AUCHITHYAM | Volume-04 | Issue-03 | March 2023 | ISSN: 2583-4797
7. కథాసాహితి కథల సంకలనాలు: ఆదివాసుల అస్తిత్వచిత్రణ
లెంక సత్యనారాయణ
పరిశోధకులు, ఆంధ్రవిశ్వవిద్యాలయం
అసిస్టెంట్ ప్రోఫెసర్, తెలుగు, ప్రభుత్వ డ్రిగీకళాశాల
నర్సంపేట, వరంగల్ రూరల్ జిల్లా, తెలంగాణ రాష్ట్రం - 506 132
సెల్: +91 9989732382. Email: lenkasatayanarayana@gmail.com
Download PDF
Keywords: కథ, ఆధునిక సాహిత్యం, కథాసాహితి, వాసిరెడ్డి నవీన్, ఆదివాసులు, సంస్కృతి, జీవనవిధానం, నాగరికత, అభివృద్ధి, విధ్వంసం ప్రపంచీకరణ, మల్లిపురం జగదీష్, అట్టాడ అప్పలనాయుడు.
ఉపోద్ఘాతం:
కథాసాహితి కథా వార్షిక సంకలనాల ప్రచురణ సంస్థ. కథా వార్షిక సంకలనాలు రావడానికి ప్రధాన కారులు చేకూరి రామారావు, హరి పురుషోత్తమరావు, హైదరాబాద్ బుక్‌ట్రస్ట్ (హెచ్‌బిటి) అనుసంస్థ. ప్రజాసాహితి పత్రికా సంపాదకుడుగా పని చేసిన వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ కథా సాహితి వార్షిక కథల సంకలనాలకు ప్రధాన సంపాదకులు. నూతనమైన శైలి, శిల్పాలతో, కథా వస్తుకుసంబందించిన కొత్తదనం, సమకాలీనమైన సమస్యలను, విస్మృత వర్గాల జీవిత చిత్రణను వాళ్లయాస భాషలో చెప్పడం ఈ కథా సంకలనాల ప్రత్యేకత. తెలుగు కథను వందేళ్ళపాటు వర్థిల్లునట్లు చెయ్యడంకథా సాహితి వారి కథాసంకలనాల లక్ష్యం.
కథాసాహితి కథల సంకలనాలో ఆదివాసుల జీవిత చిత్రణ, వారి అస్తిత్వానికి చెందిన కొన్ని కథలు గలవు. ఆ కథల ద్వారా ఆదివాసుల అస్తిత్వాన్ని నిరూపించడం, ఆదివాసులు తమ అస్తిత్వాన్ని కోల్పోవడానికి గల కారణాలు విశ్లేషించడం ఈ వ్యాసము యొక్క ముఖ్య ఉద్దేశ్యము. ఆదివాసులు తమ జీవిత మూలాలను విడిచిపెట్టి పరాయికరుణ చెందడానికి పెక్కు కారణాలున్నాయి. అభివృద్ధిలో భాగంగా గిరిజనుల జీవనశైలిలో మార్పులు రావడం, వ్యాపారం పేరుతో తెలివి గల పల్లపు ప్రజలు ఆదివాసుల అమాయకత్వాన్ని దోచుకొవడం, పరుగులు తీస్తున్న ప్రపంచీకరణ ప్రభావం, అభివృద్ధి పేరుతోఅమాయకులైన ఆదివాసులకు అటవీ భూములుపైన, ఉత్పత్తులు పైన అధికారం లేకుండా చెయ్యడం మొదలైన అనేక అంశాలు మూకుమ్మడిగా దాడిచేసి ఆదివాసులు తమ అస్తిత్వాని కోల్పోయేటట్లు చేసినవి. ఈ అంశాలు మల్లిపురం జగదీష్ రాసిన శిలకోల, ఇప్పమొగ్గలు కథల్లోను, అట్టాడ అప్పుల నాయుడు రాసిన చిటికినవేలు కథ ద్వారా నిరూపించబడుచున్నవి.
ఆదివాసులు - విషయపరిచయం:
భారతదేశంలో సామాజిక వ్యవస్థకు, విద్యకు దూరమై ఏ మాత్రం అభివృద్ధిని సాధించని ఆదివాసులు ఈ దేశంలో ఎందరోగలరు. రాజ్యాంగములోని 342వ ఆర్టికల్ ప్రకారం 500గిరిజన తెగలు ఉన్నట్లు తెలుస్తుంది. గిరిజనులను ఆదివాసులుగా పరిగణిస్తున్నాము. ఆది అంటే మొదట అనీ, ఆదివాసులంటే మొదటి నుండీ ఈ భూమిపై ఉన్నవాళ్ళు అని అర్థం. ‘‘గిరిజనులు పదంలోని గిరి అంటే కొండ అని, జనులంటే ప్రజలని భావము. కొండ ప్రాంతాల్లో నివసించే వాళ్లని అర్ధం. ఉత్తర భారతీయ భాషల్లో గిరిజలను ఆదివాసులంటారు.’’1 ఆదివాసుల జీవిత చరిత్రను తెలుసుకోడానికి వారి చారిత్రక సమాచారం కొంత వరకు దోహదపడుతుంది. ‘‘ప్రాచీన ఆచారాలను సంప్రదాయాలను వీడకుండా కొండల్లో కోనల్లో అనాగరికంగా జీవిస్తున్న తెగలను గిరిజనులు అని అంటారు. కొండల మీదనే తొలుత నివాసాలు కల్గి ఆటవిక సంపదనే తమ జీవితానికి ఉపాధిగా గ్రహించిన వారిని, కొండల్లో ఉండే కొద్దిపాటి చదును ప్రదేశాన్ని గుర్తించి అక్కడ ఎదిగిన చెట్లును కూల్చి పొడు వ్యవసాయం చేసుకొనే వాళ్ళను కొన్ని తెగలుగా ప్రభుత్వం గుర్తించింది. వీళ్ళంతా గిరిజనులు.”2 పైన చెప్పబడిన అంశాలను పరిశీలించినపుడు ఆదివాసుల మూలాలు, వారి ఉనికి కొంత వరకు తెలుస్తుంది.
కథాసాహితి కథల ద్వారా ఆదివాసుల అస్తిత్వనిరూపణ:
శిలకోల: ఈ కథ కథాసాహితి వారి కథల సంకలనం కథ 2009లో ముద్రించబడినది. ఈ కథలో చామంతి ప్రధానపాత్ర. ఒక గిరిజన స్త్రీ తన అస్తిత్వాన్ని నిలుపుకొడానికి చేసే ప్రయత్నం ఈ కథలో కన్పిస్తుంది. వ్యాపారం పేరుతో వచ్చిన పల్లపు గిరిజనేతర వ్యక్తి ఒక గిరిజన స్త్రీని భోగ వస్తువుగా మార్చి వాడుకోవడం, గిరిజన పథకాల ద్వారా వచ్చిన లబ్ధిని పొందడం, అమాయకులైన గిరిజన జాతిని అవమానించడం, చివరకు తన ద్వారా పుట్టిన కూమారైను పార్టీ టిక్కెట్ కోసం రాజకీయ నాయకులపక్కలోకి పంపించడానికి వెనుకాడని రాక్షసుడు నుంచి చామంతి తన అస్తిత్వాన్ని కాపాడుకోడానికి చేసిన పోరాటం ఇందులో చెప్పబడిరది.
జగన్నాధం వ్యాపారం పేరుతో వచ్చి గూడెంలో చామంతి తండ్రికి అప్పిచ్చి కందులు, జన్నలు తీసుకొనేవాడు. పొగాకు ముక్క, సారా చుక్క రుచి చూపించి కాంట్రాక్టర్‌గా అవతరించి చామంతి తండ్రి పేరు మీద శాంక్షనైన పనిని తాను నేస్తంతో వేలిముద్రలు వేయించుకొని, పనిపూర్తిచేసి లాభపడ్డాడు. ‘‘ఎదుటివాళ్లను నమ్మడం ఈ నేల గొప్పతనమో, అమాయకత్వమోగాని ఆ నమ్మకాన్ని సొమ్ము చేసుకోవడం మాత్రం పల్లపొడి నైపుణ్యం.’’3 స్వచ్ఛమైన అమాయకులైన గిరిజనులు తెలివిగల పల్లపోని మోసానికి బలికావడం అనాదిగా జరుగుతుంది. పదవ తరగతి వరకు చదువుకున్న చామంతికి గూడెంలో టీచర్ ఉద్యోగం రాగా ఆమెను నమ్మించి తనకు పెళ్ళి జరిగిన విషయం చెప్పకుండా వివాహం చేసుకున్నాడు. ఈ విషయం చామంతికి తెలిసేటప్పటికి చామంతి గర్భవతి. ఈ విధంగా చామంతి జీతానికి, జీవితానికి అధికారి జగన్నాధం. కట్టుబాట్లును వదులుకున్న తనకు తగిన శిక్ష పడిరదని చామంతి బాధపడిరది. చామంతి తల్లిదండ్రులు గోచిగుడ్డలతో, పాతబట్టలతో పోడు చేసుకొనేవారు. సెల్‌ఫోన్, టీ.వి, ఫ్రిజ్‌లు చామంతి ఇంటికి వచ్చి చేరాయి. హైహీల్స్, కొత్తచీరలు, సెంటులు చామంతికి వచ్చాయి. ఇవన్నీ ప్రపంచీకరణ ఫలితమే. వీటి వలన ఆదివాసుల మూలాలు క్రమంగా తొలగిపోతున్నవి. గిరిజన జాతి సంస్కృతిని పూర్తిగా ధ్వంసం చేస్తున్నది ఈ ప్రపంచీకరణ. ‘‘సంస్కృతి అంటే కేవలం ఆట, పాట, సంగీతం, సాహిత్యం మాత్రమేకాదు. ప్రజల యొక్క జీవన విధానం సంస్కృతి. సమస్త మానవ సంబంధాల సారం సంస్కృతి. ప్రజల హృదయాలలో కదిలి భావాలలో మెదిలి దైనందిన చర్యలతో ప్రదర్శితమయ్యే జీవితాచరణే సంస్కృతి. మనం నాగరికత యొక్క ఏ పొరల మీద జీవిస్తున్నాయె తెలియపరిచే కొలబద్ద సంస్కృతి.’’4
గిరిజనుల గొప్ప సంస్కృతిని, జీవన విధానాన్ని ప్రపంచీకరణ మార్చేస్తుంది. చామంతి జీతం డబ్బులతో చిట్టీలు వేసి గూడెంలోగల భూములను కొని వాటిని చామంతి పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించగా లాభాలు జగన్నాధం సొంతమౌతున్నాయి. కారణం 1/70 చట్టం ప్రకారం గిరిజన ప్రాంత భూములు తన పేరు మీద ఉంటే అవి చెల్లవుగనుక జగన్నాధం అలా చేసాడు. జగన్నాధం యస్టీ నియోజక వర్గం టిక్కెట్ భార్య పేరుమీద పొంది తాను చక్రం తిప్పాలనుకున్నాడు. చామంతి తన ఉద్యోగాన్ని వదులుకోడానికి ఇష్టపడలేదు. ‘‘బోడి ఉద్యోగం పట్టుచీర కట్టుకోడానికిస్తే చింకి పాతకి సాపిందట ఒకిర్తి అలాగున్నదినీ వరస. అందుకే అన్నారు మిమ్మల్ని కొండోళ్లని’’ అని జగన్నాధం లేడి మాంసపు రుచికి అలవాటుపడ్డ పులిలా చామంతి సర్వస్వాన్ని అపహరించి చివరకు గిరిజన జాతినే హేళన చేస్తాడు. పార్టీ టికెట్‌పొందే ప్రయత్నంలో భాగంగా గెస్ట్‌హౌస్‌లో ఇంచార్జ్ వద్దకు పాంపాలి, పాపను పిలుపించమన్నపుడు చామంతి గుండెల్లోకి శిలకోలగుచ్చినట్లైంది. ప్రతిజీవి తనమనగడకు ప్రతిబంధకము కలిగినపుడు ఏదో రకంగా తనను తన జాతిని కాపాడే ప్రయత్నం చేస్తుంది. అది జాతి ధర్మం. అది జీవిత ధర్మం. కాబట్టి చామంతి జగన్నాధంను గట్టిగా కాలితో తన్నగా మల విసర్జనాల మధ్య పడ్డాడు. ఈ విధంగా ఆదివాసి స్త్రీ చామంతి తన ఆస్తిత్వాన్ని కాపాడుకుంది.
ఇప్పమొగ్గలు:
ఈ కథ కథా సాహితి వారి కథల సంకలనం కథ 2011లో ముద్రించబడినది. మారుతున్న కాలానికి అనుగుణంగా తాను మారకుండా తన జాతి అస్తిత్వాన్ని, వ్యక్తిత్వాని నిలుపుకోడానికి పోరాటం చేసిన యువతి బూది ఈ కథలో ప్రధానపాత్ర. బూది బాల్యమంతా అక్క జ్యోతి బూజాలపైనే సాగింది. జ్యోతి ఐ.టీ.డి.ఏలో ఏయెన్నెమ్ ట్రైనింగ్ చేసింది. పట్నవాసిని నమ్మిమోసపోయి ఆత్మహత్యచేసుకుంది. ‘‘మంచిపిల్ల వాడి మాయలో పడిపోయింది. వాడి కాంట్రాక్ట్ పనులు కోసం పిల్లని వాడుకున్నాడు ఎన్నాళ్ళని భరించగలదు. మనసుచంపుకోలేక..ప్చ్.’’5 బూది అక్క తెలివైన పట్నపోని చేతిలో మోసపోయి జీవితానికి ముగింపు పలికింది. బూది తన జాతికి కలిగే అవమానం, కష్టాలను ధైర్యంతో ఎదిరించింది. గిరిజన సహకార సంస్థలు, ఐ.టీ.డి.ఏలు, గిరిజనాభివృద్ధికి తోడ్పాటునందించాలి. కాని ఆ సంస్థలు, అందులో ఉద్యోగులు ఇంకా ఆదివాసులును అనాగరికులుగా భావించి అవమాన-పరుస్తున్నారు. బూది హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులో డిప్లొమా పూర్తి చేసింది. సర్టిఫికెట్లతో ఉద్యోగానికి ఎదురుచూస్తుంది. ‘‘మారుతున్న కాలంలో గిరిజనులు మారాలి. సభ్యసమాజంతో కలిసి నడవాలి. పోటీపడాలి. అభివృద్ధి సాధించాలని’’ పీవో చెప్పాడు. మారుతున్న కాలానికనుగుణంగా గిరిజనులు మారాలని కొరుకున్న సభ్యసమాజం దానిని హర్షించడం లేదు. జాతిని అవమానపరుస్తుంది.దూరం పెడుతుంది. హోటల్ మేనేజ్‌మెంట్ డిప్లొమా సర్టిఫికేట్‌తో ఉద్యోగానికి దరఖాస్తు చెయ్యడానికి ఐ.టీ.డి.ఏకు వెళ్ళినపుడు ఆఫీసులో గుమస్తా ‘‘బ్రీడో..హైబ్రీడు ఆరోజుల్లో ఏజెన్సీని పల్లపోలు ఒక తిన్నగవుం చేరేటి? షావుకార్లు, సోండీలు, పోలిసు... ఆళలోనయిదీ’’ అని తన జాతి అందచందాలు అనుమానించి మాట్లాడం బూదికి చాలా దు:ఖాన్ని తెప్పించింది.
ప్రకృతి ఒడిలో గిరి అందచందాల నడుమ అచ్చమైన ఆహ్లాదంలో కల్మషం లేని స్వచ్ఛమైన మనసుతో పెరిగిన గిరిజనులు అందంగా ఉండంలో తప్పేంలేదు. పైగా వారి అమాయకత్వాని ఆసరాగా చేసుకొని వారిని నిందించనవసరంలేదు. అడవినినమ్మి కొండకొనల్లో నివసిస్తున్న గిరిజనులపట్ల ఇంత నీచభావన ఎందుకు. అతిధులను గౌరవించడం గిరిజనుల సంప్రదాయం. నమ్మిన వారితో స్నేహం చెయ్యడం వారి సంస్కారం. నలుగురితో నడవడానికి నగరానికి వస్తే అడుగడుగున అవమానించడం, గిరిజనుల పుట్టుకను గూర్చి నీచంగా మాట్లాడే వీళ్ళు నాగరికులేన అన్నది ప్రశ్న.
గిరిజనులను గూర్చి కథా రచయిత వి.ఆర్. రాసానిగారు ఇలా చెప్పిరి ‘‘గిరిజనులంటే నాగరిక సమాజానికి దూరంగా, నేటి సమాజం అనుభవిస్తున్న సాంకేతిక పరమైన సౌకర్యాలకు, ఆర్థిక సమృద్ధికి, పాలనాపరమైన పథకాల ఫలితాలకు దూరంగా ప్రకృతిలో ప్రకృతిగా కలిసిపోయి అడవులపై ఆధారపడి జీవించే ఆదివాసులు. బతుకుపోరాటంలో ఆహారన్వేషణ చేస్తూ ఒకప్రదేశం నుండి మరోక ప్రదేశానికి తరలిపోయే అస్థిరవాసులు, సంచార తెగలు. ఒకప్పుడు అడవులపై జీవించినా కారణాంతరాల వలన ఎప్పుడో మైదాన ప్రాంతంలోకి వచ్చి స్థిరపడి బతుకుతెరువు కోసం నేర్చిన విద్యలను లేదా తమ శ్రమను నమ్ముకొని సంచారం చేస్తూ బతికే సామాజిక వర్గాలు. కులవృత్తులపై ఆధారపడి ఇతర కులాలకు ఆశ్రిత కులాలుగా జీవించే తెగలు. సంచార తెగలు, గిరిజనులు”
బూది హోటల్లో సర్వర్‌గా ఉద్యోగం చేస్తు కష్టమర్స్ ఎలాంటి చూపులు ఎక్కడ చూసినా, వెకిలి చేష్టలు చేసినా మొదట భరించింది. హోటల్ మేనేజర్ ‘‘హోటల్‌కి ఇంపార్టెంట్ గెస్ట్స్ వస్తున్నారు. వారిని రాత్రికి రిసీవ్ చేసుకొవాలి’’ అన్నపుడు బూది అంగీకరించలేదు. వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడంలోనే ఉంది ఎదుగుదల రహస్యం అని నీతివాక్యాలకు విషం పూసి హితబోధ చేసిన హోటల్ మేనేజర్ మాటలను బూది తిరస్కరించి, ఆ అవకాశమేదో కోరుకున్నవారికి ఇవ్వమని ఉద్యోగం వదిలి వెళ్ళిపోయింది. నాగరికత, సంస్కృతి ముసుగులో తన జాతికి జరుగుతున్న అన్యాయాన్ని భరించలేక తన జాతి మూలాలను కాపాడటానికి బూది ప్రయత్నించింది.
చిటికెనవేలు:
ఈ కథ కథా సాహితి వారి కథల సంకలనం కథ 2018లో ముద్రించబడినది. ఈ కథారచయిత అట్టాడ అప్పలనాయుడు. అభివృద్ధి పేరుతో నేటి ప్రభుత్వాలు ఆదివాసుల అస్తిత్వాని పూర్తిగా కనుమరుగు చేస్తున్నవి. ఖనిజాల కోసం,రిజర్వాయర్లు కోసము, కంపెనీలు, రిసార్ట్, పార్కుల కోసము ఆదివాసుల అటవీ భూమిని బడా కాంట్రాక్టర్లకు పూర్తిగా దారా దత్తంచేసి గిరి పుత్రుని ఉనికి లేకుండా పూర్తిగా అడవులను విధ్వంసం చేస్తున్నవి. అడవులు ఆదివాసులకు అడవులతో గల సంబంధము విడదీయరానిది. ఆదివాసుల జీవనోపాధికి కీలకమైనవి. హస్తకళా నైపుణ్యానికి ముడి సరుకునిచ్చేది అడవి. అనేక ఔషధాలను సమకూర్చి రకరకాల ఉత్పత్తులకు కేంద్రమైన అడవి ఆదివాసుల జీవనాడి. ఆదివాసులకు జవసత్వాలను సమకూర్చే ఔషదం.
అడవి అభివృద్ధి పేరుతో కనుమరుగౌతుంటే, ఆదివాసుల అస్తిత్వం కనుమరుగైన విధానం ఈ కథలో కన్పిస్తుంది. కొత్త కొత్త మార్కెట్ శక్తులు అడవుల్లోకిప్రవేశించి అభివృద్ధి చిత్రపటాన్ని కళ్లముందుంచి ఆదివాసుల సహత్వాని పూర్తిగా ధ్వంసం చేస్తున్నవి. ఆదివాసుల అభివృద్ధికి, ఆస్తిత్వానికి నెహ్రూ ప్రతిపాదించిన పంచశీలసూత్రాలు ఉత్తమమైనవి. అవి ఆదివాసుల ఉనికి కాపాడటానికి తోడ్పడతాయి. ఆ సూత్రాలు.
- ‘‘ఆదివాసీ ప్రజలు వాళ్ళ స్వశక్తి ఆధారంగా అభివృద్ధి చెందాలి కాని వాళ్ళపై బలవంతంగా ఏమీ రుద్దకూడదు. వాళ్ళ కళారూపాలను, సంస్కృతులను ప్రోత్సహించాలి.
- భూమిపైన, అడవులపైన ఆదివాసుల హక్కులను గౌరవించాలి.
- ఎక్కువ మంది బయట వాళ్ళను ఆదివాసీ ప్రాంతంలోకి పంపకుండా చూడాలి.
- లెక్కకుమించిన పథకాలతో ఆదివాసీ ప్రాంతాలను అతిగా పరిపాలించకూడదు. వాళ్ళ సామాజిక, సాంస్కృతిక వ్యవస్థలకు అనుగుణంగా మనం పనిచేయాలి. అంతేగాని వాటికి వ్యతిరేకంగా మనం పనిచేయకుడదు.
- ఫలితాలను ఖర్చు పెట్టిన సొమ్ముతో కొలవకుండా గుణాత్మకంగా వచ్చినటు వంటి మానవశీల శ్రేష్టతను బట్టి పరిగణించాలి’’.
నేటి సమాజం, ప్రభుత్వాలు ప్రపంచీకరణ మాయజాలంలో కొట్టుకుపోతున్నవి. కనుక నెహ్రు వంటి మహనీయుల ఆచరణలను తుంగలోకి తొక్కి ఆదివాసీ జాతి అస్తిత్వాన్ని మంటగలుపుతున్నవి. సోమన్నగూడ సవర జాతి పెద్ద సోమన్న. ఈ గూడ ప్రకృతి రమణీయత మధ్య రెండు కొండలనడుమఉంది. అడవిని ఆనుకొని రెండు పర్వతాల మధ్య నుండి నిత్యం ప్రవహించే గడ్డవుంది. దాని పేరు ప్రాజెక్టు అధికారి ఎస్.జి.ఫాల్స్‌గా మార్చాడు. ప్రభుత్వ రికార్డులో ఇది ఇటికగూడ.ఒకప్పటి పెద్దజమీ. అడవంటుకున్నది. సోమన్న భుజాన తుపాకి వేలాడిరది.గూడ పేరు సోమన్నగూడ అయింది. ప్రస్తుతంసొమన్న గూడలో పెద్ద ఎత్తున మార్పులోచ్చాయి. ‘‘పల్లపు ఉప్పు, కిరసనాయిలు, నూలుబట్టలు, ఇప్పసారా... యివే... ఈటితోనే మనం అప్పులపాలయిపోనాం!... ఇపుడన్నిటికీ పల్లానికి పట్టణానికి పరిగెడుతున్నాము కరణం నాయుడ్లూ... పల్లము, పట్నము గూడకు వోచ్చిసినాయి’’.
సోమన్న దు:ఖములో ఆదివాసులు తమ మూలాలను కోల్పోయి, పరాయి కరణచెంది అస్తిత్వాన్ని కోల్పయినట్లు కన్పిస్తుంది. సోమన్నకు జైలు నుండి విడుదలైనపుడు ఆర్థిక సహాయం కింద గెడ్డెగువున గల ఎకరం భూమి ప్రభుత్వం ఇచ్చింది.క్రికెట్ బేట్లూ బంతులు, కిట్‌లు గూడెంలోకి చేరాయి. ఆడవి పచ్చదనం, ఆఫీసులు,పి.వో బంగ్లాలు, జి.సి.సిలు, అతిధి గృహాలు, హాస్టళ్లు, బ్యాంకులు, దుకాణాలు, బ్రాందీషాపులు, సార కొట్లు, పోలీస్ స్టేషన్లతో నిండిపోయినవి. ఇవి అడవి పచ్చదానాన్ని, ఆదివాసి ప్రాంతంలో ఆదివాసులు లేకుండా చేసినవి. యస్.జీ.ఫాల్స్ బాగా క్లిక్ అయింది.రెండు కొండల్లో గల గ్రానేట్, బాక్సైట్ ఖనిజాలకోసం బడాకంపెనీలు త్రవ్వకాలు జరుపుతున్నాయి. ఉద్యోగం, కాంపెన్సేషన్ ఇస్తామని ఎకరం భూమినిడెవలప్‌మెంట్ కొరకు తీసుకుంటామని పీ.వో సోమన్న దగ్గరకు ఒప్పంద పత్రాలతో వచ్చాడు. సొమన్నఅందకు అంగీకరించనందుకు మనవడు బుధుడికి కోపమొచ్చింది. సోమన్నదొర మరుచటిరోజు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశాడు. పత్రాలతో పాటు చిటికినవేలు పొట్లాన్ని పీ.వోకు అందించాడు.
‘‘దారే సరయింది కాదో నేనే మళ్లిపోనానో నాకే తెల్దు. ఈ బతుక్కు మీరు దారిచూపుతనన్నారు. ‘అదిగదిదారికాదు’. అని ఋజువు పరచలేను. నేనొక దారి చూపలేను. మీ దారిని నమ్మలేను, మీరు ఊరిల ఒకలాగ మాటాడతారు. యిదిగీ కుర్చీల కూసున్నపుడిరకొకలాగ మాటాడతారు. మీ మాటకి మీరాతకీ తేడా వుంతాది. మిమ్మల్ని నడిపించే వోళుయేరేగావుంతారు. చట్టమని మీరనుకుంతారు, రాజ్జెమని, నీననకుంతాను’’ అని చెప్పిన సోమన్న దొర మాటల్లో ఆదివాసులు దారి తప్పుతున్నారని, వారందరూ ప్రభుత్వం జపించే అభివృద్ధి మంత్రంలో మునిగిపోయారని, వారిది నిజమైన అభివృద్ధి కాదని, వారిని నడిపించేది కొన్ని రాజ్యాంగేతర బలమైన శక్తులని వారందరి ఫలితంగా ఆదివాసుల ఉనికి, వారి బ్రతుకులు పూర్తిగా ధ్వంసమౌతున్నవని అర్థం.
ముగింపు:
భూమికోసం, భుక్తికోసం నిరంతరం పోరాడే అమాయకులైన గిరిజనులు ప్రపంచీకరణ ఫలితంగా సమాజంలో వస్తున్న మార్పుల వలన తమస్థిరత్వాన్ని, సహజత్వాన్ని, అస్తిత్వాన్ని కోల్పోతున్నారు. ప్రతి జాతి అభ్యుదయ పథంలో ప్రయాణించాలి. ప్రభుత్వము తన వంతు సహాయాన్ని ఆయాజాతులకుఅందించాలి కాని అభివృద్ధి క్రమంలో జరగబోయే మార్పులు జాతిమూలాలను ఛేదించకూడదు. జరిగే అభివృద్ధి ప్రకృతిలో మమేకమై, ప్రకృతిలో భాగమై, ప్రకృతితో సహజీవనం చేస్తున్న ఆదివాసులకు మంచి ఫలితాలనందించాలి. కాని ఆ అభివృద్ధి ఆదివాసులకు శాపంకారాదు.
పాదసూచికలు:
- నవీన్, వాసిరెడ్డి., శివశంకర్, పాపినేని., (సంపా.). పాతికేల్లకథ. తెలుగుకథ 1990-2014, మనసు ఫౌండేషన్. బెంగుళూరు.
- నవీన్, వాసిరెడ్డి., శివశంకర్, పాపినేని., (సంపా.). కథాసాహితి వారి కథల సంకలనం కథ సికింద్రాబాద్.
- నవీన్, వాసిరెడ్డి., శివశంకర్, పాపినేని., (సంపా.). కథాసాహితి వారి కథల సంకలనం కథ 2018, సికింద్రాబాద్.
- డా. అశోక్, ఐ ఏ ఎస్ (సంపా.), వెంకట లక్ష్మయ్య, డా పారా, భారతీయ గిరిజనసంస్కృతి-సమాజం, ఐ ఏ ఎస్ స్టడీసర్కిల్, హైదరాబాద్.
- కృష్ణకుమారి, నాయని., తెలుగు జానపదవిజ్ఞానం- సమాజం- సంస్కృతి- సాహిత్యం, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, 2010
ఉపయుక్తగ్రంథసూచి:
- హంసావత్, డా. నాగేంద్ర (సంపా.) సత్య. కె. లోనావత్, మన గిరిజన సంస్కృతి భూమి బుక్ ట్రస్ట్, హైదరాబాద్, 2021
- శైలమ్మ, జి., తెలుగు కథా సాహిత్య- గిరిజన జీవితం, ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం.
- బాలగోపాల్, కె. ఆదివాసుల చట్టాలు- అభివ్రృధ్ధి, పర్ స్పెక్టివ్స్ సామాజిక శాస్త్రం / సాహిత్యం. హైదరాబాద్, 2018
- మాతృభాషాసాంస్కృతి, జనసాహితి ప్రచురణ, 1998
- రాసాని, వి.ఆర్., సంచార తెగలు గిరిజనులు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2007
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.