headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-12 | November 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

5. కాళోజీ కవిత్వం: సౌందర్య దర్శనం

డా. తత్త్వాది ప్రమోద కుమార్

సహాచార్యులు, తెలుగు విభాగం,
ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (స్వ), జగిత్యాల,
జగిత్యాల, తెలంగాణ.
సెల్: +91 9441024607, Email: thatwadi@gmail.com
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 17.10.2024        ఎంపిక (D.O.A): 30.10.2024        ప్రచురణ (D.O.P): 01.11.2024


వ్యాససంగ్రహం:

ప్రజాకవి కాళోజీ నారాయణరావు కవిత్వంలోని శైలీ అలంకార, ధ్వని, శిల్పాది కవితాసౌందర్యాన్ని పరిచయంచేయడమే పరిశోధన వ్యాసం ప్రధానోద్దేశం. కాళోజీ నారాయణరావు సాహిత్యం గూర్చి లబ్దప్రతిష్ఠులైన దాశరథి, వరవరరావు, కాత్యాయనీ విద్మహే, తూర్పు మల్లారెడ్డి, తిరుపతిరావు వంటి సాహితీవేత్తలు పరిశోధనాత్మకమైన వ్యాసాలు రాశారు. కాళోజి కవితాసంకలన గ్రంథాలలో, వివిధ రచయితలు ఆయా సంపుటాలలో వెలువరించిన వ్యాసాలు నా పరిశోధనా వ్యాసానికి ఆధారంగా నిలిచాయి. కాళోజి కవిత్వంలోని ప్రయోగాలను ఆధారం చేసుకుని ఛందః శిల్పం, అల్పాక్షరాలు - అనాల్పా ర్థభావనలు, అలంకారసౌందర్యం, ధ్వని, శిల్పసౌందర్యం మొదలైన శీర్షికలతో వ్యాసాన్ని విభజించి రాశాను. కాళోజీకవిత్వంలో సామాజికచింతనామయమైన వస్తువుతోపాటు కావ్యాలంకారభావనలు ఉన్నాయని, వాటిని తెలియచేయాలని ఆలోచనతో ఈ వ్యాసాన్ని పరిమితం చేసుకున్నాను. ఈ వ్యాసం ఆధారంగా భవిష్యత్తులో కాళోజీ కవిత్వంలోని భావుకతతోపాటు కవితాశిల్పాల గూర్చి , అలంకారాల గూర్చి పరిశోధన చేసే అవకాశం ఉంటుంది.

Keywords: కాళోజి, ప్రజాకవి, అలంకారాలు, శిల్పసౌందర్యం, ఛందస్సు, ధ్వని, వ్యంగ్యం, నా గొడవ.

1. ఉపోద్ఘాతం:

తెలంగాణ నిలువెత్తు సంతకం కాళోజీ నారాయణరావు. కాళోజి అంటే నిత్య చైతన్యం. కాళోజీ అంటే నిరుపమాన ధైర్యం. కాళోజి అంటే నిరాశ్రితుల గుండెల్లో వెలుగు. ప్రజా శ్రేయస్సుని తన శ్రేయస్సుగా భావించి, తన జీవితాన్ని రచనలను ప్రజాపక్షం చేసిన కవి ధీరుడు కాళోజి. కథ రాసినా కవిత రాసినా కాళోజీ కలంలోని సిరాచుక్కలు పేద దీనజనుల ఆర్తిని, ఆక్రందనలను తెలిపేందుకే…… వాటిని తొలగించేందుకే…… “పల్లె పట్టణం బనక పల్లేరయి తిరిగి….. గుట్టలపై ఎక్కి ఎక్కి గట్టు దిగజారి……. లోయలలో దూకి దూకి లోతులెన్నో చూచిన…..” కాళోజి జీవితానుభవాలు, ఆ అనుభవసారం కవితా ధారగా మారి కాళోజి ‘నాగొడవ’ గా రూపుదిద్దుకుంది. 

“కవిత్వం మీద అంత ప్రేమ వున్న కాళోజి ఆ కవిత్వాన్ని ఒక కళారూపంగా ఎందుకు సాధన చేయలేకపోయాడు” అని పాఠకుల సందేహంగా సమీక్షకులు/ విమర్శకులు1 పేర్కొన్నారు. కానీ కాళోజి కవిత్వం, జీవితం రెండూ ఒకటిగానే పెన వేసుకున్నాయి. అవి రెండు వేరువేరు కాదు. “అస్తిత్వ చేతన మూర్తిభవించిన కాళోజి వ్యక్తిత్వానికి నిలువుటద్దం ఆయన కవిత్వం”2 అందుకే కాళోజి జీవితంలోని ప్రతి సంఘటన కవితా రూపంలో దర్శనమిస్తుంది. ఈ కవితా రూపం కూడా కాళోజీ లాగా సాదాసీదాగా ఉంటుంది. ఛందోబంధం ఉండదు. అలంకారాల అపేక్ష కనిపించదు. శిల్పం తల్పం అంటూ మెరుపుల నగిషీలు కొరకు ఆగిపోదు. సరళంగా, సూటిగా ఘాటుగా కొనసాగుతుంది. ప్రజలను పాఠకులను తన భావాల ద్వారా చైతన్యంతో ప్రతిస్పందింప చేయడమే కాళోజి కవితా లక్ష్యం. అందుకే సాధారణ కవుల లాగా కాళోజీ కవిత్వం పట్ల శైలీ నిర్మాణాదుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపలేదు. భావవ్యక్తీకరణకు వాటిని అడ్డంకులుగా భావించాడు. అందుకే “మెరుపుల వలె పరిగిడు / మా ఊహా తరంగాలకు / బక్కెద్దుల నాపే / పగ్గాలు పనికొస్తాయా?” (సరస్వతీ భక్తుల్లారా!) అంటూ ఎదురు ప్రశ్నించాడు. కంటికి కనిపించిన అన్యాయాన్ని ఎదిరించడం, ప్రశ్నించడం, తద్వారా చుట్టూ ఉన్న సమాజాన్ని జాగృతం చేయడం కాళోజి కవితా లక్ష్యం. బక్క జీవులను కదిలించడమే, బండ బారిన పెత్తందారుల మనసును కరిగించడమే ఆయన ధ్యేయం. ఆ లక్ష్యం ధ్యేయ సాధనకు అనుగుణంగా కాళోజి కవితా రీతి కొనసాగింది. తీరుబడిగా కూర్చుని ఆలోచిస్తూ ఆయన కవిత్వం రాయలేదు. ఆగకుండా సాగిపోయే వాగు నీరులాగా కాలోజీ కవిత్వం కదలాడింది. దీర్ఘ సమాసాలు లేవు పదాల గారడీ లేదు. జన వ్యవహారంలో నలుగుతున్న పదాలతోనే సాహిత్య నిర్మాణం చేశాడు. వ్యవహార భాషకు పట్టం కట్టి, కావ్య గౌరవాన్ని కలిగించాడు. కాళోజీ కవిత్వంలోని భాష, శైలి, రూపం, వస్తువు అన్ని తెలంగాణవి అయినా అవి సార్వజనికం సార్వకాలికం అదే కాళోజి విశిష్టత.

2. అల్పాక్షరాలు – అనల్పార్థభావాలు:

అల్పాక్షరాలలో అనాల్పార్థాలను పలికింపచేయడం మహాకవుల లక్షణం. వేమన వంటి ప్రజాకవులు, మహాకవులు ఈ మార్గాన్ని అనుసరించారు. ప్రజాకవి కాళోజీ నారాయణరావు కూడా ఈ మార్గం లోనే నడిచా . ఏనుగును తెచ్చి ఏకుల బుట్టలో పెట్టినట్లుగా విశ్వభావనలన్నీ కేవలం చిన్న చిన్న పదాలలో కాళోజి సమకూర్చడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇది కాళోజీ కవితా విశిష్టత.

“చాప చింపు – సామ్రాజ్యం/ కోడిగుడ్డు – కోహినూరు/ పాటి పన్ను- ప్లాటీనం/ బస్సు సీటు – బ్రహ్మరథం/ ఏదైతేం? ఏదైతేం?/ పోటీపడికాటులాడ/ ఏదైతేం?”3

రోజురోజుకు పెరుగుతున్న పోటీ తత్త్వాన్ని గూర్చి వివరించిన పై కవితలో ఉపయోగించినవన్నీ చాలా చాలా స్వల్పమైన పదాలు. ప్రతీ పాదంలోనూ మొదటి పదం సామాన్యార్థక సూచకమైతే రెండవ పదం అధికారానికి, ఆడంబరానికి, ధనికత్వానికి చిహ్నాలు. ఏదైతేం? ఏదైతేం? అనే ప్రశ్నార్థకాన్ని పునరుక్తి చేసి తాను చెప్పదలుచుకున్న భావానికి బిగువును పెంచాడు. సాధారణ పాఠకుడిలో కూడా భావోద్విగ్నత కలిగించాడు.

“అన్నపురాసులు ఒకచోట/ ఆకలి మంటలు ఒకచోట/ హంస తూలికలు ఒక చోట/ అలసిన దేహా లొక చోట/ సంపదలన్నీ యొక చోట/ గంపెడు బలగం బొకచోట”4

అంటూ అన్నార్థులు - అర్థపుష్టి కలిగిన వారి మధ్య గల వ్యత్యాసాలను సామాన్య పదాలలో తేట తెల్లం చేశాడు.

3. ఛందఃశిల్పం:

కాళోజీ కవితలన్నీ దాదాపు మాత్రాఛందస్సుతో కూడుకున్నవే. అక్షరాలు కొన్నింటిని ఆటునిటు మార్చితే ముత్యాలసరాలు, ద్విపదలు, తరువోజలు, తేటగీతులు, ఆట వెలదులు, సీసాలు మొదలైన ఛందస్సులో ఒదిగిపోతాయి. సరైన భావజాలాన్ని పాఠకుల గుండెల్లో సూటిగా ప్రసరింప చేయడమే లక్ష్యంగా ఎంచుకున్న కాళోజీ ఛందోబంధాలను తెంపుకున్నాడు. ఈ భావన తోనే “కాళోజి వేమన - గురజాడల వంటి కవి…. కాళోజీ కవితా రూపం గురజాడకు దగ్గరగా ఉంటుంది. లేదా దేశీ ఛందస్సుకు దగ్గరగా ఉంటుందని చెప్పడం ఉచితం.” అని వరవరరావు పేర్కొన్నారు.5 అవసరమైన సందర్భంలో చందస్సు పై సాధికారతను ప్రకటించడానికి ప్రయత్నించాడు. దీనికి నిదర్శనం “పోతన చేతన కథనము.”6 ఇందులో పోతన్నను ప్రస్తుతిస్తూ ఉత్పలమాల, కందం, శార్దూలం మొదలైన ఛందో వైవిధ్యంతో కూడిన పద్యాలను రాశాడు. అలాగే కంద పద్యాలలో “ప్రజాస్వామ్యం”7 అనే కవితను రాశాడు.

ఛందఃశిల్పాలపై అంతగా మమకారాన్ని చూపని కాళోజి ప్రాసలు - అనుప్రాసల పై మాత్రం మెండుగా అభిమానాన్ని ప్రదర్శించాడు. సాధారణంగా కాళోజీ కవితలన్నింటిలో ఈ విషయాన్ని గమనించవచ్చు. “కన్నీటిలో ఎన్నెన్నో కలవు”8 “కూత – చేత”9 మొదలైన కవితల్లో ప్రాసలపై మమకారం పరాకాష్ఠకు చేరుకుంది. ఆ ప్రాసలు కూడా సహజంగా ఒదిగిపోయినట్లున్నాయే కానీ కృత్రిమంగా కనిపించవు.

4. అలంకారసౌందర్యం:

కాళోజీ కవిత్వంలో మనకు సాధారణంగా కనిపించేది నిరలంకారశైలి. అలంకారాలు అతిశయోక్తుల కంటే కవిత్వాన్ని సహజ సుందరంగా చెప్పడానికే కాళోజి ప్రథమ ప్రాధాన్యతనిచ్చాడు. అయినా అక్కడక్కడా అలంకారాల ప్రయోగాలు కనిపిస్తుంటాయి.

“నా తల నీ తల నానారాతల తలలెందుకు?/ నేతల తలలున్నవి గద! మన తలలు నున్న జేయుటకు”10

ఇందులో వృత్తయనుప్రాసంతో పాటు ఛేకానుప్రాసాలంకారాన్ని స్వారస్యంగా ప్రయోగించాడు.

“ఆ కళ్ళ కళలు ఆ కళ్ళు/ ఆ కళ్ళు కలల ఆ కల్లు/ ఆ కళ్ళ కలలు ఆ కళ్ళు/ కలల ఆ కళ్ళు ఆకళ్ళు”…11

ఆ కళ్ళు అనే పదాన్ని శేషార్థంలో ప్రయోగిస్తూ, ఆ కళ్ళు అంటే ఆ నేత్రాలని మరియు ఆకలి అనే అర్థాన్ని సాధించాడు. పేదవారి కళ్ళల్లో కలల్లో బతుకులో అంతటా ఆకలి విస్తరించి ఉందని అంటూ పేదవారి దైన్య జీవనాన్ని దయనీయంగా వర్ణించాడు. ‘మన భూతం’ అనే గేయ కవితలో-

“మా భూతము కడుగొప్పది/ మా భవితవ్యము పూజ్యము”12

పూజ్యం అనే మాటకు గౌరవం మరియు శూన్యం అనే రెండు అర్థాలు ఉన్నాయి. మా భవిష్యత్తు గౌరవ ప్రదంగా ఉంటుందని మరియు ఇక మా భవిష్యత్తు శూన్యం అని శ్లేష వ్యంగ్యార్థంలో పై కవితను రాశాడు.

నానా భావననది/ నీ నా భావన లేనిది/ ఎద చించుక పారునది/ ఎదలందున చేరునది/ కనుకొలకుల చిలుకునది/ కనురెప్పల తడుపునది/ ఎడద ఊరి పారునది/ ఎడదచేరి ఊరు నది/ నా గొడవనునది కాళోజి అను నది”13

ప్రతీ పాదంలోనూ క్రియాత్మక పదాల్లోని ‘నది’ అనే శబ్దం ‘నది’ అనే అర్థం లోను మరియు ‘అది’ అనే అర్థంలో నిర్దిష్ట సూచకంలో ప్రయోగించాడు. ఇది పూర్తిగా శ్లేషాలంకారంలో కొనసాగిన గేయం.

5. శిల్పసౌందర్యం:

సాదాసీదాగా నడిచే కాళోజీ కవిత్వంలో శిల్పం లేదనుకోవడం పాఠకుల పొరపాటే అవుతుంది. కవితా శిల్ప రహస్యాలు తెలియక కాదు. వాటి అవసరం లేదనే ఉద్దేశంతో శిల్ప సౌందర్యానికి ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ పరిశీలించి చూస్తే శిల్ప ప్రాధాన్యత ఉన్న కవితలను గుర్తించవచ్చు.

“నర్తకుని నాట్యాలు గాయకుని గానాలు/ వాదితృని వాద్యాలు శిల్పకుని శిల్పాలు/ చిత్రకుని చిత్రాలు అంగనల అందాలు/ కందర్పు కయ్యాలు కవిరాజు కావ్యాలు/ కర్షకా! నీ కర్రు కదిలినన్నాళ్లే”14

ఈ గేయంలో మొదట మామూలు నామవాచకాలే కనిపిస్తున్నాయి. ఏ పాదానికి ఆపాదమే విడివిడిగా అర్థ బోధన కలిగిస్తుంది. ఐదవ పాదంలోని కర్షకా! అనే సంబోధన దానితోపాటు ‘నీ కర్రు కదలి నన్నాళ్లే’ అనే క్రియాంత పదంతో పై నాలుగు పాదాలకు లంకె ఏర్పడింది. సంపూర్ణమైన అర్థం స్ఫురించింది. కర్షకుడు లేకుంటే నిఖిల సృష్టి నిశ్చలమైనట్లే. ఈ గేయంలో ఐదవ పాదమే కీలకమై వెన్నెముకగా నిలిచింది. శిల్ప పరంగా ఇది ఉత్కృష్టమైన కవిత.

“కోట గోడలు నేలకూలుతున్నాయి” అనే గేయంలో ప్రతి రెండు పాదాల తర్వాత-

“అవి వచ్చే రోజులంతమైనాయి/ కోటగోడలు నేలకూలుచున్నాయి/ ఇప్పడిప్పుడే తెప్పరిల్లుచున్నాయి” 15

అనే క్రియాంత వాక్యాలు ద్విరుక్తం కావడం వల్ల ప్రజాస్వామ్య శక్తులకు లభించే విజయత్సోహాన్ని నొక్కి చెప్పినట్లయింది. గేయంలో ఉధృతి పెరిగింది. తద్వారా భావనాబలం మరింతగా చేకూరింది.

శిల్పపరంగా భావనాపరంగా మహోత్కృష్టమైన కవిత ‘కాటేసి తీరాలె’:

"మనకొంపలార్చిన మన స్త్రీల చెరచిన/ మన పిల్లలను చంపి మనల బంధించిన/ మానవాధములను మండలాధీశులను/ మరచిపోకుండగ గురుతుంచుకోవాలె/ కసి ఆరిపోకుండా బుస కొట్టుచుండాలె/ కాలంబు రాగానే కాటేసి తీరాలె” 16

మొదటి రెండు పాదాలలో జరిగిపోయిన క్రియలను తెలిపి తదనుగుణమైన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళికను తరవాత పాదాలలో వెల్లడించాడు. చర్యలకు తగినట్టి ప్రతి చర్యలను సూచిస్తున్నాడు. ‘గురుతుంచుకోవాలె’ అని సుతిమెత్తగా చెపుతూనే చివరలో ‘కాటేసి తీరాలె’ అని తీవ్రమైన కసితో చెప్పినట్లుగా ఉంది. ఆ సంఘటనలు అత్యాచారాలు సున్నిత మనస్కుడైన కాళోజీ హృదయాన్ని ఎంతగానో కలచి వేసి ఉంటాయి. అందుకే భావావేశం క్రోధావేశం కలగలిసి పెల్లుబికిన గేయం ‘కాటేసి తీరాలె’.

కవిత్వం చదవగానే విషయస్పరణ కావడం కంటే ఇంకా మున్ముందు ఏముందో ఏ విషయాన్ని గూర్చి కవి చెబుతున్నాడో తెలుసుకోవాలనే ఉత్కంఠ ఉబలాటం పాఠకుడిలో కలిగినట్లయితే ఆ కవితకు మరింత బిగువు పెరిగినట్లే. ఈ సూత్రాన్ని కాళోజి గుర్తెరిగాడు. కర్షక పోటీపడి కాటులాడ ఎవరనుకున్నారు ఇట్లావునని జంట సింగిణులు మొదలైన కవితా ఖండికల్లో పై శిల్ప రహస్యాన్ని మనం గమనించవచ్చు.

“ఎవరనుకొన్నారు? ఇట్లౌనని ఎవరనుకొన్నారు?/ వానా కాలంలోనూ చేనులెండిపోతాయని/ మండే వేసవిలో వలె ఎండలు కాస్తుంటాయని/ ఎవరనుకొన్నారు? ఇట్లౌనని ఎవరనుకొన్నారు?17

ప్రశ్నార్ధకంతో కవిత ప్రారంభించి ఉద్దిష్ట విషయం గూర్చి పాఠకుడిలో ఉత్కంఠత కలిగించాడు. తర్వాత పాదాల్లో విషయాన్ని తేటతెల్లం చేశాడు. స్వాతంత్ర్యనంతరం స్వదేశీ పాలకుల పాలన మరియు వారి డొల్లతనాన్ని బయటపెట్టాడు.

“దానిమ్మ గింజలో దాగిన ఎరుపు/ లేత అరిటాకు పై పూతల నునుపు/ క్రొత్త మఖమలు లోని మెత్తందనాలు/ కన్నతల్లి పాల కమ్మందనాలు/ గోదుగ్ధ ధారల గోర్వెచ్చదనము/ ద్రాక్ష ఫలములోన ద్రవియించు తీపి/ పువ్వు పొదుగులోన పొంగేటి తేనె/ ముసి ముసి నవ్వుల కుసుమముల సొంపు/ అంద చందాలొలుకు ఆనంద ఝరులు/ చంటి పాపని పెదవి జంట సింగిణులలో/ అన్ని చేరి ఆటలాడుతున్నాయి.”18

కాళోజీ లోని సున్నితమైన ప్రతిస్పందనలకు నిలువెత్తు రూపం ఈ కవిత. పెదవులను జంట విల్లులతో పోల్చడమే వినూత్నం. మొదటి తొమ్మిది పాదాలలో ఎరుపు, నునుపు, మెత్తందనం, కమ్మందనం మొదలైన విశేషణాలను ఉపయోగించి చివరగా పై విశేషాలన్నింటినీ కేంద్రీకృతం చేస్తూ ‘చంటి పాపని పెదవి జంట సింగిణులు’ అని పేర్కొన్నాడు. పాఠకుని భావంబర వీధిలో హరివిల్లు లాంటి ఆనందాన్ని కలిగించాడు.

6. ధ్వని:

వ్యంగ్య ప్రాధాన్యము కలిగి న కావ్యం ఉత్తమ ఉత్తమ ఉత్తమ కావ్యాలని ఆనంద వర్ణుడు జగన్నాథుడు మొదలైన భారతీయ అలంకారికులు పేర్కొన్నారు.

"యత్రార్ధః శబ్దోవా తమర్ధముపసర్జనీకృత స్వార్థౌ
వ్యంక్తః కావ్య విశేషః సధ్వనిభిరితి సూరిభిః కతిథః“
(ధ్వన్యాలోకం)

ఎక్కడ శబ్దం లేదా దాని అర్థం స్వయంగా తొలగిపోయి కావ్య విశేషమైన వ్యంగ్యం స్ఫురిస్తుందో అది ధ్వని అని పండితులన్నారని ఆనందవర్ధనాచార్యులు ధ్వని సిద్ధాంతాన్ని ప్రతిష్టించారు.19

కాళోజీ కవిత్వంలో ఎక్కువగా వ్యంగ్య ధ్వని కనిపిస్తుంది. ఆ వ్యంగ్యం నర్మగర్భంలా ఉండదు. కొరడా దెబ్బలా ఛెళ్ళుమనిపిస్తుంది. అన్యాయం అనిపించినప్పుడు ఎంతటి వారినైనా అధిక్షేపిస్తూ విమర్శించడం కాళోజి నైజం.

లేమావి చిగురులను లెస్సగా మెసేవు / ఋతురాజు వచ్చెనని అతి సంభ్రమము తోడ / మావి కొమ్మల మీద మైమరచి పాడేవు / తిన్న తిండెవ్వారిదే కోకిలా! /  పాడు పాటెవ్వారిదే కోకిలా! ……..20

ఇందులో కోకిల అంటే రాయప్రోలు సుబ్బారావు. నిజాం వ్యతిరేక ఉద్యమం ముమ్మరంగా కొనసాగుతున్న ఆరోజుల్లో తెలంగాణ ప్రాంతంలో ఉంటూ, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుశాఖాధిపతిగా పనిచేస్తూ, తెలంగాణ ప్రజల పోరాటంలో పాలుపంచుకోలేదని కారణంగా రాయప్రోలు సుబ్బారావును అధిక్షేపిస్తూ 1943లో రాసిన గేయం ఇది.

ఏనాటి సుకృతమొ? ఏ విశ్వకవి చలువొ/ ఈనాడు నిన్నింత దానిగా చేసినది/ అంతకే నీ వేడ ఆగలేకున్నావు?/ లేకున్న నీ లెక్క ఎందులో కోకిలా?/ లేకున్న నీవేడనుందువో కోకిలా?"21

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ చలువ వల్ల పేరు ప్రఖ్యాతులు గాని, లేకపోతే అనామకుడవే కదా! అని ధ్వని సూచకంగా రాయప్రోలును తీవ్రంగా అధిక్షేపించాడు.

కవిత్వం మొత్తంలోనో లేదా పాదంలోనో కాకుండా ప్రతీ పాదంలోనూ వ్యంగ్యాత్మకత సాధించడం కాళోజీ కవితలో కనిపించే గుణం.

“గణనాయక! అధినేతా!/ అడ్డంకుల దొడ్డోడా!/ వంకర మొగము కలాడ!/ ఒంటి పంటి మొనగాడా! కడలి కడుపు సామి! దొరా!/ అధినేతా! వినాయకా!...”22

ఇది వినాయక స్తుతి. కానీ నేటి రాజకీయ నాయకులపై వ్యంగ్య విమర్శయా అనే రీతిలో అచ్చమైన తెలుగు పదాలతో ఈ గేయం కొనసాగింది.

కాళోజీ చెప్పిన కవిత్వం ప్రత్యక్ష వ్యాఖ్యానంలా కొనసాగుతుంది. అతడు ఇతడు అనే భేదం చూపకుండా అరాచక వాదులందరి పైనా విమర్శనాస్త్రాలు గుప్పించాడు. వారిపై చురకలు అంటించాడు. ప్రజాసేవ పేరుతో ప్రజలను నిలువునా ముంచే రాజకీయ నాయకులను చూసి…..

“ప్రజా సేవను పేర బ్రతకండీ, తిన్నంగ మీరు/ ప్రజల సొత్తును మీదే యనుకోండి/ సులభమైన భక్తి మార్గము/ సులువుగా పైకొచ్చు మార్గము”23

అని రాజకీయుల కుటిల మనస్తత్త్వాన్ని బయటపెట్టాడు. ఓట్లతో సీట్లు సాధించి ప్రజాసంక్షేమాన్ని మరచిన రాజకీయ నాయకుల గూర్చి-

“గాంధీ పేర టోపీ పెడదాం/ గాంధీ పేర బూడిద పూద్దాం/ ఓటు లొచ్చు కిట్టుకును గన్నాం/ లోటులన్ని తీర్చుకున్నాం”24

అని వారి అసలు రంగును తెలిపి స్తుతిమెత్తగా అధిక్షేపించాడు.

రాజకీయ నాయకుల శాంతి ప్రవచనాలతో విసిగిన కాళోజి వారి ప్రవచనాలలోని కపటత్వాన్ని డొల్లతనాన్ని లోకానికి వెల్లడించాడు. “గుండె పగిలిపోతుంటే/ కడుపు మండిపోతుంటే/ కండ కరిగిపోతుంటే/ ఎముక విరిగిపోతుంటే/ బ్రతుకు చితికి పోతుంటే/ శాంతి – శాంతట! శాంతి!!”25…. అని అధిక్షేపిస్తూ కామరాజు, నీలం సంజీవరెడ్డి మొదలైన ప్రసిద్ధి ప్రసిద్ధ నాయకులందరినీ విమర్శించాడు. కాళోజి స్వేచ్ఛాజీవి. పార్టీల నియమాలు సంప్రదాయాలు బంధనాలుగా కనిపించాయి. అందుకే పాతివ్రత్యం అనే మాటకు వ్యంగ్యార్థ సూచకంగా ‘పార్టీ వ్రత్యము’ పేరుతో కవిత రాస్తూ-

“ఆత్మ విమర్శన శక్తి/ ఆలోచన అనుమానము/ సోకిన పార్టీ వ్రత్యము/ సున్నమగుట మరువరాదు”26… అని ఒక పార్టీలో సభ్యుడిగా ఉన్నట్లయితే స్వయం నిర్ణాయక శక్తిని కోల్పోతారు అనే విషయాన్ని తేటతెల్లం చేశాడు. “సంఘాలు నియమాలు సంప్రదాయాలు/ మనిషిలోని కుళ్ళు మారు రూపాలు”27…. అంటూ అసహనాన్ని వ్యక్తం చేశాడు.

ఏ విషయాన్నైనా కుండబద్దలు చేసినట్లు ఘాటుగా చెప్పడం కాళోజీ కవితా లక్షణం. ఆ సమయంలో తాను చెప్పదలుచుకున్న వారు పెద్దవారా? గొప్పవారా? మిత్రులా? ఇతరులా? అనే విషయాన్ని పట్టించుకోరు. నిజాన్ని నిర్భయంగా చెప్పడమే ఆయన తీరు.

“‘లా’ వొక్కింతయు లేదు/ ‘ఆర్డరు’విలోలంబాయె/ ‘క్రమముల్’ ఠావుల్ దప్పెను/ మూర్ఛిల్లె రాజ్యాంగమున్/ రావే ‘ధీ’ ‘క్రోధ శ్రీ’ సంరక్షించు పౌరాత్మకా!”28 “లావొక్కింతయు లేదు” అనే పోతన భాగవత పద్యం పేరడీగా ఎమర్జెన్సీ నిరసిస్తూ కొనసాగిన ఈ గేయంలో మొట్టమొదటనే ‘లా’ (న్యాయం) లేదంటూ శ్లెష వ్యంగ్యాన్ని ధ్వనింపచేసాడు. చివరలో ఉన్నట్టి ‘ధీ’ ‘క్రోధ శ్రీ’ పదాలు ఆనాటి పరిస్థితులపై కాళోజి కి ఉన్నట్టి ధర్మాగ్రహాన్ని తెలుపుతున్నాయి. ఎందుకంటే క్రోధావేశం కలిగినప్పుడు కాళోజీ కవిత్వంలో సంస్కృత పదాలతో కూడిన సంబోధనలు సమాసాలు ప్రయోగిస్తుంటాడు. 1957 లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఏర్పాటును నిరసిస్తూ “ఆకాశవీధి ఉన్మాద స్వామి/ అంధపర దేశ స్వామితాగాదనమీ”29 అని చదలవాడ పిచ్చయ్య పేరును సంస్కృతీకరించి విమర్శించాడు. ఈ పద సంస్కృతీకరణ ద్వారా తన ధర్మాగ్రహాన్ని ధని పూర్వకంగా వెళ్లగక్కాడు. మరొక సందర్భంలో నీలం సంజీవరెడ్డిని ఉద్దేశించి “ఖ్యాత మాన గాంధీ ధృత శ్వేతాంబర ధారీ!/… ….. తిమిరాంతర్య విభూషిత సమశోభాకారీ!”30 అంటూ అధిక్షేపించాడు. ఉన్నత స్థాయిలో ఉన్నత పదవుల్లో ఉన్న వ్యక్తులపై ధర్మాగ్రహాన్ని ప్రకటించాల్సిన సందర్భాల్లో ఇలా సంస్కృత భాషా దీర్ఘ సమాస చాలానాన్ని ప్రయోగించి వ్యంగ్యాత్మకంగా ధ్వని పూర్వకంగా వారిని విమర్శించేవాడు.

7. ముగింపు:

  • ‘విశ్వ శ్రేయః కావ్యం’ అనే నానుడిని విశ్వసించిన కాళోజి తన రచన ప్రజల గూర్చి, ప్రజల కొరకు, ప్రజల భాషలోనే రచించాడు.
  • “కాళోజి కావ్య సంపుటి చదివాక ప్రజలకు దగ్గరగా పోగల కావ్య రచనా విధానాన్ని గూర్చి కవులు చేసే పరిశోధన ఫలించిందనక తప్పదు”31 కవిత్వానికి కొత్త కళను తీర్చిదిద్ది నూతన ఒరవడిని సృష్టించాడని చెప్పవచ్చు.
  • ఛందోలంకారం శిల్ప మర్మాలతో కవిత్వాన్ని కొనసాగించినట్లయితే కాళోజీ మహాకవిగా పేరు ప్రతిష్ఠలు పొందగలిగేవాడు. అందులో సందేహం లేదు. కానీ ప్రజల గుండెల్లో “ప్రజాకవి”గా నిలిచేవాడు కాదు.
  • అచ్చమైన “ప్రజాకవి” కావుననే తెలంగాణ ప్రజల హృదయాల్లో అగ్రసనాధిపత్యాన్ని సంపాదించుకున్నాడు.

8. పాదసూచికలు:

  1. బి. తిరుపతిరావు, నా గొడవ కాళోజి కవితలు, పుట xxviii
  2. కాత్యాయనీ విద్మహే, 'కాళోజీ కవిత్వంలో మనిషి' ఈ మాట సెప్టెంబర్ 2014
  3. పోటీపడి కాటులాడ, నా గొడవ మొదటి సంపుటి, పుట 32
  4. వ్యత్యాసాలు, నా గొడవ మొదటి సంపుటి, పుట 5
  5. వరవరరావు, నా గొడవ కాళోజీ కవితలు, పుట xvii
  6. పోతన చేతనము, నా గొడవ పుట 329
  7. ప్రజాస్వామ్యం, నా గొడవ పుట 175
  8. కన్నీటిలో ఎన్నెన్నో కలవు, నా గొడవ పుట 28
  9. కూత - చేత, పరాభ వర్షం, నా గొడవ పుట 89
  10. చాలును, పరాభ వర్షం, నా గొడవ పుట 95
  11. ఆ కళ్ళు, పరాభవ శిశిరం, నా గొడవ పుట 155
  12. మన భూతము, పరాభవ శరత్తు, నా గొడవ 116
  13. నా గొడవ, పరాభ వసంతం, నా గొడవ పుట 49
  14. కర్షకా!, నా గొడవ మొదటి సంపుటి పుట 8
  15. కోట గోడలు కూలుతున్నాయి, నా గొడవ మొదటి సంపుటి పుట 16
  16. కాటేసి తీరాలి, నా గొడవ మొదటి సంపుటి పుట 18
  17. ఎవరనుకున్నారు ఇట్లౌనని, నా గొడవ పుట 34
  18. జంట సింగిణులు, నా గొడవ మొదటి సంపుటి పుట 18
  19. ముదిగొండ వీరభద్రయ్య, విమర్శ - కళాతత్వశాస్త్రాలు పుట 105
  20. కోకిల, నా గొడవ మొదటి సంపుటి, పుట 22
  21. కోకిల, నా గొడవ మొదటి సంపుటి, పుట 22
  22. గణనాయకా!, పరాభవసంతం, నా గొడవ పుట 50
  23. భుక్తి మార్గ కీర్తన, పరాభవ గ్రీష్మం, నా గొడవ పుట 71
  24. రఘుపతి రాఘవ రాజారాం, పరాభవ గ్రీష్మం, నా గొడవ పుట 72
  25. శాంతి! శాంతట!! శాంతి!!!, పరాభవ గ్రీష్మం, నా గొడవ పుట 69
  26. పార్టీవ్రత్యం, పరాభవ గ్రీష్మం, నా గొడవ పుట 73
  27. మారు రూపాలు, పరాభవ గ్రీష్మం, నా గొడవ పుట 73
  28. లా అండ్ ఆర్డర్, ఎమర్జెన్సీ లో నా గొడవ, పుట 185
  29. అంద పరదేశ అగాధమి, పరాభవసంతం, నా గొడవ పుట 63
  30. కూత - చేత, పరాభవ వర్షం, నా గొడవ పుట 89
  31. దాశరథి, నా గొడవ ప్రథమ ముద్రణ పీఠిక, నా గొడవ పుట 421

9. ఉపయుక్తగ్రంథసూచి:

  1. అయిలయ్య, బన్న, తెలంగాణ ఉద్యమం ప్రజాకవి కాళోజి కవిత్వం, 1969.
  2. కాళోజి, నా గొడవ. యువభారతి సాహితీ వాహిని పరంపర, సికింద్రాబాద్ 1974
  3. జగన్నాథం, పేర్వారం, కాళోజి నారాయణరావు, (మోనోగ్రాఫ్) సాహిత్య అకాడమీ, న్యూఢిల్లీ 2007
  4. తిరువెంగళాచార్యులు, వేదాల, ఆంధ్ర రసగంగాధరం శ్రీశర్వాణి వ్యాఖ్యానసహితము, 1973.
  5. తిరువెంగళాచార్యులు, వేదాల, ఆంధ్ర ధ్వన్యాలోకము, 1954.
  6. నా గొడవ, కాళోజీకవితలు, కాళోజీ ఫౌండేషన్ హైదరాబాద్ 2016
  7. రామిరెడ్డి, దువ్వూరి, అలంకారతత్వం, కవికోకిల గ్రంథావళి, 1935.
  8. వరవరరావు, గట్టు ఈశ్వర్. (సమీక్ష) "ప్రజాప్రత్యామ్నాయల్లో నూరేళ్ల కాళోజి", july 2023 సమదర్శిని
  9. వీరభద్రయ్య, ముదిగొండ. విమర్శ కళాతత్వశాస్త్రాలు, తెలుగు అకాడమీ హైదరాబాద్ 2012
  10. సూర్యనారాయణ శాస్త్రి, సన్నిధానం, కావ్యాలంకార సంగ్రహము, ఓరియంటల్ ప్రెస్, సికింద్రాబాద్, 1945.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]