headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-12 | November 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

9. “మట్టి మనిషి” నవల: రైతుజీవనం

పోతురాజు చక్రవర్తి

పరిశోధకులు, తెలుగు అధ్యయనశాఖ,
శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం, తిరుపతి.
తిరుపతి, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 8886840136, Email: pchakravarthi777@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 13.10.2024        ఎంపిక (D.O.A): 28.10.2024        ప్రచురణ (D.O.P): 01.11.2024


వ్యాససంగ్రహం:

ఆధునిక తెలుగు సాహిత్యంలో నవల ప్రక్రియ మనిషి జీవితాన్ని విస్తృతంగా ఆవిష్కరించిన ప్రక్రియ. అందువలనే నవల అంటే పాఠకులు తమ జీవితాలను నవలలో వెతుక్కునే ప్రయత్నం చేస్తారు. అందుకే నవల పుట్టుక నుండి నేటి వరకు అందరీ మన్ననలు పొందుతూ ఉంది. గొప్పదయినా నవలను గొప్పగా ఆవిష్కరణ చేయటం నవలా రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి సఫళీకృతులైనారు. వీరు రాసిన “మట్టి మనిషి” అనే నవలలో రచయిత్రి చిత్రించిన విషయాలను విపులంగా ఈ వ్యాసంలో వివరించబోతున్నాను. మట్టిమనిషి నవలలో ప్రధానంగా రైతుకు భూమితో గల అనుబంధాన్ని వివరించారు.అలానే రైతు సమస్యలను సందర్భానుసారంగా నవలలో చిత్రించారు. నేను ఈ వ్యాసంలో ప్రధానంగా రైతు జీవన స్థితిగతులను రచయిత్రి నవలలో ఎలా ఆవిష్కరించారో విశదీకరించబోతున్నాను. వాసిరెడ్డి సీతాదేవి రచనలపై పలువురు పరిశోధనలు చేశారు. అందులో స్త్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో "వాసిరెడ్డి సీతాదేవి నవలలు-స్త్రీ జీవిత చిత్రణ" అనే అంశంపై ఆచార్య నూలకుంట మునిరత్నమ్మ పర్యవేక్షణలో వై.సుగుణ 2013 లో పరిశోధన చేశారు. అదేవిధంగా శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఎం. కె దేవకీ పర్యవేక్షణలో "వాసిరెడ్డి సీతాదేవి మట్టి మనిషి వాస్తవ-జీవిత చిత్రణ" అనే అంశంపై ఎం. రేణుక దేవి 1990 సంవత్సరంలో పరిశోధన చేశారు.కానీ మట్టి మనిషి అనే నవలలో రైతు జీవన స్థితిగతులుపై ఎవరు ఇప్పటివరకు పరిశోధనాత్మక వ్యాసం ఎవరు రాయలేదు. ఈ వ్యాసానికి కావలసిన ఉటకింపులకు నవలను ఆకరంగా తీసుకుంటున్నాను. సమయానుగుణంగా ఆధారగ్రంధాలను కూడా ఆకరముగా తీసుకుంటున్నాను.

Keywords: ఉపోద్ఘాతం, ఇతివృత్త పరిచయం, పాత్ర చిత్రణ, రైతు జీవనం, శైలి.

1. ఉపోద్ఘాతం:

నవల ప్రధానంగా, వినోదదాయకంగా ఉండాలి. విజ్ఞానం కొరకు ఎవరు నవలలు చదవరు. అందుకు వేరే గ్రంధాలు ఉన్నాయి. ఇతర వ్యాపకాల నుంచి విశ్రాంతి పొందడానికి, తలబద్దలు చేసే, ఆలోచనల నుంచి మనసు మరల్చి, ఆటవిడుపుగా, కాలక్షేపం చేయడానికి, నవలలు చదువుతూ ఉంటారు. కనుక నవల నడక సాఫీగా ఉండాలి. తేలిక భాష, సరళమైన శైలి ఉండి, భావానికి తగిన భాష, భాషకు తగిన శైలి, అమరినప్పుడు, నవలలను చదవడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉండదు. నవలే చదివిస్తుంది. అంత ప్రాధాన్యత కలిగిన నవల ఈ "మట్టి మనిషి" నవల. ఇందులో మూడు తరాలకు సంబంధించిన కథ ఉంది.

2. రచయిత్రి పరిచయం:

నేటి నవలా రచయితల్లో డా. వాసిరెడ్డి సీతాదేవి అగ్రశ్రేణికి చెందినవారు. వాసిరెడ్డి సీతాదేవి 1933, గుంటూరు జిల్లాలో, చేబ్రోలులో వాసిరెడ్డి రాఘవయ్య, రంగనాయకమ్మ దంపతులకు జన్మించారు. ఈమె రచించిన మొదటి నవల జీవితం అంటే (1950), తొలి కథ సాంబయ్య పెళ్ళి (1952). అప్పటినుండి ఈమె సుమారు 39 పైగా నవలలు, 100 పైగా కథలు రచించారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం ఐదుసార్లు, ఆత్మగౌరవపురస్కారం, వివిధ విశ్వవిద్యాలయాల నుండి గౌరవ డ్డీలిట్ పురస్కారాలు, జీవితకాల సాఫల్య పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం నుండి సాహిత్యంలో విశిష్ట పురస్కారం అందుకున్నారు. (పరిచయం)

3. ఇతివృత్తం:

తెలుగు నవలా సాహిత్యంలో చెప్పుకోదగ్గ నవలలో వాసిరెడ్డి సీతాదేవి మట్టి మనిషి నవల ఒకటి ఈ నవల 1972లో ఆంధ్రప్రభ, దినపత్రిక, ఆదివారం అనుబంధంలో ధారవాహికంగా ప్రచురణలు పొందిన, ఈ నవల ముఖ్యంగా పాఠకుల యొక్క ఆదరణ పొందింది. పుస్తక రూపంలో వచ్చిన తర్వాత మరో రెండు సార్లు పునర్ముముద్రితమైంది. ఈ నవలను నేషన్ బుక్ ట్రస్ట్ వారు, పధ్నాలుగు భాషల్లోకి, అనువదించారు. ఇంతటి గొప్ప ఆదరణ పొందిన నవల, అప్పటి సమకాలీన సమాజపు నిజనిజాలను ఆనాటి భూస్వామ్య వ్యవస్థలోని దోపిడి దౌర్జన్యాలను చిత్రించారు. ఒక రూపం నుంచి మరొక రూపానికి చెందిన, ఒక దృశ్య రూపాన్ని వాసిరెడ్డి సీతాదేవి మన ముందు ఉంచారు.

ఈ నవల ఒకటి ఇందులో రైతుకు భూమితో గల అనుబంధాన్ని వివిధ కోణాల్లో ఆవిష్కరించారు. తల్లికి బిడ్డకి ఎటువంటి అనుబంధం ఉందో భూమికి పొలానికి రైతుకి కూడా అదే అనుబంధం ఉంటుంది. ఇందులో కథానాయకుడు సాంబయ్య. ఈయన మట్టిలో పెరిగిన మాణిక్యం. మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి, చివరికి అదే మట్టిలోనే తన తుది శ్వాస విడుస్తాడు. వాసిరెడ్డి సీతాదేవి ఈ నవలల్లో మూడు తరాల జీవిత కథలను, అందులో ఉన్న పాత్రల విభిన్నమైన మనస్తత్వాలను, చదువుతుంటే, మనకు పరిచయం ఉన్న వ్యక్తుల గురించి చదువుతున్నట్లు అనిపిస్తుంది. ఇందులో ఉన్న మూడు తరాల పాత్రల్లో సాంబయ్య, రవి, పాత్రలు చదువుతూ ఉంటే, కళ్ళు చెమ్మగిల్లుతాయి. అంత అద్భుతంగా వాసి రెడ్డి ఈ నవలలో పరిచయం చేశారు. సాంబయ్య రవితో అంటాడు ఈ భూమి నీదేరా! ఈ పంట నీదేరా! అని సాంబయ్య సందేశం నింగి నేల నిండిపోయి ప్రతిధ్వనించింది. సాంబయ్య నినాదమే కాదు సామ్యవాద సూక్తం కూడా ఎలుగెత్తి దున్నేవాళ్ళ ప్రతి ఒక్కరి అణువణువునా ప్రతిధ్వనిస్తూ సౌమ్యంగా భూస్వామ్య వ్యవస్థ అంతిమ పరిష్కారం జరగకపోతే ప్రతి మట్టి మనిషి తుపాకీ పట్టక తప్పదు.

4. రైతు జీవనం:

భూమినే నమ్ముకున్న రైతు ఆశలు, ఆరాటాలు, అనుభవాలు, ఎలా ఉంటాయో ముఖ్యంగా సాంబయ్య అనే పాత్ర ద్వారా తెలుస్తుంది. మిగితా పాత్రలు కూడా ఉన్నాయి, వెంకయ్య,వెంకటాపతి, కనకయ్య, రవి మొదలైన పాత్రలు కూడా రైతు యొక్క జీవన పరిస్థితులకు, దగ్గరగా ఉన్నాయి.అయితే రైతుజీవనం గురించి, అప్పుడు ఎలా ఉందో తెలుస్తుంది. వెంకయ్య కుమారుడు సాంబయ్య. వెంకయ్య రైతు కుటుంబం నుంచి వచ్చాడు.వెంకయ్య బ్రతుకుతెరువు కోసం వేరే గ్రామానికి వలస వచ్చాడు. వెంకయ్య కుటుంబం గడవాలి అంటే వ్యవసాయం లో పనిచేస్తే తప్ప, వారి కుటుంబం గడవదు. అటువంటి పరిస్థితి నుంచి వచ్చినవాడు వెంకయ్య. వెంకయ్య ఆ గ్రామంలో, వీరభద్రయ్య ఇంట్లో పాలేరు గా వెళ్ళినాడు. జీతగానిగా జీతం సరిపోదు అని సొంతంగా రెండు ఎకరాలు పొలాన్ని కౌలుకు తీసుకొని భార్యాభర్తలు ఇద్దరు నిరంతరం కష్టపడి, వచ్చిన డబ్బుతో, సొంతంగా రెండెకరాల పొలాన్ని కొన్నాడు. కొద్దిరోజులకి వెంకయ్య మంగమ్మ లకి సాంబయ్య జన్మిస్తాడు. సాంబయ్యకి చిన్నతనంలోనే, వ్యవసాయం అంటే ఏమిటో నేర్పుతాడు. సాంబయ్యకి పాతికేళ్లు వచ్చేసరికి, పక్క గ్రామంలో వ్యవసాయం చేసే, రైతు కూతురు దుర్గమ్మని ఇచ్చి సాంబయ్యకి పెళ్లి చేస్తాడు. కొద్దిరోజులకు వెంకయ్య మంగమ్మ ఇద్దరు తిరిగిరాని లోకాలకు వెళ్తారు. వారు పోతూ పోతూ తల్లిదండ్రులు ఇచ్చిన ఐదు ఎకరాల పొలాన్ని సాగు చేసుకుంటాడు. కుటుంబ భారం మొత్తం సాంబయ్య మీదే పడుతుంది.

సాంబయ్య నిరంతరం కష్టపడే తత్వం కలవాడు. సాంబయ్య ఎప్పుడు పొలంలో వ్యవసాయం తప్ప ఏమి ఎరగని నిస్వార్థ జీవి. ఎవ్వరిని కూడా మోసం చేయని నిజమైన రైతు మనస్తత్వం కలవాడు. సాంబయ్య ఆత్మవిశ్వాసి. తన భార్యతో ఒక్కరోజు కూడా పగలు ఇంట్లో మాట్లాడలేదు. అంటే ఆయనకు వ్యవసాయం అంటే ఎంత మక్కువో తెలుస్తుంది. ఒక ఉద్యోగస్తుడికైనా సెలవులు ఉంటాయి. కానీ సాంబయ్య అనే రైతుకు సెలవు అంటే ఏమిటో కూడా తెలియని కష్టజీవి. సాంబయ్య రేయింపగళ్ళు కష్టపడి భూములు కొని, వాళ్ళ నాన్న ఇచ్చిపోయిన ఆస్తికంటే, రెండింతలు ఎక్కువగా సంపాదించాడు. కానీ సాంబయ్య పిసినారి తన భార్య పురిటి నొప్పులతో బాధపడుతూ మగ పిల్లవానికి జన్మనిస్తుంది. దుర్గమ్మ కి ప్రసవం సమయంలో వచ్చిన జబ్బు కి పట్నం వెళ్లి చూపించాలి అంటే డబ్బులు అయిపోతాయని అయ్యవార్లు ఇచ్చిన మందులపై ఆధారపడి దుర్గమ్మని చంపుకుంటాడు. తల్లి లేని పసిపిల్లవాన్ని వెంటపెట్టుకొని, మరల వ్యవసాయం పనులు ప్రారంభిస్తాడు. సాంబయ్య కూడా చిన్న వయసులోనే తన కుమారుడు వెంకటపతికి వ్యవసాయం నేర్పిస్తాడు. వెంకటాపతి కి పెళ్లి వయసు వచ్చేసరికి, అదే ఊరిలోనే తన తండ్రి ఏ ఇంట్లో అయితే పాలేరుగా పనిచేశాడో అదే ఇంట్లో నే బలరామయ్య కూతురు వరూధిన్ని వెంకటపతికి ఇచ్చి వివాహం జరిపిస్తాడు.

బస్తీలో విలాసాలకు అలవాటు పడి, తాగుడుకి బానిసలై, వ్యామోహాలకు, వ్యసనాలకు అలవాటుపడి, మోసాలకు, గొడవలకు, అక్రమాలకు పాల్పడడం ప్రారంభించారు. ఇలా మెల్లగా సాలె గూట్లో చిక్కుకొని సాంబయ్య కష్టపడి సంపాదించుకున్న ఆస్తినంతా కోడుకు - కోడలు కాజేశారు. చివరికి కోడలు వరూధిని ఆత్మహత్య చేసుకుంటుంది. భార్య చనిపోయిన బాధలో కొడుకు మరింత మద్యానికి బానిసై ఎటో వెళ్లి పోతాడు. ఈ ఇద్దరి వ్యవహారికంవల్ల వీరి కొడుకు రవి తాతయ్య దగ్గరికి చేరుకుంటాడు. తల్లిదండ్రులు పిల్లల పట్ల బాధ్యతగా వ్యవహరించకుండా వారి సంతోషాలకు పిల్లల్ని దిక్కులేని వారిగా చేశారు. భూస్వామ్య వ్యవస్థలోనే ఉంటూ భూమిని నమ్ముకోకుండా అమ్ముకునే వారి పరిస్థితి ఇది.సాంబయ్య ఆస్తి అంతా పోయినా గుండె ధైర్యం చేసుకొని తన దిబ్బ లో కూరగాయలు పండిస్తూ జీవనం కొనసాగి స్తుంటాడు. తల్లిదండ్రులకు దూరమైన మనవడు రవిని చేరదీసి మనసున్న మట్టి మనిషిగా మారాడు. సాంబయ్య రవి బంజరు భూమిని దున్ని మంచి పంటలు పండించడం మొదలు పెట్టారు. వారు సాగు చేస్తున్న బంజరు భూమిలో పంట పండించడం చూసి ఓర్వలేని కనకయ్య సాంబయ్యకు తెలియకుండా బంజరు భూమిని తన మీద పట్టా చేయించుకుంటాడు. అయితే ఈ భూస్వామ్య వ్యవస్థలో భూమి దున్నే వాడిది కాదు, పట్టా ఉన్న వాడిదే భూమి. ఈ వ్యవస్థలో కష్టపడే వారికి ఫలితం లేదు. ఆ తాత మనవడు సాగుచేసి పండించిన పంట మీది కాదు, ఆ పంట మీద హక్కు మీకు లేదు. ఇది ఆ భూమి పట్టాదారునికి, పంట మీద హక్కు వుందని ఆ గ్రామంలో ప్రెసిడెంట్ చెప్పాడు. ఈ అన్యాయాన్ని చూస్తున్న సాంబయ్య ఒక్కసారిగా గుండె బరువెక్కి కుప్ప కూలి పోయాడు. మట్టిలోనే పుట్టిన వాడు చివరికి మట్టిలోనే తన తుది శ్వాస విడుస్తాడు. ఈ విధంగా రైతు యొక్క జీవన పరిస్థితి వాసిరెడ్డి సీతా దేవి చాలా చక్కగా వర్ణించారు.

5. పాత్ర చిత్రణ:

నవల ఇతివృత్తానికి ఆలంబనంగా నిలిచేది పాత్రలు. ఇక్కడ రచయిత, తన యొక్క భావాలను అభివ్యక్తం చేస్తూ, తాను నిర్వహించే కథ గమనానికి, పాత్ర చిత్రనను సాధనంగా చేసుకుంటారు. నవలకు ముఖ్యంగా, ప్రాణం పోసేవి పాత్రలు. అలాగే పాఠకుల్లో, సానుభూతిని రెక్కెత్తించి,రసానుభూతిని కలిగిస్తుంది నవల ప్రారంభం నుండి ముగింపు వరకు పాత్రలు స్థిరంగా నిలిచి ఉంటాయి.

నవల ఎంత పెద్దదైనా, చిన్నదైనా, తమతో పాటు చివరిదాకా నడిపించి, ఆనందానుభూతులను లేదా, విషాదమైన సంఘటనలను, కలిగిస్తాయి. నవలాకారుడు తన పాత్రలను సృష్టించేటప్పుడు తాను తన వ్యక్తిగత జీవితంలో,చూసిన వ్యక్తులు, వారి వ్యక్తిత్వం ఆధారంగానే తన పాత్రల్ని సృజించి, కథాగమనానికి ఒక నిర్దేశాన్ని చేకూరుస్తాడు. వాసిరెడ్డి సీతాదేవి మట్టి మనిషి నవలలో రైతుబడే ఆవేదనను, అందులో సాంబయ్య రవి ,అనే పాత్రలు, హృదయాన్ని కదిలిస్తాయి.

5.1 సాంబయ్య పాత్ర:

మట్టి మనిషి అనే నవలలో కథ మూడు తరాలకు సంబంధించినదిగా చెప్పవచ్చు. తొలి తరంగా వీరభద్రయ్య దగ్గర పాలేరుగా పనిచేసిన వెంకయ్యతరం. వారి కుమారుడైన సాంబయ్య రెండవ తరం . సాంబయ్య కుమారుడు వెంకటపతి మూడవతరంగా చెప్పొచ్చు. ఇంకా చెప్పాలి అంటే. వెంకటాపతి కొడుకు రవి నాలుగవ తరానికి చెందినవాడు గా చెప్పొచ్చు. వెంకయ్య పాలేరుగా జీతం చాలదు అని కొంత డబ్బును సమకూర్చి సొంతంగా రెండెకరాల పొలాన్ని కొని వ్యవసాయంలో వచ్చిన డబ్బుతో మరల ఐదు ఎకరాల పొలం కొని ,తన కుమారుడు అయినా సాంబయ్యకి అప్పగించగా ,సాంబయ్య భూమి పైన పిచ్చితో, ఆశతో, మక్కువతో, ఇష్టంతో దాన్ని రెట్టింపు చేస్తాడు. భూమిని నమ్ముకున్న వారు ఏ రోజు చెడిపొరు అని సాంబయ్య చెప్పకనే చెప్పాడు. సాంబయ్య తన శ్రమతో, పిసినారితనంతో, భూదాహంతో కొడుకు పుట్టిన నాటికి తండ్రి ఇచ్చి పోయిన పొలాన్ని రెట్టింపు చేశాడు. దొడ్లు దోవలో సంపాదించాడు. సాంబయ్య పొలంలో కూలీలకు కూడా కొన్ని సందర్భాల్లో వారిలో నమ్మకంగా ఉన్న వారికి పొలం బాధ్యతలు అప్పగించే వాడు.

“ఎల్లమందా! ఇట్రా!” అని అరిచాడు.
ఎల్లమంద చేతులు కట్టుకొని ఎదురుగా నిలబడ్డాడు.
ఒరేయ్! నేపోతున్నా! పొద్దుకూకేలోపల మళ్ళీ వస్తా.
ఈలోపల గడ్డంతా తొక్కించి కింద గింజలన్ని వేరే రాసి పోయించు.”
“అట్టాగే దొరా!” (పుట. 3.)

ఎంతసేపు భూమ్మీద ఆలోచన తప్ప ,చెమటను కాసుగా మార్చి, ఇంకా ఇంకా కొత్త కొత్త పొలాలను కొని పారేయాలి అనే దాహం తప్ప ,సంసారం గురించి, పిల్లలు భార్య బాగోగులు ఏమిటో ఎరుగకుండా బ్రతికాడు. సాంబయ్య. ఒకరోజు పొలంలో ఉండగా తన ఇంట్లో పనిమనిసి.

దొరగారూ! దొరగారూ!”రామి ఆదుర్దాగా సాంబయ్య గూటి ముందుకు పరుగెత్తుకొచ్చింది.
‘’నీ సిగతరగ! ఏందే ఆ పొలికేకలూ?”
‘అయ్యగారూ, అమ్మగారికి నొప్పులొచ్చినయ్!”
“పిల్లా, పిల్లాడా?”
‘ఇంకా పెసవం అవలేదు. నొప్పులు మోపుగా వున్నాయి! అమ్మ అల్లాడిపోతున్నారు. తొందరగా బయలుదేరండయ్యగారూ!”
వోసి నీయమ్మ! మగాణ్ణి నేనొచ్చేం జేస్తానే?
చాకలి రత్తికి కబురు పెట్టారా?”
“మా పుల్లి రత్తి కోసం లగెత్తింది. నేనేమో ఇట్టా లగెత్తుకొచ్చాను.”
“సరే, నువ్వు పద!" (పుట. 2)

పొలం పని వదిలిపెట్టి,ఇంటి దగ్గర ప్రసవ వేదన తో పడుతున్న దుర్గమ్మ దగ్గరికి పోతాడు సాంబయ్య. బాలింతరాలైన దుర్గమ్మ కి జబ్బు చేసి బ్రతకడం కష్టమని ఇరుగు పొరుగు వారు చెప్పిన, పట్నం తీసుకెళ్లి ఆసుపత్రికి అయ్యే ఖర్చుకి వెనుకాడి, అయ్యవార్ల మందుల మీద ఆధారపడి, తన భార్య దుర్గమును పోగొట్టుకున్నాడు. పొత్తిళ్లలోనీ. పసిగొడ్డు తల్లి లేనివాడు అయినాడు.

భార్య చివరి దశలో ‘’నే పోతున్నా! వాణ్ణయినా సరిగా చూసుకో?” “దుర్గమ్మ చెంపలు కన్నీటితో తడిసినయ్.” (పుట. 12.)

సాంబయ్య గుండెల్లో కలుక్కుమంది. మరణానికి ముందు ఆ ఇల్లాలి అప్పగింతల్లో మొండితనం, పిసినారి బుద్ధి, కర్కోటక గుణం, వెల్లడయ్యాయి. కానీ అతడు రైతుకి భూమితో గల అనుబంధం అలాంటిది. అది ఈ తరం వాళ్లకు అర్థం కాదు. సాంబయ్య తరం వాళ్లకి ఇంకా, వెనుకటి తరాల వాళ్ళకి, మట్టితో గల అనుబంధం ఉన్న రైతులకు మాత్రమే అర్థమవుతుంది.

సాంబయ్య కుమారుడు పుట్టగానే పుత్రవాస్తల్యంతో, ఇంకా మనోబలంతో ,కుమారునిపై ప్రేమతో, తన కష్టాలు పాలు కాకూడదని ,తన కుమారుడు శుక్లపక్షంలో చంద్రుడు పెరిగినట్లు పెరగగా, కుమారునితో పాటు తన ఆస్తులు కూడా పెరిగాయి. కష్టపడి తన రెక్కలోడ్చి చెమట చిందించి తను నమ్ముకున్న నేలను ఎక్కడ మరో పెళ్లి చేసుకుంటే ,వచ్చే భార్యకు తన ఆస్తిని ఇవ్వవలసి వస్తుందని, రెండవ పెళ్లిని మానుకున్నాడు సాంబయ్య తాను కష్టపడి సంపాదించిన ఆస్తి అంతా పోతుంది అని, ఈ నిర్ణయం తీసుకున్నాడు. కొడుకు వెంకటపతిని వెంటపెట్టుకొని, ఒరే వెంకటపతీ! ఇదంతా మన పొలమేరా!” సాంబయ్య చేతిలో కర్ర పైకెత్తి, రాయి రప్పా, దుబ్బులూ వున్న పొలంకేసి చూపించాడు. “అదంతా మందేనా?” చెయ్యి ముందుకు చూపిస్తూ అడిగాడు వెంకటపతి, ،، “ఓ! అక్కడ పోత్తాడి చెట్టుంది చూడూ! అందాకా మందే!” తన్మయత్వంతో చెప్పాడు తండ్రి. ‘తనదీ’ అన్న మమకారం పసిహృదయాన్ని కూడా తాకి, కదిలించి, గిలిగింతలు పెట్టింది. (పుట. 44)

అప్పటికే సాంబయ్య పది ఎకరాల మాగాని, నాలుగు ఎకరాల గరువు, డెబ్బై ఎకరాల బీడు, కలిగిన ఆ స్వామి అయ్యాడు. మొత్తానికి సాంబయ్య చిన్న ఆసామి నుంచి, పెద్ద భూసామి అవ్వాలని లక్ష్యంతో తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. అనుకున్నట్లే బలరామయ్య అహం మీద దెబ్బతీయాలన్న ప్రతికార వాంఛ సాంబయ్యలో ప్రవేశించింది.

తన తండ్రి పాలేరుగా పనిచేసిన, ఇంటి నుంచే వరూధిని అనే అమ్మాయిని, వెంకటపతికిచ్చి వివాహం చేసుకొని, సంతోషంతో ఉండినాడు. కానీ ఆ సంతోషం ఎన్ని రోజులు లేకపోయింది. భార్య మాటలు విన్న వెంకటపతి తండ్రి నీ అన్యాయం చేస్తూ బహుళపక్షంలో క్షీణిస్తున్న చంద్రుడిలా తన ఆస్తిని పూర్తిగా మోసగించి, కాజేసి, వీధులపాలు చేశాడు సాంబయ్యను.

ఎన్నో సంవత్సరాల నుంచి భూమిపై వాంఛతో కూడబెట్టుకున్న నగదు, ఆస్తి, ఈనాడు అనేవి లేకపోయింది. సాంబయ్య భరించలేకపోయాడు. మరలా తిరిగి సంపాదించాలన్న తనకు అంత వయస్సు లేదు అంతకుమించి కోరికనే లేదు. నిజానికి ఏ రైతు అయినా సరే ఎన్నో ఏండ్లు కష్టపడి సంపాదించిన ఒక్కరోజులో తన చేతి నుంచి జారుకున్నది. అది వినగానే ఎవరైనా కృంగి కృషించి పోక తప్పదు. సాంబయ్య స్థానంలో మరి ఏ రైతు ఉన్నా సరే ఆత్మహత్య చేసుకుని ఉంటారేమో, కానీ సాంబయ్య దీన్నిబట్టి మనోధైర్యం కలవాడు అని అర్థమవుతుంది.

సాంబయ్య చివరకు చివరి దశలో మనవడు రవి వలన తను బ్రతకాలని ఆశ అది కూడా తన కోసం కాకుండా తన మనవడి కోసం బ్రతకలన్న ఆశ చిగురిస్తుంది. మనవడు రవి ఏంటి తాతయ్య! నీ ఒంటి మీద మట్టి ఉంది. అంటే అందుకు బదులుగా సాంబయ్య.....

“మట్టిలో పుట్టిన వాడ్ని!
మట్టి మీద బతికిన వాడ్ని
మట్టిలో కలిసిపోయే వాడ్ని
వంటిమీద మట్టి ఉండక
మరి బంగారం ఉంటుందారా!” (పుట. 348)

అని అంటాడు సాంబయ్య రవి తో ఆ దశలో కూడా మనవడికి,

“రా! రారా! బాబు! నాగలి పట్టడం నేర్చుకో.
భూమి తీరు తిన్నగా చూసుకో” (పుట.368)

మనవడికి ఒక దారి ఏర్పరచాలి అని ఆ వయసులో కూడా వ్యవసాయం చేయడానికి పూనుకుంటాడు. ‘’ఇల్లు చూసి ఇల్లాలిని చూడు గట్టు చూసి రైతును చూడు” అనే సామెత చెప్పినట్లు, ఒక రైతు ఏ విధంగా పొలంలో పైరు పెడుతున్నాడు .అనే విషయాన్ని గమనించాలి అంటే తన పొలం కు ఉండే గట్టును, చూసి చెప్పొచ్చు. అంటా ! అంటే సాంబయ్య పొలం లో పైరు అలా పెట్టేవాడు అని తెలుసుకోవచ్చు. సాంబయ్య వయస్సు క్షీణించినా కూడా చివరకు ఆ వయసులో మనవడితో కలిసి ఇంటి దగ్గర కూరగాయలు పండిస్తూ కొంత బంజరు భూమిలో మాగాని పెట్టి చేతికి వచ్చిన పంట, నోటికి అందేలోపే,

"ఈ నేల నాది!
ఈ పంట నాది. ఈ భూమి..”
అతని కంఠ స్వరం విడచిన గాలి విశ్వవ్యాపితమైంది.
సాంబయ్య భూమ్మీద పడ్డాడు!
దిక్కులు ప్రతి ధ్వనించాయి.
తాతయ్య?!
తాతయ్య?”
“ఇంకెక్కడి తాతయ్య బాబు? సాంబయ్య పోయారు!”
నరశిమ్మ తల గుడ్డ విప్పి కళ్ళు తుడుచుకున్నాడు. (పుట. 400)

సాంబయ్య భూమికుండే, అనుబంధాన్ని తెంపుకొని వెళ్లిపోతాడు. తాతయ్య మరణాన్ని చూసి రవి వచ్చిన పోలీసులను కర్రతో కొట్టగా రవి నీ అరెస్టు చేస్తారు చివరకు రవి.

“వస్తాన్రా
వస్తా-
తెస్తా నీ కోసం
తుపాకీ!” (పుట. 403)

నిజానికి నేటి రైతులందరూ కూడా సాంబయ్య ను ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే ఒకరి సొత్తు ను అన్యాయంగా కాజేసిన చేసినవాడు కాదు. ఒకరిని మోసం చేసినవాడు కాదు. నేటి కాలంలో అయితే రైతులు రైతులే మోసం చేసుకుంటున్నారు. ఒకరికి తెలియకుండా ఒకరి సొత్తులను కాజేస్తున్నారు. నాలుగు ఎకరాల భూమిని ఎనబై ఎకరాల భూమిని చేశాడంటే ఆ కాలంలో అంత ఆషామాషా విషయం కాదు. అందుకే సాంబయ్య ఒక యోధుడు, ఋషి ,సాధకుడు, అన్నింటికీ మించి కృషివలుడు. సాంబయ్య లాంటి మనసు ఉన్నవారు నేటి కాలంలో అరుదుగా కనిపిస్తారు. ఈ నవలలో ఒక విధంగా దళితులు పాలేరుగా ఉండి మార్పు చెందిన, వారి గురించి బడుగు బలహీన వర్గాల గురించి చెప్పారు రచయిత...

5.2 రవి పాత్ర:

వెంకటపతి కొడుకు రవి . తల్లిదండ్రులకు దూరమై దిక్కులేని వాడిగా, రవి నీ చూస్తా ఉంటే ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మగిల్లుతాయి. రవి తండ్రి అయిన వెంకటపతికి సాంబయ్య దగ్గరికి రావడానికి ముఖం లేదు. వెంకటపతి రవిని ఊరి పొలిమేరలో వదిలి వెళ్లిపోయాడు. రవి సాంబయ్య దగ్గరకు వచ్చి. తనను తాను పరిచయం చేసుకున్నాడు.

“తాతయ్య”
సాంబయ్య.
“ఎవరయ్యా నువ్వూ?”
‘సాంబయ్య !” మనవడిని.!
‘’సాం... బ... య్య... మనవ..డి...వా... నువ్వు?” ‘నువ్వు ఊరుబోయిన వెంకయ్య కొడుకు సాంబయ్యవేనా?”
‘అవును! ఊరుబోయిన వెంకయ్య కొడుకును నేనే! నీ తాతయ్యను నేనే!”
‘నువ్వేరా నా మనవడివి. నువ్వేరా వారసుడివి.”
‘తాతయ్యా నేను వరూథిని కొడుకుని కానా?”
కాదు. సాంబయ్య మనవడివి.”
‘వెంకటపతి కొడుకుని కానా?”
‘కాదు. సాంబయ్య మనవడివే.”
తాతయ్యా!”
‘ముమ్మాటికీ నువ్వు సాంబయ్య మనవడివే.
(పుట 347.)

సాంబయ్య రెండో చేత్తో పొదగి, పట్టుకొని, విశాలమైన, తన ఎదురు రొమ్ముకి హత్తుకున్నాడు. ఆ మధురమైన దివ్యనుభూతి కోసమే, ఇంతకాలం బ్రతికున్నానేమో అని అనుకున్నాడు. నీకోసం బ్రతుకుతాను రా! చాలా రోజులు బ్రతకాలి రా! నేను అంటాడు. ఉద్రేకంగా. (పుట.347.)

సాంబయ్య ఆస్తి అంతా పోయిన బాధలో ఉన్న కూడా మనవడిని చూడగానే తాను కోల్పోయిన ఆస్తి మొత్తం తిరిగి వచ్చింది. అనే సంతోషం లో ఉన్నాడు.

సాంబయ్య పూర్తిగా చితికిపోయినప్పటికీ తన ఊర్లో ఎవరిని కూడా దేహి అని అడగలేదు. కనకయ్య లాంటి దళారులు ఎదుట కూడా సాంబయ్య తలవంచలేదు. ఆనాటి నుండి ఈనాటి వరకు ఈ దేశంలో మట్టిని నమ్ముకుని రాత్రింబగళ్లు శ్రమించి పంటలు పండించే అసంఖ్యాకులైన వ్యవసాయదారులలో సాంబయ్య గొప్ప ప్రతినిధిగా నిలుస్తాడు. తన మనవడు రవి పుట్టినప్పటినుంచి పల్లెదనం, పచ్చదనం పల్లె భూములు, కష్టతనం, తెలియని రవి. ఇప్పుడు తాతతో కలిసి కష్టపడడం గుండెల్ని పిండేస్తుంది.

రవి చదువుకున్న వాడు ఐనప్పటికీ, సాంబయ్య రవి కి చిన్న వయ్సులోనే నాగలి పట్టించాడు. కలం పట్టుకోవాల్షిన చేతులతో రవి నాగలి పట్టుకొని వ్యవసాయం నేర్చుకున్నాడు.పంట వేశారు దిబ్బ మీద కూరగాయలు సాగు ప్రారంభించారు. సాగు తలపెట్టిన బంజరులో, రంకె చేస్తున్న దున్న బురదలో పడి కాళ్ళు నిగడదున్నీ, ముక్కులో నుంచి నురుగు కక్కీ చనిపోతుంది. రవి క్రుంగి పోయాడు. కానీ సేద్యం ఆగలేదు. అలానే కొనసాగింది. రవి అంతా చిన్న వయస్సు లో కష్టపడిన చివరికి ఫలితం లేకుండా పోయింది. తన తాత మరణం తో మరింత క్రుంగి పోతాడు రవి. ఆ ఊరి సర్పంచ్. కనకయ్య ఖద్దరు పంచాల వాళ్ళు ఎర్ర బట్టల జవానులు కలిసి నోటిదాకా వచ్చిన ముద్దని,బలవంతంగా ఉరపిక్కున్నారు. రవి నీ కూడా అరెస్టు చేస్తారు.. నేటి తివ్రవాది ఉద్యమాలకు మూల కారణం ఎక్కడుందో వివరించి చొప్పనక్కరలేదు. అటువంటి ఉద్యమాలకు అంకురం రవి.

5.3 వెంకటపతి-వరూధిని:

సాంబయ్య తను కష్టార్జితంతో రెక్కల ముక్కలు చేసుకొని సంపాదించిన ఆస్తి అంతా నాశనం అవ్వడానికి కారణం వెంకటపతి వరూధినే, నవలలో సాంబయ్యకు ప్రత్యర్థి వరూధిని, సాంబయ్య భూమిని నమ్ముకుంటే, వరూధిని డబ్బులు నమ్ముకుంటుంది. సాంబయ్యకు పల్లెటూరు ఆశ్రయమైతే వరూధినికీ పట్టణమే ఆశ్రయం. తన జీవిత లక్ష్యాన్ని సాధించడానికి సాంబయ్య తన శ్రమను నమ్ముకుంటే, వరూధి ని తన అందాన్ని నమ్ముకుంటుంది. సాంబయ్య భూస్వామ్య విధానాన్ని, వ్యవసాయాన్ని నమ్ముకుంటే, వరూధిని పెట్టుబడిదారీ విధానాన్ని, సులభంగా డబ్బు తెచ్చిపెట్టే వ్యాపారాన్ని నమ్ముకుంటుంది. చిన్ననాటి నుండి కొడుకు వెంకటపతిని తనలో బానిసగా పెంచాడు సాంబయ్య. తన కొడుకు పట్ల సాంబయ్య కు పెద్ద ఆశలు లేవు. తనలాగే భూమిని దున్నుకుని, భూమిని నమ్ముకుని, బతికితే చాలు అనుకున్నాడు. చదువుకుంటే వెంకటపతి నాగరికడులా ఆలోచించి ఉన్న భూములను అమ్ముకుని పట్నానికి వెళ్లిపోతాడని సాంబయ్య భయం. అందుకే సాంబయ్య వెంకటపతిని చదివించలేదు. చిన్న వయసులోనే పొలం పనులు నేర్పించాను అంటూ.

సాంబయ్య కనకయ్యతో- 

“నా కొడుకు భూమి దున్నుతున్నాడు.
రత్నాల పండిస్తాడు.
కనకయ్య! నా బిడ్డ నాగలీ, భూమినీ నమ్మినవాడయ్యా!
అహాయ్! ఏహేయ్! చో!”అంటూ ఎద్దుల్ని అదిలించాడు సాంబయ్య.” (పుట.46. పేర 1)

వెంకటపతి తాను గీసిన గీతను దాటకుండా ఉండేట్టుగా పెంచాడు సాంబయ్య. అలాంటి వెంకటపతి వరూధినిని పెళ్లి చేసుకోగానే పెళ్ళానికి బానిస అయిపోయి తండ్రి మీద తిరగబడతాడు. పల్లెటూర్లో తాను కోరుకునే విలాస జీవితం లభించదని తెలుసుకున్న వరూధిని, త్వరలోనే నగరానికి భర్తతో సహా ప్రయాణం సాగుతుంది.

భర్తను సాంబయ్య మీదకు ఉసిగొల్పి, అతని దగ్గర ఉన్న డబ్బంతా తన చేతుల్లోకి తీసుకుంటుంది. ఈ విధంగా సాంబయ్య సంపాదించిన ఆస్తి మొత్తం కొడుకు కోడలు కాజేశారు. కానీ సాంబయ్య శ్రమను నమ్ముకున్న వ్యక్తి కనుక, తన చెమట చుక్కతో మళ్లీ అంత ఆస్తిని సంపాదించగలనన్న ఆత్మవిశ్వాసం, అతన్ని ఆఖరి క్షణం వరకు వదలలేదు.

6. శైలి:

రచయిత్రి నవలను మొత్తం సరళభాషలోనే వ్యక్తపరిచారు. సరళత్వంతో పాటు వ్యవహారిక భాషలో ఆధునిక భాషతో నవలను నడిపించారు. పాత్రలకు అనుగుణంగా గుంటూరు యాసని వాడారు. ప్రాంతీయ యాసతో పాత్రను మాట్లాడించటం వలన పాఠకుల మనసుకి దగ్గరగా రచయిత్రి తీసుకోని వెళ్లే ప్రయత్నం చేశారు.

రచయిత్రి ప్రధాన ఆలోచన వస్తువుకి అనుగుణంగా పాత్రని మలచటం. అలానే ఆ పాత్రని పాఠకుల ఆలోచనలని కదిలించి ఆలోచన చేసేట్టు ప్రయత్నం చేయడం ఆమె అనుకున్నట్టే ఈ నవలయందు సఫళీకృతమాయ్యారనే చెప్పవచ్చు.రచయిత్రి వస్తువుకు తగ్గట్టు శైలినీ ఎలా మార్చాలో ఈమె వస్తు అభి వ్యక్తీకరణ నేటి నూతన కవులకు ఆదర్శవంతంగా కనిపిస్తుంది.వస్తువుకి తగ్గట్టు శైలిలో మార్పులు చేస్తే రచన పాఠకులకు దగ్గర అవుతుందని వాసిరెడ్డి సీతాదేవి శైలి ద్వారా మనం తెలుసుకోవచ్చును.

“రవీ! నువ్వెళ్ళి ఎల్లమందకొడుకు నరశిమ్మని కేకేసుకురా!
రేపు కట్టేత, ఓదెలు కట్టి కుప్పేద్దాం!”
“తాతయ్యా!’’
‘”వాడూ నువ్వూ మోపులు కట్టి, మోస్తే నేను కుప్ప మీదుంటాను
. పొద్దుపైన వాటాలేసరికి కుప్పలేస్తుంది.
”‘తాతయ్యా ఇంకా నువ్వు పొలం వస్తావా? కుప్పవేస్తావా?”
‘ఆ! కుప్పవేస్తా! మళ్ళీ మాట్లాడితే కుప్పనూరుస్తా.
చూస్తావుగా సాంబయ్య ‘తాత తడాఖా?” (పుట 396 పేర 6)

ఈ విధంగా వాసిరెడ్డి సీతాదేవి గారి శైలి వస్తువు తగ్గట్టు మనకు కనిపిస్తుంది.

7. ముగింపు:

  • రైతు ఏ విధంగా నష్టపోయాడు అనే సంఘటన రచయిత ఈ నవలలో చెప్పారు
  • రచయిత మట్టికి రైతుకి గల సంబంధాన్ని, ప్రధానంగా ఈ నవలలో ఆనాటి నుండి ఈ నాటికి మరిచిపోలేని, మద్యపానానికి బానిసగా, మారిన వెంకటపతి .లాంటి మనుషులను ఇప్పటికీ లేకపోలేదు. వరూధిని లాంటి ఆడవారు కూడా అంత కాకున్నా, కొంతవరకైనా సరే నేటి కాలంలో లేకపోలేదు.
  • ఒక్క ఆడదాని జీవన సరళి వలన ఒక కుటుంబం వీధిపాలయ్యింది .రవికి భవిష్యత్తు లేకపోయింది.
  • ఆడది అనుకుంటే ఒక ఇంటి దీపాన్ని వెలిగించవచ్చు, లేదా ఆర్పేయవచ్చు, అనీ పెద్దలు ఇందుకే అన్నారేమో!
  • మట్టిలో పుట్టి మట్టిలో పెరిగి, మట్టిని నమ్ముకుని, మట్టిని బంగారంగా మార్చుకుని చివరికి సర్వస్వాన్ని కోల్పోయి ఆ మట్టిలోనే కలిసిపోయాడు సాంబయ్య అనే రైతు.
  • ఈ నవల లో కండలు కరిగించి చెమటోడ్చి మట్టుకోక ఒక వైభవాన్ని సంతరించిన శ్రమజీవి సాంబయ్య.
  • నేటి కాలంలో కూడా రైతు ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నాడు. రాజకీయా దుండగుల వలన, రైతు ప్రాణాలే బలైపోతున్నాయి.
  • ఈ నవలను చదివిన పాఠకులందరిలో కూడా ముఖ్యంగా,వ్యవసాయం పొలం, రైతు గురించి తెలియని ఎందరికో కూడా, రచయిత్రి కళ్ళకు కట్టినట్లు, కంటి ముందు జరిగేటట్లు, పాఠకులకు అందించారు.
  • ఈ నవలలో ముఖ్యంగా సాంబయ్య రవి పాత్రలు మరియు వెంకటపతి వరూధిని పాత్రలు రైతు జీవన పరిస్థితుల విధానాన్ని తెలియజేస్తున్నాయి.

8. ఉపయుక్తగ్రంథసూచి:

  1. ఆరుద్ర. సమగ్ర ఆంధ్ర సాహిత్యం, 12వ సంపుటం. ప్రజాశక్తి విజయవాడ 1991
  2. నాగభూషణ శర్మ, మొదలి. తెలుగు నవలావికాసం. హైదరాబాద్, 1974
  3. నాగయ్య. జి. తెలుగు సాహిత్య సమీక్ష, రెండవ సంపుటి, నవ్య పరిశోధక, ప్రచురణలు, తిరుపతి,1995
  4. రమాపతిరావు, అక్కిరాజు. తెలుగు నవల. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ. హైదరాబాద్, 1975
  5. వెంకట కుటుంబరావు, బొడ్డపాటి. ఆంధ్ర నవలాపరిణామం. హైదరాబాద్,1971
  6. వెంకటసుబ్బయ్య, వల్లంపాటి. నవలా శిల్పం. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 1989
  7. వెంకటేశ్వర్లు, పుల్లబొట్ల. తెలుగు నవలాసాహిత్యవికాసం. విజయవాడ, 1974.
  8. సిమ్మన్న, వెలమల. తెలుగు సాహిత్య చరిత్ర, దళిత సాహిత్య పీఠం, విశాఖపట్నం. 2012
  9. సీతాదేవి, వాసిరెడ్డి. వాసిరెడ్డి సీతాదేవి సాహిత్యం మొదటి సంపుటం. మట్టి మనిషి. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ హైదరాబాద్, 2007
  10. సుజాతరెడ్డి, ముదిగొండ. తెలుగు నవలానుశీలనం, హైదరాబాద్, 1990.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]