AUCHITHYAM | Volume-04 | Issue-03 | March 2023 | ISSN: 2583-4797
11. తొలి తెలుగు శాసనాలు: పదజాలం
ఆచార్య కరిమిండ్ల లావణ్య
అధ్యక్షులు, తెలుగు అధ్యయనశాఖ
ప్రిన్సిపాల్, తెలంగాణ విశ్వవిద్యాలయం (సౌత్ క్యాంపస్)
నిజామాబాద్–503 322, తెలంగాణ
సెల్: +91 98484 10244. Email: lavanyakarimindla@gmail.com
Download PDF
Keywords: శాసనాలు, ప్రాకృతం, సంస్కృతం, తెలుగు, నాగబు, గాథాసప్తశతి, గ్రామ నామాలు, అన్యదేశ్యాలు, పదాంశాలు, తద్భావాలు, తత్సమాలు, దేశ్యాలు, పరుషాలు, సరళాలు, అనుస్వారం, మిశ్రపదాలు.
ఉపోద్ఘాతం:
తొలి తెలుగు శాసనాలను పరిశీలించినపుడు వాటిలోని పదజాలం ప్రధాన పాత్ర పోషిస్తుంది. పదాల ఆధారంగానే విషయ విశ్లేషణ అర్థం అవుతుంది. ఈ పదాల వల్లనే నేటి భాష స్థిరీకరణ పొందింది. అందుకని ఆనాటి శాసనాల్లోని పదాలను విశ్లేషించటం ఈ వ్యాస ముఖ్యోద్దేశం. అందుకని ఆనాటి శాసనాల్లోని సంస్కృత, తెలుగు, ప్రాకృత పదాలను గుర్తించాలని పరిశోధనా ప్రణాళికను వేసుకున్నాను. భాషల వారీగా విభజించాలనే పరిశోధనా పద్ధతిని ఉపయోగించాను. ప్రణాళికాయుక్తంగా వ్యాసం ముగించాను.
నేటి తెలుగు ప్రాంతాన్ని చాలా రాజవంశాలు పరిపాలించాయి. ఒక్కొక్క వంశానికి ఒక్కో చరిత్ర ఉంది. ఈ చరిత్ర మనకు నాటి శాసనాలు, వాఙ్మయం, కళలు, కట్టడాల ద్వారా తెలుస్తుంది. ఈ చరిత్రలో ఆయా కాలాల సామాజిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులు, జీవన విధానం, సంస్కృతి, సాహిత్యం, భాష తదితరాంశాలు ఉన్నాయి.
ఆనాడు భాషా దృష్టితో శాసనాలు వేయించలేదు. ఆనాటి ప్రజల సంక్షేమం కోరి ఆయా రాజులు శాసనాలు వేయించారు. ప్రజలందరూ సమకాలీన పరిస్థితులను అర్థం చేసుకోవాలని శాసనాలు వేయించారు. నేడు ఆ శాసనాలను అధ్యయనం చేసి, నాటి సంస్కృతులు, భాషలు తెలుసుకోవలసిన అవసరం ఉంది. మనిషి తన జీవనానికి అనుగుణంగా పనిని, ప్రాంతాన్ని ఎంచుకొని తన ఉనికిని తెలియజేస్తున్నట్లే, మనుషులు మాట్లాడే భాష కూడ కొత్త కొత్త పదాలను తనలో కలుపుకుంటూ ఉంటుంది. ఈ పదాలను శాసనాల్లో పరిశీలించినట్లేయితే, అవి మొదట ప్రాకృత, సంస్కృత భాషలు రాజ భాషలు కావడంవల్ల ఆ భాషల్లోనే శాసనాలు వేశారు. ఆ తరువాత దేశీభాషలైన తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ, ఒరియా తదితర భాషల్లో శాసనాలు వచ్చాయి. ఈ శాసనాల్లోని తొలి తెలుగు శాసనాల పదాలను పరిశీలించినప్పుడు అంతకుముందు రాజభాషలైన సంస్కృత, ప్రాకృత భాషల పదాలు తక్కువగా కన్పిస్తాయి. ప్రతీ భాష స్వతస్సిద్ధతను కోరుకుంటుంది కదా !
దేశీపదాలు ఎక్కువగా, మాండలికాలు, అన్యదేశాలు తక్కువగా తొలి తెలుగు శాసనాల్లో కన్పిస్తాయి. తత్సమ, తద్భవాలతో కూడిన సంస్కృత, ప్రాకృత పదాలున్నాయి. మొదటగా అమరావతి ప్రాకృత శాసనంలో ‘నాగబు’ గాథాసప్తశతిలో పొట్ట, అత్త, కరణి తదితర తెలుగు పదాలు ఒకటి, రెండు శతాబ్దాల నుండి వాడుకలో ఉన్నాయి.
విషయ వివరణ:
‘‘క్రీ.శ. 200 నుండి క్రీ.శ. 11వ శతాబ్దం వరకున్న 269 శిలా, తామ్ర శాసనాల్లో 187 తెలుగులో వేశారని బూదరాజు రాధాకృష్ణ (తెలుగు భాషాచరిత్ర, భద్రిరాజు కృష్ణమూర్తి) ద్వారా తెలుస్తున్నది’’. (1) మిగతా 82 శాసనాలు ప్రాకృత, సంస్కృత శాసనాలు. వీటిలో తెలుగు పదాలున్నాయి. పులుమావి జింగ్లిగుండు శాసనంలోని ‘‘వేపూరు’’, శివస్కంద వర్మ మైదవోలు శాసనంలోని ‘విరిపఱ’. అత్తివర్మ గోరంట్ల శాసనంలోని ‘తాంటికొంట’ అక్కిజ్ఞవేనిజ్జ, శాలంకాయన నందివర్మ పెదవేగి శాసనంలోని ‘వేంగీపుర’ ‘కమ్బురాఞ్చెరువు’,‘చెఞ్చెరువు’ తదితర వ్యక్తి స్థల, గ్రామ నామాలు సంస్కృత, ప్రాకృత శాసనాల్లో కనిపించే తెలుగు పదాలు. పూర్తిగా తెలుగు భాషలోనే వేసిన శాసనం క్రీ. శ. 575 నాటి ధనుంజయుని (రేనాటి చోళరాజు) కలమళ్ళ శాసనం.
తొలి తెలుగు శాసనాల్లోని పదాలను పరిశీలించడం వరకే ఈ వ్యాసపరిమితి. కాబట్టి తొలి తెలుగు శాసనాల్లోని సంస్కృత, ప్రాకృత దేశీ, అన్యదేశాలతోపాటు మాండలికాలను వివరిస్తాను.
తత్సమ పదాలు:
సంప్రదాయ వ్యాకరణాలు భాషలోని పదజాలాన్ని తత్సమ, తద్భవ, దేశ్యాలుగా విభజించాయి. తెలుగులోకి వచ్చిన ఎరువుమాటలూ (Borrowing Words) వాటి పదాంశాలు తెలుగు వర్ణమాలలో మార్పులేకుండా కలిసిపోతే తద్భవమనీ, లేకపోతే తత్సమమనీ, ఆ రెండు రకాల పదాంశాలు కలిసి ఏర్పడే పదం మిశ్రమ పదమని చిన్నయసూరి బాలవ్యాకరణం చెబుతున్నది. ఇక్కడ పదాంశాలనుబట్టి విభజన చేస్తే, దేశ్య, దేశ్యేతర పదజాలాన్ని పోల్చి చూస్తే తెలుగులో ఇమిడిపోయిన ఎరువు మాటలు క్రీ.శ. 6 నుండి 10వ శతాబ్దాల మధ్య మొత్తం పదజాలానికి నూటికి 20–25 శాతం ఉండగా, 10–11 శతాబ్దాల్లో నూటికి యాభై శాతం అయింది.
అంటే కావ్య భాషా ప్రభావం వల్లే తత్సమ, తద్భవాలు పెరిగాయని చెప్పవచ్చు. ఎరువు మాటల్లో ఎక్కువగా సంస్కృత, ప్రాకృత భాషల నుండి వచ్చినవే.
సంస్కృతం నుండి ఎరువుగా వచ్చిన మాటల్లో రెండు మార్పులు కనిపిస్తాయి. ఒకటి: అర్ధవిపరిణామం, రెండు: సంస్కృత వ్యాకరణ విరుద్ధం. అర్థ విపరిణామానికి లోనైన పదాలు వక్రమ్బు (అడ్డు), కరణమ్ (గ్రామాధికారి), జీవితంబు (జీతం), నియోగముల్ (జిల్లాలు), మేఱ్ (అంబా), స్త్రీవాచక ప్రత్యయం, సంస్కృత వ్యాకరణ విరుద్ధతకు లోనైన పదాలు ప్రధాని, మనోవల్లభి, వనజనేర్తట, ఉరమాల తదితరాలు.
తత్సమ శబ్దాలకు తెలుగు పద్ధతిలోను, తెలుగు పదాలకు సంస్కృత పద్దతిలోను సంధి చేయడం అక్కడక్కడ శాసనాల్లో కనిపిస్తుంది. నీలీస్వర, మన్చ్యణ, గొఱ్య, గొఱ్ఱె పళ్యాలు, పళ్యెము, పళ్లెం.
ఇవిగాక సంఖ్యావాచకాలయిన సంస్కృత పదాలు తెలుగు శాసనాల్లో ఉన్నాయి. త్రి=మూడు, నవ=తొమ్మిది, షష్టి=అరవై, నవతి=తొంభై, సహస్ర=కోటి, అర్ధ=సగం వంటి సంస్కృత పదాలు తొలి తెలుగు శాసనాల్లో చూస్తాం.
శాసనాన్ని రాసేటపుడు రాజభాషలనే గౌరవ సూచకంతో సంస్కృత, ప్రాకృత శ్లోకాలను మొదట, చివర రాసేవారు. సంస్కృత, ప్రాకృతాల ప్రభావం వల్ల తెలుగులోకి వచ్చిన సహ వర్ణాలున్నాయి. అవి ఖ, ఘ, ఠ, థ, ధ, ఫ, భ, శ, షలు వీటిలో ‘ఠ’ కారం ప్రత్యేక వర్ణంగా శాసనాల్లో కనిపించదు. మిగిలిన వర్ణాలతో కూడిన పద బంధాలెన్నో తొలి తెలుగు శాసనాల్లో ఉన్నాయి. అవి తెలుగు పదాలు కావచ్చు. ప్రాకృత, సంస్కృత పదాలు కావచ్చు.
సంస్కృత పదాల మాదిరిగానే కొన్ని ప్రాకృత పదాలు తొలి తెలుగు శాసనాల్లో కనిపిస్తాయి. క్రీ.శ.600 ప్రాంతానికి చెందిన కమలాపురం తాలుకా ఇందుకూరులోని శాసనంలో ప్రాకృత పదాలను పరిశీలిస్తే, ప్రాకృత పదాలు ఈ శాసనంలో ఉన్నాయి.
‘‘స్వస్తి శ్రీ చోటి మహరాజుల్లేళన్ ఎరిగల్ దుగరాజుల్ ఇచ్చిన పన్నన కొచ్చియ పాఱ రేవ శమ్మారికిన్’’ అనే వాక్యంలో ఎరిగల్ అంటే ఎరుకలగలవాడు, జ్ఞాని అని అర్థం. దుగరాజు అంటే యువరాజు, జ్ఞానియైన యువరాజు ‘‘కౌశిక్’’ (కొచ్చొయ) గోత్రానికి చెందిన బ్రాహ్మణునికి దానమిచ్చిన భూమి గురించి ఈ శాసనం తెలుపుతుంది. ఇక్కడ బ్రాహ్మణుని గోత్రం ‘‘కొచ్చియ’’ (కౌశిక) అని చెప్పబడిరది. ఆనాటి ప్రజల వాడుకలో ఉన్న పదాన్ని అలాగే రాశారు.
సంఖ్యా వాచకలైన ప్రాకృత పదాలు తొలి తెలుగు శాసనాలో ఉన్నాయి. దువ=రెండు, తిఱ్ఱి=మూడు, చౌ=నాలుగు, బారన=పన్నెండు, నత్తిగ=ఇరవైఒకటి, పాతిక=ఇరవై ఐదు, వంద=నూరు, ఆద=సగం వంటి ప్రాకృత సంఖ్యావాచకాలు తెలుగు శాసనాల్లో ఉన్నాయి. సంస్కృత, ప్రాకృతాల్లో రాయడం కన్నా తెలుగులో రాయడం వారికి ఆనాడు కొత్త భాషను సృష్టించుకొని పదాలను, పదబంధాలను, వాక్యాలను రాయడం కూడ ఆనాటి లేఖకుల నేర్పుగా భావించవచ్చును.
నేటి తెలుగు వాళ్ళు ఇంగ్లీష్ నేర్చుకొని, రాయడానికి ఉత్సాహం చూపినట్లుగానే నాడు తెలుగు దేశీ భాషలోనే రాయాలనే ఉత్సాహం ఉండేది.
దేశీ పదాలు:
మూల భాష నుండి వచ్చిన పదాలు దేశీపదాలు. మూల ద్రావిడం నుండి తెలుగు భాష పుట్టిందని భాషా శాస్త్రవేత్తలు నిరూపించి, వర్ణమాల క్రమాన్ని తెలిపి, మూల ద్రావిడ పదాలను సేకరించారు. మూల ద్రావిడం నుండి కాలక్రమేణ మారుతూ వస్తున్న భాష శాసనాల్లో కనిపిస్తుంది. కొన్ని పదాలను ఉదహరిస్తాను.
వదాది సరళాలు:
క్రీశ 7వ శతాబ్దానికి ముందున్న వ్యుత్పత్తి స్పష్టంగా తెలిసిన దేశీ పదాల్లో సరళాదులు కనిపించవు.
అనుస్వారం:
దేశ్య శబ్దాల్లో పరుష, సరళాలకు ముందు అనుస్వారం కనిపిస్తుంది. విలెంబలి, పులొంబున, స్వత్సరంబు తదితర పదాలలో సరళాలకు ముందు అనుస్వార ప్రయోగం శాసనాల్లో కనిపిస్తుంది.
మహదేక వచనం:
క్రీ.శ. పదకొండో శతాబ్దం వరకున్న శాసన భాషలో 1882 విభిన్న విశేష్య పదాలు లభిస్తున్నాయి. వాటిలో 573 దేశీ పదాలున్నాయి. వీటిలో గణ్డ, గణ్డణ్డు తదితర పదాలున్నాయి.
అమహదేక వచనం:
అమహత్తుల్లో కూడ ప్రథమైక వచన ప్రత్యయం చేరని రూపాలు, చేరిన రూపాలున్నాయి. దేశ్యాల్లో ఇల్లు, కోయిల– ము, రామడు, మడు– వు, తదితర పదాలను శాసనాల్లో చూస్తాం.
మిశ్ర పదాలు:
మిశ్రపదాలు క్రీ.శ. 7వ శతాబ్దం నుండే లభిస్తున్నాయి. తొలి తెలుగు శాసనాల్లో తత్సమ, దేశ్యాలతో ఏర్పడ్డ మిశ్ర పదాలు ఎక్కువగా, తద్భవ దేశ్యాలతో ఏర్పడ్డ మిశ్ర పదాలు తక్కువగా కనిపిస్తాయి. పద మిశ్రణం పద్య శాసనాలకన్నా గద్య శాసనాల్లో ఎక్కువ. దేశ్య తద్భవ మిశ్రణమైన పదాలు కణ్ణసామి, గొల్లపల్లు, మావ్యలగరుడణ్డు, మొగమాడ తదితరాలు. దేశీ, తత్సమ మిశ్ర పదాలు అమృతపడి, గణ్డభైరవ, జయమాడ, పోర్ముఖరామ, మాసపత్తిక తదితరాలు.
నామ పదాలు:
నామ ప్రాతిపదికతో ఏర్పడే పదాలు రెండు విధాలుగా పేర్కొనవచ్చు. ఒకటి అవిభాజ్యం. రెండు విభాజ్యం. అవిభాజ్యంలో దేశీ పదాలుంటాయి. అవి ఊరు, ఇల్లు తదితరాలు దేశీపదాలు, ఎరువు మాటలు సంస్కృత ప్రాకృతాల నుండి వచ్చినవి.
ఒక్క ‘ఊరు’ పదం గురించి చరిత్ర పరిశోధకులైన మల్లంపల్లి సోమశేఖర శర్మ పలువిధాలుగా ప్రస్తావించారు. ‘‘ఊరు’’ పదం సత్యాదిత్యచోళుని మాలెపాడు శాసనంలో (క్రీ.శ. 725)లో కనిపిస్తుంది.‘‘ఊరు’’ యొక్క ప్రథమైక వచనం‘‘వాను’’ లో ‘‘ఊను’’ అవుతుందని, అది క్రమంగా ఊణ్డు, ఊడు అయినందువల్ల ‘‘ఊడ్లు’’ ప్రథమా బహువచన రూపం ఏర్పడిరదని మల్లంపల్లి వారు పేర్కొన్నారు. కాని, ప్రాచీన శాసనాలైన కొసినేపల్లి శాసనంలో ‘‘ఊరు పెన్‌కాలు’’ అని, చిలమనూరు శాసనంలో ‘‘ఛిఱుంబురు పళన్’’ అనే ప్రయోగం ఉంది. అందుకే ఊను ఏకవచన రూపంలో ఉన్న దేశి పదం. నల్ల చెఱువువల్లె శాసనంలో ‘‘కజమోళూఏళ’’ అనే ప్రయోగంలో ‘‘ఊరు’’ రూపం కనిపిస్తున్నది. అది ఊను అనడం కంటె ‘‘ఊదు’’ అనడమే మంచిది. అదే క్రమంగా ‘‘ఊరు’’ గా మారి ఉండవచ్చని చరిత్ర, శాసన పరిశోధకులైన జి. పరబ్రహ్మశాస్త్రి నిరూపించారు. వేల్పుచెర్ల శాసనంలో ‘కొదపునూఱ’ అని శకటరేఫ కనిపిస్తుంది. అప్పటికే దీనిలోని వర్ణం ర,ఱలుగా మారి ఉండవచ్చును. ‘‘వంగనూర్లి’’ వంటి పదాలను పరిశీలించినపుడు ‘‘ఊద్లు’’ అనే రూపం క్రమంగా ఊడ్లు, ఊళ్లు అని మార్పు చెందింది. ఒక్క ‘‘ఊద్లు’’ దేశీ పదం కాలానుగుణంగా భాషలో వచ్చిన మార్పుల వల్ల, అనేక రకాలుగా మార్పు చెందుతూ నేడు ‘‘ఊరు’’ పదంగా స్థిరపడిపోయింది. భాషలోని పదజాలమంతా కాలంతోపాటు మార్పులకు లోనవుతూనే ఉంటుంది.
అన్యదేశ్యాలు:
మూలభాష నుండి సంక్రమించని పదజాలమంతా అన్య దేశ్యమే. ‘‘భాష నిరంతరం మార్పులకు లోనవుతూ ఇతర భాషల పదాలను ఆదానంగా తెచ్చుకొని తనలో కలుపుకొని, ముందుకు సాగుతుంది. ఆదాన ప్రదానాలే అన్య దేశ్యాలు (Borrowing Words) సంస్కృతుల కలయిక వల్ల, సాంఘిక, వాణిజ్య, వర్తక అవసరాల వల్ల, పరిపాలన సౌలభ్యం కోసం, అన్ని భాషల్లో ఆదాన ప్రదానాలు సహజంగా జరుగుతాయి. ద్రావిడ భాషా కుటుంబానికి చెందిన తెలుగును చారిత్రకంగా పరిశీలిస్తే ప్రాచీన దశలో తత్సమ, తద్భవ పదజాలం ఎక్కువగా తెలుగులో చేరినవి. తెలుగులో అన్యదేశ్యాలు అనే వ్యాసంలో స్వరాజ్యలక్ష్మి పేర్కొన్నారు’’. (2) మధ్య యుగం నుండి (కాకతీయులు, విజయనగర, రెడ్డి, పద్మనాయక) ముస్లింలు, క్రిస్టియన్ల పాలనా ప్రభావం వల్ల తెలుగు భాషలో ఉర్దూ, అరబ్బీ, ఇంగ్లీష్ భాషల పదాలు చేరి స్థిరపడిపోయినాయి.
తొలి తెలుగు శాసనాల్లో ఆన్యదేశ్యాలు తక్కువగా ఉన్నాయి. ద్రావిడ భాషల్లో భాగంగా తెలుగు భాషను చెబుతున్నందువల్ల, కన్నడ, తమిళ భాషల పదాలు కొన్ని తొలి తెలుగు శాసనాల్లో చేరిపోయాయి. కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలు సరిహద్దుగా ఉన్న రాయలసీమ ప్రాంతంలోని శాసనాల్లో ఈ భాషల ప్రభావం కొంత తొలి తెలుగు శాసనాలపై పడిరది. విశాఖ – శ్రీకాకుళం ప్రాంతాలు సరిహద్దుగా ఉన్న ఒరిస్సా రాష్ట్ర భాష ఒరియా భాషా ప్రభావం కొద్దిగా నాటి శాసనాల్లో కనిపిస్తుంది.
కత్తిశయ్య–న్, కుళ్ళమ్మ–న్ (పుణ్యకుమారుని తిప్పలూరి శాసనం) పదాల్లోని ‘‘న్’’ అనేది అత్యంత ప్రాచీనం, బహుశా తమిళం నుండి రావచ్చని బూదరాజు రాధాకృష్ణ అభిప్రాయం. కెయమ్/కెయన్, కుళమ్/కుళన్ వంటి పర్యాయపదాలు తమిళంలో కూడ ఉన్నాయి.
మాండలికాలు:
భాషకు మార్పు సహజం. ఈ మార్పు వల్ల భాషలో బహురూపత, వైవిధ్యం ఏర్పడుతాయి. ఈ బహురూపత మూడు విధాలుగా ఉంటుందని భద్రిరాజు కృష్ణమూర్తి ‘‘తెలుగు మాండలికాలు – ప్రమాణభాష’’ అనే వ్యాసంలో తను సంకలనం చేసిన ‘తెలుగు భాషా చరిత్ర’లో పేర్కొన్నారు. ఈ మూడు విధాలను పరిశీలిస్తే భాషలో చారిత్రక మార్పులు, ప్రాంతీయ మార్పులు, సాంఘిక మార్పులు జరుగుతాయని అర్ధమవుతుంది. ఈ మార్పులు ప్రాఙ్నన్నయ కాలం నుండే జరుగుతున్నాయని, నాటి శాసనాల ద్వారా తెలుస్తున్నది. ప్రాఙ్నన్నయ కాలం నుండే శాసనాలు ఆంధ్రప్రదేశమంతా వ్యాపించి ఉండడంవల్ల మాండలిక సంబంధమైన భాషా విశేషాలు ఆయా ప్రాంతాల్లో వేరు వేరుగా కనిపిస్తున్నాయి. క్రీ.శ 7వ శతాబ్దం నాటికే విశాఖ – శ్రీకాకుళం మాండలికం, మధ్యాంధ్ర మాండలికం, రాయలసీమ మాండలికం ఏర్పడ్డాయి.
‘‘సాదుశకటరేఫ’’ను నాటి శాసనాల్లో పరిశీలించినట్లయితే పెదవేగి శాసనంలో ‘‘అఱుతొఱె’’, ‘‘చెఞ్చెఱువ’’ కమ్హురాఞ్చెరువ’’, అనే మాటలున్నాయి. మొదటి రెండు పదాల్లో ఉన్న శకటరేఫ మూడవ పదంలో లేదు. అప్పటికి ముందు కాలంలోనే ఈ రెండు ధ్వనులు ఒకే వర్ణంగా మారాయని చెప్పవచ్చు. క్రీ.శ. 7వ శతాబ్దినాటి ‘‘ఇరుకుటూరు’’ ఎనిమిదో శతాబ్దం నాటి ‘‘చిట్టేరు’’, ‘‘నూర’’ అనే పదాల్లో శకటరేఫ లేదు. ఈ శకటరేఫ లేని ప్రాంతాలు పల్నాడు ప్రాంతాలు, శాసనంలో ‘‘వడమఱలూఱి’’ పదాలున్న ప్రాంతాలు విశాఖ నుండి అనంతపురం మధ్య భూభాగాలు. అందువల్ల రేఫ ‘‘ఱ’’ కారాల మధ్య తేడా నాటి కాలంలోనే వేరు వేరు ప్రాంతాల్లో వేరుగా ఉంది. నామవాచకం మీద ‘‘అగు’’ ధాతు భూతకాలిక విశేషణరూపం’’ ‘‘అయిన’’ చేర్చి నిర్మించిన విశేషణాత్మక పదబంధాలు విరళంగా కనిపిస్తాయి. ఉదాహరణకు ‘‘ఉత్తమోత్తమున్ఱ్’’ – అయిన’’ (పుణ్యకుమారుని తిప్పలూరి శాసనం క్రీ.శ 630 నాటిది) అనే పదబంధ నిర్మాణం క్రీ.శ ఏడో శతాబ్దానికే కడపలో ప్రారంభమై, 8–10 శతాబ్దాల మధ్యకాలంలో దక్షిణ కోస్తాకు వ్యాపించింది.
‘‘యి’’ అనే సపదాంశం తీరాంధ్రలో తొమ్మిదో శతాబ్దం నుండే మాండలికంగా వాడుకలో ఉండేది. ప్రాఙ్నన్నయ యుగంలోని ‘‘యిని’’ అనే పదం ఆధునిక యుగం వరకు ‘‘ఇన్ని’’ అనే రూపాన్ని పొందింది. క్రీ.శ. 13వ శతాబ్దం వరకు శాసనాల్లో అనేక మాండలిక పదాలు చోటుచేసుకున్నాయి. అందులో ‘‘ఱ’’ కారం రాతలో నిల్చి ఉండడం, నాల్గు/నాలు రూపం వాడడం. ‘‘ఉన్’’ ప్రత్యయం బదులుగా ‘‘అండు’’ ప్రత్యయం (పదినొకొండు) వాడడం వంటి అంశాలు ఈ మాండలికాల్లోని విశేషాలు. ‘‘ఱ’’ కారం విశాఖ – శ్రీకాకుళ ప్రాంతానికే పరిమితం. ఉదాహరణకు ‘‘నిఱుజెఱ్వు’’, ‘‘తాలాంఱ’’, ‘‘చోఱగంగ’’ తదితరాలు, చల్లు/చెల్లు(అ/ఎ) మార్పు దేశి పదాల్లో విశాఖ – శ్రీకాకుళ ప్రాంతాల్లో తప్ప మిగతా ఆంధ్రదేశమంతా కనిపిస్తుంది.
మాండలిక విషయంలో నెల్లూరు జిల్లా అనేక ప్రాచీన రూపాలను నిలుపుకున్నట్లు ఆధారాలున్నాయి. చేసిన/కేసిన, చేసిరి/కేసరి తదితర పదాలను తొలి తెలుగు శాసనాల్లో చూస్తాం. ఇటీవలి మాండలిక పరిశీలనలో నెల్లూరు ప్రాంతంలో ‘‘కిక’’, ‘‘కీలిసె’’, ‘‘కీడిసె’’ వంటి తాలవ్యీకరణ కాని రూపాలు కనిపించాయని ప్రముఖ శాసన పరిశోధకులు కందప్పశెట్టి అభిప్రాయం. ‘‘వ్రిత్తికాన్ఱు’’ వంటి రూపాలు బహుశ నెల్లూరు జిల్లాలో పామర మాండలికాల్లో నిల్చి, అవి ఇలాగే శాసనాల్లోకి వచ్చి ఉండవచ్చని కందప్ప శెట్టి అభిప్రాయం. విశాఖ – శ్రీకాకుళంలోని ‘‘నూన్య’’, చెల్యలు, ‘‘నూన’’ ప్రయోగాలకు, మద్యాంధ్రలో ‘‘నూనె’’, ‘‘చెల్లెలు’’ రూపాలున్నాయి.
ముగింపు:
శాసనాల ఆధారంగా ప్రాచీనాంధ్ర భాషను శాస్త్రీయ పద్ధతుల్లో పరిశీలించినప్పుడు తెలుగు ప్రత్యేక భాషగా విలక్షణ నిర్మాణంలో ఉండేదని అర్ధమవుతుంది. ఒక భాష ఎప్పుడూ స్వతస్సిద్ధమైన వ్యవస్థతోనే కూడుకొని ఉంటుంది. అప్పటి ప్రాచీన భాషలైన సంస్కృత, ప్రాకృత భాషల పదజాలం శాసనాల్లో ఎక్కువగా కనిపించదు. కాని, తత్సమ, తద్భవాలున్నాయి. నది ఏ విధంగానైతే నిరంతరంగా కొత్త నీటిని తనలో చేర్చుకొని కళకళలాడుతుందో అలాగే, భాష కూడ నిరంతరంగా మార్పులకు లోనవుతూనే ఉంటుంది. అందుకే రెండు వేల సంవత్సరాల నాటి భాష నేటి కాలం వారికి అర్థం కాదు, కాని, నాటి శాసనాల్లోని పదజాలం ఆధారం గానే నేటి పదాలు భాషలో స్థిరత్వాన్ని పొందుతాయి.
పాద సూచికలు:
- తెలుగు భాషా చరిత్ర పుట: 212
- తెలుగు భాషా చరిత్ర పుట: 212
ఉపయుక్తగ్రంథసూచి:
- ఆదినారాయణ శాస్త్రి, యం. – రాయలసీమ తెలుగు శాసనాల సాంస్కృతిక అధ్యయనం – ఆదిత్య పబ్లికేషన్స్ – అనంతపురం – 1995.
- కృష్ణమూర్తి భద్రిరాజు, సంపాదకులు – తెలుగుభాషా చరిత్ర – తెలుగు విశ్వవిద్యాలయం – హైద్రాబాదు – 1995.
- చిన్నయసూరి, పరవస్తు – బాలవ్యాకరణం – వావిళ్ళ రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ – మద్రాసు – 1950.
- నారాయణరావు, చిలుకూరి – ఆంధ్ర భాషా చరిత్రము 1,2 సంపుటాలు – వాల్తేరు, ఆంధ్ర విశ్వకళాపరిషత్ – 1937.
- పరబ్రహ్మ శాస్త్రి, పి.వి – తెలుగు శాసనాలు – ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి – హైదరాబాదు – 1975.
- బాలేందు శేఖరం, లక్ష్మీరంజనం ఖండవల్లి – ఆంధ్రుల చరిత్ర – సంస్కృతి.
- వెంకటపతి రెడ్డి కసిరెడ్డి – తెలుగు భాషా వికాసం – కె.వి.ఆర్. పబ్లికేషన్స్ హైదరాబాదు.
- శాస్త్రి బి.యన్. – శాసనాలు – మూసీ పబ్లికేషన్స్ – హైదరాబాదు.
- సోమయాజులు, జి.జె. – ఆంధ్ర భాషా వికాసం – వాల్తేరు – ఆంధ్రవిశ్వ కళాపరిషత్తు.
- ప్రచురణ (నడుస్తున్న చరిత్ర – జూన్ 2011)
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.