headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-12 | November 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

1. తెలుగు - కన్నడ సాహిత్యాల పరస్పరప్రభావం: అనువాదదృక్కోణం

(ICSSR మేజర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ 2023-24)

DOI
డా. అన్నెం నరేష్

అసోసియేట్ ప్రొఫెసర్ & ప్రాజెక్ట్ డైరెక్టర్
అనువర్తిత భాషాశాస్త్రం & అనువాద అధ్యయనాల కేంద్రం (CALTS),
హైదరాబాద్ కేంద్రీయవిశ్వవిద్యాలయం, హైదరాబాద్, తెలంగాణ.
సెల్: +91 9008849402, Email: nareshannem@uohyd.ac.in



అశ్విన్ కుమార్ డి.బి.వి.ఎన్

పరిశోధకులు
అనువర్తిత భాషాశాస్త్రం & అనువాద అధ్యయనాల కేంద్రం (CALTS),
హైదరాబాద్ కేంద్రీయవిశ్వవిద్యాలయం, హైదరాబాద్, తెలంగాణ.
సెల్: +91 9966159933, Email: 20hapt02@uohyd.ac.in
DOWNLOAD PDF


సమర్పణ (D.O.S): 20.10.2024        ఎంపిక (D.O.A): 30.10.2024        ప్రచురణ (D.O.P): 01.11.2024


వ్యాససంగ్రహం:

ఒక ప్రాంతం సామాజిక, సాంస్కృతిక గతిశీలతకు సాహిత్యం అద్దం పడుతుంది. భిన్న భాషలు కలిగిన భారతదేశంలో అనువాదాల ద్వారా పరస్పరం సంవదించుకునే ప్రాంతీయసాహిత్యాలు చాలా ఉన్నాయి. ఒక ప్రాంతీయభాష నుండి మరొకదానికి ప్రత్యక్ష అనువాదాలు పరస్పరప్రభావాలకు దారితీస్తాయి. ఇరువైపులా సాహిత్యాన్ని పెంపొందిస్తాయి. తెలుగు, కన్నడభాషలు దక్షిణ- భారతదేశంలో ఎక్కువగా మాట్లాడబడే ద్రావిడభాషల కుటుంబానికి చెందినవి. ఈ రెండుభాషల మధ్య భాషాపరమైన అనుబంధం పాక్షికంగా ఉమ్మడి బ్రాహ్మిక్ లిపిని పంచుకోవడం వల్ల ఏర్పడింది. రెండు భాషలకు గొప్ప సాహిత్యచరిత్ర ఉండడంతో రెండూ భారతీయ సాహిత్యానికి స్థూలస్థాయిలో గణనీయమైన తోడ్పాటుతోపాటు ప్రాంతీయస్థాయిలో ఒకదానినొకటి ప్రభావితం చేస్తాయి. అనువాదాల దృక్కోణం నుండి ఈ ప్రభావాలను విశ్లేషించడం ద్వారా అనువాద చరిత్రను డాక్యుమెంట్ చేయడానికి దోహదపడడమే కాకుండా, ఈ పరస్పరచర్యల వల్ల ఇరువైపులా ఏర్పడిన సాహిత్య- సంప్రదాయాలను అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. అయితే, తెలుగు కన్నడభాషల మధ్య సాహిత్య అనువాదపాత్రను డాక్యుమెంట్ చేసే ప్రయత్నాలు చాలా తక్కువ. తెలుగు - కన్నడ భాషల మధ్య సాంస్కృతిక, సాహిత్యపరమైన మార్పిడిలో అనువాదం ప్రాముఖ్యత వివరించడంతో పాటు, ఇటువంటి మార్పిడి రెండు వైపులా కొత్త ఆలోచనలు, ప్రక్రియలు, కథాకథనాల ఆవిర్భావానికి ఎలా దారితీస్తోందో విశ్లేషించడం ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశ్యం.

Keywords: సాహిత్యవినిమయం, అనువాదం, ద్రావిడభాషలు, తెలుగుసాహిత్యం, కన్నడసాహిత్యం.

1. ఉపోద్ఘాతం:

సాహిత్యం - సమాజం సంక్లిష్టంగా అనుసంధానమై, తరచుగా ఒక ప్రాంతం రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులను ప్రతిబింబిస్తాయి. ఇరవైరెండు అధికారిక భాషలు, వందలాది ఇతర భాషలు కలిగిన భారతదేశం, పరస్పరభాషాపరమైన ప్రభావాలకు మాత్రమే కాకుండా, అనువాదం ద్వారా ప్రాంతీయ సాహిత్యాల మధ్య మార్పిడికి కూడా వేదికగా ఉంది. ఈ వ్యాసం తెలుగు- కన్నడ సాహిత్యాల పరస్పరప్రభావాలను అనువాదదృక్కోణంలో విశ్లేషిస్తుంది.

మొదటి శతాబ్దం నాటికే తెలుగుభాష వాడుకలో ఉందని తొలిశాసనాలు సూచిస్తాయి. తొమ్మిదవ శతాబ్దానికి చెందిన అద్దంకిశాసనం / పండరంగని శాసనం చంపూశైలిలో వ్రాయబడింది. కందుకూరుశాసనం, బెజవాడ శాసనం వంటి ఇతర శాసనాలు పద్యశాసనాలు. అయితే, పదకొండవ శతాబ్దంలోనే తెలుగు సాహిత్యగ్రంథాలకు ప్రత్యేకమైన గుర్తింపు లభించింది. నన్నయ్యభట్టు “ఆంధ్ర మహాభారతం” తెలుగుసాహిత్యానికి పునాదులు వేసిన ఒక మౌలికరచన. నన్నయ్య, తిక్కన, ఎర్రాప్రగడల కవిత్రయం మహాభారతాన్ని తెలుగు చేసారు. పొరుగున ఉన్న కన్నడ మాట్లాడే ప్రాంతాల నుండి, వైష్ణవ, వీరశైవ ఉద్యమాలు పన్నెండు నుండి పదిహేనవ శతాబ్దాల వరకు తెలుగు సాహిత్యాన్ని ప్రభావితం చేశాయి. పద్నాలుగో శతాబ్దంలో అష్టదిగ్గజాలు ప్రబంధరచనాశైలిని ప్రాచుర్యంలోకి తెచ్చారు. భక్తి ఉద్యమం కూడా తెలుగుసాహిత్యంపై గణనీయమైన ప్రభావాన్ని చూపింది. ఈ కాలంలో అన్నమాచార్య, బమ్మెర పోతన వంటి కవులు ఆధ్యాత్మికతకు, భగవంతునికి సంబంధించిన పద్యాలను రచించడంతో భక్తిసాహిత్యం పుంజుకుంది. పదిహేనవ శతాబ్దానికి చెందిన అన్నమాచార్య కీర్తనలు కర్ణాటకసంగీతాన్ని ప్రభావితం చేశాయి. పదహారవ శతాబ్దం నుంచి తెలుగులో వచ్చిన కావ్యాలు పురాణసంఘటనలను ఆధారంగా తీసుకున్నాయి. పదిహేడవ శతాబ్దం మధ్య నుండి పంతొమ్మిదవ శతాబ్దపు మధ్యకాలం వరకు తెలుగులో రచయితలు చాలా మంది వుండగా, గొప్పరచనలు అరుదు. చెంచయ్య., రాజా ప్రకారం, “ఈ కాలంలో రచయితలు అసంఖ్యాకంగా వున్నారు కానీ కవులు చాలా తక్కువ; సాహిత్య ఉత్పత్తి అపారమైనది, కానీ నాణ్యత చాలా తక్కువ” (86). అయితే, యక్షగానం, హరికథ వంటి కొన్ని కళారూపాలు ఈ కాలంలో అభివృద్ధి చెందాయి. పంతొమ్మిదవ శతాబ్దపు ప్రథమార్థంలో తెలుగుసాహిత్యం అంతకు ముందు శతాబ్దాల కావ్యప్రభావానికి దూరం కావడానికి ప్రయత్నిస్తూ ఉంది. పంతొమ్మిదవ శతాబ్దపు చివరిభాగంలో తెలుగుసాహిత్యంలో సాంఘికనవల వంటి కొత్తశైలులు ఆవిర్భవించాయి. పంతొమ్మిది, ఇరవయ్యవ శతాబ్దాలలో, భారతదేశంలోని ఇతర సాహిత్యాలలాగా, తెలుగుసాహిత్యం కూడా వలస పాలన ద్వారా ప్రభావితమైంది. ముద్రణాయంత్ర పరిచయం వల్ల కందుకూరి వీరేశలింగం, గురజాడ అప్పారావు, త్రిపురనేని రామస్వామి, రాయప్రోలు సుబ్బారావు, దేవులపల్లి కృష్ణశాస్త్రి, చాసో, చలం, సి. నారాయణరెడ్డి, శ్రీశ్రీ, బోయి భీమన్న, గుర్రం జాషువ, కొలకలూరి ఇనాక్, కాళోజీ, అబ్బూరి ఛాయాదేవి, వోల్గా వంటి రచయితల / రచయిత్రుల రచనలు సామాన్యులకు అందుబాటులోకి వచ్చాయి. వీరు వివిధసామాజికసమస్యలపై సామాజిక- రాజకీయమైన మార్పులను ప్రతిబింబిస్తూ రచనలను చేసి తెలుగుసాహిత్యాన్ని ప్రభావితం చేశారు. ఇరవై ఒకటవ శతాబ్దం తెలుగు సాహిత్యంలో కొత్తశైలులతో సహా ఆధునిక ఇతివృత్తాలను చూస్తోంది.

అటువైపు కన్నడసాహిత్యమూలాలు రాష్ట్రకూటపాలనలో వున్నాయి. రాష్ట్రకూటరాజు నృపతుంగ అమోఘవర్ష I రచించిన తొమ్మిదవ శతాబ్దపు ‘కవిరాజమార్గ’ కన్నడభాషలో తొలి రచన. అయితే, కొంతమంది చరిత్రకారులు ఇది నృపతుంగ అమోఘవర్ష I, కవి శ్రీ విజయ సంయుక్త రచన అని వివరిస్తారు (కామత్ 90). పదవశతాబ్దములో పంప, పొన్న, రన్నల కాలంలో కవిత్వ అభివృద్ధి జరిగినది (శాస్త్రి 383). పది-పన్నెండు శతాబ్దాల మధ్య కన్నడసాహిత్యం జైనమతం ద్వారా ప్రముఖంగా ప్రభావితమైంది. పన్నెండవ శతాబ్దపు లింగాయత్ లేదా వీరశైవ ఉద్యమం కొత్తరకాల సాహిత్యాన్ని, ముఖ్యంగా లయబద్ధమైన వచనసాహిత్యాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది. బసవన్న, అక్క మహాదేవి వంటివారు ఆచార వ్యవహారాలను విమర్శిస్తూ, ఆధ్యాత్మికత సాధనలో ఐహికసుఖాలకు చోటులేదని ప్రబోధించారు. ఈ కాలం తరవాత వచ్చిన విజయనగరసామ్రాజ్యకాలాన్ని తెలుగు, కన్నడ సాహిత్యాలలో ‘స్వర్ణయుగం’ అని పిలుస్తారు. ఈ కాలంలో పాలకులు కన్నడ రచయితలను మాత్రమే కాకుండా వీరశైవ, వైష్ణవసంప్రదాయాలలో రాసిన తెలుగు, సంస్కృతం, తమిళకవులను కూడా ఆదరించారు. స్వయంగా గొప్ప కవి అయిన శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ‘అష్టదిగ్గజాలు’ అనే ఎనిమిదిమంది కవులుండేవారు. ఈ కాలంలో తెలుగు, కన్నడసాహిత్యాలు రెండూ విలసిల్లాయి. తరువాతి శతాబ్దాలలో మైసూర్, నాయకరాజ్యాలలో ఈ సాహిత్యపోషణ కొనసాగింది. పంతొమ్మిదవ శతాబ్దంలో ప్రారంభమైన ఆధునికకన్నడసాహిత్యం వలసపాలన ద్వారా ప్రభావితమైనప్పటికీ, రచయితలు ప్రధానంగా ప్రాచీనసాహిత్యరూపాలనే ఉపయోగించారు. ఇరవయ్యో శతాబ్ది ప్రారంభంలో బి. ఎం. శ్రీకంటయ్య నాయకత్వంలో ‘నవోదయ’ సాహిత్యోద్యమం రావడంతో ఈ ఆచారం ఒక మలుపుతిరిగింది. పాతపద్ధతులకు దూరంగా, కొత్త రచనావిధానాలను తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. ‘నవోదయ’ దశ తర్వాత ‘ప్రగతిశీల’, ‘నవ్య’ ఉద్యమాలు వచ్చాయి. వివిధ రచనల నేపథ్యవస్తువులు-రాజులు, వారి రాజ్యాల నుండి దైనందినమానవజీవితానికి దగ్గరగా ఉన్న విషయాలకు మారాయి. ఇరవై, ఇరవై ఒకటవ శతాబ్దాలలో ప్రముఖరచయితలు కువెంపు, శివరామ కారంత్, డి.వి. గుండప్ప, ఎ.ఎన్. కృష్ణ, డి.ఆర్. బెంద్రే, మస్తీ వెంకటేశ అయ్యంగార్, ఎస్.ఎల్. భైరప్ప, వి.కె. గోకాక్, యు.ఆర్. అనంతమూర్తి, తర్వాత పూర్ణచంద్ర తేజస్వి, చంద్రశేఖర కంబార వంటి రచయితలు విభిన్న ఇతివృత్తాలపై రచనలు చేయడం జరగింది.

తెలుగు, కన్నడభాషల మధ్య సాహిత్యసంబంధం చారిత్రక, సాంస్కృతికానుభవాలను పంచుకోవడమే కాకుండా అనువాదం ద్వారా కూడా జరిగింది. ఇది కేవలం భౌగోళికసామీప్యత వల్ల మాత్రమే కాదు, శతాబ్దాలుగా అభివృద్ధిచెందిన భాషాసాంస్కృతికపరస్పరచర్యల వల్ల కూడా ఏర్పడినది. ఈ రెండు భాషల మధ్య సాహిత్యాత్మక రచనల అనువాదం సాహిత్య, సాంస్కృతిక అంశాల మార్పిడికి కారణంగా వుండడమే కాకుండా, ఈ రెండు సాహిత్యసంప్రదాయాలను సుసంపన్నం చేస్తుంది.

2. పూర్వ అధ్యయనాల సమీక్ష:

ఐదువేల సంవత్సరాల పురాతననాగరికత కలిగిన భారతదేశం బహుభాషాసాంస్కృతిక సాహిత్యాలకు నిలయం. రీటా కొఠారి ప్రకారం, భారతీయసాహిత్యం "సంగ్రహించలేని విధంగా స్వీయ, సమాజాన్ని ఉత్పత్తి చేసే బహుళ భాషల ద్వారా ఏర్పడిన భాండాగారము" (60). అనువాదం భారతీయ సాహిత్యంనుంచి విడదీయరాని అంశమైనప్పటికీ, చరిత్రను అర్థం చేసుకునే సాధనంగా అనువాదాన్ని పరిగణించలేదు. (బర్క్ 3; డి'హల్స్ట్ 397). హేతుబద్ధంగా, ఇలాంటి అధ్యయనాలు అనువాదాల చారిత్రక సందర్భోచితీకరణ, వివరణను కలిగి వుంటాయి. “Translation and literary history: An Indian view”లో దేవీ అనువాదం చరిత్ర గురించి ఈ విధంగా చెప్పారు:

చాలా సాహిత్య సంప్రదాయాలు అనువాదంలో ఉద్భవించి, పలు అనువాద చర్యల ద్వారా ప్రాముఖ్యత పొందుతాయి కాబట్టి, సాహిత్య అనువాద సిద్ధాంతం అందుబాటులో ఉంటే అది సాహిత్య చరిత్ర సిద్ధాంతానికి సహాయపడుతుంది. సాహిత్య చరిత్రలో అనువాదాల ఖచ్చితమైన స్థానం గురించి ఏ విమర్శకుడు ఒక నిర్దిష్ట అభిప్రాయం చెప్పలేదు (183).

T. విజయ్ కుమార్, "Translation as Negotiation: The Making of Telugu Language and Literature" అనే పరిశోధన పత్రంలో, తెలుగు సాహిత్యంలో అనువాదాల పాత్రను విశ్లేషించారు. V. B. తారకేశ్వర్, తన వ్యాసం "Translation practices in Pre-colonial India: Interrogating Stereotypes"లో, వలసపాలనకు ముందు కన్నడలోని అనువాదపద్ధతులను పరిశీలించారు.

ప్రాంతీయభాషలను సాహిత్యభాషలుగా మార్చడానికి అనువాదం ఎలా ఉపయోగపడుతుందో, సంస్కృతగ్రంథాలు ప్రాంతీయభాషలలో ఎలా అందుబాటులోకి వచ్చాయో, అంతకుముందు ఈ గ్రంథాల నుండి దూరంగా ఉంచబడిన ప్రజలకు వాటిని ఎలా అందుబాటులో ఉంచారో విశ్లేషించారు. అనువాదం కన్నడ సాహిత్యాన్ని ఎలా రూపుదిద్దిందనే దానిపై దృష్టి సారించిన రావుగారు, పంతొమ్మిది, ఇరవయ్యవ శతాబ్దాల అనువాదకార్యకలాపాలను స్థూల (వలస పాలనాధికారులు భారతీయరచనలను ఆంగ్లంలోకి అనువదించడం), సూక్ష్మస్థాయి (ఇంగ్లీషు రచనలను ప్రాంతీయ భారతీయ భాషల్లోకి అనువదించడం) గా విభజించి, ఈ కాలంలోని రాజకీయ, సామాజిక,సాహిత్యరంగాన్ని రూపొందించడంలో అనువాదానికి కీలకపాత్ర ఉందని అభిప్రాయపడ్డారు(1). మూలభాషాసాహిత్యం నుండి కొత్తసాహిత్యశైలులను, దృక్కోణాలను తీసుకురావడం ద్వారా లక్ష్యభాషా సాహిత్యాన్ని అనువాదం సుసంపన్నం చేస్తుంది (రాణి 332). సాహిత్యానువాదాల చరిత్రకు సంబంధించి అధ్యయనాలు వున్నప్పటికీ, తెలుగు - కన్నడ భాషల మధ్య సాహిత్య అనువాదాలు రెండు వైపులా సాహిత్యాన్ని ఎలా ప్రభావితం చేశాయనే విషయంపై ఇంకా కృషి జరగాలి.

3. తెలుగు - కన్నడ సాహిత్యాల పరస్పరప్రభావం:

తెలుగు కన్నడసాహిత్యాల మధ్య పరస్పరప్రభావానికి ఈ రెండు భాషల మధ్యగల భాషాపరమైన అనుబంధం, భౌగోళికప్రాంతాల ఉమ్మడి గతం కూడా కారణమని చెప్పవచ్చు. నరసింహాచార్య ప్రకారం, చాళుక్యులు కర్ణాటక, ఆంధ్ర ప్రాంతాలను పరిపాలించడం, రెండు భాషలను పోషించడం (రామానుజపురం 27) ఈ సంబంధానికి ఒక కారణం. తెలుగు కవి శ్రీనాథుడు తన తెలుగును కన్నడ అని వర్ణించినంత స్థాయికి రెండు భాషలూ అనుసంధానించబడి ఉన్నాయి (రామానుజపురం 27). తెలుగు కన్నడ భాషాసాహిత్యాల "బంధుత్వం" శతాబ్దాలుగా రెండు ప్రాంతాలలోని అనేక ద్విభాషా రచయితలలో కనిపిస్తుంది - పదిహేనవ శతాబ్దంలో నీలకంఠాచార్య; పదిహేడవ శతాబ్దానికి చెందిన ముమ్మడి తమ్మ, తిరుమలభట్ట; పద్దెనిమిదవ శతాబ్దానికి చెందిన హుబ్బల్లి సంగయ్య, వీరరాజు;, పందొమ్మిదవ శతాబ్దంలో వెంకటరమణయ్య (రామానుజపురం 28). ఈ పరస్పర అనుసంధానం భక్తి ఉద్యమం సమయంలో కూడా కనిపిస్తుంది. అయితే ఇది కన్నడలో అనువాదాల ఫలితంగా ఉనికిలోకి రాలేదు కానీ తెలుగు, కన్నడ నుండి సంస్కృతంలోకి అనువాదాలకు దారితీసింది (తారకేశ్వర్ 102).

మహాభారతం, రామాయణం, మరికొన్ని ముఖ్యమైన జైన రచనల అనువాదాలతో తెలుగు, కన్నడ సాహిత్యాల మధ్య సంబంధం ప్రారంభమైంది. ఈ పరస్పర సాహిత్య వినిమయం మధ్యయుగ హొయసల కాలం నాటిది. పన్నెండవ శతాబ్దపు వచనకారుడైన అల్లమ ప్రభు వంటి ప్రముఖ వ్యక్తులు రెండు భాషల సాహిత్య సంప్రదాయాలను ప్రభావితం చేశారు. స్వయంగా కవి కావడమే కాకుండా, ప్రౌఢదేవరాయచే తెలుగులోకి అనువదించబడిన ‘చామరస ప్రభులింగలీలె’ కథానాయకుడు కూడా అల్లమ ప్రభువు (దత్త 617). ఈ కాలంలో, భక్తి సాహిత్య అనువాదాలు, వివిధ భాషా ప్రాంతాలలోకి కథన రూపాల్లో ఆలోచనల వ్యాప్తికి దోహదపడ్డాయి. పాల్కురికి సోమనాథుని ‘బసవ పురాణము’ తెలుగు నుంచి కన్నడలోకి అనువదించిన తొలి గ్రంధమని చెప్పవచ్చు. పదమూడవ శతాబ్దంలో తెలుగులో రాయబడిన ఈగ్రంధం, పద్నాలుగో శతాబ్దంలో భీమకవి ద్వారా కన్నడలోకి అనువదించబడింది. అయితే, పాఠకులు ఈ గ్రంథాన్ని తెలుగు, కన్నడ భాషల్లో విభిన్నంగా స్వీకరించారు. తెలుగుగ్రంథంతో పోల్చితే కన్నడ అనువాదం చాలా ప్రాబల్యంగల సాహిత్యంగా, వీరశైవులకు పునాది గ్రంథంగా మారింది (బెన్-హెరుత్ 133). ఒకే సాహిత్యాత్మకరచనను వివిధ భాషలు స్వీకరించడంలో గల వ్యత్యాసం ఆ కాలంనాటి సామాజిక-సాంస్కృతిక పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. సాహిత్యసంప్రదాయాలు ఒకదానినొకటి ప్రభావితంచేయడంలో అనువాదం ఒక ముఖ్యమైన సాధనమని దీని ద్వారా మనం గ్రహించవచ్చు. బసవపురాణ కన్నడ అనువాదం విస్తృత తాత్విక ప్రశ్నలతో పాఠకులను ఆకర్షించడం ద్వారా ఆ భాష మాట్లాడే ప్రాంతాలలో సామాజిక-మత సంస్కరణకు దారితీసింది.

పంతొమ్మిదవ శతాబ్దం వరకు తెలుగు-కన్నడభాషల మధ్యగల అనువాదాలు చాలా వరకు రామాయణమహాభారతాలు, రాజుల జీవితాలు, లేదా మతపరమైన గ్రంథాలకు సంబంధించినవి. 1775-1875 మధ్య కాలాన్ని సాహిత్యాత్మకరచనల నాణ్యత క్షీణిచడం వల్ల తెలుగు సాహిత్యంలో క్షీణ యుగంగా లక్ష్మీకాంతంగారు పేర్కొన్నారు(10). ఈ కాలంలో తెలుగు నుండి కన్నడకి తక్కువ సంఖ్యలో అనువాదాలు రావడానికి ఇది ఒక కారణం కావచ్చు. పంతొమ్మిదవ శతాబ్దపు చివరిలో, తెలుగు, కన్నడ సాహిత్యాలు రెండూ గత శతాబ్దాల ప్రభావం నుండి దూరమవుతున్న కాలంలో, తెలుగు కన్నడ మధ్య అనువాదం ఎక్కువగా జరగడం ప్రారంభమైంది. కందుకూరి వీరేశలింగం పంతులుగారి వివిధ నవలలు తెలుగు నుండి కన్నడలోకి అనువదించబడ్డాయి. 1897లో అనంతనారాయణశాస్త్రి అనువదించిన ‘సత్యవతి చరిత్ర’, 1899లో బెనెగల్ రామారావు అనువదించిన ‘సత్యరాజ పూర్వదేశ యాత్రలు’, వీరేశలింగం సంఘసంస్కరణ ఆలోచనలను కన్నడ పాఠకులకు అందించాయి. 1897లో గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం, సామాజిక అసమానతలను, కన్యాశుల్కం వంటి ఆచారాలను విమర్శిస్తూ సంఘసంస్కరణకు పిలుపునిచ్చింది. తెలుగులో రాయబడిన ఇటువంటి రచనలు అనువాదం ద్వారా కన్నడ పాఠకులకు చేరువయ్యి, ఇరవయ్యవ శతాబ్దపు ప్రారంభంలో కన్నడలో వచ్చిన నవోదయ ఉద్యమాన్ని కూడా ప్రభావితం చేసి ఉండవచ్చు. ఆ తర్వాత తెలుగులో వచ్చిన సాంఘిక నవలలైన బలివాడ కాంతారావు రచించిన ‘దగాపడిన తమ్ముడు’ (1957) కన్నడలోకి ‘నాడి కడయితు’ (1979) గా ఉపేంద్ర అనువదించారు, త్రిపురనేని గోపీచంద్ రాసిన ‘అసమర్థుని జీవనయాత్ర’ (1947)ని కన్నడలోకి ‘అసమర్థన జీవనయాత్రే’ (2003) గా సుజనన మూర్తి అనువదించారు.

తెలుగు సాహిత్యం నుండి అనేకమంది ముఖ్య సాహిత్యవేత్తలు కన్నడ రచయితలను ప్రభావితం చేసారు. గురజాడ అప్పారావు ‘కన్యాశుల్కం’ తెలుగుసాహిత్యాన్ని విప్లవాత్మకంగా మార్చడమే కాకుండా T. P. కైలాసం, కువెంపు వంటి కన్నడ రచయితలను కూడా ప్రభావితం చేసింది. మరోవైపు, దేశీయ సంస్కృతి, ఆధ్యాత్మికత, మానవతావాదం, సామాజికన్యాయంపై ‘’కువెంపు’ ఉద్ఘాటన ఈ ఇతివృత్తాలపై తెలుగులో రాసిన శ్రీశ్రీ, గుర్రం జాషువా వంటి తెలుగురచయితలను ప్రభావితం చేసింది. అదే విధంగా, కన్నడరచయితలు ప్రారంభించిన నవ్య ఉద్యమం భాష, అస్తిత్వవాదంలో నూతనత్వాన్ని ఉద్ఘాటించింది. ఇది శ్రీశ్రీ, దేవులపల్లి, కృష్ణశాస్త్రి వంటి తెలుగుకవుల రచనలలో ప్రతిబింబిస్తుంది.

ఇరవయ్యవ శతాబ్దంలో, ముఖ్యంగా శతాబ్దపు చివరి భాగంలో కన్నడలోకి అనువదించబడిన తెలుగు రచనల పునరుజ్జీవనం కనిపిస్తుంది. ప్రముఖ తెలుగు కవులు శ్రీశ్రీ, సి.నారాయణరెడ్డి వంటి వారు రాసిన కవితలే ఎక్కువగా కన్నడలోకి అనువాదించబడ్డాయి. శ్రీశ్రీ ‘మహాప్రస్థానం’ (1950) లోని భాగాలను కన్నడలోకి హెచ్.ఎస్. శివప్రకాష్, బంజాగెరె జయప్రకాష్, రాఘవేంద్రరావు ‘మహాప్రస్థానం – మాతొందు ప్రస్థానం’ (1991) గా అనువదించారు. పూర్తి ‘మహాప్రస్థానం’ అదే సంవత్సరంలో మార్కండపురం శ్రీనివాస్ అనువదించారు. సి.నారాయణరెడ్డి ‘విశ్వంభర’ (1980), ‘మంటలు మానవుడు’ (1970)ని ‘విశ్వంభర’ (1992), ‘జ్వాలెగాలు మత్తు మానవ’ (1999)గా మార్కండపురం శ్రీనివాస్ అనువదించారు. ఎన్. గోపి కవితా సంపుటిని ‘కాలాన్ని నిద్రపోనివ్వను’ (1998) రాజేశ్వరి దివాకర్ల ‘కాలవన్ను నిద్రసలు బిడెను’ (2011)గా అనువదించారు. ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తూ సమకాలీన కాలంలో తెలుగు, కన్నడ భాషల మధ్య అనేక కవితలు అనువదించబడుతున్నాయి.

తెలుగులోని స్త్రీవాదరచనలు ఇరవయ్యవ శతాబ్దం ద్వితీయభాగంలో కన్నడలోకి అనువదించబడ్డాయి. తెలుగులో తొలి స్త్రీవాదరచనలు విజయ దబ్బే వంటి కన్నడ రచయితలపై ప్రభావం చూపాయి. గుడిపాటి వెంకటాచలంగారి నవలలు ‘అమీనా’ (1928), ‘మైదానం’ (1930) స్వాతంత్ర్యానికి పూర్వం స్త్రీల దుస్థితిని ఎత్తిచూపాయి. ‘అమీనా’ను 1983లో మార్కండపురం శ్రీనివాస్, ‘మైదానం’ను 2018లో రమేష్ అరోలి కన్నడలోకి అనువదించారు. రంగనాయకమ్మ రచించిన ‘పేక మేడలు’ (1970) యం.జి. భీమ్‌రావు ‘బేడీ బండ భాగ్య’ (1991)గా; మాలతీ చెందూర్ ‘రాగం అనురాగం’ (1981)ను సంపత్ ‘రాగ అనురాగ’ (1991)గా; వోల్గా రచనలు ‘ఆకాశములో సగం’ (1990), ‘విముక్త’ (2011) సంపత్, వీరభద్రగౌడలు ‘ఉషోదయ’ (2009), ‘విముక్త’ (2012)గా అనువదించారు. ఇవి తెలుగు కన్నడ భాషలలో తరువాతి తరం స్త్రీవాద రచయితలపై ప్రభావం చూపాయి. 1960ల నాటి దిగంబర కవిత ద్వారా ప్రభావితమైన తెలుగు విప్లవ కవిత అనువాదాల నేపథ్యంలో ‘బండాయ’ సాహిత్యం వంటి సాహిత్య సంప్రదాయాలు కన్నడ సాహిత్యంలో ప్రారంభమయ్యాయి (రాజు., కుమార్ 9).

అదేవిధంగా అనేక కన్నడ రచనలు ఇరవై, ఇరవై ఒకటవ శతాబ్దాలలో అనువాదం ద్వారా తెలుగు పాఠకులకు చేరాయి. గిరీష్ కర్నాడ్ అనేక నాటకాలను భార్గవీరావుగారు కన్నడ నుండి తెలుగులోకి అనువదించారు. కర్నాడ్ రచించిన కన్నడనాటకం ‘తలెదండ’ను భార్గవీరావుగారు ‘తలదండం’గా తెలుగులోకి అనువదించి 1995లో సాహిత్య అకాడమీ అనువాద బహుమతిని గెలుచుకున్నారు. పూర్ణచంద్ర తేజస్వి నాటకం ‘కృష్ణగౌడన ఆనె’ను సాకమూరు రాంగోపాల్ తెలుగులోకి ‘కృష్ణారెడ్డిగారి ఏనుగు’గా అనువదించారు. కన్నడలో కువెంపు రచించిన కవితా సంపుటి ‘పక్షికాశి’ని 2011లో మార్కండపురం శ్రీనివాస్ తెలుగులోకి అనువదించారు. మస్తీ వెంకటేశ అయ్యంగార్ చారిత్రక నవల ‘చీకవీర రాజేంద్ర’ను ఆయాచితుల హనుమచ్ఛాస్త్రి అదే పేరుతో 1973లో తెలుగులోకి అనువదించి కొడగు చివరి రాజుగారి కథను తెలుగు పాఠకులకు అందించారు. కన్నడ నుండి తెలుగులోకి త్రివేణి ‘అపస్వర’ (1952) అపస్వరం (1976)గా, కె. ఎస్. నిరంజన ‘విమోచన’ (1953) ‘విమోచన’ (1985)గా, త్రివేణి ‘శరపంజర’ (1962) ‘సరపంజరం’గా (1979) శర్వాణి చేసిన అనువాదాలు స్త్రీప్రధాన రచనలు.

ఎస్.ఎల్. భైరప్ప రచించిన ‘పర్వ’ (1979) అదే పేరుతో గంగిశెట్టి లక్ష్మీనారాయణ అనువదించి తెలుగు పాఠకులకు మహాభారతానికి ఆధునికభాష్యాన్ని అందించారు. యు.ఆర్. అనంతమూర్తి రచించిన ప్రసిద్ధనవల ‘సంస్కార’ (1965)ను తెలుగులోకి ఎస్.ఎల్.శాస్త్రి అనువదించారు. సుధామూర్తి ‘డాలర్ సొసే’ జగదీశ్వరి అనువాదం ‘డాలర్ కోడలు’, రంగనాథ రామచంద్రరావు అనువదించిన శాంతినాథ దేశాయ్ కన్నడ ‘ఓం నమో’, డి.వి. గుండప్ప రచించిన ‘మంకుతిమ్మన కగ్గ’ (1943) తెలుగులో M. R. చంద్రమౌళి ‘మంకుతిమ్మని మిణకు’ (2021) వంటి ఇటీవలి అనువాదాలు కన్నడ రచనలను తెలుగు పాఠకులకు పరిచయం చేస్తూనే వున్నాయి.

తెలుగు-కన్నడభాషల మధ్య మౌఖిక సాహిత్య అనువాదం ముఖ్యంగా తెలుగురాష్ట్రాలు, కర్ణాటక సరిహద్దుప్రాంతాలలో నివసించే ప్రదర్శనకారుల కారణంగా వృద్ధి చెందుతుంది. బొమ్మారెడ్డి చెప్పినట్లుగా, “తెలుగు-కన్నడభాషలలో సాహిత్యసంప్రదాయాలు ‘ఉన్నతకులాల’ ఆధిపత్యంలో ఉండగా, మౌఖికసాహిత్యాన్ని ప్రధానంగా మాల, మాదిగ, జంగమ వంటి ‘నిమ్నకులాల’ ప్రజలు పాడతారు. ఏదైనా పాట లేదా కవిత్వం రాతపూర్వక వచన ఉత్పన్నరూపంగా మాత్రమే కనిపిస్తుంది” (233-234). లిఖిత సాహిత్యం కంటే సరిహద్దుల వెంబడి దేశీయ మౌఖిక సాహిత్యం వ్యాప్తి చాలా నెమ్మదిగా వుంటుంది. ఇది మౌఖిక సాహిత్యం ఒక ప్రాంతంలోనే నిర్బంధమవ్వడం, అటువంటి సాహిత్యం డాక్యుమెంటేషన్, డిజిటలైజేషన్ లేకపోవడం వల్ల అయ్యి వుండవచ్చు. బుర్రకథ ద్విభాషా కథనాన్ని (తెలుగు, కన్నడ) విశ్లేషిస్తూ, స్కంధగుప్త, నరేష్ అన్నెం ఈ విధంగా అభిప్రాయపడ్డారు, “బుర్రకథ ద్విభాషా కథనాన్ని అనుసృజనతో పాటు అనువాదంగా కూడా పరిగణించవచ్చు” (162). ఇటువంటి అనువాదం ఒక భాష సాహిత్యం నుండి మరొక భాషకు కొత్త కథనా పద్ధతులను పరిచయం చేస్తుంది, తద్వారా కొత్త సాహిత్య సంప్రదాయాలను సృష్టించవచ్చు.

ప్రస్తుత డిజిటల్ యుగంలో, కొత్త సాంకేతికతలు సాహిత్య అనువాదాన్ని సులభతరం చేస్తాయి. ఇది వివిధ రకాల డిజిటల్ మీడియాలతో అనుబంధంగా, అనువాదానికి కొత్త మార్గాలను తెరిచి, ఆలోచనల వేగవంతమైన వ్యాప్తిని సుగమం చేస్తుంది. ఈ పరిణామం మరొక ప్రయోజనం స్థిరపడిన రచయితలతో పాటు వర్ధమాన రచయితల రచనలు కూడా తెరపైకి వస్తాయి.

4. ముగింపు:

  • తెలుగు - కన్నడసాహిత్యాల పరస్పరప్రభావవినిమయాలు, భాషాసాంస్కృతికసంబంధాలు, సాహిత్యేతివృత్తాలు, అనువాదాల ద్వారా జరుగుతాయి. ఈ రెండు సాహిత్యసంప్రదాయాలు శతాబ్దాలుగా సాహిత్యరచనల మార్పిడి ద్వారా ఒకదానినొకటి ప్రభావితం చేశాయి.
  • అనువాదం అనేది రెండు సాహిత్యాల మధ్య వేదికగా వుండి, పరస్పరప్రభావం ద్వారా వాటిని పెంపొందించి, భాషా సరిహద్దులకతీతంగా ఆలోచనలను వ్యాప్తి చేయడంలో కీలకపాత్ర పోషిస్తోంది. 
  • ఈ భాషల మధ్య అనువాదం రామాయణ మహాభారతాల అనువాదంతో ప్రారంభమైనప్పటికీ, సమకాలీన అనువాదాలు సమాజం, జీవితానికి సంబంధించిన విభిన్న అంశాలతో ముడి పడి వున్నాయి. 
  • అనువాదాలు రెండుభాషల సాహిత్యాలపై పరస్పరప్రభావాన్ని కొనసాగిస్తున్నాయి. రెండు భాషల్లో అంతగా తెలియని రచనల అనువాదాల ద్వారా వినిపించని స్వరాలు ప్రధాన స్రవంతిలోకి రాగలవు.

5. ఉపయుక్తగ్రంథసూచి:

  1. ద్వా. నా., శాస్త్రి. తెలుగు సాహిత్యచరిత్ర. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, 1998.
  2. లక్ష్మికాంతం, పింగళి. ఆంధ్రసాహిత్యచరిత్ర. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, 1974.
  3. Ben-Herut, Gil. “From Marginal to Canonical: The Afterlife of a Late Medieval Telugu Hagiography in a Kannada Translation.” Translation Studies, vol. 14, no. 2, May 2021, pp. 133–49.
  4. Bommareddi, Aruna. “Translating Region: A Case of Kannada and Telugu Oral Epics.” The Criterion: An International Journal in English, vol. 12, no. 1, February 2021, pp. 231–39.
  5. Burke, Peter and Po-chia Hsia, R., editors. Cultural Translation in Early Modern Europe. Cambridge University Press, 2007.
  6. Chenchiah, P and Raja M, Bhunjanga Rao. A History of Telugu Literature. Oxford University Press, 1928.
  7. D’hulst, Lieven. “Translation History.” Handbook of Translation Studies, edited by Gambier, Yves, and Luc van Doorslaer, John Benjamins Publishing Company, 2010, pp. 397-405.
  8. Datta, Amaresh. Encyclopedia of Indian Literature. Sahitya Akademi, 1987.
  9. Devy, Ganesh. “Translation and Literary History: An Indian View." Postcolonial Translation: Theory and Practice, edited by Bassnett, Susan and Harish Trivedi, Routledge, 2002, pp. 182–188.
  10. Kamath, Suryanath U. A Concise History of Karnataka: From Pre-Historic Times to the Present. Jupiter Books, 2001.
  11. Kothari, Rita. Uneasy Translations: Self, Experience and Indian Literature. Bloomsbury, 2022.
  12. Kumar, T. Vijay. “Translation as Negotiation: The Making of Telugu Language and Literature.” Translation Today, vol. 10, no. 1, pp. 61–83.
  13. Lambert, Jose. “History, Historiography and the Discipline: A Programme." Translation and Knowledge, edited by Gambier, Yves and Jorma Tommola, University of Turku, 1993, pp. 3-25.
  14. Raju, Cherabanda, and M. Vijay Kumar. “Quicksand.” Indian Literature, vol. 33, no. 6 (140), 1990, pp. 9–11.
  15. Ramanujapuram, Narasimhacharya. History of Kannada Literature: Readership Lectures. Asian Educational Services, 1988.
  16. Rani, Seema. “Transcending Boundaries: Indian Literature through the Lens of Translation.” International Journal of Multidisciplinary Trends, vol. 3, no. 1, 2021, pp. 331–33.
  17. Rao, S Jayasrinivasa. “Translation and Kannada Literature: Appropriating New Genres” CIEFL Bulletin (New Series), vol. 14, no. 1 and 2, 2004.
  18. Sagar, Sunil. “Historiography of Translation in India: Issues and Approaches.” The Creative Launcher, vol. 2, no. 4, Oct. 2017, pp. 112–22.
  19. Sastri, Nilakanta K. A. A History of South India: From Pre-Historic Times to the Fall of Vijayanagar. Oxford University Press, 1958.
  20. Skandgupta and Naresh Annem. Bilingual Narration as Translation: A Case Study of Selected Burrakatha Narratives. University of Hyderabad, PhD thesis.
  21. Tharakeswar, V.B. “Translation Practices in Pre-colonial India: Interrogating Stereotypes.” Translation Today, vol. 3, no. 1 and 2, pp. 83–110.

Acknowledgements:

ICSSR పరిశోధన ప్రాజెక్టు “Literary Interface through Translation: History of Literary Translations between Telugu and Kannada from 1800-1947” లో భాగంగా ఈ పత్రం సమర్పించడం జరిగినది.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]