headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-04 | Issue-03 | March 2023 | ISSN: 2583-4797

1. భారతీయభాషల్లో భాగవతం: విశ్లేషణ

పరిశ కృష్ణస్వామి

తెలుగు ఉపాధ్యాయులు
ఉన్నత పాఠశాల, ఎల్లారెడ్డి మండలం
కామారెడ్డి జిల్లా, తెలంగాణ
సెల్: +91 9885326581. Email: telugaayana.pks@gmail.com

Download PDF


Keywords: ప్రాచీనసాహిత్యం, పోతన, భాగవతం, భారతీయభాషలు, కృష్ణస్వామి

ఉపోద్ఘాతం:

మానవజీవనకళ్యాణానికి భారతీయసంస్కృతి, వాఙ్మయం మూలాలని చెప్పవచ్చు. ఈ విషయం ఉటంకించడానికి భారతదేశం కర్మభూమి అని, పుణ్యభూమి అని సుప్రసిద్ధం. ఈ కారణంగా మనదేశం ప్రపంచానికి గురుస్థానంలో నిలుస్తుంది. ధర్మ, అర్ధ, కామ, మోక్షపురుషార్దాల సాధనలో నిరంతర అన్వేషణలో జ్ఞానానికి పెద్దపీట వేసింది. ఆత్మసాక్షాత్కారం పొందే క్రమంలో ఎందరో ఋషులు, యోగులు, జ్ఞానులు, భక్తులు, త్యాగమయులు, సమాజసేవాసంపన్నులు ఈ దేశ ఉన్నతికి నిర్విరామకృషి చేశారు. ఆ కృషి అంతిమఫలితం ఆత్మానందం. భగవంతునితత్త్వరహస్యం. ఈ విషయాలను స్పష్టం చేసేది భారతీయ ప్రాచీనసాహిత్యం. అవి వేదాలు, ఉపనిషత్తులు, ఇతిహాసాలు, పురాణాలు, కావ్యాలు మొదలైనవి. ఈ రహస్యం తెలిసిన ఎందరో మహాత్ములు భారతభూమిని పుణ్యస్థలంగా కొనియాడుతారు. అందుకు ఒక ఉదాహరణ స్వామి వివేకానంద ఖండాంతరాలు తిరిగివచ్చి ఓడ దిగిన మరుక్షణం ఈ నేల తల్లి పవిత్రధూళిని తన శిరస్సుపై ధరించడమే.

నేటి సమాజంలో నానాటికి దిగజారిపోతున్న నైతికవిలువలు, మానవుడి దృష్టి అభివృద్ధి పేరుతో చేస్తున్న విచక్షణ లేని కృత్యాలేనని ఇలాంటి దుస్థితి నుండి మానవుడు బయటపడి ఈ ప్రపంచం సౌబ్రాతృత్వంతో వెళ్లి విరియాలని, లోకకళ్యాణం జరిగి తీరాలని భావించి, ప్రాచీన వాఙ్మయాన్ని విభిన్న కోణాల్లో ఆవిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందులో భాగంగానే భారతీయ ప్రాచీన వాఙ్మయాలైన వేదాలు, ఉపనిషత్తులు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు, రామాయణ, భారత, భాగవత, కావ్యాలు, పురాణాలు, స్మృతికావ్యాలు ఇలా ఎన్నో కొత్త కొత్త రీతులలో సరికొత్తగా ఆవిష్కరించబడుతున్నాయి. ఈ ఆవిష్కరణలు మానవునికి భారతీయసంస్కృతి, సాంప్రదాయాలు కర్మసిద్ధాంతాల పట్ల భక్తి భావంతో జ్ఞానమార్గం గుండా భగవంతుని చేరే పూలదారులు వేస్తున్నాయి. అలాంటి వాటిలో మన వేదాలు ప్రపంచ భాషల్లోకి అనువదింబడడం గర్వించదగిన అంశం.

దేవభాషగా కీర్తించబడుతున్న సంస్కృతం ప్రపంచభాషలకి ఆదిభాషగా ఊహించవచ్చు. సంస్కృతభాష నుండి అనేకభాషలు పురుడుపోసుకున్నాయని పరిశోధకులు మాట. అటువంటి సంస్కృతభాషలో భారతపుణ్యసీమపై రూపుదిద్దుకున్న రామాయణ, భారత, భాగవతాలను అధ్యయనం చేయడం ఎంతో అవసరం. అలాంటి దారిలో మహాభారతం దేశ, కాల, మనుషుల మధ్య భిన్నభావనలను ఆవిష్కరించి, మానవుడు ఎంచుకోవలసిన మార్గాలను సూచించింది.

భాగవతపురాణవైశిష్ట్యం:

ఈ సృష్టి ప్రయాణం ఎలా సాగుతుంది దానికి కారకులు ఎవరు? ఈ లోకాన్ని నడిపిస్తున్నది ఎవరు? వంటి ప్రశ్నలకు సమాధానంగా ఉద్భవించిన మహాపురాణం భాగవతం. వ్యాసుడు రచించిన 17 పురాణాలతో సంతృప్తి పొందక వ్యాసుడు నారదుని ఉపదేశంతో శ్రీమన్నారాయణని చరిత్ర ఆయన భాగవత కథామృతాన్ని 18వ మహాపురాణంగా రచించి సంతుష్టుడైనాడు. 'అత్ర జ్ఞాన విరాగభక్తి సహిత నైష్కర్మ్యమావిష్కృతమ్' భాగవతం భక్తి జ్ఞాన వైరాగ్య సంయుతమైనదని పై సంస్కృత వాక్యం. భాగవతంలో లేనివిద్య ఇంకెక్కడా కానరాదు అంటే అది అతిశయోక్తి కాదేమో. “భక్త్వా భాగవతం జ్ఞేయం వ్యుత్పత్త్యాన టీకయ” అన్న ఆర్యోక్తిని పరిగణించి భాగవతం భక్తి ప్రధానమైనది. భాగవతం భగవంతుడైన శ్రీహరిలీలావిశేషాల కథల సమాహారం అష్టాదశపురాణాలలో ఒకటి.

శ్రీమహాభాగవతపురాణం ఆయా సందర్భాలలో దుష్టశిక్షణ, శిష్టరక్షణ నిమిత్తం అవతరించిన అవతారమూర్తుల కథలు, అందులోని ఆ భగవానుని కృపకు పాత్రమై మోక్షం పొందిన వివిధ రూపాలు, శ్రీహరి లేని చోటు, పాత్ర, వస్తువు ఏదీ లేదని అణువణువున శ్రీహరి ఉంటాడని, భక్తితో భజిస్తే పలుకుతాడని, నిరూపిస్తాయి భాగవత కథలు. అందుకే భాగవతం భక్తిరస కథాకావ్యం. ఇంత విశేష మహాత్యం కలిగిన భాగవతం వ్యాసుడి చేత రచించబడడం లోక కళ్యాణార్ధమే. ఇంతటి విశిష్టత కలిగిన భాగవతం ప్రపంచ భాషల్లోకి అనువదించబడడం, దాని ప్రశస్తినీ, మాహాత్య్మమును, భక్తిమార్గప్రాధాన్యతను తెలియజేస్తుంది. అలా భారతీయభాషల్లో అనువదించబడిన కొన్నింటిని రేఖామాత్రంగా ప్రస్తావించడం మరియు పోతన భాగవతరచన మాధుర్యం రుచి చూపడం ఈ వ్యాస ప్రధాన ఉద్దేశం.

హిందీ భాషలో భాగవతం:

1935 ప్రాంతంలో కృష్ణకథా సాహిత్యం శ్రీ వల్లభాచార్యుల ప్రమేయంతో జనబాహుళ్యంలోకి వచ్చింది. భాగవతం ఈ వల్లభాచార్యుల ప్రవచనాలను ఆధారంగా చేసుకొని వారి శిష్యుడైన సూరదాసు కొన్ని భాగాలను ‘సూరసాగర్’ అనే పేరుతో దోహాలుగా గానం చేశాడు. ఈ సూరసాగర్ లోని పదాలు 1,25,000 కాక నేడు 10,000 మాత్రమే లభిస్తున్నాయి. సురదాసు భాగవతం భగవల్లీలాత్మక పదం -

"బ్రజ్ భయౌ మహర కై పుత్, జబ్ యహ బాత్ సునీ!

 సుని ఆనందే సబ్ లోగ్ గోకుల్ నగర్ సుని"

అని ప్రారంభమవుతుంది. పిల్లల భావాలను బాలకృష్ణుని చిత్రణలో కవి అద్భుతమైన తెలివితేటలను మరియు సూక్ష్మ పరిశీలనను ప్రవేశపెట్టాడు-  

"మయ్యా కబహిం బడౌగీ చీటీ?

కితీ బార్ మోహిం దూధ్ పియత  భాఈ, యహ అజహూ హై ఛాతీ!" 2

'అమ్మ నా చిన్న జుట్టు ఇంకెప్పుడు పెరుగుతుంది ఎంతో కాలంగా నేను పాలు తాగుతున్న నా జుట్టు అజ్జు జుట్టుల ఎప్పుడు అవుతుంది.' అని బాలకృష్ణుని  అమాయకత్వాన్ని చిలిపితనాన్ని గమ్మత్తుగా చిత్రించాడు సూరదాసు. ఈ విషయాన్ని ప్రముఖ హిందీ కవి కొనియాడారు. ఒక్కోసారి తులసీదాసు కవిత్వాన్ని మించిపోయే కవిత్వం సూరదాసు రాసాడని అనిపిస్తుంది. ఈయన వల్లభాచార్యుని శిష్యుడు. శ్రీ వల్లభాచార్యుడు శ్రీమద్భాగవతమునకు వ్యాఖ్యానము కూడా రచించినట్లు తెలుస్తుంది. 1590 నుండి 1640 ప్రాంతంలో ‘దశమస్కంధ’ అనే పేరుతో ఆనందదాసు భాగవతకథానువాదం చేశాడు. హిందీలో 'సదాసఖి పాల్' భాగవతం ఆమూలాగ్రం వచనంలో అనువాదం చేశాడు.

కన్నడ భాషలో భాగవతం:

సంస్కృతభాగవతం ఆధారంగా చాటు విఠ్ఠలనాథుడు కన్నడలోకి యధానువాదం చేశాడు. ఇది కన్నడ భాషలో చాలా ప్రసిద్ధికెక్కింది. ఇది భామినిషట్పది వృత్తాలలో సంగ్రహించిన రచన. ఈ కన్నడ అనువాదం ఒక్కరితో సాగక మరో ఇద్దరు కవుల సహాయంతో సాగిందని పూర్వపరిశోధకులు వెల్లడించారు. చిక్క దేవరాయ ఒడయార్ అనే రాజకవి రచించిన భాగవతం కన్నడ సాహిత్యలోకంలో విశేష ఆదరణ పొందినట్లుగా తెలుస్తుంది.

అస్సామీ భాషలో భాగవతం:

వైష్ణవాచార్యుడు శ్రీశంకరదేవుడు (1449-1569) రచించిన భాగవతం అస్సామీ భాషాసాహిత్యంలో ప్రధానమైనది. అయితే ఇందులోను పూర్తిగా శంకరదేవుడే రచించలేదు. కొంతభాగం శిష్యులు అనువదించినట్లు తెలుస్తుంది. భాగవతంలోని కొన్ని రుక్మిణి-హరణం, కృష్ణుడిజీవితం వంటి భాగాలను రచించాడు. విశేషమేమిటంటే శంకరదేవుడు - పోతనలు సమకాలికులు. మరియు వారి ఇద్దరి అనువాదభావాలకు పోలిక ఉండడం మరో విశేషం. అస్సామీ గద్య సాహిత్యపితామహుడు బట్టదేవుడు. అస్సామీ సాహిత్యాన్ని ప్రభావితం చేసిన ‘కథాభాగవత్’ వచనంలో అత్యద్భుతంగా రచించినవాడు. ఈయన 1558-1638 కాలంలోని వాడు. బట్టదేవుడికే ‘భట్టాచార్యుడు’ అని నామాంతరం ఉన్నట్లు తెలుస్తుంది.

తమిళభాషలో భాగవతం:

వరదరాజు అయ్యంగార్ విశిష్టాద్వైత సాంప్రదాయం అనుగుణంగా భాగవతాన్ని తమిళంలోకి అనువదించాడు.16వ శతాబ్దానికి చెందిన మరోకవి ‘శైల్వైశూడువార్’ అనే కవి 5000 పద్యాలతో భాగవతాన్ని అనువదించాడు.

బెంగాలీ / వంగభాషలో భాగవతం:

‘మాలధరవసు’ అనే కవిసంస్కృతభాగవతదశమస్కంధం నుండి శ్రీకృష్ణనిర్యాణం వరకు ‘శ్రీకృష్ణ విజయం’ పేరుతో రచించాడు. ఇది విష్ణుపురాణం ఆధారంగా సాగినట్లుగా పరిశోధకులు వెల్లడించారు. మాలధరవసు కవి 15 శతాబ్దానికి చెందిన వాడని తెలుస్తుంది. ‘శ్రీకృష్ణమంగళ’ అనే పేరుతో మాధవాచార్య కవి భాగవతదశమస్కంధం ఆధారంగా అనువాదం సాగించినట్లు తెలుస్తోంది. భాగవత దశమ, ఏకాదశస్కంధాల ఆధారంగా ‘శ్రీకృష్ణమంగళ’ అనే పేరుతో మరోకవి కృష్ణదాస్ భాగవత అనువాదం సాగింది. పరశురామదాసు కవి దశమ, ఏకాదశస్కంధాలననుసరించి ‘శ్రీకృష్ణమంగళ’ అనే పేరుతోనే మరో కావ్యం రచించినట్లుగా తెలుస్తుంది.

16వ శతాబ్దానికి చెందిన రఘునాథభట్టాచార్య ‘కృష్ణప్రేమ తరంగిణి’ అనే పేరుతో ద్వాదశస్కంధాలను 20వేల పద్యాల్లో అనువదించాడు. వీరికే ‘భాగవతభట్టాచార్య’ బిరుదు ఉన్నట్లుగా తెలుస్తుంది. భాగవతద్వాదశస్కంధాలను అనువదించిన కవి దుర్గభానంద మరొక కవి. దుఃఖీశ్యామదాసు దశమస్కంధభావం ఆధారంగా ‘గోవింద మంగళ’ అనే గ్రంథం రచించాడు. మరొక కవిగోపాలవిజయాఖ్యాక ‘దేవకీనందనసింహ’ అనే పేరుతో భాగవతఅనువాదం చేశాడు. భాగవతం అధారంగా చైతన్యుడు చైతన్య మతంగా వ్యాప్తి చేశాడు. భజనకీర్తనల ద్వారా భగవంతుడిని పొందవచ్చునని చాటి చెప్పిన వాడు.

"It seems highly probable that the chaitanya sect and its doctrines… had an independent origin directly from the srimadbhagavata tradition."3

గుజరాతి భాషలో భాగవతం:

గుజరాతి భాషలో నరసింహ మెహతా రచించిన భాగవతం సుప్రసిద్ధం. భాగవతం దశమస్కంధభాగాలను ఋతురాముడు అనే కవి మరియు బాలభానుడు అనే కవులు విడివిడిగా రచించినట్లు తెలిసింది. ప్రేమానందుడు అనే మరోకవి కూడా గుజరాతి భాషలో భాగవతాన్ని రచించినట్లు తెలుస్తుంది. రత్నేశ్వరుడు భాగవతాన్ని సంక్షిప్తీకరించారు.

ఒరియా భాషలో భాగవతం:

ఒడియా భాషలో జగన్నాథ దాసు భాగవతం ఎంతో ప్రత్యేకతను కలిగి ఉంది. అయితే ఇది సామాన్య ప్రజామోదం కోసం రచించినట్లుగా తెలుస్తుంది. దీని వెనుక కూడా ఒక కథావిశేషం కూడా ఉంది. జగన్నాథ పండితుని తల్లి పద్మావతి దుఃఖాన్ని పోగొట్టడానికి జగన్నాథ పండితుడు ఈ భాగవతం ధనవంతులందరికి, దరిద్రులకి సమానంగా అందాలని అత్యంత సులభశైలిలో ఒడియా భాషలో రచించి ప్రచారం చేశాడు. హాయిగా పాడుకోవడానికి వీలుగా నవాక్షరీ ఛందస్సులో రచించారు. అంత్యప్రాసలు అందమైన భావాలను జోడించి పామరులు సైతం పాడుకొనేలా రచించి ప్రసిద్ధికి ఎక్కాడు. అందుకే ఒరియా ప్రజలు జగన్నాథ దాస భాగవతాన్ని పూజిస్తారు. భక్తి భావంతో పట్టిస్తారు. ఈ విషయం చూస్తే తెలుగులో పోతన భాగవతానికి పోలికలు కనిపిస్తుంది. తెలుగు భాగవతం కూడా పండిత పామర జనరంజకం కదా! జగన్నాథుడు రచనకుగాను శ్రీ చైతన్య ప్రభువు ‘ఒతిబొడి’ (సహజకవి) అని కీర్తించాడు. ఒడియా భాషలో జగన్నాథ దాసు భాగవత రచనకు చైతన్యాన్ని ప్రభావం కూడా ఉండి ఉండవచ్చు. 

మరాఠీ భాషలో భాగవతం:

మరాఠీ సాహిత్యంలో భోపదేవుడు రాసిన భాగవతవ్యాఖ్య సుప్రసిద్ధమైంది. ఏకనాథుడు ‘ఏకనాథభాగవతం’, నామదేవుని శిష్యుడు ‘పరసా భాగవత్’ భాగవతం రచించినట్లు తెలుస్తుంది. ఇక ఒక లక్ష ఓవీ (మరాఠీ ఛందస్సు) వృత్తాల్లో దశమ స్కంధాన్ని శివకళ్యాణుడు అనువదించాడు. కృష్ణ దయార్నవుడు అనే కవి 40,000 ఓవీలతో దశమస్కంధంపై గ్రంథాన్ని రచించాడు. ఇది అసంపూర్ణమైనందున ఉత్తమశ్లోకుడు అనే శిష్యుడు పూర్తి చేసినట్లు చరిత్ర తెలుపుతుంది. మేరోపంత్ ‘మంత్ర భాగవతా’న్ని రచించాడు.

మలయాళం భాషలో భాగవతం:

మలయాళంలో పేరుపొందిన వారిలో శంకరఫణిక్కర్ (14వ శతాబ్దం) ‘భారతమాల’ అనే గ్రంథంలో భాగవతదశమ స్కంధం కథను రచించి ఆ తర్వాత కాలంలో భారతం రాసినట్లు తెలుస్తుంది. అలాగే మలయాళ కవులలో మాధవఫణిక్కరు కూడ భాగవతాన్ని రచించినట్లు తెలుస్తుంది. కృష్ణగాధ లేక కృష్ణఫ్యాక్టు అనే పేరుతో 15వ శతాబ్దానికి చెందిన నంబూద్రి అనే కవి భాగవత రచన చేశాడు. అయితే భాగవతానికి ఉన్న మాహాత్మ్యం ఈ గ్రంథానికి ఉందని మలయాళ ప్రజల విశ్వాసం. ఎలత్తచ్చన్ (16వ శతాబ్దం) అని కవి ‘శ్రీమద్భాగవతం, భాగవత గద్యం’ అనే రెండు గ్రంథాలు రచించాడని తెలుస్తుంది.

తెలుగు భాగవతం:

ఈ విశిష్టగ్రంథరాజం భారతదేశంలో వివిధ భాషల్లోకి వివిధ ప్రక్రియలరూపంలో అనుసృజనలు జరిగి ఉండటం జగద్విత విషయమే. అందులో భాగంగా తెలుగు భాషలోకి 14వ శతాబ్దానికి చెందిన బమ్మెర పోతన అనువదించడం తెలుగుజాతికే తలమానికమై నిలిచింది. 'శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్…' అంటూ భాగవత రచన ప్రారంభించి తెలుగు భాష సౌందర్యాన్ని, శ్రీకృష్ణపరమాత్మ రూపాన్ని, ఆయన లీలలను అత్యంత రమ్యంగా తీర్చిదిద్దిన పోతన ధన్యజీవి, పుణ్యజీవి, కారణజన్ముడు. తెలుగు పద్య పడతిని భావయుక్తాలంకార చీరలు కట్టి పద చమత్కార మువ్వలు తొడిగి నట్టింట నాట్యమాడించిన ఘనత పోతన భాగవత పద్యాలది.

"భాగవతము తెలిసి పలుకుట చిత్రంబు 

శూలికైన తమ్మి చూలికైన ;

విబుధజనుల వలన విన్నంత కన్నంత 

తెలియవచ్చినంత తేటపఱుతు"

పదవ తరగతి విషయం కాదంటూ ఆరంభంలో చెప్పిన పద్యం ఇది. సంస్కృత భాగవతం కేవలం పండితుల సొత్తుగా నిలచినప్పటికీ దాని అంతరార్థం ప్రతీ మనషికి అవసరం. భాగవతము పండితభోగ్యం కాక భక్తభోగ్యం అని "భక్త్వా భాగవతం జ్ఞేయం వ్యుత్పత్త్యాన టీకయ" అన్నది ఆర్యోక్తి. ఈ దూరదృష్టితో భాగవత అనువాదకులు ఆ గ్రంథానికి మెరుగులు దిద్దుతూ తమతమ భాషల్లోకి అనువదించి ధన్యులయ్యారు.

"పలికేడిది భాగవతమఁట 

పలికించెడి వాడు రామభద్రుండఁట నేఁ

బలికిన భవహర మగునఁట

పలికెద వేఱొండు గాథ పలుకఁగ నేలా?" 5

అని రామభక్తి చాటుతూ, భాగవతం పలకడం నా అదృష్టం అంటూ కృష్ణకథను రచించాడు. పోతన 'శ్రీమహాభాగవతం' పేరుతో తెలుగులో స్వేచ్ఛానువాదం చేసి భాగవతానికి అజరామరకీర్తిని తెచ్చి పెట్టాడు. శ్రీకృష్ణుడు అంటే ఎలా ఉంటాడో తెలియని తెలుగు వారికి తన భాగవత అనువాదంతో ఒక రూపాన్ని ఇచ్చి ఆ రూపానికీ, లీలావిశేషాలకూ దాసులను చేసితెలుగు వారిని పరమ భక్తులుగా తీర్చిదిద్దారు. ఒకానొక సందర్భంలో వ్యాసుడు రచించిన మూల భాగవతాన్ని మరిపించే రచన పోతన భాగవతం అంటే అపచారం అవుతుందేమో.

భాగవతం శ్రీకృష్ణకథామృతం. ఈ కథలను అత్యంత రమనీయంగా లలిత మనోహరంగా తెలుగులోకి అనువదించిన వాడు పోతన. పోతన అనువాదం యధానువాదం, స్వేచ్ఛానువాదం  రెండు పద్ధతులను పాటించాడు. అవసరమైన చోట కథా భాగాలను పెంచి పోషించాడు. దానికి ఉదాహరణ 'గజేంద్రమోక్షం ఘట్టం', 'రుక్మిణి కళ్యాణం'... వంటివి. భక్తిని చాటే సందర్భంలో పోతన మహా భక్తుడు ప్రహ్లాదునితో సమానంగా భగవంతుని స్మరించాడు. పోతన రచన కౌశలమంతా గజేంద్రమోక్షంలో గజేంద్రుడి ప్రార్థనలో -

"ఎవ్వనిచే జనించు జగ; మెవ్వని లోపలనుండు లీనమై; 

యెవ్వని యందు డిందుఁ; బరమేశ్వరుఁ డెవ్వఁడు; మూల కారణం

బెవ్వఁ; డనాదిమధ్యలయుఁ డెవ్వడు; సర్వముఁ  దానయైన 

వాఁ డెవ్వఁడు; వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేఁడెదన్" 6 

ఈ సృష్టికి మూల కారకుడు ఎవడో వాడిని స్మరిస్తానంటూ చేసిన ప్రార్థన పోతన ప్రార్థన లాగే వినిపిస్తుంది. "సిరికిఁజెప్పడు శంకచక్రయుగముఁ జేదోయి సంధింపడ..." అనే పద్యం పోతన రచనలో భక్తవరేణ్యుడు శ్రీమహావిష్ణువు యొక్క భక్తపాలన ప్రథమ కర్తవ్యంగా కనిపిస్తుంది. అట్లే వామన చరిత్రలో బలిని అణిచివేసే సందర్భంలో -

"ఇంతింతై వటుఁడింతయై మఱియుఁ దానింతై నభోవీథిపై

నంతై తోయదమండలాగ్రమున కల్లంతై, ప్రభారాశిపై

నంతై, చంద్రుని కంతయై  ధ్రువుని పైనంతై మహార్వాటి పై

నంతై, సత్యపదోన్నతుండగుచు బ్రహ్మాండాంతసంవర్ధియై." 7

అనే పద్యంలో సూర్యబింబం కొలమానంగా సాగిన తీరు కంటికి వామనుడి పూర్ణరూపం సాక్షాత్కరింపజేస్తుంది. ఈ పద్యం భాషకు వర్ణచిత్రం అనే చెప్పవచ్చు. బాలకృష్ణుని వర్ణించినటువంటి దశమస్కంధంలోని ప్రతి పద్యము పసిపాపల అమాయకపు బోసినవ్వులూ, గోపికలంతా కూడి శ్రీకృష్ణుని అల్లరి పనులను యశోదకు పిర్యాదు చేసే  సందర్భంలో "ఓయమ్మ నీ కుమారుడు మాయిండ్లను పాలు పెరుగు మననీడమ్మా..." అంటూ గొల్లలు పలుకగా యశోదాదేవి 'చిన్నికృష్ణుని అమాయకుడనీ, ఏ పాపమెరుగడనీ, మీ ఇండ్లలో లేరా పిల్లలు? అని గొల్లభామలనే ఎదురడిగినప్పుడు ప్రతీ తల్లి హృదయాన్నీ, తన బిడ్డపై ప్రేమను సాక్షాత్కరింప చేస్తాడు పోతన.  శ్రీ కృష్ణుని అల్లరి చేష్టలు భరించాలనిపించేంత అందంగా చిత్రించాడు. ఒక్కటేమిటి పోతన భాగవతంలోని ప్రతి పద్యం చమత్కారయుక్తమైనది, రసవంతమైనది, సారభూతమైనది.

తెలుగు భాగవతాలలో ప్రసిద్ధి చెందినవి పోతన రచించినది ఒకటి. రెండవది వెంగమాంబ రాసిన ద్విపద భాగవతాలు. వెంగమాంబ సైతం మోక్షచింతనకే ద్విపదభాగవత రచన చేసినట్లు అవతారికలో "ముదము దీపింపస న్మోక్ష చింతనముఁ జేయగా భూసుర  శ్రీకృష్ణుని మాడ్కి" 8 అని చెప్పుకున్నది. పోతనకు ముందే మడికి సింగన భాగవత దశమస్కంధం అనువాదం చేసినట్లు తెలుస్తుంది. ఇది ద్విపద ఛందస్సులో మధురాకాండము, కళ్యాణకాండము, జగదభిరక్షాకాండములు అనే మూడు భాగాలుగా విభజించి రాసినట్లు తెలుస్తుంది. ఇందులో కొంత భాగమే  లభ్యమైనట్లు తెలుస్తుంది.

"సత్యభామయుఁ బారులుతీరు జూచి / నత్యుదాత్తతఁ బ్రీతి హరి వేడుటయును;

 వేగంబె శౌరి యావృక్షంబుఁ బెఱికి / నాగారిపై నిడి నాతియుఁ దాని

ద్వారకాపురి కేఁగ వాసవుఁ.."

శ్రీకృష్ణుడు తన ప్రియసఖి సత్యభామ కోరిక మేరకు పారిజాత అపహరణ సందర్భాన్ని ద్విపదలోని కళ్యాణకాండములో రమ్యంగా చిత్రించారు సింగన కవి. జనమంచి శేషాద్రిశర్మ ‘తాండవ కృష్ణ’గా రంగాజమ్మ ‘ప్రబంధం’గా శ్రీపాదకృష్ణమూర్తిశాస్త్రి ‘వచనభాగవతం’గా రచించారు. 'ద్విపద భాగవతము' కొండేపూడి సుబ్బారావు ఇంకా ఎంతోమంది కవివరేణ్యులు పలురకాల ప్రక్రియలో భాగవతాన్ని రచించారు. కొన్ని లభ్యమైనవి. మరికొన్ని అలభ్యమైనవి. ఇలా తెలుగు భాషలో ఎన్నో భాగవతాలు ఉన్నప్పటికీ పోతన భాగవతం మకుటాయమానం. పోతన రచించిన భాగవతంలో స్వతంత్రరసపోషణ, పాత్రచిత్రణ, కథావివరణ, పద్యమాధుర్యం, పదజాలవినియోగం అన్ని కలిపి ఆ గ్రంథానికి వన్నెతెచ్చాయి. అంతేకాక పోతన వంటి భక్తకవులు భాగవత కథలోని పాత్రలలో పరకాయప్రవేశం చేసి రాయడం, అందులో మునిగి భాగవత పాఠకులనూ ఆ గ్రంథంలో లీనం చేయడమే దాని ప్రత్యేకత. వీటన్నిటికంటే మించి ‘కృష్ణకథ’ కావడం తెలుగు వారికి 'ఇష్టకథ'గా భాగవతం నిలిచింది.

మరో విషయం ఏ.సి.భక్తి వేదాంతస్వామి ప్రభుపాద - 'ఇస్కాన్' సంస్థ వారు శ్రీమద్భాగవతాన్ని ప్రపంచపు పలు భాషల్లోకి అనువదిస్తూ భాగవత మాధుర్యాన్ని ప్రపంచానికి పరిచయం  చేయడం భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే ప్రయత్నంగా గర్వించదగిన విషయం.

ముగింపు:

వివిధ భాషల్లోని భాగవతాలను పరిశీలిస్తే అత్యధికంగా 'దశమస్కంధం' అనువదించబడినదని అర్థమవుతుంది. అంటే భాగవతం అంటే దశమస్కంధభాగమే అన్న భ్రమ కలుగుతుంది. అలా ఎందుకంటే దశమస్కంధం సాక్షాత్తు కృష్ణపరమాత్ముని జన్మవిశేషాలు, ఆయన లీలలు అందంగా తోచడమే అయి ఉండవచ్చు. అయితే భాగవతం భక్తిరసకావ్యం. ఈ భక్తిని ఆధారంగా రచించిన భాగవతాలు లేకపోలేదు. కానీ దశమ స్కంధ కథలు శ్రీకృష్ణుడి రూపాన్ని కన్నులముందు నడయాడేలా చేస్తాయి. అది భాగవత కథలకున్న ప్రత్యేకత. అయితే భాగవతం వివిధభాషల్లోకి అనువదించబడినట్లే భాగవతంపై పలు వ్యాఖ్యలుకూడా వచ్చాయి. అలాంటి వాటిలో 'శ్రీధరీయవ్యాఖ్య' ముఖ్యమైనది. ఇది పోతన అనువాదానికి సహకరించినదని స్పష్టంగా తెలుస్తుంది. విశ్వనాథ చక్రవర్తి 'సారార్థదర్శిని', మధుసూదన సరస్వతి 'గూడార్థదీపిక', వల్లభాచార్య 'సుబోధిని' ప్రసిద్ధమైనవి.

పాదసూచికలు:

  1. సూరసాగర్, దశమస్కంధం,  దోహా 1
  2. సూర్ దోహావలి , అబిద్ రిజవీ - పుట 66
  3. PADYAVALI, S.K.DAI - Introduction - page.7
  4. పోతన భాగవతం, ప్రథమస్కంధం-17
  5. పోతన భాగవతం, ప్రథమస్కంధం - పద్యం 18
  6. పోతన భాగవతం, అష్టమస్కంధం - పద్యం 73
  7. పోతన భాగవతం, అష్టమస్కంధం - పద్యం 622
  8. ద్విపదభాగవతం, తరిగొండ వెంగమాంబ, అవతారిక
  9. ద్విపదభాగవతము (మడికి సింగన), పరిష్కర్త -మహాదేవ శాస్త్రి, పుట -120

ఉపయుక్తగ్రంథసూచి:

  1. కరుణశ్రీ. భాగవతవైజయంతిక. హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి, 1988.
  2. యాదగిరి, కె. పోతన భాగవతసమాలోచనం. వరంగల్లు: కాకతీయ విశ్వవిద్యాలయం, 2004.
  3. లక్ష్మీరంజనం, ఖండవల్లి. భారతీయసాహిత్యసంకలనం. హైదరాబాదు: తెలుగుఅకాడమి, 1979.
  4. పోతన భాగవతము 1 & 2 సంపుటములు, తి.తి.దే, 2015

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]