headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-03 | Issue-13 | December 2022 | ISSN: 2583-4797

2. జానపదుల జనశ్రుతులు

ఎ. మహేశ్‌ కుమార్‌

ఎం.ఏ., యూ.జి.సి.-నెట్‌, ఎ.పి.సెట్‌.,
అతిథి అధ్యాపకులు, మహరాణి ఆదిలక్ష్మి దేవమ్మ ప్రభుత్వ డిగ్రీ & పి.జి కళాశాల, గద్వాల.
జోగులాంబ గద్వాల జిల్లా, తెలంగాణ రాష్ట్రం.
సెల్: +91 9505828120, 9346650862. Email: maheshkumargujjula6@gmail.com

Download PDF


Keywords: జానపదం, సామెతలు, ఫోక్-లోర్, జనశ్రుతి, వ్యంగ్యం, హాస్యం, నీతి

ఉపోద్ఘాతం:

ప్రాచీనకాలం నుండి నేటి ఆధునికకాలం వరకు కూడా గ్రామీణ ప్రాంతాలలోని ప్రజల జీవనవిధానం అనేది విభిన్నంగా ఉండి వివిధ రకాల అంశాలతో కూడి ఉంటుంది. గ్రామీణుల ఆచారవ్యవహరాలు, సంస్కృతి - సంప్రదాయాలు, మూఢనమ్మకాలు, కథలు, ఆటలు, పాటలు, కళలు విశ్వాసాలు మొదలయినవి అన్ని వారి జీవన విధానంతో ముడిపడి ఉంటాయి. ఇలాంటి గ్రామీణ ప్రాంత ప్రజల సాంస్కృతిక వికాసాన్ని తెలియజేసెదే జానపద విజ్ఞానం. ‘‘జానపదం’’ అనే పదం ‘‘జనపదం’’ అనే పదం నుండి ఆవిర్భవించింది. జనపదం అనగా పల్లె లేదా గ్రామం. జానపద విజ్ఞానాన్ని ఆంగ్లంలో ‘‘Folk lore’’ అని పిలుస్తారు.  ‘‘Folk lore’’ అనే పదం  ‘‘volklehre’’ అనే జర్మన్‌ భాషా పదం నుండి వచ్చింది. జానపద విజ్ఞానానికి  ‘‘Folk lore’’  అన్న పదం సూచించిన వ్యక్తి డబ్ల్యూ జె.థామ్స్‌. ‘‘Folk’’ అనగా ‘‘నిరక్షరాస్యులయిన కర్షకులు’’ ‘‘lore’’  అనగా పాండిత్యం అని అర్థం. నిరక్షరాస్యుల పాండిత్యమే ‘‘జానపద విజ్ఞానం’’.

జానపదులు తమకు సంబంధించిన ప్రత్యేక సంస్కృతిని కలిగి ఉంటారు. వారి సంబంధిత ఆటలు, పాటలు, కళలు మొదలయినవి అన్ని ‘‘జానపద విజ్ఞానం’’ పరిధిలోకి వస్తాయి. అయితే జానపద విజ్ఞానం మౌఖిక జానపద సాహిత్యం, సాంఘిక ఆచారాలు, భౌతిక వస్తు సంస్కృతి, జానపద కళలు, జానపదుల భాష అనే ప్రధాన భాగాలుగా ఉంటూ తిరిగి ఇవి అన్ని విభజింపబడి ఉంటాయి.

బిరుదురాజు రామరాజు, నాయని కృష్ణకుమారి, తంగిరాల వెంకట సుబ్బారావు, ఆర్‌.వి.ఎస్‌ సుందరం మొదలయిన జానపద సాహితివేత్తలు జానపద సాహిత్యంను శాస్త్రీయంగా 1) గేయశాఖ 2) దృశ్యశాఖ 3) వచనశాఖ అనే మూడు ప్రధాన భాగాలుగా విభజించడం జరిగింది.

జానపదుల నిత్యజీవితంలో చెప్పుకునే కథలు, సామెతలు, పొడుపు కథలు, జాతీయాలు మొదలయినవి వచన శాఖలో అంతర్భాగంగా ఉంటాయి.

సామెతలు – నిత్యజీవితంలో ప్రాధాన్యం:

మనోహరమైన పోలికలతో జీవిత అనుభవాలను ఆవిష్కరిస్తూ సామెతలను ఉపయోగించి సందర్భానుసారంగా మార్గ నిర్ధేశనం చేయడం జానపదుల నిజజీవితంలో సాధారణ అలవాటు. వారి జీవన విధానంలో సామెతలకు ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. సంక్షిప్తంగా ఉంటూ సందేశానిచ్చేది సామెత. అందుకే ‘‘సామెత లేని మాట ఆమెత లేని ఇల్లు’’ అనే మాట బాగా ప్రసిద్ధమయింది.

సామెత అనేది ‘‘సామ్యత’’ అనే పదం నుండి ఏర్పడిరదని డా॥ చిలుకూరి నారాయణ రావు గారి అభిప్రాయం. ఇక్కడ ‘‘సామ్యత’’ అంటే పోలిక. తెలుగులో సామెతకు శాస్త్రం, జనశ్రుతి, లోకోక్తి, నానుడి అనే పేర్లు కూడా కలవు. సామెతను ఆంగ్లంలో ‘‘Proverb’’ అని వ్యవహరిస్తారు.

“సామెత” అనే పదాన్ని మొదటి సారిగా 15వ శతాబ్దంలో ‘‘వరాహపురాణం’’లో ప్రయోగించినట్లు తెలుస్తుంది. అంతకు ముందే నన్నయ, తిక్కన, సోమన, పెద్దన లాంటి ప్రాచీన కవులు సందర్భానుసారంగా వారి రచనలలో సామెతలను ఉపయోగించడం గమనించవచ్చు. ప్రత్యేకంగా మొల్ల తన రామాయణంలో సామెతల గురించి ప్రస్తావిస్తూ చెప్పిన పద్యం ఒకటి బాగా ప్రాచూర్యంలో ఉంది.

కం. ‘‘కందువ మాటలు, సామెత
       లందముగాఁ గూర్చి చెప్ప నది తెనుఁగునకున్‌
       బొందై, రుచియై, వీనుల
       విందై, మఱి కానుపించు విబుధుల మదికిన్‌.” (మొల్ల.రా.  అవ. 18.)

తెలుగు భాషలో సందర్భానికి తగినట్లుగా సామెతలు ఉపయోగించినప్పుడు ఆ సామెతల వలన భాష యొక్క తీరు చాలా అందంగా కనిపిస్తుంది అని మొల్ల వెల్లడిరచింది. జానపదులు తమ మాటల మధ్యలో ఉపయోగించిన కొన్ని సామెతలను పరిశీలిస్తే వాటిలోని నిగూఢత అది అందించే సందేశం మనకు అవగతమవుతుంది.

వివిధ సామెతలు – సందేశాలు:

1) ఒడ్డు చేరేదాకా ఓడ మల్లయ్య ఒడ్డు చేరాక బోడి మల్లయ్య:

నేటి సమాజంలో ఎవరికైనా ఏదైనా ఆపద వచ్చి ఎదుటివారి సహాయం కోరేటప్పుడు ఒక విధంగా ప్రవర్తిస్తారు. తీరా ఆపద నుండి బయట పడినాక వారు నడుచుకునే విధానం ప్రవర్తించే తీరు చాలా వేరుగా ఉంటుంది. అంటే అవసరం ఉన్నప్పుడు ఒకలా ఉండి, అవసరం లేనపుడు మరోలా ఉండే  సందర్భాలలో ఈ సామెతను ఉపయోగిస్తారు.

2) చెడపకురా చెడేవు:

సామెత సంక్షిప్తంగా ఉన్నప్పటికి దాని సందేశం మాత్రం గమనించవలసిందే. సమాజంలో ఎదుటి వారికి చెడు తలపెడితే అది తిరిగి ఏదో ఒకరోజు మనకు కూడా జరుగుతుంది. అని తెలియక ఇతరులను ఇబ్బంది పెట్టే వారి విషయంలో ఈ సామెతను ఉపయోగిస్తారు.

3) ఊదిబత్తిల పొగ జూసి ఊరంటుకుంది అన్నడట:

గ్రామీణ ప్రాంతాలలో కానీ, పట్టణాలలో కానీ ఎక్కడైనా శుభప్రదమైన రోజులలో ఇంట్లోపూజా కార్యక్రమాలు నిర్వహించి అగరుబత్తిలు వెలిగించి వాటిని ఇంటి ముందు గడప దగ్గర పెట్టడం సాధారణం. అలా వెలిగించిన ఊదిబత్తిల నుండి వచ్చే పొగను చూసి ఊరే అంటుకుంటున్నది అని  ప్రచారం చేశాడట. అసలు విషయం పూర్తిగా తెలుసుకోకుండా తనకు తాను ఏదో ఊహించుకుని ప్రచారం చేసే వ్యక్తులు చాలామందే ఉన్నారు. అలాంటి వారి విషయంలో ఈ సామెతను ఉపయోగిస్తుంటారు.

4) చెప్పిన మాటలు గాలికి, తిన్న తిండి లోనికి:

ఏ మాత్రం కష్టపడకుండా, ఎవరు ఏ విషయం మంచి కోరి చెప్పినా అది పట్టించుకోకుండా, సోమరిలాగా తింటూ జీవితం గడిపేవారి విషయంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. మనిషిగా పుట్టినందుకు కష్టపడి పని చేస్తూ జీవించాలనేది సహజమైన ధర్మం. అలా కాకుండా ఆవారాగా జీవితం గడిపేవారిని ఉద్ద్యేశించి ఈ సామెతను ఉపయోగిస్తారు.

5) మందిది మంగళవారం మనది సోమవారం:

తప్పులెంచువారు తమ తప్పులెరుగరు అన్నట్లు  నేటి సమాజంలో తాము చేసే తప్పులను గమనించకుండా వాటిని సమర్ధించుకుంటూ, ఇతరుల తప్పులను మాత్రం ఎత్తి చూపేవారు చాలా వరకు కనిపిస్తు ఉంటారు. అలా వారి విషయాలు సమర్ధించుకుని ఇతరుల విషయాలలో జోక్యం చేసుకునే సందర్భంలో ఈ సామెతను ఉపయోగిస్తుంటారు.

6) గంగల పుట్టిన లింగాలన్ని ఒకటే:

కొన్ని కొన్ని ప్రత్యేక సందర్భాలలో పంచాయితీలప్పుడు కాని, ఏవైనా సమావేశాలలో కాని కుటుంబంలోని అందరూ ఒకే మాటకు కట్టుబడి ఉంటారు. అది వాస్తవమైనా, అవాస్తవమైనా వారు మాత్రం వారి వారి నిర్ణయానికే కట్టుబడి ఉంటారు. అలాంటి సందర్భాలలో ఈ సామెతను ఉపయోగిస్తుంటారు.

7) అన్ని ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటే - ఏమి లేని ఆకు ఎగిరెగిరి పడ్డదట:

కొంతమంది తమకు ఎన్ని రకాల సిరి సంపదలు ఉన్నా ఢాంబికాలకు వెళ్ళకుండా వారి వారి హద్దులలో జీవిస్తూ జీవితాన్ని గడుపుతూ, వారికి చేతనైనా సహయాన్ని ఇతరులకు చేస్తూ ఉంటారు. కానీ మరికొందరు చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా గొప్పలకు పోయి ప్రదర్శనలు ఇస్తూ చివరికి ఇబ్బందుల పాలవుతారు. అలాంటి వారిని ఉద్దేశించి ఈ సామెతను ఉపయోగిస్తూ ఉంటారు. ఈ సామెత వెనకాల అంతరార్థం ఏమిటంటే ఎంత ఎదిగినా కూడా మన హద్దుల్లో మనం జీవించాలి అనేది ఇక్కడ స్పష్టమవుతుంది.

8) అయినోళ్లకి ఆకులో పెడతరంట - కానోళ్ళకి కంచంలో పెడతరంట:

ప్రాచీన కాలం నుంచి నేటి ఆధునిక కాలం వరకు కూడా అరటి ఆకులో భోజనం చేయడం ఒక సంప్రదాయం ఆరోగ్యకరం కూడా. గొప్పవారి ఇళ్ళలో విందులు జరిగేటపుడు అరటి ఆకులో భోజనం పెట్టడం సాధారణ విషయం. కానీ విందుకు వచ్చిన దగ్గరి బంధువులకు ఆకులో భోజనం పెట్టి, మిగతా వారికి కంచంలో పెట్టడం అనేది భేదంగా చూడటమే. అంటే మన అని భావించిన వారిని ఒకలాగా వేరే వాళ్ళని మరోలాగా చూసినపుడు ఈ సామెతను బాగా ఉపయోగిస్తూ ఉంటారు. అందరిని సమానంగా చూడాలనే ఉపదేశం ఈ సామెతలో మనం గ్రహించగలగాలి.

9) ఉంటే ఉగాది లేకపోతే ఏకాసి:

డబ్బులు ఉన్నపుడు ఒకలాగా ఉండి, డబ్బులు లేనపుడు మరోలా ఉండే వారి విషయంలో ఈ సామెతను ఉపయోగిస్తారు. గ్రామీణ ప్రాంతాలలో ఈ సామెత బాగా ప్రచారంలో ఉంది. కష్టపడి పని చేసి సంపాదించిన డబ్బులతో ఒక రోజంతా విలాసవంతంగా గడిపి, మరుసటి రోజు ఖాళీ కడుపులతో జీవించే వారి విషయంలో ఈ సామెతను ప్రదానంగా వాడుతుంటారు. ఎంత సంపాదించినా అది భవిష్యత్తుకు కూడా ఉపయోగపడే విధంగా ఉండాలి అనేది ఈ సామెత ఉద్ద్యేశం చేతిలో డబ్బులు ఉన్నాయి కదా అని విచ్చల విడిగా ఖర్చు చేసి మరుసటి రోజు ఏమి లేవని బాధపడే కంటే ముందు జాగ్రత్తగా ఆలోచించాలనేది ఇక్కడ మనం గమనించవలసిన విషయం.

10) ఏడ్చే వానికి ఎడమ పక్కన - కుట్టే వానికి కుడి పక్కన కూర్చోరాదు (నిలబడ రాదు):

ఎలాంటి సందర్భాలలో అయిన ఏడ్చేవాళ్ళు ఎప్పుడు ఎడమ వైపు చీదుతూ ఉంటారు. అదే విధంగా ఏవైనా కుట్టేవాళ్ళు ఆ సూదిని కుడివైపుకు లాగుతూ ఉంటారు.వీరి ఇద్దరిలో ఎవరి ప్రక్కన ఉన్న అది మనకే ఇబ్బందికరంగా ఉంటుంది. అంటే మనకు అనూకూలంగా లేని వారి ప్రక్కల మనం ఉండకూడదు. అనేది ఈ సామెత అంతరార్థం. ఒక వేళ అలాంటి వారి ప్రక్కన ఉంటే దాని వలన ఎలా ఇబ్బంది పడతామో స్పష్టంగా ఈ సామెత వివరిస్తుంది.

ఇలా చర్చించుకుంటూ పోతే హితంతో కూడి హస్య మేళవింపుగా ఉంటూ వ్యంగ్యం వ్యక్త పరుస్తూ జానపదుల జీవితాలతో ముడిపడి ఉన్నా సామెతలు కోకొల్లలు. ఒక జీవితానికి సరిపడా అనుభవాన్ని ఈ సామెతలు అందిస్తాయంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదు.

ముగింపు:

ఎన్నొ రకాల విషయాలకు నెలవైనది జానపద విజ్ఞానం బిరుదురాజు రామరాజు, నాయని కృష్ణకుమారి, నేదనూరి గంగాధరం, తంగిరాల వెంకట సుబ్బారావు, ఆర్‌.వి.ఎస్‌. సుందరం లాంటి మొదలయిన జానపద సాహితివేత్తలు, అదే విధంగా గ్రిమ్స్‌ సోదరులు, సి.పి. బ్రౌన్‌, డబ్య్లూ. జె. థామ్స్‌, మెకంజి, అలన్‌డండస్‌ లాంటి పాశ్చాత్యుల విశేష కృషి ఫలితంగానే జానపదుల మౌఖిక ప్రచారంలో ఉన్న అనేక విషయాలు నేడు గ్రంథస్తం కాబడి చాలా మంది విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండి జానపద విజ్ఞాన పరిశోధకులకు దిక్సూచిలాగా మారాయి.

పూర్వం వారు ఎలా అయితే జానపదులతో మమేకమై వారి సాహిత్యంను ఏ విధంగా అయితే సేకరించారో నేటి జానపద పరిశోధకులు, జానపద అధ్యయన కారులు గ్రామీణ ప్రాంతాలలో నివసించే వారితో పూర్తిగా మమేకం అయితే మరింత జానపద సాహిత్య సంపద వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా జానపదుల ప్రదర్శనలను విరివిగా చిత్రీకరించి వాటిని ప్రసార మాధ్యమాలలో ప్రదర్శించటం, వారితో వివిధ ప్రాంతాలలో ప్రదర్శనలు ఇప్పించటం ద్వారా కూడా అనాదిగా వస్తున కళారూపాలను అందరికి పరిచయం చేసి వాటిపై సంపూర్ణ అవగాహన కల్పించెందుకు అవకాశం ఉంటుంది.

జానపదుల ఉత్సవాలు జరిగే సమయాలలో క్షేత్ర పర్యటనలు చేసి వారు ఆడే ఆటలు, పాడే పాటలు, గేయాలు మొదలయినవి అన్ని సేకరించి పుస్తకరూపంలో తీసుకురాగలిగితే భావితరాలకు అందే ఆస్కారం ఉంటుంది. అంతే కాకుండా జానపద కళాకారులు వారి కుటుంబాలలోని తర్వాతి తరానికి వాటిని నేర్పించే ప్రయత్నం చేస్తే కళారూపాలను సజీవంగా ఉంచుకొని సాహితి ప్రియులను అలరించవచ్చు.

ఏది ఏమైనప్పటికి జానపద విజ్ఞానం తరగని గని వంటిది. అది ఏనాటికైనా స్థిరంగా నిలిచిపోయే సాహిత్య సంపద. ఎన్నో రకాల విశిష్టమైన సాంప్రదాయాలకు నెలవైన ఈ జానపద విజ్ఞానంను భావితరాలకు అందించే విధంగా పరిశోధకులను ప్రోత్సహిస్తే అది మరికొంత మందిని అదే దారిలో వెళ్ళే విధంగా చేయవచ్చు అనేది గమనించవలసిన విషయం.        

ఉపయుక్త గ్రంథసూచి:

  1. కృష్ణకుమారి, ఆచార్య నాయని. (Ed.). (2019). తెలుగు జానపద విజ్ఞానం సమాజం-సంస్కృతి-సాహిత్యం. హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం.
  2. మల్లికార్జున్, కె. (2022). మౌఖిక సాహిత్యం.
  3. మోహన్, డా. జి. ఎస్. (2001). జానపద విజ్ఞానాధ్యయనం. హైదరబాద్: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్.
  4. సాహితి దుందుభి. (2021). హైదరాబాద్: తెలుగు అకాడమీ.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]