headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-12 | November 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

7. స్వాతంత్ర్యానికి పూర్వం వెలువడిన రచయిత్రుల కథలు: సూక్ష్మపరిశీలన

డా. ఆగపాటి రాజ్ కుమార్

అసిస్టెంట్ ప్రొఫెసర్ (పి), తెలుగుశాఖ
కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్,
హనుమకొండ, తెలంగాణ.
సెల్: +91 8309706806, Email: agapatirajkumar6@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 19.10.2024        ఎంపిక (D.O.A): 30.10.2024        ప్రచురణ (D.O.P): 01.11.2024


వ్యాససంగ్రహం:

సమాజం మేలుని కోరేది సాహిత్యం. సమాజానికి సాహిత్యానికి అవినాభవ సంబంధం ఉందని, సాహిత్యం సమాజానికి అద్దం పడుతుంది. ఈ క్రమంలో స్వాతంత్య్రానికి పూర్వమే సమాజ శ్రేయస్సును కాంక్షిస్తూ సమకాలీన సామాజిక సందర్భం నుండి కథలు రాసిన రచయిత్రులు బండారు అచ్చమాంబ, నందగిరి ఇందిరాదేవి, ఎల్లా ప్రగడ సీతాకుమారి, సుసర్ల లక్ష్మీనరసమాంబలు రచించిన కథలను పరిశీలించి పరిశోధనాత్మకంగా విశ్లేషించడం ఈవ్యాసం ప్రధానోద్దేశం. తొలితరం కథా రచయిత్రులుగా సమాజంలో నెలకొన్న సామాజిక, రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక సమస్యలతోపాటు స్వాతంత్య్రానికి పూర్వం స్త్రీల స్థితిగతులను వీరు కథల్లో చిత్రికపట్టిన తీరును గమనించి పరిశోధనాత్మకంగా వింగడిరచి ఆనాడే వారు అందిపుచ్చుకున్న స్పృహను నేటి సమాజానికి తెలియపరచడమే ఈ వ్యాస లక్ష్యం. ఈ పరిశోధనా విషయసామాగ్రి డా. పంతంగి వెంకటేశ్వర్లు సంపాదకత్వంలో వెలువడిన తెలంగాణ తెలుగు కథ గ్రంథం, ఆచార్య కాత్యాయనీ విద్మహే రచించిన సాహిత్య ఆకాశంలో సగం గ్రంథం, డా. వెల్దండి శ్రీధర్‌ సంపాదకత్వంలో వెలువడిన తెలుగు కథ ప్రాంతీయతత్వం గ్రంథం, భూమిక తెలుగు మాసపత్రిక-2018 మార్చి. వీటిని అధ్యయనం చేసి ఈ పరిశోధనాత్మక వ్యాసానికి కావాల్సిన విషయాన్ని సేకరించాను.

Keywords: స్త్రీలు, సమాజం, విద్య, చైతన్యం, జీవన వైవిద్యం, అత్తాకోడళ్ళు, స్త్రీ స్వేచ్ఛ.

0. ఉపోద్ఘాతం:

2001 జూలై 13న ఆంధ్రజ్యోతి పత్రిక వివిధ సాహిత్య వేదికకు రాసిన వ్యాసంలో డా॥ముదిగంటి సుజాతరెడ్డి ‘తెలంగాణ నుంచే తొలి కథానిక’ అని చెబుతూ బండారు అచ్చమాంబ 1898 నుంచీ కథ రచనారంభం చేశారని ఆమె రాసిన ‘ప్రేమ పరీక్షణము’, ‘ఎరువు సొమ్ము  పఱువు చేటు’  కథలు రాయసం వేంకట శివుడు గారు నిర్వహించిన ‘తెలుగు జనానా’ పత్రికలో అచ్చయ్యాయని తెలిపారు. 1901 నుంచి 1904 వరకు సేకరించిన అచ్చమాంబ పది కథలను సాహిత్య పరిశోధకుడు సంగిశెట్టి శ్రీనివాస్ ప్రచురించినారు.

తెలంగాణ కథా సాహిత్యంలోనే కాదు సమస్త తెలుగు కథాచరిత్రలోనూ మొట్ట మొదటి రచయిత్రి బండారు అచ్చమాంబ. ఈమె నైజాం సరిహదుద్దలో గల కృష్ణా జిల్లా నందిగామ గ్రామంలో కొమర్రాజు వెంకటప్పయ పంతులు- గంగమ్మ దంపతులకు అచ్చమాంబ జన్మించారు. సోదరుడు కొమర్రాజు లక్ష్మణరావు. అచ్చమాంబ తన ఆరేళ్ళ వయస్సులో తండ్రి మరణాంతరం తల్లితో, సోదరుడితో తన సవితి సోదరుడైన కొమర్రాజు శంకరావు ఉంటున్న తెలంగాణ ప్రాంతంలోని నల్గొండ జిల్లా దేవరకొండ గ్రామానికి 1880లో వెళ్ళింది. అచ్చమాంబకు ఎనిమిది సంవత్సరాల వయస్సున్నప్పుడు 1882లో తన మేనమామ బండారు మాధవరావుతో వివాహం జరిగింది. ఈమె రాసిన పది కథలలో ‘ధనత్రయోదశి’, స్త్రీ విద్య ఈ రెండు కథలు 1902లో ప్రచురించబడ్డాయి. ఈ రెండు కథలతో పాటు, 1909 సెప్టెంబర్లో వరంగల్లో జన్మించిన నందగిరి ఇందిరాదేవి రచించిన కథలలో ముఖ్యమైన కథ ‘పందెం’ ఇది 1941లో గృమలక్ష్మి పత్రికలో అచ్చయింది. దీంతో పాటు ఎల్లాప్రగడ సీతాకుమారి రచించిన ‘ఈ రాధేనా’ కథ జూలై 1938 నాటి భారతి పత్రికలో ప్రచురింపబడిరది. అదేవిధంగా సుసర్ల లక్ష్మీనరసమాంబ రచించిన రెండు కథలు 1. అత్త కోడళ్ళు కథ ఇది. 1931వ సంవత్సరం జూలైలో గృహలక్ష్మిలో ప్రచురించబడిరది. 2. రాజాపెళ్ళి ఈ కథ 1933, డిసెంబర్లో గృహలక్ష్మి పత్రికలో ప్రచురించబడిరది. మొత్తంగా నాటి సమాజంలోని స్త్రీలను విద్యార్జనకై ప్రోత్సహించి స్త్రీలను చైతన్యపరిచిన ఈ ఆరు కథలను పరిశోధనాత్మకంగా వివరించడమే ఈ వ్యాస ముఖ్యోద్ధేశం.

నాటికాలంలో విద్యావంతులైన స్త్రీలు సమాజపు కట్టుబాట్లను, పతివ్రతా ధర్మాలను చాటా చెప్పే వృత్తంతాలను తీసికొని రచనలు చేశారు. కానీ అచ్చమాంబ అభ్యుదయ మార్గంలో ఆలోచించి ప్రాచీనమైన సతీ ధర్మాలతో పాటు నవీన పాశ్చాత్య విద్యా సంస్కారాలను కలబోసి ఒక నూతనమైన పద్ధతిలో రచనా వ్యాసంగాన్ని ఆరంభించినారు. అచ్చమాంబ జీవిత చరిత్ర రచించిన పులుగుర్తి లక్ష్మీనరసమాంబ అచ్చమాంబలను ఒక ఆదర్శ మహిళగా అభివర్ణించడంలో ఈ విషయం తెలుస్తుంది. అచ్చమాంబ 1901లో రచించిన ‘‘అబలా సచ్ఛరిత్ర’’ అన్న గ్రంథంలో ప్రసిద్ధ స్త్రీల కీర్తి ప్రతిష్టలను ఇనుమడిరపజేశారు. ప్రప్రథమంగా తెలుగు భాషలో స్త్రీల చరిత్రను రచించిన వారుగా గణతికెక్కారు. ఆమెలో గల నిర్మొహమాటం, సూటిదనం, జాతీయతాగుణం ఈ గ్రంథం ద్వారా ప్రదర్శితమౌతుంది.’’1 1902లో ఆమె రాసిన కథలు ధనత్రయోదశి, స్త్రీవిద్య ప్రచురించబడ్డాయి.

1. భండారు అచ్చమాంబ కథలు:

సంస్కరణోద్యమం ప్రధానంగా సంబోధించి స్త్రీ సమస్యపై ఆంధ్రదేశంలో వీరేశలింగం పంతులు చేసిన విశేష కృషి ఫలితంగా స్త్రీలు విద్యావంతులు కావటం, సంఘాలు పెట్టుకోవటం, తోటి స్త్రీలను విద్యార్జనకై ప్రోత్సహించటం 1900 నాటికి సాధ్యమైంది. అలా తయారైన మొదటి తరం స్త్రీలలో భండారు అచ్చమాంబ ఒకరు. తాను విద్యావంతురాలై బృందావనపు స్త్రీల సమాజాన్ని ఏర్పరచి విద్యార్జనకై స్త్రీలను ప్రోత్సాహపరిచే కార్యాచరణలో భాగంగా భండారు అచ్చమాంబ కథా సృజనకు పూనుకొన్నది.

1.1. స్త్రీ ఆత్మ విశ్వాసానికి ప్రతీక - ధనత్రయోదశి కథ:

‘ధనత్రయోదశి’ కథలో పాత్రలు, సంఘనటలు, సన్నివేశాలు, సంభాషణల రూపంగా కథనం సాగింది. కథ జరిగిన చోటు బొంబాయి నగరం. ప్రధాన పాత్రలు భార్య భర్తలైన వేంకటరత్నము, విజయలక్ష్మి, గుమాస్తా, రుక్మిణి, రాముడు, వెంటకసెట్టి ఇతర పాత్రలుగా వుండి కథా గమనానికి ఉపకరిస్తాయి.

ధనత్రయోదశి పండుగ ఉత్తర హిందుస్థానంలో ప్రాచుర్యంలో వుంది. ఇది నరక చతుర్ధశి ముందురోజు జరుపుకునే పండుగ. వెంకటరత్నమునకు, వెంకట సెట్టి అతని ముసలి గుమాస్తా కృష్ణమూర్తి పరీక్ష పెడతారు. డబ్బులు కాజేయటానికి వేంటకరత్నానికి అవకాశం లభించేలా చేస్తారు. నూరు రూపాయల నోటు తీసి ముసలి గుమాస్తా సెట్టికి తెలియకుండా తీసుకొమ్మని పండుగ ఖర్చులకు ఉపయోగపడతాయని వెంకటరత్నము జేబులో పెడ్తాడు. వెంకట రత్నము అంతరాత్మ కొంతసేపు తడబాటుపడ్డా ఏం ఆలోచించకుండా సరాసరి ఇంటికి వెళతాడు. అతని భార్య విజయలక్ష్మి మాత్రం ఆ నూరు రూపాయలు ఎక్కడివి, న్యాయంగా సంపాదించినవి కావు. దొంగ సొమ్ము నేనూ, పిల్లలం తినలేము అని  కోపగిస్తుంది. భార్య ఆవేదన, కోపం చూసి వెంకటరత్నము తెల్లవారిపోయి నూరు రూపాయల నోటును ముసలి గుమాస్తా ముందు విసిరేస్తాడు. అప్పుడే వేంకట సెట్టి అక్కడికి వచ్చి వేంకటరత్నమును పరీక్షలో నెగ్గావు అని మెచ్చుకొని జీతం పెంచుతాడు. విజయలక్ష్మి నిజాయితీ మెచ్చుకొని తన కూతురుగా చూసుకుంటాడు.

ఈ కథలో అత్యాశలేని, స్వయంకృషి మీద విశ్వాసం కలవారుగా వేంకటరత్నము, విజయ లక్ష్మి పాత్రలు చిత్రింపబడినాయి. వాళ్ళు దారిద్య్రంలో వున్నా ఉదాత్తగుణాలను విడువలేదని రచయిత్రి చిత్రించింది. ‘‘కష్టపడి సంపాదించుకొనిన పది రూపాయాలను సుఖముగా దినటుల నీ దొంగసొమ్మును దినగలమా, దానిని మనము ముట్టినపుడెల్ల నిదీ మీరు విశ్వాసదోసము వలనే సంపాదించి తినుమన్నదని మనసు చెప్పుచుండదా? నాకీ దరిద్రములో గలుగుచున్న పరమానందమిక దొరక జాలదు గదా!’’ అని విజయలక్ష్మి పాత్ర తన వివేకంతో భర్తను అవినీతి పనులకు దిగకుండా హెచ్చరించటం ద్వారా అచ్చమాంబ స్త్రీ ఆత్మ విశ్వాసాన్ని, ఔన్నత్యాన్ని చాటినట్లయింది.

2.2. స్త్రీలను విద్యార్జనకై ప్రోత్సహించిన కథ స్త్రీ విద్య:

‘స్త్రీ విద్య’ కథ భార్యాభర్తల మధ్య జరిగే సంవాద రూపంలో ఉంది. ఈ కథలో భార్యగా, తల్లిగా, స్త్రీకి విద్య ఎంత అవసరమో చెప్పబడిరది. శాస్త్రాలల్లో స్త్రీలు చదువుకోకూడదని వున్నదన్న మాటను ఖండిస్తూ భర్త స్త్రీలు అజ్ఞానాంధకారంలో వున్నట్లయితే మూఢత్వంలో వుండిపోతారని అంటారు. అచ్చమాంబ భర్తపాత్ర చేత స్త్రీ విద్య ప్రాశస్త్యాన్ని చెప్పిస్తుంది. సాధారణమైన ప్రయోజనాలతో పాటు భర్త చెప్పిన కారణాలు నీకే చదువు వచ్చియుండిన శాస్త్రములలో నేను వ్రాసియున్నది నీవే చదివి తెలిసికొన జాలియుందువు నేను ఇదివరకు జదివిన శాస్త్రములలో ఎక్కడను స్త్రీలు చదువగూడదనిన మాట లేదు. బహుశా యే శాస్త్రములోను నిట్టి సంగతి యుండదని నా తాత్పర్యము’’. సంభాషణాత్మకంగా సాగిన ఈ కథకు వస్తువు ప్రత్యేక్షంగా వీరేశలింగం గారి స్త్రీ విద్యా ఉద్యమమే. వీరేశలింగం 1885లో స్త్రీ విద్యపై రాసిన ఒక వ్యాసంలో స్త్రీ విద్యా ప్రయోజనాలుగా పేర్కొనబడిన వాటిలో ఒకటి - స్త్రీ విద్యావంతురాలయితే ఉద్యోగ నిమిత్తం పొరుగూరు వెళ్ళిన భర్తకు స్వతంత్రంగా ఉత్తరం వ్రాయగలగటం. ఎవరి సహయం లేకుండానే ఆయన వ్రాసిన ఉత్తరాన్ని చదువుకోగలగటం స్త్రీ విద్య కథాంశం. అచ్చంగా ఇదే. ఉద్యోగ నిమిత్తం దూర ప్రాంతాలకు పోతూ తనకు ఉత్తరం రాసేందుకు తాను రాసే ఉత్తరాలు చదువుకొనేందుకు భార్య చదువు నేర్చుకొనవలసిన అవసరం ఎంత వుందో ఒక భర్త ఆమెకు నచ్చచెప్పి ఒప్పించటం ఈ కథలోని విషయం. ఈ కథలో రచయిత ఒక ఊహను కూడా కథాంశంలో భాగంగా చిత్రించారు. చదువు నేర్చిన తర్వాత తన భార్య లేఖ రాయడం, తాను దాన్ని చదవడం, పిల్లలను కూర్చుండ బెట్టుకుని ఆమె వారికి చదువు చెప్పడం. ఈ దృశ్యాన్ని భర్త ఊహించుకుని చెబుతాడు. ఇందులోనే భార్యభర్తల సంబంధం గురించి చెప్పిన ఒక వాక్యం ఆసక్తికరంగా ఉంటుంది. ‘పరస్పరానురాగముల మనబోటి భార్య భర్తలొండొరులు ప్రేమ పూర్వకముగా జేయునే కార్యమేని నితరులకది యల్పముగా దోచినను వారిలో వారికదీ యొక యమూల్యముగా దోచక మానదు  అట్లా స్త్రీలకు విద్య అవసరమన్న విషయాన్ని అచ్చమాంబ అనేక కోణాల నుంచి భార్యభర్తల సంవాద రూపంగా సరసంగా చర్చించింది. రెండు పాత్రల మధ్య సంభాషణ రూపంగా కథనం సాగింది. గ్రాంథిక భాషలో వున్నా అచ్చమాంబ కథల్లో వున్నది సరళ గ్రాంథికమే.

2. నందగిరి ఇందిరాదేవి:

ప్రముఖ సంఘసేవకుడు వడ్లకొండ నరసింహరావు గారి కుమార్తె నందగిరి ఇందిరాదేవి. నారాయణ గూడలోని మాడపాటి హనుమంతరావు ఉన్నత పాఠశాల వ్యవస్థాపకుల్లో  వీరు ఒకరు. తెలంగాణలో స్త్రీ విద్యాభివృద్ధికి పాటుపడిన వాళ్ళలో వీరు ప్రథములు. తన కుమార్తె ఇందిరాదేవిని బి.ఏ. వరకు చదివించారు. తర్వాత నందగిరి వెంకటరావుతో ఇందిరాదేవికి వివాహం జరిగింది. ఆకాశవాణిలో మొట్ట మొదట ప్రసంగించిన రచయిత్రి ఇందిరాదేవి.

2.1. బరువైన జీవిత సత్యాన్ని ఉపదేశించే కథ - పందెం:

ఇందిరాదేవి కథల్లో ముఖ్యమైంది ‘‘పందెం’’ ఈ కథ ఒక బరువైన జీవిత సత్యాన్ని ఉపదేశిస్తుంది. సేటు రాజారాం, అతని స్నేహితుల మధ్య సాగిన సంభాషణ కథా గమనానికి నాంది పలుకుతుంది. సంభాషణలలో ‘యావజ్జీవ శిక్ష’ గూర్చిన ప్రస్తావన చాలా దూరం పొడిగింపబడి సేటు రాజారాం, మిత్రుడు నరోత్తందాసుల పందెంగా మారింది. నరోత్తందాసు ఏకాంతంగా, బయటి ప్రపంచంలో ఏమాత్రం సంబంధం లేకుండా పదేళ్ళపాటు గడపాలి. శిక్ష ముగిసిన తర్వాత నరోత్తం దాసుకు సేటు రెండు లక్షలు చెల్లించాలి. ఇదీ పందెం ఒప్పందం. కాకతాళీయంగా జరిగిన వీరి సంభాషణ కట్టుదిట్టమైన పందెంగా మారటం అనేది ఆశ్చర్యంతో పాటు ఆసక్తిని కలిగిస్తుంది. సేటు మిత్రుని భోజన పానీయాదులతో పాటు అతనికి కావాలసిన వస్తువులన్నిటిని సమకూర్చుతాడు.

మొదటి రెండు మూడు సంవత్సరాలు చాలా విచారంగా విసుగ్గా కాలం గడిపిన మిత్రుడు తర్వాత పుస్తకాభిమానిగా మారిపోతాడు. రాత్రింబవళ్ళు అనేక పుస్తకాలు చదువుతాడు. అవలీలగా పదేళ్ళలలో పది భాషలు నేర్చుకొంటాడు. ఇకా మరుసటి రోజయితే పదేళ్ళు నిండుతాయి. ఆర్థిక స్థోమత బాగా లేక సేటు రెండు లక్షలు చెల్లించే స్థితిలో లేడు. కాని శిక్షననుభవిస్తున్న ఒక తెల్ల కాగితంలో ఈ విధంగా రాసి నిర్ణీతకాలంకంటే ముందుగానే తమ ఒప్పందాన్ని కొట్టివేసి వెళ్ళిపోతాడు. అందులో ప్రపంచం అంతా పెద్దవాళ్లన్నట్టు మిధ్య. ఈ స్వేచ్ఛ, ఈ జీవితం బుద్భుద ప్రాయాలు. ప్రపంచం పై మెరుగులతో నిండి ఉంది. ఇట్లాంటి బూటకపు ప్రపంచంలో జీవించడం నాకిష్టం లేదు. ఐహిక సుఖాలన్నీ పుస్తకాలతోనే అనుభవించాను.

జ్ఞానాన్ని సముపార్జించాను. ప్రపంచం అబద్దాన్ని నిజమంటుంది. ఇట్లాంటి లోకమే స్వర్గం అంటుంది. కాని ఇదంతా భ్రమ, ఈ ప్రపంచం మీద విసుగు పుట్టింది. పదేళ్ళ కిందట రెండు లక్షల ఆస్తి అంటే ఎన్నో కలలు కన్నాను. అనుభవించినట్లే ఆనందించాను. కానీ అవి ఇపుడు నాకు అవసరం లేదు’’ అని రాసి ఉంటుంది.

వ్యాపారానికే కాదు మానసిక వ్యాపారానికి కూడా పనికి వచ్చే జూద వస్తువుగా డబ్బును పరిగణించే రాజారాం సేటు పది సంవత్సరాల పాటు ఖైదు (గృహనిర్భంధం)లో రెండు లక్షలిస్తాననే సరికి నరోత్తందాసు నిర్భంధంలోకి వెళ్ళిపోతాడు. మొదటి సంవత్సరం తీవ్రమైన మానసిక హింసకు లోనైనా పుస్తక పఠనం అతన్ని కాపాడుతుంది. గడువు పూర్తయిన తర్వాత వ్యాపారం దెబ్బతిన్న కారణంగా అంత డబ్బు ఇచ్చే స్థితిలో లేని రాజారాం సేటు గదిలో నిర్భంధంలో వున్న మిత్రుణ్ణి చంప బూనుకుంటాడు.

అయితే ఈ నిర్భంధంలో తాను ఈ ప్రపంచం, స్వేచ్ఛ జీవితం బుద్బుద ప్రాయాలని తేలుకున్నట్లు, గడువుకు ముందే వెళ్ళిపోతున్నట్లు ఉత్తరం రాసి నరోత్తందాసు వెళ్ళిపోతాడు. పుస్తకాల ద్వారా మానసిక స్వేచ్చను అనుభవించి, డబ్బు విషయంలో పరిణతని సాధించి, జీవితంలో బతకటానికి డబ్బును మించిన విలువలున్నాయని తెలుసుకోవటం ఓటమిలో గెలుపు. డబ్బుతో వ్యక్తి మానసిక స్వేచ్ఛను నిర్భంధించలేమన్న సత్యాన్ని తెలుసుకోలేకపోవటం గెలుపులో ఓటమి. దీంతో అంతకాలంగా నిజంగా నిర్భంధంలో ఉన్నదెవరో తెలిపోయింది.2

ఆసక్తికరమైన కథాకథనమైన శైలితో ఇందిరాదేవి ఈ కధలో అత్యంత ఉత్కంఠంను రేకత్తించారు. కథాంశంలో జీవన వైరాగ్యాన్ని వెల్లడిరచారు.‘‘బ్రహ్మ సత్యమ్ జగనిధ్యా’’ అన్నది ఆది శంకరుల అద్వైత్వాన్ని అనుసరించారు. ఆధ్యాత్మిక మార్గాన్ని ఉపదేశించారు.  సాంఫీుక పరమైన విషయంతో ఒక బరువైన జీవిత సత్యాన్ని అభివ్యక్తీకరించటంలో రచయిత్రి అత్యంత నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఎత్తుగడ ముగింపులతో చక్కని పొందికను కనబరిచారు.

3. ఎల్లా ప్రగడ సీతాకుమారి:

ఈమె నిజామాంధ్ర మహసభలలో చురుకుగా పాల్గొన్నారు. ఆంధ్ర మహిళ సభలను నిర్వహించారు. మూడవ, పదకొండవ ఆంధ్ర మహిళ సభకు అధ్యక్షతా స్థానాన్ని వహించారు. స్త్రీ విద్యా వ్యాప్తి, బాల్య వివాహల నిర్మూలన స్త్రీలకు ఆర్థిక స్వాలంబన, మతతత్వం పట్ల అవగాహన, సోమరితనాన్ని త్యజించటం, స్త్రీల ఆరోగ్య పరిరక్షన, గోషా పద్ధతికి స్వస్తి పలకటం, మూఢ నమ్మకాలను వదిలివేయటం వంటి అంశాలు ఆమె ఉపన్యాసాలలో వుండేవి.

సీతా కుమారి సాంఘిక, రాజకీయ, సారస్వత రంగాలలో విశేషంగా కృషి చేశారు. స్త్రీల కోసం ఆంధ్ర సోదరీ సమాజం స్థాపించారు. ఇదే తర్వాతి కాలంలో ‘ఆంధ్ర యువతీ మండలి’గా రూపుదిద్దుకొంది. ప్రత్యేకంగా తెలంగాణ మహిళ సమితిని కూడా నడిపారు. 1957లో ఆమె బాన్సువాడ నుంచి పోటి లేకుండా రాష్ట్ర శాసన సభా సభ్యులుగా ఎన్నికైనారు. సీతాకుమారి రచనలు గృహలక్ష్మి, భారతి, ఆంధ్ర పత్రిక వంటి పత్రికలలో ప్రచురితమైనాయి. సామాజిక స్పృహతో ఆమె రచించిన కథలు ప్రగతి భావాలను వెల్లడిస్తాయి. ఆమె రచనాశైలి సరళంగా, చక్కని సంభాషణలతో అక్కడక్కడా తెలంగాణ నుడికారంతో కన్పిస్తుంది.

3.1. స్త్రీ ఆలోచన శక్తికి నిదర్శనం - ఈ రాధేనా? కథ.

సీతాకుమారి రచించిన ‘‘ఈ రాధేనా? కథ జూలై 1938 నాటి భారతి పత్రికలో ప్రచురించబడిరది. రాధను తల్లిదండ్రులు ఒక ముసలి వానికిచ్చి పెండ్లి చేయబోతుంటే ఇంటి నుంచి పారిపోతుంది. అపుడు ఒక రైలుబండిలో రాజా పరిచయం కావటం, క్రమక్రమంగా వారిద్దరి అభిప్రాయాలు, అభిరుచులు, భావాలు కలవటం జరుగుతుంది. వారిద్దరు పెండ్లి చేసుకొనే సందర్భంలో రాజాకు రాధ తన మేనమామ కూతురని తెలుస్తుంది. ఈ కథకిదీ కొసమెరుపు.

అత్యంత నాటకీయ ఫక్కీలో సాగిన ఈ కథలో రాధ తీసుకున్న దృఢమైన నిర్ణయం ఆమె జీవితాన్ని సరిjైున క్రమంలో పెట్టగలిగింది. రచయిత్రి రాధ గుణాలను వివరిస్తూ ఆమె మాటల్లోనూ, నడతల్లోనూ ఎక్కువ అనురాగము, పరిపూర్నమైన జాగ్రత్త, సూక్ష్మమైన విధేయతా తొణికిసలాడుతూ కన్పించేది’’ అంటారు. ఈ కథ స్త్రీ సహజమైన భావోద్వేగాలను వెల్లడిస్తుంది. స్త్రీ ఆలోచనా శక్తిని, సంఘర్షణగా విస్తృతిని, నిరూపిస్తుంది. పాత్ర మనోగత భావాలు పరిపరి విధాలుగా సంచరించినా, ఒక క్రమబద్ధమైన జీవితానుగమనం వైపు నడిపిస్తుంది. స్త్రీలు సాధ్యా సాధ్యాలు ఆలోచించి సరిjైున నిర్ణయాన్ని వ్యక్తపరచే సామార్థ్యాన్ని కలిగి వుండాలని ఈ రాధేనా? కథ, బోధించింది.

4. సుసర్ల లక్ష్మీ నరసమాంబ:

స్వాతంత్య్రానికి పూర్వం సుసర్ల లక్ష్మీమాంబ రచించిన అయిదు కథలు లభిస్తున్నాయి. అందులో రెండు కథలను పరిశోధనాత్మకంగా తెలియజేస్తాను.

4.1. 1930 నాటా ఆచార వ్యవహరాలకు అద్దంపట్టే అత్తలు కోడళ్లు కథ.

అత్తలు కోడళ్ళు కథ 1931వ సంవత్సరం జూలై నెల ‘గృహలక్ష్మి’ పత్రికలో ప్రచురించబడిరది. సంభాషణ రూపంలో సాగిన ఇద్దరు అత్తలు ఇద్దరు కోడళ్ళకు సంబంధించిన కథ ఇది. ఈ కథలో సీతమ్మ, కామాక్షమ్మలవి అత్తగార్ల పాత్రలు. సుశీల, కళ్యాణిలు వాళ్ళ కోడళ్ళు. లక్ష్మీ నరసమాంబ ఈ కథలో ఇతివృత్తంగా తీసుకున్నది. అత్తా కోడళ్ళ సమస్యల గురించి. 1930 ప్రాంతంలో అత్తలు కోడళ్ళను హింసించడం అనే సమస్యపై చాలామంది రచయిత్రులు కథలు రాశారు. ఈ సమస్య కేవలం 1930 ప్రాంతానికి సంబంధించిందే కాదు. ఇప్పటికీ ఈ కాలంలో కూడా కనిపిస్తుంది. ఆ రోజుల్లో అత్తగారు కోడళ్ళపై పెత్తనం చెలాయించడం, కోడలిని బానిసలాగా చూడటం, ఇంటి పని అంతా కోడలితో చేయించడం, కోడలి మీద ఉన్నవి, లేనివి కల్పిస్తూ కొడుకుకూ చెప్పడం, కొడుకుతో తిట్టించడం, కొట్టించడం సర్వసాధారణంగా జరిగేది. ఇవన్ని శృతిమించి ఆ కోడలు ఈ భాధల్ని తట్టుకోలేక చనిపోయినా, చంపబడిన అత్తగారు యధేచ్ఛగా తమ పుత్రరత్నాలకు బాహటంగా మరో వివాహం కూడా చేసేవారు. ఈ విషయాలన్నీ ఆధారంగా చేసికొని రచించబడ్డదే ఈ కథ.

కార్తీక పూర్ణిమనాడు శివలయానికి వెళ్తున్న సీతమ్మ, కామాక్షమ్మ ఇద్దరు త్రోవ పొడుగున తమ కోడళ్ళ వల్ల తాము పడే బాధలను చెప్పుకుంటారు. అదే సమయంలో వారి కోడళ్ళిద్దరూ సుశీల, కళ్యాణి కూడా ఇంటి గోడ దగ్గర చేరి తమను పెట్టే బాధలను గురించి ఒకరికొకరు చెప్పుకుంటారు.

ఈ కథలో అత్తగార్ల, కోఢళ్ళ సంభాషణలో అనేక విషయాలు చర్చలోకి వస్తాయి. కామాక్షమ్మ తన కోడలు గుడికి వస్తానంటే వద్దంటుంది. తన కోడలు గుడికి వస్తే ఇంట్లో వంటపని ఎవరు చేస్తారన్నది. ఆమె భయం. సీతమ్మ కూడా ఇంటిపని  అంతా కోడలికే చెపుతుంది. అత్తకు ఒక్క పని కూడా చెప్పకుండా చేసుకుంటుంది సుశీల.

ఇంటి పని అంతా స్త్రీలదే. స్త్రీ భార్య స్థానంలో కానీ భార్య స్థానం నుండి అత్తగారి స్థానంలోకి రాగానే తమ పని అంతా కోడళ్ళకు అప్పగించడం, కోడళ్ళు ఎలా పని చేసినా మంచిగా చేయలేదని వేధించడం అత్తలకు హక్కు అయింది. అంతవరకు ఇంటిల్లిపాదీకి చాకిరి చేసిన స్త్రీ అత్త కావటంతో ఇంటి యాజమాన్యం సంగతేమో కానీ ఇంట్లో కోడలిపై మాత్రం యజమానురాలిని అని నమ్మి ప్రవర్తిస్తుంది. అధికారం చెలాయిస్తుంది. కోడలు అంటే అత్త దృష్టిలో బానిస. తానేమన్నా పడి వుండాల్సిన బానిస. తానేం చెప్పినా చేయవలసినా సేవకురాలు.

ఈ కథలో కూడా సీతమ్మ, కామాక్షమ్మల దృష్టిలో కోడళ్ళు చేయాల్సిన పనులు ఇంటి పని అంతా అంటే పిల్లల పెంపకం, వంటపని. ఈ పని అంతా కూడా తాము ఏర్పరచుకున్న ఒక కోణం నుండే జరగాలి. కామాక్షమ్మకు కోడలు వంట పని చేయాలి. ఆ వంట చేయడం కూడా తనకు నచ్చేలాగా చేయాలి. ఇంటి పనుల విషయంలో అత్తల ఆలోచనా విధానం ఒక లాగా ఉంటే కోడళ్ళ ఆలోచనా విధానం మరోలాగా ఉండటం వలన కూడా వారి అభిప్రాయాలు కలవకపోవడం వలన తరచుగొడవలు వస్తుంటాయి.

ఈ కథలో కామక్షమ్మ తన కోడలు కళ్యాణి ఇంగ్లీష్, హిందీ కూడా మాట్లాడుతుంది. అని చెప్పడం, సీతమ్మ తన కోడలు సుశీల నూలు వడుకుతుందని, మీటింగులకు వెళుతుందని, పికెటింగులకు వెళుతుందని, పత్రికలు చదువుతుందని చెప్పడం ద్వారా 1930 నాటి రాజకీయ పరిస్థితులను రచయిత్రి చక్కగా వివరించినారు. 1835లో ఆంగ్లేయులు ఆంగ్ల విద్యను  ప్రవేశపెట్టడంతో తెలుగు నేలలో స్త్రీలు కూడా ఆంగ్ల విద్యను నేర్చుకున్నారు. ఈ కథలో కామాక్షమ్మ తన కోడలుకు ఇంగ్లీష్ వచ్చని, ఆమె తన అన్నతో ఇంగ్లీష్లో మాట్లాడిరది. అని చెప్పడం ద్వారా కళ్యాణి ఇంగ్లీష్ నేర్చుకుందని తెలుస్తుంది.

భారతీయులు వివిధ భాషలు మాట్లాడటం వల్ల ఒకరి భావాలు మరొకరు గ్రహించటం కష్ట సాధ్యమని జాతీయ సమైక్యతకు, దేశ పురోభివృద్ధికి పెద్ద ప్రతిబంధకమని భావించి దేశీయ నాయకులు సమస్త ప్రజానీకానికి సులభసాధ్యమైన భాష, అన్ని ప్రాంతాలలోను ఎక్కువ వాడుక భాష హిందుస్తానీ భాష అని భావించి హిందీ భాష హిందుస్తాన్ భాషకు సంబంధం కలిగి ఉండటం చేత సులభంగా నేర్చవచ్చుననే ఉద్దేశంతో హిందీ భాషను జాతీయ భాషగా నిర్ణయించారు.3 అప్పటి నుండి హిందీ భాషా ప్రచారం జరిగింది. తెలుగు నెలలో హిందీ భాషా ప్రచారం జరిగి ఎంతో మంది స్త్రీలు హిందీని నేర్చుకున్నారు. దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఎంతోమంది యువతులకు హిందీ నేర్పించింది. స్వయంగా తన తల్లికి కూడా హిందీ నేర్పించింది.4 ఈ కథలో కూడా కామాక్షమ్మ తన కోడలు కళ్యాణి హిందీ చక్కగా మాట్లాడుతుందని చెప్పడం ద్వారా హిందీ భాష ఎంత ప్రచారం పొందిందో సుసర్ల లక్ష్మీనరసమాంబ తెలియజేసింది.

గాంధీజీ ప్రభావంతో మహిళలలో చైతన్యం రగిలింది. గాంధీజీ ప్రోత్సాహంతో స్త్రీలు స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ కథలో సుశీల మీటింగులకు వెళ్ళినట్లు రచయిత్రి తెలియజేసింది. గాంధీజీ ఖద్దరు వస్త్రధారణలో భాగంగా నూలు వడకమని విదేశీ వస్త్రాలను బహిష్కరించమని పిలుపునిస్తే స్త్రీలు నూలు వడకడం, ఖద్దరు ధఱించడం ప్రారంభిస్తారు. విదేశీ వస్త్రాలను గుట్టలుగా పోసి తగులబెట్టారు. ఈ కథలో సీతమ్మ కోడలు సుశీల నూలు వడికినట్లుగా సీతమ్మ, కామాక్షమ్మ సంభాషణల ద్వారా తెలియజేసింది. జాతీయోద్యమంలో భాగంగా ఆనాటి స్త్రీలు పత్రికలను చదివేవారు. పత్రికలు చదవడం ద్వారా నాటి రాజకీయ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకొని మరింత ఉత్సాహంతో ఉద్యమంలో పాల్గొనేవారు. ఈ కథలో కూడా సుశీల పత్రికలను చదివేదని రచయిత్రి తెలిపింది. ఈ కథలో అత్తగార్ల, కోడళ్ళ సంభాషణల ద్వారా 1930 నాటి ఆచార వ్యవహరాలు, సామాజిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులను రచయిత్రి చక్కగా వివరించింది.

4.2. లక్ష్మీ నరసమాంబ సంఘసంస్కరణ దృష్టికి నిదర్శనం - రాజా పెళ్ళి కథ.

‘‘కందుకూరి వీరేశలింగం పంతులు, కొమర్రాజు లక్ష్మణరావు, బండారు అచ్చమాంబ, ఉన్నవ లక్ష్మీనారాయణ మున్నగు వారి సంఘ సంస్కరణ దృష్టిని లక్ష్మీ నరసమాంబ పుణికి పుచ్చుకుంది అని తెలియజేసే కథ ‘‘రాజా పెళ్ళి’’. ఈ కథ 1933వ సంవత్సరం డిసెంబర్ నెలలో గృహలక్ష్మి పత్రికలో ప్రచురించబడిరది.

రాజా అని ముద్దుగా పిలువబడే రాజ రాజేశ్వరి తల్లిదండ్రులకు ఆరవ సంతానం. ఆ అమ్మాయిని రాజా అని పిలవడమే అందరికీ ఇష్టం. రాజా చిన్నప్పుడే వివాహం చేశారు. కాని ఆమె పసుపు పారాణి ఆరకముందే ఆమె భర్త మరణిస్తాడు. దానితో రాజా, రాజా తల్లిదండ్రులు పుట్టెడు దుఃఖంలో మునిగిపోతారు. కొంతకాలం తర్వాత రాజా ఎలాగైనా మళ్ళీ పెళ్ళి చేస్తానన్న రాజా తండ్రి ఆ శపథం నెరవేర్చక ముందే మరణిస్తాడు. దాంతో మళ్ళీ ఇంటిల్లిపాది శోక సముద్రంలో మునిగిపోతారు. రాజా కోలుకోకుండా అయిపోతుంది. రాజా తల్లి మాత్రం తన భర్త మాటలను గుర్తుకు తెచ్చుకొని ఎలాగైనా తన కూతురికి మళ్ళీ పెళ్ళి చేయాలని నిశ్చయించుకొని ఆ ధైర్యంతోనే జీవిస్తుంది. అదే విషయం తన బంధువులకు తెలియజేస్తుంది. కొంతమంది వ్యతిరేకిస్తే కొంతమంది ఆమోదిస్తారు. వారి సహకారంతో రాజాకు ఇష్టమైన మంచి సంబంధం చూసి ఘనంగా పెళ్ళి జరిపిస్తుంది రాజా తల్లి. అప్పటి వరకు పెళ్ళిలో జరిగే ఇచ్చి పుచ్చుకోవడాలు (కన్యాశుల్కం, వరకట్నం) గాని, పెళ్ళి కొడుకు అలకలు గాని ఈ పెళ్ళిలో కనిపించవు. పెళ్ళి సరదాగా కొత్త సంప్రదాయాలతో జరుగుతుంది. చాలామంది బంధువులు వస్తారు. ఆ పెళ్ళంటే ఇష్టం లేని కొంతమంది బంధువులు రారు. పొరుగూరు ద్రోణంరాజు లక్ష్మీ బాయమ్మ గారైతే తాను రాకపోయినా తన ఆశీస్సులు పద్య రూపంలో రాసి పంపుతారు.

పెళ్ళి ఘనంగా నూతన సంప్రదాయ బద్ధంగా జరిగినందుకు బహుమానంగా వూరంతా వారిని వెలివేస్తుంది. దానికి వాళ్ళు భయపడరు. తమకేం లోటు లేదంటారు. ఇష్టం వచ్చిన తమ ఇంటికి రావచ్చంటారు. లేనివాళ్ళు మానవచ్చన్నారు. పుట్టింట్లో చిన్న సంతర్పణ జరుగుతుంది. సత్యనారాయణ వ్రతం, దీపారాధన జరుగుతుంది. ఇష్టమైన వాళ్ళు వచ్చి భోజనాలు చేస్తారు. అంతా కలుస్తారు. కలవటం వల్ల తమకేమీ పట్టుకోలేదని ఇంకా గుసగుస లాడుకుంటున్న వారికి చెప్తారు. ఆ రకంగా ఈ కథ ముగుస్తుంది.

సంఘ సంస్కరణోద్యమం బాగా ఊపందుకొన్న రాజమహేంద్రవరానికి ఆనుకొని వున్న పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించిన రచయిత్రి సుసర్ల లక్ష్మీనరసమాంబపై ఆ ఉద్యమ ప్రభావం బాగా ఉంది అనటానికి రాజా పెళ్ళి కథ ఒక నిదర్శనం. వితంతువుకు వివాహం అవసరమని ఈ కథ ద్వారా నరసమాంబ నిరూపించింది. ఎన్నో సంవత్సరాల నుండి వస్తున్న సనాతన సంప్రదాయాలకు ఈ కథ ద్వారా రచయిత్రి అడ్డుగీత గీసింది. స్త్రీలు ఏమాత్రం పురుషులకు తీసిపోరని పురుషులతో సమానంగా జీవించే హక్కు ఉంటుందని ఈ కథ ద్వారా రచయిత్రి ఆనాడే తెలియజేసింది.

సనాతనంగా వచ్చిన సంప్రదాయం ఆడపిల్లలకు రజస్వం కాకముందే పెళ్ళి చేయడం. ఈ ఆచారం ఎక్కువగా బ్రాహ్మణులలో ఉండేది. ఒకవేళ రజస్వలానంతరం వివాహం జరిపితే వారిని వెలివేసేవారు. ఆ వెలికి భయపడ్డ తల్లిదండ్రులు పిల్లలకు రజస్వల కాకమునుపే వివాహం చేసేవారు. ఈ కథలో కూడా రాజాకు చిన్నతనంలో పెళ్ళి చేశారు. దురదృష్టవశాత్తు ఆమె భర్త చనిపోయి వితంతువు అవుతుంది. కూతురికి ఎలాగైనా పెళ్ళి చేయాలనుకున్న తండ్రి కూడా హఠాత్తుగా మరణిస్తాడు. తండ్రి మరణంతో బాగా కుంగిపోయిన రాజా పెళ్ళి గురించి బంధువులతో సంప్రదిస్తుంది ఆమె తల్లి. బంధువులందరూ కలిసి సంబంధాలు చూసి మంచి వరుడిని నిర్ణయిస్తారు.

వివాహానికి రాజా బంధువులతో వస్తారు కాని ఆ ఊరి వాళ్ళు కొంతమందే వస్తారు. రాజాకు వితంతు వివాహం జరగడం వల్ల రాజా కుటుంబాన్ని ఆ ఊరు వెలివేస్తుంది. కాని రాజా కుటుంబ సభ్యులు ఈ వెలికి ఏమాత్రం భయపడలేదు. ఇంకా తమను వెలివేసిన వారినే వాళ్ళు వెలివేస్తారు.

వెలివేయడమంటే వారితో రాకపోకల సంబంధాలు నెరపకపోవటం, బంధుత్వ సంబంధాలు ఏర్పరచుకోకపోవటం, చాకళ్ళను, మంగళ్ళను ఆ ఇంటి అవసరాకు పోకుండా నిషేధించటం. కమ్మరి, కుమ్మరి మొదలైన వృత్తి పనివాళ్ళు అవసరమైన సాధనాలు ఇవ్వకుండా నిషేధించడం. ఊరుమ్మడి సంపదను తాకే హక్కును, అనుభవించే హక్కును నిరాకరించటం. ఆ రకంగా మంచినీళ్ళ బావుల నుండి, చెరువుల నుండి కూడా వాళ్ళు నీళ్ళు తెచ్చుకోలేరు.

కాని సమాజం ఆధునికమవుతున్న క్రమంలో నిలవనీటి గ్రామీణ జీవితం కదల బారటం సహజం.. చదువుల కోసం, ఉద్యోగాల కోసం గ్రామాలు వదిలి పట్టణాలకు వచ్చాక నగరీకరణ మనుషుల మధ్య కులమతాలకు సంబంధించి, అంటు ముట్టు లాంటి అంతరాలను సర్దుబాటు చేస్తుంది. బెజవాడ లాంటి పెద్ద ఊళ్ళో కొద్దిమంది సహాయం చేయకపోయినా, కొద్ది మంది అయినా చేయూతనిస్తారు. ఇది మారిన పరిస్థితి ప్రభావం. ఈ అవగాహన రచయిత్రికి వుంది.

ఈ కథలో రాజా కుటుంబం వెలికి భయపడలేదు సరికదా తమ ఇంటికి భోజనానికి రాకపోతే రాకపోయినా ఫర్వాలేదు. ఎలాగూ మా బంధువులైతే వచ్చారు. ఊళ్ళో వారి ఇష్టం వుంటే వస్తారు లేకపోతే రారు. మా ఇష్టం మాది వాళ్ళిష్టం వారిది అంటూ తాము చేసిన వివాహం పట్ల తమకున్న నమ్మకాన్ని ధైర్యంగా బహిర్గతం చేశారు.

బ్రిటీషు వలస పాలన వల్ల ప్రపంచ సంస్కృతితో ఏర్పడిన సంబంధంలో భారతదేశంలో అంత వరకు వ్యవస్థలకు, కులానికి, కుటుంబానికి, మతానికి ఉన్న ప్రాధాన్యత తగ్గి వ్యక్తి క్షేమం ప్రధానంగా ముందుకు వచ్చింది. వ్యక్తి జీవితాన్ని సౌఖ్యవంతంగా చేయటానికే సంస్కరణోద్యమాలు వచ్చాయి. ఆ నేపధ్యంలోనే రాజావాళ్ళు మా ఇష్టం మాది అనుకోగలిగారు. తమ సౌఖ్యాలను కాదనే సనాతనాచారులను ధిక్కరించారు.

ద్రోణం రాజు లక్ష్మీ బాయమ్మ ఈ పెళ్ళికి రానందుకు విచారిస్తూ తన ఆశీస్సులను పద్యాలుగా వ్రాసి టెలిగ్రాము ద్వారా పంపింది అని రచయిత్రి ఈ కథలో చెప్పిన విషయం గమనించదగింది. ఈమె వాస్తవ వ్యక్తి. గొప్ప జాతీయవాది. సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని సేవ చేసింది. జిల్లా కాంగ్రెస్ సంఘ కార్యదర్శినిగా ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ మహిళా సంఘ అధ్యక్ష కార్యదర్శిగా ఎంతో సేవ చేసింది కవయిత్రి.5 రచయిత్రి ద్రోణం రాజు లక్ష్మీబాయమ్మ పద్యాలు రాసి పంపించినట్లు కల్పించడం ద్వారా ఈ వివాహాన్ని ఆనాటి రచయిత్రులు, జాతీయ వాదులు ఇంకా మేధావులు అందరూ ఆమోదించారని తెలిపినట్లైంది.

5. ముగింపు:

  • అత్యంత ప్రతికూల వాతావరణంలోనూ తొలితరం తెలుగు రచయిత్రుల ఆధునిక భావజాలంతో రచనలు చేసి మార్గదర్శకులుగా, మనోధైర్యాన్నిచ్చిన సాహిత్యకారులుగా సాహిత్య చరిత్రలో సుస్థిర స్థానాన్ని పొందారు. ఆనాటి సంఘసంస్కరణ భావాలను, స్త్రీల ఆలోచనలను అర్థం చేసుకోవటానికి స్వాతంత్య్రానికి పూర్వపు రచయిత్రుల కథలు దోహదం చేస్తాయి.
  • కౌటుంబిక, సామాజిక వ్యవస్థలో జరిగిన పరిణామాలకు రచయిత్రులు కథా రూపమిచ్చారు.
  • ఈనాడు మనం అనుకుంటున్న సామాజిక బాధ్యత, సామాజిక స్పృహను స్వాతంత్య్రానికి పూర్వమే రచయిత్రులు గుర్తించి తరువాతి కాలంలో కథలకు, కధకులకు మార్గదర్శనం చేశారని స్పష్టమైంది.

6. పాదసూచికలు:

  1. పంతంగి వెంకటేశ్వర్లు - తెలంగాణ తెలుగు కథ -  పుట: 241
  2. అమ్మంగి వేణుగోపాల్ - సాహిత్య సందర్భం సమకాలీన స్పందన -పుట: 83
  3. వి.సీతారామ దేవి - హిందీ భాష స్త్రీలు (వ్యాసం) - గృహలక్ష్మి పత్రిక - పుట: 558
  4. ఇంద్రగంటి జానకీ బాల - తెలుగు జాతి రత్నాలు - మార్గదర్శి దుర్గాబాయ్ దేశ్ముఖ్ - పుట: 17
  5. గోపరాజు సీతాదేవి -  జననీ జన్మభూమిశ్చ - స్వీయ చరిత్ర - పుట: 123

7. ఉపయుక్తగ్రంథసూచి:

  1. కాత్యాయనీ విద్మహే. సాహిత్యాకాశంలో సగం. స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ, వరంగల్లు, ఫిబ్రవరి, 2010.
  2. భూమిక. తెలుగు మాస పత్రిక. హైదరాబాద్. ఫిబ్రవరి, మార్చి, 2018
  3. శ్రీధర్, వెల్దండి. (సం.) తెలుగు కథ - ప్రాంతీయ అస్తిత్వం .-తెలుగు అధ్యయన శాఖ, సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాల, జనవరి, 2015
  4. శ్రీనివాస్, సంగిశెట్టి. (సం.) భండారు అచ్చమాంబ. తొలి తెలుగు కథలు.‘కవిలె’ తెలంగాణ రీసెర్చ్ అండ్ రెఫరాల్ సెంటర్. హైదరాబాద్, తెలంగాణ - 2010
  5. శ్రీరామమూర్తి, కోడూరి. తెలుగు కథ - నాడూ, నేడు. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్. మార్చి, 2006
  6. సరిత, జి. సుసర్ల లక్ష్మీనరసమాంబ సాహిత్యం. ఎం.ఫిల్ సిద్ధాంత వ్యాసం. కాకతీయ విశ్వవిద్యాలయం, వరంగల్. ఆగష్టు, 2011
  7. సుజాతారెడ్డి, ముదిగొండ. తెలంగాణ తొలి తరం కథలు (సంకలనం), రోష్నమ్ పబ్లికేషన్స్, హైదరాబాద్, 2002

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]