AUCHITHYAM | Volume-5 | Issue-12 | November 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
12. 'గరిమెళ్ళ' వారి శ్రీవేంకటేశ్వరశతకం: ప్రబంధలక్షణాలు
డా. జె.వి. చలపతిరావు
అసోసియేట్ ప్రొఫెసర్, తెలుగుశాఖ,
కాకరపర్తి భావనారాయణ కళాశాల (స్వయంప్రతిపత్తి),
విజయవాడ, ఎన్.టి.ఆర్. జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9849556162, Email: jvchalapathi25@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 12.09.2024 ఎంపిక (D.O.A): 28.10.2024 ప్రచురణ (D.O.P): 01.11.2024
వ్యాససంగ్రహం:
శ్రీవేంకటేశ్వరశతకం ఒక ప్రయోగాత్మక పద్యరచన. దీన్ని గరిమెళ్ళ సోమయాజుల శర్మగా ప్రసిద్ధులైన గరిమెళ్ళ అచ్యుత సత్యశేషగిరి సోమయాజుల శర్మ రచించారు. వీరిది వేదాధ్యయనవారసత్వం గల కుటుంబం. సంస్కృతాంధ్రదర్శనాల్లో ఎం.ఏ. పట్టభద్రులు. చిన్ననాటి నుండే రామాయణ, భారత, మహా భాగవతాలను; సంస్కృతాంధ్ర పంచమహాకావ్యాలను అధ్యయనం చేసారు. వందలాది పద్యాలు వీరికి కంఠస్థం. ద్వాదశీవ్రతమాహాత్మ్యం, వాల్మీకి వృత్తాంతం, శ్రీవేంకటేశ్వరశతకం, శ్రీవేంకటరామయశోవికాసం, శివమాహాత్మ్యాఖండం, శివకర్ణామృతం మొదలైన పద్యకావ్యాలు రచించారు. ఒక రచన ఏ ప్రక్రియకు చెందినదయితే సాధారణంగా ఆ రచనలో ఆ ప్రక్రియాలక్షణాలే ఉంటాయి. కానీ ఈ శతకంలో కొన్ని ప్రబంధలక్షణాలు కూడా ఉండడం ఒక ప్రయోగం. ప్రక్రియావివేచనతోపాటు, కావ్యసౌందర్యపద్ధతి (ఆలంకారికపద్ధతి)లో వస్తువు, రసం, ధ్వని, కావ్యనాయికానాయకులు, అష్టాదశవర్ణనలు మొదలైన వాటిని ఈ పత్రంలో విశ్లేషించడమైనది. ఈ దిశగా ఈ శతకంపై ప్రత్యేకంగా పూర్వం పరిశోధనలు జరగలేదు.
Keywords: గరిమెళ్ళ సోమయాజులు, శతకం, ప్రబంధం, ప్రక్రియాప్రయోగం, వేంకటేశ్వర మాహాత్మ్యం
1. ప్రస్తావన:
శ్రీవేంకటేశ్వరశతకాన్ని (1970) ‘గరిమెళ్ళ సోమయాజులు’గా ప్రసిద్ధి చెందిన గరిమెళ్ళ అచ్యుత సత్యశేషగిరి సోమయాజులశర్మ రచించారు. ఇది ఆయన తొలి రచన. శతకానికి ఉండే మకుటనియమం, ఛందో సంఖ్యా నియమం వంటి వాటినిఈ శతకానికి పాటించినా, పద్యాలు ముక్తకాలు వలే అనిపిస్తున్నా, శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నాయకుడుగా భావిస్తూ, వివిధ వర్ణనలతో వస్తు స్ఫురణతో ప్రబంధానికుండే కొన్ని లక్షణాలతో వెలువడింది. అందువల్ల ప్రక్రియా పరంగా దీన్ని పూర్తిగా శతకం అనవచ్చో లేదో పరిశీలించటమే లక్ష్యంగా ఈ పరిశోధన పత్రరచన కొనసాగుతుంది. శతకప్రక్రియలో కనిపించే కొన్ని విశేషాలు ఈ శతకంలో కనపించడం వల్ల, ఒక విశేషంగా శతకాల్లో కూడా ప్రబంధలక్షణాలు కొన్ని కనిపిస్తున్నాయని ఈ పత్రం తెలియజేస్తుంది.
2. పరిశోధనపద్దతి:
సంప్రదాయ సాహిత్యాన్ని ముఖ్యంగా కావ్యాలను ఆలంకారిక పరిశోధన పద్ధతిలో అధ్యయనం చేస్తారు. శతకాన్ని, ప్రబంధాన్ని కూడా ఆలంకారిక పద్ధతిలోనే విశ్లేషిస్తారు. గరిమెళ్ళ వారు శ్రీవేంకటేశ్వర శతకం రచిస్తున్నానని చెప్పారు. దీనిలో ప్రబంధలక్షణాలు కూడా ఉన్నాయనేది నా ప్రతిపాదిత పరిశీలనాంశం. అందువల్ల ఈ పత్రరచనలో ఆలంకారికపరిశోధన పద్ధతినే ఉపయోగిస్తున్నాను.
సీ. శ్రీవిఘ్న నాయకుఁ జిత్తంబునఁ దలంచి
శారదాదేవిని సన్ను తించి
యంజనా పుత్తున కంజలి ఘటియించి
బ్రహ్మరుద్రాదులఁ బ్రస్తుతించి
సూర్య చంద్రాదుల స్తోత్రంబు గావించి
వ్యాసాది సకల సం యముల నెంచి
దివిజ వాఙ్మయ కవి ప్రవరుల,గీర్తించి
సకలాంధ్ర కవులను సంస్మరించి
తే॥గీ॥ మమతఁ దలిదండ్రులకును నమస్కరించి
సీసశతకంబు చెప్పెదఁ జిత్తగించి
తప్పులన్నియు క్షమియింపు దయ దలిర్ప
వేంకటాచలవాస శ్రీవేంకటేశ!
కవి గరిమెళ్ళ సోమయాజులుగారు తన శ్రీవేంకటేశ్వర శతకంలో తొలి పద్యంగా దీన్ని వర్ణించారు. మంగళాదీని మంగళ మధ్యాని మంగళాంతాని కావ్యమ్ అనేది భారతీయ కావ్య సంప్రదాయం. అదే సంప్రదాయాన్ని కవి శతకానికి కూడా ఉపయోగించారు. శతక కవులు ఇంచుమించు అందరూ ఈ సంప్రదాయాన్నే పాటిస్తున్నారు.
3. శ్రీ వేంకటేశ్వరశతకం-లక్షణసమన్వయం:
శ్రీ గరిమెళ్ళ సోమయాజులు గారు తాను రాసిందాన్ని ‘శతకం’ అన్నారు. కనుక, దీనికి ముందుగా శతక లక్షణాలను సమన్వయించి, తర్వాత, ఆ లక్షణాల కంటే భిన్నంగా ఉన్నవాటిని విశ్లేషించుకుందాం. తెలుగు సాహిత్యంలో శతకానికి ఒక ప్రత్యేకత ఉంది. దీని గురించి సాహిత్య విమర్శకులు, చరిత్రకారులు వివిధ లక్షణాలను, ఆ ప్రక్రియలోని ప్రత్యేకతను పేర్కొన్నారు. ‘ఆంధ్రశతక వాఙ్మయ పరిణామ చరిత్ర’ అనే పీఠికలో ప్రసిద్ధ సాహిత్య పరిశోధకులు నిడుదవోలు వెంకటరావు ఇలా వివరించారు.
‘‘శతకములు పురాణములవలె కథాప్రధానములు గావు; ప్రబంధములవలె వర్ణనాప్రధానములు గావు; గేయకృతులవలె సంగీత ప్రధానములుగావు. ద్విపదల వలె దీర్ఘపరిమితి గలవి కావు. ఇవి ముక్తకము లయ్యును, నేక సూత్రత గలవి.’’ (నిడుదవోలు వెంకటరావు, శతక సంపుటము-1, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి ప్రచురణ,1966, పీఠిక: పుట: 1)
శతకసాహిత్యంపై పరిశోధన చేసిన డా. కె. గోపాలకృష్ణారావు శతకాలకు ఉండే లక్షణాలను ఇలా వివరించారని డా. జి. నాగయ్య తన తెలుగు సాహిత్యసమీక్షలో వివరించారు.
‘’సామాన్యముగ శతకములలో నూటికి బదులు నూతనమిది పద్యము లుండుట వాడుక. ఈ సంఖ్యానియమము భక్తి శతకములందు ప్రాధాన్యము వహించినది. భగవన్నాను స్తోత్రములందు సహస్రమో, అష్టోత్తర శకమో నామములుండుట పరిపాటి. భగవంతుని నామములవలెనే భగవన్నుతి ప్రధానము లైన పద్యములు కూడ అష్టోత్తర శతముండవలెనను సంప్రదాయ మేర్పడి యుండును. తొలుత భక్తి శతకములందు పాటింపబడిన ఈ సంఖ్యానియమము క్రమముగా తదితర శతకములకును సామాన్య లక్షణమైనది. పంచరత్నములు, నవరత్నములు, తారావళులు మున్నగునవి నూటికి తక్కువ పద్యములు గలిగిన శతకములు. సంస్కృత ప్రాకృతములందు త్రిశతులు, పంచశతులు, సప్తశతులు, సహస్రములు కూడ కలవు. తెలుగులో వేమన ఈ సంఖ్యానియమ మును పాటింపక సహస్రాధిక సంఖ్యలో పద్యరచన కావించినాడు. కొందరు శతకకర్తలు కావ్యములందువలె అవతారికాదులను చేర్చి సంఖ్యానియమమును సడలించినారు. కాని తెలుగు శతకములో సంఖ్యానియమమును లక్షణము ప్రధానముగ పాటింపబడినది’’ నాగయ్య,జి. (2019), తెలుగు సాహిత్య సమీక్ష ( ద్వితీయ సంపుటి),నవ్యపరిశోధక ప్రచురణలు: హైదరాబాద్. ప్రథము ముద్రణ: 1995, పుట:545).
ఇలా శతక సాహిత్యంపై పరిశోధన చేసిన వారంతా ఇంచు మించు ఈ క్రింది నియమాలను క్రోడీకరించారు.
1. సంఖ్యానియమం: సాధారణంగా శతకం అంటే నూరు పద్యాలు ఉన్న రచన. కానీ, సాధారణంగా 108 పద్యాలు ఉండటం శతకానికి ఉండే లక్షణంగా తెలుగు శతకాల్లో కనిపిస్తుంది. శ్రీవేంకటేశ్వరశతకంలో 108 సీసపద్యాలు ఉన్నాయి. వీటితో పాటు చివరిలో సాధన పంచకం పేరుతో ఐదు సంస్కృతశ్లోకాలను కూడా వర్ణించారు.
2. మకుటనియమం: ఒక సీస పద్యంలో సాధారణంగా పద్యం పూర్తయిన తర్వాత తే.గీ.లేదా ఆటవెలది పద్యాన్ని రాస్తారు. అలాగే, దీనిలో తేటగీతి పద్యంతో పూర్తిచేశారు. ‘‘ వేంకటాచల వాస! శ్రీవేంకటేశ!’’ పేరుతో ఏకపద మకుటం కనిపిస్తుంది.
3. వృత్తనియమం: ఒకేరకమైన ఛందస్సుతో పద్యాలు ఉండాలి. ఈ శతకంలో కూడా సీసపద్యాలు, తేటగీతితో ఒకే ఇతివృత్తంతో శతకాన్ని పూర్తిచేశారు. కానీ, శతకంలో 106 పద్యం మాత్రం విషమసీసంగా పరిగణించే ఉత్సాహవృత్తం కనిసిస్తుంది.
4. రసనియమం: భక్తి, శృంగార, వైరాగ్య, నీతి శతకాల్లో వాటికి అనుగుణమైన రసాలను శతకాల్లో వర్ణిస్తుంటారు. శ్రీవేంకటేశ్వరశతకం భక్తి శతకం. ఈ శతకంలో కూడా భక్తిరసం కనిపిస్తుంది.
5. భాషా నియమం: ‘‘శతకములలో యే రసము ప్రతిపాదిత మగునో అదియే అన్ని పద్యముల యందు ప్రపంచితము కావలెను కాని వేఱొక రసమున కందు ప్రవేశము కలుగ కూడదు. భక్తిరస ప్రధానములగు శతకములలో నితర రసముల ప్రసక్తి యుండరాదు. శృంగారరస ప్రధానములగు శతకములలో వీర హాస్యాది రసములకు చోటీయరాదు. భక్తి శృంగార రసములకు తప్ప తక్కిన రసము లెంతమాత్రమును ప్రపంచితము కావని సారాంశము. ఈ శతకములలో భావము లొకభాగమున నొకరీతిగాను, వేఱొక భాగమున మఱియొక రీతిగాను నుండరాదు.’’ అని శతకసాహిత్యంలో రసనియమం గురించి సాహిత్య విమర్శకుడు నిడదవోలు వెంకటరావు వివరించారు. (నిడుదవోలు వెంకటరావు, శతక సంపుటము-1, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి ప్రచురణ,1966, పీఠిక: పుట: 4)
దీని ప్రకారం ఈ శతకంలో కూడా భక్తి రసభరితమైన పద్యాలు మాత్రమే ఉన్నాయి. శతక లక్షణాలన్నీ శ్రీవేంకటేశ్వరశతకానికి సరిపోతున్నాయి. కానీ, వీటిలో నాయకుడు, వర్ణనలు వంటి వాటి విషయంలో ప్రక్రియా వైవిధ్యం కనిపిస్తుంది. ఇక్కడ ప్రబంధాలవలే వర్ణనాప్రధానములు కావని చెప్పిన అభిప్రాయం పరిశీలనాంశం. కానీ, ఈ వేంకటేశ్వరశతకంలో వర్ణనలు ఉన్నాయి. ఆ వర్ణనలు కొన్ని ప్రబంధాలకు సంబంధించినవి ఉన్నాయి. అలాగే ముక్తకాలు అనే లక్షణం ప్రకారం, ఒక పద్యానికీ మరొక పద్యానికి మధ్య కొనసాగింపు ఉండకూడదు. విడిగా చదివినా ఆ పద్యం పరిపూర్ణంగా అనిపించాలి. గరిమెళ్ళవారి రచనలోని ఒక ప్రత్యేకత ఏమిటంటే, ఈ శతకంలో ప్రతి పద్యం ముక్తకంలా కనిపిస్తూనే, ప్రబంధంలా వర్ణనల కొనసాగింపులా కూడా అనిపిస్తుంది. ప్రబంధానికి సంబంధించి కొన్ని లక్షణాలను మన సాహితీవేత్తలు వివరించారు.
4. ప్రబంధపదనిర్వచనం:
ప్రబంధమనగా 'ప్రబంధము ప్రకృష్టమైన బంధము కలది' అని అర్థం. ఆంధ్రవాఙ్మయంలో ప్రబంధ ప్రక్రియకున్న ప్రాధాన్యం మరో ప్రక్రియకు లేదనడం అతిశయోక్తి కాదు. ప్రబంధశబ్దం సంస్కృత కవుల, లాక్షణికుల ప్రయోగంలో కూడా ఉంది. ప్రబంధశబ్దాన్ని కావ్యపరంగా భామహుడు, దండి, విశ్వనాథుడు మొదలైన వారు నిర్వచించారు. అప్పకవి, విన్నకోట పెద్దన వంటి తెలుగు లాక్షణికులు కూడా ప్రబంధ శబ్దాన్ని కావ్య పరంగానే వివరించారు. ప్రబంధ లక్షణాలు: క్రీ.శ.16వ శతాబ్దం నాటి కావ్యాలను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేకంగా ప్రబంధ లక్షణాలను పలువురు ఆధునిక సాహితీ విమర్శకులు వివరించారు. వారిలో ఆచార్య పింగళి లక్ష్మీకాంతం రాయల యుగపు ప్రబంధ కావ్యాలను సమన్వయ పరచి ప్రబంధ లక్షణాలను కింది విధంగా చెప్పారు. 1. ప్రబంధం ఏకనాయకాశ్రయం, 2. వస్వైక్యప్రధానం, 3. అష్టాదశ వర్ణనాత్మకం, 4.శృంగారం ప్రధానరసం, 5. ఆలంకారిక శైలి. 6. స్వతంత్ర రచన. దీనితో పాటు ఆలంకారిక శైలి కూడా కనిపిస్తుంది. కానీ, అన్ని ప్రబంధ లక్షణాలు అన్వయం కావడం లేదు. వాటిని కింద విధంగా వివరించే ప్రయత్నం చేస్తాను.
4.1 ప్రబంధం ఏకనాయకాశ్రయం:
శ్రీవేంకటేశ్వరశతకంలో అష్టాదశ వర్ణనలలో కొన్ని ఉన్నాయి. దీనికి నాయకుడు శ్రీవేంకటేశ్వరుడు. వేంకటేశ్వరస్వామిని వివిధ సందర్భాలలో ఆయన రూపురేఖలను కళ్ళకు కట్టినట్లు వర్ణించారు. ఆయన స్వభావాన్ని కూడా వ్యక్తీకరించారు. శ్రేవేంకటేశ్వరునికి ప్రతిరోజూ సుప్రభాత సేవ ఉంటుంది. ఈ సందర్భంగా ఆయన గుణగణాలను సందర్భానుసారంగా వర్ణించారు కవి.
సీ॥ సప్తగోత్ర నివేశ ! ఛత్రితవ్యాళేశ !
సుప్రభాతము లెమ్ము సుప్రకాశ !
రక్షితమాతంగ ! పక్షి రాజ తురంగ !
సుప్రభాతములెమ్ము సుందరా
ఘనఘనాఘనకాయ ! వినుతథ కవిధేయ !
సుప్రభాతము లెమ్మ యప్రమేయ
గంగా స్రవత్పాద ! మంగా హృదాహ్లాద !
సుప్రభాతము లెమ్ము సుప్రసాద !
తే॥గీ॥
మత్స్యకచ్ఛప భూదార మనుజసింహ
ఖర్వ భార్గవ రఘురామ కామసాల
బుద్దకల్కి స్వరూప ! ప్రబోధ మీశ !
వేంకటాచలవాస ! శ్రీ వేంకటేశ! (శ్రీ వేంకటేశ్వరశతకం: 10వ పద్యం)
కలియుగ దైవంగా భావించే శ్రీవేంకటేశ్వరస్వామివారి వివిధ అవతారాలను ఈ పద్యంలో వర్ణించారు కవి. దీని ద్వారా ఆ యా అవతారాల సమయంలో స్వామివారి గుణగణాలను ప్రస్తావించుకోవాల్సిందే. దీన్ని బట్టి నాయకుని గుణగణాలను వర్ణించినట్లే అవుతుంది. ప్రబంధంలో నాయకుడి గుణగణాలను వర్ణించడం ఒక భాగం.
కేవలం ఒక్కపద్యంలోనే కాదు, అనేక పద్యాల్లో శ్రీవేంకటేశ్వరుణ్ణి వర్ణించడం ఈ శతకంలో ఒక ప్రత్యేకత. దీనికోసం మరొక పద్యాన్ని చూద్దాం.
సీ. దివ్యకౌస్తుభరత్న దీపిత వక్షస్క !
మేలుగల్గును నీకు మేలుకొనుము
కస్తూరి తిలక సంకలిత రమ్యలలాట!
మేలుగల్గును నీకు మేలుకొనుము
రాకాసుధాకర రమణీయ ముఖబింబ !
మేలుగల్గును నీకు మేలుకొనుము
గగన గంగానదీ కలిత పాదాంభోజ !
మేలుగల్గును నీకు మేలుకొనుము
తే.గీ. చందన సుగంధ లేపిత చారుదేహ !
శంఖ ఖడ్గ శరాసన చక్రహస్త !
మేలుగల్గును నీ కింక మేలుకొనుము
వేంకటాచలవాస ! శ్రీ వేంకటేశ !
శ్రీవేంకటేశ్వరుని ఆకారాన్ని, ఆయన రూపురేఖలను వర్ణించడం ఈ పద్యంలో కూడా కనిపిస్తుంది. దివ్వమైన కౌస్తుభాన్ని ధరించిన ఆయన రూపం, కస్తూరి తిలకాన్ని ధరించిన ఆయన ముఖమెంత రమణీంగా ఉందో ఈ పద్యంలో వర్ణితమైంది. అంతేకాదు, ‘చందన సుగంధలేపిత చారుదేహ’ అనడం ద్వారా శ్రీవేంకటేశ్వరునిలోని కరుణార్ద్రహృదయస్వరూపాన్నీ, తర్వాత ‘శంఖ ఖడ్గ శరాసన చక్రహస్త !’ అనడం ద్వారా దుష్టులను శిక్షించి, శిష్టులను రక్షించే ఆయన గుణగణాల వర్ణన ఎంతో ఔచిత్యంతో వర్ణించారు కవి. అయితే, ప్రబంధాల్లో వర్ణించే నాయకుని వర్ణనల వలే భక్తి శతకాల్లో కూడా ఆ భగవంతుణ్ణి వర్ణించడం జరుగుతూనే ఉంటుంది.
4.2 ప్రబంధాల్లో వస్వైక్యప్రధానం:
ప్రబంధాలు కనీసం మూడు నుండి పది ఆశ్వాసాల వరకు ఇతివృత్తంతో కొనసాగుతాయి. ప్రఖ్యాతమైన పురాణేతిహాసాల నుండి వస్తువుని స్వీకరిస్తారు. కొన్ని సార్లు ఉత్పాద్య, మిశ్రమాల రూపంలో కూడా ఇతివృత్తాన్ని స్వీకరిస్తారు. దీనికి తెలుగు సాహిత్యంలో మనుచరిత్ర, కళాపూర్ణోదయం, వసుచరిత్రలు ఉదాహరణలుగా నిలుస్తున్నాయి. భక్తి శతకాల్లో కనిపించే మరొక విశేషమేమిటంటే, ప్రబంధాల్లో ఉండే వివిధ పాత్రలతో, సన్నివేశాలతో కూడిన కథలా ఇతివృత్తం ఉండదు, కానీ, ఆ శతకం పూర్తయ్యేసరికి ఆ దైవం పట్ల ఒక కథావగాహన వంటిది వస్తుంది. దీన్ని కూడా వస్త్వైక్యం అనవచ్చు. సాధారణంగా ప్రబంధాల్లో వస్త్వైక్యం అంటే మొదటి ఆశ్వాసం నుండీ ఆ కావ్యంలో చివరి ఆశ్వాసం వరకు కథ కొనసాగేలా వర్ణించడం. అయితే, నాటకాల్లో కూడా వివిధ అంకాలు, రంగాలుగా కథ ఉన్నా, అది కూడా అన్నింటిలోనూ ఆ కథ కొనసాగాలి. దీని గురించి సాహిత్య విమర్శకులు నాటకకళలో ఐక్యత్రయం గురించి చెబుతూ అవి స్థలైక్యం, కాలైక్యం, వస్వైక్యం మూడురకాలుగా విభజించారు. ఒకే ఒక స్థలంలో నాటకమంతా జరగడం స్థలైక్యం. - ఒకే ఒక కథను పొందుపరచడం వస్వైక్యం. కాలైక్యం అంటే కథ జరిగినంత కాలంలోనే ప్రదర్శన జరగడం అని విజ్ఞాన సర్వస్వంలో వివరించారు. దీనికి డా. సిహెచ్. లక్ష్మణచక్రవర్తి సంపాదకులుగా వ్యవహరించారు. (తెలుగు సాహిత్య దర్శనం, 11 వ సంపుటి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్.2016:851). దీనిలో మనం గ్రహించేది వస్త్వైక్యం. అంటే దీని ప్రకారం చూసినా ఒకే కథ మొదటి నుండీ చివరి వరకు కొనసాగాలి. ప్రబంధాల్లో కూడా కొన్నింటిలో వస్త్వైక్యం లేదని కొంతమంది, ఉందని కొంతమందీ వాదించుకున్నారు. స్వారోచిషమనుసంభవం అనే పేరు కలిగిన ‘మనుచరిత్ర’లో కూడా వస్త్వైక్యం ఉందని, లేదనీ సాహితీవేత్తలు భావించారు.
‘’మనుచరిత్ర ఆరాశ్వాసముల ప్రబంధము. అందు వస్వైక్యము లేదని కొందరందురు. స్థూలదృష్టికి మా త్రము అందు కథైక్యము లేనట్లు గోచరించును. అందు వస్తువు విస్తరింపబడినది. మొదటి మూడాశ్వాసములు స్వరోచి జనన గుణశీలాది సంపత్తికి హేతుభూతమైనవి. తరువాత మూడాశ్వాసములును స్వరోచి జన్మసంస్కారాది సద్గుణగణ నిరూపణమైనవి. వరూధినీ వృత్తాంతము, స్వరోచి చరిత్రము అనెడి రససమంచితములు, స్వయం సంపూర్ణములునగు రెండు కథలను చక్కగా కలిపి ఒకేసూత్రమున సంధించుటలోనే పెద్దన నేర్పు వ్యక్త మగును’’ అని ప్రముఖ సాహిత్య చరిత్రకారుడు మర్షకుడు సి నాగయ్య అభిప్రాయపడ్డారు. పాటింపబడినది’’ నాగయ్య,జి. (2019), తెలుగు సాహిత్య సమీక్ష (ద్వితీయ సంపుటి), నవ్యపరిశోధక ప్రచురణలు: హైదరాబాద్. ప్రథము ముద్రణ: 1995, పుట: 48)
దీన్నిబట్టి ప్రబంధాల్లోనేన కథ మొదటినుండి చివరి వరకు అన్ని ఆశ్వాసాల్లోను ఒకే పద్ధతిలో కొనసాగదు. అలాంటప్పుడు శతకాలలో పాత్ర చిత్రణకు, సన్నివేశ కల్పనకు కావ్యం ప్రబంధాలలో ఉండే అవకాశం లేనప్పుడు ఆ కథ మొదటి నుండి చివరి వరకు ఒకే పద్ధతిలో కొనసాగదు. కానీ, అన్ని పద్యాలు చదివిన తర్వాత ఆ కథానాయకుని లేదా కథానాయక లేదా అందులో వివిధ వండితమైనటువంటి పాత్రల మనస్తత్వాలు రూపురేఖ స్వభావ చిత్రనలు తెలిసే అవకాశం ఉంది. అంతవరకు మాత్రమే శ్రీ వేంకటేశ్వర శతకంలో ప్రబంధ లక్షణాలను పరిగణనలో తీసుకోవాలి. ప్రబంధాల లక్షణాలు శతకాలలో కనిపించడం అనేది ఒక నూతన ప్రతిపాదన మాత్రమే. దీనికి గాను శతకంలో శ్రేవేంకటేశ్వరుణ్ణి కథానాయకుడిగాను, వస్త్వైక్యాన్ని పాటించడంగాను భావించే అవకావం ఉంది.
వీటితో పాటు ప్రబంధాలకు అత్యంత ముఖ్మమైన లక్షణాల్లో వర్ణనలను చెప్పుకోవాలి. కాబట్టి అలాంటి వర్ణనలు శ్రీ వేంకటేశ్వరశతకంలో విస్తృతంగా కనిపిస్తాయి. వీటిలో కొన్నింటిని సమన్వయించే ప్రయత్నం చేస్తాను.
4.3 అష్టాదశ వర్ణనల్లో కొన్ని వర్ణనలు:
తెలుగు ప్రబంధాలలో సాధారణంగా అష్టాదశవర్ణనలు ఉండాలని సాహితీవేత్తలు భావిస్తున్నారు. దీని గురించి మొట్టమొదటి సారిగా నన్నెచోడుడు తన ‘కుమారసంభవం’ కావ్యంలో ప్రస్తావించాడు.
క॥ "వన జలకేళీ రవి శశి
తనయోదయమంత్రగతి రతక్షితి పరణాం
బునిధి మధు ఋతుపురోద్వా
హనగవి రహ దూత్య వర్ణనా ష్టాదశమున్" (నన్నెచోడుడు, కుమారసంభవం 1-44)
వనాలు, జలములు, సూర్యోదయం, చంద్రోదయం, పుత్రుని జననం, రాజనీతి, భూమి, నదులు, రుతువులు, పురం, ఉద్యానవనాలు, పర్వతాలు, విరహం, రాయబారం మొదలైన వాటిని కావ్యంలో వర్ణించాలని చెప్పారు. వీటిలో అన్నీ ఉండాలనేమీ లేదు. చాలావరకు ఉన్నా సరిపోతాయి. ఇవన్నీ ఉంటే ఆ రాజ్యం లేదా దేశం సుభిక్షంగా ఉందని చెప్పడానికి వీలవుతుంది. అది ఆలంకారికుల ఆలోచన. శ్రీవేంకటేశ్వశతకంలో శ్రీవేంకటేశ్వరుని దయాదాక్షిణ్యాల వల్ల కలియుగంలో జీవించే ధర్మాత్ములు సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పడానికి కవి శ్రీ గరిమెళ్ళవారు చక్కని శతకాన్ని ప్రబంధోచితంగా వర్ణించారు. వీటిలో కొన్ని వర్ణనలను కింది విధంగా చూడొచ్చు.
కవికి ఇష్టదైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామియే శ్రీ వేంకటేశ్వర శతకమునకు నాయకుడు. దీనిలో భక్తియే ప్రధానమైన రసము. శ్రీ వేంకటేశ్వర స్తుతియే వస్తువు. ఆయా సందర్భాలలో కొన్ని పద్యాల్లో తక్కిన రసములు కూడ పోషింపబడినవి. అట్లే తిరుపతి పట్టణము, వేంకటాచలము మొదలగునవి వర్ణింపబడినవి.
4.4 పురవర్ణనము :
సీ॥ శ్రీ జయ విజయ సంశ్రిత భక్త వైష్ణవ
స్థానమై వైకుంఠధామ మనఁగ
భుజగేన కవిగురు ద్విజరాజ సౌమ్య ని
వేశమై యాకాశ వీధి యనఁగ
నారద చతురాస్య। శారదావాసమై
ఘనమైన సత్యలో కంబనంగ
వసుమతీ యతిగణ పద్మనాభ విభూతి
సదనమై వృత్త స్త్రంబనంగ
తే॥ వెలయు తిరుపతి పురమున వెలసి భక్త
సంతతులఁ బ్రోచు వేంకటేశ్వరుని నిన్ను
నిష్టం గొలిచిన వాఁడె పో నిర్మలుండు.
వేంకటాచలవాస! శ్రీ వేంకటేశ! (శ్రీ వేంకటేశ్వర శతకం 93వ పద్యం)
ఈ పద్యములో తిరుపతి పట్టణము వర్ణించి, ఆ తిరుపతిని వైకుంఠధామంగా, సత్యలోకంగా పోల్చి, అటువంటి పురంలో వెలిసిన స్వామి శ్రీవేంకటేశ్వరుడుగా పట్టణప్రాముఖ్యాన్ని తెలిపాడు కవి.
4.5 పర్వతవర్ణనము :
సీ॥ తాలతూల రసాల సాల తక్కోల త
మాలాది కుజరాజ। మండితంబు
కరిఖడ్గ పంచాస్య కిరి ఋక్ష శార్దూల
శరఖాది మృగయూథ సంకులంబు
భర్మ రజత ముఖ్య బహులోహ మరకత
రత్నాది బహుమణి భ్రాజితంబు
గంధర్వ కిన్నెర గరుడ కింపురుషాది
గీర్వాణ మిధున సం క్రీడనంబు
తేట: పటుశిఖర చుంబితాంబర భాగమగుచు
నలరు దీనికేతన వేంకటాచలంబు
నెక్కి నినుగాంచఁ బాపము లెల్లఁ బాయు
వేంకటాచలవాస! శ్రీ వేంకటేశ! (శ్రీ వేంకటేశ్వర శతకం 94వ పద్యం)
శ్రీవేంకటేశ్వరుడు వెలిసిన తిరుపతి పట్టణము, ఆ పట్టణం ఉన్న వేంకటాచలం గొప్పతనాన్ని కూడా వర్ణించాడు కవి. ఈ పర్వతంపై అనేకమృగాలు, రత్నాలు, గంధర్వులు, కిన్నెర, గరుడ కింపురుషులు మొదలైన వారంతా ఉండి విశిష్టతను కలిగి ఉండడమే కాకుండా, ఆకాశాన్ని తాకేటంత ఎత్తులో ఉండడం, దాన్ని భక్తులు చూడగానే వాళ్ల పాపాలన్నీ పోయేటంతటి మాహాత్మ్యం ఉన్న పర్వతం అని వర్ణించడం వల్ల, ప్రకృతి సహజత్వాన్ని, సహజత్వంలోని విశేషాన్ని వర్ణించడం పర్వతవర్ణనలో కనిపించే విశేషం.
4.6 సరోవరవర్ణనము:
సీ॥ సంతత పీయూష సమమధురాముల
పాథస్త రంగ విభ్రాజితంబు
కైరవేందీవర కల్ప్ర రక్తాబ్జ
పుందరీక కదంబ : మండితంబు
మకర కూర్మ కుళీర మత్స్యకించుళకాది
బహుళ వార్దంతుని వాసితంబు
కలమరాళ బలాక జలకుక్కుటరథాంగ
జలపక్షి కూజిత కలకలంబు
తే॥ నైనస్వామి పుష్కరిణి సరోంబువులను
మజ్జనం బాడీ పాపము లుజ్జగించి
నిన్ను గొలిచిన వాఁడెపో నిర్మలుండు
వేంకటాచలవాస! శ్రీ వేంకటేశ! (శ్రీ వేంకటేశ్వర శతకం 95వ పద్యం)
ఈ పద్యములో స్వామి వారి పుష్కరిణీ సరస్సు మాహాత్మ్యాన్ని వర్ణింపబడినది. ఈ సరస్సులో మత్స్యములు, హంసలు, జలపక్షులతో కలిసిమెలిసి ఉండే ఆ సరస్సులోని నీళ్ళు అమృతప్రాయంతో పోల్చారు. ఆ సరస్సులో దిగగానే వాళ్ళ పాపములన్నీ తొలగిపోతాయని వర్ణించారు. ఈ రెండు పద్యాల్లోను పవిత్రమైన ప్రాంతాల్లో ఉండాల్సినవన్నీ తిరుపతి పట్టణం, ఆ చుట్టూ ఉన్న పరిసరాల్లోను ఉన్నాయని, అవన్నీ పవిత్రమైనవనీ, పశుపక్ష్యాదులతో పాటు, క్రూర, సాధుజంతువులన్నీ కలిసి ఉండటం అనేది ఒక విశేషం. ఇవన్నీ భిన్నవైరుధ్యాలున్నప్పటికీ, శాంతి సమతుల్యతలతో సమస్తమానవాళిని మాత్రమే కాకుండా సమస్తప్రాణకోటిని రక్షించే మహానుభావుడు శ్రీవేంకటేశ్వరుని మాహాత్వ్మాన్ని వర్ణించడం వల్ల ఆ ప్రాంతాలన్నీ దర్శించాలనే కుతూహలం కలుగుతుంది.
4.7 సూర్యోదయ వర్ణనము :
సీ॥ నీడనిర్గత పక్షి నికురంబ కలకల
ధ్వానము నల్డిక్కులఁ బరిఢవిల్లె
శతపత్ర మధురసాస్వాదనేందిందిర
బృంద ఝంకారముల్ పిక్కటిల్లె
క్షీర గ్రహణలోల శృంగిణీ వత్స కృ
తాంబనినాదంబు లావహిల్లె
గోపికా మధ్యమానాపూర్ణ దధిఘట
స్వానముల్ కాష్ఠల సందడిల్లె
తే॥ సకలకువలయ కాంతులు సన్నగిల్లె
నిఖిల దిశలను వెలుఁగులు నివ్వటిల్లె
సుప్రభాతంబు లెమ్మయ్య! య ప్రమేయ!
వేంకటాచలవాస! శ్రీ వేంకటేశ ! (శ్రీ వేంకటేశ్వర శతకం 7వ పద్యం)
శ్రీవేంకటేశ్వర సుప్రభాతంలా అనిపిస్తూనే, ప్రబంధాల్లో ఉండేటటువంటి సూర్యోదయ వర్ణన చేశాడు కవి. సూర్యోదయం అవుతుంటే పక్షుల కిలకిలరావాలు ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి. తిరుపతి ప్రాంతంలో నాలుగు దిక్కులలూ ఆ కలకల ధ్వనులు వినిపిస్తుంటాయట. ఆక్కడున్న తుమ్మెలు మొదలైన కీటకాలు పూలలోని మధురమైన రసాన్ని ( తేనెను) ఆస్వాదించడం వల్ల ఆ ప్రాంతమంతా ఆ ఝుంకారగీతాలతో మారుమ్రోగుతుందట. సూర్యోదయం కాగానే పాలు, పెరుగు, నెయ్యి వంటివన్నీ పట్టుకొని గోపికలు (యాదవకాంతలు) ఎంతో సందడి చేస్తున్నారు. సూర్యోదయం అవుతుంటే కలువలు ముడుచుకొని, కమలాలు విచ్చుకుంటాయి. అవి ఆ తిరుపతి ప్రాంతంలో తమ తమ విధులను నిర్వహిస్తున్నాయి. శ్రీ వేంకటేశ్వరునికి ఆ సూర్యోదయాన్ని వివరించి, సుప్రభాతం అవుతుందని, నిద్రలేవమని చెప్పడం ఎంతో భక్తిపూరితంగా ఉంది. ఉదయమే శ్రీవారికి చేసే సేవలన్నీ ప్రకృతి చేస్తుందని చెప్పడం ప్రబంధలక్షణాలకు చక్కని ఉదాహరణ.
సూర్యోదయ, సూర్యాస్తమయ వర్ణనల సంగమం:
సీ॥ అంతరిక్షంబున నఖిల నక్షత్రముల్
మెల్లమెల్లన నస్త మింపఁ దొడఁగె
హరిణాంక బింబంబు కిరణకాంతి దొరంగి
పడమటి గిరి సమీపమున వ్రాలె
సకల పుష్ప పరాగ సౌరభగంధిల
పృథుక సమీరముల్ వీచుచుండె
బాల మార్తాండ బిం ప్రభూతారుణ
భానువుల్ ద్యోస్టలిఁ బ్రాకఁజొచ్చె
తే॥ దిక్కులన్నియు నొగిఁదేట తెల్లమయ్యె
సఖిల జనులకు నానందమతిశయిల్లె
సుప్రభాతము లెమ్మింక సుందరాంగ!
వేంకటాచల వాస ! శ్రీ వేంకటేశ! (శ్రీ వేంకటేశ్వర శతకం 8వ పద్యం)
ఈ రెండు పద్యాల్లో ప్రభాత కాలం, సూర్యోదయం వర్ణింపబడినవి. ఈ వర్ణనములు అష్టాదశ వర్ణనలలో చేరినవి.
4.8 శ్రీ వేంకటేశ్వరస్వామి చూపుల వర్ణనము :
సీ॥ మదన కేళీలోలమంగా సముత్తుంగ
పక్షోజకుంభాగ్ర వీక్షణములు
సంగ్రామ సన్నద్ధ సకలరక్షః పక్ష
శిక్షణ సంరంభ దీక్షణములు
సంతత భవదం జలజ సంసేవనా
శ్రయభక్త సందోహ రక్షణములు
నారద సంగీత పారవశ్యోద్భూత
లఘనిమీలా పక్ష్మ లక్షణములు
తేట: పుల్ల శత పత్ర పత్రాభ: భూరి
సుంద రేక్షణంబులు నిరతంబు ! నెనక మెసంగ
శుభదయాదృష్టి మమ్ములఁ జమ గాక
వేంకటాచలవలవాస! శ్రీ వేంకటేశ! (శ్రీవేంకటేశ్వరశతకం 96వ పద్యం)
ఈ పద్యములో స్వామి వారి దయా వీక్షణములు వర్ణింపబడినవి. శ్రీవేంకటేశ్వరుని చూపులు సకల సుజనులనందరినీ కాపాడేవిధంగా ఉన్నాయి.
4.9 శ్రీ స్వామి వారి పాదవర్ణనము :
సీ. శంఖ చక్రాంబుజ : చ్ఛత్ర మయూర వ
క్రస్పుట రేఖా వి రాజితంబు
సకల సన్మణిగణస్థగిత గుంజన్మంజు
మంజీర శింజాన రంజనంబు
అరుణారుణనఖాదీ ప్రాంగుళ్ళు పీతంబు
కచ్ఛపాకార ప్ర కాశితంబు
సంపుల్ల రక్తాజ్జ సంకాశ మృదులంబు
మాపాణి పల్లవ మర్దితంబు
తేట॥ దేవ మునిరాజ భక్త సం సేవితంబు
నగు భవద్దివ్య పాదాబ్జ। యుగము నాదు
హృదయ పీఠ మోలి నలంక రించుఁ గాక
వేంకటా చలవాస ! శ్రీ వేంకటేశ! (శ్రీ వేంకటేశ్వర శతకం 102వ పద్యం)
ఈ పద్యములో శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పాదములు చక్కగా వర్ణింపబడినవి. వీటితో పాటు కొన్ని పద్యాల్లో శ్రీ స్వామి వారి దివ్యాయుధములైన శంఖ (97వ సద్యం) , చక్ర (98వ పద్యం) గద (99వ పద్యం), ఖడ్గ (100వ పద్యం), ధనస్సు (101వ పద్యం) కు సంబంధించి ప్రత్యేక పద్యములలో వర్ణనలు ఉన్నాయి. చెట్లు - గరిమెళ్ళ వారి శ్రీ వేంకటేశ్వర శతకములో అష్టాదశ వర్ణనములలో చేరని ఇతర వర్ణనలను దీనిలో చేయడం ఒక ప్రత్మేకతగా చెప్పుకోవచ్చు. కావ్యాదర్శములో దండి, కావ్యాలంకార సంగ్రహములో భట్టుమూర్తి కవి అష్టాదశ వర్ణనల్లో కొన్ని వర్ణనలు లోపించినప్పటికీ దోషము లేదని అంగీకరించినారు. ఆచార్య కెవిఆర్ నరసింహంగారు ప్రబంధాల్లో ఉండే వర్ణనల గురించి ఇలా చెప్పారు.
‘‘ఒక చిన్నకథను సర్వాంగసుందరముగఁ బెంచి వ్రాయుటకు వర్ణనలు ముఖ్యములు. ఈ వర్ణనలు ప్రబంధములందు సాధారణముగా రెండు తెఱఁగుల నుండును.1. వస్తు బహిరాకార వర్ణనము.2. వస్తుగుణ వర్ణనము. ఈ వస్తు వర్ణనములో సజీవ ప్రకృతి వర్ణనము, నిర్జీవ ప్రకృతి వర్ణనము గలిసియుండును. సజీవ ప్రకృతిలో మరల మానవ ప్రకృతి వర్ణనము, మాన వేతర ప్రకృతి వర్ణనము నుండవచ్చును. వస్తుగుణవర్ణన మనఁగాఁ దత్త్వ విచారము చేసి తన్మనోగతి వివిధ భావ పరివర్తనములను వ్యక్తముచేయుట.’’ (పుట: 13) ప్రబంధాల్లో ఉండే నిర్జీవాల కూడా కవులు వర్ణించినట్లే ఈ శతకంలో కూడా పర్వతాలను వర్ణించి, వాటికెంతో మహిమ కలదని చెప్పారు. వేంకటేశ్వర శతకములో కావ్యదృష్టితో 108 పద్యములు గల శతకమే అయినప్పటికీ ప్రబంధవర్ణనలను శ్రీ శర్మగారు సందర్భోచితంగా పొందుపరచడం ఈ శతకంలో కనిపించే విశేషాలు. వివిధ సందర్భాల్లో భక్తులతో భగవంతుడెలా ఉండేవారో పాఠకునికి అర్థమవుతుందే తప్ప, ఆ సన్నివేశాలను కావ్యంలోనో, ప్రబంధంలోనో వర్ణించినట్లుండదు. సాధారణంగా భక్తి శతకాల్లో ఎలా ఉంటాయో ప్రసిద్ధ సాహిత్య విమర్శకుడు ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం ఇలా అన్నారు. ‘‘ భక్తి శతకాలలో నామగుణ కీర్తనం, భగవల్లీలాభివర్ణం, ఆముష్మిక చింతనాసక్తి, ఆర్తనివేదనం, అనుతాప పశ్చాత్తాప వ్యక్తీకరణం మొదలైన అంశాలు గోచరిస్తాయి’’ (జి.వి.సుబ్రహ్మణ్యం, సాహిత్యంలో చర్చనీయాంశాలు, 1991 : 146)
ఇవన్నీ వస్తు వర్ణనను సూచిస్తున్నాయి. ఇలాంటివి ప్రబంధాల్లో కూడా ఉంటాయి.
ఆచార్య కె.వి.ఆర్. నరసింహంగారు తన ‘‘ఆంధ్రప్రబంధములు: అవతరణ వికాసములు’’ గ్రంథంలో ‘శతకాలు తప్ప మిగిలిన అన్ని గ్రంథాలు ప్రబంధాలే’’ (పుట: 10 ) అన్నారు. కానీ, ప్రబంధాల్లో ఉండే కొన్ని లక్షణాలు శతకాల్లో కూడా కనిపిస్తున్నాయనేది ఈ పరిశోధన పత్రసారాంశం. ప్రబంధం అనేది కేవలం తెలుగులో పదహారవ శతాబ్దం నుండే ఒక ప్రత్యేకమైన కావ్యప్రక్రియగా గుర్తింపు పొందింది. కానీ, భారతీయ ఆలంకారికులు ‘ప్రబంధం’ అనే శబ్దాన్ని కావ్యం అనే అర్థంలో కూడా ప్రయోగించారు. ఇంకా చెప్పాలంటే వర్ణనతో కూడిన సాహిత్యాంశం ప్రబంధంగానే చెప్పారు. వీటినే ఆంధ్రప్రబంధాల గురించి పరిశోధనలు చేసినవారంతా లక్షణగ్రంథాలను ఉపయోగించి, వాటిని సోదాహరణంగా, సాధికారికంగా వివరించారు. ఈ దృష్టితోనే శ్రీవేంకటేశ్వరశతకం కూడా వర్ణనాత్మకం, కావ్యనాయకత్వం వంటి ప్రత్యేక లక్షణాలతో పాటు, ప్రాచీన భారతీయ లాక్షణికుల దృష్టిని అనుసరించి, శతకాల్లో కూడా ప్రబంధాల్లో ఉండే వర్ణనలు ఉంటాయని నిరూపించడమే ఈ పత్రం లక్ష్యంగా గుర్తించాలి.
5. ముగింపు:
శ్రీవేంకటేశ్వర శతకములో కావ్యదృష్టితో 108 పద్యములు గల శతకమే అయినను ప్రబంధ శ్రీ శర్మగారు సందర్భోచితముగా పొందుపరిచినారు.వివిధ సందర్భాల్లో భక్తులతో భగవంతుడెలా ఉండేవారో పాఠకునికి అర్థమవుతుందే తప్ప, ఆ సన్నివేశాలను కావ్యంలోనో, ప్రబంధంలోనో వర్ణించినట్లుండదు. సాధారణంగా భక్తి శతకాల్లో ఎలా ఉంటాయో ప్రసిద్ధ సాహిత్య విమర్శకుడు ఆచార్య జి.వి.సుబ్రహ్మణ్యం ఇలా అన్నారు. ‘‘ భక్తి శతకాలలో నామగుణ కీర్తనం, భగవల్లీలాభివర్ణం, ఆముష్మిక చింతనాసక్తి, ఆర్తనివేదనం, అనుతాప పశ్చాత్తాప వ్యక్తీకరణం మొదలైన అంశాలు గోచరిస్తాయి’’ (జి.వి.సుబ్రహ్మణ్యం, సాహిత్యంలో చర్చనీయాంశాలు, 1991 : 146) ఇవన్నీ వస్తు వర్ణనను సూచిస్తున్నాయి. ఇలాంటివి ప్రబంధాల్లో కూడా ఉంటాయి. ఇలా వర్ణనల విషయంలో, రస విషయంలో శాస్త్రవిషయంలో, భాష విషయంలో, శైలి విషయంలో శ్రీ వేంకటేశ్వర శతకము ప్రబంధ పద్ధతిలోనే కొనసాగింది. అయినా, శతకంగానే పరిగణించినప్పటికీ, శతకాల్లో ప్రబంధలక్షణాలు ఉన్నాయని గానీ,లేదా శ్రీవేంకటేశ్వరశతకంలో ప్రబంధ లక్షణాలు కనిపిస్తున్నాయనేది నా పరిశీలనాంశం. అంతేకాదు, సాధారణంగా శతకాలలో ఛందో వైవిద్యం ఎక్కువగా ఉండదు. శ్రీ. వెంకటేశ్వర శతకములో 108 పద్యములు సీసములే అయినప్పటికీ, గర్భ కవిత్వం ఉండటంతో పాటు మత్తేభము, మత్తకోకిల మొదలగు వృత్తములు, కందము, ద్విపద మొదలగు జాతి పద్యములు కూడా ప్రబంధములో ఉన్నట్లు కనపడుతున్నాయి.. ఈ విధంగా చూసినప్పుడు శ్రీ వేంకటేశ్వర శతకము ప్రబంధ లక్షణములతో కూడుకొని ఉందని నిరూపితమవుతుంది.
6. ఉపయుక్తగ్రంథసూచి:
- దుర్గయ్య, పల్లా.(2012). ఆంధ్రప్రబంధవాఙ్ఞయవికాసము, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం: హైదరాబాద్.
- నాగయ్య,జి. (2019), తెలుగు సాహిత్య సమీక్ష ( ద్వితీయ సంపుటి),నవ్యపరిశోధక ప్రచురణలు: హైదరాబాద్. ప్రథము ముద్రణ: 1995.
- రామనరసింహం, కె.వి.ఆర్.(1965). ఆంధ్రప్రబంధములు: అవతరణ వికాసములు, ఆంధ్రాయూనివర్సిటి ప్రెస్: వాల్తేర్.
- రామరాజభూషణుడు. సూర్యనారాయణశాస్త్రి, సన్నిధానం. (వ్యా.) కావ్యాలంకారసంగ్రహము (నరసభూపాలీయము), (1976). యం.శేషాచలం అండ్ కో: సికిందరాబాద్.
- లక్ష్మీకాంతం, పింగళి.( 2018) ఆంధ్ర సాహిత్య చరిత్ర, నవచేతన పబ్లిషింగ్ హౌస్: హైదరాబాద్,
- వెంకటరావు, నిడుదవోలు.( 1966) ‘ఆంధ్రశతక వాఙ్మయ పరిణామ చరిత్ర’ (పీఠిక), శతక సంపుటము-1, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి ప్రచురణ: హైదరాబాద్.
- సుబ్రహ్మణ్యం, జి.వి. (1991). సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు. తెలుగు అకాడమీ: హైదరాబాద్.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.