AUCHITHYAM | Volume-5 | Issue-1 | January 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed
8. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ‘తులసిమొక్కలు’ కథ: సంఘసంస్కరణ దృష్టి
డా. తంగి ఓగేస్వరరావు
తెలుగు అధ్యాపకులు,
వి. వి. గిరి ప్రభుత్వ కళాశాల,
దుంపగడప, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9959753832, Email: t.ogeswararao@gmail.com
Download
PDF
వ్యాససంగ్రహం:
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ప్రముఖ కథకులు. వ్యవహారికభాషలో కథలు రాసి భాషా విషయంలోనూ, వస్తువు విషయంలోనూ నూతన ఒరవడికి నాందిపలికారు. సంఘసంస్కరణ వీరి కథలలో ప్రధాన వస్తువు. గురజాడ ప్రారంభించిన మార్గాన్ని తన సాహిత్యం ద్వారా మరింత ముందుకు శ్రీపాదవారు తీసుకువెళ్లారు. వీరి కథలో తన కాలంనాటి సాంఘిక దురాచారాలు కథా వస్తువులుగా తీసుకున్నారు. సమాజం నుండి ఆయా దురాచారాలను తొలగించవలసిన ఆవశ్యకతను వీరి కథలు తెలియజేస్తాయి. వీరు రచించిన తులసిమొక్కలు కథ కూడా ఈకోవాకే చెందుతుంది. భోగం వృత్తిని కథా వస్తువుగా తీసుకోని రచించిన ఈ కథ సమాజం నుండి ఈ వృత్తిని రూపుమాపవలసిన ఆవశ్యకతను తెలియజేస్తుంది. ఈ పరిశోధన వ్యాస రచనకు అవసరమైన సమాచారాన్ని కళాశాల గ్రంథాలయం నుండి మరియు https://archive.org నుండి స్వీకరించాను.
Keywords: భోగం, రంగనాయక, ప్రకాశం, రాజామణి, వీరేశలింగం పంతులు, వేశ్యరికం.
1. ఉపోద్ఘాతం:
20 వ శతాబ్దపు కథకులలో విశిష్టంగా చెప్పుకోదగ్గ రచయత శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి. భాషలో, భావంలో, తెలుగు నుడికారం ప్రయోగించడంలో ఇతను పేరెన్నిక గన్నవారు. ఇతని జీవితం ఒక సంధి యుగంలో గడిచింది. ఒక ప్రక్క పాత సంప్రదాయాలు వెనక్కి లాగుతూ ఉండగా, పాశ్చాత్య నాగరికత మరొక ప్రక్క ఆకర్షిస్తూ ఉండగా ఆ పాత కొత్తల కలయకని తన రచనలలో ప్రతిభావంతంగా చూపించిన రచయితలలో శ్రీపాదవారు ప్రముఖులు. వీరు తెలుగు సాహిత్యంలోని కథ, నవల, నాటకం, పద్యం, విమర్శ ఇలా అన్నీ ప్రక్రియలలోనూ తనదయిన ముద్రవేశారు. అవధానంలో కూడా వీరికి ప్రమేయం ఉంది. వీరి రచనలు సందేశాత్మకంగా, ఛాందస భావాలకు వ్యతిరేకంగా మార్పుకోరేవిగా ఉంటాయి. భాష నేపధ్యంలో ఒక భాగం కావడం శ్రీపాదవారితోనే ప్రారంభమైంది. శ్రీపాదవారు ఉపయోగించిన భాష గోదావరి జిల్లా వెలనాటి బ్రాహ్మణులనూ, బ్రాహ్మణాగ్రహారాలనూ సజీవంగా చిత్రించగలిగింది. నేపధ్యానికీ, పాత్రలకూ, కథాంశానికీ మధ్య సంబంధాన్ని చిత్రించడానికి ప్రయత్నించిన మొదటి కథకుడు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి.
తెలుగు సాహిత్యంలో గురజాడ అప్పారావు తర్వాత అంతటి పేరొందిన కథకుడు శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి. “శ్రీపాద - వీరేశలింగం నుంచి వస్తువునూ, గురజాడ నుంచి ప్రక్రియనూ గ్రహించాడు. అచ్చమైన తెలుగు కథా రచయిత”1 అని వల్లంపాటి వెంకటసుబ్బయ్య గారు ప్రశంసించారు.
ఇతనిని కథాకథన చక్రవర్తిగా సాహిత్యకారులు కొనియాడారు. శ్రీపాదవారు దాదాపు 25 కథా సంపుటలను వెలువర్చారు. వీటిలో ఎక్కువభాగం అప్పటి అగ్రవర్ణాల అంతర్మధనంగానే కనిపిస్తాయి. శ్రీపాద ఒక వర్గానికే వ్యతిరేకంగా తన కలాన్ని ఎక్కుపెట్టినట్లు కనిపించినప్పటికీ... ఆయన ప్రత్యక్షంగా చూసిన పరిస్థితులు అవే కావడం చేత, అవే ఇతివృత్తాలను కథాంశంగా తీసుకోవడంలో ఆశ్చర్యం లేదు. పైగా ఆయన బలం కూడా అదేనని తోస్తుంది. ఇక్కడ ఒకసారి పోరంకి దక్షిణామూర్తిగారి మాటను గుర్తుచేసుకోవాలి.
“ఆయన తన చుట్టూ వున్న పరిసరాల్ని బాగా ఆకళించుకొన్నవాడు. అక్కడి జన జీవితాన్ని వెయ్యి కళ్ళతో కనిపుట్టినవాడు.ఆ జనం పలుకుబళ్ళ కోసం చెవులు దోర బెట్టుకొని విన్నవాడు - ఇంత నిష్ఠగా తెలుగు కథను పండించిన రచయితలు చాలా అరుదు”2 అని దక్షిణామూర్తి శ్రీపాదవారి గురించి అన్నమాటలు పై అంశాలను దృవీకరిస్తున్నాయి.
తను విన్న మాండలికాలు, పడికట్టు పదాలు, వాక్య నిర్మాణాలను యధాతథంగా సంభాషణల్లోకి చొప్పించడంతో సదరు కథలు సహజంగా తోస్తాయి. అందుకే తెలుగు భాష మీద పట్టు సాధించాలన్నా, ఒకప్పటి తెలుగు సమాజం మీద అవగాహన ఏర్పరుచుకోవాలన్నా తప్పకుండా శ్రీపాద కథలని చదవమని పెద్దలు చెబుతుంటారు.
శ్రీపాద కథలకి ఒక పరిమితి అంటూ కనిపించదు. ఇలా రాయాలని ఆయన మడిగట్టుకున్నట్లు తోచదు. ఒకసారి రాయడం అంటూ మొదలుపెడితే అది పది పేజీలలో ముగిసిపోవచ్చు. 60 పేజీలని దాటిపోవచ్చు. తను చెప్పదల్చుకున్న విషయాన్నంతా కాగితం మీద ఆవిష్కరించడమే ఆయన ఉద్దేశంగా కనిపిస్తుంది. అలాగని ఆయన కథలలో వర్ణనలు, కల్పనలూ కనిపించవు. సాదాసీదా సంభాషణలే కథని నడిపిస్తాయి. ఒకోసారైతే ఎలాంటి వివరణా లేకుండా పూర్తిగా సంభాషణలతోనే కథ నడుస్తుంది. అందుకు ‘బ్రాహ్మణాగ్రహారం’ అనే కథే గొప్ప ఉదాహరణ. పాఠకుడు ఇందులో కథని కేవలం సంభాషణల ద్వారానే వెతుక్కోవలసి ఉంటుంది.
శ్రీపాద సంప్రదాయవాది కాదు. అలాగని అప్పటి పరిస్థితుల మీద ఘాటైన వ్యాఖ్యానాలూ చేయలేదు. అప్పటి సమాజాన్ని ఉన్నది ఉన్నట్లుగా పాఠకులకు చూపించే ప్రయత్నం చేశారు. శ్రీపాద రాసిన కథలలో చాలావరకు ప్రజాదరణ పొందినవే. గులాబి అత్తరు, షట్కర్మయుక్తా, వడ్లగింజలు, యావజ్జీవం, కలుపుమొక్కలు... ఇలా చెప్పుకొంటూ పోతే శ్రీపాద విశిష్ట రచనల జాబితా చాలా పెద్దగానే తేలుతుంది. ఇవే కాకుండా ‘అనుభవాలూ-జ్ఞాపకాలూనూ’ పేరుతో ఆయన స్వీయానుభవాలు కూడా అప్పటి సమాజం గురించీ, దాని పట్ల ఆయన దృక్పథం గురించీ అవగాహన కలిగిస్తాయి.
శ్రీపాదవారు తాను ఉన్న సమాజాన్ని నిశితంగా గమనించి, తన రచనలలో పొదుపరిచారు. దీనికి ఒక ఉదాహరణ తులసిమొక్కలు కథ. నాటికాలంలో ప్రధానంగా ఉన్న ఒక సాంఘిక దురాచారం అయిన భోగం వృత్తిని వస్తువుగా తీసుకొని ఆ వృత్తివారి జీవితాలను ఈ కథలో వాస్తవికంగా చిత్రించారు. ఈ కథ భారతి పత్రికలో 1926లో ప్రచురితమైంది.
2. తులసిమొక్కలు కథ – ఇతివృత్తం:
కొందరు విద్యార్ధులు స్టీమర్ రేవు నుండి గుండువారి రేవు వరకు ఈతల పోటీకి దిగడంతో ఈ కథ మొదలవుతుంది. ఈ పోటీలో ప్రకాశం విజయం సాధిస్తాడు. వంద రూపాయలు గెలుచుకుంటాడు. కానీ అప్రయత్నంగా ప్రకాశం గుండువారి రేవు వద్ద స్నానం చేస్తున్న రంగనాయక అనే భోగం అమ్మాయిని పట్టుకోవడంతో వివాదం మొదలవుతుంది. ఆ అమ్మాయి వాల అన్న మాధవరావు పోలీసు స్టేషన్ లో ప్రకాశంపై కేసు పెడతాడు. చివరికి ప్రకాశం గురువు వీరేశలింగం పంతులు మధ్యవర్తిత్వంతో రంగనాయక, ప్రకాశం వివాహం జరగడంతో ఈ కథ సుఖాంతం అవుతుంది.
ఈ కథలో సుబ్రహ్మణ్య శాస్త్రి భోగం వృత్తివారి జీవితాలను ప్రధానంగా చిత్రించారు. వారిలో మార్పుతీసుకు వచ్చి , ఆ వృత్తిని విడిచిపెట్టేలా చేయడం రచయత ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తుంది. శ్రీపాదవారు సంస్కరణ దృక్పథంతో రాసిన కథలలో ఈ తులసిమొక్కలు ఒకటి.
3. తులసిమొక్కలు కథ– పాత్రల చిత్రణ:
3.1 ప్రకాశం:
ఈ కథ నందలి ప్రధాన పాత్రలలో ఇది ఒకటి. ఇతను బ్రాహ్మణ యువకుడు. పేదవాడు. తెలివైనవాడు. ఏకదాటిగా బి.ఏ. చివరి సంవత్సరం వరకు ఉత్తీర్ణుడైయ్యాడు. ఈతల పోటీలో విజయం సాధిస్తాడు. ఆ సందర్భంలో రంగనాయక అనే యువతిని పట్టుకున్నాడనే కారణంతో నిందించబడతాడు.
“నేను చేసిన పని చాలా తప్పే. కానీ యిది బుద్ధిపూర్వకంగా చెయ్యలేదు. ఈ సమయంలో యిక్కడ యింతమంది స్త్రీలు స్నానం చేస్తూవుంటారన్న వూహే నాకు కలగలేదు. ఇక జరిగిపోయినదానిని గురించి యేమనుకున్నా ప్రయోజనం లేదు, కనుక నేను నెగ్గిన నూరురూపాయలూ నీకిచ్చేస్తాను. క్షమించు”3 అని ప్రాధేయపడతాడు. కాని ఆ యువతి అక్కలు కనికరించరు. పోలీసులను తీసుకువస్తారు. పోలీసువారు ఇతనిపై కేసు నమోదు చేస్తారు.
తన గురువైన వీరేశలింగం పంతులుతో కలిసి పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామదీక్షితులను ప్రకాశం కలిసినప్పుడు ‘నీకు వ్యతిరేకంగా ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా?’ అని రామదీక్షితులు అనగా వేరే సాక్ష్యాలు అవసరం లేదు. జరిగినదంతా కోర్టులో చెబుతాను. క్షమించమని అడుగుతాను అని చెబుతాడు. పై రెండు సందర్భాలలోనూ ప్రకాశం ఋజువర్తనం, నిజాయితీ ప్రస్పుటమవుతుంది.
“నాలుగు సంవత్సరాల నుంచి నా శిష్యుడుగా వున్నాడు. సంవత్సరం క్రిందట పెళ్లాడడానికి నిశ్చయించుకున్నాడు. అయితే యిప్పుడు బ్రహ్మసమాజంలో కలవదలచి నా దగ్గిరేవున్న వినయవతీ, గుణవతీ, రూపవతీ అయిన కమ్మవితంతువును పెళ్లాడాలనుకుంటున్నాడు. కనుకనే మీపిల్లని పెళ్లాడడానికి అంగీకరించినాడు”4 అని వీరేశలింగం పంతులు ప్రకాశం గురించి చెప్పినమాటలు సంఘాన్ని సంస్కరించాలని ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పేరకంకాడు, ఆచరణలో చూపేవాడని స్పష్టంజేస్తున్నాయి.
ఈ విధంగా విద్యాబుద్ధి, నిజాయితీ, సంఘం సంస్కరించబడాలనే ఆకాంక్ష ఉన్న వ్యక్తిగా శ్రీపాదవారు ప్రకాశం పాత్రను తీర్చిదిద్దారు.
3.2 రంగనాయక:
ఈమె భోగం వృత్తి చేసే రాజామణి కూతురు. ఈమెకు పదునాలుగు సంవత్సరాల. రజస్వలై రెండు నెలలు మాత్రమే అయింది. ముక్తసరు మనిషి. సానులు, సరసుల నడుమ తిరగడం వలన వయస్సుకు మించి మనుషులను అర్ధం చేసుకోగల నేర్పు ఆమెది. గుండువారి రేవులో ప్రకాశం ఈమెనే అప్రయత్నంగా పట్టుకుంటాడు. ఆమె అన్న ప్రకాశాన్ని తిట్టగా అక్కడ ఉన్న విద్యార్ధులు ‘మీరు భోగంవారు. మీకు ఇందులో కొత్తేముంది’ అని హేళన చేస్తారు. ఈ సందర్భంలో ఒక వృద్ద బ్రాహ్మణ వితంతువు “బొగందైతే మాత్రం! ఎదిగినబిడ్డ; తప్పుకాదూ?”5 అన్న మాటలు రంగనాయక మనస్సుపై బలమైన ముద్ర వేస్తాయి. ఆమెకు మొదటి నుండి భోగం వృత్తి అంటే ఇష్టం ఉండదు. ఆ సంఘటన తర్వాత ఆ అభిప్రాయం మరింత దృఢపడుతుంది. “నేను చెయ్యలేనమ్మా సానరికం. నాకు పెళ్లిచెయ్యి”6 అని తల్లితో తన మనస్సులోని అభిప్రాయాన్ని చెప్పుకుంటుంది.
రంగనాయక అక్క సరసులలో ఒకడు ఆమె చేయి పట్టుకోవడానికి ప్రయత్నించగా వెంటనే రంగనాయక “బొగందాన్నయితేమాత్రం? చెయ్యి పట్టుకోవడమే?”7 కస్సుమంటుంది. ఇలా అయితే ఎలా బ్రతుకుతావు? బువ్వ ఎలా వస్తుంది? అని ఆమె అమ్మ, అక్కలు అనగా “పోనీలెండి. వచ్చినంతలోనే గడుపుకుంటాను. నాగుణాలు నచ్చిన సరసుడే వుంటాడు. అసలు నేను మంచి బ్రాహ్మణ్ని చూసి కూడా వెళ్లిపోయి వారింట్లో చాకిరీచేస్తూ బతుకుతాను”8 అని బదులిస్తుంది.
రామదీక్షితులు, వీరేశలింగం పంతులుతో “పిల్ల దీపంలావుంది. చాలతెలివైనది. శీలం చాలా నిశితమైన దని తలుస్తాను......పరపురుషుడు తన్ను తాకినందుకు ఆపిల్ల చాలా కించపడుతోంది”9 అని రంగనాయక గురించి అన్న మాటలు ఆమె సుగుణశాలని స్పష్టం చేస్తున్నాయి. ఇటువంటి మంచి లక్షణాలు గల స్త్రీరత్నం కాబట్టే భోగం వృత్తిలో పుట్టి పెరిగినా ఆ వృత్తిలోని మాలిన్యాన్ని తనకు అంటించుకోకుండా, తన ప్రవర్తనను ఉన్నతీకరించుకుంది. సంప్రదాయబద్దమైన కుటుంబజీవనం కోరుకున్న స్త్రీ కాబట్టే వీరేశలింగం పంతులు ప్రకాశాన్ని వివాహం చేసుకోమని అడుగగానే మరో ఆలోచనలేకుండా అంగీకరిస్తుంది.
3.3 రాజామణి:
ఈ కథలో రాజామణి వేశ్యారికాన్ని వృత్తిగా చేసుకొని జీవించే భోగం వాళ్ళకు ప్రతిరూపం. ఈ ఐదుగురు కూతుర్లలో నలుగుర్ని ఈ వృత్తిలోకి దింపుతుంది. చివరి కూతుర్ని కూడా ఈ వృత్తిలోకి దింపడానికి ప్రయత్నిస్తుంది. వీరేశలింగం పంతులు రాజామణిని ‘నీవు నీ నలుగురు కూతుర్లను సానరికంలో దింపి కష్టమో, సుఖామో, లాభమో, నష్టమో అనుభవిస్తున్నావు. రంగనాయకని పెళ్లి చెయ్యకూడదూ?’ అని అడిగినప్పుడు “మా పిల్ల సానిగా ఉండటానికే ముచ్చటపడుతుందండి”10 అని సమాధానం చెబుతుంది. కానీ తన కూతురు అభిప్రాయం తెలుసుకున్న తరవాత తన ఆలోచన మార్చుకుని ఆమెకు వివాహం చేయాలనుకుంటుంది.
రంగనాయకకు కన్నెరికం చెయ్యడానికి ఒక షావుకారు మొదట రాజామణి ఎనిమిది వందల రూపాయాలు ఇవ్వమంటే ఐదు వందలు ఇస్తానంటాడు. కానీ ఆమెకు వివాహం కుదిరింది అని తెలిసిన తరవాత వెయ్యి నూట పదహారులు ఇస్తానంటాడు. కనీసం రంగనాయకను ఒక్కసారి చూపించమని ప్రాధేయపడతాడు. కానీ రాజామణి “మరివకని భార్యాని నీవెందుకు చూడాలయ్యా?”11 తిరస్కరిస్తుంది. దీన్ని బట్టి జీవిక కోసమే ఆమె ఈ భోగం వృత్తిని చేపట్టింది కానీ ఏమాత్రం ధనాశ లేదని స్పష్టమవుతుంది. తన కూతురు వివాహాన్ని ప్రకాశంతో జరిపించి సంతోషిస్తుంది.
3.4 వీరేశలింగం పంతులు:
ఈ పాత్రకు ఈ పేరు పెట్టడంలో శ్రీపాద వారు ఎంతో ఔచ్చిత్యాన్ని పాటించారు. పేరుకు తగినట్లుగానే ఈ పాత్ర ఆంధ్ర సంఘసంస్కరణోద్యమ పితామహుడు కందుకూరి వీరేశలింగం పంతులుని గుర్తుకు తెస్తుంది. ఈ కథలో ఇతను ప్రకాశం గురువుగా దర్శినమిస్తాడు. రాజామణిని ఒప్పించి రంగనాయక, ప్రకాశం వివాహం జరిపిస్తాడు. జైలు శిక్ష నుండి తన శిష్యుడ్ని కాపాడడంతోపాటూ రంగనాయకను భోగం వృత్తినుండి బయటకు తీసుకువచ్చి ఆమె జీవితం నాశనం కాకుండా కాపాడుతాడు. వేశ్యారికాన్ని, భోగం వృత్తిని విడిచిపెట్టి ఆ వృత్తిలోని స్త్రీలు సంస్కరించబడాలని శ్రీపాద వారు కోరుకున్నారు. అతని ఆలోచనలకు ప్రతిరూపమే ఈ పాత్ర.
ఈ కథలో పై పాత్రలతో పాటూ మాధవరావు (రాజామణి కుమారుడు), ఆమె నలుగురు కుమార్తెలు(పేరులేని పాత్రలు), రామదీక్షితులు(పబ్లిక్ ప్రాసిక్యూటర్), ప్రిన్సిపల్ మొదలైన పాత్రలను శ్రీపాద సుబ్రహ్మణ్యం శాస్త్రి సందర్భానుసారం కథా గమనంలో ఉపయోగించుకున్నారు.
4. తులసిమొక్కలు కథ– సంఘసంస్కరణ దృక్పథం:
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు ప్రధానంగా ఆనాటి సమాజంలోని దురాచారాలను ఎత్తిచూపుతూ, సంస్కరణ యొక్క ఆవశ్యకతను తెలియజేస్తాయి. వితంతు సమస్యను, బాల్య వివాహాలను, వేశ్యారికాన్ని విమర్శిస్తూ అనేక కథలు రాశారు. ఈ ‘తులసిమొక్కలు’ భోగం వృత్తివారిని ప్రధానంగా తీసుకొని రచించిన కథ. ఈ కథలో భోగం వృత్తిలోని అమానుషత్వాని విమర్శిస్తూనే, ఆ వృత్తిలోని స్త్రీలు ఆ వృత్తినుంచి బయటపడేసే మార్గాన్ని కూడా శ్రీపాదవారు వివరించారు.
ఈ కథలో రాజామణి కుటుంబాన్ని తీసుకుంటే ఆమె నలుగురు కూతుర్లు వేశ్యారికంలోకి దింపబడ్డారు. వారికి ఒక బ్రాహ్మణుడు, ఇద్దరు వైశ్యులు, ఒక చౌదరి సరసులుగా ఉన్నారు. చివరి కుమార్తె రంగనాయకను కూడా ఒక వైష్ణవున్ని సరసునిగా చెయ్యాలనుకుంటుంది. దీన్ని బట్టి భోగం వృత్తి ప్రధానంగా అగ్రవర్ణాల ప్రోత్సాహంతో ఎదిగిన వృత్తిగా కనిపిస్తుంది.
“నూరురూపాయలిస్తా నంటుండగా యింకా వెక్కి వెక్కి యేడుస్తుం దేమిరా బొగంపిల్ల?”10, “బొగంపిల్ల యెగిసెగిసిపడుతోంది”12 ఇలా రంగనాయక గురించి గుండువారి రేవులో గుమికూడిన వారు అనడం బట్టి ఆ వృత్తిలో ఉన్నవారికి సమాజం చులకనగా చూసేదని తెలుస్తుంది.
“మాలో పెళ్లిళ్లు కూడా జరుగుతూనే వున్నాయి. కాని మంచి వరుడు దొరకడం కష్టం. ఈ కారణం చేత కూడా కొందరు తమ బిడ్డల్ని సానులుగా చేస్తున్నారు. అగ్రజాతులవా రెవరేనా పెళ్లాడడానికి సిద్ధపడితేనూ పిల్లలలో అనేక మంది కులస్త్రీలు అవుతారు”13 అని రాజామణి అన్నప్పుడు వీరేశలింగం పంతులులు ‘భోగం స్త్రీలను పెళ్లి చెయ్యడంలో రెండు ప్రధాన సమస్యలు ఉన్నాయి.
ఒకటి పెళ్లి చెయ్యడానికి సానులు అంగీకరించడం కాగా మరొకటి వారిని వివాహం చేసుకోవడానికి అగ్రవర్ణాల యువకులు ముందుకురావడం’ అని పేర్కొన్నారు. వీరేశలింగం పంతులు మాటలను పరిశీలిస్తే ఈ భోగం వృత్తిని పెంచిపోషించినది అగ్రజాతులవారే కాబట్టి ఈ దురాచారాన్ని నిర్మూలించే బాధ్యత కూడా ప్రధానంగా వారిపైనే ఉందని అవగతమవుతుంది. అదేవిధంగా తమ ఆడపిల్లలను అగ్రజాతులవారికే ఇస్తామని రాజామని చెప్పడంలో ఆనాటి సమాజంలోని కులపరమైన వివక్ష కొంతవరకు కారణమై ఉండవచ్చు.
ఈ కథలో కన్నెరికం మరో దుష్ట సంప్రదాయాన్ని గమనించవచ్చు. భోగం వృత్తిలో ఆడపిల్లలు రజస్వల అయిన పిదప వారి శీలాన్ని బేరం పెట్టడాన్ని కన్నెరికంగా ఏ కథలో పేర్కొన్నబడింది. ఆడపిల్ల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఆమె మానాన్ని వేలం వేయడం కన్నా అమానుషం మరొకటి ఉండదు. ఈ కథలో రాజామణి తన చిన్న కుమార్తె అయిన రంగనాయక కన్నెరికం చేయడానికి బేరం పెట్టడం, ఒక వైశ్యుడు అందుకు ముందుకు రావడం. డబ్బుల దగ్గిర చర్చలు జరగడం మనం గమనించవచ్చు.
శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి ఈ కథలో హిందూ సమాజంలో ఉన్న కులవ్యవస్థను, అదే విధంగా స్త్రీ పురుషుల అసమానతలను తీవ్రంగా విమర్శించారు. మన సమాజంలోని అన్నీ దురాచారాలకూ, మూఢనమ్మకాలకూ ఇవే ప్రధాన కారణమని వివరించారు. సమసమాజాన్ని ఆకాంక్షించారు.
5. తులసిమొక్కలు కథ – నామౌచిత్యం:-
ఈ కథలో రంగనాయక, ప్రకాశం, వీరేశలింగం పంతుల అనేవి ప్రధాన పాత్రలు. వీరిలో మొదటి పాత్రను తీసుకుంటే తన కుటుంబం వేశ్యావృత్తిలో ఉన్నప్పటికి ఆ మాలినాన్ని ఎక్కడా అంటించుకోకుండా కుటుంబజీవనం కోరుకునే పాత్ర కాగా రెండవది బ్రాహ్మణ కుటుంబంలో జన్మించి కూడా ఒక వేశ్య కుమార్తెను వివాహ చేసుకునే పాత్ర. ఇక మూడవది ఆనాటి సంప్రదాయ వాదుల కట్టుబాట్లను దిక్కరించి ఆ ఇద్దరినీ ఒకటిగా చేసే పాత్ర. గంజాయి వనంలాంటి నాటి సమాజంలో మార్పుకు శ్రీకారం చుట్టిన ఈ పాత్రలు నిజంగా తులసిమొక్కలే.
“చదువరులకు చదువు చెప్పగలిగినది ఆయన రచన - విద్యాబుద్ధులున్న అహంకారులకు కనువిప్పు చేసినది ఆయన వచనము! తీయందనపు – తీయందనము చవులిచ్చిన దాయన శైలి”14 అన్న మల్లాది రామకృష్ణశాస్త్రి మాటలు అక్షర సత్యం.
6. ముగింపు:
- శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి రచనలలో సంఘసంస్కరణ ప్రధానంశంగా ఉంటుంది. దానికి ఈ తులసిమొక్కలు కథ చక్కని ఉదాహరణ.
- ఈ కథ ద్వారా శ్రీపాదవారు 20వ శతాబ్ది తొలినాళ్ళలో తెలుగు సమాజంలో ముఖ్యంగా ఉన్నత వర్ణాల వారిని ఆశ్రయించి ఉన్న భోగం వృత్తి అనే సాంఘిక దురాచారాన్ని సమాజం ముందుంచారు.
- పురుషాధిపత్యసమాజంలో ఏ ఆచారమైనా అంతిమ లబ్దిదారులు పురుషులేనని, నష్టపోయేది మాత్రం స్త్రీలు అన్నది నిర్వివాదం. అదే విషయాన్ని ఈ భోగం వృత్తిలో కూడా చూడవచ్చు.
- రాజామణి కుటుంబాన్ని పరిశీలిస్తే తమకు ఇష్టం లేకపోయినా సామాజిక, ఆర్ధిక కారణాల వలన అనేక మంది స్త్రీలు ఈ వృత్తిని కొనసాగించడం వెనుక ఉన్న కారణాలను తెలుసుకోవచ్చు.
- శ్రీపాదవారు ఈ దురాచారాన్ని విమర్శిస్తూనే ఆ వృత్తిలో ఉన్న మహిళలను ఆదుకోవాలని, ఆ వృత్తి నుండి బయటపడే విధంగా సామాజికంగా, ఆర్ధికంగా వారికి చేయూతనివ్వాలని తెలియజేశారు.
- రంగనాయక, ప్రకాశం వివాహాల ద్వారా ఆ భోగం వృత్తి నుండి బయటపడే మార్గాన్ని కూడా ఈ కథలో చూపించడం జరిగింది.
7. పాదసూచికలు:
- కథాశిల్పం. పుట. 106- 107
- తెలుగు సాహిత్య చరిత్ర. పుట. 588
- పుల్లంపేట జరీచీర. పుట. 456
- ఇదే. పుట. 465
- ఇదే. పుట. 457
- ఇదే. పుట. 458
- ఇదే. పుట. 457
- ఇదే. పుట. 458
- ఇదే. పుట. 462
- ఇదే. పుట. 467
- ఇదే. పుట. 456
- ఇదే. పుట. 466
- ఇదే. పుట. 467
- ఇదే. పీఠిక పుట. 8
8. ఉపయుక్తగ్రంథసూచి:
- దక్షిణామూర్తి, పోరంకి. (1988). కథానిక స్వరూప స్వభావాలు, శివాజీ ప్రెస్, సికింద్రాబాద్.
- వెంకటసుబ్బయ్య, వల్లంపాటి. (2008). కథాశిల్పం, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.
- శాస్త్రి, ద్వా.నా. (2013). తెలుగు సాహిత్య చరిత్ర, ప్రగతి పబ్లిషర్స్, హైదరాబాద్.
- సుబ్రహ్మణ్యశాస్త్రి, శ్రీపాద. (1999). అనుభావాలూ - జ్ఞాపకాలూను, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్.
- సుబ్రహ్మణ్యశాస్త్రి, శ్రీపాద. (2005). పుల్లంపేట జరీచీర, ప్రగతి పబ్లిషర్స్, హైదరాబాద్.
View all
(A Portal for the Latest Information on Telugu Research)
Call for Papers: Download PDF
"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.
# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో
టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.
# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.
# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.
# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024
# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.
# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)
# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.
# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.
# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో
ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే)
చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు
స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.
# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.
# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.
# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.
గమనిక: ఈ
పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ,
పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.