headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-1 | January 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

11. ‘తెన్నేటి లక్ష్మీనరసింహమూర్తి’ కవిత్వం: విద్యాసంబంధాంశాలు

డా. దొడ్డిగర్ల రాజమనోహర్

తెలుగు అధ్యాపకులు,
ఎస్.బి.వి.పి.డిగ్రీ కళాశాల, విశాఖపట్నం,
విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 8142534232, Email: drdrmanohar@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

ఆధునిక సాహిత్య ప్రక్రియ అయిన వచనకవిత మానవ జీవితంలోని తాత్వికతను, సామాజిక, ఆర్థిక, మానసిక, మానవ సంబంధాల్ని, విశ్లేషణల్ని, వైఫల్యాల్ని, వైరుధ్యాల్ని ప్రతిబింబిస్తూ శక్తివంతమైన సాధనంగా పాఠకుల్ని కదిలిస్తుందనడంలో ఏవిధమైన సందేహం లేదు. అలా ఒక శక్తివంతమైన ప్రక్రియగా అనేక మంది రచయితల చేతిలో అభివృద్ధి చెందుతూ సామాజిక ప్రగతికి తోడ్పడుతుంది. ఈ క్రమంలో వ్యక్తి వికాసానికి, అభివృద్ధికి విద్య అత్యంత ఉపకరణమని అనాదిగా గుర్తించినప్పట్టికీ, సమాజంలో పూర్తిస్థాయిలో అక్షరజ్ఞానాన్ని అందిపుచ్చుకోడానికి ఎక్కడో ఏదో ఒక మూల లోపం కనబడుతూనే ఉంది. కావుననే వందశాతం అక్షరాస్యత సాధించాలనే ప్రభుత్వ సంకల్పం కుంటుపడుతూనే ఉంది. ఇలాంటి తరుణంలో విద్య ఆవశ్యకతను గురించి ప్రచారం చేయడంతోపాటు, ‘అక్షరగోదావరి’ అనే పేరుతో కార్యక్రమాలు కూడా నడిపిస్తుంది ప్రభుత్వం. ఇలాంటి ప్రాయోజిక కార్యక్రమాలకు తమవంతుగా సహకారం అందించే దిశగా తమ కలాలతో గళం విప్పుతూ రచనలు చేస్తున్న రచయితలను ఆధునిక కాలంలో వేళ్ళమీదే లెక్కపెట్టొచ్చు. ఈ కోవలో అక్షర కిరీటి తెన్నేటి లక్ష్మీనరసింహమూర్తిని కూడా చూడొచ్చు. ఈయన వెలువరించిన కవితల్లో ఎక్కువ శాతం విద్య ప్రాధాన్యతను నొక్కి చెప్పేవే ఉన్నాయి. ముఖ్యంగా వయోజన విద్య ఆవశ్యకతను తెలియజేసేవే కనిపిస్తున్నాయి. ఇలాంటి కవితల్లో దాగి ఉన్న విద్యా ప్రాధాన్యతాంశాలను పరిశీలించి సమాజంలో, పాఠకులలో చైతన్యం కలిగించడమే ఈ వ్యాస ముఖ్యోద్దేశం.

Keywords: వయోజనవిద్య, అక్షరకిరీటి, అక్షరగోదావరి, మరబొమ్మలు, నిరక్షరాస్యత, లక్ష్యార్థం మొదలుగునవి.

1. ఉపోద్ఘాతం :

‘విద్య లేనివాడు వింత పశువు’ అన్నారు పెద్దలు. స్వతహాగా మనిషి జ్ఞానవంతుడు. ఏమీ తెలియని ఆదిమానవుని దశ నుండి భాషని కనిపెట్టి తన భావాలను వెలిబుచ్చే దాకా ఎదిగి ఇంకా దూసుకుపోతూనే ఉన్నాడు. భాష ఏర్పడిన తర్వాత లిపిని ఏర్పరచుకొని రాయడం, చదవడాలను నేర్చుకున్నాడు. వర్ణాశ్రమ ధర్మాల ప్రకారం కొన్ని వర్గాల వారికే విద్య చేరువైంది. తర్వాత కాలంలో సాహిత్యపరంగా చదువుకున్నవారు కావ్యాల వంటి ప్రక్రియలు చేపట్టగా నిరక్షరాస్యులైన జానపదులు మౌఖిక సాహిత్యంలో పల్లె పదాలతో పరవశించారని చెప్పవచ్చు. బ్రిటిష్‌ వారి పాలనలో మిషనరీల రాక మతపరంగా,విద్యాపరంగా పెనుమార్పులను తెచ్చింది. అందరికీ చదువుని అందించడంతో పాటు ఇంటికే పరిమితమైన ఆడపిల్లల విషయంలో ముందంజ వేసి స్త్రీ విద్య ప్రోత్సహించింది. అప్పటికే సంఘ సంస్కరణోద్యమంలో భాగంగా ప్రతి ఒక్కరికీ చదువుకొనే అవకాశం లభించింది. గిడుగు, గురజాడల వంటి మహానుభావుల వ్యవహారిక భాషోద్యమ ఫలితంగా గ్రాంథికం కనుమరుగై అందరికీ అర్థమయ్యే భాష విద్యకి చేరువై సులభతరం చేసింది.

పూర్వం చదువు మగవారికి మాత్రం పూర్తి స్థాయిలో అంది ఆడవారికి నాలుగు ముక్కలు రాయడం, చదవడం మాత్రం నేర్పించేవారు. అనంతరం అంతా పోటీ పడి చదవడం ప్రారంభమైంది. విదేశాలకు వెళ్ళి విద్యార్జన చేయడం కూడా సమాజంలో జీతాన్ని తోడు చేసింది. నేడు విద్య అనేది ఓ వ్యాపారంలా మారింది. పోటీ ప్రపంచంతో పాటు తల్లిదండ్రుల ఆశ, ఒత్తిడులు పిల్లల మెదళ్ళపై పడ్డాయి. కానీ చదువు విలువ తెలిసి దాన్ని ఒడిసి పట్టుకున్నవారికి అవకాశాలు కుప్పలు తెప్పలు. సరస్వతీ నిలయాలు పవిత్రమైనవి. విద్య-విజ్ఞానం అనేది ఒకదానితో ఒకటి సంబంధం కలిగి జాతి పురోగమనాన్ని ఆశిస్తాయి. ఎవరూ దోచుకోలేని విద్యాధనాన్ని గురించి తెన్నేటి లక్ష్మీనరసింహ మూర్తి కవితలను రాసారు. అందులోని విద్య యొక్క గొప్పతనాన్ని, విద్యావశ్యకతను, విద్య వలన కలిగే లాభాలను, అవిద్య వలన కలిగే దుర్భర పరిస్థితులను గురించి సంపూర్ణ అవగాహనని కల్పించారు. అందులోని విషయ విశేషాలను ఈ పరిశోధన వ్యాసంలో విశ్లేషిస్తున్నాను.

2. రచయిత పరిచయం:

వ్యాఖ్యాతగా, సామాజిక సేవా కార్యక్రమాల్లో ఇలా పలు రంగాల్లో నిస్వార్థ సేవలందిస్తున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. ఒక ప్రక్క తెలుగు భాషా పండితునిగా విద్యార్థుల్లో భాషా, సాహిత్యాల మాధుర్యాన్ని పంచుతూనే మరో ప్రక్క వయోజనులకు విద్యను అందించాలనే సంకల్సంతలో వీరి స్వగ్రామంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అవిద్య వల్లనే సమాజం అజ్ఞానంలో కొట్టిమిట్టాడుతుందనే కందుకూరి మాటను స్వీకరించి విద్య గొప్పతనాన్ని చెప్పే పనిలో నిమగ్నమయ్యారు తెన్నేటి మాష్టారు. వీరు ఏడు కవితా సంపుటులను ప్రచురించారు. సుమారు వెయ్యి కవితలు వరకూ రాశారు. 
తెన్నేటి లక్ష్మీనరసింహమూర్తి పశ్చిమగోదావరిజిల్లా, నిడమర్రు మండలం, పెదనిండ్రకొలను గ్రామంలో శ్రీ వెంకట జానకిరామారావు, సుబ్బలక్ష్మి దంపతులకు 1965లో జన్మించారు. పాఠశాల, ఉన్నతపాఠశాల విద్య అంతా నిడమర్రులోనే కొనసాగింది. భీమవరం ఓరియంటల్‌ కళాశాలలో బి.ఏ(ఓ.ఎల్‌.) చేసి, ఆంధ్రాయూనివర్సిటీ తెలుగులో ఎం.ఏ. చేసి, అనంతరం బి.ఇడి. పూర్తి చేసి గణపవరం మండలం అర్ధవరం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో తెలుగు స్కూల్‌ అసిస్టెంట్‌గా బోధిస్తున్నారు.

విద్యాశాఖ వారు సర్వశిక్ష అభియాన్‌ ద్వారా నిర్వహించే ‘‘సబ్జెక్ట్‌ కాంప్లెక్స్‌’’ నకు తెలుగు రిసోర్స్‌ పర్సన్‌గా మండల, జిల్లా స్థాయిలలో విశేషకృషి చేశారు. సర్వశిక్ష అభియాన్‌ వారు రూపొందించే మాడ్యూల్స్‌ రూపకల్పనలో రిసోర్స్‌ పర్సన్‌గా సేవలందించారు. సర్వశిక్ష అభియాన్‌ వారు బాల బాలికల సృజనాత్మక కళలను పెంపొందించే కృషిలో భాగంగా నిర్వహించిన బాల సాహిత్యానికి మండల, జిల్లా రిసోర్స్‌ పర్సన్‌గా పని చేశారు.
వృక్షానికి తల్లి వేరు ఎలాంటిదో జీవితానికి క్రమశిక్షణ అంతే ముఖ్యం అన్న సత్యాన్ని నమ్మిన తెన్నేటి తమ గురువుగారైన శ్రీ భారతం శ్రీమన్నారాయణగారి వద్ద తెలుగు భాషలో పలు మెళుకువలు ఔపోసన పట్టారు. తెలుగులో యుగప్రవక్తలైన కందుకూరి, రాయప్రోలు, గురజాడ, శ్రీశ్రీ, మధునాపంతుల వారి సాహిత్య ప్రభావంతో తెన్నేటి రాసే కవితలు, వ్యాసాలు, ఇతర రచనలు ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, అస్త్రం, నేటి నిజం, స్ఫూర్తి, తెలుగు విద్యార్ధి, వజ్రాయుధం, భావతరంగిణి, విజ్ఞాన సుధ, రంగస్థలి, ఉదయ తరంగం, ఆంధ్రాడైరీ, పూర్ణిమ మొదలైన పత్రికలలో ప్రచురించబడుతూనే ఉంటాయి. పాఠకులను పలకరిస్తూనే ఉంటాయి. పరోపకారం, సమాజ సేవ, సర్వ మతాలను సమభావనతో చూడడం ఈయన ఆశయాలు. వీరి ఆశయాల సాధనకు పదును పెట్టి ఆలోచనలను సఫలీకృతం చేస్తూ సాహితీ రంగంలో తనదైన బాణీలో ఒక ముద్రను సొంతం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం 2016లో అందుకున్న తెన్నేటి ‘నవసాహితీ విశారద’, ‘సాహితీ కిరీటి’, ‘సాహితీ వల్లభ’, ‘సాహితీ విద్యారత్న’, ‘కవితా కిరీటి’ వంటి బిరుదులు పొందారు.

3.తెన్నేటి కవిత్వం - విద్యావిషయక అంశాలు:

3.1.విద్య - ప్రాధాన్యత:

తెనేటి రాసిన కవితల్లో మిక్కిలి కవితలు అక్షరాస్యతను గురించి చెప్పినవే దర్శనమిస్తున్నాయి. విద్యయే అన్నిటికీ మూలమని, విద్యలేకపోతే ఏదీ సాధించలేమని తెలియజెప్పే ప్రయత్నం ఈయన కవితల్లో కనిపిస్తుంది. విద్యా నేపథ్యంలో రాసిన కవితా శీర్షికలే పాఠకుల్ని ఆలోచింపచేసేలా ఉండటం ఈయన కవితల్లో ప్రత్యేకత. ఈ కోణంలో పరిశీలిస్తే, అక్షరం లేనిదే ప్రపంచం లేదన్నట్లు సాగిన ‘అక్షరం’ శీర్షిక చదువు యొక్క విశ్వరూపాన్ని మనముందుంచనట్లైంది. నాశనం అన్నది లేనిది, ఎప్పటికీ పాతపడనిది అయిన అక్షరం. అక్షరాలు అనంత జ్ఞానాన్ని దాచుకున్న వామన రూపాలు. పలు భాషల్లో భిన్న ఆకృతితో ఉండే అక్షరాలు విద్యకి పునాదులు. ఒకప్పుడు ఇది అందరికీ అందనిదైనా నేడు ప్రతి ఒక్కరు ఒడిసిపట్టుకొని ఎదగడానికి సహకరిస్తోంది. మార్పుని తెచ్చి, వాస్తవాలను ముందుంచి ఈ విశ్వానికే మూలరూపమని అక్షర సత్యాలను పొందుపరుస్తూ చదువు  గొప్పతనాన్ని ఆసాంతం దర్శింపజేయడం ఈ కవితలో గమనించవచ్చు.

‘‘అక్షయమైనది అక్షరం
క్షరం కానిది అక్షరం
రక్షణనిచ్చేది అక్షరం.
ఆక్షేపణ లేనిది అక్షరం
లక్షణాలు నేర్చేది అక్షరం
ఏ ఆంక్షలు లేనిది అక్షరం
కాంక్షలన్నీ తీర్చేది అక్షరం
క్షణాల్లో మార్పు తెచ్చేది అక్షరం
అక్షరం పరబ్రహ్మ స్వరూపం
అక్షరం నరరూప స్వభావం
అక్షరం జగతికాధారం
అక్షరం జనాలికాశ్రయం
అక్షరం వాస్తవానికో రూపం
అక్షరం ప్రపంచానికే మూలం’’ (తెన్నేటి తరగలు, పుట : 13)

విద్య చేయని గారడీ లేదని, తన చుట్టూ ప్రపంచాన్ని గిరగిరా తిప్పుకొంటూ విశిష్టత సంతరించుకొని మనిషి బతుకుని ఆశించే శక్తిగా మారింది. సంపదలు లేకున్నా చదువుంటే ఏ విధంగానైనా సన్మార్గంలో జీవించవచ్చు. ‘విద్య యొక్క అర్థం, పరమార్ధం రెండూ వ్యక్తిని ఉత్తమమైన వానిగా రూపొందింపజేయడమే’, ‘విద్య ఐశ్వర్యంలో ఆభరణం వంటిది- దారిద్య్రంలో ఆశ్రయం వంటిది’ అని స్వామీ వివేకానంద గారి సూక్తుల సారంగా ఈ కవితా సృష్టిని రచయిత చేసారనిపించేలా ఉంది. అక్షరాస్యతకు అభివృద్ధికి సంబంధం ఉందని కేరళ రాష్ట్రాన్ని చూస్తే తెలుస్తుంది. చదువుకున్నవారి ఆలోచనలు హేతుబద్ధంగా ఉంటాయి మరియు స్థిరత్వాన్ని కలిగి ప్రపంచ జ్ఞానంతో కూడి ఉంటాయి. విలువలను నేర్పి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో విద్య ప్రధానపాత్రని పోషిస్తుంది.

అక్షరాలు పేరిస్తే వాక్యాలై సజీవ రూపాన్ని పొంది మనిషి జీవితాన్ని నిర్దేశిస్తాయి. మూఢాచారాలు, ఛాందస భావాలకు సమాజాన్ని దూరంచేసి మానవత్వం ఉన్న మనుషులుగా తీర్చి దిద్దుతుంది. ఈ రోజుల్లో విద్య యొక్క గొప్పతనాన్ని గుర్తించారు కాబట్టే కూలివాడైనా తనలా కాకూడదని తన కొడుకు బాగా వృద్ధి లోనికి రావాలని తపిస్తూ రేయింబవళ్ళు కష్టపడుతూ పిల్లల్ని చదివిస్తున్నాడు. ప్రభుత్వం కూడా ఎన్నో సదుపాయాలనిచ్చి ప్రతి ఒక్కరూ విద్యార్జన చేసేలా సిద్ధాంతాలు చేసింది. వారిని బడికి రప్పించడానికి పలు పథకాల రూపకల్పనలతో అభివృద్ధి పథంవైపు నడవడంలో భాగమే. ఏ విజ్ఞానవంతుని కదిలించినా ఎంత ఎదిగినా నిత్య విద్యార్థిగా ఉండటానికే ఇష్టపడుతానని నిరంతరం నేర్వడమే విధిగా భావిస్తున్నారు. సమాజ సేవలో ట్రస్ట్‌ల రూపంలో చదువుకొనే వారిని ప్రోత్సహిస్తుండటం అభినందనీయం. అందర్నీ ప్రగతిపథం వైపు నడపాలంటే విద్య యొక్క గొప్పతనాన్ని తెలపడమే మార్గంగా ఎంచి ఆలోచన కలిగించేలా ఈ కవితా పంక్తులు ఉన్నాయనడంలో సందేహం లేదు.

3.2. విద్య -సద్వినియోగం:

విద్యని ఎలా సద్వినియోగం చేసుకోవాలో వివరించడంలో రచయిత కృతార్థులయ్యారని మరికొన్ని కవితలు పరిశీలిస్తే తెలియవచ్చింది. ఈ క్రమంలో విద్యను అభ్యసించి సద్వినియోగం చేసుకోవడం ఎంతో ముఖ్యమని తెలిపే ప్రయత్నం చేశారు. జ్ఞానాన్ని మంచికి మాత్రమే వినియోగించాలని చెప్పడమే ప్రధాన ఉద్దేశ్యంగా కవితను అల్లడం వీరిలో ప్రత్యేంగా దర్శనమిచ్చింది. అక్షరాలను ఆయుధాలుగా మలచుకున్నా దాన్నే సంపదగా తెలి ఆరాధించిన అది చేయని జాలాలుండని స్పష్టం చేయడాన్ని చూస్తే దుర్వినియోగం చేయొద్దని అంతర్లీనంగా చెప్పడాన్ని చూడొచ్చు.

‘‘అక్షరాన్ని సంధిస్తే ఆయుధం
అక్షరాన్ని సంధిచేస్తే ఆదాయం
అక్షరంతో ఆడితే క్షయం
అక్షరాన్ని ఆరాధిస్తే అక్షయం’’ (తెన్నేటి తరగలు, పుట: 20)

అక్షరాలతో కూడిన విద్యగానీ అలాంటి చదువుతో సంపాదించిన ఉద్యోగంగానీ ఓ గొప్ప పరమావధిని నిర్వర్తించేలా నిర్దేశింపబడుతుంది. అలా అక్షరాలను ఆయుధంగా మలచుకున్నవే పత్రికలు, అన్ని ప్రాంతాలు వారికీ అర్థమయ్యే సరళతతో కూడి విలువలున్న ప్రాంతాల వారితో సంస్థగా తీర్చబడుతుంది. సమాజంలో జరిగే సామాజిక, రాజకీయ, ఆర్ధిక అంశాలపై తన డేగకన్నుతో చూస్తూ విషయజ్ఞానాన్ని ప్రజలకు అందించి చైతన్యపరుస్తుంది. అలాగే టీచర్ల ఉద్యోగం కూడా విద్యాబోధనతో అక్షర సంధానాలతో సాగి ఉత్తమ పౌరులుగా తీర్చి దిద్దుతారు. అలాంటి అక్షర యజ్ఞంలో ఉత్తమ విలువలను ప్రదర్శించాలిగానీ అసత్యాన్ని, అవినీతినీ, తేలిక భావాన్నీ ప్రదర్శిస్తే అది కీడుకి దారితీసి అభివృద్ధిని ఆటంకపరుస్తుందని తెలియజేసారు. నేర్చుకున్న జ్ఞానం పట్ల ఆరాధనాభావాన్ని ఆటంకపరుస్తుందని తెలియజేసారు. నేర్చుకున్న జ్ఞానం పట్ల ఆరాధనా భావాన్ని కలిగి నీతివంతులుగా విద్యను ఉన్నతికే వినియోగించడమే నిబద్ధతకు సాక్ష్యంగా అభివర్ణించడం  రచయిత అక్షరాలోచనకు తార్కాణంగా చెప్పుకోవచ్చు.

అ,ఆ లతో మొదలైన విద్యార్జన వ్యక్తులను సంపూర్ణ వ్యక్తిత్వం కలిగిన వారిగా తీర్చి దిద్దుతుంది. పోటీ ప్రపంచంలో నిలదొక్కుకొని చిరు ఉద్యోగం నుండి కలెక్టర్ల వరకు ఎదిగే వారికి పునాది విద్యాసోపానాలే. ఆ దారిలో పైకి వెళ్ళడం మొదలు పెట్టి దిగజారకుండా జ్ఞానవ్యాప్తికీ, పురోభివృద్ధికి కృషి చేయడం వలన సమాజాన్ని ముందుకు తీసుకొని వెళ్ళగలుగుతాము. విద్యని సక్రమమైన ఆయుధంగానో, ఆదాయంగానే మలచుకోవడం ఉత్తమగుణం. తలెత్తుకొని బతికే మార్గాన్నిచ్చిన విద్యని వ్యాపార దృక్పథంతో చూసి దాని స్థాయిని తగ్గించవద్దని నేటి ధోరణులను గమనించి హితవుతో పాటు హెచ్చరికను జారీ చేయడం ఈ కవితా విశేషంగా గ్రహించవచ్చు.

‘చదువంటే’ అనే శీర్షిక ద్వారా విద్యనినేర్వడంపట్ల అలసత్వం తగదని, బతుకు చక్కగా ఉండాలంటే జ్ఞానార్జనే మార్గమని అదిలేని జీవితం వ్యర్ధమని తెలిపారు. కొందరు వ్యక్తులు, మరికొందరు పిల్లలు చదువంటే ఖర్చు, శ్రమ అని తలచి దాని పట్ల కొంత చిన్నచూపుని కలిగి ఉండటం తగదని అర్థంలేని ఆలోచనలు, భయాలు వీడి ముందడుగు వేయమని సూచించారు. అజ్ఞానం నుండి పుట్టే తలపులు ఏవీ సంపూర్ణనంతం కావని అవి వ్యక్తిని తీర్చిదిద్దేవి కావని చెప్తూ చదువు తెచ్పేవన్నీ గొప్ప వరాలేనని తేల్చి చెప్పడం ద్వారా విద్యా చైతన్యాన్ని తనదైన శైలిలో అందించడం రచయితగా తన బాధ్యతని ఈ కింది కవితలో చెప్పకనే చెప్పారనిపిస్తుంది.

‘‘చిన్న చూపు ఏలరా చదువంటే ?
ఉన్నతనంగా ఉంటాదిరా అది లేకుంటే
చదవలేననే భయం వీడరా
చక్కగా సాధన చేస్తే రానిదేదిరా
చదువుతో అందరి మన్ననలు అందుకో
చదువు లేకుంటే బతుకే చప్పగా ఉంటాది
చదువు లేకుంటే బతకటం అనవసరం
బతకాలంటే చదువు అవసరం’’ (తెన్నేటి తరగలు, పుట : 8)

విద్య నేర్చుకోవాలన్న తపన ఉంటేనే ఆ వైపుగా అడుగులు వేయగలం. కనుక రచయిత చదువుకోవాలనే చైతన్యాన్ని అందిస్తూ జీవితం బాగుండాలంటే విద్యావంతులుగా మనగలిగి నిలదొక్కుకుంటేనే సాధ్యం అవుతుందనే ఉత్తేజాన్నిక్కడ కలిగించారు. ఏదైనా ఒక పనిపట్ల నిబద్ధతని కనబరచాలంటే దాన్ని గురించిన పూర్తి సానుకూల దృక్పథంతో పాటు అవగాహనని కూడా కలిగి ఉండాలి. అప్పుడే దాని గురించి ఆలోచించి నిర్ణయం తీసుకోగలుగుతాం. కొందరు తల్లిదండ్రులు కష్టపడి చదివిస్తున్నా విద్య పట్ల విముఖతని, నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుంటారు. అప్పుడు సమయం, డబ్బు వృథా అవడం జరుగుతుంది. అప్పుడు ఆ పిల్లలకు చదవంటే భయం వద్దని చెప్పి ధైర్యాన్ని ఇవ్వటంతో పాటు విద్యార్జన వలన భవిష్యత్‌లో ఎంత గొప్పగా ఎదగగలమో వివరిస్తూ చదవడం అనేది కష్టం కానిదని ఆడుతూ పాడుతూ నేర్చుకోవచ్చునని తెలపాలి. చేసే పనిని శ్రద్ధగా పూర్తి చేయడంలో ఆనందం ఉందని, అందరి మెప్పుని పొందగలమని, ఉత్తమ వ్యక్తిత్వంతో ఎదగవచ్చుననే ఉద్బోధ నిరక్షరాస్యులలో చదువుకోవాలనే కోరికను కలిగిస్తుందని చెప్పకతప్పదు.

విద్య పట్ల మక్కువని పెంచుకోవడం అంటేనే మన లక్ష్యాన్ని నిర్ణయించుకొని గమ్యాన్ని  చేరడమేనని ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నది రచయిత ఉద్దేశ్యం. అక్షరాస్యుడికీ, నిరక్షరాస్యునికీ సంఘంలో గౌరవంలో తేడా ఉంటుంది. చదువుకొనే అవకాశం ఉన్నప్పుడు నిరక్షరాస్యునిగా మిగలడం అంటే మన స్థాయినీ స్థానాన్ని దిగజార్చుకోవడమేనని గుర్తించాలి. ఎందరో గొప్పవారి జీవిత చరిత్రలను తిరిగేస్తే జ్ఞానార్జనే వారి విజయానికి మూలమని తెలుస్తుంది. అక్షరం ముక్క రాకున్నా అదృష్టంతో ఎదిగినవారు కూడా కొందరుండొచ్చు. అది వారి వారి సుకృతం. అలాంటివారు కోటికి ఒకరుంటారు. వారి విషయంలో చదువుంటే ఇంకెంత ఎత్తుకి వెళ్ళేవారో అనుకోవాలి. అలాగే వ్యాపారాలకు పెట్టుబడి అవసరం. అవి నష్టాల్లో కూరుకుపోతే కోలుకోలేం. చదువు అలాకాదు ఒక డిగ్రీ చేతిలో ఉంటే దానికి తగిన ఏదో ఒక ఉద్యోగంతో ఎదిగేందుకు వీలవుతుంది. అదే కన్నవారికి సంతోషాన్నిస్తుంది. అలాగే కొందరు అక్షరజ్ఞానం లేనివారు పిల్లల్ని బాల కార్మికులుగా మారుస్తున్నారు. అలాంటి వారికి ఈ కవిత ఒక పాఠంలా పని చేస్తుంది. పిల్లల భవిష్యత్‌కి చదువే దిక్సూచి అని తెలిపారు.

3.3. విద్య -పరిణామం:

విద్య ఏ విధంగా తరతరాలుగా సమాజంలో వివిధ రకాలుగా ఎలా పరిణమిస్తూ వస్తుందో తెలుపుతూనే నేటికి అది ఎలా విస్తరించిందో వివరించే ప్రయత్నం రచయిత చేయడం గమనించదగిన విషయం. విద్య ఎలా వికసిస్తూ వస్తోందో ‘అక్షరం’ అనే కవిత ద్వారా పరిశీలించదగ్గది. పూర్వం వర్ణవ్యవస్థ, సాంప్రదాయాలూ అంటూ హద్దులు సమాజంలో మనుషుల మధ్య ఏర్పడ్డట్లే విద్యాసంబంధితాలకూ ఏర్పరిచారు. అలా కొందరి చేతిలో బంధీగా ఉన్న అక్షరం కాలక్రమేణా స్వేచ్ఛని పొంది అందేంత చేరువగా వచ్చింది. ఆ ఎదుగుదల భవిష్యత్‌ని, మానవతని, చైతన్యాన్ని నింపుకొని వచ్చి ఆ వెలుగులను పంచుతోందని,అక్షర పరిణామం జీవితాలకెలా చేరువుగా మారిందో చెప్పే క్రమంలో ఓ పండుగలా వచ్చిందనే భావాన్ని వ్యక్తం చేయడం ఈ కవితలో పరిశీలించొచ్చు.

‘‘పద్యమై, గద్యమై, నాట్యమై ఎదిగిన అక్షరం
ఛందస్సుల అలంకారాలంటూ ఆచారాల సంకెళ్ళతో
కొందరికే నియమితమైన అక్షరం
పంచములకు, పామర జనాళికి అంటరానిదైన అక్షరం
పాండితి లోకంలో వేళ్ళూనుకొని పెన వేసుకొన్న
మూఢాచారాల బంధనాలను
తెగతెంపులు చేసుకొచ్చింది అక్షరం
అందరిదాని’’నంటూ, తారతమ్యాల్లేవు అంటూ
అందరి అభ్యున్నతికి ఆధారమవుతానంటున్న అక్షరం
భవిత, మానవత, జాగృతి మోసుకొచ్చిన అక్షరం
సమత, మమత, నవత పంచుతున్న అక్షరం
జీవనాధారమై నిలిచే అక్షరం
బ్రతుకు దెరువునిచ్చే అక్షరం
అందరి జీవితాలలో వెలుగు నింపే అక్షరం.
వచ్చింది... వచ్చింది.. సంక్రాంతిలా అక్షరం..’’ (అక్షరగోదావరి, పుట: 16)

అక్షరానికి కూడా అంటరానితనాన్ని నేర్చిన చరిత్ర మనది. కొన్ని వర్గాలకు చేరువై మరికొన్ని వర్గాలకు దూరమై ‘అందరికీ విద్య’ అనేది అందని ద్రాక్షే అయ్యింది. కట్టుబాట్ల క్రమ విద్యావ్యాప్తికి అడ్డొచ్చింది. పలు సంస్కరణలతో అక్షరం అందరిదైంది. నిజానికి చదువు, జ్ఞానం అనేవి ఏ ఒక్కరి సొంతమో కాదు. విద్యకు ఎలాంటి భేద భావాలుండవు. ఎవరు ఒడిసిపట్టినా వారి చెంత ఇమడగలదు. మరియు వారి అభివృద్ధికి, వ్యక్తిత్వానికి సోపానాలు వేయగలదు. చదువు ఇచ్చే జ్ఞానం, భరోసాతో ఎవరైనా ఉన్నత స్థానానికి ఎగబాకే అవకాశం దొరుకుతుంది. బ్రతుకు తెరువు అనేది శారీరక శ్రమతోనూ సాధ్యం కావచ్చు. విద్యావిషయ జ్ఞానంతోనూ సుసాధ్యం కావచ్చు. కానీ ఈ  రెండవ మార్గం ఉత్తమమైనది. జీవితం ఒక పర్వదినంలా సాగాలంటే విద్యాధికులుగా మారడం వలనే సాధ్యమవుతుందనే రచయిత వాదనతో సమాజం ఖచ్చితంగా ఏకీభవించాలి. ఈ కోణంలోనే పై కవిత ఆలోచన కలిగించింది.

కాలానుగుణంగా సమాజంలో అనేక మార్పులు సంభవించాయి. విద్య విషయంలో నాటికీ, నేటికీ పలు పరివర్తనలు చోటుచేసుకున్నాయి. ఇలా విద్య విషయంలో ప్రాధాన్యత ఎలా మారుతూ వస్తుందో మరో కవితలో వర్ణించే ప్రయత్నం చేశారు రచయిత. జ్ఞానం ఎంత గొప్పదో గుర్తిస్తేనే విద్యను అంతగా ఆస్వాదించి, అదో తపస్సులా ఎంచి అందుకునేందుకు కృషిచేస్తారు. ఒకప్పుడు ఈ ఆలోచన లేకపోవచ్చు. కానీ ఆధునిక కాలంలో దీని ఆవశ్యకతను గుర్తించాలని హితవు పలకడం ఈ కవితలో గమనించదగిన విషయం. కనుకే విద్యాభ్యాసానికి ఓ ఉన్నత స్థానమివ్వాలని ఈ కవితా ముఖంగా కోరారు రచయిత. ఇప్పట్లో అందరికీ చదువుకొనే అవకాశమున్నా కొందరే దాని విలువను అందుకుని ఉత్తీర్ణులై బతుకుబడిలో ముందుంటున్నారనే విషయాన్నిలా ఈ కింది వాక్యాల్లో పరిశీలించవచ్చు.

‘‘అప్పట్లో చదువుకునే వాళ్ళందరూ, ఇప్పట్లో చదువుకునే వాళ్ళెందరో
అప్పట్లో చదువు బ్రతకటానికోదారి, ఇప్పట్లో చదువే బ్రతికించే దారి
వాస్తవమ్మీ పలుకు తెన్నేటి పలుకు...’’ (వాస్తవమ్మీ పలుకు తెన్నేటి పలుకు, పుట:2)

చదువు జీవితానికి ఓ దారిని చూపిస్తుందనేది ఆనాడైనా, ఈ నాడైనా, మరేనాటికైనా వాస్తవం. ఒకప్పుడు విద్య అందరిదీ కాక, కొందరిదే అయినా నేడు మాత్రం ప్రతీ ఒక్కరికీ చదువుకునే అవకాశం, సదుపాయాలున్నాయి. విద్య విషయంలో భేదభావాలు ఉండకూడదని మరియు పుస్తక జ్ఞానం ఉత్తమ బతుకు తెరువుని ఇస్తుందని ప్రతి ఒక్కరూ విశ్వసించడం వలన చదువుకి ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పుడది బ్రతికించే దారి అయిందని రచయిత అనడం వెనుక విద్య అనేది జీవనగమనానికి ఎన్నో నీతివంతమైన మార్గాలకు మరల్చుతుందనే సూచన చేయడం రచయిత విద్యా దృక్పథానికి నిదర్శనంగా చెప్పవచ్చు.

3.4 విద్య - దృక్కోణం:

విద్యను అభ్యసించడమే కాదు, దాన్ని సమంజసమైన మార్గంలో దర్శించాలి. విద్య సన్మార్గంలో ఉపయోగపడాలి. ఈ క్రమంలో దానిగురించి విద్యానందించే విధానం ఎలా ఉండాలో?, విద్యా బోధన ఎలా ఉండాలో కూడా తెలియజెప్పే ప్రయత్నం మరో కవితలో కనిపించింది. అలాగే నేటి చదువులపై చురకలు వేస్తూ ‘విద్య..ప్రగతి నిర్దేశం’ శీర్షిక ద్వారా హితబోధ చేశారు. చదువు అనేది ఏ ఆశయంతో సాగాలో వివరిస్తూ  ఇప్పుడు పట్టిన వక్రగతి విమర్శ కూడా అంతర్లీనం చేసి ఆలోచింపజేయడం ద్వారా విద్యా వ్యవస్థలోని లోపాలు సరిదిద్దవచ్చుననేది సారాంశంగా ఉంది. ఒకనాడు చదువన్నా, బోధకులన్నా, విద్యాలయాలన్నా గౌరవం ఉండేది. వినయంతో అభ్యసించేవారు. రానురాను అన్నింటా మార్పులు వచ్చినట్లే యావత్‌ విద్యావ్యవస్థ పరిణామానికి లోనైంది. వాటిని విశ్లేషిస్తూ అలా ఉండకూడదన్న ఆవేదనని కనబరుస్తూ ప్రగతికి మార్గాన్ని నిర్దేశించేలా ఉండాలన్న తన అభిప్రాయాన్ని రచయిత వెలిబుచ్చడం పరిశీలించదగ్గది.

‘‘విద్య అంటే మమ్మీ డాడీల సంస్కృతి అంటగట్టేది కాదు
విద్య అంటే అంకెల్లో లెక్కించే ర్యాంకుల పంటకాదు
విద్య అంటే గారడీ చేసే గ్రేడ్‌ గ్రాఫ్లతోటకాదు
అమ్మ అంటే గంటల తరబడి బట్టీ పట్టించే సిస్టమ్‌ కాదు
వినూత్న కోర్సులతో మేధోమధనం చేయించే కర్మాగారం కాదు
రకరకాల సౌకర్యాలతో ఫీజులు గుంజే వ్యాపారం కాదు
విభిన్న ప్రచారాలతో బడా సంస్థలు
ఆడే మాయాజాలం కాదు
విదేశాలకెగిరిపోయే రెక్కల వీసాలిచ్చే రేషన్‌ కాదు
నిస్పృహలతో కిటికీ ఊచలకు ఉరేయించే మహమ్మారి కాదు
కార్పోరేట్‌ సంస్థల ఉచ్చుల్లో బలయ్యే బాల్యం కాదు
విద్య అంటే
ఉన్నత విలువల ఉత్తమ వ్యక్తిత్వాల నందించే సమాహారం
సృజనాత్మక కళలతో మేధా పరిపక్వత చేకూర్చే సమ్మేళనం
తరాల సంస్కృతీ సాంప్రదాయాల వారసత్వంగా
జీవన మార్గాన్నందించే ప్రగతి నిర్దేశనం’’ (కవితలు కొలువు, పుట: 903)

పురోభివృద్ధి ఆనందాన్నిస్తుంది గానీ తిరోగమనం ప్రశ్నార్థకంతో పాటు బాధని కలిగిస్తుందనే మాటని సాక్ష్యంగా మారిన నేటి విద్యారంగం గురించిన మాటలు పైనున్నాయి. ఇక్కడ విద్య అనేది మార్కెట్‌ని తలపిస్తోందని, ర్యాంకుల కోసం జ్ఞాన బోధకన్నా బట్టీ పెట్టించే జైళ్ళలా మారి పెట్టుబడిదారుల చేతిలో కుదేలయిందని సమాజంలో విద్యావ్యవస్థలో విలువలు క్షీణించడాన్ని కనులకు కట్టారు. విద్య అంటేనే విలువలతో కూడిన జ్ఞానం. కానీ నేడు ప్రైవేట్‌, గవర్నమెంట్‌ పాఠశాలల్లో పోటీలను దృష్టిలో ఉంచుకొని చదువుని నేర్చుతున్నారే గానీ నైతిక విలువలతో వ్యక్తిత్వం పెంచేందుకు కృషి చేయట్లేదన్న విషయం తేటతెల్లం అవుతోంది. అందుకే కన్నవారిని, మాతృభూమిని వదిలి విదేశాలకు ఎగిరెళ్ళి తల్లిదండ్రులను అనాథలను చేయగలుగుతున్నారు. ‘విద్య అంటే మమ్మీ దాడీల సంస్కృతి అంటగట్టేది కాదు’ అని ప్రత్యేకంగా చెప్పడంను బట్టి మాతృభాషని పక్కన పెట్టి ఆంగ్లభాషకు పెత్తనాన్ని కట్టడాన్ని నిరసించారు. తెలుగు కనుమరుగు అవుతున్న కారణాన్ని, ఆంగ్ల మోజుని ఎద్దేవా చేయడంలో వాస్తవాన్ని గమనించవచ్చు.?

నేటి విద్యావ్యవస్థలో హంగులు ఎక్కువ జీవం తక్కువ. ఫీజుల కోసం మేనేజ్‌మెంట్‌ జిమ్మిక్కులు, తమ పిల్లలు బడిలో వేయగానే ఐ.ఎ.ఎస్‌., ఐ.పీఎస్‌లు అయిపోవాలన్న తల్లిదండ్రులు అత్యాశ, ఆడిపాడే వయస్సులో ఐ. ఐ.టీలంటూ చిరు మెదళ్ళపై బలవంతంగా రుద్ది వారిని చావు వరకూ తీసుకెళ్తున్న ఘటనలెన్నో ఉన్నాయి. దీనికి కారణం విద్యారంగాన్ని పూర్తిగా వ్యాపారమయంగా మార్చడమే. ఆ సంకెళ్ళను తెంచుకొని చదువంటే మేధస్సుకి మెరుగులుదిద్ది. వ్యక్తిత్వాలను తీర్చి దిద్ది, సృజనాత్మకతతో, అభివృద్ధిని కాంక్షించి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చి వారిని దేశ సంపదగా నిలపడమే అసలైన విద్యా వ్యవస్థ లక్ష్యంగా మారాలని రచయిత తన ఆశావాదాన్ని వ్యక్తం చేసారు. నిజానికి విద్య యొక్క ప్రధమోద్దేశం ఇదే. కానీ వ్యక్తుల స్వార్ధం. ఈ వ్యవస్థ కుచించుకొనిపోయి దారి మళ్ళింది. దాన్ని తెలివి ఉన్నవాడికన్నా, డబ్బు ఉన్నవాడికే పెద్ద పీట వేస్తుండటంతో ప్రతిభ, నైపుణ్యం లేని తరం పురోభివృద్ధికి ఆటంకంగా మారి వ్యవస్థని అపహాస్యం చేస్తున్నాయని చదువంటే కేవలం ముందడుగుగానే ఉండాలని ఈ కవిత ద్వారా నొక్కివక్కాణిండంలో రచయిత నేటి విద్యా వ్యవస్థపై నిరసన భావం కలిగి ఉన్నారని అర్థమవుతుంది. అలాగే ఈ విధానం మారాల్సిన అవసరం ఎంతైనా ఉంది తెలియవస్తుంది.

ఇదే కోణంలో ‘విద్య’ అంటే అనే శీర్షికలో చదువుల రంగం పక్కదారి పట్టడానికి తల్లిదండ్రుల యాజమాన్యాలే కారణమని వివరించడంతోపాటు ఈ మాయలో బలి పశువులవుతున్న పిల్లలేంకోల్పోతున్నారో తెలియజెప్పే ప్రయత్నం మరికొన్ని కవితల్లో చేశారు రచయిత. విద్యార్థులకు ఎలాంటి వాతావరణం ఉండాలో తెలపడాన్ని పరిశీలిస్తే, ఈ రంగంలో వచ్చిన మార్పుల ఆద్యంతాలను గూర్చి సూక్ష్మ పరిశీలన చేసారని, ఈ కవితే అందుకు సాక్ష్యమని ఈ కింది కవితనుబట్టి గ్రహించవచ్చు.

‘విద్య అంటే మార్కులు తెప్పించటమే కాదు మార్పును తెప్పించాలి.
విద్య కేకలు పెట్టించేలా కాకుండా ఆకలితీర్చేలా ఉండాలి.
విద్య బట్టీ సిస్టమ్‌ కాదు, క్రియేటివిటీ నేర్పాలి
విద్యార్థులంటే బంగరు పంజరంలో రెక్కలు విరిచేసిన చిలుకలు కాదు
విద్యార్థులంటే పరిమితుల్లేని ఆకాశంలో ఎగిరే స్వేచ్ఛా విహంగాలు
విద్యార్థులంటే మన పిల్లలే... వారసత్వ సంపదలే
పిల్లలను అంకెల ర్యాంకులతో కాదు
అనురాగంతో, మమకారంతో పెంచాలి
పిల్లలను మనీతో కాదు పెంచేది
మనసుతో పెంచాలి...’’ (అక్షరగోదావరి, పుట : 21)

ఈ కవితలో విద్యార్థుల తల్లిదండ్రులకు పలు సూచనలు చేయబడ్డాయి. విద్యావ్యవస్థలో మార్పులు అనేవి అభివృద్ధి కోసం అయితే ఆస్వాదించవచ్చు. అలా కాక కాలక్రమేణా విద్యారంగంలో డబ్బే ప్రధానంగా మారినపుడు వెన్నెముక లేని వ్యవస్థ పసలేనిదై నిలుస్తుంది. ఈ రోజుల్లో రెండు సంవత్సరాల పిల్లల్ని కూడా ‘ఫ్రీ నర్సరీ’ అంటూ బడికి పంపి అమ్మచేతి గోరుముద్దలు తింటూ పరిసరాలు గురించి, నడత గురించి, మంచి చెడ్డల గురించి నేర్చుకోవాల్సిన వారిని యూనిఫారమ్‌లు తొడిగి ఆటస్థలమైనా లేని కార్పొరేట్‌ స్కూళ్ళకు పంపి వేలకువేలు ఫీజులను కడుతున్నారు. అక్కడి నుండి వారిని రుద్ది రుద్ది చదివిస్తూ అర్థం కాకున్నా బట్టీలు పెట్టిస్తూ చిరు బుర్రల్ని రంపాలతో కోసి జ్ఞానాన్ని కుక్కేసే విధంగా చెప్తోన్న విద్య హింసగా మారుతోంది. విద్యార్థుల స్వేచ్ఛనీ, భావుకతనీ, సృజననీ హరిస్తూ బోధింపబడుతోన్న తీరు ఏ మాత్రం సమర్ధింపతగినది కాదని విద్యారంగంలో సముచిత మార్పులతో అభివృద్ధి వ్యవస్థలో సాధ్యమని కోరడంలో రచయిత విద్యా దృక్పథం ఎలాంటిదో అర్థం అవుతూఉంది.

నేడు తల్లితండ్రులకు పిల్లలు త్వరగా స్థిరపడి రెండు చేతులా సంపాదించేయాలని అర్థంలేని కలలు కంటున్నారు గానీ మమతానురాగాలను అందించాల్సిన వయసులో వాటికి దూరం చేస్తే వారు తిరిగి వాటిని అందించలేని విధంగా తయారవుతారనడానికి వృద్ధులపై నిర్లక్ష్యమే ప్రత్యక్ష సాక్ష్యం. అయినా డబ్బు సంపాదించే యంత్రాల్లా పెంచితే మనసులో స్పందనలు కరువై మరబొమ్మల్లా తయారవుతారని అప్పుడు అనురాగాలు కరువవుతాయని గ్రహించాలన్నదే కవితా కర్త ఉద్దేశ్యం, మానవత్వం, ప్రేమభావాలను విద్య సాకుతో దూరం చేయవద్దని ర్యాంకుల పరుగులో వారిని బలిచేయకండని హితవు పలుకుతూ విద్యారంగం సంస్కరణ దిశగా పయనించినపుడే రాబోవు తరాలు ఉత్తమంగా ఉండగలవని ఆశించారు. అలాగే ‘స్వేచ్ఛాయుత విద్యావిధానాన్ని సమర్ధించారని కూడా చెప్పొచ్చు.

3.5 విద్య -హితబోధ:

ఒక్క అక్షరం అటుఇటు అయితే అర్థాలు తారుమారైనట్లే ఓ సరైన నిర్ణయం చదువు పట్ల తీసుకోకుంటే జీవిత పరమార్థాన్ని కోల్పోవలసి వస్తుందని హితబోధ చేసే కవిత్వం రచయిత కలం నుండి జాలువారింది. మానవుడు దానవుడిగా నిరక్షరాస్యతతో మారుతాడు. అలాంటి దానవునికి విలువలను, నేర్పి వ్యక్తిత్వాన్ని నిలిపి సమాజంలో ఒక ఉన్నత స్థితి దక్కేలా చేసేదే విద్య అనే అభిప్రాయాన్ని కనబరిచారు.

‘‘పడిపోటానికి ఓడిపోటానికి ఒకే అక్షరం
పొంగిపోటానికి కుంగిపోటానికి ఒకే అక్షరం
పాడు చేయటానికి చెడు చేయడానికి ఒకే అక్షరం
కష్టపడటానికి ఇష్టపడటానికి ఒకే అక్షరం
మానవుడు దానవుడవ్వటానికి ఒకే అక్షరం
వాస్తవమ్మీ పలుకు తెన్నేటి పలుకు....’’ (వాస్తవమ్మీ పలుకు తెన్నేటి పలుకు, పుట:19)

ఈ విధంగా సాగిన పంక్తులలో అంతర్లీన భావనలే అధికంగా ఉన్నాయి. ఓ చిన్న తేడా ఎంతో మార్పుని తెస్తుంది. సాధారణ విషయాల్లో ఆ మార్పు మంచిగానో, చెడుగానో పరిణమిస్తుంది. కాని విద్య విషయంలో మాత్రం సరైన అడుగు వేయకపోతే వచ్చే తేడా మాత్రం ఎంతో నష్టాన్ని కలిగిస్తుంది. కొందరు చదువు విలువ తెలియక చిన్నచూపుతో సమయాన్ని వృథా చేసుకొని జ్ఞానాన్ని పొందలేరు. అలాంటి వారు ఎదగలేరు. కొందరు అవకాశం లేకున్నా దాన్ని అందిపుచ్చుకోవడానికి ఎంతో కష్టపడి, ఇష్టపడి చదువుతారు. అలాంటివారు ఓ గొప్ప స్థాయికి అర్హులు. వారే అందరికీ ఆదర్శనీయులు. ఈ విధంగా చెప్పడం ద్వారా చదువు పట్ల ఆసక్తిని కలిగి ఉంటే ఎంతగా శ్రమించినా అలసట తెలియదని ఆస్వాదించడమే తెలుస్తుందని స్పష్టం చేసారు.

విద్యని అభ్యసించని వారికి నిలదొక్కుకునే అవకాశాలు తక్కువ. ఏ శ్రామికునిగానో లేక ఆదాయం సరిపోక, ఆకలి తీర్చుకోడానికి తనపై ఆధారపడిన వారి పోషణార్థం నేరస్తునిగా మారవలసి వస్తుంది. వారెందరో సమాజంలో ఛీకొట్టించుకొంటూ చట్టానికి దొరకనంత వరకు దొరల్లా బతికేస్తున్నారు. విలువలు లేని బతుకు ఆనందాన్నివ్వదు. నిరంతర భీతిని కలిగించి ప్రశాంతతని దూరం చేస్తుంది. అదే విద్యార్జన చేసినవాడు ఏదో ఒక మంచి పనిలో స్థిరపడి పరువుగా బతుకుతాడు. ఇలా తెలిపి చదువుతున్న వారిని నిరాసక్తత, నిర్లక్ష్యం వీడమని చేసే పనిని భవిష్యత్‌ని దృష్టిలో ఉంచుకొని పూర్తి స్థాయిలో చేయమని చెప్పడంతో పాటు అక్షరం యొక్క విశిష్టతని ఎరిగి అక్షరాస్యతని సాధించమని విన్నవించడం ఆహ్వానించదగిన విషయం.

3.6 విద్య -సంస్కారం:

చివరగా కేవలం చదువు ఒక్కటి ఉంటే సరిపోదని దానితోపాటు సంస్కారం, మానవత కూడా ఉండాలని ప్రబోధించడం విశేషం. విద్య వినయాన్ని అందించాలి. అందిపుచ్చుకున్న జ్ఞానం మరొకరికి తోడ్పాటుగా, ఆదరణగా మారితే మనసున్న మనిషి గా పరిపూర్ణుడవుతాడు. సంఘంలో పదిమందితో జీవించేటపుడు స్వార్థంతో ఎవరితో కలవక విడిగా బతికేవాడికి విలువుండదు. అందరి ఆనందంలోను, బాధలోను భాగమయ్యే గుణాన్ని అలవర్చేవిధంగా విద్య సంస్కారాన్ని అందించాలని కోరుకోవడం ఈ కింది కవితలో పరిశీలించవచ్చు.

‘‘సంస్కారం లేని చదువు, వ్యక్తిత్వాన్ని రూపొందించలేని చదువు
సార్ధకత చేకూర్చని చదువు, ఉపయోగపడని చదువు
ప్రయోజనం కాన్పించని చదువు, అర్ధమవ్వని చదువు
వ్యర్ధమేనోయ్‌... వ్యర్ధమేనోయ్‌....వాస్తవమ్మీ పలుకు తెన్నేటి పలుకు....’’ (వాస్తవమ్మీ పలుకు తెన్నేటి పలుకు, పుట:19)

నాలుగు అక్షరం ముక్కలు నేర్చుకొని సంపాదనా మార్గాన్ని వెతుక్కొని విర్రవీగితే సరికాదని మంచితనం, సంఫీుభావం కూడా ఉండాలనే సూచన చేయడం ఈ కవితలో ప్రధాన విషయం. సాధారణంగా మనిషి సమాజంలో భాగమైనా లాభం లేనిదే ఏ పనీ చేయడు. కోరికలు, ఆశ అధికం ఎంత చదువుకున్నా కొందరు ఈ విధమైన సంకుచిత భావాలను కనబరుస్తుంటారు. కానీ పరిణతి ఉన్న మానసిక స్థితిని చదువు ద్వారా అలవర్చుకొంటే అతని చుట్టూ నలుగురు మూగి చేరువ అవుతారు. ఇక విద్య అనేది ఎంతో తెలివిని, లోకజ్ఞానాన్ని ఇస్తుంది. కనుక ఏ పనిని ఎలా సాధించాలో నేర్పు తెలుస్తుంది. అలా ఇతరుల అవసరాలను, కష్టాలను కొంతైనా తీర్చే సార్ధకతని విద్య ద్వారా నిలుపుకోవాలని ఆశించారు. నైతికవిలువలు విద్యలో కొరవడటాన్ని గుర్తించి దాని ప్రభావమే చదువుకున్న వారిని సైతం మరమనుషులు చేస్తోందని, ఈ విధానాన్ని విడనాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని నొక్కిచెప్పడం ఈ కవితా సూచనగా భావించవచ్చు.

4.ముగింపు:

‘తెన్నేటి లక్ష్మీనరసింహమూర్తి విద్యా విషయక కవితలు-పరిశీలన’ అనే ఈ వ్యాసంలోని కవితలన్నీ మనిషి మనుగడకు విద్య మూలమని, విద్యావ్యవస్థ గొప్పతనాన్ని, లోపాలను, వాటికిగల కారణాలను, సూచనలను పరిశీలించాను. అసలు చదువు అనేది వ్యక్తి ఎదుగుదలకు ఎంత ముఖ్యమో చెప్తూ గతంలో కొద్దిమందికే పరిమితమై తర్వాత కాలంలో వికాసాన్ని చెప్పడంతో నాటి పరిస్థితులను అవలోకనం గావించి నేడు ఏ విధంగా రూపుని మార్చుకొని వ్యాపార దృక్పథంతో సాగుతోందో వివరించి ఆవేదన చెందారు. అంతేకాకుండా విలువలు లేని విద్య రాణించదని వ్యక్తి సంపూర్ణమత్వం లోపిస్తుందని చెప్పడం ద్వారా చదువుతో పాటు నైతిక విలువలను పెంపొందించాల్సిన బాధ్యతని గుర్తు చేశారు. విద్య బతుకుకి భరోసానిస్తుందని, ప్రతి ఒక్కరూ చదువుకోవాలని ఆశించడంలో సమాజాభివృద్ధికి విద్య ఎంత అవసరమో రచయిత  చాటి చెప్పినట్లైంది.
రచయిత ఓ ఉపాధ్యాయుడు కనుక విద్య యొక్క ఆవశ్యకతను తెలియజెప్పడంలో, విద్యను బోధించడంలో బెత్తం పట్టారని చెప్పవచ్చు. ఒకప్పుడు అందరికీ అందని ద్రాక్షగా ఉన్న విద్య నేడు సంవృద్ధి ఫలభరితమై అందరికీ అందుబాటులోనికి వచ్చిందని చెప్పడంతో పాటు విద్య జ్ఞానాన్నే కాకుండా విలువలను బోధించాలని లేదంటే ఆ చదువు నిరర్థకమని సూచించారు. నేడు విద్యారంగంలో సంభవిస్తున్న మార్పులను చర్చిస్తూ విద్య ఒక వ్యాపారమైందని, మమ్మీ - డాడీ సంస్కృతిలో పడిన తల్లిదండ్రులు పిల్లలు పుట్టగానే డాలర్లు సంపాదించాలన్న అత్యాశతో ప్రేమను కాక ఒత్తిడిని పెంచడం బాధాకరమని చెప్తూ చదువు అనేది ఆటపాటల సమన్వితమై విలువల భరితమై ఉల్లాసాన్ని, ఉత్తేజాన్ని, విజ్ఞానాన్ని, చైతన్యాన్ని అందించాలని కోరారు. విద్య వినయ సంపదను పెంచి అభివృద్ధిని కాంక్షించేలా వెల్లివిరియాలని దానిపట్ల నిర్లక్ష్యం తగదని హితవు పలికి ఆలోచింపజేసిన విధానం ప్రశంసనీయంగా ఉంది. వీరి కవిత్వంలో వాస్తవిక జీవన చిత్రణ కనిపించడాన్ని బట్టి సమాజాన్ని ఎంతగా ఆకళింపుచేసుకున్నారో తెలిసింది. గత, వర్తమాన అంశాలను దృష్టిలో ఉంచుకొని విద్య గురించి క్షుణ్ణంగా చెప్పడంవల్ల తెన్నేటి వారి కవితలన్నీ విశిష్టతని సంతరించుకున్నాయని ఈ వ్యాస ముఖంగా అర్థంచేసుకున్నాను.

5. ఉపయుక్తగ్రంథసూచి:

  1. గంగాధర్‌, ఎం. ఆధునిక తెలుగు కవిత్వంలో విప్లవ ధోరణలు-ఒక విశ్లేషణ. ప్రాణహిత ప్రచురణలు, ధర్మసాగర్‌, వరంగల్‌జిల్లా,1994.
  2. చంద్రశేఖరరెడ్డి, రాచపాళెం. ఆధునికాంధ్రకవిత్వం- ఉద్యమాలు– సందర్భాలు. ఆర్‌. లక్ష్మి, అనంతపురం, 2002.
  3. జగన్నాథమ్‌, పేర్వారం. అభ్యుదయకవిత్వానంతరధోరణులు. సాహితీసమితి, రాగన్నదర్వాజ, హనుమకొండ, 2003.
  4. లక్ష్మీనరసింహమూర్తి, తెన్నేటి. అక్షరగోదావరి (కవితా సంపుటి), గోదావరి సాహితీప్రభ ప్రచురణలు, గణపవరం,2007
  5. పైదే. కవితల కొలువు (కవితాసంపుటి), గోదావరి సాహితీప్రభ ప్రచురణలు, గణపవరం, 2018.
  6. పైదే. తెన్నేటి తరగలు (కవితాసంపుటి), గోదావరి సాహితీప్రభ ప్రచురణలు, గణపవరం, 2003.
  7. పైదే. వాస్తవమ్మీపలుకు తెన్నేటిపలుకు (కవితాసంపుటి), గోదావరి సాహితీప్రభ ప్రచురణలు, గణపవరం, 2018.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]