headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-1 | January 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

20. “జక్కంపూడి మునిరత్నం” శతక సాహిత్యం: నీతి

డా. కె. ధనశ్రీ

అసోసియేట్ ప్రొఫెసర్, తెలుగుశాఖ,
శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కళాశాల,
నంద్యాల, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 7386893278, Email: parameswarg@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

ఆచార్య జక్కంపూడి మునిరత్నం శతకసాహిత్యంలో నీతి పద్యాల విశ్లేషణ - ఈ వ్యాసానికి ప్రధాన భూమిక. వీరి పద్యాలలో నీతి పద్యాలకు అధిక ప్రసక్తి కలదు. ఈయన పద్యాలను పరిశీలించి చూడగా రకరకాల అంశాలకు సంబంధించిన పద్యాలున్నాయి. అవి వరుసగా కాలానికి, అనుబంధానికి, శ్రమకు, లక్ష్యానికి, స్నేహానికి, రహస్యాలకు, దయకు, అనుమానాలకు, వినయానికి, ధనానికి, మంచిమాటకు, ఖర్చుకు, వరకట్నంకు, క్రోధం, శాంతానికి, ప్రాణులకు, అదృష్టానికి, పిరికి గుణానికి, ప్రవర్తనకు, చెడు అలవాట్లకు, బానిసత్వానికి, గుణాల వంటి ఎన్నోవిషయాలకు సంబంధించిన పద్యాలు ఈ శతకాలలో ఉన్నాయి. వాటి సారాన్ని, కవి నీతి దృక్పథాన్ని స్థాలీపులాకన్యాయంగా వివరించడం ఈ వ్యాసప్రధానోద్దేశ్యం. "జక్కంపూడి" శతకాలు, వీరి సాహిత్యరంగ కృషిపై వెలుగుచూచిన పరిశోధన గ్రంథాలు, విమర్శలు ఈ వ్యాసానికి ఉపయుక్తవిషయాలు. విశ్లేషణాత్మక పద్ధతిలో ఈ వ్యాసం రూపుదిద్దుకుంది.

Keywords: నీతి, శతక సాహిత్యం, పద్యాలు, వరకట్నం, విద్య.

1. ఉపోద్ఘాతం :

ఆచార్య జక్కంపూడి మునిరత్నం 15.01.1948లో జన్మించారు. ఈయనది తమిళనాడు, తిరువళ్ళూరు జిల్లా, తిరుత్తని తాలుకా, కావేరి రాజపురం గ్రామం. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖ ఆచార్యుడిగా పనిచేశారు.1 వీరు - పిల్లలకోసం సండే దివ్య శతకం, పథశతకం, తెలుగుబాల శతకం మొదలైనవి రచించారు.

2.శతక తీర్థం:

దాదాపు వెయ్యి సంవత్సరాల నుంచి కనిపిస్తున్న తెలుగు శతకాలు వేల సంఖ్యలో ఉన్నాయి. అందులో ఒక విభాగమైన నీతి శతకాలు వందదాకా ఉన్నాయి. భారతీయ సాంప్రదాయంలో నీతి ప్రవర్తనకు ఎంతో ప్రాధాన్యం ఉంది. అందుచేత బిడ్డలకు చిన్నతనం నుండీ జీవితసూత్రాలను చక్కని నీతుల ద్వారా చెబుతారు. భావాలతో పాటు, వారికి మంచి భాష, సర్వజ్ఞానం అలవడాలని వేమన శతకం లాంటివి ముందుగా ప్రారంభిస్తారు. ఆ తర్వాత సులభశైలిలో సుమతీ శతకం, కుమార శతకం మొదలైనవి అందిస్తారు. తెలుగు శతకములలో ప్రధానంగా పాటింపబడిన లక్షణాలు (1) సంఖ్యా నియమము (2) మకుట నియమము (3) ఛందో నియమము (4) రసనియమము (5) ఆత్మాశ్రయకవితానియమము2 మొదలైనవి. శతకాలన్నీ దాదాపు ముక్తకాలుగానే, ఏ పద్యానికి ఆపద్యంలోనే భావం ముగుస్తుంది. ఈ లక్షణాలు అన్నీ కూడా మునిరత్నం శతకాలలో మనం గమనించవచ్చును. ఈ శతకంలో కనిపించే నీతిని విశ్లేషించడానికి  మచ్చకకు కొన్ని పద్యాలను ఈ పరిశోధనవ్యాసంలో పరిశీలిద్దాం.

2.1 జగమంతకుటుంబం - ఆత్మీయ సంబంధం:

ఆత్మీయ సంబంధం అంటే ఒకరి మనోభావాలు మరొకరు అంతర్గతంగా పసికట్టడం, వాటికి అనుగుణంగా కట్టుబడి ఉండటం పిల్లలు లేని తల్లి దండ్రులు, అనాధ పిల్లలను దత్తత తీసుకొని ఆ సంతానం ద్వారా తమకోరికలను తీర్చుకోవడ నేటి సమాజంలో చూస్తున్నాం అదే విధంగా సోదరీ, సోదరుల బంధాన్ని కూడా స్వీకరించవచ్చని కవి ఈ పద్యంలో ఇలా ప్రకటించారు-

అన్నదమ్ములు లేరని ఎన్నవలదు
అక్కచెల్లెండ్రు లేరని స్రుక్కవలదు
ఎంచి చూడగా నీవారె ఎల్లవారు
వినుము దేదాప్య! నామాట వెలుగుబాట 3

మనకు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు లేరని బాధపడకూడదు. మన చుట్టుప్రక్కల ఉన్న వారందరు అన్నదమ్ములు వంటివారనీ, వారే నీవాళ్ళగా ఎంచాలనీ భావం సమాజంలో కొంత మంది వ్యక్తులు రక్తసంబంధంతో కూడిన సోదరి, సోదరుడు లేరని మానసికంగా బాధపడిపోతుంటారు. ఆ బంధం కోసం దిగులు పడవలసిన అవసరం లేదు. అలాంటి బంధం మన చుట్టూ ఉన్న సమాజంలోనే పొందవచ్చు. దాన్ని ఆత్మీయ సోదరి, సోదరుల సంబంధం అంటారు. రక్త సంబంధం కంటే ఆత్మీయ సంబంధం చాలా గొప్పగానూ, ఎవ్వరూ విడదీయ రాని పవిత్రమైన బంధంగాను ఉంటుంది.

సమాజంలో కొంతమంది తల్లిదండ్రులకు ఏకసంతానం కలిగి ఉంటారు. అలాంటి పిల్లలు ఒకవిషయం గుర్తించుకోవాలి. మనం తల్లి గర్భం నుంచి ఒక్కరుగానే వస్తాం. భూమి మీద మన జీవనం అయిపోయిన తరువాత ఒంటరిగానే దైవం దగ్గరకు పోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయాలు. ఒంటరిగా ఉన్నాం అని కొంతమంది బాధపడి పోతుంటారు. బంధాలు అనేవి ఋణాను బంధాలు అవి ఋణం ఉంటేనే ఆ బంధాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఋణం లేకపోతే ఏ బంధం మనకు రాదు. ఇవి ప్రతి ఒక్కరి జీవితంలో నిగూఢంగా దాగి ఉంటాయి. ఈ పరమార్థం ప్రతి ఒక్కరు తెలుసుకొంటే 'ఒంటరి' అనే పదానికి అర్థం తెలుస్తుంది. ఎవ్వరూ బాధపడరు అని రచయిత మనకు ఈ పద్య నిగూఢ అర్థాన్ని తెలియజేశాడు.

2.2. గమ్యం - ఔన్నత్యం:

విద్యార్థి ఒక లక్ష్యం ఎంచుకొన్న తరువాత దాని మీద మనస్సు పెట్టి, సాధన చేసి అందులో విజయం పొందాలి. అప్పటి వరకు విశ్రాంతికి అవకాశం ఇవ్వకూడదని ఈ పద్యం అర్థం. విద్యార్థి ఒక మంచి లక్ష్యం ఎంచుకున్నప్పుడు అది అందరికీ ప్రయోజనం చేకూర్చేదైఉండాలి. అంటే నీకు, తల్లిదండ్రులకు, సమాజానికి అలా కాకుండా అందరూ బాధపడే విధంగా లక్ష్యం ఉండకూడదని నీతి బోధ చేస్తూ-

లక్ష్యమును ఎంచుకొనుము ఆ లక్ష్య మందె
మనసు నిలిపి సాధన చేసి కవలము సిద్ధి
అంత వరకు విశ్రాంతికి ఆశపడకు
వినుము దేదిప్య ! నా మాట వెలుగుబాట4

లక్ష్యాన్ని చేరుకొనేటప్పుడు మధ్యలో ఎన్నో ఆటంకాలు వస్తూ ఉంటాయి. ఆటంకాలన్నీ నిర్భయంగా ఎదుర్కోవాలి. ఎలా అంటే ఒక తపస్సు చేసే వ్యక్తి దేవుడి నుండి వరాలు పొందే ముందు విద్యార్థి అనేక పరీక్షల్లో పాసవ్వాల్సి ఉంటుంది. ఆ పరీక్ష గాలి కావచ్చు, రాళ్ళ వర్షం కావచ్చు, మరొకటి కావచ్చు. కానీ వాటికి భయపడకుండా తపస్వి తపస్సు చేస్తూనే ఉంటుంది. ఆవిధంగా నీవు కూడా పరీక్షలు సమాజం నుండి ఎదుర్కొన్న తర్వాతే మంచి ఫలితాన్ని పొందుతావు. అప్పటి వరకు శ్రమిస్తూనే ఉండాలి.

కొంతమంది లక్ష్యాన్ని ఎంచుకొంటారు. దాన్ని చేరడానికి ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొంటారు. ఆ ప్రణాళిక ప్రకారం పనులు చేసుకుంటూ పోతారు. కాని చివరి క్షణంలో ఓటమి పాలవుతారు. అలా కావడానికి కారణం ఒకటి అని చెప్పలేము. మనస్సుకు ఏకాగ్రత లేకపోవడం, నిరుత్సాహం, చుట్టు ప్రక్కల వారి ఈర్ష్య ద్వేషాలు, పిరికితనం ఇలా రకరకాల కారణాల చెప్పవచ్చు.

ఎవ్వరు అయినా సరే లక్ష్యమునకు చేరుకోవాల అనుకొనేవాళ్ళు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. 'మధ్యలో వచ్చే సమస్యలు కంటే లక్ష్యం చాలా గొప్పది అని గుర్తించాలి. ఎవ్వరు అయితే లక్ష్యాన్ని చేరుకుంటాడో వాడే నిజమైన విజయుడు అని అందరు గుర్తించాలి. లక్ష్యాన్ని చేరుకోవాలి అనే వాళ్ళు ఒకరిని గుర్తుపెట్టుకోవాలి. ఎవ్వరు అంటే భారతంలో వున్న ఏకలవ్యుడు. ఇతన్ని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలి తమ గురువు ద్రోణాచార్యులు ఆజ్ఞ ఇవ్వకపోయినా, తనంతట తానే ఒక లక్ష్యం ఎంచుకుని దానిలో విజయుడు అయినాడు. అందరికి ఆదర్శంగా నిలిచాడు. ఆవిధంగా ప్రతి ఒక్కరు ఉండాలని రచయిత ఈ పద్యం ద్వారా మనకు సందేశం ఇచ్చాడు.

2.3 స్నేహబంధం - ఆదర్శనీయం:

స్నేహబంధం శ్రీ కృష్ణుడు కుచేలుడులాగా ఉండాలి. వీరి చిన్నప్పటి స్నేహం, వారి జీవనం వున్నంతవరకు కలకాలం అందరూ ఆదర్శంగా తీసుకునే విధంగావుంది. శ్రీ కృష్ణుడు ధనం, రాజ్యంతో తులతూగుతున్నప్పుడు, తన స్నేహితుడు ఆర్థిక సహాయం కోసం శ్రీకృష్ణుని దగ్గరకు వస్తాడు. అప్పుడు శ్రీ కృష్ణుడు గర్వం చూపకుండా ఎంతో ప్రేమతో తన చిన్నప్పటి స్నేహితునికి ఆర్థిక సహాయాన్ని అందిస్తాడు. తమ స్నేహానికి అందరూ ఆశ్చర్యవంతులు అవుతారు. ఇలాంటి నీతిని బోధించే పద్యం-

క్షితిని నీదు, సేమంబు కాంక్షించువారి
తనదు బాధగ నాబాధ దలచువారి
మిత్రులుగ నెన్నుకొను మది మేలు నీకు
వినుము దేదాప్య ! నా మాట వెలుగుబాట! 5

నీ క్షేమం కోరుకుంటూ, నీ బాధ తమ బాధగా స్వీకరించన వారే మిత్రులు అలాంటి మిత్రులను ఎన్నుకోవాలి. అది నీకు మేలు జరుగుతుందని ఈ పద్యభావం. విద్యార్థులు స్నేహితులను ఎంచుకొనేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మనస్సులో ఒకటి పెట్టుకొని బయటకు ఒకటి మాట్లాడుతుంటారు. అలాంటి వారి స్నేహం పనికిరాదు. అలాంటి వారి వల్ల  ప్రాణములకు హాని కలిగే అవకాశం ఉంది. ఇతరుల గుణగణాలను తెలుసుకొని స్నేహం చెయ్యాలి లేని యెడల ఆ స్నేహం నిన్ను కష్టాల్లో పడేస్తుంది. నీవు స్నేహితులతో మాట్లాడేటప్పుడు వారి మాటలను బట్టి, చేతలను బట్టి, వీళ్ళు మంచి వారా లేదా చెడు స్వభావం కలిగినవారా కని పెట్టే జ్ఞానం నీకు ఉండాలి. అపుడే నీవు స్నేహితుల ద్వారా మేలును పొందగలవు. ఒక వేళ చెడ్డ వారికైతే అలాంటి వారిని నీవు తొలగించుకోవాలి. ఎలా అంటే మనం దారిలో నడుస్తున్నప్పుడు ముళ్ళు మనకు కనిపించినప్పుడు దాన్ని తొక్కకుండా ప్రక్కదారిన పోతాం. ఆవిధంగా శత్రువులను వదిలివేయాలి. అలాంటి తెలివి వుంటే ఎవ్వరూ ఏమీ చేయలేరు. సంతోషాన్ని ఎవ్వరూ ఇవ్వరుదాన్ని మనమే ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా మన మేలు మనమే కోరుకోవాలి. దేనికైనా సంసిద్ధంగా ఉండాలి. స్నేహితులు లేరని కూడా బాధపడకూడదు.

నేడు సమాజంలో కొంతమంది స్నేహితులును చూస్తుంటాం. వారి మధ్య ఎలాంటి బంధం ఉంటుందంటే అందరు బాధపడే విధంగా ఉంటుంది. ఒకరిని ఒకరు మోసం చేసుకోవడం, ఒకరిని ఒకరు అపార్థం చేసుకోవడం, ఒకరిని ఒకరు దూషించుకోవడం లాంటివి ఉంటాయి. ఇలాంటి స్నేహానికి ఉదాహరణగా భారతంలో కోకొల్లలుగా ఉన్నాయి. ద్రుపద మహారాజు మరియు ద్రోణాచార్యులు వారిని ఇలాంటి స్నేహానికి ఆదర్శంగా తీసుకోవచ్చు. అయితే ఇద్దరిలో ఒకరు ధర్మంగా, న్యాయబద్ధంగా, స్నేహం విలువ తెలిసినవారు ఉన్నారు వారు ఎవరు అంటే ద్రోణాచార్యులు వారు. ఇక ద్రుపద మహారాజు తన చిన్నప్పటి స్నేహాన్ని మరిచీ, ఇంటికి వచ్చిన తన స్నేహితుడు అయిన ద్రోణుడును ఎన్నో మాటలతో అవమానించి పంపుతాడు. ఇలాంటి వారిని దేవుడు కూడా క్షమించడు. ప్రతి ఒక్కరి జీవితంలో  స్నేహానికి ఒక పవిత్రమైన స్థానం ఉంటుంది. అలాంటి స్నేహానికి చెడ్డ పేరు తీసుకువచ్చేవారు ఉంటారు. మంచి పేరు తీసుకువచ్చే వాళ్ళు ఉంటారు. మనం స్నేహానికి ఎవ్వరు అయితే విలువ ఇచ్చి, స్నేహ ధర్మాన్ని పాటిస్తారో అలాంటి వారిని ఆదర్శంగా తీసుకోవాలి అని ఈ పద్య నిగూడ అర్థం.

2.4 వరకట్నం - సామాజికరుగ్మత:

వరకట్నం ఇవ్వకూడదని స్త్రీలు సభలతో ఉపన్యాసం ఇస్తుంటారు. పెళ్ళి కుమారుడు తమ కుమారుడు అయినప్పుడు వరకట్నం కావాలని స్త్రీలు అడుగుతూ ఉంటారని ఈ పద్య భావం వరకట్నం అంటే పెళ్ళి సమయంలో పురుషునికి అత్త ఇంటివారు ఇచ్చే డబ్బును వరకట్నం అంటారు. వరకట్న సమస్య పోవాలంటే అటు స్త్రీల లోను, ఇటు పురుషులలోను మార్పు రావాలి అప్పుడే ఈ సమస్య పోతుంది. తల్లిదండ్రులు తమ ప్రేమకు గుర్తుగా తమ బిడ్డలకు తమ దగ్గర ఉన్న ధనం, వస్తువులుగా తమ బిడ్డలకు తమ దగ్గర ఉన్న ధనం, వస్తువులు వాహనాలు ఇస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా పవిత్రమైన బంధాన్ని కలుపుకునేటప్పుడు ఒకరికి ఒకరు సంప్రదాయంగా ఇచ్చిపుచ్చుకుంటారు. దానిని నేడు వ్యాపారంగా మార్చేశారు. ఈ విషయాన్నే ప్రస్తావిస్తూ...

వరకట్న మివ్వరాదని
వరవేదిక లెక్కిపలుకు వనితలు కూడా
వరుడు కుమారండగునెడ
వరియింతురు కట్నముల నవశ్యము సఖుడా! 6

వరకట్నం తీసుకొనే ముందు పురుషులు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. పురుషార్థాలు నాలుగు ఉన్నాయి. ఒకటి ధర్మం, రెండు అర్థం, మూడు కామం, నాలుగు మోక్షం, అంటే ధర్మబద్ధంగా డబ్బు సంపాదించాలి. ధర్మబద్ధంగా కామం కలిగి ఉండాలి. తద్వారా పురుషుడు మోక్షం పొందాలని పెద్దలు చెప్పారు. అంతేగానీ కాబోయే భార్య ద్వారా కట్నం రూపంలో ధనం తీసుకోవాలని ఎవ్వరు ఎక్కడా చెప్పలేదు. నీవు అలా తీసుకున్నావంటే అది నీ అసమర్థత అని అంచనా వేసుకోవాలి. తల్లులే ఈ కట్నానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే కొంతవరకు సమస్య తగ్గి పోవడానికి అవకాశం ఉంది. వేదికి ఎక్కి పలికిన మాటలు ఆచరణకు వస్తే బాగుంటుంది.

పురుషులే కాదు స్త్రీలకు కూడా డబ్బులు ఇచ్చి వివాహం చేసుకుంటూ ఉంటారు. దాన్ని కన్యాశుల్కం అంటారు. ఇలాంటివి సమాజంలో అక్కడక్కడ చూస్తూనే ఉన్నాం. డబ్బుతో కూడిన వివాహ సంబంధాలు ఆర్థికంగా బాగా ఉండే వాళ్ళకి అంత ఇబ్బందిగా ఉండదు. కానీ ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు తమ పిల్లలను వివాహాలు చేయాలంటే పుండు మీద కారం చల్లినట్లు ఉంటుంది. ఎందుకంటే వివాహం అనగానే ఎన్నో ఖర్చులు ఉంటాయి. దానితో పాటు ఒకరికి ఒకరు డబ్బులు ఇచ్చీ, వాళ్ళ మధ్య వివాహ బంధం ఏర్పాటు చేయడం తలలో ప్రాణం తోకలోకి వచ్చినట్టు అవుతుంది. ప్రభుత్వం 'కట్నాలు' తీసుకో కూడదని చట్టాలు తీసుకొని వచ్చింది. కాని వాటిని ఎవ్వరూ పాటించడం లేదు. ఇటు స్త్రీల తల్లి దండ్రులుగానీ, అటు పురుషుల తల్లిదండ్రులుగానీ వివాహ బంధం ఏర్పాటు చేసుకొనేటప్పుడు ఒకరిని ఒకరు నీటిలోని 'జలగలు' లాగా డబ్బులు కాలాలని పట్టి పీడుస్తున్నారు. అలా చేయడం వల్ల కొంతమంది పెళ్ళికూతుర్లు ఆత్మ హత్యలు చేసుకోవడం లాంటివి చేస్తుంటారు. దానితో తల్లి దండ్రులు మానసికంగా క్రుంగిపోతుంటారు. అలాంటి వారిని మన చుట్టు ప్రక్కల సమాజంలో చూస్తూనే ఉంటాం. ఈ కట్నాలు రూపుమాపాలంటే యువతలో మార్పు రావాలి. అప్పుడే చీడపురుగు లాంటి కట్నాన్ని సమాజం నుంచి తరిమికొట్టచ్చు. ఇలా చేయడం ద్వారా పిల్లల తల్లిదండ్రులు చాలా సంతోషంగా తమ పిల్లలకు వివాహం చేయడానికి ముందడుగు వేస్తారు. ఎక్కువుగా ఆడపిల్లల తల్లిదండ్రులు ఈ "కట్నం" అనే “రోగాన” బారి నుండి తప్పించుకో లేకపోతున్నారు. ఆడపిల్లలు తమ చదువు ద్వారానే కట్నం అనే రోగానికి తగిన బుద్ది చెప్పాలని రచయిత ఈ పద్యం ద్వారా మనకు సందేశాన్ని ఇచ్చారు.

2.5. యువత - ప్రవర్తన:

నేటి యువత ఎలా ఉన్నారంటే పెద్దవాళ్ళు ఏదైనా ఒక మాట అంటే చాలు ఆత్మహత్యచేసుకోవడం, ఇంటి నుండి పారిపోవడం, పెద్దవాళ్ళమీదికి తిరగబడటం లాంటివి చేస్తున్నారు. అలా చేయడం వల్ల కొంత మంది తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు తమ పిల్లల ప్రాణాలు కాపాడుకోవటానికి వాళ్ళ ఇష్టానికి వదిలేస్తున్నారు. పిల్లలు తమ ఇష్టానుషారం రోడ్ల మీదకు వచ్చి వాహనాలు నడపడం తద్వారా ఇతరులకు ప్రాణనష్టం కలిగించడం లాంటివి చేస్తున్నారు. కొంతమంది పిల్లలు చదవకుండా పోకిరిలారోడ్ల మీద తిరగడం లాంటివి చేస్తున్నారు. తల్లిదండ్రులు ఒకటి గుర్తించుకోవాలి సమాజం గురించి జ్ఞానం లేని ప్రాణాలు ఉన్నా ఒక్కటే లెకున్నా ఒక్కటే ఎందుకంటే వారి వల్ల తమకు, సమాజానికి ఎటువంటి ప్రయోజనం ఉండదు. నష్టం తప్ప. కాబట్టి విలువలతో కూడిన మంచి పిల్లలుగా తయారుచేయడం సమాజం, తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు బాధ్యత. ఇవన్నీ పిల్లలు గుర్తుపెట్టుకొని సమాజంలో మెలగాలి. ఇలాంటి గుణపాఠాన్ని వివరిస్తూ..

నగలు చేసెడువారు బంగారు కాచి
కొట్టునట్టుగా నీమేలు కోరువారు
తిట్టినా కొట్టినా తప్పు పట్టకమ్మ
వినుము దేదీప్య! నా మాటా వెలుగుబాట7

నగలు చేసేవారు బంగారాన్ని బాగా కాచి, కొట్టి తయారు చేస్తారు. అదే విధంగా నీ మేలు కోరువారు నిన్ను తిట్టినా, కొట్టినా తప్పు పట్టుకూడదని ఈ పద్య భావం. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, పిల్లలు ఎప్పుడైనా తప్పుచేస్తే దండించి తిడుతూ, కొడుతూ ఉంటారు. వాటిని పిల్లలు మంచిగానే స్వీకరించాలి ఎందుకంటే ఒక బాధ్యత కలిగిన పౌరులుగా తయారుచేయడం వారి బాధ్యత. ఆ భాద్యతలోనే ప్రేమ, తిట్టులు, కొట్టడం అన్నీ వస్తాయి. పిల్లలు ప్రేమ కాకుండా తిట్లు, దండనలు అనేవి కూడా పెద్దల నుండి స్వీకరించవలసి ఉంటుంది. అప్పుడే నీవు ప్రజలు మెచ్చదగిన మానప్రనిగా తయారు అవుతారు. ఒక రాయి శిల్పుని దగ్గర ఎన్నో దెబ్బలు తినిన తారువాతనే అందరిచే నమస్కరించబడుతుంది. ఆ విధంగా నీవు కూడా అందరి మనోభావాల నుండి బాధ, మంచి గ్రహించినప్పుడే ప్రజలచే గౌరవించబడతావు.

'పెద్దల మాట సద్దన్నం మూట' అనే సామెత గుర్తు పెట్టుకోవాలి. ఎందుకంటే పెద్దలు అనుభవ జ్ఞానంతోనే ఏది మంచి ఏది చెడు తెలుసుకొనీ ముందస్తుగా సలహాలు ఇస్తుంటారు. వినకపోతే ఒక్కొక్కసారి మొట్టికాయలు, కొట్టడం లాంటివి చేస్తారు. అవన్నీ కూడా మీరు బాగా అభివృద్ధిలోకి రావాలనీ, భవిష్యత్తులో జీవితాన్ని చాలా చక్కగా తీర్చుదిద్దుకోవడానికి అని పిల్లలు గ్రహించాలి. అపుడే మీ జీవితం  బంగారు జీవితంగా తయారు అవుతుంది. పెద్దలు మాట వినకుండా పిల్లలు ఎలా అంటే? అలా జీవించారో వారి జీవితం ఎలా ఉంటుందంటే 'తోక లేని గాలిపటంలా' ఉంటుంది. 'లక్ష్యం లేని గమ్యంలా ఉంటుంది. అంటే జీవితం వ్యర్థం అవుతుంది. నీవు జీవితం విలువ తెలుసుకునేటప్పటికి కాలం గడిచిపోతూ ఉంటుంది. కాబట్టి యువత, పెద్ద చిన్న మాట విని తమ జీవితమును సార్ధకము చేసుకోవాలని ఈ పద్య అంతరార్థం.

3. ముగింపు:

ఇలాంటి శతక పద్యాలు యువత, పెద్దలు, తల్లిదండ్రులు చదవటం ద్వారా ఏది మంచి, ఏది చెడు తెలుసుకుంటారు. ఎవరితో ఎలా ప్రవర్తించాలి గ్రహిస్తారు. ఒక సమస్య వస్తే దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో తెలసుకొంటారు. సందర్భాన్ని బట్టి ఈ పద్యాలలోని నీతిని వేరే వాళ్ళ దగ్గర ఉపయోగించడం ద్వారా అవతల వాళ్ళు కూడా మంచిగా మారే అవకాశం ఉంది. కాబట్టి విద్యార్థి దశ నుండే ఇలాంటి పద్యాలు పిల్లల చేత కంఠస్థం చేయించాలి. వాటి అర్థాలను, భావాలను తెలుసుకొనేలా చేయాలి. వాటిని తమ జీవితానికి ఉదాహరణం తీసుకోవాలి. ఇలాంటి పద్యాలు పిల్లలకు నేర్పించడంలో ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజం, ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి తద్వారా అంటే మల్లెపువ్వె తన సువాసనతో చుట్టుప్రక్కల బ్యాక్టీరియాను ఎలా అయితే పారద్రోలతుందో అదే విధంగా శతక పద్యాలు చదివి వాటి జ్ఞానంతో మన చుట్టు ప్రక్కల మనుషులలో వున్న అంధకారాన్ని, అజ్ఞానాన్ని తరిమి కొట్టాలి. తద్వారా రాక్షస లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తులు మంచి గుణాలను తమలో అలవాటుచేసుకొని సమాజంలో మంచి వ్యక్తులుగా కలిసిమెలసి, ఐక్యమత్యంగా మెలుగుతారని నా వ్యాస లక్ష్యం.

4. పాద సూచికలు:

  1. గుణపాఠం - పిల్లల కథలు సం, 2008
  2. ఆంధ్రశతక వికాశము - 1976, పు – 7.
  3. దేదీప్యశతకం - 25 ప, పు -6
  4. పైదే - 77 ప, పు - 16
  5. పైదే - 98 ప, పు -20
  6. సుఖశతకం - 3వ ప, పు -1
  7. దేదీప్యశతకం - 33 ప, పు -7

5. ఉపయుక్త గ్రంథసూచి:

  1. కృష్ణయ్య, శ్రీ కొర్లకుంట, సూక్షి సుధశతకం, తిరుపతి - 1985.
  2. మునిరత్నం, జక్కంపూడి, దేదిప్యశతకం, కల్పనా పబ్లికేషన్స్, తిరుపతి, 2010.
  3. లింగన్న, కాణిపాకం, గాంధిచెప్పెబాల (బాలల బొమ్మగాంధీ శతకం), సాహితీక్షేత్రం, చిత్తూరు, 2005.
  4. వేంకటేశ్వరరాజు, శ్రీ పత్తి గొదుపు, వెలుగుబాట (బాలప్రబోధము) కర్నూల్, 1977.
  5. సుబ్బరాయుడు, వట్టిపల్లి, రాయలసీమలో శతకవాజ్మయము రచన సాహిత్యవేదిక, కడప, 2001.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]