AUCHITHYAM | Volume-5 | Issue-1 | January 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
18. నన్నయ తీర్చిదిద్దిన మానవ సంబంధాలు: విశ్లేషణ
డా. అల్లు గణేష్
టి.జి.టి. తెలుగు ఉపాధ్యాయుడు,
డా. బి. ఆర్. అంబేద్కర్ గురుకులం,
అడవి తక్కెళ్ళపాడు, గుంటూరు, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9177835898, Email: ganesshallu@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
మానవపరిణామక్రమంలో అనేకమైన మార్పులు చోటుచేసుకున్నాయి. నిప్పు కనిపెట్టడం, చక్రం తయారుచేయటం విప్లాత్మకమైన మార్పులని చెప్పవచ్చు. తర్వాత మనిషి తన భావాలను వ్యక్తపరచడానికి, ఇతరుల భావాలను గ్రహించడానికి భాషను కనుక్కున్నాడు. మానవత్వం నిలుపుకోవడానికి అనేక ఆచారాలు, అలవాట్లు, సాంప్రదాయాలను అలవర్చుకున్నాడు. విజ్ఞానం వైపు అడుగులు వేసి సృష్టికి ప్రతిసృష్టి నిర్మించుకున్నాడు. ఇంత అభివృద్ధి జరగడానికి ఏ ఒక్క మనిషో కారణమని చెప్పలేము. వ్యక్తులు సమూహాలుగా ఏర్పడి ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటు అభివృద్ధి సాధించాడు. ఇటువంటి సమూహాలలో వ్యక్తుల మధ్య సంబంధాలకు చాలా ప్రాధాన్యత ఉంది. అభిప్రాయాలు, ఆలోచనలు పంచుకుంటూ మనుగడ సాగిస్తున్నారు. సమాజానికి ప్రతిబింబమయిన సాహిత్యంలో కూడా మానవ సంబంధాల గురించి అనేకమంది కవులు, రచయితలు రాశారు, రాస్తున్నారు కూడా.. తెలుగులో ఆదికవి అయిన నన్నయ తన మహాభారతంలో మానవ సంబంధాలను చక్కగా తీర్చిదిద్దారు. ఉన్నతమైన పాత్రల ద్వారా మానవుల మధ్య సంబంధాలను తెలుగు ప్రాంత ఆచార సాంప్రదాయాలకు అనుగుణంగా నడిపించారు. నన్నయ భారతంలో తల్లీకొడుకుల సంబంధాలు, తండ్రీకొడుకుల సంబంధాలు, తండ్రికూతుర్ల సంబంధాలు, సోదర సంబంధాలు, గురుశిష్యుల సంబంధాలు, భార్యాభర్తల సంబంధాలు మొదలైన సంబంధాలు ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ నా పరిశోధన పత్రంలో తెలియజేశాను
Keywords: మానవసంబంధాలు, నన్నయ, తల్లీకొడుకుల సంబంధాలు, తండ్రీకొడుకుల సంబంధము, తండ్రీకూతుర్ల సంబంధాలు, సోదర సంబంధాలు, గురు శిష్యుల సంబంధాలు.
1. ఉపోద్ఘాతం:
ఎన్నోవేల సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన మనిషి పరిణామక్రమంలో విజ్ఞానాన్ని సంపాదించి, సృష్టిలో మిగిలిన జంతువులకున్నా కొంత భిన్నంగా, సమున్నతంగా జీవించడం అలవాటు చేసుకున్నాడు. ఈ వరుసలో తను జీవిస్తూ తన వంశాన్ని నిలబెట్టుకోవడమే కాకుండా తనలాంటి వాళ్ళతో కలసి గుంపులుగా బ్రతకటం నేర్చుకున్నాడు. తనతోపాటు చుట్టూ ఉన్నవారి గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నాడు. కాబట్టే మానవజాతి మనుగడ నిరంతరంగా సాగిపోతోంది.
పశువుల కంటే ఇతరమైన మనుష్యాది సమూహము అని "సమాజం" అనే పదానికి నైఘంటికార్థం. అంటే జంతుజాలం నుండి వేరు చేసుకుంటూ తన గురించి, తన సమాజం గురించి ఆలోచించే స్థాయికి మనిషి ఎదిగాడు. తమ భావాలను మిగిలిన వాళ్ళతో పంచుకోడానికి సాహిత్యాన్ని ఒక వంతెనగా ఉపయోగించవచ్చునని తెలియజేసిన ఆదికవి నన్నయ, సామాజిక స్పృహతో ఆంధ్రమహాభారత రచనకు శ్రీకారం చుట్టాడు. సమాజానికి హితాన్ని గూర్చేయేదైనా సామాజికమౌతుంది. అందుకే సమాజానికి ఉపయోగపడని సాహిత్యాన్ని సమాజం కూడా పట్టించుకోదని కొందరి భావన. అలా సమాజం గురించి ఆలోచించిన నన్నయ తన రచనల ద్వారా తెలుగు జాతికి మార్గదర్శకుడయ్యారు.
మానవుడు సంఘజీవి, సంఘాన్ని విడిచి మనుగడ సాగించడం కష్టతరం. సమాజంతో మానవుడికి అవినాభావ సంబంధం ఉంది. పుట్టిన దగ్గర్నుండీ సమాజంలోని వివిధ వ్యక్తులతో సంబంధాలు కలిగి ఉన్నాడు. మనిషి సమాజంలో మంచి సంబంధాలు కలిగి సత్ప్రవర్తకునిగా ఉండాలనే తలంపుతో పెద్దలు ముందుగా తల్లిని, తండ్రిని, గురువుని, అతిథిని గౌరవించాలని, అలా చేసినప్పుడు సమాజాన్ని కూడా గౌరవించాలనే తలంపు కలుగుతుందని చెప్పారు. తన చుట్టూ ఉన్న మానవులతో ఏర్పరుచుకునే సంబంధాలు మనిషి మనుగడకు ఎంతో అవసరం.
ఆదికవి భారతంలోతల్లీకొడుకుల సంబంధం, పితాపుత్ర సంబంధం, పితాపుత్రికా సంబంధం, గురు శిష్య సంబంధం, భార్యాభర్తల సంబంధం ఇలా అనేక విధాలైన మానవ సంబంధాలను పరిశీలిద్దాం.
2. తల్లీకొడుకుల సంబంధాలు:
"న మాతుః పరదైవతమ్" - తల్లి కంటే వేరు దైవం లేదు. మనిషి పుట్టగానే ఏర్పడే తొలి బంధం తల్లి, బిడ్డను నవమాసాలు మోసి, కని పెంచి పెద్దవాణ్ణి చేసి సమాజంలో మంచిపేరు, ప్రఖ్యాతలు సంపాదించేలా చేసే వ్యక్తి తల్లి. బిడ్డ పురోగతి సాధించడంలో తల్లిపాత్ర ప్రముఖమైంది. నన్నయ రచనలో తల్లి మీద గౌరవం చూపి, తల్లిని రక్షించి సమాజానికి ఉపయోగపడిన వారు చ్యవనుడు, గరుత్మంతుడు. తల్లికోసం ఎలాంటి కష్టాలనైనా ఓర్చుకోవాలి. ఈ విషయాన్ని వివరించే కథ చ్యవనుడిది.
2.1 పులోమ – చ్యవనుడు:
ఆంధ్ర మహాభారతం ఆదిపర్వంలో చ్యవనుడి కథ వస్తుంది. భృగుడనే బ్రాహ్మణుడి భార్య పులోమ, గర్భవతైన ఆమెను అగ్నిహోత్రానికి కావలసిన ఏర్పాట్లు చూడమని చెప్పి భర్త స్నానానికి వెళ్తాడు. ఇంతలో పులోముడనే వింత రాక్షసుడు అక్కడకు వచ్చి అగ్నిహోత్రుడి ద్వారా ఈమె భృగు మహర్షి భార్య అని తెలసుకుని పులోముడు పంది రూపంలో ఆమెను ఎత్తుకుపోతాడు.
గర్భంలో చ్యవనుడు ఆమె ఆక్రందన విన్నాడు. గర్భాన్ని చీల్చుకుని బయటకు వచ్చాడు. అతడు వేయిమంది సూర్యులతో సమానమైన కాంతి గలవాడు. తీక్షణమైన అగ్నితో సమానమైన తేజస్సుతో రాక్షసుణ్ణి భస్మం చేస్తాడు. తన తల్లిని కాపాడుకున్న చ్యవనుడు మాతా పుత్ర సంబంధానికి చక్కని ఉదాహరణ.
“సముదిత సూర్య సహస్రో
పమ దుస్సహ తేజు జగదుప ప్లవసము యా
సమ దీప్తి తీవ్ర పావక
సము జూచుచు నసుర భస్మ సాత్కృతుడయ్యెన్”1
2.2 వినత – గరుడుడు:
ఆంధ్ర మహాభారతం ఆదిపర్వం ద్వితీయాశ్వాసంలో గరుడోపాఖ్యానం ఉంటుంది. కశ్యప ప్రజాపతి భార్యలైన వినత, కద్రువలు సంతానం కావాలని కోరగానే కద్రువ అండాల నుండి పాములు పుడతాయి, వినత అండాల నుండి పిల్లలు రాకపోతే ఒక గుడ్డును పగల గొట్టగానే సగం రూపమున్న అనూరుడు బయటకు వచ్చి, తొందరపడిన తల్లిని శపించి వెళ్ళిపోతే రెండో గుడ్డు నుండి అమిత బలశాలి అయిన గరుత్మంతుడు పుట్టి తల్లి దాస్యం పోగొట్టడానికి, కద్రువ పుత్రులు అడిగారని. అమరావతికి వెళ్ళి అమృతం తెస్తాడు. ఈ విధంగా గరుడుడు తన మాతృభక్తిని చాటుకున్నాడు.
3. తండ్రీకొడుకుల సంబంధాలు:
కుమారుడికి తగిన వయసు రాగానే విద్యాబుద్ధులు చెప్పించాలి. యోగ్యులుగా తయారుచేసి, సమాజానికి ఉపయోగపడే విధంగా మార్గదర్శకత్వం వహించేది తండ్రి. కుమారుడు తండ్రిబాటలో నడవాలి. నన్నయ భారతంలో తండ్రీ కొడుకుల మధ్య సంబంధం చక్కగా చిత్రీకరించబడింది.
3.1 శమీకుడు-శృంగి:
ఆదిపర్వం ద్వితీయాశ్వాసంలో ఈ కథ వస్తుంది. వేటకు వచ్చిన పరీక్షిత్తు, దాహం తీర్చుకోవాలని శమీకుడి ఆశ్రమానికి వచ్చి, ధ్యానంలో ఉండి పలుకని ఆ ముని మీద చచ్చిన పాముని పడేసి వెళ్ళిపోతాడు. తర్వాత వచ్చిన శమీకుడి కొడుకు శృంగి కోపంతో పరిక్షిత్తుకి శాపం పెడతాడు. ఆ తర్వాత తండ్రికి చెబుతాడు, క్షణికమైన కోపంలో రాజు చేసిన తప్పుకన్నా నువ్వు చేసిన తప్పు పెద్దదని కొడుకుకి చెప్పి, రాజుకు జరగబోయే ఆపద గురించి విచారిస్తాడు.
కం॥ “క్రోధమ తపమూ జెరచును
క్రోధమ యణిమాదులైనా గుణముల బాపు
క్రోధమ ధర్మ క్రియలకు
బాధయగుం గ్రోథిగా తపస్వికి జన్నే?”2
3.2 యయాతి-పూరుడు:
నహుషుడికి ప్రియంవదకు పుట్టినవాడు యయాతి. రాక్షసుల గురువైన శుక్రాచార్యుల కూతురు. దేవయానిని వివాహం చేసుకొని, ఆమె యందు యదువు. తర్వసుడు అనే ఇద్దరు కొడుకులను పొందాడు. రాక్షసరాజైన వృషపర్వుడి కూతురైన శర్మిష్టను కూడా పెళ్ళి చేసుకొని, ఆమె యందు ద్రుహ్వి, తనువు, పూరుడనే ముగ్గురు కుమారులను జన్మించారు. శర్మిష్టను యయాతి పెళ్ళి చేసుకున్నాడని తెలుసుకున్న దేవయాని తన తండ్రి శుక్రుడితో విషయం చెప్పగానే "నీవు యౌవన గర్వంబున రాగాంధుండవై నా కూతున కప్రియంబు సేసితివి కావున జరాభార పీడితుండవుకమ్ము”3 అని శపించాడు. తన ముసలి తనాన్ని తీసుకుని యౌవనాన్ని ఇచ్చే కొడుకే తన తర్వాత రాజ్యానికి అర్హుడని యయాతి కొడుకులని అడిగితే అందరూ కాదన్నా, పూరుడు తన యౌవనాన్ని తండ్రికి ఇచ్చి తను ముసలితనాన్ని స్వీకరించడం వలన యయాతి పూరుల మధ్య చక్కని పితాపుత్ర సంబంధం ఈ కథ వలన తెలుస్తోంది.
తన తండ్రి కోసం ఆ జన్మ బ్రహ్మచర్య వ్రతం పట్టిన శంతన భీష్ములు, అష్టావక్రుడి కథ, వశిష్ట శక్తులు వంటి పితాపుత్రుల బంధాలు ఎన్నో నన్నయ గారి భారతంలో కనిపిస్తాయి.
4. తండ్రీకూతుర్ల సంబంధాలు:
తండ్రీ కూతుళ్ళు మధ్య అనురాగాన్ని నన్నయ గారు చక్కగా తీర్చిదిద్దారు. ఇందులో దేవయాని - శుక్రాచార్యులు; శకుంతల కణ్వమునుల గురించి చెప్పుకోవాలి.
4.1 శుక్రుడు-దేవయాని:
ఆదిపర్వం తృతీయాశ్వాసంలో ఈ వృత్తాంతం వస్తుంది. తల్లిలేని పిల్లని ఎంత గారాబంగా పెంచుతారో ఈ కథ తెలుపుతుంది. రాక్షస గురువు శుక్రాచార్యులు. అతని కూతురు దేవయాని, తనకేం కావాలన్నా దక్కించుకోవాలనే తలపు కలది. కూతురు మీద ప్రేమతో ఏమీ చెప్పకుండా కూతురు ఎలా చెబితే అలా చేసేవాడు శుక్రుడు. మృత సంజీవన్ని విద్య నేర్చుకోవడానికి వచ్చిన కచున్ని మొదట ఇష్టపడిన దేవయాని, కచుడే జీవితం అనుకుంది. రాక్షసులచే చంపబడిన కచుని బతికించమని, తండ్రికి కోరగానే సంజీవినీ విద్యతో బతికిస్తాడు. గురుపుత్రి సోదరితో సమానమని కచుడు చెప్పగానే ఆవేశంతో అతన్ని శపిస్తుంది. కొంత కాలానికి యయాతిని వలచానని నీవే నా భర్తవని చెబితే, యయాతితో అంటే, రాజులు బ్రాహ్మణ కన్యలను వివాహమాడకూడదని యయాతి చెప్పినా ధర్మవేత్త మా నాన్న శుక్రాచార్యులు చెబితే చేసుకుంటావా. అని అడిగి తండ్రిచేత ఒప్పించి పెళ్ళి చేసుకుంటుంది. తన కూతురికి ఎక్కడా ఎదురుచెప్పని శు భ్రుడికి దేవయానికి మధ్య చక్కని పితా పుత్రికల సంబంధం నిరూపితమయింది.
“వెలయగ ధర్మాధర్మం
బులు నడుపుచు నిఖిలలోక పూజ్యుండై ని
ర్మలుడగు శుక్రుడు పంచిన
సలఘు భుజాసను వివాహమగుదే? యనిసన్"4
4.2 కణ్వుడు-శకుంతల:
ఆదిపర్వం చతుర్థాశ్వాసంలో దుష్యంతోపాఖ్యానం వస్తుంది. ఇందులో చెప్పుకోదగిన పుత్రికా తండ్రులు కణ్వుడు - శకుంతల. పుట్టిన నాడే తల్లిదండ్రులైన మేనకా విశ్వామిత్రులచే విడువబడి, పక్షులచే రక్షించబడుతున్న శకుంతలను తెచ్చి జాగ్రత్తగా పెంచిన మునికణ్వడు. "కన్న తండ్రి, అనాన్ని పెట్టినవాడు, భయాన్ని పోగొట్టిన వాడు"-ముగ్గురూ స్త్రీకి తండ్రులు. అందుకే కణ్వడు శకుంతలకు తండ్రిగా ఉండి ఆమె ఆలన పాలన చూసుకునేవాడు. ఒకనాడు కణ్వముని ఆశ్రమంలో లేని సమయంలో వేటకని వచ్చిన దుష్యంతుడు, శకుంతలను మోహించి, గాంధర్వ వివాహం చేసుకొని వెళ్ళిపోతాడు. కణ్వముని వచ్చి జరిగింది గ్రహించి, శకుంతలను దీవిస్తాడు. కొంతకాలం తర్వాత దుష్యంతుడి నుండి ఎటువంటి పిలుపు రాకపోయేసరికి, కణ్వముని శకుంతలతో ఇలా అంటున్నాడు.
"ఎట్టి సాధ్వులకును బుట్టిన యిండ్లను
పెద్ద కాలమునికి తద్ద దగదు
పతులకడన యునికి సతులకు ధర్మవు
సతుల కీడుగడయా పతుల జూరె"5
కణ్వమహర్షి "ఎలాంటి స్త్రీలయినా పుట్టినింట్లో ఎక్కువకాలం ఉండకూడదు. పతుల సన్నిధికి వెళ్ళడమే సతుల ధర్మం. సతుల జీవనం భర్తల దగ్గరే శోభిస్తుంది కదా!" అంటూ తన శిష్యుల్ని తోడిచ్చి శకుంతలను దుష్యంతుడి దగ్గరకు పంపాడు. శకుంతలను కన్న తండ్రి కన్నా ప్రేసుతో పెంచిన ధర్మాత్ముడు కణ్వముని, తండ్రి మీద గౌరవంతో శకుంతల అతను చెప్పినట్టే చేసి, పితా పుత్రికల సంబంధానికి ఉదాహరణగా నిలిచారు.
5. సోదర సంబంధాలు:
కుటుంబంలోని వ్యక్తులలో సోదరులతో సంబంధ బాంధవ్యాలు ఏర్పడుతాయి. సంఘంలో అనాదిగా వస్తున్న ఆచారం ప్రకారం సంతానంలో పెద్ద వారిని చిన్నవారు గౌరవించడం, చిన్నవారిని పెద్దవారు అభిమానించడం సంప్రదాయం.
నన్నయ భారతంలో అన్నదమ్ముల మధ్య సంబంధాలు చక్కగా విశదీకరించబడ్డాయి. ఇందులో విభావసు సోదరుల కథ, భీష్మ విచిత్ర వీర్య, చిత్రాంగదుల వృత్తాంతం గురించి పరిశీలిద్దాం.
5.1 విభావసు సోదరులు:
ఆదిపర్వం రెండో ఆశ్వాసంలో ఈ కథ వస్తుంది. అహంకారం మనిషి పతనానికి దారి తీస్తుందని చెప్పే వృత్తాంతం ఈ సోదరుల వృత్తాంతం. తన తల్లి దాస్యాన్ని పోగొట్టడానికి గరుడుడు అమృతాన్ని తీసుకురావడానికి వెళ్తుంటే ఆకలి వేసి, తండ్రి కశ్యపుణ్ణి అడిగితే, మనుష్యులుగా పుట్టి ఒకరినొకరు జంతువులు కమ్మని శపించుకున్న విభావసు సోదరులను ఆహారంగా తీసుకోమని చెప్తాడు.
విభావసుడనే బ్రాహ్మణుడికి సుప్రతీకుడనే తమ్ముడున్నాడు. తాతల నుండి వస్తున్న ఆస్తిని విభావసుడొకడే అనుభవిస్తున్నాడని, అతని దగ్గరకి వచ్చి సుప్రతీకుడు అడగ్గానే "ఏనుగు" అయిపొమ్మని తమ్ముణ్ణి శపిస్తాడు విభావసుడు. ఆహంకరించిన తమ్ముడు అన్నను కూడా నువ్వు తాబేలువయిపొమ్మని శపిస్తాడు. ఇలా జంతువులపోయిన వారు మానవత్వం వీడి ప్రవర్తించి అన్నదమ్ములని కూడా మరచిపోయారు. అన్నదమ్ముల అనుబంధానికి ఇదొక గొడ్డలిపెట్టు.
5.2 భీష్మ సోదరులు:
ఆదిపర్వంలో నాల్గవ ఆశ్వాసంలో ఈ కథ ఉంటుంది. శంతనుడికి గంగకు పుట్టిన దేవవ్రతుడే భీష్ముడయి, శంతన సత్యవతులకు పుట్టిన విచిత్ర వీర్య, చిత్రాంగదులను పెంచి పెద్దచేసి వారికి రాజ్యం అప్పగించాలని చూస్తున్నప్పుడు, గంధర్వ రాజుతో యుద్ధం చేసి చిత్రాంగదుడు మరణిస్తాడు. తర్వాత ఇంకో తమ్ముడు విచిత్ర వీర్యుడి గురించి కాశీరాజు కుమార్తెలను తీసుకువస్తాడు.
“నాయనుజునకు వివాహము
సేయగ గుణ్యత్రయంబు జేకొని బలిమిం
బోయెద నద్ధంబగు వా
రాయతీ భుజశక్తి నడ్డమిగుడాజిమొనన్"6
ఈ విధంగా సోదరుల గురించి, వారి సంతానం గురించి అలోచించి చివరకు ప్రాణాలను కూడా కోల్పోయిన భీష్ముడి సోదరభావం ఆచంద్ర తారార్కం నిలుస్తుంది. ఇంకా ధృతరాష్ట్ర పాండు రాజులు, పాండవ సోదరులు కౌరవ మొదలైన సోదర సంబంధాలను మనోహరంగా వర్ణించడాన్ని నన్నయ భారతంలో మనం గమనించవచ్చు.
6. గురు - శిష్య సంబంధాలు:
తల్లిదండ్రుల తర్వాత వ్యక్తి వికాసానికి అభివృద్ధికి దోహదం చేసేది, తోడ్పడేది గురువే. "గు" అంటే అంధకారం. "రు" అంటే దాన్ని నివారించేది. అంధకారాన్ని నివారించేవాడు కాబట్టి గురువు.
గురుర్ర్బహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మైః శ్రీ గురవేనమః
నన్నయ తన రచనలో గురుశిష్య సంబంధాన్ని చాలా చక్కగా వివరించాడు. ఇందులో పైలుడు ఉదంకుని వృత్తాంతం, శుక్రుడు కచుడి కథ గమనిద్దాం.
6.1 పైలుడు - ఉదంకుడు:
ఆదిపర్వం ప్రథమాశ్వాసంలో వీరి వృత్తాంతం వస్తుంది. అష్ట సిద్ధులతో పాటు ఇతర విషయాలను గురుముఖంగా నేర్చుకున్న ఉదంకుడు గురుపత్ని అజ్ఞానుసారం ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి, పౌష్య మహారాజు భార్యకుండలాలు తీసుకువస్తుంటే, మధ్యలో తక్షకుడు వాటిని అపహరించుకొని పోతే వాటిని తీసుకురాడానికి పాతాళం వెళ్ళి అక్కడున్న నాగులను ప్రసన్నం చేసుకుని, ఆ కుండలాలను తెచ్చి గురుపత్నికి ఇచ్చి తన గురుభక్తిని చాటుకున్నవాడు ఉదంకుడు.
6.2 శుక్రుడు-కచుడు:
ఆదిపర్వం తృతీయాశ్వాసంలో ఈ కథ వస్తుంది. సుఖార్జీచేత్ త్యజేత్ విద్యా, విద్యార్థి చేత్ త్యజేత్ సుఖం అని శాస్త్ర వాక్యం. విద్య కావాలంటే సుఖాన్ని విడిచిపెట్టాలి, సుఖం కావాలంటే విద్యను వదలి పెట్టెయ్యవలసిందే. పట్టుదల ఉంటే ఎలాంటి విద్యనైనా సాధించవచ్చునని కచుడి వృత్తాంతం తెలియజేస్తోంది. దేవతల గురువైన బృహస్పతి కుమారుడు కచుడు దేవదానవుల యుద్ధంలో చనిపోయిన రాక్షసులను తన మృత సంజీవనీ విద్యవలన బతికిస్తున్న శుక్రుడి దగ్గర విద్య నేర్చుకొమ్మని కచున్ని పంపిస్తారు.
కచుడు శుక్రుడి దగ్గరకు వెళ్ళి దాపరికం లేకుండా తానెవరో, ఏ పనిమీద వచ్చాడో వివరించి చెప్పాడు.
“ఏను కచుండనువాడ మ
హా నియమ సమన్వితుడ, బృహస్పతి సుతుడన్
మానుగ వచ్చితి నీకును
భాను నిభా! శిష్యవృత్తి బని సేయంగన్”7
ఇలా చెప్పిన కచున్ని శిష్యుడిగా అంగీకరించిన శుక్రుణ్ణి రోజూ సేవిస్తున్న కచున్ని రాక్షసులు చంపి, కాల్చి బూడిద చేసి శుక్రాచార్యుడికి సుర (మద్యం)లో కలిపి ఇచ్చేస్తారు. కచుడు వస్తేగాని భోజనం చేయనని దేవయాని అంటే, దివ్యదృష్టితో చూసి, ఉదరంలో నున్న కచుడికి సంజీవనీ విద్యను నేర్పుతాడు. కడుపు చీల్చుకుని బయటకు వచ్చిన కచుడు ఆ విద్యతో శుక్రుణ్ణి మళ్ళీ బతికిస్తాడు. ఇంతటి నష్టానికి కారణమైన మద్యపానం వ్యసనమై జనులకు చేటు కలిగిస్తుందని శుక్రుడు, ఇకపై ఎవరూ సురాపానం చేయకూడదని కట్టడి చేశాడు.
“భూసురు రాదిగ గల జను
వీసుర సేవించిరేని యిది మొదలుగ బా
పాసక్తి పతితులగుదురు
చేసితి మర్యాద దీని జేకొనుడు జనుల్”8
ఈ విధంగా ఒకరికొకరిని బతికించుకున్న గురుశిష్యులుగా శుక్రాచార్యకచులు గురుశిష్య సంబంధాన్ని నిరూపించుకున్నారు. అలాగే పరశురామ-భీష్మలు, ద్రోణాచార్య- అర్జునులు, బలరామ-దుర్యోధనులు గురుశిష్య సంబంధాన్ని నిలిపిన వారిగా నన్నయ రచనలో కనిపిస్తారు.
7. భార్యా-భర్తల సంబంధాలు:
భారతీయ సంప్రదాయంలో భార్యాభర్తల బంధానికి ఒక విశిష్టమైన స్థానముంది. ప్రపంచ చరిత్రలోనే ఇంతటి పటిష్టమైన వ్యవస్థ మరొకచోట కనపడదు. మహాభారతంలో ఈ బంధానికి సంబంధించిన సంఘటనలు చాలా కనబడతాయి. ఇందులో రురుడు-ప్రమద్వర, జరత్కారువు-జరత్కారుడు, శకుంతలా దుష్యంతులు పాండురాజు కుంతిమాద్రి, దీర్ఘతముడు - ప్రద్వేషింగి వంటి వివిధ బంధాలు కనిపిస్తాయి.
8. ముగింపు:
- మానవ జీవితం సుఖసంతోషాలతో ముందుగు సాగాలంటే మానవ సంబంధాలు అత్యవసరం.
- ఈ మానవ సంబంధాలు కష్టసుఖాలలో తోడునీడగా ఉంటూ మనిషి యొక్క సమగ్రాభివృద్ధికి తోడ్పడతాయి.
- నన్నయ రచించిన మహాభారతంలో కూడా ఈ మానవ సంబంధాలు చక్కగా తీర్చిదిద్ది తర్వాతి కవులకు మార్గదర్శి అయ్యాడనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
9. పాదసూచికలు:
- ఆది - 10 ఆశ్వా -131వ పద్యం
- ఆది - 2 ఆశ్వా -172వ పద్యం
- ఆది - 3 ఆశ్వా - 187వ వచనం
- ఆది - 3 ఆశ్వా- 163వ పద్యం
- ఆది - 4 ఆశ్వా - 66వ పద్యం
- ఆది - 4 ఆశ్వా - 199వ పద్యం
- ఆది -3 ఆశ్వా - 108వ పద్యం
- ఆది -3 ఆశ్వా -121వ పద్యం
10. ఉపయుక్తగ్రంథసూచి:
- చంద్రశేఖరమ్, కట్టమూరి. ఆంధ్రమహాభారతము – మానవసంబంధాలు, యాజీ పబ్లికేషన్స్, గరివిడి, 2015.
- రామకృష్ణయ్య, కోరాడ. ఆంధ్రభారతకవితావిమర్శనము. గంగాధరపబ్లికేషన్స్, విజయవాడ, 1981.
- లక్ష్మీరంజనం, ఖండవల్లి, బాలేందుశేఖరం, ఖండవల్లి. ఆంధ్రులచరిత్ర-సంస్కృతి, టాగూరు పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2008
- సీతారామాచార్యులు, బహుజనపల్లి. శబ్దరత్నాకరము. ఏషియన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, న్యూఢిల్లీ, 1988
- సుబ్రహ్మణ్యం, జి.వి., (సంపా.) కవిత్రయ విరచిత శ్రీమదాంధ్రమహాభారతము. మొదటి సంపుటం, తి.తి.దే. ప్రచురణ, తిరుపతి, 2008.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.