headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-1 | January 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

15. ‘వరాహ’ నది: నాగరికత

రామవరపు వేంకట రమణమూర్తి

ప్రోగ్రాం ఎగ్జికూటివ్‌ (రిటైర్డ్),
ఆకాశవాణి, ప్రసారభారతి, భారతప్రభుత్వం.
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9440798301, Email: rvrmurty1@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

వరాహనది ఉత్తరాంధ్రలో ఓ చిన్న నది. ఈ నదికి సంబంధించిన నాగరికత గురించి ఈ వ్యాసం తెలుపుతుంది. వరాహనది భౌతిక, భౌగోళిక స్వరూపస్వభావాలను స్పృశించడం, ఈ నదీ పరీవాహక ప్రాంతాలలో ఉండే వివిధ ప్రాంతాల ప్రాముఖ్యాన్ని తెలపడం, ఈ నదితో ముడిపడిఉన్న చారిత్రక, సాంస్కృతిక విషయాలను క్రోడీకరించి, విశ్లేషించడం ఈ పరిశోధనవ్యాసం ప్రధానోద్దేశ్యం. క్షేత్రస్థాయిపర్యటన, వివిధ ఆధారగ్రంథాలు, అంతర్జాలం సహాయంతో ఈ వ్యాసం రూపుదిద్దుకుంది.

Keywords: వరాహనది, నాగరికత, పరీవాహకప్రాంతాలు, ఆనకట్టలు, చరిత్ర, పర్యావరణం.

1. ఉపోద్ఘాతం:

తల్లి పేదదైనా తల్లి ప్రేమ విలువ పేదది కాదు.” సుసంపన్నులు తమ బిడ్డపై చూపే ప్రేమ ఎంత గొప్పదో అంతే గొప్పది - ఓ పేద తల్లి ప్రేమ. అలాగే నది ‘‘చిన్నదైనా’’ దాని చుట్టూ ఉన్న ప్రపంచానికి ఆ నది అందించే ‘‘నాగరికత-వారసత్వ సంపద’’ మాత్రం పెద్ద నదులతో పోటీ పడగలదు. అందుకే అన్నారు ఓ కవి ‘‘ఏరులన్నీ వేరైనా... నీరంతా ఒకటే’’ అని. అలాగే ఏరులన్నీ వేరైనా అవి అందించే వారసత్వ సంపదల విలువ ఒకటే. అందుకే ఈ రోజు మనం ఆంధ్ర ప్రదేశ్‌లోని ఓ చిన్న నది -దాని గమనం- అది అందిస్తున్న వారసత్వ పరిమళాలు, నాగరికతా విశేషాలను ఓసారి ఆస్వాదిస్తూ వివరాలలోనికి వెళ్దాం. ఆంధ్రరాష్ట్రంలో ఉత్తరాంధ్రప్రాంతంలో ప్రవహించే ఏరే... ‘‘వరాహ.’’ వరాహ అనగానే విష్ణుమూర్తి ఎత్తిన ‘‘వరాహవతారం’’ జ్ఞాపకం వస్తుంది. అంతేకాదు ‘‘వరాహం’’ అనగానే హంపీ విజయనగర సామ్రాజ్య రాజ్యచిహ్నంలో ఉన్న ‘‘వరాహం’’ కూడా గుర్తుకు వస్తుంది. వరాహం అంటే బలానికి చిహ్నం. అలాగే వరాహ పేరుతో ప్రవహిస్తున్న ఈ నది గొప్ప నాగరికతకు చిహ్నంగా నిలుస్తోంది.

2. వరాహనది పుట్టుక - భౌతిక, భౌగోళిక స్వరూపస్వభావాలు:

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతపల్లి మండలంలో చిన్నాయపాలెం - కొండసంత ప్రాంతాల్లో (అంటే సన్నివరం పర్వతప్రాంతాల్లో)1 ఉద్భవిస్తోంది ఈ వరాహ నది. పుట్టిన చోటు నుండి పుత్తడిగైరం పేట, యరకం పేట, గుండుపాల (నర్సీపట్నందరి) గబ్బాడ, బలిఘట్టం, ధర్మసాగరం, అన్నవరం, గిడుతూరు, రామన్న పాలెం, కోటవూరట్ల - కైలాసపట్నం, గొట్టివాడ, ములగలలోవ, ఏటికొప్పాక, సోమదేవుపల్లి, ధర్మవరం, పెనుగొల్లు వరకు ప్రవహించి ఇక్కడ పెనుగల్లు వద్ద రెండు పాయలుగా చీలిపోతోంది వరాహ.

ఒక పాయ వొమ్మిపాలెం, కర్రిపాలెం, వాకపాడు మీదగా సాగిపోతోంది. ఇంకొక పాయ పెనుగొల్లు నుండి సర్వసిద్ధి రాయవరం, ఉప్పరపల్లి, వాకపాడు దాటి వెళ్తూ పిట్టల పాలెం వద్ద మళ్ళీ ఈ రెండు పాయలు కలిసిపోతున్నాయి. ఇలా మళ్ళీ ఒకటైన వరాహ నది బంగారమ్మ పాలెం - రేవువాడాడ (రేవువాతాడ) వద్ద బంగాళాఖాతంలో కలిసిపోతోంది.
వరాహనది సముద్రంలో కలిసే ముందుగా అనకాపల్లి ప్రాంతం నుండి వస్తున్న ‘‘శారద’’ నదిని కలుస్తోంది. అయితే ఏ నదీ... ఇంకో నదికి ఉపనదిగా భావింపబడడం లేదు. రెండూ స్వతంత్ర నదులుగా గుర్తింపబడుతున్నాయి. ఈ రెండు నదులూ సముద్రంలో కలిసే రేవువాతాడ ప్రాంతం యాత్రీకులకు కనువిందుగా ఉంటుంది. ఐతే ప్రస్తుతం ఈ ప్రాంతం భారత నౌకాదళం ఆధీనంలోనికి వెళ్ళిపోవడం వలన ఇక ఆ దృశ్యం చూసే అవకాశం యాత్రీకులకు లేదని చెప్పవచ్చు.

ఇలా ఈ నది రోలుగుంట, గోలుగొండ, నర్సీపట్నం, మాకవరపాలెం, కోట ఊరట్ల, ఎలమంచిలి, యస్‌. రాయవరం మండలాలలో ప్రవహిస్తోంది. గతంలో విశాఖపట్నం జిల్లాలో పుట్టి విశాఖపట్నం జిల్లాలోనే ప్రవహించిన ఈ నది జిల్లాల పునర్విభజనకారణంగా నేడు అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి జిల్లాలలో ప్రవహిస్తోంది. ఈ నది మొత్తం పొడవు 75 కి.మీ. ఉంటుంది. ఈ నదికి ప్రధానమైన ఉపనది సర్పానది. ఇది చింతపల్లి మండలంలో పుట్టి రావికమతం, రోలుగుంట, మాకవరపాలెం మండలాలు మీదుగా ప్రవహించి కోట ఊరట్ల మండలంలో కైలాసపట్నం వద్ద వరాహలో కలుస్తోంది. దీని పొడవు దాదాపు 45 కి.మీ. ఎర్రగెడ్డ, జాజిగెడ్డలు సర్పానదిలో కలుస్తున్నాయి.2 ఇదీ వరాహ భౌతికస్వరూపం.

3. వరాహనదీతీరప్రాంతాలు- నాగరికత:

ఆధ్యాత్మికరంగం, సాహితీరంగం, హస్తకళా రంగాలతోపాటుగా చారిత్రాత్మక గుర్తింపు పొంది ఉంది ఈ నదీపరివాహకప్రాంతం. చూడడానికి చిన్నదిగా ఉండే ఈ నది నాగరికతారూపం మాత్రం పెద్దదే!

3.1 బలిఘట్టం:

ముందుగా ఈ నదీతీరంలో ఉండే ‘‘బలిఘట్టం’’ ఊరు విషయానికి వద్దాం. బలిఘట్టంలోని శివాలయంలోని శివలింగాన్ని బ్రహ్మదేవుడు ప్రతిష్ఠించినందున ఇక్కడి శివలింగాన్ని ‘‘బ్రహ్మలింగేశ్వర స్వామి’’ అని అంటారు. పురాణకాలంలో ఇక్కడ జరిగిన యజ్ఞం కోసం బలిచక్రవర్తి బ్రహ్మను ప్రార్థించి శివలింగాన్ని భూమిపైకి తెప్పించాడు. కృతయుగం నాటి ఈ సంఘటన వల్ల ఇది పవిత్ర ప్రాంతంగా మారి ‘‘బలిఘట్టం’’గా పేరు పొందింది.
వరాహ నదికి ఈ పేరు రావడంలో ఒక కథ ప్రచారంలో ఉంది. ఒక రాజు రోజూ శివునికి పూజ చేసేవాడు. ఒకసారి పూజకు నీరు లభించలేదు. అందుచేత ఆ రాజు విష్ణుమూర్తిని నీటి కోసం ప్రార్థించాడు. మహావిష్ణువు వరాహ రూపంలో దర్శనం ఇచ్చి రాజు కోరిక మేరకు కొండలతో ఒక నదిని పుట్టించి ఈ ఆలయం సమీపం నుండి ప్రవహించేలా అనుగ్రహించాడు. అందుకే ఈ నదికి ‘‘వరహ’’ అన్న పేరు వచ్చిందని ఐహిత్యం. బలిఘట్టంలో శివరాత్రి పర్వదినం బాగా జరుగుతుంది.3

పాకలపాటి గురువు (పూర్వనామం... దామరాజు వెంకట సుబ్బయ్య).4 చివరి రోజుల్లో ఇక్కడే ఉండేవారు. ప్రజల్ని ఆధ్యాత్మిక, సేవా రంగాల్లో నడిపించేవారు. వీరి సమాధి, ఆశ్రమం ఇక్కడ ఉన్నాయి. ఈ బలిఘట్టం దగ్గరే ‘‘చిద్గగనానందస్వామి’’ సమాధి ఉంది. ఈయన రాయలసీమ కడప జిల్లా ప్రొద్దుటూరు తాలూకాలో ఓ గ్రామానికి చెందిన వ్యక్తి. అతని పూర్వనామం వెంకటరెడ్డి. ఆధ్యాత్మిక మార్గంలో నడుస్తూ ‘‘చిద్గగనానందస్వామి’’గా దీక్ష పొంది తన 52 వ ఏట 1936 లో బలిఘట్టం వచ్చి అక్కడ 12 రోజుల పాటు లోకశాంతి కోసం దీక్ష వహించారు. వీరు 1969 జూలై నెలలో సమాధి స్థితి పొందారు.5

3.2 నర్సీపట్నం:

వరాహనదికి సమీపంలో ఉన్న ప్రాంతం నర్సీపట్నం. ఆంధ్రదేశంలో స్వాతంత్య్రసమరకాలంలో ఈ నర్సీపట్నం ప్రస్తావన ఎక్కువగా వస్తుంది. ఆనాటి విశాఖపట్నం, నేటి అనకాపల్లి జిల్లాలో ఉంది నర్సీపట్నం. నర్సీపట్నాన్ని ‘‘గేట్‌ వే ఆఫ్‌ ఏజెన్సీ’’ లేదా ‘‘మన్యం ప్రాంత ముఖద్వారం’’గా భావించవచ్చు. నర్సీపట్నం పేరు వినగానే మనకు జ్ఞాపకం వచ్చేది ‘‘అల్లూరి విప్లవం’’. అల్లూరి సీతారామరాజు మనన్యం విప్లవం (1922-24) ప్రధానంగా తాండవా... వరాహ నదీ పరివాహక ప్రాంతాల్లో ఎక్కువగా సాగింది. అందుకే ఆనాడు ఆంగ్లేయుల సైనిక-పోలీసు స్థావరంగా నిల్చింది నర్సీపట్నం. ఆంగ్లేయ దళాలు ఇక్కడి నుండే చింతపల్లి, కృష్ణదేవిపేట, లమ్మసింగి, గోలుగొండ ప్రాంతాలకు వెళ్ళేవి. దామనపల్లి కొండల వద్ద 1922 సెప్టెంబర్‌లో అల్లూరి సేనతో జరిగిన గెరిల్లా యుద్ధంలో పేరు పొందిన బ్రిటిష్‌ సైనికాధికారులు స్కాట్‌ కోవర్డ్‌, హైటర్‌లు మరణించారు. వీరి మృతదేహాలను నర్సీపట్నంలో బ్రిటిష్‌ ప్రభుత్వం సమాధి చేసింది.6

ఆనాటి విశాఖపట్నం జిల్లా, మన్యంలో గూడెం (గూడెం కొత్త వీధి... జి.కె. వీధి) ముఠా ఉండేది. లాగరాయి ఈ ప్రాంతంలోని ప్రదేశమే. (ప్రస్తుతం అల్లూరి జిల్లా). లాగరాయి విప్లవం 1916 లో లేచింది. అప్పుడు గూడెం ముఠాదారుడుగా ఉన్న మొట్టాడం వీరయ్య దొర (తిరుగుబాటుదార్లు ఎఱ్ఱగొండలో కొంత కాలం ఉన్న సంగతిని చెప్పలేదని) సహకరించలేదని బ్రిటిష్‌ ప్రభుత్వం వీరయ్య దొరని 1917 లో నర్సీపట్నం జైలులో ఉంచింది. తప్పించుకొని మళ్ళీ గూడెం వచ్చిన వీరయ్య దొరను తిరిగి బంధించింది ప్రభుత్వం. తరువాతి కాలంలో వీరయ్య దొర అల్లూరి విప్లవంలో ప్రధాన పాత్ర వహించిన సంగతి తెల్సిందే.6

మాకవరం (సర్పా నదీ ప్రాంతం)లోని కొందరు అల్లూరి విప్లవంలో పాల్గొన్నారు. అటువంటి వారిలో కిమిడి అచ్చెయ్య, సుంకోజి గంగులు వంటి వారికి 5 సంవత్సరాల కఠిన కారాగార జైలుశిక్ష పడింది.6 విప్లవ సమయంలో ఏమాత్రం సహాయపడలేదని ఈ ముఠాని ప్రభుత్వం తీసుకొని ముఠాదారుణ్ణి జైల్లో పెట్టింది.

3.3 ఏటికొప్పాక:

హస్త కళారంగంలో వరాహనదీ తీరంలోని ఒక గ్రామం ప్రపంచ ప్రఖ్యాతి పొందింది. అదే ‘‘ఏటికొప్పాక’’. ఎలమంచిలి చాళుక్య రాజుల కాలం (క్రీ॥శ॥ 1205-1538) లోని రాజనారాయణ కొప్పదేవుని పేరున వరహ ఏటి ఒడ్డున ఏర్పడిన గ్రామమే ‘‘ఏటికొప్పాక’’ గ్రామం. అంటే ఈ గ్రామం 13వ శతాబ్దినాటికే ఏర్పడిన గ్రామం. ఆ రోజుల్లో నక్కపల్లి గ్రామం రథాలు, కొలత పాత్రలు, కుంచాలు (ధాన్యం వంటివి కొలిచే సాధనం) వంటివి తయారు చేయడంలో ప్రసిద్ధి వహించింది. ఈ ప్రాంత కళాకారులు కొందరు ఏటికొప్పాక గ్రామంలో కర్ర బొమ్మల తయారీ ప్రారంభించారు. కాలగతిలో ఈ బొమ్మలు అనేక విధాలుగా రూపు మార్చుకుంటూ నేడు ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘‘ఏటికొప్పాక’’ బొమ్మలుగా మన ముందుకు వచ్చాయి.

ఇలా ఏటికొప్పాక బొమ్మల తయారీ ప్రారంభం అయిన తర్వాత వీటికి విజయనగర సంస్థానం (ఆంధ్రరాష్ట్రం) వారి ప్రోత్సాహం లభించింది. కొండపల్లి బొమ్మలు, నిర్మల్‌ బొమ్మల వలే ఈ ఏటికొప్పాక బొమ్మలు కూడా ఆంధ్రుల హస్తకళా నైపుణ్యానికి గుర్తుగా నిలుస్తున్నాయి. ఈ ప్రాంతంలో ఈ బొమ్మల తయారీకి కారణం ఇక్కడ లభించే ‘‘అంకుడు’’ చెట్లు.

నేడు ఈ ఏటికొప్పాక బొమ్మలు సాంకేతికంగాను, కళాత్మకంగాను ఉన్నత ప్రమాణాలతో తయారు అవుతున్నాయి. ఈ బొమ్మలు 2017లో ‘‘భౌగోళికసూచిక’’ (అంటే జియోటేగ్‌)ని పొందాయి. రసాయనిక రంగులతోనే కాకుండా నేడు సహజ రంగులు (నేచురల్‌ కలర్స్‌)తో కూడా తయారుకావడం వలన ఐరోపా, అమెరికా వంటి దేశాల్లో వీటికి మంచి గిరాకీ ఉంటోంది.7

ఏటికొప్పాకలోని కళాకారులు కొందరు నేషనల్‌ ఇన్నోవేషన్‌ ఫౌండేషన్‌, యునెస్కో (సీల్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ హేండీక్రాఫ్ట్‌) (Seal of Excellence for Handicraft) వంటి వారి నుండి బహుమతులు పొందారు. టాక్సీకొలాగ్‌ ధృవీకరణ (Toxi Colog Certification) 2022 లో వీటికి లభించింది. ఏటికొప్పాక బొమ్మల తయారీతో నైపుణ్యం సాధించి, పరిశోధనలు చేసిన ఆ గ్రామ వాస్తవ్యులు శ్రీ చింతలపాటి వెంకటపతి రాజు గారికి 2023 లో ‘‘పద్మశ్రీ’’ పురస్కారం లభించింది. ‘‘మన్‌ కీ బాత్‌’’ ఆకాశవాణి కార్యక్రమంలో మన ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్రమోదీ ఈ బొమ్మల గురించి సంభాషించారు.

ఆంధ్రరాష్ట్రంలో సహకారరంగంలో తొలిసారిగా ఏటికొప్పాకలో చక్కెర కర్మాగారం 1933లో రిజిస్టర్‌ అయి 1951-52 లో పని చేయడం ప్రారంభించింది.8

ఇంతేకాదు, ఈస్టిండియా పరిపాలన కాలంలో కూడా ఈ ఏటికొప్పాక ప్రాధాన్యత వహించింది. విజయనగరసంస్థానాధీశుడు పూసపాటి ఆనందరాజు (గజపతి) (మొదటి ఆనందరాజు) (1757-1760 పాలనాకాలం) ఫ్రెంచి వార్ని ఓడిరచడానికి సిద్ధం అయ్యాడు. దీని కోసం ఈస్టిండియా కంపెనీ తరఫున సైన్యంతో వచ్చిన కల్నల్‌ ఫోర్డ్‌ కసింకోట వద్ద ఆనందరాజును కలిసేడు. ఇలా ఇద్దరూ కలసి వరాహనదీతీరంలో నున్న ఏటికొప్పాక చేరారు. ఇక్కడ జాన్‌ అండ్రూస్‌ (విశాఖపట్నం ఇంగ్లీషు స్థావరం చీఫ్‌ కౌన్సిలర్‌)తో కలసి యుద్ధానికి సంబంధించిన సంధి చేసుకున్నాడు. ఆనంద గజపతి, కల్నల్‌ ఫోర్డ్‌ ఒప్పందాలపై 1758 నవంబర్‌ 21 న ఒప్పందాలపై సంతకాలు చేసారు. ఇదే చరిత్రలో ‘‘ఏటికొప్పాక’’ సంధిగా పేరు పొందింది. దీని ఫలితంగా ఆంగ్ల-విజయనగర సేనలు చందుర్తి యుద్ధంలో (1758 డిసెంబర్‌ 7న) (గోదావరి జిల్లాలో) ఫ్రెంచి వార్ని ఓడిరచాయి. ఇలా ప్రాధాన్యత వహించిన ‘‘ఏటికొప్పాక సంధి’’ జరగడానికి కారణం ఆనంద గజపతిని దత్తత తీసుకున్న రాణీ చంద్రాయమ్మ (పెద విజయరామరాజుభార్య) పుట్టింటివారైన చింతలపాటి వారి స్వగ్రామం ఏటికొప్పాక కావడం, సైన్యాలకి కావలసిన నీటి వనరుగా వరాహ నది ఇక్కడ ఉండడమే.9

3.4 సర్వసిద్ధి:

వరాహ నదికి సంబంధించిన ఇంకొక చారిత్రక ప్రదేశం ‘‘సర్వసిద్ధి’’... దీని పక్కనే ఉన్న సర్వసిద్ధి రాయవరం. సర్వసిద్ధి గ్రామం పురాతనమైన గ్రామం. బాదామి చాళుక్య చక్రవర్తి రెండవ పులకేశి ఆంధ్ర దేశాన్ని జయించిన సందర్భంగా ఆయన సోదరుడైన కుబ్జవిష్ణువర్ధనుని (కీ॥శ॥ 624-41) ఈ ప్రాంతానికి తన ప్రతినిధిగా నిలిపాడు. పులకేశి మరణం తరువాత విష్ణువర్ధనుడు తూర్పు చాళుక్య రాజ్యస్థాపన చేసాడు. ఇలా 18 సం॥ పాలించాడు. ఈయన తరువాత ఈయన కుమారుడు జయసింహుడు (మొదటి) (క్రీ॥శ॥ 641-73) ఈ ప్రాంతాన్ని పాలించాడు.10 ఈయన తన తండ్రికి ఉన్న బిరుదుతో ‘‘సర్వసిద్ధి’’ పేరుగా ఈ గ్రామాన్ని నిర్మించాడు. మరికొందరు జయసింహుని పేరు పైనే ఈ గ్రామం ఏర్పడిరదని భావిస్తున్నారు.10

విష్ణుకుండినుల కాలంలో, మొదటి వేంగీ రాజుల కాలంలో, సింహాచలంలోని ఒక శాసనంలో ప్లక్కినాడుగా పేర్కొనబడిన ప్రాంతాలలో ఇప్పటి అనకాపల్లి, విశాఖపట్నం, సర్వసిద్ధి తాలూకాలు చేరి ఉన్నాయి.4 అంతేకాదు ప్రక్కినాడు, ప్లక్కినాడు అన్న పేరుతో చాళుక్యుల కాలంలో ప్రసిద్ధి చెందిన ప్రాంతంలోనే ఈ ‘‘సర్వసిద్ధి’’ గ్రామం ఉంది. జయసింహుని తామ్రశాసనాలను పరిష్కరించిన శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మ ప్లక్కినాడు (ప్రక్కినాడు) ఉమ్మడి విశాఖప్రాంతం అనకాపల్లి, సర్వసిద్ధి తాలూకాల ప్రాంతం అని అభిప్రాయపడ్డారు.12 ఎలమంచిలి చాళుక్యుల (1205-1538)లో తలమానికం వంటివాడైన విశ్వేశ్వరచక్రవర్తి 14 వ శతాబ్దం వాడు. ఇతని రాజ్యకాలంలో క్రీ॥శ॥ 1402లో ‘‘సర్వసిద్ధి’’ వద్ద ఆంధ్రేశ్వరులతో ఘోరయుద్ధం జరిగింది. దీని గురించి పంచదార్ల శాసనంలో-

‘‘గతి బహుశక్తి భూమితి మసి
గణయత్సర్వసిద్ధి పదభగ్నం సతి చిత్రభాను
సాక్షిణి ధరణీ వరాహ దధావదంధ్ర బలం’’ అని చెప్పబడింది.

ఇదే విషయాన్ని విన్నకోట పెద్దన ‘‘కావ్యాలంకార చూడామణి’’ యందు సమర్ధింపబడింది.

‘‘చతురుపాదు బహుశక్తి క్షమావళి బాఱవిడిచి చిత్రభాను సాక్షి బాఱె సర్వసిద్ధి పదమేది ధరణీ వరాహమునకు నోడి రాచకదువు’’4

దండి మహాకవి తన ‘‘దశకుమార చరిత్ర’’లో వర్ణించిన ఆంధ్ర నగరం నేటి సర్వసిద్ధి అని కొందరు చరిత్రకారుల అభిప్రాయం. ఈ సర్వసిద్ధి ప్రాంతాన్ని యాదవ రాజులు పాలించినట్లు విశాఖ గెజిట్‌లో పేర్కొంది. నేటి ఎలమంచిలి ప్రాంతం ఒకనాడు సర్వసిద్ధి తాలూకాలో ఒక భాగంగా ఉంది.

అన్నింటికన్నా ముందు నేడు సర్వసిద్ధి అనగానే సర్వసిద్ధి రాయవరంలో జన్మించిన మహాకవి అయిన గురజాడ అప్పారావు జ్ఞాపకం వస్తారు. తొలి తెలుగు కథ ‘‘దిద్దుబాటు’’ను వ్రాసిన ఈయన కలం నుండే వెలువడింది సంఘాన్ని సంస్కరించిన ‘‘కన్యాశుల్కం’’ నాటకం. గురజాడ అప్పారావు విజయనగరసంస్థానాధీశుడు ఆనందగజపతి, గజపతిసోదరి ‘‘రీవావాణి’’గా పేరు పొందిన అప్పలకొండమాంబలకు ఆరాధ్యనీయుడుగా నిలిచాడు.

3.5 పెనుగొల్లు:

వరాహ నది సముద్రంలో కలిసే ముందుగా పెనుగొల్లు వద్ద (సర్వసిద్ధి రాయవరం మండలం) రెండుగా చీలుతుంది అని ముందే చదివాం కదా. ఈ పెనుగొల్లుకు కొంత గొప్పతనం ఉంది. గ్రామంలో కొంత కాలం పాటు ‘‘మృదంగ కేసరి’’ ముళ్ళపూడి లక్ష్మణ రావు ఉన్నారు. ఈయన వద్ద కీ॥శే॥ వంకాయల నరసింహం (ఆకాశవాణి మృదంగ కళాకారులు) వంటివారు విద్య నేర్చారు. ఈ గ్రామంలోని ఆనాటి ఇంద్రగంటి సత్యనారాయణ హరికథలు చెప్పేవారు. కుమారుడైన లక్ష్మీనారాయణ కుమారులు ఇంద్రగంటి వెంకటలక్ష్మణశాస్త్రి (IVL శాస్త్రి) విశాఖపట్నంలో ‘‘సంగీతజనకులం’’ అనే సంగీతసంస్థను నిర్వహించారు. వీరు పెనుగొల్లులోనే జన్మించారు. ఆకాశవాణిలో వీణావాద్య కళాకారులైన శంకర్‌ ప్రకాశ్‌ కూడా పెనుగొల్లుకు చెందినవారే! పెనుగొల్లు గ్రామంలో పురాతన శివాలయం ఉంది.

3.6 ఇతర గ్రామాలు:

పెనుగొల్లు వద్ద వరాహనది రెండుగా చీలిపోయింది అని చదివాం కదా. కర్రివానిపాలెం మీదగా పారే వరాహ నది పాయ దగ్గర పెద్ద ఉప్పలం గ్రామం ఉంది. ఈ గ్రామం దరి మహాయాన బౌద్ధానికి చెందిన బుద్ధుని విగ్రహం, స్థూపానికి చెందిన పునాదులు, విహారాలు కనుగొనబడ్డాయి. ఈ పెద్ద ఉప్పలంను గతంలో ఉప్పలాయపట్నం అని పిలిచేవారు. గతంలో ఇక్కడ పెద్ద విస్తీర్ణం గల చెఱువు ఉండేది. ఆ రోజుల్లో బౌద్ధవిహారాల అవసరాలకు ఈ చెఱువునీరు ఉపయోగపడేది. పెద్ద ఉప్పలం, లింగాయపాలెంలో జరిపిన త్రవ్వకాలలో శాతవాహన, రోమన్‌ రాజుల నాణేలు లభించాయి.11

4. వరాహనది- ఆనకట్టలు:

ఇక వరాహనదిపై గల ఆనకట్టల విషయానికి వద్దాం. వరాహనదికి ఉపనది అయిన సర్పానదిపై రావికమతం మండలంలో చీమలపాడు కళ్యాణపులోవ గ్రామం వద్ద వరాహ రిజర్వాయర్‌ ప్రాజెక్టు నిర్మింపబడింది. దీనిని గతంలో కళ్యాణపు లోవ ప్రాజెక్టు అని అనేవారు. ఇప్పుడు శ్రీ గుడివాడు గురునాధరావు వరాహ రిజర్వాయర్‌ ప్రాజెక్టు అని అంటున్నారు.

గోలుగొండ మండలంలో రావణాపల్లి గ్రామం వద్ద వరాహనదిపై రావణాపల్లి రిజర్వాయర్‌ నిర్మింపబడింది. ఇదేకాకుండా వరాహ, దాని ఉపనదులపై చిన్న చిన్న ఆనకట్టలు ఎన్నో నిర్మింపబడ్డాయి.

5. వరాహనది పరివాహక ప్రాంతప్రజలు- స్వాతంత్య్ర సమరం:

వరాహనది పరివాహక ప్రాంతప్రజలు కూడా భారతస్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నారు. క్లుప్తంగా కొన్నింటిని గురించి తెలుసుకుందాం. వరాహనదీతీరంలో నున్న ఏటికొప్పాకు గాంధీజీ 1929 మే ఒకటిన వచ్చారు. మే రెండవ తేదీన ఆ గ్రామప్రజలు నగిషీలు చెక్కబడిన చిన్న కొయ్యపెట్టెలో వెయ్యి నూట పదహార్లు ఖద్దరు నిధి కోసం గాంధీజీకి సమర్పించారు. ఆ పెట్టెను గాంధీజీ చింతలపాటి వెంకట నరసింహరాజు గారికి అమ్మి ముప్పది రెండు రూపాయలు వసూలు చేసారు. కోట ఊరట్ల మండలంలోని కైలాసపట్నం ఖద్దరు ఉత్పత్తి కేంద్రాన్ని సందర్శించారు. ఇక్కడ కూడా ఏటికొప్పాకలో తయారైన కొయ్యపెట్టెలో గాంధీజీకి సన్మానపత్రం సమర్పించారు. ఖద్దరు నిధికి వెయ్యి నూట పదహార్లు కొన్ని నగలు అక్కడి ప్రజలు గాంధీజీకి సమర్పించారు. కొయ్యపెట్టెను వేలం వేయగా పద్నాలుగు రూపాయలు వచ్చాయి. బహిరంగ సభలో ఖద్దరు నిధికి రూ. 1116 వచ్చాయి.12

6. ముగింపు:

చిన్న నది అయిన ‘‘వరహ’’ నదికి ఎంతటి ‘‘వారసత్వ సంపద’’ ఉందో తెలుసుకున్నాం కదా. గతంలో నదీ తీర ప్రజలు, నదుల ద్వారా ఉపయోగం పొందినవారు ఈ నదులను ఎంతో పూజ్యభావంతో చూసేవారు. తమ జీవిత చరిత్రలలో, గ్రంథాలలో వీటని కీర్తించారు. కాని నేటి మానవుడు నది ద్వారా నాగరికతను పొందేం అన్న భావనను మర్చిపోయి ఎంతవరకు నదిని కలుషితం చేయవచ్చో అంతవరకు కలుషితం చేసేస్తూనే ఉన్నాడు. మొత్తం ఇసుకను దోచేస్తున్నాడు. వందలాది, వేలాది అడుగుల లోతు ఉన్న బోర్లు వేసి నదీ గర్భంలోని నీటిని కూడా వాడేసుకుంటూ నదిని ఎండగడ్తున్నాడు. ఇది సమంజసమా? ఇదేనా నదుల పట్ల మనం చూపవలసిన గౌరవం? ఇటువంటి చర్యలు రాబోయే కాలంలో తీప్ర పరిస్థితులకు దారి తీస్తాయి అందుకే మనం ‘‘నదిని కాపాడుకోవాలి. నది చేత కాపాడబడాలి.’’

7. సూచికలు & ఉపయుక్తగ్రంథసూచి:

  1. Hydrological Studies in Varaha Reservoir, Kalyanapu Lova, Visakhapatnam Dist. (Page 188) Article by T. Sasikala, C. Manjulatha, DVSN Raju, Andhra University, Visakhapatnam) International Journal of Fauna & Biological Studies (www.faunajournal.com)
  2. ఆంధ్రప్రదేశ్‌ నదులు : వాగులు - వంకలు. శ్రీ అంగత వరప్రసాద్‌ రావు పల్లవి పబ్లికేషన్స్‌, సూర్యాపేట, విజయవాడ-3 (జూలై 2021)
  3. అంతర్జాలంలో ‘‘దైవదర్శనం’’ బ్లాగ్‌ (శ్రీ ఆర్‌.బి. వెంకట రెడ్డి) (Net)
  4. విజ్ఞాన సర్వస్వము : తెలుగు సంస్కృతి (రెండవ సంపుటము) సంపాదకులు : డా॥ బి. రామరాజు, డా॥ పి.వి. పరబ్రహ్మ శాస్త్రి. తెలుగు విశ్వవిద్యాలయం, కళా భవన్‌, హైదరాబాద్‌-4 (మార్చి 1988)
  5. యోగులు - అవధూతలు : (9 జూలై 2022) (ఫేస్‌బుక్‌)
  6. విప్లవ వీరుడు - అల్లూరి సీతారామరాజు. డా॥ జోళెపాళెం మంగమ్మ (విశాలాంధ్ర పబ్లిషింగ్‌ హౌస్‌, బ్యాంక్‌ స్ట్రీట్‌, హైదరాబాద్‌-1 (జూలై 1985)
  7. పద్మశ్రీ చింతలపాటి వెంకటపతిరాజు (ఏటికొప్పాక) గారితో చరవాణిలో సంభాషణ.
  8. Growth and Development of Sugar Industry in India (With respect of Co.op. Sugar Mills in A.P.) - N. TyagarajuInternational Journal of Recent Scientific Research (Net) (Vol. 7 - Issue 10 - October 2016)
  9. పద్మనాభ యుద్ధం : (మెనోగ్రాఫ్‌-చరిత్ర) శ్రీ టి. సత్యనారాయణ మూర్తి. తెలుగు అకాడెమి, హైదరాబాద్‌ (2003)
  10. ఆంధ్రుల చరిత్ర (ప్రధమ, ద్వితీయ భాగాలు) (బి.ఎ. చరిత్ర 1993) తెలుగు అకాడెమి, హైదరాబాద్‌ (2003)
  11. Proceedings of 2 Day National Seminar on History and Culture of Kalinga - Andhra (with Focus on Srikakulam Dist - 17 & 18th June 2012) (History Congress of Kaling Andhra) - Book by INTACH - Srikakulam Dist.
  12. ఆంధ్ర ప్రదేశ్‌లో గాంధీజీ : తెలుగు అకాడమి హైదరాబాద్‌ (1978)
  13. 26 జిల్లాల ఆంధ్ర ప్రదేశ్‌ సమగ్ర స్వరూపం (అట్లాసు) విజేత కాంపిటేషన్స్‌, బండ్ల పబ్లికేషన్స్‌ (ప్రై) లిమిటెడ్‌. బాగ్‌ అంబర్‌ పేట, హైదరాబాద్‌.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]