AUCHITHYAM | Volume-5 | Issue-12 | November 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
2. తెలుగు సాహిత్య విమర్శ పదజాలం: పదకోశాలు- పరిశీలన
(ICSSR మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ 2023-24)
డా. సిహెచ్. లక్ష్మణచక్రవర్తి
అసిస్టెంట్ ప్రొఫెసర్ & ప్రాజెక్టు డైరెక్టర్, తెలుగు అధ్యయనశాఖ,
తెలంగాణ విశ్వవిద్యాలయం, డిచ్పల్లి,
నిజామాబాద్, తెలంగాణ.
సెల్: +91 9849714261, Email: chakravarthy.hyd@gmail.com
జాగర్ల మహేందర్
రీసెర్చ్ అసిస్టెంట్ (ICSSR-ప్రాజెక్ట్), తెలుగు అధ్యయనశాఖ,
తెలంగాణ విశ్వవిద్యాలయం, డిచ్పల్లి,
నిజామాబాద్, తెలంగాణ.
సెల్: +91 8008252967, Email: jmrhcu143@gmail.com
DOWNLOAD
PDF
సమర్పణ (D.O.S): 19.10.2024 ఎంపిక (D.O.A): 27.10.2024 ప్రచురణ (D.O.P): 01.11.2024
వ్యాససంగ్రహం:
తెలుగు సాహిత్యవిమర్శ ప్రారంభమయి 150 సంవత్యరాలు గడుస్తున్నది. ఎందరో విమర్శకుల విమర్శరీతులు ఈ కాలంలో కనిపిస్తున్నాయి. ఈ విమర్శరీతులలో ప్రాచ్య ప్రాశ్చాత్య ప్రభావాలకు లోను అయినవి ఉన్నాయి. ఈ క్రమంలో ఆలంకారికులు సృష్టించిన సాహిత్య శాస్త్ర పరిభాష, పాశ్చాత్యులు విమర్శలకు సంబంధించిన పరిభాష తెలుగు సాహిత్య విమర్శలో తొలి నుంచి కనిపిస్తున్నది. వాటి అధ్యయన అవసరం ఉంది. ఈ విమర్శ పదజాలాన్ని పరిచయం చేస్తూ కొన్ని పదకోశాలు తెలుగులో వెలువడ్డాయి. సాహిత్య విమర్శ పదకోశాలు ఈ కింది రీతులలో కనిపిస్తున్నాయి. 1. ఆలంకారికులు సృష్టించిన పదజాలానికి సంబంధించినవి: (సాహిత్య పదకోశము-మిరియాల రామకృష్ణ,ముకురాల రామారెడ్డి), ఆంగ్లసాహిత్యశాస్త్రానికి చెందినవి. (ఆంగ్ల సాహిత్య శాస్త్ర పదకోశం-బి.వెంకటేశ్వర్లు), ప్రక్రియా పరమయినవి. (నాటకరంగ పారిభాషికపదకోశం- మొదలి నాగభూషణశర్మ), తెలుగు సాహిత్య విమర్శపదాలను వివరించేవి. (సాహిత్య విమర్శ పదాల డిక్షనరీ-ఎస్.ఎస్.నళిని), ఆయా విమర్శ రీతులకు చెందిన పరిభాషకు సంబంధించినవి. మార్క్సిస్టు నిఘంటువు-1-కృష్ణారావు, రావు). 2. సాహిత్య పదజాలం గురించి నిఘంటురూపంలో అధ్యయనం: మానవీయశాస్త్రాల పరిభాష. (బి.తిరుపతిరావు), ఆధునిక వ్యవహారకోశం. (బూదరాజు రాధాకృష్ణ)., తెలుగు అకాడెమీ ప్రచురించిన పారిభాషిక పదకోశాలు. (భాషాశాస్త్రం, తత్త్వశాస్త్రం., శాస్త్రనామనిఘంటువు)., నిఘంటు రూపంలో ఆయా ఇంగ్లీషు పదాలకు తెలుగు సమానార్థకమైన పదాన్ని ఇస్తూ తయారు చేసినవి., 3. ఆయాభావనలను, పరిభాషను చర్చించినవి: తెలుగు సాహిత్య విమర్శ దర్శనం పేరుతో సిహెచ్.లక్ష్మణ చక్రవర్తి సంపాదకత్వంలో వెలువడ్డ విజ్ఞాన సర్వస్వంలో ప్రాచ్యప్రాశ్చాత్య భావనలకు చెందిన సుమారు (౩౦౦)మూడు వందలకు పైగా పారిభాషికపదాలకు సంబంధించిన వివరణ వుంది., సాహిత్యం మౌలికభావనలు పేరుతో పాపినేని శివశంకర్ పరిశోధన పదకోశం, నిఘంటువురూపం కాకుండా సాహిత్య విమర్శకు సంబంధించిన మౌలిక భావనలను విశ్లేషించింది. పై రీతులలో జరిగిన కృషికి అనుబంధంగా ప్రాచ్య ప్రాశ్చాత్య భావనలు తెలుగు సాహిత్య విమర్శలో వ్యక్తమైన రీతిని ,ఆయా పరిభాషపదాల అనువాదాన్ని, తెలుగు సాహిత్య విమర్శకుల మౌలిక వివేచనను, పరిభాష సృష్టిని అధ్యయనం చేయవచ్చు. ముఖ్యంగా ప్రాచ్య ప్రాశ్చాత్య భావనల అనుస్యూతి పరిభాష పరంగా తెలుగు సాహిత్యంలో ఎట్లా ఉందో ఈ పరిశోధన వివరించగలుగుతుంది. అనుసరించిన పరిశోధన పద్ధతులు: సేకరణ, విశ్లేషణపద్ధతి. ఈ రీతిలో మరింత కృషి జరగడానికి ప్రాశ్చాత్య దేశాలలో వచ్చిన పదకోశాల రీతిని అధ్యయనం చేయడం ద్వారా తెలుగులో సాహిత్య విమర్శ పదజాలానికి సంబంధించి జరగవలసిన కృషిని చెప్పడానికి తోడ్పడుతుంది.
Keywords: సాహిత్యవిమర్శ, విమర్శరీతులు, పరిభాష, విమర్శపదజాలం, పదకోశాలు, విమర్శకులు
1. ఉపోద్ఘాతం:
తెలుగు సాహిత్యవిమర్శ ప్రారంభమయి 150 సంవత్సరాలు దాటింది. ఎందరో విమర్శకులు విమర్శరీతులను ప్రాచ్య పాశ్చాత్య ప్రభావంతో కొనసాగించారు. కొత్త మార్గాలను, అనుశీలన రీతులను సాహిత్య విమర్శలో ప్రవేశ పెట్టారు. తమ ముద్రను నిలుపుకున్నారు. ఈ క్రమంలో సాహిత్య విమర్శ రచన, రచయిత, సమాజం పాఠకుడు కేంద్రంగా ఎదిగింది. లక్ష్యం-లక్షణం, విషయం-విధానం, వస్తువు-శిల్పం, సంవిధానం అన్న రీతులలో విమర్శను విభజించవచ్చు. సాహిత్య పరిణామాన్ని గుర్తించడానికి ఈ మార్గాలు ఎంతగా పనిచేస్తాయో సాహిత్య విమర్శ పరిభాష కూడా అంతే ఉపయోగపడుతుంది.
2. పరిభాష అంటే:
సామాన్య వ్యవహారానికి సామాన్య పదజాలం సరిపోతుంది. కాని కొన్ని కొన్ని విషయాలను, ప్రత్యేక సందర్భాలను చెప్పడానికి ప్రత్యేక పదాలు అవసరమవుతాయి. పారిభాషికతను నిర్దేశించవలసి వస్తుంది. అలా జరిగినప్పుడు అల్ప ప్రయత్నంతో అనల్ఫార్థస్ఫూర్తి కలిగే పదాన్ని సూచించవలసిన అవసరం ఏర్పడుతుంది. సామాన్య వ్యవహారంలో కొత్తభావనలను ప్రకటించడానికి, ఒక ప్రత్యేక రంగానికి కావలసి పదజాలాన్ని పెంపుచేసుకొంటాం. పారిభాషికాల ఉత్పత్తి వినియోగాలు ఒక్కొక్క ప్రత్యేక వర్గం, శాస్త్రం మీద ఆధారపడి ఉంటాయి. సమాజంలో ఉన్న పదం పరిభాషగా ఉన్న పదం లాంటిదే అయినా రెండింటి మధ్య అర్థభేదం ఉంటుంది. కాబట్టి పరిభాష పదజాలాన్ని రూపొందించే వారు ఆ భావనకు సహజమైన పద్ధతిలోనే అది అర్థం అయ్యేట్టు చేస్తారు. పదవ్యుత్పత్తి గ్రహించినా, వదబంధాన్ని విశ్లేషించి చూసినా సరిపోదు. దానికొక నిర్వచనం చెప్పాలి. అప్పుడే పారిభాషికార్థం స్పష్టంగా తెలుస్తుంది. ఇవి వ్యస్తపదాలు కావచ్చు, సమస్తపదాలు కావచ్చు, పదబంధాలు కావచ్చు సాధారణ పదాల భావనలు, శాస్త్ర సాంకేతిక పదాల భావనలు వేరువేరు. సాధారణ పదాల భావనలు వస్తువు గుణగణాలను, తత్సంబంధాలను చెబితే, సాంకేతిక భావనలు సాంకేతిక పదాలను అనుసరించి ఉంటాయి.
ఉత్తమమైన దాన్ని నిర్ణయించడానికి శాస్త్రకారుడు అనేక ప్రమాణాలను ఏర్పరుస్తాడు. ఆ ప్రమాణాలకు తగిన ఉదాహరణలు, ఆధారాలు చూపుతాడు. ఇవి మరింత స్పష్టంగా అర్థం కావడానికి భావనలను తయారు చేస్తాడు. అవి సాధారణ, శాస్త్ర పాఠకులు ఇద్దరికీ అవసరమయిన, స్పష్టమైన రీతిలో చెప్పడానికి శాస్త్ర కారుడు పరిభాషను సృష్టించ వలసి వస్తుంది
3. పరిభాష – నిర్వచనాలు:
- “విజ్ఞానశాస్త్రాలలోను (సైన్సెస్), మానవీయ శాస్త్రాలలోను (హ్యుమానిటీస్), సారస్వత కళా రంగాలలోను, రాజకీయ వాణిజ్య వరిపాలనా రంగాలలోను, వృత్తి విద్యలలోను, ఇంజనీరింగ్, ఇతర సాంకేతిక విద్యలలోను ప్రత్యేకార్థాలలో వాడుకలో ఉన్న నిర్దిష్టపదాలు పారిభాషికాలు”[1] (పారిభాషిక పదాలు: కల్పనాశిల్ప రీతులు వ్యాసం, 1992:60)
- “Technical terms are the significant components of a technical and scientific language- Cluver, Dev. A.D.
- Any conventional symbol for a concept (any unit of thought including both abstract ideas and concrete objects) the use of which is restricted to the specialists to a particular field of knowledge – Vocabulary of Terminology, International Organization, Switzerland.
- A technical term replaces long phrase or even a complicated discourse and its meaning is fixed by an agreement of definition- Bloomfield.”[2](తెలుగులో సాంకేతిక పదాల రూపకల్పన:భాషాశాస్త్ర సూత్రాలు వ్యాసం,2022:26)
పారిభాషిక పదాలయిన వాటికి ఈ రకంగా ఎన్ని నిర్వచనాలను చెప్పినా ఒక భావనను తక్కువ మాటలతో చెప్పడానికి ప్రయత్నం చేసేవి పారిభాషిక పదాలు. అర్థసంకోచం వలన ఈ పదాలు ఏర్పడతాయి. పరిభాష ను ఎంత నిర్వచించుకున్నా అతివ్యాప్తి, అవ్యాప్తి లేకుండా చెప్పడం కష్టం.
1.2. సాహిత్యవిమర్శలో పరిభాష - పదాలు:
సాహిత్యవిమర్శలో ప్రక్రియలు, ప్రక్రియా భేదాలు, భావనలు, ధోరణులు, యుగాలు, సిద్ధాంతాలు, సాంకేతికంగా ఒక అర్థాన్ని వివరించేవి పరిభాషగా గుర్తించబడతాయి.
సాహిత్య విమర్శ భాషశాస్త్రం, వ్యాకరణం వంటిది కాదు. అక్కడ ఆయా అంశాలు సాంకేతికమైనవి సాహిత్యవిమర్శలో భావనలు, సాంకేతిక పదాలు మాత్రమే గాక సామాజిక, సాహిత్య సిద్ధాంతాలు, ఆయా సాహిత్యయుగాలు, ఉద్యమాలు ధోరణులు, వాదాలు, సిద్ధాంతాలు, ప్రక్రియలు, ప్రక్రియా భేదాలు కూడా సాహిత్య విమర్శ పరిభాష పదాలుగా కనిపిస్తాయి.
అలంకారశాస్త్రంలో సాహిత్య సిద్ధాంతాలు, వాటిని అర్థం చేసుకోవడానికి అవసరమైన సాంకేతికపదాలు పరిభాష గౌరవాన్ని పొందాయి. అదే సందర్భంలో దృశ్య, శ్రవ్య కావ్యాలు వాటి భేదాలు, ఉపవిభజనలు రూపకభేదాలు వంటివన్నీ ప్రక్రియలుగా, ప్రక్రియా భేదాలుగా కనిపిస్తాయి. వీటిని వివరించడమూ కనిపిస్తుంది.
ఆధునిక యుగంలో ప్రాశ్చాత్య ప్రభావంతో ఎన్నోప్రక్రియలు తెలుగులోకి వచ్చి చేరాయి. కథానిక, నవల, విషాదాంత నాటకం, స్కెచ్, వచన కవిత, హైకు వంటి కవిత్వ, కవిత్వేతర ప్రక్రియలు ప్రాశ్చాత్య ప్రభావజనితాలే. ఇవి కూడా సాహిత్య విమర్శ పరిభాషలో భాగమే.
సామాజిక ఉద్యమాలు ధోరణులు సాహిత్య పరిణామంలో భాగం. ఆ యుగాలలోని కవులు, వారిపై పడిన ప్రభావాలు సాహిత్య చరిత్రలో చర్చనీయాంశాలు. ఆ ఉద్యమాల స్వరూప స్వభావాలు వాటి మేనిఫెస్టోలు సాహిత్య విమర్శకు ఆకరాలు. ఇవన్నీ సూచించడానికి భావకవిత్వం, అభ్యుదయకవిత్వం, విప్లవకవిత్వం అని ఆయావాదాలు, ఉద్యమాలను సాహిత్యవిమర్శకులు వ్యవహరిస్తూ ఉంటారు. ఇవి భావనలుగా చర్చించబడతాయి.
ఆయా ఉద్యమాలు, ధోరణులకు సాహిత్య, సాహిత్యేతర సిద్ధాంతాలు కారణమవుతుంటాయి. ఆ వాదాల వెనుక ఉన్న సైద్ధాంతిక దృక్పథాలు పరిభాష గౌరవాన్ని పొంది సాహిత్య విమర్శలో ప్రవర్తిస్తూ ఉంటాయి. ధ్వని, వక్రోక్తి, ఔచిత్యం వంటివి సాహిత్య సిద్ధాంతాలయితే ఆధునికయుగంలోని వివిధ దృక్పథాలు సామాజిక సిద్ధాంత స్థాయిని పొందుతాయి. ఆయా కవితా ఉద్యమాలు ధోరణుల వెనుక ఈ సిద్ధాంతాలు ఉంటాయి. అవి పరిభాషగా సాహిత్య విమర్శలో ఉపయోగంలో ఉంటాయి.
అలంకార శాస్త్రంలో ధ్వని భేదాలు, వక్రోక్తి భేదాలు, కావ్య గుణాలు, కావ్య హేతువులలోని ప్రతిభ, వ్యుత్పత్తి, అభ్యాసాలు భావనల స్థాయి కలిగినవి. ఆధునిక సాహిత్య విమర్శలో వాస్తవికత, వస్తువు, రూపం, అస్పష్టత, నిబద్ధత, కళాత్మకత వంటివి మౌలిక భావనలు. ఆధునిక అనంతర వాదంలో వివిధ సామాజిక శాస్త్రాల నుంచీ భావనలు సాహిత్య విమర్శలో కనిపిస్తున్నాయి.
1.3. సాహిత్య విమర్శ పదజాలం రకాలు:
తెలుగుసాహిత్యవిమర్శలో కనిపిస్తున్న విమర్శ పదజాలాన్ని ఆరు రకాలుగా విభజించవచ్చు.
1. భారతీయ అలంకారశాస్త్రం కల్పించిన సాహిత్యశాస్త్ర పరిభాషను తత్సమీకరించుకుని వాటిని అదే అర్థంలో ఉపయోగించుకోవడం:
ఉదా. రసం, ధ్వని, సహృదయుడు, సామాజికుడు, శయ్య, పాకం. ఈ పరిభాష అంతా అలంకారశాస్త్రం పై ఆధార పడింది.
అయితే తెలుగు లక్షణ గ్రంథాలలో భారతీయ అలంకారశాస్త్ర పరిభాష అవగాహన, ఆ మాటల తెలివిడితో సాహిత్య శాస్త్రానికి దగ్గరగా కొత్త మాటలను కల్పించడం కూడా కనిపిస్తుంది. విన్నకోట పెద్దన కావ్యాలంకారచూడామణిలో విద్దలి, సద్దలి, పద్దలి, ఉత్పులకము వంటి కావ్య భేదాలు చెప్పాడు.
2. పాశ్చాత్యసాహిత్య విమర్శ శాస్త్రం ద్వారా పరిచయమైన భావనలను, పరిభాషను తెలుగులోకి అన్వయించుకుని, అనువదించుకుని ఉపయోగించుకోవడం:
ఉదా. stream of consciousness చైతన్యస్రవంతి అని, Irony ని వ్యంగ్యం అని, styleను శైలి అని ఉపయోగించుకోవడం. ఇంగ్లీషు మాటకు తగినట్లుగా తెలుగు అనువాదం చేయడం.లేదా సమానార్థక పదాన్ని , మన భాషలో ఆభావనకు దగ్గరగా ఉన్న పదాన్ని చూపడం కనిపిస్తుంది. టి.ఎస్. ఇలియట్ చెప్పిన Objective corelative ను విభావం అనడం, Style ను రీతి అనడం ఇటువంటివే.
Inner being- అంతరమూర్తి, Arts of Pleasure - విలాసకళలు
Aesthetic Arts – సరసకళలు Imitation - యథాతథ ప్రతిబింబము.
- ఈ మాటలు పింగళిలక్ష్మీకాంతం అనువాదాలు[3] (ఆధునిక సాహిత్య విమర్శకులు ప్రస్థానాలు 2008, మొదటి భాగం పుట 114)
Harmony - మేళన Comedy - మోదరూపకం,
Tragic Flow – విషాదదోషం Sublime - రమణీయోదాత్తత
Wit - ఉక్తి వైచిత్రి. decorum - ఔచిత్యం
- ఈ మాటలు వడలి మందేశ్వరరావు అనువాదాలు[4] (ఆధునిక సాహిత్య విమర్శకులు ప్రస్థానాలు 2008, రెండవ భాగం పుట 32,33)
3. భారతదేశంలో అయినా, పాశ్చాత్యదేశాల్లో అయినా సాహిత్యేతర శాస్త్రాలకు సంబంధించిన పరిభాషను అదే అర్థంలో సాహిత్యానికి అన్వయించుకుని చెప్పడం లేదా కొంత అర్థభేదంతో వివరిస్తూ ఉపయోగించడం:
ప్రాచీన కాలంలో వేదాంతశాస్త్ర పరిభాష అలంకారశాస్త్రంలో కనిపిస్తుంది. ఇటీవల బి. తిరుపతిరావు వంటి విమర్శకులలో సామాజికశాస్త్రంలో ప్రసిద్ధమైన పదబంధాలు, పరిభాష తెలుగు సాహిత్యవిమర్శలో కనిపిస్తున్నాయి. ఈయన మానవీయ శాస్త్రాలలోని ఇంగ్లీషుపరిభాష ను తెలుగులోకి అనువదించడం, ఇప్పటికే అనువదించిన వాటిని ఒకచోట చేర్చడం చేశారు.
4. తెలుగు విమర్శకులు ఒక సిద్ధాంతాన్నీగానీ, ఒక రచనను గానీ విశ్లేషిస్తున్నప్పుడు ఆ సందర్భానికి అనుగుణంగా అవసరమైన నూతన విమర్శ పదాలను సృష్టిస్తూ దానికి పారిభాషికతను కల్పించడం:
వస్తుకళ, భావకళ, రచనాకళ (రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ)కావ్య పరమార్థ దృక్పథము, జీవునివేదన, (విశ్వనాథ సత్యనారాయణ) సంవిధానము, రసన,( శ్రీశ్రీ )
5. Aesthetics ను కళాతత్త్వ శాస్త్రం అంటున్నాం. లలిత కళలయిన చిత్రలేఖనం, శిల్పం, సంగీతం,నాట్యం నుంచి కూడా పరిభాష పదాలు సాహిత్య విమర్శలోకి వచ్చాయి:
ఉదా. ఇమేజరీ, శిల్పం, లయ వంటివి'లయ' సంగీత శాస్త్రానికి సంబంధించిన పదం. దీన్ని కళాసామాన్యం చేశారు రాళ్ళపల్లి. 'భావచిత్రం' లో కనిపించే పరిభాషలో చిత్రకళకు సంబంధించినవి కొన్ని ఉన్నాయి
6. ఒక పదానికి విశేషణంగా అనేక మాటలు వాడి పరిభాషను తయారుచేయడం:
ఉదా. శైలి, వ్యూహం, శిల్పం అన్న పదాలు ఈ ధోరణిలో కనిపిస్తాయి.
శైలి:-. ఆలంకారికశైలి, కవితాత్మకశైలి వంటివి ఇందుకు ఉదాహరణలుగా చెప్పవచ్చు.
వ్యూహం:-కల్పనల ఖండన వ్యూహం. ప్రతికల్పనల కల్పనవ్యూహం, -సరళీకరణవ్యూహం:-విస్తరణ వ్యూహం:-
శిల్పం:- దృశ్యమాన శిల్పం, కాంట్రాస్ట్ శిల్పం, గుప్తశిల్పం, బాహ్యశిల్పం. సన్నివేశశిల్పం, అధివాస్తవికశిల్పం, ధ్వనిశిల్పం, సాహిత్యశిల్పం, భాషాశిల్పం, దళితశిల్పం, గతస్మరణశిల్పం, నిసర్గశిల్పం, పండిత శిల్పం అన్న మాటలు కనిపిస్తాయి
2. పారిభాషికపదకోశాలు - రకాలు:
సాహిత్య విమర్శ పరిభాషను వివిధ విమర్శకులు రచించిన గ్రంథాల నుంచీ సేకరించడం ఒక పద్ధతి. అయితే సాహిత్య విమర్శ వికాసంలో పరిభాష ప్రాధాన్యాన్ని విమర్శ పదజాలం అవసరాన్ని గుర్తించిన కొందరు సాహిత్య విమర్శకు సంబంధించిన పదకోశాలను సిద్ధం చేశారు.
తెలుగు అకాడమీ వివిధ శాస్త్ర సంబంధమైన పదకోశాలను, సిద్ధం చేసి అందుకు తగిన మార్గాన్ని వేసింది. పదకోశాల విస్తృత ప్రాతిపదిక మీద జరగాలంటే వ్యక్తుల కృషి కంటే సంస్థల కృషి ఎక్కువ అవసరం. పదకోశాల తయారీలో సాహిత్య శాస్త్రం సాహిత్య విమర్శకులకు సంబంధించి సంస్థలు, వ్యక్తులు చేసిన కృషి తెలుగు సాహిత్య రంగంలో కనిపిస్తుంది. ఇవి అలంకార శాస్త్రం, పాశాత్య సాహిత్య విమర్శ, వివిధ మానవీయ శాస్త్రాలకు సంబంధించినవి.
2.1. అలంకారశాస్త్ర పరిభాష:
సాహిత్యం అంటే ఏమిటి, దాని స్వభావం ఏమిటి, దాన్ని సృష్టించేవాడికి ఉండవలసిన గుణాలేమిటి, అది జీవించి ఉండడానికి గల కారణాలేమిటి, అనుభూతి అంటే ఏమిటి,అది ఎలా కలుగుతుంది వంటి అంశాలను భారతీయ సాహిత్య సిద్ధాంతం చర్చిస్తుంది. సాహిత్యశాస్త్రం, అలంకార శాస్త్రం, కావ్యశాస్త్రం అన్నవి భారతీయ సాహిత్య సిద్ధాంతానికి ఉన్నపేర్లు. భరతుడి నాటి నుంచి జగన్నాథ పండిత రాయల దాకా సాహిత్యానికి సంబంధించి ఈ దేశంలో సాగిన ఆలోచనాధార, విచార విధానం, వివిధాంశాల ప్రతిపాదనలు చర్చలు, సిద్ధాంతాలూ మొదలైన ఈ సమస్తాన్నీ భారతీయ సాహిత్య సిద్ధాంతాలంటారు. ఈ సిద్ధాంత కర్తలు దానికి అనుగుణమయిన పరిభాషను సృజించారు.
2.1.1. సాహిత్యపదకోశం
అలంకార శాస్త్రానికి సంబంధించి తెలుగులో ఇప్పటికి కనిపిస్తున్న పదకోశం తెలుగు అకాడమి ప్రచురించిన సాహిత్యపదకోశం. దీన్ని మిరియాల రామకృష్ణ, ముకురాల రామారెడ్డి కూర్చారు. శ్రవ్య, దృశ్య, అలంకార విభాగాలుగా రూపొందించిన ఈ కోశంలో భారతీయాలంకారికులు రూపొందించిన పరిభాషతో బాటు అరిస్టాటిల్, ప్లేటో వంటి వారి రచనల్లో కనిపించే పరిభాషను కూడా సేకరించి వివరించారు. అలంకారికుల పరిభాషకు సంస్కృత నిర్వచనం కొంత, తెలుగు వివరణలతో ఈ పరిభాష కోశాన్ని సిద్ధం చేసారు.
తెలుగులో పెద్దన కావ్యాలంకార చూడామణిలో విద్దలి, పద్దలి, సద్దలి, ఉత్పులకము వంటి కావ్యాలను ఉదహరించారు. తెలుగు అలంకారశాస్త్రం నుండి ఈ పదాలను మాత్రమే ఈ పదకోశం స్వీకరించింది. హిందీలో వచ్చిన హిందీ సాహిత్యకోశ్, కావ్యాలంకారసంగ్రహం, ప్రతాపరుద్రయశోభూషణం వంటి రచనలను, అలంకారశాస్త్ర గ్రంథాలను ఆధారం చేసుకుని ఈ పదకోశాన్ని సిద్ధంచేసారు. ఒకే పరిభాషకు రెండు మూడురకాలుగా వివరణలున్నాయి, సమాధి అన్న కావ్య గుణానికి దండి వామనుల నిర్వచనాలు వేరు వేరు.
అలంకారశాస్త్రంపైన వేదాంతపరిభాష ప్రభావం ఎక్కువగా ఉంది. రసానందం, బ్రహ్మానందం, వాసన వంటి మాటలను వేదాంత పరిజ్ఞానం లేకుండా వివరించే అవకాశం తక్కువ. అందువల్ల అలంకారశాస్త్రంపైన ప్రభావం చూపిన ఇతర శాస్త్రాలనుకూడా దృష్టిలో ఉంచుకుని పరిభాషలను వివరించవలసిన అవసరం ఉంది. తెలుగు అకాడమి తయారుచేసిన పదకోశంలో ఒకే పరిభాషకు పర్యాయ పదాలున్నప్పుడు ఏది ఎక్కువ ప్రచారంలో ఉన్నదో దానినే ప్రధాన ఆరోపంగా గ్రహించి తక్కిన పర్యాయపదాలు ప్రత్యేక ఆరోపాలుగా చూపించారు. ఇదే పద్ధతిలో ముకురాల రామిరెడ్డి సాహిత్య నిఘంటువును సిద్ధం చేసారు కానీ ఇది ముద్రణకు నోచుకోలేదు.
అలంకారశాస్త్రం అనగానే అక్కడ చెప్పిన పరిభాషనే తీసుకోవడంతో తర్వాత సిద్ధమైన పరిభాష అనాదరణకు గురి అయింది. ఆలంకారికుల ఆలోచనలలాగే ఉన్నా తెలుగు కవులూ ప్రసన్నకథ, వస్తుకవిత, సంవిధాన చక్రవర్తి, నవీనగుణసనాథ వంటి పదాలను బిరుదులుగానో, కవితా వ్యక్తిత్వంగానో గాకుండా ఒక పరిభాషగా చూడవలసిన అవసరాన్ని గత ఐదారు దశాబ్దాలుగానే గుర్తిస్తున్నాం. శ్రీనాథుడు ఇతర కవుల రచనలలో గుర్తించిన లక్షణాలు కూడా పరిభాష గౌరవం కలిగినవే. వీటిని వివరించుకుని తెలుగువారు అలంకారశాస్త్ర వికాసానికి చేసిన దోహదాన్ని గుర్తించవలసి ఉంది. వీటికి ఒక కోశాన్ని సిద్ధం చేసుకోవాల్సిఉంది.
2.2. ఆంగ్ల సాహిత్య శాస్త్ర, సాహిత్యేతర శాస్త్ర పరిభాషలకు చెందినవి:
తెలుగులో ఆధునిక సాహిత్య విమర్శ ప్రాశ్చాత్య ప్రభావంతో ఉండడం వలన వివిధ ప్రక్రియలు, భావనలు, సిద్ధాంతాలు తెలుగు సాహిత్యవిమర్శలో ప్రవేశించాయి. అనివార్యంగా ప్రాశ్చాత్య సాహిత్యశాస్త్రం, సాహిత్య విమర్శ పదజాలం తెలుగు సాహిత్య విమర్శలోకి వచ్చి చేరాయి. వాటిని వివరిస్తూ అనువదిస్తూ తెలుగులో పదకోశాలు వెలువడ్డాయి. ఇవి వివరణాత్మకంగా కాకుండా నిఘంటురూపంలో ఇంగ్లీషు పరిభాషకు సమానార్థకమైన తెలుగుమాటను ఇచ్చినవి కనిపిస్తాయి.
2.2.1. ఆంగ్ల సాహిత్య శాస్త్ర పదకోశం - బొద్దుల వెంకటేశం:
ఆధునిక సాహిత్య విమర్శలో సంస్కృత అలంకార శాస్త్రాల కంటే పాశ్చాత్య సాహిత్య విమర్శ రీతుల, పరిభాషల ప్రయోగమే ఎక్కువ. ఈ దృష్టితో ఇంగ్లీషు సాహిత్య విమర్శ పదాలను తెలుగులో అనువదించి ఈ కోశం వివరించారు బొద్దుల వెంకటేశం. “ప్లేటో సాహిత్య అభిశంస మొదలుకొని నవ్య సాహిత్య విమర్శ వరకు పాశ్చాత్య సాహిత్య శాస్త్రంలో ప్రముఖంగా భావింపబడిన సుమారు 900 పైగా విమర్శనాత్మక పదాలు ఈ గ్రంథంలో వివరించబడినాయి”[5] అని (ఆంగ్ల సాహిత్య శాస్త్ర పదకోశం,2013: పు.3) కూర్పరి పేర్కొన్నారు.
ఇంగ్లీషు సాహిత్య విమర్శలోని పదజాలానికి తెలుగు పదాన్ని/పరిభాషను చూపడంలో బొద్దుల వెంకటేశం ఈ కింది పద్ధతులను అనుసరించారు.
- అకారాది క్రమాన్ని అనుసరించడం.
- ఇంగ్లీషులోని పదానికి భావనకు దగ్గరగా ఉన్న పదాన్ని సూచించడం, కొంత క్లిష్టత ఉన్నప్పుడు హిందీ భాష సహాయం తీసుకోవడం.
- ఇంగ్లీషులోఆరోపం/ ఇంగ్లీషు మాటను తెలుగు లిప్యంతరీకరణతో చూపి దానికి సమానార్థక తెలుగు పదం చూపడం లేదా అనువదించడం.
- ఇంగ్లీషు సాహిత్య శాస్త్ర పదాలకే ఉద్దేశితమైనా వాటిని అక్కడక్కడా భారతీయ అలంకార శాస్త్ర పదాలతో పోల్చడం.
ఇవి పదకోశం నిర్మాణంలో అనుసరించిన పద్ధతులు.
అయితే ఈ పదకోశ నిర్మాణంలో ఆయా భావనల/పరిభాషలను మూలగ్రంథంనుంచీ తీసుకున్నారా? లేక ఏదైనా ఒకటి, రెండు ఇంగ్లీషు లో వచ్చిన పదకోశాలను ఆధారంగా చేసుకొని దీన్ని సిద్ధం చేశారా? అన్న విషయం స్పష్టంగా తెలియదు. అదే సందర్భంలో పూర్వులు చేసిన అనువాదమా? తానే చేశారా అన్నది తెలియదు.
పదకోశంలో ఒక పరిభాష పదాన్ని ఆరోపంగా ఇచ్చి దాన్ని ఉపయోగించిన వారిని, ఉపయోగించిన సందర్భాన్ని తెలియపరుస్తూ, దానికి అలంకారశాస్త్రంలోనూ వ్యవహారం ఉంటే రెండిటినీ తులనాత్మకంగా వివరించారు.
ఉదా: Act (ఆక్ట్) అంకం. అరిస్టాటిల్ భరతుని అభిప్రాయాలను చెప్పారు. నాటకంలోని కథాఘట్టాల విభాగాన్ని అంకం అనడంతో బాటు దశరూపకాల్లోనూ అంకం ఒక నాటక భేదమని దాన్ని ప్రస్తావించి భారతీయ దృక్కోణాన్ని స్పష్టంగా వివరించారు.
Actuality - వాస్తవికత అన్న అనువాదం కనిపిస్తుంది. అయితే సాహిత్యలోకంలో Reality/Realismకు సమానంగా వాస్తవికత/వాస్తవికవాదం అన్నమాట ఎక్కువగా వ్యవహారంలో ఉంది.
Agon - నాట్యవివాదం, వాగ్యుద్ధం అని రెండురకాల అనువాదాలు ఉన్నా పాత్రల మధ్య జరిగే వాద వివాదాన్ని, బృంద గాయకులు రెండుగా చీలి చేసే వివాదం Agon,. దీనికి నాట్య వివాదం సరైన అనువాదం. వాగ్యుద్ధం ఇక్కడ ఈ అర్ధాన్ని ఇవ్వదు. ఇటువంటి కొన్ని కొన్ని లోపాలున్నా ఇంగ్లీషు సాహిత్య విమర్శలో కనిపించే చాలా వరకు పదాలను తెలుగులో వివరించడం ఈ పదకోశం ప్రత్యేకత. ఇంగ్లీషులో తరచుగా ఉపయోగించే పదాలూ ఈ కోశం ద్వారా తెలుస్తాయి. అయితే చాలా పదాలకు సాహిత్య విమర్శకులలో ఎక్కువగా వాడుకలో వ్యవహారంలో ఉన్నవి కాక భిన్నమైన అనువాదం కనిపిస్తుంది. అవి ఇంగ్లీషు మాటకు సరైన అనువాదమే అయినా సాహిత్య విమర్శ వ్యవహారంలో ఆ పదం తెలుగులో మరో అర్థంలో, భావనలో వాడటం కనిపిస్తుంది.
2.2.2. మానవీయ శాస్త్రాల పరిభాష - బి. తిరుపతిరావు:
సాహిత్య విమర్శ పదజాలం విషయంలో ఈ రచన పరోక్ష పద్ధతికి చెందింది. 1960ల తర్వాత మానవీయ శాస్త్రాల అభివృద్ధి విస్తృతంగా జరిగింది. కాలానుగుణంగా ఆధునిక సాహిత్య విమర్శలో మానవీయ శాస్త్రాల ప్రభావం, పరిభాషల వాడకం కనిపిస్తుంది. ఆధునిక కాలంలో ఇటీవల అధ్యయనాలు Inter Disciplinary లో జరుగుతుండడం వలన ఈ నిఘంటువు ప్రయోజనం మరింత ఎక్కువ. ఇది ఇంగ్లీషు పదాన్ని ఇచ్చిదానికి తెలుగు మాటను చెప్పే పద్ధతిలో కూర్చిన నిఘంటువు. ఆయా పదాలకు సమాన పదం ఉంటుంది కానీ వివరణ ఉండదు.
- మానవీయ శాస్త్రాలలో వర్తమానకాలంలో ఉపయోగిస్తున్న మాటలకు తెలుగు పదాల్ని రూపొందించడం.
- ఇప్పటికే ఆ పదాలకు ఉన్న సమాన పదాల్ని సేకరించడం.
- గత వందేళ్లలో రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత సిద్ధాంతాలు, వాదాలు, శాస్త్రాల్లోని పరిభాషను గ్రహించడం. ఈ నిఘంటు నిర్మాత అనుసరించిన పద్ధతి. మానవీయ శాస్త్రాల్లో సాహిత్యమూ ఒక అంశం. అందువల్ల సాహిత్య పదాలు ఈ నిఘంటువులో కనిపిస్తాయి. పరిభాష ఇంగ్లీషులో పదబంధంగా కనిపించినా తెలుగులో ఒక్కొక్కసారి వాక్యరూపంగా కనిపించడం పరిభాష అనువాదంలా/సమానార్థక పదం దొరకనప్పుడున్న సమస్యగా ఈ గ్రంథం చెబుతుంది.
చరిత్ర, సంస్కృతి, సాహిత్యం, భాష, న్యాయం, తత్వం, వాస్తు, మతం, నైతిక శాస్త్రాలన్నీ మానవీయ శాస్త్రాల్లో భాగం. ఒక పదం నుంచీ పుట్టిన మరికొన్ని పదాలు పరిభాషలో ఈ గ్రంథం ద్వారా తెలుస్తాయి.
Decipher - చిక్కురాతను వివరించడం.
Euthanasia Murders – కారుణ్య పూరిత మరణ హత్యలు వంటివి వాక్యరూప వివరణలకు ఉదాహరణలు.
ఆధునిక అనంతర వాదం ఆధునిక సాహిత్య విమర్శలోకి ప్రవేశించిన వివిధ సామాజిక శాస్త్రాల పరిభాషకు సంబంధించిన పదాలకు సమానార్థకమైన తెలుగు మాటలను గుర్తించడానికి ఈ కోశం ఉపయోగపడుతుంది.
Self-Deception - స్వయం వంచన అని అనువదించారు. స్వీయ వంచన/స్వవంచన అని అనువదించవచ్చు. Self - అన్న మాటను ‘స్వయం’ అని అనువదించుకుని Self చేరిన మాటలన్నీ - స్వయం నియంత్రణవాదం, స్వయం నియతివాదం, స్వయం నిర్దేశితవాదం అన్న రీతిలో అనువదించారు. ఇవి స్వనియంత్రణ/స్వనియతి, స్వనిర్దేశిత అన్న రీతిలో అనువదించవచ్చు.
2.2.3. ఆధునిక వ్యవహార కోశం - బూదరాజు రాధాకృష్ణ:
సాహిత్య విమర్శ, మానవీయ శాస్త్రాలు వంటి వాటికి మాత్రమే సంబంధించినవి కాకుండా సమకాలీన రచనరంగంలో ఉపయోగిస్తున్న చాలా పదాలకు తెలుగులో సమానార్థక పదం ఇవ్వడానికి ప్రయత్నం చేసింది ఈ రచన. శాస్త్ర సాంకేతిక పదాలతో పాటు పత్రికా రంగం, వివిధ మాధ్యమాలలో అప్పుడప్పుడే వస్తున్న సాంకేతిక పదాలకు సమానార్థకమైన తెలుగు పదాలు అకారాదిగా ఈ కోశంలో కనిపిస్తాయి. అందువల్ల సాధారణ పదాలు, పరిభాష పదాలు రెండూ ఇందులో కనిపిస్తాయి. పుస్తక శీర్షిక చెబుతున్నట్లు ఆధునిక, సమకాలీన కాలాలలోని పరిభాషలు, వివిధ పదజాలాలు ఈ కోశంలో చోటు సంపాదించాయి.
ఉదా: Academic Year - విద్యా సంవత్సరం
Academy - పరిషత్తు, విద్యాసంస్థ వంటి నిత్య వ్యవహారపదాలు. వంటి సాధారణ పదాలు
Absurd - అర్ధరహిత, అసంగత ,Abstract Language - అమూర్త భాష
వంటి సాహిత్య విమర్శలో ఉపయోగించే సాంకేతిక పదాలు ఈ కోశంలో కనిపిస్తాయి. కోశం నిర్మాణ ఉద్దేశం కేవలం సాహిత్యం, సామాజిక, మానవీయ శాస్త్రాలు కాకపోవడం వలన అన్ని రకాల పదాలు పరిభాషలు ఇందులో ఉన్నాయి. కానీ సాహిత్య విమర్శలోని ఆయా పదాలకు సమానార్ధకంగా భావించే లభించే పదాలను ఇందులో బూదరాజు రాధాకృష్ణ కూర్చారు.
Theme - ఇతివృత్తం/ప్రాతిపదిక Talent - ప్రతిభ, ప్రజ్ఞ ,
Synopsis - సార సంగ్రహం, సారాంశం Metaphor - రూపకం
వంటి సాహిత్య విమర్శ పరిభాష పదజాలం కూడా ఇందులో కనిపిస్తుంది. ఒక ఆరోపానికి సాంకేతికంగా ఉన్న అర్థంతో పాటు సాధారణ అర్థం కూడా ఉండటం ఈ పదకోశపు పరమ ప్రయోజనం
2.3. ప్రక్రియా పరమయినవి.
తెలుగు సాహిత్యంలో సంస్కృతం, ఇంగ్లీషు, ఉర్దూ ప్రభావాలతో, జానపద సాహిత్య రూపాలతో వివిధ కవుల ప్రయోగాలతో వెలువడ్డ సాహిత్య ప్రక్రియలు ఎన్నో ఉన్నాయి. ఆయా ప్రక్రియలు కవి దర్శనం నుంచీ వెలువడ్డా వాటికి సాహిత్య విమర్శకులు లక్షణ నిర్దేశం చేస్తూ ఉంటారు. ఆ ప్రక్రియ అవగాహనకు అవసరమైన పరిభాషను సృష్టిస్తూ ఉంటారు. భరతుడి నాట్యశాస్త్రం, అరిస్టాటిల్ పోయేటిక్స్ ఎన్నో సాంకేతిక పదాలను ప్రక్రియ దృష్టితో సృష్టించింది. ఇంగ్లీషులో కవిత్వం, కాల్పనిక సాహిత్య ప్రక్రియలకు ప్రత్యేకంగా సాహిత్య విమర్శ పదకోశాలు ఉన్నాయి.
2.3.1. భరతకోశం:
తెలుగులో కాకపోయినా తెలుగువారు తయారుచేసినది భరతకోశం. ఈ కోశం సిద్ధం చేయడం కొరకే జన్మించిన కారణజన్ముడు మానపల్లి రామకృష్ణకవి. భరతుడు మొదలుకొని అర్థవేది వరకున్న నాట్యశాస్త్రకారుల గ్రంథాలను క్షుణ్ణంగా పరిశీలించి నాట్యశాస్త్ర పారిభాషిక పదాలను'భరత కోశం'లో కూర్చారు. ఇది 37 అధ్యాయాల బృహత్ గ్రంథం. ఆయా నాట్యశాస్త్ర గ్రంథాలను పరిశీలించి సంస్కృతంలో ఉన్న పారిభాషిక పదానికి సంస్కృతంలోనే వివరణను ఇస్తూ సిద్ధంచేసిన కోశమిది.
తెలుగు సాహిత్యవిమర్శకులు నాట్యశాస్త్రవిషయంలో సంస్కృత పారిభాషిక పదాన్నే అనుసరిస్తున్నారు. ఇందులో ఉన్న వివరణలను తెలుగు చేసుకుని ఒక పదకోశాన్ని నిర్మించుకోవచ్చు. ఈ విధమైన ప్రయత్నం కొంతవరకు పోణంగి శ్రీరామ అప్పారావు చేసారు. నాట్యశాస్త్ర అనువాదాన్ని వ్యాఖ్యానంతో సహా చేసిన పోణంగి శ్రీరామఅప్పారావు అనుబంధంలో ముఖ్యపదానుక్రమణికను, పారిభాషిక పద సహితంగా అకారాదిగా కూర్చారు. ఈ పారిభాషికపదాలకు సంస్కృతంలో మూలంలో ఉంటే వాటిని వీరు కొంత తత్సమీకరించి మరికొంత అనువదించారు. ప్రధాన గ్రంథంలో ఆ పదాల వివరణ ఉంది. కొన్ని చోట్ట పరిభాష సంస్కృతంలో వివరణ తెలుగులో ఉంటుంది. ఈ పారిభాషిక పదాలను వివరణలతో సహా ఉన్నది ఉన్నట్లుగా తీసుకుంటే భరతుని నాట్యశాస్త్రం వరకు పారిభాషిక పదకోశాన్ని నిర్మించ వచ్చు. ఈ పనిని చేస్తూనే మానవల్లి రామకృష్ణకవి భరతకోశం ను తెలుగులోకి యథాతథంగా అనువదించుకోవలసిన అవసరం ఉంది..
2.3.2. నాటకరంగ పారిభాషిక పదకోశం- మొదలి నాగభూషణ శర్మ:
ఒక ప్రక్రియకు చెందిన సాంకేతికపదాలు ఈ కోశంలో ఉన్నాయి. ఒక సాహిత్యప్రక్రియను విశ్లేషించడానికి వివరించడానికి ఆ ప్రక్రియకు సంబంధించిన సాంకేతిక పదాలతో పరిచయం అవసరం. దాన్ని గుర్తించి నాటకరంగ పరిభాషను గురించి రెండు పదకోశాలను సిద్ధం చేయాలని మొదలి నాగభూషణ శర్మ భావించారు. ప్రాచ్యనాటక శాస్త్రపరిభాషను ప్రాచ్యం, పాశ్చాత్యం అన్న రీతులలో విభజించుకొని వాటిని కూర్చాలనుకున్నారు. అందులో పాశ్చాత్య నాటకరంగం నుంచీ కనిపిస్తున్న పరిభాషను మాత్రమే ఒక కోశంగా వెలువరించారు. ఇందులో రెండు విషయాలకు సంబంధించిన పరిభాషా పదాలు ఉన్నాయి.
- సాంకేతికరంగ విషయాలు
- నాటకరంగ నాటక సిద్ధాంత పదాలు.
పాశ్చాత్యుల నుంచీ మనం వాడుతున్న పదాలను ఆకారాదిగా చూపి వాటికి వివరణలు, అర్థాలు ఇచ్చారు. ప్రక్రియ పరంగా ఉపయోగించే ఈ పదజాలం ఒకచోట ఉండటం వలన ఆయా పారిభాషికపదాలు ఆ ప్రక్రియకే పరిమితమై ఉన్నాయా? మరో ప్రక్రియలో కూడా ఈ పరిభాష పదం ఉపయోగిస్తున్నారా? ఉపయోగిస్తే అదే అర్థంలో ఉపయోగిస్తున్నారా? వంటి అంశాలు స్పష్టంగా తెలుస్తాయి.
ఇంగ్లీషు సాహిత్య విమర్శ పదకోశాలు, నిఘంటువులలో నవల, కవిత్వం వంటి ప్రక్రియలకు ప్రత్యేక రచనలున్నాయి. ఆ రీతి తెలుగులో అంతగా కనిపించదు. అటువంటి స్థితికి ఉదాహరణగా నిలిచేది ఈ నాటక రంగ పారిభాషిక పదకోశం. ఒక ఆరోపానికి సమానార్థకంగా తెలుగు పదాన్ని ఇవ్వడంతో పాటు ఇంగ్లీషు/తెలుగు భాషలలో పరిభాషకు వివరణ ఇవ్వడం ఈ పదకోశపు ప్రత్యేకత. ఇప్పటికి దొరుకుతున్న పదకోశాలలో ఇంగ్లీషుకు తెలుగు పదాన్ని ఇచ్చి, దాన్ని తెలుగులోనూ వివరించిన రీతి కనిపిస్తుంది. కానీ ఈ రీతిలో రెండు భాషలలో వివరణను ఇచ్చిన పదకోశాలు దీనికి ముందు, దీని తరువాత లేవు.
సాంకేతిక పదాలు మాత్రమే కాక, నాటక ప్రయోగంలో ఉపయోగించే పదాలను ఇందులో మొదలినాగభూషణ శర్మ కూర్చారు. Call Board - నోటీస్ బోర్డ్, నటవార్త ఫలకం, Cleat Line - బిగింపుతాడు వంటివి కూడా ఈ కోశంలో ఉన్నాయి. ఇవి నాటక వ్యవహర్తలు ప్రయోగ సమయంలో ఉపయోగించేవి. వీటికి పారిభాషిక పదంగా సాహిత్య విమర్శ పదజాలంగా అంత గుర్తింపు ఉండదు.
- ఒక ఆరోపానికి కొన్ని చోట్ల రెండు, మూడు సమానార్థక పదాలు ఉండటం.
- ఒకే ఇంగ్లీషు మాటకు, లేదా రెండు ఆరోపాలకు ఒకే సమానార్థకం తెలుగులో ఉన్నా సూచించడం కనిపిస్తుంది.
- కొంత భేదంతో వాడబడుతున్న పరిభాష ఒకే ఆరోపంగా చూపడం Drama -Play వంటివి
-ఇందులో మొదలి నాగభూషణ శర్మ పాటించిన పద్ధతి.
భారతీయ రంగస్థల శాస్త్ర పదకోశం కూడా వెలువడి ఉంటే నాటక ప్రక్రియకు సంబంధించిన సమస్త విషయాలను ఒకే చోట అర్థం చేసుకునేందుకు వీలు కలిగేది. అదే సందర్భంలో ఒక ప్రక్రియకు చెందిన పారిభాషిక పదకోశాన్ని నిర్మించడానికి అవసరమైన మెలకువలు తెలిసేవి.
నాటకరంగ పారిభాషిక పదకోశంలో నాటక ధోరణులు నాటక సమాజాలు, శైలి భేదాలు, పాత్రల రీతులు వాటి భేదాలు వంటి సమస్త విషయాలను ఆకారాదిగా వివరించారు. సాంకేతిక పదాలు సాధారణంగా నాటక ప్రయోగానికి ఉపయోగించే పదాలు వేరు వేరు ఆకరాలుగా ఇచ్చి ఉంటే మరింత స్పష్టత పాఠకుడికి ఏర్పడి ఉండేది. ఏది సాంకేతికం, ఏది సాధారణం అన్న అవగాహన వలన విమర్శ పరిభాషను, ప్రక్రియ పరిభాషను స్పష్టంగా తెలుసుకునేందుకు తోడ్పడేది.
2.4. తెలుగు సాహిత్య విమర్శ పదాలను వివరించేవి:
తెలుగు సాహిత్య విమర్శ ప్రాచ్య ప్రాశ్చాత్య ప్రభావంతో కూడింది. ఇందులోకి వివిధ సామాజిక శాస్త్రాలు, మానవీయ శాస్త్రాల పరిభాష విస్తృతంగా చేరింది. అవీ సాహిత్య విమర్శ పదాలుగా గుర్తింపును పొందుతూ ఉన్నాయి. ఆ క్రమంలో శుద్ధ సాహిత్య విమర్శ పదాలేవి వాటి మూలాలేవి అన్నదీ సాహిత్యంలో చర్చనీయాంశమవుతూ ఉంటాయి. కేవలం సాహిత్య విమర్శలో ప్రధానంగా ఉపయోగించే పదాలతో ఇంగ్లీషులో M.H Abrahams A Glossary of Literary Terms - Oxford వారు literary terms వంటివి కూర్చారు. అటువంటి దృష్టితో వెలువడ్డ నిఘంటువులు ఈ రీతిలో చేరుతాయి.
2.4.1. సాహిత్య విమర్శ పదాల డిక్షనరీ-ఎస్. ఎస్. నళిని:
ఎం. ఫిల్ సిద్ధాంత వ్యాసాలలో కూడా లోతుగా, సత్యదృష్టితో జరిగే పరిశోధనకు ఉదాహరణగా నిలిచేది ఈ పరిశోధన. నాలుగు అధ్యాయాలుగా ఉన్న ఈ సిద్ధాంత గ్రంథంలోని చివరి అధ్యాయాన్ని, ప్రధానమైన దాన్ని 'సాహిత్యవిమర్శపదాల డిక్షనరీ ' పేరుతో ముద్రించారు. మొదటి మూడు అధ్యాయాలు ఈ అధ్యాయానికి పూర్వరంగంగా ఉండేవి. పరిభాష పద్ధతులను తెలిపేవి. ఇందులో తెలుగు పదాలకు ఇంగ్లీషులో సమానార్థక పదాలు ఇచ్చి ప్రతీ తెలుగు సాహిత్యవిమర్శపదాన్ని, భావనను వివరించారు. ఇది మొదటి భాగం. మరోభాగంలో తెలుగుపదాలకు ఇంగ్లీషు సమానార్థకాలు, మూడవభాగంలో ఇంగ్లీషు పదాలకు తెలుగు సమానార్థకాలను అకారాదిగా పదసూచిగా ఇచ్చారు. సమకాలీన సాహిత్యవిమర్శ భావనలను తెలుసుకోడానికి ఉపయోగపడే విధంగా ఈ కోశాన్ని సిద్ధం చేశారు.
సాహిత్య విమర్శ పదాల డిక్షనరీ పేరుతో ఎస్.ఎస్.నళిని సిద్ధం చేసిన కోశం పాశ్చాత్యుల భావనలను ఎక్కువగా పరిచయం చేసింది. అదేవిధంగా మన విమర్శకులు సృష్టించిన పరిభాషను కూడా గుర్తించవలసి ఉంది. విశ్వనాథ జీవునివేదన, శ్రీశ్రీ రసన, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ వస్తుకళ, భావకళ, రచనా కళ, కట్టమంచి భావనాశక్తి, నాటకీయత, సుప్రసన్న విశ్వలయ, చేరా వ్యూహంవంటివెన్నో పరిభాషలు మనం సృష్టించుకున్నాం. వాటికి వివరణలు కూడా ఆయా విమర్శకుల మాటల్లోనే దొరుకుతాయి. వీటన్నిటిని పదకోశంగా సిద్ధం చేసుకోవాల్సి ఉంది
2.5. ఆయా విమర్శ రీతుల పరిభాషకు సంబంధించినవి:
తెలుగు సాహిత్య విమర్శ పరిణామ వికాసాలలో ఎన్నో సాహిత్య విమర్శరీతులు ఉన్నాయి. ఇందులో కొన్ని సాహిత్య భూమిక మీద ఎదిగినవి కాగా మరికొన్ని సామాజిక భూమిక మీద ఎదిగినవి. సాహిత్య భూమిక మీద వచ్చినవి గాక వివిధ సామాజిక, వైజ్ఞానిక, మానవీయశాస్త్రాల కోణంలో పరిభాషను వివరించే కోశాలు ప్రాశ్చాత్య దేశాలలో వచ్చాయి. Dictionary of philosophy మార్క్సిస్ట్ సిద్ధాంతాలపై వచ్చిన పదకోశం. ఇటువంటి నిఘంటువులలో అచ్చంగా సాహిత్య విమర్శలో ఉపయోగిస్తున్న అంశాలే గాక ఆ భావజాలానికి సంబంధించిన పరిభాషపదాలు ఉంటాయి. సాహిత్య విమర్శ రీతిలో సమన్వయమైన వాటిని ఇటువంటి సందర్భంలో స్వీకరించవలసి ఉంటుంది.
2.5.1. మార్క్సిస్టు నిఘంటువు (తత్త్వశాస్త్రం) — రావు కృష్ణారావు:
సాహిత్య పరిభాష పదకోశాలు, నిఘంటువులలో ఆయా సిద్ధాంతాలకు సంబంధించినవి కూడా భాగమై ఉంటాయి. మార్క్సిస్టు నిఘంటువు ఈ పద్ధతిలో వచ్చిన నిఘంటువు. ఈ నిఘంటువును తత్త్వశాస్త్ర విభాగం, రాజకీయ, ఆర్థికశాస్త్ర విభాగం అని రెండు రీతులుగా కూర్పుని విభజించుకున్నారు. అందులో తత్వశాస్త్ర విభాగ సంబంధమైనది. సాహిత్య విమర్శ పదజాలం పదజాలానికి ఉపయోగపడేది.
550 కి పైగా ఆరోపాలతో సిద్ధం చేసిన ఈ నిఘంటువులో ఇంగ్లీషు అకారాదిగా ఆరోపం, దానికి తెలుగులో సమానార్థక పదం లేదా అనువదించిన పదం ఇచ్చి ఆ పరిభాషను తెలుగులో వివరించారు.
“మామూలుగా మనం వాడే చదివే వదులు అర్ధాన్నిచ్చే మాటలు వాడితే ఆ మాటలకు నిర్దిష్టత లోపించి, అపార్థాలొచ్చి తత్వశాస్త్ర ప్రయోజనం దెబ్బతినే ప్రమాదం ఉందనే భయంతోనే తెలుగు అకాడమీ తెలుగు విశ్వవిద్యాలయం ఉపయోగించిన పారిభాషిక పదాలను వీలైనంతవరకు వాడాను”[6] అని(మార్క్సిస్టు నిఘంటువు-కూర్పు,2017.పు.2) అంటారు నిఘంటు కూర్పరి. దీన్ని బట్టి ఇప్పటికే వాడకంలో ఉన్న ఆయా మాటల సమానార్థక పదాలను ప్రసిద్ధంగా ఉపయోగిస్తున్న, ఒక ఆరోపాన్ని వివిధ తత్వవేత్తలు, ఏ రీతిగా వివరించారో సుదీర్ఘంగా ఇవ్వడం ఈ గ్రంథం ప్రత్యేకత.
ఉదాహరణ: Consciousness - చైతన్యం
హెగెల్, మార్క్స్, ఈ మాటకు గురించి చెప్పిన విషయాలన్నీ కూర్పరి ఇక్కడ వివరించారు.
ఈ నిఘంటువులో పరిభాష సంబంధ పదాలతో బాటు హెగెల్, రెనె డెక్టార్, మార్క్స్, లెనిన్ వంటి వ్యక్తులు తాత్వికులు కూడా ఆరోపాలుగా కనిపిస్తారు. ఆయా ఆరోపాలలో వారి ఆలోచన ధారను ఆ ఆరోపం కింద వివరించడం కనిపిస్తుంది. దీనివలన ఆయా పరిభాషల సృష్టికర్తలను గురించి కూడా ఇక్కడే కొంత తెలుసుకునే వీలు కలుగుతుంది
వేదాంతంలో ఉపయోగించిన పదాలు మార్క్సిజంలో కనిపించినప్పుడు అదే అర్థంలో మార్క్స్ ప్రయోగించడా? మరో అర్థంలో దాన్ని తీసుకొని అర్థం చేసుకోవాలా? అన్న విషయాలు తెలుస్తాయి. ఆయా పారిభాషిక పదాలను Glossary గా పుస్తకం చివర అకారాదిగా కూర్చారు. కొన్ని పదాలకు సరైన సమానార్థక పదం దొరకనప్పుడు అనువాదించడమో లేదా లిప్యంతీకరణతో అలాగే సూచించడమో కూడా ఈ నిఘంటువులో కనిపిస్తుంది.
ఉదా: Epicurus - ఏపీ క్యూరన్ , Cynics - సినిక్ లు, Cyrenaic - సైరనైక్ లు.
2.6. తెలుగు అకాడెమీ ప్రచురించిన పారిభాషిక పదకోశాలు (భాషా శాస్త్రం, తత్త్వ శాస్త్రం, , శాస్త్ర నామ నిఘంటువు మొదలయినవి.):
పారిభాషిక నిఘంటువులు పదకోశాల నిర్మాణంలో తెలుగు అకాడమీ చేసిన కృషి గణనీయమైనది. సామాజికశాస్త్రాలు, శాస్త్ర సాంకేతిక రంగాలు, మానవీయ శాస్త్రాలకు అకాడమీ ఇంగ్లీషు -తెలుగు నిఘంటువులను కూర్చింది.
భాషాశాస్త్రం, మనోవిజ్ఞానశాస్త్రం, తత్త్వశాస్త్రం, వంటి శాస్త్రాలకు కూర్చిన నిఘంటువులు సమానార్థక తెలుగుపదాన్ని సూచించే పద్ధతిలో వచ్చినవి. తొలిరోజుల్లో వచ్చిన ఈ పద్ధతి నిఘంటువుకు కొనసాగింపుగా తత్త్వశాస్త్ర నిఘంటువు వివరణాత్మకంగా ఎం.రాజగోపాలరావు సంకలనకర్తగా వెలువడింది.. తెలుగు అకాడమీ పారిభాషిక పదాలకు సమానార్థకాలను, అనువాదాలను ఇంగ్లీషు నుంచి తెలుగులోకి తెచ్చింది.
భాషాశాస్త్ర సంబంధ నిఘంటువు నుంచీ శైలీ విమర్శకు సంబంధించిన పదాలను వేరు చేసుకుని శైలీ సాహిత్య విమర్శలో ఉపయోగించవచ్చు. నిఘంటు రూపంలో ఆయా ఇంగ్లీషు పదాలకు తెలుగు సమానార్థకమైన పదాన్ని ఇస్తూ తయారు చేసినవి తెలుగు అకాడమీ కృషిలో ప్రధానమయినది. తర్వాతి కాలంలొ కొన్ని వివరణాత్మక నిఘంటువులు, పదకోశాలు వచ్చాయి.
2.7. విఙ్ఞాన సర్వస్వాలు:
విషయ ప్రధానమైన విస్తృత వివరణ కలిగిన సాధారణ పాఠకుడు సైతం అవగాహన చేసుకోవడానికి అవసరమైన అంశాలను బోధించేవి విజ్ఞాన సర్వస్వాలు. ఒక అంశానికి అవసరమైన ప్రాథమిక సమాచారం మొదలుకొని దాని పరిణామ వికాసాలను పాఠకుడి అవగాహనలోకి తీసుకురావడంలో విజ్ఞాన సర్వస్వాలు తోడ్పడతాయి.
తెలుగు సాహిత్య విమర్శ దర్శనం పేరుతో సిహెచ్.లక్ష్మణ చక్రవర్తి సంపాదకత్వంలో వెలువడ్డ విజ్ఞాన సర్వస్వంలో ప్రాచ్య ప్రాశ్చాత్య భావనలకు చెందిన సుమారు (౩౦౦)మూడు వందలకు పైగా పారిభాషిక పదాలకు సంబంధించిన వివరణ ఉంది. ప్రక్రియలు, ధోరణులు, ఉద్యమాల వంటి వాటితో బాటు ప్రాచ్య, పాశ్చాత్య సిద్ధాంతాల, పరిభాషల వివరణ ఇందులో ఉంది. తెలుగు కవులు, విమర్శకులు సృష్టించిన కొన్ని పరిభాషల, భావనల వివరణ ఇందులో ఉంది, ఉదా. విశ్వనాథ ఏకవాక్యత, నాచనసోమన సాహిత్యరసం, తెనాలి రామకృష్ణకవి వికట కవిత్వం వంటివి.
నాటక విజ్ఞాన సర్వస్వం పేరుతో గండవరపు సుబ్బరామిరెడ్డి సంపాదకత్వంలో వెలువడ్డ విజ్ఞాన సర్వస్వంలో ప్రాచ్య, ప్రాశ్చాత్య నాటక విభాగానికి సంబంధించిన పరిభాష పదాలు వాటి వివరణలు ఉన్నాయి. నాటకంలోని అర్ధోపక్షేపకాలు రస సిద్ధాంతంలోని విభావాదులు, ప్రాశ్చాత్య నాటక పరిభాషలోని unity of Plots ఐక్యత్రయాలు , విషాదరూపకాల వంటి అంశాల వివరణ ఉంది. అయితే తెలుగు ఆరోపం గ్రహించి చేసిన వివరణలో అది ప్రాశ్చాత్య దేశం అనూదితమైనదే అయినా దాని మూలరూపం ఇవ్వడం కనిపించదు.
ఉదా: కాలైక్యం, స్థలైక్యం వంటి మాటలకు ఇంగ్లీషు పదాలు కనిపించవు. కేథారీస్ అన్నదీ ఒక ఆరోపంగా ఉన్నా క్షాళన అన్న ఆరోపంలో దీన్ని చూడండి అన్న సూచన ఉండటం వలన తెలుగు ఆరోపాలతోనే వివరణ ఇవ్వాలన్న లక్ష్యం కనిపిస్తుంది. అకారాది ఆరోపాలు నటులు, నాటక కర్తలు, నాటక సమితులు, పరిభాష అన్ని ఒకే అకారాదిగా ఉండడం వలన పరిభాషను వెతుక్కోవలసి వస్తుంది. అంశాల వారీగా ఆరోపాలను చూపవలసి ఉండింది.
2.8. సాహిత్యవిమర్శ గ్రంథాలు - పరిభాష:
తెలుగు సాహిత్యవిమర్శ పదజాలం గురించి పదకోశాలు, నిఘంటువులు, విజ్ఞాన సర్వస్వాల రూపంలోనే గాక పరిశోధనల రూపంలో ఆయా భావనల అధ్యయనం కనిపిస్తుంది. వాస్తవికత అధివాస్తవికత- నందిని సిధారెడ్డి, తెలుగు నవలా సాహిత్యంలో మనో విశ్లేషణ- కోడూరి శ్రీరామ్మూర్తి, తెలుగులో చైతన్య స్రవంతి నవలలు- వై.రామకృష్ణారావు వంటి పరిశోధనలు ఆయా భావనలను పరిభాషను వివరించి సాహిత్యానికి అన్వయించి చూపినవి. ఆధునిక యుగములో సాహిత్యవిమర్శలోకి ఎన్నో భావనలు వివిధ శాస్త్రాల నుంచీ అధ్యయన మార్గంలోకి వస్తున్నాయి. వాటిని వివరిస్తూ వచ్చిన గ్రంథాలు ఈ పద్ధతిలో చేరుతాయి.
2.8.1. సాహిత్యం-మౌలిక భావనలు-పాపినేని శివశంకర్:
సాహిత్యవిమర్శలో ఆలంకారిక, మార్కిస్టు, పాశ్చాత్య భావనలను మనం ఉపయోగిస్తున్నాం. కొన్ని సందర్భాల్లో ఆ భావనలపరి ధిని అర్థం చేసుకుంటూ మరికొన్ని సందర్భాల్లో సరైనపద్ధతిలో ఉపయోగించకుండా ఉంటున్నాం. ఈ అంశాలు గుర్తిస్తూనే సాహిత్యశాస్త్రం స్వయం సమగ్రశాస్త్రంగా ఆలంకారికుల నుంచి ఆధునిక విమర్శకులదాకా చాలామంది భావించారు. సాహిత్యపరిశీలనలో తత్త్వశాస్త్రం, చరిత్ర, సామాజికశాస్త్రం, మొదలైనశాస్త్రాల పరిభాషను తీసుకుని సాహిత్యం మౌలికభావనలన్న సిద్ధాంతవ్యాసం పాపినేని శివశంకర్ రచించారు. ఈ సిద్ధాంతగ్రంథంలో వాస్తవికతలోని అంశాలు, సాహిత్యపరిధిలోని స్థలకాలబద్ధత, వర్తమానత, చారిత్రకత , వస్తు రూపాలు, ఆధునికత-వర్తమానత అన్న ఐదు అధ్యాయాలున్నాయి. వీటిని ఆధారంగా చేసుకుని సాహిత్యానికి కేంద్రబిందువుగా ఉండే భావనలను ఈ పరిశోధన అంచనావేసింది. ఈ సిద్ధాంతగ్రంథంలో ఇప్పటికే పరిభాషలుగా స్థిరపడినవాటిని భావనలను చెప్పడంతో బాటు తెలుగులో నూతన పరిభాషా సృష్టికీ, పరిశీలనకు ఈ సిద్ధాంత గ్రంథం ప్రయత్నం చేసింది. సాహిత్య విమర్శ తత్త్వాన్ని మౌలిక సమస్యలను విశ్లేషించిన సైదాంతిక విమర్శ గ్రంధం ఇది. పదకోశం, నిఘంటువుల రూపం కాకుండా ఆయా భావనలను చర్చించింది
3. జరగవలసిన కృషి:
అలంకారశాస్త్రం అనగానే సంస్కృతంలో వచ్చినవి, ప్రాచీన తెలుగు కవులు చెప్పినవి అన్న దానికి పరిమితం కాకుండా తర్వాత వారు చెప్పిన వాటికి కూడా పదకోశాల్లో స్థానం కల్పించుకోవాలి.
మార్క్సిస్ట్ సౌందర్యశాస్త్రాన్ని, కళాతత్త్వశాస్త్రాన్ని నేపథ్యంగా చేసుకుని వచ్చిన అనువాదాలు కూడా ఉన్నాయి. కె.వి.ఆర్.. బి. సూర్యసాగర్, తక్కోలు మాచిరెడ్డి వంటి వారు చేసిన అనువాదాలున్నాయి. వీటిని అకారాదిగా కూర్చుకోవచ్చు. అలాగే యు.ఎ.నరసింహమూర్తి గారి 'కవిత్వ దర్శనం'లో కూడా పాశ్చాత్యుల, ప్రాచ్యుల పరిభాషలకు సంబంధించిన ఆలంకారికుల పరిభాషలకు వివరణలున్నాయి. సాహిత్య విమర్శరంగంలో కృషిచేస్తున్న ప్రతి విమర్శకుడు ఎంతోకొంత పరిభాషను సృష్టిస్తున్నాడు. వాటిని ఒక దగ్గరికి చేర్చుకోవలసిన అవసరం ఉంది.
అలంకారశాస్త్ర వికాసంలో భాగంగా ఆధునిక సాహిత్య విమర్శను మనం పరిగణిస్తేనే ఈ విమర్శకులు సృష్టించిన పరిభాష అందులో చేరుతుంది. సామాజిక భూమికమీద నుంచి వస్తున్న సాహిత్యవిమర్శ పదకోశాన్ని వేరుగానైనా నిర్మించుకోవచ్చు. ఎందుకంటే ఎక్కువగా పాశ్చాత్య ప్రభావ పదజాలం ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ప్రత్యేకంగా అలంకారశాస్త్రంలో ప్రయోగించిన పదజాలాన్ని అనువాదం చేసుకోవాల్సిన పనిలేదు. ఈ పరిభాషను అలాగే ఉపయోగించుకోవడానికి అలవాటుపడిపోయాం. అయితే వీటి వివరణలు మరో భాషలో ఉంటే వాటిని మాత్రం తెలుగు చేసుకోవాలి.
పాశ్చాత్యుల పరిభాషను అనువదించుకుని ఉపయోగించు కోవాలి. అయితే ఒక పరిభాషకు అనేకులు అనేక విధాలుగా అనువాదం చేసారు. వీటిలో ఏది ఉత్తమమైనదో దానిని రూఢి చేసుకోవాల్సిన అవసరం ఉంది.
అలంకారశాస్త్రం కావచ్చు లేదా ఇతర శాస్త్రాలు కావచ్చు. పరిభాష విషయంలో అన్ని శాస్త్రాలకు ఇప్పుడు ఒక పద్ధతి అనుసరించాలి. సంస్కృతంలో ఆ శాస్త్రం ఉంటే అందులో ఆ పరిభాషల వివరణలను ఉన్నదున్నట్లుగా చేర్చాలి. ఆ పరిభాష క్రిందే ఈ పరిభాషకు అనువాదం తెలుగు వివరణ ఇవ్వాలి. ఇదే పద్ధతి ఇంగ్లీషు నుంచి వచ్చిన పరిభాషకు కూడా అనుసరిస్తే సరిపోతుంది.
ఉదా:- ధ్వని-అన్న పరిభాషకు సంస్కృతంలో వివరణ ఇస్తాం.
అదేపదం క్రింద ధ్వని అని ఇచ్చి తెలుగు వివరణ ఇస్తాం. అలాగే Irony- అన్న మాటకు ఇంగ్లీషు వివరణ క్రింద తెలుగులో Irony- అన్న మాటకు మనం వాడుతున్న సమానార్థక పదం ఇచ్చి తెలుగులో వివరణ ఇవ్వాలి. ఇలా ప్రతి శాస్త్రానికి చేయడం ద్వారా సంస్కృతంలోనో, ఇంగ్లీషులోనో పరిభాష అలవాటు చేసుకున్నవారికి తెలుగు పరిభాష వెంటనే పరిచయం చేసినట్లు అవుతుంది. ఇలా మొదటి దశలో చేసి రెండవదశలో తెలుగులోనే పదకోశాన్ని విడిగా ముద్రించడం ద్వారా తెలుగు భాషను కూడా పరిరక్షించుకునే వీలు కలుగుతుంది. అలాగే ఇతర భాషల పరిభాష నుంచీ వ్యవహర్త స్వభాష పరిభాషను ఉపయోగించే వీలు కలుగుతుంది.
4. ముగింపు:
- తెలుగు సాహిత్యవిమర్శ ఎదిగిన క్రమంలో సాహిత్య పరిభాష కూడా పెరిగింది. అనేక సాహిత్య, సాహిత్యేతర మార్గాల నుంచీ వచ్చిన భావనలు.
- పరిభాషలు తెలుగు సాహిత్య విమర్శలోకి చేరి విమర్శ వికాసానికి తోడ్పడుతున్నాయి.
- ఇవి సమగ్రంగా సేకరించి విరణణాత్మక పదకోశాలుగా సిద్ధం చేసుకున్నప్పుడు మాత్రమే సాహిత్య విమర్శ మరింత పరిపుష్టం అవుతుంది.
- ఆయా పరిభాషల మూలాలు, ఒకే పదానికి తెలుగులో కనిపిస్తున్న భిన్న అనువాదాల సామంజస్యమూ చర్చనీయాంశమవుతుంది. స్పష్టత ఏర్పడుతుంది. అందుకు ఇప్పటి వరకు వచ్చిన పదకోశాలను ఉపయోగించుకుంటూనే మరింత సమగ్రతను సాధించ వలసి ఉన్నది.
5. పాదసూచికలు:
- పారిభాషిక పదాలు: కల్పనాశిల్ప రీతులు వ్యాసం,1992.పుట60
- తెలుగులో సాంకేతిక పదాల రూపకల్పన:భాషాశాస్త్ర సూత్రాలు వ్యాసం,2022.పుట26
- ఆధునిక సాహిత్య విమర్శకులు ప్రస్థానాలు, మొదటి భాగం.2008.పుట114
- ఆధునిక సాహిత్య విమర్శకులు ప్రస్థానాలు, రెండవ భాగం.2008.పుట32,33
- ఆంగ్ల సాహిత్య శాస్త్ర పదకోశం,2013.పుట3
- మార్క్సిస్టు నిఘంటువు-కూర్పు,2017.పుట2
6. ఉపయుక్తగ్రంథసూచి:
- కృష్ణారావు,రావు.2017. మార్క్సిస్టు నిఘంటువు-1 తత్వశాస్త్ర విభాగం(ఇంగ్లీషు-తెలుగు).లెఫ్టిస్ట్ స్టడీ సర్కిల్.గుంటూరు.
- తిరుపతిరావు,బి.2008, .మానవీయశాస్త్రాల పరిభాష. ద్రావిడ విశ్వవిద్యాలయం.కుప్పం.
- దక్షిణామూర్తి,పోరంకి.1992.భాష ఆధునిక దృక్పథం.శివాజీ ప్రెస్: హైదరాబాద్.
- నళిని,ఎస్.ఎస్. 1999, .సాహిత్య విమర్శ పదాల డిక్షనరీ, .రమేష్ పబ్లికేషన్స్.హైదరాబాద్.
- పాండయ్య,అప్పం.2022.తెలుగు భాష ఆధునికీకరణ తెలంగాణ భాషావైవిధ్యం. తెలుగు విజ్ఞాన పరిషత్తు: హైదరాబాద్.
- పారిభాషిక పదకోశము 1992. (తర్క శాస్త్రం, తత్త్వ శాస్త్రం, మనోవిజ్ఞాన శాస్త్రం). తెలుగు అకాడమి.హైదరాబాద్.
- పారిభాషిక పదకోశము భాషా శాస్త్రం.2008, .తెలుగు అకాడమి.హైదరాబాద్.
- రాజగోపాలరావు.ఎం.2008, .తత్త్వ శాస్త్ర నిఘంటువు.తెలుగు అకాడమి.హైదరాబాద్.
- రామకృష్ణ,మిరియాల,.రామారెడ్డి,ముకురాల.1978, సాహిత్య పదకోశము. తెలుగు అకాడమి.హైదరాబాద్.
- రామారావు,చేకూరి.2003.తెలుగులో వెలుగులు.ఆంధ్ర సారస్వత పరిషత్తు: హైదరాబాద్.
- లక్ష్మణ చక్రవర్తి,సిహెచ్, 2009. లక్ష్మణరేఖ. ఆముక్త ప్రచురణలు.హైదరాబాద్.
- లక్ష్మణ చక్రవర్తి,సిహెచ్.2014.ప్రతిబింబం.ఆముక్త ప్రచురణలు.హైదరాబాద్.
- లక్ష్మణచక్రవర్తి, సిహెచ్., సంపత్కుమారాచార్య,కోవెల. 2016, తెలుగుసాహిత్యవిమర్శదర్శనం.. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్
- వెంకటేశం,బొద్దుల 2013, .ఆంగ్ల సాహిత్యశాస్త్ర పదకోశం.సరోజా ప్రచురణలు:కరీంనగర్.
- శివశంకర్.పాపినేని.1996, .సాహిత్యం - మౌలిక భావనలు., స్వీయ ప్రచురణలు,.గుంటూరు.
- సుబ్బరామిరెడ్డి,గండవరపు.(సం)2008, నాటక విజ్ఞాన సర్వస్వం.).పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం.హైదరాబాద్.
Acknowledgement:
The Author would like to acknowledge the Indian Council of social science Research (Ministry of Education) for the financial support (F.NO.ICSSR/RPD/MN/2023-24/G/154) to carry out this project work. Special thanks to vice Chancellor, Telangana University for his continues support during the Project.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.