headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-09 | August 2023 | ISSN: 2583-4797 | UGC-CARE listed

1. విశ్వనాథ ‘వేఁగి క్షేత్రము’: చారిత్రక విశేషాలు

dr_p_sivakumar.jpg
డా. పట్టపు శివకుమార్

తెలుగు అధ్యాపకులు,
శ్రీ గోవిందరాజ స్వామి ఆర్ట్స్ కళాశాల
తిరుపతి, ఆంధ్రప్రదేశ్ - 517501.
సెల్: +91 9492032640. Email: pattapu.siva@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన ‘ఆంధ్రప్రశస్తి’ కావ్యం 1919-20 ప్రాంతంలో భారత జాతీయోద్యమ ప్రభావంతో వెలువడినది. ఈ కావ్యంలో మొత్తం 12 కవితా ఖండికలు ఉన్నాయి. ఇందులో ఐదవ ఖండిక ‘వేఁగి క్షేత్రము’. విశ్వనాథ వారు ‘వేఁగి క్షేత్రము’ అనే కవితా ఖండికలో ఆంధ్రుల పూర్వ వైభవమును, వేఁగి క్షేత్రమును పాలించిన తెలుగు రాజుల శౌర్య ప్రతాపములను, ఆంధ్ర ప్రజల చారిత్రక, సాంస్కృతిక ప్రాభవములను గురించి విశేషంగా వర్ణించారు. ఈ వ్యాసంలో ఆంధ్రప్రశస్తి కావ్య విశిష్టత, వేఁగి క్షేత్రము రచనా నేపథ్యం, ఈ కవితా ఖండిక యొక్క విశిష్టత, అదేవిధంగా వేఁగి పట్టణమును గురించిన చారిత్రక ఆధారములు మరియు వేఁగి పట్టణము కవితా ఖండికలో కవి ప్రస్తావించిన పూర్వ పల్లవ రాజులను (శాలంకాయనులు) గురించిన విశేషములను పరిశీలన చేయడం అనేవి ప్రధానాంశములు. ఈ వ్యాసంలో ప్రస్తావించిన వివిధ విషయాల ద్వారా ఈ కవితా ఖండికలో కవి వర్ణించిన చారిత్రకాంశములు గుర్తించబడతాయి. అదేవిధంగా ఈ కవితా ఖండికలో పేర్కొన్న స్థల కాలాదులు మరియు వ్యక్తులకు చారిత్రకంగా ఆయా కాలాలలో గల ప్రాధాన్యత అనేది వెల్లడవుతుంది. అంతేకాకుండా వివిధ చారిత్రకాంశములను సాహిత్యంతో సమన్వయించి చూడగలిగే పరిశీలనాత్మక దృష్టి కూడా అలవడుతుంది.

Keywords: విశ్వనాథ సత్యనారాయణ, ఆంధ్రప్రశస్తి కావ్య విశిష్టత, వేఁగి క్షేత్రము రచనా నేపథ్యము, కవితా విశిష్టత, వేఁగి పట్టణము చారిత్రక ఆధారములు, పూర్వ పల్లవులు (శాలంకాయనులు), సముద్రగుప్తుడు, చారిత్రక విశేషములు

1. ఉపోద్ఘాతం:

ఆధునికాంధ్ర సాహిత్యంలో విశ్వనాథ సత్యనారాయణ జన్మతః ప్రతిభావ్యుత్పత్తులు కలిగిన మహాకవి. వీరు కృష్ణాజిల్లా నందమూరులో 10-9-1893లో జన్మించినారు. 1921 నుంచి 1926 వరకూ బందరులోని ఆంధ్ర జాతీయ కళాశాలలో అధ్యాపకునిగా విశ్వనాథ వారి ఉద్యోగ జీవితం ప్రారంభమైనది. ఆ తర్వాత బందరు నేషనల్ కాలేజి గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్ కాలేజి, విజయవాడలో ఎస్.ఆర్.ఆర్.& సి.వి.ఆర్. కాలేజి, కరీంనగర్ ప్రభుత్వ ఆర్ట్స్ & సైన్స్ కాలేజి మొదలైన కళాశాలల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. విశ్వనాథ వారు 1957లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ  ఉపాధ్యక్షులుగానూ, 1958లో శాసనమండలికి నామినేటెడ్ సభ్యులుగానూ కూడా విధులు నిర్వర్తించారు. 1976 అక్టోబరు 18న విశ్వనాథ వారు పరమపదించారు.
తెలుగుభాషకు విశ్వనాథ వారు అనేక విశిష్టమైన రచనలను అందించారు. అందులో సుమారు 25 పైచిలుకు కావ్యాలు, 6 శతకాలు, 13 గేయకావ్యాలు, 15 నాటకాలు, 58 నవలలు, 10 సంస్కృత నాటకాలు, 10 విమర్శ గ్రంథాలు, ఇంకా మరెన్నో వ్యాసాలు, ఉపన్యాసాలు మొదలైనవి ఉన్నాయి. వారి ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షం’ కావ్యం ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారాన్ని పొందినది.

2. ‘ఆంధ్రప్రశస్తి’ కావ్య విశిష్ఠత:

విశ్వనాథ వారు ఏ విషయమునైనా కవితాదృష్టితో చూడగలిగిన కళాశీలి. స్వతహాగా విశ్వనాథ వారికి  ఆంధ్రాభిమానము కూడా ఎక్కువ. అందువల్లనే విశ్వనాథ వారు భారత జాతీయోద్యమ స్ఫూర్తితో, ఆంధ్రత్వముతో ఆత్మాభిమానము గల కవిత్వ పోకడలతో, ప్రాచీన కవితా ప్రయోగాలతో ‘ఆంధ్రప్రశస్తి’ కావ్యమును రచించారు. భైరవభట్ల కామేశ్వరరావు గారు poddu.net అనే అంతర్జాల పత్రికలో తేదీ 28 ఏప్రిల్ 2009న “నేనెఱిగిన విశ్వనాథ” అనే శీర్షికతో రాసిన వ్యాసంలో విశ్వనాథ వారి ‘ఆంధ్రప్రశస్తి’ కావ్య విశిష్టతను ఈ విధంగా పేర్కొన్నారు.

ఆంధ్రప్రశస్తి కావ్యం నిండా ఇలాటి తెలుగుదనమే. గుండెలని పొంగించే తెలుగుదనం. “ఇంతకు ముందెప్పుడో – ఇక్కడ, యీ ఆంధ్రదేశంలో, గడ్డిపోచలు కూడా వాడికత్తులై శత్రువుల కుత్తుకలను ఉత్తరించిన కాలంలో, నువ్వూ నేనూ తోడి సైనికులమై చేసిన స్నేహం కాబోలు మన ఈ అనుబంధం” అని ఆంధ్రప్రశస్తిని అంకితం చేస్తూ మల్లంపల్లి సోమశేఖరశర్మ గారితో అన్న విశ్వనాథలో అణువణువూ ఆంధ్ర పౌరుషం ఉరకలు వేసి, మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఇప్పటి చాలామందికి తెలియని ఆంధ్రుల పూర్వ ప్రశస్తిని పద్యాలలో మధురంగా గానం చేశారు విశ్వనాథ. ఆంధ్ర మహావిష్ణువుతో మొదలుపెట్టి, శాతవాహనుడు, గౌతమీపుత్ర శాతకర్ణి, మాధవవర్మ, వేంగీ క్షేత్రము, ముఖలింగము, నన్నయభట్టు, ప్రోలరాజు, కొండవీటి పొగమబ్బులు, చంద్రవంక యుద్ధము, అళియరామరాయల వరకూ తెలుగు చరిత్రలోని ముఖ్య సన్నివేశాలని, ముఖ్య ప్రదేశాలని, వ్యక్తులని కథలు కథలుగా కవితాత్మకంగా మనకి పరిచయం చేసే కావ్యమాల ఆంధ్ర ప్రశస్తి.” (1)

భైరవభట్ల కామేశ్వరరావు గారు ప్రస్తావించిన ఈ మాటలు విశ్వనాథ వారి ఆంధ్రప్రశస్తి కావ్యంలోని వస్తువును గురించి మనకు తెలియజేస్తున్నాయి. తన కాలం నాటి తరానికి తెలియని ఆంధ్రుల పూర్వ వైభవమును, ఆంధ్రజాతి పౌరుషమును, తెలుగు నేలను ఏలిన ప్రభువుల శౌర్య ప్రతాపములను, ధర్మనిరతిని కవి ఈ కావ్యంలో ప్రస్తుతించినాడు. అంతేకాకుండా ఆంధ్రుల పూర్వ వైభవమును వర్ణించడానికి గాను ఆయా చారిత్రక ఘట్టాలను ఎంచుకోవడంలో విశ్వనాథ వారు పాటించిన ఔచిత్యం కూడా గుర్తించదగినది. 

3. ‘ఆంధ్రప్రశస్తి’ చారిత్రక కావ్యం: 

  చారిత్రకాంశములు ప్రధాన ఇతివృత్తంగా స్వీకరించి రచించినది చారిత్రక కావ్యం అని చెప్పవచ్చు. చరిత్రకు స్థలము, కాలము ప్రధానము. ఇక్కడ కాలము అంటే కాలక్రమము అని అర్థం చేసుకోవాలి. అలాగే స్థలము అనేదానిని కేవలం ఒక ప్రదేశంగా భావించరాదు. అది కాలక్రమంలో కలిగిన మార్పుల వలన రూపొందిన చారిత్రక స్వరూపం అని భావించాలి. అందువల్లనే చారిత్రక కావ్యంలో స్థల, కాల, పాత్రాదులు ప్రధాన భూమికను పోషిస్తాయి. ఆంధ్రప్రశస్తిని చారిత్రక కావ్యంగా మలచుటలో విశ్వనాథ వారు పాటించిన మెలకువలు చారిత్రక కావ్య రచనకు చక్కని మార్గాన్ని చూపుతున్నాయి. అందువల్లనే చారిత్రక కావ్య రచనలో విశ్వనాథ వారికి గల ప్రతిభా విశేషములను గురించి ప్రస్తావిస్తూ, మల్లంపల్లి శరభయ్య శర్మ గారు ఆంధ్రప్రశస్తి కావ్యం గురించి రాసిన ‘దర్శిని’ అనే వ్యాసంలో ఈ విధంగా పేర్కొన్నారు.      

  “ఇందు విశ్వనాథ తాను చరిత్రను కావ్యముగ చేయుటయెట్లో నిర్దేశించెను. చరిత్రయంతయును కావ్యమునకు వస్తువుగ పనికిరాదు. అందు పుట్టురత్నములవంటి గాథలు కొన్ని యుండును. వానిని ఎన్నికొని వెలికిఁ దీయవలయును. ఒక్కొక్క గాథ ఒక్కొక్క పద్యావళిగ పేటలు పేటలుగ పూల దండవలె కట్టవలయును. ఏగాథకు ఆగాథ ప్రత్యేక ప్రబంధమయ్యును అన్నియును గలిపి ఒక మహాప్రబంధముగ భాసించునట్లు నిర్మించవలయును. ఇదియే రచనయందలి సౌందర్యము. అవయవ ప్రబంధములయందువలె ఆమహాప్రబంధమునందును ప్రతీయమానార్థము నెత్తావివలె తెరలు తెరలుగా బుగులుకొను చుండవలయును.”  (2) 

  ఆంధ్రప్రశస్తి కావ్యం చరిత్రను కావ్యంగా ఏవిధంగా మలచవచ్చునో నిర్దేశిస్తుందని శరభయ్య శర్మ గారి మాటల వలన స్పష్టమవుతున్నది. అంతేకాకుండా కేవలం చరిత్ర అయినంత మాత్రాన  గతం అంతా కావ్య వస్తువుగా ఎంచుకోవడానికి పనికిరాదని కూడా ఇక్కడ తెలుస్తున్నది. చారిత్రక గాథలను కావ్యంగా మలచే క్రమంలో ముందుగా దేనికి అదే ప్రత్యేకము, విశిష్టము అయిన ఒక్కొక్క గాథను ముక్తకము లాగ రచించాలి. ఆ తర్వాత వాటన్నిటిని కలిపి ఒక మహాప్రబంధము లాగా అన్వయించే విధంగా సమకూర్చాలి అని శరభయ్య శర్మ గారి మాటల వలన బోధపడుతున్నది. ఇటువంటి రచనా నిర్మాణం విశ్వనాథ వారి ఆంధ్రప్రశస్తి కావ్యంలో చక్కగా అన్వయించడం వలన ఇది చారిత్రక కావ్యంగా నిరుపించబడుతున్నది. అందువల్లనే శరభయ్య శర్మ గారు ఆంధ్రప్రశస్తి కావ్యమును చారిత్రక కావ్య రచనకు ఒక నమునాగా విశ్వనాథ వారు తీర్చిదిద్దినారు అని ప్రశంసించినారు.  

  అలాగే ఈ కావ్యంలో కవి పేర్కొన్న ఆయా వ్యక్తులకు, సంఘటనలకు చారిత్రకంగా ఉన్నటువంటి ప్రాధాన్యత, విలువ కూడా ఇక్కడ గమనించదగినవి అని చెప్పవచ్చు. విశేషంగా ‘ఆంధ్రప్రశస్తి’ కావ్య ప్రారంభములో యుద్ధోన్ముఖుడైన రాజు స్తుతింపబడినాడు. కావ్యం చివరలో విజేత అయిన రాజు కీర్తింపబడినాడు. ఇది విశ్వనాథ వారి రచనా వైచిత్రికి మచ్చుతునక. 

4. వేఁగి క్షేత్రము - రచనా నేపథ్యము:

జాతీయోద్యమ ప్రభావంతో ఆంధ్రులలో ఐకమత్యాన్ని కలిగించి, వారిని స్వాతంత్రోద్యమం వైపు పురోగమింప చేయాలనే ఉద్దేశ్యంతో విశ్వనాథ వారు ఈ ‘ఆంధ్రప్రశస్తి’ కావ్యం రచించారు. అందువలన వేఁగి క్షేత్రము కవితా ఖండిక రచనా ఉద్దేశ్యము కూడా ఆంధ్రుల శౌర్య ప్రతాపములను గుర్తుచేయడమే అని మనకు తెలుస్తున్నది. పూర్వం ఆంధ్రరాజుల రాజధానిగా, విద్యా కేంద్రముగా ఎంతో గొప్ప ప్రఖ్యాతి పొందిన వేఁగినాడు, ఈనాడు దుర్దశను పొంది చిన్న గ్రామముగా మాత్రం మిగిలింది. ఒకనాడు మహోజ్వలముగా సమైక్యతతో సాహస ప్రతాపములు ప్రదర్శించిన ఆంధ్రజాతి ఈనాడు అనైక్యతతో అస్వతంత్రతతో, పరాయి పరిపాలనలో సతమతమవుతూ అనేక బాధలు పడుతున్నది. ఆంధ్రులలో శౌర్య ధైర్యములు నివురుగప్పిన నిప్పువలె మరుగున పడి ఉన్నవి. వాటిని మేల్కొల్పినచో ఈ పరాయి పాలన ఉండదు. ఆంధ్రదేశంలోని ప్రజలు అందరూ ఒకనాడు మహావైభవముతో వెలిగిన వేఁగినాడు లోని ఆంధ్రులకు వారసులు. కావున గత వైభవమును స్మరణకు తెచ్చుకొని ఆంధ్ర ప్రజలు స్వాతంత్య్ర సముపార్జన చేయాలి. ఆంధ్రులు అందరు కూడా ఒక్కసారిగా విజృంభించి తమ శౌర్యధైర్య పరాక్రమాలు ప్రదర్శిస్తే ఈ ఆంగ్లేయులను పారదోలటం చాల సులభమని భావించి, విశ్వనాథ వారు ఈ కవితా ఖండిక ద్వారా ఆంధ్రులకు ప్రబోధము చేశారు.

5. వేఁగి పట్టణము - చారిత్రక ఆధారములు:

పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరుకు సమీపములోని ఇప్పటి పెదవేఁగియే విశ్వనాథ వారు వర్ణించిన ‘వేఁగి క్షేత్రము’. వేఁగి పట్టణము రాజధానిగా ఆంధ్ర ప్రాంతమును పరిపాలించిన రాజుల ప్రస్తావన మొట్టమొదట సముద్రగుప్తుని అలహాబాదు స్తంభ శాసనములో కనబడుతున్నది. ఈ శాసనము నందు ‘వేఁగి హస్తివర్మ’ అని పేర్కొనబడింది. ఆంధ్ర దేశమును మొదట శాతవాహనులు, ఆ తరువాత ఇక్ష్వాకులు, బృహత్పాలాయనులు, ఆనంద గోత్రీకులు, శాలంకాయనులు మొదలైనవారు పరిపాలించారు. వీరిలో శాలంకాయనులే వేఁగిలో స్వతంత్ర రాజ్యము స్థాపించి, వేఁగి పట్టణము రాజధానిగా పరిపాలించారు. వేఁగి పట్టణము యొక్క స్థాపనను గురించి చిలుకూరి వీరభద్రరావు గారు వారి ‘ఆంధ్రుల చరిత్రము’ (ప్రథమ భాగం) నందు ఈ విధంగా పేర్కొన్నారు.

సాలంకాయన గోత్రుడైన పల్లవరాజులలో నొకరు ఒక నూతన నగరమును నిర్మింపజేసి దానికి “బెబ్బులి” అనే అర్ధం వచ్చే “వేంగి” అనే పేరు పెట్టాడు. అక్కడి నుండి పాలించే రాజులు వేంగిరాజులని, వారిచే జయింపబడిన దేశాన్ని వేంగి దేశమని అనడం మొదలుపెట్టారు. ... సా.శ. 4 శతాబ్దంలో అలహాబాదు శాసనంలో వేంగిని ప్రస్తావించారు గనుక అంతకు పూర్వమే అనగా సా.శ. 2వ లేదా 3వ శతాబ్దంలో వేంగి నగరం ఏర్పడి ఉండవచ్చును.”(3) చిలుకూరి వీరభద్రరావు గారి ఈ వాక్యాలు వేఁగి పట్టణము యొక్క స్థాపనను గురించి మనకు తెలియజేస్తున్నవి. అదేవిధంగా ‘శాలంకాయన’ అనేది రాజవంశం కాదని, అది పల్లవ రాజుల గోత్ర నామము అనే విషయం కూడా ఇక్కడ తెలుస్తున్నది. కనుక శాలంకాయనులు అనేది తెలుగు నేలను పాలించిన పల్లవ రాజులలోని ఒక రాజు యొక్క గోత్ర నామము అని ఇక్కడ మనం గ్రహించవచ్చు.

శాలంకాయనుల పాలనా కాలంలోని వేఁగి పట్టణమును గురించి, అందులోని ప్రజలను గురించి పంపన సూర్యనారాయణ గారు తమ “విశ్వనాథ వారి భక్తి – దేశభక్తి” అనే గ్రంథములో ప్రస్తావిస్తూ, “వేంగికి చుట్టును ఉన్న ప్రాంతమునకు వేంగీ విషయమనియు, వేఁగి నాడనియు పేర్లు. తొలి రోజులలో ఈ వేఁగినాడులోని బ్రాహ్మణులకు వేఁగినాటి వారనిపేరు. ఈ శాలంకాయనులు ‘సూర్యభగవానుడగు’ చిత్రరథ స్వామి పాదపద్మారాధకులు.”(4) అని  పేర్కొన్నారు. అందువలన వేఁగినాటి వారు అనే వాడుక శాలంకాయనులలైన పల్లవ రాజుల పరిపాలనా కాలం నుంచే వ్యవహారంలో ఉన్నదని తెలుస్తున్నది. అదేవిధంగా శాలంకాయనులు సూర్యభగవానుని ‘చిత్రరథస్వామి’గా సేవించినారు అని పేర్కొనడం వలన వారు సూర్య వంశస్తులు అని కూడా ఇక్కడ స్పష్టమవుతున్నది.

క్రీ॥శ॥ 624వ సంవత్సరమున రెండవ పులకేశి తన దండయాత్రలో తూర్పు తీరముపై దాడిచేసి వేఁగి రాజ్యమును వశపరచుకొన్నాడు. తరువాత పులకేశి తమ్ముడైన విష్ణువర్థనుడు క్రీ॥శ॥ 631 లో వేఁగి దేశమునకు రాజు అయినాడు. అయితే తరువాత అతడు తన రాజధానిని వేఁగి పురము నుండి రాజమహేంద్రవరమునకు మార్చినాడు. ఆ విధంగా పూర్వం ఒక రాజ్యమునకు రాజధానిగా విలసిల్లిన వేఁగి పురము ఇప్పుడు తన కళాకాంతులు కోల్పోయి, చిన్న గ్రామముగా మాత్రం కనిపిస్తున్నది.

6. వేఁగి క్షేత్రము -  కవితా విశిష్టత:

విశ్వనాథ వారు రచించిన వేఁగి క్షేత్రము కవితా ఖండిక విశిష్టతను గురించి పంపన సూర్యనారాయణ గారు పేర్కొన్న ఈ మాటలను ప్రస్తావించుకోవాలి. “ఈ గ్రంథము వెలువడిన నాటి నుండి మొత్తముగా గాని ఇందలి ఖండికలు గాని ప్రతివత్సరము పాఠశాల మొదలు కొని విశ్వవిద్యాలయము వరకు పాఠ్యాంశములుగా నిర్ణయింప బడుటయే దీని ప్రశస్తిని వేనోళ్ళ చాటుచున్నది. కనుకనే నేటి విద్యావంతులలో ఏదో తరగతిలో ఆంధ్రప్రశస్తి లోని కొన్ని పద్యమ్ములనైన చదువని వారెవ్వరు నుండరనినచో నతిశయోక్తి కాదు.

స్వాతంత్ర్య సంపాదన సముద్దేశముతో వెలువడి నప్పటికి పుబ్బలో పుట్టి మఖలో మాడుపోవునట్టిది కాదీ గ్రంథము. అనగా ఒక ప్రయోజనము కోసమవతరించి ఆ అవసరము తీరిన తరువాత కాలము చెల్లి పోవువాటిలో చేరునది కాదు. ఇతివృత్త స్వీకరణము మొదలు కావ్యాంశములు సర్వములు సార్వకాలికములు; సార్వ జనీనములు. మీదుమిక్కిలి వైవిధ్య విలసితములు.” (5) అనే ఈ మాటలు విశ్వనాథ వారి ‘వేఁగి క్షేత్రము’ ఖండిక యొక్క ప్రాశస్త్యాన్ని గురించి విశేషంగా తెలియజేస్తున్నాయి. అంతేకాకుండా ఒక కావ్యం గాని, అందులోని కొంత భాగం గాని విద్యార్థుల పాఠ్యపుస్తకములలో భాగంగా ఉండటం దాని యొక్క విలువకు గీటురాయి అని చెప్పవచ్చు. పైన పేర్కొన్న నిదర్శనాల వలన విశ్వనాథ వారి ‘ఆంధ్రప్రశస్తి’ కావ్యంలోని ‘వేఁగి క్షేత్రము’ ఖండిక ఎంతో విశిష్టమైనదని తెలుస్తున్నది.

7. వేఁగి క్షేత్రము – చారిత్రక విశేషములు:

విశ్వనాథ వారు ఈ కవితా ఖండికలో ప్రధానంగా శాలంకాయన గోత్రీకులైన పూర్వ పల్లవుల (3వ శతాబ్ది) వైభవము, వారి ధర్మ పరిపాలన, వారి కాలంలోని వైభవోపేతమైన కోటలు, సస్యశ్యామలమైన పంట పొలాలు మొదలైన వాటిని గురించి వర్ణించినారు. అంతేకాకుండా తెలుగు బాలురు ఆడుకునే ఆటలను ప్రస్తావించే నెపంతో ఆ కాలం నాటి యుద్ధ విద్యలను గురించి వర్ణించడం కూడా కనిపిస్తుంది. అలాగే సముద్రగుప్తుని దండయాత్ర, పల్లవులపై చాళుక్య రాజుల విజయం అనేవి కూడా వేఁగి క్షేత్రము కవితా ఖండికలో విశ్వనాథ వారు పేర్కొన్న ముఖ్యమైన చారిత్రక విశేషములు.

8. శాలంకాయనుల (పూర్వ పల్లవులు) వైభవము:

విశ్వనాథ వారు ఈ కవితా ఖండికలో మొదటగా వేఁగి క్షేత్రమును పాలించిన రాజులను గురించి ప్రస్తావించారు. అయితే వేఁగి క్షేత్రమును రాజధానిగా చేసుకొని ఆంధ్ర దేశాన్ని పాలించిన రాజవంశీయులు పూర్వ పల్లవ రాజులలోని శాలంకాయన గోత్రీకులు అని తెలుస్తున్నది. వారిని గురించి కవి ఈ విధంగా పేర్కొన్నాడు.

ఏ రాజు పంచెనో యిచట శౌర్యపు పాయ సమ్ములు నాగుల చవితినాళ్ల
ఏ యెఱ్ఱసంజలో నెలమి పల్లవరాజ రమణులు కాళ్లఁబారాణు లిడిరొ
చిత్రరధస్వామి శ్రీరధోత్సవములో తెలుగు పిల్లలు కత్తి త్రిప్పి రెపుడొ
ఏ రెండుజాముల యినుని వేడిమి వచ్చి కలిసి పోయెనొ త్రిలింగ ప్రభువుల
నాజగచ్ఛ్రేయంబులై యలరు తొంటి
వేంగి రాజుల పాద పవిత్ర చిహ్న
గర్భితమ్మైన యీ భూమి ఖండమందు
నశ్రువులు జార్త్రు జీవచ్ఛవాంధ్రజనులు” 

(సత్యనారాయణ, విశ్వనాథ. ఆంధ్రప్రశస్తి. పుట. 27)

పూర్వం ఆంధ్రదేశంలో ఏ వేఁగి రాజులు నాగులచవితి రోజున శౌర్యపు పాయ సాన్నములు పంచినారో కదా! ఏ పల్లవరాజుల అంతఃపుర కాంతల అందమయిన పాద పద్మములకు పూయబడిన లత్తుక పారాణి శోభలు ఏ నేలలో ఉదయ కాలమున ప్రకాశించినవో, ఏ నేలలో తెలుగు బాలలు సూర్యభగవానుని చిత్రరథోత్సవ వేళ కత్తిసాములు ప్రదర్శించినారో, నిరంతరము లోక శ్రేయస్సు కొరకు పోరాడిన పల్లవ రాజుల పవిత్ర పాద చిహ్నములు ఏ నేల గర్భమున ప్రకాశిస్తున్నవో, అంతటి మహాపుణ్య భూమిలో ఈనాడు ఆంధ్రప్రజలు అనైక్యతతో, పౌరుష విహీనులై బ్రతికిన శవాలవలె కన్నుల నీరు కారుస్తూ దైన్యంగా బ్రతుకును గడుపుతున్నారు అని కవి విషాదాన్ని పొందాడు. ఎందుకంటే ఈ వేఁగి దేశమును పాలించిన ధర్మ ప్రభువుల పాద చిహ్నాలు కూడా ఆనవాలు లేకుండా పోయినవని కవి భావన.

విశ్లేషణ:

ఈ పద్యంలో విశ్వనాథ వారు ప్రధానంగా పూర్వ పల్లవులను గురించి వర్ణించినాడు. పద్యాన్ని ప్రారంభిస్తూనే కవి ‘ఏ రాజు పంచెనో’ అని అనడంలో ఈ ఉదంతం చాలా ప్రాచీన కాలం నాడు జరిగినది అనే అంతరార్థం ధ్వనిస్తున్నది. అలాగే ఆ పంచిన రాజు ఎవరు? అనే విషయం స్పష్టంగా పేర్కొనలేదు. అందువలన అది కేవలం ఒక్క రాజు మాత్రమే కాదని, పల్లవ రాజుల పరంపర అనేది కవి యొక్క భావనగా ఇక్కడ మనం గ్రహించాలి. నాగులచవితి రోజున పాయసాన్నములు పంచడం అనే అలవాటు తెలుగునాట వాడుకలో లేదని తెలుస్తున్నది. అయితే ఇక్కడ కవి ప్రస్తావించినది ‘శౌర్యపు పాయసాన్నములు’ అని గమనించాలి.

ఆ తర్వాత విశ్వనాథ వారు ఈ పద్యంలో మిగతా విషయాలను అన్నింటిని సూర్య సంబంధమైన విశేషణాలతోనే పేర్కొనడం అనేది గమనించదగిన అంశం. పల్లవ రాజులను గురించిన ప్రస్తావన తర్వాత, పల్లవ రాజుల అంతఃపుర కాంతల రమణీయమైన పాద పద్మములకు పూయబడిన లత్తుక పారాణి శోభలు, సూర్యభగవానుని చిత్రరథోత్సవ వేళ తెలుగు బాలలు ప్రదర్శించిన కత్తిసాములు, నిరంతరము లోకశ్రేయస్సు కొరకు పోరాడిన పల్లవ రాజుల పవిత్ర పాద చిహ్నములు అనేవి ఈ పద్యంలో కవి వర్ణించిన అంశములు. ఇక్కడ పల్లవ రాజ రమణుల పారాణి కాంతులు ‘ఏ యెఱ్ఱసంజలో’ అనే విశేషణం చేత సూచించబడినవి. అంటే అది ఉదయ కాలమున ప్రకాశించే సూర్యబింబంలోని ఎర్రని కాంతితో పోల్చబడినది అని తెలుస్తున్నది. తెలుగు బాలలు వారి కత్తిసాములను సూర్యభగవానుని ‘చిత్రరథోత్సవ వేళలో’ ప్రదర్శించారు అనడంలో కూడా సూర్యుని ప్రసక్తి ఉన్నది. 

ఇక ఆ తర్వాత లోకశ్రేయస్సు కోసం పోరాడిన పల్లవ రాజుల పాద ముద్రలు ‘రెండు జాముల సూర్యుని కాంతి’లో కలిసిపోయినవి అని కవి వర్ణించాడు. ఈ వర్ణన రెండు జాముల వేళలో ఉండే సూర్యకాంతి లోని తీక్షణతను స్ఫురింపజేస్తున్నది. ఆ సమయంలో సూర్యుని కాంతి ఏవిధంగా అయితే తల ఎత్తి చూడటానికి వీలులేనంత తీక్షణంగా ఉంటుందో, అదేవిధంగా పల్లవ రాజుల శౌర్య ప్రతాపములు కూడా శత్రువులకు దుస్సహములు అని ఇక్కడ కవి యొక్క భావన. ఈ విధంగా పల్లవ రాజుల ఆరాధ్య దైవమైన సూర్యభగవానునికి సంబంధించిన విశేషణాలతో కవి ఈ పద్య రచన చేశాడు.

అదేవిధంగా కవి వేఁగి పట్టణాన్ని ఉద్దేశించి, పల్లవ రాజుల శౌర్య ప్రతాపములను ఈ కింది పద్యంలో వర్ణించినాడు.

నీయతుల ప్రభావ మహనీయత వేఁగిపురాధిరాజమా!
ఆయత ధర్మమూర్తులు మహాత్ములు వారలు బ్రహ్మకోశగో
పాయిత లాంధ్రపల్లవ నృపాలుర హుంకృతి వ్యాఘ్రగర్జనా
నై యరిలోకభీకర మహాద్భుత శౌర్య రసాకృతింజనెన్” (సత్యనారాయణ, విశ్వనాథ. ఆంధ్రప్రశస్తి. పుట. 28)

‘మహనీయమైన వేఁగి పట్టణమా! నిన్ను పరిపాలించిన ఆదర్శ ధర్మమూర్తులు అయిన పల్లవ రాజులు ఇపుడు లేరు. వారు క్రోధావేశముతో ఒక్కసారి హుంకరిస్తే అది పెద్దపులి గాండ్రింపు లాగ మిక్కిలి భయంకరమై శత్రువులను గడగడలాడించినది’ అని పల్లవ రాజుల శౌర్య ప్రతాపములను విశ్వనాథ వారు స్మరించినారు.

విశ్లేషణ: 

విశ్వనాథ వారి ఉద్దేశ్యంలో గతించిపోయిన చరిత్రలో వేఁగి పట్టణానికి ఒక విశిష్టతను, గొప్ప కీర్తిని కలిగించినది పూర్వ పల్లవ (శాలంకాయనులు) రాజుల పరిపాలన మాత్రమే. అందువల్లనే కవి ఈ కవితా ఖండికలో అడుగడుగునా పూర్వ పల్లవుల ప్రశస్తిని, వైభవమును స్మరిస్తూనే ఉన్నారు. ఆ పరంపరలోనే విశ్వనాథ వారు ఈ పద్యంలో పల్లవ రాజుల యశస్సును వేఁగి పట్టణానికి అన్వయిస్తూ, నీయతుల ప్రభావ మహనీయత వేఁగిపురాధిరాజమా! అని వేఁగిని సంబోధించారు. దీనివలన ఆంధ్రదేశ చరిత్రలో వేఁగి పట్టణానికి కలిగిన కీర్తి ప్రతిష్టలకు పూర్వ పల్లవుల (శాలంకాయనులు) మహోన్నత పరిపాలన కారణమని తెలుస్తున్నది. అదేవిధంగా ఆనాటి పల్లవ రాజులు ఆయత ధర్మమూర్తులు. అనగా వారి ధర్మం విశాలమైనది, అందరిపట్లా సమదృష్టి కలిగినది అని కవి భావన. వారి ధర్మ పరిపాలనలో రాజు పేద అందరూ కూడా సమానమే. ఇటువంటి ధర్మ పరిపాలన చేసినందు వల్లనే వారిని కవి ‘మహాత్ములు’ అని సంబోధించినాడు. 

ధర్మ ప్రభువులు అయిన పల్లవ రాజులు శత్రు రాజులపట్ల కూడా ధర్మబద్ధమైన క్రోధావేశామునే ప్రకటించినారు. అయితే వారి ఆవేశం పెద్దపులి గాండ్రింపు వలె భయంకరమై, శత్రువుల గుండెలను గడగడలాడించినది. ఇక్కడ కవి పల్లవ రాజుల కోపమును పెద్ద పులి గాండ్రింపుతో పోల్చడంలో, వేఁగి అనే పేరు పెద్ద పులి అనే అర్థంలో ప్రయుక్తమనే విషయాన్ని గుర్తుచేస్తున్నది. అంతేకాకుండా ఇది ఆనాటి రాజుల శౌర్య ప్రతాపములను, ధైర్య సాహసములను, ప్రజా రక్షణ విషయంలో వారికి గల భుజబల పరాక్రమాలను కూడా స్ఫురింపజేస్తున్నది.                
అదేవిధంగా ‘ఈ వేఁగినాట ఎక్కడ చూచినా పూర్వ పల్లవుల వైభవములు కన్నులకు కట్టినట్లు కనిపిస్తున్నవి. పచ్చిక మొలకలతో పాడుబడిన ఈ కోట శిఖరాలు ప్రకాశిస్తున్నవి. అప్సరస స్త్రీల చేత గానము చేయబడిన పల్లవ రాజుల విజయ వైభవము ఈ గాలి తరగలలో నిక్షిప్తమై, వీనులకు విందుగా ఆ మధుర గానమును వినిపిస్తున్నది’ అంటూ విశ్వనాథ వారు మూడవ శతాబ్దినాటి పల్లవ రాజుల రాజ్య వైభవమును ఎంతగానో స్తుతించినారు.

 
ఆ తర్వాత కవి తాను కాలు పెట్టిన వేఁగి క్షేత్ర ప్రాశస్త్యాన్ని స్మరిస్తూ ఈ విధంగా పేర్కొన్నారు.

ఈ నా పాదార్పిత క్షోణి నేరాజు ధర్మాసనంబుండి స్మృత్యర్థమనెనో
  . . . . . . . . . నేక్రతుధ్వనులు శబ్దించినదియొ . .”   (సత్యనారాయణ, విశ్వనాథ. ఆంధ్రప్రశస్తి. పుట. 28)


‘పూర్వము పల్లవ రాజులు ధర్మమును కాపాడినారు. ధర్మము కొరకే బ్రతికినారు. అటువంటి ఈ నేలలో తెలుగు వీరులందరూ ఆనాడు యుద్ధ విద్యలు నేర్చినారు. ఇక్కడ వీస్తున్న ఈ గాలి ఎంతగా పురాతన కాలమునాటి యజ్ఞ యాగాది క్రతువుల మంత్ర ధ్వనులను వీనుల విందుగా విన్పించుచున్నదో కదా!’ అని తన మనసులో భావించినాడు. 

విశ్లేషణ:

పల్లవ రాజులు ధర్మ ప్రభువులని, వారి పరిపాలన ధర్మబద్ధమైనదని ముందు పేర్కొన్న పద్యాల వలన తెలుస్తున్నది. ఈ పద్యంలో కవి ముఖ్యంగా పల్లవుల కాలం నాటి సామాజిక జీవితమును గురించి ప్రస్తావించారు. ఆనాడు పల్లవుల పాలనలోని వేఁగి పట్టణంలో తెలుగు యువకులు అందరూ వీరుల వలె యుద్ధవిద్యలు నేర్చినారు. కవి పలికిన ఈ మాట వీరులైన ఆనాటి తెలుగు యువకులకు రాజ్య రక్షణ, యుద్ధ విద్యలపట్ల గల అభిమానమును ఎంతటిదో మనకు తెలియజేస్తున్నది. అదేవిధంగా వేఁగి క్షేత్రములో వీస్తున్న గాలిలో ఇప్పుడు కూడా పురాతన పల్లవుల కాలం నాటి యజ్ఞ యాగాదుల మంత్ర ధ్వనులు వీనుల విందుగా వినిపిస్తున్నాయని కవి భావించినాడు. పల్లవులు తమ కాలంలో అనేక యజ్ఞ యాగాలు నిర్వహించారు అనే విషయం చారిత్రక సత్యం. ఈ యజ్ఞ యాగాదులు అన్నీ కూడా రాజ్య క్షేమం, ప్రజా సంక్షేమం కోసమేనని గ్రహించాలి.  

విశ్వనాథ వారు తనకు వేఁగి క్షేత్రము యొక్క పూర్వ వైభవ స్మృతులు కలగడానికి గల కారణాన్ని వివరిస్తూ, 

ఎటఁ గనినఁ బూర్వపల్లవ నృపచరితలె
వ్రాయఁబడి పాడఁబడి గీయఁబడి యుపన్య
సింపఁబడి శ్రోత్రపేయమై చెన్ను దాల్చె
నీయతీంద్రియ శక్తి నాకెట్టు లబ్బె!”  (సత్యనారాయణ, విశ్వనాథ. ఆంధ్రప్రశస్తి. పుట. 30)

అని తన ఆశ్చర్యమును ప్రకటించినారు. వేఁగి క్షేత్రమునకు వెళ్లి దర్శించుకోగానే పల్లవుల కాలం నాటి పూర్వ వైభవము తన కన్నులకు కట్టినట్లుగా విశ్వనాథ వారు ఈ పద్యములో చెప్పుకున్నారు.

విశ్లేషణ: 

కవి వేఁగి క్షేత్రమునకు వెళ్ళగానే ‘ఈ క్షేత్రము తన పూర్వ జన్మ పరంపరలలోని తెలియని సువాసనలను మేల్కొల్పి ఆనాటి వైభవమును కన్నులకు కట్టినట్లు చేయుచున్నది’ అని భావించినాడు. అంతేకాకుండా వేఁగిలో ఎక్కడ చూసినా కవికి పల్లవ రాజుల చరిత్రకు సంబంధించిన గాథలు రాయబడినట్లుగా, పల్లవ వీరుల విజయ గాథలు గానం చేయబడినట్లుగా, ఆ రాజుల వీర గాథలు చిత్రములుగా గీయబడినట్లుగా, పల్లవుల వైభవము వీనులకు విందుగా ఉపన్యసింపబడినట్లుగా అనిర్వచనీయమైన అనుభూతిని పొందినాడు. అయితే ఈ వర్ణన అంతా కూడా విశ్వనాథ వారికి గల ఆంధ్రదేశాభిమానము వలన చేసినది అని చెప్పుకోవాలి. అదేవిధంగా ఇందులో పేర్కొన్న అంశాలు అన్నీ కూడా విశ్వనాథ వారి విద్వత్తుకు నిదర్శనాలు అని మనం గ్రహించవచ్చు.

9. ఆంధ్రుల పౌరుషము:

అసమానమైన ఆంధ్రుల పౌరుషమును గురించి విశ్వనాథ వారు ఈ కింది పద్యములో వర్ణించినారు.

వేఁగి రాజ్యపు పల్లె వీధుల చెడుగుళ్ళ రిపులఁ గవ్వించు నేరుపులు దెలిసి
. . . . . .  బొడ్డు కోయని కూనకే పోయుదురట” (సత్యనారాయణ, విశ్వనాథ. ఆంధ్రప్రశస్తి. పుట. 29)

అంటూ ‘వేఁగినాట గల పల్లెలలోని పిల్లలు చెడుగుడు ఆట ఆడునప్పుడే శత్రువులను కవ్వించే పద్ధతి నేర్చినారు. బిళ్ళంగోడు ఆటలో శత్రువుల తలలు ఎగురవేయు విధమును నేర్చినారు. అదేవిధంగా ఉప్పాటలో చెఱపెట్టి ఉప్పు తెచ్చునపుడే శత్రు వ్యూహములను చిన్నాభిన్నము చేయు పద్ధతి పసిగట్టినారు. అంతేకాకుండా కోతి కొమ్మచ్చి ఆటలోనే శత్రువుల కోట ప్రదేశమ్ములను ఎగబ్రాకి దూకు విధమును అభ్యసించినారు. అసలు తెలుగు తల్లులు బొడ్డు కోయని కూనకే శౌర్యరసమును ఉగ్గుపాలతో రంగరించి పోస్తారు. ఆహా! తెలుగు బాలలు ఎంత ధైర్యసాహసములు కలవారో కదా!’ అని కవి ఎంతగానో పొంగిపోయినాడు.

విశ్లేషణ: 

విశ్వనాథ వారు ఈ పద్యంలో పల్లవుల కాలంలోని వేఁగినాడులో గల తెలుగు బాలలు ఆడుకునే వివిధ ఆటలను గురించి వర్ణించినారు. అయితే ఆటలను గురించి ప్రస్తావిస్తూనే అందులో పల్లవుల కాలం నాటి అనేక యుద్ధ విద్యలను గురించి కూడా పేర్కొన్నారు. ఈ యుద్ధ విద్యల ప్రస్తావన వలన ఆనాటి తెలుగు వీరులకు యుద్ధ విద్యలలో గల అనేక నైపుణ్యాలను కూడా స్ఫురింపచెయ్యడానికి కవి  ప్రయత్నించారు. ఈ పద్యంలో ఆనాటి తెలుగు బాలలు ఆడుకునే ఆటలలో చెడుగుడు, బిళ్ళంగోడు, ఉప్పాట, కోతికొమ్మచ్చి అనేవి కనిపిస్తున్నాయి. ఈ ఆటలన్నీ ఈనాటికి కూడా తెలుగు ప్రాంతంలోని పల్లెటూరి పిల్లలు ఎంతో ఇష్టంతో ఆడుకునేవి. చెడుగుడు ఆటలోని చాకచక్యం అంతా ఎదుటి జట్టులోని వారిని కవ్విన్చాడంలోనే ఉంది. ఆ కవ్వింపు వల్ల ప్రత్యర్థులు సులువుగా సహనాన్ని కోల్పోతారు. అదేసమయంలో వారిని అదునుచూసి తేలికగా ఓడించవచ్చు. ఇటువంటి ఎత్తుగడ దూరంగా ఉన్న శత్రువును కవ్వించి, మన మేరకు రప్పించి అదునుచూసి దెబ్బతీసే యుద్ధ నైపుణ్యాన్ని గుర్తు చేస్తున్నది. 

ఇదేవిధంగా బిళ్ళంగోడు ఆటలో కోడుతో బిళ్ళను ఎగురవేసినట్లుగా, తెలుగు వీరులు తమ కరవాలంతో శత్రువుల తలలను ఎగురగొడుతున్నారు అని కవి భావన. ఉప్పాటలో చెఱపెట్టి ఉప్పు తీసుకురావడంలో ఎదురుదాడి చేయడమే ప్రధానం అని తెలుస్తున్నది. అందువల్లనే శత్రువుల వ్యూహాలను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు ఎదురుదాడి చేయడమే తగిన యుద్ధపద్ధతి అని గ్రహించాలి. కోతికొమ్మచ్చి ఆటలో చెట్లు ఎక్కడం, దూకడం అనేవి ఎంతో నైపుణ్యంతో చేయాలి. శత్రువులను జయించాలి అంటే వారి కోటలను పట్టుకోవడం ప్రధానం. అందుకే కోట గోడలను ఎక్కి, దూకగలిగే నైపుణ్యం తెలుగు వీరులకు చిన్నతనంలో ఆడిన కోతికొమ్మచ్చి ఆటలోనే అలవడుతుందని కవి వర్ణిస్తున్నాడు. చిన్నతనంలో తెలుగు బాలలు ఆడిన ఈ ఆటలు భావిష్యత్తులోని వారి యుద్ధవిద్యలకు ప్రేరేపకములు అని తెలుస్తున్నది. అయినప్పటికీ తెలుగు బాలలకు వారి తల్లులు ఉగ్గుపాలతోనే శౌర్య ప్రతాపములను రంగరించి పోయడం వల్లనే వారికి  స్వతహాగా యుద్ధ విద్యల పట్ల ఆసక్తి కలుగుతున్నదని కవి భావన.

10. సముద్రగుప్తుని దండయాత్ర:

విశ్వనాథ వారు ఆంధ్రదేశం మీదికి దండెత్తి వచ్చిన సముద్రగుప్తుని గురించి ఈ కింది పద్యంలో పేర్కొన్నారు.

ఈ పోలాలెంత చేవెక్కించుకొన్నవో గుండెవ్రయ్య సముద్రగుప్తుడడలె . . . .”  (సత్యనారాయణ, విశ్వనాథ. ఆంధ్రప్రశస్తి. పుట. 30)

అనే ఈ పద్యంలో ‘ఈ వేఁగి పట్టణము నందలి మాగాణి భూములు ఎంత చేవగలవో ఈ నేలలో పుట్టిన వారి దెబ్బ తగలి సముద్రగుప్తుడు అంతటి వీరుడు కూడా హడలి పరారయ్యెను అని కవి పేర్కొన్నాడు. 

విశ్లేషణ:

ఈ వేఁగి పట్టణము నందలి మాగాణి భూములు ఎంత చేవగలవో అని కవి పేర్కొనడంలో గోదావరి నదీ పరీవాహక ప్రాంతంలో పండే పంట పొలాల సత్తువ వ్యక్తమవుతున్నది. ఈ నేలకు ఇంతటి చేవ కలగడానికి ఇక్కడ ప్రవహించే నదీ జలములు కారణం. అందువల్లనే ఈ నేల సారవంతమైనది. ఇక్కడి మనుషులు కూడా చేవ గలిగినవారు. ఆంధ్రుల శక్తిసామర్థ్యాలను తక్కువగా అంచనా వేసి దండయాత్రకు వచ్చిన సముద్రగుప్తుడు కూడా తెలుగు వీరుల యుద్ధ నైపుణ్యానికి, అవిక్రమ పరాక్రమానికి హడలి వెనుదిరిగి వెళ్ళినాడు. అందుకు కారణం సారవంతమైన ఇక్కడి మాగాణి భూములు అని కవి ఉద్దేశ్యం. 

అయితే తెలుగునాట శౌర్యము తోపాటు అచంచలమైన భక్తి కూడా ఉన్నదని విశ్వనాథ వారి భావన. ‘ఈ నేల ఎంత పుణ్యము చేసుకొన్నదో, అందువల్లనే చిత్రరథస్వామి పూజలతో తన జన్మ ధన్యము చేసుకొన్నది. ఎందుకంటే శౌర్యము - భక్తి - ఈ రెండు ఈ నేలలో పుట్టిన ప్రజలలో నిండుగా ఉన్నవి’ అని కవి పేర్కొన్నాడు. 

విశ్వనాథ వారికి ఆంధ్రదేశం పట్ల గల విశేషమైన అభిమానము ఈ కింది పద్యంలో కనిపిస్తుంది.  

ఇమ్ముగ కాకుళమ్ము మొదలీ వరకుం గల యాంధ్రపూర్వరా
  . . . . . . . యాంధ్ర రక్తముల్” (సత్యనారాయణ, విశ్వనాథ. ఆంధ్రప్రశస్తి. పుట. 32)

అంటూ విశ్వనాథ వారు ఆంధ్రదేశం పట్ల వారికి గల అభిమానమును ఈ పద్యంలో వెల్లడించినారు.

విశ్లేషణ:

  ‘ఆంధ్ర విష్ణువు రాజధాని అయిన శ్రీకాకుళము మొదలుకొని దేశమంతటా నెలకొని ఉన్న పూర్వ ఆంధ్ర రాజ్యముల పేరు చెప్పగనే హృదయము ఆర్ద్రతతో చలించిపోతుంది’ అని ఈ పద్యంలో విశ్వనాథ వారు స్వయంగా చెప్పుకున్నారు. ఆర్ద్రమైన చిత్తవృత్తులతో చలించిపోయే గుణం తనకి కలగడం పూర్వజన్మల సుకృతమని విశ్వనాథ వారు భావించారు. అంతేకాకుండా ఎన్నోజన్మల నుండి తన శరీరంలో ప్రాచీనమైన ఆంధ్రుల రక్తం ప్రవహిస్తున్నదని కూడా విశ్వనాథ వారు సగర్వంగా ప్రకటించుకున్నారు. అయితే ఇందులోని విశేషాంశాలు అన్నీ కూడా ఆ మహాకవికి ఆంధ్రదేశం పట్ల గల విశేషమైన అభిమానమును వెల్లడిస్తున్నవని చెప్పుకోవాలి.

11. ముగింపు:

కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణగారు తన ఆంధ్ర దేశాభిమానమును అనుభూతి కవితా ప్రక్రియ రూపంలో వర్ణించిన విశిష్ట కవితా ఖండికయే ఈ వేఁగి క్షేత్రము. మనోవాక్కాయ కర్మలన్ని కూడా పూర్వవైభవముతో నిండి నిబిడీకృతమైన విశ్వనాథ వారు వేఁగిక్షేత్రమును స్మరించి దాని పూర్వపు మహోన్నతదశకు, నేటి దీనదశకు గల వ్యత్యాసమునకు పరితపించినాడు. పూర్వం ఒకనాడు స్వాతంత్ర్యమును అనుభవించిన ఆంధ్రప్రజలు తన కాలంలో ఆంగ్లేయులపాలనలో అవస్థలు పడుతుండగా, విశ్వనాథ వారు గత వైభవము గుర్తుకువచ్చి తన కాలం నాటి దుస్థితిని గమనించి తీవ్ర మనోవేదనతో రాసిన పద్యరత్నములు ఈ వేఁగి క్షేత్రము లోనివి.
వేఁగిక్షేత్రమును పాలించిన పూర్వ పల్లవ రాజుల శౌర్య పరాక్రమాలు, ధర్మనిరతి, వైభవోపేతమైన కోటలు, సస్యశ్యామలమై పంట పొలాలు, వారి పరిపాలన, రాణుల దైవభక్తి, దానశీలత వంటివి ఈ ఖండికలో వర్ణించబడినాయి. అలాగే ఆ కాలం నాటి తెలుగు ప్రజల ఆటలు, యుద్ధవిద్యలు మొదలైన విశేషాలు అన్నీ కూడా ఈ ఖండికలో ప్రస్తావించబడినాయి. ‘వేఁగి క్షేత్రము’ అనే ఈ కవితా ఖండిక ద్వారా విశ్వనాథ వారు ఆంధ్ర ప్రజలు తమ పూర్వ పాలకులైన పల్లవ రాజుల శౌర్య ప్రతాపములను, ఆత్మాభిమానమును, ధైర్య సాహసములను గుర్తుచేసుకున్నారు. అందువల్లనే ఆంధ్రజాతి ఆంగ్లేయుల పాలనలోని  అస్వతంత్రతా భావ దాస్యము నుండి విముక్తులై స్వేచ్ఛా స్వాతంత్య్రములను పొంది, మహావీరులుగా మనుగడ సాగించాలని ఈ ఖండిక ద్వారా ప్రబోధము చేశారు.

12. ఫలితములు: 

విశ్వనాథ వారి ‘వేఁగి క్షేత్రము’ – చారిత్రక విశేషములు అనే ఈ వ్యాసంలో ప్రస్తావించిన వివిధ అంశాల ద్వారా వెల్లడయిన ఫలితములు ఈ కిందివి. 

చారిత్రక కావ్య రచనలో పాటించవలసిన మెలకువలను గురించి ప్రస్తావించడం వలన చారిత్రక కావ్యాల పరిశీలకు ఇది దోహదపడుతుంది. 

ఈ కవితా ఖండికలో విశ్వనాథ వారు వర్ణించిన చారిత్రకాంశములు పూర్వ పల్లవులకు చెందినవిగా తెలుస్తున్నది. కవి ఉద్దేశ్యంలో పూర్వ పల్లవులు అంటే శాలంకాయనులు అని భావించాలి. శాలంకాయన అనేది రాజవంశ నామం కాదని, అది పల్లవ రాజులలోని ఒకరి గోత్రనామమని చిలుకూరి వీరభద్రరావు గారి మాటల వలన స్పష్టమైనది. 

ఈ కవితా ఖండికలో పేర్కొన్న స్థలము, అనగా వేఁగి క్షేత్రమునకు బెబ్బులి అనే అర్థాన్ని స్ఫురింపజేసేలాగా ఆ పేరు పెట్టబడిందని కూడా చిలుకూరి వీరభద్రరావు గారి మాటల వలన తెలిసినది. చారిత్రకంగా వేఁగి క్షేత్రమునకు గల ప్రాధాన్యత మరియు ఆ నగరము ఆంధ్రులకు రాజధానిగా వర్ధిల్లిన విశేషములు తెలిసినవి. 

కాలము (క్రీ.శ. 3వ శతాబ్దం చివర నుండి 7వ శతాబ్దం వరకు) మరియు పల్లవులకు చారిత్రకంగా ఆయా కాలాలలో గల ప్రాధాన్యత వెల్లడయినది. 

అదేవిధంగా పల్లవుల ఆరాధ్యదైవం చిత్రరథస్వామి అని తెలుస్తున్నది. తద్వారా వారు సుర్యారాధకులు అనే విషయం తెలుస్తున్నది.

పల్లవ రాజుల శౌర్య ప్రతాపములు, ఆకాలం నాటి కోటలు, తెలుగు బాలలు ఆడుకునే ఆటలు, వీరుల యుద్ధ విద్యలను గురించి పేర్కొనడం వలన చారిత్రక, సామాజికాంశాలను సమన్వయించే తీరు బోధపడుతుంది. 

వీటితోపాటుగా వివిధ చారిత్రకాంశములను సాహిత్యంతో సమన్వయించి చూడగలిగే పరిశీలనాత్మక దృష్టికి కూడా ఈ వ్యాసం అవగాహనను కలిగిస్తుంది.

13. పాదసూచికలు:

  1. నేనెఱిగిన విశ్వనాథ (వ్యాసం), కామేశ్వరరావు, భైరవభట్ల. www.poddu.net (అంతర్జాల తెలుగు పత్రిక, సందర్శించిన తేది: 17-06-2023)
  2. దర్శిని (ఆంధ్రప్రశస్తి పై వ్యాసం), శరభయ్య శర్మ, మల్లంపల్లి. www.andhrabharati.com (అంతర్జాల వేదిక, సందర్శించిన తేది: 18-06-2023)
  3. ఆంధ్రుల చరిత్రము. (ప్రథమ భాగం) వీరభద్రరావు, చిలుకూరి. పుట. 222
  4. విశ్వనాథ వారి భక్తి-దేశభక్తి. డా. సూర్యనారాయణ, పంపన. పుట. 131 
  5. విశ్వనాథ వారి భక్తి-దేశభక్తి. డా. సూర్యనారాయణ, పంపన. పుట. 207

14. ఉపయుక్తగ్రంథసూచి:

  1. గౌతమరావు, జువ్వాడి. (1974) విశ్వనాథ కవితా వైభవం. యువభారతి ప్రచురణ, సికిందరాబాదు. 
  2. ద్వా.నా. శాస్త్రి. (2004) తెలుగు సాహిత్య చరిత్ర. ప్రతిభ పబ్లికేషన్స్, హైదరాబాదు.
  3. నరసింహం, కె.వి.ఆర్. (1975) ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి. ఆంధ్ర విశ్వకళా పరిషత్తు ప్రచురణ, విశాఖపట్టణం-3
  4. ప్రతాపరెడ్డి, సురవరం. (1949) ఆంధ్రుల సాంఘిక చరిత్ర. సాహిత్య వైజయంతి ప్రచురణ, హైదరాబాదు-1 
  5. లక్ష్మీరంజనం, ఖండవల్లి. (1957)  ఆంధ్రుల చరిత్ర - సంస్కృతి. బాలసరస్వతీ బుక్ డిపో, కర్నూలు, మద్రాసు.
  6. వీరభద్రరావు, చిలుకూరి. (1910) ఆంధ్రుల చరిత్రము. (ప్రథమ భాగం) విజ్ఞానచంద్రికా గ్రంథ మండలి, చెన్నపురి. 
  7. వేంకటావధాని, దివాకర్ల. (1961) ఆంధ్రవాజ్ఞ్మయ చరిత్ర, ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాదు   
  8. సత్యనారాయణ, విశ్వనాథ. (1961) ఆంధ్రప్రశస్తి. వి. ఎస్. ఎన్. & సన్స్, మారుతీనగర్, విజయవాడ -4.  
  9. సుబ్రహ్మణ్యం, జి.వి. (1995) విశ్వనాథ నవ్య సంప్రదాయం. యువభారతి ప్రచురణ, సికిందరాబాదు. 
  10. సూర్యనారాయణ, పంపన. (1990) విశ్వనాథ వారి భక్తి-దేశభక్తి. చిట్టిప్రోలు పబ్లిషర్స్, నరసరావుపేట.
  11. హనుమంతరావు, బి.యస్.ఎల్. (1994) ఆంధ్రుల చరిత్ర. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు-1

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]