తెలుస్తుంది. ద్వైతమైనా, అద్వైతమైనా, విశిష్టాద్వైతమైనా, సాంఖ్యమైనా మరేదైనా భగవంతుని చేరటానికి దారి చూపించేవే. పోతన తన భాగవతంలో అద్వైతంతో పాటు భగవంతుని చేరే ఇతర మార్గములను కూడా అంగీకరించినట్లు తెలుస్తుంది. భాగవతులు తమకు అనుకూలమైన దారిలో భగవంతుని చేరవచ్చు. అందుకే, సర్వ సిద్ధాంత సమన్వయ సారంగా పోతన భక్తి, కర్మ, జ్ఞాన, యోగ మార్గములలో పరతత్త్వమును చేరే విధానమును రమణీయమైన కథల ద్వారా, శ్రవణీయమైన వర్ణనల ద్వారా ఎన్నిమార్లు చదివినా తనివి తీరనట్లుగా అక్షరీకరించాడు.

8. ఉపయుక్త గ్రంథసూచి:

  1. ఆరుద్ర, సమగ్రాంధ్రసాహిత్యం, నాల్గవసంపుటం, ప్రజాశక్తి బుక్ హౌస్, విజయవాడ:1990.
  2. ఉషశ్రీ, శ్రీమద్భాగవతం, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి: 2006.
  3. కోటేశ్వరరావు శర్మ చాగంటి, శ్రీమదాంధ్ర భాగవతం, ఎమెస్కో: 2017.
  4. పావనిశాస్త్రి, విశ్వనాథ, ఉభయభారతి, విశ్వనాథ పబ్లికేషన్స్: 2002.
  5. పోతన, బమ్మెర, శ్రీమహాభాగవతం, ఫస్ట్ ఎడిషన్, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి: 2017.
  6. పోతన, బమ్మెర, శ్రీమదాంధ్ర మహాభాగవతంచతుర్థ ముద్రణ, విక్టరీ పబ్లిషర్స్: 2018.
  7. ప్రసాదరాయ కులపతి, ఆంధ్ర భాగవత విమర్శ, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.
  8. మారుతీవేంకట సుబ్రహ్మణ్యం, ముత్తరాజు, అమరానందము, అద్వైత యోగపీఠం: 2018.
  9. లక్ష్మావధానులు, కుప్పా, అద్వైతాక్షర మాలిక, సాధన గ్రంథ మండలి, తెనాలి: 2009.
  10. లక్ష్మీకాంతం, పింగళి, ఆంధ్ర సాహిత్య చరిత్ర, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్: 1998.
  11. శేషగిరిరావు, దేవరకొండ, అద్వైత సాధన, ఎమెస్కో: 2016.
  12. శ్రీరామమూర్తి, కొర్లపాటి, సంకలన కర్త, పోతన సాహిత్య గోష్ఠి, ఆంధ్రా యూనివర్సిటీ ప్రెస్, విశాఖపట్టణం: 1983.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]