AUCHITHYAM | Volume-5 | Issue-1 | January 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
14. ఆంధ్రప్రదేశ్ గిరిజనులు: కళలు - సాహిత్యం
గొంటి బాబ్జి
పరిశోధక విద్యార్థి, తెలుగు విభాగం
ఆంధ్ర విశ్వకళాపరిషత్, విశాఖపట్నం,
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 8688061477, Email: babjitelugu76@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
గిరిజనజాతులను, పాశ్చాత్యుల గిరిజన విభజనను పరిచయం చేసి వివిధ ప్రాంతాల్లో ఉన్న గిరిజనుల కళలు, సాహిత్యం గురించి ఈ వ్యాసం సోదాహరణంగా చర్చిస్తుంది. సంక్షిప్తగిరిజనచరిత్ర, సామాజిక మానవశాస్త్రజ్ఞుల వర్గీకరణలు, బొమ్మలతయారీ, రేఖాచిత్రాలవంటి గిరిజనకళలను సోదాహరణంగా వివరిస్తూ, పూర్వపరిశోధకులు విమర్శకులు తెలిపిన నిర్వచనాలను విశ్లేషించడం, మౌఖికసాహిత్యంలో గేయాల స్థానాన్ని తెలియజేయడం ఈ వ్యాసం ప్రధానోద్దేశం. ఆధారగ్రంథాలనుండి సేకరించిన అంశాలు ఈ పరిశోధనకు విషయసామగ్రి. విశ్లేషణ, వివరణాత్మక పరిశోధనపద్ధతులను ఈ వ్యాసం రూపుదిద్దుకుంది.
Keywords: గిరిజనులు, కళలు, సాహిత్యం, సంక్షిప్తచరిత్ర, గేయాలు.
1. ఉపోద్ఘాతం:
గిరిజనుల్ని ఆంగ్లంలో ‘షెడ్యూల్డ్ ట్రైబ్స్’గా పిలుస్తున్నారు. ‘ట్రైబ్’ అంటే ‘తెగ’ అని అర్ధం వుంది. ‘తెగ’ల మీద మానవశాస్త్రజ్ఞులు, సామాజిక శాస్త్రజ్ఞులు వివిధ రకాల నిర్వచనాల్ని అందించారు. ఈ నిర్వచనాలను పరిశీలిస్తే వివిధ శాస్త్రజ్ఞుల అభిప్రాయాల్లో వైరుధ్యం వుంది. పరస్పర బంధుత్వాలు, ఉమ్మడిప్రాంతం, ఒకే భాష, ఉమ్మడి యాజమాన్యం, ఒకే రాజకీయ వ్యవస్థ, పరస్పర కలహాలు లేకపోవడం, తెగల ప్రధాన లక్షణాలుగా ముజుందార్ పేర్కొన్నారు. సమాజంలో కులవ్యవస్థ ఏర్పడిన నాటి నుంచి అస్తిత్వం కోసం, మనుగడ కోసం ఆయా కులాలు తమ వృత్తులు, కళలు, సాహిత్య అంశాల పట్ల శ్రద్ధ వహించాయి. సాహిత్యంలో ఏర్పడిన వివిధ ప్రక్రియలు, కవిత్వోద్యమాలు కూడా అలాంటివే.
సంస్కృతి వికాసంలో భాగంగా జరిగిన భాషాపరమైన పరిశోధనలు, సాహిత్య పరిశోధనల్ని విశ్లేషించి భవిష్యత్ తరాల ముందుంచడానికి విశేషమైన కృషి జరిగింది. దీనిలో భాగంగానే ఆదివాసీ, గిరిజన సాహిత్యంలో విస్తృత పరిశోధనలు చోటుచేసుకున్నాయి. భారతీయ సంస్కృతిలో ప్రధాన స్రవంతి సమాజానికి సమాంత సంస్కృతిగా వెలుగొందుతున్న ఆదివాసీ సంస్కృతి పట్ల నేడు పరిశోధనలు తీవ్రతరమయ్యాయి. నేటికాలంలోఅనాదిగా అనాగరిక జాతులుగా మిగిలిపోయిన మరికొన్ని తెగలను వెలికి తీసి వారి సామాజిక, ఆర్ధిక అభివృద్ధికి కృషి చేయడానికి, వివిధ సంస్థలు, ప్రభుత్వాలు ముందుకొచ్చాయి. గిరిజనులు తమ చారిత్రక జీవనక్రమంలో మత ఉద్యమాలు, పునరుజ్జీవోద్యమాలు, వ్యావసాయిక, సాంస్కృతిక ఉద్యమాల ప్రభావానికి లోనయ్యారు. 1920-35 మధ్యకాలంలో బిర్సా ఉద్యమ ప్రభావంతో రాజకీయ, మత నాయకులెందరో ఉద్భవించారు. ఈ నాయకులు దశాబ్దాల కాలం పాటు గిరిజనులను ప్రభావితం చేశారు. ఈనేపథ్యం ఆదివాసీ, గిరిజన సాహిత్యాన్ని పరిశీలించాల్సిన అవసరం వుంది. భూమిని అడవి నమ్ముకున్న గిరిజనులు భారతీయ సంస్కృతి నిర్మాణానికి మూలపురుషులుగా చరిత్రకారులు చెప్తారు. అయినప్పటికీ నేటికీ వారి పరిస్థితి అవిచ్ఛిన్నంగా కొనసాగుతున్న వారి సంస్కృతి, జీవనవిధానం యథాతధంగా వుంది. గిరిజనుల పోరాట సంస్కృతి, తమదిగా చేసుకొని జీవిస్తున్న సాహిత్యం, కళలు నిర్విరామంగా కొనసాగుతున్నాయి. అడవి ప్రాంతాల్లో స్వేచ్ఛగా జీవిస్తూ, అడవి మీదనే ఆధారపడి స్వయం ప్రతిపత్తి గల ఆర్ధిక విధానంతో దోపిడీకి తావులేకుండా సమిష్టిగా జీవిస్తూ వ్యవసాయం చేయడం, వేట, అక్కడ దొరికే పండ్లూ, కాయలతో జీవిస్తూ వచ్చాడు. గిరిజన సాహిత్యమంతా క్రమబద్ధంగా పరిశీలిస్తే వారి జీవన విధానం, కళలు, సాహిత్యం ప్రతిబింబిస్తుంది. ఈ సాంస్కృతిక సముదాయమంతా ప్రధాన స్రవంతి సాహిత్యం మీద ప్రభావాన్ని చూపిన సంధర్భాల్ని మనం గమనించవచ్చు.
2. సంక్షిప్త గిరిజన చరిత్ర:
దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కువ సంఖ్యలో గిరిజనులు నివసిస్తున్నారు. వీరు విభిన్న భాషలు మాట్లాడతున్నారు. భారతదేశంలో తొలి తెగలు ఆదిమ గిరిజనులేనని ఆర్యుల వేదగ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఆర్యులు భారత భూ భాగం మీదకు వచ్చినప్పుడు ఇక్కడ ఎన్నో ఆదిమ జాతులు, తెగలు వున్నాయని వేద గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఆనాటి ఆ ప్రజానీకాన్ని దస్యులని పేర్కొన్నారు. ఋగ్వేదంలో కిరాతుకులు, నిషాదులు, చెంచులు, బోయలు, పుళిందులు తదితర తెగల ప్రస్తావన వుంది. ఆనాటి పుళిందులనే నేడు గోండులుగా పిలుస్తున్నారని పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఆదిమకాలం నుంచి తమ సంస్కృతిని పరిరక్షించుకుంటూ, నాగరిక ప్రపంచానికి దూరంగా కొండకొనల్లో, అడవుల్లో నివసిస్తున్నందున వీరిని గిరిజనులుగా పిలుస్తున్నారు. నేటి కాలంలో యావత్ భారతదేశంలో గిరిజనులుగా జీవిస్తున్న ప్రజానీకాన్ని ఒకే తాటి మీదకు తీసుకొచ్చే లక్ష్యంతో, ఒకఅస్తిత్వాన్ని కలిగించడానికి వీరిని ‘ఆదివాసీలు’గా ప్రాచుర్యంలోకి తీసుకొస్తున్నారు. ఆదిమ జాతుల అధ్యయనంలో మానవ విజ్ఞాన శాస్త్రజ్ఞులు ఎంతగా శక్తియుక్తులను వెచ్చించినా గిరిజనల్ని ఇతర వర్గాల నుంచి విడదీసే లక్షణాలు ఆధారంగా నిర్వచించడానికి ప్రయత్నం జరిగింది.
సామాజిక జీవనవిధానాన్ని బట్టి గిరిజనుల్ని కొందరు సామాజిక, మానవశాస్త్రజ్ఞులు వర్గీకరించారు.
వీరిలో మొదటిగా ముజుందార్ వర్గీకరణలో మూడు రకాలు వున్నాయి. వీటిలో
- హిందూమతంతో సంబంధాలు వున్న గిరిజనులు,
- హిందూమతంతో సంబంధం లేని గిరిజనులు,
- హిందూమతాన్ని అలవర్చుకున్న తెగలు వున్నాయి.
రెండవది వెరియన్ ఎల్విన్ సంస్కృతిపరంగా గిరిజనుల్ని నాలుగు తెగలుగా విభజించారు.
- తొలిగా సామూహిక జీవనాన్ని గడుపుతూ గొడ్డలితో వ్యవసాయం చేస్తూ జీవిస్తున్న తెగలు,
- రెండవది సాంప్రదాయక జీవనాన్ని గడుపుతూ గిరిజనేతరులతో సంబంధాలు వుండే తెగలు.
- మూడవది గిరిజనేతరులతో సంబంధాలు నిర్వహిస్తూ సాంప్రదాయక మతాన్ని సామాజిక వ్యవస్థాపనను పోగొట్టుకున్న గిరిజన తెగలు,
- నాల్గోవది బిల్, నాగా మొదలయిన తెగల్లా జీవన విధానాన్ని కొనసాగించే వాటిగా విభజించారు.
1952లో ఆదివాసీ సంక్షేమసంఘం ‘గిరిజన భారతీయసదస్సు’లో గిరిజనుల్ని నాలుగు రకాలుగా విభజించారు. గిరిజనతెగలు, ఉపగిరిజనతెగలు, బాహ్యసంస్కృతి ప్రభావానికి లోనైన తెగలు, బాహ్యసంస్కృతిలో మిశ్రమమైన గిరిజనతెగలుగా విభజించారు. మతపరంగా గిరిజనుల వర్గీకరణ జరిగింది. మానవశాస్త్రజ్ఞుడు దూబె భారతీయ గిరిజనుల్ని ఐదు రకాలుగా విభజించారు.
- మొదటిగా సంస్కృతి పరంగా మార్పుకు గురికాని గిరిజనులు.
- రెండోది ఇరుగు, పొరుగు గ్రామాల జీవినవిధానాన్ని అనుసరించి ఆర్ధికంగా మెరుగై వారి అసల సంస్కృతినే ఆచరించే తెగలు.
- మూడోది గిరిజన సంస్కృతిని విడనాడకుండా, గ్రామాల్లో వివిధ కులాలు, మతాలతో కలిసి జీవించే తెగలు.
- నాల్గోవది సంస్కృతి పరంగా హిందూ వ్యవస్థలో అఖరి మెట్టు అయిన వెనుకబడిన కులాల స్థాయికి వచ్చిన తెగలు.
- ఐదవది ఉన్నత ఆర్ధికస్థాయి, రాజకీయ పలకుబడి సంతరించుకొని తమ తమ గిరిజన సాంప్రదాయాన్ని విడనాడకుండా ఉన్నత జీవితాన్ని గడుపుతున్న తెగలుగా ఈ వర్గీకరణ వివరిస్తుంది.
థర్న్‌వాల్డ్ భారతీయగిరిజనుల్ని ఆడమ్‌స్మిత్ శాస్త్రీయ వర్గీకరణ ఆధారంగా ఆర్ధిక కోణం నుంచి వర్గీకరించారు. పనివిభజన, పనులు చేసే విధానం, సేకరించే ఉత్పత్తులు ఆధారంగా ఈ వర్గీకరణ చేసినట్టు పేర్కొన్నారు. ఐతే ఈ థర్న్‌వాల్డ్ వర్గీకరణను ముజుందార్ వ్యతిరేకించారు. ఇంకా సరళంగా విభజించవచ్చని ఆయన ఈ విధంగా పేర్కొన్నారు. వేటాడే తెగలు, పోడు వ్యవసాయం చేసే తెగలు, చిన్నవృత్తి చేసే తెగలు, పశుపాలక తెగలు, మైదానభూముల్లో వ్యవసాయంచేసే తెగలు, జానపద కళాకారులైన తెగలు, వ్యాపారం చేసే తెగలు, శ్రామికవర్గ తెగలుగా విభజించారు. ఇంకా భాషపరమైన, భౌగోళికపరమైన తెగల వర్గీకరణ జరిగింది.
౩. ఆంధ్రప్రదేశ్ గిరిజనులు:
ఆంధ్రప్రదేశ్‌లో నివసిస్తున్న గిరిజనుల సంస్కృతి, జీవన విధానం ప్రత్యేకమయినది. ముఖ్యంగా ద్రావిడ, ఇండో ఆర్యన్, ముండారి, తెలుగు భాషా కుటుంబాలకు చెందిన గిరిజనులు ఇక్కడ నివసిస్తున్నారు. అదిలాబాద్ జిల్లాలో వ్యవసాయ ఆధారితంగా ‘అంధ్’ తెగలవారు నివసిస్తున్నారు. విశాఖపట్నం జిల్లా ‘భగత’ తెగ జీవిస్తున్నారు. వీరిది కూడా వ్యవసాయమే ప్రధాన వృత్తి. కృష్ణా నదికి ఇరువైపులా విస్తరించి వున్న నల్లమల అటవీప్రాంతంలో ‘చెంచు’లు ప్రధానంగా జీవిస్తున్నారు. ‘గౌడు’ సంచారతెగ శ్రీకాకుళం విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో నివసిస్తున్నారు. పాడేరు, అరకు మొదలయిన కొండవాలు ప్రాంతాల్లో వీరు అధికంగా జీవిస్తున్నారు. ‘కొండరెడ్డి’ తెగ గోదావరి, ఖమ్మం జిల్లాల్లో నివసిస్తున్నారు. ‘జాతాపులు’ వీరు శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో నివసిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో నివసించే మరో తెగ ‘కోలాం’. వీరు ద్రావిడభాషా కుటుంబానికి చెందిన కొలామి భాషను మాట్లాడతారు. ‘కొండకాపు’ తెగ విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయగోదావరి జిల్లాల్లో నివసిస్తున్నారు. వీరిని కొండదొరలుగా పాండవరైతులుగా మరో పేరుగా పిలుస్తారు. ‘ఖోందు’ తెగ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో వున్నారు. ‘ఖొటియా’ తెగ విశాఖపట్నం జిల్లాల్లో నివసిస్తున్నారు. ‘కోయ’ ఈ తెగ గోదావారి పరివాహక ప్రాంతంలోనూ ఖమ్మం, వరంగల్, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో నివసిస్తున్నారు.వీరికి ప్రత్యేకంగా కోయ భాష వుంది. విశాఖపట్నం జిల్లాలో ‘కులియా’ అనే చిన్న గిరిజన తెగ వుంది. వీరు అరకులోయ, పాడేరు, పెదబెయిలు, మంచింగ్‌పట్ మండలాల్లో నివసిస్తున్నారు. వీరిని ములియాలు అని కూడా పిలుస్తారు. ‘మాలీ’, ‘మన్నెందొర’,మూకదొర’ తెగలు విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో నివసిస్తున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, గోదావరి జిల్లాల్లో ‘నాయకపు’ తెగవారు, ప్రత్యేకించి ఆదిలాబాద్ జిల్లాలో ‘పధాన్’ తెగవారు జీవిస్తున్నారు. విశాఖపట్నం, తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో ‘పొరజ’ తెగ ప్రజానీకం జీవిస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో ‘రెడ్డిదొర’ తెగ, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ‘రోనా’, శ్రీకాకుళం మెట్ట ప్రాంతంలో ‘సవర’ తెగలు నివసిస్తున్నాయి. లంబాడీలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో మినహా పశ్చిమగోదావరి జిల్లా మెట్టప్రాంతం నుంచి తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల్లో కూడా కనిపిస్తారు. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో ‘తోటి’Ñ శ్రీకాకుళం, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ‘వాల్మీకీ’ తెగలు నివసిస్తున్నాయి. ‘యానాదులు’ నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో జీవిస్తూ వుండేవారు. రెండు దశాబ్దాల నుంచి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు వ్యాపించారు. ఆంధ్రప్రదేశ్ అంతటా ‘ఎరుకల’ తెగ వుంది. ‘గోండు’లు ఆదిలాబాద్ జిల్లాలో నివసిస్తున్నారు. ఈవిధంగా ఆంధ్రప్రదేశ్‌లో జీవిస్తున్న గిరిజనులకు భాష, సాహిత్యం, కళలు మొదలయిన సంస్కృతి సంపదగా వుంది.
4. గిరిజన కళలు:
గిరిజనుల కళారూపాల మీద కొంత అధ్యయనం జరిగింది. 1949లో గిరిజన కళారూపాల మీద అధ్యయనం చేసిన హొహుయిబెల్ శాస్త్రజ్ఞుడు వాటి విశిష్టతను వివరించారు.
‘‘ఆదిమ ప్రజల కళల్లో సాంకేతిక పరమైన అయోమయం వుంటుంది. అలాగే ఎంతో నైపుణ్యమూ వుంటుంది. శైశవదశ నిరాడంబరతా వుంటుంది. అయోమయంగా వుండే క్షిష్టతా కనిపిస్తుంది. ప్రకృతి సహజంగానూ, వాస్తవంగానూ వుండి, అమూర్తభావనామిశ్రితమై వుంటుంది.’’ అని పేర్కొన్నారు.
గిరిజనలు తమ జీవితాలకు అవసరమైన వస్తువుల్ని ప్రకృతి నుంచే గ్రహించారు. గిరిజన కళారూపాల్ని పూర్తిగా ఆస్వాదించాలంటే అవి ఏ నేపథ్యంలో, ఏ నేపథ్యం కోసం అభివృద్ధి చెందాయో గుర్తించాలని నియొనార్డ్ ఆడమ్ పేర్కొన్నారు. గిరిజన కళల సాంస్కృతిక నేపథ్యం భిన్నం కాబట్టి అందుకు అనుగుణమైన దృష్టితో వాటిని పరిశీలించాలన్నారు.
1973లో గిరిజన కళలు మీద పరిశోధన చేసిన వెరియర్ ఎల్విన్ వారి కళారూపాల్ని నాలుగు రకాలుగా విభజించారు.
1. బొమ్మల తయారీకళ, 2. రేఖాచిత్ర కళ, 3.సంగీతకళ, 4.మౌకికసాహిత్యం దాదాపుగా అన్ని గిరిజన తెగల్లోనూ ఈ కళారూపాలు వున్నాయి.
తమ భావను, ఆధ్యాత్మిక ఆలోచనల ప్రేరణలోంచి ఈ కళారూపాలు పుట్టాయనే అభిప్రాయం వుంది. గిరిజన కళలకు, మత భావాలకు అవినాభావ సంబంధం వుందని ఎల్విన్ అధ్యయనం వివరిస్తోంది.
అ). బొమ్మలతయారీకళ :
భారతదేశంలో బొమ్మల ఆరాధన ఆచారంగా వుంది. ప్రత్యేకించి ఈ ఆచారం గిరిజనుల్లో అధికంగా కనిపిస్తుంది. గిరిజన దేవుళ్ళ ప్రతిమలు అరుదుగానే వున్నాయని గిరిజన ఆధ్యయనాలు వివరిస్తున్నాయి. గోండులు, సంతాల్‌లు, భిల్లులు, నాగాలు తమ దేవతలుగా రాళ్ళను, మట్టి ముద్దలను, రూపంలేని కొయ్యలను పూజించే ఆచారం వుంది. ఆనాదిగా గిరిజనలు ప్రకృతి రూపంలోనే దేవుళ్ళను ఆరాధించేవారు. బస్తరులో మురియా తెగ తమ దేవతలకు ఇత్తడితో చేసిన గుర్రాలు, ఏనుగులు, మనషుల బొమ్మలను సమర్పిస్తారు. మిగిలిన తెగలు మట్టితో చేసిన పక్షులు, గుర్రాలు, ఏనుగుల బొమ్మలను సమర్పిస్తారు. గిరిజనలు అనుభవాలకు, ప్రతిస్పందనకు సంకేతంగా మట్టిబొమ్మలను తయారు చేస్తారు. గిరిజనగ్రామాల్లో చెట్ల కింద గుట్టలుగా పోస్తారు. గంజాం జిల్లాలోని సవర తెగ గిరిజన దేవతలు, దెయ్యాలు, పూర్వీకుల బొమ్మలను విరివిగా చిత్రీకరిస్తారు. గిరిజనుల రోజువారీ జీవితాలను అదృశ్యశక్తులు నడిపిస్తాయని వారి నమ్మకం. వివాహ కిరీటాలు, దీపస్తంభాలు, కొయ్య బొమ్మలు తయారు చేస్తారు.అంతేగాక గిరిజనుల తమ జీవనయానానికి ఉపకరించు వస్తుసామాగ్రిని, పాత్రలు, ఆభరణాలను వెదురు, కొయ్య, మట్టితో తయారు చేస్తారు. తలవెంట్రుకలను క్రమపద్ధతిలో వుంచి పిన్నులు, తల దువ్వుకొనే దువ్వెనలు, మెడలో ధరించడానికి పూసలు, గవ్వలతో కూడిన దండలు తయారు చేస్తారు. చేతులకు ధరించే గాజులు, కంచు కడియాలు, తెల్లనిరాగి, సీసం, కంచుతో తయారు చేసిన ఆభరణాలు, గడ్డి, పక్షుల ఈకలు, నెమలిఈకలు ఆకులు, నారతో ధరించే వస్త్రాలను తయారు చేయడం గిరిజనుల ప్రత్యేకత. కొయ్యతో గరిటెలు, ఆకులు, ఈనెలతో బుట్టలు తయారు చేస్తారు. అంతేగాక వేటలో ఉపయోగించే ఆయుధాలను సైతం గిరిజన ప్రజల కళాతృష్ణ ప్రత్యేకతను చాటుకుంటుంది.
ఆ). రేఖాచిత్ర కళ:
గిరిజనుల జీవితాల్లో అంతర్భాంగా నిలిచిన కళ చిత్రలేఖనం. వివాహ శుభకార్యాల నుంచి వారిని రక్షించు కొనే కార్యచరణ వరకు ఈకళను వారు పోషిస్తున్నారు. అదృశ్య శక్తులను సంతృప్తి పర్చడానికి వీరు గోడల మీద బొమ్మలు వేస్తారు. చనిపోయిన కుటుంబ పెద్దలకు నివాళిగా, గూడెం జనాన్ని రోగాల నుంచి కాపాడటానికి, పంటలు అధిక ఉత్పత్తి జరగడానికి రేఖాచిత్రాలను చిత్రించే ఒకశక్తివంతమయిన ఆచారం వీరి సొంతం. పిశాచాలను దరినీయకుండా నేల మీద రకరకాల రంగులతో వైవిధ్యభరిత నమూనాలను, అలంకరణలను చిత్రీకరిస్తారు. వీరి చిత్రకళకు నిద్రలో కలిగే కలల్లోని ప్రతిరూపాలే ప్రాతిపతిక అని ఎల్విన్ అధ్యయనం వివరిస్తుంది. మరణించిన వ్యక్తి పేరున చిహ్నంగా కొయ్యస్తంభాన్ని నిలపడం వీరి ఆచారం. ఆ స్తంభం మీద బియ్యంతో తయారు చేసిన బీర్‌ను అందిస్తున్న మహిళల్ని, వేట దృశ్యాలు, పూజాకార్యక్రమాలు నిర్వహిస్తున్న శామణుల బొమ్మల్ని కొయ్య స్తంభాల మీద చిత్రిస్తారు. గిరిజనుల్లో మరో ప్రత్యేకమయిన ఆచారం శరీరం మీద పచ్చబొట్లు పొడుచుకోవడం. వీటిలో వివిధ రకాల నమూనాలు వుంటాయి. ఒక్కొక్క నమూనాకు ఒక ప్రాధాన్యత వుంటుంది.ఇది తెగలను బట్టి వివిధ రకాలుగా వుంటాయి.
ఇ). సంగీతకళ:
గిరిజన సంగీత వ్యవస్థలో పరికరాలు, గాత్ర సంగీతానికి కూడా ప్రత్యేకత వుంది. భారతీయ గిరిజన తెగలు ఉపయోగించే సంగీత వాయిద్యాల్లో వివిధ రకాల డోళ్ళు, డప్పులకు విశిష్టత వుంది. బూరలు, వేణువులు, కొమ్ముబూరలు, ఇత్తడిపళ్ళాలు, కర్తాళ్ళు, జాజ్‌లు పేర్కొనదగినవి. భారతీయ గిరిజన గాథల్లో జీవనతత్వం కళాత్మకంగా, సంగీతబద్ధంగా, కవిత్వరూపంలో నిక్షిప్తమయినట్టు 1967లో చేసిన అధ్యయనంలో ముజుందార్ పేర్కొన్నారు. గిరిజన తెగల్లో మరియాలు ‘మృదంగాల’ను, భిల్లులు ‘మాదల్’, నాగాలు ‘ఖోల్’లను, భిలాలాలు ‘డోళ్ళ’ను, ‘నక్కరాల’ను, మహారాష్ట్ర భిల్లు తెగ ‘పుంగీ’ వాయిద్యాన్ని, రాజస్థాన్ గౌరాసియా తెగ ‘గౌర్జా’ వాయిద్యాన్ని తమ నృత్యాల్లో వినియోగిస్తున్నట్టు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి.
ఈ). మౌకిక సాహిత్యం:
కవిత్వం, నాటకం, కథలు, సంగీతం సాధారణంగా గిరిజన జీవితాల్లో కలిసే వుంటాయి. భారతీయ గిరిజన తెగల్లో అనేక కవిత్వ రూపాలు కనిపిస్తాయి. జోలపాటలు, సరదాపాటలు, భక్తి గేయాలు, శృంగార గేయాలు, వ్యంగ్య కవిత్వం, పురాణగాధలు గిరిజనుల్లో కనిపిస్తాయి. గిరిజనులకు రుతు పాటలు వున్నాయి. వీటిని ఆయా సమయాల్లో పాడతారు. పెళ్ళి పాటలు, నృత్యగీతాలు, వేట పాటలు, మంత్రోచ్ఛారణ లాంటి పాటలు, మరణం జరిగిన సందర్భంలో ఉచ్ఛరించే ప్రత్యేక పదాలు ఒంటిరిగా, యుగళంగా ఈ పాటలు పాడటం కనిపిస్తుంది. గిరిజన కళల ప్రాభవం తగ్గిపోతుండటానికి పారిశ్రామిక ప్రగతి ప్రభావం కారణంగా కనిపిస్తుంది.
5. గిరిజనసాహిత్యం:
ప్రధానస్రవంతి సమాజంలోని కళలు, సాహిత్యం పుట్టుకలాగే గిరిజన సాహిత్యం కూడా పుట్టింది. వారు అనుభవించే దుఃఖం, వేదన, పుట్టక, చావు మొదలయిన ఘటనల్ని నృత్యగీతాలుగా మార్చుకొని ఆడుతూ, పాడుతూ జీవించసాగారు. అనాదిగా గిరిజన జీవితాల్లో అంతర్భాగంగా నిలిచిన నృత్యం తనతో పాటు గీతాలను కూడా తీసుకొచ్చింది. గీతాలను రాగ, తాళ బద్ధంగా పాడుతుంటే నృత్యకారులు తమ శారీరక అవయవాలను అందుకు అనుగుణంగా అభినయం చేస్తారు. నృత్యం, సాహిత్యం వెలుగునీడలా కలిసి వుంటాయి. ప్రాచీనకాలం నుంచి నేటి వరకు ఆచార, సాంప్రదాయాల్లో మార్పులు చోటుచేసుకోని గోండులు, సవర, ఖోండులు, భిల్లులు వారి సంస్కృతిని నృత్యగీతాలతో ప్రతిబింబిస్తారు. ఆదిలాబాద్ రాజ్‌గోండులు సాంస్కృతిక, సాంఘిక మొదలైన ధార్మిక కార్యక్రమాల్లో తమ వంతు పాత్రను నిర్వహిస్తారని ఆచార్య గోనానాయక్ తన సిద్ధాంతవ్యాసంలో పేర్కొన్నారు. గిరిజన గేయ సాహిత్యాన్ని ఆచార్య బిరుదు రామరాజు-
‘‘దైనందిక జీవితంలో సుఖాన్నో, దు:ఖాన్నో అనుభవించినప్పుడు అతని ఉద్విగ్న హృదయం నుంచి లయాన్వితమైన పదమో, గేయమో వెలువడుతుంది. ఇదివారి నోళ్ళల్లో నాని పెరిగి,తిరిగి స్వయంభువుగా నిలుస్తుంది.’’ అని పేర్కొన్నారు.
ఈ నిర్వచనం ప్రకారం ప్రధాన స్రవంతి సమాజం నుంచి ఉద్భవించిన కళలకు, గిరిజన కళలకు వ్యత్యాసం కనిపించదు.
‘‘ఆదిమానవుడు వేటాడిన తర్వాత తనలో కలిగిన భావోద్వేగాలతో నృత్యం చేస్తూ మాట్లాడిన భాష లయబద్ధమై పదాలు పుట్టాయి’’ అని ఆచార్య ఆర్వీయస్ సుందరం పేర్కొన్నారు.
సంస్కృతి సాంప్రదాయాల్లో నృత్యగానాలకు గిరిజనులు అధిక ప్రాధాన్యతను ఇస్తారు. పర్ధాన్‌ల కథాగానాల ప్రకారం పహండి కుప్పార్‌లిగో వీరికి ఆదిగురువు. పరెండఖడ కోయ గోండుల బంధ విముక్తి కోసం ‘సోడా డెంసాంగ్’, అట్రావజగ్’ అనే నృత్యగనాలను గుహల ముందు ప్రదర్శిస్తారు. దీని ఆధారంగా గోండుల సంస్కృతిలో ఆది నుంచి ఈ నృత్యగానాల సాంప్రదాయం వున్నట్టు భావించవచ్చు. నేటికి వివిధ సందర్భాల్లో వివిధ రకాల నృత్యగానాలను ప్రదర్శిస్తూనే వుంటారు. గిరిజన ఆచార సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే నృత్యాలకు నేటి ప్రాధాన్యత వుంది. గిరిజన గీతాలను పరిశోధకులు వర్గీకరించారు. ఒకటి మర్మిడెంసా గీతాలు, గేర డెంసాగీతాలు, సాన డెంసా గీతాలు మొదలయిన ఆచార సంప్రదయాల్లో ప్రదర్శించేవి, రెండు పండుగలు, ఉత్సవాల్లో ప్రదర్శించేవి డండారి నృత్యగీతాలు, గుస్సాడి నృత్యగీతాలు, చెచోయ్ నృత్య గీతాలు, చాహోమ్ నృత్య గీతాలు,పార నృత్యగీతాలు మొదలయినవి, మూడు మత సంబంధమైన పెన్ డెంసా గీతాలు, సత్తిక్ గీతాలు, అవ్వల్‌పెన్ గీతాలు, భీమల్ గీతాలు మొదలయిన విభజించారు.
ఇటువంటి గిరిజన గీతాల్లో దండారి పాట ‘దెన దెన రేరేన /దేన దేన దేదేనా’ ఆరంభంగా మొదలవుతుంది. ఈ పాట సారాంశం దేవతలు నృత్యాలు చేస్తారని తెలిపేదిగా వుంటుంది. ఇది ప్రధానంగా ‘గోండు’ తెగకు సంబంధించినది. గుస్సాడి నృత్య గీతాలో గుస్సాడి పాట గోండుల ఆదిగురువు యౌదాన్ ఆత్మ ప్రతిరూపాన్ని కొనియాడేదిగా వుంటుంది.
‘ఏతవాతా దాద ఏత్మ వాతరో/ బడె దేశున ఏత్మవాత’ పాటకు ప్రారంభంగా వుంటుంది. ఏత్మ దేవుడు మన పెద్ద దేశం నుంచి వస్తున్నాడని అర్ధం. పెద్దదేశమనగా కైలాసం.
చొచ్చొయ్ గీతం ‘దేన దేన దేరేనా దాదరో / దేన దేన దేదేన దాదరో’ అంటూ ప్రారంభమవుతుంది. ఒక నెమలి దట్టమైన అడవిలో పర్వతం మీద నాట్యం చేస్తుంది బాణం ఇవ్వు వదినా దానిని కొట్టుకొని తెస్తానంటాడు మరిది. వద్దు నాయనా! అది గుడ్లు పెట్టడానికి వచ్చింది దానిని చంపకూడదు అంటాది వదిన ఇది సంభాషణాత్మకంగా సాగే పాట. గిరిజనులకు తోడుగా జీవిస్తున్న పశుపక్ష్యాదులందు గల మమకారాన్ని వ్యక్తీకరీంచేదిగా ఈ పాట సాగుతుంది. భగత తెగల గేయాల్లో యవ్వనంలో వున్న ఆడ, మగల మధ్య జరిగే సరస సంభాషణలు కనిపిస్తాయి. ఇవి జానపద గీతాలను పోలి వుంటాయి.
‘‘బట్టివాళ్ళ వీధిలోన పూవులమ్మ పూలు నా రాస గుమ్మడే / బట్టివారి చిన్న కొడుకు సీర కొంగు లాగిడో నా రాస గుమ్మడే’’ మొదలయిన పాటలున్నాయి. సవర గీతాల్లో బాధలు కనిపిస్తాయి. ‘‘తగడాలి యరయ్ మమేన్ అయ్‌యోన్ ఞడోజ్ / బడోన్‌బాన్ యరయ్ మమేన్ అయ్‌బన్ ఞడోజ్ /సిన్‌డీరిన్ యరయ్ మమేన్ అయ్‌బన్ ఞడోజ్’’ ఈ గీతంలో కల్లు తాగి ఇంటి కొచ్చిన భర్తను చూసి ఆవేదన చెందుతున్న భార్య ఇతివృత్తంగా సాగుతుంది.
కమ్మెర తెగ గేయాల్లో ఇంటిపనుల మీద, సంసార కార్యకలాపాల మీద సాగుతాయి. స్త్రీలు కోడికూయకు ముందే నిద్రలేచి తన పనులు చేసుకొంటున్న తీరును ఈ పాటలో గమనించవచ్చు. ‘‘నోవేనోవన్నాలా నోవన్నలాలో సువానల సువ్వే /తెల తెల వారిదో పొద్దెక్కి లేసిదో సువానల సువ్వే తూరుపు గుమ్మాలు తూల తుడినిదో సువానల సువ్వే.. దచ్చిన గుమ్మాలు దూరం తుడిసితో సువానల సువ్వే’’ తెల్లవారకముందే ఆదివాసీ స్త్రీలు ఎన్ని పనులు చక్కబెడతారో ఈ గేయంలో జానపదుల వర్ణనలు ఆకట్టుకుంటాయి. వాల్మీకి తెగ గేయాల్లో ఆదివాసీలు వినియోగించే పనిముట్ల నాజూకుతనాన్ని స్త్రీలు ఏ విధంగా వ్యక్తం చేస్తారో ఈ గేయం ద్వారా అవగతం అవుతుంది.
‘‘ ఏయప్ప దంపుల్లో వెన్నెలో - సోయప్ప దంపుల్లో వెన్నెలా/ అది దంచు రోకలి వెన్నెలో - భీమన్న రోకలి వెన్నెలా/ అది తుడుచు చీపురు వెన్నెలో - గుర్రాపు కుచ్చుది వెన్నెలా’’ ఈ గేయంలో ప్రకృతి నుంచి ఉత్పత్తయిన వస్తువుల మీద గిరిజన స్త్రీలు చూపించే మమకారం వెల్లడవుతుంది.
కోందు తెగ గేయాల్లో ఆదివాసీ సమాజంలోని కుటుంబ అనుబంధాలు కనిపిస్తుంటాయి. ‘‘సందమామో ఓయి మామన్నలా మాయన్నలాలో చందమామో- పేదరాసి పెద్దమ్మకి ఎందరు కొడుకులో చందమామో - ఎందరో కాదమ్మ ఏడుగురు కొడుకులో చందమామో/ ఏడుగురు తరువాత అన్నల పాపమ్మో చందమామో’’ ఈ గేయంలో అన్నాచెల్లెల్ల మధ్య అనుబంధం వ్యక్తమవుతుంది.
కొండదొర గేయాల్లో కుటుంబ వ్యవస్థలోని లోపాల్ని సంస్కరించే సాహిత్యం, వారి హింసాత్మక గాథలు కనబడతాయి. ఇక వేట ప్రధానమయిన గేయాలు గిరిజన సాహిత్యంలో ప్రధానమయినవి. ఆదివాసీలు మాంసాహార ప్రియులు. వీరి వేట వృత్తి కేవలం ఆహారం కోసమే కాకుండా జంతు చర్మాలు సేకరించి వీటిని సంగీతవాయిద్యాలకు వినియోగిస్తారు.
‘‘లచ్చే కోడలయ్యో కోడ - లాలాచీరో బాలలా కోడలా/ బక్కా చర్మమెగానో - ఎంతగుంజిన తెరుపలేదో’’ ఇది వేటపాట. దీనిలో జంతు చర్మం గురించిన వివరణ వుంది.
ఆదివాసీ వివాహాల్లో పాటలకు పెద్దపీటవేస్తారు. పెళ్లి కూతురిని తీసుకొని పెళ్ళి కొడుకు ఇంటికి తీసుకెళ్లేవరకు ఎన్నో పాటలు పాడతారు. వీటిలో వ్యవసాయం, వేట, పండుగ, సరసం మొదయిలనవి వుంటాయి. దేవుని వివాహం,రాజుల వివాహం, సవర్ల వివాహం గురించి ‘బొయ్యా’ పూజారి ‘అమజ్ బొకొడి గల్‌జి సలేజ్’ అనే పాట పాడతాడు.
గౌడ, జాతాపు, హిల్‌రెడ్డి, కోలాం, కొండకాపు, కోటియా, మాలి, నూకదార, కొండరెడ్డి మొదలయిన తెగలకు మరింత గేయ సాహిత్యం వుంది. మిగతా తెగల సాహిత్యానికి ఇది కొంత వ్యత్యాసం కలిగివుంటుంది. వీరంతా పాండవుల వంశంవారని, ఇక్కడి ప్రాంతాల్లో పాండవులు అరణ్యవాసం చేశారని వీరు చెప్తారు. వీరు పాండవుల మీద గేయాలు, కథా గేయాలు, కథలు చెప్తుంటారు.
‘‘దానిదానిదానో దన ధర్మరాజో/ దాని ధర్మరాజో దండి ధర్మరాజో/ దేవలోకమందు దేవసంబరాలు’’ గేయం పాండవుల మీద సాగే గిరిజన సాహిత్యం. భగత, గదబ తెగలు తాత్కాలిక వ్యవసాయ వృత్తి విధానాన్ని ఎంచుకున్నవారు. వీరికి గేయసాహిత్యం వుంది.
‘‘బొక్క తీసిన పిక్కవేద్దాం జొన్ననరక మాయరె/ పిక్కవేసి మొక్కమొలుద్దాం జొన్న నరక మాయరె’’ పాట ఈ కోవకు చెందినదే.
ఆదిమ గిరిజన తెగకు చెందిన చెంచులకు కొన్ని ప్రత్యేకమయిన పాటలున్నాయి. నరహరిని చెంచులు ఇంటి అల్లుడుగా భావిస్తారు. చెంచులక్ష్మిని వివాహమాటినట్టుగా చెప్పుకుంటారు.
‘‘మా దేవుడు మాదేవుడు నరహరే మా అల్లుడు/మా బిడ్డే మా బిడ్డే చెంచులక్ష్మి మాబిడ్డే/ ఇద్దరు కలిసారో భీముని కొలనులో/ సింగాలో ఎదురయ్యాయి, గండు పిల్లులే ఎదురయ్యాయి/ జింకలే ఎదురయ్యాయి, అడవి ఏనుగులే తోడయ్యాయి.’’
నల్లమల అడవుల్లో శ్రీశైలానికి 18 మైళ్ళ దూరంలో గల భీముని కొలనులో వీరు కలిశారని, నాటి నుంచి చెంచులకు విజయం చేకూరందని వారినమ్మకం. ఆ ఘటనకు సంబంధించిన గేయమే ఇది. లంబాడాలు, సుగాలీల గేయసాహిత్యానికి మరో ప్రత్యేకత వుంది. ఆంధ్రరాష్ట్రంలో యానాదులు, ఎరుకళ్ళు, బంజారాలు మైదాన ప్రాంతంలో జీవిస్తున్నారు. బంజారా తెగల దేశవ్యాప్తంగా 17 రాష్ట్రల్లో విస్తరించి వున్నారు. వీరంతా సంస్కృతిపరంగా సమాన లక్షణాలను కలిగివుంటారు. బంజారాల భాషను ‘గోల్‌బోలి’ అంటారు. బంజారాలు ‘భోంగ్’ పండుగ జరుపుకుంటారు. ఆ రోజు బియ్యపు పిండి, బెల్లం, నెయ్యితో కలిపిన వంటకం చేసి కులదేవతలను, వారి పెద్దలను స్మరించకుంటూ ఈ వంటకాన్ని నిప్పులపై వేస్తూ పూజ చేస్తారు. బంజారా స్త్రీలు ఇసుర్రాయి అనే పనిముట్టులో బియ్యాన్ని పోసి పిండి చేస్తారు. ఈ సందర్భంలో వారు కొన్ని పాటలు పాడతారు. పండుగరోజు తొలికూడి కూయక ముందు పిండి విసరడానికి చెల్లెలు వరస అయిన అమ్మాయిలు బియ్యం ఇసరడానికి వదినను లేపమని అన్నకు చెపుతారు. ఈసందర్భంలోని ఒక పాట వుంటుంది.
‘‘తినపాలి చావళ కాడనాకిభీయా!/ మారిభోళి భావజేన వటాడో బియా!/ఓరోనాను బళారోవ వటాడోభియా!/చారపాలి ఘౌంలా కాడనాకి భీయా!’’ మూడు పాళ్ళ బియ్య తీసినాం, మా చిన్న వదినను లేపు పిండి విసరాలి అన్నా అని చెల్లెలు చెప్పగా, అన్న వచ్చీరానిదులో వుంది. ఒకవేళ లేస్తుందో లేదో అన్ని అన్న చెప్పగా అట్లయితే పిల్లవాడు ఏడుస్తున్నాడని చెప్పు లేస్తుందని అని అన్నతో చెప్పే సందర్భంలోని పాట ఇది.
6. బాలల గేయాలు:
గిరిజన సాహిత్యంలో బాలల గేయాలకు ప్రముఖస్థానం వుంది. చిన్నపిల్లల్ని నిద్రపుచ్చడానికి, వాళ్ళు మారాం చేస్తు న్నప్పుడు ఊరుకోబెట్టడానికి కొన్ని పాటలు పాడుతుంటారు. జోలపాటలు రాగయుక్తంగా పిల్లలకు హాయిగొలిపేవిగా వుండి వారు నిద్రపోతుంటారు. అలాగే అన్నం తినిపించే సమయంలోను, ఆటలాడే సమయంలోను ఇలాంటి పాటలు పాడుతుంటారు.
‘‘హలోరే మాలకీయా, పాలనేరో నింద లేలరే/ సోజ్‌రే బాలకీయా, జోలిరి నిందలేలరే/ హలో హలోరే బాలకీయా, సోజో జోజోరే బాలకీయా/ తారి పాలనేరి గ్యారి, నింద లేలరే బాలకియా’’ పాలు తాగి ఉయ్యాల్లో హాయిగా నిద్రపొమ్మని ఈ పాట భావం. పాలు తాగేటప్పుడు, పండ్లు తినేటప్పుడు ‘‘ఆజో ఆజో అనిత, జర ఆజోతోసై’ పాట పాడుతుంటారు.
7. ముగింపు:
- గిరిజన సాహిత్యంలో ప్రేయసీ ప్రియుల గేయాలు, ప్రియునికి ధైర్యాన్ని నూరిపోస్తూ ప్రియురాలు పాడేపాట, బావపై మరదలు పాడే పాట మొదలయినవి వున్నాయి.
- అలాగే శ్రామిక గేయాలు, దేవతలకు సంబంధించిన గేయాలు, వేంకటేశ్వరస్వామిని స్తుంతించే గేయం మొదలయినవి వున్నాయి.
- ఈ విధంగా గిరిజన సాహిత్యంలో అనేక ప్రక్రియలు వున్నాయి. పొడుపు కథలులు గిరిజన సాహిత్యంలో ప్రాధాన్యతసంతరించుకున్న అంశం. అయితే గ్రామీణ, జానపద సాహిత్యం మీద జరిగిన పరిశోధనల కంటే గిరిజన సాహిత్యం మీద జరిగిన పరిశోధనలు తక్కువుగా వున్నాయి.
- గిరిజనసాహిత్యం మీద ఇంకా జరగవలసిన పరిశోధనలు మిగిలే వున్నాయి. దీనికి సంబంధించి సూక్షస్థాయి పరిశోధనలు కనుక జరిగితే గిరిజన సాహిత్యం ఇంకా విస్తరించే అవకాశం వుంది. ఆఫ్రికా మొదయిలన పాశ్చాత్య దేశాల్లో సాహిత్యం మీద, సంస్కృతి మీద జరిగిన పరిశోధనల్లా భారతదేశంలో గిరిజన సాహిత్యం మీద పరిశోధనలు జరిగితే గిరిజనుల సంస్కృతి వికాసం చెందే అవకాశం వుంది.
8. ఉపయుక్తగ్రంథసూచి:
- కృష్ణకుమారి, నాయని. తెలుగు కావ్యకళాపరిచయం, రెండవ భాగం, హైదరాబాద్, 1995.
- గోనా, నాయక్ ఎం. గిరిజన సాహిత్యం, తెలుగు అకాడమి, హైదరాబాద్, 2012.
- నదీం, హస్‌నైన్. భారతీయగిరిజనలు, ఓరియంటల్ బ్లాక్‌స్వాన్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్, 1995.
- మోహన్, జి.యస్. జానపద విజ్ఞానవ్యాసావళి, శ్రీనివాస పబ్లికేషన్, మలయనూరు, 1981.
- సూర్యనారాయణ, ఎం. భారతీయగిరిజనసముదాయాలు, తెలుగు అకాడమి, హైదరాబాద్, 1983.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.