AUCHITHYAM | Volume-04 | Issue-03 | March 2023 | ISSN: 2583-4797
5. కర్పూర వసంతరాయలు కావ్యం పై ఇతర కావ్యాల ప్రభావం: విశ్లేషణ
డా. జాడ సీతాపతిరావు
అసిస్టెంట్ ప్రొఫెసర్
ట్రిబుల్ ఐటి, నూజివీడు ప్రాంగణం
ఏలూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్
సెల్: +91 9951171299. Email: seethuphd@gmail.com
Download PDF
Keywords: కర్పూరవసంతరాయలు, నృసింహపురాణం, వర్ణనలు, మానసికస్థితులు, గంగానది, పురాణాలు, ఆరాధనతత్త్వం, విశ్లేషణ, విమర్శ, నారాయణరెడ్డి, సీతాపతిరావు.
కావ్యనేపథ్యం:
సాహిత్యసృజన ఆదర్శం, ఆనందం కోసం. కొత్తదనం దీనికి బీజం. ప్రాచీనకావ్యసౌందర్యాన్ని పుణికి పుచ్చుకొని కొత్తదిగా మార్చినా, పాఠకుడి మనసులో వహ్వా అనే భావోదయం కలుగుతుంది.
క్రీస్తు శకం 1386 నుండి 1402 వరకు కొండవీడును రాజధానిగా చేసుకొని “కుమారగిరిరెడ్డి” అనే రెడ్డి రాజు రాజ్యాన్ని పాలించాడు. 1957 ఇది ఒక కథాత్మకగేయకావ్యం. కుమారగిరిరెడ్డి ఆస్థాననర్తకి 'లకుమ; ఈ లకుమాప్రభువుల ప్రణయగీతం కర్పూరవసంతరాయలు. మల్లంపల్లి సోమశేఖరశర్మగారి “HISTORY OF REDDY'S KINGDOMS”లో కుమారగిరి రెడ్డికి “కర్పూర వసంతరాయలు” అన్న బిరుదుందని ఉదహరించారు (CHAPTER VIII, page 145). ప్రతి సంవత్సరం 9 రోజులు వసంతోత్సవాలు నిర్వహిస్తుండేవాడు 'కుమారగిరి'. పంజాబు నుండి కర్పూరాన్ని, గోవా నుండి కుంకుమద్రవ్యాలను తెప్పించి ఆ 9 రోజులు జనంపై వెదజల్లుతుండేవాడట. ఆ నేపథ్యంలో ఈ కావ్యానికి శ్రీకారం చుట్టారు సినారె. లకుమ ఒక కల్పితపాత్ర. ఈమెను సజీవచిత్రణ చేయడానికి పూనుకున్నారు.
కథలోకి వెళ్తే:
కర్పూర వసంతరాయలు ఒక రెడ్డిరాజు. పాలనాదక్షుడు. సంగీతనృత్యాలంటే చెవి- కోసుకుంటాడు. అది పిచ్చిగా మారితే ప్రమాదమేగా. ఈ భావనల్ని తీసుకున్న సి. నారాయణరెడ్డి గారు కొంత చరిత్రను, కొంత సృజనను కలిపిన వసంతకర్పూరపరిమళం - ఈ కర్పూర వసంతరాయలు.
పాత్రస్వభావం:
లకుమ అందగత్తె, ఆపై నాట్యపు జాణ. వసంతరాయల హృదయవీణగా మారింది. రాజు తలచుకుంటే వైభవానికి కొరతా? ఆదరణకు ఆలోచనా? కవికి ఉన్న నృత్యాభినివేశం, నాట్య౦లో గ్రహించిన విశేషాలు మరింత పాకాన పెట్టాయి. అవి విచిత్రమైన మలపులతో, వలపులతో లకుమను చుట్టాయి. వెరసి ఆమె నిర్ణయాన్ని ఆమె తీసుకున్నట్లు చేశాయి.
కథలో సంఘటనలు: ఇతర కావ్యప్రభావాలు:
వసంతరాయలు లకుమను తీసుకొని అహోబలక్షేత్రం వెళ్ళాడు. స్వామిని దర్శించుకున్నాడు. దీన్ని కవి అందంగా కవిత్వీకరించాడు. దీన్ని ఒక సన్నివేశంగా మలిచాడు. సాయంకాలానికి వసంతేశుల ప్రయాణం. ఆ రాత్రి నిద్ర, ఉదయాన్నే లేచి స్వామి దర్శనం. పూదోటలో పూలు కోసి స్వామి పూజకు ఏర్పాట్లు. రాయలు నరసింహస్వామిస్తుతి, పూజ ఇంకొకటి. అహోబలస్వామిని దర్శించారన్న ఒక్క విషయాన్ని ఇన్ని విభాగాలుగా వర్ణన చేశాడ౦టే కవి ప్రతిభావిశేషాలు ఇందులో కనిపిస్తున్నాయి.
ఇలాంటి వర్ణనకు దగ్గరిగా ఎఱ్ఱన నృసింహపురాణంలో అహోబలస్వామి వర్ణన కనిపిస్తుంది. అది విష్ణువు నరసింహావతార౦గా ఆవిర్భవించి, హిరణ్యకశిపుణ్ణి ఎత్తుకొని వెళ్ళి, అహోబలపర్వతం మీదకెగిరి అక్కడ చంపడం. ఈ కథ ఐదో ఆశ్వాసంలో ఉంది. లకుమ వసంతరాయల వర్ణనలో దీన్ని ‘సినారె’ కొంత అనుసరించారు. లకుమావసంతేశులు స్వామి దర్శనార్థం అహోబలం చేరుకున్నారు. అక్కడ ‘భవనాశిని’ అనే నదిలో స్నానం, లక్ష్మీవనంలో పూలను కోయడం ఘట్టాలవర్ణన ఇలా ఉంది.
భవనాశినీధునీ పావనపయ స్నాత/ములు ప్రభాతాలసానిలపోతములు వీచె.
సుఖనిద్రనున్న రాజునకు ప్రాతస్సమీ/రములు వైతాళికత్వమును నిర్వర్తించె. (కర్పూర వసంతరాయలు, పుట 58)
భవనాశినిలో ఉదయం వేళ ‘గాలి’ స్నానం చేసి వచ్చింది. నిద్రలో ఉన్న రాజుకు మెలకువ వచ్చింది. ఆ గాలికి కవి వైతాళికత్వాన్ని ఆరోపం చేస్తున్నాడు. దీనివల్ల అలంకారంతో పాటు కవితాసౌందర్యం కనబడుతుంది.
“నుత లక్ష్మీవన పుష్ప సౌరభములు న్సొంపారి లోలోర్మి సం ......
........................ గావించె నాహ్లాదమున్” (నృసి౦హ. 5-129)
ఈ పద్యంలో లక్ష్మీవన పుష్పసౌరభాలతో గాలి వచ్చింది. ఆపై మృదువుగా వీచింది. ఈ పద్యంలో మందపవనుడు, ప్రభాతాలసానిలపోతములుగా మారిపోయాడు. అక్కడి దేవతాద్విజకోటి, వసంత రాయలుగా కవి మార్చుకున్నాడు. వసంతరాయలను మేల్కొల్పడానికి వైతాళికులు లేరు. కానీ కవి రాచమర్యాదలకు భంగం కలగకుండా కల్పించాడు.
లకుమ పరిస్థితి చూస్తే:
‘నిదుర మునిగిన లకుమ నీలాలకలతోడ/కోడెగాడుపులు దాగుడుమూతలాడుకొనె' (అదే. పుట. 57) కోడె గాలుపులు, దాగుడు మూతలులాంటి పదాలతో ఏదో జరుగుతుందని కవి ఉత్కంఠను లేపుతున్నాడు.
“ఇరుదెస నబ్ధి నాథుడు.... రచ్చటన్” (5-135)
ఈ పద్యంలో విష్ణువు ఒడిలో స్థిరనివాసం ఉన్న అందమైన తీగలలాంటి లక్ష్మీదేవి కేశపాశాలకు కొత్త నృత్యవిలాసాలను వాయుదేవుడు కల్గిస్తున్నాడు అని చెప్పాడు. లక్ష్మీదేవి స్థానంలో లకుమాదేవి. మృదులమారుతలీలన్, ‘కోడెగాడుపు’గా మార్చాడు. ‘శ్రీకరకుంతల భారచారువల్లరులు’ అనే ప్రయోగం ‘నీలాలక’గా మార్చుకున్నాడు. ‘నూత్ననర్తనవిలాసము’ అనే ప్రయోగం దాగుడు మూతలుగా. ఎఱ్ఱన గాలిని సోమరి చెప్పినా, అతడు పిల్లవాడుగానే పేర్కొన్నాడు. సినారె కోడెతనాన్ని చూపాడు. అప్పటికి కవికి కూడా కోడె వయసేగా. రాజు బలవంతుడు, తన ప్రతాపం సాగదు. అందుకని సోమరి పిల్లాడుగానే ఉన్నాడు. లకుమకు బలం లేదు. ఈమెను చూడగానే వాడికి ఎక్కడ లేని బలం వచ్చింది. మనుషుల ప్రతాపం అంతా బలహీనులమీదే. అధికారులు కూడా మనుషులే. కానీ బలమైన వారిముందు వారి అధికారం చెల్లదు కదా.... అనే లోకం తీరును చూపాడు.
నరసింహ స్వామి వర్ణన, గంగానది మాహాత్మ్యం:
"శ్రీ కమనీయమూర్తి నరసింహ పదాంబుజ సేవగోరి మ౦.... మహోత్సవంబుతోన్" (5-122)
అందమైన రూపంతో ఉన్న నరసింహస్వామి పదపద్మాలను సేవించాలని గంగానది చాలా కెరటాలతో, మత్తెక్కిన తుమ్మెదలతో మనోహరమైనపద్మాలతో, చల్లని నీటిబిందువులతో మనోహరంగా ప్రకాశించే మహోత్సవంతో తన సహజమైన శరీరవిలాసంతో ఈ భువికి దిగివచ్చిందని ఎఱ్ఱన వర్ణించాడు.
“అహోబలుని చరణసేవకై దివి/నవతరిలిన మందాకినిలో” (అదే. పుట. 58). ఇందులో ఉరుకులు పరుగులు నేటి మందాకినీలో లేవు.
“భవరోగంబుల కౌషధంబు, భవపాపజ్వాలకున్ వైరి, దు
ర్భవ పంకప్రవిశోధనంబు, భవభావస్ఫార తృష్ణాహరం..” (నృసింహపురాణం 5-150)
“భవనాశిని భవనాశిని,
భవనాశిని యనుచు... గలదే” (నృసింహపురాణం 5-151)
ఈ చిన్న కందపద్యంలో మూడు సార్లు ప్రశంసించడం జన్మ రాహిత్యానికి సూచన. కవులు కవిత్వ ఫలం ఇదేగా.
“నా కరుణారసంబు భవనాశిని నాన వినాశ... భవ్యతన్” (5-152) నా కరుణా రసమే ఈ భావనాశిని నదిగా నాశం లేని ఆకృతిని పొందింది. ఇది స్వర్గ, మర్త్య, నాగలోకాలన్నిటిని పవిత్రం చేసే నీటిని కలిగి ఉంది. అందువల్లే ప్రశంసలు పొందింది. లోకాతిశయమైన చూపులకు సాఫల్యాన్ని కూర్చే పావనత్వం, మహత్వంతో ప్రకాశిస్తుంది అని చెప్పడం ఎఱ్ఱన నృసింహపురాణ భవనాశిని వర్ణన. డెబ్భై పై బడిన ఇక్కడి పదాలను, సినారె గారు తమ కలంలో పది పన్నెండు పదాలకు తీసుకువచ్చారు.
"భవభయ పాప జ్వాలాహారులు/భవనాశినిలో పారెడు నీరులు.
భవరుక్పీడిత జనౌషధమ్ములు /భవనాశినిలో పయఃపథమ్ములు" (అదే. పుట. 58)
‘భవ’ అనే పదం నాలుగు పాదాల్లోనూ కవి ప్రయోగించాడు. హారులు, నీరులు; జనౌషధమ్ములు, పథమ్ములు అనే మూడు, నాలుగక్షరాలతో అంత్యప్రాసను వాడాడు. నీటి ఉధృతితో పాటు, పైకి కిందకి వచ్చే కెరటాల పౌనఃపున్యానికి శబ్దసూచిక.
పురాణపు సౌరభం:
ఎఱ్ఱన స్థల పురాణ౦ చెప్పడం ప్రధానం. కర్పూర వసంత రాయలులో భవనాశినిలో స్నానం చేసి, స్వామిని దర్శించుకొని, నాట్యం చేస్తుంటే చూడాలి. అంటే ఎఱ్ఱనగారికి ఈ నదీ జలాలు కేవలం ప్రాప పరిహరణ. కర్పూర వసంత రాయలకు చాలా పనులు.
లకుమతో కూడి రాయలు స్వామిని దర్శించుకున్నారు. స్వామికి పెద్ద పెద్ద గోళ్ళు. అవి వజ్రాయుధంలా వాడిగా, కఠినంగా, తళతళ మెరుస్తూ ఉన్నాయి. ఏ ఆయుధం చేతా చావకూడదని బ్రహ్మనుంచి వరం పొందాడు కదా హిరణ్యకశిపుడు.
“అలఘు తరాట్టహాసము లజాండ కటాహము వ్రయ్య భీషణో
జ్జ్వల వికట స్ఫురత్కులిశశాత నఖాంకుర తీవ్ర పాతనం-
బుల నసురేంద్రుడు పేరురము బొల్పఱ జించి కలంచి శోణితం
బులు దొరగించె ద్రు౦చె బ్రోవులుగా బలుబ్రేవులుక్కునన్” (5-99)
హిరణ్యకశిపుడిని తన ఒడిలో ఉంచి నృసింహస్వామి పెద్ద పెద్ద అట్టహాసలతో బ్రహ్మాండమనే పాత్రను ముక్కలు చేయగా, భయంకరమైన, ప్రకాశవంతమైన వజ్రాయుధంలా వాడిగా ఉన్న తన నఖాగ్రలతో బాగా గిచ్చడంవల్ల రాక్షసరాజు ఉన్నత వక్షాన్ని అందం చెడేటట్లు చీల్చి, కల్లోల పరిచి, రక్తం పారించాడు. చాలా ప్రేవుల్ని ముక్కలుగా చేశాడని ఎఱ్ఱన వర్ణన.
దీని సారాన్ని సూటిగా సినారె తన కవిత్వంలో చూపారు: “ఒక్కదెస హిరణ్యకశిపు/డొక్కను జీల్చిన పవిధారానిశాతనిష్ఠుర నఖ/ రమ్ములు మిరుమిట్లు గొల్ప”. (అదే. పుట. 59) కేవలం గోర్లే ఆయుధం. కానీ ఆయుధం అవడం వల్ల అదే ప్రధానం. దాన్ని ఇక్కడ తీసుకున్నారని గ్రహించవచ్చు. అంతేకాదు,
“శితనారసింహ నఖరా
హత దైత్య మహిప సూపహారంబున ద/
ర్పిత యయ్యే ననగ బరిశా౦/
తతనొందె ద్రిలోక పీడ తత్కర్షణ మాత్రన్” (5-106)
నరసింహస్వామికి ఉన్న వాడిగోర్లతో చంపి, రాక్షసరాజుకి కానుకతో తృప్తిపరచినట్లు ఉన్నదని, ఒక్క క్షణకాలంలోనే ముల్లోకాల పీడను విరగడ చేశాడని ఎఱ్ఱన వర్ణన.
సినారె మాత్రం వసంత రాయలు స్తుతించి, అక్కడ ఉన్న వారంతా పొగడుతుండగా దేవతలు అహో! బలా, అని పొగిడారట. ‘మీరు మదీయ బలం బహోబల శబ్దపూర్వకంబుగా ప్రశంసించితిరి గావున నీ తీర్ధం బహోబలనామధేయంబున ద్రిభువనపావనంబై వెలయుంగాత’ (నృ.పు. ఆశ్వా. 1 - 28వ పద్యభావం) అని ఎఱ్ఱన చెప్పాడు.
సినారె: “ఆమ్నాయమ్ములు నాలుగు /సాకృతులై నీ గుణమ్ము/ లాలపించ ఈ గిరి వే/ దాద్రిగ పేరొందెనంట” (అదే. పుట. 60) అని చెప్పారు.
ఎఱ్ఱన నృసింహపురాణంలో నృసింహస్వామిని స్తుతిస్తూ దండకాన్ని (5-109) రెండు పుటలు రాశాడు. ఇక్కడ సినారె మాత్రా ఛందస్సును వాడుతూ గేయస్తుతి చేశాడు. అసలు నరసింహస్వామిని కొలవడంలో ముఖ్యంగా: నరసింహస్వామికి దేవతలందరకు ఇక్కడకు వచ్చి నన్ను భక్తితో ప్రతిరోజూ కొలిస్తే వారి సుఖసంతోషాలు ఇస్తాననడం. రెండోది వసంతోత్సవం స్వామికి, రాయడికి ఇష్టం.
పూజలు పునస్కారాలు:
లకుమ స్వామిని స్తుతించింది. లక్ష్మీదేవి ప్రత్యేకంగా: “ధృతి శాంతియు దృష్టియు స/న్మతి యను నెచ్చెలులతోడ/వేదవేద్యు అంకపీఠి/ వెలసిన లక్ష్మిని భజించె” (కర్పూర వసంతారాయలు, పుట. 61). లక్ష్మీదేవి నరసింహస్వామిలో చేరటానికి సమీపంలో ఉన్న పూదోట నుంచి వచ్చింది. అందుకే ఆ తోటకు లక్ష్మీవనం అని దేవతలు, స్వామి పేరు పెట్టారు. అందులో లకుమ కూడా అక్కడనుంచే వచ్చిందట.
“శాంతియు దుష్టియున్ ధృతియు సన్మతియున్ మొదలైన నెచ్చలుల్
సంతతభక్తి దంన్గొలువ సంయమి దేవగణంబు లద్భుతా
శ్రాంత కుతూహలస్ఫురణ గన్గొనుచుండగ నట్లు వచ్చి శ్రీ
కాంత ముకుందు నంకతటి గైకొనియెన్ సవిలాస ఖేలతన్” (5-125)
లోకైక మాత శ్రీ మహాలక్ష్మి శాంతి, తుష్టి, ధృతి, సన్మతి మొదలైన ముఖ్య చెలికత్తెలు భక్తితో తన్ను సేవిస్తుండగా, ముని, దేవతాగణాలు ఆశ్చర్యంతో నిండిన కుతూహలంతో చూస్తుండగా, సవిలాసంగా శ్రీ మహావిష్ణువు ఒడిలోకి చేరింది.
“పుండరీకపత్ర జైత్ర/ ములు స్వామి ప్రసన్ననేత్ర/ ములలో అమృతంపునవ్వు/ మొక్కలు చూచెను రాయడని” (పుట. 65) లకుమ నాట్యం తర్వాత కూడా రాజు, లకుమ స్వామి దర్శనం చేసుకున్నారు. ఇద్దరూ ఒరసి పట్టుకొని ఉన్నారని అమృతంపు నవ్వు మొలకలు చూసినట్లు సినారె పేర్కొన్నారు. ఇది ఆమె శాశ్వత కీర్తికి సూచన.
ఎఱ్ఱన వర్ణనలు- సినారె సొంపు:
“సితకమలదళంబులకున్
బ్రతియగు లోచనము లందు బ్రబలప్రసాద
స్మితరుచిజాలములు దిశా
ప్రతతిన్ బూర్ణేందురుచుల భంగి వెలి౦గెన్” (5-114)
తెల్లని పద్మాల రేకులకు సమానమైన అతని కన్నులలో ప్రసన్నతతో కూడిన చిరునవ్వుల కాంతులు విస్తరించాయి. అవి దిక్కుల సమూహాన్ని పున్నమి చంద్రుడి కాంతుల్లా ప్రకాశిస్తున్నాయి అని ఎఱ్ఱన వర్ణన. ఇందులో అమృతపు నవ్వు మొక్కగా, సితకమలం, పుండరీకంగా కవి దర్శించారు.
“కోఱలు గీటుచు న్నయనకోణములం దహనస్ఫులింగముల్
గాఱగ గర్ణముల్
బిగియగా ఘనకేసరముల్ విదుర్చుచున్
మీఱిన యుబ్బునన్ బొదలి మీదికి మూరెడు పేర్చి కింక దై
వాఱగ బట్టె
బిట్టు దితి పట్టి నృసింహు డసహ్యతీవ్రతన్” (5-95)
స్వామి కోఱలుగీటుతూ, కళ్ల చిరవనుంచి నిప్పురవ్వలు విడుస్తూ, చెవులు బిగించి, దట్టమైన పొడవైన కేసరాలు విదులిస్తూ హద్దుమీరిన ఉత్సాహంతో ముందరికి మూరెడు వ్యాపించగా కోపం పెరిగి సహింపశక్త్య౦గాని వేగంతో హిరణ్యకశిపుణ్ణి గట్టిగా పట్టుకొన్నాడు. చూడడానికి భయంకరమైన ఇలాంటి రూపాన్ని కవిగారు లకుమకు తెచ్చి చూపించాడు.
“సంధ్యాశోణములు హరి/ స్వామినయనకోణములం/ దున హిరణ్యకశిపుని నె/ త్తురుచారలు చూచె లకుమ.
కేసరములు పటపట నూ/ గించుచు గర్జించు క్రుద్ధ/కంఠీరవమూర్తి చూచి/ కంపితయైపోయె లకుమ”. (పుట. 65)
‘నయనకోణం’ అనే పదాన్ని సినారె వాడుకున్నారు. ‘దహనస్ఫురిలింగము’ అనే పదాన్ని నెత్తురు చారలుగా మార్చారు. ఎర్రదనం ఎఱ్ఱన ప్రయోగం తీసుకున్నాడు. కోరలు గీటుచు, కర్ణముల్ బిగియగా, మీఱిన యుబ్బునన్ బొదలి మీదికి మూరెడు పేర్చి ఇన్నిటిని కలిపి ఒక్క ‘క్రుద్ధ కంఠీరవమూర్తి’ గా సినారె మార్చాడు. ఈ దెబ్బకు లకుమ రాజు గారి భుజం మీద వాలింది.
శ్రీభీమేశ్వర పురాణం - బసవ పురాణం:
భీమేశ్వర పురాణంలో భీమేశ్వరుడు దక్షారామ వాటికలోకి ప్రవేశిస్తున్నప్పుడు దేవతలంతా ఒకదగ్గరికి వచ్చారట. అది వసంత కాలం. వసంతోత్సవ కేళికి భీమనాథుడే ఆజ్ఞ ఇచ్చినట్లు –
“ఆజ్ఞ వాటి౦చె గేలీ విహారములకు / భీమనాథు౦డు దేవతాగ్రామణులకు
గంధ కర్పూరకస్తూరికా ప్రశస్త / వస్తుకోటులు నొసగె నవారితముగ” (శ్రీభీమేశ్వర పురాణం, 3-121)
ఈ భీమనాథుడి స్థానం కర్పూర వసంతరాయల స్థానం అయింది. అక్కడి దేవతలు ఇక్కడ ప్రజలు. గంధకర్పూరాదులను భీమనాథుడు దేవతలకిస్తే ఈ వసంతరాయలు తాను ప్రజల మీద చల్లుతున్నాడు. ప్రజలు సంతోషం కోసం.
“తనతోడ నడచువారిని జూచి, అల్లన శి / రము నూచి, మందహా సము చేసి, నిండు
దో
సిళ్లతో మృగమద శ్రీ చందనరజమ్ము / కుండికలతో అచ్చ గొజ్జంగి నీరమ్ము
కుమ్మరించె వసంతనృపుడు
కుసుమించె జనచిత్త మపుడు”. (కర్పూర వసంతరాయలు పుట. 38, 39)
భీమేశ్వరుని స్థానాన్ని వసంతరాయలకు కల్పించడం వల్ల గొప్పతనాన్ని పెంచినట్లయింది. రాయలు ఈ భీమేశ్వరుడి భక్తులు. శివభక్తులు శివుడితో సమానమంటాడు. పాల్కురికి సోమన బసవ పురాణంలోది ఈ సంఘటన.
“అచ్యుతునిమీద జల్లే దుగ్ధాబ్ధి కన్య;
భారతీదేవి పద్మజు పైని జల్లె;
శచి మహేంద్రుని జల్లె; వాసంతకేళి
గంధకర్పూర కస్తూరికాజలంబు” (శ్రీభీమేశ్వర పురాణం పుట: 134)
అచ్యుతుడు, లక్ష్మి; సరస్వతి బ్రహ్మ, శచీ ఇంద్రులు ఒకరిపై ఒకరు జల్లుకున్నారు అనే మాటల్ని అని వరుస అయిన వారిమీద “తరుణమిదే యంచు/ వరుస గలిసినవారు/కనులకాశ్మీరధూ/ళిని గొట్టి నగినారు” (కర్పూర వసంతరాయలు పుట. 22) అని సినారె వర్ణించి చూపరులను, పాఠకులను నవ్వించారు.
“చెవిలోన బాఱంగ జిమ్మె గొజ్జగనీట
గాలభైరవు నొక్క కలువక౦టి” (బసవపురాణం పుట: 139)
ఇందులో అంత వరస వాయి లేవు. సినారె కర్పూరవసంతరాయలులో జాగ్రత్తగా పదాల్ని పేర్కొన్నారు: “ప్రౌఢాంగనలు కొత్త/కోడెకాండ్రను దరిసి /చెవులలో పన్నీరు/ చిలికి పర్విడినారు” (కర్పూర వసంతరాయలు పుట. 22). ప్రౌఢాంగన అయితే కొత్త కోడెకాండ్రను సమీపించి పన్నీరు జల్లుతారు. ఆ కలువక౦టిని సినారె ప్రౌఢా౦గనగా మార్చుకున్నారు. ఇది ఔచిత్యం కూడా. దేవతలే పరిమళజలాలు జల్లుకోవడం చూసి తన్ను తాను మరిచిపోయాడు.
ఛందోవైవిధ్యం:
మాత్రాఛందస్సు విషయంలో మొదటిది నాగార్జునసాగరం. రెండోది కర్పూరవసంతరాయలు. దీనిలో ఖండగతిని కొద్దిగా వాడుతూ, త్రిస్ర , చతురస్ర, మిశ్రగతుల్ని విశేషంగా వాడారు. ఒక రకమైన గతిలో కొన్ని చోట్ల మాత్రల్ని పెంచి, కొన్ని చోట్ల తగ్గించారు. వెంటవెంటనే గతుల్ని కూడా మార్చారు. ఛందోవైవిధ్యం, గతివైచిత్రి పాఠకుడికి కొత్త ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ప్రతీచరణంలో యతి, ప్రాసలకు బదులుగా అంత్యనియమాలు వాడారు.
సింహావలోకనం:
కవిత్వశక్తికి అధ్యయనం ఒక అవసరం. ప్రతిభకు ఇది పట్టం గడుతుంది. కవనం ధారగా సాగడానికి ఛందస్సు బాటగా నిలుస్తుంది. చరిత్ర, ఊహ, ఆశ్చర్యం, ఆనందం, అద్భుతంతో కలిసిన ఆత్మత్యాగం దేశరక్షణలో భాగంగా వ్యక్తిస్వేచ్చకంటే గొప్పదిగా అన్వేషించారు. లకుమ వాస్తవాన్ని గుర్తించింది. తన వ్యక్తిగతజీవితం కంటే దేశానికి ఉండాల్సిన అవసరాన్ని గుర్తించిన విరాగిగా, ఆత్మత్యాగిగా వెలిగింది. అందుకే ఇప్పటికీ అక్కడ కస్తూరిసౌరభమే అనడం కవికి ఆ పాత్ర పట్ల ఆదరణకు అనురక్తికి చిహ్నం. పరమ సాధ్విగా లకుమ రక్తంతో కూడిన ప్రాణం అంత్యంత ఆదరణతో ప్రేమించిన వసంతరాయల జీవితం కొండవీటి మట్టిలో కర్పూరసౌరభమై పంచభూతాత్మకంగా నిలిచి౦ది.
ఉపయుక్తగ్రంథసూచి:
- ఎఱ్ఱన. నృసింహపురాణము. చెన్నపురి: వావిళ్ల రామశాస్త్రులు అండ్ సన్స్, 1924.
- జానకి రాం, ఆచంట. సి. నారాయణరెడ్డి కర్పూర వసంతరాయలు (కావ్యం) పరిచయము. 1955.
- డా. వెంకట రామకృష్ణశాస్త్రి, రేమిల్ల. నృసింహపురాణము, టీకా తాత్పర్యాలు. విజయవాడ: రాఘవేంద్ర పబ్లిషర్స్, 2020.
- నారాయణ రెడ్డి, సింగిరెడ్డి. కర్పూరవసంతరాయలు. ఎనిమిదవ ముద్రణ. హైదరాబాదు: వరేణ్య క్రియేషన్స్, 2021.
- భూమయ్య, అనుమా౦డ్ల. కర్పూర వసంతరాయలు కథాకళాఝంకృతులు. మొదటి ముద్రణ. హైదరాబాదు: మనస్వినీ దేవి, 2000.
- శ్రీనాథమహాకవి. శ్రీ భీమేశ్వరపురాణము: 1901: వేంకటసుబ్బయ్య, ఆర్. (సంపా.). మద్రాసు: క్రొత్తపల్లి వేంకట పద్మనాభశాస్త్రి ప్రచురణ.
- సోమనాథకవి, పాల్కురికి. ద్విపద బసవపురాణము: 1969: వేంకట సుబ్రహ్మణ్యం, గూడ. (సంపా.) హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ.
- Somasekhara Sharma, Mallampalli. History of Reddy's Kingdoms: 1946: Waltair, South India: Andhra University.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.