headerbanner

✽ ఆచార్యులకు, అధ్యాపకులకు, పరిశోధకులకు, తెలుగుభాషాసాహిత్యాభిమానులకు "ఔచిత్యమ్.కామ్"కు హార్దిక శుభస్వాగతం.! ✽ 🙏వ్యాసరచయితలకు సూచన: పరిశోధనవ్యాసాలను "UNICODE" ఫాంట్ లో మాత్రమే టైప్ చేసి, ప్రతినెల 20వ తేదీ లోపు వ్యాససమర్పణ లింక్ ద్వారా సూచనలకు అనుగుణంగా సమర్పించగలరు. ఇతర ఫాంట్/ఫార్మేట్ లలో పంపిన వ్యాసాలను, పరిశోధన పద్ధతులు పాటించని వ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము. ✽ వ్యాసరచయితలకు సూచనలకోసం క్లిక్ చెయ్యండి. గమనిక: వ్యాసకర్తల అభిప్రాయాలతో సంపాదకమండలికి ఎటువంటి సంబంధం లేదు. - సంపాదకుడు ✽ మరిన్ని వివరాలకు: "editor@auchithyam.com" ను సంప్రదించండి. ✽ పరిశోధకమిత్ర పోర్టల్ ను సందర్శించండి ✽    ✽ పరిశోధకమిత్ర ప్రత్యేకతలు ✽   

AUCHITHYAM | Volume-5 | Issue-1 | January 2024 | ISSN: 2583-4797 | UGC-CARE listed

7. ‘కేశవరెడ్డి ‘మునెమ్మ’ నవల: పాత్రచిత్రణ

డా. ఢిల్లీశ్వరరావు సనపల

తెలుగు అధ్యాపకులు,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల (పురుషులు), శ్రీకాకుళం,
శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్.
సెల్: +91 9441944208, Email: eswar.dilli820@gmail.com
Download PDF


వ్యాససంగ్రహం:

ఆంధ్రదేశంలో ఆస్తిత్వవాద ఉద్యమాలు బలపడిన తరుణంలో రాయలసీమ ప్రాంత అస్తిత్వంతో పాటు, దళిత, బహుజన, స్త్రీ జీవిత చిత్రలతో, మార్క్సిస్టు భావజాలంతో, సహజ న్యాయం పద్ధతిలో రచనలు చేసిన రచయిత కేశవరెడ్డి. వీరి నవలల్లో మునెమ్మ నవలకు ప్రత్యేక స్థానం కలదు. స్త్రీ ప్రధాన పాత్రగా, ఆకట్టుకునే శిల్ప నైపుణ్యంతో, రాయలసీమ భాషా మాండలిక పదాలతో కూడి విమర్శ ప్రతి విమర్శలకు వేదికైన నవల మునెమ్మ. మునెమ్మ నవలలో గల పాత్ర చిత్రణ, ఇతివృత్తం, శిల్ప నైపుణ్యం, భాషా విశేషాలు, విమర్శ ప్రతి విమర్శలు వంటి విశేషాలను తెలియజేయడం ఈ వ్యాసం ముఖ్య ఉద్దేశం. ఉపోద్ఘాతం, రచయిత పరిచయం, నవల నేపథ్యం, పాత్ర పరిశీలన, శిల్ప నైపుణ్యం, భాషా విశేషాలు, విమర్శ ప్రతి విమర్శలు, ముగింపు, ఉపయుక్తం గ్రంథ సూచి, ఆధార గ్రంధాలు క్రమానుగతంగా పరిశోధనా వ్యాసం సాగింది. దీనికి కేశవరెడ్డి నవలలు పరిశీలన, పరిశోధనా పద్ధతులు, నవలా శిల్పం, మునెమ్మ నవలపై వచ్చిన విమర్శ ప్రతి విమర్శలు, మునెమ్మ నవలపై వచ్చిన పూర్వ పరిశోధనలు పరిశీలిస్తూ వ్యాసం రచన సాగింది. రాయలసీమ అస్తిత్వంతో పాటు, స్త్రీవాద నేపథ్యంలో, పొయిటిక్ జస్టిస్ కోణంలో సహజ న్యాయ పద్ధతిలో మునెమ్మ నవల సాగిందని పరిశీలనలో గ్రహించిన విషయాలు.

Keywords: నంజర నంజర, పొరక, తరుగులోడు, సవాయి రోగం, కొరుకుడు రోగం, సిగర పొడి, ఉతాళం మనిషి, కండ్లు బూసులు కమ్మినాయి, శిగర చెట్టు

1. ఉపోద్ఘాతం:

ఆధునిక తెలుగు సాహిత్యంలో అస్తిత్వవాద సిద్ధాంతాలు ప్రముఖ స్థానం పోషించాయి. ఆధునిక యుగ ఆవిర్భావం నుండి ఈ సిద్ధాంతాలకు సంబంధించిన నేపథ్యం, వస్తువు దర్శనమిస్తున్నా ప్రత్యేకంగా స్థానాన్ని బలపరచుకున్నది మాత్రం 1970 - 80 దశకాల్లోనే అనేది గమనించవచ్చు. స్త్రీవాద నేపథ్యంతో, పోస్టుమాడ్రనిజాన్ని పునికి పుచ్చుకొని, మ్యాజిక్ రియలిజం తరహాలో, సహజ న్యాయం అనే సూత్రం ఆధారంగా వెలువడిన రచన మునెమ్మ నవల. ఆధునిక స్త్రీ భావజాలంతో సమకాలీన ఆలోచనల ప్రభావంతో డాక్టర్ కేశవరెడ్డిగారి మానస పత్రికగా వెలువడిన నవలిది. మునెమ్మ నవల రచయిత పరిచయం నేపథ్యం, ఇతివృత్తం, పాత్ర పరిశీలన, మనస్తత్వ విశ్లేషణ,  వర్ణనలు, భాషా విశేషాలు, స్త్రీవాద నేపద్యమా? పోస్టుమాడ్రనిజమా? పారడాక్షా? మొనాటమా? పరవర్షణా? బీష్టియాలిటా? అనే విషయాలతో పాటు సమకాలీన సాహిత్యంలో మునెమ్మ నవల స్థానం వంటి అంశాలు ప్రస్తావన ఈ వ్యాసం ఉద్దేశ్యం.

2. రచయిత పరిచయం : 

కేశవరెడ్డిగా సాహిత్య లోకానికి పరిచయమైన పెనుమూరు కేశవరెడ్డి 1946 మార్చి10న చిత్తూరు జిల్లా తలుపులపల్లెలో రైతు కుటుంబంలో జన్మించారు. పాండిచ్చేరి విశ్వవిద్యాలయంలో వైద్య విద్యను పూర్తి చేసుకున్న వీరు నిజామాబాద్ విక్టోరియా హాస్పిటల్లో వైద్యుడిగా చిరకాలం పనిచేశారు. మధురాంతకం రాజారాంకు ఏకలవ్య శిష్యుడుగా కేశవరెడ్డి తనతను పేర్కొన్నారు. కేశవరెడ్డి ఎనిమిది నవలలను, రెండు పెద్ద కథలు రాశారు. ఇన్ క్రెడిబుల్ గాడెస్ (1979), స్మశానం దున్నేరు(1979), సిటీ బ్యూటిఫుల్(1982), రాముడుండాడు- రాజ్యముండాది (1982), అతడు అడవిని జయించాడు (1984), మూగవాని పిల్లనగ్రోవి (1996), చివరి గుడిసె(1996), మునెమ్మ (2008)  ; బానిసలు- భగవాను వాచ (కథలు) కేశవరెడ్డి కలం నుండి వెలువడ్డాయి. కేశవరెడ్డి రచనలు భారతీయ భాషల్లోనే కాకుండా ఇంగ్లీష్ వంటి విదేశీ భాషల్లో కూడా అనువాదం పొందాయి. కేశవరెడ్డి రచనల్లో దళిత, బహుజనుల జీవిత చిత్రంతోపాటు స్త్రీవాదం దర్శనమిస్తుంది. రెక్కాడితే గాని డొక్కాడని బడుగు-బలహీన వర్గాలు జీవితాలను, వ్యదార్థ జీవుల యదార్ధ గాధలకు కావ్య రూపం కల్పించారు.

3. నవల నేపథ్యం: 

రాయలసీమ గ్రామీణ ప్రాంత రైతు కూలీ కుటుంబానికి చెందిన నిరక్షరాస్యరాలైన ఒంటరి మహిళ తన చుట్టూ అలుముకున్న చీకట్లను ఛేదించి నిలిచిన తీరు, సమస్యల సాధనలో ఎదురైన సవాళ్లు, ప్రతిఘటనలు నేపథ్యంతో మునెమ్మ నవల రూపుదిద్దుకుంది. మార్క్సిస్టు భావజాలం, మ్యాజిక్ రియాలిజం తరహాలో, పోస్టుమాడ్రనిజాన్ని పునికిపుచ్చుకున్న రచన మునెమ్మ. సహజ న్యాయం అనే సూత్రం ఆధారంగా మనిషికి సాటి మనిషి సాయం చేయగల పరిస్థితి లేనప్పుడు ప్రకృతి శక్తుల సాయంతో ప్రాకృతిక నియమంలో న్యాయాన్ని పొందడం అనే సూత్రాన్ని అనుసరించి కథ నడుస్తుంది.

4. కథేతివృత్తం:

చిత్తూరు జిల్లాలోని ఒంటిల్లు గ్రామం అందులో ఒక పడచు జంట జయరాముడు - మునెమ్మలు. అరమరకలు లేని వారి జీవితంలో అనుకోని సంఘటనగా వారు పెంచుకుంటున్న బొల్లిగిత్త మునెమ్మ ఒంగోని ఉన్న సమయంలో ఆమె పైకి తన ముందరకాళ్ళను ఉంచడంతో కోపించిన జయరాముడు దాన్ని పారతో నుజ్జునుజ్జుగా కొట్టి  తర్వాత రోజు మద్దెపాలెం పశువుల సంతలో అమ్మడానికి నిశ్చయించి పోటుమిట్ట గ్రామంలో గల తరుగులోని(పశువుల దలారీ)తో మాట్లాడి మరుసటి రోజు ఉదయాన్నే బొల్లిగిత్తను తోలుకొని సంతకు పయనమయ్యాడు. రెండు రోజుల తర్వాత బొల్లిగిత్త తిరిగి ఇంటికి వస్తుంది. కానీ బొల్లిగిత్తను తోలిన జయరాముడు తిరిగి రాకపోవడంతో మునెమ్మకు ఆశ్చర్యం, అనుమానం కలుగుతుంది. జయరాముడ్ని తలుచుకుంటూ నిద్రించిన మునెమ్మ భయంకరమైన కలగంటుంది. కలలో జయరాముడు శవమై కనిపిస్తాడు. మెలకువ వచ్చిన మునెమ్మ భర్తను వెతుకుతూ బయలుదేరుతుంది. మునెమ్మ తోడుగా బంధువుల కుర్రాడు సినబ్బ బయలుదేరుతాడు. సినబ్బే ఈ కథనంతా చెప్పే కథకుడు మనకు. ముందుగా పోటుమిట్టను చేరుకొని తరుగులోడితో మాట్లాడి కొంత విషయం గ్రహించి తర్వాత నాగులమర్రి గ్రామం చేరుకుంటారు. నాగులమర్రిలో పూటకూళ్ల వారింట రాత్రి బసచేసి వారినుండి మరికొంత సమాచారం గ్రహించి మద్దిపాలెం పశువుల సంతకు చేరుకుంటారు. పరశువులసంత సంచాలకుడి నుండి, కల్లంగడి నడిపే వాడినుండి సమాచారం సేకరించి జయరాముడి మరణానికి తరుగులోడు, మందులోడు కారణమని అనుమానించి, తన భర్త వద్ద బొల్లిగిత్తను కొనుగోలు చేసిన మందులోడిని వెతుక్కుంటూ వెళ్ళేసరికి వాడు చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటాడు. మునెమ్మ చేతిమీద ఉన్న బొల్లిగిత్త బొమ్మను చూసిన మందులోడు భయంతో ప్రాణం విడవడంతో మునెమ్మ తన అనుమానం నిజమని నిర్ధారించుకుని తిరుగు ప్రయాణమై వస్తూ భర్త చావుకు కారకాల్లో ఒకడైన తరుగులోడిని తన బొల్లిగిత్తతో పొడిపించి చంపి తన  భర్త చావుకు ప్రతీకారం తీర్చుకోవడంతో కథ ముగుస్తుంది.

5. పాత్ర పరిశీలన:

మునెమ్మ నవలలో ప్రధాన పాత్రలు మునెమ్మ, బొల్లిగిత్త, జయరాముడు. అయితే ఈ నవలలో ప్రతి పాత్ర ప్రధాన పాత్రగానే ఆగిపిస్తాయి. నవలలో ఇతర పాత్రలు సినబ్బా,  తరుగులోడు, సాయమ్మత్త, దొరసామిరెడ్డి, మందులోడు, పూటకూల్ల ముసలోళ్ళు. నవల మొత్తంగా చూసినప్పుడు పాత్రల సంఖ్య తక్కువే ఉన్నప్పటికీ వాటి చిత్రణలో దేనికి అదే కథకు ప్రత్యేక బలాన్ని అందించేలా ఉంటాయి. పాత్రలు దేనికదే స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. కేశవరెడ్డి పాత్రల చిత్రీకరణలో ప్రత్యేకత పొందిన నవలా రచయితగా మునెమ్మ నవల పాత్రల ఆధారంగా చెప్పకనే తెలుస్తోంది.

5.1 మునెమ్మ: 

మునెమ్మ పదహారణాల రాయలసీమ గ్రామీణ రైతు కుటుంబానికి చెందిన నిరక్షరాస్యరాలు. కానీ నవలలో మునెమ్మ తన భర్తను వెతుకుతూ బయలుదేరడానికి సిద్ధమైన క్షణం నుండి శక్తులన్నింటినీ తనలో నింపుకున్న సహజ జ్ఞాననిధిలా, సమయస్ఫూర్తితో సమస్యల వలయాలను ఛేదించి అపరమేధావిగా వ్యవహరించిన తీరు గమనించ తగినది. మునెమ్మ భర్త చాటు భార్యగా, అత్త చాటు కోడలుగా పరిచయంలో అగుపిస్తుంది. తర్వాత పరిణామాల దృష్ట్యా అంతుచక్కని శక్తిమంతురాలగా సహజ ప్రకృతి శక్తులు నిండిన సామాన్యంగా అగుపించే అసమాన్య ధీరవనితగా చిత్రించబడింది. మునెమ్మ అసలైన కథానాయిక, ఈ నవలలో తన విశ్వరూప ప్రదర్శన చేస్తుంది. 1930 ల నాటి స్త్రీ అయినప్పటికీ నిబ్బరతతో కూడిన ఆలోచన ఆమె సొంతం. అవసరమైన చోట తన బుద్ధి బలానంతటినీ వినియోగించడమే కాకుండా ప్రతి సందర్భంలోనూ సంపూర్ణ బుద్ధి సూక్ష్మతను ప్రదర్శిస్తుంది. తర్కం , అమాయకత్వంతో కూడిన ఆహార్యం, మెత్తదనం, బుద్ధికుశలత, ధైర్యం, తనకు ఎదురయ్యే పరిస్థితుతో పోరాడే ఆత్మస్థైర్యం, కంటికి కనిపించని పగ కలగలిపిన వ్యక్తిత్వం మునెమ్మ సొంతం.

"కాలు తీసి వీధిలో పెడితే దారి తానంతట అదే తెలుస్తుంది. భూమ్మీదకి వచ్చే ముందు ఎలాటి బతుకు బతుకుతాం? ఎక్కడ బతుకుతాం ఇవన్నీ ఆలోచించే వచ్చామా?" (మునెమ్మ నవల భాగం 9 పేజి45) అనే మాటల్లోనే ఆత్మవిశ్వాసంతో కూడిన తాత్వికత, "సమయం వచ్చినపుడు ఈ గొడ్డే కాదు ఈడ నుండి మద్దిపాలెం దాకా రోడ్డు మీదుండే ప్రతి కంకర రాయీ నోరు తెరిచి మాట్లాడుతుంది" (మునెమ్మ నవల భాగం10పేజి46) అనే మాటల్లో సాధికారతతో కూడిన ఆత్మస్థైర్యం, "సమయం వచ్చినప్పుడు గొంతు మీద కాలేసి అడుగుదాం. చేప కోసం గాలం వేసినప్పుడు బెండు తదితక్కలాడగానే లాగుతామా? బెండు నీళ్లలో మునిగినప్పుడు కదా లాగుతాం? (నవల భాగం12 పేజి 56) అనడంలో కాలస్పృహతో కూడిన లోకజ్ఞత,  "రోడ్డు కిరువైపులా ఉండే ప్రతి చెట్టు కింద ఆయన (మరణించిన భర్త) చేతులు చాచి పిలిచినాడు" (నవల భాగం 14 పేజి 64) అనడంలోని భర్తతో తనకు గల తాదాత్మ్యం, "వినిపించని వాటి గురించి కనిపించని వాటి గురించేరా  మనం ఆలోచించాల్సింది" (నవల భాగం 16 పేజి 73) అని పలకడంలో అంతర్దృష్టితో కూడిన బుద్ధి సూక్ష్మత, "ఇలాంటి పని మీద బయలుదేరినప్పుడు ఎక్కువగా ఉపయోగించాల్సింది కళ్ళనూ, చెవులనే గాని నోటిని కాదురా. మనం బయలుదేరింది మన ఒడిలో ఉండే వాటిని రోడ్డు మీద పారేసుకోవడానికి కాదు" (నవల భాగం 16 పేజీ 73) అనే మాటల్లో బుద్ధి కౌశలం, "జయరాముడు సంతులేకుండా వెళ్ళిపోయినాడురా అంత్యక్రియలు కూడా సక్రమంగా జరగకుంటే ఆయనకు గతులు ఉండవు" (నవలా భాగం 17 పేజీ 76) అనే మాటల్లో  సామాజిక నమ్మకాలకు విలువనిచ్చే స్త్రీ మనస్తత్వం, "ఆయన పైన చెయ్యేసినోళ్లు - వాళ్ళు, ఇద్దరో, ముగ్గురో - వాళ్లను దొరకబట్టాల. వాళ్లను పాడెమీద పెట్టి నోట్లో రూక వేయ్యాల" (నవల భాగం 17 పేజి76) అనే మాటల్లో ప్రతీకార వాంఛతో కూడిన ఉక్రోషం,  "అవసరం అన్ని నేర్పుతుందిరా సినబ్బా. ఈమాట గొడ్డుకు కూడా వర్తిస్తుంది" (నవల భాగం 24 పేజి 102) అనే మాటల్లో కార్యోన్ముఖుత దర్శనమిస్తుంది. మునెమ్మ పాత్ర చిత్రణలో ఎంతో వైవిధ్యత దర్శనమిస్తుంది. పరిశీలన, పరిశోధన, ప్రతీకారవాంఛ, మమకారం, బుద్ధికుశలత, సమయస్ఫూర్తి, అంతర్దృష్టి, సగటు స్త్రీతత్వం, కార్యోన్ముఖత, కాలస్పృహ, తాత్త్వికత, ఆత్మవిశ్వాసం కలగలిసి సజీవ స్త్రీమూర్తి మన కళ్ళముందు చలన సదృశ్యంగా మూర్తీభవిస్తుంది.  "సాధారణ స్త్రీలోని అసాధారణ శక్తిని బయటకు తీసి కథని నడిపిస్తారు రచయిత" (మునెమ్మ నవల ముందుమాట పేజి-6) అంటారు జయప్రభ. ఎంతగా 60 ఏళ్ల వెనుకటి కథనే ఎన్నుకున్న మునెమ్మ పాత్రని చిత్రీకరిస్తున్నప్పుడు అనివార్యంగా ఆయనపై సమకాలీన ఆలోచన ప్రభావం పనిచేసినట్టుంది (నవల ముందుమాట పేజి16) అంటూ పేర్కొన్న జయప్రభ మాటలు పరిశీలించదగినవి. అంతేకాదు మునెమ్మను నిస్సహాయ స్త్రీగా పేర్కొన్నకాత్యాయనిగారి మాటల్లో ఆంతర్యం గ్రహించాలి. (రాసేవాళ్ళకు చదివేవారు లోకువ వ్యాసం, 13/10/2008 సాక్షి పత్రిక).

5.2 బొల్లిగిత్త:

మునెమ్మ నవలలో మునెమ్మ పాత్ర తర్వాత ప్రాధాన్యత గల పాత్ర బొల్లిగిత్త. కథా గమనానికి బొల్లిగిత్తే ప్రధాన భూమిక. మునెమ్మ నవలలో మనుష్య పాత్రలకు మించిన పాత్ర చిత్రణ బొల్లిగిత్తది. కేశవరెడ్డి నవలల్లో పెంపుడు జంతువుల పాత్రలు ప్రాధాన్యతను సంతరించుకోవడం పరిపాటే. అతడు అడవిని జయించాడు నవలలో సుక్కపంది, చివరి గుడిసె నవలలో వేటకుక్క, ఇన్క్రెడిబుల్ గాడెస్ నవలలో పందులగుంపు పాత్రలుగా కలవు. అయితే మునెమ్మ నవలలో బొల్లికగిత్త పాత్ర వాటిని మించి ఉంటుంది. జంతువైనప్పటికీ మనుష్య సమానంగా చూపే పాత్ర బుల్లిగిత్తది. జయరాముడు - మునెమ్మల జీవితాల్లో జీవితాలతో మానసికంగా, శారీరకంగా మమేకం పొందిన రూపం బొల్లిగిత్త. జయరాముడు - మునెమ్మలు తమ చేతిపై బొల్లిగిత్త బొమ్మ పచ్చబొడిపించుకోవడమే పై మాటలకు సాక్ష్యం. జంతువైనప్పటికీ మనిషిలో వికారాన్ని కలిగించే స్థాయి, స్థానం దాని సొంతం. దీనికి ఉదాహరణ జయరాముడికి బొల్లిగిత్త పై ఏర్పడిన పగ. అంతేకాదు జయరాముడు స్థానంలో మునెమ్మ పగను పంచుకొని జయరాముడు మరణానికి కారణమైన మందులోడు, తరుగులోడును చంపడంలో ప్రధాన భూమిక వహిస్తుంది. మునెమ్మ సంసారంలో చిచ్చుకు కారణం బొల్లిగిత్త. మునెమ్మ ప్రతీకారాన్ని నెరవేర్చింది కూడా బొల్లిగితే కావడం ఆ పాత్ర విశేషాన్ని చెప్పకనే చెబుతోంది.

నవలలో ప్రాకృతిక న్యాయం సాధనకు బొల్లిగిత్తే కారణం. జయరాముడి అంత్యక్రియల అనంతరం మునెమ్మ మలి జీవితానికి  బుల్లిగిత్త సహాయకారి. ఇలా నవల పర్యంతం బొల్లిగిత్త వివిధ కోణాల్లో దర్శంపవస్తుంది. జయరాముని రాముడిగా సంబోధిస్తూ బొల్లి గిత్తను లక్ష్మణుడిగా సంబోధించడం మునెమ్మ నవల్లో బొల్లిగిత్త పాత్ర ప్రాధాన్యతను తెలియజేస్తుంది. అంతేకాదు మునెమ్మ నవలలో మునెమ్మ పాత్రతో పాటు విమర్శలకు చోటు కల్పించిన పాత్ర బొల్లిగిత్త. "నేను ఇంటికి కోడలుగా వచ్చిన రోజునే బొల్లిగిత్త భూమ్మీద పడింది. పెండ్లికొచ్చిన వాళ్లంతా కొత్త పెండ్లి కూతుర్ని చూసిన తర్వాత కొట్టంలోకి వెళ్లి కొత్తగా పుట్టిన దూడను కూడా చూసి వెళ్లారు" (నవల భాగం 4 పేజి 29) మా బొల్లిగిత్త ఆనవాలు చెప్తా. దానికి నాలుగేండ్లు వయసుంటుంది. పుల్లరంగు చర్మంమీద తెల్లమచ్చలుంటాయి. కరువాయి మూతి, గూడ కొమ్ములు కాదు. ఎలికొమ్ములు కాదు. మధ్యస్థంగా ఉంటాయి" (నవల భాగం 15 పేజి 69), "ఆయనా, నేనూ, అదీ వీధి వెంబడి పోతుంటే అద్దో సీతారామ లక్ష్మణులు పోతా ఉండారు అని జనం అనడం నేను చెవులారా ఎన్నోసార్లు విన్నాను". (నవల భాగం 4 పేజి 29) " తను దుఃఖపడుతున్నది జయరాముని కోసమో బొల్లిగిత్త కోసమో ఆమె తేల్చుకోలేకపోతున్నది". (నవల భాగం4 పేజి 29) " మునెమ్మ కుడి చేతి మీద కూడా బొల్లిగిత్త బొమ్మ పచ్చపొడుచుకుంది". (నవల భాగం 15 పేజి 72) పై మాటలు బొల్లిగిత్తను గురించి ప్రస్తావించిన కొన్ని సందర్భాలు మాత్రమే. "పరోక్షంగా భర్త మరణానికి కారణమైన బొల్లిగిత్త ఆ భర్త స్థానాన్ని భర్తీ చేయడం నవలగా ఈ కథాంశం సాధించిన పొయిటిక్ జస్టిస్"(అనగనగనగా : మునెమ్మ ఒక మాంత్రిక కథనం /ఒక పురాగాధ వ్యాసం పేజి 117) అని పలికిన అంబటి సురేంద్రరాజు మాటల్లో బొల్లిగిత్త పాత్ర ప్రాధాన్యాన్ని చెప్పకనే తెలుస్తోంది.

5.3 జయరాముడు: 

నవలలో ప్రధాన పాత్రల్లో ఒకటి మునెమ్మ భర్త జయరాముడు. హత్యకు గురైన జయరాముడ్ని వెతుకుతూ వెళ్లడంలోనే కథాగమనం సాగుతుంది. నవల మొత్తంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో వినబడే పేరు, నవల గమనంతో ముడిపడిన పేరు జయరాముడు. నవలలో జయరాముడు పాత్ర వైవిద్యమైందిగా అగుపిస్తుంది. జయరాముడి పాత్ర చిత్రణలో రెండు భిన్న సందర్భాలను ఈ నవలలో కల్పించారు రచయిత. జయరాముడు తన చుట్టూ ఉన్న పరిసరాల పరిస్థితుల ప్రభావంతో ప్రవర్తించే ప్రవర్తన ఒకటైతే,  తన తండ్రిలో గల అవలక్షణాలు జయరాముడిలో వంశపారంపరంగా రావడం రెండోది. జయరాముడి తల్లి సాయమ్మత్త తన భర్త జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న సందర్భంలో పై విషయం ప్రస్తావనకు వస్తుంది. జయరాముడు వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే చెడ్డవాడు కాకపోయినా మంచివాడు మాత్రం కాడు అనేది చెప్పకనే తెలుస్తోంది. వ్యవసాయం చేయడానికి అంగీకరించని మానసిక స్థితి, కాపు కుటుంబంలో జన్మించి బాడుగ తోలుకొనే వైనం, మునెమ్మపై బొల్లిగిత్త ఎగరడంతో అది పశువనే స్పృహ కూడా లేకుండా దాన్ని నంజర నంజర చేయడం, ఏం జరిగిందో తనకి తెలియదు అని చెప్పిన మునెమ్మ చెంప పగలగొట్టడం వంటి వాటిని పరిశీలిస్తే జయరాముడులోని భిన్నమైన మానసిక స్థితి వ్యక్తమౌతుంది. జయరాముడిలోని మరో లక్షణం అతి. ఈ అతి అనేది ప్రేమ విషయంలోనూ కోపం విషయంలోనూ అంతే స్థాయిలో ఉండేదిగా తెలియవస్తుంది. "ఏవి జేసిందో నీకు తెలవదా? ఏవి తెలవనట్టు మాట్లాడతా ఉండవుగదనే బెస్ట్ లంజా" (నవల భాగం 1 పేజి 16),  "సదరు అవలక్షణాలు తన కొడుక్కి రాకూడదన్నదే ఆమె నిత్యం చేసే ప్రార్థనల సారాంశం"  (నవల భాగం3పేజి 20),  "అట్టాటోనికి పుట్టినోడు అంతకన్నా సక్కంగా బతుకుతాడా?" (నవల భాగం 4 పేజి28),  తండ్రి అవలక్షణాలన్నీ ఒగిటొగటే వచ్చేసినాయి"(నవల భాగం 4 పేజీ 28) వంటి మాటలు జయరాముడి వ్యక్తిత్వాన్ని తెలియజేసే మాటలు. నవలలో జయరాముడి పాత్రలో  మరో వైవిధ్యం అతని రూపం. "రెండోవాడు నల్లగా, బొద్దుగా, భూమిలోకి దిగేసిన గడ్డపారలాగా నిటారుగా ఉంటాడని, అతని కనుబొమలు గుబురుగా ఉండి ఒకదాన్నొకటి కలుసుకుంటాయని ముసలాయన చెప్పాడు. మనిషి మితంగా మాట్లాడినా పెలుసుగా మాట్లాడుతాడనీ ముసలమ్మ చెప్పింది." (నవల భాగం 13 పేజి 57)

నవలలో జయరాముడి పాత్ర సముచిత స్థానం పొందడమే కాకుండా విమర్శలలో కూడా నిలిచిందని చెప్పాలి. రాసే వాళ్లకు చదివే వాళ్ళు లోకువ వ్యాసం పై చర్చలో భాగంగా డాక్టర్ మనోహర్ "అవును ఈ విమర్శకురాలికి మేం లోకువే" అనే వ్యాసంలో మునెమ్మ నవల్లో స్త్రీవాద నేపథ్యాన్ని గుర్తు చేస్తూ పురుషాధిక్యతకు ప్రతీక జయరాముడు, అతని అహంకారం, వికృత మానసిక ధోరణే ఈ నవలలో కథాగమనం మలుపుకు కారణంగా పేర్కొన్నారు.(27/10/2008 సాక్షి పత్రికలో వ్యాసం) మునెమ్మ ప్రమేయం గానీ బొల్లిగిత్త వికృత చర్య గానీ ఏమీ లేని ఒక సంఘటనను జయరాముడు పురుషాహంకారంతో ఇంకొక రకంగా అర్థం చేసుకుంటాడు. ఏం జరిగిందో నీకు తెలవదా అంటూ నింద వేసి చెంప పగలగొడతాడు అతని వక్రదృష్టి వలననే కథ మొదలైందని (అవును ఈ విమర్శకురాలికి మేం లోకువే వ్యాసం 27/10/2008 సాక్షి పత్రిక)డాక్టర్ మనోహర్ అంటారు. "వెనుకబాటు తనపు జీవన విధానాల్లో జయరాముడు తండ్రి దొరసామిరెడ్డిలో, జయరాముడిలో ఈ మృగత్వం ఒక వికారంగా కాక సహజ స్థితిలో ఉంది"(అనగనగనగా: మునెమ్మ ఒక మాంత్రిక కథనం/ఒక పురాగాధ వ్యాసం పేజి114) అని పేర్కొన్న అంబటి సురేంద్రరాజు మాటలు జయరాముడి పాత్ర వైవిధ్యాన్ని వ్యక్తపరుస్తున్నాయి.

5.4 సినబ్బ:

మునెమ్మ నవలలో మునెమ్మ పాత్రతో సమానమైన నిడివి గల పాత్ర సినబ్బ. మునెమ్మ కథనంతా పాఠకుడికి చెప్పేది సినబ్బే. నవల్లో స్వతంత్రంగా ఒక్కచోట కూడా ప్రత్యక్షంగా భావప్రకటన చేయని పాత్ర సినబ్బ. విమర్శకుల అభిప్రాయంలో సినబ్బ మరెవరో కాదు నవల రచయిత కేశవరెడ్డే. నవలలో సినబ్బ పాత్ర ఎంతలా ఉంటుందంటే మునెమ్మ మనోగత విషయాలను సైతం వివరించి పాఠకుడికి తెలియజేసేదిగా అనేక సందర్భాలు దర్శనమిస్తాయి. "అది మూర్ఖత్వం కాదు. అవధులు లేని వేదన ద్వారా సిద్ధించిన యోగమే ఆ అంతర్దృష్టి అని కూడా అర్థమయింది" (నవలాభాగం 9 పేజి 41),  "ఏడుస్తూ ఆమె రెండు మూడు సార్లు పిల్లగా పిల్లగా అన్నది. అది ఆమె జయరామునికి పెట్టిన రహస్య నామమట. వాళ్లు ఏకాంతంగా ఉన్నప్పుడు లేక ఆమె భావావేశంలో ఉన్నప్పుడు అలా పిలుస్తుంది" (నవల భాగం 9 పేజి 41) అనే మాటలు ద్వారా మునెమ్మ ఆంతరంగిక విషయాలు కూడా వ్యక్తీకరించే పాత్రగా సినబ్బ అగుపిస్తాడు. "ఈ సినబ్బ జోక్యం నవలలో ఎంతగా ఉందంటే సన్నివేశాలను, పాత్రలను వాటి మనసులోని ఆలోచనలను కూడా సినబ్బ ద్వారా తెలుసుకోవడం తప్ప పాఠకులకు మరో మార్గమే ఉండదు" (రాసే వాళ్లకు చదివే వాళ్ళు లోకవ వ్యాసం 13/10/2008 సాక్షి పత్రిక) అని కాత్యాయనిగారి మాటల్లో సినబ్బ పాత్ర ప్రమేయం ఎంతలా ఉందో తెలియవస్తుంది.

5.5 ఇతర పాత్రలు:

మునెమ్మ నవలలో తరుగులోడు, మందులోడు పాత్రలు కొంత భిన్నమైనవిగా చెప్పవచ్చు. బయట ఒకలా లోపల మరోలా ఉండే పాత్రలివి. తరుగులోడి పాత్ర పూర్తిగా విలువలు, వ్యక్తిత్వం లేనిదిగా అనిపిస్తుంది. తాను చేసిన తప్పులను సైతం ఒప్పులుగా సమర్ధించుకుంటూ తనే ఉత్తముడిగా చెప్పుకునే వ్యక్తి తరుగులోడు. సందర్భశుద్ధి లేని సామెతలను చెబుతూ సందర్భాన్ని దాటవేస్తూ మాట్లాడడం తరుగులోడు సొత్తు. నవల్లో పలు సందర్భాల్లో తరుగులోడి వ్యక్తిత్వానికి సంబంధించిన మాటలు దర్శనమిస్తాయి. "తరుగులోడు ఆపాద మస్తకం నకిలీ మనిషి (నవల భాగం 10 పేజి 48),  "వాడు గొడ్ల వ్యాపారం తగ్గించుకున్నాడు. మిలటరీ వాళ్లు వచ్చినప్పటి నుంచి వాడు వేరే వ్యాపారాలు జేస్తా ఉండాడు" (నవలభాగం 6 పేజి 33),  "రోడ్డు కవతల సిపాయోనికి ఆడది కావాల. ఊర్లలో ఉండే ఆడదానికి దుడ్డు కావాల. వాడినీ దీన్నీ కలిపి నా కమిషన్ నేను తీసుకుంటా ఉండా. ఇప్పుడు నన్ను అందరూ నిష్ఠూరం చేసేదెందుకు?"(నవల భాగం పది పేజి 49) అని తన చేస్తున్న తార్పుడు పనిని కూడా సమర్థించుకోవడంలో తరుగులోడి వ్యక్తిత్వం వ్యక్తపడుతుంది. తప్పు చేస్తూ తమని తామ సమర్ధించుకునే అనేకమందికి ప్రతీకగా అనిపించే పాత్ర తరుగులోడు. పై మాటల ద్వారా మునెమ్మ నవలలో గుర్తించదగిన పాత్రల్లో ఒకటి తరుగులోడి పాత్ర అని చెప్పవచ్చు.

నిడివిలో తక్కువైనా కథను మలుపు తిప్పడంలోనూ కథలో రహస్యాలను బయటపెట్టడంలోనూ ప్రధాన భూమిక వహించిన పాత్రగా చిత్రించిన పాత్ర మందులోడు. పశు వైద్యంలో ఎంతో జ్ఞానం కలిగి ఉన్నప్పటికీ మనిషిగా విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయిన వైనం మందులోడిలో దర్శనమిస్తుంది. దుష్ట ప్రవర్తన నీచమైన వ్యక్తిత్వం కలిగిన మృగతుల్యపు ప్రవర్తన గల పాత్ర మందలోడు.500 రూపాయలు కోసం ఒక మనిషిని (జయరాముడ్ని) హత్య చేసే కిరాతకత్వం కలిగిన పాత్ర. "మనిషి పసుతత్వానికి సంబంధించిన నవల ఇది. మృగం మనిషి కాదు, కానీ ప్రతి మనిషీ ఒక మృగమే. మనిషిలో మృగం సదా దాగి ఉంటుంది. మనిషి చైతన్యవంతుడై సృష్టించిన నాగరికతను తొలగిస్తే మనిషి మృగం కన్నా మిన్నకాదు" (అనగనగనగా: మునెమ్మ వ్యాసం పేజి 114) అని పలికిన అంబటి సురేంద్రరాజు మాటలు తరుగులోడు, మందులోడు పాత్రలకు అచ్చంగా అతికినట్లు సరిపోతాయి. నవలలో నాయకురాలు మునెమ్మ కాగా తరుగులోడు, మందులోడు పాత్రలు ప్రతినాయక పాత్రలుగా చెప్పొచ్చు.

నవలలో జయరాముడు తండ్రి దొరసామిరెడ్డి పాత్ర భిన్నమైన మనస్తత్వాన్ని కలిగినదిగా చిత్రంచబడింది. మొండితనం, సోమరితనం, మూర్ఖత్వం, పశుతత్వం  మూర్తిభవించిన అవలక్షణాలన్నీ కలగలిపిన రూపం దొరసామిరెడ్డి. మనిషి పసుతత్వానికి నిలువెత్తురూపంగా దొరసామిరెడ్డి దర్శనమిస్తాడు. "మృగత్వం వారిలో నిద్రావస్థలో లేదు మేలుకొని ఉంది" (పేజి నెంబర్ 114) అని పలికిన అంబటి సురేంద్రరాజు మాటలు దొరసామిరెడ్డి పాత్రకి అతికినట్టు సరిపోతాయి. నవలలో మునెమ్మ ఒక వర్గానికి ప్రతినిధిగా అగుపిస్తే మరో వర్గానికి  ప్రతినిధిగా దర్శనమిచ్చే పాత్ర సాయమ్మత్త. తరతారాలుగా స్త్రీ అణచివేత, అస్వతంత్రత, కుటుంబ భారం, సమాజపు ఛీత్కారాలుకు ప్రతినిధిగా అగుపించే పాత్ర సాయమ్మత్త. పురోగమనానికి, ప్రతిఘటనకు మునెమ్మ ప్రతీకైతే అగచాట్లకు, అవమానాలకు, అవహేళనలకు, బాధలకు ప్రతీక సాయమ్మత్త. నవలలో సాయమ్మత్త పాత్ర నిడివి చిన్నదే అయినప్పటికీ రెండు తరాల మనస్తత్వాలకు, జీవితాలకు, ఆర్థిక - సామాజిక స్థితిగతులకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచే పాత్ర సాయమ్మత్త అని చెప్పొచ్చు.

బ్రతుకు బండి భారమైనా వయోభారం జీవిత గమనాన్ని సజావుగా సాగనీయకపోయినా మొక్కవోని ధైర్యంతో తమ కాళ్ళమీద తాము నిలుస్తూ దారిన పోయే బాటసారులకు ఆశ్రయం కల్పిస్తూ జీవనం సాగించే ఉదాత్తమైన పాత్రలు పూటకూళ్ల ముసలమ్మ ముసలాయన పాత్రలు. మనిషిని చూసి  వారి వ్యక్తిత్వాన్ని  అంచనావేయగల అనుభవం వారి సొంతం. అధర్మంపై ధర్మానిదే విజయం అనే నమ్మకం ధర్మబద్ధమైన ప్రయత్నానికి పరాజయం లేదనే నైతిక సహకారాన్ని మునెమ్మకు అందించిన వారు పూటకూళ్ళ మసలోళ్లు.  "మనం సాధించదల్చుకున్నది ధర్మసమ్మతమైనదైతే దాన్ని పొందడానికి మనకు యోగ్యత ఉంటే దానికోసం సాగే ప్రయత్నం నిజాయితీగా సాగితే దాన్ని సాధించే తీరుతాం ఏ అమావాస్య గాని పౌర్ణమి గాని అడ్డు రావు" (నవల భాగం 13 పేజీ 61) అని ముసలాయన పలికిన మాటలు మునెమ్మను సమర్ధించేవిగా తాను చేయబోయే పని సరైనదే అని సమర్థించేవిగా ఉంటాయి. నిడివి తక్కువైనా నైతిక బలాన్ని సమాజపు స్థితిగతిని, తీరుతెన్నులను దిక్సూచత్వం చేసే పాత్రలుగా నవలలో సముచిత స్థానం గలగినవి.

6. శిల్ప నైపుణ్యం:

శిల్పం అనగా కల్పనల్లోని వైచిత్రి. ఈ వైచిత్రి చూసే కంటికి అనుభూతికి రావాలి. ఆనందం జనించడానికి తోడ్పడిన వస్తువుల్లోని భౌతికమైన గుణాల యొక్క సమష్టి రూపమే శిల్పం. "ఒక రచనలో కథనంలో గానీ పాత్ర చిత్రణలో గానీ సందర్భాలను ముడి వేయడంలో గానీ సన్నివేశాల రూపకల్పనలో గానీ వైవిధ్యం కలిగినప్పుడు ఆ వైవిధ్యాన్ని చదివేవాడు గుర్తించగలిగినప్పుడు మరింత ఆనందం కలుగుతుంది. ఇదే సాహిత్యంలో శిల్పం అనే గుణం"(సాహిత్యంలో శిల్పం అంటే ఏమిటి? పరిమి శ్రీరామనాథ్  అంతర్జాల వ్యాసం) అనే నిర్వచనం మునెమ్మ నవలా శిల్పానికి సరిగ్గా అతికినట్లు సరిపోతుంది. పాత్రచిత్రణ, సందర్భ కల్పన, ఇతివృత్తం, ఎత్తుగడ, కథాకథనం వంటి వాటి నిర్వహణలో కేశవరెడ్డి చేయితిరిగిన రచయిత అనడంలో సందేహం లేదు. మునెమ్మ నవల అశేష జనాదరణ పొందడంలో ఈ శిల్ప నైపుణ్యం విశిష్ట భూమిక పోషించిందనవచ్చు. సందర్భానుకూలంగా చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా చెప్పడంలోనూ సందర్భానుకూలంగా ధ్వన్యాత్మకంగా వ్యక్తపరచడంలోనూ తనదైన ప్రత్యేకత మునెమ్మ నవలకుంది. "యాదృచ్ఛికంగా నిర్హేతకంగా జరిగినట్లు కనిపించే ఘాతుక సంఘటనల మధ్య కార్యాకారణ సంబంధం ఉందనే సంగతి మనకు విశదం చేసేందుకు రచయిత హేతుప్రమాణంగా వివరణలిస్తాడు. విషయం మనకు సుబోధకం చేసేందుకు రచయిత చేసే ఈ ప్రయత్నం రూపపరంగా నవల కథన శిల్పానికి విశేష బలాన్ని ఇస్తుందని అంబటి సురేంద్రరాజు పలికిన మాటలు గమనించదగినవి.  "కథాకథన నైపుణ్యం పదును చెడకుండా ఉండటానికి రచయిత ఎంత జాగరూకతతో వ్యవహరించాలో డాక్టర్ కేశవరెడ్డికి తెలిసినంత బాగా తెలుగు సాహిత్యంలో మరో రచయితకు తెలియదు"(అనగనగనగా: మునెమ్మ ఒక మాంత్రిక కథనం ఒక/పురాగాధ వ్యాసం పేజి 113) అని పలికిన అంబటి సురేంద్రరాజు మాటలు అక్షర సత్యంగా మునెమ్మ నవలకు సరిపోతాయి.

7. భాషా విశేషాలు: 

మునెమ్మ నవల ఇతివృత్తం రాయలసీమ ప్రాంతానికి సంబంధించినది కావడం, రచయిత కేశవరెడ్డి కూడా రాయలసీమ ప్రాంతం వారు కావడం వలన భాషా వ్యవహారం, మాండలిక పదజాలం ఆ ప్రాంతానికి సంబంధించిందే ఉంది. మునెమ్మ నవలా భాష గురించి "ఈ నవలలో పాత్రాగత సంభాషణలు రాయలసీమ మండలికపు రెడ్డి కుటుంబాల యాసలోనూ కథనం మాత్రం శిష్ట వ్యావహారికంలోనూ ఉంటాయి" (మునెమ్మ నవల ముందుమాట పేజి 10) అని పేర్కొంటారు జయప్రభ. మునెమ్మ నవలలో సందర్భానుకూలంగా అనేక మాండలిక పదాలు ప్రయోగించబడ్డాయి. ఉదాహరణకు: 'నంజర నంజర', 'పొరక', 'తరుగులోడు', 'సవాయి రోగం', 'కొరుకుడు రోగం', 'సిగర పొడి', 'ఉతాళం మనిషి', 'కండ్లు బూసులు కమ్మినాయి', 'శిగర చెట్టు', 'గాండ్లాయన', 'లిబ్బి', 'కడుపు ఉబ్బరించడం', 'బొక్కెన', 'మొరవ', 'ఇలావారిగా', 'మండీలు', 'కరుమోలం', 'బిస' వంటి మాండలిక పద ప్రయోగం కనిపిస్తుంది. డాక్టర్ కేశవరెడ్డి మునెమ్మ నవల రాయలసీమ మండలికంలో రాయబడినప్పటికీ కొన్ని మాటలు తప్ప భాష అధిక శాతం పాఠకులకు అర్థమయ్యే విధంగానే ఉంది అనడంలో సందేహం లేదు.

8. విమర్శలు - ప్రతి విమర్శలు: 

డాక్టర్ కేశవరెడ్డి నవలల్లో ఏ నవల మీద జరగని విమర్శ ప్రతి విమర్శలు మునెమ్మ నవల మీద జరిగాయి. ఒకానొక సందర్భంలో వ్యక్తిగత విమర్శల వరకూ సాగాయి. విమర్శకు ఒక రచన వేదికైందంటే దానికి సాహిత్య లోకంలో స్థానం కలిగినట్లేనని చెప్పొచ్చు. మునెమ్మ నవల ఒకే వాదాన్ని బలపరిచే వర్గంలో భిన్నమైన అభిప్రాయాలకు వేదికైంది.

మునెమ్మ నవలపై కాత్యాయని(చూపు), గోపిని  కరుణాకరన్, తెలకపల్లి రవి, డాక్టర్ మనోహర్, డాక్టర్ భారతి, ఆర్.కె,  ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు, అనిల్ అట్లూరి, కత్తి మహేష్, శ్రీమతి సుజాత, వేణు వంటి వారు విమర్శ ప్రతి విమర్శలు, వ్యాసాలు రాశారు.

8.1: ఈ నవలపై వచ్చిన ప్రతికూల విమర్శల్లో కాత్యాయని రాసిన "రాసే వాళ్లకు చదివే వాళ్ళు లోకువ" అనే వ్యాసం 13-10-2008 లో సాక్షి పత్రికలో వచ్చింది. ఈ వ్యాసంలో నవల లోని అనేక సందర్భాలను, రచయిత మాటలను, నవలకు ముందుమాట రాసిన జయప్రభ అభిప్రాయాలను, వెనుక మాట రాసిన అంబటి సురేంద్రరాజు అభిప్రాయాలను విమర్శించారు. "హింస, బీభత్సం, ప్రతీకారాలు, హత్యలు నవలల పేజీలు నిండా నెత్తుటేరులు. కేశవరెడ్డిగారి సంచలన కాంక్ష ఓ అనుమానం రూపంలో ఆ జంట మధ్యకు దూరింది" (రాసే వాళ్లకు చదివే వాళ్ళ లోకువ వ్యాసం 13-10-2008 సాక్షి పత్రిక) అంటూ ఘాటుగా విమర్శించారు కాత్యాయని. అంతేకాకుండా అప్పటివరకు మామూలుగా ఉన్న మునెమ్మ ప్రతీకార యాత్ర మొదలైన నుండి అనుభవం ఉన్న డిటెక్టివ్లా మారిపోయిన తీరును, మునెమ్మకు బొల్లిగిత్తకు సంబంధం అంటగట్టిన తీరును, సినబ్బ పాత్రలో అతిని, మార్క్సిస్టుగా తనని తాను పేర్కొన్న కేశవరెడ్డి వర్గస్పృహలో వైరుధ్యాన్ని పేర్కొంటూ తీవ్రస్థాయిలో విమర్శ చేసిన తీరు ఈ వ్యాసంలో కనిపిస్తుంది. అంతేకాకుండా  "తన బుర్రలో పుట్టిన పర్వర్షన్లను ఒక నిస్సహాయ స్త్రీకి ఆరోపించి చవకబారు పాఠకులను ఆకట్టుకోవాలని తపించిపోతున్నారు" (రాసే వాళ్లకు చదివే వాళ్ళు లోకువ వ్యాసం 13/10/2008 సాక్షి పత్రిక)అంటారు కాత్యాయని. గ్రామీణ సమాజం మీద, మానవ సంబంధాల మీద, మునెమ్మ వంటి స్త్రీల మీద పాఠకుల్లో మిగిలి ఉన్న గౌరవాన్ని విధ్వంసం చేసి సంచలనాలు సృష్టించాలనుకునే రచయిత మానసిక స్థితిని గూర్చి పేర్కొంటూ ముక్కిపోయిన ఫార్ములా కథగా ఈ నవలను అభివర్ణిస్తారు కాత్యాయని.

8.2: "రాసే వాళ్లకు చదివే వాళ్ళు లోకువ"  వ్యాసంపై చర్చలో భాగంగా "మునెమ్మ ఎవర్ని జయించింది?" అనే శీర్షికతో  గోపిని కరుణాకరన్ - కాత్యాయని విమర్శలను ఖండిస్తూ వ్యాసం రాశారు. "స్త్రీగా నవలను అర్థం చేసుకోవడంలో దాన్ని తాత్విక దృక్పథాన్ని అంచనా వేయటంలో ఆ నవల అస్తిత్వాన్ని వడిసి పట్టుకోవడంలో కాత్యాయనిగారు పూర్తిగా విఫలమయ్యారు" (మునమ్మ ఎవర్ని జయించింది? వ్యాసం 20/10/2008 సాక్షి పత్రిక) అంటూ ప్రతి విమర్శ చేశారు. మునెమ్మ కాత్యాయని గార్ల అస్తిత్వాలు వేరు. మునెమ్మ రాయలసీమ ప్రాంతవాసి. కాత్యాయని కోస్తా ప్రాంతపు వాసి, మునెమ్మ కష్టజీవి, కాత్యాయని సంపన్న వర్గానికి చెందిన స్త్రీగా పేర్కంటూ మునెమ్మను అర్థం చేసుకోవాలంటే రాయలసీమలో 12వ శతాబ్దంలో పురుడుపోసుకున్న అస్తిత్వ ఉద్యమాలు గూర్చి తెలిసి ఉండాలంటారు కరుణాకరన్. అక్కమహాదేవి, తరిగొండ వెంగమాంబ, తుగ్గలి మంగమ్మవ్వ నగ్నత్వంతో సమాజపు అసలు నైజాన్ని బట్టబయలు చేశారని మునెమ్మ కూడా అలాంటి అన్వేషణే చేశారని కరుణాకరన్ ఈ వ్యాసంలో పేర్కొన్నారు.

8.3: "వికృత శిల్ప విన్యాసం" పేరుతో తెలకపల్లి రవి 20/10/2008 సాక్షి పత్రికలో వ్యాసం రాశారు. ఈ వ్యాసంలో సామాజికతకూ సహజాతాలకూ మధ్య సంబంధాన్ని సవ్యంగా అర్థం చేసుకొని ఉంటే కేశవరెడ్డి బొల్లిగిత్తనూ మునెమ్మను కలిపి కథ కట్టేవారు కాదు. అది జుగుప్స కన్నా ఒక మెట్టు దిగువన ఉంటుంది. పర్వర్షన్ అని తప్ప మరో పదం వర్ణించలేం (వికృత శిల్పన్యాసం వ్యాసం 20/10 /2008 సాక్షి పత్రిక) అంటారు. అంతేకాకుండా ముందుమాట రాసిన జయప్రభ ఫెమినిస్ట్ రచయితగా కేశవరెడ్డిని పేర్కోవడాన్ని ప్రశ్నిస్తూ మునెమ్మ పాత్ర చిత్రీకరణలో సమకాలీన స్త్రీల ఆలోచన కనిపించిందని పేర్కొనడాన్ని, నేటి కాలపు ఆలోచనలను నాటి పాత్రలో చూపించడంలో ఔన్నత్యాన్ని ప్రశ్నిస్తారు రవి.

8.4: "అవును ఈ విమర్శకురాలికి మేం లోకువే" అనే పేరుతో కాత్యాయనిగారి విమర్శను ఖండిస్తూ డాక్టర్ మనోహర్ 27/10/2008న సాక్షి పత్రికలో వ్యాసం ప్రచురించారు. ఈ వ్యాసంలో  " మునెమ్మ తన వాంఛలను పెంపుడు జంతువుతో తీర్చుకుంటుందని ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని మనందరికీ ప్రకటించడం జుగుప్సాకరం. ఒక ఒంటరి స్త్రీపట్ల ఇటువంటి నిర్ణయాన్ని ప్రకటించడం వాంతి వచ్చే విమర్శ" (అవును ఈ విమర్శకురాలికి మేం లోకువే వ్యాసం 27/10/2008 సాక్షి పత్రిక) అని కాత్యాయని విమర్శను ఖండించారు డాక్టర్ మనోహర్. మునెమ్మ ప్రమేయంగానీ బొల్లిగిత్త వికృత చర్య గానీ ఏమీ లేని ఒక సంఘటనను జయరాముడు పురుషహంకారంతో ఇంకోరకంగా అర్థం చేసుకుంటాడని పేర్కొంటూ విమర్శకులు ఇంత దిగజారి రాస్తే పాఠకులు మరింత నష్టపోతారంటూ కాత్యాయనిగారి విమర్శపై చురకలు వేస్తారు డాక్టర్ మనోహర్.

8.5: "ఈ డాక్టర్ గారికి చికిత్స చెయ్యక తప్పదు" అనే పేరుతో 27/10/2008 సాక్షి పత్రికలో డాక్టర్ భారతి మునెమ్మ నవల మీద విమర్శ వ్యాసం ప్రచురించారు. ఈ వ్యాసంలో కేశవరెడ్డి మునుపటి నవలల్లో ఆయన వెళ్ళగక్కిన హేయమైన వెకిలి స్టేట్మెంట్లు గుర్తుకు వచ్చాయి. వాటికి కొనసాగింపగానే మునెమ్మకు జూ- ఎస్టీరియా లేదా జూఫిలియా - పోనీ బీస్టాలిటీ అనే లక్షణాలని అంటగట్టారని విమర్శిస్తారు. బొల్లిగిత్తకు మునెమ్మకు శారీరక వాంఛను అంటగట్టినట్టుగా పేర్కొంటూ జంతువుల్లో మనుషుల పట్ల లైంగిక వాంఛలేమి ఉండవని శాస్త్రీయంగా ధ్రువీకరిస్తూ "తను సృష్టించే పాత్రల పట్ల, ఎన్నుకోవలసిన దృక్పథం పట్ల ఆయనకు చాలా అయోమయం ఉంది. డాక్టర్ గారూ! మీ మానసిక ఆరోగ్యం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కొన్నాళ్లపాటు రచనలు ఆపేయటం మీకూ సమాజానికీ కూడా క్షేమకరం" (ఈ డాక్టర్ గారికి చికిత్స చెయ్యక తప్పదు వ్యాసం 27-10-2018) అంటూ రచనను, రచయితను ఘాటుగా విమర్శించారు డాక్టర్ భారతి.

మునెమ్మ నవలపై విమర్శ ప్రతి విమర్శలు ఎంతలా ముదిరారాయంటే రచయితే స్వయంగా ప్రతి విమర్శ చేసే స్థితికి దారితీసింది. రాసే వాళ్లకు చదివే వాళ్ళు లోకువ వ్యాసం పై చర్చలో భాగంగా "హిస్టీరియా రోగులనుండి సాహిత్యాన్ని కాపాడండి" అనే పేరుతో 03/11/2008 సాక్షి పత్రికలో కేశవరెడ్డి గారే స్వయంగా వ్యాసాన్ని ప్రచురించారు. ఈ వ్యాసంలో కాత్యాయనిగారిని హిస్టీరియా రోగిగా పేర్కొన్నారు. సెక్స్ లో రకాలు, జంతువులు మనుషుల మధ్య గల వాంఛలు గూర్చి తాను పేర్కొనని విషయాలను ఊహించుకొని రాసే విమర్శలు గూర్చి ఈ వ్యాసంలో పేర్కోవడం గమనించదగింది. మునెమ్మ నవలపై ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు రాసిన వ్యాసంలో మునెమ్మ నవలలో గల స్త్రీవాద కోణాన్ని కొందరు స్త్రీవాద రచయిత్రులు సరిగా అర్థం చేసుకోలేకపోయారని పేర్కొంటారు. మునెమ్మ నవలపై వచ్చిన విమర్శ ప్రతి విమర్శలు నవలలను మరింత లోతుగా అధ్యయనం చేయడంలో సహకరిస్తాయనడంలో సందేహం లేదు. గురజాడ మధురవాణి, చలం రాజేశ్వరిపై వెలువడే విమర్శ ప్రతి విమర్శలకు ఏమాత్రం తీసిపోనిది కేశవరెడ్డి మునెమ్మ. అయితే కొన్ని విమర్శలు రచన మీద కాకుండా రచయితలపై జరగడం బాధాకరం.

9. ముగింపు:

మునెమ్మ నవల పరిశీలన ఎన్నో నూతన కోణాలు, నూతన ప్రతిపాదనలు, నూతనాంశాలకు అవకాశం కల్పించేదిగా ఉంది.  దీనికి అనేక కారణాలు కలవు. మానవ పాత్రలకు సమానంగా పెంపుడు జంతువును ప్రధాన పాత్రలో ఒకటిగా చేసి కథనల్లడం,  కథాకథన పద్ధతి, శిల్ప సౌందర్యం, ఇతివృత్తం, పాత్ర చిత్రణ, వర్ణనలు- అలంకారాలు, భాషా విశేషాలు, పాఠకుల ఊహకు వదిలేసిన మాటలు ఇలా దేనికదే ప్రత్యేకమైనదిగా చెప్పొచ్చు. 

నవలలో కొన్ని సంభాషణలు ధ్వన్యాత్మకంగా ఉండడం ఏకకాలంలో అనేక ఆలోచనలకు అవకాశాలు కల్పించడం మరో విశేషం. దీని కారణంగానే ఈ నవల స్త్రీవాద నేపథ్య రచనా  మార్మిక కళాత్మక రచనా సంబద్ధ రచనా అసంబద్ధ రచనా అనే అంశాల చర్చకు వేదికగా నిలిచిందని భావించవచ్చు.  చెప్పే మాటల్లో వ్యంగ్యత కారణంగా భిన్నార్ధాలు స్పురిస్తాయి. రచయిత తన అభిప్రాయాన్ని తాను ప్రకటిస్తే అదో లెక్క.  అలా కాకుండా పాఠకుడి ఊహకు విడిచి పెట్టడం వల్ల అనేక విషయాలు వస్తాయనడానికి ఈ నవలే ప్రత్యక్ష ఉదాహరణ. మొత్తంగా చూసినప్పుడు మునెమ్మ నవలలో పాత్రలు పాఠకుడికి చిరకాలం గుర్తుండేవిగా ఉంటాయి. ఇతివృత్తం సహజమైన సామాన్య స్త్రీ కేంద్రంగా సాగింది. శిల్ప నైపుణ్యం ప్రత్యేకంగా ఉండి పాఠకుడ్ని కట్టిపడేస్తుంది. భాష రాయలసీమ మండల భాష. భిన్నమైన పాత్రల కథ కావడంతో అనేక విమర్శలకు కారణమైంది. ఈ నవలకు సంబంధించి మరెన్నో విషయాలు పరిశోధనకు రావాల్సి ఉందని అనిపిస్తుంది. మునెమ్మ , బొల్లిగిత్తల సంబంధాన్ని గూర్చి చర్చ నడిచింది గానీ మునెమ్మ, సినబ్బల సంబంధానికి సంబంధించి జరగవలసినంతగా చర్చ జరగలేదని నా భావన. 

ఏది ఏమైనా అశేష పాఠకాదరణ పొందిన నవలల్లో మునెమ్మ ఒకటిగా చెప్పొచ్చు. అంతమంది పాఠకాదరణ పొందిందంటేనే సాహిత్య లోకంలో మునెమ్మ స్థానమేమిటో చెప్పకనే అర్థమౌతుంది. రాయలసీమ అస్తిత్వంతో పాటు, స్త్రీవాద నేపథ్యంలో, పొయిటిక్ జస్టిస్ కోణంలో, సహజ న్యాయ పద్ధతిలో మునెమ్మ నవల సాగిందని  పై విశ్లేషణ ఆధారంగా చెప్పవచ్చు.

10. పాదసూచికలు:

  1. మునెమ్మ నవల భాగం 9 పేజి45
  2. మునెమ్మ నవల భాగం10 పేజి 46
  3. మునెమ్మ నవల భాగం 14 పేజి 64
  4. మునెమ్మ నవల భాగం 13 పేజీ 61
  5. మునెమ్మ నవల ముందుమాట పేజి-6
  6. సాహిత్యంలో శిల్పం అంటే ఏమిటి? పరిమి శ్రీరామనాథ్ గారి అంతర్జాల వ్యాసం
  7. అనగనగనగా: మునెమ్మ ఒక మాంత్రిక కథనం ఒక/పురాగాధ వ్యాసం పేజి 113
  8. రాసే వాళ్లకు చదివే వాళ్ళు లోకువ వ్యాసం 13/10/2008 సాక్షి పత్రిక
  9. మునమ్మ ఎవర్ని జయించింది? వ్యాసం 20/10/2008 సాక్షి పత్రిక
  10. అవును ఈ విమర్శకురాలికి మేం లోకువే వ్యాసం 27/10/2008 సాక్షి పత్రిక
  11. ఈ డాక్టర్ గారికి చికిత్స చయ్యక తప్పదు వ్యాసం 27-10-2018
  12. హిస్టీరియా రోగులనుండి సాహిత్యాన్ని కాపాడండి వ్యాసం 03/11/2008 సాక్షి పత్రిక
  13. అనగనగనగా: మునెమ్మ ఒక మాంత్రిక కథనం /ఒక పురాగాధ వ్యాసం పేజి 117

11. ఉపయుక్తగ్రంథసూచి:

  1. అప్పారావు, గురజాడ (2017). కన్యాశుల్కం, విశాలాంధ్ర పబ్లిక్ సింగ్ హౌస్ : విజయవాడ.
  2. ఆర్.కె. (27/10/2008). ఓ అసంబద్ధ రచన వ్యాసం, సాక్షి పత్రిక.
  3. కరుణాకరన్ గోపిని (20/10/2008). మునెమ్మ ఎవరిని జయించింది? వ్యాసం, సాక్షి పత్రిక.
  4. కాత్యాయని (చూపు) (13/10/2008). రాసే వాళ్లకు చదివే వాళ్ళు లోకువ వ్యాసం, సాక్షి పత్రిక.
  5. కేశవరెడ్డి (2012). చివరి గుడిసె నవల, విశాలాంధ్ర పబ్లిక్ సింగ్ హౌస్, హైదరాబాద్ : తెలంగాణ.
  6. కేశవరెడ్డి (2021). మనమ్మ నవల, నవచేతన పబ్లిక్ సింగ్ హౌస్, హైదరాబాద్ : తెలంగాణ.
  7. కేశవరెడ్డి (3/11/ 2008). హిస్టీరియా రోగుల నుండి సాహిత్యాన్ని కాపాడండి వ్యాసం, సాక్షి పత్రిక.
  8. కేశవరెడ్డి (2019). స్మశానం దున్నేరు నవల, నవచేత బుక్ హౌస్ హిమాయత్ నగర్ : హైదరాబాద్.
  9. కేశవరెడ్డి, తెలుగు వికీపీడియా, అంతర్జాలం.
  10. చలం (2011). మైదానం నవల,  ప్రియదర్శిని ప్రచురణలు: హైదరాబాద్.
  11. మనోహర్ (27/10/2008 ). అవును ఈ విమర్శకురాలికి మేం లోకువే వ్యాసం, సాక్షి పత్రిక.
  12. రవి తెలకపల్లి (20/10/2008). వికృత శిల్ప విన్యాసం వ్యాసం, సాక్షి పత్రిక.
  13. వెంకటసుబ్బయ్య, వల్లంపాటి (2021). నవలా శిల్పం, నవచేతన పబ్లిక్ సింగ్ హౌస్, హైదరాబాద్ : తెలంగాణ.
  14. శ్రీరామనాథ్, పరిమి, సాహిత్యంలో శిల్పం అంటే ఏమిటి? అంతర్జాల వ్యాసం.
  15. సుజాత (మార్చి 2013). ఒక మిస్టీరియస్ మునెమ్మ! వ్యాసం చదువు బ్లాగ్, వాకిలి అంతర్జాల సాహిత్య పత్రిక.

View all


(A Portal for the Latest Information on Telugu Research)


Call for Papers: Download PDF

"ఔచిత్యమ్" - అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక (UGC-CARE Listed Journal), [ISSN: 2583-4797] ప్రామాణిక పరిశోధన పద్ధతులు అనుసరిస్తూ, విషయ వైవిధ్యంతో రాసిన వ్యాసాల ప్రచురణే లక్ష్యంగా నిర్వహింపబడుతోంది. రాబోవు "December-2024" సంచికలో ప్రచురణ కోసం భాష/ సాహిత్య/ కళా/ మానవీయశాస్త్ర పరిశోధన వ్యాససంగ్రహాలను ఆహ్వానిస్తున్నాం. దేశంలోని అన్ని విశ్వవిద్యాలయాల ఆచార్యులు, పరిశోధకులు, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు.

# సూచనలు పాటిస్తూ యూనికోడ్ ఫాంటులో టైప్ చేసిన పరిశోధన వ్యాససంగ్రహం సమర్పించాల్సిన లింక్: ఇక్కడ క్లిక్ చెయ్యండి.

# వ్యాససంగ్రహం ప్రాథమికంగా ఎంపికైతే, పూర్తి వ్యాసం సమర్పణకు వివరాలు అందజేయబడతాయి.

# చక్కగా ఫార్మేట్ చేసిన మీ పూర్తి పరిశోధనవ్యాసం, హామీపత్రం వెంటనే ఈ మెయిల్ ద్వారా మీకు అందుతాయి. ఇతర ఫాంట్/ఫార్మేట్/పద్ధతులలో సమర్పించిన పూర్తివ్యాసాలను ప్రచురణకు స్వీకరించలేము.

# వ్యాససంగ్రహం పంపడానికి చివరి తేదీ: 20-November-2024

# వ్యాసరచయితలకు సూచనలు (Author Instructions) - చదవండి.

# నమూనా పరిశోధన వ్యాసం (TEMPLATE) ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

# హామీపత్రం (COPYRIGHT AGREEMENT AND AUTHORSHIP RESPONSIBILITY) ను చదవండి. (నింపి పంపాల్సిన అవసరం లేదు. వ్యాసాన్ని సమర్పించినప్పుడు హామీపత్రం స్వయంచాలకంగా మీ పేరు, వ్యాసవివరాలతో సిద్ధమై మాకు, మీ E-mailకు కూడా అందుతుంది.)

# 2 నుండి 3 వారాల సమీక్ష తరువాత, వ్యాసంలో అవసరమైన సవరణలు తెలియజేస్తాము. ఈ విధంగా రెండు నుండి మూడు సార్లు ముఖ్యమైన సవరణలన్నీ చేసిన తరువాతే, వ్యాసం ప్రచురణకు స్వీకరించబడుతుంది.

# “పరిశోధకవిద్యార్థులు” తమ వ్యాసంతోపాటు “పర్యవేక్షకుల” నుండి నిర్దేశించిన ఫార్మేట్లో "యోగ్యతాపత్రం" [Letter of Support] కూడా తప్పనిసరిగా సమర్పించాలి. రీసెర్చిగైడ్ అభిప్రాయలేఖను జతచేయని రీసెర్చి స్కాలర్ల వ్యాసాలు ప్రచురణకు పరిశీలించబడవు. ఇక్కడ Download చేసుకోవచ్చు.

# ఎంపికైన వ్యాసాలను అంతర్జాల పత్రికలో ప్రచురించడానికి నిర్ణీత రుసుము (Handling, Formatting & Processing Fee) Rs. 1000 ( వెయ్యి రూపాయలు మాత్రమే) చెల్లించవలసి ఉంటుంది [non-refundable]. వ్యాసం సమర్పించేటప్పుడు ఎలాంటి రుసుము చెల్లించకూడదు. సమీక్ష తరువాత మీ వ్యాసం ప్రచురణకు స్వీకరించబడితే, రుసుము చెల్లించే విధానాన్ని ప్రత్యేకంగా ఒక Email ద్వారా తెలియజేస్తాము.

# రుసుము చెల్లించిన వ్యాసాలు "ఔచిత్యమ్" అంతర్జాల తెలుగు పరిశోధన మాసపత్రిక "DECEMBER-2024" సంచిక (www.auchithyam.com)లో ప్రత్యేకమైన, శాశ్వతమైన లింకులలో ప్రచురితమౌతాయి.

# వ్యాసరచయితలు ముఖచిత్రం, విషయసూచిక, తమ వ్యాసాలను PDF రూపంలో Download చేసుకోవచ్చు. "ఔచిత్యమ్" పత్రిక కేవలం అంతర్జాలపత్రిక. ముద్రితప్రతులు (హార్డ్-కాపీలు) ఉండవు. వ్యాసరచయితలకు పత్రిక హార్డ్-కాపీ అందజేయబడదు.

# మరిన్ని వివరాలకు: +91 7989110805 / editor@auchithyam.com అనే E-mail ను సంప్రదించగలరు.

గమనిక: ఈ పత్రికలోని వ్యాసాలలో అభిప్రాయాలు రచయితల వ్యక్తిగతమైనవి.
వాటికి సంపాదకులు గానీ, పబ్లిషర్స్ గానీ ఎలాంటి బాధ్యత వహించరు.

Letter of Support - Format
[for Research Scholars only]