AUCHITHYAM | Volume-03 | Issue-13 | December 2022 | ISSN: 2583-4797
౩. తల్లాప్రగడ విశ్వసుందరమ్మ - జాతీయోద్యమ కవిత్వం
కప్పల సురేశ్
పరిశోధకులు, తెలుగుశాఖ,
హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం - 500046, తెలంగాణ రాష్ట్రం.
సెల్: +91 7680073973, Email: sureshbabu147147@gmail.com
Download PDF
Keywords: తల్లాప్రగడ, విశ్వసుందరమ్మ, జాతీయోద్యమకవిత్వం, దేశభక్తి, సంఘసంస్కర్త, కవయిత్రి
ఉపోద్ఘాతం:
ఒక మారుమూల ప్రాంతాన సామాన్య కుటుంబంలో జన్మించి సంఘసంస్కర్తగా, కవయిత్రిగా, త్యాగశీలిగా, స్వాతంత్ర్య సమరయోధురాలిగా, మాతృభూమికి నిరుపమానమైన సేవలందించిన గొప్పవ్యక్తి తల్లాప్రగడ విశ్వసుందరమ్మగారు. ఆమె ఆంధ్రదేశంలో 1899 జూన్ 30న పశ్చిమగోదావరి జిల్లా భీమవరం తాలూకా ‘ఉండి’ అనే గ్రామంలో మల్లవరపు శ్రీరాములు, సీతమ్మల ప్రథమ సంతానంగా జన్మించారు. 9వ ఏటనే టంగుటూరుకు చెందిన తల్లాప్రగడ నరసింహశర్మతో వివాహమైంది. బాల్య వివాహం వల్ల బడి చదువు పూర్తిచేయలేకపోయింది. పండిత పుత్రిక కావడంతో సాహిత్యంతో పాండిత్యాన్ని సంపాదించింది. 16వ ఏట గృహిణిగా కాకినాడ వెళ్ళారు. ఆమె భర్త నరసింహశర్మ పిఠాపురం రాజా నడిపే అనాధశరణాలయానికి సహాయకునిగా ఉండేవారు. ఆ కాలంలోనే విశ్వసుందరమ్మగారికి అనాథలంటే సానుభూతి, వాత్సల్యం ఏర్పడ్డాయి. భర్తతోపాటు మొదటగా బ్రహ్మసమాజంలో చేరి ఎంతో ఇష్టంగా సంఘసంస్కరణ చేశారు. తరువాత రాజకీయ కార్యక్రమాలలో కూడా పాల్గొని ఉద్యమనేతగా కూడా వ్యవహరించారు.
విశ్వసుందరమ్మ రాజకీయ రంగం:
1920లో గాంధీజీ ఇచ్చిన స్వాతంత్ర్యోద్యమ పిలుపు దేశ ప్రజలకు శంఖారావంలా ఉత్తేజపరిచింది. ఆ సందర్భంలో విశ్వసుందరమ్మగారు కూడా ఆకర్షితులై భర్తతోపాటు ఉద్యమం వైపు నడిచారు.1921లో అఖిల భారత సభలకు హాజరైన విశ్వసుందరమ్మకు గాంధీజీ, నెహ్రూ, టంగుటూరి ప్రకాశం పంతులు, భోగరాజుపట్టాభి సీతారామయ్య వంటి నాయకులు ఉపన్యాసాలు ఆమెను ఉద్యమం వైపుకు మరింత దగ్గర చేశాయి. గాంధీజీ ఇచ్చిన సలహాలు సూచనలతో దేశసేవకు తమ జీవితాన్ని అంకితం చేయడానికి సిద్ధపడి రాజకీయ సభలన్నిటిలో పాల్గొని ప్రజలకు నూతన ఉత్సాహాన్ని కల్గించారు.
ఉద్యమ నేతగా విశ్వసుందరమ్మ:
ఆంధ్ర దేశంలో రాజకీయ రంగంలో ప్రవేశించి దేశభక్తురాలిగా, గాంధీజీ శిష్యురాలిగా ఖాదీ ధరించి ఖాదీ ఉద్యమాన్ని నడిపించి దేశంలోని బానిసత్వాన్ని రూపుమాపడానికి అహర్నిశలు కృషి చేసిన గొప్ప త్యాగమూర్తి తల్లాప్రగడ విశ్వసుందరమ్మగారు. ఆంధ్రదేశంలో జరిగిన అన్ని ఉద్యమాలలో ఈమె ప్రధాన పాత్ర పోషించారు. పశ్చిమగోదావరిజిల్లా మహిళలకు నాయకత్వం వహించి ఆమె ఉద్యమం నడిపారు. భర్త నరసింహాశర్మతోపాటు చాగల్లులో ‘ఆనందనికేతన్’ ఆశ్రమం స్థాపించి హరిజన బాలబాలికలకు విద్యాబుద్ధులు నేర్పించి దేశభక్తులుగా తీర్చిదిద్దిన ఘనత ఈవిడకే దక్కుతుంది. అస్పృశ్యతా నివారణ, స్త్రీజనాభ్యుదయం, నూలు వడకడం, ఖద్దరు నేయడం మొదలగు నిర్మాణాత్మక కార్యక్రమాలు చేపట్టారు.
ఉప్పుసత్యాగ్రహం:
1930 లో గాంధీజీ ఆదేశంతో ఉప్పుసత్యాగ్రహ ఉద్యమం దేశం నాలుగు ప్రక్కల వ్యాపించింది. ప్రజల ఉత్సాహానికి ఆవేశానికి, అంతులేదు. ఆనందనికేతన్ ఆశ్రమం నుంచి 1930 ఏప్రిల్ 13న శ్రీ తల్లాప్రగడ విశ్వసుందరమ్మగారు, ఆమె భర్త, తమ్ముడు, చెల్లెలు, శ్రీ తల్లాప్రగడ ప్రకాశరాయుడు వంటి బంధుజనులు, మిత్రులు పెద్ద దళంగా ఏర్పడి సత్యాగ్రహం చేయటానికి బయలుదేరారు. ఆమె భర్త, సోదరుడు ఈ ఉద్యమ కాలంలో అరెస్టు అయ్యారు. అదే సమయంలో విశ్వసుందరమ్మగారు ఏ మాత్రం భయపడకుండా ఉద్యమ భాద్యతలు చేపట్టారు. చివరకు 1930 మే మొదటివారంలో ఏలూరులో ఆమెను కూడా అరెస్టుచేశారు.
విశ్వసుందరమ్మగారు అరెస్టు అయిన సందర్భంలో ఇలా అంటారు “గాంధీమాహాత్ముడు మొదలు పెట్టిన ఈ ధర్మ సమరంలో పాల్గొన్నందుకు నేనేమీ పశ్చాత్తాపం చెందడం లేదు. భారతీయులను దాస్యమున ముంచి బ్రిటీషు గవర్నమెంటు తప్పు చేయుచున్నది. పైగా మానవులకి దేహారోగ్యము పెంపొందించునది అగు ఉప్పుపై ఏడుకోట్ల పన్ను కట్టుటయేకాక ప్రజల నీతిని చెరచు మద్యమును అమ్మించి ద్రోహము చేయుచున్నది. ఈ బ్రిటీషు ప్రభుత్వమును మేము స్వాతంత్ర్యము కోరుట మా జన్మహక్కు కావున మేమూరికే ఉండము” అంటూ ఆంగ్లప్రభుత్వాన్ని దుయ్యబడుతూ తీర్మానాన్ని అందించి దళిత స్త్రీలతో కలిసి “వందేమాతరం” అంటూ దేశభక్తితో రాయవెల్లూరు జైలుకు వెళ్లారు.
శాసనోల్లంఘనఉద్యమం:
ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులుగారి ఆధ్వర్యాన కాకినాడలో జరిగిన తూర్పుగోదావరి జిల్లా రాజకీయ మహాసభలో శాసనోల్లంఘన తీర్మానాన్ని విశ్వసుందరమ్మగారే ప్రతిపాదించారు. శాసనోల్లంఘన ప్రథమదళంలో తనపేరు వ్రాయించుకున్నారు. నాటినుంచి విదేశీవస్త్ర దహనాలు, బహిరంగసభల్లో ఉపన్యాసాలు ఇస్తూ ప్రతి కాంగ్రెసు సమావేశాలకు హాజరయ్యింది.1932లో శాసనోల్లంఘనం రెండవఘట్టం దేశాన్ని ఒక్క కుదుపు కదిపింది. దమననీతిని అవలంబించిన ప్రభుత్వం సభలు, సమావేశాలు నిషేదించారు. ప్రచారాలు వీల్లేదన్నారు. ఆ నిషేధాజ్ఞను అతిక్రమించి 1932 జూలై 6న తెనాలిలో శ్రీమతి విశ్వసుందరమ్మ అధ్యక్షతన తెనాలిలో మండల కాంగ్రెస్ సభ జరిపారు. చురుకుగ సభ ముగించి, విజయోత్సాహంతో ఊరేగింపు జరుపుతుండగా పోలీసులు వచ్చారు. లాఠీఛార్జీ జరిగింది. ఆమెతోపాటు 26 మందిని అరెస్టు చేశారు. దెబ్బల నుంచి రక్తం కారుతు వుండగా “శ్రీ గాంధీ నామాం మరువాం, మరువాం, సిద్దాము జైలూకు వెరువాం వెరువాం” అంటూ ఆరు నెలల జైలుశిక్ష అనుభవించటానికి రెండవసారి రాయవెల్లూరు వెళ్లారు.
చెరసాల జీవితం:
ఆనాడు స్త్రీలను చెరసాలలకు తీసుకెళ్ళగానే వారిచేత అంచుల్లేని తెల్ల చీరలు కట్టించేవారు.పైగా చేతిగాజులను పగలకొట్టించేవారు. హత్యానేరం, దొంగతనాలు చేసి జైలుకు వచ్చిన స్త్రీలు ప్రభుత్వ ఆదేశాలను పాటించేవారు. కాని దేశం కోసం జైళ్ల పాలైన విశ్వసుందరమ్మ లాంటి త్యాగధనులు అంచుల్లేని తెల్ల చీర కట్టడానికి, గాజులు పగల కొట్టడానికి నిరాకరించారు. అది భారతీయ సంస్కృతిని కించపర్చడమేనని నిరసన తెలియజేశారు. టంగుటూరి ప్రకాశం పంతులుగారు రాయవెల్లూరు జైలుకు వెళ్ళి జైలు అధికారులతో మాట్లాడి చివరకు అంచులు కలిగిన చీరలు కట్టుకోవడానికి అనుమతి ఇప్పించారు. అంతేకాకకుండా గాజుగాజుల బదులుగా రబ్బరుగాజులు వేసుకోవడానికి జైలు అధికారులు అంగీకరించారు.
జైలు జీవితాన్ని విశ్వసుందరమ్మగారు మహా పుణ్యకార్యంగా భావించారు. కార్యకర్తలుగా అరెస్టు అయిన నారీమణులెందరినో ఆ జైలులో కలుసుకున్నారు. జైలు కూడును భారతమాత ప్రసాదంగా భావించారు. ప్రార్ధనాగీతాలతో దేశభక్తి గీతాలాపనలతో కాలక్షేపం చేయడమే కాక చెరసాల జీవితంపై ఎన్నో గీతాలు రచించారు. అక్కడ గుజ్జు నాగరత్నం, పొణకా కనకమ్మ, కంభంపాటి మాణిక్యాంబ, కాశీభట్ల వెంకట రమణమ్మ, కోటమర్తి కనక మహాలక్ష్మమ్మ, మూల్పురి చుక్కమ్మ, కలగిర పిచ్చమ్మ, మద్దాలి వెంకట సుబ్బమ్మ, మంగమ్మ, రాజమ్మ, బసవరాజు రాజ్యలక్ష్మమ్మ మొదలైన స్త్రీలనెందరినో కలుసుకున్నారు.
క్విట్ఇండియా ఉద్యమం:
ఆంధ్రదేశం క్విట్ ఇండియా నినాదాలతో మారుమ్రోగింది. చాగల్లు ఆశ్రమం నుండి విశ్వసుందరమ్మ, నరసిహశర్మ దంపతులు మరింత ఉత్సాహంతో ఉద్యమానికి ఊపిరి పోసారు. ఆశ్రమంలోని బాలబాలికలందరు పెద్దలందరితో కలిసి నిరసనలు, నినాదాలు చేశారు. విశ్వసుంధరమ్మ దంపతులు ఊరూరా తిరుగుతూ మరింత ముమ్మరంగా ప్రచారం చేసారు. విజయమో వీరస్వర్గమో అంటూ ఆంధ్రదేశమంతటా నినాదాలు చేసారు. ఒకపక్క నిషేదాజ్ఞలు అమలులో ఉన్నా ఎవరు భయపడలేదు. ప్రభుత్వపు దమనకాండ ప్రజలను భయపెట్టి అదుపు చేయలేకపోయింది. అందులో చాగల్లు ఆశ్రమం ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. ఆ ఆశ్రమాన్ని ఏ విధంగా అదుపు చెయ్యాలో వారికి అంతు పట్టలేదు. అనేక ఆటంకాలు కలగ జేసారు. అయినా విశ్వసుందరమ్మ దంపతులు నదురు బెదురు లేకుండా వారి కార్యక్రమాలు సాగిస్తూనే వున్నారు. ఆ చుట్టుపక్కలనున్న దేశభక్తులైన ప్రజలందరికి చాగల్లు ఆశ్రమం పెద్ద దిక్కుగా నిలిచింది. ఆ అశ్రమ చర్యలు అణచలేక ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని చాగల్లులోని ఆనంద నికేతన్ ఆశ్రమాన్ని తాళాలు వేసుకున్నారు. దానితో ఆశ్రమ వాసులు రోడ్డుపై నిలబడవలసి వచ్చింది.
ఐనా ఆ దంపతులు నిరుత్సాహపడకుండా, నిడదవోలు కాలువ గట్టున తిరిగి సమావేశమేర్పాటు చేసుకున్నారు. తిరిగి ఆమె కార్యకలాపాలు యధాతధంగా నిర్వహించడం మొదలు పెట్టారు. వీరి ఆశ్రమంలో పెరిగి పెద్దవారైన హరిజన బాలలు తిరిగి సంఘసేవలో, ఉద్యమాలలో చురుగ్గా పాల్గొనడం ప్రారంభించారు. అది చూసిన తల్లా ప్రగడ విశ్వసుందరమ్మ, నరసింహశర్మ దంపతుల ఉత్సాహానికి ఆనందానికి అంతు లేదు. వారు చేసిన కృషి ఫలించిందనుకున్నారు.
విశ్వసుందరమ్మ కవితారంగం:
తల్లాప్రగడ విశ్వసుందరమ్మగారు ఒక ప్రక్క భర్త నరసింహశర్మగారితో పాటు రాజకీయాలలో ప్రవేశించి ప్రధాన పాత్ర పోషిస్తూ మరొకపక్క కవయిత్రిగా ఎనలేని కృషి చేసారు. తల్లాప్రగడ విశ్వసుందరమ్మగారి కవితలు ‘కవితా కదంబము’ అనే పేరుతో ఆవిడ సోదరులు డా॥మల్లవరపు వెంకట కృష్ణారావుగారు, మల్లవరపు విశ్వేశ్వరరావుగార్లు సాహితీలోకానికి అందించారు. ఈ ‘కవితా కదంబము’లో ‘హృదయవీణ’ పేరుతో 60 కవితలు, ‘కథా కవిత’ పేరుతో 7 కవితలు, ‘సుజనస్తుతి’పేరుతో 5 కవితలు, ‘భారతీయ సాంఘిక గీతావళి’ పేరుతో 48 కవితలు ప్రచురించారు. వీటిలో కొన్ని కవితలు భారత స్వాతంత్ర్యోద్యమాన్ని దృష్టిలో ఉంచుకొని రాసినవి కాగా, ఇంకొన్ని అందమైన ప్రకృతి వర్ణనలతో భావకవితలు, నాయక స్తుతి స్మృతి కవితలు, గాంధీ కీర్తనలు, భక్తికవితలు మనకు కన్పిస్తున్నాయి.ఈ కవితలన్ని చక్కని భావాలతో పాఠకులను ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ‘కథాకవితలు’ తప్ప మిగిలిన కవితలన్ని చిన్న చిన్న కవితలే అవడం విశేషం.
ముద్దుకృష్ణ గారు ప్రచురించిన ‘వైతాళికులు’అనే గ్రంథంలో తల్లా ప్రగడ విశ్వసుందరమ్మగారి కవితలు ప్రచురించారు. కృష్ణశాస్త్రి, వేదుల, అబ్బూరి, శ్రీశ్రీ, రాయప్రోలు, గురజాడ, విశ్వనాధ, రామిరెడ్డి, సౌదామిని, బంగారమ్మ మొదలైన మహా కవుల, కవయిత్రుల మధ్యలో విశ్వసుందరమ్మగారి కవితలు ప్రచురించడం ఆవిడ కవితల ప్రాధాన్యాన్ని తెలియ చేస్తోంది. కళాప్రపూర్ణ ఊటుకూరి లక్ష్మీకాంతమ్మగారు తమ ‘ఆంధ్ర కవయిత్రులు’ గ్రంథంలో 5వతరము ఆంధ్ర కవయిత్రుల్లో ‘మొదటి కవయిత్రి’గా పేర్కొన్నారు. అంతేకాకుండా పురుషులతో పాటు పాల్గొని ముందంజ వేసిన గౌరవము శ్రీమతులు తల్లా ప్రగడ విశ్వసుందరమ్మ, బసవరాజు రాజ్యలక్ష్మి (సౌదామిని) చావలి బంగారమ్మగార్లదే అని తమ గ్రంథంలో పొందుపరిచారు.
జాతీయోద్యమ కవిత్వం:
తల్లా ప్రగడ విశ్వసుందరమ్మగారు తన శక్తిని, సమయాన్ని, సంఘసంస్కారానికి, సంఘసేవకు, దేశసేవకు వినియోగించినట్లుగానే, ఆమె తన కవనశక్తిని కూడా సంఘం కోసం, దేశం కోసం వెచ్చించారు. ‘ఆంధ్రరాష్ట్రము’ అనే కవితలో “సూర్య భగవానుడుదయించే సురుచిరముగ సుజనులందరు మేల్కాంచి శోభిల్లంగ నిదురమున్గుట పాడియా నీకు నిపుడు ఆంధ్రుడా! వేగపడ నీది యదను సుమా!” అంటూ ప్రారంభం చేసి ఆంధ్ర దేశము దుస్ధితిలో నున్నది. దీనిని కాపాడుమని ప్రబోధగీతములా రచించారు. ఆంధ్రరాష్ట్రము ఒకనాడు వైభవముతో నున్నదని భావించక నేటి స్థితి పరిశీలించి ఆంధ్ర రాష్ట్ర అవతరణకై, కృషి చేయమని హెచ్చరించారు.
ఉగాది పండగ గురించి, “పరుల పాలనము నిరసించి మన దేశ ప్రజల పాలనము నాశించి ద్రోహుల ప్రచారముల ద్రుంచమని తెల్పుతూ వచ్చెనిదే సంవత్సరాది” అంటారు. రాట్నంతిప్పమంటారు. ఖద్దరు కట్టమంటారు. ఉప్పు సత్యాగ్రహం, అహింసా మార్గము విడువక, స్వహింసనైనా సహించి సత్యాగ్రహాన్ని చేయమంటారు. “భారతీయుల మగుచు ప్రభవించి ఫలమేమి నిజదేశ స్వాతంత్ర్యమును గాంచక” అని ప్రశ్నించుతారు. బ్రిటిషువారిని దుయ్యబట్టిన విధం చూస్తే ఉత్సాహం కలుగుతుంది. “కొంపతీయు వర్తకుడై కొట్టినాడు దేశమంత మాటలాడితె శిక్షలంట, పాటపాడితే కేసులంట” అని వర్ణించుతారు. “వనితలందర నగచాట్లు పాలొనర్ప ఆంగ్లజాతికి గౌరవమంత రించె, చాలునింక ఆంగిలేయుల పాలనమ్ము-చోటులేదిక వారికిచ్చోటసుంత” అని తమ కవితలలో తేల్చి చెప్పేశారు.
విశ్వసుందరమ్మ ‘సైమన్ కమీషన్’ అనే కవితలో ఆంగ్లేయులు మనపట్ల వ్యవహరించిన తీరును గుర్తుచేశారు. స్వాతంత్ర్యం అని పలికితే దేశానికి దోషమని, వాక్ స్వాతంత్య్రం పనికిరాదని నోటికి తాళాలు వేశారు. భారత స్వాతంత్ర్యం కోసం ముందుకు అడుగుపెట్టగా చెరసాలలో బంధించి అనేక కష్టాలకు గురి చేశారు. సైమన్ కమీషన్ వచ్చి కొత్తగా చేసినది ఏమీ లేదని అంతా బూటకమని మన ప్రజా పోరాటమే మనకు రక్షయని పిలుపునిచ్చారు. “ఓ భరతమాతా! బానిసత్వంతో నీ ప్రజలు బాధపడుతున్నారు. ఖద్దరు కవచము, సత్యఖడ్గము దాల్చి శాంతి సమరం చేస్తున్నారు. వారికి జయమొసంగము”, అప్పుడే స్వరాజ్య సిద్ధి కల్గుతుందని ‘సమర విజయం’ అనే కవితలో భరతమాతను విశ్వసుందరమ్మ వేడుకున్నారు.
రెండుసార్లు జైలు జీవితం అనుభవించిన విశ్వసుందరమ్మ మహా కవయిత్రిగా జైలు జీవితాన్ని గురించిన అనేక కవితలు ఎంతో సహజంగా రచించి అందరి మన్ననలు అందుకున్నారు.స్త్రీల చెరసాల జీవితాన్ని గురించి ఉన్నది ఉన్నట్లుగా యదార్ధ విషయాలను వర్ణించి కవితలు రాసిన ఏకైక కవయిత్రి ఈవిడ. “బహువస్త్రములు కల్గుభామలేయచ్చట జతవస్త్రములు తోడజరుప వలసె – నేతివెన్నలతోడ నేస్తమాడెడి వారే తైలహీనాన్నమును దినగవలసె” ఇంటి దగ్గర రకరకాల రంగురంగుల చీరలను ధరించు స్త్రీలకు ఈ జైలులో జంట చీరలే గతి అయ్యాయి. నెయ్యి, వెన్నలతో కమ్మగా భుజించే స్త్రీలకు తైలవిహీనమైన భోజనం తినాల్సివచ్చిందని, పట్టుపరుపులపై నిద్రించు స్త్రీలు కఠిన నేలపై నిద్రిస్తున్నారని తనతో ఉద్యమాల్లో పాల్గొని జైలుపాలైన స్త్రీల త్యాగాన్ని కవితగా రాశారు.
చెరసాలలో తనలాగే శిక్షలు అనుభవిస్తూ ఖైదీలుగా ఉన్న స్త్రీలను గురించి రాసిన విశేషాలు చెప్పుకో తగినవి. ‘ఏ’ క్లాసు ‘బి’ క్లాసు ఖైదీలను గౌరవించినట్లుగా ‘సి’ క్లాసు స్త్రీలను గౌరవించరని వారి దుస్థితిని ‘స్త్రీలచెరసాలలో’ అనే కవితలో విశ్వసుందరమ్మ చక్కగా వర్ణించారు. నల్లచీరలు కట్టిన జైలు వార్డర్లు అడుగడుగునా చెరసాల స్త్రీలను భయపెడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని “అల యశోకవనాన సీతమ్మలాగ, గడుపుచున్నారు నెలతలు ఖైదు బ్రతుకు - రాయ వెల్లూరు జైలు నిర్బంధమందు” అని చెరసాల స్త్రీలను అశోకవనంలో రాక్షసుల మధ్యలో ఉన్న సీతమ్మ పరిస్థితితో పోల్చారు.
విశ్వసుందరమ్మగారు గాంధీజీ ప్రభావంవల్ల ‘మద్యపాన నిషేధం’ అనే అంశాన్ని కూడా ప్రజలలోకి తీసుకెళ్లారు. వివిధకోణాల నుంచి మద్యపానసమస్యను పరిశీలించిన ఆమె తాగుడుని నిరసిస్తూ అనేక కవితలు వ్రాశారు. ఒకచోట “కల్లు స్వదేశియే, కనుక ద్రావగవచ్చు ననెడి దుర్వాదమున్ వినకుమయ్య” అని హెచ్చరిస్తారు. ‘వితంతువివాహం’అనే కవితలో బాలవితంతువుల గోడు వినమంటారు. స్త్రీజనాభ్యుదయానికి పాటు పడమంటారు. సంస్కరణభావాలతో మానవసేవ చేసిన శ్రీ వీరేశలింగం పంతులు, గాంధీజీలను కీర్తించుతారు. వారి అడుగు జాడలలో ప్రజలని నడవమని ఆయా కవితలలో విశ్వసుందరమ్మగారు పేర్కొన్నారు.
ముగింపు:
తల్లాప్రగడ విశ్వసుందరమ్మగారు ఒక ఉద్యమనేతగా, ఒక దేశభక్తురాలుగా, త్యాగశీలిగా, మహా కవయిత్రిగా మనకు కన్పిస్తారు. స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొని మాణిక్యాంబ వంటి స్త్రీమూర్తులకు గురువుగా నిలిచారు. హరిజన బాలబాలికలను ఉద్దేశించి ఆనందనికేతన్ ఆశ్రమాన్ని స్థాపించి వారికి అండగా నిలిచారు. తండ్రి వల్ల లభించిన పాండిత్యంతో ఉద్యమ కవితలు రాసి ఎందరో యవతీ యవకులను స్వాతంత్ర్యోద్యమం వైపు నడిపించారు. సంఘ సంస్కరణలో భాగంగా స్త్రీ అభ్యుదయానికి తోడ్పడ్డారు. 1920 నుంచి 1948 వరకు దేశం కోసం పాటుపడి కీర్తిగడించిన గొప్ప దేశభక్తురాలు విశ్వసుందరమ్మగారు.
ఉపయుక్తగ్రంథసూచి:- దుర్గాభాయి, దేశ్ ముఖ్ & గిరిజ, అచ్యుతుని. 1987. స్వాతంత్ర్య సమరంలో ఆంధ్ర మహిళలు. హైదరాబాదు: ఆ. సా.ప. ప్ర. మ్యూజియం ప్రచురణలు.
- ప్రభావతి, వాసా. 2016. భారతీయ సాహిత్య నిర్మాతలు( తల్లాప్రగడ విశ్వసుందరమ్మ). బెంగుళూరు: సాహిత్య అకాడమి, కృత్తికా ప్రింటర్స్.
- లక్ష్మీకాంతమ్మ, ఊటుకూరి. 1975. ఆంధ్ర కవయిత్రులు (ప్రథమ ముద్రణ). ఖైరతాబాదు: దక్షిణ భారత ప్రెస్.
- వైదేహి, అల్లాడి. 1975. ఆంధ్రదేశము -స్త్రీలు. హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి ప్రచురణలు.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.