AUCHITHYAM | Volume-5 | Issue-1 | January 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
16. రేకపల్లి సోమనాథకవి ‘రుక్మవతీ పరిణయము’: వర్ణనాసౌందర్యం
డా. కళ్ళేపల్లి ఉదయ్ కిరణ్
సహాయాచార్యులు (ఒ), తెలుగుశాఖ,
డా. బి. ఆర్. అంబేద్కర్ విశ్వవిద్యాలయం- శ్రీకాకుళం,
ఎచ్చెర్ల, శ్రీకాకుళం, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9494188200, Email: udaykiran188200@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
కళింగాంధ్ర కవులలో అడిదము సూరకవి సమకాలికుడైన రేకపల్లి సోమనాథకవి ప్రద్యుమ్న విజయము, రుక్మవతీపరిణయము కావ్యాలని రచించాడు. తెలుగు సాహిత్యంలో అటు శాస్త్ర పాండిత్యం, ఇటు సాహిత్యసృజన రెండింటిలోనూ ప్రవేశం ఉన్నవారు అరుదు. అటువంటివారిలో కళింగ ఆంధ్రకవి అయిన రేకపల్లి సోమనాథకవి ఒకరు. శాస్త్రపాండిత్యం కల వారి రుక్మవతీ పరిణయము రచనలో కవిత్వ విషయమైన వర్ణనలు ఏ విధంగా నిక్షిప్తం చేశారో పరిశీలించటం ఈ వ్యాస ప్రధాన ఉద్దేశ్యం. వర్ణన అంటే ఏమిటో వివధ అలంకారికుల అభిప్రాయాలని ప్రస్తావిస్తూ, ప్రధాన వర్ణనల విషయంలో ఎక్కువమంది ఆమోదించినవాటిని పరిచయం చేశాను. అష్టాదశ వర్ణనలలో కుమారోదయ వర్ణన, వివాహవర్ణన, నాయికావర్ణన, యుద్ధవర్ణనలతో పాటు కథలో భాగంగా చేసిన ఇతర వర్ణనలని పరిచయం చేశాను. శాస్త్ర పండితుల కావ్యరచన కవుల కావ్య రచనల మధ్య వ్యత్యాసాన్ని తెలపడానికి ప్రయత్నం చేశాను. రేకపల్లి సోమనాథకవి రుక్మవతీ పరిణయములో వర్ణనలు కథను అనుసరించి సాగలేదని, ఒక ఆశ్వాసంలో వర్ణనలకే అధిక ప్రాధాన్యం ఇచ్చి కథ ముందుకు సాగకుండా చేశాడని గమనించాను. అయినప్పటికీ “అలసత కూడదు ఇంచుకయు అధ్యయనంబున” అన్న మాటలకు సాక్ష్యంగా నిలిచిన అతని కృషిని తెలియజేయాలనుకున్నాను.
Keywords: ప్రాచీనసాహిత్యం, ప్రబంధం, రేకపల్లి సోమనాథకవి, రుక్మవతీపరిణయము, వర్ణనలు.
1. ఉపోద్ఘాతం:
ప్రద్యుమ్న విజయము, రుక్మవతీ పరిణయము కావ్యాలను రాసిన రేకపల్లి సోమనాథకవి నివాస స్థలం కాకర్లపూడి రాజుల వారి రాజధాని అయిన సత్యవరం. ఇతని అసలు పేరు సోమప్ప శాస్త్రి. ఇతని తండ్రి జీవనం గడవక స్వస్థలమయిన తాళ్ళపూడి నుండి సత్యవరమునకు వలస వచ్చాడు. సోమనాథకవి వేద, తర్క, వ్యాకరణాది శాస్త్ర పాండిత్యం చేత కాకర్లపూడి గోపాలరాయ పాయకరావు అనుగ్రహం పొంది వారి ఆస్థానకవిగా నియమితుడయ్యాడు.
రాజాశ్రయాన్ని సుదీర్ఘకాలం నిలుపుకోవటానికి పండితునిగా కంటే కవిగానే మెండైన అవకాశం ఉందని గ్రహించిన సోమనాథకవి వెలివల గౌతమరాజు అను వాని దగ్గర తెలుగులో కవిత్వ రచన చేయుటలో శిక్షణ పొంది కవిగా అవతరించాడు.
ఈ కవి అడిదము సూరకవి సమకాలికుడు. కాకర్లపూడి రాజులు ఏ కారణము చేతనో సోమనాథకవి యెడల విముఖులగుట చేత ఇతడు కొంతకాలం విజయనగర రాజుల ఆశ్రయము పొందినట్లు తెలుస్తోంది. ఆ సమయంలోనే అడిదము సూరకవికి, ఇతనికి పొరపొచ్చాలు ఏర్పడ్డాయి. ఒకరిపట్ల ఒకరు ఈర్ష్య కలిగి పరస్పరం నిందించుకుంటూ చెప్పిన పద్యాలు అడిదము రామారావు తన “విస్మృత కళింగాంధ్ర కవులు” రచనలో పొందుపరిచారు.
“తెలుఁగు కవిత్వపు మర్మము
కలనెఱుఁగని శుష్క తర్క కర్కశ మతికిన్
దెలిసెనొక యించుకించుక
వెలివల గౌతన్న కృపఁ గవిత్వపుజాడల్”[1]
అని అడిదము సూరకవి సోమనాథకవిని కలలో కూడా తెలుగు కవిత్వములో ఉండే మర్మము తెలియనివాడని, వట్టిపోయిన తర్కబుద్ధి కలిగి, గౌతమరాజు ద్వారా కొద్దిగా మాత్రమే కవిత్వం గురించి తెలుసుకున్నాడని ఆక్షేపించాడు.
“తర్క కర్కశ బుద్ధులై తగినవారి
కేమసాధ్యమటంచు నూహింప రాదె?
తెలుఁగు ముక్కలు నాల్గైదు తెలిసి తాము
కవులమనుకున్న వెఱపాడఁగట్లు మదిని”[2]
తర్కాది శాస్త్రాలు చదివిన వారికి అసాధ్యమయినది ఏదీ ఉండదని, తెలుగులో నాలుగైదు ముక్కలు తెలిసినవారే కవులమని నిర్భయంగా చాటుకొంటుండగా, వారి కంటే తాను తక్కువ కాదని సూరకవి ఆక్షేపణను తిప్పికొట్టాడు. సమగ్రాంధ్ర సాహిత్యంలో ఆరుద్రగారు ఇందుకు భిన్నమయిన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు.
“సత్యవరం సంస్థానంలోనే కాక ఇతర సంస్థానాలకు కూడా సోమనాథకవి వెడుతూ ఉండేవాడు. విభూతి కుండలాలు ధరించి పుస్తకాలు చంకన పెట్టుకుని శిష్యులతో సంచారం చేసేవాడు. ఎవరు ఎంత చక్కని శ్లోకం చెప్పినా, పద్యం చెప్పినా సోమనాథం తప్పులు పట్టేవాడు. సభలో ఉన్న ప్రతి ఒకడినీ ‘ఇతడు పండితుడు కాడు’ ‘ఇతడు తార్కికుడు కాడు’ ఇతడు శాబ్దికుడు కాడు’ ‘ఇతడు సత్క్రియా రసజ్ఞుడు కాడు’ అని చులకనగా కొట్టిపారేసేవాడు. ఒకసారి అదిడం సూరన్నతో ఇతనికి పేచీ వచ్చింది.”[3] అని వేరొక కోణంలో వారిరువురికి కలిగిన స్పర్ధ గురించి వివరించాడు.
అయిననూ “సోమప్ప శాస్త్రి గొప్ప పండితుఁడేగాని కవిత్వమునం దెక్కుడు ప్రజ్ఞ కలవాఁడుగాఁగన్పట్టఁడు.”[4] అని అతని రచనను పరిశీలించినట్లయితే తెలుస్తుందని అడిదము రామారావు చెప్పటం సూరకవి ఎదుట సోమనాథకవి కొంచెం తక్కువే అని అర్థమవుతుంది.
శాస్త్రంలో, సాహిత్యంలో సోమనాథకవికి ప్రావీణ్యం కలదని అతని జీవిత విశేషాలను బట్టి, సూరకవితో అతనికి జరిగిన వాదన బట్టి తెలుస్తోంది. ఉభయ ప్రావీణ్యం కలిగిన తెలుగు కవులలో సోమనాథకవి ఒకరు. మొదటగా సృజనాత్మక విషయమయిన కవిత్వ రచన చేయగల సమర్ధులు తదనంతర కాలంలో ఛందోవ్యాకరణాది శాస్త్రాలను నేర్చుకోడానికి ప్రయత్నించినా అది వారికి కొంత సులభంగా ఉంటుంది. కారణమేమిటంటే కవిత్వరచనలో వ్యాకరణాది శాస్త్రాల పట్ల అవగాహన తప్పనిసరి కావటమే. కానీ మొదటగా వేద, తర్క, వ్యాకరణాది శాస్త్రాలలో నిష్ణాతులయినవారు సృజన వ్యాపారమయిన సాహిత్య రచనకు పూనుకొని దానిని సాధించుట కొంత కష్టతరం. ఎందుకనగా శాస్త్రము బుద్ధి వ్యాపారంపై ఆధారపడిన నియమసంబంధి. కవిత్వరచన హృదయవ్యాపారంపై ఆధారపడిన సృజన సంబంధి. అందువలన శాస్త్రాన్ని మొదటగా నేర్చుకున్నవారు ఆయా నియమాలను రచనలో ఇముడ్చుతూ రచన చేయటానికి ప్రయత్నిస్తారే కానీ దానిలో సహజత్వాన్ని సాధించటం కష్టసాధ్యమయిన కార్యం. కవులు అలా కాకుండా నియమాలను పాటిస్తూనే కథాగమనం, పాత్రచిత్రణ, సన్నివేశ కల్పన, సంభాషణాచాతుర్యం, రసపోషణాదిసృజన వ్యాపారాలను నిర్వహించే సామర్ధ్యం కలవారు. కనుక శాస్త్రకారుల, కవుల రచనలలో వ్యత్యాసము కనిపిస్తుంది.
శాస్త్ర పండితుడైన రేకపల్లి సోమనాథకవి తన కావ్య ఆరంభంలో కవులతో పాటు భాషా శాస్త్ర నిపుణులను కూడా ప్రస్తావించాడు.
“అక్షపాద, కణాద, జైమిని, పాణిని, పతంజలి ప్రభృతులను స్తుతించిన (13 – 14వ - 1 అ.) కవి శాస్త్ర పండితుడైనను కావ్యమునందు పాండిత్య ప్రదర్శనము లేకపోవుట విశేషము.”[5] అని కొర్లపాటివారు చెప్పటంలో రెండు అంశాలని గమనించాలి.
- ఈ కవి కావ్యారంభంలో తక్కిన కవులకు భిన్నంగా పూర్వ శాస్త్రపండితులని తలవటం.
- సోమనాథకవి తన గొప్పతనాన్ని చాటడానికి పాండిత్యాన్ని ప్రదర్శించకపోవటం.
ప్రబంధాలు దాదాపు ఈ శతాబ్దం తరువాత కనుమరుగయిపోయాయి. అంటే ఈ రచనలు ప్రబంధాల అంత్య దశ. అందులోనూ రేకపల్లి సోమనాథకవి తొలుత శాస్త్రకారుడయి ఉండి తన రచనలో పాండిత్య ప్రకర్ష లేకుండా తన రచన అయిన “రుక్మవతీ పరిణయము” ప్రబంధంలో వర్ణనలను ఏ విధముగా నిర్వహించాడో పరిశీలించటం ఈ వ్యాస ప్రధానోద్దేశ్యం.
2. వర్ణన - వివిధ అభిప్రాయాలు:
అగ్ని పురాణంలో వర్ణనల ప్రసక్తి ఉంది. “కావ్యస్థానము (వర్ణనలు)లిందు విభావములుగా పరిగణింపబడినవి. రుద్రటుడు వీనిని కావ్యస్థానములనెను. భోజుఁడు సరస్వతీ కంఠాభరణమునందు వీనినే అర్థాలంకారములనెను. హేమ చంద్రుడు కావ్యాశాసనమునందు “శబ్దార్థవైచిత్ర్యోపేతం కావ్యమ్” అని చెప్పి యీ వర్ణనలను భయ వైచిత్ర్యములతో జేర్చి చెప్పెను.”[6] ఈ విధంగా వర్ణనల గురించి వివిధ అలంకారికులు తమ అభిప్రాయాన్ని వెల్లిబుచ్చారు.
2.1 వర్ణనలు ఎన్ని:
వర్ణనలు ఎన్ని అనే ప్రశ్నకి రకరకాల సమాధానాలున్నా ఎక్కువమంది అంగీకరించేది దండి ప్రతిపాదించిన 18 వర్ణనలనే.
“నగరార్ణవ శైలర్తు చన్ద్రార్కోదయ వర్ణననైః
ఉద్యాన సలిలక్రీడా మధుపాన రతోత్సవైః
విప్రలమ్బై ర్వివాహైశ్చ కుమారోదయ వర్ణనైః
మన్త్ర ద్యూత ప్రయణాజి నాయకాభ్యుదయై రపి”[7] దండి నగర, సముద్ర, పర్వత, ఋతు, చంద్రోదయం, సూర్యోదయం, ఉద్యాన, సలిల క్రీడ, మదుపనం, రతి, విప్రలంభం, వివాహం, కుమార జననం, మంత్రం, ద్యూతం, ప్రయాణం, యుద్ధం అని 18 వర్ణనలని చెప్పాడు.
కథను పెంచి పోషించటంలో, రసపుష్టిని కలిగించటంలో వర్ణనల పాత్ర అధిక ప్రాధాన్యం కలిగి ఉంది. కనుక ప్రబంధంలో వర్ణనలకు కూడా తగిన ప్రాధాన్యం ఉండాలి. “వర్ణనలు కథాగతిని బెంచునవియై యుండవలయునే గాని దానిని నిరోధించునవియై యుండరాదు. ఇది వర్ణనల యెడఁ గవి పాటించవలసిన మొదటి ధర్మము. వర్ణమాన వస్తువు స్ఫురణకు రాక వర్ణనా పద్ధతిపై మనసు పోయినప్పుడా వర్ణనలు కావ్య సౌందర్య భంజకములనియే తలంపనగును.”[8] అన్న ఆచార్య కె. వి. ఆర్. నరసింహంగారి మాటలు ఈ ప్రబంధానికి ఆపాదించినప్పుడు కథాగమనానికి వర్ణనలు అక్కడక్కడా అడ్డు నిలిచినట్లుగా గోచరిస్తుంది.
3. సోమనాథకవి వర్ణనాసౌందర్యం:
ప్రద్యుమ్నుడు శంబరాసురుని సంహరించిన వృత్తాంతం, రుక్మి కూతురైన రుక్మవతిని వివాహమాడటం అనే రెండు ప్రధాన కథలుగా ఈ ప్రబంధ కావ్య ఇతివృత్తము ఉంది. కవిత్వములో ఎక్కువ ప్రజ్ఞ ఇతనికి లేదనే విమర్శ అడిదము రామారావుగారి మాటలలో తెలిసిన పిదప రేకపల్లి సోమనాథకవి కవిత్వంలో గల వర్ణనలను గురించి పరిశీలించటం నూతన దృష్టిగా తోచింది. కాగా వర్ణనల విషయంలో విచిత్ర పదప్రయోగం, సంస్కృత భూయిష్టమయిన పద్యాలు ఇతని రచనలో అక్కడక్కడా కనిపిస్తాయి. అటువంటి వాటిలో ఒక ఉదాహరణగా ఈ కింది పద్యము చెప్పదగినది.
3.1 కుమారోదయ వర్ణన:
“ప్రొద్దులు నిండినంత పరిపూర్ణ శుభావహ భావ భాగ్విభా
స్వద్దిననాథ పూర్వక నవగ్రహమాలిక తేజ మందగా
నద్దివిజాళి కల్పక లతాంత నిరంతర వృష్టి నింప న
మ్ముద్దియ బాలుఁగాంచె, నవమోహన రూపక కళావిశాలునిన్”[9]
నిండైన శుభసమయంలో నవగ్రహాలతో కూడి సూర్యుడు తేజస్వరూపుడై ఉండగా, స్వర్గలోకతరువులు పువ్వుల వర్షం కురిపిస్తుండగా రుక్మిణీదేవి ప్రద్యుమ్నుని ప్రసవించిందని తెలిపే పై పద్యములో లోక వ్యవహారమయిన నెలలు నిండుట అను పదానికి కవి “ప్రొద్దులు నిండినంత” అని ప్రయోగించటం వినూత్న ప్రయోగంగా కనిపిస్తుంది. అదే విధంగా సంస్కృతపదభూయిష్టంగా కూడా ఈ పద్యం కనిపిస్తుంది.
“సోమప్ప కవి కవిత్వము మూఁడు పాళ్లు సంస్కృతము; ఒక పాలు తెలుగు”[10] అని తేల్చి చెప్పిన అడిదము రామారావుగారి ఊహ ప్రస్తావించదగినది.
ప్రద్యుమ్నుని జననం వలన లోకానికి ఉదయమయిందని తెలుపుతూ కవి చేసిన ప్రాకృతిక వర్ణనను ఈ కింద పద్యం తెలుపుతుంది.
“అలజడినొంది వాడె కుముదాళులు సద్విజరాజసూ క్తి వి
చ్చలవిడి నుల్లసిల్లె దిగజారెఁదమంబు జగంబునందు శ్రీ
గలిగెను నీరజస్థితికిఁగా౦తి పరంపర మీఱె,రుక్మిణీ
బలరిపు దిక్ప్ర సూత నవపంచశరార్కు మహోదయంబునన్.”[11] జగానికి సూర్యుడు లేకపోతే సంపద లేదు. ప్రాణులన్నిటిలో అతడు దయారూపడై ఆహారాన్ని అందిస్తున్నాడు. శత్రువుల పక్షం వైపు తీక్షణత చూపిస్తాడు అనే లక్షణాలు ప్రద్యుమ్నుని యందు ఆరోపితమయ్యాయి. వెన్నెలలు వాడిపోయాయని, పక్షులు సంతసించాయని, చీకట్లు జారిపోయాయని, కమలములకు ఔన్నత్యం కలిగిందని, జగానికి సంపద కలిగిందని సూర్యోదయము వలన జరిగే క్రియలన్నీ ప్రద్యుమ్నోదయము వలన జరిగాయని చేసిన వర్ణన వారిరువురికి అభేదత్వం కల్పించింది.
3.2 నాయికావర్ణన:
రుక్మవతి జన్మించినపుడు అలతి అలతి పదాలతో తేటగీతిలో కవి చేసిన వర్ణన ఆమె సౌందర్యాన్ని పరిపూర్ణంగా తెలియజేస్తుంది.
“అమిత సౌందర్య రేఖా సమగ్రలీలఁ
బొలుచు నాకన్య సంతత స్ఫురణరత్న
దీపనలరీతి రుక్మి పార్ధివవరేణ్యు
భవనమెల్లను దీపింపఁ బ్రభఁదలిర్చె”[12]
ఇంటికి అంతటికి వెలుగులు ప్రసరింపచేసే రత్నముల మాదిరిగా రుక్మి కూతురు వలన ఆ ఇంటికి శోభ కలిగిందని చెప్పటంలో ఆమె బాల్య సౌందర్యంతో పాటుగా అతని జీవితంలో ఆమెకు గల ప్రాధాన్యం కూడా స్ఫురిస్తుంది.
“తిమిరపు నైగనీగ్యముల తేటలు కాటుక కప్పు నిగ్గు లిం
ద్రమణి దళోత్కరద్యుతులుదగ్రత భాసిలు శైవలంబు నం
దమరిన నాఁటికిం దలప నంబురుహాస్య శిరోజపాళి దా
సమత నొసంగ దెంతయును సంతతవక్రతమ స్వభావాయై.”[13]
రుక్మవతి కురులను వర్ణిస్తూ కవి ఈ పద్యాన్ని చెప్పాడు. ఆమె కురులు చీకటి వంటి నిగనిగలతో కాటుక నల్లదనపు కాంతితో ప్రకాశిస్తున్నాయని సహజసిద్ధ వర్ణన చేసాడు కవి.
రుక్మవతి సౌందర్యం యవ్వనంలో ఏ విధంగా ఉందో కవి ఈ కింది పద్యంలో తెలిపాడు.
“తామర చూలి హేమము సుధారసయుక్తి మనోభవ ప్రతా
పామిత వహ్ని కీలల సమగ్రపుటం బొనరించి మార్దవ
శ్రీ మహిమాప్తి నాసతి సృజింపఁగఁబోలును గాక కల్గునే
యా మహనీయ కోమలతరంగ విభావిభవాతి రేకముల్.”[14]
ఆ బ్రహ్మదేవుడు బంగారాన్ని, అమృతాన్ని, మన్మథుని ప్రతాపాగ్నిని సమపాళ్ళల్లో రంగరించి ఆ రుక్మవతిని సృష్టించాడేమో లేకపోతే అంతటి సౌందర్యకాంతి కలగదని వర్ణించటంలో ఆమెను సృష్టించటంలో ఆ దేవుడు ప్రత్యేకదృష్టి నిలిపినట్లు వివరించాడు.
3.3 యుద్ధ వర్ణన:
రతీదేవి మాయావతి అను పేరుతో ఆ శంబరాసురుని రాజ్యంలో నివసిస్తూ ఆ బాలుని తన పతిగా ఎరిగి, అతనికి రక్షణ కల్పించి పెద్ద చేసి అతనిని యుద్ధ సన్నద్ధునిగా తయారు చేసింది. ప్రద్యుమ్నుడు శంబరాసురుని యుద్ధానికి పిలిచినపుడు సోమనాథకవి చేసిన వర్ణన ఇది.
“ఓరి నిశాచరాధమ మహోదధిన న్బడవై చితింక నిన్
ఘోరరణాబ్ధిలోనఁ బడఁ గ్రుమ్మెద రమ్మని ముమ్మలించి వేఁ
జీరిన శంబరుండు దరి శ్రీఘ్రమ యుగ్ర గదాగ్రహస్తుఁడై
భూరి సమీరణుం డచలముంబలె మారునెదిర్చి యార్చుచున్”[15]
తనను సముద్రములో పడవేసిన శంబరాసురుని యుద్ధమనే సముద్రములో వేసి అణచివేస్తానని ప్రద్యుమ్నుడు పలకటంలో అతని పగ ప్రస్ఫుటమవుతుంది.
3.4 వివాహ వర్ణన:
మేనమామ కూతురయిన రుక్మవతిని ప్రద్యుమ్నుడు కాక వేరెవరు పొందగలరని అంటూ సోమనాథకవి చెప్పిన పద్యం కృష్ణుడి వివాహ ఘట్టాన్ని కూడా గుర్తు చేస్తుంది.
“హరి తనయుఁడేగుదెంచిన
ధర నన్యుల కేలగలుగుఁ దరుణీ మణి! మున్
హరిగొని పోవఁడే రుక్మిణి
ధరణీవరకోటిఁ గెలిచి దర్పమెలర్పన్.”[16]
ఇపుడు వచ్చిన కృష్ణుని కొడుకు ఆ రుక్మవతిని వేరే రాజులకు ఎందుకు వదులుకుంటాడు. ఇంతకు ముందు అతని తండ్రి రుక్మి సోదరి అయిన రుక్మిణిని తీసుకుపోలేదా? అని తండ్రి వివాహ ఘటాన్ని కొడుకు వివాహముతో పోలుస్తూ కవి వారి పరిణయాన్ని వర్ణించిన తీరు సబబుగా తోస్తుంది.
ఇటువంటి అష్టాదశ వర్ణనలతో పాటు ఇతర వర్ణనలు కూడా సందర్భోచితంగా ఈ కావ్యంలో కవి పొందుపరిచాడు.
తన మరణం ప్రద్యుమ్నుని వలన జరుగుతుందని తెలుసుకున్న శంబరాసురుడు పసిబిడ్డగా ఉన్నపుడే ఆ పిల్లవాణ్ణి సముద్రంలో పడవేయగా ఒక చేప ఆ బాలుని మింగింది. అరుదైన ఆ చేప జాలరులకు చిక్కగా శంబరాసునికి బహుమతిగా ఇచ్చారు. వండటానికి ఆ చేపని కోసినపుడు ఆ చేప గర్భంలో ప్రద్యుమ్నుడెలా ఉన్నాడో కవి ఇలా వర్ణించాడు.
“వంట కనుకూలమగుటకై వ్రక్కలిడఁగ
ముత్తియపుఁ జిప్పలోపల ముత్తియంబు
కరణిఁ, గననయ్యె ననిమిష గర్భమునను
బాల భాస్వత్ప్రతీకాశ బాలకుండు.”[17]
వంటకు అనుకూలమైన రీతిలో ఆ చేపను కోయగా ముత్యపు చిప్పలోన ముత్యం వలె ఆ చేప గర్భంలో ప్రద్యుమ్నుడు ప్రకాశిస్తున్నాడని చెప్పటంతో ఆ సన్నివేశం కళ్ళ ముందు కదలాడుతుంది.
శంబరాసురుని సంహరించబోయే ప్రద్యుమ్నుడు బాలుడిగా ఉన్నపుడే ఆ రాక్షసుని ఇంట్లో చేరుతాడు. మయావతి పేరుతో ముందుగానే అక్కడకి చేరిన రతీదేవి తన పతి అయిన మన్మథుడే ప్రద్యుమ్నుడిగా అవతరించాడని ఎరిగి ఆ బాలుడిని సంరక్షిస్తుంది. ఆ బాలుడిని రతీదేవి చూసినపుడు కవి చేసిన వర్ణన అవినాభావ సంబంధం అంటే ఏమిటో తెలిపేలా ఉంది.
“సీ.వదనాంబుజంబుపై వ్రాలించు చూడ్కులు - మదమిళిందంబులై మరలకుండుఁ
జీరునవ్వువెన్నలఁ జేర్చినకన్నులు - స్థిర చకోరంబులై తిరుగకుండు
లావణ్య సరసి నాలంబించు దృష్టులు - వన్నెయౌ కలువలై వాడకుండుఁ
బ్రేమ నిధానమో ప్రియుఁజెందు వీక్షులు - వరఖండ జనంబులై వదలకుండు
నిటుల చారవిప్రయుక్త సంఘటిత కాంత
మోహకలనాప్తి సూచనోత్సాహయైన
రతికిఁ దమి మించి జనియించె రమణుపైని
ప్రథమదశయైన దృక్సంగ భావమపుడు.”[18]
రతీదేవి చూపులకి, ప్రద్యుమ్నుని ముఖానికి అవినాభావ సంబందాన్ని చెపుతూ బాలుడిగా ఉన్న తన పతిని చూసి రతీదేవి పొందిన ఆనందాన్ని పై పద్యంలో కవి వివరించాడు. మన్మథుని ముఖకమలం పై రతీదేవి చూపులు మదించిన తుమ్మెదలవలె, అతని నవ్వుల వెన్నెలను తాగే చకోరపక్షుల వలె, అతని ముఖసరస్సులో ఆమె చూపులు కలువులై ఉన్నాయని కవి వర్ణించాడు.
రుక్మవతిని స్వయంవర మండపానికి చెలికత్తెలు తీసుకొని రాగా ఆమె అందం అక్కడికి వచ్చిన రాజుల మనసులని ఏ విధముగా దోచుకుందో ఈ పద్యంలో కవి అందంగా వ్యక్తీకరించాడు.
“రమణి వదనేందు చంద్రికా ప్రసరమునను
రాజమణిసంఘముల మనోరాజమణులు
గరఁగి ప్రవహించి శేషాంగ నిరుపమాన
సరస లావణ్య సాగర సక్తిఁజెందె.”[19]
ఆమె ముఖం నుంచి వెలువడుతున్న చంద్రకాంతి వలన రాజుల మనసులనే మణులు కరిగిపోయాయి. మిగిలిన వారి శరీరాలు ఆమె అందమనే సముద్రంలో ఒకటయిపోయాయని చెప్పటం చేత స్వయంవరానికి వచ్చిన రాజులందరూ తమని తాము కోల్పోయారని కవి సూటిగా చెప్పాడు.
4. ముగింపు:
- “రుక్మవతీ పరిణయము”లో అధికంగా శబ్దాలంకార ప్రయోగాలున్నాయి. సంస్కృత పదాడంబరం మెండుగా ఉంది.
- స్వతహాగా కవి కాకపోవటం చేత వర్ణనలని తగిన విధంగా కథాగమనంలో ఉపయోగించుకోలేకపోయాడు. అందువల్ల చతుర్ధాశ్వాసంలో కథాగమనం మందగించి వర్ణనలు ఒక ప్రవాహముగా సాగిపోయినట్లు సులభముగానే తెలిసిపోతుంది.
- అయిదశ్వాసాల ప్రబంధంలో ప్రద్యుమ్నుడిని శంబరాసుర వృత్తాంతములో మహావీరునిగా, రెండవ వృత్తాంతమయిన రుక్మవతీ పరిణయములో పెళ్ళికొడుకుగా చూపటంలో కొంత నూతనత కనిపిస్తుంది.
- కళింగకవి మరీ ముఖ్యంగా తొలుత శాస్త్రకారుడై ఉండి తరువాత కవిత్వ రచనకి పూనుకుని సాహిత్య సృష్టికి ఆటంకాలు, పరిధులు లేవని నిరూపించినందుకు రేకపల్లి సోమనాథకవి కృషి సర్వదా అభినందనీయం.
5. పాదసూచికలు:
- విస్మృత కళింగాంధ్ర కవులు - అడిదము రామారావు, పుట. 70.
- విస్మృత కళింగాంధ్ర కవులు - అడిదము రామారావు, పుట. 70.
- సమగ్రాంధ్ర సాహిత్యం , రెండవ సంపుటి. – ఆరుద్ర, పుట. 995.
- విస్మృత కళింగాంధ్ర కవులు - అడిదము రామారావు, పుట. 75.
- తెలుగు సాహిత్య చరిత్ర, అయిదవ సంపుటి – కొర్లపాటి శ్రీరామమూర్తి, పుట. 233.
- ప్రబంధ వాఙ్మయ వికాసము – డా. పల్లా దుర్గయ్య, పుట. 105.
- కావ్యాదర్శం, ప్రథమ పరిచ్ఛేదం - 16 వ శ్లోకం – దండి, పుట. 09.
- ఆంధ్ర ప్రబంధము అవతరణ వికాసములు – ఆచార్య కాకర్ల వెంకట రామ నరసింహం – పుట. 78.
- రుక్మవతీ పరిణయము, ద్వితీయాశ్వాసము -9 వ పద్యము – రేకపల్లి సోమనాథకవి, పుట. 56.
- విస్మృత కళింగాంధ్ర కవులు - అడిదము రామారావు, పుట. 76.
- రుక్మవతీ పరిణయము, ద్వితీయాశ్వాసము- 10 వ పద్యము – రేకపల్లి సోమనాథకవి, పుట . 57.
- రుక్మవతీ పరిణయము, తృతీయాశ్వాసము-23 వ పద్యము– రేకపల్లి సోమనాథకవి. పుట. 84.
- రుక్మవతీ పరిణయము, తృతీయాశ్వాసము-61 వ పద్యము– రేకపల్లి సోమనాథకవి, పుట. 93.
- రుక్మవతీ పరిణయము, తృతీయాశ్వాసము-44 వ పద్యము– రేకపల్లి సోమనాథకవి. పుట. 89.
- రుక్మవతీ పరిణయము, ద్వితీయాశ్వాసము - 51 వ పద్యము – రేకపల్లి సోమనాథకవి. పుట. 67.
- రుక్మవతీ పరిణయము, పంచమాశ్వాసము - 71 వ పద్యము – రేకపల్లి సోమనాథకవి. పుట. 164.
- రుక్మవతీ పరిణయము, ద్వితీయాశ్వాసము - 28 వ పద్యము – రేకపల్లి సోమనాథకవి. పుట. 61.
- రుక్మవతీ పరిణయము, ద్వితీయాశ్వాసము - 39 వ పద్యము – రేకపల్లి సోమనాథకవి, పుట. 64,65.
- రుక్మవతీ పరిణయము, పంచమాశ్వాసము-40వ పద్యము – రేకపల్లి సోమనాథకవి. పుట. 158.
6. ఉపయుక్తగ్రంథసూచి:
- ఆరుద్ర, (2012) సమగ్ర ఆంధ్ర సాహిత్యం, తెలుగు అకాడెమీ, హైదరాబాద్.
- దండి. (1951) కావ్యాదర్శః,ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ, హైదరాబాదు.
- దుర్గయ్య, పల్లా. (2012), ప్రబంధ వాఙ్మయ వికాసము, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్.
- రామారావు పంతులుగారు, అడిదము (1940). విస్మృత కళింగాంధ్ర కవులు, ఆంధ్ర విజ్ఞాన సమితి, విజయనగరము.
- వెంకట రామ నరసింహం, కాకర్ల. (1965). ఆంధ్ర ప్రబంధము అవతరణ వికాసములు, ఆంధ్ర యూనివర్సిటీ ప్రెస్, వాల్తేరు.
- శ్రీరామమూర్తి, కొర్లపాటి. (1991). తెలుగు సాహిత్య చరిత్ర, రమణశ్రీ ప్రచురణలు, విశాఖపట్టణము.
- సోమనాథకవి, రేకపల్లి. (1940). రుక్మవతీ పరిణయము, ఆంధ్ర విజ్ఞాన సమితి, విజయనగరము.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.