headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-03 | March 2023 | ISSN: 2583-4797

10. వేమన సాహిత్యం, జీవితం: రిసెప్షన్ సిద్ధాంతం

డా. వెంకట రామయ్య గంపా

తెలుగు సహాచార్యులు
ఆధునిక భారతీయభాషలు మరియు సాహిత్యాధ్యయనశాఖ
ఢిల్లీ విశ్వవిద్యాలయం, ఢిల్లీ - 110007
సెల్: +91 9958607789. Email: gvramaiah@gmail.com

Download PDF


Keywords: వేమన, రిసెప్షన్ సిద్ధాంతం, పరిశోధకుల దృక్పథం, విమర్శకులదృక్పథం, జనామోదధోరణి

ఉపోద్ఘాతం:

ఒక సందర్భంలో మిత్రుడు ఒక విశ్వవిద్యాలయ ఇంటర్వ్యూలో వేమనకు సంబంధించిన అంశం పైన మాట్లాడే ప్రయత్నం చేస్తే అక్కడున్నవారు ‘వేమన పైన కొత్తగా మీరు చెప్పడానికి ఏముంది? తెలుగువారికి ఎంతసేపు మహాభారతం, రామాయణం, భాగవతం, వేమన తప్ప మరొక అంశాలు మాట్లాడడం, చదవడం రాదా’ అన్నట్లు మాట్లాడారని మిత్రుడు చెప్పారు. ఈమాట వినడానికి కొంచెం కష్టం అనిపించింది. కానీ అందులో వాస్తవం ఉంది. ఎందుకంటే కొంతమంది దృష్టిలో కొత్త అంశాన్ని చదివి అర్థం చేసుకోవడానికి ఇబ్బంది అయినప్పుడు ఉన్న వాటిని మనకు నచ్చిన పద్ధతిలో చెప్పడం అనేటువంటిది జరుగుతూ ఉంది. కానీ పరిశోధనలో ఆలోచన చేసే కొద్దీ కొత్త అంశాలు వెలుగులోకి వస్తూనే ఉంటాయి. పాతవాటినే నూతన పద్ధతిలో చర్చిస్తూనే ఉంటారు. ఉదాహరణకు ప్రపంచంలో ఇప్పటివరకు షేక్స్పియర్ పై వేలాది వ్యాసాలు వందలకొద్దీ పరిశోధనగ్రంథాలు వెలువడ్డాయి. అయినప్పటికీ ఇప్పటికీ కూడా ప్రపంచంలో ఎక్కడో ఒకచోట ప్రతి సంవత్సరం ఒక అంతర్జాతీయ సదస్సు జరుగుతూ ఉంటుంది. భారతదేశంలో రామాయణ, మహాభారతాలపై కొన్ని వందల సంఖ్యలో సిద్ధాంత గ్రంథాలు, వ్యాసాలు వెలువడ్డాయి. ఇప్పటికీ వాటికి సంబంధించిన అంశాలపై నూతన పద్ధతిలో పరిశోధకులు ఆలోచన చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలాగే తెలుగులోనూ వేమన పైన పరిశోధక వ్యాసాలు, విమర్శన గ్రంథాలు వెలువడినప్పటికీ చర్చించాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. నూతన సాహిత్య, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థికసిద్ధాంతాలను అన్వయం చేసి చర్చించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

అటువంటి ప్రయత్నం ఈ వ్యాసంలో అనుసరించడం జరిగింది. ఇందులో వేమన రచనలను, జీవితాన్ని రిసెప్షన్ సిద్ధాంతం ఆధారంగా చర్చించడం జరిగింది. 'ఈనాటి సాహిత్య విమర్శలో లోతు తక్కువ. టెక్స్ట్ ను వదిలి లోకమంతా పోరాడి వస్తారు' అని ప్రముఖ పరిశోధకులు అడ్లూరి రఘురామరాజు పేర్కొన్నారు. కొన్ని సందర్భాలలో రచనతో పాటు రచన వెలుపల ఉన్న అంశాలనూ చర్చించాల్సిన అవసరం ఉంది. అందుకోసం అవసరమైతే రచన వెలుపలకి వచ్చి తక్కిన అంశాలను కూడా చర్చించాల్సిన ఆవశ్యకత ఉంది.

రిసెప్షన్ సిద్ధాంతం (Reception theory):

రిసెప్షన్ సిద్ధాంతం (Reception theory) అనేటువంటిది Reader response theory (పాఠకప్రతిక్రియ విమర్శ/ పాఠక స్పందన విమర్శ / పాఠక ప్రతిస్పందనాధారిత విమర్శ)లో ఒక భాగంగా చూస్తారు. Hans Robert Jauss (1921-1997) అనే విమర్శకుడు రీడర్ రెస్పాన్స్ సిద్ధాంతాన్ని వ్యాప్తిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేసినట్లు రచనల ద్వారా తెలుస్తుంది.

Holub suggests that Reception Theory is a creative process that occurs in the act of reading. He states, the literary work is neither completely text nor completely the subjectivity of the reader, but a combination or merger of the two’’. (Holub, Robert C. Reception Theory: A Critical Introduction. P. 84)

రిసెప్షన్ సిద్ధాంతం అనేటువంటిది 1980 కాలంలో ఆంగ్లంలో ఒక ముఖ్యమైన సాహిత్య సిద్ధాంతంగా పరిచితమైంది. ఈ సిద్ధాంతంపై అనుకూల, వ్యతిరేక భావాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది ప్రకారం ఈ సిద్ధాంతం సాహిత్యం కంటే హోటల్ మేనేజ్మెంట్ వారికి బాగా ఉపయోగపడుతుందని వ్యంగ్యంగా చెప్పారు. రిసెప్షన్ సిద్ధాంతం కొన్ని సందర్భాలలో రచనకు ప్రతిస్పందనగా వెలువడుతుందా? లేదా ఇతర ప్రభావిత అంశాల ఆధారంగా రచనను చర్చించాలా? అనేటువంటిది ఒక ముఖ్యమైన ప్రశ్న. రిసెప్షన్ సిద్ధాంతంలో పాఠకుడు కేవలం రచనకు సంబంధించిన అంశాలనే కాకుండా తక్కిన అంశాలను ఆధారంగా చేసుకొని రచనను అధ్యయనం చేసే ప్రయత్నం చేస్తాడు. ముఖ్యంగా చారిత్రకసంబంధమైన అంశాలను పాఠకుడు పరిగణలోకి తీసుకోవలసి ఉంటుంది.

పాఠకుడు పాఠాన్ని చదివిన తర్వాత అర్థం చేసుకునే విధానం చాలా ముఖ్యమైనది. కొన్ని సందర్భాలలో రచయిత చెప్పిన దృక్పథంతో కాక భిన్న దృక్పథంతో పాఠాన్ని అర్థం చేసుకోవడమూ జరుగుతుంది. తర్వాత కాలంలో రచయిత ప్రభావం ఇతర రచయితల పైన ఎలా ఉందో తెలుసుకోవడానికి పాఠకుడు ప్రయత్నం చేస్తారు. రిసెప్షన్ సిద్ధాంతం అనేది రచయిత సృజనాత్మకతనుండి రచన ఎలా రూపొందింది? దానిని పాఠకుడు ఎలా స్వీకరించాడు? అనే అంశాన్ని ప్రధానంగా చర్చిస్తుంది.

కొంతమంది విమర్శకుల దృష్టిలో రీడర్ రెస్పాన్స్ థియరీలో రిసెప్షన్ థియరీ ఒక భాగంగా చెబుతారు. కానీ జర్మన్ విమర్శకులు ఈ విషయాన్ని పూర్తిగా అంగీకరించలేదు. రీడర్ రెస్పాన్స్ సిద్ధాంతం రిసెప్షన్ సిద్ధాంతాన్ని భిన్నంగా చూసే ప్రయత్నం చేశారు. రీడర్ రెస్పాన్స్ సిద్ధాంతం అనేది ప్రతి రచనకు అన్వయం చేయొచ్చు. కానీ రిసెప్షన్ సిద్ధాంతంలో ఆ సౌలభ్యం తక్కువ. రిసెప్షన్ సిద్ధాంతంలో ఒక రచయిత ప్రభావం ఇతర రచయితల పైన ఎలా ఉంది? వారికి తక్కిన రచయితలతో ఎటువంటి సంబంధాలున్నాయి? పాఠకులు వారిని ఎలా ఆదరించారు అనేటువంటి అంశాలు ముఖ్యమైనవి. చాలా తక్కువ రచనలు చేసిన వారు వ్యవస్థపై పెద్దగా ప్రభావం చూపని వారిని ఈ సిద్ధాంతంతో అన్వయం చేయడం కొంచెం క్లిష్టం. రీడర్ రెస్పాన్స్ సిద్ధాంతం అనేటువంటిది పాఠకుడి వ్యక్తిగత అంశానికి చెందినటువంటిది. కానీ రిసెప్షన్ సిద్ధాంతం అనేటువంటిది సమూహానికి చెందినటువంటి అంశం. రీడర్ రెస్పాన్స్ థియరీలో కేవలం పాఠకుడు ఒంటరిగా ప్రతిస్పందన తెలియజేసే అవకాశం ఉంటుంది కానీ రిసెప్షన్ సిద్ధాంతంలో పాఠకుడు వ్యక్తిగత అభిప్రాయంతో పాటు సమూహానికి చెందినటువంటి అభిప్రాయాలను, ప్రభావాలను పరిగణలోకి తీసుకోవలసి ఉంటుంది. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని రిసెప్షన్ సిద్ధాంతాన్ని, రీడర్ రెస్పాన్స్ సిద్ధాంతం నుంచి వేరు చేసే ప్రయత్నం కొంతమంది విమర్శకులు చేశారు.

వేమన - రిసెప్షన్ సిద్ధాంతం:

రిసెప్షన్ సిద్ధాంతం దృష్టితో వేమన రచనలను పరిశీలించడం ఈ వ్యాసం ప్రధానోద్దేశం. పాఠకల వ్యక్తిగత అభిప్రాయంతో పాటు, సమూహానికి చెందినటువంటి అభిప్రాయాలను, ప్రభావాలను పరిగణలోకి తీసుకొని, ఈ అంశాలను దృష్టిలో ఉంచుకొని రిసెప్షన్ సిద్ధాంతం ద్వారా వేమన రచనల్ని అనుశీలించవచ్చు.

వేమన - ఆంగ్ల పరిశోధకుల దృక్పథం:

వేమన రచనలకు తెలుగువారితోపాటు పాశ్చాత్య పరిశోధకులు ఆకర్షితులు కావడం ప్రత్యేకమైన విషయం. వేమన పద్యాలను ముద్రణా రూపంలో తీసుకువచ్చి సామాన్య పాఠకులకు చేరవేయడంలో సి.పి. బ్రౌన్ చేసిన కృషి ఎంతో ఉందనేది తెలుగు పాఠకులందరికీ తెలిసిన విషయమే. బ్రౌన్, తర్వాత కాలంలో వేమన పద్యాలను ఆంగ్లంలోకి అనువాదమూ చేశారు. వీటితోపాటు వేమన పైన కొన్ని పరిశోధన వ్యాసాలు కూడా కనిపిస్తున్నాయి. ఆ వ్యాసాలు Charles Philip గారి Brown My Discovery of Vemana, Major R.M. Macdonald రచించిన Vemana: A Rebel Poet, C.E. Gover గారి Popular Poet, Henry Bowers గారి వ్యాసం Far in Advance of His Age మరియు W.H. Campbell గారు రచించిన The One Great Poet of the People. ఈ వ్యాసాలన్నిటిని నార్ల వెంకటేశ్వరరావు గారు Vemana Through Western Eyes అనే పేరుతో సంకలనం చేసి ప్రచురించారు.

తక్కిన తెలుగు కవుల కంటే వేమన పైన పాశ్చాత్యులు ఇంత ఆసక్తి చూపడానికి గల కారణాలు ఏమిటి? వారి దృక్పథం ఏమిటి? అనేవి విశ్లేషించవలసిన అంశాలు. పాశ్చాత్యులకు వేమన సంఘ సంస్కర్త, మానవతావాదిగా కనిపించారు. ఆయన ఉన్నత విద్యావంతుడు కాకపోవడం, తెలుగు వ్యాకరణం, ఛందస్సు, అలంకార శాస్త్రం గురించి పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల ఆయన పద్యాలు సులభంగా అర్థమయ్యేవి. ఈ కారణం వలన 19 వ శతాబ్దంలో, తెలుగు పండితులకు పూర్తి విరుద్ధంగా, పాశ్చాత్య పండితులు వేమన పద్యాలు అర్థం చేసుకోవడానికి సులభంగా ఉన్నాయని ప్రశంసించారు. వీటితోపాటు ఇంకా పలు అంశాలు ఉన్నాయి. వాటిని ఇక్కడ పేర్కొనవలసిన అవసరం ఉంది

In 1829 I had printed Vemana. As this author satirises Brahmans, they dislike or scorn his volume and at their desire, the college board shelved it, and it was forgotten. About 50 copies were given me, and 450 disappeared after ten years I discovered these rolled up as waste paper in the library.’ అని C.P. Brown పేర్కొన్నారు. ఆనాడు విద్యావంతులు ఒక సామాజిక వర్గం నుంచే ఉన్నారు. ఆనాటి విద్యావంతులు అప్పటి సంప్రదాయాలు పద్ధతులను పాటించేవారు. కొన్ని పద్ధతులు, విధానాలు అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. కానీ అవే పద్ధతులు మరికొంత మందికి ఇబ్బంది కలిగించే విధంగానూ ఉంటాయి. ఆనాడు సమాజంలోని మూఢాచారాలు, పద్ధతులు అధిక సంఖ్యలో ఉన్న సామాన్య జనానికి ఇబ్బందికరంగా మారాయి. సమాజంలో ఉన్న ఈ పరిస్థితులు పాశ్చాత్యులకు ఒక అవకాశం దొరికింది. పాశ్చాత్యుల ముఖ్య ఉద్దేశం వారికి సంబంధించిన మతాన్ని, పద్ధతులను, సంప్రదాయాలను ఇక్కడి వారికి పరిచయం చేయడం. ఇటువంటి సందర్భంలో స్థానిక పరిస్థితులను, మూఢాచారాలను వెలుగెత్తి చూపిన ఒక స్థానిక కవి పాశ్చాత్యులకు అవసరమైన ఒక పరికరంగా కనిపించారు. వీటికి తోడు ఆనాడు అధిక సంఖ్యాక కవులు ఒకే సామాజిక వర్గం నుంచి ఉన్నారు. వేరే సామాజిక వర్గంలో ఒక కవిని చూడడమనేటువంటిది కొత్త విషయంగా కనిపించింది.

His family name he never discloses, and hence imagine him to have been a Zangam, the sect of Sudras.’

He was by birth a Capu or farmar’ - C.P. Brown.

Vemana was tipical Kapu and never tried to conceal the fact’ – W.H. Campbell

అని పాశ్చాత్య పరిశోధకులు పేర్కొనడాన్ని బట్టి వ్యవస్థలో కవికి సంబంధించిన వ్యక్తిగత విషయాల పైన పాశ్చాత్య పరిశోధకులకు ఆసక్తి ఉందని తెలుస్తుంది. తెలుగు సమాజాన్ని, భారతీయ సమాజాన్ని అర్థం చేసుకోవడానికి అందులో ఉన్నటువంటి లోటుపాట్లను తెలుసుకోవడానికి వారికి వేమన ఒక ప్రధానమైన కవిగా కనిపించాడు. ముఖ్యంగా ఆనాటి భారతీయ మతపరమైన అంశాలు పాశ్చాత్యులకు వింతగా కనిపించాయి. పాశ్చాత్యుల దృష్టిలో వారి సంప్రదాయం ఉన్నతమైనదిగా, వారి మతం అత్యుత్తమమైనదిగా భావించారు. అటువంటి సందర్భంలో భారత దేశంలో ఉన్నటువంటి ఆచారాలను మతాన్ని ఇక్కడి వారు విమర్శించడం వారికి చాలా పదునైన ఆయుధంగా కనిపించింది. ఆనాడు ఉన్న మతం గురించి W.H. Campbell - 'While there is no country in which religion occupies a more prominent place than in India, there is probably none in which the religious life of the people is more markedly unreal. Whatever Hinduism may have been in the past it is now a mere tissue of formalities, utterly incapable of exercising any real spiritual influence upon the lives of its votaries.' అని పేర్కొన్నారు. వేమన మన సమాజంలో ఉన్న మతపరమైన విశ్వాసాలను విమర్శిస్తూ పలు పద్యాలను రాశారు. వాటిని ఆంగ్లేయులు తమకు అనుకూలంగా వ్యాఖ్యానించుకున్నారు.

He (Vemana) Rejects Mahabharata, the great epic of India, as a pack of lies and describes the Vedas themselves as “courtesans which inspires with false hopes but are utterly unintelligible” (Holub, Robert C. Reception Theory: A Critical Introduction. P. 84).

“Vemana has no respect for Vedas. The Books that are called the Vedas are like courtesans, deluding men and wholly unintelligible, but the hidden knowledge of God is like an honourable wife” అని “W.H. Campbell R.M. Mac Donald పేర్కొన్నారు.

యన్. కోటేశ్వరి దక్షిణాంధ్రయుగసాహిత్యం అనే వ్యాసంలో “విజయ రాఘవ నాయకుడుకి 700 మంది భార్యలు 3400 మంది రాజదాసీలు ఉన్నట్లు చెబుతారు. అచ్యుతప్ప నాయకుడు చనిపోయినపుడు అతని 370 మంది భార్యలు సతీసహగమనం చేయమని ఒత్తిడి చేసినట్లు చెబుతారు” అని పేర్కొన్నారు. (రంగనాథాచార్యులు, కె. కె. (సంపా). తెలుగు సాహిత్యం మరో చూపు పుట- 179). చరిత్రలో ఇటువంటి దురాచార విషయాలు కొన్ని మాత్రమే. పేర్కొంటూ పోతే ఇటువంటి విషయాలకు పరిమితం లేదు. ఈ దురాచారాలు పాశ్చాత్యులకు చాలా అనుకూలంగా కనిపించాయి.

వేమన రచనలు: తెలుగు పరిశోధకుల/ విమర్శకుల దృక్పథం:

ఆచార్య వెలిదండ నిత్యానందరావు గారు వెలువరించిన విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన అనే గ్రంథంలో వేమనపై దాదాపు 15 పరిశోధన గ్రంథాలు వెలువడినట్లు సమాచారం కనిపిస్తుంది. ఇవి కాకుండా పలువురు పరిశోధకులు/ విమర్శకులు తమ అభిరుచి మేరకు రచనలను రచించారు. వేమన రచనల్లోని వివిధ అంశాలను చాలా కూలంకషంగా చర్చించారు.

సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక, తాత్విక అంశాలన్నింటినీ పరిశీలించారు. భక్తి సాహిత్యంలో భాగంగా కూడా చూశారు. విమర్శకులు కొంతమంది కొత్త పంథాలో వేమన సాహిత్య జీవితాలను విశ్లేషించే ప్రయత్నం చేశారు. వేమన సాహిత్య రచనలను, జీవితాన్ని సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ అంశాలన్నిటితోనూ విశ్లేషించే ప్రయత్నం చేశారు. భావవాదులు, భౌతికవాదులు వారికి నచ్చిన పద్ధతిలో వేమన రచనలను అనుశీలించారు. వీరు ఎన్ని రకాలుగా వ్యాఖ్యానాలు చెయ్యచ్చో, ఎన్ని రకాలుగా మాట్లాడవచ్చో అన్నీ చేశారు. కానీ కొన్నిచోట్ల విమర్శకులు కొంత వాస్తవానికి దూరంగా వెళ్లి విమర్శ చేసినట్లు కనిపిస్తుంది.

కొంతమంది వేమన అధ్యయన కేంద్రాలను, వికాస కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రత్యేక అధ్యయనాలు చేయడం మొదలుపెట్టారు. మరికొంతమంది వేమనను చారిత్రక భౌతిక వాద దృక్పథంతోను, విప్లవవాదిగానూ, అభ్యుదయవాదిగాను చెప్పుకుంటూ వెళ్లారు. ఒకరేమో వేమన విప్లవ వైతాళికుడు అని చెబితే, మరొకరేమో ప్రస్తుత కాలానికి వేమన అవసరమని చెప్పారు. కొంతమంది విమర్శకుల అభిప్రాయం ప్రకారం వేమనకు స్త్రీల పైన సదభిప్రాయం లేదని చెబితే, మరికొందరు వేమన స్త్రీ జనోద్ధరణ చేశారని నిరూపించే ప్రయత్నం చేశారు.

మరో విమర్శకుడు వేమన జైనమత ప్రచారకుడని నిరూపించే ప్రయత్నం చేశారు. ఈ అంశాలు అన్నీ కూడా వేమన వివిధ దృక్కోణాలు అనే పుస్తకంలో కనిపిస్తాయి. వేమన దర్శనం - విరసం పేరిట వక్ర భాష్యం అనే పుస్తకంలో మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు కనిపిస్తాయి. వేమన -విరసం విమర్శ- వినోద కాలక్షేపం మొదలైన వ్యాసాలలో వేమన పైన భిన్నమైన వ్యాఖ్యానాలు కనిపిస్తాయి. ఇటువంటి పుస్తకాలు ఇంకా చాలా ఉన్నాయి. వీటన్నిటిని ఇక్కడ విశ్లేషిస్తే చాలా పెద్ద వ్యాసం అవుతుంది. అయితే వీటి ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే వేమన అభ్యుదయ వాదులకు, విప్లవాదులకు తమ అభిప్రాయాలు వెలిబుచ్చుకొనే ఒక సాధనంగా మారారు. నచ్చిన పద్ధతిలో వ్యాఖ్యానించుకునే సౌకర్యం లభించింది. ఒక చర్చకు కావలసిన మసాలాలు అన్నీ విమర్శకులకు లభించాయి. వాస్తవం ఏమిటనేది పాఠకులే నిర్ణయించాలి. వీరిని భక్తి సాహిత్యంలో భాగంగా చర్చించారు. భక్తి సాహిత్యంలో రెండు వర్గాలు కనిపిస్తాయి. సనాతన ధర్మాన్ని ఆచరిస్తూ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ కనిపించేటువంటి భక్తి సంప్రదాయం ఒక వర్గం. సమాజంలో ఉన్నటువంటి దురాచారాలను రూపుమాపి సమసమాజం కోసం ప్రారంభమైనటువంటి భక్తి ఉద్యమంలో భాగస్వాములైన వారు రెండవ వర్గం వారు. వేమనను భక్తి ఉద్యమంలో భాగంగా రెండవ వర్గంలో చేర్చడం అనేటువంటిది పేర్కొనదగిన అంశం.

వేమన- జనామోద ధోరణి (పాపులర్ కల్చర్):

పాపులర్ కల్చర్ ను జనామోద ధోరణిగా పేర్కొంటున్నాము. పత్రికలు, సినిమా, మీడియా మొదలైనవాటన్నిటిని కలిపి పాపులర్ కల్చర్ కింద చూస్తున్నాము. ఈ జనామోద ధోరణి లేదా పాపులర్ కల్చర్ పుణ్యమా అని వేమన గారిని వెండితెర సంస్కృతిలోకి పాఠకులు తీసుకెళ్లారు. వేమన జీవితానికి సంబంధించిన సినిమాలు రెండు కనిపిస్తున్నాయి. 1947 లో వేమన యోగి పేరుతో సినిమా విడుదలయ్యింది. ఆ సినిమాలో చిత్తూరు నాగయ్యగారు నాయకుడిగా నటించారు. ఆ సినిమా చూడటానికి సౌకర్యంగా ఉంటుంది. తరువాత కాలంలో 1987లో విజయ్ చందర్ గారు శ్రీ వేమన చరిత్ర అనే పేరుతో సినిమా తీశారు. అయితే ఇందులో ప్రేమ వ్యవహారం ఎక్కువగా కనిపిస్తుంది. వేమన ఒక ప్రేమికుడిగా కనిపిస్తారు. వెండితెరకు కావలసిన అంశాలన్నిటిని పుష్కలంగా జోడించారు. మనం ఆరాధించే పాత్రలకు రంగులు అద్ది వ్యాపార సంస్కృతిలోకి తీసుకురావడం అనేటువంటిది గమనించాల్సిన విషయం. తర్వాత కాలంలో అటు వేమన గారి పైన పలు పాటలు, పద్యాలు.. వారికి సంబంధించిన ఇతర విషయాలు యూట్యూబ్లో దర్శనమిస్తున్నాయి. ఈ పాపులర్ సంస్కృతిలో నిజానిజాల స్థానంలో వ్యాపార అంశాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కొంతమంది పాఠకులు ఒక సాధారణ విషయాన్ని నచ్చిన రీతిలో మసాలాలు జోడించి వ్యాపార పద్ధతిలోకి మార్చేశారు. వేమనకు సంబంధించిన సమాచారం కార్టూన్స్ రూపంలోనూ మనకు కనిపిస్తూ ఉంది. పాపులర్ కల్చర్ లో, ఉన్న విషయాలకంటే కల్పితాంశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం వేమన విషయంలో అదే జరిగింది. చివరికి ఈ పాపులర్ కల్చర్ లో కనిపించేదే వాస్తవం అనే పరిస్థితి నేడు ఉంది. దేశీ సాహిత్యం, కవులు పాపులర్ కల్చర్ లోకి ఎలా వచ్చింది అని తెలుసుకోవడం కోసం వేమన జీవిత సాహిత్యాలను ఉదాహరణగా తీసుకోవచ్చు.

వేమన - జానపదుల దృక్పథం:

వేమన విగ్రహారాధనపై నిరసన వ్యక్తం చేసినట్లు కనిపిస్తుంది. కానీ జానపద సంస్కృతిలో వీరు జానపద దేవతగా మారిపోయారు. వీరికి ఆలయ నిర్మాణాలు చేసి పూజలు చేస్తున్నారు కడప మరియు రాయలసీమ ప్రాంతంలో యామయ్య స్వామి, వేమయ్య స్వామి అనే పేరుతో పిలుస్తూ ఉంటారు. స్వామి అనే పదానికి పలు అర్థాలు ఉన్నప్పటికీ ఇక్కడ దేవుడని అర్థంలో ఉపయోగిస్తున్నారు. విగ్రహారాధనను, పూజలు పురస్కారాలను తిరస్కరించిన వారికి తిరిగి అదే పద్ధతిలో వారిని పూజించడం ఇక్కడ పేర్కొనదగిన అంశం. కవులు ఏవైతే వద్దని పేర్కొన్నారో వాటిని జానపదులు తిరిగి కవులకు అందించారు. వేమన సమాజంలో ఏ ఫలితాన్ని ఆశించి రచనలు చేశారో అందుకు భిన్నంగా వ్యాఖ్యానాలు, సంప్రదాయ పద్ధతులు కనిపిస్తున్నాయి.

ముగింపు:

రీడర్ రెస్పాన్స్ థియరీ ద్వారా రచయిత చెప్పిన విషయాన్ని పాఠకుడు కొన్ని సందర్భాలలో భిన్నంగా వ్యాఖ్యానించు- కుంటున్నాడు. రిసెప్షన్ సిద్ధాంతం ప్రకారం రచయిత పాఠంలో చెప్పిన విషయం కంటే భిన్నమైన పద్ధతిలో పాఠకుడు స్వీకరిస్తున్నాడు. కొన్ని సందర్భాలలో వ్యాఖ్యానంలో, రచనని స్వీకరించడంలో పూర్తిగా భిన్నమైన పద్ధతిని అవలంబిస్తున్నారు. ఇదే విషయం వేమన సాహిత్యజీవితానికి అన్వయం చేసినప్పుడు పాఠకులు వారిని స్వీకరించిన విధానం భిన్న పద్ధతుల్లో ఉంది. రచయిత చెప్పిన విషయానికి పాఠకుల స్వీకరించిన పద్ధతికి పొంతన లేదు. రచయిత ఆశించిన ఫలితం, పాఠకుడు స్వీకరించిన అనుభవం భిన్నంగా ఉన్నాయి. వీటిని సరిదిద్దుకోవలసిన అవసరం ఉంది అని రిసెప్షన్ సిద్ధాంతం ద్వారా తెలుసుకుంటారు.

ఉపయుక్తగ్రంథసూచి:

తెలుగు పుస్తకాలు:

  1. ప్రభాకర్, ఎ. కె. (సంపా.) బహుళసిద్ధాంతాలు, ప్రమేయాలు, పరికరాలు. హైదరాబాద్: _______, 2019.
  2. రంగనాథాచార్యులు, కె. కె. (సంపా). తెలుగు సాహిత్యం మరో చూపు. హైదరాబాద్: ఆంధ్ర సారస్వత పరిషత్, 1990.
  3. వెంకటేశ్వరరావు, త్రిపురనేని. వేమన వివిధ దృక్కోణాలు. విజయవాడ: వేమన వికాస కేంద్రం, 1982.
  4. వేమన దర్శనం - విరసం పేరిట వక్రభాష్యం. విజయవాడ: వేమన వికాస కేంద్రం, 1982.

ఆంగ్ల పుస్తకాలు:

  1. Holub, Robert C. Reception Theory: A Critical Introduction. London and New York: Methuen, 1984.
  2. Venkateswar Rao, Narla.(Ed.) Vemana Through Western Eyes. ________: Seshachalam, 1969.

సినిమాలు:

  1. యోగి వేమన. కె. వి. రెడ్ది (దర్శకుడు), చిత్తూరు నాగయ్య (నాయకుడు), వాహినీ స్టూడియో, 1947.
  2. శ్రీ వేమన చరిత్ర. సి. ఎస్. రావు (దర్శకుడు) విజయచందర్ (నాయకుడు), రాధా మాధవ చిత్ర, 1986.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]