headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-03 | March 2023 | ISSN: 2583-4797

2. నన్నయ భారత ఆదిపర్వం: సామాన్యుల జీవనచిత్రణ

డా. కె.వి.ఎన్.డి. వరప్రసాద్

సహాయాచార్యుడు, తెలుగుశాఖ
ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం
రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్
సెల్: +91 9490921345. Email: prasad.tel@aknu.edu.in

Download PDF


Keywords: ప్రాచీనసాహిత్యం, నన్నయ, సామాన్యుల స్ధితిగతులు, లోనారసి, వరప్రసాద్

ఉపోద్ఘాతం:

"నైలునది నాగరికతలో సామాన్యుని జీవనమెట్టిది...

        ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయీలెవ్వరు"1

అంటూ సామాన్యుని జీవన చిత్రణం కవితా వస్తువు కావాలనే ఆధునికుల ఆకాంక్షకు శ్రీ శ్రీ కవితా రూపం ఇచ్చాడు. కాలం మారిన నేపథ్యంలో కావ్య స్వరూపం, స్వభావంలో పెను మార్పులు రావడం అందరికీ తెలిసిందే. ప్రాచీన సాహిత్యంలో వైదిక, శ్రౌత పరిజ్ఞానం, చాతుర్వర్ణ వ్యవస్థ తరచూ గా ప్రస్తావించబడుతుంది. రాజరికాలు పోయాక ప్రపంచమంతా ప్రజాస్వామ్యాన్నే (ఏదో ఒక రూపంలో) అనుసరిస్తూ ఉంది. అందువల్ల మిగిలిన విషయాలు ఎలా ఉన్నా మనదేశంలో గాఢంగా వేళ్ళూనుకున్న చాతుర్వర్ణ- వ్యవస్థను ఆధునికులు గెలిచేస్తూ దీనిని ‘నిచ్చెనమెట్ల’ వ్యవస్థగా అభివర్ణించటాన్ని చూస్తున్నాం. అయితే ప్రాచీనసాహిత్యంలో సామాన్యుల స్ధితిగతుల ప్రస్తావనే లేదా? ఉంటే ఏ రకంగా, ఏఏ సందర్భాల్లో ఉందో స్ధాలీపులాకన్యాయంగా పరిశీలించి, విశ్లేషించడమే ఈ పరిశోధనావ్యాస ప్రధానలక్ష్యం.

ప్రధానవిషయం:

సాహిత్యంలో సామాజికాంశాల పరిశీలన రెండు విధాలుగా చేయవచ్చు. ఆనాటి సామాజిక స్థితిగతుల్ని అంటే వస్త్రధారణ, గృహ నిర్మాణం, ఇతర సౌకర్యాలు మొదలైనవి ఎలా ఉన్నాయో ప్రత్యేకించి చెప్పటం మొదటిదికాగా, సామాన్యుల జీవనస్థితిగతుల్ని అంటే వారి జీవన ప్రమాణాల్ని పరిశీలించటం రెండవది. ఈ రెండూ సామాజిక అంశాల పరిశీలనకు దోహదం చేసే పద్ధతులు. వీటిని మరింత లోతుగా అధ్యయనం చేయాలంటే... ఈ దేశంలో వేళ్లూనుకున్నట్టు చెబుతున్న చాతుర్వర్ణ వ్యవస్థా కాదు, మన మిత్రులు చెబుతున్న నిచ్చెనమెట్ల వ్యవస్థా కాకుండా సమాజంలోని అన్నివర్గాల్లోఉన్న సామాన్యుల గురించి ఆలోచించాలి.

ఇక్కడ సామాన్యుడు అంటే కనీస అవసరాలు అయిన భోజన, గృహ, వస్త్ర వసతులు కలిగిన వాడు అని భావం. ప్రపంచ మేధావి అయిన కార్ల్ మార్క్స్ చెప్పిన ‘హావ్స్ అండ్ హేవ్ నాట్స్’ అనే సిద్ధాంతాన్ని మనం సమన్వయం చేసుకోవాలి. ఆ మహా మేధావి ప్రపంచ జనాభాను ఆర్థిక స్థోమత ఆధారంగా పై రెండు విధాలుగా విభజించాడు.ఇక్కడ శ్రీ శ్రీ అన్న ‘సామాన్యులు’, మార్క్స్ చెప్పిన ‘హేవ్ నాట్స్’ ఒకటే అని గ్రహించాలి.

మన ప్రాచీన సాహిత్యం పై ఒక అపప్రద ఉంది. ప్రాచీన సాహిత్యంలో మహారాజుల, చక్రవర్తుల భోగభాగ్యాలు, వైభవం, స్త్రీ అంగాంగ సౌందర్యవర్ణనలు ఉంటాయని కొంతమంది విమర్శకులు అంటుంటారు - నిజమే, కానీ అది పూర్తిగా నిజం కాదు. ప్రథమాంధ్ర మహాకవి నన్నయ భట్టారకుల వారు భారతంలో అనేక సందర్భాలలో పేదల స్థితిగతులను వర్ణించడాన్నిమనం మహాభారతంలో గమనించవచ్చు.

ఈ దృక్పథంతో తెలుగులోని ప్రాచీన సాహిత్యంలో మొదటి కావ్యమైన నన్నయ భారతంలోని పేదల స్థితిగతులను విశ్లేషిస్తే నాటి ప్రజల జీవన స్ధితిగతుల్ని, సామాజికాంశాలను విశ్లేషించినట్టే. ఆగర్భ శ్రీమంతుడు కూడా ఆర్ధికంగా పతనమై ఏమీ లేని స్థితిలో కడుపేదగా జీవించిన సందర్భాలను గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఇది ఇంచుమించు అందరికీ సుపరిచితమైన విషయమే. ఆగర్భ శ్రీమంతుడైనా పేదరికం అనుభవించవలసి వచ్చినప్పుడు వాడు పేదవాడే. నన్నయ భారతంలో పేదవాడైన ద్రోణుడు, ఆగర్భశ్రీమంతులైన పాండవులు ఈ పేదరికాన్ని, పేదరికం యొక్క తీవ్ర స్థితిని అనుభవించారు.

అయితే ఇక్కడ ప్రజలుగా తీసుకున్న పాత్రలు బ్రాహ్మణులైన ద్రోణుడు, విశ్వవిఖ్యాత మహాపురుషులైన పాండవులు అయినందువల్ల వారి పేదరికపు స్థితిని మన ఆధునికులు గుర్తించలేకపోతున్నారు. "సుఖాలు అందరికీ ఒకటే కాకపోవచ్చు కానీ కష్టాలు అందరికీ సమానమే" అన్న నీతిని మనం ఇక్కడ అనుసంధానం చేసుకుంటే నన్నయ చెప్పిన పేదల స్థితిగతులలోని ఔచిత్యాన్ని మనం గ్రహించగలుగుతాం. ఈ విషయాన్ని ఈ క్రింది విధంగా సోదాహరణంగా సిద్ధాంతీకరిస్తున్నాను.

నన్నయ మహాభారతం ఆదిపర్వం పంచమాశ్వాసంలో ద్రోణుడు, ద్రుపదుడను పాంచాల మహారాజుచే పేదరికం కారణంగా అవమానించబడతాడు. పూర్వాశ్రమంలో వీరిద్దరూ అగ్నివేశుడనే గురువు దగ్గర శిష్యులు, బాల్య మిత్రులు కూడా. తాను పట్టాభిషిక్తుడయ్యాక ద్రోణుడు తనను కలిస్తే సహాయం చేస్తానని తనంత తానే పాంచాలుడు, ద్రోణుడికి మాట ఇచ్చాడు. తర్వాత పాంచాలుడు మహారాజు అయ్యాడు. ద్రోణుడు వివాహితుడై అశ్వత్థామ అనే పుత్రుణ్ణి కన్నాడు. ద్రోణుడు జన్మతః పేదవాడు. తన కుమారునికి పాలు కరువైనందువల్ల పాంచాలుని దగ్గరికి వెళ్లి తన కుమారునికి పాల నిమిత్తమై గోధనాన్ని అర్థించాడు. నన్నయ ఈ సందర్భంలో సార్వత్రిక సత్యాన్ని చెప్పాడు. ఇది ఎవరూ కాదనలేని సత్యం. ఎవరినైనా ఏదైనా సహాయం అడగడం చాలా కష్టమని నన్నయ ఈ సందర్భంలో చెప్పాడు. నన్నయ ఏమన్నాడో చూద్దాం.

 మత్తకోకిల: వేఁడు టెంతయుఁ గష్టమైనను వేఱులేని సుహృజ్జనున్

                 వేఁడికో లుచితంబ కావున వేడ్కతోఁ జని సోమకున్

                 వేఁడినన్ ధన మోపఁడేనియు వీనిమాత్రకు నాలుగేన్

                 పాఁడికుఱ్ఱుల నీఁడె వీనికిఁ బాలు ద్రావుచునుండఁగన్2

ఇది ఎంతో మహత్తరమైన విషయం. అడగడానికి మనసు చంపుకోవాలి. సహాయం అర్ధించడమంటే ఆత్మాభిమానాన్ని కుదవబెట్టినట్టే. దీని గురించే ఆదిశంకరాచార్యులవారు "ప్రశ్నోత్తరి" అనే లఘు గ్రంథంలో 'లఘుత్వ మూలం కిం'3 అనే ప్రశ్నకు ("మనిషి ఎప్పుడు చులకనైపోతాడు") "అర్థితైవ" అని సమాధామిస్తారు శంకరులు. దీనికి అర్థం "ఎవరినైనా దేని గురించైనా అర్థించినప్పుడు" అని. దీనినే నన్నయ గారు" వేడు టెంతయు కష్టము" అని చెప్పారు.

ఇది అన్ని కాలాలకు, అన్ని దేశాలకు, అన్ని మతాలకు, అన్ని కులాలకు లింగభేదం లేకుండా వర్తించే అంశం. అది ఇది అనడం ఎందుకు ఇది సర్వులకూ వర్తిస్తుంది. పైగా ఈ పద్యం నన్నయ గారి సోపజ్ఞమే. దీనికి మూలం కానరాదు, అంటే మానవ సమాజానికి సంబంధించిన, వ్యవహారసరళికి సంబంధించిన చక్కని సామాజికాంశం ఇది. పైపద్యంలోని మాటలు ద్రోణుడివి. బాల్యమిత్రుడు, సహాధ్యాయి అయిన మహారాజును అర్థించడం ఆయనకు ఎంతో కష్టంగాను, భారంగాను అనిపించింది. అయినా పేదరికం ఆయన్ను తన స్థాయిని తగ్గించుకొని అర్థించేలా చేసింది. అయినా అవమానం పాలయ్యాడు.

ద్రుపదుడు ద్రోణుణ్ణి మహారాజునైన నాకు, పేదవాడివైన నీతో మిత్రత్వం ఏమిటని గద్దించాడు. ద్రుపదుడి మాటలను నన్నయ గారి పద్యరూపంగా అవలోకిద్దాం.

         చ.    “ధనపతితో దరిద్రునకుఁ, దత్త్వవిదుం డగు వానితోడ మూ

                 ర్ఖునకుఁ బ్రశాంతుతోడఁ గడఁ గ్రూరునకున్, రణశూరుతోడ భీ

                 రునకు, వరూథితోడ నవరూథికి, సజ్జనుతోడఁ గష్టదు

                 ర్జునునకు నెవ్విధంబునను సఖ్యము దా నొడఁగూడ నేర్చునే?”4

ధనవంతునితో దరిద్రునికి, పండితునితో మూర్ఖునికి, ప్రశాంతునితో క్రూరునికి వీరునితో పిరికివానికి, కవచరక్షణ కలవానితో రక్షాకవచం లేనివానికి, సజ్జనునితో దుర్మార్గునికి స్నేహం ఏ విధంగా కలుగుతుంది అని ద్రుపదుడు ప్రశ్నించడంతో తాను అనుకున్నది పొందకపోగా ఊహించని అవమానాన్ని పొందాడు ద్రోణుడు.

అలాగే లక్షాగృహ దహనానంతరం పాండవులు తల్లితో అరణ్యమధ్యమున పడిన బాధలు సామాన్యుల జీవన విధానాన్ని గుర్తుకు తెస్తాయి. ఈ సందర్భంలో పాండవులు దాహార్తితో పడిన బాధను మనం దీనికి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఆగర్భశ్రీమంతులైన పాండవులకు ఆ క్షణంలో దాహార్తిని తీర్చుకునే సదుపాయమే లేకపోయింది. సమీపంలో నీళ్లు లేవు, నీళ్లు త్రాగు సాధనము లేదు. ఆ క్షణంలో వారు కనీసం తాగడానికి నీరుకూడా లేక ఎంతటి కటిక దరిద్రాన్ని అనుభవించారో ఊహించుకోవచ్చు.

తల్లిని, ధర్మజాదులను వటవృక్షము నీడలో ఉంచి భీముడు ఒక సరోవరాన్ని అన్వేషించాడు... అందులో దిగి స్నానంచేసి "కడుపునిండా నీళ్లు త్రాగాడు" అని నన్నయ రాశారు. ఇక్కడ "కడుపునిండా నీళ్లు త్రాగి" అనే ప్రయోగం నన్నయ గారిది. దీనిగురించి ఇక్కడ ప్రత్యేకంగా ప్రస్తావించుకోవాలి. అన్నానికి నోచుకోని పేదలు కడుపునిండా నీళ్లు మాత్రమే తాగుతారనేది చాలామందికి అనుభవైక- వేద్యమే. ఇక్కడ మరో సమస్య- తల్లికి సోదరులకు తాగునీటిని భీముడు తీసుకెళ్లడం అనేది. నీటిని ఒక పాత్రలో నింపుకు పోవాలంటే ఒక పాత్ర కావాలి, కానీ అంతటి మహారణ్యం మధ్యలో పాత్ర లభించే అవకాశమే లేదు. కాబట్టి భీముడు కమలపత్త్రపుటికలతో 5 నీళ్లను తీసుకెళ్లాడని నన్నయ రాశాడు. ఇక్కడ పేదవారు, కూలీలు కాలువల్లో దోసిళ్లతో నీళ్లు త్రాగడం, తాటియాకు దొన్నెలతో నీరు త్రాగడం వంటివి జానపద జీవన విధానంలో గమనించవచ్చు. అలాగే భీముడు ఆ సరోవరంలో లభించిన తామరాకులను దొన్నెలుగా మలిచి నీటిని తీసుకొని ధర్మజాదుల దాహార్తిని తీర్చాడు. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే ఈ సందర్భంలో వ్యాసభారతంలో భీముడు

                 “తేషామర్థేచజగ్రాహ / భ్రాతృూ ణాం భ్రాతృవత్సలః

                 ఉత్తరీయేణ పానీయం / ఆనయామాస భారత6

అని నీటిని వస్త్రంతో గ్రహించి తెచ్చాడని రాయబడి ఉంది. నన్నయ దానిని అమూలకమైన "కమలపత్త్రపుటికలు"గా మార్చడం నన్నయ యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఇక్కడే నన్నయ గారి లోకజ్ఞత అభివ్యక్తం అవుతుంది.

ఈ సందర్భంలోనే వటవృక్షం కింద అలసి సొలసి భుజాల మీది కండువాలనే నేలపై పరుచుకొని, తమ తమ బహుదండాలను తలగడలుగా భావించి నిద్రిస్తున్న సోదరులను, తల్లిని చూసి భీముడు దుఃఖించాడు. ఇక్కడ కటిక నేలపై నిద్రించడం అనేది పాండవుల నిరుపేద స్థితిని తెలియజేస్తుంది. అంతేగాక "నిద్ర సుఖమెరుగదు" అనే లోకోక్తిని కూడా గుర్తుకు తెస్తుంది. ఇక్కడ నన్నయ అగర్భ శ్రీమంతులైన పాండవుల గర్భదరిద్రాన్ని చెప్పడం ఆయనకు సామాన్యుల స్ధితిగతులపై ఉన్న అవగాహనను చూపిస్తుంది. అంతేకాకుండా త్రిభువనసామ్రాజ్యశ్రీప్రభుడగు ధర్మరాజు కటిక నేలపై నిద్రిస్తున్న దరిద్రాన్ని చూసి భరించలేక భీముడు బాధపడడాన్ని, నన్నయ సామాన్య మానవ జీవన విధానాలలో భాగమైన నిద్ర, శయనాలను గూర్చి చెప్పిన పద్యాన్ని ఇక్కడ ప్రస్తావించుకోవచ్చు.

          క.    “త్రిభువనసామ్రాజ్యశ్రీ

                 ప్రభుఁ డగు ధర్మాత్మజుండు ప్రాకృతజనున

                 ట్లభిరూక్షతలంబున ని

                 ట్లభిభూతుం డగునె నిద్ర నతిఖిన్నుండై7

ఈ పద్యంలో నన్నయ “ప్రాకృత జనునట్లు” అని వాచ్యం చేయడాన్ని నన్నయ కాలం నాటి సామాన్య మానవుల నిద్ర, శయ్యా విధానాలుగా భావించవచ్చు. ఈ సందర్భంలోనే కుంతిభోజుడు కూతురు, వసుదేవుని చెల్లెలు, విచిత్ర వీర్యుని కోడలు, మహావీరుడైన పాండు రాజు పట్టమహిషి, వీరాధివీరులు, పరమ ధర్మాత్ములైన పంచపాండవుల తల్లి, సుకుమారి, హంసతూలికా తల్పాలపై శయనించే కుంతిమహాదేవి అలసిపోయి, కటిక నేల మీద రాళ్లు ఒత్తుకుంటున్నా నిద్రపోయింది.... తల్లి కంటే గాఢ నిద్రలో కొడుకులు... అని భీముడు బాధపడడంలో పాండవుల దారిద్ర్య పతాక స్థాయిని భంగ్యంతరంగా వర్ణించాడు నన్నయ.

పాండవులు ఏక చక్రపురంలో విప్రవేషధారులై భిక్షాటన చేస్తూ జీవించడం మానవ జీవితంలోని అధమాధమస్థాయి. ఈ సందర్భంలో నన్నయ

         క.     “ధృతిఁ జదువుచు భిక్షార్థము

                 ప్రతిగృహమున కరుగుచున్న భవ్యుల మౌన

                 వ్రతులం దృప్తులఁ జేసిరి

                 సతతము నందుల గృహస్థ సద్ద్విజులు దయన్.”8

         క.     “జలజప్రియతేజుల వీ

                 రల ధీరుల ధరణివలయరాజ్యశ్రీయో

                 గ్యుల ని ట్లేలొకొ భిక్షా

                 శులఁ జేసి విధాతృఁ డంచు శోకింప జనుల్9

అంటూ పాండవులు భిక్షమెత్తే సందర్భంలో నాటి భిక్షకుల స్థితిగతులనే కాకుండా, పుట్టుకతో సంపన్నులైన వారు కడు పేదవారుగా జీవించడాన్ని కూడా వర్ణించడం చూడవచ్చు.

తెలుగులో అతి ప్రాచీన కావ్యమైన నన్నయ భారతం లో ఎన్నో సందర్భాల్లో ప్రాకృత జనుల గురించి ప్రస్తావన ఉంది. వారు అత్యంత సమర్ధులైనా బ్రాహ్మణ, క్షత్రియ వంశస్థులకు సరిసాటి కాదని కించపరచబడ్డ సందర్భాలు కూడా చిత్రితమయ్యాయి. ఏకలవ్యుడు బొటనవేలు చరిత్ర దీనికి ఒక నిలువెత్తు ఉదాహరణ కాగా సూతపుత్రుడుగా గుర్తింపు పొంది జీవితాంతం అవమాన- భారంతో జీవించిన కర్ణుడు మరొక ఉదాహరణ. ప్రతిభ కంటే జన్మ కారణమైన వర్ణవ్యవస్థలే ఆయా వ్యక్తుల గౌరవ ఛీత్కారాలకు కారణాలు అయ్యాయని ఆయన ప్రస్తావించిన తీరును ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇలాంటి ఉదాహరణలు నన్నయ భారతంతోపాటు ప్రాచీనసాహిత్యంలో కోకొల్లలు.

ముగింపు:

ఆధునికులు చాలామంది, ప్రాచీన కావ్యాలు సామాన్యుల గురించి ఏమీ చెప్పలేదు అని, తమ ఏలికల మెప్పుకోసం ఇంద్రుడు, చంద్రుడు అనే ప్రశంసలు మాత్రమే కానవచ్చేలా రాశారని విమర్శించడం సమంజసం కాదని వీటివల్ల తెలుస్తుంది.

పైన ప్రస్తావించిన విషయాలను గమనిస్తే నన్నయ నాటి సమాజంలో సామాన్యుల జీవితపు తీరుతెన్నులను మనం బేరీజు వేయవచ్చు. ప్రథమాంధ్ర మహాకవి అయిన నన్నయభట్టారకుల వారు తన కవిత్వాన్ని, తన రచనను "లోనారసి" చూడాలని సూచన చేశారు. ఆయన భారతంలో ప్రధాన కథ అయిన భారతాన్ని రసరమ్యంగా, భావబంధురంగా నడిపిస్తూనే, సమాజంలోని చిన్నచిన్న అంశాలను కూడా స్పృశించారు. నన్నయ భారతాన్ని పైపైన కాకుండా ఆయన చెప్పినట్టు “లోనారసి” చూస్తే నన్నయనా టి సామాన్యుని జీవన విధానానికి సంబంధించిన మరెన్నో అంశాలు వెలుగు చూస్తాయని నా విశ్వాసం.

పాదసూచికలు:

  1. శ్రీశ్రీ, మహాప్రస్ధానం, దేశచరిత్రలు,1993, పుట. 73
  2. నన్నయభట్టారకుడు, శ్రీమదాంధ్ర మహాభారతము (ఆదిపర్వం, పంచమాశ్వాసం 218వ పద్యం), 2014, పుట. 565
  3. ఆదిశంకరులు, ప్రశ్నోత్తరి – శ్లోకం.18- గురుకుల్ వెబ్ సైట్ నుండి
  4. నన్నయభట్టారకుడు, శ్రీమదాంధ్రమహాభారతము (ఆదిపర్వం, పంచమాశ్వాసం 204వ పద్యం), 2014, పుట. 559
  5. నన్నయభట్టారకుడు, శ్రీమదాంధ్ర మహాభారతము (ఆదిపర్వం, షష్ఠాశ్వాసము, 174వ వచనం), 2014, పుట. 663
  6. వ్యాసభారతం, ఆదిపర్వం - 150 వ అధ్యాయం- 19వ శ్లోకం
  7. నన్నయభట్టారకుడు, శ్రీమదాంధ్ర మహాభారతము (ఆదిపర్వం, షష్ఠాశ్వాసము, 178వ పద్యం), 2014, పుట. 664
  8. నన్నయభట్టారకుడు, శ్రీమదాంధ్ర మహాభారతము (ఆదిపర్వం, షష్ఠాశ్వాసము, 238వ పద్యం), 2014, పుట. 690
  9. నన్నయభట్టారకుడు, శ్రీమదాంధ్ర మహాభారతము (ఆదిపర్వం, షష్ఠాశ్వాసము, 239వ పద్యం), 2014, పుట. 690

ఉపయుక్తగ్రంథసూచి:

  1. నన్నయభట్టారకుడు. 2014, శ్రీమదాంధ్ర మహాభారతము - ఆదిపర్వం - టి.టి.డి. ప్రచురణలు, తిరుపతి
  2. వేంకటావధాని, దివాకర్ల. 1958, ఆంధ్రవాజ్ఞ్మయారంభదశ- నన్నయభారతం- బర్కత్ పుర, హైదరాబాదు
  3. వేంకటశాస్త్రి, చెళ్లపిళ్ల, 1956, నన్నయభట్టు – సుదీర్ఘ వ్యాసం- కథలు- గాథలు- 2వభాగం- అద్దేపల్లి అండ్ కో ప్రచురణ, రాజమహేంద్రవరం
  4. మృత్యుంజయరావు, జొన్నలగడ్డ, 1979, వ్యాసభారతం – నన్నయ పరిష్కారం, బీవీ అండ్ కో ప్రెస్, త్యాగరాజనగర్, రాజమహేంద్రవరం
  5. మధునాపంతుల సత్యనారాయణశాస్త్రి. 1978, ప్రసన్నకథావిపంచి, తితిదే ప్రచురణ, తిరుపతి
  6. వేంకటావధాని, దివాకర్ల, 1972, నన్నయ భట్టారకుడు- యూజీసీ పబ్లికేషన్స్, హైదరాబాద్
  7. వ్యాసమహర్షి, శ్రీ మహాభారతం, 2018, గీతాప్రెస్, గోరఖ్ పూర్

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]