headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-1 | January 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

21. ‘బెల్లి యాదయ్య’ కవిత్వం: సామాజికదృక్పథం

విప్లవకుమార్ మందుల

పరిశోధకవిద్యార్థి, తెలుగుశాఖ,
పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం,
లలితకళా పీఠం, హైదరాబాద్, తెలంగాణ.
సెల్: +91 9515225658, Email: viplavakumar2021@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

తెలుగు వచన కవిత్వ వికాసంలో బహుజనుల పాత్ర చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా బహుజన కులాల సామాజిక దృక్పథంతో చాలామంది కవులు కవిత్వాన్ని పండించారు. అటువంటి వారిలో విశిష్టమైన కవి బెల్లి యాదయ్య. బెల్లి యాదయ్య కవిగా తనదైన శిల్పంతో, సామాజిక దృక్పథంతో కవిత్వాన్ని రాశారు. వీరిపై మార్క్సిజం ప్రభావం అధికంగా ఉంది. మార్క్సిజం వెలుగులో ఏర్పరచుకున్న ప్రాపంచిక దృక్పథంతో కవిత్వాన్ని సృష్టించారు. వీరి కవిత్వంలో వివిధ సామాజిక దృక్పథాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా బెల్లి యాదయ్య కవిత్వంలో సామాజిక దృక్పథాన్ని అధ్యయనం చేయడం ఈ పరిశోధన వ్యాసముఖ్యోద్యేశ్యం.

Keywords: బెల్లి యాదయ్య, సామాజికదృక్పథం, బహుజనదృక్పథం, దళిత దృక్పథం, స్త్రీ దృక్పథం, ప్రాంతీయదృక్పథం, మతదృక్పథం.

1. ఉపోద్ఘాతం:

సమాజంలో మానవ దృష్టి, ఆలోచనలు, వ్యక్తపరిచిన భావాలు, వాటి నిర్దిష్ట మార్గమే దృక్పథం అని చెప్పవచ్చు. అయితే సాహిత్య, కళా రంగాల్లోని దృక్పథాలను పరిశీలించాల్సిన, విశ్లేషించాల్సిన అవసరతను, అనివార్యతను మన ముందు పెట్టింది మాత్రం మార్క్సిజమే. మార్క్స్ మానవ సమాజ పరిణమక్రమ చరిత్రను వర్గ దృష్టితో విశ్లేషించి, గతి తార్కిక చారిత్రక భౌతికవాద సిద్ధాంతంతో వర్గ దృక్పథాన్ని ప్రపంచం ముందు పెట్టాడు. ఆ తర్వాతనే సాహిత్యంలో ఒక సామాజిక స్పృహ వేగవంతమైంది. అందుకే-

'కమ్యూనిస్టు మార్క్సిస్టు సిద్దాంతాలు ప్రచారంలోకి వచ్చిన తర్వాత సాహిత్యంలో సామజిక స్పృహ పెరిగిన మాట వాస్తవం' అంటారు ఎం.ఎం. వినోదిని. (వేగుచుక్కలు, పుట.6, 2014).

ఫలితంగానే సమాజాన్ని, సాహిత్యాన్ని తులనాత్మకంగా పరిశీలించే విధానం ముందుకొచ్చింది. మార్క్సిజం సిద్ధాంతం పునాదిగా మానవజాతి విముక్తి కోసం జరిగిన పారిస్ కమ్యూన్ (1871), రష్యాలో బోల్షివిక్ విప్లవం (1917), చైనా విప్లవం (1949) విప్లవాల్లో అమరులైన వీరుల త్యాగం ఫలితంగా కార్మిక వర్గదృక్పథం విస్తరించింది. క్రమేణా సాహిత్యంలో అప్పటిదాకా చెలామణిలో, పై చేయిగా ఉన్న భావవాద దృక్పథానికి ప్రత్యామ్నాయంగా భౌతికవాద దృక్పథం పుట్టుకొచ్చింది. ప్రపంచ విప్లవాలు, ఉద్యమాల ఫలితంగా భావవాద దృక్పథం వెనుకపట్టు పట్టింది.

అంతకు ముందు కాలంలో కూడా సాహిత్యం ఉన్నది. కానీ రాజరిక వ్యవస్థల్లో రాజే దైవాంశసంభూతుడు. కనుక ఆరాజునో, ఆ రాజ్య ప్రాకారాలనో పొగుడుతూ, కీర్తిస్తూ ఆస్థాన కవులుండేవారు. కాబట్టి అనివార్యంగా ఆస్థాన సాహిత్యమో లేదా ఆ రాజుకో, కవికో నచ్చిన దైవ సాహిత్యమో వచ్చేదే తప్ప ప్రజాసాహిత్యం మిక్కిలి తక్కువ అని చెప్పక తప్పదు. పైగా పురాణాలనే కవితా వస్తువుగా రాయాలి. లేదంటే కల్పిత కథావస్తువు అని అధమ కావ్యంగా చూసే పరిస్థితి ఉండేది. రాజు ఆస్థానాల బయట కూడా అన్నమయ్య, వేమన, వీరబ్రహ్మం లాంటి వారు అద్భుతమైన సాహిత్యం ప్రజల భాషలో సృష్టించారు. ఆశు కవిత్వం చెప్పారు. అన్నమయ్య దేవుడి పేరుతో సాహిత్యం రాస్తూ కూడా ప్రజాసమస్యలను వినిపించేవాడు. వేమన, పోతులూరి వీరబ్రహ్మం కూడా సామాజిక సమస్యలను మిక్కిలి గట్టిగా వినిపించిన మొనగాళ్ళని చెప్పవచ్చు. అయినా ప్రగతిశీల భావాలున్నావారు అయినా భావవాద దృక్పథం నుంచి బయటపడలేకపోయారనేది కూడా ఇక్కడ గమనించదగినది.

'కేవలం వర్గ సమస్యతో మాత్రమే సాహిత్యాన్ని చూస్తే, దాంట్లోనూ భౌతికదృష్టి ఉన్నా, సాహిత్యం సమాజ వాస్తవికతను ప్రదర్శించడంలో పాక్షికకోణమే ప్రదర్శితమౌతుంది. అందువల్ల వర్గ, కుల సమస్యల సమ్మేళనంతో సాహిత్యాన్ని విశ్లేషించేది సాహిత్యంలో బహుజన దృక్పథమవుతుంది’ అంటాడు దార్ల వెంకటేశ్వరరావు (బహుజన సామాజిక దృక్పథం, సూర్య దినపత్రిక, డిసెంబర్ 20, 2010).'

కనుక ప్రపంచ దేశాల్లో వర్గదృక్పథం పునాదిగా సామాజికదృక్పథం తీరుతెన్నులను పరిశీలించవచ్చు. కానీ భారత దేశంలో అలా చూడడం కుదరదు. ఎందుకంటే భారత సామాజిక వ్యవస్థ వర్గ సమాజంతో పాటు, వర్ణ వ్యవస్థ ప్రాతిపదికన కుల వ్యవస్థగా ఘనీభవించి ఉన్నది. ఇండియాకు బయట ఉన్న సమాజం అంతా వర్గాలుగా నిట్ట నిలువునా చీల్చబడి ఉన్నది. కానీ ఇక్కడ నిలువుగా చీల్చబడ్డ వర్గంతో పాటు, ఆ వర్గం లోపలి ప్రజలు కులం పేరుతో అడ్డంగా చీల్చబడ్డారు. ఇది వర్గ ఐక్యతకు దృఢమైన ఆటంకంగా ఉన్నది. వర్గంలో కులం ఉన్నది. కులంలో వర్గం ఉన్నది. కనుక వాటి నిర్మూలన సంక్లిష్టమైంది. ఇండియాలో జైవిక, సాంస్కృతిక నిర్మాణంలో కుల కట్టుబాట్ల పేరుతో కుల భావజాలం తొలగించలేని మురికి కూపమై, ఇండియాకు పట్టిన క్యాన్సర్ రూపమై స్థిరీకరించబడి ఉన్నది. ఈ కులమే వర్గ చైతన్యానికి ఆటంకంగా మారింది. కాబట్టి మన దేశంలో సామాజిక వ్యవస్థ అంటే ప్రధానంగా కుల వ్యవస్థనే.

2. బహుజనత్వం:

'ఏ సమాజమైనా తనకు కావలసిన సాహిత్యాన్ని తానే సృష్టించుకుంటుంది. ఇలా సామాజిక జీవనంలో పుట్టిన సాహిత్యం ఆయా సామాజిక వ్యవస్థల స్వరూప స్వభావాలను ప్రతిఫలింప చేస్తుందంటాడు’ వి.వీరాచారి. (అన్నమయ్య పదవైభవం, పుట. 132, సంపాదకుడు శ్రీరంగస్వామి.టి, శ్రీలేఖ సాహితీసంస్థ, వరంగల్, 2010)

కనుక బెల్లి యాదయ్య జీవిస్తున్న కాలాన్ని, పరిస్థితులను, సమాజ స్థితిగతులను తనదైన శైలిలో కవిత్వికరిస్తున్నాడు. తను, తన చుట్టూ ఉన్న సమాజం ఎదురుకుంటున్న సామాజిక అసమానతలను, కుల వివక్షను, అణగారిన కులాలపై ఆధిపత్య కులాలు సాగిస్తున్న అణిచివేతను యాదయ్య ప్రశ్నిస్తున్నాడు. బానిసత్వంలో మగ్గుతున్న కులాలను మేల్కొల్పుతున్నాడు. అందుకు బుద్ధుడు చెప్పిన బహుజన హితాయః బహుజన సుఖాయః అన్న నినాద మార్గంలో బహుజనుల కోసం సృజన చేస్తున్నాడు. తన సాహిత్య దృక్పథం విప్లవం. సమసమాజ స్థాపనే తన లక్ష్యమని ప్రకటించినాడు. కానీ 1985 తర్వాత జరిగిన కారంచేడు, చుండూరు, పదిరికుప్పం, సోంపేట, వేంపేట ఘటనలతో తెలుగు సాహిత్య ప్రవాహం మలుపుతిరిగింది. అనివార్యంగా పూలే, అంబేడ్కర్ ఐడియాలజీని ఆచరించాల్సిన అవసరత తెరమీదికొచ్చింది. వర్గపోరాటాలకు మాత్రమే పరిమితం కాకుండా, మార్క్స్, పూలే, అంబేడ్కర్ ఆలోచనా విధాన మేళవింపుతో కుల, వర్గ పోరాటాలు జమిలీగా చేయాలని మారోజు వీరన్న, కంచ ఐలయ్య లాంటివారు సిద్ధాంతీకరించారు. ప్రజలు ఈ సిద్ధాంతంతో పదం కలిపారు, కదం తొక్కారు. ఫలితంగానే గొల్లకుర్మ డోల్ దెబ్బ, మోకు దెబ్బ, చాకిరేవు దెబ్బ, మాదిగ దండోర లాంటి సంఘాలు ఆవిర్భవించాయి. మాదిగ దండోరా మంద కృష్ణకు శివసాగర్ తోడ్పడ్డాడు.

దాంతో కుల, వర్గ పోరాటం అనడమే తప్పన్న భావనతో ఉన్న సిపిఐ, సిపిఎం లాంటి పార్టీలు సైతం కుల సంఘాలను వృత్తి సంఘాల పేరుతో పెట్టక తప్పలేదు. వర్గకుల పోరాట సిద్ధాంత భూమికగా ఏర్పడ్డ కుల సంఘాలు ఆత్మగౌరవం, కుల నిర్మూలన, సమానత్వం అనే నినాదమిస్తే, పార్లమెంటరీ కమ్యూనిస్టు పార్టీలు పెట్టిన కుల (వృత్తి) సంఘాలు వృత్తి రక్షణ కోసం పనిచేయనారంభించాయి. వృత్తి రక్షణ అంటే కుల రక్షణ లేదా కుల స్థిరీకరణే. ఎందుకంటే కులం అనేది ప్రాణి అయితే వృత్తి అనేది ఆ ప్రాణి శరీరం. కాబట్టి శరీరం అంతర్గతంగానో, బహిర్గతంగానో నశించకుండా కుల నిర్మూలన సాధ్యం కాదు. కుల వృత్తులు ఉన్నంత కాలం కులం సజీవంగా ఉంటుంది. ఇది గుర్తెరగకుండా పార్లమెంటరీ కమ్యూనిస్టులు తమ పార్టీల్లో ఉన్న ఆయా కులాలకు చెందిన క్యాడర్ ను రక్షించుకోవడం కోసం వృత్తిసంఘాలు పెట్టారు. ఇంతటి ప్రభావంతో కుల, వర్గ పోరాటాలు తోసుకొచ్చాయి. అలా అన్ని భూర్జువా పార్టీలను, కమ్యూనిస్టు పార్టీలను, కవులను, కళాకారులను ఈ ఊపు ఆవరించింది. అయితే ఇది కుల చైతన్యంగా కాకుండా, కుల నిర్మూలనా చైతన్యంగా నిర్మిత ప్రవాహమవ్వాల్సిన అవసరం ఉన్నది.

'సాహిత్యం కులాన్ని పట్టించుకుని వెలువడిన విధానాన్ని బహుజన సాహిత్య దృక్పథం తెలుపుతుంది తప్ప, కులాన్ని ప్రోత్సహించదు. కులాన్ని ఆధారంగా చేసుకుని వ్యక్తిగత ప్రతిభను, సమాజాన్ని విచ్ఛిన్నం చేసిన విధ్వంసాన్ని విశ్లేషిస్తూ, కుల నిర్మూలనకు ప్రయత్నిస్తుంది. అందుకనే సాహిత్య సృజన కూడా ఒక బాధ్యతాయుత, సామాజిక ప్రయోజక సాధనంగా ఉపయోగపడాలని’ భావిస్తుందంటాడు దార్ల వెంకటేశ్వర రావు. (బహుజనసామాజికదృక్పథం, సూర్య దినపత్రిక, డిసెంబర్ 20, 2010).'

తదనుగుణంగా కుల, వర్గపోరాట, దళితబహుజనసిద్ధాంతం యాదయ్యను కూడా సహజంగానే అలుముకుంది. కనుకనే దళిత, బహుజన సామాజిక దృక్పథంతో కవిత్వం రాశాడు.

నేను గొర్రెల్ని కాస్తుంటాను
గొర్రెల్ని గుర్తుపట్టి
శాల్తీలను లెక్కేసుకోవడం నా గణిత శాస్త్రం
పుష్టిగా మేపి నీళ్లు తాపడం
నొప్పి రోగం గమనించి చికిత్స చేయడం
అసమానతలు తొలగించి
సురక్షితమార్గాన జువ్వాన్ని నడిపించడం నా పరిసరాల విజ్ఞానం
విశ్వ రహస్యాలు తెలిసినవాన్ని
వెర్రివాన్ని ఎలాగవుతానో! (నేను గొర్రెల్ని కాస్తుంటాను, పుట.2)

బెల్లి యాదయ్య పుట్టిన కులం గొల్ల. ఈ గొల్లవారిని వెర్రివారని, ఎంత మంచి గొల్లోనికైనా యపకాయంత వెర్రి ఉంటదని అగ్రకులాలు సృష్టించిన సామెత. ఇది కేవలం వారిని కించపరిచడానికి, ఇతర కులాలు ప్రజలు తమ కంటే బుద్ధిహీనులని హేళన చేయడం, ఇలా అగౌరవపరచడం వారి అహంకారానికి, దుర్భుద్దికి నిదర్శనం. దాన్ని తిప్పి కొడుతూ యాదయ్య నేను గొర్రెల్ని కాస్తుంటాను కవిత్వం రాసి తమ ఆత్మగౌరవాన్ని చాటుతున్నాడు. ప్రకృతి, సైన్స్, గణితం, వైద్యం, సాంఘిక శాస్త్రం ఇలా ఎన్నో విశ్వరహస్యాలు తెలిసినవారు. వెర్రివారెలా అవుతారని ప్రశ్నిస్తున్నాడు. అసమానతలను తొలగించే పరిసరాల విజ్ఞానం మార్గంలో జీవాలను నడిడిపిస్తానంటూ, అసమానతలు చూపించేవారికి చురకలంటిస్తున్నాడు. ఇది ఆత్మగౌరవ పోరాటంలో భాగంగా రాసిన కవిత్వం.

బంగ్లాల్లో తులసి పూజాకన్నా ముందే
ఇక్కడ ధాతి పూజ సురువు
ఆలయాల్లో అర్చకుల స్తోత్రం కన్నా ముందే
ఇక్కడ అగ్నిహోత్రం ఆరంభం
బడి మొదటిఘంట మోగకముందే
ఇక్కడ ఢాకలి మీద సుత్తి శ్రుతిలయలు మొదలు (లోహాయజ్ఞం, పుట. 12)

ఈ సమాజంలో మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ గా ఉన్న వడ్ల, కమ్మరులు నిరాధారణకు గురయ్యారు. వారి గురించి, వారిని గుర్తించి యాదయ్య కవిత్వం రాశాడు. అది కూడా ఎలా దొరల బంగ్లాకు ముడిపెట్టి. అక్కడి తులసి పూజ కన్నా ముందే, ఆలయాల్లో బ్రాహ్మణుల కంటే కూడా ధాతిలో అగ్నిహోత్రం ప్రారంభమవుద్ది. అంటూ పోలికలు పెట్టాడు. ఈ పోలికలోనే వీరి వెనుకబాటుకు కారణం వారే అనేది కూడా తెలుస్తుంది. వీళ్ళు ఉత్పత్తులు చేస్తుంటే వారు వట్టిగనే కూర్చొని తింటున్నారు. శ్రమ ఉత్పత్తి కులాలది, సిరి ఏ విధమైన ఉత్పత్తి చేయని విశ్రాంత కులాలది అనే విషయాన్నీ గుర్తు చేస్తున్నాడు. వడ్ల కమ్మరోళ్లు కర్రు, నాగలి నుంచి బండి వరకు సమస్త వ్యవసాయ పనిముట్లు తయారు చేస్తారు. సకల వంట పాత్రలను పుట్టిస్తారు. ఇంతటి పరికరాలను ఉత్పత్తి చేసిన వీరు మాత్రం ఇంకా వెనుకబాటుకు గురైతునే ఉన్నారన్న విషయాన్నీ సమాజం ముందు పెడుతున్నాడు యాదయ్య.

బహుశా!
ప్రపంచం మొత్తం మీద
కత్తిచేత నెత్తురు పద్యాల్లో ఆత్మకథ రాసుకునేది ఇతనొక్కడే కావచ్చు
హంతకుడి మాదిరి విధుల్లో సంచరిస్తూ
హతుడిగా మిగులుతుంది కూడా ఇతనొక్కడే కావచ్చు
ఓనా సహవాసులారా!
చట్టం సిద్ధార్థుడిగా మారితే తప్ప
ఈ రక్తసిక్త మానవ హంసకు
దేవదత్త సమాజం నుండి
రక్షణ లేదు (రుధిరక్రీడ, పుట. 32)

ఇది పెద్దమ్మలవారు అనే వెనుకబడిన సంచార కులంవారి గురించి రాసినది. వీళ్ళు కూడా మనుషులేనని చాలా మంది గుర్తించరు. తమని తాము హింసించుకుంటూ ఎదుటివారికి వినోదం పంచే వృత్తి వీరిది. ఈ నిచ్చన మెట్ల కుల వ్యవస్థ, కిందికులాలు బతకడానికి ఎంతటి అవస్థలను సృష్టించిందో వీరిని చుస్తే తెలుస్తుంది. ఇలాంటి అట్టడుగు కులాల బాధలను యాదయ్య తన కవిత్వం ద్వారా చర్చనీయంగావిస్తున్నాడు. అందుకు చట్టాల్లో మరిన్ని ప్రగతిశీల మార్పులు రావాలని కోరుతున్నాడు. ఎంతగా అంటే చట్టం బుద్దుడిగా మారితే తప్ప ఈ దేవుడి సమాజంలో అలాంటి సామాన్య మానవులకు రక్షణ ఉండదని భావిస్తున్నాడు. అంటే దేవుడి పేరు మీద బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య ఆధిపత్య సమాజం వారి కింది కులాల శ్రమను దోచుకుంటూ, బానిసలుగా, బిక్షకులుగా, ఆకలికి అల్లాడేలా చేస్తుంది. వారు మాత్రం సుఖాలను అనుభవిస్తూ, వారి కింది కులాల వారిని కష్టాల్లోకి నెట్టేయడం, అగౌరవంగా చూడడం అగ్రవర్ణ నీతిగా మారింది. వాటిని మార్చడానికే బహుజన హితాయః బహుజన సుఖాయః అన్న మార్గంలో దేశం సాగాలని కోరుకుంటున్నాడు యాదయ్య.

3. దళిత దృక్పథం:

తెలుగు సాహిత్యంలో దళిత ప్రస్తావన మొదటి సారిగా బమ్మెర పోతన రచించిన శ్రీమద్భాగవతంలోని అష్టమ స్కందం గజేంద్ర మోక్ష ఘట్టంలో దళిత పద ప్రయోగం కనిపిస్తుంది. కానీ, ఈ దళిత చైతన్యానికి సూచిక కాదు. మహాత్మ జ్యోతిబాపూలే దళిత శబ్దాన్ని జాతి వాచకంగా ప్రచారంలోకి తెచ్చారు. 1970లో వచ్చిన దళిత ఫాంథర్స్ ఉద్యమం ద్వారా ఈ పదం బాగా ప్రచారంలోకి వచ్చింది.” అంటాడు డి. వి శ్రవణ్ కుమార్ (సాహిత్య ప్రస్థానం. పుట: 126 మే, 2022)

ఆ క్రమంలోనే ఆ ప్రభావాలతోనే బెల్లి యాదయ్య దళిత దృక్పథాన్ని అలవర్చుకున్నాడని చెప్పవచ్చు.

రాత్రినాటకంలో రాజులా వెలిగి
తెల్లారాక బతుకుబాగోతంలో బాంచకోలువేందని మాత్రం
వీళ్ళ మెదళ్ళ మృదంగాలు బద్దలు కావు (మా వూరి గడి పుట.87)

ఊళ్లలో యక్షగాన, బాగోతాలతో పురాణాలను, రాజుల చరిత్రలను నాటకాలతో ప్రచారం చేసేవారు. వారు నిత్యం బానిసత్వంలో మగ్గిపోతుంటారు. పైగా ఆ కథల్లోని కులనీతిని, అసమానతల ఖ్యాతిని గొప్పగా కొనియాడుతారు. ఈ ఊడిగపు బతుకు పూర్వజన్మ సుకృతం అని సమాధానపడుతుంటారు. చిన్న ప్రశంస, పొగడ్తలకే జీవితాన్ని వారి సేవకు తాకట్టు పెడతారు. ఇదంతా అగ్రవర్ణ కుట్రలో, నిచ్చనమెట్ల కులవ్యవస్థలో భాగం. ఇలాంటి స్థితిలో కూడా వెట్టిచాకిరికి, కుల దోపిడీ, అణిచివేతలకు వ్యతిరేకంగా ఎందుకు నోరు విప్పరని యాదయ్య ఆవేదన పడుతున్నాడు. రాత్రి నాటకంలో రాజులా వెలిగినప్పుడు, నిజజీవితంలో కులం పేరుతో బానిసత్వం ఎందుకు అనుభవించాల్సి వస్తుందో ఆలోచించాలని, ఎదిరించాలని యాదయ్య కోరుకుంటున్నాడు.

దాసులం ధర్మఘంట లాగాం
దర్బారు దిగిరండి
పూజ్యం అవమానాల పాళ్లు
గొడ్లగోసే బండదగ్గరే లెక్కేసుకుందాం (మట్టిసెగలు, పుట.62)

దళితులను వేల సంవత్సరాలుగా దాసులుగా, బానిసలుగా మలిచి, ఊరికి దూరంగా నెట్టేశారు. సాటి మనుషులన్న గౌరవం కూడా ఇవ్వకుండా నిత్యం అవమానాలకు గురి చేశారు. మూతికి ముంత, ముడ్డికి తాటాకులు కట్టి తమ అడుగులు, ఉమ్మి కూడా నేలపై పడరాదని హీనాతిహీనంగా చూశారు. తరతరాలగా బానిసలుగా కులం పేరుతో ఊడిగం చేయిస్తున్నారు. ఆ కుల దోపిడి నుంచి తెలివిడిలోకొచ్చి 'దాసులం ధర్మగంట లాగాం' అంటూ తమకు జరిగిన అన్యాయాలను, కులం పేరుతో చేసిన అణిచివేతలను, తమని అంటరానివారిని చేసిన వెలివేతలను, అగ్రకులాల దుర్మార్గాలను రచ్చకీడ్చాడు. అగ్రకులాలవారి అరాచకాలు, అకృత్యాలు చర్చించేందుకు, లెక్కలేసుకునేందుకు రమ్మంటున్నాడు బెల్లి యాదయ్య. అది కూడా ఎక్కడకి? ఇక్కడక్కడక్కడికి కాదు. సరాసరి గొడ్లగోసే బండదగ్గరే తేల్చుకుందాం అంటున్నాడు. ఇక్కడ తన నిరసనను, తిరుగుబాటును ఒకేసారి వ్యక్తం చేస్తున్నాడు. అందులో అంతర్లీనంగా హెచ్చరిక కూడా దాగిఉన్నది.

చుండూరు, కారంచేడుల్ని
సోంపేట వేంపెంటల్ని
మేం మరచిపోమ్
బహుశా...మనువాది
ఇంకా మమ్మల్ని ఓటర్లే అనుకుంటున్నాడు కాబోలు (చాటింపు, పుట.30)

చుండూరు, కారంచేడు, సోంపేట, వేంపెంటల్లో దళితుల ఊచకోత మానని పుండై కవిని వేధిస్తున్నది. పుట్టుకతో యాదయ్య బీసీ అయినా తన సహచర దళిత ప్రజలపై కులాధిపత్యవాదులు చేసిన ఒక్కొక్క మరణహోమ మంటల గాయాలను, పూర్వికులు నిప్పును దాచిపెట్టుకున్నట్టు దాచిపెట్టుకున్నాడు యాదయ్య. ఆ నివురుగప్పిన తనంలోంచే తాను మెల్లగా రాజుకుంటూ, ఓటర్లుగా పరిమితమైపోకుండా రాజ్యాధికారానికి రాజుకొమ్మని దళితులను రాజేస్తున్నాడు. అంతకంటే కూడా దళితులపై జరిగిన దుర్మార్గాల నుంచి దళితులు చైతన్యమైతున్నారని, ఓటర్లుగా మిగలడానికి సిద్ధంగాలేరని కూడా తెలియజేస్తున్నాడు. ఇక్కడ యాదయ్యకు సానుభూతేకాదు దళితుల పట్ల సహానుభూతి కూడా ఉందని స్పష్టమైతున్నది. ఓటర్లే అనుకుంటున్నాడు కాబోలు అన్న వాక్యంలో దళితులకు అధికారం రావాలని యాదయ్య కోరుకుంటున్నట్టు మనకు అర్థమైతుంది.

4. స్త్రీ దృక్పథం:

నేనే దోషిని
నేనే పాపిని
ఎందుకంటే
నీ మగతనం కోసమే
నా వెచ్చని గాఢమైన ఆడతనం అర్పితం కావలసివుందని
రాసి పెట్టిన మనుధర్మం రాజ్యమేలుతున్నందుకు (నిరవధి. పుట.7)

బెల్లి యాదయ్య స్త్రీ దృక్పథంతో కూడా కవిత్వం రాశాడు. అది స్త్రీలు ఎదుర్కుంటున్న సమస్యల్ని ఏకరువు పెట్టినట్టో, పరిష్కారానికి డిమాండ్ చేసినట్టో ఉండదు. ఆ సమస్య మూలాల మీద తన అక్షరాలను ఎక్కుపెడతాడు. ఇక్కడ మోసపోయిన ఒక స్త్రీ, తను ఇలా కావడానికి కారణం మనుధర్మం అనే ఆధిపత్య సిద్ధాంతం వలన అంటుంది. ఆ అసమంజసమైన పురుషాధిపత్య హిందూ మత ధర్మమే ఆడవాళ్లను అవసరానికి వాడుకోవచ్చు, వదిలేయవచ్చు అంటున్నది. మనుధర్మం సమాజంలో అలాంటి దుర్మార్గకర భావజాలం వ్యాప్తి చేసి, రాజ్యం ఏలుతున్నందువల్లనే మహిళల దుస్థితికి కారణం అంటున్నాడు. దాన్నుంచి స్త్రీ విముక్తి కావాలంటే మనుధర్మాన్ని బద్దలుకొట్టాల్సిన అవసరం ఉందనే కార్యాన్ని స్త్రీ జాతి ముందు పెడుతున్నాడు యాదయ్య.

ఆమె నిట్టూర్పువిడుస్తుంది
మహిళగానే తప్ప మనిషిగా గుర్తించని
అసమ పరిస్థితులను గురించి
వేణువైనంతకాలం పాడుకునే లోకం
విల్లయితే పారిపోతారని
వెదురుకు మరొకరు చెప్పాలా బెల్లి! (పాంచజన్యం, పుట.7)

ఈ సమాజం మహిళను ఆట వస్తువుగా, అవసరాలు తీర్చే బొమ్మగా చూస్తుంది. స్త్రీ కూడా ఒక మనిషి, ఆమెకూ కొన్ని కోరికలు, ఇష్టాయిష్టాలు, స్వంత ఆలోచనలు, అభిప్రాయాలూ ఉంటాయనుకోవడలేదు. ఒక వేళ ఉంటాయని గుర్తించినా అవి మగజాతి కోసం బలిపెట్టడం బాధ్యత అని భావిస్తున్నారు. ఈ దేశంలో మహిళను ద్వితీయ శ్రేణి ప్రాణిగా, అప్రకటిత బానిసగా చూస్తున్నారు తప్ప మనిషిగా గుర్తించడం లేదు. ఈ అసమ వ్యవస్థను పోగొట్టాలంటే స్త్రీ పీడనను ఎదిరించాలంటున్నాడు. భరించినంత కాలం ఆడుకుంటారు, వాడుకుంటారు. ఒక్కసారి విల్లులా తిరగబడితే వేడుకుంటారని చెప్తున్నాడు. స్త్రీ సమానత్వాన్ని కాంక్షిస్తున్నాడు.

గాయపడ్డాను కోయపడ్డాను అనుకోకు
అంటిన అర్హతలేని ఒంటిని
విష్పర్ ప్యాడ్ లో మలిచి డస్ట్ బిన్ లో పారెయ్
నిసిగ్గు మగతనం మీద సినిక్ ముఖం దుశ్యర్యలమీద
కాసింత జనం ఉమ్మిని
నీ పాద ధూళిని కలిపి కుమ్మరించేసెయ్ (అట్లా ఉన్నప్పటికిని, పుట.87)

సమాజంలో మహిళకు ఏ మరకపడ్డా పనికిరాదు, ముల్లొచ్చి ఆకు మీద పడినా ఆకొచ్చి ముళ్లు మీద పడినా ఆకుకే నష్టం లాంటి అనేక సామెతలు ఉండేవి. ఈ పనికిరాని పాతకాలం సామెతలను తుత్తునియలు చేస్తూ కొత్త రాతలు రాస్తున్నాడు బెల్లి యాదయ్య. మహిళల మీద పెత్తనం చేయడం కోసం, ఏవో పనికిమాలిన కారణాలు చూపించి వారిని తక్కువ చేయడం, బలహీనులుగా ముద్రలేయడం, పవిత్రత, పాడు అంటూ దాన్ని మహిళలకు మాత్రమే అంటగట్టడం, అదికూడా ఆలోచనకు చెందినది కాకుండా శరీరానికి ఆపాదించడం లాంటి విపరీత ధోరణులు భారతీయ సమాజంలో కోకొల్లలు. అవన్నిటిని విష్పర్ ప్యాడ్ లో చుట్టి డస్ట్ బిన్ లో పారేయమంటున్నాడు. పురుషుడి లాగే మహిళ కూడ మనిషే. తనకూ స్వేచ్ఛ, సమానత్వం, స్వాభిమానం, ఆలోచనలు, అభిప్రాయాలుంటాయి అని గుర్తించని వారిని, వాటిని అతిక్రమించి మహిళలపై దాడులకు ఒడిగట్టే వ్యర్ధ ముఖాల మీద జనం ఉమ్మిని, మహిళా పాద దూళిని కొట్టి ప్రశాంతంగా నీ జీవితం నీవు గడుపు. అనుకున్న లక్ష్యాల వైపు దూసుకుపో అంటున్నాడు.

5. మత దృక్పథం:

రాళ్ళూ రప్పలు
రాముడికికొన్ని రహీమ్ కు కొన్ని రాబర్ట్ కు కొన్ని
భజన చేస్తుంటాయి
ఇక్కడ
ఎన్ని జననాలు జరుగుతున్నాయో
అన్ని యుద్ధాలు జరుగుతున్నాయి
మనల్ని మనంగా భావిస్తే
మతం మానవతగా భాసిస్తే లోకమంతా
బ్రతికినట్టే నంటాను (భవిష్యద్దర్శనం, పుట.28)

మనుషులు మతాలూ విడివడి దేవుళ్ళకు భజన చేస్తుంటారు. కానీ ఏ దేవుడు మనుషుల కోసం చేసిందేమి లేదు. పైగా దేవుళ్ళ పేరుతో మనుషుల్ని ఒకరికొకరు చంపుకోవడం, రాజకీయవసరాల కోసం ఒక మతం వారు మరో మతం వారిని ఊచకోత కోస్తూ సామూహిక హత్యలు చేస్తుంటారు. అందుకే ఎన్ని జననాలు జరుగుతున్నాయో అన్ని యుద్దాలు జరుగుతున్నాయంటాడు. మానవులు మతాలుగా కాకుండా మనుషులుగా ఉంటే, మానవీయత బతికితే లోకమంతా బతుకుతుందంటు, లౌకికతను కోరుకుంటున్నాడు యాదయ్య.

మాష్టారేం చేస్తాడు
దేహం చుట్టూ దేశ పటాన్ని చుట్టుకుంటాడు
నిత్యం జాతి జావళి ఆలపిస్తుంటాడు
మతసారాన్ని సుద్దముక్కలతో బ్లాక్ బోర్డుమీద నిలదీస్తాడు
అద్వైతం ఆపాదన కుదరదంటే దేవున్ని సైతం గోడకుర్చీ వేయిస్తాడు (మాష్టారేం చేస్తాడు పుట.73)

మాష్టారు మతసారాలను నిలదీసి, దేవుణ్ణి గోడకుర్చీ వేయిస్తాడనడంలోనే బెల్లి యాదయ్య సామాజిక దృక్పథం కుండ బద్దలుకొట్టినట్టు కనిపిస్తుంది. దేవున్ని గోడకుర్చీ వేయించాలనే ఆలోచనలో కవి గతితార్కిక భౌతికవాద శాస్త్రీయతను ఎంతగా ఆచరిస్తాడో అర్థమైతుంది. ప్రతి టీచర్ పాఠశాలలోని క్లాస్ రూములో మతాల అంతు తేల్చి, దైవమనే మూర్ఖత్వాన్ని తొలగిస్తే దేశం జ్ఞానవంతంగా శాశ్యశామలం అవుతుంది. రేపటి తరాలకు భయం అనేదే ఉండదు. భారత రాజ్యాంగం చెప్పిన సైన్టిఫిక్ టెంపర్ తప్పక అభివృద్ధి అవుతుంది. స్వతహాగా టీచర్ అయిన ఈ కవి విద్యారంగం పట్ల, పాఠ్య ప్రణాళికల పట్ల, దేశాభివృద్ధిపట్ల ఎంతటి శాస్త్రీయ దృక్పథం కలిగి ఉన్నాడో తెలిసిపోతుంది.

వీర తిలకడారుడు
విగ్రహాలకు పడిమొక్కేవాడు కాదు
ఇప్పుడు
మాకో సెక్యులర్ పాదచారుడు కావాలి
అతని నడత ప్రగతి మతాన్ని ప్రాపంచికం చేయాలి (నాయకుడు కావాలి, మా ఊరు అట్లా లేదు, పుట.27, అక్టోబర్, 2015)

తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత రాష్ట్రం ఎలా ఉండాలి? దానికి ఎలాంటి నాయకుడు కావాలి అనే విషయాన్నీ కవి ఇలా భావిస్తున్నాడు. వీర తిలకం పెట్టుకుని విగ్రహాలకు పది మొక్కుతూ రాజ్యాంగ విరుద్ధంగా ఉండకూడదు. ప్రభుత్వ ప్రతినిధి లేదా ప్రజా ప్రతినిధి అనేవాడు ఒక మతానికి రిప్రజెంటేషన్ చేస్తున్నట్లు ఉండకూడదు. నాయకుడి మతం ప్రగతి అభిమతంగా సాగాలి. సెక్యులరిజాన్ని కాపాడేవాడవ్వాలి. అన్ని రకాల ప్రజల జీవనానికి హామీగా ఉండాలి. అని కవి భావిస్తున్నాడు.

6. ప్రాంతీయ దృక్పథం:

బెల్లి యాదయ్యకు ప్రాపంచిక దృక్పథమే కాదు, ప్రాంతీయ దృక్పథం కూడా ఉన్నదని ఆయన సాహిత్యాన్ని పరిశీలించి చూస్తే అవగతమవుతుంది. నిలబడ్డ నేల, పీల్చుతున్నాగాలి, తాగుతున్న నీరు, బతుకుతున్న జీవితం, నడుపుతున్న సంస్కృతి ప్రభావం అక్కడివారి మీద ఉంటుంది. ఆ ప్రాంత భౌగోళిక, ఆర్ధిక, రాజకీయ, సాంస్కృతిక విషయాలు సహజంగానే ఆ ప్రజలను ఆలోచింపజేస్తుంటాయి. ఒక సాహిత్య విద్యార్థిగా తెలుగు నేల మీదున్న తెలంగాణ, ఆంధ్రా, రాయలసీమ మూడు ప్రాంతాల్లో విద్యనభ్యసించాడు. మున్నేల చరిత్రలను చదువుకున్నాడు. ఆ క్రమంలోనే తన నేల చరిత్రను, తన భాషను, తన సాహిత్య విశిష్టతను దేవులాడుకుని ఉంటాడు. కానీ ఎక్కడ దొరకదు.

ఎవడు
ఎప్పుడు
ఎందుకు రాసినా
చరిత్రే
చరిత్ర ఐతది తప్ప
చరిత్ర కానిది
ఎన్నటికీ
చరిత్ర కాదు (విభాజకం, దీర్ఘ కవిత, పుట.1)

అందుకే ఆ దృక్పథంతోనే విభాజకం దీర్ఘ కవితను పై వాక్యాలతో ప్రారంభించాడని అర్థమైతుంది. యాదయ్య సొంత ఊరు పాలెం పక్కనే ఉన్న మాదారం గ్రామానికి చెందిన వట్టికోట ఆళ్వారుస్వామి తొలి తెలుగు రాజకీయ నవల 'ప్రజల మనిషి' రాశాడు. కానీ ఆయనను, ఆయన రచనల్ని సాహిత్య చరిత్రలో ప్రతి పుట వెతికి చూశాడు. కానీ ఎక్కడా కనిపించదు. ఈ ప్రాంతానికి సంబంధం లేనివారు, ఇక్కడి యెతలు, కథలు రాయని నన్నయ్య లాంటి అనువాద కవులు సాహిత్య చరిత్ర నెత్తిన నాట్యం చేయడం, తెలుగు భాష పేరుతో తెలంగాణ ప్రజల్ని మోసం చేయడం, అప్రకటిత వివక్ష చూపడం మట్టి మనుషుల జీవితాన్ని పుక్కిటపట్టి రాస్తున్న యాదయ్య లాంటి కవులు ఎలా తట్టుకోగలరు.

తెలుగుతనానికి తందాన తాన
బాష పేరిట సొగసైన బందిఖానా
ఇది తెలంగాణ (విభాజకం, దీర్ఘ కవిత, పుట.13)

అనువాదాలను అంటుకోకుండా తొలిసారిగా దేశీ పద్దతిలో రచనలనారంభించిన పాల్కురికి సోమన్న, రాజులకు కవిత్వాన్ని తాకట్టు పెట్టబోనన్న పోతన్నకు తెలుగు సాహిత్య చరిత్రలో ఇచ్చిన ప్రాధాన్యత ఏపాటిది? అంతెందుకు పాఠశాలల్లో విద్యార్థులు చేసే ప్రతిజ్ఞ రాసింది నల్లగొండ జిల్లాకు చెందిన పైడిమర్రి వెంకట సుబ్బారావు. తెలంగాణ వచ్చే వరకు ఆయన పేరు కూడా ఎక్కడ ప్రస్తావించలేదు కదా! తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం ప్రపంచంలోనే పేరెన్నిక కలది. అంతటి త్యాగాలు, ఉద్యమ పాఠాలు ఎక్కడ? ఆ పోరాటంలో సుద్దాల హనుమంతు రాసిన పల్లెటూరి పిల్లగాడా, బండి యాదగిరి రాసిన బండెనుక బండికట్టి పదహారు బండ్లు కట్టి ఏ బండ్లే పోతవు కొడుకో నా కొడక ప్రతాపరెడ్డి, మల్లు స్వరాజ్యం రాసిన కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మ కొడవళ్లు చేపట్టవే పాటలకు సాహిత్య చరిత్రలో స్థానం ఎక్కడ? సాక్షాత్తు బెల్లి యాదయ్య కూడా పాత్ర వేసిన భూస్వామి, మా భూమి నాటకాలు ఆంధ్రా ఆధిపత్య సంస్కృతిలో, చరిత్రలో ప్రస్తావనకు కూడా నోచుకోలేదు. అల్లూరి సీతారామరాజు చరిత్ర అందరికీ తెలుసు. మరి కొమురం భీం త్యాగం ఆంధ్రా చరిత్రకారుల కంటికి ఎందుకు కానరాకుండా పోయింది? ఇదంతా తెలుగు భాష ఒకటైనందున రాష్ట్రం ఒకటి అన్న పేరుతో జరిగిన సాంస్కృతిక, చారిత్రక దోపిడి. ఇవన్నీ ఎదుర్కుంటున్న, అనుభవంలోకి వస్తున్నా క్రమంలో యాదయ్యను ప్రాంతీయ దృక్పథం ఆవరించిందనిపిస్తుంది.

జాతి ఒకటి సరే
వేషం ఒకటి సరే
గోస వేరై ఉన్నదన్న విషయం గుర్తెరగవూ
ఫలహారం ఒకటి సరే
పండగల్లో తేడాలున్న సంగతి చెప్పవెందుకూ (విభాజకం, దీర్ఘకవిత, పుట.12)

జాతి, వేషం, భాషంటూ, మనమంతా తెలుగుజాతి అంటూ దశాబ్దాలుగా అమాయకులైన తెలంగాణ ప్రజలను దోపిడి చేశారు. బాగుచేయండి మహాప్రభో అని ఎంత మొత్తుకున్నా ఆంధ్రా పాలకులు చెవినబెట్టలేదు. నీటి దోపిడి, కొలువుల దోపిడి, నిధుల దోపిడి, హైదరాబాద్, హైదరాబాద్ చుట్టున్న భూముల దురాక్రమణ, సినిమా దురాక్రమణ ఇలా ప్రతిచోటా ఆధిపత్యమే. కానీ ఇక్కడి ప్రజల గోస పట్టించుకున్నోడే లేడు. పైగా ఇంకా గోసల్లోకి నెట్టేశారు. ఫలహారం ఒకటి కావచ్చు కానీ పండగల్లో చాలా తేడాలున్నాయని కవి గుర్తించాడు, ప్రశ్నించాడు.

7. ముగింపు:

  1. సామాజిక అస్తిత్వం సామాజిక చైతన్యాన్ని అందిస్తున్నదేని మార్క్సిస్టు మౌలిక సూత్రం. కనుక భావవాద దృక్పథానికి ప్రతిగా సాహిత్యానికి సామాజిక దృక్పథం ఉంటుందనే మార్క్సిజం ప్రతిపాదన ప్రపంచ విప్లవ వెలుగు బావుటాలో విశ్వవ్యాపితం అయింది. అందుకే ప్రపంచ సాహితీ యవనికపై సామాజిక దృక్పథం అనేది పతాక స్థాయికి చేరింది.
  2. కుల వ్యవస్థ మూలాలు, అసమానతలు, ప్రభావాలు, పర్యవసానాలు, ప్రజా పోరాటాలు వాటిలో సాహిత్యం పాత్రను పరిశీలించడమే ఇక్కడ సామాజిక దృక్పథం అని చెప్పవచ్చు.
  3. ఈ నేపథ్యంలో బెల్లి యాదయ్య బహుజన దృక్పథం, దళిత దృక్పథం, స్త్రీ దృక్పథం, మత దృక్పథం, ప్రాంతీయ దృక్పథాలతో తనదైన శైలిలో కవిత్వ రచన చేశారు.

8. ఉపయుక్తగ్రంథసూచి:

  1. అంబేడ్కర్, బి. ఆర్. కుల నిర్మూలన. హైదరాబాద్: హైదరాబాద్ బుక్ ట్రస్ట్, 1969.
  2. కారల్ మార్క్స్, ఎంగెల్స్ . ది జర్మన్ ఐడియాలజీ. న్యూ డిల్లీ: పీపుల్స్ పబ్లిషింగ్ హౌస్, 2010.
  3. దత్తయ్య, అట్టెం. తెలంగాణ బీసి వాద సాహిత్యం. హైదరాబాద్: ప్రణవం పబ్లికేషన్స్, 2021.
  4. ప్రతాప్. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం - ప్రజాస్వామిక దృక్పథం. శ్రీకాకుళం: దిక్సూచి ప్రచురణలు, 2017.
  5. యాదయ్య, బెల్లి. తర్జుమా. పాలెం: పదం ప్రచురణలు, 2014.
  6. యాదయ్య, బెల్లి. నేను గొర్రెల్ని కాస్తుంటాను. పాలెం: పదం ప్రచురణలు, 2011.
  7. యాదయ్య, బెల్లి. బోధివృక్షం. పాలెం: పదం ప్రచురణలు, 2011.
  8. యాదయ్య, బెల్లి. మా ఊరు అట్లా లేదు. పాలెం: పదం ప్రచురణలు, 2015.
  9. యాదయ్య, బెల్లి. విభాజకం. పాలెం: పదం ప్రచురణలు, 2011.
  10. వినోదిని, ఎమ్.ఎమ్. వేగుచుక్కలు. హైదరాబాద్: హైదరాబాద్ బుక్ ట్రస్ట్, 2014.
  11. శ్రీనివాస్, సంగిశెట్టి(సంపాదకులు). సబాల్టర్న్, హైదరాబాద్:
  12. శ్రీరంగస్వామి, టి. (సంపాదకులు). అన్నమయ్య పద వైభవం. వరంగల్: శ్రీలేఖ సాహితి సంస్థ, 2010.

పత్రిక వ్యాసాలు:

  1. లక్ష్మీ నరసయ్య, జి. దళిత బహుజన వాదం – దళిత బహుజన సాహిత్య విమర్శ, కొలిమి వెబ్ సైట్, మే, 2021.
  2. వెంకటేశ్వరరావు, దార్ల. బహుజన సామాజిక దృక్పథం, సూర్య దినపత్రిక డిసెంబర్ 20, 2010.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]