AUCHITHYAM | Volume-5 | Issue-12 | November 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
8. 'కారా' వారి ’కుట్ర’ కథ: సామాజికస్పృహ
డా. తంగి ఓగేశ్వరరావు
తెలుగు అధ్యాపకులు,
వి.వి. గిరి ప్రభుత్వ కళాశాల, దుంపగడప,
పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9959753832, Email: t.ogeswararao@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 08.10.2024 ఎంపిక (D.O.A): 28.10.2024 ప్రచురణ (D.O.P): 01.11.2024
వ్యాససంగ్రహం:
కాళీపట్నం రామారావు ‘కుట్ర’ అనే కథలో మిశ్రమ ఆర్ధిక వ్యవస్థ యొక్క డొల్లాతనాన్ని సహేతుకంగా పాఠకులముందుంచారు. పెట్టుబడి విధానం యొక్క మరో రూపమే ఈ మిశ్రమ ఆర్ధిక విధానమని విమర్శించారు. ఈ మిశ్రమ ఆర్ధిక విధానం పర్యవసానంగా దేశంలో ఆర్ధిక అంతరాలు పెరిగాయని తెలియజేశారు. దేశంలో ధనవంతులు మరింత ధనవంతులుగానూ, పేదలు మరింత పేదలు గానూ మారడానికి ఈ మిశ్రమ ఆర్ధిక విధానమే కారణమన్నారు. ఈ మిశ్రమ ఆర్ధిక వ్యవస్థ, దాని ఆధారంగా రూపొందించిన ప్రణాళికల్లో కుట్ర దాగి ఉందని, ఆ యథార్ధాన్ని మరచి పాలకులు ఈ వ్యవస్థను మార్చడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులపై ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేస్తున్నారని, తిరుగుబాటుదారులని, దేశద్రోహులని నెపం మోపి అణచివేస్తున్న వైనాన్ని కాళీపట్నం వారు ఈ ‘కుట్ర’ కథలో వాస్తవికంగా, తార్కికంగా అక్షరీకరించారు. విప్లవ రచయిత సంఘం(విరసం)లో సభ్యులుగా కాళీపట్నం రామారావుగారి సామాజిక, రాజకీయ, ఆర్ధిక స్పృహకు నిదర్శనం ‘కుట్ర’ కథ. స్వాతంత్ర్యం అనంతరం మిశ్రమ ఆర్ధిక విధానం, ప్రణాళికల వలన దేశంలో పెరిగిన ఆర్ధిక అంతరాలను ‘కుట్ర’ కథా రచయిత చెప్పిన అంశాలతో సరిపోలుస్తూ ఈ పరిశోధనా పత్రాన్ని రాశాను. దీనికి అవసరమైన సామగ్రిని కళాశాల గ్రంథాలయం నుండి, అంతర్జాలం నుండి తీసుకున్నాను.
Keywords: కుట్ర, కాన్స్టిట్యూషన్, ప్లాన్లు, రూల్స్, మిశ్రమ ఆర్ధిక వ్యవస్థ
1. ఉపోద్ఘాతం:
కారా మాష్టర్ గా ప్రసిద్ధి పొందిన కాళీపట్నం రామారావు గారు సరళ భాషా రచయిత, కథకుడు, విమర్శకుడు. వృత్తిరీత్యా ఉపాధ్యాయుడైన ఈయన రచనా శైలి సరళంగా, ఉత్తరాంధ్ర మాండలికంలో ఉంటుంది. ఈయన సామాన్యజ్ఞానం గల పాఠకులు సైతం రచనలో లీనమయ్యేలా, భావప్రాధాన్య రచనలు చేశారు. ప్రసిద్ధ నవలా రచయిత యండమూరి వీరేంద్రనాథ్, రామారావు గారి రచనల నుండి ప్రేరణ పొంది ఆయనను గురువుగా భావించేవారు. ఈయన చేసిన రచనలు తక్కువైనా సుప్రసిద్ధాలు.
కాళీపట్నం రామారావు గారు 1924, నవంబరు 9 న శ్రీకాకుళం జిల్లా లావేరు మండలానికి చెందిన మురపాక గ్రామంలో భ్రమరాంబ, పేర్రాజు దంపతులకు జన్మించారు. శ్రీకాకుళంలో యస్.యస్.యల్.సి వరకు చదివారు. భీమిలిలో సెకెండరి గ్రేడ్ ట్రయినింగ్ స్కూలులో ఉపాధ్యాయ శిక్షణ పొందారు. 1943 నుండి 1946 వరకూ నాలుగైదు చోట్ల వివిధ ఉద్యోగాలు చేసినా స్థిరముగా ఇమడగలిగింది మాత్రం ఉపాద్యాయవృత్తిలోనే. 1948 నుండి 31 ఏళ్ళు ఒకే ఎయిడెడ్ హైస్కుల్ లో ఒకేస్థాయి ఉద్యోగం చేశారు. అతను 1972లో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పదవీవిరమణ చేశారు.
కాళీపట్నం రామారావు గారు తెలుగు కథకు శాశ్వతత్వాన్ని చేకూర్చే దిశగా విశేషకృషి చేశారు. యజ్ఞం, జీవధార, భయం, రాగమయి మొదలైన ప్రసిద్ధ కథలు రచించారు. 1966లో ఈయన వ్రాసిన ‘యజ్ఞం’ కథ తెలుగు పాఠకుల విశేష మన్ననలు పొందింది. దోపిడి స్వరూప స్వభావాలను నగ్నంగా, సరళంగా, సహజంగా, శాస్త్రీయంగా చిత్రించిన కథ ఇది. దీనికి 1995 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. ఆంధ్రభూమి దినపత్రికలో ‘నేటి కథ’ శీర్షికను నిర్వహించి క్రొత్త రచయితలకు అవకాశమిచ్చారు. రామారావు గారి కథా సాహిత్య దీక్షకు ప్రతిబింబమైనది కథానిలయం. దీన్ని శ్రీకాకుళంలో స్థాపించారు. దీని ద్వారా తెలుగు కథాసాహిత్యం ఒకే చోట భద్రపరచడానికి ప్రయత్నించారు. ఆ ప్రయత్నంలో చాలా వరకు సఫలీకృతం అయ్యారు.
“ఈ లోకములో నా శైశవం 1935 నుండి పాఠకునిగా బాల్యము, 1940-1942 వరకు రాసేందుకు ఆసక్తి ప్రయత్నము, 1943 నుండి ఐదేళ్లు చిన్నచితగా ఏవోవో పత్రికల్లో కొన్ని రచనలు. 1948 నుండి ఆంధ్రపత్రిక ఉగాది సంచికలూ, భారతి వంటివానిలో పన్నెండు వరకు ఒక స్థాయి కథలు రాయగలిగాను. 1957 నుండి ఉన్నత స్థాయి కథలు రాయగలిగేందుకు అధ్యయనము. అది ఫలించి 1963 నుండి పదేళ్ళ పాటు మరో పన్నెండు కథానికలు రాయగలిగేను. ఆ తర్వాత కథలైతే రాయలేకపోయాను కాని కథను గురించి అధ్యయనాలు, అందుకవసరమైన ఇతర ప్రక్రియలలో సహా చదువూ నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. అభిప్రాయాలు పదిమందితో పంచుకోవడమూ ఆగలేదు”1 అని కాళీపట్నం రామారావు గారు కథకుడిగా తన ప్రస్థానాన్ని చెప్పుకున్నారు.
2008 జనవరి 18న లోకనాయక్ ఫౌండేషన్ వారు డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అధ్వర్యంలో విశాఖపట్నంలో కారా మాష్టార్ గారిని సన్మానించారు. ఆ సందర్భంగా అప్పటి లోక్ సభ స్పీకర్ సోమనాథ్ చటర్జీ గారు ‘ఆరు దశాబ్దాలుగా కారా మాష్టారి కథలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. తన జీవితంలో అనుభవించిన, పరిశీలించిన కష్టాలను, సంఘర్షణను ఆయన తన కథలలో ఇమిడ్చారు. సమాజంలో అట్టడుగు వర్గాల జీవన సమరాన్ని సునిశితంగా పరిశీలించి తన పాత్రలలో చూపారు’ అని తన సందేశంలో చెప్పారు.
“మంచి కథలు రాసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. గొప్ప కథకు గొప్ప లక్ష్యం ఉండాలి. మంచి కథలు కాకతాళీయంగా రావచ్చు. గొప్ప కథలు గొప్ప కథకులు రాస్తే తప్ప రావు. గొప్ప కథలు రాసే ఘనత ఒక రాచకొండ విశ్వనాథశాస్త్రికీ, ఒక బీనాదేవికీ, ఒక కాళీపట్నం రామారావుకీ దక్కింది”2 అని కొడవటిగంటి కుటుంబరావు గారు పేర్కొన్నారు.
“భగవంతుడికి జనం నమస్కరిస్తారు. ఆ భగవంతుడు మనిషిగా మారితే అప్పుడు కూడా అందరూ అతనికి నమస్కరిస్తారని మనందరికీ తెలిసిన విషయమే. అయితే దేముడు మానవుడైతే అప్పుడు అతనైనా సరే కాళీపట్నం రామారావుకి నమస్కరించి తీరవలసిందే. ఆయనలాంటి గొప్ప కథకులుండటం మన జనం అదృష్టం”3 అని రావిశాస్త్రి గారు కారా మాష్టర్ గారి వ్యక్తిత్వాన్ని ప్రశంసించారు.
“శ్రీకాకుళం – కళింగాంధ్ర జీవితానికీ, భాషకీ గౌరవం తెచ్చిన మరో రచయితగా, సహజ కథకులుగా కా.రా. నిలిచిపోయారు”4 అని ద్వా.నా.శాస్త్రి గారు పేర్కొన్నారు.
కాళీపట్నం రామారావు గారి ప్రతికథ సామాజిక స్పృహతో తొణికిసలాడుతుంది. యజ్ఞం, జీవధార, భయం, రాగమయి ఇలా ఏ కథను తీసుకున్న పెట్టుబడిదారీ, దోపిడీ వార్గలకు వ్యతికేకంగా అట్టడుగు వర్గాల పక్షపాతం వహించం గమనించవచ్చు. రామారావు గారి సామాజిక, ఆర్ధిక పరిజ్ఞనానికి నిదర్శనమైన మరో కథ ‘కుట్ర’.
భూషణం మాస్టారు శ్రీకాకుళ ఉద్యమ పుట్టుపూర్వోత్తరాల గురించీ, పోరాటం గురించీ, ప్రజల తెగువ గురించీ, నిప్పులా రగిలిన అప్పటి చరిత్రని ‘అడివంటుకుంది’, ‘కొండగాలి’ వంటి రచనల ద్వారా సాహిత్యంలో నిక్షిప్తం చేశారు. ఆయన సహచరుడు అయిన కాళీపట్నం రామారావు గారు కూడా తమ కథల్లో అప్పటి చరిత్రని పట్టుకునే ప్రయత్నం చేశారు. అలాంటి కథల్లో ‘కుట్ర’ ఒకటి.
కారా మాష్టర్ గారు ఏభై ఏళ్ల క్రితం (1972) రాసిన కథ యిది. శ్రీకాకుళం ఉద్యమ ప్రస్థానం గురించి, విస్తరిస్తున్న ఉద్యమాన్ని చూసి భయపడ్డ ప్రభుత్వం ప్రజల్ని అణచివేయడానికి ఎలా కదులుతున్నదో భూషణం మాస్టారు తన కథల్లో రాస్తే, ‘కుట్ర’ కథలో ఉద్యమం సెట్ బ్యాక్ కు గురైన తర్వాత ప్రభుత్వం పెట్టిన కుట్రపూరితమైన, హాస్యాస్పదమైన ‘కుట్ర’ కేసు గురించి రాశారు.
‘పార్వతీపురం’ కుట్ర కేసుగా ప్రసిద్ధి చెందిన ఈ కేసు అప్పట్లో సంచలనం సృష్టించింది. వందలమంది సాక్షుల సమక్షంలో ప్రభుత్వాన్ని కూల్చేసే కుట్రకు పాల్పడ్డారన్న ఆరోపణ నాటి ప్రభుత్వం చేసింది. నిజానికి ఏభై ఏళ్ల తర్వాత పరిస్థితి మరింత దిగజారి ఊరూరా ‘కుట్ర’ కేసుల రచన మరింత విస్తారంగా జరుగుతుంది.
అసలు ‘కుట్ర’ అంటే ఏమిటి? రాజ్యాంగాన్ని అడ్డంపెట్టుకుని, చట్టాల్లోని లొసుగులను అడ్డం పెట్టుకుని కొందరు పారిశ్రామికవేత్తలు ఈ దేశంలో దోపిడీ యంత్రరచన ఎలా చేశారు? అని వివరించారు కారా మాస్టారు ఈ కథలో. ఏభై ఏళ్ల క్రితం రాసిన ఈ కథకి అప్పటికన్నా ఇప్పుడే ఎక్కువ ప్రాసంగికత వున్నదని ఈ కథ చదివితే మనకి బోధపడుతుంది. ఊరి ఊరికీ కనీసం ఒక దేశద్రోహం కేసు పెడుతున్న సందర్భంలో ‘కుట్ర’ నైజాన్ని సునిశితంగా వివరించే కథ ఇది.
2. కుట్రకథ - ఇతివృత్తం :
కథాకాలం శ్రీకాకుళ ఉద్యమం సెట్ బ్యాక్ కు గురైన సందర్భం. ఇద్దరు మిత్రులు మాట్లాడుకుంటూ ఉంటారు. “పట్నంలో యేదో కేసౌతోందట - యిన్నావా?”5 అని అడుగుతాడొకడు. “దగ్గిర దగ్గిర నూటేబైమంది ముద్దాయిలూ వెయ్యిమంది సాక్షులూ!”6 అంటూ మరొకడు సమాధానమిస్తాడు. ఇలా కథ మొదలవుతుంది.
ఆదివాసులు, కొండప్రాంత ప్రజలు నడిపిన స్ఫూర్తిదాయకమైన ఉద్యమాన్ని దుర్మార్గంగా, క్రూరంగా అణచివేసిన ప్రభుత్వం ఆ ఉద్యమానికి సహకరించిన వారిపై, బాసటగా నిలిచిన వారిపై ‘కుట్ర’ కేసు పెడుతుంది. ఆ ‘కుట్ర’కు సాక్షులుగా వెయ్యిమందిని చూపిస్తుంది. అందరికీ తెలుసు ఇది ఒక దొంగ కేసని.
“కుట్రంటే - ఇద్దరో ముగ్గురో మధ్య రహస్యంగా ఏదైనా జరిగితే అది కుట్ర. నూర్నూటేబై మంది జనఁవేటి, ఆళ్ళ పక్షాన కాదు, నీ పక్షాన పలకడాని కొచ్చినోళ్ళే వెయ్యిమంది సాక్షులు! అంత సాక్షింలో జరిగిందీ అంటే అది పబ్లిగ్గా జరిగిందన్న మాట. అలాటిది ఏటన్నా కావచ్చు గాని కుట్రనడానికి మాత్రం కాదు. నన్నడిగితే దాన్ని కుట్రనడఁవే ఓ పెద్ద కుట్రంటాను. ఏటి - తిరుగుబాటనడానికి నీకు నామోషీ దేనికి?”7 అని దాన్ని తిరుగుబాటు అనాలంటాడు రచయిత.
ఈ కథలో ప్రత్యేకత ఏంటంటే, కుట్ర కేసు గురించి, శ్రీకాకుళ ఉద్యమం గురించి ఇంత కంటే ఎక్కువ ప్రస్తావన ఉండదు. స్వాతంత్రం రావడానికి కొంచెం ముందు, వచ్చిన తర్వాత స్వదేశీ పారిశ్రామికవేత్తలు, ఆర్థికవేత్తలు ఎలాటి ఎత్తుగడలు వేశారు, తమకు అనుకూలమైన వారికోసం పాలసీలను ఎలా అనుకూలంగా రాసుకుని అమలుపరుచుకున్నారు, ప్రజలధనాన్ని చట్టాలను అడ్డంపెట్టుకుని, చట్టాల సహాయంతో ఎలా దోచుకున్నారు - అన్న విషయాలను రచయిత వివరించారు.
శ్రీకాకుళం మన్యంలో ఉద్యమం రాజుకున్న 1947 కీ ఈ కథ వెలువడిన 1967 కీ మధ్య - అంటే స్వతంత్రం వచ్చిన ఇరవై ఏళ్ల కాలంలో ఆర్థిక దోపిడీ ఎలా జరిగిందో, అసలు కుట్ర అది ఎందుకయ్యిందో చారిత్రక వివరాలతో కాళీపట్నం వారు ఈ కథను చెప్పారు.
కథాంశం క్లిష్టమైనది. ఆర్థికపరమైన అంశాలను చెప్పడం వ్యాసంలో వీలవుతుందేమో కానీ కథలో నేరుగా చెప్పడం కష్టం. అందుకే, దాదాపు మోనోలోగ్ లా సాగిన కథలో ప్రభుత్వ వనరులు డబ్బున్నవాళ్ళకోసం ఉపయోగపడేలా చట్టాలు, విధానాలు ఎలా రూపొందుతాయో రచయిత వివరించారు.
కథనం కారా మాస్టారి మార్కు పద్దతిలో అంటే మైదాన ప్రాంతంలో ప్రవహించే నదిలా లేదా ఉపాధ్యాయుడు నింపాదిగా పాఠం చెప్పే పద్ధతిలో సాగుతుంది.
కొత్తగా దేశం ఏర్పడి దిశా నిర్దేశం చేసుకుంటున్న దశలో ప్రభుత్వంలో దూరిన లేదా దూర్చబడ్డ పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా వున్న మేధావులు విచ్చలవిడి దోపిడీకి అవకాశం కల్పించే చట్టాలని ఎలా తయారుచేసుకున్నారో రచయిత ఈ కథలో వివరించారు.
“అలాగ కోట్లకొద్దీ జనాల్ని దగా చేసేసి, నొర్లేని ఆ జనం కరవూ, కాటకాలూ, నిరుద్యోగంతో దిక్కుతోచక అల్లాడుతుంటే ఉన్న కోట్లు చాలక యింకా యింకా కోట్లమీద కోట్లు కూడేసే వారందరూ క్షేమంగానే వున్నారు. ఎంచేతా? వాళ్ళు చేసే ఘోరాలూ, దగాలూ అన్నీ లాఫుల్ గానే జరుగుతుండి ఉండాలి”8 అని కాళీపట్నం వారు మన చట్టాల వెనుక అంతర్లీనంగా ధనవంతుల స్వార్ధాన్ని బహిర్గతం చేశారు.
ఈ విచ్చలవిడి దోపిడీ చట్టబద్ధమైపోయి, ఈ దోపిడీని ప్రశ్నించిన వారిది చట్టవ్యతిరేకమై పోతుంది. ఈ దోపిడీని ప్రశ్నించాలా వద్దా అన్నది ఇష్టాయిష్టాలకి సంబంధించిన విషయం కాదు. ప్రశ్నించక, నిలదీయక తప్పని పరిస్థితి కొందరిది. ఎందుకంటే నిలదీయకుండా, దానికి వ్యతిరేకంగా పోరాడకుండా మనలేని పరిస్థితి.
“ఇదంతా మనకి బాగానే ఉండొచ్చు. ఎందుకంటే మనకి దానివల్ల నష్టం లేదు కాబట్టి. నష్టపోయిన వాళ్లకు మాత్రం దాన్ని మార్చాలనుంటుంది. అది మారాలంటే నువు మారనీవు. నిన్ను మార్చబోతే మార్చబోయిన వాళ్ళని దేశద్రోహులంటావు”9 అంటూ కాళీపట్నం రామారావు గారు తిరుగుబాటు వెనుక ఉన్న కారణాలను తెలియజేశారు.
అసలు కుట్ర ఏది? ఎవరు చేస్తున్నారు? నమ్మిన జనసామ్యాన్ని నాయకులో, పవర్లో వున్న పార్టీయో, పార్టీలో మనుషులో దగా చేస్తే - అది దేశద్రోహం కాదా? వాళ్ళు ఎవరైనా కానీ - ఆ చేసే దగాని బైటపెట్టడం, ఎదుర్కోమనడం - ఇదా దేశ ద్రోహం? ఇలాంటి ప్రశ్నలకు కాళీపట్నం రామారావు గారు ఈ ‘కుట్ర’ కథలో హేతుబద్దమైన సమాధానం ఇచ్చారు.
2.1 'కుట్ర' కథ – సామాజికస్పృహ :
“రామారావు గారి కథల్లో సామాజంలో మనుషులు ప్రవర్తించే తీరు కేవలం నిజంగా ఉండడమే కాదు, సమాజపు భావజాల వ్యవస్థ దాని బరువు కింద కనిపించకుండా అణిగివున్న సామాజిక వ్యవస్థా వ్యక్తమవుతాయి. అంత గాఢంగా సమాజం అడుగున ఉన్న నిజాన్ని చూపిన రచయితలు ఏ సాహిత్యంలోనూ ఎంతో మంది వుండరు”10 అని వెల్చేరు నారాయణరావు గారు కారా మాష్టార్ కథల్లో సామాజిక స్పృహను వివరించారు.
కాళీపట్నం రామారావు గారికి భారత సామాజిక నిర్మాణంపై మంచి అవగాహ ఉంది. అది అతని కథలలో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ కనిపిస్తుంది. ఈ ‘కుట్ర’ కథలో ప్రధానంగా మూడు అంశాలను గమనించవచ్చు. అవి కాళీపట్నం రామారావు గారికి గల-
1. రాజకీయ స్పృహ
2. ఆర్ధిక స్పృహ
3. సాంఘిక స్పృహ
2.2 రాజకీయ స్పృహ :
ఆధునిక రాజ్యాలు ప్రధానంగా ప్రజాస్వామ్య రాజ్యాలు. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వాలు ప్రజల సంక్షేమం కోసం చట్టాలను రూపొందించి, అమలుపరుస్తాయి. అందుకే వీటిని సంక్షేమ ప్రభుత్వాలు అని కూడా భావిస్తారు. కానీ నిజానికి ప్రజాస్వామ్యంలో చట్టాల రూపకల్పన ప్రజాకోసం కాకుండా కొందరి స్వార్ధ ప్రయోజనాలను కాపాడుకునే విధంగా జరుగుతుందని కాళీపట్నం రామారావుగారు ఈ కథలో పేర్కొన్నారు. చట్టాలను రూపొందించే టప్పుడు పాలకులు “ఏ రూల్సు లేప్పోతే నీ కిబ్బందై, ఏ రూల్సు పెడితే నీక్కాబోయే ప్రత్యర్థులకి కాళ్ళూ చేతులూ ఆడవో అలాటి రూల్సే అన్నీ యెతికెతికి రాస్తావు”11 అని చట్టాల వెనుక ఉన్న స్వార్ధాన్ని, కుట్రను తేటతెల్లం చేశారు.
ప్రజాస్వామ్యంలో వయోజన ఓటుహక్కు ప్రధానమైంది. దీని ద్వారానే ప్రజలు తమ పాలకులను ఎన్నుకుంటారు. మొదటిలో ఈ ఓటుహక్కు 21 సం. వచ్చేది. తరవాత కాలంలో దీనిని 18 సం. తగ్గించారు. “నిన్న టెలక్షన్లో ముదరోళ్ళు మునపట్లా మనకి ఓట్లెయ్యలేదు. సరే. ఎవరేస్తన్నారు? యువజనులే కసింతలో కసింత మెరుగు. ఎంచేత? ముదరోళ్ళకి మన సంగత్తెలిసిపోయింది. కుర్ర గుంటలికి తెలియడాని కింకా కొంతకాలం పడతాది. ఆల్ రైట్. ఓటేసీవయసు పద్దెనిమిదేళ్ళకి దించీ - అనాల. అదిగదీ సిసలైన డెమోక్రేట్ ఎత్తుగడ”12 అంటూ మాష్టార్ గారు దీనివెనుక ఉన్న కుట్రను బహిర్గతం చేశారు.
ఈ కథలో కాళీపట్నం వారు “మాబు మన పక్షఁవైనంతకాలం, అంటే డెమాక్రసీ ఆళకి లాభించినంత కాలం వయోజన ఓటూ, సీక్రెట్ బేలట్టూ అంటూ కుప్పిగంతులేసుగ్గెంతుతారు. ఎప్పుడైతే జనం అప్పోజిషన్ కాసి తిరిగిపోతారో సీ! యీ దేశానికి డెమోక్రసీ యేటి! మనం మాబాక్రసీలకేగాని డెమాక్రసీలకి తగం అని తిట్లకి తయారడి పోతారు”13 అంటూ రాజకీయ నాయకుల మనస్తత్వాన్ని వివరించారు. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలకు గెలుపు ఓటమీ సహజం. కాని రాజకీయ నాయకులు తాము గెలిచినప్పుడు అది ప్రజాస్వామ్య గొప్పతనంగానూ, ఓడిపోయినప్పుడు ప్రజాస్వామ్యాన్ని నిందించడం గమనించవచ్చు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషిన్స్ వ్యవహారం దీనికి ప్రబల ఉదాహరణ.
“నువ్వేం చేసినా – లిబరల్ గా ఉన్నట్టు కనపడాల. దానివల్ల అవతలోడు బలహీనమైపోయి అదే సమయంలో నువ్ మెరిసీ గలగాల. కీలకస్థానాల్లో నీ కిష్టం కాని మనుషులు దూర్రాదు. దూరినా ఆర్గనైజేషన్ ఆళ్ళిష్టఁవొచ్చినట్టు నడవరాదు. నీ ప్రధాన లక్ష్యం అది. ఆఫీసు రన్నింగ్ కాణ్ణించీ అన్ని వ్యవహార ములూ ఆ గోలుకే సాగుతాయి”14 అంటూ ప్రజాస్వామ్యం పేరుతో దాని వెనుక జరుగున్న బాగోతాన్ని మాష్టార్ గారు వాస్తవికంగా చెప్పారు. కేంద్రంలో ఒక ప్రభుత్వం అధికారంలో ఉండి, రాష్ట్రంలో మరో ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడూ అదేవిధంగా రాష్ట్రంలో ఒక ప్రభుత్వం అధికారంలో ఉండి, స్థానిక ఎన్నికల్లో గ్రామాల్లో, పట్టణాల్లో వేరే ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పుడు కేంద్ర, రాష్ట్ర మరియు స్థానిక ప్రభుత్వాల మధ్య సంబంధాలను పరిశీలిస్తే ఈ విషయ అవగతమవుతుంది.
ఈ విధంగా కాళీపట్నం రామారావు ఈ కుట్ర కథలో ప్రజాస్వామ్యం పేరుతో పాలకులు ప్రజలను మోసం చేస్తున్న తీరును వాస్తవికంగా అక్షరబద్దం చేశారు.
2.3 ఆర్ధిక స్పృహ :
కాళీపట్నం రామారావు స్వాతంత్ర్యానికి పూర్వం, స్వాతంత్ర్య అనంతరం గల సంధికాలంలో జీవించారు. ఆ సామయంలో భారత ఆర్ధిక వ్యవస్థ తీరుతెన్నేలను అధ్యయనం చేశారు. మాష్టార్ గారికి అర్ధశాస్త్రంలో ఎటువంటి పట్టాలు లేవు. అయినా కథలో కూడా అర్ధశాస్త్రం చెప్పవచ్చునని ఈ కుట్ర కథ ద్వారా నిరూపించారు. స్వాతంత్ర్యానంతరం భారత ప్రభుత్వం అనుసరించిన మిశ్రమ ఆర్ధిక వ్యవస్థను మాష్టార్ గారు తీవ్రంగా విమర్శించారు. “నన్నడిగితే కుట్రనదగ్గదేదేనా జరిగితే రాజ్యాంగం రాసినకాడే జరిగుండాల. పంచవర్ష ప్రణాళికలు ఏసిన్నాడు డెఫినెట్ గా జరిగింది. జరిగిందనడానికి దాఖలాలున్నాయి - మన కళ్ళముందే”15 అంటూ భారతదేశంలో నానాటికీ పెరుగుతున్న ఆర్ధిక అసమానతలను, పెట్టుబడిదారులు ప్రభుత్వాన్ని నియంత్రించడం వంటివి దానికి ఋజువులుగా చూపించారు.
మన దేశానికి బ్రిటిష్ వారి నుండి స్వాతంత్ర్యం లభించిన తర్వాత భారత రాజ్యాంగ నిర్మాతలు భారతదేశాన్ని ప్రణాళికా బద్దంగా అభివృద్ధి చేయాలనుకున్నారు. “స్వాతంత్య్రం వస్తే రేపు మన దేశానికేం కావాల? మనఁవేం చెయ్యాల? ఏం చెయ్యగలం? ఇలాటాలోచన ఒక్క - తప్పు - ఒక్క పెద్ద మనిషికీ వచ్చుండదు. ఎవళ్లో ఒకళ్లిద్దరికొచ్చినా ఆళ్ల పీక ఏ పెద్దోళ్ళో నొక్కేసుంటారు. అందికే ఆరోజొచ్చీసరికి రాజ్యాంగం రాయడం కాణ్ణుండి ప్లాన్లేయ్యడం కాణ్ణుండి - ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపించడానికి సరేసరి - అన్నిటికీ నాన్ పార్టీ ఇంటలెక్ట్సుమీదా కొండొకచో ఏంటీపార్టీ ఇంటలెక్ట్సు మీదా ఆధారపడవలసొచ్చింది. ఆళ్లు ప్రజారాజ్యం రామరాజ్యం అంటూనే దీన్ని రాక్షసరాజ్జెం చేసీచేరు”16 అని మన స్వాతంత్ర్య పోరాటంలో మన నాయకులు చేసిన పొరపాటునూ, తాత్పలితంగా మనం నష్టపోయిన విధానాన్ని కారా వారు ఈ కథలో వివరించారు.
పి.పి.వైద్యనాధ్ ఇతివృత్తం తీసుకొని మిశ్రమార్ధిక విధానాల ఫలితంగా భారత సమాజం నష్టపోయిన విధానాన్ని కారా వారు ఈ కథలో సమగ్రంగా వివరించారు. పి.పి.వైద్యనాధ్ అనే వ్యక్తి స్వాతంత్ర్యానికి పూర్వం బ్రిటిష్ వారి క్రింద పనిచేసిన వ్యక్తి. “స్టేట్ ఎకనామిక్సు కీ బోర్డు ఎక్కడెక్కడని కేపిటల్లోనూ ఇందంబడందం బడని ఎతికితే దొరకదట. తిరుచ్చో తిరునల్వేలో - ఆడి హెడ్డాఫీసు దొంగ కబ్బోర్డు - సీక్రెట్ వాల్టులో - వెతికితే దొరకటం ఖాయం”17 అని కారా మాష్టార్ ఇతని గురించి అన్న మాటలను పరిశీలిస్తే ఇతను పెట్టుబడిదారీ ఆర్ధిక విధానాలను బాగా వంటబట్టించుకున్న వాడని స్పష్టమవుతుంది. అటువంటి వాడిని స్వాతంత్ర్యానంతరం ప్రణాళికా సంఘంలో కీలక పదవి కట్టబెట్టారు. ఇలాంటి వారంతా కలిసి సామ్యవాద సామాజ స్థాపనకోసం ప్రణాళికలు అని చెప్పి మన దేశాన్ని ఆర్ధిక ఊబిలోకి నెట్టిన వైనాన్ని ఈ కథలో కారా మాష్టర్ వాస్తవికంగా వివరించారు.
స్వాతంత్ర్యానంతరం భారత ఆర్ధిక విధానం పై కాంగ్రెస్, కమ్యూనిస్ట్ లకు భిన్న అభిప్రాయాలు ఉండేవి. వీటిని ఆసరాగా తీసుకొని ఈ పి.పి.వైద్యనాధ్ మిశ్రమ ఆర్ధిక వ్యవస్థ అనే కొత్త విధానం భారతదేశానికి బాగుతుందని చెప్పి, మన వాలను దానికి ఒప్పించాడు. “కొత్తంటే కొత్తా కాదూ, ఆ పేరే కొత్త. ఆ దారి అంతకు ముందు యూరపు దేశాలు తొక్కిందే. ఇప్పుడా బ్రిటననగా ఫ్రాన్సనగా, ఏయే దేశాల్లో అయితే వర్కింగ్ క్లాసు కసింత తెలివి తెచ్చుకొని సోషలిజం గీషలిజం లాటి పదాలతో యాగీ ఆరంభిస్తారో, ఆయా దేశాలన్నిట్లోనూ మసిబూసి మారేడుకాయ చేసే యీ విద్య కొత్తది కాదు. ఈడు దాన్నే బాగా స్టడీ చేసి మిక్సెడెకానామీ అన్నాడు. ఆ పేరేనా యీడెట్టేడో అదీ పాద్దేనో, నాకనుమానఁవే”18 అని కాళీపట్నం వారు వైద్యనాధ్ యొక్క కుట్రను బహిర్గతం చేశారు.
భారతదేశ స్వాతంత్ర్యానికి పూర్వం సుభాస్ చంద్రబోస్ నేషనల్ ప్లాన్ తయారు చేశాడు. దీనికి ప్రత్యామ్నాయంగా దేశంలోని కోటీశ్వర్లంతా కలిసి ఒక ప్లాన్ తయారు చేశారు. దీనిని బొంబాయి ప్లాన్ అంటారు. “మాంసం పెలాటబుల్ గా ఉండడానికి అటొకటీ ఇటొకటీ చిన్న బ్రెడ్ స్లయిసులు తగిలించి సాండ్ విచెస్ తయారు చేస్తారు చూశా - అలాగ పందొమ్మిది వందల ముప్పై యెనిమిదిలో రాయిస్టులు తయారుచేసిన పీపుల్సు ప్లాన్నుండి ఓ ముక్కా - సారీ యిందాక నేషనల్ ప్లానన్నాను - ఆ తరువాత యస్సెస్ అగర్వాలా మార్కు గాంధియన్ ప్లాన్నుండి ఓ ముక్కా తీసి - మొదట చెప్పిన బొంబాయి ప్లానుకి అటూ యిటూ తగిలించేసేడు. తగిలించి పార్లమెంటు ముందుకి పమ్మించేడు. ఏటయ్యా యీ డిష్షూ? - అంటే, మిక్సెడెకానమీ అన్నాడు......... రెండు కోర్సులు పూర్తిచేసి మూడో దానికొచ్చేక గాని తము పుచ్చుకున్న ఫలహారం పచ్చి మాంసమనీ అందులోనూ నరమాంసమనీ కొందరు అహింసా మూర్తులు తెలుసుకో లేప్పోయేరు”19 అని పి.పి.వైద్యనాధ్ దేశానికి చేసిన ద్రోహాన్ని, మన నాయకుల అవివేకాన్ని కారా వారు ఈ కథలో ఎత్తి చూపారు.
స్వాతంత్ర్యానంతరం మన దేశం మిశ్రమ ఆర్ధిక వ్యవస్థను స్వీకరించిన తర్వాత దానిని అమలు చేయడానికి పంచవర్ష ప్రణాళికలను రూపొందించింది. మొదటి ప్రణాళికలో వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం అని ఘనంగా చెప్పుకుంది. “వ్యవసాయిక ఉత్పత్తులు పెరిగితేగాని ఒక టైపాఫ్ యిండస్ట్రీకి పునాదుండదు. ఆట్ని అందుకూ పెంచాలన్నాడు. వ్యవసాయదార్ల లాటు బాగు చెయ్యడానికీ కాదు, ఆహార సమస్యకి సొల్యూషన్ గానూ కాదు. ఒకేళ ఆ రెండు లాభాలూ దేశం పొందిందంటే అవి బై ప్రోడక్టల టైపు. పత్రికలూ నాయకులూ మనకింకోలా చెప్పుండొచ్చు”20 అని మొదటి ప్రణాళిక వెనుక ఉన్న దురుద్దేశాన్ని మాష్టార్ గారు ఈ కథ ద్వారా తెలియజేశారు.
ఇక రెండవ ప్రణాళికలో పారిశ్రామిక రంగానికి పెద్ద వేస్తున్నామని, దేశంలో నిరుద్యోగం తగ్గిపోతుందని నాటి పాలకులు ఊదరగొట్టారు. పరిశ్రమలను పబ్లిక్ సెక్టార్ పరిశ్రమలు, ప్రైవేట్ సెక్టార్ పరిశ్రమలుగా విడగొట్టారు. భార పరిశ్రమలను అనగా ఇనుము ఉక్కు, భారీ పరిశ్రమలకు, చిన్న తరహా పరిశ్రమలకు అవసరమైన యంత్రాలు, విడిభాగాలు తయారు చేసే వాటిని పబ్లిక్ సెక్టార్ లో ఉంచారు. వీటిని ప్రభుత్వమే నెలకొల్పుతుంది. ఇక సిమెంట్, సైకిళ్ళు, బట్టలు, పంచదార వంటి కన్సూమర్ గూడ్స్ ని తయారు చేసే పరిశ్రమలను ప్రైవేట్ వ్యక్తులకు కేటాయించారు. “గుణింతఁవే తేడాలా కనపడతాది గాని, భార పరిశ్రమకీ, భారీ పరిశ్రమకీ తేడా సచ్చినంతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే నెత్తిమీది బియ్యబ్బస్తా భార పరిశ్రమైతే కడుపులో కెళ్ళే పరమాన్నం లాంటిది భారీ పరిశ్రమ”21 అని మాష్టార్ గారు పేర్కొన్నారు.
ప్రైవేట్ సెక్టార్ లో పరిశ్రమలను కూడా ఈ పెట్టుపడిదార్లు తమ డబ్బులతో స్థాపించలేదు. ఇక్కడ కూడా కుట్రాలను పన్నారు. “మదుపుకి డబ్బుల్చాల వన్నోళ్ళకి బ్యాంకుల్చేత అప్పులిప్పించీ, ఇండియన్ గూడ్స్ కాస్ ట్లీ అంటే కాంపిటీషన్నుండి ప్రొటెక్షనిచ్చీ, అడిగినట్టూ అల్లరిపడ్డట్టూ నిరూపించి కొన్ని కొన్ని టాక్సుల్నుండి ఎగ్జంప్షనిచ్చీ ప్రభుత్వమే కొంతమంది బీద పారిశ్రామికు ల్చేత పరిశ్రమలను పెట్టించింది”22 అని కారా మాష్టర్ ప్రజల సొమ్మును ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు దోసిపెట్టిన వైనాన్ని ఈ కుట్ర కథలో వివరించారు.
నిజానికి సోషలిస్ట్ దేశాలలో కూడా భార పరిశ్రమలను ప్రభుత్వాలే చేపడతాయి. కాని ప్రైవేట్ వారికి అవసరమైన యంత్రాలు తయారు చేయడానికి కాదు. తరవాత తాము టేకాఫ్ చేయదలచిన చిన్న పరిశ్రమల కోసం ముందుగా భార పరిశ్రమలను స్థాపిస్తాయి. అంటే ప్రజల సదుపాయం కోసం ప్రజలు పెట్టుబడి పెడతారు అక్కడ. కాని మన దేశంలో రాబోయే ప్రైవేట్ పారిశ్రామికవేత్తల కోసం ప్రభుత్వం ప్రజల సొమ్మును పెట్టుబడి పెట్టింది. దీనిని “పుట్టబోయే నీ పులి పిల్లల శ్రేయస్సు కోసం పురిటికి ముందే బలి సిద్ధం చేస్తున్నావన్నమాట”23 అని మాష్టార్ గారు పేర్కొన్నారు.
కన్సూమర్ గూడ్స్ తయారు చేసేవాడిది, అమ్మేవాడిది ఆడింది ఆట, పాడింది పాట. ఎందుకంటే వీటి వినియోగదారులు ప్రజలు. వీళ్ళు సంఘాలుగా ఏర్పడటం, బేరసారాలు ఆడటం ఉండదు. కాని భార పరిశ్రమ ఉత్పత్తులకు వినియోగదార్లు భారీ పరిశ్రమలను నిర్వహించేవారు. వీరు లైయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ ఇలా సంఘాలుగా ఏర్పడి, తమ పలుకుబడినీ, రాజకీయ నాయకుల అండను ఉపయోగించి భార పరిశ్రమల ఉత్పత్తులకు ధర నిర్ణయించడం జరిగింది. “ఇలాంటి వెల్ అండ్ వైడ్ లీ ఆర్గనైజ్జు, కేలిక్యులేటింగ్ లీ ఇంటలిజెంట్ అండ్ రూత్ లెస్ గ్రీడీ పీపుల్ ఓ రకం ప్రోడక్ట్సుకి కొనుగోలుదార్లు. ఏ ప్రొడక్ట్సుకీ? ప్రజల డబ్బుతో పబ్లిక్ సెక్టార్ల తయారయ్యే హెవీ ఇండస్ట్రీస్ ప్రొడ్యూస్ చేసే యిండస్ట్రియల్ గూడ్సుకి. ఈ కొనుగోలుదార్లతో పైన చెప్పిన ఇండస్ట్రియలిస్టులు తయారుచేసే కన్స్యూమర్ గూడ్సు కొనుగోలుదార్లు - అంటే జన సామాన్యం - ఆ జన సామాన్యాన్ని సరిపోల్చండి. ఇంక నెంబర్ ఒన్ కొనుగోలుదార్లకి ఎదురుగా అమ్మకం దార్లెవరయ్యా - సొమ్ముకడిదీ, సోకొకడిదీ, అని సాఁవెత చెపతారు జూసా - అలాగ ప్రజల సొమ్ముకి ట్రస్టీలు ప్రభుత్వంవారు పెట్టుబడిపెడితే, ఆ పెట్టుబడితోగాని దాని లాభనష్టాలతోగాని ప్రమేయంలేని, పెద్ద పెద్ద జీతాలూ, అనరోరియమ్ లూ లాగే నిపుణులు - వ్యాపారాలు నడిపిస్తారు”24 అంటూ కారా మాష్టార్ రెండవ ప్రణాళికలోని కుట్రను వివరించారు. ఇలా నష్టాల్లోకి వెళ్ళిన ప్రభుత్వ భార పరిశ్రమలను తిరిగి ప్రైవేట్ వ్యక్తులు తక్కువ ధరకు హస్తగతం చేసుకున్నారు. దానికి అవసరమైన ధనం ప్రభుత్వమే సూరిటీ ఇచ్చి వారికి బ్యాంకుల ద్వారా ఇప్పించడం మరో కుట్ర.
“అసలు కుట్ర అది. అది దుంప. ఇయన్నీ దాన్లోంచొచ్చిన పిలకలు. సామాజిక వ్యవస్థ అనే బాడీలో విషక్రిమిని ప్రవేశపెట్టేవు. వీక్ బాడీయే. అయినా ఇంకా రోగ నిరోధక శక్తి మిగిలుంది. సంతోషించి సాయం చెయ్యడానికి బదులు రెసిస్టెన్సు చంపడానికా వైద్యం!”25 అని కాళీపట్నం రామారావు గారు మిశ్రమ ఆర్ధిక వ్యవస్థ, దానిని అమలు చేయడానికి రూపొందించిన పంచవర్ష ప్రణాళికల వెనుక ఉన్న కుట్రను ఈ కథ ద్వారా ప్రజల ముందుంచారు.
2.4 సాంఘిక స్పృహ :
కాళీపట్నం రామారావు విప్లవ రచయితల సంఘం (విరసం) వ్యవస్థాపక సభ్యులు. సమసమాజ స్థాపనను ఆకాంక్షించారు. శ్రీకాకుళం గిరిజన పోరాటాన్ని, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని కళ్ళార చూశారు. ఆ పోరాటాల వెనుక ఉన్న వాస్తవాలు అతనికి తెలుసు. దోపిడీ పెట్టుబడిదారీ వర్గాల దుర్మార్గాలను, కుట్రలను కళ్ళార చూశారు కాబట్టే వాటిని తన రచనలలో అంత వాస్తవికంగా చిత్రించగలిగారు.
స్వాతంత్ర్యానంతరం బెంగాల్ మొదలుకొని ఆంధ్రప్రదేశ్ వరకు ప్రభుత్వాలకు, వాటి విధానాలకు వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు జరిగాయి. పాలకులు వీరిపై రాజద్రోహం, ప్రభుత్వాలను కూల్చడానికి కుట్ర చేశారనే కేసులు పెట్టి ఆ తిరుగుబాట్లను అణచివేయడానికి ప్రయత్నించాయి. వీటిని చాలావరకు శాంతిభద్రతల సమస్యగానే చూశాయి. ఈ సమస్య వెనుక ఉన్న సామాజిక రాజకీయ ఆర్ధిక కారణాల జోలికి పోలేదు. కాని కారా మాష్టార్ గారు ఈ తిరుగుబాట్లకు గల అసలు కారణాలను ‘కుట్ర’ కథలో పరిశోధనాత్మకంగా వివరించారు.
“కాన్స్టిట్యూషన్ ఆళ్లకి కావలసినట్టు రాయించుకొని యీ కసింత కాలంలోనే భిక్షాధికార్లు లక్షాధికార్లూ, లక్షాధికార్లు మల్టీ - మల్టీ మిలీనీర్సూ అయిపోయి, సాలక యింకా నిచ్చెన్లెత్తేస్తన్నారు. ఆళ్ళని అడ్డడానిక్కాదు, అదుపులో ఎట్టడానిక్కూడా ప్రజలగ్గాని ఆళ్ల సేతిలో ఉందని చెప్పే శాసనాధికారానికి గాని శక్తి సాలడం లేదు. ఆళ్ళు కాన్స్టిట్యూషన్ని అడ్డెట్టుకుంటే అనకూడదుగాని ఆళ్ళ - దేన్నో తెంచడానికి శాతకాదు నీకున్న శాసనాధికారానికి. అదిగందికే ప్రజలు ఉగ్రనారసింహులు కావలసొచ్చింది”26 అని తిరుగుబాట్ల వెనుక ఉన్న అసలు కారణాన్ని కాళీపట్నం వారు పాఠకుల ముందుంచారు.
కాన్స్టిట్యూషన్ ను మార్చాలంటే చట్ట సమ్మతంగానే మార్చాలని పాలకులు చెప్పే మాటల్లోనే కుట్ర ఉందని కారా వారు పేర్కొన్నారు. “చట్టసమ్మతంగా - అని నువ్వెట్టించిన షరతే చెపుతాది. దాని ప్రకారం నడిస్తే దాన్ని మార్చలేఁవని”27 అని ఆ మాటల వెనుక ఉన్న యథార్ధాన్ని వివరించారు.
“నువ్వలాగ, మరీ అంత కంతల్లేని గదిలో కాపరఁవెట్టి, ఉన్న ఒక్క గుమ్మా నికీ మంచం అడ్డేసేస్తే ఆ కాపరం సక్కబెట్టదలచినోడికి రెండే రెండు దార్లు. నిశిరాత్రి నీ పీక పిసికీడం మొదటిది లేదా గోడలు బద్దలు గొట్టేయాల. మూడోదారి లేదు”28 అంటూ తిరుగుబాట్లు వెనుక వాస్తవికంగా ఉన్న కారణాలను ఈ కథ ద్వారా ప్రజల ముందుంచారు.
“ప్రెస్సంటే గుర్తుకొచ్చింది. ప్రెస్సంటే మీకో చిన్న ఇన్ఫర్మేషన్. ప్రెస్సె లాంటిదంటే - ప్రెస్ – అన్నాడు ఓ పొలిటికల్ ఫిలాసఫరు. దాని సాయింతో ప్రభుత్వాలను తక్తు మీదికెక్కించడం, ఎవహారం బాగులేదంటే ఆట్ని దింపీడం - ఇలాటివే కాదు; పనికొస్తాడూ పైకెత్తాలీ అంటే మశికాల్లాటి పీనుగుల్ని పట్టుకొని మహాగజాల స్థాయికి పెంచీగల్రు; పెంచి, ఎదురు తిరిగినా పనికి రాప్పోయినా ఆ మహాగజాల్ని మళ్ళా మక్షికాల సైజుకు కట్ చేసీగల్రు”29 అని కారా మాష్టార్ అన్న మాటలు సర్వకాలికం. రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు ఈ పత్రికల యాజమాన్యాలను నయానో భయానో తమ గిప్పిట్లో పెట్టుకొని, ప్రజలకు వాస్తవాలను తెలియనీయకుండా జాగ్రత్త పడటం ఇప్పుడూ మనం గమనించవచ్చు. ఇంకా ఆందోళన కలిగించే విషయం ఏమిటంటే ఈ రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు సొంతగా పత్రికలు, టి.వి. పెట్టుకోవడం. ఈ విధంగా సమాజంపై కుట్ర జరుగుతున్నా తీరును 50 సం. క్రితమే కారా మాష్టార్ గుర్తించి రాసిన కథ ఈ ‘కుట్ర’.
“నాకు తెలిసి ప్రపంచ సాహిత్యంలో రామారావుగారిలా కథ చెప్పే వాళ్ళు ఎంతోమంది లేరు”30 అని వెల్చేరు నారాయనారు గారు అన్న మాటలు అక్షర సత్యం.
ఇలా తెలుగు భాషా సాహిత్యాలకు ఎంతో సేవ చేసిన కాళీపట్నం రామారావు గారు 2021 జూన్ 4 న స్వర్గస్తులయ్యారు.
3. ముగింపు:
- కాళీపట్నం రామారావు గారు ఈ కుట్ర కథలో ప్రజాస్వామ్యం పేరు చెప్పి నేటి పాలకులు ఏవిధంగా నియంతృత్వ పోకడలను అనుసరిస్తున్నారో వివరించారు.
- స్వాతంత్ర్యానంతరం మన పాలకులు గొప్పగా చెప్పి అమలు చేసిన మిశ్రమ ఆర్ధిక విధానం, పంచవర్ష ప్రణాళికలు లోపభూయిష్టమని సహేతుకంగా పేర్కొన్నారు.
- చట్టాల రూపకల్పనలో పాలకులు అనుసరిస్తున్న కుట్రాలను తేటతెల్లం చేశారు.
- ప్రభుత్వ విధానాల ఫలితంగా ఆర్ధిక అసమానతలు పెరుగుతున్న విధానాని ఈ కథలో కారా మాష్టార్ చిత్రించిన విధానం ప్రస్తుత సమాజ నిర్మాణంపై అతనికున్న అవగాహనకు నిదర్శనం.
- స్వాతంత్ర్యానంతరం ప్రభుత్వ విధానాల ఫలితంగా దేశ ప్రజలందరికీ చెందవలసిన ఆర్ధిక వనరులు
కొందరు స్వార్ధపరులు హస్తగతం చేసుకున్నావైనాన్ని కాళీపట్నం వారు ఈ కథలో ఉదాహరణ సహితంగా వివరించారు.
4. పాదసూచికలు:
- కాళీపట్నం రామారావు రచనలు, పుట 561
- ఇదే, పుట 9
- ఇదే, పుట 11
- తెలుగు సాహిత్య చరిత్ర, పుట 608
- కాళీపట్నం రామారావు రచనలు, పుట 363
- ఇదే, పుట 363
- ఇదే, పుట 363
- ఇదే, పుట 372
- ఇదే, పుట 372
- ఇదే, పుట 18
- ఇదే, పుట 363
- ఇదే, పుట 364
- ఇదే, పుట 364
- ఇదే, పుట 364
- ఇదే, పుట 364
- ఇదే, పుట 366
- ఇదే, పుట 365
- ఇదే, పుట 366
- ఇదే, పుట 367
- ఇదే, పుట 367
- ఇదే, పుట 368
- ఇదే, పుట 371, 372
- ఇదే, పుట 369
- ఇదే, పుట 370
- ఇదే, పుట 364
- ఇదే, పుట 364
- ఇదే, పుట 364
- ఇదే, పుట 364
- ఇదే, పుట 370, 371
- ఇదే, పుట 18
5. ఉపయుక్తగ్రంథసూచి:
- కథా యజ్ఞం. (1982). హైదారాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ.
- ద్వా.నా.శాస్త్రి.(2013).తెలుగు సాహిత్య చరిత్ర, ప్రగతి పబ్లిషర్స్, హైదరాబాద్.
- రంగనాయకమ్మ గారు యజ్ఞంపై రాసిన విమర్శనాత్మక వ్యాసం (ప్రజాసాహితి – సెప్టెంబర్, 1977)
- రంగనాయకమ్మ.(1983). ‘యజ్ఞం’ కథ మీద రెండు వ్యాసాలు, స్వీట్ హోమ్ పబ్లికేషన్స్, విజయవాడ.
- రామారావు కాళీపట్నం.(1971). యజ్ఞం కథా సంపుటి, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ.
- రామారావు కాళీపట్నం.(1999). కాళీపట్నం రామారావు రచనలు, మనసు ఫౌండేషన్, బెంగళూర్.
- వెల్చేరు నారాయణరావు.(1986). కాళీపట్నం రామారావు కథలు రెండోసారి చదవడానికిముందు... కారా కథలు ముందుమాట విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.