headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-12 | November 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

10. ప్రాచీనాంధ్రసాహిత్యం: గిరిజనుల సాంస్కృతిక అంశాలు

డా. బానోత్ స్వామి

లెక్చరర్, తెలుగుశాఖ,
కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్
హన్మకొండ, తెలంగాణ రాష్ట్రం.
సెల్: +91 9603082128, Email: banothswamy128@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 20.10.2024        ఎంపిక (D.O.A): 29.10.2024        ప్రచురణ (D.O.P): 01.11.2024


వ్యాససంగ్రహం:

భారతదేశానికి స్వాతంత్ర్యం రాకముందు గిరిజనులను వివిధ పదాలతో పిలిచేవారు. వనవాసి, గిరిజన్, ఆదిమజాతి లాంటి పదాలు ఉపయోగించేవారు. పురాణాలలో, ఇతిహాసాలలో ముఖ్యంగా గిరిజనుల గురించి, దండకారణ్యం గురించి అనేక వివరాలు ఉన్నాయి. గిరిజన నాగరికత చాలా పురాతనమైనది. వారికి రాజ్యాలు ఉండేవి, కోటలు ఉండేవి, వీరికి భాష ఉంది, సంఖ్యా పరిజ్ఞానం, మాసాలు, ఋతువులు లాంటి లెక్కలు కూడా ఉన్నాయి. వారి సాహిత్యం, సంగీతం, వాయిద్య పరికరాల సహకారంతో అత్యున్నత స్థాయికి చేరింది. గిరిజనుల సంస్కృతి ఔనత్యాన్ని, క్రమశిక్షణను, మౌఖికంగానే తర్వాత తరాలవారికి అందజేయబడుతుంది. భారత సంస్కృతికి అనేక మూలాలు గిరిజన సంస్కృతిలో కనిపిస్తాయి. నన్నయ కాలం నుండి ఆధునిక కవుల వరకు తమ కావ్యాల్లో గిరిజనుల గురించి వాళ్ళ సాంఘీక, సాంస్కృతిక, జీవన విధానాన్ని గురించి వర్ణించడం జరిగింది. నన్నయ భట్టు, ఆది, సభాపర్వాల్లో శబరి, పులింద, నిషాద, కిరాత, లుబ్ద శబ్దాలతో పాటు పర్వత నివాసులు, అరణ్య నివాసులు, పర్వతేయులు అని మొదలగు శబ్దాలను గిరిజనుల గురించి ప్రయోగించాడు. ఈ విధంగా మొదలగు శబ్దాలను గిరిజనుల గురించి నన్నయ మొదలుకొని, సంస్కృత తెలుగు కవులు గిరిజనుల గురించి ప్రస్తావించడం విశేషం.

Keywords: చంబకాయలు, వాసాలు, గూగ్రీలు, గీరానగింజలు, చిట్లపొట్లకాయ, ఉప్పెనబట్టెలు, పిల్లాదీపాలంకి, యాకెళ్ళి పాయలు, కాటిరేడు, ఆటవిక.

1. ఉపోద్ఘాతం:

నన్నయ కాలం నుండి ఆధునిక కవుల వరకు తమ కావ్యాల్లో గిరిజనుల గురించి వాళ్ళ సాంఘీక, సాంస్కృతిక, జీవన విధానాన్ని గురించి వర్ణించడం జరిగింది. నన్నయ భట్టు, ఆది, సభాపర్వాల్లో శబరి, పులింద, నిషాద, కిరాత, లుబ్ద శబ్దాలతో పాటు పర్వత నివాసులు, అరణ్య నివాసులు, పర్వతేయులు అని మొదలగు శబ్దాలను గిరిజనుల గురించి ప్రయోగించాడు. ఈ విధంగా మొదలగు శబ్దాలను గిరిజనుల గురించి నన్నయ మొదలుకొని, సంస్కృత తెలుగు కవులు గిరిజనుల గురించి ప్రస్తావించడం విశేషం.

చాలా ప్రబంధాలలో గిరిజన వర్ణనలు, వేట వర్ణనలు పురస్కరించమని చర్వితచర్వణ విషయాలు చెప్పడం జరిగింది. తప్ప వాటిని ప్రత్యేక దృష్టిలో చెప్పింది చాలా తక్కువ. తెలుగు సాహిత్యంలో పూర్తి విషయాలను  గ్రంధాలలో కానీ, రచన చేయడంలో కానీ తెలియపరచలేదు. తెలుగు సాహిత్యంలో గిరిజన ప్రస్తావన కవుల రచనలు చాలా ఉన్నాయి. సంస్కృత వాఙ్మయంలో   కూడా గిరిజన ప్రస్తావన ఉంది. వేదాలలో పంచములు అనే పదం లేదు. పంచములు అంటే గిరిజనులు అని ఉంది. ఋగ్వేద ప్రథమ మండలం ఏడవ సూక్తంలోని 9వ మంత్రంలో పంచక్షిత పదం ఉంది. ఋగ్వేదంలో పంచజనులు, పంచాక్షత పదం, పంచకృషులు అనే మాటలు అనేక చోట్ల కనిపిస్తాయి”. (వేణుగోపాల్ విట్ట, ప్రాచీనాంధ్ర సాహిత్యంలోగిరిజన జీవన చిత్రణ, ఉస్మానియా విశ్వవిద్యాలయం, 2008.)

“తరతరాలుగా గిరిజనులు ఎక్కువ ఎలాంటి మానసిక చింతన లేకుండా ఒక విధంగా ప్రశాంతమైన ప్రకృతి వాతావరణానికి అలవాటు పడి, అడవులతో జీవించడం ప్రారంభించారు.వారి జీవన విధానంలో మార్పులు వస్తూ వలస విధానం ప్రారంభమైంది. మనకంటే పూర్వికులు సంకేతాలను సృష్టించి వినియోగించగలిగే సామర్థ్యాన్ని సంతరించుకోవడంలో తమ సంస్కృతిని నశించిపోకుండా ఇప్పటికే కాపాడుకుంటూ మానవునికి కావాల్సిన కనీస పదార్థాలను, సంబంధిత వస్తువులను వాడకుండా మానవుడు జీవించడం సాధ్యం కాదు.

భావాలు, ఆదర్శాలు, నిబంధనలు, ఆలోచన ధోరణులు, బాంధవ్య వ్యవస్థ, వస్తు సామాగ్రి, మనస్సంబంధ, బాంధవ్యపరమైన సాంకేతిక ప్రక్రియలు ఉత్పత్తులు అవుతాయి. వీటన్నిటిని సమన్వయం చేస్తే జీవన స్వరూపమనే పరిపూర్ణత సిద్ధిస్తుంది. ఈ జీవన స్వరూపమే సంస్కృతి సాంప్రదాయాలు వాటి నుండే ఏర్పడతాయి. 

“చారిత్రకంగా సృష్టించబడిన జీవన స్వరూపమే సంస్కృతి.” (భారతీయ గిరిజన సంస్కృతి – సమాజం, తెలుగు అకాడమి , హైదరాబాద్ 2022. పుట సంఖ్య 17.)

ఈ సంస్కృతి ఒక్క మానవజాతికే పరిమితమైనది. వారసత్వం నుండి కాక సామాజిక పరిజ్ఞానం నుండి వచ్చింది. ప్రస్తుతం ఉన్న సమాజంలో భిన్నత్వాలు, ఏకత్వాలు ఉన్న ప్రతి వర్గానికి ఒక ప్రత్యేకమైన విలక్షణమైన సంస్కృతిని కలిగి ఉంది. సంస్కృతి మానవ జీవితానికి సమాజానికి ప్రాతిపదిక. మానవ జీవితాన్ని అవగాహన చేసుకునేందుకు ప్రాతిపదికగా వివిధ స్థలాల్లో, కాలాల్లో సంస్కృతి తులనాత్మకమైనది. మానవజాతికి మూలకంగా అవగాహన చేసుకునేందుకు సహాయపడుతుంది. అందువల్ల గిరిజనుల భూతకాల విషయాలను గురించి అవగాహన కొరకు గిరిజన సంస్కృతిని అధ్యయనం చేయాలి.

“ఆదిమానవుని సంస్కృతికి ప్రతిబింబం గిరిజన సంస్కృతి. గిరిజనులు ఆహారం ఎలా తయారు చేసుకుంటారు, ఇల్లు ఏ విధంగా నిర్మించుకుంటారు, వారు రోజువారి ఆహార సేకరణ కోసం వేటలు ఎలా చేస్తారు? వృత్తులు వృత్తులకు సంబంధించిన పరికరాలు తయారు చేయడం గురించి ఇవన్నీ విషయాలు ఒక తరం నుండి మరొకతరానికి ఎలా సంక్రమిస్తుందో తెలియజేసేదే గిరిజన సంస్కృతి. ఈ విషయాలను గురించి అధ్యయనం చేయడానికి మౌఖిక సాహిత్యం ఎంతగానో తోడ్పడుతుంది. గిరిజనులే మన సంస్కృతి సాంప్రదాయాలకు మూలపురుషులని చెదలు పట్టిన చరిత్ర మొదలును పరిశీలిస్తే తెలుస్తుంది.

గిరిజనులు చాలా వైవిధ్య భరితమైన జీవనాన్ని సాగిస్తుంటారు. వారి జీవన విధానంలో భాగమైన పండుగలు, జాతరలు, ఉత్సవాలు,నృత్యాలు, ఆచార సాంప్రదాయాలు, నాగరిక ప్రపంచాన్ని ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. గిరిజనులు ఎక్కువగా ప్రకృతిని ప్రేమిస్తారు. ప్రకృతిని ఆరాధిస్తారు. మానవాతీత శక్తుల మీద వారికి నమ్మకం ఎక్కువ. అందుకే వారు కొండలు, గుట్టలు, వాగులు, చెట్లు, పుట్టలను, దేవతలుగా భావించి వారికి మంచి కలిగించే శక్తులను పూజిస్తారు”. (చీనియ నాయక్, బంజారా చరిత్ర సంస్కృతి- ప్రగతి, అనంతపురం, ఆంధ్ర ప్రదేశ్ 1998. పుట సంఖ్య. 17.)

2. సాంస్కృతిక అంశాలు:

2.1 వృత్తులు:

ప్రాచీన తెలుగు సాహిత్యంలో గిరిజనుల జీవన విధానాన్ని పరిశీలిస్తే అధికభాగం వారు వేటాడి జీవించినట్లు తెలుస్తుంది. వేటే వీరి ప్రధాన వృత్తి. ఆహార సేకరణను వేట ద్వారానే చేసేవారు పచనక్రీయ ఎరిగిన మీదట, జంతువులను మచ్చిక చేసుకొన్న తర్వాత అప్పుడప్పుడు వ్యవసాయాన్ని కూడ చేసారు. అడవుల్లో దొరికే పండ్లు, దుంపలు, తేనెలు, జంతు మాంసాలు వీరి భోజన పదార్థాలు. రాజులను దర్శించటానికి వెళ్లిన గిరిజనులు ఆయా రాజులకిచ్చిన కానుకలను పరిశీలిస్తే వాటిని వారెలా సేకరించారో వారేంతిన్నారో, వారి వృత్తులు ఏమిటో అర్థం కాక మానదు.

“గిరిజనులు జీడిపళ్ళు, తేనెలు, చాఱపప్పు వెదురు బియ్యాల వంటకాలు, నేయి, పెరుగు, పాలు, మూడు ప్రొద్దులు ముచ్చటగా ఆరగించారు. వీటిని బట్టి చూస్తే జంతువుల పెంపకంతో పాటు అడవుల్లో దొరికే పళ్ళు తేనెలు చాఱపప్పులను తృప్తిగా తిన్నారు. సుదక్షిణా పరిణయంలో బోయడొకడు దిలీపునికి హరి భల్లూక వరాహ శార్దూలపాకాలను సమర్పించినట్లు కస్తూరి మెలకలను, ఏనుగు దంతాలను, చమరీ మృగాలను తెచ్చిచ్చిన వర్ణనలు ఉన్నాయి. దీని వలన వేటాడి మాంసాలను సేకరించేవారనేది స్పష్టమవుతుంది.” (చీనియ నాయక్, బంజారా చరిత్ర సంస్కృతి- ప్రగతి, అనంతపురం, ఆంధ్ర ప్రదేశ్ 1998. పుట సంఖ్య 48)

గిరిజనుల్లో కొందరు జీవన ఉపాధి కొరకు మరియు వారి వంశానుగతంగా కొన్నివృత్తులు చేపడుతూ ఉంటారు. మరికొందరు అవసరాల నిమిత్తం తాత్కాలికంగా వృత్తులను నిర్వహిస్తారు. అవి తర్వాత వృత్తులుగా మారాయి. అలాంటి వృత్తులు గిరిజనులలో కూడా చేస్తున్నారు. సాధారణంగా కొన్ని ప్రాంతాలలో గిరిజనులలో మంగలి, అవుసలీ, డప్పుబాట్, వివిధ వ్యవసాయ ఉత్పత్తులను మరియు వస్తు వినిమయ పద్ధతి వీరి సంస్కృతి సాంప్రదాయాలలో భాగంగా ఉండేది. గిరిజన వృత్తిలో భాగంగా వీరి ఆహార సేకరణ మరియు తినే వస్తువులు ప్రకృతికి దగ్గరగా చాలావరకు సహజసిద్ధంగా దొరుకుతాయి.

2.2 ఆహారం:

మనవ సమాజంలో ఎవరి ఏ వృత్తి అయిన భోజనసంపాదన కొరకే అని మనం గమనించాలి. గిరిజనులు సామాన్యనంగా అడవుల్లో దొరికే పండ్లు, వేట మాంసం, వివిధ రకాల ఔషదాలు, తేనే ఆహార పదార్థలుగా భుజించేవారు. పళ్లు, వేటాడి తెచ్చే మాంసం, పండించుకొనిన ఆహార పదార్థాలు గిరిజనుల భోజన పదార్థాలు, వేటలో గిరిజనులు నిర్దయులై మృగాల పట్టి చంపి మాంసాన్ని సేకరించేవారు. జంతువుల తిత్తులొలిచి మెత్తని మోటు కత్తులతో తునియలు చేసి ఆకులలో గుత్తంగా పొత్తరలు కట్టి ఉంచేవారు. క్రొవ్విన పందులను చంపి తెచ్చి మంటల్లో వేసి కమరేలా కాల్చి పెంకులతో ఆ కాలిన తోలును మాత్రం పోయేటట్లు చేసేసి, ఎఱ్ఱ మన్ను దళంగా పూసి మళ్ళీ నిప్పులతలో ద్రవమంతా ఇగిరిపోయేటట్లు కాల్చి ముక్కులుగా కోసేవారు.

 ఆ ముక్కలను సన్నని సలాకలకు గ్రుచ్చి చమురు కారేటట్లు కాల్చి తినేవారు.

భోజనంబులు మాకు ముప్రోద్దు జీడి
పండ్లు పేరతేనియలు చారపప్పు వెదురు
బియ్యముల వంటకము నేయి పెరుగు పాలు
నింత సుఖమున్నదే రాజు లేరికైనా (సుదక్షిణ పరిణయం. ప. 3-151) 

ఆదిమానవుడు అడవిలోని పండ్లు, గడ్డలు, ఆకులు తిని జీవించిన విధంగానే గిరిజనులు ప్రకృతిలోని వృక్ష సంపదను ఆహారంగా స్వీకరిస్తారు. వాటిలో ముఖ్యంగా పిండి, దుంప, చడు దుంప, తెల్లగడ్డ, చంబకాయలు, తేనె, ఆకుకూరలు, తెగదుంప వంటి వాటిని నేడు ఆహారంగా ఉపయోగిస్తున్నారు. జొన్నలను పిండి చేసుకొని అంబలి, ఘడక, బొంతబియ్యం, సామాలు, ధాన్యంతో ఆహారాన్ని తయారు చేసుకుంటారు. ప్రస్తుతం నేటికీ అదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలలో గోండులు, కొలాములు సబ్జా గింజలు, సజ్జ, గానుగు గింజలను అంబలి కాచుకుంటారు. పిట్టలను పక్షులను జంతువులను వేటాడి ఆహారంగా స్వీకరిస్తారు.

గిరిజనుల కట్టుబొట్టులో తేడా కనిపించిన ఆహారంలో మాత్రం మార్పు రాలేదు. వీరు ప్రధానంగా ఆహార సేకరణ కూడా ప్రకృతిలో లభించే వనరులను, వీరి మనుగడ  సాగించడం కోసం స్వీకరిస్తారు. ఆహార సేకరణ ప్రాచీన శిలాయుగం నుండి ఇప్పటివరకు కనిపిస్తుంది. గిరిజనులు చేసే పోడు వ్యవసాయం ద్వారా మంచిగా, సమృద్ధిగా పంట పండితే మూడు నెలలకు సరిపడా ఆహారం దొరుకుతుంది. కానీ మిగతా మూడు నెలల కాలం కోసం కందమూలాలను సేకరించడం అడవి దుంపలు, పండ్లు, సేకరించడం వేటాడడం చేపలు పట్టడం చేస్తుంటారు.

2.3 గృహనిర్మాణం:

ప్రాచీన మానవులు చెట్ల తొర్రల్లో కొండ గుహల్లో నివసించారు. చెంచుల, యానాదుల జీవన విధాన పద్ధతులు పరిశీలిస్తే వీరిని పాతరాతియుగ ప్రజల సంతానంగా చెప్పొచ్చు. కావ్య ప్రబంధాల్లో ఆచారాలు వేషభాషలు వర్ణింపబడ్డా వీరు నివసించిన గృహ వర్ణనలు మాత్రం బహు స్వల్పం.

అలరు కస్తురి దీనెలలికి వాకిళ్ళు చెం

తలవైచి పోయిన తట్టు పునుగు

గోడలు పూయంగ గ్రుమ్మి గంధంబున

మేదించి నట్టి జవ్వాది యడుసు

నాడాడ సరిబేసులాడి పోవిడిచిన

ముదురు వెదుళ్లలో ముత్తియములు

బలుపుటేనిక కొమ్ముటల వలపై ద్రోవ

దవిలించి కట్టిన సవరములను

వంట కట్టెలకని తెచ్చి వాములిదిన

యగరు మాకులపై నిండ నాఱబెట్టు

కప్పురంపులునంటులు గలిగి మొఱయు

నెఱుకు పల్లియలొక కొన్ని యెదుట గాంచి (యయాతి చరిత్ర 1-119)

నాగరికులు జాజుతో అలుకగా గిరిజనులు కస్తురితో తీనెలనలికారు. మనవారు మట్టితో పేడకలిపి దానిని మక్కబెట్టి గోడలు పూస్తారు. గిరిజనులు మట్టి బదులు గంధం పేడ బదులు జవ్వాది కలిపి గోడలకు పూసారు. గిరిజనులు వెదురు ముత్యాలతో ఆటలను ఆడారు. మదించిన ఏనుగు కొమ్ములు పాతి అలువలు అల్లి వానికి సవరాలు కట్టారు. కర్పూరపు అరటి పట్టలను అగరు మ్రాకులపై ఆరబెట్టేవారు.

వాల్మీకి చరిత్రలో సప్త ఋషులు వేసిన ప్రశ్నకు జవాబు తెలుసుకోవాలనుకొనిన బోయడు మార్గ మధ్యంలో అవకాశం ఉన్నను వేటాడక చింతాభరమెంతయో ఘనం కాగ వేగంగా తన తాటింటికి వెళ్ళినట్లు గల వర్ణనలను చూడగా వారు నివసించడానికి తాటికమ్మల గుడిసెలను నిర్మించుకునే వారని తెలుస్తుంది.

సామాన్యంగా నాగరిక సమాజంలో గిరిజనేతరులు గృహ నిర్మాణం వీరికి అనుకూలమైన వాస్తు శాస్త్రాన్ని బట్టి గృహ నిర్మాణం చేసుకుంటారు. కానీ గిరిజనులకు వాస్తు శాస్త్రానికి సంబంధించిన నియమ నిబంధనలు ఏమీ ఉండవు. వీరి సాంప్రదాయ పద్ధతిలో అందరూ ఒకే విధంగా గృహ నిర్మాణం చాలా ఎత్తైన ప్రదేశంలో నిర్మాణం చేపబడుతారు. కేవలం ఇల్లు నిర్మాణం చేసుకోవాలి అన్న ఆలోచన ఉంటే అడవికి వెళ్లి వాసాలు, కర్ర, వెదురు బొంగు, పచ్చికర్రలు గృహానికి అవసరమైన కలపను సేకరించి పూర్తిగా ఎండిన తర్వాత గృహ నిర్మాణం చేస్తారు.

2.4 వేట విధానం: 

నన్నెచోడుడు ప్రబంధ లక్షణాలను చెబుతూ, చాతుర్షష్టి కళలతో పాటు అష్టాదశ వర్ణనలో కావ్యం పరిపుష్టం అయి ఉండాలని చెప్పారు. తరువాత కవులు వర్ణనల సంఖ్యను పెంచారు.అనేక ప్రభందాలలో వేట వర్ణనలు చాలా ఉన్నాయి. మొట్టమొదట వేట వర్ణన గురించి తెలిపే కావ్యం ఉత్తర హరివంశం. కొండకోనల్లో సెలయేర్ల తీరాల్లో జీవించిన గిరిజనులు తమ పంట పొలాలను పాడుచేస్తూ, తమను బాధించే క్రూరమృగాలను వేటాడేందుకు రాజులను ఆహ్వానించేవారు. ఈ వేట సందర్భంలో రాజుల యొక్క శక్తి సామర్థ్యాలను, నైపుణ్యాలను వీరు ప్రదర్శించేవారు. కాళిదాసు వేటను గురించి వివరిస్తూ వేట వ్యసనం కాదు, వేట ప్రీతిని బలాన్ని చేకూరుస్తుందన్నారు. వేటను పోలిన మరో వినోదం లేదన్నారు. వేట ప్రయోజనం వలన గోవులను, వ్యవసాయ సంపదను కాపాడవచ్చని, మృగాల నుండి రక్షణ పొందవచ్చని శృంగార శాకుంతలం తెలియజేస్తుంది. ఆటవిక జీవన సమరంలో ఆదిమానవ ప్రతిరూపంగా మిగిలి ఉంది వేట. మానవుని జీవన మంత్రం వేట. గిరిజన వేటలో పెద్ద సాధనము కుక్క. వేటలకు ఉపయోగించే బాణాన్ని రకరకాల మీటాలకు, ఉచ్చులకు మానవుని యంత్రాలుగా పేర్కొనవచ్చు. ప్రాచీన కాలంలో గిరిజనులకు వేట జీవనాధారం. ఈ వేట వలన దాదాపుగా మూడు నెలల వరకు వీరు జీవనం కొనసాగిస్తారు. వేట కూడా వివిధ రకాలుగా ఉంటుంది. ఒంటరిగా వెళ్లడం, కొన్ని కొన్ని సమూహాలుగా ఏర్పడి వేటాడటం, అందరూ సమిష్టిగా వేటాడటం, ఉంటుంది గిరిజనులు సాధారణంగా వేటకు విల్లంబులు, బల్లెములు, రాళ్లను గొడ్డలిని కర్రలను సాధనాలుగా ఉపయోగిస్తారు. విలువిద్యలో గిరిజనులు చాలా నేర్పరులు. (వేణుగోపాల్ విట్ట, ప్రాచీనాంధ్ర సాహిత్యంలోగిరిజన జీవన చిత్రణ, ఉస్మానియా విశ్వవిద్యాలయం, 2008. పుట సంఖ్య 40.)

2.5 వేషభూషణలు:

కొండ కోనల్లో సెలయేటి తీరాల్లో నివసించే గిరిజనులు చిత్ర విచిత్రంగా అలంకరించుకునేవారు. ఎఱ్ఱని వెండ్రుకలను కొప్పుగా చుట్టి లేత ఆకులను, తీగలను, తురిమి, గురివింద దండలు ధరించి, నెమలి ఫించాలను వస్త్రాలుగా చుట్టుకొని పయ్యెదలకు మారుగా పారుటాకులు ధరించారు. తిలకంగా చాదుబొట్టు పెట్టుకొని చిగురాకులను కర్ణాభరణాలుగా ధరించారు. కురుల్లో కుసుమ పూవుల ధూళిని ధరించారు. నుదుటి భాగాన గైరికాద్రవ్యాన్ని పూసారు. ఎఱ్ఱని కళ్ళు నల్లని ఒళ్ళు కలిగి ఉన్నారు. గిరిజన స్త్రీలు చందనపు కమ్మలు భుజాలకు తగిలేటట్లు వ్రేలాడదీసారు. కుంకుమ చెట్టు పూల పొడిని పాపట్లో ధరించారు. ఇప్పటి నాగరికులు ఎఱ్ఱని కుంకుమను ధరిస్తారు. భాగ్యవంతులైనా పట్టు చీరల బదులు పారుటాకులను ధరించారు. మాణిక్యాలంకారాలున్నా గురి వింద పూసల దండలనే ధరించారు. గోండుల తలలపై కొమ్ముల నలంకరించుకునే ఆచారం నేటికి ఉంది.

ఉరువైన గురివింద సారులు నర్రుల నుంచి

తలలపై కింకొమ్ము లలవరించి

కీరు నానంబులుమొరాలపై జేర్చి

పాపమేపరి యిక పటము గప్పి (క్షత్ర బంధోపాఖ్యానం ప.2-12)

క్షత్ర బంధోపాఖ్యానంలోని చెంచు తలపై కొమ్ము ధరించినట్లు చెప్పబడింది. కుఱుచ చెవులు, హీన జాతి లక్ష్మణ పెద్ద చెవులు మహా పురుష లక్షణం. గిరిజనులు గద్దలు ఈకలతో వస్త్రాలు అల్లుకొని ధరించారు. పికిలి పిట్ట తోక క్రింద ఉండే ఎఱ్ఱని తూళికలతో చుట్టిన సంకుల పేర్లను ధరించారు. కోరెందుతీగతో (దీనిని సంస్కృతంలో ఆధారి అంటారు). చేసిన పూసలను ధరించారు. కోరింత దగ్గు తగ్గేందుకు కోరెందు తీగల దండలు పిల్లలకు బుధ, ఆదివారాల్లో వేసేవారు.

2.6 గిరిజన స్త్రీల వర్ణన:

గిరిజన స్త్రీలు విలక్షణమైన వేషరీతిలో ఉంటారు. ముఖ్యంగా లంబాడి స్త్రీల వేషదారణ గమనించినట్లయితే తనువు నిండా వస్త్రా దరణ, అద్దాల అల్లికలు, చిన్నగా శబ్దం చేసే కాళ్ళ కడియాలు బహు ముచ్చటగా ఉంటాయి. చేతి నిండ జంతువుల జంతువుల ఎముకలతో తయారు చేసిన గాజులు దరించి ఉంటారు. ఈ వేష దారణ ముఖ్యంగా క్రూర మృగాల నుండి, జంతువుల నుండి రక్షించబడతాయి. 

తలరెండు పాయలు తగదువ్వి కడతల

జడలల్లి పేలిక ముడులువైచి 

చెవుల టోప్లిల్ వ్రేల  జక్కి యడ్కాటూలు

గుగ్రీలు వానిపై కుదురనిలిపి……      (శ్రీ మత్ర్పతా గిరి ఖండం ప.5-15) 

“లంబాడి స్త్రీ పాపిట తీసి తలను రెండు పాయలుగా దువ్వి, రెండువైపుల జడలు అల్లుకొని బట్ట పేళికలతో ముళ్ళు వేసి, చెవులకు టోప్లేలు వ్రేలాడదీసి, గూగ్రీలు, ఆడ్కాటులు జడలకు తొడిగి క్రిందికి గొలుసులు జారునట్లుగా చెక్కి ఆలంకరించుకొని ముక్కునకు పెద్ద పోగు ధరించి, మెడకు పెద్దదైన లావుపాటి వెండి కంఠికను ధరించింది. సూది కుట్టుతో కుట్టిన అలంకరణగల ముదురు ఎఱుపు రంగుగల చోళి మరియు గగరా ధరించి కాళ్ల కడియాలు మల్లుషుల్లు మనగా ఒక లంబాడీ స్త్రీ వచ్చింది. ఇట లంబాడీ స్త్రీ వర్ణన, వేషభూషలు కళ్ళకు కట్టినట్లుగా ప్రాచీన సాహిత్య వర్ణనలో చూడవచ్చు.

2.7 మతము-జాతరలు:

ప్రాచీన సాహిత్యంలో గిరిజనుల ప్రస్తావనలో అధ్యత్మిక సంధర్బాలను గమనించవచ్చు. అల్లమ్మ, ఎక్కలమ్మ, మల్లమ్మ, మైసమ్మ,  కాటిరేడు పోతరాజుకు మొక్కులు చెల్లించేవారు. భిల్లులు, చెంచులు హిందూ దేవతలవలే గ్రామ దేవతలను కొలిచేవారు.  

అల్లమ్మ నేక్కలమ్మలను

మల్లమ్మను కటిరేణి మైసమ్మను తా

నుల్లమున దలచి భక్తిని

భిల్లుల గొనియాడి పల్కే విభుడాలింపన్ (భానుమద్విజయం పు.2-216) 

గిరిజనులకు హిందూ మతంపై విశ్వాసం మెండు భద్రాద్రి రామన్న, శ్రీశైల మల్లన్న, అహోబిల నరసింహ వీరి ఆరాధ్య దైవాలు బోనా లెత్తి తప్పెటలతో దేవత వద్దకు వెళ్ళి నైవేద్యంగా కోళ్లను బలిఇస్తారు. ముత్యాలమ్మ, మైసమ్మ పోశమ్మ ఎల్లమ్మ, తోకయ్య వీరి దేవతలు, వేటాడుటకు ముందు కాటిరేని పూజ జరిపేవారు.

2.8 వివాహాము:

వర్ణ వ్యవస్థ పకడ్బందీగా నడుస్తున్న రోజుల్లో వివాహాలకు సంబంధించి కులాల మధ్య వివాహాలను మనుస్మృతి ఈవిధంగా తెలిపింది. శూద్రునకు శూద్రకన్య, వైశ్యునకు శూద్రకన్య, స్వజాతి కన్య, క్షత్రియునకు శూద్ర వైశ్య స్వజాతి కన్యలు, విప్రునకు శూద్ర, వైశ్య, క్షత్రియ స్వజాతి కన్యలు శ్రేష్ఠులు. బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు తప్ప లోకంలోని మిగతా వారంతా శూద్రులందు చేర్చ బడ్డారు.

శుద్రైవ భార్య శుధ్రస్య సాచస్వాచ విశాం స్మృతే

తేచస్వాచైవ రాజాజ్ఞశ్చతాశ్చ స్వాచాగ్ర జన్మనం: (మనుస్మృతి త్రుతియాద్యాయం శ్లోకం.13)

అగ్ర వర్గాల వారు, క్రింది వర్గాల వారిని వివాహ మాడ వచ్చును కాని, క్రింది వర్గాల వారు పై వర్గాల వారిని వివాహ మాడరాదు. క్రింది వర్ణాల వారు అగ్ర వర్గాల వారిని వివాహ మాడితే వారికి స్మృతులు అనేక రకాల శిక్షలు వేసాయి. శ్రీకృష్ణుని జాంబవతితో వివాహం, వేంకటేశ్వరుని బీబీనాంచారీల వివాహం, నృసింహస్వామి చెంచు లక్ష్మీల వివాహం నాటి అనులోమ వివాహాలకు ఉదాహరణలుగా చెప్పాలి.

2.9 ఆచారాలు:

క్రొత్తగా పుట్టిన శిశువు ఇళ్ళల్లో భిల్ల సతులు జవ్వాది, పునుగు, ఏనుగుమదజలాల సువాసనల వ్యాపింప చేస్తారు. వాసన పోవడానికి ఇప్పుడు (పురుటి వాసన) అగరు వత్తులు ముట్టిస్తారు. నాగరికులు పన్నీరును చల్లినట్లుగా కాదంబరి లో వర్ణించబడింది.

ముట్టింతురు జవ్వాదియు 

దట్టపునుగు భద్రకరిమదముగూర్చి కడం

జుట్టంగ గబ్బు క్రొత్తగ

బుట్టిన నిసువుల నివాసముల భిల్లసతుల్ (సుదక్షిణపరిణయం ప.3-145)

ప్రతి మతంలో కొన్ని విశ్వాసాలు, ఆచారాలు, అనూచానంగా. కొనసాగింపబడుతున్నాయి. ఒక్కొక సారి ఈ ఆచారాల నెందుకు ఆచరిస్తున్నామో, అవిఎలా కొనసాగింపబడుతున్నాయో తెలియదు. మన జీవితాలలో మనం కొనసాగిస్తున్న ఆచారాలు అనాది మానవుడాచరించి మనకు అందించినవే కాకపోతే కాలం గడిచేకొలది మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

రాజులను దర్శించే గిరిజనులు అడవులలో వారికి అందుబాటులో ఉన్న వస్తు సంచయాన్ని కానుకలుగా తెచ్చిచ్చినట్లు అనేక కావ్య ప్రబంధాల్లో వర్ణితాలు. రాజు దైవ స్వరూపుడు, దైవం దగ్గరికి పిల్లలున్న ఇంటికి ఒట్టి చేతులతో పోరాదన్నది ఇప్పటికీ ఆచరింప బడుతున్న ఆచారం ఈ గిరిజనుల కానుకల సాంప్రదాయమే క్రమంగా నాగరికులలో దైవం దగ్గరికి, బంధువుల దగ్గరికి రిక్త హస్తలతో పోరాదనే నియమంగా రూపొందింది” (చెన్నయ్య, జే తెలంగాణ గిరిజన భాషా సాహిత్యలు, ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాద్, 2017. పుట సంఖ్య 27.)

2.10 ఆటలు:

నేడు మనం ఆడే ఆటలకు ప్రాచీన కాలంలో వఆడిన ఆటాలకు కొన్ని భేదాలు ఉన్నాయి. మరి కొన్ని ప్రాచీన కాలాన ఆడిన ఆటలే ఆడబడుతున్నాయి. 300 లేక 400 సంవత్సరాలకు పూర్వంఆడిన అట వివరాలు స్వరూప స్వభావలు మనకు తెలియని స్థితికి చేరాయి.

చిట్లపొట్లకాయ సిరిసింగణావత్తి

గుడి గుడిగుంచాలు కుందెన గుడి

డాగిలి మ్రుచ్చులాటలు, గ్రచ్చకాయలు

వెన్నెల కుప్పలు, తన్ను బిల్ల

తూరన తుంకాలు, గీరన గింజలు

పిల్ల దీపాలంకి, బిల్లగోడు

చిడిగుడవ్వల పోటి చెండు గట్టినబోది

యల్లి యుప్పన బట్టె లప్పళాలు

చిక్కనాబిల్ల తోటిళ్ళు చిందతాది

యైన శైశవక్రీడా విహార సరణి

జెంచు కొమరుల తోడ నుద్దించుకాడు

దిన్నడభినవ బాల్య సంపన్నుడగుచు

(తెలుగు సాహిత్యంలో క్రీడ వినోదాలు, వడ్ల సుబ్రహమణ్యం. పు.43) 

వెన్నెలకుప్ప, బిళ్ళగోడు, గుడుగుడుగుంచాలు, గచ్చకాయలు, అప్పళాలు, గీరానగింజలు, చిట్లపొట్లకాయ, ఉప్పెనబట్టెలు, పిల్లాదీపాలంకి, రాసిన సాహిత్యం లో వర్ణింపబడిన కొన్ని ఆటలు వివరాలు తెలిసినప్పటికీ నిఘంటువులో సైతం క్రీడా విశేషాలు ఉన్నాయి. అందులో కొన్ని ఆటల వివరాలు కూడా ఉన్నాయి. తెలుగు సాహిత్యంలో క్రీడా వినోదాలు వడ్ల సుబ్రహ్మణ్యం రచయిత వివరించారు.

2.11 రాజనీతిలో గిరిజనుల స్థానం:

“మహాభారతంలో ధర్మరాజు ద్రాక్షుడు రాజనీతిని బోధిస్తూ రాజు ఏ నియమాలను పాటించారో ఎలా జారుకుడై మెలగాలో తెలిపారు. అట్టి సందర్భంలో గిరిజనుల్లోని యోధులకు రేవు వద్ద కొలువు ఇవ్వమని భారత కర్త తిక్కన చెప్పడం వృత్తి నిర్వహణలో గిరిజన యోగ్యతను సూచిస్తుంది.

కొలవిమ్ము మాపుకడయో

ధులకెల్లను సంధ్యవడ్డ దూతలనున్ జా

రుల సంభావింపుము రా

త్రుల కాంతాభోగతత్పరుడవగమునృపా” (ఆముక్తమాల్యద 4వ. ఆశ్వ. 206-225)

ఆముక్తమాల్యదలో యమునాచార్యులు పాండ్యరాజులకు నీతులను బోధిస్తూ రాజనీతిని కూడా చెప్పారు. ఎంతటి శత్రువు వచ్చినా వెనుతిరగారదని వారిని ఎదిరించి, అవసరమైన బల స్తోమతలను సమకూర్చుకోవాలని గిరిజనుల గురించి తెలిపారు.

2.12 వైద్యం:

అడవుల్లో తిరిగే గిరిజనులకు అనేక జంతువులతో చెట్లు చేమలతో పరిచయం ఉంది. మూలికా వైద్యంలో నైపుణ్యం సంపాదించారు. జంతువుల వైద్యం నుండి తీసే పసుపు పచ్చని పదార్థాన్ని చేదుకట్టు అంటారు. ఈ రసాన్ని మందుల్లో ఉపయోగిస్తారు. ఎఱకు రేడగు ‘స్వరోచికి’ చెంచులు నక్కకొమ్ము, గోరోజనం, తేనె పెఱజున్నులను కానుకలుగా ఇచ్చారు. తేనెపెర వాతహరమగు పదార్థం సామాన్యంగా లభించని వస్తువిది.మొసలిలో ఉండే గోరోజనాన్ని క్రొవ్వును పక్షవాతం రాకుండా మందుగా ఉపయోగించేవారు ఆహారం సులభంగా జీర్ణం కావడానికి రాతిబదనికల చూర్ణాన్ని భోజ్య పదార్థాలపై చల్లేవారు. పులిజున్నును ఔషధంగా వాడారు. (చంద్రభాను చరిత్ర 2-5)

శిశువులకు దగ్గు దమ్ములు రాకుండా ‘ఏదుపొట్ట’ ను ఉపయోగించేవారు. దుప్పి కొమ్మును నూరి శివువులకు త్రాగిస్తే గొంతు వాపులు తగ్గేవి. కుందేలు పాలపొట్ట (ఇది చిన్న కుందేళ్ళ కుంటుంది) వలన శిశువుల సమస్త జీర్ణ కోశ సంబంధ రోగాలు తగ్గుతాయి. ప్రసవించిన స్త్రీలు కాయం అనే వేడిని కలిగించు పదార్థాన్ని తినేవారు. వేప చిగుళ్ళు, యాకెళ్ళి పాయలు, కుంకుమ పూవు కలిపి ముద్దగా నూరి శనగగింజంత పరిమాణంలో మాత్రలు చేస్తారు. దీనినే కాయం అంటారు. ప్రసవించిన స్త్రీలు రోజు కొకటి చొప్పున మూడు దినాలు నేటికీ వాడుతున్నారు. వాత హరణార్ధం వసకొమ్ముల పూసలను ధరించేవారు. సులభ మలవిసర్జనానికై పుట్టిన శిశువులకు ఆముదాన్ని త్రాగించేవారు. ఆరోగ్యంగా ఉండేందుకు మందుల తాయితలను కట్టుకునేవారు.

శివుని కంటి నుండి రక్తం స్రవించగా తిన్నాడు చేసిన వైద్యం నాటి గిరిజన వైద్యంగా భావించాలి మీది వస్త్రాన్ని పొట్లం చూసి ఆవిరి వచ్చేటట్లు నోటితో గాలిని ఉది కోకతో ఒత్తేవారు. చేతుల రాపిడి వల్ల కలిగే వేడుకలపై ఉంచేవారు. ప్రాచీన సాహిత్యం లో గిరిజనులు రాజులకి ఇచ్చిన కానుకలు వైద్యానికి పనికి వచ్చేవిగా ఎక్కువగా కనిపిస్తాయి”. (వేణుగోపాల్ విట్ట, ప్రాచీనాంధ్ర సాహిత్యంలోగిరిజన జీవన చిత్రణ, ఉస్మానియా విశ్వవిద్యాలయం, 2008. పుట సంఖ్య 40.)

3. ప్రాచీనకావ్యాలలో గిరిజన భాష - యాస : 

జానపద దశ నుండి నాగరికత పురోగమించిన మానవుల భాష యందు మార్పులు జరుగుతూ భాష కలగలుపు ఎక్కువ ఉంటది అగ్ర జాతులలో వైష్ణవులందరూ తమిళ పదాలు, శైవుల యందు కన్నడ పదాలు, కురువలలో కన్నడ పదాలు, లంబాడిలో మరాఠీపదాలు ఎక్కువగా కనిపిస్తాయి. ప్రాచీన సాహిత్యంలో అగ్రజాతుల వారి భాషకు నిమ్న జాతుల వారి భాషకు ఎంతో స్పష్టమైన భేదం ఉంది. అగ్ర జాతుల వారి భాషల పదాలు సంపూర్ణలై ఉచ్చరణ స్పష్టంగా, ఉండగా నిమ్న జాతుల వారి భాషలో వ్యంగ్య వ్యవహారాలు ఉన్నాయి. తదుపరి కాలం తరువాత అగ్ర జాతుల భాషలో ఎటువంటి పలుకుబడులు, ఊతపదాలు సమకూర్చుకున్నాయో, గిరిజన భాషలో కూడా అట్టి పలుకుబడులు, ఊతపదాలు కుదురుకున్నాయి.

ప్రాచీన కావ్య ప్రపంచమంతా రాజు నాయకమే కానీ సామాన్యులకు, అందులో గిరిజనులకు స్థానం లభించలేదు. రాజు ఆస్థాన కూలీలుగా, వినోదాలలో, వేట సందర్భంలలో మాత్రం కొందరు సామాన్యులకు, గిరిజనులకు స్థానం లభించింది. నన్నయ్య గారి మార్గకవిత పుంజుకొని దేశికవిత వెనుకబట్టక నన్నెచోడుడు దానిని రంగానికి కొని వచ్చాడు. అట్లాగే పాల్కూరికి సోమన సంస్కృత రచనలనకు ఎదురు తిరిగి దేశ రచనలపై ఎక్కువ మక్కువ కనబరిచాడు.
దేశీయ పదాలతో పాటు ఆటవికులు పెట్టుకున్న పేర్లు కూడా శుద్ధ దేశ్యాలుగానే, అవి ఏ జంతువాచకాలుగాను, వృక్ష వాచకాలుగా కనిపిస్తుంటాయి. కాటిరేడు, కంభమయ్యా, పోతురాజు, గంగమ్మ, మలమమ్మ, అక్కలమ్మ, ఈ పేర్లు గిరిజన తెగలలో ఈనాటికీ వ్యవహారంలో ఉన్నాయి.

4. పరిధి ప్రాముఖ్యత:

ప్రాచీనాంధ్ర సాహిత్యంలో అనేక గిరిజన పాత్రలు అంశాలు కేవలం పేరుకు మాత్రమే ప్రస్తావించడం జరిగిందని పరిశీలించడం జరిగింది. సాహిత్యంలో అనేక విషయాలు ఉద్భవించినప్పటికీ గిరిజన సాహిత్యంలో పాత్రలు మాత్రం కేవలం నామమాత్రంగానే కొనసాగాయి. వాటికి తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో పాటు ప్రాచీనాంద్ర సాహిత్యంలో గిరిజన సాహిత్యానికి ప్రాధాన్యత ఎక్కడ లభించలేదు. పాత్రలు వివిధ సన్నివేశాన్ని బట్టి సందర్భాన్ని బట్టి చెప్పడం జరిగింది కానీ వాటికి సంబంధించిన చారిత్రక విషయాలను పూర్తిగా ఎక్కడ ప్రస్తావించలేదు. ప్రస్తుతం పరిశోధన జరుగుతున్న అనేక విషయాలలో గిరిజన సాహిత్యం పట్ల కూడా లోతైన సాహిత్య అధ్యయనం జరగాలని, గిరిజన సాహిత్య పరిధి ప్రాముఖ్యతను భావితరాలకు అందించాలని ఆశిస్తున్నాను.

5. ముగింపు: 

ప్రాచీనాంధ్ర సాహిత్యంలో గిరిజనుల ప్రస్తావన చాలా తక్కువ అప్పటి గిరిజనులు సంచార జీవులుగా జీవిస్తూ ఎక్కువగా అరణ్య ప్రాంతాల పాత్రలో నిషేధం అవుతున్నాయి కానీ స్థిర నివాసం ఎక్కడా కనబడలేదు దీనికి మూలం సంచార జీవనంతో పాటు ఆటవిక జీవితానికి అలవాటు పడి అరణ్యంలో నివసించడం.

ప్రస్తుతం నేటికీ కూడా కొన్ని గిరిజన తెగలు ఆధునిక కాలానికి దూరంగా అరణ్యాలలో జీవిస్తూ ఉన్నాయి దానికి ప్రధాన కారణం విద్యా సామాజిక అవగాహన సాంకేతిక పరిజ్ఞానం లోపం నూతన చైతన్య స్రవంతి లేకపోవడం.ప్రాచీన సాహిత్యంలో ఎక్కడ చూసినా గిరిజన పాత్రలను అసంపూర్ణంగానే వివరించారు. ఆనాటి చాతుర్వర్ణ వ్యవస్థలో గిరిజనులు కూడా జీవించినప్పటికీ వారికి సముచితమైన స్థానం ఇవ్వకపోగా, గిరిజన సాహిత్యం పై సమగ్రమైన రచన చేయలేదు. దానికి ప్రధాన సమస్య నిమ్న జాతులుగా సంచరించడం అప్పటి సంస్కృత విద్యను అందిపుచ్చుకోకపోవడం. ఆధునిక తెలుగు సాహిత్య ప్రపంచంలో నేటికీ కూడా గిరిజన సాహిత్యానికి సముచితమైన స్థానం ఇవ్వకపోగ సాహిత్య సృష్టి జరగలేదు.

18వ శతాబ్దం తర్వాత కథకు, నవలకు తదుపరి కాలంలో వచ్చిన కవిత ప్రక్రియకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తు రచనలు కొనసాగాయి. ప్రపంచీకరణ, ప్రభావం తర్వాత 19, 20 శతాబ్దాలలో స్త్రీల, దళిత, బీసీవాద, మైనారిటీవాదాల సాహిత్యాలు తమ అస్తిత్వాన్ని రాసుకున్నాయి, కానీ గిరిజన సాహిత్యం ఆశించిన మేర సాహిత్య రచన జరగలేదు, దానికి ప్రధాన కారణం అక్షరాస్యత వైఖరి, ఆటవిక జీవనానికి అలవాటు పడిన గిరిజన తెగ సామాజిక చైతన్యం లేకపోవడంతో పాటు, ప్రాచీనసాహిత్యంలో ఆధార గ్రంధాలు ఎక్కువగా లేకపోవడం. కాబట్టి ప్రస్తుతం పరిశోధన రంగంలో గిరిజన సాహిత్యంపై చాలా లోతైన సమగ్ర విశ్లేషణ జరగాలని కాంక్ష.

6. ఉపయుక్తగ్రంథసూచి:

  1. చెన్నయ్య, జె. తెలంగాణ గిరిజన భాషా సాహిత్యలు, ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాద్, 2017
  2. జగన్నాధం, పెర్వరం, ఆధునిక సమాజంలో గిరిజన భాషా సంస్కృతి, ద్రవిడ విశ్వవిద్యాలయం కుప్పం, 2012
  3. జగన్నాధం, పేర్వారం. ఆధునిక సమాజంలో గిరిజన భాషాసంస్కృతి, ద్రవిడ విశ్వవిద్యాలయం కుప్పం, 2012
  4. నదీం హస్ నైన్ భారతీయ గిరిజనులు, హైదరాబాద్, 1995
  5. నాయక్, గోనా. భారతదేశంలోబంజారాలు, కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005
  6. నాయక్, గోనా. సుగాలి సంస్కృతి భాషాసాహిత్యం, కేంద్రీయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్, 2005
  7. నాయక్, చీనియ. బంజారా చరిత్ర సంస్కృతి- ప్రగతి, అనంతపురం, ఆంధ్ర ప్రదేశ్ ,1998
  8. భారతీయ గిరిజన సంస్కృతి – సమాజం, తెలుగు అకాడమి , హైదరాబాద్, 2022
  9. ముత్యం. తెలంగాణ భాష తెలుగు భాష గిరిజన భాషలు, శాతవాహన విశ్వవిద్యాలయం, కరీంనగర్, 2016
  10. రామాచార్యులు, బి. తెలుగు కావ్యాల్లో గిరిజనుల సంస్కృతి, 2001
  11. వెంకటేశం, ఎన్. అర్.  బుడగ జంగాలు భాషసాహిత్య, సాంస్కృతికపరిశీలన,1995
  12. వేణుగోపాల్, విట్ట. ప్రాచీనాంధ్ర సాహిత్యంలోగిరిజన జీవన చిత్రణ, ఉస్మానియా విశ్వవిద్యాలయం, 2008
  13. సుందరం, ఆర్వీఎస్, ఆంధ్రుల జానపద విజ్ఞానం, 1983
  14. సూర్యనారాయణ, భారతదేశం గిరిజన సముదాయం,1983

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]