headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-1 | January 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

12. తెలుగుకవుల అభిమానపద్యాలు: అనుకరణలు

డా. ఎన్. శిల్పారాణి

ఉపాధ్యాయురాలు,
వేమాపురం, తిరుపతి,
తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9502375155, Email: silparanimay26@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

పద్యం తెలుగుజాతి అలంకారం. తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటుతున్నది పద్యం. తెలుగు పద్యానికున్న ఘనతను చాటుతూ, తెలుగునాట ఆణిముత్యాలుగా ఉన్న పద్యరత్నాల్ని గుర్తుచేసుకోవటం, తెలుగు పద్యాలలో ఉన్న సౌందర్యాన్ని తెలియజేస్తూ, కవులకు అత్యంత ప్రియమైన పద్యాలను పరిచయం చేస్తూ, వారి కావ్యాలలో పూర్వపుకవుల పద్యానుకరణలను తెలియజెప్పటం ఇక్కడి ఉద్దేశం. ఈ వ్యాసానికి నా విద్యార్థి దశలోని ఉపాధ్యాయుల ప్రసంగాలు, వివిధ సాహితీసదస్సుల్లోని ప్రసంగాలు, వివిధ సాహిత్యచరిత్ర గంథాలతోపాటు రాత-గీత: పద్యం అనుకరణ, అనుసరణ, సాహితీనందనం వంటి అంతర్జాలంలో లభిస్తున్న వ్యాసాలు ప్రేరణలు. ఇలాంటి వ్యాసాలను స్ఫూర్తిగా చేసుకొని తెలుగుపద్యాన్ని ప్రత్యేకంగా అధ్యయనం చేయడానికి అవకాశం ఏర్పడటానికి, తెలుగుపద్యం ప్రత్యేకతను తెలుగుకవుల అభిమానపద్యాల అనుకరణలు, అనుసరణలపై ప్రత్యేక పరిశోధన చేయటానికి ఈ వ్యాసం దోహదపడుతుందన్న లక్ష్యం ఇందులోని ప్రధానాంశం. నన్నయ, తిక్కనాదులు తమకెంతో ఇష్టమైన పద్యాలను తమ గ్రంథాల్లో పునరావృతం చేశారు. నన్నయాదుల్ని అనేకమంది తరువాతి కవులు అభిమానించి తమ గ్రంథాల్లో వారి పద్యశైలిని అనుసరించి తమ కృతజ్ఞతను తెలుపుకున్నారు. అందువల్ల పూర్వకవుల పద్యం మరింత శోభాయమానం కావటంతోపాటు, ఆ శైలి మరింత విస్తరించింది. ఈ పద్యానుసరణ పరిణామాన్ని సమగ్రంగా పరిశీలించి పద్యసౌందర్యాన్ని రాబోయేతరాలకు అందించే అధ్యయనం జరగవలసిన అవసరాన్ని ఈ వ్యాసం తెలియజేస్తుంది.

Keywords: పద్యం, కవిత్వం, ప్రాచీనసాహిత్యం, అనుకరణ, ప్రభావం.

1. ఉపోద్ఘాతం:

సంప్రదాయసాహిత్యం అంటే పద్యం. సంప్రదాయపద్యవైభవాన్ని తెలుగుజాతి అనునిత్యం పారాయణచేయాలి. ఆదికవి నన్నయ ఎంతోమంది మహాకవులకు సైతం ఆరాధ్యుడు. నన్నయగారి దగ్గరనుంచి తిక్కన, ఎఱ్ఱన వంటి కవిపండితుల పద్యశైలిని తరువాత వచ్చిన మారన, పోతనాది కవులంతా అనుసరించి వారి అభిమానాన్ని చాటుకున్నారు. ఆ కవుల పద్యాలను, అందులోని సందర్భాలను, సౌందర్యాన్ని సందర్భానుసారంగా వర్ణిస్తూ, వారి అనుసరణలను ఎత్తిచూపటం ఇందులోని ముఖ్యాంశం.

ఆంధ్రభాషాయోష అమృతంపు పలుకులు- పండితహృద్యమై పద్యమాయె
అలపాలకడలి దేవాసురుల్ మధియింప- ప్రబలిన సుధ తెల్గు పద్యమాయె
నిర్జరాధీశుని నిర్జించి ఖగరాజు- బడసిన సుధ తెల్గు పద్యమాయె
సుమశరారి మనోజ్ఞ డమరుకన్వెల్వడి- పరతెంచు ధ్వని తెల్గు పద్యమాయె
నారదుని దివ్య మహతీ నినాదజనిత- భవ్య గానామృతము తెల్గు పద్యమాయె
పద్యకవిత సరస్వతీ పాదపద్మ- మహిత మంజీర నాదసంభవముగాదె”

అని జంధ్యాల పాపయ్యశాస్త్రిగారు తెలుగు పద్యవైభవాన్ని ఎలుగెత్తి చాటారు. తెలుగువారి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటినది పద్యం. పద్యం తెలుగువారి ఆస్తి. తెలుగుజాతికి మాత్రమే ప్రత్యేకించిన గొప్ప రచనాప్రక్రియ. తెలుగు పద్యానికి వెయ్యేళ్ళకు పైబడిన చరిత్ర ఉంది. పద్యం మంచిగంధం, పద్యం మల్లె పరీమళం. పద్యానికి అలతి అలతి సుకుమార పదాలతో వయ్యారాలొలికే సొగసు ఉంది. సుదీర్ఘ సమాసాలతో భావావేశాన్ని, రసానుభూతిని కలిగించే శక్తి ఉంది. పద్యానికి ఎంతటి పాషాణహృదయాన్నైనా రసానందంలో ఓలలాడిస్తుంది. పద్యం ఒక అద్భుతం, ఆశ్చర్యం, ఆనందం. అంతటి ఉత్తమశక్తి కలిగిన పద్యాన్ని, రాసిన కవులకు కూడా ఉన్నతపీఠం దక్కింది.

2. మహాకవుల అభిమానపద్యాలు:

మహాకవులు సైతం పద్యాన్ని గొప్పగా ఆదరించారు, అభిమానించారు. అందువల్ల సహజంగానే కొన్ని పద్యాలను తమ కావ్యాల్లో అప్రయత్నంగా పునరావృతం చేసి ఆ పద్యాలపై వారికున్న ప్రేమను తెలియజేశారు. అలాగే కొందరు కవులు తమ అభిమాన కవుల పద్యాల్ని తమ కావ్యాల్లో ఒకటి రెండు పాదాలనో, పూర్తి పద్యాన్నో అనుసరించి లేదా ఆ పద్యప్రేరణతో రాసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అయితే ఈ రెండు విషయాల్లో మొదటి విషయంలో ప్రథములు ఆదికవి నన్నయ. 

2.1 నన్నయ అభిమానపద్యం:

నన్నయ భారతం ఆదిపర్వం ప్రథమాశ్వాసంలో ఉదంకుడు జనమేజయునికి సర్పయాగబుద్ధిని కలిగించే సందర్భంలో చెప్పిన ఈ క్రింది పద్యం గమనించండి.

కాదన కిట్టిపాటి యపకారముఁ దక్షకుఁ డేకవిప్రసం
బోధనఁ జేసి చేసె నృపపుంగవ! నీవు ననేకభూసురా
పాదిత సర్పయాగమున భస్మము సేయుము తక్షకాదికా
కోదరసంహతిన్‌ హుతవహోగ్ర సమగ్ర శిఖాచయంబులన్‌” (ఆది.1-124)

ఈ పద్యంలో ఉదంకుడు జనమేజయునికి తక్షకుడు శమీకుడి కొడుకైన శృంగి అనే బ్రాహ్మణుని ప్రేరణతో తన తండ్రిని చంపాడు. అందుకు ప్రతీకారంగా నీవు కూడా కొందరు బ్రాహ్మణుల సహాయంతో సర్పయాగం చేసి తక్షకుడు మొదలైన పాములసమూహాన్ని యజ్ఞంలో బూడిద చేయమని చెబుతున్నాడు. ఇది ఆదిపర్వం ప్రథమాశ్వాసంలోని పద్యం. ఇదే పద్యాన్ని నన్నయగారు జనమేయుడు సర్పయాగాన్ని చేస్తున్న సందర్భంలో మరోసారి చెప్పాడు. ఆదిపర్వం ద్వితీయాశ్వాసం రెండువందల ఒకటో పద్యంగా ఎలాంటి మార్పులేకుండా చెప్పటం నన్నయగారికి ఆ పద్యంపట్ల వున్న ప్రత్యేకమైన అభిమానాన్ని తెలియజేస్తున్నది. ఇది ఒక గొప్ప విశేషంగా చెప్పవచ్చు.

2.2 తిక్కన అభిమానపద్యం:

తిక్కనగారు కూడా నన్నయగారి లాగే తన పద్యాలకు తాను మురిసిపోయి ఇలాంటి పనే చేశారు. విరాటపర్వం కీచకవధఘట్టంలో ద్రౌపది కీచకునితో తన భర్తల బలపరాక్రమాల్ని చెప్పి భయపెడుతున్న పద్యం. ఈ పద్యం తెలుగు ప్రజలకు అత్యంత ఇష్టమైన పద్యాల్లో ఒకటి.

దుర్వారోద్యమ బాహువిక్రమ రసాస్తోక ప్రతాపస్ఫుర
ద్గర్వాంధ ప్రతివీర నిర్మథన విద్యాపారగుల్ మత్పతు-
ల్గీర్వాణాకృతు లేవురిప్డు నిను దోర్లీలన్ వెసన్ బట్టి గం-
ధర్వుల్ మానము ప్రాణముం గొనుట తథ్యంబె మ్మెయిం కీచకా” (విరాట.2-55)

ఈ పద్యాన్ని ద్రౌపది మొదట కీచకుడిని భయపెట్టటానికి కీచకుని ఎదుట చెప్పింది. మళ్ళీ పాండవులముందు ప్రత్యేకంగా భీముడికి ‘ఇప్డు నిను దోర్లీలన్ వెసన్ గిట్టి మానముఁ బ్రాణముం గొనుట తథ్యం బెమ్మెయిన్’ అని తానన్న మాటల్ని నిజం చేయాలని పరోక్షంగా సూచించటానికి యధావిధిగా చెబుతుంది. ఈ పద్యం తెలుగు ప్రజలందరి నోళ్ళలో నానిన గొప్ప పద్యం. ఈ పద్యం తిరిగి విరాటపర్వం రెండో ఆశ్వాసంలోనే 172వ పద్యంగా కనబడుతుంది.

3. పద్యానుకరణలు- అనుసరణలు:

పద్యరచనలో అనుకరణ, అనుసరణ అనే మాటలకు ఒక ప్రత్యేకత ఉంది. మనలను ప్రభావితం చేసిన వారి పంథాలో మనమూ నడిస్తే అప్రయత్నంగా మన రచనలో వారి శైలి పొడచూపితే అది అనుకరణ. ఇక్కడ స్ఫూర్తి పదప్రయోగం వరకు మాత్రమే నియమితమై ఉంటుంది. పద్యభావం నుండి కూడా స్ఫూర్తిపొందితే అది అనుసరణ. ఒకవిధంగా చెప్పాలంటే తత్ మూల పద్యాన్ని రాసిన కవికి ఈ పద్య రచయిత సమర్పించుకునే కృతజ్ఞతాపూర్వక నమస్కృతి అని చెప్పవచ్చు.”1

ఇలా అనుకరణకు, అనుసరణకు ఉన్న వ్యత్యాసాన్ని చెప్పుకుంటూ పూర్వకవుల్ని తరువాతి కవులు తమ పద్యాల ద్వారా చాటుకున్న అభిమానాన్ని పరిశీలిద్దాం.

3.1 భారతకవులు:

నన్నయ, తిక్కన, ఎఱ్ఱన భారతకవులు. ఆదికవి అయిన నన్నయ అంటే తరువాతి కవులందరికీ అభిమానమే. తిక్కన మొదలుగా అనేకమంది కవులు నన్నయను అనుసరించినవారే. వీరికి తెలుగునాట మిగతాకవులకంటే ఒకింత ఉన్నతాసనమే ఉంది. ఈ ముగ్గురినీ సాధారణంగా తెలుగు కవులు తమ అభిమాన కవులపై ఉన్న గౌరవంతోనో, ఆ పద్యశైలి పై ఉన్న అభిమానంతోనో ఆ పద్యాల్ని వారి కావ్యాల్లో ఉపయోగించటం కనిపిస్తుంది. ఈ సంప్రదాయం తొలుత భారతకవుల్లోనే కనబడుతుంది.

ఎఱ్ఱాప్రెగడ నన్నయగారిని ‘సకల లోకైక విదితుఁ డయిన నన్నయభట్ట మహాకవీంద్రుడు’ అని నుడివి అతని ‘సరససారస్వతాంశ’ తనకు అబ్బిందని చెప్పుకున్నాడు. లోకం నన్నయగారు విడిచిన భారతాన్ని నన్నయ రచనలాగే పూర్తిచేయమని కోరినప్పుడు ఎఱ్ఱన అలాగే పూర్తిచేశాడు. ఈ సందర్భంలో ఆరణ్యపర్వశేషంలో కొన్నిచోట్ల నన్నయవలనే రాసి నన్నయగారిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.

నన్నయగారు సభాపర్వం ద్వితీయాశ్వాసంలో భీష్ముడు శిశుపాలుడిని నిందించే సందర్భంలో చెప్పిన పద్యమిది. ఈ పద్యం యదువృష్ణిభోజ కుకురాంధకవంశ వీరుల సైన్యమనే నది వేగంగా కదులుతున్న గుర్రాలనే అలలతో, మదపుటేనుగులనే మొసళ్ళ సమూహాలతో, అమితంగా అటు ఇటు తిరుగుతూ మెరుస్తున్న సైనికులనే చేపలతో, భయంకరమై, ఏమాత్రం దయలేని కోపమనే ఎడతెగని గాలివీచగా ఒక్క క్షణంలో కలత చెందింది. ఈ పద్యం శబ్దఘటనచేత అర్థస్ఫూర్తిని కలిగించే నన్నయగారి అక్షరరమ్యతకు గొప్ప ఉదాహరణ.

రయవిచల త్తురంగమ తరంగములన్‌ మదనాగ నక్ర సం
చయముల సంచలచ్చటుల సైనిక మత్స్యములన్‌ భయంకరం
బయి యదువృష్ణిభోజ కుకురాంధక వాహినియుం గలంగె ని
ర్దయతరరోషమారుత నితాంత సమీరితమై క్షణంబునన్‌ (సభా-2-33)

ఎఱ్ఱనగారు ‘తత్కవితారీతియు కొంత దోప’ అని నన్నయ కవిత్వాన్ని ఉద్దేశించి చెప్పుకున్నాడు. అందువల్లనే నన్నయగారి పై పద్యాన్ని తన ఆరణ్యపర్వశేషం షష్ఠాశ్వాసంలో అనుసరించాడు. దుర్యోధనుడు ప్రాయోపవేశాన్ని మాని కరిపురానికి ప్రయాణమైన సందర్భంలో చెప్పిన పద్యమిది. ఇందులో మొదటి రెండు పాదాలను యధావిధిగా తీసుకొని, రెండోపాదం చివరినుంచి తన కవిత్వాన్ని జోడించాడు.

రయ విచలత్తురంగమ తరంగములన్‌ మదనాగ నక్రసం
చయములఁ జంచలచ్చటుల సైనిక మత్స్యములన్‌ మహోన్నతం
బయి కురురాజచంద్రు నుదయంబునఁ దద్దయుఁ బొంగెఁ బ్రస్ఫుర
ద్భయద మనోహర ప్రకట భంగులఁ దద్భటవార్ధి యుద్ధతిన్‌” (ఆరణ్య-6-58)

‘వేగంగా కదిలే గుఱ్ఱాలనే కెరటాలతో, మదించిన ఏనుగులనే మొసళ్ళగుంపులతో, అధికంగా కదలాడే సైనికులనే చేపలతో వెల్లివిరిసి, కౌరవరాజు దుర్యోధనుడనే చంద్రుడి రాకతో ఆ సైన్యమనే సముద్రం ఉత్సాహంతో రమణీయభయానకంగా విజృంభించిందని ఈ పద్యానికి అర్థం. ఈ పద్యం ఎఱ్ఱనగారిదే అయినా నన్నయకవితారీతిని అధికంగా చూపుతున్నది.

3.2 పోతన:

నన్నయగారు తెలుగులో కావ్యసృష్టి చేసిన తొలికవి, ఆదికవి. భారతం ఉదంకోపాఖ్యానంలో నన్నయగారు రాసిన నాలుగు పద్యాలు ఒక నూతన ఒరవడిని సృష్టించాయి. ఉదంకుడు నాగరాజులను స్తుతించే సందర్భంలో చెప్పిన ప్రతి పద్యం చివరిపాదాంతంలో “మాకు ప్రసన్నుఁడయ్యెడున్” అనే పదాలు తరువాత వచ్చిన ఎంతోమంది కవులకు సమానమకుటంగల శతకాలకు మార్గదర్శకాలైనాయని చెప్పవచ్చు. ఈ పద్యాలు నన్నయగారి అక్షరరమ్యతకు అద్భుతమైన ఉదాహరణలు. ఈ పద్యంలో ‘స’కారంతో కూడిన ఊష్మాక్షరాలనుపయోగించి నన్నయగారు చేసిన రచనాశిల్పం పాములకు సహజమైన బుసల్ని తలపిస్తుంది.

“బహువన పాదపాబ్ధి కులపర్వత పూర్ణ సరస్సరస్వతీ
సహిత మహామహీభర మజస్ర సహస్ర ఫణాళిఁ దాల్చి దు
స్సహతర మూర్తికిన్ జలధిశాయికిఁ బాయక శయ్య యైన య
య్యహిపతి దుష్కృతాంతకుఁ డనంతుఁడు మాకుఁ బ్రసన్నుఁ డయ్యెడున్” (భా.ఆది.1-104)

ఈ పద్యం తరువాత వచ్చిన ‘అరిది తపోవిభూతి’, ‘దేవమనుష్యలోకములన్’, ‘గోత్రమహామహీధర నికుంజములన్’ పద్యాలలో చివరిపాదాంతంలో ఉన్న ‘మాకుఁ బ్రసన్నుఁ డయ్యెడున్’ అన్న మాట పోతనగారికి ఎంతో ఇష్టమైనది. ఆయన తన ‘వీరభద్ర విజయము’ దేవతాప్రార్థనలో యధావిధిగా అనుకరించారు.

“లలితంపుభూతియును శేషవిభూషణమున్ శిరంబు పై,
వేలుపు టేరు పాపటను వెన్నెలపాపఁడు మే గొండరా,
చూలియుఁ గేల ముమ్మొనలశూలము నీలగళంబు గల్గునా,
వేలుపు శ్రీమహానగము వేలుపు మాకుఁ బ్రసన్నుఁడయ్యెడున్ (వీ.వి.1-1)

ఈ పద్యం తరువాత రెండవ పద్యమైన “సిరియును వాణి గౌరి…” అనే పద్యం చివరిపాదంలో “మాకు ప్రసన్నుడయ్యెడున్” (వీ.వి.1-2) అని చెప్పటం గమనించవచ్చు. ఈ సందర్భం నన్నయగారి రచనపై పోతనగారికున్న అభిమానాన్ని తెలియజేస్తుంది.

మంచన తిక్కనకు సమకాలీనకవి. ఆయన రాసిన కేయూరబాహుచరిత్ర అనే నీతికథాకావ్యంలో చెప్పిన పద్యానికి పోతన మురిసి, ఆ పద్యాన్ని స్వల్పమైన మార్పుతో ఉపయోగించుకుట్లుగా తెలుస్తున్నది. ఈ పద్యం మంచన పద్యం అన్నదానికంటే కూడా పోతనగారిదిగానే మిక్కిలి ప్రసిద్ధిపొందింది. మంచన తను కన్నబిడ్డవంటిది, ఎంతో సుకుమారమైనది అయిన తన కావ్యకన్యను రాజులకు అమ్ముకుని, వారిచ్చే ధనాన్ని తీసుకోవటం నీచమైనది, దానిమీద బతకటం పడుపువృత్తితో సమానంగా భావిస్తాడు. అందువల్లనే తిక్కనవంటి మంత్రి నండూరి గుండయమంత్రికి అంకితమిచ్చాడు. ఈ సందర్భంలో చెప్పిన ఈ పద్యం ఆనాటి కవుల ఆత్మగౌరవాన్ని సూచిస్తున్నది. తరువాతి కవులకు స్ఫూర్తివంతంగా నిలిచింది.

“బాలరసాలపుష్పనవపల్లవకోమలకావ్యకన్యకన్
గూళల కిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటే సత్కవుల్
హాలికు లైననేమి మఱి యంతకు నాయతి లేనినాఁడు గౌ
ద్దాలికు లైననేమి నిజధారసుతోదరపోషణార్థమై (కే.చ.1.13)

మారన చెప్పిన ఈ పద్యం పోతనగారిని ఎంతగానో ఆకర్షించింది. శ్రీనాథుడు పోతన భాగవత కావ్యాన్ని రాజుకు అంకితమిచ్చి ఆస్తులు, అగ్రహారాలు పొందమని చెప్పగా ఇదే పద్యాన్ని ఎంతో పౌరుషంతో శ్రీనాథునికి ఎత్తిపొడుపుగా చెప్పినట్లుగా జనశ్రుతి. ఈ పద్యం పోతన రచనల్లో లేదుగానీ, ఆశువుగా చెప్పిన చాటుపద్యంగా ప్రసిద్ధి. ప్రధానంగా ఈ పద్యం తొలిపాదంలో ‘పుష్ప’ అన్నచోట ‘సాల’ అని, మూడవపాదంలో ‘మఱి యంతకు నాయతి లేనినాఁడు’ అన్నచోట ‘గహనాంతర సీమల కందమూల’ అని మాత్రమే స్వల్ప మార్పుతో ఉండటం విశేషం. పోతన చాటుపద్యంగా చెప్పబడుతున్న ఈ పద్యాన్ని గమనించవచ్చు.

“బాలరసాలసాలనవపల్లవకోమలకావ్యకన్యకన్
గూళల కిచ్చి యప్పడుపుఁగూడు భుజించుటకంటే సత్కవుల్
హాలికు లైననేమి గహనాంతర సీమల కందమూల కౌ
ద్దాలికు లైననేమి నిజధారసుతోదరపోషణార్థమై”

 

సకలభాషాభూషణ, సాహిత్యరసపోషణ, సంవిధాన చక్రవర్తి, నవీన గుణసనాధ అని బిరుదాలు కలిగిన నాచన సోమన తెలుగు సాహిత్యంలో ఒక విలక్షణకవి, ప్రత్యేకమైనకవి. తన ఉత్తరహరివంశం అనే విశిష్టమైన కావ్యం ద్వారా మహాకవుల సరసన చేరిన గొప్పకవి. ఈ కవినుద్దేశించి చిన్నయసూరి “ఘను నన్నయభట్టును, దిక్కన, నేరాప్రగడఁ బొగడి, యళికంబున యక్షిని దాచినట్టి సర్వజ్ఞుని నాచన సోమనాథు స్తుతి యొనరింతున్” అన్నాడు. బహుజనపల్లివారు “అది మిక్కిలి ప్రౌఢముగానూ, భారతముకంటె ఎల్ల విధముల విశేషించినదిగానూ కానంబడుచున్నది. ఇతనిని సర్వజ్ఞుడందురు. అట్లనుటకు సందేహింప బనిలేదు” అని కొనియాడారు. సోమనకు తిక్కన అభిమానకవి అని కూడా అంటారు.

నరకాసురుని పై యుద్ధానికి పోతూ శ్రీకృష్ణుడు సత్యభామను కూడా తోడు తీసుకువెళతాడు. రాక్షసవీరులతో యుద్ధం చేస్తూ, మూర్ఛపోయినప్పుడు సత్యభామ తన ధనుస్సు పట్టి యుద్ధం చేస్తుంది. ఆమె నరకాసురునితో యుద్ధం చేసేటప్పుడు ఆమె సంరంభాన్ని వర్ణిస్తూ చెప్పిన పద్యం తెలుగుసాహిత్యంలో నాచనసోమన స్థానాన్ని పెంచిందని చెప్పవచ్చు.

అరిఁ జూచున్ హరిఁ జూచుఁ జూచుకములం దందంద మందారకే
సరమాలామకరంద బిందు సలిలస్యందంబు లందంబులై
తొరుగం బయ్యెదకొం గొకింతఁ దొలఁగం దోడ్తో శరాసారమున్
దరహాసామృతపూరముం గురియుచుం దన్వంగి కేళీగతిన్” (ఉ.హ.1-162)

సత్యభామ సహజంగానే వీరనారి. ఆమెకు నరకునివంటి వీరునితో యుద్ధం చేసే అవకాశం వచ్చింది. తన పరాక్రమాన్ని ప్రదర్శించే అవకాశమది. ఆ సందర్భంలో ఇటు శత్రువును చూస్తూ, అటు ప్రియుని చూస్తూ ఏకకాలంలో వీరాన్నీ, శృంగారాన్నీ ప్రదర్శిస్తున్నది సత్యభామ. ఆమె అటు అరిని (శత్రువుని) చూస్తున్నది. అతని మీద బాణ పరంపర కురిపిస్తున్నది. ఇటు హరిని చూస్తున్నది. అతనిపై చిరునవ్వులను చిందిస్తున్నది. ఈ రెండు పనులూ ఏకకాలంలో నిర్వహిస్తున్నది. ఆ సందర్భంలో ఆమె పయ్యెద కొంగు కొంచెం తొలిగింది. మెడలోని మందారమాలలోని పువ్వులనుంచి తేనెసొనలు కురిసి ఆమె వక్షస్థలాన్ని చిత్తడి కావిస్తున్నాయి. ఆమె సౌందర్యమూ, శృంగారమూ, వీరమూ, చిరునగవు, మెడలోని మందారదామంలోని మకరందాలధార, కొంచెంగా తొలగిన పైటకొంగు ఒక ఆహ్లాదకరమైన దృశ్యాన్ని ఈ పద్యంలో రూపు కట్టించాడు సోమనకవి. ఈ పద్యం పోతనవంటి సహజకవిని ఆకర్షించింది. అందువల్ల సోమన పద్యాన్ని తన భాగవతం దశమస్కంధం ఉత్తరభాగంలో నరకాసురవధ ఘట్టంలో అనుకరించాడు.

పరుఁ జూచున్ వరుఁ జూచు నొంప నలరింపన్ రోషరాగోదయా
విరతభ్రూకుటిమందహాసములతో వీరంబు శృంగారమున్
జరగం, గన్నులఁ గెంపు సొంపుఁ బరఁగం, జండాస్త్రసందోహమున్
సరసాలోక సమూహమున్ నెఱపుచుం, జంద్రాస్య హేలాగతిన్ (భాగ.10.ఉ.భా-178)

ఇక్కడ “అరిఁజూచున్, హరిఁజూచున్…” అన్నచోట “పరుఁజూచున్ వరుఁజూచున్” అని మార్చి ఆ సందర్భానికి సరిపోయేలా పోతనగారు తన పద్యాన్ని రాసుకుని సోమన పద్యంపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.

సహజకవిగా, ప్రజాకవిగా పేరుదక్కిన పోతన కవిత్రయం తర్వాత వచ్చిన గొప్పకవి. నన్నయ తిక్కనాది కవులు భాగవతాన్ని తనకోసమే వదలారని, ఆ రచనచేసి తన జననంబు సఫలంబు చేసుకొంటానని చెప్పుకున్న సౌమ్యుడు పోతనామాత్యుడు. ఆయన భాగవతాన్ని ఎంత సమర్ధవంతంగా నిర్వహించాడో యావత్ తెలుగుజాతికి తెలుగు. ఇప్పటికీ ఆయన పద్యం పామరలోకంలో నిలిచివుండటమే అందుకు సాక్ష్యం. ఆయన రాసిన ఎన్నో పద్యరత్నాలు తరువాతి కవులకి అనుసరణీయాలైనాయి.

భాగవతంలోని ప్రతి పద్యం ఒక అమృత సమానమే. అయితే గజేంద్రమోక్షంలోని పోతనగారు చెప్పిన ఒక పద్యం శ్రీకృష్ణదేవరాయలకు ప్రీతిపాత్రమై, ప్రేరణగా నిలిచింది. ఈ పద్యం చాలా సులువైన పద్యం. చిన్నచిన్న తేలికైన మాటలతో భావం ఇట్టే అర్థమయ్యే అందమైన పద్యం. ఈ ప్రపంచాన్ని ఎవరివలన పుట్టిందో, ఎవరిలో కలిసిపోతుందో, ఎవరి లోపల ఉన్నదో, అంతటికీ ఈశ్వరుడెవరో, అన్నిటికీ కారణమైన వాడెవరో, ఆది, అంతంలేని వాడెవరో, సర్వంతానే అయినవాడెవరో, ఆత్మస్వరూపుడైనవాడెవరో అటువంటి ఈశ్వరుడినే నేను శరణు వేడుకుంటున్నాను అని ఈ పద్యానికర్థం. ఈ పద్యంలో గొప్ప వేదాంతం ఉంది.

ఎవ్వనిచే జనించు జగ మెవ్వనిలోపల నుండు లీన మై
యెవ్వనియందు డిందుఁ బరమేశ్వరుఁ డెవ్వఁడు మూలకారణం
బెవ్వఁ డనాదిమధ్యలయుఁ డెవ్వఁడు సర్వముఁ దాన యైన వాఁ
డెవ్వఁడు వాని నాత్మభవు నీశ్వరు నే శరణంబు వేఁడెదన్‌” (భాగ.8-73)

భాగవతంలో మొసలివాతపడి దీనావస్థలో ఉన్న గజేంద్రుడి సందర్భం, ఆముక్తమాల్యదలోని రాక్షసుడి చేత చిక్కిన దాసరి సందర్భానికి సరిపోతుంది. ఈ సందర్భంలో పోతన గజేంద్రుని నోట పలికించిన పద్యానికి అనుకరణగా రాయలు చెప్పిన పద్యం ఎంత రమణీయంగా కనబడుతుంది.

ఎవ్వని చూడ్కిఁ జేసి జనియించు జగంబు, వసించు నిజ్జగం
బెవ్వని యందు, డిందు మఱి యెవ్వనియం దిది, యట్టి విష్ణుతో
నివ్వల నొక్క వేల్పు గణియించిన పాతకి నౌదు నేఁడనే
నెవ్విధినైన ని న్గదియనేని, యన న్విని బంధ మూడ్చినన్‌ (ఆముక్త.6-43)

ఎవ్వని చూపుతో సృష్టి రూపెత్తి, ఎవ్వనిలో నివసిస్తూ, తుదకెవ్వనిలో లీనమవుతున్నదో అలాంటి శ్రీమహావిష్ణువుతో ఇవతల సిబ్బిలో మరొక దేవతను తూస్తే, ఎంతటి పాపానపోతానో నేను తిరిగి రాకపోతే అంత పాపానపోతాను, అనగానే వాడు బంధం తొలగించాడు”2 అని ఈ పద్యానికర్థం. ఈ పద్యంలోని ఎత్తుగడ అంతా పోతనగారి పద్యానికి సమానం.

పైన చెప్పిన భాగవతంలోని పోతనగారు చెప్పిన ‘ఎవ్వనిచే జనించు జగము’ పద్యంగానీ, ఆముక్తమాల్యదలో రాయలు చెప్పిన ‘ఎవ్వని చూడ్కిఁ జేసి’ అనే పద్యంగానీ రెండూ కూడా తిక్కన శిష్యుడు, తెలుగులో తొలిపురాణాన్ని అనువదించినవాడు అయిన మారన రాసిన మార్కండేయపురాణం హరిశ్చంద్రోపాఖ్యానంలోని ఈ కింది పద్యానికి ప్రేరణగా కనిపిస్తున్నాయి. ఆ పద్యాన్ని గమనించండి.

ఎవ్వనిమాహాత్మ్య మెప్పుడు వేదము ల్చెలఁగి సుస్తోత్రము ల్సేయుచుండు
నెవ్వనిశాసనం బేడుదీవులరాజులకు శిరోభూషణలక్ష్మి నొందు
నెవ్వనిరక్ష మహేంద్రాదిసురలకుఁ బెట్టనికోట యై పెంపుదాల్చు
నెవ్వనిసత్కీర్తి యీయజాండం బెంత యంతయుఁ దానయై యతిశయిల్లు
నట్టిమహితగుణాభరణాభిరామ, మూర్తి ప్రత్యర్థినృపసమవర్తి పరమ
పూజ్యసామ్రాజ్యవైభవస్ఫూర్తి నిత్య, సత్యవర్తి హరిశ్చంద్రచక్రవర్తి” ⁠ (మార్కం.పు.1-142)

ఇలాంటిదే ఈ కావ్యంలోనే ఇంకోపద్యం ధర్మపక్షులు భారతార్థసంశయాలను చెప్పే సందర్భంలో చెప్పబడింది గమనించండి. నిజానికి పై పద్యంకంటే ఈ పద్యమే ముందు చెప్పబడింది. అయితే ఈ పద్యం తేటగీతి ఛందస్సులో ఉన్నది.

ఎవ్వఁ డబ్ధిపర్యంక శాయిత్వలోలుఁ
డెవ్వఁ డఖిలప్రజాసర్గహేతుభూతుఁ
డెవ్వఁ డాదిమసంయమిధ్యేయమూర్తి
యట్టిదేవుండు సకలలోకార్చితుండు (మార్కం.పు.1-109)

కవిబ్రహ్మ, ఉభయకవిమిత్రుడైన తిక్కనగారు ‘తింటే గారెలు తినాలి- వింటే భారతం వినాలి’ అన్నంత గొప్పగా భారతాన్ని రాశారు. తెలుగుసాహిత్యంలో కావ్యప్రక్రియకు ఒక నూతన రచనాశైలిని తెచ్చిపట్టి ‘తిక్కన శిల్పపుతెనుఁగుతోట’గా పేరుతెచ్చుకున్నారు. కేవలం కవిగానేకాక సమర్థుడైన మంత్రిగా, రాయబారిగా, ధర్మకర్తగా, నీతివేత్తగా ఎన్నో పాత్రలు పోషించిన ధీమంతుడు. భారతంలోని పదిహేను పర్వాలను ఒంటిచేతుమీదుగా ‘ఆంధ్రావళి మోదంబొరయునట్లు’గా రాసి తెలుగుజాతికి అంకితం చేశాడు. నాటకీయశైలికి రూపకల్పన చేసి కావ్యగౌరవాన్ని మరింత పెంచిన మహాకవి. విరాటపర్వంలో ‘భీమునితో ద్రౌపది ధర్మరాజు గొప్పతనాన్ని గురించి’ చెబుతున్న సందర్భంలో తిక్కన చెప్పిన సీసపద్యం తరువాతి కవులకు ప్రేరణగా నిలచింది.

ఎవ్వని వాకిట నిభమద పంకంబు- రాజభూషణ రజోరాజి నడఁగు
ఎవ్వని చారిత్ర మెల్ల లోకములకు- నొజ్జయై వినయంబు నొరపు గఱపు
నెవ్వని కడకంటి నివ్వటిల్లెడు చూడ్కి- మానిత సంపద లీనుచుండు
నెవ్వని గుణలత లేడు వారాసుల- కడపటి కొండపైఁ గలయ బ్రాఁకు
నతడు భూరిప్రతాప, మహా ప్రదీప- దూర విఘటిత గర్వాంధకార వైరి
వీర కోటీరమణి ఘృణివేష్టితాంఘ్రి- తలుఁడు కేవల మర్త్యుఁడె ధర్మసుతుఁడు” (భా. వి. 2-191)

ఈ పద్యం ధర్మరాజు మహిమని తెలియజేస్తుంది. ధర్మరాజు సామాన్యమానవుడుకాదని చెబుతూ, లోకాలన్నిటికి ఆదర్శమైన ఉత్తమప్రవర్తనకు ఆయన నిలయమని, వినయవర్తనానికి ఒరవడిపెట్టినవాడని, ఆయన కటాక్షవీక్షణం గొప్ప సంపదల్ని కలుగజేస్తుందని, ఆయన సుగుణాలనే తీవెలు సప్తసముద్రాలుదాటి చక్రవాళ పర్వతంమీదకు కలయప్రాకుతాయని, ఆయన మహాపరాక్రమమనే పెద్దదీపం శత్రువుల గర్వమనే అంధకారాన్ని దూరంగా పారద్రోలుతుందని, ఆయన పాదాలు శత్రువీరుల కిరీటాల్లోని రత్నకాంతులతో సదా ఆవరింపబడి వెలిగిపోతాయని అటువంటి ధర్మరాజు కేవలం మానవమాత్రుడు కాదని అర్థం. ఈ పద్యం ఉదాత్తాలంకారంతో సాగుతూ ఉత్తమమైనదిగా నిలచింది.

3.3 మొల్ల:

ఈ పద్యాన్ని అభిమానించిన ఆతుకూరి మొల్ల తన రామాయణంలో ఇలాంటి పద్యాన్నే రాసింది.

ఎవ్వాని వీటికి నేడు వారాసులు పెట్టనికోటలై పెచ్చు పెరుఁగు
నెవ్వాని సేవింతు రింద్రాదిదేవత లనుచరబలులయి యనుదినంబు
నెవ్వాని చెఱసాల నేప్రొద్దునుందురు గంధర్వ సుర యక్ష గరుడ కాంత
లెవ్వాని భండార మిరవొంద విలసిల్లు నవ నిధానంబుల వివిధభంగి
సకలలోకంబులును మహోత్సాహవృత్తి నెవ్వనికిఁ జెల్లుఁ బుష్పక మ్మెక్కి తిరుగ
నాకెతక్కగగలదె యేనాటనైన మద్భుజాశక్తి ప్రతి పోల్ప నద్భుతంబు” (రామా. సుందర. 47)

ఈ పద్యం రోజురోజుకు సీతమీద ప్రేమ ఎక్కువవుతున్న రావణుడు తనను గురించి తాను గొప్పగా సీతకు చెప్పుకుంటున్న సందర్భం. ఈ సందర్భం సరిగ్గా ధర్మరాజు మహిమను తెలియజేసే తిక్కన పద్యానికి ప్రతిబింబంగా తోస్తుంది.

3.4. మారన:

తిక్కనగారి ‘దుర్వారోద్యమ బాహువిక్రమ..’ పద్యాన్ని అభిమానిస్తూ మార్కండేయ పురాణంలో మారన అలాంటిదే ఒక పద్యాన్ని రాయటం విశేషం. ఆ పద్యాన్ని గమనించగలరు.

దుర్వాసుం డతికోపవిస్ఫురితవక్త్రుండై యన్న్ దానితో
గర్వాంధ్యంబున మత్తపంబునకు విఘ్నం బాచరింపంగ నా
గీర్వాణాధిపుతోడఁ బూనితి కడుం గీడేల లేకుండు? నీ
గర్వం బంతయు నుజ్జగించి విహగాకారంబునం బుంశ్చలీ!” (మార్కం.పు.1-28)

దుర్వాసమహర్షి తపస్సును చెడగొట్టటానికి వచ్చిన వపువనునచ్చరని శపించి పక్షిగా మార్చిన సందర్భంలో చెప్పిన పద్యం పోతనగారికి ప్రేరణగా నిలిచిందని చెప్పవచ్చు. అయితే మారన చెప్పిన పద్యం వృత్తపద్యం, పోతనగారిది కందపద్యం.

కొందఱు తీవ్రశస్త్రహతిఁ గొందఱు దుస్తరరోగబాధలన్
గొందఱు నీరు ద్రావునెడఁ గొందఱు భోజనకార్యవేఖలన్
గొందఱు యోగముక్తు లయి కొందఱు నిష్ఠఁ దసం బొనర్చుచున్
గొందఱు కాంతల న్గ వయుకోర్కులఁ జత్తు రనేకభంగులన్” (మార్కం.పు.1-55)

పై పద్యంలో మారన మనిషి ఏవిధంగా అనేకానేకాలైన వ్యసనావస్థలతో బాధపడతాడో చెప్పిన సందర్భం.

కొందఱకు దెనుఁగు గుణమగుఁ
గొందఱకును సంస్కృతంబు గుణమగు రెండుం
గొందఱకు గుణములగు నే
నందఱ మెప్పింతుఁ గృతుల నయ్యై యెడలన్” (భాగ.1-18)

పోతన ఇక్కడ కొందరికి తెలుగు కవిత్వం ఇష్టం. కొందరికి సంస్కృతంలో ఉంటే బాగా నచ్చుతుంది. కొందరికి రెండూ యిష్టమే. సందర్భాన్నిబట్టి నా కవిత్వంతో‌ అందరినీ మెప్పిస్తాను అని చెప్పుకుంటున్న సందర్భం.

“కనుఁగొని కోప వేగమునఁ గన్నుల నిప్పులు రాలన్... (భార.విరా.2.133)” అన్న తిక్కనగారి పద్యం ఎంతో ప్రసిద్ధమైనది. తెలుగుజాతి అంతటికీ సుపరిచిత పద్యం. ఇందులో తిక్కనగారు చూపిన నాటకీయశిల్పం అనితరసాధ్యమైనది. భీముడి కోపభావాన్ని అభినయబంధురంగా రూపుకట్టించిన పద్యమిది. ఈ పద్యం తెలుగు కవిలోకంలో ఎంతటి అలజడిని కలిగించిందంటే తరువాతి వచ్చిన ఎంతోమంది కవులు ఈ పాదాల్ని ప్రయోగించిన సందర్భాలు అనేకం. ప్రధానంగా మారన తన మార్కండేయపురాణంలో అనేకచోట్ల తిక్కనలాగే తన కవిత్వాన్ని రూపుకట్టించాడు. ఎన్నోచోట్ల తిక్కనను అనుకరించాడు. తిక్కన పద్యశైలిని అనుసరించాడు. ఆ విషయం పైన ఒకటి రెండు పద్యాలలో గమనించాం. ఇంకా ఈ కింది పద్యపాదాలద్వారా ఆ విషయం ప్రస్ఫుటమవుతుంది.

కనుఁగొని యోరి దురాత్మ! మహాత్మునిఁ గంకు మదగ్రజు నుగ్రుఁడవై…” (మార్కం.1.36)

కన్నుల నిప్పులు రాలఁగ నిట్లను గర్వమున న్విహగాధమ!...” (మార్కం.1.37)

కనుగొని కౌశికుం డలిగి కన్నుల నిప్పులు రాల నిట్లనున్…” (మార్కం.1.182) మొదలైనచోట్ల తిక్కన పద్యాన్ని అనుకరించి తన అభిమానాన్ని చాటుకున్నాడు.

3.5 పెద్దన:

తెలుగుసాహిత్యంలో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగినది ప్రబంధయుగం. ప్రబంధయుగమనగానే వెంటనే స్పురించేది పెద్దన పేరు. అల్లసానివాని అల్లికజిగిబిగికి ప్రత్యేకస్థానం ఉన్నది. పెద్దన అష్టదిగ్గజకవులలోనేకాక, ప్రబంధసాహిత్యానికే పెద్దనవచ్చు. పెద్దన తన సమకాలీన కవులకేకాక తన తరువాతి కవులకు కూడా ఒక కవితా మార్గదర్శి. ఆయన కవితాప్రేరణతో ఎంతోమంది కవిత్వాన్ని ప్రధానవృత్తిగా ఎన్నో అనుకరణలు, అనుసరణలు చేశారు. అయితే అలాంటి పెద్దనగారు కూడా తన పూర్వకవియైన మారన పద్యాన్ని అనుకరించటం కనిపిస్తున్నది.

మంచన కేయూరబాహుచరిత్రలో కేయూరబాహువు మృగాంకవళిని చూచి తన వివరాలు అడిగిన సందర్భంలో చెప్పిన ఈ పద్యం ప్రేరణ అయిందని చెప్పవచ్చు.

“ఎవ్వరిదాన వీవు హరిణేక్షణ యెయ్యది నీకుఁ బేరు ని
న్నెవ్వతె తెచ్చెఁ జెప్పు మిది యేర్పడ బంటుగ నన్ను నేలు మం
చవ్వసుధేశ్వరుం డతిపహస్తమువట్టిన పట్టిధైర్యమున్
ద్రవ్వెడు కన్నులం గొని యదల్చి వదల్చె గరంబు చయ్యనన్” (కే.బా.చ.4-21)

పై పద్య సందర్భానికి సరిపోయే సందర్భం మనుచరిత్రలో ప్రవరుడు హిమాలయాలకు చేరి అక్కడ ఎదురైన వరూధినిని చూచి, ఓ యువతీ నీవెవరు? భయంలేకుండా ఒక్కదానివే ఈ అడవిలో తిరుగుతున్నావు. నేను ప్రవరుడనే పేరుగల బ్రాహ్మణయువకుడిని. కొవ్వెక్కి ఈ కొండకు వచ్చి దారితప్పాను. మా ఊరికి దారిచెప్పమని వేడుకుంటున్న సందర్భం. పై పద్యంలోని తొలిపాదంలో ‘ఎవ్వరిదాన వీవు హరిణేక్షణ’ అన్నమాట ‘ఎవ్వతెవీవు భీతహరిణేక్షణ’ అన్న పెద్దనగారి మాటకు ప్రేరణగా నిలుస్తుంది. కేవలం ఈ మాట మాత్రమేకాక ఈ పద్యంలోని భావమంతా పై పద్యంలోని సందర్భానికి సరిపోతుంది. పెద్దనగారికి మంచన కవిత్వం ఎంతగానో నచ్చటంతో ఆ అభిమానాన్ని ఈ సందర్భం ద్వారా చాటుకున్నట్లు తెలుస్తున్నది. ఆ పద్యాన్ని ఈ కింద గమనించవచ్చు.

ఎవ్వతె వీవు భీతహరిణేక్షణ యొంటిఁ జరించె దోట లే
కివ్వనభూమి భూసురుఁడ, నేఁ బ్రవరాఖ్యుఁడఁ, ద్రోవ తప్పితిన్‌
గ్రొవ్వున నిన్నగాగ్రమునకున్‌ జనుదెంచి, పురంబుఁ జేర నిం
కెవ్విధిఁ గాంతుఁ దెల్పఁగదవే తెరు వెద్ది? శుభంబు నీ కగున్‌” (మను.2-39)

4. ముగింపు:

పద్యం ఎప్పటికీ సజీవమే. తెలుగుజాతి ఉన్నంతకాలం పద్యం నిలిచివుంటుంది. తెలుగు కవిలోకంలో వెలసిన అనేక పద్యరత్నాలు ఆణిముత్యాలవలె ఇప్పటికీ పండితపామరలోకంలో సజీవంగా నిలిచివున్నాయి. మహాకవులు కథాగమనంలో సందర్భానుసారంగా ప్రయోగించిన పద్యాలు, పదబంధాలు తరువాతి కవులకు అనుకరణీయాలయినాయి. పదకొండో శతాబ్దంలో నన్నయతోనో అంతకుముందునుంచో మొదలైన పద్యసంపద ఇప్పటికీ జనవ్యవహారంలో ఉంది. ఎఱ్ఱన, సోమన, మారన, పోతన, రాయలు వంటి మహాకవులు సైతం తమ పూర్వపుకవుల పద్యాలను తమ కావ్యాల్లో తగినచోట్ల అనుకరించి ఆ కవులపైన, ఆ పద్యాలపైన తమకున్న అపరిమిత అభిమానాన్ని చాటుకున్నారు. పద్యంలోని పదాలకూర్పు, ఎత్తుగడ, శిల్పసౌందర్యం, రచనాశైలీ ఆ పద్యాన్ని చిరస్థాయిగా నిలుపుతుంది. అయితే పూర్వపు కవుల పద్యాలను అనుకరించడంలోనో, అనుసరించడంలోనో తరువాతి కవులస్థాయి పెరగటం, తరగటం వంటి మాటలకు ఇక్కడ అవకాశం లేదు. ప్రతి కవికీ తనదైన శైలీ, ప్రత్యేకతలు ఎప్పుడూ ఉంటాయి. అయితే పూర్వపుకవుల పద్యాలను అనుసరిస్తూ రాయటంలో ఆ సందర్భానికి తగినదని భావించటమో, ఆ కవిపైన అభిమానమో కారణాలు కావచ్చు. అయితే ఆ పద్యాలను ఆధారంగా చేసుకొని ఆ పద్యానికి మరిన్ని మెరుగులు దిద్దే అవకాశం కూడా ఉంది. ఆ దిశగానే ఈ పరిశోధనను గమనించాలి. 

ఈ వ్యాసంలోని మచ్చుకు ప్రస్తావించిన కొన్ని పద్యాలు మనం వివిధ సందర్భాల్లో పరిశీలించినవే. అయితే కొన్ని పద్యాలు ఉదాహరణకు మార్కండేయపురాణంలోని కొన్ని పద్యాలు, మొల్లరామాయణంలోని పద్యాలు కొన్ని గతంలో ప్రస్తావనకు రానివి కూడా ఉన్నాయని చెప్పవచ్చు. ఇంకా తెలుగుకావ్యాలలో అనేకంగా పూర్వకవుల పద్యానుకరణలు ఉన్నాయి. ఇటువంటి వ్యాసాలు మరిన్ని గ్రంథాలను చదవటానికి పురిగొల్పుతాయని, గ్రంథాన్ని ఆసాంతం క్షుణ్ణంగా పరిశీలించడానికి దోహదం చేస్తాయని ముఖ్యంగా పద్యసౌందర్యాన్ని నిరూపించటానికి దోహదం చేస్తుందని నమ్ముతూ, వాటిపై ప్రత్యేక పరిశోధనలు జరిపి ఆ పద్యరత్నాలలో కవులు ఆశించిన లక్ష్యాలను తెలుగు పద్య సాహిత్యాభిమానులకు అందించవలసిన అవసరం ఉందని భావిస్తున్నాను. అలాంటి పరిశోధనలకు ఈ వ్యాసమొక చేర్పుగా ఉంటుందని ఆశిస్తున్నాను. 

5. పాదసూచికలు:

  1. రాత-గీత: పద్యం అనుకరణ, అనుసరణ, అంతర్జాల వ్యాసం, అక్టోబర్, 6, 2010
  2. ఆముక్తమాల్యద, సౌందర్యలహరీ వ్యాఖ్యానం, పుట.622

6. ఉపయుక్తగ్రంథసూచి:

  1. కోటీశ్వరరావు తుమ్మపూడి, ఆముక్తమాల్యద (సౌందర్యలహరీ వ్యాఖ్యానం), మలయకూట పబ్లికేషన్స్, హైదరాబాద్, 2001.
  2. నాచన సోమన, ఉత్తరహరివంశము, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, హైదరాబాద్, 1979.
  3. పోతన. వీరభద్రవిజయము, వావిళ్ళ ప్రచురణలు, మద్రాసు, 1952.
  4. పోతన. శ్రీమదాంధ్రభాగవతము, వావిళ్ళప్రచురణలు, మద్రాసు, 1952.
  5. మంచన, కేయూరబాహుచరిత్రము, తిరుపతి వేంకటకవులు(సం.), 1902.
  6. మారన, మార్కండేయపురాణము, వావిళ్ళ ప్రచురణలు, మద్రాసు, 1955.
  7. మొల్ల. మొల్లరామాయణము, సరస్వతీ బుక్ డిపో, బెజవాడ, 1935.
  8. సుబ్రహ్మణ్యం, జి.వి. (సంపా.) కవిత్రయ విరచిత శ్రీమదాంధ్రమహాభారతము, తితిదే ప్రచురణలు, తిరుపతి, 2013.

వ్యాసాలు: 

  1. సనాథ్, శ్రీపతి. "పద్యం అనుకరణ, అనుసరణ", రాత-గీత: అంతర్జాల వ్యాసం, అక్టోబర్, 6, 2010
  2. నారాయణరావు, వెల్చేరు. "కవిత్వంలో ‘ప్రభావం’ అంటే ఏమిటి?", సాహితీనందనం, అంతర్జాల వ్యాసం, జూలై, 2009.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]