AUCHITHYAM | Volume-04 | Issue-03 | March 2023 | ISSN: 2583-4797
9. తెలుగులో వ్యాస స్వరూపం: దాని నిర్మాణం
యెల్చాల నర్సింలు
పరిశోధకులు, తెలుగుశాఖ
ఉస్మానియా విశ్వవిద్యాలయం
హైదరాబాదు, తెలంగాణ
సెల్: +91 9247335278. Email: yelchalanarsimlu.yn@gmail.com
Download PDF
Keywords: వ్యాసప్రక్రియ, స్వరూపం, నిర్మాణం, వచనవిన్యాసం, నర్సింలు
ఉపోద్ఘాతం:
ఆధునిక తెలుగు సాహిత్యప్రక్రియల్లో వ్యాసానికి నేడు అత్యున్నతస్థానం ఏర్పడింది. సాహిత్యంలోని అన్ని ప్రక్రియలను వివరించేది వ్యాసమే. రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక మొదలైన అన్ని విషయాలను సామాన్యపాఠకులకు అందించేది వ్యాసం. మానవ సమాజానికి సంబంధించి వివిధ రంగాలలో వస్తున్న మార్పులననుసరించి విశ్లేషణ, పరిశోధన, తార్కికత మొదలైన అంశాలతోపాటు ఆత్మీయత, ఆలోచనా ధోరణులకు ప్రాతినిథ్యం వహిస్తూ వచనసాహిత్యంలో భాగంగా విస్తృతంగా వ్యాప్తిలో ఉన్న ప్రక్రియ వ్యాసం. ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దాన్ని వ్యాసరూపంలో రాయడం, దాన్ని స్పష్టంగా, సమగ్రంగా నిర్వచించడం కష్టం. వస్తువులో, ప్రయోజనంలో, శైలిలో, నిర్మాణంలో, వైవిధ్యం చూసినప్పుడు ఒకటి రెండు వాక్యాలలో వ్యాసస్వరూపాన్ని తేల్చి చెప్పడం అసాధ్యం.
వ్యాసనిర్వచనాలు:
ఆంగ్లసాహిత్య సంబంధంవల్ల తెలుగులో ఆవిర్భవించిన అనేక ప్రక్రియల్లో వ్యాసం ఒకటి. ఆంగ్లంలో ‘ఎస్సే’ అనే మాటకి సమానార్థంగా వాడే ప్రక్రియ వ్యాసం. వ్యాసం అనే మాటకు కొందరు వారివారి అభిప్రాయాలను జోడిస్తూ పదప్రయోగాలు చేశారు. అనేక దేశవిదేశభాషలుగా, తెలుగువారికి దగ్గరయిన ఫలితంగానే తెలుగు భాషలో ఆధునికసారస్వతప్రక్రియలకు బీజన్యాసం జరిగిందనీ, విశేషించి ఆంగ్లసాహిత్యప్రభావం వల్లనే తెలుగులో ‘వ్యాసప్రక్రియ’ అవతరించిందనీ, పలువురు విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. ‘వ్యాసం’ అనే పదాన్ని మొట్టమొదట బ్రౌన్ నిఘంటువు పేర్కొన్నది. వ్యాసం శబ్దానికి అర్థం – ‘విస్తరించు ప్రయత్నం’, ‘పరిశీలన’ అనే అర్థాలున్నాయి. “ఏ విషయాన్నైనా తెలుసుకొని, దానిలోని అంశాలను విభజించి, వివరించి చెప్పడం వ్యాసం’’ అని భాషాసమితి విజ్ఞాన సర్వస్వంలో పేర్కొన్నారు.
‘వ్యాసం అన్నది ఒక చింతనం, ఒకానొక మానసిక స్థితిలో రచయిత తనకు తానుగా తనలో తాను వ్యక్తం చేసుకొనే వాగ్వైఖరి’ అని ఏ.సి. బెన్సన్ నిర్వచించారు. ఇతని దృష్టిలో వ్యాసం అంటే వచనకారుని స్వేచ్ఛను, వాగ్గేయకారుని గీతరచనల్లోని నిర్మాణ కౌశలాన్ని పొదువుకొన్న రచన వ్యాసం. ‘స్నేహ పరిచయాలతో చుట్టుముట్టేట్లుగా పాఠకుణ్ని ఆకట్టుకొని ఆశ్లేషించి పరవహింపజేసేది వ్యాసం’ అని వర్జీనియా ఉల్ఫ్ పేర్కొన్నాడు.
తెలుగులో వ్యాసానికి మార్గదర్శకుడు స్వామినేని ముద్దు నరసింహనాయుడు. ఇతని ‘హితసూచని’ అనే తన వ్యాస సంపుటిలో ‘ప్రమేయం’ అనే మాటను ప్రయోగించారు. పరవస్తు వేంకట రంగాచార్యులు వ్యాసాన్ని ‘సంగ్రహములు’ అని వ్యవహరించారు. అలాగే కందుకూరి వీరేశలింగం పంతులు వ్యాసాన్ని ‘ఉపన్యాసం’ అని వ్యవహరించారు. తర్వాత గురజాడ అప్పారావు తన ‘వ్యాస చంద్రిక’ అనే గ్రంథంలో ‘వ్యాసం’ అన్న పేరును ప్రయోగించి బహుళ వ్యాప్తిలోకి తెచ్చిన ప్రథములు వీరు. ఇతని వ్యాసాలు వ్యావహారిక భాషకు చాలా దగ్గరగా ఉంటాయి. వ్యాసరచన, వ్యాసం అనే పదాలు అంతకుముందు ఉన్నప్పటికీ ప్రక్రియాపరంగా మొదట వాడింది గురజాడవారే. గిడుగు, కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి మొదలైనవారంతా ఇతోధికంగా వ్యాస ప్రక్రియను పరిపుష్టం చేశారు.
వ్యాస స్వరూపం:
వ్యాసనిర్మాణంలోనూ మనం కొన్ని సూత్రాలను సంభావించుకోవచ్చు. అంటే విశిష్టవ్యాసంగా పరిగణించే ఏ రచనలోనైన అర్థక్రమం ఉండాలి. సంబంధముండాలి. పరిపూర్ణత భాసించాలి. మాధుర్యముండాలి. ఔదార్యముండాలి. స్పష్టత ఉండాలి. ఆధునిక విమర్శకులు వ్యాసరచనావిశేషాన్ని విశ్లేషించి ఈ నియమాలుంటాయన్నారు. నిడివిలో వ్యాసం అతిదీర్ఘంగా ఉండక క్లుప్తంగా, సంగ్రహంగా ఉండాలి. పుటలు నియతంగా ఉండాలి. రచనలో ఏ విషయమైనా నిర్దిష్టంగా ఉండాలి. వ్యాస ప్రకరణాన్ని బట్టి ప్రత్యేక ఉపశీర్షికలు ఉండాలి. భాష నిర్దుష్టంగా సులభగ్రాహ్యంగా ఉండాలి. నిర్మాణంలో ఉపక్రమం- ఉపపాదనం - ఉపసంహారం క్రమంగా పాటింపబడాలి. వచనత్వం దీని ప్రధానలక్షణం. రచయిత వ్యక్తిత్వం ప్రదర్శితమయ్యేలాగా వ్యాసరచన ఉండాలి.
“ప్రాచీనవేదఋక్కుల కాలం నుంచి నేటివరకూ అంతర్బహిరాకృతుల్లోనూ, పారిభాషిక నామపద వ్యవహృతిలోనూ, వైవిధ్యాన్నీ, వైలక్షణ్యాన్నీ పొందుతూ దేశకాలానుగుణంగా వ్యాసవాహిని ప్రవహిస్తూ వస్తుంది. నేటికి తెలుగులో ఒక సాహిత్య- ప్రక్రియ యొక్క పారిభాషిక నామంగా స్థిరపడినట్టి వ్యాసపదం పూర్వకాలల్లో భిన్నభిన్న దేశాల్లో భాషాసాహిత్యాల్లో భిన్నభిన్న పారిభాషిక నామాన్ని స్వీకరించి ఆయా సాహిత్యప్రస్థానాలకు ఉద్దీపనాన్ని ఉత్తేజాన్ని కలుగుజేసింది. ఇప్పటికీ అలా కలుగజేస్తుంది కూడా. ప్రాచీన సంస్కృతంలో వేదసూక్తముల తర్వాత అప్పటి వ్యాస స్వరూప విషయాల్ని బట్టి భాష్యం లేక వ్యాఖ్య మీమాంస మొదలైన పదాలు పదానికి ప్రయత్నం అనే అర్థాన్ని మొదట రాసి మరొక అర్థాన్ని రాయడం లేదు.” (శ్రీశ్రీ వచన విన్యాసం - శ్రీశ్రీ, పుట. 3)
భిన్న విషయాలపైన భిన్న పద్ధతులలో రాసిన వ్యాసాలను పరిశీలించినప్పుడు విషయంలోను, నిర్మాణంలోను చాలా తక్కువగా సామ్యం కనిపిస్తుంది. ఈ కారణం వల్ల వ్యాస స్వరూపాన్ని వివరించి చెప్పడం మరీ క్లిష్టమవుతుంది. క్రమంగా వ్యాసం నిర్మాణంలోనూ, స్వభావంలోనూ, విషయ వైవిధ్యంలోనూ, అది సాధించిన ప్రయోజనంలోనూ ఎంతో పుష్టిని చేకూర్చుకోసాగింది. వ్యాస విమర్శకులు వీటిని రకరకాలుగా విశ్లేషించి తనదైన శైలిలో చూపించారు.
ఆధునిక వ్యాసం తర్కసహమైన ఆలోచనకు, నిర్మాణసౌష్ఠవానికి, సృజన కళాతత్త్వానికి, పేరెన్నికగన్నది. కష్ట సాధ్యము ఆనందదాయకము అయిన ఇలాంటి సాహిత్యాభివ్యక్తియే వ్యాసం అని సేంబొవె పేర్కొన్నారు. వ్యాసాలను విషయం కోసం చదువుతున్నామే గాని, వ్యాస నిర్మాణంలోని మెలకువలను తెలుసుకోవడానికి కూడా చదవాలి. పాఠకులకు వ్యాసం సుబోధకంగా ఉండాలంటే వ్యాస రచయిత ఎక్కువ శ్రమ పడాలి. వ్యాస రచయిత ఒక్కరు ఎంతగా కష్టపడితే, వేల లక్షలాది పాఠకులు అంతగా సుఖపడతారు.
వ్యాస నిర్మాణం:
నిర్మాణం స్పష్టంగా ఉండాలి. అనేకమైన శీర్షికలు, ఉపశీర్షికలు ఉన్నాయి, చిత్రాలు, బొమ్మలు తగినస్థలంలో, అనుబంధం, పాదసూచికలు చివర్లో ఉన్నాయి. చాలావరకూ వ్యాసాలకు, విషయం కాల క్రమానుసారంగానో, నేపథ్యాన్ని అనుసరించో ఏర్పాటు చేస్తారు.
విషయానికి సంబంధించిన అనేకాంశాలు సమతుల్యంగా ఉన్నాయి. ఏ అంశమూ వ్యాసం మొత్తాన్ని ఆక్రమించుకోదు, అన్ని ముఖ్యాంశాలకూ న్యాయం జరిగింది. బాగా ముఖ్యమైన అంశాలు వ్యాసంలో ఎక్కువ చోటు కల్పించుకున్నాయి. ఉదాహరణకు ఓపిల్లి జాతికి సంబంధించిన వ్యాసంలో సుదీర్ఘమైన వివరణ ఆజాతి స్వభావం గురించి ఉండి, శారీరక లక్షణాల గురించి అతికొద్ది సమాచారం ఉండడం, అసలే సమాచారం లేకపోవడం జరిగితే అదిమంచి సమతుల్యమైన వ్యాసం కాదు. “వ్యాసంలోనే కాక - ఏ రచనా నిబంధంలోనైనా సరే మనోభావాలు (Thought patterns) అక్షరాకృతిని పొందే దశలో జరిగే ప్రక్రియను సమాచార విశేషజ్ఞులు (communication Experts) విశ్లేషించి చూపారు. సాధారణంగా మనం రాస్తూ రాస్తూ పరిష్కరించుకొంటూ రాస్తూ పోతాము. ఏ వ్రాయసగాని First Draft ని పరిశీలించినా తుడుపులు కొట్టివేతలతో నిండిన రచనా వ్యాసంగం దానికి సాక్ష్యం పలుకుతుంది. అదిలోనే హంస సాదమన్న సామెత ఆ అనుభవంలోంచి పుట్టినదే. రాయడమన్నది సృజన. (Creative) ధర్మం. తుడిపి కొట్టివేయడమన్న పరిష్కరణ చర్య తద్విరుద్ధమైన విమర్శ (critical) ధర్మం. ఇలా రెండూ కలిసి పనిచేయడంలో కాలా హరణంతో పాటు రెండు సరిగా నిర్వాహం చెందని స్థితి ఏర్పడుతుందన్నది అనుభవైక వేద్యమంటారు”. (తెలుగు వ్యాసవిలాసం - వేటూరి ఆనందమూర్తి, పుట. 80)
వ్యాస వచన రచన చేస్తున్నప్పుడు విషయ ప్రతిపపాదన పదునుగా ఉండాలంటే సాంకేతిక పదజాలం తప్పనిసరి అవుతుంది. అది మితిమీరితే విషయం దురవగాహనమై పాఠకులకు చికాకు కలిగిస్తుంది. అలాంటి పదజాలాన్ని చాలా పరిమితంగా వాడాలి. వ్యాసం రాసేప్పుడు పద దోషాలు లేకుండా, వాక్య నిర్మాణంలో లింగవచన సంవాద లోపం రాకుండా చూసుకోవడం; విసుగుగొల్పే మాటల కూర్పును, చేట భారత కథనాన్ని పరిహరించడం; రచనలో హేతుబద్ధమైన పూర్వపర సంబంధాన్ని కాపాడడం; చెప్పదలచిన విషయాన్ని సమర్ధంగా పొందికతో చెప్పడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం వలన రచనా నిబంధానికి అందం వస్తుంది. ఆధునికులు చెప్పిన ఈ అంశాల్లో చాలా వాటిని మన ప్రాచీనాలంకారికులూ చాలా మంది పరిహరించవలసిన కావ్య దోషాలను, పరిగణించవలసిన కావ్య గుణాలను చర్చించే సందర్భాలలో చెప్పే ఉన్నారు.
వ్యాస నిర్మాణంలో వ్యాసకర్త వ్యూహం, ఎత్తుగడలు, చిన్న వ్యాసం, సమగ్ర వ్యాసం మొదలైనవి ఉంటాయి. వ్యాసానికి ఒక నిర్మాణం ఉంటుంది. అయితే అది అన్ని వ్యాసాలకూ ఒకే రకంగా ఉండదు. విషయ పరిధిని బట్టి అది మారుతుంది. వ్యాసకర్త వ్యాసంలో ఏం చెప్పాడు అనే ప్రశ్న పాఠకుడు వేసుకోవలసి వస్తే ఆ వ్యాస నిర్మాణంలో కూడా లోపాలున్నాయనుకోవచ్చు. వ్యాసంలో చెప్పదలుచుకున్న విషయం ఏమిటి అన్నది ఒక అంశం. అయితే, దాన్ని పాఠకుల మనసులకెలా ఎక్కించాలన్నది మరో అంశం.
“వ్యాస పరిమితుల నధిగమించని నిడివి చదివించే శైలి ఉండడంతో పాటు పాఠకుల్ని ఆలోచింపజేసే ధర్మం కూడా ప్రస్ఫుటంగా ఉంటున్నది. దీనికి బహుళ: Johnson essay కిచ్చిన నిర్వచనం A loose sally of the mind, an irregular undigested piece, not a regular and ordinary composition అన్నది ప్రేరకమై ఉండవచ్చు. Addison అన్నట్లు casual gossip - పిచ్చాపాటీ కబుర్లు కాక, Johnson చెప్పినట్లు irregular undigested loose sally of the mind ఉబుసుపోకకు కచ్చా పచ్చాగా కూర్చిన మానస విచారమూ కాక ఆరెంటినీ కూర్చుకొని ఆలోచింపజేసే రచనా ధర్మం ప్రధానంగా గలదే. ఈ unstructured essay అన్నది. ఈ విధంగా తెలుగు వ్యాసరచన కూడా నిర్మాణ విషయంలో ఇటీవలి కాలంలో నవ్య ప్రయోగాలకు గురై కూర్పులోనూ పరిష్క్రియలోనూ కొత్త రూపును దిద్దుకొంటూనే ఉన్నది”. (నవ్యసాహితీ లహరి వేటూరి ఆనందమూర్తి, పుట.85)
ముగింపు:
వ్యాసం రాయడానికి ముందు రచయిత ఒక చక్కని ప్రణాళికను రూపొందించుకోవాలి. అప్పుడే వ్యాస రూపకల్పన అవుతుంది. అంటే వ్యాసం సమగ్రం అన్నమాట. వ్యాస విభజనలో శీర్షికలు, ఉపశీర్షికలు, పేరాలు, కాలాదులు మొదలైన విషయాలు ఏ అంశం ఎక్కడ చెప్పాలో ముందుగానే ప్రణాళికను వేసుకొని వ్యాసం రాస్తే అది మంచి వ్యాసం అవుతుంది. వ్యాసానికి సంబంధించిన అంశాన్ని ముందుగానే ఊహించి స్థూలంగా నిర్ణయించుకోవాలి. ఈ నమూనా ప్రణాళికను తయారు చేయడానికి ఎంతో ఆలోచన, అనుశీలన అవసరం. వీలయినంత వరకు అనుభవజ్ఞులయిన వ్యాసరచయితలతో, పరిశోధకులతో చర్చలు సాగిస్తూ వారి సలహాలను పాటిస్తూ వ్యాసరచనను ముందుకు సాగించాలి. అప్పుడే అది సమగ్ర వ్యాసంగా రూపొందుతుంది. వ్యాసం ఎప్పుడూ వివరంగా సుబోధకంగా ఉన్నప్పుడే పాఠకుడికి సులభమవుతుంది.
ఉపయుక్తగ్రంథసూచి:
- చంద్రశేఖర్ రెడ్డి, డి., (సంపాదకులు) కె.కె.ఆర్ రచనలు, సంపుటి 1, ఎమెస్కో ప్రచురణలు, హైదరాబాదు, 2022
- నాగయ్య జి., తెలుగు సాహిత్య సమీక్ష, రెండవ సంపుటి, నవ్య పరిశోధక ప్రచురణలు, తిరుపతి, 2003
- ఇనాక్ కొలకలూరి - తెలుగు వ్యాస పరిణామం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాదు, 2001
- వెంకటేశ్వర్లు బూదాటి తెలుగు సాహిత్య విమర్శ, హిమకర్ పబ్లికేషన్స్, 2012
- ఆనంద మూర్తి వేటూరి - నవ్య సాహితీ లహరి, యువభారతి ప్రచురణ, హైదరాబాదు, 1987
- చెంచయ్య వి - వ్యాస రచనా శిల్పం, విప్లవ రచయితల సంఘం, నెల్లూరు, 2009
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.