AUCHITHYAM | Volume-5 | Issue-1 | January 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
22. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కథ: జీవన చిత్రణ
కాంటేకారు శ్రీకాంత్
పరిశోధక విద్యార్థి, తెలుగుశాఖ.
ఉస్మానియా యూనివర్సిటీ, రావిర్యాల,
మహేశ్వరం మండలం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ రాష్ట్రం.
సెల్: +91 8008668285, Email: srikanth.k.rr@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో సాహిత్యం విశేషమైన పాత్రను పోషించింది. తెలంగాణ అస్తిత్వ చైతన్యాన్ని రగలించడంలో, తెలంగాణ ప్రాంతీయ ఆకాంక్షలను చాటిచెప్పడంలో కవిత్వం అగ్రభాగాన ఉండగా.. కవిత్వం స్థాయిలో కాకపోయినా తెలంగాణ ఉద్యమాన్ని ప్రతిబింబిస్తూ చెప్పుకోదగ్గస్థాయిలో కథలు కూడా వెలువడ్డాయి. ప్రత్యేక తెలంగాణ ఉద్యమ తీవ్రతను, ఉద్యమంలోని వివిధ పరిణామాలను చాటుతూ.. ఉద్యమానికి సమకాలంలో, ఆ తర్వాత కాలంలో కథలు వచ్చాయి. ఈ విధంగా ఉద్యమ నేపథ్యంతో.. ఉద్యమంలోని వివిధ ఘట్టాలను ప్రతిబింబిస్తూ వెలువడిన కథలలోని జీవన చిత్రణను విశ్లేషించడం ఈ పరిశోధన వ్యాసం లక్ష్యం. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీల భాగస్వాములుగా ఉన్న వివిధ వ్యక్తుల పాత్రలను, వారి మధ్య మానవసంబంధాలను, ప్రాంతీయ విభేదాలు, ఉద్యమ పరిణామాలు వారి జీవితాల్లో తీసుకువచ్చిన ఒడిదుడుకులను కథకులు చిత్రించిన తీరును, తమ కథల ద్వారా పాఠకుల్లో ఉద్యమచైతన్యంతోపాటు పోరాటతత్వాన్ని రగిల్చిన తీరును ఈ వ్యాసం ద్వారా తెలుసుకుంటారు.
Keywords: తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వ సాహిత్యం, తెలంగాణ ఉద్యమ కథలు, తెలంగాణ సాంస్కృతిక చైతన్యం, తెలంగాణ కథ. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం.
1. ఉపోద్ఘాతం:
ప్రజలు తమ న్యాయమైన హక్కులను సాధించుకోవడానికి ఆరాటపడుతూ.. అందుకు చైతన్యవంతులవుతూ నిరంతరం చేసే పోరాటాన్ని ఉద్యమంగా పేర్కొనవచ్చు. అలాంటి ఉద్యమాన్ని, ఆ ఉద్యమంలో వివిధ దశలను, అందులో పాల్గొన్న ప్రజల జీవితాలను ప్రతిబింబించే కథ ఉద్యమ కథ అవుతుంది. అయితే, సహజంగానే ఏ ఉద్యమంలో అయినా.. అది జరుగుతున్న సమయంలోనే దానికి ప్రతిబింబంగా వచనసాహిత్యమనేది తక్కువగానే వస్తుంది. ఉద్యమ నేపథ్యం నుంచి కవిత్వం వచ్చినంత వెల్లువగా కథలు వంటి వచన సాహిత్యం రావడం జరగదు. తెలంగాణ ఉద్యమానికి కూడా ఇది వర్తిస్తుంది. తొలి దశ, మలిదశలలో జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని ప్రతిబింబిస్తూ వచ్చిన కథలు, నవలలు.. కవిత్వంతో పోలిస్తే చాలా తక్కువ అని చెప్పవచ్చు. పైగా చాలావరకు సాహిత్యకారులు తెలంగాణ ఉద్యమంలో ప్రత్యక్షంగా పాల్గొని.. తమవంతు పాత్ర పోషించారు. ఈ క్రమంలో ఉద్యమ సంఘటనలకు తక్షణ ప్రతిక్రియగా భావోద్వేగ కవిత్వాన్ని వెలువరించారు. కానీ, ఉద్యమ జీవితాన్ని, ఉద్యమ తత్వాన్ని, అందులోని అంతర్లీనంగా ముడిపడిన భావోద్వేగాలను ఒడిసిపట్టుకొని కథలు, నవలలుగా రాసే పని అంతగా చేపట్టలేదు. పైగా నడుస్తున్న సమాజాన్ని చిత్రిస్తూ.. తక్షణ ప్రతిస్పందనగా వచన సాహిత్యాన్ని సృష్టించడం కష్టంతో కూడిన పని. మొత్తంగా చూసుకుంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమ పరిణామాలను, ఉద్యమ నేపథ్యమైన ప్రాంతీయ వివక్షను చిత్రిస్తూ వచ్చిన కథలు చెప్పుకోదగిన స్థాయిలోనే ఉన్నాయి. తెలంగాణ ఉద్యమ సాహిత్యంలో భాగంగా తెలంగాణ ఉద్యమ కథలపై పలువురు పరిశోధకులు పరిశోధనలు జరిపారు. `ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సాహిత్యం-సమగ్ర పరిశీలన (1969-2014)` అన్న అంశం మీద ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వెల్దండి శ్రీధర్ గారు పీహెచ్‌డీ పొందారు. అదేవిధంగా `తెలంగాణ కథ - వర్తమాన జీవన చిత్రణం(1990-2010)` అంశం మీద ఎం. దేవేంద్రగారు పరిశోధన చేసి పీహెచ్‌డీ పొందారు. తెలంగాణ ఉద్యమ కథలలో భాగంగా చిత్రితమైన జీవన అంశాలను పరిశీలించడం ఈ పరిశోధన వ్యాసం ముఖ్యోద్దేశం.
2. ఉద్యమనేపథ్య కథలు:
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం నేపథ్యంతో వచ్చిన కథలను పరిశీలిస్తే.. రాశిలో తక్కువగానే కనిపిస్తాయి. 2011 నవంబర్‌లో కర్ర ఎల్లారెడ్డి, బివిఎన్ స్వామి సంపాదకత్వంలో మలిదశ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న సమయంలో తెలంగాణ ఉద్యమ కథల తొలి సంకలనం వెలువడింది. ఈ సంకలనంలో మొత్తం 19 కథలు ఉండగా.. ఇందులో తొలి దశ ఉద్యమ నేపథ్యంతో వచ్చిన కథలు నాలుగే కనిపిస్తున్నాయి. అవి పాకాల యశోదారెడ్డి `మా పంతులు`, ఇంటర్ విద్యార్థి అయిన కాసారపు సంజీవయ్య రాసిన `స్వప్నలోకంలో సత్యలోకం`, `కానిస్టేబుల్ కామయ్య`, యన్‌కే అశోక్‌కుమార్ రాసిన `ఇదా న్యాయం` కథలు. తొలిదశ ఉద్యమ కథలతో పోల్చుకుంటూ మలిదశ ఉద్యమ కథలు చాలా ఎక్కువేనని చెప్పవచ్చు. ఇప్పటివరకు పదుల సంఖ్యలో కథలు మలిదశ ఉద్యమంలో భాగంగా లేదా ఉద్యమ నేపథ్యంతో వచ్చినవి కనిపిస్తున్నాయి. ఇక, `తెలంగాణ చౌక్`లోనే 16 కథలు మలిదశ ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినవే. అంతేకాకుండా ఈ సంకలనంలో చోటుచేసుకోని కథలు కూడా చాలావరకు కనిపిస్తున్నాయి. సామాజిక ప్రభావం చూపించే ఉత్తమ కథల్లో ఉద్యమ కథల్ని గురించి చర్చిస్తే ఉద్యమ కాలంలో వచ్చిన అనేక కథలు ప్రజాజీవనంపై మంచి ప్రభావాన్ని చూపిస్తూ ప్రజల్లో అస్తిత్వ స్పృహను, పోరాటచైతన్యాన్ని రగిలించాయని చెప్పవచ్చు.
తెలంగాణ ఉద్యమ అస్తిత్వ స్పృహతో వెలువడిన కథాసాహిత్యం ఒకనాటి ఉత్తమ కథలకు ఎందులోనూ తీసిపోవు, తమ సమకాలీన సామాజిక పరిస్థితుల్ని కళ్ళకు కట్టినట్లుగా వివరించిన అనాటి కథలు ఎక్కడ కూడా ప్రాంతీయతను కోల్పోలేదు. ఉద్యమ నేపథ్యంలో తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ భాషతోపాటు తెలంగాణ సమాజ చిత్రణ, ప్రజల జీవన చిత్రణ ఈ కథలలో చూడొచ్చు. తెలంగాణ ఉద్యమ సందర్భంలోని అనేక ఘటనలను రికార్డు చేస్తూ వెలువడిన ఈ కథలలో ఆనాటి ప్రజల భావోద్వేగాలను, మానసిక, సామాజిక సంఘర్షణలు, మానవ సంబంధాల చిత్రణను కొంతమేరకు చూడవచ్చు. జీవితాన్ని చిత్రించనిదే సంస్కృతిని, సంస్కృతిలోని వివిధ పార్శ్వాలను సంపూర్ణంగా చిత్రించడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో ఉద్యమ కథల్లో చిత్రితమైన మానవ సంబంధాలు, ప్రజల జీవన విధానాన్ని ఓసారి విశ్లేషిస్తే..
3. "సంకర విత్తులు'' కథ- జీవన చిత్రణ:
పులుగు శ్రీనివాస్ రాసిన `సంకరవిత్తులు` (తెలంగాణ చౌక్) కథలో తెలంగాణ ప్రజల జీవన విధానం, కల్లాకపటం లేని అమాయక మనస్తత్వం, సాంస్కృతిక ఔన్నత్యాన్ని చాటుతూనే.. అది కోస్తాంధ్ర వలస సంస్కృతితో కలిసినప్పుడు ఎంతటి ఘర్షణకు లోనైంది.. వలసాంధ్రా సాంస్కృతిక వైరుధ్యాన్ని ఇముడ్చుకోలేక తెలంగాణ బతుకులు ఎలా అతలాకుతలం అయ్యాయో చెబుతుంది.
కథలోని ప్రధాన పాత్రధారి అయిన రాజేశ్వర్ రెడ్డి వరంగల్ జిల్లా యేలేరు గ్రామ పటేల్ మల్లారెడ్డి కొడుకు. రాజేశ్వర్ రెడ్డి చదువుతున్న పాఠశాలకు సుబ్బారావు అనే ప్రధాన ఉపాధ్యాయుడు ఆంధ్రా నుంచి దిగుమతి అవుతాడు. అతడు వస్తూనే ఇక్కడి పిల్లలను అనాగరికులుగా చూస్తూ వారి భాష యాసలను చులకన చేస్తాడు. పిల్లల భాషా, ఉచ్చారణలను సరిచేస్తూ.. తాను మాట్లాడుతున్న భాషనే సరైనదని ఆంధ్ర భాషను వారిపై రుద్దుతాడు. తన కూతురు సంగీతను కూడా సుబ్బారావు అదే బడిలో చేర్పిస్తాడు. ఆమె ఏదైతే భాషలో మాట్లాడుతుందో అదే భాషలో చదుతుండగా.. తాము మాత్రం ఇంటి వద్ద ఒక భాష మాట్లాడుతూ.. బడిలో ఇంకో భాష నేర్చుకోవాల్సి రావడం.. రాజేశ్వర్‌రెడ్డితోపాటి అతనితోటి స్థానిక విద్యార్థులకు కష్టంగా అనిపిస్తోంది. ప్రామాణిక భాష పేరిట బడి భాషలో తీసుకొచ్చిన మార్పులు ఇక్కడి విద్యార్థులపై ఎలాంటి సాంస్కృతిక ప్రభావాన్ని చూపాయో ఈ పరిణామం చాటుతుంది.
రాజేశ్వర్‌రెడ్డి తండ్రి మల్లారెడ్డి నిజాంల కాలంలో దర్జాగా దొరలా బతికిన వ్యక్తి అని అతని పాత్ర చిత్రణ బట్టి తెలుస్తుంది. కాలక్రమంలో సమైక్య రాష్ట్రం వచ్చాక చెరువులకు కుంటలకు గండ్లువడి, కరెంటులేక పంటలు పండక చివరకు తన భూములు అమ్ముకునే స్థితికి వస్తాడు మల్లారెడ్డి. అతణ్ని నక్సలైట్లు బహిరంగంగా నరికి చంపి.. అతని భూముల్లో ఎర్రజెండాలు పాతారంటూ రాజేశ్వర్ రెడ్డితో వాగ్వాదంలో సంగీత అంటుంది. తెలంగాణలో సంభవించిన నిజాం పాలన అంతం, సమైక్య రాష్ట్ర ఏర్పాటు, విప్లవోద్యమాలు తదితర చారిత్రక పరిణామాలను సూచించే అంశంగా దీనిని చూడొచ్చు.
`భూమిని తాము పరువుగా భావిస్తామే గానీ.. చెడిపోయి, పాడపనులకు అమ్ముకోమ`ని (తెలంగాణ చౌక్. పుట 59) ఆయన బలంగా చెప్పినట్టు సుబ్బారావుకు అనిపిస్తోంది. తెలంగాణలో వరుసగా తలెత్తిన సామాజిక పరిణామాలు, చైతన్యం మల్లారెడ్డి లాంటి వ్యక్తుల జీవితాల్లో ఎలాంటి ప్రభావం వేశాయో ఈ పాత్ర చిత్రణ ద్వారా గ్రహించవచ్చు. కేవలం బడిలో పాఠాలు చెప్పడానికి వచ్చిన సుబ్బారావు ఇక్కడి ప్రజల భోళాతనం, అమాయకత్వం, మంచిని ఆసరాగా చేసుకుని క్రమంగా.. ఇక్కడ క్రమంగా తన పరపతిని పెంచుకుంటాడు. ముందే అందిన సమాచారంతో పోచంపాడు ప్రాజెక్టు కిందకు రాబోతున్న ఖరీదైన నల్లరేగడి భూములను మల్లారెడ్డి నుంచి కారుచౌకగా కొనేస్తాడు. మధ్యలో తొలిదశ ఉద్యమం రావడంతో భయపడి వెళ్ళిపోయినా.. ఉద్యమం సద్దుమణిగిన తర్వాత తిరిగి వచ్చి ఇక్కడి భూముల్లో వ్యవసాయం మొదలుపెడతాడు. తక్కువ జీతం వస్తున్న ఉపాధ్యాయ వృత్తిని వదిలేసి.. వ్యవసాయంలోకి దిగి.. వాణిజ్య పంటలతో, నకిలీ విత్తనాల అమ్మకంతో చుట్టుపక్కల రైతులను మోసగిస్తూ.. సుబ్బారావు కోటీశ్వరుడు అవుతాడు. అదేసమయంలో భూమిని నమ్ముకొని ప్రాణాధార పంటలను పండిస్తున్న స్థానిక రైతులు నష్టపోవడమే కాకుండా.. వాణిజ్య వ్యవసాయం వల్ల, నకిలీ విత్తనాల వల్ల, గిట్టుబాటు ధరలు లేక అన్నదాతల ఆత్మహత్మలకు దారితీసిన పరిణామాన్ని ఇది చిత్రిస్తుంది. మరోవైపు ఊరిలో తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు మల్లారెడ్డి కొడుకు, తన విద్యార్థి అయిన రాజేశ్వర్ రెడ్డికి తన కూతురు సంగీతను ఇచ్చి పెళ్లి చేస్తాడు.
ఇది తొలితరం కథ కాగా, మలితరానికి వచ్చేసరికి రాజేశ్వర్‌రెడ్డి-సంగీతల మధ్య దాంపత్య జీవితం కొంతకాలం సాఫీగా సాగినప్పటికీ.. సంగీత తీరుతో ఇద్దరి మధ్య క్రమంగా దూరం పెరిగిపోతోంది. రాజేశ్వర రెడ్డిపై భార్య సంగీత విపరీతమైన పెత్తనం చెలాయిస్తూ.. చివరకు ఊర్లో భూమి అమ్ముతావా? లేదా విడాకుల పత్రం మీద సంతకం పెడతావా? తేల్చుకో అంటుంది. డబ్బు కోసం ఎంతకైనా దిగజారే ఆమె తీరును రాజేశ్వర్‌రెడ్డి అసహ్యించుకొని.. వృధాప్యంతో, అస్వస్థతతో బాధపడుతున్న తల్లి మాట మేరకు.. విడాకుల పత్రం మీద సంతకం పెట్టి సొంతూరుకు బయలుదేరతాడు రాజేశ్వరరెడ్డి.
కథలోని రాజేశ్వర్‌రెడ్డి- సంగీత పెళ్లిని పెద్ద మనుషుల ఒప్పందం ద్వారా ఏర్పాటైన సీమాంధ్ర-తెలంగాణ విలీనానికి ప్రతీకగా చూపుతాడు కథకుడు. తెలంగాణ భర్త- ఆంధ్రా భార్య మధ్య పొసగని కలహాల కాపురం- అందుకు దారితీసిన సాంస్కృతిక, సామాజిక, చారిత్రాక కారణాలను ప్రతీకాత్మకంగా పాఠకుల చూపించే ప్రయత్నం చేస్తాడు. కథలో రెండు ప్రాంతాల సంస్కృతుల మధ్య ఘర్షణ, ప్రజల మధ్య మానసిక ఐక్యత లేకపోవడం ప్రధానంగా కనిపిస్తుంది. భార్య సంగీత పెత్తనాన్ని, పోకడల్ని అసహ్యించుుకుంటూ `నీ విష సంస్కృతిని, సంకర సంస్కృతిని నా మీద రుద్దకంటాడు` రాజేశ్వర రెడ్డి.
`ఏంటి నీ సంస్కృతి.. అసలు నీకు నీ తల్లిదండ్రులకు ముడ్డి మీద గుడ్డలు ఎలా కట్టుకోవాలో తెల్సా? మేం నేర్పాం. మొద్దురాచిప్పలు..... వెనుకబాటుతనాన్ని ఉద్ధరించడానికి వచ్చిన మమ్మల్ని అవమానిస్తావా? మా సంస్కృతి సంకర సంస్కృతి అంటావా? మాది బ్రిటిష్ వాళ్ల స్వేచ్చా సంస్కృతి, మోడరన్ సంస్కృతి. మరి మీది నిజాం నవాబు నిరంకుశ సంస్కృతి. పరదా సంస్కృతి.” (తెలంగాణ చౌక్. పుట 52)
అంటూ కోపంగా ఊగిపోతుంది సంగీత. ఈ సంవాదం ద్వారా తెలంగాణ సంస్కృతిపై ఇక్కడి కోస్తాంధ్రుల చులకన భావాన్ని, తెలంగాణవారికి తామే సంస్కృతి, నాగరికత నేర్పామన్న బడాయికోరు మాటల మతలబును చాటుతాడు.
“అమాయకత్వానికీ, సహనానికీ ప్రతీకలు నా వాళ్ళు.. రక్తపుటేరులను మౌనంగా చూసిన వాళ్ళు నా వాళ్ళు.. నీళ్ళు లేక భూములు బీడులుగా మారినా… ఆకలిని, అన్యాయాలను, అవమానాలను, నవ్వుతూ, నిశ్శబ్దంగా భరిస్తున్నవాళ్లు నా వాళ్ళు.. నా వాళ్లనూ, నా గడ్డనూ నీవు కూడా వెక్కిరిస్తావా? దాని మీదనే జీవిస్తూ.. దాన్నే విమర్శిస్తావా? ఇది తల్లి పాలు తాగి రొమ్ము గుద్దడం కాదా?`` అని నిలదీస్తాడు రాజేశ్వర రెడ్డి (తెలంగాణ చౌక్. పుట 52). తెలంగాణ నేల మీదే జీవిస్తూ ఇక్కడి ప్రజలతో మమేకం కాకుండా ఇక్కిడివారి వేష భాషలు, సంస్కృతినే అవహేళన చేస్తున్న వలసాంధ్రుల ధోరణిని ఎత్తిచూపుతాడు.
ఆంధ్ర నుంచి విడిపోవడమే తెలంగాణ సమస్యకు పరిష్కారంగా ‘ఇడుపుకాయిదం’ మీద సంతకాన్ని సూచనప్రాయంగా తెలియజేయడం ద్వారా.. ఈ కథ భవిష్యత్ దార్శనికతను ప్రదర్శించిందని చెప్పవచ్చు. చంద్రలత అనే రచయిత్రి రాసిన ‘రేగడివిత్తులు’ (1997) నవలకు కౌంటర్ గా ఈ కథగా రాశారు.
"కోస్తా ప్రాంతం నుండి వలస వచ్చి తెలంగాణ భూములను కొత్త పంటలకు, వ్యాపారపు పంటలకు అలవాటు చేసి, భూమిని జీవనాధార వ్యవస్థ స్థాయి నుండి సంపద స్థాయికి మార్చినవారి అహంకారపూరిత అధికార సంస్కృతిని 'సంకర సంస్కృతిగా' నిరసించి చెప్పాడు శ్రీనివాస్. బయటి ఆధిపత్యం భార్యాభర్తల సంబంధాలలోకి కూడా ప్రవేశించి కోస్తా స్త్రీ తన తెలంగాణ భర్త పట్ల ఎంత అధికారపూరిత మనస్తత్వంతో ప్రవర్తిస్తుందో ఈ కథలో చిత్రించాడు`` (కాత్యాయనీ, విద్మహే. తెలంగాణ సాహిత్యం-జీవిత చిత్రణం. 2007. పుట 153).
ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణకు దిగుమతి అయిన వ్యాపార సంస్కృతి.. ఇక్కడి ప్రజల జీవనవిధానంలో, ముఖ్యంగా రైతుల జీవితాల్లో ఎలాంటి మార్పులను, దుష్ప్రరిణామాలను తీసుకొచ్చిందో ఈ కథ స్థూలంగా వ్యాఖ్యానించిందని చెప్పవచ్చు. ఆంధ్ర నుంచి వలస వచ్చిన రైతులే తెలంగాణ వారికి వ్యవసాయాన్ని నేర్పారన్న ఇతివృత్తంతో వచ్చిన `రేగడి విత్తుల` అప్పట్లో వివాదాస్పదం అయింది. తెలంగాణ ప్రజలు వెనుకబడినవాళ్లు, అనాగరికులు.. వారికి తామే సంస్కృతిని, నాగరికతను నేర్పించామన్న ఆధిపత్య భావన ఆ నవలలో ప్రతిబింబించడంతో దానికి దీటైన సమాధానంగా ఈ కథ వెలువడిందని అని చెప్పవచ్చు. ``దశాబ్దాలుగా తెలంగాణ జీవితాలు ఎట్లా అన్యాక్రాంతం అయ్యాయి? ఇటేటు రమ్మంటే ఇల్లంతా నాదేనన్నట్లు వలస వచ్చిన, కడుపులో పెట్టుకొని చూసుకున్నందుకు తిన్నింటి వాసాలు లెక్కపెట్టిన ఆంధ్రా ప్రజల నైజం ఎలాంటిదో ఈ కథ కూలంకషంగా చర్చించింది. సుబ్బారావు, సంగీత పాత్రలు ఆంధ్రా పీడనకు నిదర్శనంగా నిలుస్తాయి. రాజేశ్వర్ రెడ్డి, అతని తల్లి పాత్రలేమో దగా పడిన తెలంగాణకు నిదర్శనంగా కనిపిస్తాయి. తెలంగాణ ప్రజల మనస్తత్వానికి, ఆంధ్రా ప్రజల మనస్తత్వానికి గల తేడాను చూపడంలో రచయిత నూటికి నూరు పాళ్ళు కృతకృత్యులయ్యాడు`` అన్న (శ్రీధర్, వెల్దండి. సారంగ వెబ్ పత్రిక-జూన్ 2019) వ్యాఖ్య సబబే అనిపిస్తుంది.
4. "వర్తమాన చిత్రపటం"లో జీవన చిత్రణ:
తెలంగాణ ఉద్యమ నేపథ్యంతో డాక్టర్ బి.వి.ఎన్. స్వామి రాసిన ‘వర్తమాన చిత్రపటం’ (తెలంగాణ చౌక్) కథ.. `నాది అభివృద్ధి సమస్య కాదు, అస్తిత్వ సమస్య` అంటూ తెలంగాణ అస్తిత్వ సమస్యను ప్రతీకాత్మకంగా చెప్పే ప్రయత్నం చేస్తుంది. పాతికేళ్లుగా శారీరక, మానసిక ధర్మాలతో ఏకముఖంగా సాగిన భార్య మరణంతో తీవ్ర విషాదంలో ఉంటాడు కథకుడు. ఇద్దరివి వేర్వేరు కులాలు. అగ్రవర్ణంతో నేను, ధవుళ వర్ణంతో ఆమె, నలుపు ఛాయతో నేను, బీద ఛాయతో ఆమె అంటూ భిన్న సామాజిక వర్గాలైన తాము ప్రేమించి.. ఊరినుంచి పారిపోయి వచ్చి పెళ్లిచేసుకున్న విషయాలను గుర్తుచేసుకుంటాడు కథకుడు. తనకు దూరమైన భార్య స్మృత్యర్థం ఊరిలోని తన సొంత స్థలంలో ఆమె సమాధిని లేదా స్మారక కట్టడాన్ని నిర్మించాలనుకుంటాడు. కానీ ఆ స్థలం రోడ్డు విస్తరణ వల్ల ఊరి మధ్యకు వచ్చిందంటూ అభివృద్ధి సాకు చూపి ఊరి స్పర్పంచ్ కథకుడి ప్రయత్నాన్ని అడ్డుకుంటాడు. ఆ స్థలంలో వాణిజ్య షాపుల నిర్మించి అద్దెకు ఇవ్వడమో, లేక తనకు అమ్మేయమనో సర్పంచ్ చెప్తాడు. వ్యాపార దృక్పథమే పరమావధిగా తలిచే సర్పంచ్ వల్ల సొంత ఊరికి, సొంత స్థలానికి పరాయిగా మిగిలిన కథకుడు `తెలంగాణకు` ప్రతీకగా కనిపిస్తాడు.
వ్యాపార ప్రయోజనాలు మాత్రమే ఆలోచిస్తూ.. ప్రజల భావోద్వేగాలను పట్టించుకోని సర్పంచ్ పాత్ర.. ఆంధ్రుల ప్రాంతీయ వివక్షకు ప్రతీకగా చూపినట్టు అనిపిస్తుంది. అభివృద్ధికి ఆటంకమంటూ తెలంగాణ ఆకాంక్షను, అస్తిత్వ, ఆత్మగౌరవ పోరాటాన్ని సమైక్యవాదులు వ్యతిరేకించిన నేపథ్యంలో కథకుడు ఈ కథను రాసినట్టు కనిపిస్తోంది. మరో సందర్భంలో పక్కింటి భార్యాభర్తల గొడవలను తెలంగాణకు ప్రతీకాత్మంగా చూపుతూ.. ఆత్మగౌరవాన్ని చంపుకొని బతకాల్సిన పనిలేదని, ఇష్టం లేనప్పుడు గౌరవంగా వీడిపోవడమే మంచిదని.. తెలంగాణ అంశం శాంతిభద్రతల అంశం కాదని చాటుతాడు రచయిత.
5. ఆత్యహత్య నేపథ్య కథలు- జీవన చిత్రణ:
ఉద్యమ సమయంలో జరిగిన ఆత్మహత్యలను చిత్రిస్తూ వచ్చిన కథల్లో కొంతమేర జీవిత చిత్రణను, మానవ సంబంధాలను గమనించవచ్చు. వెగ్గలం రవి రాసిన `మనాది` (తెలంగాణ చౌక్) కథలో తాత-మనువల అనుబంధం కనిపిస్తుంది. కథలో ప్రధాన పాత్రధారి అయిన శీను అనే యువకుడు. తల్లిదండ్రులు లేని అతణ్ని తాత రాయమల్లు ఉన్నంతలో అల్లారుముద్దుగా పెంచుతాడు. శీను పెద్ద చదువులు చదివి.. మంచి ఉద్యోగం చేయాలని తాత ఆశ పడుతుంటాడు. మలిదశ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటున్న శీను.. జరుగుతున్న పరిణామాల వల్ల ఉద్వేగానికి లోనవుతాడు.
తెలంగానది యాభై ఏండ్లు పోరాటం.. ఈ పోరాటమింక నడుస్తనే ఉందిగని.. తెలంగానైతే వస్తలేదు.. అసలు తెలంగాణ వస్తదన్న నమ్మకం లేదు తాతా..` (తెలంగాణ చౌక్. పుట 119) అంటూ తన `మనాది`ని చెప్పుకుంటాడు శీను.
"నేను పెద్ద నౌకరి జేయల్నని మా తాత ఆశ. గీ తెలంగానల ఆంధ్రోడున్నంత కాలం మా అసోంటోల్లకు నౌకర్లురావు. గందుకే మా తెలంగాన కావలెనంటున్నం. మా బతుకులు మేం బత్కాలెనంటున్నం. సోనియమ్మన్నది.. నా బర్త్ డే గిఫ్టుగా తెలంగాన ఇస్తున్న అని. తెలంగాణ వచ్చిందన్న ఆనందంతోటి పండుగ జేసుకొని పటాకులు గాల్చుకున్నం. కని ఆ ఆనందం ఎంతోసేపు నిలువలేదు... తెలంగాన వస్తదన్న నమ్మకం పోయింది. గందుకే నేను సావలెనని తీర్మానించుకున్న` (తెలంగాణ చౌక్. పుట 120)
అని లేఖ రాసి శీను ఆత్మహత్య చేసుకుంటాడు. మలిదశ ఉద్యమంలో క్రియాశీలంగా వ్యవహరిస్తూ ఉద్యమ పరిణామాలను చూసి కలత చెందిన యువత మనోభావాలను ఈ కథ అద్దంపట్టింది. ఉద్యమంలో జరిగిన ఆత్యహత్యలకు నాటి రాజకీయ పరిణామాలు ఎలా కారణమయ్యాయో చెప్తూ.. వీటివల్ల తాత రాయమల్లు వంటి ఎందరో ఆప్తులు, కుటుంబసభ్యుల ఆశలు ఎలా అడియాసలయ్యాయో, ప్రాణంలా పెంచుకుంటున్న బిడ్డలు దూరమైతే అయినవారి జీవితాల్లో ఎంతటి విషాదం మిగులుతుందో ఈ కథ చిత్రించింది.
పీ చంద్ రాసిన `తెలంగాణ తల్లి` (తెలంగాణ చౌక్) కథలో తెలంగాణ పోరాటాలలో తన కుటుంబ సర్వస్వాన్ని కోల్పోయిన ఓ మహిళ ఇతివృత్తం, జీవన చిత్రణ చూడొచ్చు. మలిదశ ఉద్యమంలో భాగంగా ఉస్మానియా యూనివర్సిటీ ఆవరణలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకుంటాడు. అతని తల్లిది.. నిజాం గుండెల్లో నగారా మోగించిన నల్లగొండ జిల్లా కండివెండి గ్రామం. చిన్నప్పుడే ఆమె తండ్రి నిజాంకు వ్యతిరేకంగా రజాకార్లతో పోరాడి.. పోలీసు యాక్షన్ తర్వాత సర్కార్ బలగాల చేతిలో ప్రాణాలు విడుస్తాడు. ఆమె భర్త బానయ్య తొలిదశ ఉద్యమంలో పాల్గొని.. తెలంగాణ రాకపోవడంతో నక్సలైట్ల పార్టీలో కలిసి పోరాటంచేసి పోలీసుల కాల్పుల్లో చనిపోతాడు. ఇప్పుడు ఉన్న ఒక్కానొక్క కొడుకు కూడా ఉద్యమం కోసం ఆత్మహత్య చేసుకోవడంతో ఆ తల్లి జీవితమంతా అంధకారం అలుముకుంటుంది. అంతటి విషాదంలోనూ, అంతటి దు:ఖంలోనూ తన కొడుకు ఆత్మహత్య పిరికిచర్య అని గర్హిస్తుంది.
“వీడు నా కడుపుల పుట్టి... నా అయ్య లెక్కనో, వాని అయ్యలెక్కనో నచ్చెదాక కొట్లాడి సావకుండా పిరికి వానిలెక్కన వాన్ని వాడు కాల్చుకొని సచ్చిండు. అంత కంటే తెలంగాణ ద్రోహులను ఎవరినైనా చంపిసచ్చినా సంతోషించే దాన్ని. వాడు నా కడుపుల చెడబుట్టిండు. వాడు అసలు నా కొడుకు కాదు` (తెలంగాణ చౌక్. పుట 133)
అంటూ తన పోరాట స్వభావాన్ని చాటుతుంది. చరిత్ర పొడుగుతా ఉద్యమాలకు, పోరాటాలకు కేంద్రమైన తెలంగాణ ప్రాంతం ఎంతోమంది బిడల్ని పొగొట్టుకుంది. ఎంతో దు:ఖాన్నిదిగమింగుకుంది. పోరాటాలలో బిడ్డల్ని కోల్పోయిన విషాదమూర్తిని `తెలంగాణ తల్లి`కి ప్రతీకగా కథకుడు ఈ కథలో చూపుతాడు. బోయ జంగయ్య రాసిన `తుపాకులు` (మూడు తరాల తెలంగాణ కథ. హైదరాబాద్. 2017) కథకు ఇది పొడిగింపు కథగా భావించవచ్చు. ఆ కథలో మహిళ తెలంగాణ పోరాటాలలో భర్తను, కొడుకును కోల్పోగా, ఈ కథలో స్త్రీమూర్తి తండ్రిని, భర్తను, కొడుకును కోల్పోయి.. నడుస్తున్న తెలంగాణ వర్తమానానికి ప్రతీకగా నిలబడుతుంది. ఒక ఉదాత్తమైన ఆశయం కోసం విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకున్నప్పటికీ..ఇది తెలంగాణ చరిత్రలో సామాజిక విషాదంగా, అమరుల తల్లిదండ్రుల కుటుంబాల్లో మిగిలిన తీరని శోకంగా భావించవచ్చు.
6. తొలిదశ ఉద్యమ నేపథ్యంలో `తుపాకులు` కథ-జీవన చిత్రణ:
ప్రముఖ దళిత కథకుడు బోయ జంగయ్య 1998లో రాసిన కథ `తుపాకులు` (మూడు తరాల తెలంగాణ కథ) కథలో తొలిదశ ఉద్యమ ప్రస్తావన కొంత కనిపిస్తోంది. ఈ కథ తెలంగాణ పోరాటాలలో తన కుటుంబ సభ్యులను కోల్పోయిన ఓ మహిళ జీవితంలోని విషాదాన్ని ఈ కథ చిత్రిస్తోంది. తీవ్ర మానసిక సంఘర్షణలో ఉన్న ఓ మహిళ భువనగిరి వెళ్లే ఆర్టీసీ బస్సులో నార్కట్ పల్లి వద్ద ఎక్కి.. వలిగొండ వరకు చేసే ప్రయాణాన్ని ఈ కథ కళ్లకు కడుతుంది. ఆమె భర్త నిజాం వ్యతిరేక సాయుధ పోరాటంలో పాల్గొని.. రజాకార్ల చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. మలితరంలో ఆమె ఒక్కగానొక్క కొడుకు తొలిదశ తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటాడు. పెద్ద ఎత్తున పోరాడినా తెలంగాణ రాకపోవడంతో విప్లవోద్యమ బాట పట్టి.. పోలీసు కాల్పులకు బలి అవుతాడు. బస్సులో ప్రయాణం చేస్తున్న ఆమె టిక్కెట్టు తీసుకోకుండా మొండిగా ప్రవర్తిస్తుంది. దారిలో బస్సు ఎక్కిన ఖద్దరువాలా (నాయకుడు) చూసి నిష్టూరమాడుతుంది. “'పోరాటమపుడు ఆయుధాలు పట్టుకున్నోల్లు మంట గలిసిండ్రు. స్వరాజ్యం వొచ్చినంక మాయ మాటలు జెప్పి పదవులను పుచ్చుకొని ప్రజా నాయకులం అని బతుకుతుండ్రు` అని వెటకారమాడుతూ.. సాయుధ పోరాటంలో తన భర్తను కోల్పోయిన జ్ఞాపకాల్లోకి జారుకుంటుంది ఆమె.
దారిలో బస్సెక్కిన పోలీసులను చూసి.. దు:ఖం పొంగుకొచ్చి 1969 నాటి తొలిదశ ఉద్యమ గతాన్ని తలుచుకుంటుంది. అనంతరకాలంలో పోలీసు కాల్పులకు అసువులు బాసిన కొడుకు జ్ఞాపకాలతో కన్నీరుమున్నీరవుతుంది. తెలంగాణలో జరిగిన పోరాటాలలో ఎంతోమంది అమరులయ్యారు. ఆ త్యాగాల కారణంగా వారిని నమ్ముకున్న స్త్రీమూర్తుల జీవితాల్లో ఎంతటి విషాదం నిండిందో ఈ కథ హృదయానికి హత్తుకునేలా చాటుతుంది.
7. "మూడు తొవ్వలు" కథలో జీవణ చిత్రణ:
తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో బెజ్జారపు రవీందర్ రాసిన `మూడు తొవ్వలు` (మూడు తరాల తెలంగాణ కథ) కథ మలిదశ తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఓ ప్రభుత్వ అధికారి మానసిక సంఘర్షణను చిత్రిస్తోంది. కొత్తగా వచ్చిన తన పైఅధికారి క్రూర స్వభావంతో ప్రవర్తిస్తూ.. అందరి ముందు తనను అవమానించడంతో.. దానిని జీర్ణించుకోలేక సెలువు లేదా ట్రాన్స్‌ఫర్ చేసుకొని వెళ్లిపోవాలని నిశ్చయించుకున్న సచివాలయపు (సెక్టోరియల్) అధికారి మధు కథ ఇది.. హైదరాబాద్ నుంచి ఆర్టీసీ బస్సులో కోరుట్లకు బయలుదేరిన అతని స్వగతంలో కథ సాగుతుంది. బస్సు ప్రయాణంలో బస్సు కండక్టర్, సాధువు, బిడ్డను ఎత్తుకొని యువతి రూపంలో మూడు తొవ్వలు కనిపిస్తాయి.
మనిషి ఎదుర్కొనే సమస్యలకు, సంక్షోభాలకు నిజజీవితంలో ఎదురయ్యే సంఘటనల రూపంలో పరిష్కారం లభిస్తుందని సంకేతాత్మకంగా చెప్పే ప్రయత్నం చేస్తాడు కథకుడు. అనేక ఒత్తిళ్లలోనూ చమత్కారమైన మాటతీరుతో విజయవంతంగా విధుల నిర్వహిస్తున్న కండక్టర్ ఒక తొవ్వ కాగా.. ఇంట్లో తండ్రితో, భార్యతో గొడవల వల్ల సతమతమై.. చివరకు సాధువుగా మారిన తన ఊరివాడు రమాపతి రూపంలో మరొక తొవ్వ కనిపిస్తుంది. పసిపిల్లతో బస్సు ఎక్కి.. మొదట భర్త చేతిలో తన్నులు, తిట్లు తింటూ.. అతడు తన వ్యక్తిత్వాన్ని కించపరచడంతో ఒక్కసారిగా శివంగి ఎదురుతిరిగి భర్తను చితకబాదిన యువతిరూపంలో మూడో తొవ్వ కనిపిస్తుంది. `నవ్వుతున్న కండక్టర్, నిర్వికారంగా ఉన్న సాధువు, ఉగ్రరూపమెత్తిన స్త్రీ.. ముగ్గురూ రీళ్లలాగా గిర్రున తిరుగుతున్నారు మధు ఆలోచనల్లో..` (మూడు తరాల తెలంగాణ కథ, పుట 543)
అంటూ ఆలోచనాత్మకంగా కథను ముగిస్తాడు. మలిదశ ఉద్యమంలో డిసెంబర్ 9 ప్రకటన అనంతరం తెలంగాణ ఏర్పాటుపై కాలయాపన జరుగుతుండటంపై ప్రజల మనస్థితిని, తెలంగాణ రాజకీయాలను కథకుడు చూచాయగా ప్రస్తావిస్తాడు. ఎటు కదల్లేక సందిగ్ధావస్థలోని తెలంగాణ ఉద్యమకారులకు సైతం మూడుతొవ్వలను ప్రతీకాత్మకంగా సూచించినట్టు ఈ కథ అనిపించకపోదు.
8. ముగింపు:
ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కథల్లోని జీవన చిత్రణను విశ్లేషించినప్పుడు.. ఉద్యమ ఉద్వేగాలలో నలిగిపోయే ప్రజల జీవితాలు ఎంత సంక్షుభితంగా ఉంటాయో తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమ కథలు ప్రధానంగా ప్రాంతీయ వివక్షను చిత్రించడాన్ని గమనిస్తాం. తమ ప్రాంతంపై చూపుతున్న వివక్ష కారణంగా తమ జీవితాల్లో జరుగుతున్న నష్టాన్ని, తమ ఆకాంక్షల సాధన కోసం చేస్తున్న పోరాటంలో తాము ఎదుర్కొంటున్న ఒడిదుడుకుల్ని కథలు చాలా ప్రతిభావంతంగా, వాస్తవికంగా రికార్డు చేశాయని చెప్పవచ్చు. ఉద్యమాల అణచివేతలో భాగంగా జరిగే పోలీసు కాల్పుల్లో తమ ఆప్తులు ప్రాణాలు కోల్పోయినప్పుడు, ఉద్యమ ఉద్వేగాలలో మనస్తాపంతో తమ ఆప్తులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు వారి బంధుమిత్రులు ఎంతగా మానసిక వేదనకు గురవుతారో ఈ కథలు చాటుతాయి. తెలంగాణ ఉద్యమ సందర్భంలో జరిగిన ఆత్మహత్యలను చిత్రిస్తూనే.. బలవన్మరణాలు కాకుండా బతికి పోరాడాలనే స్ఫూర్తిని, పోరాట తత్వాన్ని ఉద్యమ కథలు నూరిపోస్తాయని చెప్పవచ్చు. తెలంగాణ ఉద్యమంలోని పరిస్థితులను, పరిణామాలను ప్రతిభావంతమైన శిల్పంతో ఆలోచన రేకెత్తించే రీతిలో చిత్రిస్తూ.. ఉద్యమ కథలు ఆనాటి సామాజిక వాస్తవికతను మన కళ్లముందు ఉంచే ప్రయత్నం చేశాయి. ముఖ్యంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎంతటి సంక్షుభిత పరిస్థితులు, ఒడిదుడుకులు ఉన్నాయో భావితరాలకు తెలియజేసే దర్పణంలా ఈ కథలు నిలబడతాయని, ఉద్యమ నేపథ్యంలో ఈ కథలు గమనించినప్పుడు అవి ప్రతిబింబించిన సామాజిక వాస్తవికత దృష్ట్యా విశిష్టమైన కథలుగా నిలిచిపోతాయని చెప్పవచ్చు.
9. ఉపయుక్తగ్రంథసూచి:
- ఎల్లారెడ్డి, కర్ర. స్వామి, బీవీఎన్ (సంపా). తెలంగాణ చౌక్ (ఉద్యమ కథల తొలి సంకలనం) (2011). తెలంగాణ సాహితీ పబ్లికేషన్స్. హనుమకొండ.
- దేవేంద్ర, ఎం (2021). తెలంగాణ కథ - వర్తమాన జీవన చిత్రణం(1990-2010). శ్రీచందన మరోజు పబ్లికేషన్స్. హైదరాబాద్.
- మల్లారెడ్డి, తూర్పు (సంపా). తెలంగాణ సాహిత్యం-జీవిత చిత్రణం (2007). తెలుగుశాఖ, శ్రీ లక్ష్మీనరసింహాస్వామి కళాశాల, ఉస్మానియా పట్టభద్రుల సంఘం ఎగ్జిబిషన్ సొసైటీవారి సంయుక్త ప్రచురణ. భువనగిరి.
- రవీందర్, బెజ్జారపు (2013). నిత్యగాయాల నది(కథాసంపుటి). పాలపిట్ట బుక్స్. హైదరాబాద్.
- సదానంద్ శారద. అయోధ్యారెడ్డి, ఏఎం.. మొ||వారు (సంపా). మూడు తరాల తెలంగాణ కథ (2017). తెలంగాణ సాహిత్య అకాడమీ. హైదరాబాద్.
- సుజాతారెడ్డి, ముదిగంటి, అశోక్‌కుమార్, కే.పీ మొ||వారు (సంపా). అస్తిత్వ (ప్రాతినిధ్య తెలంగాణ కథలు). 2019. తెలంగాణసాహిత్య అకాడమీ. హైదరాబాద్.
- స్వామి, బి.వి.ఎన్. రాత్రి, పగలు.. ఒక మెలకువ (కథా సంపుటి) (2013). స్వీయ ముద్రణ. హైదరాబాద్.
వ్యాసం:
- శ్రీధర్, వెల్దండి. (2009). `తెలంగాణ ఉద్యమ కుంపటి పులుగు శ్రీనివాస్ ‘సంకర విత్తులు’` వ్యాసం. సారంగ వెబ్‌మ్యాగజీన్-జూన్-2009
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.