AUCHITHYAM | Volume-5 | Issue-1 | January 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
19. సమాజంపై కవిత్వప్రభావం: పూర్వాపరాల పరిశీలన
గోవిందరావు శివ్వాల
అసిస్టెంట్ మేనేజర్,
ఆంధ్రప్రదేశ్ సృజనాత్మక మరియు సాంస్కృతికసమితి,
విజయవాడ, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9971328836, Email: govindarao.sivvala@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
బ్రిటిష్ ప్రభుత్వం నుండి స్వాతంత్ర్యం పొందిన జాతి– రాజ్యం భారతదేశం, అనేక బ్రిటిష్ చట్టాలని అందిపుచ్చుకుని, తన పౌరులపై ఎన్నో నిర్భంధాలని విధించింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో 1970 తర్వాత సాహిత్యంలో కవులు, కళాకారులపై నిర్భంధ చట్టాలని అమలు చేసింది. ఈ నేపధ్యంలో ఈ పరిశోధనవ్యాసం కవికి, రాజ్యానికి ఉన్నటువంటి సంఘర్షణని భావనాత్మకంగా గ్రహించడానికి ప్రయత్నిస్తుంది. రాజ్యం కవిత్వాన్ని ఉద్వేగ, అనుభూతులవ్యవస్థగా, ఉపదేశాల అంశంగాకాక శాంతిభద్రతల సమస్యగా చూస్తుందా? అనే సమస్యని విశ్లేషించడానికి వివిధ నిషేధరచనలని, ప్రభుత్వ స్టేట్మెంట్లని ఈ పరిశోధనవ్యాసం విశ్లేషిస్తుంది. కవిగా ఒక భావజాలం కలిగి ఉండడం, ప్రజా ఉద్యమాలకి సంఘీభావం తెలపడాన్ని రాజ్యం నేరంగా భావిస్తున్నట్టు ఉన్నది. ప్రజాకవులకి, ప్రజలకి మధ్య ఉన్న దృఢమైన బంధం వలన కళాకారుడు వ్యక్తం చేసే మౌఖిక, అసమ్మతి, రాడికల్ భావాలు ప్రేక్షకులని ఆకర్షించడం కూడా రాజ్యంపై కవులు కళాయుద్ధం చేయడం కారణంగా కనిపిస్తుంది. ఈ వ్యాసంలో ప్రభుత్వనిషేధానికి గురి అయిన ‘ఝంఝ’ (1971), ‘శంఖారావం’, ‘లే’ వంటి కవితా సంకలనాలని, కుటుంబరావు సంపాదకత్వంలో వెలువడిన ‘ఇప్పుడు వీస్తున్న గాలి’ (1972) కథా సంకలనాన్ని, వరవరరావు ‘భవిష్యత్ చిత్రపటం’ (1987), ఇంకా ఎమర్జెన్సీలో ప్రభుత్వానికి సపోర్టుగా వెలువడిన రచనలని, వాటి గురించిన కోర్ట్ రిపోర్టులను పరిశీలించడం జరిగింది. సమాచారం కోసం వివిధ ప్రాంతాలలో పర్యటించి పాత పత్రికల్ని, లైబ్రరిల నుండి పుస్తకాలని, వివిధ వ్యక్తులతో సంభాషణ జరిపి విషయం సేకరించడం జరిగింది.
Keywords: రాజ్యం, పాట, కళ ప్రయోజనం, శాంతిభద్రతలు, నిషేధాలు, తిరుగుబాటు
1. ఉపోద్ఘాతం:
“నా నీడలో నా భావాల వేడిని అనుమానించి
తుదకంటా నాశనం చెయ్యాలని
నన్ను వెన్నంటే నడుస్తుంటారు పోలీసులు
నేను అనాలోచితంగా అమయాకంగా ఆకాశం కేసి చూస్తే
నా చూపుల ఎత్తు పల్లాల్ని కొలుస్తారు
నా పాద ముద్రలో విప్లవ గీత చరణాల ఎత్తుగడల్ని పట్టుకోవడానికి
మట్టిని భద్రపరచి పరిశోధనల కంపుతారు...
ఇదంతా వాళ్ళ పాటకు నేను పల్లవిని గాక పోవడమే
వాళ్ళ పల్లకీకి బోయిగా మారకపోవడమే...
దోపిడీ రాజ్యాంగాలు ఎన్నైనా వాటి వర్గ రక్షణ ‘పవిత్ర కార్యం ఒక్కటే
నాది శ్రామిక జీవన సౌందర్య గీతం
మతానికి దోపిడీ పథానికి నేను పల్లవిని కాను...
బొట్టు బొట్టుగా నా నెత్తుటిని ఈ నేల విముక్తి కోసం విత్తనంగా చల్లుతాను”
(చెరబండరాజు, ‘పునర్జన్మ’. సృజన, ఆగష్టు, 1977, పే. 52 – 53)
కవి చెరబండరాజు జైలులో రాసిన ఈ కవితలో అతని భావాల వేడి కనిపిస్తుంది. రాజ్యం అతని భావాలని, రచనలని శల్య పరీక్ష చేసి, వారి దోపిడిని కీర్తించే కవి కాకపోవడం వలన కూడా ఒక నేరస్తునిగా ముద్ర వేసింది. బ్రిటిష్ ప్రభుత్వం నుండి స్వాతంత్ర్యం పొందిన భారత దేశం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అనేక బ్రిటిష్ చట్టాలని అడాప్ట్ చేసుకొని, 1970 తర్వాత సాహిత్యంలో ఎన్నో నిర్భంధాలని అమలు చేసింది. కవులు, కళాకారులపై నిర్భంధ చట్టాలని అమలు చేసింది. ఈ పేపర్ కవికి, రాజ్యానికి ఉన్నటువంటి సంఘర్షణని భావనాత్మకంగా గ్రహించడానికి ప్రయత్నిస్తుంది. కవిత్వాన్ని రాజ్యం ఉద్వేగ, అనుభూతుల వ్యవస్థగా, ఉపదేశాల అంశంగా కాక శాంతిభద్రతల సమస్యగా చూస్తుందా? ప్రాచ్య, పాశ్చాత్య దేశాలు, ఇంకా ఆధునిక ప్రజాస్వామ్య రాజ్యాలు కవులపట్ల, కళారూపాల పట్ల ఎటువంటి వైఖరి ప్రదర్శించాయి? రాజ్యం కళాకారులని అణిచివేయడమే కాకుండా వారిని తన వ్యవస్థ లో ‘సమ్మతి’ ద్వారా భాగం చేసుకోవడం ఈ పేపర్ పరిశీలిస్తుంది.
2. రాజ్యం, కళల సంఘర్షణ - నేపథ్యం:
‘రాజు మరణించే ఒక తార రాలిపోయే కవి మరణించే ఒక తార గగనమెక్కె’ అని తెలుగు కవి గుర్రం జాషువా తన ‘పిరదౌసి’ కావ్యంలో రాశాడు. జాషువా, రాజుని రాలిపోయే తారతో పోల్చి కవిని గగనమెక్కేతారతో పోల్చాడు. రాజు కంటే కవే ప్రజలకి దగ్గర వాడుగా కనిపిస్తాడు. ఇంకా లోతుగా ఆలోచిస్తే ఇక్కడ మనకి కనిపించే రెండు ముఖ్యమైన అంశాలు – ఒకటి ‘రాజ్యం’, రెండు ‘కళ’. ఈ రెండు భావనలు ఒకదానికొకటి సరిపడనివా? ప్రముఖ ఆఫ్రికన్ రచయిత ‘గూగి వా ధియాంగొ’ (1998) అంటాడు: “సృజానాత్మకమైన కళ, రాజ్యంతో యుద్ధం చేస్తుంది. ఒకరు పెన్నుతో యుద్ధం చెస్తే, మరొకరు గన్నుతో యుద్ధం చేస్తారు”. ఈ రెంటికి మధ్య సంఘర్షణ ఉంటుంది. గూగి ప్రకారం, ‘రాజ్యం’ అనేది వెలుగు చూడక ముందే ‘కళ’ ఉందట. పూర్వం రాజ్యం వ్యవస్థ లేని సమాజాల్లో కళ అనేది ప్రజలకి మంచి చెడులు భోదించే వ్యవస్థగా ఉండేది. రాజ్యం దేవుడికి బదులు భూలోకంలో ఆయన స్థానాన్ని భర్తీ చేయడానికి వచ్చిందట. భారతీయ సాంప్రదాయ కళా, సాహిత్యాలు రాజ్యం అనేది, రాజు అనేవాడు ‘మత్స్య న్యాయం’ నుండి ప్రజలని రక్షించడానికి పుట్టిన రూపంగా చెబుతాయి. అయితే, ఎంగెల్స్ ప్రకారం, “రాజ్యం అనేది చారిత్రకంగా, భిన్న వర్గాలు మధ్య వైషమ్యాలని పరిష్కరించాలని వచ్చింది, కానీ అది ఏ మాత్రం పరిష్కరించలేకపోయింది” కార్ల్ మార్క్స్ ప్రకారం, “రాజ్యం అనేది వర్గ పాలనలో ఒక భాగం, ఒక వర్గాన్ని మరొక వర్గం అణిచివేయడానికి ఉపయోగించే సాధనం, భద్రత పేరుతో దోపిడీని చట్ట బద్దం చేస్తుంది”(లెనిన్, 2014 : 44).
మార్క్స్ ఆ క్రమంలో ముందుకు పోయి, తన కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో, ‘ఆధునిక రాజ్యం బూర్జువా కలాపాలని చక్కదిద్దే కమిటిగా మిగిపోయింది’ అని చెబుతాడు (మార్క్స్, 1970: 33). ఈ ఆధునిక సామాజిక వ్యవస్థలో భౌద్దిక ఉత్పత్తిలో భాగం అయిన కళలు, కళాకారులు మార్కెట్ లో సరుకులుగా మారి తమ కళ నుండి పరాయికరణ చెంది రాజ్యంతో మరింత సంఘర్షణకి గురి అవుతున్నట్టుగా కనిపిస్తున్నది.
3. కవిత్వం – రాజ్యం – శాంతి భద్రతలు:
రాజ్యం కవిత్వాన్ని, కళని శాంతి భద్రతల సమస్యగా చూస్తుందా? భారతీయసాంప్రదాయ సాహిత్యంలో రాజ్యం, కళని ‘లా అండ్ ఆర్డర్ సమస్య’గా చూడలేదు అంటున్నారు. భారతదేశంలో సాహిత్య సెన్సార్ షిప్ మీద పరిశోధన చేసిన మినీ చంద్రన్ (2017). ఆమె ప్రకారం, జ్ఞానం, అధికారం బ్రాహ్మణ వర్గం చేతుల్లో ఉండేది కాబట్టి రచయితలని ప్రజా మేధావులుగా సత్యం మాట్లాడే అవకాశం కల్పించలేదు అంటుంది. ఇంకా, చదువరులు సంఖ్య పైవర్గాలకే పరిమితం కావడం వల్ల రచనల వల్ల రాజ్యానికి ఏమి ప్రమాదం లేదు అంటుంది. మనువు, తన మనుస్మృతిలో, కళల్లో ప్రావిణ్యం చూపిస్తున్న వారిని, వేశ్యలని రాజ్య బహిష్కారం చేయాలి అంటాడు ఎందుకంటే, ఆ ఆనందం వల్ల ఇంద్రియ లోలత్వం వచ్చి, మనసు అడవి గుర్రంలా అదుపు తప్పుతుంది అంటాడు (అప్పారావు, 1983: 868). అయితే, కౌటిల్యుని అర్ధ శాస్త్రంలో, కవులని, కళాకారులని రాజ్యానికి ప్రమాదకారులుగా గుర్తించలేదు అంటుంది చంద్రన్. కళని రాజ్యం ఆ కాలంలో కూడా మతదృష్టితో చూస్తే కవులని ప్రమాదకరంగా భావించారే అనడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. కవులు తమ మత రచనల ద్వారా రాజ్యాలని ప్రభావితం చేశారు.
గ్రీకు తత్త్వవేత్త అయిన ప్లేటో, తన ‘ఆదర్శ రాజ్యం’లో కవిని దేశబహిష్కారం చేయమంటాడు (2002: 252). కవి తన అసత్యాలతో పౌరులని పక్కదారి పట్టిస్తున్నాడు అని. ప్లేటో, కవి సత్యం నుండి రెండు సార్లు వెనక్కి తొలగి ఉంటాడు అన్నాడు. అంటే ఒక ‘టేబిల్’ని ఉదాహరణగా చెప్పి, అసలు టేబుల్ రూపం, దేవుడు తన భావాల్లో సృజిస్తే, వడ్రంగి దానికి భౌతిక రూపం ఇస్తున్నాడు, దాన్ని మళ్ళి తిరిగి చిత్రకారుడు తన చిత్రంలో చిత్రిస్తున్నాడు. ఆయన కళని అనుకరణగా భావించి అది హీనమైనది అని అంటాడు. కళకి, రాజ్యంకి ఉండే సంఘర్షణలో ఉండే నాలుగు కోణాలు చెబుతాడు గూగి: కళలో ఉండే దైవిక అంశం, సోక్రటిస్ అంశం, ఆండర్సన్ బాలుడు, మరొకటి కళ ఒక గొంతు. వీటి వల్లనే రాజ్యానికి, కళకి సంఘర్షణ ఉందని. మనకందరికీ తెలుసు ‘కవిబ్రహ్మ’ అనే పదబంధం. కవి ఒక రకమైన సృష్టికర్త. హిందూ దేవుడు బ్రహ్మ లోకాన్ని సృష్టించిట్లు గానే కవి కూడా కావ్యాన్ని సృష్టిస్తాడు. ఇంకా కవి సృష్టికర్త కంటే స్వతంత్రుడు అని మన సంప్రదాయ అలంకారిక గ్రంధాలు చెప్పాయి. మరో వైపు రాజ్యం, రాజు భూలోకం లో దేవుడు బదులు వచ్చాయి అనే భావన ఉన్నది. ఇక్కడ రాజ్యం, కవి ఒకరినొకరు దేవుని స్థానం కోసం పోటి పడుతున్నట్లు తెలుస్తుంది. గూగి చెప్పిన సోక్రటీస్ అంశం ఏమిటంటే- మనకి తెలుసు గ్రీకు తత్త్వవేత్త సోక్రటిస్ యువకులని తన భోదనల ద్వారా పక్కదారి పట్టిస్తున్నాడనీ, ఆయనకు మరణ శిక్షగా విషం తాగించే కథ. అక్కడ సోక్రటిస్ వాదన ఏమిటంటే- సమాజం పెద్ద దున్నపోతు లాంటిది. దాని భారితనం వల్ల కొన్ని సార్లు బద్దకంగా పడి ఉంటుంది. అలాంటి దానికి చురుకు కలిగించడానికి తన లాంటి జోరీగ అవసరం ఉంటుంది - ఆ పని నేను చేస్తున్నాని అంటాడు. ఇంకా కవులు నగ్నరాజు గారి దేవతా వస్త్రాల బండారాన్ని బయటపెట్టే అండర్సన్ బాలుడు వంటివారు. నాలుగోది - నోరులేని వారికి కవులు, గాయకులూ గొంతు అని.
పై ప్రకారం చూస్తే, కవులకి సామాజిక బాధ్యత ఉంటుందా? అనే ప్రశ్న తలెత్తుతుంది. ప్లేటో ప్రకారం కళకి, ఆనందంతో పాటు, ప్రయోజనం ఉండాలి అంటాడు. తమ ప్రయోజకత్వాన్ని కవులు నిరూపించుకుంటే తమ రాజ్యంలో ఉండడానికి అనుమతి ఇస్తాము అంటాడు ప్లేటో తన ‘రిపబ్లిక్’ గ్రంధంలో. అంతవరకు కవితాభిమానాన్ని నిగ్రహించుకోవాలి అంటాడు. నిజ జీవితంలో రాగ ద్వేషాలని అదుపులో పెట్టుకోవడం ఉత్తమం అంటుంటే, కవి వాటిని తన కావ్యంలో నీరు పోసి పెంపొందిస్తాడట. అయితే కళ ద్వారా కలిగే ప్రయోజనాన్ని అరిస్టాటిల్ తన ‘పోయటిక్స్’ గ్రంధంలో ఇలా వివరిస్తాడు :
“ట్రాజెడి నాటకాన్ని చూసిన ప్రేక్షకుడు, భయం, జాలి వంటి భావాలని థియేటర్ లో వెలిబుచ్చడం వలన ఆ ఎమోషన్స్ పరిశుద్ధం చేయబడి ఉపశమనం కలిగిస్తాయి” (అప్పారావు, 1983: 229). కాని నాట్య శాస్త్రం ప్రకారం కళ యొక్క ప్రయోజనం ఆధ్యాత్మిక ఆనందం.
భూస్వామ్య యుగంలో రాజులు కవుల్ని, కళాకారులని తమ ఆస్థానంలో ఉంచి పోషించేవారు. కవులు రాజుల్ని పొగిడేవారు. తెలుగు నేలపై పోతన, దూర్జిటి, వేమన, అన్నమయ్య లాంటి కొందరు కవులు ‘రాజులు మత్తులు వారి సేవ నరకప్రాయం’ అని తిరస్కరించి ప్రజా కళాకారులయినారు. వారు రాజాస్థానాలని తిరస్కరించి దేవస్థానాన్ని నమ్ముకున్నారు. సమాజంలోని వైదిక ధర్మాన్ని, జ్ఞాన, కర్మ మార్గాలని సాహిత్యం ద్వారా ప్రవేశపెట్టి సంస్కృత మార్గంలోకి, అంటే ఆనాటి భద్రలోకపు వైదిక వర్గం వృత్తంలోకి తెలుగు సాహిత్యాన్ని నన్నయ్య మొదలైన వారు నడిపించినప్పుడు మార్గ పద్దతీని, ఉరుతర గద్య పద్యోక్తులని ఈసడించిన జాను తెనుగులో, దేశి పద్దతిలో తను నమ్మిన మతాన్ని ప్రచారం చేయడానికి దిగాడు పాల్కురికి సోమనాధుడు. నూతనంగా తేదలుచుకున్న మత ప్రచార అవసరమనే పరిమితులు ఉన్నప్పటికీ రాజ సభ, పండిత గోష్టి నుండి సాహిత్యాన్ని పదిమందిలోకి తెచ్చాడు. ద్విపద వంటి జనసామాన్యంలో వున్న కవితా రూపాలని తెచ్చాడు. తెలుగు సాహిత్యంలో వైదిక విషయానికి, మార్గ పద్దతికి లిఖిత సాహిత్యంలో కూడా ఒక ప్రత్యామ్నాయ ధోరణి వెలసింది. పాలక ఆలోచనకి భిన్నంగా శతక కవుల్లో, ముఖ్యంగా వేమనలో మనకి ధిక్కార స్వరం వినిపిస్తుంది. దేశి కవులకి శ్రమ సౌందర్యం. మొత్తం మీద భూస్వామ్య సమాజంలో శూద్రులు కవితా రాజ్యం బయటే ఉన్నారు.
మరోవైపు రాజ్యం - కళని, కళాకారులని తనవారిగా చేసుకోవాలని ప్రయత్నం చేస్తుంది, డబ్బులిచ్చి, పదవులిచ్చి బిరుదులిచ్చి. రాజ్యం, తన పాలితుల్ని, బలంతోని, సమ్మతితోని అదుపు చేస్తాయి అంటాడు ఇటాలియన్ మార్క్సిస్ట్ తత్వవేత్త ఆంటోనియో గ్రాంసి. ఫ్రెంచ్ తత్త్వవేత్త ఆల్థూసర్, సైన్యం, పోలీసులు, జైళ్ళు, కోర్టులు లా అండ్ ఆర్డర్ అనేవి దమన శీలపరికరాలు, వీటి ద్వారా బలం ప్రయోగించి అసమ్మతిని అణిచివేస్తుంది; ఇంకా సమ్మతిని తన భావజాల ఉపకరణాలైన మతపరమైన, విద్యాపరమైన, కుటుంబ, చట్ట రాజకీయ ఉపకరణాలు (పార్టీలు, వ్యవస్థలు), ట్రేడ్ యూనియన్లు, సమాచార సాధనాలు, సాంస్కృతిక రంగం ద్వారా సాధిస్తాయి. ప్రైవేటు సంస్థలు కూడా రాజ్యంలో భాగస్వాములే అంటాడు. కవుల్ని, ఇటాలియన్ మార్క్సిస్ట్ తత్త్వవేత్త అంటోనియో గ్రాంసి చెప్పిన, ‘ఆర్గానిక్ ఇంటలెకచ్యువల్స్’ తో పోల్చవచ్చు. ఆయన ప్రకారం, ఈ ఆర్గానిక్ మేధావులు ఆధునికతతో పాటు సమాజంలో సంప్రదాయకంగా వస్తున్న సంస్కృతిని తమతో పాటు తీసుకొస్తారు. ఈ ఆర్గానిక్ మేధావులు సమాజాన్ని తెలుసుకోవడంతో పాటు అర్ధం చేసుకుంటారు, ఇంకా దాని పట్ల సానుభూతి వ్యక్తం చేస్తారు.
4. వలస పాలనలో స్వేచ్చ, స్వతంత్రభావాలపై నిషేధం:
వలసపాలనలో బ్రిటిష్ విద్యావిధానంలో స్వతంత్రభావాలు ఏర్పరుచుకున్న కవులు, కళాకారులు స్వాతంత్ర్య పోరాటంలో కృషి చేస్తున్న భారతీయులకి సపోర్టుగా, దేశ ప్రజల స్వాతంత్ర్య ఆకాంక్షని తమ కళా రూపాల్లో సాహిత్యంలో వ్యక్తం చేశారు. ఆధునిక కవి గురజాడ తన ‘పూర్ణమ్మ’ కథ లో కన్యని చెరచాలి అన్న రాజుని దుర్మార్గుడు అని తిట్టి తన ఆధునికత చాటుకున్నాడు, అంతే కాని భూస్వామ్య కవిత్వంలో వలె అతనిపై శృంగార కవిత్వం, విరహ కవిత్వం రాయలేదు. గరిమెళ్ళ సత్యన్నారాయణ ‘మాకొద్దీ తెల్లదొరతనం’ బ్రిటిష్ సామ్రాజ్యవాదుల కుటిల తంత్రాన్ని క్రూర శాసనాల్ని తీవ్రంగా నిరసించిన రచన. ఉన్నవ లక్షినారాయణ మాలపల్లి నవలని జైలులో రాశాడు. బ్రిటిష్ ప్రభుత్వం దీనిని నిషేధించింది. రాయవెల్లూరు జైలులో 1921–22 మధ్య ఉన్నవ లక్షినారాయణ ఖైదీగా వున్నారు. జైలు సూపర్నెంటు అనుమతి తీసుకోని నవల రాశాడు. సూపర్నెంటు దాన్ని స్వాధీన పరుచుకొని పై వారికి పంపాడు. గ్రంధకర్త క్రిమినల్ సెటిల్మెంట్ వ్యవస్థ గురించి, పోలిసు, జైలు, కోర్ట్ గురించి పరమ దారుణంగా రాశాడని, ప్రభుత్వం పట్ల ప్రజల్లో ద్వేషం కలిగేటట్లు, బొల్షేవిజం సూత్రాలను, సహాయ నిరాకరణ తత్వాన్ని ప్రబోధ, ప్రచారం చేసే విధంగా ఉన్నాదని, ప్రచురణకు అనుమతి ఇవ్వకూడదు పైనుండి ఆర్డర్ వచ్చింది.
నిషేధాలు ఎప్పుడు సమాజం రాజకీయంగా సంక్షోభంలో ఉన్న కాలంలో జరుగుతుండడం వలన ప్రభుత్వాలు అభిప్రాయాలకి భయపడడం అనేది సహజమే అనిపిస్తుంది. బ్రిటిష్ ప్రభుత్వం శాంతి భద్రతల పేరుతో స్వాతంత్ర్యఉద్యమాన్ని అణిచి వేయడానికి అనేక చట్టాలని తెచ్చింది. మాట్లాడే హక్కుల్ని, పుస్తకాలని, ప్రదర్శనలని రాజద్రోహం పేరుతో, సెన్సార్షిప్ పేరుతో, ప్రెస్ చట్టాలు పేరు తో నిషేధించింది. 1876లో బ్రిటిష్ ప్రభుత్వం ‘డ్రమాటిక్ పెర్ఫార్మన్స్ ఆక్ట్’ తీసుకువచ్చింది. ఆ చట్టానికి కొన్ని రకాల ప్రదర్శనలని నిషేధించే హక్కు హక్కు ఉంది – చట్టబద్దంగా రూపొందిన ప్రభుత్వం పట్ల అసంతృప్తి వ్యక్తంచేసినా, అప్రఖ్యాతి పాలు చేసినా, పోలీసులుకి వారెంట్ జారి చేసి అరెస్టు చేసే హక్కు ఉంటుంది. ఈ చట్టం ప్రకారం తమా రచనలని ప్రదర్శించాలి అనుకునే కవులు విధిగా తమ రచనలని స్థానిక పోలీసులకి చూపించి అనుమతి పొందాలి. ఈ విధానం లో అనేక రచనలకు పొలిసు స్టేషన్లు ఆర్కైవ్స్ గా మిగిలిపోయాయి (లాల్, 2004). ప్రజానాట్యమండలి నుండి సుంకర సత్యన్నారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు రచించిన ‘మా భూమి’ నాటకరచనని, ప్రదర్శననీ నిషేధించింది. నిజాం ప్రభుత్వం దాశరధి రచించిన ‘అగ్నిధార’, సోమసుందర్ రచన ‘వజ్రాయుధం’ని నిషేధించింది. గాడిచర్ల హనుమంతురావు, వట్టికోట ఆళ్వారుస్వామి వంటి రచయితలు తమ రచనల కారణంగా జైలుపాలు అయ్యారు. విశ్వనాథ సత్యన్నారాయణ ‘ఆంధ్రపౌరుషం’ కావ్యాన్ని నిషేధించారు. 1931 తర్వాత జాతీయఉద్యమం ప్రబలడంతో నిషేధాలు 1945 వరకు నిరవధికంగా సాగాయి. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మళ్ళి శ్రీకాకుళం గిరిజన పోరాటంతో మళ్ళి సాహిత్యంపై నిషేదాలు ప్రారంభం అయ్యాయి. స్వతంత్ర భారత ప్రభుత్వం ప్రజా ఉద్యమాలని, కళా సాహిత్యాలలో డిసెంట్ ని, ప్రభుత్వం పై వ్యక్తం చేసిన అసంతృప్తి ని అడ్డుకొనడానికి బ్రిటిష్ చట్టాలనే కొనసాగించింది.
5. రచన - రాజద్రోహం:
1972లో ఆంధ్రప్రదేశ్ విప్లవరచయితల సంఘం ఉపాధ్యక్షుడు, రచయిత అయిన కొడవటిగంటి కుటుంబరావు సంపాదకీయంలో వచ్చిన ‘ఇప్పుడు వీస్తున్న గాలి’ అనే కథ సంపుటిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిషేధించింది. ‘ఇప్పుడు వీస్తున్న గాలి’ – కథాసంకలనంలో చెరబండరాజు రాసిన కథ ‘చిరంజీవి’ ఉన్నది. భారతప్రభుత్వం దీన్ని వరల్డ్ ఫెయిర్లో ‘అవుట్ స్టాండింగ్ బుక్’ అని కూడా ప్రకటించింది. అయితే ఈ పుస్తకంపై ఆంధ్రప్రదేశ్ శాసనమండలిలో 1972 జూన్ 29న వాదన జరిగింది.
తెలుగు నేలపై కవులు రాజ్యంపై అనేక ఏళ్ళగా యుద్ధం చేస్తున్నారు. ఒకసారి మూలాలలోకి వెళ్ళితే, విరసం (విప్లవ రచయితల సంఘం) స్థాపన ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ రాజకీయ, సాంస్కృతిక క్షేత్రాల్లో చారిత్రకంగా కొత్త మార్పులు చోటుచేసుకున్నాయి. మహాకవి శ్రీశ్రీ షష్టిపూర్తి సందర్భంగా 1970లో విశాఖ విద్యార్ధులు రచయితలకి ఒక సవాల్ విసిరారు. ‘రచయితలారా! మీరు ఎటువైపు? ప్రజల వైపా? పాలకుల వైపా?’ అనే ప్రశ్న వేసిన కరపత్రం ఎన్నో పరిణామాలకి కారణం అయ్యింది. లబ్దప్రతిష్టులు అయిన శ్రీశ్రీ, రావిశాస్త్రి, కాళీపట్నం రామారావు లాంటి పేరుపొందిన రచయితలు ఉద్యమానికి తన సానుభూతి తెలిపారు. విరసం (1970), జననాట్యమండలి (1972) లాంటి సంస్థల ఏర్పాటుకి కారణం అయ్యింది. శ్రీశ్రీని షష్టిపూర్తిలో డబ్బు ఇచ్చి సత్కరించి విప్లవం నుండి ఆయన్ని దూరం చేసే సంకల్పాన్ని విశాఖ విద్యార్థులు కవులు పసిగట్టారు. ప్రభుత్వ ప్రయత్నాన్ని వమ్ముచేస్తూ విరసం ఆవిర్భవించింది. శ్రీకాకుళం గిరిజనరైతాంగపోరాటంలో అశువులు బాసిన కవి, గాయకుడు, కత్తి, కలం పట్టిన సుబ్బారావు పాణిగ్రాహి తరువాత తరం కవులకి, గాయకులకి స్పూర్తి అయ్యాడు. పాణిగ్రాహి జముకుల కథలో విప్లవాన్ని ప్రచారం చేశాడు. అప్పటి వరకు వచనంలో రాసిన కవులు సులభంగా చదువురాని వారికి కూడా అర్ధం అవ్వాలని పాటలు రాయడం మొదలు పెట్టారు. గద్దర్, చెరబండరాజు, వంగపండు, గూడ అంజయ్య లాంటి కవులు, గాయకులు అద్భుతమైన ప్రజా సాహిత్యంలో తమ భావ జాలాన్ని వ్యక్తం చేశారు. చెరబండరాజు విప్లవ కవిత్వం రాసినందుకు జైలు పాలు అయ్యాడు. తెలుగులో కవులు పాటని రాజ్యం తూటాకి సమాధానంగా ఎంచుకున్నారు. అన్ని సాహిత్యరూపాల్లో పాట అధికంగా ఆకట్టుకొంది. పాట అటు సాహిత్యాన్ని, ఉద్యమాన్ని ఎంతో ప్రభావితం చేసి, ఉద్యమాలకి గొంతుక నిచ్చి, వేలాది మంది కార్యాకర్తల్ని ఉద్యమంలో దూకేటట్టు చేసింది. కవులు, రచయితలు గాయకులుగా, ప్రదర్శకులుగా, వక్తలుగా ప్రజల మధ్యకి వచ్చేటప్పటికి వారి శరీరం, గాత్రం ముఖ్యం అయిపోతుంది. ఆ వ్యక్తీకరణ ఇక ఏమాత్రం పుస్తకాల్లో దాక్కోలేదు. ఆ విధంగా వారు ముఖాముఖి రాజ్యంతోని యుద్ధం చేయడం మొదలు పెట్టారు.
‘ప్రజలలో తిరుగుబాటుని బోధిస్తున్నవి’ అని విప్లవకవితా సంకలనాలని ప్రభుత్వం నిషేధిస్తుంటే, కోర్టు మాత్రం, కవితాసంకలనాలలోవున్న ఈ కవితలు అందరికి అందుబాటులో లేవు, అక్షరాస్యులకే అందుబాటులో లేనప్పుడు ఇంకా నిరక్షరాస్యుల గురించి చెప్పాలా అని అంటున్నది. విప్లవ కవులపై ఆరోపణలకు, నిర్భందించిన ప్రయోజనాలకు పొంతన లేదని దిగంబర కవులు గాని, విప్లవ కవులు చట్ట వ్యతిరేక కార్యాకలాపాల్లో పాల్గొంటున్నారని ప్రభుత్వం నిరూపించలేక పోయిందని, విప్లవ కవుల్లో మార్క్సిజం, లెనినిజం, మావోయిజం పట్ల ఉన్న విశ్వాసాలకి గాని, ప్రజల్లో కొన్ని వర్గాల పట్ల వారు వాడిన ‘బూతు’కు గాని వారిని అరెస్ట్ చేయడంలో వున్న ప్రయోజనంతో సహేతుకమైన సంబంధం లేదని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు(సృజన, అక్టోబర్, 1971, పే. 6-7). విశ్వాసాలు అదుపులో పెట్టబడేవికావు, ఎవరిని అతనికున్న విశ్వాసాల గురించి జైల్లో పెట్టడానికి వీలులేదు అన్నారు జస్టిస్ ఓ. చిన్నప రెడ్డి, జస్టిస్ ఏ. డి. వి. రెడ్డి ధర్మాసనం. ఉద్వేగాలకి, విశ్వాసాలకి వేదిక అయిన కళ మంచి చెడుల చర్చ వేదికగా, అనుభూతుల వ్యవస్థ గా చూడవలసి ఉంటుంది.
6. వివిధ కవితాసంకలనాలు - నిషేధాజ్ఞలు:
సాహిత్యంపై నిషేధానికి రాజ్యానికి సంప్రదాయకారణాలు అయిన నైతిక, లైంగిక, మత విశ్వాస అభ్యంతరాల పాలు కన్నా రాజకీయ సిద్ధాంతాల సంకుచితత్వం ఎక్కువగా ఉన్నట్టు ఉంది. విప్లవ రచయితల సంఘం, తిరుపతి శాఖ ప్రచురించిన కవితాసంకలనం ‘లే’ ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1971, ఆగష్టు, 7న నిషేధించింది. ‘లే’ కవితా సంకలన కర్త సుభాష్. ఏ కారణంతో నిషేధించారు అంటే - ‘న్యాయ బద్దంగా ఏర్పడిన ప్రభుత్వం పట్ల ద్వేషాన్ని, కసిని, అసంతృప్తిని రేకెత్తిస్తున్నాయి ఈ కవితలు’ అనేది ప్రభుత్వ వాదన. అయితే కోర్టు మాత్రం ‘లే’ నిషేధాన్ని ధ్రువపరచలేదు.
అనంతపురం చైతన్యసాహితీప్రచురణ ‘రక్తగానం’, ’బందూక్’ కవితాసంకలనాలు, ‘మార్చ్’ (1971), ‘ఝుంఝ’ (1971) అనే కవితాసంకలనాలపై ప్రభుత్వం నిషేధాజ్ఞలు జారి చేసింది. ’ఝుంఝ’ లో సైన్యం చేరవద్దని హెచ్చరిక ఉన్నదని ప్రభుత్వం ఆక్షేపించింది. ఆ పుస్తకాలు ప్రభుత్వంపై విద్రోహాన్ని పురికోల్పినట్లు ఆరోపించింది. రాజద్రోహం నేరంమోపి కిషన్ రావుని, ఎం.వి.రమణ రెడ్డిని దేశ భద్రతా చట్టం కింద జ్వాలాముఖిని, నిఖిలేశ్వర్, చెరబండరాజులని జైల్లో పెట్టారు.
‘నెత్తుటి దీపం’, ‘బందూక్’, ‘పిలుపు’ పత్రిక నవంబర్ సంచికలను నిషేధించారు. సోషలిస్ట్ పబ్లికేషన్స్ ప్రచురించిన ‘శంఖారావం’ అనే విప్లవ గేయాల సంకలనాలని కూడా నిషేధించింది. సృజన సంచికలు – 1972 మార్చ్, మే, 1973 ఏప్రిల్, మే, 1974 మే, ‘విమోచన’ పత్రిక రెండు సంచికలు నిషేధానికి గురయ్యాయి.
కవులు రచయితలు రాజ్యం ప్రకటిస్తున్న అవార్డ్ లని, బిరుదులని తిరస్కరిస్తున్నారు. కాళీపట్నం రామారావు తన ‘యజ్ఞం’ కథకి సాహిత్యఅకాడమి బహుమతి ఇస్తే దాన్ని తిరస్కరించాడు. ఏ ప్రజల కోసమైతే ఆ కథ రాసానో వారికి ద్రోహం చేయదలుచుకోలేదని దాన్ని తిరస్కరించారు.
‘కొన్ని వేల మందిని తుపాకులతో కాల్చి చంపి, తుపాకుల మీదే తప్ప మరింకే దేనిలోను తనకి నమ్మకం లేదని ఈ ప్రభుత్వం రూడి చేసింది. ఈ ప్రభుత్వపు ఉచ్చులలో నుండి బయటపడాలి అంటే పేదజనం కూడా తుపాకుల ఉపయోగం మీదే నమ్మకం పెట్టుకోవాలి తప్ప ఎలక్షన్ ఎండమావుల మీద ఆశలు ఉంచుకొని లాభం లేదు. ఇది గమనించిన మా విప్లవరచయితలు ఆ నిజాన్ని జనానికి చెబుతున్నందుకు ఈ ప్రభుత్వం జైల్లో పెట్టించడమే కాక ఇంకా అనేక విధాలా దాడులు చేసి వారిని ఇబ్బంది పెట్టి హింసిస్తుంది’ (కాళీపట్నం రామారావు, సృజన, డిసెంబర్, 1974, పే. 61). అవార్డులు వాపసు ఇవ్వడం, తిరస్కరించడం ప్రభుత్వం చేపట్టే ప్రజావ్యతిరేకచర్యలకి నిరసన తెలపడంలో భాగంగా చూడవచ్చు.
7. ముగింపు:
రాజ్యం సాధారణ ప్రజానీకానికి దూరం అయ్యి తమ వర్గప్రయోజనాలు పరిరక్షించుకొనడానికి ప్రయత్నించినప్పుడు, కవులు ప్రజలపక్షం మాట్లాడడాన్ని సహించని రాజ్యం వారిని ప్రజల నుండి దూరం చేయడానికి జైళ్లలో ఉంచుతున్నట్లు కనిపిస్తుంది. వారు చేసిన నేరం అంతా కవిగా ఒక భావజాలం కలిగి ఉండడం, ప్రజా ఉద్యమాలకి సంఘీభావం తెలపడాన్ని రాజ్యం నేరంగా భావిస్తున్నట్టు ఉన్నది.
ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం అనేది ప్రజల హక్కు. ‘డిసెంట్’ తెలపడం అనేది నేటి రాజ్యం దేశ ద్రోహంగా భావించడం చూస్తున్నాము. అయితే రాజ్యం ఒక కవి మాటలకి ఎందుకు అంతగా భయపడిపోతుంది? అంటే జర్మన్ రచయిత బ్రెచ్ట్ అంటాడు, “వారి దగ్గర ఎంత పోలీసు బలగం ఉండనీ, దుర్మార్గులైన అధికారులు ఉండనీ, లంచగొండులైన న్యాయాధికారులు ఉండనీ, టార్చర్ కేంద్రాలు ఉండనీ, జైళ్ళు ఉండనీ కాని, ఒక సాధారణ మనిషి మాటకి భయపడిపోతాది” (వా ధియాంగో, 1998 : 9- 10).
రాజ్యం కవిత్వానికి భయపడి నిషేధించానికి కారణం ప్రజాకవులకి, ప్రజలకి మధ్య ఉండే బంధం పాలకులకి, పాలితులకి మధ్య ఉండే బంధం కన్నా దృఢమైనది అని కుటుంబరావు వాదించారు (కుటుంబరావు, సృజన, ఏప్రిల్, 1971, పే. 6). కళాకారుడు సమాజంలో ఒక వ్యక్తి కాబట్టి, తన కళ సమాజంలోని ప్రేక్షకులకి నచ్చేటట్లు చేసుకోవడం ముఖ్యం కాబట్టి.
8. పాదసూచికలు:
- ‘పునర్జన్మ’ అనే ఈ కవితని చెరబండరాజు ఎమర్జెన్సీలో హైదరాబాద్ సెంట్రల్ జైల్లో ఉండగా రాశారు. చెరబండరాజుగా దిగంబరకవిగా, విప్లవకవిగా ప్రఖ్యాతుడైన బి. భాస్కర రెడ్డి 1971లో అంతరంగిక భద్రతాచట్టం(మీసా) కింద అరెస్ట్ అయి, 1974లో సికింద్రాబాద్ కుట్రకేసులోను, ఆ తర్వాత ఎమర్జెన్సీ లోనూ సుదీర్ఘ కాలం జైలులో ఉండడం వల్ల ఆరోగ్యం పూర్తిగా చెడిపోయి, బ్రెయిన్ ట్యూమర్ వ్యాధితో మరణించారు.
- ‘to bring hatred contempt and excises disaffection towards the government established by law in India, and is prejudicial to maintenance of harmony, the publication of which is punishable under sections 124 – A, 153 – A and 295 – A of the Indian Penal Code (సృజన, ఫిబ్రవరి, 1973, పే. 85).
9. ఉపయుక్తగ్రంథసూచి:
- అప్పారావు, పి.ఎస్.ఆర్. (1983). నాట్యశాస్త్రం. నాట్యమాల ప్రచురణ, హైదరాబాద్.
- నాజర్. (2016 ). పింజారి. విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, విజయవాడ
- బాలగోపాల్, కే. (2011). సాహిత్యంపై బాలగోపాల్. హైదరాబాద్ బుక్ ట్రస్ట్, హైదరాబాద్ .
- లెనిన్. (1989). లెనిన్ సంకలిత రచనలు -7. ప్రగతి ప్రచురణాలయం, మాస్కో.
- మధుసూధనరావు, త్రిపురనేని. (2018). సాహిత్యసర్వస్వం. విప్లవరచయితలసంఘం, హైదరాబాద్.
- వరవరరావు. (2017). వరవరరావు కవిత్వం 1957–2017. స్వేచ్చాసాహితి, హైదరాబాద్.
- వేణుగోపాల్, ఎన్. (2008). కళ్ళ ముందరి చరిత్ర. స్వేచ్చసాహితి, హైదరాబాద్.
పత్రికలు:
- చెరబండరాజు. ‘పునర్జన్మ’. సృజన మాసపత్రిక, సంచిక. 70, సంపుటి. 1, ఆగష్టు, 1977. పుట. 52 – 53.
- కోటేశ్వరరావు, కొల్లూరి. ‘“ఇప్పుడు వీస్తున్న గాలి”. నిషేధం, శాసనమండలి చర్చ’ ‘సృజన మాసపత్రిక, సంచిక. 35, సంపుటి. 8. ఆగష్టు, 1972. పుట. 57 - 62.
- సాహితీమిత్రులు. ‘పీడన చట్టం’. సృజన మాసపత్రిక, సంచిక. 25, సంపుటి. 8, అక్టోబర్, 1971. పుట. 6 -7.
- జీ.డి. ‘దోపిడీని కాపాడేందుకు సన్మాన కవుల “దీక్ష”’. సృజన మాసపత్రిక, సంచిక. 70, సంపుటి. 1, ఆగష్టు, 1977. పుట. 74 - 86 .
- రామారావు, కాళీపట్నం. ‘ఆం.ప్ర. సాహిత్య అకాడమీ అవార్డ్ తిరస్కృతి : శ్రీ కాళీపట్నం రామారావు ప్రకటన’. సృజన మాసపత్రిక, సంచిక 63, సంపుటి. 12, డిసెంబర్, 1974. పుట. 61.
- సాహితీమిత్రులు. ‘విరసానికి శ్రీరామరక్ష’. సృజన మాసపత్రిక. సంచిక. 19, సంపుటి. 3, ఏప్రిల్, 1971. పుట 5 - 6
- విరసం. ‘విరసం చరిత్ర - విహంగ వీక్షణం’. అరుణతార మాసపత్రిక. సంచిక. 5, సంపుటి. 25, డిసెంబర్. 2005. పుట. 13 -14.
ఆంగ్లగ్రంథాలు:
- Bloom, Allan, and Adam Kirsch. (1968). The republic of Plato. Vol. 2. Basic Books, New York.
- Chandran, Mini. (2017). The writer, the reader and the state: literary censorship in India. SAGE Publishing India, New Delhi.
- Gramsci, Antonio. (2011). Prison Notebooks Volume 2. Vol. 2. Columbia University Press, New York.
- Lal, Ananda. (2004). The Oxford companion to Indian theatre. (No Title) (2004). Oxford University Press, New Delhi.
- wa Thiong'o, Ngugi. (1998). Penpoints, gunpoints, and dreams: Towards a critical theory of the arts and the state in Africa. Clarendon Press, New York.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.